Jump to content

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య/లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్

వికీసోర్స్ నుండి

3

లెటర్స్ ఆన్

హిందూ మేరేజస్

బ్రహ్మసమాజ భావాలు

1864 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కేశవచంద్రసేన్ మద్రాసులో ఉన్నాడు. బ్రహ్మసమాజ భావాలను ప్రచారం చెయ్యడానికి అక్కడ కొన్ని ఉపన్యాసాలు చేశాడు. ఆయన గొప్పవక్త. తన ఉపన్యాసాలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించమని, కులనిర్మూలన చెయ్యమని, సంస్కరణోద్యమాన్ని కొనసాగించడం కోసం సంఘాలు స్థాపించమని ఉద్బోధించాడు. ఆయన ఉపన్యాసాలు హిందూయువకులమీద, విద్యార్థులమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. చైతన్యవంతులను చేశాయి.1 “హిందూమతానికి వేదకాలంనాటి ఔన్నత్యం తిరిగి కలిగించడం” అనే బ్రహ్మసమాజ భావన విద్యావంతులను ఆలోచింపచేసింది. కేశవచంద్రసేన్ మద్రాసులో ఉపన్యసించిన మూడునెలల లోపలే, బెంగాల్ బ్రహ్మసమాజం నమూనాలో మద్రాసు వేదసమాజం ప్రారంభమైంది. సభ్యులు ఏకగ్రీవంగా సమాజ నిబంధనలు తయారుచేశారు. ఆస్తికత, ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన మానడం, కులభేదాలను విస్మరించడం, మతద్వేషాన్ని విడిచిపెట్టడం, స్త్రీ విద్య, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, దేశ భాషలలో పుస్తక ప్రచురణ మొదలైనవి ఈ సమాజ ఆశయాలు. వీరికి వేదాలమీద విశ్వాసం ఉన్నందువల్ల వేదసమాజమని పేరు పెట్టారు. ఈ సమాజానికి వి. రాజగోపాలాచార్యులు, సి. సుబ్బరాయులు సెట్టి, అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఇద్దరూ న్యాయవాదులే. దీనికి తంజావూరు, సేలం, కోయంబత్తూరు, బెంగుళూరులో అనుబంధసంస్థలు ఏర్పడ్డాయి. వేదసమాజ సభ్యులు ఉపన్యాసాలకు, ప్రార్థన సమావేశాలకు తమ కార్యక్రమాలను పరిమితం చేసుకొన్నారు. సనాతన ఆచారాలమీద, ఉపనిషత్కాలం తర్వాత వాడుకలోకి వచ్చిన సంప్రదాయాలమీద విమర్శలు చేయడంవల్ల వేదసమాజం సంప్రదాయవాదులకు, సామాన్య ప్రజలకు దగ్గరకాలేక పోయింది. అధ్యక్ష కార్యదర్శులు మరణించిన తర్వాత, ఈ సమాజం కొంతకాలం నిద్రాణంగా ఉండిపోయింది. మద్రాసు ప్రెసిడెన్సీలో మత సాంఘిక సంస్కరణల మిద చర్చను, జిజ్ఞాసను రేకెత్తించడంలో మాత్రం వేదసమాజం సఫలమైంది.

సి.వి. రంగనాథశాస్త్రి (1819-1881)

వేదసమాజం స్ఫూర్తితో కలమూరు వెంకట రంగనాథశాస్త్రి, ఆయన మిత్రులు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. రంగనాధశాస్త్రి చిత్తూరుజిల్లాలో ఒక పండిత కుటుంబంలో జన్మించాడు. పావెల్ పర్యవేక్షణలో 1842లో అత్యున్నతశ్రేణిలో ప్రొఫిషియెంట్' (proficient) గా హైస్కూలు చదువు పూర్తిచేసి, మద్రాసు హైకోర్టులో ఉద్యోగ జీవితం ఆరంభించాడు. అనేక యూరోపియన్ భాషలు నేర్చుకొన్నాడు. 1859లో మద్రాసు స్మాల్‌కాజ్‌కోర్టులో జడ్జి పదవి చేపట్టాడు.

రంగనాథశాస్త్రి విద్యాభిమాని. పాశ్చాత్య విద్యావిధానం ఆయన ఆలోచనల మీద గాఢమైన ప్రభావం చూపింది. ప్రజలు విద్యావంతులైన నాడే దేశం అభివృద్ది చెందుతుందని గట్టిగా నమ్మాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. తన కుమార్తెకు చదువు చెప్పించాడు. హిందూ మతగ్రంథాలను అనుశీలనంచేసి, ఆ మతం ఉత్కృష్టమైనదని గ్రహించాడు. ఆయనకు వర్ణభేదాలమీద విశ్వాసం తొలగిపోయింది.2 వేదసమాజం కలిగించిన స్పూర్తితో హిందూసమాజాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాలను పరిశీలించాడు. ఈ విషయంలో శాస్త్రగ్రంథాలేమంటున్నది తెలుసుకోడానికి కృషి చేశాడు. ఈ అనుశీలనంతో బాల్యవివాహవ్యవస్థ దారుణమైనదని గ్రహించాడు. .

బాల్యవివాహాలు నిరసిస్తూ దక్షిణ భారతదేశంలో రచించబడిన తొలిపుస్తకం ఏదో స్పష్టంగా తెలియడంలేదు. కేశవచంద్రసేన్ మద్రాసు వచ్చిన సంవత్సరమే వితంతువివాహాలను నిరసిస్తూ, తెలుగులో ఒక పుస్తకం వెలువడినట్లు తెలుస్తూంది. “హిందూవివాహ శాస్త్రసంగ్రహం” అనే అనువాద గ్రంథం మనుస్మృతిని ఉల్లేఖిస్తూ, రజస్వలానంతర వివాహాలను, వితంతువివాహాలను శాస్త్రాలు అనుమతించాయని, వాటిమీద నిషేధంలేదని తెలియజేసింది. కలియుగంలో "ఆయుస్సు తక్కువ గనుక ఆడపిల్లలకు 16 యేండ్ల లోపల పెండ్లి చేయకపోవడం వాంఛనీయం, యెట్టి పరిస్థితులలోను 12 ఏండ్లలోపల చేయకూడదు” అని గ్రంథ రచయిత వాదించినట్లుంది.3 సామినేని ముద్దునరసింహం 1862 ప్రాంతంలో ‘హితవాది' పత్రికలో సాంఘిక విషయాల మీద అనేక వ్యాసాలు రాశాడు.4 మద్రాసు వేదసమాజ పత్రిక 'తత్త్వబోధిని” లో సంస్కరణ, బాలికావిద్య, వితంతు పునర్వివాహాలు మొదలైన విషయాలమీద వ్యాసాలు ప్రచురించబడ్డాయి. సి.వి. రంగనాథశాస్త్రి తన మిత్రుడు చదలువాడ అనంతరామశాస్త్రిని రజస్వలానంతర వివాహాలు శాస్త్ర సమ్మతమైనవని నిరూపిస్తూ, ఒక పుస్తకం రాయమని ప్రోత్సహించాడు. ఆయన కోరిక ప్రకారం అనంతరామశాస్త్రి "వివాహ్య కన్యా స్వరూప నిరూపణమ్” అనే పుస్తకాన్ని సంస్కృతభాషలో, శ్లోకరూపంలో రచించాడు.

అనంతరామశాస్త్రి (1835-1872 ప్రాంతం)

అనంతరామశాస్త్రి నెల్లూరు పుదూరు ద్రావిడ బ్రాహ్మణుడు. ఆయన అన్న చదలువాడ సీతారామశాస్త్రి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగుపండితుడు. వీరిద్దరూ చిన్నాయనశాస్త్రి, పెదనాయనశాస్త్రి పేర్లతో ప్రసిద్ధులయ్యారు. అనంతరామశాస్త్రి “సకల కళాకోవిద” అల్లాడి రామబ్రహ్మశాస్త్రి వద్ద శాస్త్రాలు అభ్యసించాడు. పండితగోష్ఠులలో, చర్చలలో పాల్గొని కీర్తి గడించాడు. వెంకటగిరి ఆస్థానంలో జరిగిన పండితవాదంలో ఆస్థానపండితుడు తర్కభూషణం వేంకటాచార్యులను ఓడించి, సంస్థానాధిపతి సర్వజ్ఞ కుమారునికి అద్వైతం బోధించినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. “పరమహంస, చిదానందయోగి, గతాగతవేది, సాహిత్యచక్రవర్తి, సాంగోపాధ్యాయుడు” అని హిందూ బాంధవి పత్రిక, ఆయన మరణించిన ఏభైసంవత్సరాల తర్వాత ప్రస్తుతించింది. అనంతరామశాస్త్రి చివరిదశలో సన్యాసం స్వీకరించాడని, శాస్త్రాచారాలను లెక్కపెట్టకుండా 'అస్పృశ్యుల' ఇళ్ళలో కూడా భోజనం చేసేవాడని అంటారు.5 ఆయన 32 సంవత్సరాల వయస్సులో 1872 ప్రాంతంలో మరణించినట్లు ఒంగోలు వెంకటరంగయ్య అభిప్రాయపడ్డాడు.6

వివాహ్య కన్యా స్వరూప నిరూపణమ్

1928లో “దేశీయ సంఘసంస్కరణ సభ” వారి అభ్యర్ధన ననుసరించి, ఒంగోలు వెంకటరంగయ్య ఈ పుస్తకాన్ని తెలుగులో సంగ్రహంగా అనువదించాడు. 1860 శిక్షాస్మృతి, సెక్షన్ 375 ప్రకారం పదేళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు జరపవచ్చు. ఇంత చిన్న వయసులో బాలికలకు పెళ్ళిచెయ్యడం న్యాయంకాదని కేశవచంద్రసేన్ అలజడి చేస్తూ వచ్చాడు. “బహుశః కేశవచంద్రసేన్ ప్రచారము మద్రాసుకు గూడా వ్యాపించి ఈ చిన్న పుస్తకమునకు కారణమై యుండవచ్చును” అని పుస్తకరచన నేపథ్యాన్ని వెంకటరంగయ్య వివరించాడు.7 సుందరలింగం కూడా తన పరిశోధన గ్రంథంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు.8 వివాహ్య కన్యా స్వరూప నిరూపణమ్ 1866లో శ్రీరామాదర్పణ ముద్రాక్షరశాలలో అచ్చయినట్లు వెంకటరంగయ్య తెలియజేశాడు. అయితే 1865 ఆగష్టు 3 నాటికే ఈ పుస్తకం అచ్చయి, ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తూంది.9 అనంతరామశాస్త్రి మనుస్మృతిని ప్రమాణంగా గ్రహించి రజస్వలానంతర వివాహాలను సమర్థించాడు. మనుస్మృతికి విరుద్దంగా ఉన్న పరాశర, వైద్యనాథ స్మృతులను, ఇతర శాస్త్రగ్రంథాలను ప్రమాణంగా గ్రహించనవసరం లేదని తీర్మానించాడు. నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమమైనది. ఇందులో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందువల్ల వివాహానికి యోగ్యమయిన స్త్రీ లక్షణాలు తెలుసుకోవాలి. స్త్రీరూపంలో ఇప్పుడు జరుగుతున్న బాల్యవివాహాలకు, మనుస్మృతి ఇతర శాస్త్రాల ఆమోదం లేదు. కనుక బాలికలు ఈడేరిన తరువాతనే వివాహం చెయ్యాలని తీర్మానించాడు. శాస్త్ర గ్రంథాల ప్రమాణం సంగతి అట్లా ఉంచితే, లౌకికదృష్టితో చూచినా, బాల్యవివాహాలు అన్యాయమైనవని ఆయన భావించాడు. “చంటి పాపల వయసులో జరుగుతున్న వివాహాలు ఈ లోకం నుంచి తొలగిపోవాల” నే ఆకాంక్ష వ్యక్తం చేశాడు. అనంతరామశాస్త్రి తన పుస్తకాన్ని కంచికామకోటి పీఠాధిపతి “శ్రీమన్మహాదేవేంద్ర శ్రీసరస్వతీపాదు” లకు అభిప్రాయాన్ని అర్థిస్తూ పంపుకొన్నట్లు పీఠికలో వివరించాడు.10

గుర్రం వెంకన్నశాస్త్రి (1825-1880 ప్రాంతం)

పీఠాధిపతి, అనంతరామశాస్త్రి పుస్తకాన్ని తిరస్కరించి, బాల్యవివాహాలను సమర్థిస్తూ ఖండనగ్రంథాలు రాయమని పండితులను ప్రోత్సహించినట్లుంది. “విరించి నగర వాస్తవ్యులు, అనారత ధర్మశాస్త్ర పాఠకులు, సముత్తేజిత ప్రజ్ఞులు” శ్రీరామశాస్త్రి అనంతరామశాస్త్రి అభిప్రాయాలను తిరస్కరిస్తూ ఒక పుస్తకంరాసి, పీఠాధిపతులకు దాఖలు చేసుకొన్నాడు. 'సిద్ధాంత సిద్ధాంజనం' పేరుతో గుర్రం వెంకన్నశాస్త్రి ఒక ఖండన గ్రంథం రాశాడు. ఈ పుస్తకానికి 'వాద ప్రహసనమ్' అని మరొక పేరు పెట్టాడు. 11

వెంకన్నశాస్త్రి నెల్లూరువాడు. రామస్వామిశాస్త్రి కుమారుడు. వెంకన్నశాస్త్రి అన్న అప్పన్నశాస్త్రి మదరాసు హైకోర్టులో “హిందూలా పండితులుగా ఉండి హిందూ ధర్మశాస్త్రము పై 'అధారిటి' అనిపించుకున్నాడు.”12 వెంకన్నశాస్త్రి తన ప్రతిభా పాండిత్యాలను, ప్రసిద్ధిని గురించి వాద ప్రహసనంలో చెప్పుకొన్నాడు. ఈయన మంచి హాస్యప్రియుడని, హాస్యరసం ఉట్టిపడే శ్లోకాలు అలవోకగా చెప్పేవాడని, 'వికటకవి' అని ప్రఖ్యాతి చెందాడని, ఈయన వంశీయులు తెలిపారు. ఈయనకు “చతుష్షష్టి కళాత్మక”, “ఆలంకారిక సార్వభౌమ' బిరుదులున్నట్లు నరసయ్య పేర్కొన్నాడు. నరసయ్య వెంకన్నశాస్త్రిని ఆప్యాయంగా “మై డియర్ బ్రదర్ ఇన్ లా” అని చెప్పుకొన్నాడు.13 వెంకన్నశాస్త్రితో తనకున్న బంధుత్వం స్పష్టంగా తెలియడం లేదు.

సిద్ధాంత సిద్ధాంజనమ్ (వాద ప్రహసనమ్)

“కొందరు ఆచారభ్రష్ఠులు నాస్తిక వాదులవుతున్నారు. వారిని సంతోషపెట్టడానికి అనంతరామశాస్త్రి రజస్వలానంతర వివాహాలను సమర్ధిస్తూ పుస్తకం రాశాడు. మనువు మాటలకు అపార్థం కల్పించి బ్రాహ్మణ, బ్రాహ్మణేతర కులాలవారు గాంధర్వవివాహం చేసుకోవచ్చని, దీనిని మనుస్మృతి అంగీకరించిందని, పరాశరస్మృతిని పాటించనవసరం లేదని వాదించాడు. ఆయన మాటలు మూర్ఖులను మోసగించవచ్చు. అవి శాస్త్ర విరుద్ధమైనవి” అని వెంకన్నశాస్త్రి తన పుస్తకాన్ని మొదలుపెట్టాడు. ఈ పుస్తకంలో ఎనిమిది పరిహాసాలున్నాయి. ఒక్కో పరిహాసంలో అనంతరామశాస్త్రి ఒక్కో వాదాన్ని పూర్వపక్షంచేసి, తన నిర్ధారణను ప్రతిపాదించాడు. ఎనిమిదో పరిహాసంలో ప్రత్యర్థి వాదాన్ని సమగ్రంగా సమీక్షించి ఖండించాడు. ఈ పుస్తకాన్ని 1865 అక్టోబరు 1న కంచి పీఠాధిపతి మద్రాసు వచ్చినప్పుడు, పీఠాధిపతి నివాసంలో జరిగిన పండితసభలో పఠించాడు. ఆ సభలో రంగనాథశాస్త్రి, అనంతరామశాస్త్రి ఉన్నారు. వీరి మధ్య చర్చ తీవ్రంగా జరిగి, ఒకరినొకరు దూషించుకొనే స్థాయికి దిగజారింది.

మద్రాస్ టైమ్స్ (1858)

గాంట్జు సోదరులు (Gantz brothers) మద్రాసులో పుస్తకవిక్రేతలుగా ఉంటూ, మద్రాస్ టైమ్స్ పత్రికను ప్రారంభించారు. 1857 సంక్షోభం తర్వాత, యూరోపియన్లకూ, దేశీయులకూ మధ్య సంబంధాలు బెడిశాయి. రెండుజాతుల మధ్య సామరస్యం, సత్సంబంధాల పునరుద్దరణ కోసం ఈ పత్రిక కృషి చేసింది. మద్రాస్ టైమ్స్ పత్రిక సి.ఏ. లాసన్, హెన్రీ కోర్నిష్ (C.A. Lawson, Henry Cornish)ల సంపాదకత్వంలో ప్రారంభమైంది. పత్రిక ఉదయం, సాయంత్రం సంచికలు వెలువడేవి. న్యూస్‌సర్వీసు సౌకర్యం లేకపోవడంవల్ల, విలేకరులు, 'కంట్రిబ్యూటర్సు' పంపే వార్తల మీద, రచనల మిద పత్రిక ఆధారపడుతూ వచ్చింది. చిన్నవ్యాపారులు, టీతోటల యజమానులు, మధ్యతరగతి యూరోపియన్ల అభిప్రాయాలను పత్రిక వినిపించింది. ప్రభుత్వ విధానాల మీద ఘాటుగా విమర్శలుండేవి. ఈ పత్రికలో మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. సుందరలింగం, లెనార్డ్ తమ పరిశోధన గ్రంథాలలో ఈ పత్రికను ఎక్కువగా ఉపయోగించుకొన్నారు. వెంకన్నశాస్త్రికి, అనంతరామశాస్త్రి వర్గానికి మధ్య జరిగిన చర్చను నరసయ్య ఈ పత్రికలో సంపాదకీయ లేఖల ద్వారా వివరించాడు.

లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్

రంగనాథశాస్త్రి , వెంకన్నశాస్త్రి మధ్య వివాదం పూర్తిగా చల్లారక ముందే, పదిహేడేళ్ళ వయసులో పచ్చయ్యప్ప ఉన్నతపాఠశాలలో 'అసిస్టెంట్ టీచరు' ఉద్యోగంచేస్తూ, నరసయ్య ఈ పుస్తకాన్ని ప్రచురించాడు. “లేటర్స్ ఆన్ హిందూ మేరేజస్ ఆర్ జి. వెంకన్నశాస్త్రియర్, సి. ఎన్.ఐ వెర్సెన్ సి. రంగనాథ శాస్త్రియర్ అండ్ సి. అనంతరామశాస్త్రియర్” అని పుస్తకానికి రెండు పేర్లు పెట్టాడు. ఈ పేర్ల కింద “హిందువులలో బాల్యవివాహాలను సమర్థిస్తూ కొంతకాలంక్రింద మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించబడిన లేఖలు" అని ఒక వివరణ ప్రచురించాడు.

నరసయ్య పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన తొలి పరిశోధకుడు బంగోరె. జమీన్‌రైతు పత్రికలో దీన్ని సంగ్రహంగా పరిచయం చేశాడు. ఆర్. సుందరలింగం ఈ పుస్తకాన్ని సంప్రదించాడు. అనంతరామశాస్త్రికి, వెంకన్నశాస్త్రికి జరిగిన వివాదం సందర్భంలో ఎథీనియం అండ్ డెయిలీన్యూస్‌లో, మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించబడిన ఉత్తరాలను తన గ్రంథంలో ఉదాహరించాడు.14 లెనార్డ్ ఈ పుస్తకాన్ని పేర్కొనలేదుగాని, రంగనాథశాస్త్రి పేరుతో నరసయ్య రాసిన లేఖను తన థీసిస్‌లో ఉదాహరించాడు. వేదసమాజ ప్రభావంలో రజస్వలానంతర వివాహాలను సమర్ధిస్తూ కొన్ని రచనలు వెలువడ్డాయని, ఆ రచనలలో ప్రతిపాదించబడిన సూత్రీకరణలను శంకరాచార్యులు తిరస్కరించిన విషయం, మద్రాస్ టైమ్స్ వార్తలను ఉదాహరించి రాశాడు.15 ఆచార్య వి. రామకృష్ణ ఈ పుస్తకాన్ని పేర్కొన్నాడు.16

నరసయ్య అన్నలిద్దరికి విద్యార్థి దశలోనే వెంకటరాయులునాయుడు ఏర్పాటుచేసిన సంస్థలతో సంబంధం ఏర్పడి ఉంటుంది. కేశవచంద్రసేన్ మద్రాసులో చేసిన ఉపన్యాసాలు, మద్రాసు వేదసమాజ కార్యక్రమాలు, ప్రార్థన సమావేశాలు ఈ ముగ్గురుసోదరుల వ్యక్తిత్వం మీద ప్రభావం చూపి ఉంటాయి. వెంకటరాయులునాయుడు 'రైసింగ్ సన్' ఆగిపోయినతర్వాత, ఆయన ఆశయాలను నరసయ్యసోదరులు ప్రారంభించిన 'నేటివ్ అడ్వొకేట్' పత్రిక కొనసాగించినట్లు సుందరలింగం అభిప్రాయపడ్డాడు.17

నరసయ్యకు విద్యార్థిదశలోనే లౌకికభావాలున్న వ్యక్తులతో, బ్రహ్మసమాజం అభిమానులతో పరిచయాలు, స్నేహాలు ఏర్పడినట్లు తోస్తుంది. పళ్ళె చెంచలరావు, చుండూరు కోటయ్య సెట్టి, మన్నవ బుచ్చయ్య మొదలైనవారితో ఆత్మీయమైన సంబంధం ఉన్నట్లుతోస్తుంది. రాజగోపాలాచార్యులు మరణించిన తర్వాత మదరాసు బ్రహ్మసమాజ ఉద్యమానికి శ్రీధరనాయుడు నాయకత్వం వహించాడు. మన్నవ బుచ్చయ్య మొదలైన యువకులు ఈయన పర్యవేక్షణలో బ్రహ్మసమాజ అనుయాయులుగా తీరారు. నరసయ్య మీద కూడా ఈయన ప్రభావం పడిఉంటుంది.

జాన్ బ్రూస్ నార్టన్ (John Bruce Norton) అభిప్రాయాలు ఉదారభావాలున్న ఆనాటి మద్రాసు యువకులందరినీ ప్రభావితం చేశాయి. ఆయన మీద వారికి అపారమైన గౌరవం ఉంది.18 నరసయ్యకు ఆయనంటే గొప్ప ఆరాధనాభావం ఉంది. పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకీయంలో ఎథీనియం అండ్ డెయిలీ న్యూస్ పత్రిక ప్రకాశకులను, ఆ పత్రికకు కొంతకాలంపాటు సంపాదకత్వం వహించిన నార్టన్‌ను నరసయ్య ఎంతో గౌరవభావంతో ప్రస్తావించాడు. ఈ చిన్నచిన్న సంగతులే నరసయ్య వ్యక్తిత్వవికాసంలో పనిచేసిన శక్తులను ఊహించుకోడానికి సహాయపడ్డాయి.

ఆరు లేఖలు

ఈ పుస్తకంలో ఆరు లేఖలున్నాయి. నరసయ్య ఈ ఆరు లేఖలు 1865 జూలై-అక్టోబరు మధ్యకాలంలో రాశాడు. బాల్య వివాహాల మీద రంగనాథశాస్త్రి వర్గానికి, వెంకన్నశాస్త్రికి మధ్య ఏర్పడిన వివాదంలో, వెంకన్నశాస్త్రి అభిప్రాయాలను వివరిస్తూ నరసయ్య ఈ లేఖలు రాశాడు. ఈ లేఖలు రాస్తున్న సమయంలో ఆయనకు పదహారోయేడు పూర్తయి పదిహేడో ఏడు పెట్టింది. ఆయన ఎంత 'మేధావి' అయినా, ఈ లేఖలు రాయడంలో ఎవరో ఒకరి సహకారం, సహాయం ఉండి ఉండాలి. తన బావ వెంకన్నశాస్త్రి 'సిద్దాంత సిద్ధాంజనమ్' లో విపులీకరించిన అభిప్రాయాలను, వాదనలను తాను ఈ లేఖలలో వివరించినట్లు నరసయ్య 'ముందుమాట' లో వినయంగా తెలియచేశాడు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా, రజస్వలానంతర వివాహాలకు అనుకూలంగా మద్రాస్ స్టాండర్డులో ఆయన ప్రచురించిన లేఖ కూడా ఈ పుస్తకంలో ఉంది. ఈ లేఖలో వ్యక్తంచేసిన భావాలు వెంకన్నశాస్తివి కావు. రంగనాథశాస్త్రి వర్గానికి చెందినవి కావు. తాను గాఢంగా విశ్వసించిన అభిప్రాయాలనే నరసయ్య ఇందులో వ్యక్తం చేశాడు. నరసయ్య కన్నా ముందు ఆయన సోదరులిద్దరు ఉదార పాశ్చాత్య విద్యావిధానంలో చదువు సాగించారు. వీరి ప్రభావం నరసయ్యమీద ఉంది. లౌకిక విద్యా విధానం, బ్రహ్మసమాజ భావాలు, పాశ్చాత్య సమాజ విలువలు, క్రైస్తవ మత బోధనలు, అప్పుడప్పుడే ననలువేస్తున్న సంస్కరణవాదుల అభిప్రాయాలు యవ్వనంలో అడుగుపెడుతున్న నరసయ్య మీద చెరగని ముద్రవేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాసిన ఈ లేఖలను పరిశీలించవలసి ఉంటుంది. తన పుస్తకానికి ఆయన రాసిన పరిచయ వాక్యాల అనువాదం :

ముందుమాట

ఈ లేఖలు నేనే రాశానని ఎంతో సంకోచంతో ఇప్పుడు ప్రకటిస్తున్నాను. ఈ లేఖలలో ఏదైనా మంచి ఉంటే, అది ఆ లేఖల చివర ఉన్న పేర్లకు చెందుతుంది. ఈ లేఖలలో ఒకే విధంగా వ్యక్తమయ్యే భావాలు, వాదనలు మాబావ గౌరవనీయులు, చతుష్షష్టి కళాత్మక, అలంకార సార్వభౌమ బిరుదాంకితులైన జి. వెంకన్నశాస్త్రి 'సిద్దాంత సిద్ధాంజనమ్' లో ఎంతో సమర్థవంతంగా ప్రకటించినవే. ఆయన భావాలకు ఇంగ్లీషు భాష అనే ముసుగు తొడగడం మాత్రమే నేను చేసినపని అని మనసుకు తెచ్చుకొన్నప్పుడు, ఈ విధంగా ఆ లేఖలను ప్రజల ముందుంచడం ఎంత తొందరపాటు పనో నాకు తెలియకపోలేదు. ప్రజలదగ్గర పొగడ్తలు ఆశించనపుడు, నిజాన్ని వారిముందుంచితే, నేను చేసిన మహాపరాధాన్ని క్షమిస్తారని నాకు తెలుసు. ఒక నిజాన్ని సంతోషంగా అంగీకరించినపుడు, అందుకు ప్రతిఫలం ఏదీ ఆశించనపుడు, అది అంత చెడ్డ సంగతేమి కాదు కదా?

డి. నరసయ్య

పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాల,

16 ఫిబ్రవరి, 1867

మొదటి లేఖ

ఈ లేఖ సి.వి. రంగనాథశాస్త్రి పేరుతో, 1865 జూలై 13వ తారీకు మద్రాస్ టైమ్స్ లో ప్రచురించబడింది. బాల్యవివాహాలను నిరసిస్తూ రంగనాథశాస్త్రి ఈ లేఖ రాసినట్లు సుందరలింగం పేర్కొన్నాడు కాని, ఈ లేఖలన్నిటికీ నరసయ్యే కర్త అని గుర్తించ లేదు.19 తన పేరుతో ఇతరులెవరో పత్రికకు లేఖ రాస్తే, రంగనాథశాస్త్రి అంతటి ప్రసిద్ద వ్యక్తి ఎందుకు ఊరుకొని ఉంటాడు? తానా లేఖ రాయలేదని ప్రకటించకుండా ఉండడు. ఆయన అటువంటి లేఖరాసి ఉంటే మద్రాస్ టైమ్స్ తప్పకుండా ప్రచురించి ఉండేది. ఆనాటి మద్రాస్ టైమ్స్ నుంచి, ఇతర ఇంగ్లీషు పత్రికల నుంచి అంత తరచుగా 'కోట్' చేసిన సుందరలింగంగాని, లెనార్డ్ గాని ఈ విషయాన్ని విడిచిపెట్టి ఉండరు. రంగనాథశాస్త్రితో నరసయ్య సోదరులకు పరిచయం ఉండి ఉంటుంది. అప్పుడప్పుడే విస్తరిస్తున్న సంస్కరణ భావాలకు అందరూ సుముఖలు కావడంవల్ల, బాల్యవివాహాలను తిరస్కరిస్తూ తన పేరుతో నరసయ్య లేఖరాసినా, రంగనాథశాస్త్రి మౌనంగా ఉండి ఉంటాడు. నరసయ్య పసివయసును, వ్యక్తిత్వాన్ని బట్టి కూడా మన్నించి ఉంటాడు.

రంగనాథశాస్త్రి అభిప్రాయాలను మొదట వివరించవలసిన అగత్యం నరసయ్యకు ఉంది. తర్వాత బాల్యవివాహాలను సమర్థిస్తూ వెంకన్నశాస్త్రి వాదాన్ని వివరించడానికి ఇది ప్రాతిపదిక అవుతుంది. రంగనాథశాస్త్రి పేరుతో ఉన్న లేఖ అనువాదం :-

ప్రియమైన దేశ ప్రజలారా ! సాటి హిందువులారా ! నేను బ్రాహ్మణుణ్ణి. శైశవావస్థనుంచి సంస్కృతం శ్రద్దగా చదువుతున్నాను. వివిధ మతకర్మలు ఆచరించే సందర్భాలలో, దేశానికి ప్రాణపదమైన వివాహక్రతువులో పఠించే మహామంత్రాల అర్థాన్ని చాలాకాలంగా అనుశీలన చేస్తున్నాను. పసిపాపలకు చేసే వివాహాలు అన్యాయమైనవని, అనాగరికమైనవని, నా పరిశోధనలో తేలింది. ఈ వివాహాలు లోకజ్ఞానానికీ , వివాహ సందర్భంలో పఠించే మంత్రాలలో వివరించబడిన సిద్దాంతాలకూ, వివాహ విధులకు ఆధారమైన శాస్త్ర గ్రంథాలకూ విరుద్ధమైనవి. బాల్యవివాహాల మీద, ఇంకా రెండు ముఖ్యమైన విషయాలమీద నా అభిప్రాయాలను ప్రచారంచేస్తూ వచ్చాను. వీటికి పండితుల సమర్ధన సంపాదించాను. వారు నాతో గొంతు కలిపారు. మన ఆధ్యాత్మిక గురువు పూజ్యులు శ్రీమత్ శంకరాచార్యులవారి సమక్షంలో, సుప్రసిద్ధులైన మన మిత్రులు, గౌరవనీయులు అనంతరామశాస్త్రి బాల్యవివాహాలమిద త్వరలో చర్చ ప్రారంభిస్తారు. ఆసక్తిఉన్న దేశీయులందరూ గౌరవ పురస్సరంగా ఆహ్వానించబడుతున్నారు.

మీ క్షేమాన్ని కాంక్షించే దేశీయుడు

సి.వి. రంగనాథశాస్త్రి

రెండో లేఖ

ఈ లేఖ 1865 ఆగష్టు 3వ తారీకు మద్రాస్ టైమ్స్‌లో వెంకన్నశాస్త్రి పేరు మీద ప్రచురించబడింది. మొదటి లేఖకు సమాధానంగా ఈ లేఖ రాయబడింది. పీఠాధిపతి సముఖంలో అనంతరామశాస్త్రి బాల్యవివాహాలకు శాస్త్రాల ఆమోదంలేదని, తనవాదం వినిపించినట్లుంది. ఆయన రచించిన 'వివాహ్య కన్యా స్వరూప నిరూపణమ్' అంతకు ముందుగానే ప్రచురించబడి పండితులకు అందుబాటులోకి వచ్చినట్లుంది. ఈ లేఖలో కొన్ని ముఖ్యమైన భాగాలను మాత్రం, అనువదించి వివరించడం జరుగుతూంది..

“పూజ్యులు శంకరాచార్యుల వద్ద అనంతరామశాస్త్రి ఈ కరపత్రాన్ని చదివినపుడు నేనక్కడే ఉన్నాను.20 అందులో వ్యక్తంచేయబడ్డ కొన్ని అభిప్రాయాలకు నేను అక్కడికక్కడే అభ్యంతరం చెప్పాను. ఆయన పట్టుపట్టడంవల్ల, ఆయన కోరినట్లుగానే, ఈ కరపత్రానికి సమాధానంగా మరొక కరపత్రం తయారు చేశాను. త్వరలో దీన్ని ప్రచురించి, స్వామివారి సన్నిధిలో పఠిస్తాను..

ముందుగా మీ దృష్టి ఈ క్రింది విషయాల మీద నిలిపి, శ్రద్దగా పరిశీలించమని అర్థిస్తున్నాను. అనంతరామశాస్త్రి వాదం పూర్తిగా మనుస్మృతి 9వ ప్రకరణంలో 28వ శ్లోకం, 10వ ప్రకరణంలో 3వ శ్లోకం - ఈ రెండు శ్లోకాల మీదే ఆధారపడి ఉంది. వీటికి అపార్ధంచెప్పి, లేదంటే, తన వాదానికి పనికివచ్చే అర్ధాన్ని బలవంతంగా రాబట్టి, ఆయన తన స్వరూపాన్ని, తన మిత్రుడు రంగనాథశాస్త్రి స్వరూపాన్ని బహిర్గతం చేశాడు. రంగనాథశాస్త్రి అపఖ్యాతిపాలయ్యే ఇటువంటి విషయాల జోలికి ఇంతకు ముందెప్పుడూ పోలేదు. ఇప్పుడు మాత్రం తనకు సహజ గుణమయిన వివేచనను కోల్పోయి, అనంతరామశాస్త్రితో కలిసి నిరర్ధకమైన సాహసానికి పూనుకొని అపహాస్యం పాలయ్యాడు.”

అనంతరామశాస్త్రి ఉదాహరించిన మనుస్మృతిలోని శ్లోకాలకు విలియం జోన్స్ (William Jones) అనువాదాన్నిచ్చి, అనంతరామశాస్త్రి మనువు అభిప్రాయానికి ఏ విధంగా అపార్ధాన్ని సృష్టించాడో వెంకన్నశాస్త్రి వివరించాడు. “ప్రస్తుతానికి మనుస్మృతికి పరిమితమయి మాట్లాడుతున్నాము. ఆనిషేధం లేకపోతే, బాల్యవివాహాలను సమర్ధించే రుషిప్రోక్తాలు, ఇతర ప్రమాణాలు చాలా ఉన్నాయి” అంటూ, తన వాదాన్ని, ప్రత్యర్థులవాదాన్ని చక్కగా బోధపరచుకొన్నారు కనుక నిర్ణయాన్ని సహృదయ పాఠకులకు విడిచిపెడుతున్నట్లు లేఖ ముగించాడు.

మూడో లేఖ

ఈ లేఖ 1865 ఆగష్టు 7వ తేది మద్రాస్ స్టాండర్డు (Madras Standard) లో ప్రచురించబడింది. లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్ పుస్తకం ముఖపత్రంమీద "Being a reprint of the letters that appeared in the Madras Times some time back upholding infant marriages among Hindus" అని ఉంది కాని మద్రాస్ స్టాండర్డు ప్రస్తావన లేదు. ఈ పత్రిక ప్రస్తావన మద్రాసు జర్నలిజం చరిత్రలలో కనిపించదు, పందొమ్మిదవ శతాబ్ది చివర పరమేశ్వర పిళ్ళె సంపాదకత్వంలో వెలువడిన మద్రాస్ స్టాండర్డు ప్రస్తావన మాత్రమే కనిపిస్తుంది. అసైలం ప్రెస్ ఆల్మనాక్‌లలో 1865 నుంచి వరుసగా ఈ పత్రిక ప్రస్తావన ఉంది. పత్రిక ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం వెలువడేది. అన్ని ఉత్తరాలు మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించి, ఈ ఒక్క ఉత్తరాన్ని ఈ పత్రికకు ఎందుకు పంపవలసి వచ్చిందో కూడా తెలియదు. లేఖ చివర ఎవరిపేరూ లేదు. నరసయ్య సొంత అభిప్రాయాలు, ఆలోచనా ధోరణి ఈ లేఖలో వ్యక్తమయ్యాయి. ఆయన శాస్త్ర గ్రంథాల సహాయంతో సంస్కరణను సమర్ధించే వర్గానికి చెందడు. సమాజానికి మేలు చేకూర్చే మార్పును హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. మద్రాసు సంస్కరణవాదులు తర్వాత కాలంలో మితవాదులుగా, అతివాదులుగా ముద్రపడ్డారు. నరసయ్య అతివాద వర్గంతో ఉండి ఉండవచ్చని ఈ లేఖలో వ్యక్తమయిన ధోరణి సూచిస్తుంది. ఒకవైపు తనబావ వెంకన్నశాస్త్రికి అండగా ఉంటూ, ఆయన అభిప్రాయాలను ఆయన పేరు మీదనే సంపాదకీయ లేఖలు రాసి వివరించాడు. మద్రాస్ స్టాండర్డుకు రాసిన ఈ లేఖలో స్పష్టంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు; ఈ వైజ్ఞానిక యుగంలో పాతపడి వాడుకలో నుంచి తొలగిపోయిన ధర్మశాస్త్రాల ప్రామాణ్యాన్ని నిరాకరించాడు. ఒక సంప్రదాయం సమాజానికి కీడు కలిగిస్తున్నపుడు దాన్ని అనుసరించడంలో సబబును ప్రశ్నించాడు. అభివృద్ధి చెందుతున్న జాతులతోపాటుగా నూతన భావాలను అలవరచుకొని, సనాతన భావాలను, దుష్ట సంప్రదాయాలను ధైర్యంగా విడిచిపెట్టి ముందుకు సాగాలని సూచించాడు. ఈ లేఖ రాసేనాటికి నరసయ్యకు సమాజాన్నిపట్టి వీడిస్తున్న సాంఘిక దురాచారాలమీద మంచి అవగాహన ఉన్నట్లనిపిస్తుంది. బాల్యవివాహాలవల్ల, వితంతువివాహాల నిషేధంవల్ల సమాజంలో వ్యభిచారం అనేక రూపాల్లో వ్యాపించి ఉందని పేర్కొన్నాడు. నరసయ్య లేఖకు తెలుగు అనువాదం :

“ముగ్గురు శాస్త్రులు, ఒక ఆచార్యులు; వెంకన్నశాస్త్రి, రంగనాథశాస్త్రి, అనంతరామశాస్త్రి, పూజ్యులు, ఆధ్యాత్మిక పీఠాధిపతి శ్రీమత్ శంకరాచార్యులు - మొత్తం నాలుగు పెద్ద తలలు (పైగా చాలా పొడవైన పేర్లు). వీరు ఇష్టంగా పిలిచే “హిందూ శైశవ వివాహాలు' అనే అంశంపైన ఇద్దరు అనుకూలంగా, ఇద్దరు వ్యతిరేకంగా ఉండి బుర్రలు బద్దలు కొట్టుకొంటూ వివాదం సాగిస్తున్నారు. సమకాలిక పత్రిక మద్రాస్ టైమ్స్ 'కాలం' లను యుద్దరంగంగా ఎన్నుకొన్నారు. మహామనీషులు విభేదిస్తే, సంతృప్తికరమైన నిర్ణయానికి రావడం కష్టమని అంటారు. ఈ సంవాదంలో పాల్గొంటున్నవారు మహామేధావులు. వారు ఆర్జించిన పాండిత్యాన్ని మనం బోధపరచుకొన్నా, అనాదిగా సమకూడిన జ్ఞానసంపదను సాధించినా, ఈ వివాదంలో పాల్గొంటే మమ్మల్ని వారు స్వాతిశయంతో మిడిసిపడుతూ చురుకైన వాగ్బాణాలు సంధించే అహంభావిగా భావిస్తారు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళని మొండిగా వాదించేవాణ్ణని అనుకొంటారు. ఇతరుల తగాదాలలో అనవసరంగా జోక్యం చేసుకొంటే, గొడవపడుతున్నవారి మోచేతులు తగిలి ముక్కు పచ్చడవుతుందన్న చందంగా, ఎంతో సుకుమారమైన మా ఘ్రాణేంద్రియాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ ఉదయం మేము వివాదాస్పదమైన రంగస్థలంమీద అడుగు పెడుతున్నాము. ఈ తొందరపాటు చర్యవల్ల తప్పనిసరిగా మేము ఏదో ఒక పక్షంవైపు నిలబడవలసి వస్తుంది. ఒక వర్గం మమ్ములను స్నేహితుడుగా భావిస్తే, రెండోవర్గం నిష్కారణంగా వివాదంలో జోక్యం చేసుకొన్న వ్యక్తిగా తలచి దూషిస్తుంది. “ఒక సాధారణ ప్రేక్షకుడుగా ఉండి ప్రపంచాన్ని బోధపరుచుకోవాలని భావించడం బుద్ది తక్కువ పని” అని మహానుభావుడైన ఒక ఫ్రాన్సుదేశపు తత్త్వవేత్త అన్నాడు. ఆలంకారికంగానే అయినా, ముక్కు పగిలి, రక్తసిక్తం కావడానికి మేము సిద్దపడి, బాల్యవివాహాలను వ్యతిరేకిస్తున్న శాస్రుల తరఫున - శాస్త్రాలు చక్కగా అనుశీలనంచేసి, బాల్యవివాహాలను సమర్ధిస్తున్న ఉత్సాహవంతులకు వ్యతిరేకంగా రంగప్రవేశం చేస్తున్నాము.

అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం, హిందూ బాలికలకు శైశవంలోనే వివాహం చెయ్యడమా? లేకపోతే, విజ్ఞానం చక్కగా అభివృద్ది చెందిన ఈనాటి స్పూర్తితో, ఏషియా నాగరిక సమాజాల్లో, యూరపు అంతటా అమలులో ఉన్న, ఆచరణయోగ్యమైన, సులభమైన పద్దతిని అనుసరించడమా? ఇదే హిందువుల ముందున్న అసలు సమస్య. ఈ చరణాలు అంత అందంగా లేకపోయినా, విషయాన్ని క్లుప్తంగా చెప్తున్నాయి.

హిందూ స్త్రీలు

అర్హుడైన వరుణ్ణి ఎన్నుకోడం మాత్రమే కాదు;
వివాహయోగ్యమైన వయస్సును కూడా ఎంచుకోవాలి.

ఇదీ అసలుసమస్య. వెంకన్నశాస్త్రి, ఆయన మిత్రుడు, పీఠాధిపతి శ్రీమత్ శంకరాచార్యులు ఏ మాత్రం మార్పు లేకుండా సంప్రదాయాన్ని కొనసాగించాలని వాదిస్తారు. రంగనాథశాస్త్రి, ఆయన మిత్రుడు అనంతరామశాస్త్రి ఈ సంప్రదాయాన్ని రద్దుపరచాలని కోరుతున్నారు. మేమూ ఆమాటే అంటున్నాము. రంగనాథశాస్త్రి, ఆయన మిత్ర బృందం తమ వాదానికి రుజువుగా మనుధర్మశాస్త్రంలోని సూత్రాలను నిదర్శనంగా చూపుతున్నారు. వెంకన్నశాస్త్రి బృందం తమ అభిప్రాయాలకు అనుకూలంగా అవే ప్రమాణాలను ప్రదర్శిస్తున్నారు. హిందూ మిత్రులందరి మాదిరే, మనం ఒకే ఆకరాన్ని ప్రదర్శించి, పరస్పర విరుద్దమయిన రెండు నిశ్చయాలకు రాగలుగుతున్నాము. ఒకే గ్రంథంలో విషయాన్ని ఉటంకించి, మన మతంలో వివిధ శాఖలకు, తెగలకు చెందినవారం రకరకాల సూత్రీకరణలు చేస్తున్నాము. హిందూశాస్త్రులు ఒక సూత్రీకరణను ఉదాహరించి, పరస్పర విరుద్ధమైన నిర్ధారణలకు వస్తారు. ఎవరు సరైనఅర్థం చెప్పారో, ఎవరు తప్పుఅర్ధం చెప్పారో నిశ్చయించడం చాలా కష్టం. బాధాకరమే, అయినా ఆ ఇబ్బందిని స్పష్టంగా అధిగమించగలిగాము. రంగనాథశాస్త్రి, ఆయన మిత్రబృందం తమవాదాన్ని సమర్ధించుకోడానికి తప్పు ఆకరాలను చూపించారు. మనువచనానికి వెంకన్నశాస్త్రి చెప్పిన అర్ధం ఒక్కటే సరైనది. రంగనాథశాస్త్రి, కాకపోతే ఆయన మిత్రుడు అనంతరామశాస్త్రి తాను చూపిన ఆధారాలకు, చిత్రంగా తర్క విరుద్దమైన అర్థాలను రాబట్టాడు. వెంకన్నశాస్త్రి తన ప్రత్యర్థి ఉదాహరించిన మనువాక్యాలనే ఉటంకించి, ఆయన వాదాన్ని తిప్పికొట్టాడు. వెంకన్నశాస్త్రివర్గం సమర్ధవంతంగా తమవాదాన్ని వినిపించినందుకు వారియోగ్యతను గుర్తిస్తున్నాము.

ఈ వాదం ప్రధానంగా మనుస్మృతి మీద ఆధారపడి కొనసాగించబడింది. సంస్కృత మాతృకను పరిశీలించినా, తమిళ అనువాదాలను, ఇతర భాషల నుంచి ఇంగ్లీషులోకి చేయబడ్డ అనువాదాలను చదివినా, మనుస్మృతి హిందువులకు బాల్య వివాహాలను విధించినట్లు తెలుస్తుంది. మూడు వేల సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది.

ఇప్పటివరకూ బాల్యవివాహాలను సమర్థించేవారితో కలిసి వాదించాము. ఇప్పుడు బాల్యవివాహాలను వ్యతిరేకిస్తున్న వారితో కలిసి వాదించడానికి సిద్దంగా ఉన్నాము. (మేము విన్న ప్రకారం, ఈ వర్గంవారు మేము అనుసరిస్తున్న పద్ధతి ప్రకారం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వాదించమని మమ్మల్ని కోరలేదు.)

ఏనాటివో పురాతన ధర్మశాస్త్రాలు బాల్యవివాహాలను అనుమతించి, ఆదేశించాయని, ఈ సంప్రదాయం ఎంతో కాలంగా కొనసాగుతున్నదనే సాకు చూపి, ఈ దురాచారం కొనసాగాలని చెప్పడానికి వీలులేదు. ఒకసంప్రదాయం నాగరికత పురోభివృద్ధికి అడ్డంకిగా నిలిచినా, విద్యావ్యాప్తిని అడ్డుకొన్నా, అనాదిగా కొనసాగుతున్న అపోహలను సమూలంగా పెకలించే ప్రయత్నానికి అవరోధమైనా, దాన్ని కొనసాగించవలసిన పనిలేదు. బ్రతుకులో స్త్రీని అర్హమైన స్థితిలో, నిజమైన స్థానంలో నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో సంప్రదాయం అడ్డు నిలిస్తే, అటువంటి సంప్రదాయాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ఒక సమాజ అవసరాలను, ఆకాంక్షలను నెరవేర్చిన తర్వాత ఆ సంప్రదాయాలు, అపేక్షలు, ఆకాంక్షలు పాతపడి, తర్వాత కాలానికి కొరగాకుండా పోతాయి, ఉపయోగపడవు. మనం చేసే కార్యాలన్నీ పూర్వుల సంప్రదాయానుసారం, వాడుక అనుసరించి ఉండాలనుకొంటే పురోగమనం అనే పందెంలో ఎక్కడో వెనకబడి పోతాము. యుగయుగాలుగా ఇది హిందువుల పాలిట శాపంగా మారింది. హిందువుల నాగరికత చలనం లేకుండా ఉండడానికి ఇదే కారణం. విజ్ఞానం వ్యాప్తి చెందుతున్న ఈ రోజుల్లో అనాదిగా కొనసాగుతున్న అపోహలను, పక్షపాతంతో కూడిన ప్రమాదకరమైన భావాలను హిందువులు వదిలించుకొంటున్నారు. హిందువుల అభివృద్ధిపథంలో అడ్డుగానిలిచిన ఇటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ దురాచారాలలో బాల్య వివాహాలు తక్కువైనవేమీ కావు. ప్రజలు వీటిని పాటించడం వల్ల, అనేక సంక్లిష్ట సామాజిక దురన్యాయాల పాల పడుతున్నారు. వీటిని గురించిన మా పరిశీలన వివరించడానికి ఇప్పుడు వ్యవధి లేదు, అవకాశమూ లేదు. బాల్య వివాహాలవల్ల కలిగే దురన్యాయాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాము. ఈ సాంఘిక దురాచారం ఇతరజాతుల వారిలోకన్నా హిందువులలో తక్కువ కీడు కలిగించేది కాదు. బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం ప్రమాదకరమైన ఈ రెండు దుష్టసంప్రదాయాలు పెద్దఎత్తున బహిరంగ వ్యభిచారానికి కారణమయ్యాయి. “మా వాదనలో పసలేదు. ఇదేమి అంత పెద్ద విషయం కాదు. దీన్ని మీరు పెద్దదిచేసి భూతద్దంలో చూపుతున్నారు” అని మా మిత్రులంటారు. ప్రజల అనుభవం ఈ నిజాన్ని ధ్రువీకరిస్తూంది. సహజంగా ఇటువంటి ఫలితంతప్ప, మరొకదాన్ని ఊహించలేము. దీన్ని ఎత్తిచూపడం, దీనికి చికిత్స సూచించడం బాధాకరమైన మా కర్తవ్యం అయింది. ఈ దేశంలో మహిళల సాంఘిక, నైతిక ఉన్నతిని హృదయంలో అభిలషించే ప్రతి హిందువు రంగనాథశాస్త్రి, ఆయన స్నేహితులతో చేయి కలపాలి. వ్యవహారం నుంచి తొలగిన మనుధర్మంగానీ, మరొక ధర్మంగానీ ఏంచెప్తున్నదని కాక, ఇంతగా అభిలషించబడుతున్న సంస్కరణకు కార్యరూపం ఇవ్వాలి. పవిత్రమైన దాంపత్యసిద్ధిని కోరుకోవాలి. హిందువులు అపోహలను వదిలించుకొని తమకు తాము కొత్తగా ఆలోచించుకోవాలి.”

నాలుగో లేఖ

ఈ లేఖ మద్రాస్ టైమ్స్‌లో 1865 ఆగష్టు 19న వెంకన్నశాస్త్రి పేరు మీద ప్రచురించబడింది.

అనంతరామశాస్త్రి మద్రాసులో లేకపోవడంవల్ల బాల్యవివాహాలమీద చర్చ వాయిదా పడింది. ఈ సమయంలో వెంకన్నశాస్త్రి వాదం ఈ లేఖలో సమగ్రంగా వివరించబడింది. “అనంతరామశాస్త్రికి వ్యతిరేకంగా కొరడా ఝళిపిస్తాను. ఆయనతో ఢీకొని నా వాదాన్ని వినిపించడానికి సిద్దంగా ఉన్నాను” అంటూ లేఖ ఆరంభమవుతుంది. కరపత్రం రాయడం పూర్తికాకపోవడం వల్ల, వెంకన్నశాస్త్రి అభిప్రాయాలు ముందుగా లేఖలో వివరించబడ్డాయి. తన మొదటి లేఖలో అనంతరామశాస్త్రి పుస్తకంలో కొన్ని అప్రధానమైన అంశాలకు సమాధానం చెప్పడానికి అవకాశం లేకపోవడంవల్ల, ఈ లేఖలో వాటిని ప్రస్తావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ లేఖలో ప్రధానాంశాలు సంగ్రహంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. “అనంతరామశాస్త్రి తన అభిప్రాయాలను వివరించే సందర్భంలో తరచుగా సభ్యతను విడిచిపెడుతూ ఉంటాడు. ఆయన సంప్రదించిన ఆకరాలు హాస్యాస్పదమైనవి. సభ్యత విడిచిపెట్టకుండా ఆయనకు సమాధానం చెప్పడం వీలుపడదు. ఉద్దేశపూర్వకంగా అటువంటి విషయాలు ఈ లేఖలో ప్రస్తావించడం లేదు, చర్చలో వచ్చే విషయాల స్వభావమే అటువంటిదని పాఠకులు గ్రహించాలి' అని వెంకన్నశాస్త్రి ముందుగా హెచ్చరిస్తాడు.

“తన వాదానికి ఆధారంగా అనంతరామశాస్త్రి మనుస్మృతి 83వ ప్రకరణంలో 8వ శ్లోకాన్ని ఉదాహరించాడు. వివాహయోగ్యమైన కన్యకు కేశాలు అతిగా ఉండడం, పల్చగా ఉండడం మంచిదికాదు. బాలిక ఈడేరిన తర్వాతగాని ఈ విషయం తెలిసే అవకాశం లేదు. అప్పటివరకు చాలా శరీరభాగాలలో కేశాలు రావు. అందుచేత ఈడేరిన బాలికనే పెళ్ళాడాలని మనువు భావించాడు. ఇదీ అనంతరామశాస్త్రి వాదం! పరిహాసాస్పదంగా లేదా?

ధర్మశాస్త్రాలు విధి నిషేధాలను స్పష్టంగా పేర్కొన్నాయి. ఈ విషయంలో ఎటువంటి స్వేచ్ఛలేదు. శాస్త్రాలు కొన్నికార్యాలను చెయ్యమనో, చెయ్యవద్దనో చెపుతాయి. వీటి ఆచరణలో మనకు స్వేచ్ఛ ఉంటుంది. అనంతరామశాస్త్రి ఉదాహరించిన మనువాక్యాలు రెండో పద్దతివి. కేశాల ప్రస్తావన సౌందర్యానికి సంబంధించినదేగానీ, ఆయన భావించిన అర్థం దానికి లేదు.

శిశువు జన్మించిన నాటి నుంచి ఎనిమిదేళ్ళు వచ్చే లోపల మనువు షోడశకర్మలు విధించాడు. ఉపనయనంతప్ప, మిగతా కర్మలను ఆడపిల్లలకు కూడా మంత్రాలు లేకుండా ఆచరించాలని విధించాడు. పురుషుడికి ఉపనయన విధితో ఈ కర్మలు ముగిసినట్లు, స్త్రీకి వివాహ విధితో ఇవి పూర్తవుతాయని పేర్కొన్నాడు. స్త్రీకి ఎనిమిదో ఏట వివాహ విధి పూర్తి చెయ్యాలి. ఈ వయసులో కుమార్తె వివాహం నిర్వహించని తండ్రి గర్హనీయుడని స్మృతి పేర్కొంటుంది. బాలికలకు ఎనిమిదో ఏడు నిండేలోపల వివాహకార్యం పూర్తిచేయాలని శాస్త్రగ్రంథాల నుంచి విస్తారంగా ఉదాహరించాము. అనంతరామశాస్త్రి మనువును తప్ప ఇతర రుషుల ధర్మసూత్రాలను అంగీకరించ నన్నాడు. ఆయన వాటిని చదివిన పాపాన పోలేదు. రంగనాథశాస్త్రికి ఇంగ్లీషు వచ్చుకదా! హైస్కూలు పరీక్షలో 'ప్రొఫిషియెంట్' గా ఉత్తీర్ణుడయ్యాడుకదా ! మనుస్మృతి ఇంగ్లీషు అనువాదాలను పరిశీలించవచ్చు కదా !”

అయిదో లేఖ

వెంకన్నశాస్త్రి పేరుతో ఈ లేఖ మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించబడింది. ప్రచురణ తేది లేదు. లేఖ 1865 సెప్టెంబరు 19 నాడు రచించబడినట్లు పేర్కొనబడింది. రంగనాథశాస్త్రి ఎథీనియం అండ్ డెయిలీ న్యూసు పత్రికలో రాసిన లేఖకు సమాధానంగా ఈ లేఖ రాయబడింది. ఈ లేఖ అనువాదం:-

“అయ్యా !

నేను శాశ్వతంగా నోరు మూయించాననుకొన్న రంగనాథశాస్త్రి నా పుస్తకంకోసం ఎదురుచూస్తున్నట్లు, శ్రీమత్ శంకరాచార్యుల సమక్షంలో పఠిస్తే, వినడానికి తాను, తన స్నేహితుడు అనంతరామశాస్త్రి ఉత్సుకతతో ఉన్నట్లు “ఎథీనియం అండ్ డెయిలీన్యూసు” లో రాశాడు. ఏమీ ఎరగనట్లు నటిస్తున్నాడు కానీ, నా పుస్తకం పూర్తయి, ఎప్పుడు వెలుగు చూస్తుందో ఆయనకు తెలుసు. వచ్చే అక్టోబరు మాసంలో ఏదో ఒకరోజు పుస్తక పఠనానికి ముహూర్తం నిశ్చయించబడింది. ఆయన మిత్రుడు మద్రాసులో లేకపోవడంవల్లే పుస్తక పఠనం ఇంతకాలంగా వాయిదాపడుతూ వచ్చింది. నా ప్రత్యర్థి ఊళ్ళల్లో ఎక్కడో తిరుగుతూ ఉంటే, పుస్తక పఠనం ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? అనంతరామశాస్త్రి మద్రాసుకు తిరిగివచ్చిన తర్వాత, మా ఇద్దరిమధ్య నలుగుతున్న వివాదాన్ని మహాపండితుల సమావేశంలో నిర్ణయిస్తారు. ఇందుకు మేమిద్దరం అంగీకరించాము. మద్రాసు ప్రెసిడెన్సీలో కాంచీపురం మొదలైన ప్రదేశాల్లోని సుప్రసిద్ధ పండితులకు ఆహ్వానాలు వెళ్ళాయి. ఆ మహావిద్వాంసులు ఇక్కడికి రావడానికి కొంతసమయం పడుతుంది కదా ! ఇదంతా తెలిసే రంగనాథశాస్త్రి పత్రికకెక్కాడు. నా పుస్తకం అచ్చయితే, నా సత్తా, పుస్తకం సత్తా తెలుస్తుందని రాశాడు. మనువు అష్టవిధ వివాహాలను అంగీకరించాడు కనుక, గాంధర్వవిధిని కూడా అంగీకరించాడని అనంతరామశాస్త్రి తన వాదానికి ఉపపత్తి చూపాడు. మనువు గాంధర్వ వివాహాన్ని గర్హించాడు. ఈ విషయాన్ని అనంతరామశాస్త్రి గమనించలేదు.”

ఆరో లేఖ

మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించబడిన తారీకుగాని, లేఖ రాయబడిన తారీకుగాని ఇవ్వలేదు. లేఖ చివర ఎన్.వి.డి. అని పొడి అక్షరాలు ఉన్నాయి. (దంపూరు వెంకట నరసయ్యకు ఇది సంగ్రహ రూపం) ఈ లేఖ సంగ్రహానువాదం :

“అయ్యా ,

మొన్న జరిగిన అవమానకరమైన సంఘటనకు సాక్షిగా నేను ఉన్నాను. అక్కడ ఉండి జరిగిన సంగతులు గమనించిన నావంటి వారెవరికైనా, వార్తాపత్రికలోనో, మరొక వేదికమీదనో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉందని విశ్వసిస్తున్నాను. అందువల్ల వీరు ఏ అద్భుతమైన వేదికమీద అదుపు తప్పి మాట్లాడారో, అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినట్లవుతుంది. ఆ విధంగా ప్రవర్తించినవారు తర్వాత అయినా, మనస్ఫూర్తిగా తమ ప్రవర్తనకు సిగ్గుపడేట్లు చేస్తుంది. మిమ్మల్ని విసిగిస్తున్నందుకు క్షమాపణ కోరకుండా, జరిగిన విషయాలను మీ

ముందుంచడానికి ప్రయత్నిస్తాను.

మీ పత్రికలో ప్రకటన ప్రకారం, గుర్రం వెంకన్నశాస్త్రి ఒకటవతేది, ఆదివారం తిరువత్తూరు వెళ్ళి, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పూజ్యులు ఆచార్యులను ముందుగా అనుకొన్న ప్రకారం ఆ రోజు కార్యక్రమం మొదలుపెట్టడానికి అనుజ్ఞ కోరాడు. ఆయన అనుమతి ఇవ్వగానే, తాను రాసిన పుస్తకం వినిపించడం మొదలుపెట్టాడు. పుస్తకపఠనం మొదలయ్యే సమయంలో అక్కడే ఉన్న రంగనాథశాస్త్రి, అనంతరామశాస్త్రి కనిపించకపోవడం గమనించి, వారిద్దరినీ లోపలకు వచ్చి కూర్చోవలసినదిగా ప్రార్థిస్తూ, ఒక సేవకుని ద్వారా సందేశం పంపాడు. ఇంత ముఖ్యమైన సందర్భంలో వారు వెళ్ళిపోవడంవల్ల, పుస్తకపఠనం జరుగుతున్నవేళ అక్కడ ఉండడం వారికి ఇష్టంలేదనో, మరేదైనా సంగతో అని అనిపిస్తుంది. ఇదంతా గమనిస్తున్న నాకు అప్పుడు ఏదో ఆశ్చర్యం కలిగించే విషయం జరగబోతున్నట్లు స్పురించింది. ఆందోళన, ఉత్సుకత మనసును పెనవేసుకొంటూ ఉంటే, ఈ సాయంత్రం ఇంకా ఏంచూడబోతామో అని అందరం ఎదురుచూచాము. తినబోతూ రుచులడగడమెందుకని, కళ్ళు చెవులు అప్పగించి గమనిస్తూ ఉన్నాను. ఇంతలో ఆ ఇద్దరు శాస్త్రులు వెంకన్న ముందుకు వచ్చి, ఆయన వాదంలో లోపాలకు అక్కడికక్కడే అభ్యంతరం తెలపడానికి అవకాశం ఇవ్వాలని ఒక్కమాటగా అడిగారు. వారి ఇష్టప్రకారమే చెయ్యవచ్చనీ, ముందు వారిద్దరు తన వద్ద ఉన్న కాగితం మీద చేవ్రాలు చెయ్యాలని, తాను చేవ్రాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని వెంకన్నశాస్త్రి సమాధానం చెప్పాడు. మొదట కట్టుబడి ఉంటామని చేసుకొన్న ఒప్పందం ప్రకారం, ఆ కాగితంలో వివరించబడిన నిబంధనలను అనుసరించి వివాదం పరిష్కరించుకోవచ్చని వివరించాడు. (ఈ నిబంధనలు ఈ ప్రయోజనాలను ఉద్దేశించి తయారుచేసినవని నాకు తర్వాత తెలిసింది. వెంకన్నశాస్త్రి, రంగనాథ శాస్త్రి అనంతరామశాస్తులకు రాసిన లేఖలో ప్రతిపాదించిన విధంగా, ఎంపికచేయబడిన పండితమండలి తీర్పు సంతృప్తికరమైన చివరి తీర్మానంగా ఓడినవారు అంగీకరించాలి. అందువల్ల పుస్తకం ప్రజాశ్రేయస్సుకు భంగం కలిగించేదని, అందులో ప్రమాదకరమయిన సిద్ధాంతాలున్నాయని, నిరూపణ అవుతుంది. అటువంటి పుస్తకం రచించినట్లు రచయిత సిగ్గుపడి, ఒప్పుకొన్నట్లవుతుంది. ఇటువంటివే ఇంకా కొన్ని నిబంధనలు ఆ కాగితంలో ఉన్నాయి. మొదట వారు ఆ ప్రతిపాదనను అంగీకరించారు కాబట్టి, ఇవి న్యాయమైన నిబంధనలే అని అంటున్నాను. అటువంటి నియమాలు పెట్టుకోవాలని వారే పట్టుపట్టారు.)

మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించిన నోటీసులో ఈ నిబంధనలేవీ లేవు గనుక, వెంకన్నశాస్త్రి హేతుబద్ద ప్రతిపాదనలకు తాము కట్టుబడడానికి సిద్ధంగా లేమని వారు సమాధానం చెప్పారు. వారిట్లా ప్రవర్తిస్తారని ఆయన ఊహకు తట్టలేదు. ప్రతి ఒక్కరూ తనలాగే మాటకు కట్టుబడి, నిర్మలమైన ఆత్మగౌరవం, వ్యక్తిత్వం కలిగి ఉంటారని, వారిమాటలు పూర్తిగా విశ్వసించవచ్చని, ఆ భోళా మనిషి, నిర్దోషి అయిన వెంకన్నశాస్త్రి నమ్మాడు. దురదృష్టవంతుడు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆయనకు ఈ విధంగా జరిగింది.

ఈ పండితుల మధ్య జరిగిన వాదం సారాంశాన్ని ఇట్లా చెప్పుకోవచ్చు.

వెంకన్నశాస్త్రి :

పత్రికా ప్రకటనలో ఇటువంటి ప్రాముఖ్యంలేని సంగతులు పేర్కొనడం అవసరం అంటారా? బహిరంగసభలకు సంబంధించిన ప్రకటనలు పత్రికల్లో ఎన్నో చూచాను. సభాధ్యక్షులెవరో, ఏ తీర్మానాలు చేయబోతారో ఇటువంటి వివరాలు నేనెన్నడూ చూడలేదు. ఇవన్నీ ఇరుపక్షాల ఆమోదంతో అక్కడికక్కడే చర్చించుకొని నిర్ణయించుకొనవలసిన అంశాలని నేను భావిస్తున్నాను.

వెంకన్నశాస్త్రి మాటలకు ఎదుటిపక్షంవారు సమాధానం చెప్పలేదు. అనంతరామశాస్త్రి ఆ కాగితం మీద చేవ్రాలు చెయ్యడానికి సిద్ధపడుతున్నట్లు అనిపించింది. ఇంతలో రంగనాథశాస్త్రి అతని చెవిలో ఏదో ఊదాడు. ఇద్దరూ వెంకన్నశాస్త్రితో ఇట్లా సంభాషించారు.

రంగనాథ శాస్త్రి :

అనంతరామశాస్త్రి : మీరు పత్రికల్లో నిందిస్తూ మా గురించి అవమానకరంగా రాశారు. ఈ అసభ్యపు రాతలవల్ల మాకు కోపం వచ్చింది.

వెంకన్న (సమాధానంగా) : మీ గురించి చెడ్డగా రాసి కోపం తెప్పించి ఉంటే, కోర్టుకు వెళ్ళవచ్చు కదా? ఇక్కడ జరుగుతున్న దానికి మీరందరూ సాక్ష్యం. (సభాసదుల వంక చూచి) వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలేవీ అనలేదని నా అంతరాత్మ చెప్తూంది. టైమ్స్ పత్రికకు నేను రాసిన మూడు లేఖల్లో వారు ప్రతిపాదించిన విషయాలకు వ్యతిరేకంగా వాదించానేకాని, వారికి వ్యతిరేకంగా కాదు. నా బుద్ధికి తట్టిన పొరపాట్లు విమర్శించాను. వారికి సమ్మతం కాకపోతే నా వాదానికి బదులెందుకు రాయలేదు? నా వాదనలను వారు తిప్పికొట్టి ఉండవచ్చు. వారిమీద నేను ఆరోపించిన 'అజ్ఞానం' మొదలైన ఆరోపణలు నామీద వారు ఆరోపించి ఉండవచ్చు.

పరిస్థితి ఇంతవరకూ వచ్చిన తర్వాత, పూజ్యులు శంకరాచార్యులు చర్చను ఆపించారు. సభాపతి, ఆ సభాస్థలి యజమాని అయిన ఆయన మొదటే హద్దూ పద్దూలేని రంగనాథశాస్త్రి ఆగ్రహాన్ని అదుపుచేసి ఉండాలి కదా ! రంగనాథం అదుపు తప్పి, ఉద్రేకంతో వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉంటే ఆయనను మందలించి ఉండాలి కదా ! వెంకన్నశాస్త్రి అంతటి పెద్దమనిషిని రంగనాథ శాస్త్రి 'ముష్టివాడు' అనే విశేషణంతో సంబోధిస్తే, ఆ ప్రవర్తనకు తగినట్లు .ఆయనను సభ నుంచి బహిష్కరించ వలసింది కదా! రెచ్చిపోయి వాదించుకొంటున్న వారిని ఒక మందలింపు మాటతో సమాధాన పరచవలసిన అవసరం లేదా! అక్కడ సమావేశమైన వారందరూ కళ్ళముందు నడుస్తున్న ఈ వివాదాన్ని చూస్తూ ఉన్నారు. వారిలో నేనూ ఉన్నాను. శ్రీ మన్మహాపీఠాధిపతులను నేనొక్కణ్ణే ఎందుకు తప్పుపట్టాలి?

మీ. ఎన్. వి. డి"

నరసయ్య రాసిన ఈ లేఖలో కొంతభాగాన్ని ప్రచురణార్హంగా లేదని విడిచిపెట్టినట్లు మద్రాస్ టైమ్స్ సంపాదకులు ఒక వివరణ ఇచ్చినట్లుంది. నరసయ్య ఆ వివరణ కూడా తన పుస్తకంలో యధాతథంగా వేసుకొన్నాడు. ఆనాటి పండితవాదాలు సాగిన తీరుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. వీరేశలింగం స్వీయచరిత్రలో ఇటువంటి సంఘటనలను వివరంగా చిత్రించాడు. పీఠాధిపతుల సమక్షంలో తనబావగారికి జరిగిన అగౌరవాన్ని తెలియచెయ్యడానికే నరసయ్య ఈ లేఖ రాశాడు. పదిహేడేళ్ళ నరసయ్య దృష్టికోణం నుంచి ఈ లేఖ రాయబడింది. ఆయనలో దాగిఉన్న పత్రికావిలేకరి, రచయిత అంకురరూపంలో ఇందులో వ్యక్తమయ్యాడు. సభలో పాల్గొన్న వ్యక్తుల, సంభాషణలను ప్రత్యక్ష ఉల్లేఖనంలో రాయడం ఆనాటి పత్రికా రచనా పద్ధతులను సూచిస్తుంది. విద్యావంతుడైన తెలుగువాడు బాల్యవివాహాలపై వెలువరించిన మొదటి పుస్తకం అని పరిశోధకులు ఈ పుస్తకాన్ని ప్రస్తుతించారు.21

ఈ పుస్తకంలోని మూడో లేఖవల్ల, పీఠాధిపతి బాల్య వివాహాలను సమర్థించిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. సంప్రదాయ రక్షకుడైన ఈ పీఠాధిపతి పరిశీలనకోసం అనంతరామశాస్త్రి తాను రచించిన వివాహ్య కన్యా స్వరూప నిరూపణాన్ని పంపాడు. ఈ పుస్తకాన్ని పూర్వపక్షం చేస్తూ వెలువడిన గ్రంథాల్లో తన రచన వాద ప్రహసనాన్ని పీఠాధిపతి, సమగ్ర ఖండనగ్రంథంగా ఎంపికచేసి, సన్మానించినట్లు వెంకన్నశాస్త్రి వాద ప్రహసనమ్ ఉపోద్ఘాతంలో పేర్కొన్నాడు. పీఠాధిపతి అనంతరామశాస్త్రి వాదాన్ని తిరస్కరించినట్లు 1865 అక్టోబరు 4, 9 తారీకుల ఎథీనియం అండ్ డెయిలీ న్యూస్ సంచికలు, తదితర పత్రికల వల్ల తెలుస్తూంది.22 ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగిందని, బ్రాహ్మణ సంఘంనుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకావడంవల్ల రంగనాథశాస్త్రి బాల్యవివాహాలచర్చ అంతటితో ముగించినా, స్త్రీ విద్య మొదలయిన అభ్యుదయకర విషయాలమీద కృషిచేసినట్లు సుందరలింగం పేర్కొన్నాడు.23 సంస్కరణవాదులు బహిష్కరణ భయంతో బాల్యవివాహాల మీద చర్చను ముందుకు తీసుకొనిపోయి ఉండరని లెనార్డ్ అభిప్రాయపడ్డాడు." అనంతరామశాస్త్రి మాత్రం అటు తర్వాత మరింత 'రేడికల్' గా మారినట్లు అనిపిస్తుంది.