ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/రోగారోగ్యములు
వాండ్రకును, కాళ్లు ఒరసికొనిపోయి పుండ్లు పడెను. ఆయిల్లు విడిచి చేరువనుండు నేపెంకుటింటికైనఁ గాపురము తరలింపు డని నేను మొఱపెట్టినప్పుడు, మాతండ్రి, "ఇపు డీ నేల యివరగా నున్నది గాని, కొంచె మారినయెడల, ఇక్కడనే కొబ్బరికాయలు కొట్ట వచ్చును సుమా !" అని పలుకుచు, నాయాలోచన లెగురఁగొట్టు చుండువాఁడు. అందువలన మాతల్లికి దేహారోగ్యము చెడిపోవుటయు, అందఱికి నసౌఖ్యము గలుగుటయుఁ దటస్థించి, నన్నలజడిపాలు చేసెను.
40. రోగారోగ్యములు
ఆకాలమున నా యారోగ్యమునుగుఱించి నే నెంతయో శ్రద్ధవహించెడివాఁడను. ఏమాత్ర మనుమాన ముండినను, మిత్రుఁడు రంగనాయకులునాయఁడుగారు నన్నుఁ బరీక్షించి మం దిచ్చుచుండువారు. రాత్రులు చదువకుండుటయె నియమముగఁ జేసికొని నేను భోజనానంతరమున నెనిమిదిగంటలకే పాన్పు చేరుచుండువాఁడను. కాని, అత్యాతురతచే నాకనులు పొడివాఱి, కునుకు పట్టకుండెడిది ! ప్రక్కగదులలోఁ జదువుస్నేహితులను చదువు మానుఁ డనియును, కనీసము మెల్లఁగఁ జదువుకొనుఁ డనియును వేఁడుచుండువాఁడను ! చన వెక్కువ గలవారి గదిలోని దీప మార్పివేసి, వారికి నిర్బంధవిశ్రాంతి చేకూర్చుచుండు వాఁడను. కాని, యెన్ని పూజలు సల్పినను, నిద్రాదేవత నాకుఁ బ్రసన్న మయ్యెడిదిగాదు. చీఁకటిపడుటయె తడవుగా పడకఁ జేరి, పొడిగ్రుడ్లుపడి యాపసోపములతో గంటలు లెక్కించెడి నాకంటె, కాలనియమము లేని చదువున నొడ లెఱుఁగక దీపముచెంతనే నిదురించు పొరుగుసహచరు లదృష్టవంతు లని యచ్చెరు వందుచుందును. నా వైద్యమిత్రుఁ డిచ్చు నిద్రాకరమగు మందె నాకు వికారము గలిగించి నిదురను బాఱఁద్రోలుచుండును ! నిద్ర యెట్లు పట్టునా యని యాలోచించినకొలఁది నా కది దూరస్థ మగుచుండును !
రాత్రి నిద్దురమాట యెటు లుండినను, పగటికాల మేమాత్రమును వేథచేయక నేను చదువుచుందును. ఏమాత్రము చదువుపా లెక్కువయైనను, ఒక్కొకసారి బొత్తిగఁ జదువుకున్నను, నాకురోగము ప్రత్యక్ష మగుచుండును. బంగారము తూఁచుత్రాసువలె, మిగుల చిన్నమార్పుననైనను నాదేహము రోగముదెస కొఱగుచుండును. అయినను, వ్యాధినుండి యొకింత తెఱపి గలిగినేని, నేను మరలఁ జదువుచు పత్రికకు వ్రాయుచు, కాలమును సద్వినియోగము చేయ నుంకించుచుందును. ఈసంగతి, ఆనాఁటి నాదినచర్యపుస్తకములలోని క్రిందియుల్లేఖమువలన తేటఁబడఁగలదు: -
"బుధ. 13 జూలై 1892 : నాకు బాధ హెచ్చెను. తయారు చేసిన వ్యాసమును అచ్చున కిచ్చితిని. వేదన అతిశయంచెను. ఊపిరి సరిగా విడువనేరక నేను పండుకొనియుండుట చూచి, కనకరాజు కంట తడిపెట్టుకొనెను. నాయఁడుగారిమందు వలన కొంత యుపశమనము గలిగెను. బంధుమిత్రులు నన్నుఁ జూడవచ్చిరి. భగవానుఁడా, యెటులయినను నేను నీవాఁడనెకదా !"
"సోమ. 18 జూలై :- ప్రొద్దుననే నా పూర్వశత్రువు గుండె నొప్పి మరల పొడసూపెను. రోజంతయు బాధనొందినను కళాశాలకుఁ బోయితిని. గదిలోనివస్తువులు సరదుకొంటిని. అచ్చుచిత్తులు దిద్దితిని. లోకాక గూడ నుండెను." "మంగళ. 19 జూలై. దేహ మింకను ససిగా లేదు. ప్రొద్దున ముద్రాలయమున కేగి పని చేసితిని. ప్రాఁతశత్రువగు కనులత్రిప్పు మరల రెండుసంవత్సరముల కీనాఁడు గనఁబడినది. దాని వెన్నంటి యుండు తలనొప్పిచే రోజంతయు బాధపడితిని. ఆరోగ్య మిట్లు ఊఁగులాడుచున్నది !"
పైని జెప్పినదానిలో రెండుసంవత్సరముల కనునది రెండునెలలని యుండవలయును. రెండునెలలకైనను, రెండుసంవత్సరములకైనను, శరీరముపై మోయలేని బరువులెత్తుటచేతనేకదా ప్రాఁతరోగములు బయలుపడుచుండును ! విద్యార్థులకు పరీక్షాకాలము పెద్దపరీక్షాకాలమె !
రోగముతో నిట్లు నిరంతరయుద్ధము సల్పుచుండు నాదేహము, అక్టోబరు చివరభాగమున మరల వ్యాధిగ్రస్థ మయ్యెను. శరీరమందు ససిగా నుండనిసమయమున పాఠములు చదువుచును, పరీక్షలకుఁ బోవుచును, పత్రికకు వ్రాయుచును, విందులు గుడుచుచును నుండుటచేత' అక్టోబరు 27 వ తేదీని నాకు పెద్దజ్వరము వచ్చెను. వేసినమందు వికటించి రోగము హెచ్చెను. ఆమఱునాఁడు నన్ను లంకణ ముంచిరి. రాత్రి పదిగంట లగుసరికి నాకు తల తిరిగెను. ప్రాణ మెగిరిపోవు నటు లుండెను. చూచుచుండఁగనే కాలుసేతులు చివరనుండి చల్లఁబడి మొద్దుపాఱఁజొచ్చెను ! స్పృహమాత్రము స్ఫుటముగ నుండెను. ఇది యంత్యావస్థ యని నే ననుకొని, ఒక కేక వేసితిని. జీవిత మంతయుఁ జేసెద ననుకొనిన ఘనకార్యములు సాధింపకయే నే నిట్లగుచుండుట కాశ్చర్య మందితిని. భోజనము చేయుచుండు నా తల్లియు, భార్యయు నంతట లేచివచ్చిరి. అంత పొరుగువీథి నుండిన యొకవైద్యుని గొనివచ్చిరి. ఇపుడు నా దేహమునిండ చెమ్మటలు పట్టెను. నిదానముగల యావైద్యుఁడు నాచేయి చూచి, నాడిలో దోషము లేకుండుట గ్రహించెను. జ్వరము విడుచుటచేత ముచ్చెమటలు పట్టి నాకు నిస్సత్తువ గలిగె నని నిశ్చయించి, నా కాయన, పేలాలజావ పోయించెను. నేను తెప్పిఱిల్లితిని. ఆవైద్యునియౌషధమువలన నొకవారమునకు నాకు నింపాందించెను.
41. వైరివర్గము
మహమ్మదీయ సంపాదకునిచే నడుపఁబడుచుండెడి "సత్యాన్వేషిణీ" పత్రిక, హిందూసంఘ దురాచార నిరసనము నెఱపుచుండెడి మా "సత్యసంవర్థని" యెడ సానుభూతి చూపు నని లోకు లనుకొనవచ్చును కాని, అట్లు జరుగలేదు. జనన మొందినది మొదలు, "సత్యాన్వేషిణి" ప్రార్థన సామాజికులను, "సత్యసంవర్థని"ని దూషించుటతోనే కాలము గడపెను. ఈదూషణ మైనను, సిద్ధాంతములలోను విధానములందును గల యభిప్రాయభేదము లాధారముగఁ జేసికొనిన ధారాళవిమర్శన మైనచోఁ గొంత సారస్యముగ నుండెడిది. అట్లు గాక, "సత్యాన్వేషిణి" వ్యక్తిగత దూషణములు చేయఁ జొచ్చెను. ప్రార్థన సామాజికులకు లేనిపోని యవగుణము లారోపించి, వారి యాదర్శములను వెక్కిఱింపఁ జొచ్చెను. మా సమాజమువా రెంత యోపికతో నూరకుండినను, సత్యాన్వేషిణి నోరు కట్టువడలేదు. అంతట వీరేశలింగముపంతులు, మహమ్మదీయసంపాదకునిచేతను, బ్రాహ్మణకార్యనిర్వాహకునిచేతను బ్రకటింపఁబడెడి యాపత్రికకుఁ దగుసమాధాన మీయఁదొడంగెను. సెప్టంబరు "సత్యసంవర్థని" లో "సాభిప్రాయవిషయ వ్యాసము" వ్రాసినది వీరె. దీనిలో