ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య
English Journalismlo Toli Telugu Velugu
Dampuru Narasaiah
A Publication of
Society for Social Change, Nellore.
First Published 2007
© Dr. Kalidasu Purushotham
For copies :
Mrs. K. Sathyavathi
16/1179, Kasturidevi Nagar,
Nellore-524 001. A.P.
Ph.: 0861-2320305
Mani Book Stall
Sunday Market, Nellore.
Cover Design:
Ramana Jeevi
Type set & composed:
Aishwarya Graphics, Nellore.
Tel.: 2327463
Printed at:
Charita impressions
Price : Rs. 120/
ఇంగ్లీషు జర్నలిజంలో
తొలి తెలుగు వెలుగు
దంపూరు నరసయ్య
('పీపుల్స్ ఫ్రెండ్' సంపాదకుడు)
డాక్టర్ కాళిదాసు పురుషోత్తం
నెల్లూరు
2007
సంస్కర్త
పత్రికోద్యమానికి ఆద్యుడు, మార్గదర్శి
మహామనీషి, దేశభక్తుడు
దంపూరు నరసయ్యకు
కృతజ్ఞతలు
ఈ పుస్తకం పాఠకుల ముందు ఉంచుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
తమిళనాడు ఆర్కైవ్స్ చెన్నై, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ - హైదరాబాదు, తిరుపతి కార్యాలయాల్లో, నెల్లూరు కలెక్టరాఫీసులో ఈ రచనకు అవసరమైన విషయాలు సేకరించాను.
ఆర్. సుందరలింగం పరిశోధన గ్రంథం “పాలిటిక్స్ అండ్ నేషనలిస్ట్ అవేకనింగ్ ఇన్ సౌత్ ఇండియా 1852-1891 నుంచి పందొమ్మిదో శతాబ్ది మద్రాసు సామాజిక పరిస్థితులను గ్రహించాను.
గురజాడ ఇంగ్లీషు రచనలు తెలుగు అనువాదాల రూపంలో తప్ప మాతృకలు చదివి ఆనందించడానికి అవకాశంలేని దురదృష్టకర పరిస్థితి కల్పించబడింది. నరసయ్యకు అటువంటి దుస్థితి ఏర్పడకుండా ఆయన రాసిన ముఖ్యమైన వ్యాసాలు, ఆయన అందుకొన్న ఉత్తరాలు, ఆయన పత్రిక మీద ప్రభుత్వ అనువాదకులు రాసిన రిపోర్టులు అనుబంధంలో చేర్చాను.
ఈ పుస్తకంలో అవసరాల సూర్యారావు, బంగోరె మొదలైనవారి రచనల నుంచి ఉదాహరించినపుడు వారు వాడిన భాషను మార్పుచేయకుండా ఉంచాను.
నా ఆత్మీయమిత్రులు శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ, డాక్టర్ ఎం. శివరామ ప్రసాద్ ఈ కృషిలో అండగా ఉన్నారు. మా బావ శ్రీ పి.ఎల్.ఎన్. ప్రకాశం ప్రూఫులు చూసే బాధ్యత స్వీకరించాడు. ఈ పరిశోధనకోసం, ఈ పుస్తక ప్రచురణకోసం నరసయ్య మనుమలు స్వర్గీయ నరసింహకృష్ణమూర్తి సంతానం పదిహేను వేల రూపాయలు ఇచ్చి సహాయపడ్డారు.
పెద్దలు, సీనియర్ పాత్రికేయులు, విశాలాంధ్ర దినపత్రిక పూర్వసంపాదకులు శ్రీ చక్రవర్తుల రాఘవాచారిగారు నా అభ్యర్థనను మన్నించి పరిచయ వాక్యాలు రాసి ఆదరించారు.
అందరికి అభివందనాలు.
కాళిదాసు పురుషోత్తం
పరిచయం
విలక్షణ సంపాదకుడు, విశిష్ట పత్రికారచయిత దంపూరు నరసయ్యగారి జీవితం, కృషిని వివరిస్తూ వెలువరించిన ఈ పుస్తకం చారిత్రక ప్రాధాన్యం కలది; సాంఘిక ప్రయోజనం కలది. ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశకంలో వారు అనేక కష్టనష్టాలకోర్చి నిర్వహించిన ఆంధ్రభాషా గ్రామవర్తమాని ఇప్పటికీ ప్రజానుకూల పత్రికల ఒరవడికి ఆదర్శమని చెప్పవచ్చు.
నరసయ్యగారు మద్రాసులో పచ్చెయ్యప్ప ఉన్నతపాఠశాలలో అధ్యాపకులుగా ఉన్నపుడు రెండు సంవత్సరాలు 'నేటివ్ అడ్వొకేట్'ను, నెల్లూరులో ప్రభుత్వోద్యోగిగా ఉన్నపుడు సంవత్సరం పాటు 'నెల్లూరు పయొనీర్'ను నిర్వహించిన అనుభవంతో 'పీపుల్స్ ఫ్రెండ్'ను 1881లో ఆరంభించి పదిహేడు సంవత్సరాలు జయప్రదంగా నిర్వహించారు. పీపుల్స్ ఫ్రెండ్ అను సమాసమే కేవలం ఆలంకారిక విశేషణంగా కాక, పత్రిక ప్రజల కనుకూలమైన పాత్ర నిర్వహించవలసిన పరమార్థాన్ని శీర్షిక ద్వారా నిర్వచించటం అర్ధవంతమైన సూచనగా భావించవచ్చు. ఇటీవల 'పీపుల్స్' అనే విశేషణ పూర్వపద మైనవన్నీ పురోగామిశీలమైనవే కదా!
అప్పుడప్పుడే దేశంలో జాతీయోద్యమ ఆవిర్భావానికి ప్రయత్నాలు జరుగుతున్న కాలం. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానంతరం, బ్రిటిష్ ప్రభుత్వం వ్యూహం కొద్దీ ప్రారంభించిన పరిమిత సంస్కరణల ప్రభావం ఇంగ్లీషు విద్యావంతులైన మధ్యతరగతి వారి మీద బాగా ప్రసరిస్తున్న రోజులవి. రిప్పన్ ప్రభువు స్థానిక కౌన్సిళ్లకు నాంది పలికిన సమకాలీన స్ఫూర్తితో పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభం కావటం యాదృచ్చికమే అవచ్చు కానీ, ఆ పత్రిక తర్వాత సంవత్సరాల చరిత్ర నరసయ్యగారి సంస్కరణాభిలాషను, జాతీయ అభినివేశాన్నీ, ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న ప్రగాఢమైన అవగాహన, సానుభూతినీ ప్రస్పుటంగా తెలియజేస్తుంది.
ఆనాటి పత్రికల్లో సాంఘికసంస్కరణ, భాషా సంస్కరణల ప్రస్తావనలు బహుళంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. సంఘసంస్కరణకు నిబద్దులైన నరసయ్యగారు హిందూ సమాజంలో రావలసిన అనేక సంస్కరణలపై తాము నడిపిన పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ద్వారా విశేషమైన కృషి చేశారు. బ్రహ్మసమాజపు ప్రభావంలో ఆయన చేసిన కృషికి “లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్” తిరుగులేని తార్కాణం. సంస్కరణలో ఆయనది వెనుచూపు లేని దృక్కోణం. వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రభృతుల కృషికి ఆనాటి ఛాందసవర్గాల వ్యతిరేకతను సరకుచేయకుండా పత్రిక ద్వారాను, ప్రత్యక్షంగాను దోహదమొనర్చిన కర్మవీరుడు.
తెలుగు వ్యావహారిక భాషావాదంపై పెద్ద ఎత్తున గ్రాంథికవాదుల దాడి జరుగుతున్న రోజుల్లో నిర్భయంగా, నిజాయితీగా వాడుకభాషను సమర్ధించిన ప్రముఖుల్లో నరసయ్యగారు ఒకరు. గురజాడ అప్పారావు కన్యాశుల్క నాటక సమీక్షలో, వేదం వేంకటరాయశాస్త్రి పాత్రోచిత భాషను మెచ్చుకొంటూ చేసిన ప్రతాపరుద్రీయ నాటక సమీక్షలో ఈ వ్యావహారిక భాషా పక్షపాతం కన్పడుతుంది. కేవలం భాషావిషయమైనా, ప్రగతిశీల ధోరణే కాకుండా, ప్రజాసమస్యలపై ఆయన పత్రికల ద్వారా నిర్వహించిన కృషి అనన్య సాధ్యమనిపిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల తొలితరం పత్రికా రచయితలలో ఉన్న అనుకూల వైఖరిని, తరువాత కాలంలో అనుభవంకొద్దీ, పరిస్థితుల ప్రభావంలో మార్చుకొని రాజకీయంగా చైతన్యం ప్రోది చేయటంతో పాటు, ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కారం సాధించటంలో ఆయన ప్రదర్శించిన పట్టుదల, ఆసక్తి ఏనాటి జర్నలిస్టుకైనా ఆదర్శప్రాయమే.
తెలుగువాడుగా పుట్టి ఇంగ్లీషు పత్రికల్లో పెద్దపేరు తెచ్చుకొన్న వారెందరో ఉన్నారు - అదీ తర్వాతికాలంలో. తొలిదశలోనే ఇంగ్లీషుపత్రికా ప్రపంచంలో తెలుగు'వాడి' రుచి చూపించిన ప్రశస్తి నరసయ్యగారిది. అవసరమైనపుడు తీక్షణత, అనుకూలతనుబట్టి సంయమనం, ఎట్టి పరిస్థితిలోనూ రాజీపడని నిష్కర్ష ఇవి ఏ క్రూసేడింగ్' జర్నలిస్టుకైనా కావలసినవి. ఈ ప్రమాణాలతో, అననుకూల పరిస్థితులలో తన ఆశయసాధన కోసం పత్రికను నమ్ముకొన్న ప్రజాపక్షపాత పత్రికారచయితలకు ఆద్యుడుగా, తరగని స్ఫూర్తిగా నిలిచిన నరసయ్యగారికి నివాళి.
నరసయ్యగారికి వెంకటగిరి జమీందారుతో సన్నిహిత సంబంధాలు ఉన్నా, కోడూరు గ్రామం కేంద్రంగా చేసుకొని జమీందారి గ్రామాల పరిస్థితులను, అక్కడి రైతుల, ప్రజల పరిస్థితులను ఆయన తన పత్రికద్వారా వివరించి తర్వాతకాలంలో ప్రారంభమైన జమీందారి రైతులపోరాటానికి పటిష్టమైన భూమిక ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఉద్యమపత్రికలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి ఆయనకే చెందుతుంది. ఇన్ని విధాల కృషి చేసిన నరసయ్యగారి చరిత్ర సమగ్రంగా రాని లోటు ఇప్పటికి కొంతవరకు తీరింది. రేఖామాత్రంగా బంగోరె, గోపాలకృష్ణ జమీన్ రైతు ద్వారా చూపిన ఆకరాలను, ఆధారాలను శోధించి, వివరాలను వెదికి పట్టుకొని, విశేష శ్రమకోర్చి ఏ యూనివర్శిటీ యో, అకాడమీయో నిర్వహించవలసిన కార్యభారాన్ని తనపై వేసుకొని నరసయ్యగారి జీవితచరిత్రను అందించటంలో పరిశోధకరచయిత డాక్టర్ పురుషోత్తంగారి కృషి సమాదరణీయమైనది. ఆయనకు తెలుగు పత్రికాలోకం ఇందుకెంతైనా రుణపడి ఉంటుంది. అలనాటి మంచి పత్రికారచయితను ఈనాటివారికి పరిచయం చేస్తూ, వెలువరిస్తున్న ఈ పుస్తకానికి ఈ రెండు మాటలు అభినందన పూర్వకంగా చెప్పడం జర్నలిస్టుగా సార్ధకత, సంతృప్తి.
21-12-2006 చక్రవర్తుల రాఘవాచారి విజయవాడ
ఈ వరుసలో......
1 |
9 |
19 |
37 |
41 |
55 |
105 |
131 |
142 |
155 |