ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య/నెల్లూరు పయొనీర్

వికీసోర్స్ నుండి

5

నెల్లూరు పయొనీర్

వెంకటగిరి సంస్థానంలో కొన్నాళ్ళు

నరసయ్య ఏ పరిస్థితులలో మద్రాసు విడిచి పెట్టవలసి వచ్చిందో తెలియదు. ఉద్యోగంలో అసంతృప్తి ఒక కారణం కావచ్చు. ఆ రోజుల్లో పచ్చయ్యప్ప విద్యా సంస్థల యాజమాన్యం ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడంలో పక్షపాత దృష్టితో వ్యవహరించేదనే అపవాదు ఉంది. నరసయ్య తండ్రి 1867 ప్రాంతంలో చనిపోయాడు.1 ఇద్దరు అన్నలు ఉద్యోగాలు చేసుకొంటూ, వేరు కాపురాలు ఉంటున్నారు. ఈ దంపూరు సోదరులు ఉమ్మడిగా నిర్వహించిన నేటివ్ అడ్వొకేట్ పత్రిక వల్ల అప్పులపాలై ఉంటారు. విధిలేని పరిస్థితుల్లో నరసయ్య వెంకటగిరి వెళ్ళడానికి సిద్ధపడి ఉంటాడు.

వెంకటగిరి (నెల్లూరుజిల్లా) జమిందారు సర్వజ్ఞకుమార యాచేంద్ర తన పెద్ద కుమారుడు, పదేళ్ళ పసివాడు అయిన రాజగోపాలకృష్ణకు ఇంగ్లీషు నేర్పించడానికి సమర్ధుడైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న సమయంలో నరసయ్య ఇంగ్లీషు పాండిత్యం గురించి విని ఉంటాడు. ఈ జమిందారుకు నరసయ్య బావ గుర్రం వెంకన్న శాస్త్రితో పరిచయం ఉంది. వెంకన్నశాస్త్రిని మొహమాటపెట్టి నరసయ్యను వెంకటగిరి పిలిపించుకొని ఉంటాడు. పుట్టి పెరిగిన మద్రాసు పట్నాన్ని, తనకెంతో ప్రియమైన బ్రహ్మసమాజ మిత్రులను, సంస్కరణ కార్యక్రమాలను, అన్నిటికన్నా తనకు ఇష్టమైన పత్రికావ్యాసంగాన్ని వదులుకొని వెంకటగిరి వెళ్ళి ఉంటాడు. 1905 అక్టోబరు 27వ తారీకు దినచర్యలో వెంకటగిరి ఉద్యోగం గురించి ఈ విధంగా రాశాడు. "Deepavali day, 36 Years ago this day, I entered the Venkatagiri Rajah's service as tutor to the present Rajah."

ఆ దినాల్లో వెంకటగిరి విద్వత్సంస్థానంగా పేరుపొందింది. సర్వజ్ఞకుమార యాచేంద్ర మేధావిగా, కవి పండిత పోషకుడుగా పేరు పొందాడు. అప్పుడప్పుడే ఆయన దృష్టి మత సాంఘిక విషయాలపైకి మళ్ళింది. ఆయనకు పాశ్చాత్య విజ్ఞానం మీద విశ్వాసం, శాస్త్రీయ దృక్పథం మీద గౌరవం ఉన్నాయి. ఆస్తికుడే, అయినా మతగ్రంథాలను గుడ్డిగా నమ్మడు. 'సేశ్వర' మతాలన్నీ తనకు ఆరాధ్యమైనవే అంటాడు. ' జ్ఞాన సమాజం' పేరుతో వెంకటగిరిలో ఒక సమాజాన్ని స్థాపించి, వారం వారం సామాజిక, విద్యావిషయాల మీద చర్చించేవాడు. మద్రాసు వేద సమాజం వారితో మత విషయాల మీద ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. విశ్వమత సిద్ధాంతాలను తెలుసుకోడానికి కృషిచేశాడు. రాధాకృష్ణ భక్తితత్త్వాన్ని అభిమానించి, అనుసరించాడు. ఆ రోజుల్లో ఎంతోమంది కవి పండితులు, గాయకులు, విద్వాంసులు వెంకటగిరి సంస్థానానికి వచ్చి సన్మానాలు అందుకొనేవారు.

ఈ కాలంలోనే సర్వజ్ఞకుమార యాచేంద్ర మత సంబంధమైన పుస్తకాలు రాయడానికి పూనుకొన్నాడు. పద్యంలోకన్నా వచనంలో రాస్తే సులభంగా బోధపడుతుందని, వ్యాకరణ పద్దతిలో కాకుండా, వాడుకభాషలో రాస్తే, అందరికీ తెలుస్తుందని అప్పటికే ఆయన అనుభవ పూర్వకంగా గ్రహించాడు.2 ఈ వాతావరణం నరసయ్య వ్యక్తిత్వం మీద ప్రభావం చూపి ఉంటుంది. భాషావిషయాలమీద నరసయ్య అభిప్రాయాలకు ఇక్కడే బీజం పడిఉంటుంది.

నరసయ్య వెంకటగిరి సంస్థాన వాతావరణాన్ని అసహ్యించుకోడానికి బలమైన కారణాలున్నాయి. సర్వజ్ఞకుమార యాచేంద్ర మేధావి, తత్త్వవేత్త అయినా, వేశ్యావ్యామోహం ఆయన బలహీనత. బ్రహ్మసమాజభావాలు, సంఘసంస్కరణోద్యమం నరసయ్య యవ్వనాశలకు ఆకృతి ఇచ్చాయి. మహానగరంలో స్వేచ్చగా పెరిగిన యువకుడికి వెంకటగిరి రాచరిక వ్యవస్థ, నిత్యం వేశ్యల నృత్యగాన వినోదాలతో ముగిసే సమావేశాలు, గోష్ఠులు రోత పుట్టించి ఉంటాయి. ఆ జీవితం అసహ్యంగా, ఇరుకుగా అనిపించి ఉంటుంది.3 సంస్థానం కొలువులో నరసయ్య ఏడాది పాటైనా ఉన్నాడో లేదో! అప్పుడు వెంకటగిరిలో సంస్థానం యాజమాన్యంలో ఒక ఆంగ్లో వర్నాక్యులర్ పాఠశాల పనిచేస్తుంది. అదికాక ఒక 'యూనియన్ స్కూలు' ఉంది.4 మొత్తం మీద నరసయ్య సంస్థానం కొలువు మానుకొని ప్రభుత్వ అజమాయిషీ ఉన్న ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరిపోయాడు. చివరకు పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాల ఉద్యోగం మానుకొని, మారుమూల, వెంకటగిరిలో ఒక చిన్నబడిలో ఉపాధ్యాయుడుగా, అనామకంగా రోజులు గడపవలసి వచ్చింది. నరసయ్య పరిస్థితి నెల్లూరు రేంజి డెప్యూటీ స్కూల్స్ ఇన్‌స్పెక్టరు చుండూరు కోటయ్య సెట్టిద్వారా నెల్లూరు కలెక్టరాఫీసులో పనిచేస్తున్న ఒక ఇంగ్లీషు అధికారి దృష్టికి వచ్చింది. ఆయన నరసయ్యను నెల్లూరు కలెక్టరాఫీసులో అనువాదకుడుగా చేరమని ఆహ్వానిస్తూ ఉత్తరం రాశాడు.5 ఆ ఉత్తరానికి అనువాదం:

నెల్లూరు,

20, డిసంబరు 1870

సర్,

మీరు అప్పుల పాలైన విషయం నాకు ఎవరూ చెప్పలేదు. ఎవరైనా చెప్పినా నేను పట్టించుకొని ఉండను. సుదర్శనరావుచేత మీకు రాయించాను. ఆ ఉత్తరం ఆంతర్యం మీరు గ్రహించలేకపోయారు. వారు రాజాగారి కొలువు మానుకొని వెంకటగిరి స్కూల్లో పనిచేస్తున్నారని, విద్యాశాఖనుంచి ఈ సేవలు గ్రహించవచ్చని, నిన్ననే కోటయ్యసెట్టిద్వారా తెలిసింది. ఈ పరిస్థితులలో మిమ్మల్ని అనువాదకుడి ఉద్యోగంలో నియమించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ (నియామకాన్ని) రేపు అదనంగా వెలువరించే గెజిటులో ప్రచురిస్తాను. సెలవుల తర్వాత, తప్పకుండా పనిలో చేరాల్సి ఉంటుంది. ఈ ఆఫీసుపని మీకు నచ్చుతుందా అని నాకు సందేహంగా ఉంది. ఇష్టమైతే సక్రమంగా ఆఫీసుకు హాజరయి, కొంత గొడ్డుచాకిరి చెయ్యడానికి నిశ్చయించుకోవాలి. నేను మద్రాసు వెళ్తున్నాను. సెలవులు ముగిసేదాకా తిరిగిరాను.

మీ

విశ్వాసపాత్రుడు

గ్రాంట్ (.........)

అప్పటి జిల్లా కలెక్టరు వేన్స్ ఏగ్ను నరసయ్య “విద్యాకుశలత” కు మెచ్చి కలెక్టరాఫీసులో “ట్రాన్సులేటరు” గా నియమించినట్లు ఒంగోలు వెంకటరంగయ్య పేర్కొన్నాడు.

చుండూరు కోటయ్య సెట్టి

కోటయ్యసెట్టి నెల్లూరువాడు. పళ్ళె చెంచలరావు సమకాలికుడు, స్నేహితుడు. 1867 నాటికే నెల్లూరు జిల్లాలో విద్యాశాఖలో డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు ఉద్యోగం చేస్తున్నట్లు, 1884 వరకు ప్రభుత్వ ఉద్యోగం చేసినట్లు, 1901 ప్రాంతాల వరకు జీవించి ఉన్నట్లు గెజిటు ప్రకటనల వల్ల తెలుస్తూంది.6 ఈయన నెల్లూరులో తొలి బ్యాంకింగ్ వ్యవస్థ "పర్మనెంట్ ఫండాఫీసు” ఏర్పాటు చెయ్యడంలో పళ్ళె చెంచలరావుతో కలిసి కృషిచేసి ఆ సంస్థ తొలి అధ్యక్షుడయ్యాడు.7

కోటయ్యసెట్టి నెల్లూరు జిల్లాలో విద్యావ్యాప్తికి కృషి చేశాడు. 1872 జూన్ మాసంలో జరిగిన జిల్లా లోకల్ ఫండ్ బోర్డు సమావేశంలో ఆయనచేసినకృషిని అభినందిస్తూ ఈ విధంగా తీర్మానించారు. “కోటయ్యశెట్టి ఇదివరలో చేసిన ప్రయోజనకారియైన నౌకరిని అంగీకరించుచు ఏప్రిల్ (...) లగాయతు 125 జీతం నుండి 150 రూపాయలకు ఇజాఫా చేయవలసినట్లు ప్రెసిడెంటుగారు చేసిన ప్రపోజలును అందరున్ను ఏక మనస్సుగా అంగీకరించిరి. విద్యా విషయమును గురించి ఉత్సాహముతో నున్ను యెడతెగకుండా కోటయ్య నౌకరి చేసి నందుకున్ను అతని యోగ్యతకున్ను యిట్లు చేయడం ప్రోత్సాహ పరుస్తుంది.....”8

1874లో నెల్లూరుజిల్లాలో ఆరు బాలికా పాఠశాలలు స్థాపించాలని లోకల్‌ఫండు బోర్డు నిశ్చయించింది. ఈ పాఠశాలలకోసం కోటయ్యసెట్టి కృషిచేశాడు. ప్రతివిద్యార్థిని వద్ద అర్ధణా జీతం వసూలు చెయ్యాలని బోర్డుసభ్యులు తీర్మానించారు. కోటయ్యసెట్టి ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, అసమ్మతిని 'డిసెంటు' రాసి తెలియచేశాడు. ఈ సమావేశంలో పాల్గొన్న నలుగురు నామినేటెడ్ సభ్యులు బడా భూస్వాములు. వీరు బాలికావిద్యను తీవ్రంగా వ్యతిరేకించారు.9 ఒకేకుటుంబం నుంచి ఒకరి కంటె ఎక్కువ మంది పిల్లలు పాఠశాలకు, హాజరవుతున్నట్లయితే, మామూలుగా వసూలుచేసే స్కూలు ఫీజులో సగం మాత్రమే వసూలు చెయ్యాలని ఆయన చేసిన ప్రతిపాదనను బోర్డు సభ్యులు ఆమోదించలేదు.10

కోటయ్యసెట్టి - పళ్ళె చెంచలరావు, ఆర్. రఘునాథరావు మొదలైనవారి ఆలోచనాధోరణికి చెందినవాడు. బ్రహ్మసమాజ భావాలను అభిమానించాడు. మత విశ్వాసాల ప్రమేయంలేని లౌకిక విద్య ఈ దేశానికి అవసరం అని భావించాడు. పాఠ్యపుస్తకాలలో ప్రత్యేకంగా ఒకమతానికి సంబంధించిన దేవతల పేర్లను స్మరించడం లౌకిక విద్యావిధానానికి విరుద్ధమైనదని గట్టిగా నమ్మాడు. వెంకటగిరి జమీందారు సర్వజ్ఞకుమార యాచేంద్ర 'నీతి సూత్రము' పేరుతో చిన్న పుస్తకం రాసి అచ్చు వేశాడు.11 దాన్ని బళ్ళలో పాఠ్యపుస్తకంగా ప్రవేశపెట్టించాలనే ఆలోచనతో, కోటయ్య సెట్టికి ఆ పుస్తకాన్ని పంపించాడు. అంతటి మహారాజు తన అభిప్రాయాన్ని కోరాడని ఉబ్బిపోకుండా, స్పష్టంగా, నిర్మొహమాటంగా కోటయ్యసెట్టి తనఅభిప్రాయాన్ని తెలియచేస్తూ సమాధానం రాశాడు. ఈ ఉత్తరం ద్వారా ఆయన వ్యక్తిత్వం, మతవిశ్వాసాలు వ్యక్తమయ్యాయి.12

నెల్లూరు,

ఫిబ్రవరి తే 22 ది 1876

మహారాజ రాజశ్రీ, రాజా వెలుగోటి కుమారయాచమనాయుడు బహదర్ - సి.యస్.ఐ పంచహజార్ మనసబ్‌దార్ రాజా ఆఫ్ వెంకటగిరి వారి సముఖమునకూ -

తమరిచ్చిన నీతిసూత్రశతము దీనితోటి మరల పంపించడ మగుచున్నది. అది యిచ్చినపుడు దానిని ప్రచురపరచి తెలుగు బళ్ళలోకి తేవచ్చునని వాక్రుచ్చితిరి. గనుక దాని విషయమై నాకు తోచిన యభిప్రాయము వ్రాసెదను. గనుక మన్నించెదరని నమ్మెద. దానిని పూర్తిగాఁ జూచినాను. మరియు కొందరికిఁ జూపించినాను. సదరు గ్రంథములో జెప్పిన నీతులు యందరికి నుపయోగించునవి కొన్ని అనఁగా పెన్‌సల్‌తో గురుతు చేయబడినది రాజ ధర్మములుగాను సమరసములేక యున్నవి. ఈ గ్రంథము లోకమున కుపయోగకరముగా నుండగోరిన యడల అందరికి నిరాక్షేపణీయముగ నుండుట బాగని తలచి.... కారము గురుతు పెట్టినాను. అవితప్ప కొదమవి అందరు ఒప్పుకొనదగినవిగానే యున్నవి. గనుక వాటిని యెత్తి సంధి లేకపోయినను వ్యాకరణ పద్దతిగా వ్రాసి అచ్చువేయించిన యడల లోకోపకారముగానే యుండును. మరియు..... అన్ని మతస్థులకు సమానముగా నుండు నటుల శ్రీ రాధాకృష్ణ సహాయం అనక దైవసహాయం అనిగాని లేక అందరికి సామాన్యమైనటువంటి (........) ముతోగాని ఆరంభించిన యడల బాగుండునని తోచుచున్నది. తమరు రచియించిన గ్రంథము మీద యేమిగాని చెప్పుటకు నాకంత యోగ్యత లేదు... యిప్పటికి సమరస అభిప్రాయము గురించి తమకు తెలిపిన యడల బాగుండునని వ్రాసితిని. గనుక చిత్తగించవలయును.

విధేయుడు

సి. కోటయ్య

భాషా విషయంలో కోటయ్యసెట్టిది వెనుకచూపు. 1864 నాటికే సర్వజ్ఞకుమార యాచేంద్ర వచనం ప్రాముఖ్యాన్ని, వాడుకభాష అవసరాన్ని గ్రహించాడు.

నెల్లూరు పయొనీర్

నెల్లూరు పయొనీర్ గురించి ఒంగోలు వెంకటరంగయ్య రాసినది తప్ప, కొత్తగా ఎవరూ ఏమి చెప్పలేకపోయారు. ఈ పత్రిక పందొమ్మిదవ శతాబ్ది అరవయ్యోపది చివర వెలువడిందని, కలెక్టరు కచేరి ఉద్యోగులు నంబెరుమాళ్ళయ్య, నరసయ్య కలిసి ఈ పత్రిక నడిపారని, పత్రికను వెలువరిస్తున్న సమయంలో నరసయ్య నెల్లూరు కలెక్టరాఫీసులో అనువాదకుడుగా పనిచేసేవాడని, పత్రిక ఒక సంవత్సరకాలం లోపలే పాఠకుల ఆదరణలేక మూతపడిందని, ఈ పత్రిక నిర్వహణను ప్రత్యక్షంగా చూచినవారిని విచారించి తానీ విషయాలు రాసినట్లు ఆయన పేర్కొన్నాడు. ఇది వారపత్రికో, పక్షపత్రికో ఆయన తెలియజేయలేదు.

"Nellore had the People's Front" అని జె. నటరాజన్ మద్రాసు ప్రెసిడెన్సీ టౌన్‌లలో ప్రారంభమయిన తొలిపత్రికలను గురించి వివరిస్తూ రాశాడు13. ఈ పేరుతో నెల్లూరులో పత్రిక వెలువడినట్లు ఒంగోలు వెంకటరంగయ్య, బంగోరె వంటి స్థానిక చరిత్రకారులెవరూ పేర్కొనలేదు.

నరసయ్య నెల్లూరు కలెక్టరాఫీసులో అనువాదకుడుగా ఉద్యోగంలో చేరిన వార్త "Collector's office - Assumed charge - Dampuru Narasaya, Translator on 4th, January 1871" అని జిల్లాగెజిటులో ప్రచురించబడింది.14 "Dampuru Narasaya, Translator Huzur" అని జూన్ 2వ తేది గెజిటులో నరసయ్య ప్రస్తావన ఉంది. ఉద్యోగంలో పదోన్నతి పొంది “హుజూరు ట్రాన్సులేటరు” అయ్యాడో లేక రెండూ ఒకటేనో స్పష్టంగా తెలియదు15. ఈ ఉద్యోగంలో అయిదునెలలు పనిచేసి, అనారోగ్య కారణంతో జూన్ ఆరంభం నుంచి నవంబరు 13 వరకు సెలవుమీద ఉన్నాడు.16 కలెక్టరాఫీసులో ఉద్యోగం చేస్తున్న కాలంలో నరసయ్య నెల్లూరు మూలాపేటలో నివాసమున్నట్లు, 1872 సంవత్సరం నెల్లూరు సెషన్స్ కోర్టులో జూరరుగా వ్యవహరించడానికి ఎంపిక చేయబడినట్లు గెజిటు ప్రకటనవల్ల తెలుస్తూంది17. 1870-1884 మధ్య వెలువడిన నెల్లూరుజిల్లా గెజిటు సంపుటాలను సమగ్రంగా పరిశీలించాను. అందులో నెల్లూరు పయొనీర్ పత్రిక ప్రస్తావన కనిపించలేదు. “ప్రవక్తక వ్యూహములోని నంబెరుమాళ్ళయ్య సబుమేజిస్ట్రేటు పదవి నందియుండెనట” అని వెంకటరంగయ్య రాశాడు. ఆరోజుల్లో నంబెరుమాళ్ళయ్య రెవెన్యూశాఖలో గుమాస్తా ఉద్యోగం చేస్తున్నట్లు గెజిటులో ఉంది. బహుశా ఉద్యోగ విరమణకు ముందెప్పుడో సబుమేజిస్ట్రేటు అయి ఉంటాడు.

మద్రాసు ప్రెసిడెన్సీ జిల్లాలలో అప్పుడప్పుడే పత్రికా ప్రచురణ మొదలవుతూంది. జిల్లాలో విద్యావ్యాప్తి తక్కువగా ఉండడం, పత్రికాపఠనం కొత్త కావడం, ఇంగ్లీషు పత్రిక కావడం మొదలైన అంశాలు నెల్లూరు పయొనీర్ వైఫల్యానికి దారితీసి ఉంటాయి. విద్యాశాఖలో ఉద్యోగం కావడంవల్ల నరసయ్య నివాసం ఒంగోలుకు మార్చవలసి రావడం, స్థానికుడు కాకపోవడం, అంగబలం, అర్థబలం చాలకపోవడం, వయసులో చాలా చిన్నవాడు కావడం కూడా పత్రిక కొనసాగక పోవడానికి కారణాలు అయి ఉంటాయి. ఈ ప్రయత్నంవల్ల నరసయ్యలోని పత్రిక వెలువరించాలనే తీవ్రమైన ఆరాటం వ్యక్తమవుతూంది. నూతన ఆవిష్కరణలకోసం కృషిచేసిన శాస్త్రజ్ఞుల జీవితాలకు, నరసయ్య జీవితానికి చాలా పోలికలు కనిపిస్తాయి. ఆయన చేసిన ఈ రెండో ప్రయత్నమూ కొనసాగలేదు.

ఒంగోలు వెంకటరంగయ్య నరసయ్యను, నంబెరుమాళ్ళయ్యను “ఇద్దరాంగ్లేయ భాషా సాహితీ ధురీణులు" అని ప్రశంసించాడు. గురజాడ తర్వాత నరసయ్య ఆంగ్లభాషా వైదుష్యాన్ని ప్రస్తుతించిన వ్యక్తి వెంకటరంగయ్య. “దంపూరు నరసయ్య యన్నచో ఈయనకు వార్తాప్రచార ముగ్గుపాలతో నలవడియున్నది” అని ప్రస్తుతించాడు. నరసయ్యను “నెల్లూరు జర్నలిజం జనకుడ”ని బంగోరె నుతించాడు. నెల్లూరు పయొనీర్ కన్న ముందునుంచీ 'నెల్లూరు డిస్ట్రిక్ట్ గెజిటు' వారం వారం క్రమం తప్పకుండా వెలువడుతూనే ఉంది. పరిశోధకులు గెజిటును పత్రికగా అంగీకరించారు.18 ప్రభుత్వేతర రంగంలో తొలిపత్రిక స్థాపించినందువల్ల కూడా నరసయ్య నెల్లూరు పత్రికారంగానికి ఆద్యుడు కాలేదు. ప్రజాశ్రేయస్సుకోసం జీవితం అంతా పత్రికలు నిర్వహించడంవల్ల, నిర్భయంగా, నిర్మొహమాటంగా రాసి ఉన్నత ప్రమాణాలు స్థాపించడంవల్ల నెల్లూరు పత్రికాలోకానికి ఆద్యుడు, ఆరాధ్యుడు అయ్యాడు, జనకుడయ్యాడు. నరసయ్య నెల్లూరు కలెక్టరాఫీసులో ఉద్యోగం చేస్తున్న కాలంలోనే “ఎసన్నియల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్” పుస్తకం ప్రచురించాడు.19 నాలుగైదేళ్ళ ఇంగ్లీషు బోధనానుభవం పుస్తక రచనకు దోహదం చేసి ఉంటుంది.

డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగం

మద్రాసు ప్రభుత్వ విద్యాశాఖ రెండవ డివిజన్‌లో నాలుగు డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగాలకు అభ్యర్ధులు అవసరం అని, 1871 డిసంబరు 9వ తారీకు నెల్లూరు జిల్లా గెజిటులో ప్రకటన వెలువడింది. నెల్లూరుజిల్లాలో విద్యాశాఖలో పనిచేస్తున్న కోటయ్యసెట్టి నరసయ్య అర్హతలకు, యోగ్యతకు ముచ్చటపడి, తన పలుకుబడితో ఈ ఉద్యోగం వేయించినట్లుంది. ఈ ఉద్యోగానికి ఎంపికఅయి, ఆ ఏడు మార్చినెలలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టినట్లుంది. కలెక్టరాఫీసులోనే రెండవ వర్నాక్యులర్ క్లర్కుగా పనిచేస్తున్న మేకల పార్ధసారథినాయుణ్ణి ట్రాన్స్‌లేటరు పోస్ట్‌కు బదిలీ చేసినట్లు ఏప్రిల్ 27వ తేది నెల్లూరు జిల్లా గెజిటు ప్రకటన వెలువడడం వల్ల, నరసయ్య కొత్త ఉద్యోగంలో చేరినసంగతి రూఢి అవుతూంది.

నెల్లూరు మునిసిపాలిటి కమిషనర్ల సమావేశం

ఆ రోజుల్లో మునిసిపాలిటి పాలకమండలి సభ్యులను కమీషనర్లని పిలిచేవారు. జిల్లా కలెక్టరు ముఖ్యమైన అధికారులను కమిషనర్లుగా నియమించేవాడు. 1872 మార్చి 27వ తారీకునాడు కమిషనర్ల సమావేశం జరిగింది. జిల్లా కలెక్టరు వేన్సు ఏగ్నూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించాడు. కోటయ్యసెట్టి, నరసయ్య కమిషనర్లహోదాలో సమావేశంలో పాల్గొన్నారు. జె. మెక్లిన్, కె. జగన్నాథంచెట్టియారు, నరసయ్య ముగ్గురూ ఒక ఉపసంఘంగా ఏర్పడి, నెల్లూరు టౌన్‌లో ప్రాథమిక పాఠశాలల విస్తరణకోసం తయారుచేసిన నివేదికమీద ఈ సమావేశంలో చర్చ జరిగింది.20 అటుతర్వాత ఎన్నడూ నరసయ్య నెల్లూరు మునిసిపాలిటి పాలకమండలి సమావేశాలలో పాల్గొన్నట్లు గెజిటులో రిపోర్టు కాలేదు.

నెల్లూరు జిల్లా లోకల్‌ఫండ్ బోర్డు సమావేశాలు

నెల్లూరు జిల్లా లోకల్‌ఫండ్ బోర్డు సమావేశాల్లో డెప్యూటి స్కూల్ ఇన్‌స్పెక్టర్ల హోదాలో కోటయ్యసెట్టి, నరసయ్య పాల్గొంటూ వచ్చారు. కోటయ్యసెట్టి నెల్లూరు రేంజి విద్యాధికారి, నరసయ్య ఒంగోలు రేంజి విద్యాధికారి. 1872 ఏప్రిల్ మాసంలో జరిగిన బోర్డు సమావేశంలో నరసయ్య మొదటిసారి పాల్గొన్నాడు.21 కోటయ్యసెట్టి, నరసయ్య నెల్లూరు జిల్లాలో పాఠ్యపుస్తకాల పంపిణిలో తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ, రాసిన లేఖలను సమావేశంలో చర్చించారు. ఇన్‌స్పెక్టింగ్ మాస్టర్లకు అలవెన్సు కొనసాగించాలని వీరు చేసిన ప్రతిపాదనను బోర్డు సభ్యులు ఆమోదించారు.

1872 అక్టోబరునెలలో జరిగిన బోర్డుసమావేశంలో ఉత్తమవిద్యార్థులకు బహుమతులిచ్చి ప్రోత్సహించాలని నరసయ్య ప్రతిపాదించి, అందుకోసం అవసరమైన పుస్తకాలజాబితా తయారు చేసి సభ్యుల ముందుంచాడు. ఈ ప్రతిపాదనల మీద చర్చ జరిగింది. తరగతిలో పదిమంది కన్న తక్కువ విద్యార్థులున్నపుడు ఒక బహుమతి చాలని, అంతకు మించి విద్యార్థులున్నపుడు రెండు బహుమతులివ్వవచ్చని సభ్యులు తీర్మానించారు. ప్రతి పాఠశాలలోనూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యే ఒక విద్యార్థికి బహుమతి ఇవ్వాలని నరసయ్యచేసిన, ప్రతిపాదనకూడా సభ్యుల ఆమోదం పొందింది.22

1873 మే 12వ తారీకున జరిగిన బోర్డుసమావేశంలో ఒంగోలుడివిజను పాఠశాలల్లో, కింది తరగతుల్లో అనుసరించబడుతున్న పాఠ్యాంశాలమీద నరసయ్య ఒక నివేదికను తయారుచేసి, సమర్పించాడు. యూనియన్ స్కూళ్ళ నిర్వహణలో, ఇన్‌స్పెక్టింగ్ మాస్టర్ల విధులకు సంబంధించిన కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాలని కోరాడు.23 1874 మే 8న జరిగిన బోర్డు సమావేశానికి, కోటయ్యసెట్టి, నరసయ్య హాజరయ్యారు. ఉదయగిరిలో ఒక ఆంగ్లో వర్నాక్యులర్ పాఠశాల ప్రారంభించమని అభ్యర్థిస్తూ, అక్కడి తాసిల్దారు నరసయ్యకు ఒక ప్రతిపాదన పంపాడు. ఇదే విషయంమీద అక్కడి ప్రజలు నరసయ్యకు ఒక అర్జీ ఇచ్చారు. ప్రజల కోరికను మన్నించి, ఉదయగిరిలో స్కూలు నెలకొల్పి, హిందుస్థానీ, తెలుగు, ఇంగ్లీషు బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని నరసయ్య చేసిన ప్రతిపాదనను బోర్డు సభ్యులు ఆమోదించారు.24 ఆ ఏడే, ఆగస్టు 5వతేది జరిగిన బోర్డుసమావేశానికి కోటయ్యసెట్టి, నరసయ్య హాజరయ్యారు. 'లోకలు ఫండు స్కూళ్ళకు ఒక కుటుంబము తాలూకు విశేషమంది చిన్నవాళ్ళు వచ్చిన యడల మామూలు ఫీజులో సగమే తీసుకొనేటట్టు ఉత్తర్వు చేయవలసినదిగా నెల్లూరు డిపిటీ స్కూలు యినిస్పెక్టరువారు చేసిన దరఖాస్తుకు సభికులలో అనేకులు వొప్పుకోనందున తోసివేయడమైనది.” అని ఒక తీర్మానం ఉంది. కోటయ్యసెట్టి ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, తన అసమ్మతిని లిఖితపూర్వకంగా తెలియచేశాడు. భూస్వామ్య వర్గం నుంచి బోర్డుకు నామినేట్ చేయబడిన ముగ్గురు సభ్యులూ కోటయ్యసెట్టి ప్రతిపాదనను వ్యతిరేకించారు.25 ఇప్పుడు స్వల్ప విషయాలుగాతోచే, ఈ చిన్న చిన్న రాయితీలకోసం నిజాయితీగా కృషిచేసిన అధికారులు ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారో ఈ సంఘటన నిరూపిస్తుంది. 1875 జూన్ మొదటివారంలో జరిగిన బోర్డు సమావేశంలో కోటయ్యసెట్టి, నరసయ్య పాల్గొన్నారు.26 నరసయ్య హాజరైన చివరి బోర్డు సమావేశం ఇదే. ఆ తర్వాత నెల్లూరు జిల్లాగెజిటులో ఆయన పేరు కన్పించలేదు. అసైలం ప్రెస్ ఆల్మనాక్‌లో కూడా 1875 తర్వాత డెప్యూటీ స్కూల్ ఇన్‌స్పెక్టర్ల జాబితాలో నరసయ్య పేరు కన్పించలేదు. 1876 నవంబరు 10వ తారీకున జరిగిన బోర్డు సమావేశం ఒంగోలు డెప్యూటీ స్కూల్ ఇన్‌స్పెక్టరు హోదాలో సి.ఎస్. నారాయణరావు, 1879 నవంబరు 1వ తారీకు సమావేశంలో సి. కుప్పుస్వామి అయ్యరు పాల్గొన్నట్లు గెజిటులో ఉంది. నరసయ్య నెల్లూరు కోర్టు వాజ్మూలంలో "Before I settled in Madras in April 1881, I was employed in this district" అని పేర్కొన్నాడు. నరసయ్యకు తారీకులు, సంవత్సరాలు అన్నీ చిన్నవివరాలు కూడా తప్పిపోకుండా, నిర్దుష్టంగా వివరించే అలవాటుంది. దినచర్యలో ప్రతి విషయం స్పష్టంగా రాశాడు. బహుశా గృహచ్చిద్రాలు, ఇతర కారణాలవల్ల 1876-81 మధ్యకాలంలో తరచుగా సెలవుమీద ఉండడంవల్ల ఆయన స్థానంలో ఇతరులు పనిచేసి ఉంటారని భావిస్తున్నాను. మొత్తంమీద కోటయ్యసెట్టి సాహచర్యంలో నరసయ్య నెల్లూరుజిల్లాలో విద్యాభివృద్ధికి పాటుపడ్డాడు. ఆయన జీవితంలో ఇది ముఖ్యమైన కాలం. వ్యక్తిత్వం రూపుదిద్దుకొంటున్న కాలం.

నరసయ్య ఒంగోలు జీవితం

నరసయ్య కష్టాలు 1875లో మొదలయ్యాయి. ఉద్యోగజీవితంలో, కుటుంబ విషయాల్లో అన్నీ ఇబ్బందులే. ఈ సమయంలోనే ఆయన సెలవు పెట్టి, రెవెన్యూ బోర్డులో ప్రవేశించడానికి ప్రయత్నం చేసినట్లు చెప్పడానికి ఆధారాలున్నాయి. ఈ ఉద్యోగ విషయంగా నరసయ్య ప్రయత్నాన్ని తెలియచేసే ఒక ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరం రాసినవ్యక్తి చేవ్రాలు పోల్చుకొని, తెలుసుకోలేక పోయాను. ఉత్తరం అనువాదం:

19 ఆగస్టు 1875

ప్రియమైన నరసయ్యా,

మీ మొదటి ఉత్తరం చదివి దారుణమైన కుటుంబ విషయాలు తెలుసుకొన్నాను. అవి ఎంతో బాధ కలిగించేవి. రెండుసార్లు మీకు ఉత్తరం రాయాలని ప్రయత్నించి, రాయలేకపోయాను. ఈ పరిస్థితుల్లో మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. మీకు సానుభూతి తెలియ చెయ్యడం తప్ప, నాకు ఏం రాయాలో తోచడం లేదు. ఈ గాయాలను కాలం తప్ప, ఏదీ మాన్చలేదు.

వేన్సు ఏగ్నూవంటి పలుకుబడి కలిగిన వారెవరైనా సహాయపడితేనే తప్ప, రెవెన్యూ బోర్డులో ఉద్యోగం సంపాదించాలనే మీ ప్రయత్నం నెరవేరడం చాలా కష్టం. మీరు కోరుకొనే పదోన్నతి కూడా దేశీయులైన అధికారుల అండలేకపోతే, చిన్న ఉద్యోగంలో చేరి, ఆ హోదాకు చేరుకొనే అవకాశాలు చాలా తక్కువ. మెంబర్లంతా సెక్రెటరీ మీద విడిచిపెడతారు. ఆయన తనను ఆశ్రయించుకొని ఉన్న వారిమీద విడిచి పెడతాడు. ఈ విషయంలో నేనేవిధంగానూ సహాయపడలేను. క్షమించు.

మర్యాదాపూర్వకంగా

భవదీయుడు

(....................)

ఉత్తరంలో నరసయ్య కుటుంబ బాధల ప్రస్తావన ఉంది. బహుశా నరసయ్య పెద్దన్న అకాల మరణాన్ని గురించిన ప్రస్తావనకావచ్చు. అన్న 'పార్ధసారథయ్య' మరణం తర్వాత, తను మద్రాసు వెళ్ళి స్థిరపడాలని యోచించి ఉంటాడు.27 ఈ ఉత్తరంలో రెవెన్యూబోర్డు ఉద్యోగాన్ని గురించి, పదోన్నతిని గురించి, ప్రస్తావించబడింది. ఇంగ్లీషు అధికారుల మెహర్బానీ సంపాదించిన దేశీయ ఉద్యోగుల ప్రాపకం, వేన్సు ఏగ్నూ వంటి గొప్పవారి అండ ఉంటేనే ఆ ఉద్యోగంలో ప్రవేశించడం సాధ్యపడుతుందని ఉత్తరం రాసిన వ్యక్తి తెలియచేశాడు.28 ఆనాటి ప్రభుత్వ పరిపాలన గురించి పరిశోధించిన ఫ్రైకంబర్గ్29 (R.E. Frykenberg), లెనార్డ్, సుందరలింగం మొదలైన పరిశోధకులు ప్రభుత్యోద్యోగాలలో అధికారుల ప్రాపకం గురించి వివరంగా రాశారు. నరసయ్యకు కులపెద్దల అండదండలు లేవు. ఆయన దేశస్థ బ్రాహ్మణుడూ కాదు, తెలుగు నియోగి బ్రాహ్మణుడూ కాదు. తెలుగు ద్రావిడ వైదికి. ఉద్యోగ జీవితంలో పైకి రాలేకపోవడానికి, ప్రాపకం లభించకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చు. నిర్మొహమాటంగా, నిజాయితీగా, మాట్లాడే ఆయన వ్యక్తిత్వం వల్ల కూడా ప్రభుత్వోద్యోగంలో ఇమడలేకపోయి ఉంటాడు. పదోన్నతి పొందలేకపోయి ఉంటాడు.

ఒంగోలు నూనెవర్తకుల "పబ్లిక్ న్యూసెన్సు” మీద రాసిన తర్వాత, పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్టరుతో అభిప్రాయ భేదం ఏర్పడి నరసయ్య ఉద్యోగం మానుకొన్నట్లు ఆయన మనుమడు కృష్ణమూర్తి చెప్పాడు. కానీ ఆ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలు చేస్తూ, ఆర్. రఘునాథరావు, కొక్కొండ వెంకటరత్నం, వీరేశలింగం మొదలయినవారు ప్రజాశ్రేయస్సు అభిలషిస్తూ, పత్రికలలో రాశారు. వీరేశలింగం, వకీళ్ళ అక్రమార్జనమిద, న్యాయస్థానాల పనితీరుమీద తీవ్రంగా దాడిచేశాడు. 'పబ్లిక్ న్యూసెన్సు' మీద రాసినంత మాత్రం చేత, పై అధికారుల ఆగ్రహానికి బలై ఉంటాడని నమ్మలేము. కుటుంబ పరిస్థితులు, ఉద్యోగంలో అసంతృప్తి, పత్రిక నడపాలనే బలమైన కాంక్ష ఆయనను నిలవనిచ్చి ఉండవు. ఇటువంటి కారణాలవల్లే ఆయన ప్రభుత్వోద్యోగం మానుకొని ఉంటాడు.

'ఎ నేటివ్ ఆన్ న్యూసెన్సెస్' (A native on nuisances)

'ఎ నేటివ్ ఆన్ న్యూసెన్సెస్' శీర్షికతో నరసయ్య రాసిన ఒక సంపాదకీయ లేఖ మెయిల్ (The Madras Mail) దినపత్రికలో ప్రచురించబడింది. "ఆయన మనుమడు శ్రీ భట్టారం కృష్ణమూర్తిగారు ఈ లేఖకుడికి ఇచ్చిందల్లా 1906లో నరసయ్యగారు తన సొంత అక్షరాలతో రోజువారి వ్రాసుకున్న డైరి, 1875 ప్రాంతంలో మద్రాసు మెయిల్ పత్రికలో పడిన "A native on nuisances" అనే సుదీర్ఘమైన లేఖ” అని బంగోరె వివరించాడుకాని లేఖ ప్రచురించబడిన తారీకు, నెల పేర్కొనలేదు30. మెయిల్ పత్రిక పుటలు ఏమయ్యాయోకానీ, బంగోరె ఆ లేఖను టైపు చేయించి, దానిమీద "Dampuru Narasaiah 1875 Madras Mail" అని సొంతదస్తూరితో రాసి పెట్టిన కాపీ మాత్రం ఈ రచయిత సంపాదించగలిగాడు. నరసయ్య రాసిన లేఖలో అవసరమైన భాగాలను అనువదించి ఇక్కడ ఇవ్వడం జరిగింది.

మెయిల్ పత్రిక సంపాదకులకు,

ఈ లేఖను మెయిల్ పత్రికలో ప్రచురించమని ప్రార్థిస్తున్నాను. ఇందులో అంతా వివరంగా ఉంది. నేను కాపురం ఉంటున్న ప్రదేశానికి సమీపంలో నివసిస్తూ, మేజిస్ట్రేటు (Magistrate) గా పనిచేస్తున్న నా దేశీయ మిత్రుడికి ఈ లేఖను పంపాను. నేనూ దేశీయుణ్ణే. అయినా, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న దేశీయ మేజిస్ట్రేట్లమీద నాకు రవంత కూడా విశ్వాసం లేదు. వ్యక్తిగత స్వార్థంవల్ల, పౌరపాలన విషయంలో వారి అభిప్రాయాలు గందరగోళంగా ఉంటాయి. ఒక కేసులో వారికి ఆసక్తి లేకపోతే, పట్టించుకోరు. చట్టాన్ని పరిశీలించి న్యాయం చెయ్యరు. ఇక్కడి స్థానిక మేజిస్ట్రేటు నా ఉత్తరం అందుకొని కొన్ని వారాల తర్వాత, చర్య తీసుకోడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఏంచేశాడో తెలుసా? డివిజనల్ మేజిస్ట్రేటు (Divisional Magistrate) ఆర్డరుకోసం నా లేఖలోని విషయాలను నివేదించాడు. ఆ డివిజనల్ మేజిస్ట్రేటు చేసిన తీర్మానం ఏమిటనుకొన్నారు? నేను నివసిస్తున్న ఇంటికన్నా, ఇంకాస్త సౌకర్యంగా ఉండే ఇంటికి మారమని సలహా ఇచ్చాడు. ఆ పనేదో నేను చేయలేనట్లు! గ్రామీణప్రాంతాలలో పౌరస్పందన ఈ విధంగా కాపాడబడుతూ ఉంది. ప్రజల అసౌకర్యాన్ని నివారించమని నేను కోరాను. మేజిస్ట్రేటు 'మహా తెలివిగా' మమ్మల్ని మాట్లాడవద్దని చెప్పాడు.

ఈ విశ్వాసపాత్రుడు, D..

నరసయ్య మేజిస్ట్రేటుకు రాసిన జాబు కాపీని తన సంపాదకీయ లేఖతోపాటు జతచేసి మెయిల్ పత్రికకు పంపాడు. ఆయన మేజిస్ట్రేటుకు ఉత్తరం ఏ సందర్భంలో రాశాడో వివరిస్తాను. ఒంగోలులో నరసయ్య కాపురంఉన్న ఇంటిపొరుగున ఒక 'కోమటి' వేపనూనె తీసేవాడు. ఇందుకోసం విధివిరామం లేకుండా, రాత్రి పగలు అనే భేదం లేకుండా రోళ్ళలో వేప విత్తనాలు పోసి దంచుతూ ఉంటారు. ఆ విధంగా దంచగా వచ్చిన పిండి ముద్దను ఉడికించి, వేపనూనె తీస్తారు. నూనె వండిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాన్ని ఇంధనంగా వాడుతారు. దీనివల్ల గాలి కంపు కొడుతుంది. వాతావరణం దుర్భరంగా తయారవుతుంది. జనసమ్మర్దమైన నివాస ప్రాంతాలలో వేపనూనెతీసే కార్యక్రమం కొనసాగించడంవల్ల ప్రజల ఆరోగ్యానికి చేటు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది.

దుర్భరమైన ఈ పరిస్థితి నుంచి విముక్తి కోరుతూ నరసయ్య పోలీసు రిపోర్టు ఇస్తాడు. పోలీసులు విచారించి, నరసయ్య రిపోర్టు చేసిన విధంగానే పరిస్థితి ఉందని 'అక్కరెన్సు' (occurrence) రిపోర్టు మేజిస్ట్రేటుకు పంపుతారు. ఆ రిపోర్టును మేజిస్ట్రేటు 'బుట్ట దాఖలు' చేస్తాడు. పోలీసులు పంపిన రిపోర్టు మీద చర్య తీసుకోబడలేదని గ్రహించిన నరసయ్య మేజిస్ట్రేటుకు ఉత్తరం రాస్తాడు. “పోలీసులు పంపిన రిపోర్టు మీద చర్య తీసుకోలేదని విని ఆశ్చర్యపోయాను. అన్నిరకాల 'న్యూసెన్స్‌లను' నిర్మూలించడంలో మీరు అసాధారణమైన చొరవ చూపుతున్నారని విన్నప్పుడు నా ఆనందానికి, ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది” అని మేజిస్ట్రేటుకు రాసిన ఉత్తరంలో అంటాడు. పీనల్‌కోడ్ (Penal Code) 278 సెక్షన్ కింద ఈ న్యూసెన్సు శిక్షార్హమైనదని పేర్కొంటూ, తన వాదనకు బలాన్నిచ్చే ఒక సంఘటన వివరిస్తాడు.

మద్రాసు సముద్రతీరంలో మునిగిపోయిన నౌకలోని బియ్యం తడిసిపోతుంది. ఈ సంఘటన సీనియర్ మేజిస్ట్రేటు దృష్టికి వెళ్తుంది. ఆయన తడిసిన బియ్యాన్ని సముద్రంలో కుమ్మరించమని ఆజ్ఞాపిస్తాడు. నౌక యజమానికి పెద్ద మొత్తం నష్టం కలిగినా నౌకను మందుగుండుతో పేల్చివేస్తారు. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన పని ఇది. ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లే అసహ్యకర పరిస్థితి ఏర్పడితే, దయ, జాలి వంటి భావావేశాలకు లోనుకాకుండా, వెంటనే నివారించే బాధ్యత మేజిస్ట్రేటు మీద ఉందని నరసయ్య తన ఉత్తరంలో హెచ్చరిస్తాడు. ఇది ప్రజలు తమ వృత్తి కొనసాగించే క్రమంలో ఏర్పడే అసౌకర్యం అని, ఇటువంటి అసౌకర్యాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయనే భావనతో మేజిస్ట్రేట్లు చర్య తీసుకోకుండా ఉపేక్షించి ఉంటారని నరసయ్య వివరిస్తాడు. ఇటువంటి సందర్భాలలో చట్టం ఏమి చెప్తున్నదో వివరిస్తాడు.

“నీ వృత్తి కొనసాగించుకోడానికి చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ రక్షణ ప్రజలకు అసౌకర్యం కలిగించనంత వరకే. అసౌకర్యం కలిగిన మరుక్షణంలోనే నీ ప్రవర్తన సివిల్, క్రిమినల్ (Civil, Criminal) చర్యలకు అర్హమవుతుంది. ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లుతున్న సందర్భాలలో నీకు చట్టపరమైన రక్షణ ఉండదు.” అని వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ భద్రతకూ మధ్య ఉన్న పల్చని సరిహద్దు రేఖను విశదీకరిస్తాడు.

ఇటువంటి సందర్భాలలో మేజిస్ట్రేట్లు మెతకగా వ్యవహరించడంవల్ల కలిగే నష్టాలను నరసయ్య ఈ ఉత్తరంలో విశదంచేస్తాడు. “మేజిస్ట్రేట్లు చర్య తీసుకోక పోవడంవల్ల, చట్టం తమకు అండగా ఉంటుందనే విశ్వాసం ప్రజలలో సన్నగిల్లుతుంది. చట్టాలను ఉల్లంఘించేవారికే అవి అనుకూలంగా ఉంటాయని తెలిస్తే, వాటిని ఎవరు గౌరవిస్తారు? ద్వేషించకుండా ఎందుకుంటారు? ప్రభుత్వోద్యోగులు చట్టప్రకారం వ్యవహరించకుండా, సంవేదనలను అనుసరించి నడుచుకొంటే, చట్టాన్ని ఉల్లంఘించేవారు ఇవి తమకు చాలామంచి రోజులని భావిస్తారు. చట్టాన్ని గౌరవించేవారు మాత్రం ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని అనుకొంటారు అంటూ ఈ లేఖలో ఆయన వివరంగా రాస్తాడు.

ఈ సందర్భంలోనే నరసయ్య తన వాదనకు శక్తినిచ్చే మరొక ఉదంతాన్ని ఉదాహరిస్తాడు. మద్రాసు సముద్రతీరంలో ధాన్యం గిడ్డంగులున్న వీధి, పొద్దస్తమానం ధాన్యం వ్యాపారులతో కిటకిట లాడుతూ ఉంటుంది. అక్కడ అనాదిగా ఇటువంటి పరిస్థితి ఉంది. ఒకరోజు మునిసిపాలిటి ఇన్‌స్పెక్టరు ఆకస్మికంగా చాలామంది ధాన్యం వ్యాపారులను అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్తాడు. ఆ దారిలో వచ్చేపోయే వాహనాలకు ఈ వ్యాపారులు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో మేజిస్ట్రేటు పెద్ద మొత్తం జుల్మానా విధిస్తాడు. ఈ తీర్పును విమర్శిస్తూ మద్రాసులో పత్రికలన్నీ గగ్గోలు పెడతాయి. ప్రజల తరపున ప్రభుత్వానికి ఎన్నో మహజరులు అందుతాయి. ఇంత జరిగినా ప్రభుత్వం మేజిస్ట్రేట్ చర్యనే బలపరుస్తుంది. చట్టం తన విధిని తాను నిర్వహించాలనడానికి నరసయ్య ఈ సంఘటనను ఉదాహరిస్తాడు.

వేపనూనె తయారు చెయ్యడం వంటి వృత్తులు ప్రమాదకరమైనవి (ఇరుగు పొరుగు ప్రజల ఆరోగ్యానికి). ఈ వృత్తులు కొనసాగించే వారి వద్ద లైసెన్సు ఫీజు (Licence Fee) వసూలు చెయ్యాలని, టౌనుకు ఒకవైపు, దూరంగా, జనావాసాలు లేని చోటికి వీరిని తరలించాలని నరసయ్య సూచిస్తాడు. తన మాదిరి ఈ న్యూ సెన్సువల్ల బాధపడుతున్న వారెవరైనా మేజిస్ట్రేటును చర్యతీసుకోమని కోరవచ్చునంటాడు. అవసరం అయితే, న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పడనికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తాడు.

మేజిస్ట్రేటుకు రాసిన ఈ ఉత్తరంలో నరసయ్య ప్రజల హక్కులకు సంబంధించిన మౌలికాంశాలను ప్రస్తావిస్తాడు. వ్యక్తికి, సమాజానికి మధ్య వైరుధ్యం ఏర్పడినపుడు వ్యక్తి స్వేచ్ఛ హద్దులను వివరంగా చర్చిస్తాడు. సంప్రదాయ వృత్తులను నిర్వహించుకొనే క్రమంలో సమాజానికి ఇబ్బంది కలిగితే, తీసుకోవలసిన చర్యలను వివరిస్తాడు. బాధ్యతగల అధికారులు జాలి, దయ వంటి హృదయ దౌర్బల్యాలకు లొంగి, చట్టాన్ని అమలు పరచనప్పుడు, ప్రజలకు చట్టంమీద గౌరవం ఉండదని హెచ్చరిస్తాడు. డివిజనల్ మేజిస్ట్రేటు హోదాలో ఉన్న బాధ్యత గల ప్రభుత్వాధికారి నరసయ్య వంటి విద్యాధికునితో ప్రవర్తించిన తీరు ఈ ఉత్తరం రాయడానికి ప్రేరణ ఇచ్చి ఉంటుంది. అనాదిగా ప్రభుత్వాధికారులు చట్టాన్ని గౌరవించే సామాన్య ప్రజల విషయంలో నడుచుకొనే ధోరణికి ఈ వ్యవహారం ఒక మచ్చుతునకగా చెప్పుకోవచ్చు.

ఈ లేఖ ఒక తెలుగువాడు వాతావరణ కాలుష్యం మీద రాసిన మొదటి రచన అని బంగోరె అభిప్రాయపడ్డాడు.31 ప్రజలకు అసౌకర్యం కలిగించే ఇటువంటి విషయాల మీద పత్రికలలో లేఖలు ప్రచురించే సంప్రదాయం ముందునుంచి ఉంది. ప్రజా సమస్యలమీద నరసయ్య స్పందించిన తీరుకు ఈ లేఖ ఒక ఉదాహరణ. పీపుల్స్ ఫ్రెండ్‌లో ఈ ధోరణినే ఆయన కొనసాగించాడు.

విశ్రాంతివేళల్లో, పుస్తకపఠనం నరసయ్య వ్యసనం. వేపనూనె తయారీలో వెలువడే దుర్వాసనతో పాటు, విధి విరామం లేకుండా వేప విత్తనాల దంపకంవల్ల, ఆయన ఏకాంత పఠనానికి భంగం కలిగి ఉంటుంది. ఆయన ఎంత ప్రశాంత వాతావరణాన్ని, ఏకాంతాన్ని కోరుకొంటాడో, దానికి భంగం కలిగితే, ఎంత చిరాకుపడతాడో దినచర్యలోని ఈ వాక్యాలు తెలియచేస్తాయి.

"Dinner cooked and eaten by 12 noon. Reading till 3 p.m. Three troublesome neighbours (women) set up a terrible gossip and made such a frightful noise that I gave up reading in despair. I went away to the temple porch and stayed there reading a little until 6-00 p.m."32