ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/స్నేహభాగ్యము
౩౯. స్నేహభాగ్యము
౧౮౯౨ వ సంవత్సరము మార్చి తుదివారమున జరిగిన మా ప్రార్థనసమాజ జయంత్యుత్సవసమయమున సభ్యుల మందఱము నమితోత్సాహమున నుంటిమి. వీరేశలింగముగారు "మానుషధర్మము"ను గుఱించియు, నరసింహరాయఁడుగారు "విశ్వాసము"ను గూర్చియు, కనకరాజు "దేవేంద్రనాధు"నిగూర్చియు, నేను "ప్రేమపారిశుద్ధ్యము"నుగుఱించియు,ధర్మోపన్యాసములు చేసితిమి. బీదజనులకు అన్నదానము చేయఁబడెను. ఏకాంతప్రార్థనమునకై సారంగధరపర్వతమునకుఁ బోయి వచ్చితిమి.
వేసవికి కళాశాల మూయుటచేత పట్టణమునుండి సమాజ మిత్రులు తమ తమ గ్రామములకు వెడలిపోయిరి. సత్యసంవర్థనిని విడిచి వెంటనే నే నెచటికిని బోలేకపోయితిని. పత్రికకు వ్యాసములు వ్రాయుచును, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు నడపుచును, నేను రాజమంద్రిలో చల్లనిగాలి ననుభవించుచుంటిని! ఇపుడు స్కాటు దొరగారు నాయింగ్లీషువ్యాసములు దిద్దుటకు నిరాకరించుటచేత, ఆంగ్లేయవ్యాసరచనయం దెక్కువజాగ్రత్త వహించితిని.
ప్రార్థనసమాజసంపర్కము వదలుకొను మని తండ్రియు మామయు నాకు హితబోధము చేసిరి. పత్రికమూలమున నాతలంపులు కార్యములును రచ్చ కెక్కుచుండెను. ఇపుడు వేలివెన్ను నుండి వచ్చిన నాభార్య, సమాజవార్షిక సమయమందలి మాచర్యలు, అచటిచుట్టముల హృదయములను గలంచివైచె నని చెప్పెను. నేను విద్యాభ్యాసమును గూర్చి శ్రద్ధఁబూని, యుద్యోగసంపాదనమునకుఁ గడంగవలయునే కాని, నిరర్థక సంస్కరణములవిషయమై కాలమును వ్యర్థపుచ్చరా దని, మనుమనిపురోభివృద్ధి గోరి వృద్ధురాలగు మాయమ్మమ్మ పంపినట్టియు, పతిసేమ మారసి నాభార్య భద్రముగఁ గొనివచ్చినట్టియు, సందేశవిశేషము ! ప్రాఁతగిల్లినప్రేమను జూపు ముత్తువమాటలు మనుమనికి నచ్చినను నచ్చకున్నను, నవయౌవనమున విలసిల్లు సతినూతనానురాగ యుతమగు హితోక్తులు పతిచెవి కెక్కు ననుట స్పష్టము కావున, సంస్కరణోద్యమముదెస నెటులైన నాకు విముఖత్వము గలిగింప నీయాఁడువా రిద్దఱు నాలోచించుకొనిరి !
ఈవేసవిలో వీరేశలింగముగారు చెన్నపురి వెళ్లి పోయిరి. ఆయన బయలుదేఱుటకు మునుపు, ఇంటియొద్ద వారిని జూచితిని. సంస్కరణాంశములం దాయన నామనసునకు నచ్చినట్టి అతివాదియె. కాని, యాయనలోపము లెంత బయలుపడియున్నవి ! అహంభావము, ఆత్మశ్లాఘనమును వీరి వాక్కులయందుఁ జూచి నేను జింతించి, ఈశ్వరకృపచే నివి తొలఁగవలె నని కాంక్షించితిని. ఆస్తికపాఠశాలస్థాపన విషయమై పాపయ్యగారు పరిపూర్ణసానుభూతిఁ జూపుచుండువారు. ఇపుడు నాకు మాతమ్ముఁడు వెంకటరామయ్యయు, మృత్యుంజయ రావును నిత్యసహచరు లయిరి. నవీనముగా స్నేహము గలసినను, మృత్యుంజయరావునెడల నాకు చన వెక్కువ. మితభాషి యైనను, మనసుగలసినమిత్రులతోఁ దన యాదర్శములను విశ్వాసములను ఆతఁడు వెల్లడించుటకు వెనుదీయకుండువాఁడు. భవిష్యత్తునందలి మాకార్య ప్రణాళికనుగుఱించి ముచ్చటించుచుండువారము. మిల్లు వ్రాసిన "స్త్రీ నిర్బంధము" అనుపుస్తకమును అమితతమకమునఁ జదివితిమి. జన లోకముయొక్క కనులువిప్పి, ఉత్కృష్టసాంఘిక సమస్యలను నిర్భయముగ నెదుర్కొనిన యాయుత్తమరచయితవాక్కులు విని నామిత్రుఁడు హర్షోద్రేకమున మిన్ను ముట్టుచుండువాఁడు. ఈమిత్రుఁడు వక్తయు వ్రాయసకాఁడును కాఁడు. సఖులతోడి సుఖసంభాషణములందు మాత్రము, ఆతనికంటె నధికమగు బుద్ధివైశద్యము సదుద్దేశసద్భావములును గనఁబఱచెడివా రరుదుగ నుందురు ! అతనికి స్త్రీవిద్యాభిమానము మెండు. అందఱివలె మాటలతోఁ దనివి నొందక, తనభార్య మాణిక్యాంబ కాతఁడు విద్యాసౌకర్యము లెన్నియో కలిగించెను. ఇపుడు నాప్రోత్సాహమున నతఁడు "పండిత రామాబాయిసరస్వతి"ని గుఱించి వ్యాసము వ్రాయఁగా, అది జూన్‌పత్రికలోఁ బ్రచురించితిమి.
రాజమంద్రినివాస మనిన నే నంత విసు వంది, ఏప్రిలుపత్రిక తపాలో నంపినవెంటనే, వేలివెన్ను, నర్సాపురము మున్నగుప్రదేశములు తిరిగి వచ్చితిని. ఈ సెలవులలో వీరేశలింగముపంతులు కనకరాజును పట్టణమున లేనందున, మే, జూను పత్రికలలోఁ బ్రచురింప వలసినవ్యాసములు నేనే నిర్ణయించితిని. ప్రాఁతవ్యాసములలో "అహం బ్రహ్మాస్మి" అను నద్వైతమతఖండనము నాకనుల కగపడెను. అది కనకరాజు వ్రాసినది. వేదాంతవిషయములలో మాకు పంతులుగారి తరువాత కనకరాజే ప్రమాణము ! అద్వైతము బ్రాహ్మమతమునకుఁ బరమశత్రు వని యాతనిమతము. ఇపు డీవ్యాసము గాటుగ నుండుట చేత, మేనెల పత్రికలో దానినిఁ బ్రచురించి, దేశోద్ధరణము గావించితి మని సంతసించితిమి. తప్పులతడకగ నుండిన యీ యసంపూర్ణ వ్యాసము తనకుఁ జెప్పక యేల ప్రచురించితి రని పిమ్మట కనకరాజు కోపపడెను. ఆతఁ డనుకొనినట్టుగనే, బళ్లారి "సన్మార్గబోధినీ" పత్రికలో నీవ్యాసముమీఁద పెద్దఖండనము ప్రచుర మయ్యెను. వేసవి సెలవు లయినపిమ్మట, ఈఖండనమునకుఁ బ్రత్యుత్తరము లిచ్చితిమి.
మరల కళాశాల తీసినవెనుక మృత్యుంజయరావుని యాలోచన ననుసరించి, ప్రార్థనసమాజసభ్యులము కొందఱము, ఇతరవిద్యా ర్థులు కొందఱితోఁ గలసి, విద్యాలయమునకుఁ జేరువ నుండు నొక మేడను అద్దెకుఁ దీసికొంటిమి. నాచదువున కందు నిశ్శబ్దమగు గది యొసఁగబడెను. చుట్టుపట్టుల నిండ్లలో నివసించియుండు కనకరాజు మృత్యుంజయరావు మున్నగుస్నేహితులు తఱచుగ మాబసకు వచ్చి, మాతో సంభాషించుచుందురు. మృత్యుంజయరా విపుడు కళాశాల చేరి పట్టపరీక్ష రెండవభాగమునకుఁ జదువుచుండెను. ఇపుడు కనకరాజు పట్టపరీక్ష మొదటితరగతిలోఁ జేరి, యెక్కువ విశ్రాంతి గలిగియుండుటచేత, పత్రికవ్యవహారము లతఁడు చూచుచువచ్చెను. చదువుకొనుటకు ప్రత్యేకవసతి యేర్పడుటచేత, ఆఱునెలలలో రానున్న పట్టపరీక్షకై కృషిసలుప నుద్యమించితిని. కాని, నా యారోగ్య మింకను సరిగ లేదు. ఆదినములలో రోగము నాదేహముతో 'సెలగాటము' లాడుచువచ్చెను ! ఆతరుణమున నామిత్రులు కొందఱు నాకు సాయము చేసిరి. రామారావుగారు ఉపహారములు చేయించి పెట్టుచును, మృత్యుంజయరావు అపుడపుడు భోజనసదుపాయము లొనరించుచును, రంగనాయకులునాయఁడుగారు ఔషధపానీయముల నంపుచును, నా కెంతయో తోడ్పడిరి.
ఇంట భోజనవిషయమున మాతల్లి యెన్నియో సదుపాయములు నాకు సమకూర్చుచుండెడిది. అప్పుడప్పుడు జబ్బుపడుచుండినను, మొత్తముమీఁద మాయింట నుండునందఱిలోను సుఖానుభవమున నేనే యధిపుఁడను ! చదువుకొనుటకు శయనించుటకును నాకు విశాలమును నిశ్శబ్దమునునగు ప్రత్యేకమగు మేడగది కలదు. వర్ష కాలమున మా కుటీరనివాసము కడు బాధాకరముగ నుండెడిది. ఆపర్ణశాలలో నేల మిగుల తేమగును, పెరడు బురదగను నుండుటవలన, అహర్నిశ మచట తిరిగి పనులు చేసికొనుచుండు మాతల్లికిని తక్కిన యాఁడు వాండ్రకును, కాళ్లు ఒరసికొనిపోయి పుండ్లు పడెను. ఆయిల్లు విడిచి చేరువనుండు నేపెంకుటింటికైనఁ గాపురము తరలింపు డని నేను మొఱపెట్టినప్పుడు, మాతండ్రి, "ఇపు డీ నేల యివరగా నున్నది గాని, కొంచె మారినయెడల, ఇక్కడనే కొబ్బరికాయలు కొట్ట వచ్చును సుమా !" అని పలుకుచు, నాయాలోచన లెగురఁగొట్టు చుండువాఁడు. అందువలన మాతల్లికి దేహారోగ్యము చెడిపోవుటయు, అందఱికి నసౌఖ్యము గలుగుటయుఁ దటస్థించి, నన్నలజడిపాలు చేసెను.
40. రోగారోగ్యములు
ఆకాలమున నా యారోగ్యమునుగుఱించి నే నెంతయో శ్రద్ధవహించెడివాఁడను. ఏమాత్ర మనుమాన ముండినను, మిత్రుఁడు రంగనాయకులునాయఁడుగారు నన్నుఁ బరీక్షించి మం దిచ్చుచుండువారు. రాత్రులు చదువకుండుటయె నియమముగఁ జేసికొని నేను భోజనానంతరమున నెనిమిదిగంటలకే పాన్పు చేరుచుండువాఁడను. కాని, అత్యాతురతచే నాకనులు పొడివాఱి, కునుకు పట్టకుండెడిది ! ప్రక్కగదులలోఁ జదువుస్నేహితులను చదువు మానుఁ డనియును, కనీసము మెల్లఁగఁ జదువుకొనుఁ డనియును వేఁడుచుండువాఁడను ! చన వెక్కువ గలవారి గదిలోని దీప మార్పివేసి, వారికి నిర్బంధవిశ్రాంతి చేకూర్చుచుండు వాఁడను. కాని, యెన్ని పూజలు సల్పినను, నిద్రాదేవత నాకుఁ బ్రసన్న మయ్యెడిదిగాదు. చీఁకటిపడుటయె తడవుగా పడకఁ జేరి, పొడిగ్రుడ్లుపడి యాపసోపములతో గంటలు లెక్కించెడి నాకంటె, కాలనియమము లేని చదువున నొడ లెఱుఁగక దీపముచెంతనే నిదురించు పొరుగుసహచరు లదృష్టవంతు లని యచ్చెరు వందుచుందును.