ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ

వికీసోర్స్ నుండి

ఆత్మచరిత్రము

ప్రథమ భాగము : విద్యార్థిదశ

1. బాల్యము

నా బాల్యదినముల సంగతులు కొన్ని నాకు జ్ఞప్తియందుఁ గలవు. మా తండ్రితో మధ్యాహ్న భోజనమునకుఁ గూర్చుండునపుడు నాకు నచ్చిన విస్తరాకు సమకూరుట దుర్ఘటమగుచువచ్చెను. అరఁటితోఁటలకు ప్రఖ్యాతినొందిన ఖండవల్లిలోనే యిట్లు జరుగుచువచ్చెను ! అచట మా తండ్రి సర్వేయుద్యోగి, తోఁటలలోనుండి యరఁటాకుల కట్ట లెన్నియో యనుదినమును మా యింటికి వచ్చుచుండినను, ఏకట్ట విప్పినప్పుడును నా కంటికి సరిపడు మంచి యాకందు దొరకకుండెడిది. ఆకు చివర గాలితాఁకుడువలన సామాన్యముగఁ గించెము చినుఁగుచుండును. ఏమాత్రము చినిఁగినను, కుపితుఁడనై, ఆకును చేతులతో నులిమి పారవైతును ! ఉసులుమఱ్ఱుగ్రామములో జరిగిన యొకసంగతి నాకు జ్ఞాపకము. మా తండ్రి నాకొక రుమాలు కొనిపెట్టెను. అది బుజముమీఁద వేసికొని, నాకంటె పెద్దవాఁడగు నొక సావాసునితో చుట్టుపట్టుల కేగుచుండువాఁడను. బాజాలు చూపింతు నని శుభకార్యములు జరుగుచోట్లకు నన్నాతఁడు కొని పోయి, నేను ఉద్యోగస్థుని తనయు నని చెప్పి, కొంచె మెక్కువగ నాకు వా రిచ్చిన సంభావనను దానే స్వీకరించుచుండువాఁడు ! అజ్ఞానదశలో నిది మఱచిపోయి, బాజాలు చూచినందుకే సామాన్యముగ నేను సంతసించుచుండినను, నా చేతిలోని డబ్బు చెలికాని వశమయ్యె నని యొక్కొకతఱి నిలు సేరువఱకును విలపించుచుందును. రాజమహేంద్రవరమున గుండువారి రేవునందలి పెద్ద టపాలకచేరి మేడమీఁద నొకనాఁడు జరిగిన సంగతి నాకు జ్ఞాపకము. అచ్చటి యుద్యోగీయులనో, మఱి యెవరినో యడిగి, మా తండ్రి యుత్తరము వ్రాసికొనుట కొకసిరాబుడ్డి తెచ్చుకొనెను. తాను వ్రాసిన జాబు మా నాయన చదువుకొనుచుండఁగా, నేను మెల్లఁగ సిరాబుడ్డి తీసి, క్రిందికి దొరలించి, 'టంటమ్మ'ని యది మెట్లమీఁదినుండి జారిపడుచుండఁగ వినోదమునఁ గాంచుచుంటిని ! అది యందుకొనఁబోయి నేనును పడి పోవుదు నని మా తండ్రి నన్నంత చేరఁదీసెను. ఆత్మవినోదమునకై సిరా వ్యర్థము చేయుటకు జీవితమున నిదియే మొదటిసారి యగుటచే గాఁబోలు, నా మనోఫలకమునం దీచిన్నసంగతి చిత్రితమై నేటికిని నిలిచియున్నది.

నా యైదవయేట మా తాతగారు నా కక్షరాభ్యాసము చేసిరి. అప్పటినుండియు నేను బడికిఁ బోయి వచ్చుచుండుట నాకుఁ గొంత జ్ఞప్తి, నా జన్మస్థలమును మాతామహు నివాసస్థానమును నగు వేలివెన్నులోను, పితృనివాసస్థలమగు రేలంగిలోను, నేను సహచరులతోఁ గలసి, పల్లెబడులకును, పాఠాశాలలకును బోవుచుండు దినముల జాడలు నా మనస్సీమ నిప్పటికిని గన్పట్టుచున్నవి. మా తల్లియు పినతల్లియు మేనమామలును, మా మాతామహులను, 'నాన్న' 'అమ్మ' యని సంబోధించుచుండుటచే నేనును వారి నట్టులే పిలుచుచుందును. ఇంతియకాక, మా పిన్నిని చిన్ని మేనమామ లిరువురిని జూచి, మా తల్లిని 'అప్ప' యనుచుందును. జ్యేష్ఠుడ నగు నన్నుఁ జూచి, పిమ్మట నా తమ్ములు చెల్లెండ్రును, మా అమ్మను అప్ప యనియు, అమ్మమ్మను అమ్మ యనియును బిలుచుచువచ్చిరి. మా తాతగారు మాత్రము తన వరుసను శాశ్వతముగ గోలుపోకుండుటకుఁ గలసందర్భ మొకింత వివరించెదను. ఒకానొకప్పుడు నేను జదివెడి రేలంగిపాఠాశాలకుఁ బరీక్షాధికారి వచ్చినప్పుడు, నాపేరు జనకునిపేరును పాఠశాలపట్టికలో స్పష్టముగఁ గానఁబడక పోవుటచే, ఆయన నన్నుఁ బిలిచి, "నీపే రేమి ? మా నాన్న పే రేమి ?" అని గ్రుచ్చిగ్రుచ్చి యడిగెను. "నాకు పేరు పెట్టలేదు, మాకుఁ 'వేలివెన్ను నాన్నా', 'రేలంగినాన్నా' ఉన్నారు" అని నేను ప్రత్యుత్తర మిచ్చి, ఆయనసందేహములను మఱింత పెంచివేసితిని ! "ఈ బాలు నింటికిఁ గొనిపోయి సరియైన జవాబు తెప్పించుఁ"డని యా యుద్యోగి యాగ్రహపడఁగా, ఉపాధ్యాయుల యాజ్ఞ చొప్పున చెలికాండ్రు నన్ను మా యింటికిఁ గొనిపోయి, నిజము తెలిసికొని వచ్చిరి. అప్పటినుండియు మా తాతయగు రామన్న గారిని, తండ్రియగు సుబ్బారాయుఁడుగారిని, సరియైన వరుసను నేను బిలువఁజొచ్చితిని. ఇంక నా పేరును గుఱించిన చిక్కు విడఁదీయవలెను. తొలిచూలి పిల్ల వాఁడ నగుటచే బాల్యమున నాకు నామకరణము కాలేదు. తన ప్రియదైవతమగు వెంకటేశ్వరునిపేరును, అప్పటికిఁ గొలఁదికాలము క్రిందటనే కాలగతినొందిన తన పెద్దయన్న పేరును, గలసివచ్చునట్టుగ 'వెంకటాచల'మని, మా యమ్మ నాకుఁ బేరిడ నేర్పఱచుకొనెను. మా తండ్రి కిది యిష్టము లేదు. తన కభీష్టదైవమగు శివుని పేరు నా కాయన పెట్టఁగోరెను. అంత నా కీయుభయదైవముల పేళ్లును గలసి 'వెంకటశివుఁ' డను పేరు వచ్చెను. విద్యాప్రారంభ మైనదిమొదలు మా తల్లితో పలుమాఱు నేను రేలంగి వెలివెన్ను గ్రామములమధ్య రాకపోకలు సల్పుచుండుటచేత, నే నా రెండుగ్రామములందలి ప్రాఁతబడులు క్రొత్తపాఠశాలలు ననేకములు త్రొక్కి చూచితిని. తాటియాకులపుస్తకములు చేతఁబట్టి, చిన్ని చదురులు వెంటఁ గొనిపోయి, అమర బాలరామాయణములు పఠించి, ఎక్కములు మున్నగునవి విద్యార్థులు గట్టిగ వల్లించెడి బడులకును, కాకితపుఁబుస్తకములు కలము సిరాబుడ్లును, పాఠపుస్తకములు పలక, బలపములును, జదువరులు వాడుక చేయుపాఠాశాలలకును, గల వ్యత్యాసము నా కనుభవగోచర మయ్యెను. ఏదేని నూతన విద్యాశాలలోఁ బ్రవేశించిన క్రొత్తఱికమున దిన మొకయేడుగఁ దోఁచినను, గురువుస్వభావము కనిపెట్టి సహపాఠుల సావాసము మరగినకొలఁది నా కమితసౌఖ్యము గలుగుచుండెను. అర్థజ్ఞానము లేని యతిబాల్యదశయం దుండుటచేత, వల్లె వేయు వాక్యావళియందుకంటె పుస్తకాదుల రూపాదులమీఁదనే నా కెక్కువ మక్కువ యుండెడిది. నే జదివినను జదువకున్నను, నాచేతులలో జరిగిన 'బాలబోధ' ల ప్రతులకు లెక్క లేదు. ఆకాలమున చిన్న పరీక్షాధికారి గ్రామపాఠశాలను జూడవచ్చునపు డెల్ల, పాఠ్యపుస్తకములు తనవెంటఁ గొనివచ్చి, యమ్ముచుండువాఁడు. అంచులు మణఁగి పుటలు చినిఁగిపోయిన ప్రాఁతపుస్తకము నంతట మూలఁ ద్రోచివైచి, క్రొత్తది కొనినరోజు నాకు పండుగయె ! అట్టమీఁదిరంగు చూచియె పుస్తకమును గొనుట చిన్ననాఁడు నా కెంతో ముచ్చట ! అన్ని రంగులలోను ఎఱుపు నాకుఁ బ్రియమైనది. ఆకుపచ్చ మధ్యస్థము. నలుపు, పసుపు, గోధుమ వన్నెలు నాకుఁ గిట్టవు. నల్లయట్టపుస్తకము నా కంటఁగట్టిరని కోపించి, ఒకప్పుడు నేను జదువుమీఁద సమ్మెకట్టితిని ! నా కీరంగుభేదములను గూర్చి కల విపరీతపుఁబట్టుదల, చదువు పుస్తకములు మొదలు వేసికొను వలువలు, ఆడుకొను వస్తువుల వఱకును, బాల్యమున వ్యాపించియుండెను ! ఎఱ్ఱనిచేలములు నాకుఁ బ్రియములు, శోణకుసుమము లత్యంతమనోహరములు. రంగులందువలెనే, రుచులందును నాకు గట్టిపట్టుదల యుండెను. కమ్మనికూరలు తియ్యనిఫలములు నాకు రుచ్యములు. పులుపు ఆగర్భశత్రువు. కారము మధ్యస్థము.

2. గోపాలపురము

వెనుకటి ప్రకరణమునందలి సంగతులు, ఐదారేండ్ల వయసునను, అంతకుఁ బూర్వమందును సభవించి నాకు జ్ఞప్తి నున్న ప్రత్యేకానుభవములు. సూత్రమునఁ గట్టిన పుస్తకమురీతిని, జలపూరితమగు నదీప్రవాహముఁబోలెను, నా కింకను జీవితము స్థాయిభావము నొందిన యనుభవసముదాయము గాకుండెను.

మా తండ్రి సర్వేశాఖలో మరల నుద్యోగము సంపాదించి, ఈమాఱు అమలాపురము తాలూకా గ్రామములలో నివసించెను. అందలి చిన్న గ్రామములలో 'ఈతకోట' యొకటి. ఈమధ్య నే నచటికిఁ బోయి చూడఁగా, అది వట్టి కుగ్రామముగఁ గ్రుంగిపోవుటకును, చిన్ననాఁటి నా యాటపట్టు లన్నియు స్వల్పప్రదేశములుగ సంకుచితము లగుటకును, విస్మయవిషాదముల నొందితిని ! నా యాఱవయేట, గొన్ని నెలలు మే మచట నుంటిమి. అప్పటికి నా తమ్ముఁడు వెంకటరామయ్య రెండుసంవత్సరములవాఁడు. మా యింటిముందలి చావడిలోనే గ్రామపాఠశాల యుండెను. అందు చేరి నేను రెండవపాఠ పుస్తకము చదువుచుంటిని. ఆ పాఠములందలి ప్రకృతివర్ణనావైచి త్ర్యము, శైలిసౌకుమార్యమును నా మనస్సున కమితానందము గొలిపెను. నా సహపాఠులగు బాలకులు నన్ను దమయిండ్లకుఁ గొనిపోయి, నాకు 'పెప్పరుమింటు'బిళ్లలు నూడిద లిడుచుండువారు. ఈ నూతనోపహారవస్తువులలోఁగూడ నా బుద్ధికి విపరీతభేదములు పరికల్పితములయ్యెను. గాటుగానుండు తెల్లని బిళ్లలకంటె, చక్కెఱపా లధికమై కంటి కింపగు నెఱ్ఱనిరూపమునను, ఇంచుక గులాబితావితోను నొప్పారెడి రంగుబిళ్ల లే నాకు రుచ్యములుగ నుండెను !

అది వేసవికాల మగుటచేత, అచట మామిడిపండ్లు ముమ్మరముగ నుండెను. ఉద్యోగవ్యాజమున మా తండ్రికిఁ గానుకలుగ సమర్పింపఁబడిన ఫలాదు లన్నియు నొకచీఁకటిగదిలోఁ జేర్పఁబడుచుండెను. గదితలుపు తీయునప్పటికి, పండ్ల నెత్తావులమొత్తము నాసికను మొత్తుచుండెడిది. రాత్రి భోజనానంతరమున మా తండ్రికోరిక చొప్పున పొరుగుబ్రాహ్మణుఁ డొకడు పనసపండ్లు కోసి తినలు విడఁదీయుచుండును. మా తలిదండ్రు లవి యచట నుండువారికిఁ బంచిపెట్టుచుందురు. మా మాతామహునకుఁ బుత్రవత్సలతయు మధురఫలాపేక్షయు మిక్కుటము. మమ్ముఁ జూచిపో వచ్చినయాయన, ఇరువురు మనుమలమీఁది ప్రేమమాధుర్యమునకును, మిగుల మాగినపండ్ల తియ్యదనమునకును జొక్కి, యా వేసవి మా చెంతనే గడపివై చెను !

ఈతకోటలో నా యనుభవమున ముఖ్యముగ రెండుసంగతులు కన్పట్టెను. అచట నొకగృహస్థునికి భార్యయు పుత్రుఁడును గలరు. తండ్రి మిగుల పొడుగుగను, తల్లియు తనయుఁడును కడు కుఱుచగను నుండుట నా కెంతో చోద్యముగ నుండెను. మా తల్లి కీసంగతి పలుమా రాశ్చర్యమునఁ జెప్పుచుండువాఁడను. మా పొరుగున నొకబీదవాని కుటీరము గలదు. ఆతని కొక కుంటికూఁతురు తప్ప మఱి యెవ్వ రును లేరు. పాప మెంతో భయభక్తులతో బగ లెల్ల పరిచర్యలు చేసి యలసిన యాబాలికను, ఏదో మిష పెట్టి తండ్రి రాత్రులు మోదు చుండును ! అంత వినువారి గుండె లవియునట్టుగ బాలిక రోదనము చేయుచుండును. లోక మనఁగ నిట్టి విపరీతవైషమ్యములతో నిండి యుండునట్టిదియే కాఁబోలని తలపోసి, రాత్రి పానుపు చేరి, నా విస్మయ విషాదములను గాఢసుషుప్తియందు విస్మరించుచుండువాఁడను !

అచ్చటినుండి మా తండ్రి నరేంద్రపురమునకు మార్పఁబడెను. మే మక్కడకుఁ బోయిన కొలఁదిదినములకే జరిగిన యొక యుత్సవ సందర్భమున నచటివారును పొరుగూళ్ల వారును "ప్రభలు" గట్టి రాత్రి యూరేగించిరి. ఆ యూరను చుట్టుప్రక్కలను ద్రావిడులు మెండుగ గలరు.

అచ్చట నొకచావడిలో జరుగు పాఠశాలలో నేను జేరి, మూఁడవపాఠపుస్తకము చేతఁ బట్టితిని. ఆ పుస్తకమందలి "శ్రీరామ పట్టాభిషేకవర్ణనము" మిగుల మనోహరముగ నుండెను. నా సహచరులలో సూర్యచంద్రు లను నిరువురు సోదరులు గలరు. చంద్రుఁడు తను కాంతితో విలసిల్లెడి సుందరాకారుఁడె కాని, సూర్యునిమోము కాల మేఘము లావరించిన సూర్యబింబమె ! వారు నివసించు నింటి యజమానునికి కురూపి యగు నేకపుత్రుఁడు కలఁడు. ఆ యువకుని సతి యన్ననో చక్కనిచుక్క. మగనిచెంత మసలెడి యా మగువ, కాఱు మబ్బునడుమ తళుకొత్తు మెఱఁపుఁదీఁగయె ! ఇట్టి విపర్యయముల కాశ్చర్యపడియెడి నా కప్పటి కాఱుసంవత్సరములు పూర్తి గాకుండెను.

1877 వ సంవత్సరపు వేసవిని నా రెండవ తమ్ముఁడు కృష్ణమూర్తి మా యిరువురివలెనే వేలివెన్నులో జననమయ్యెను. మే మంతట గోపాలపురము వెళ్లితిమి. అచట జరిగినసంగతులు నా మనో వీథిని మఱింత స్ఫుటముగ గోచరించుచున్నవి. మొదట నే నందు పల్లెబడులలో గాలము గడిపి, పిమ్మట పాఠశాలఁ బ్రవేశించితిని. మూఁడవపాఠపుస్తకము మరల నా కరము లలంకరించెను. నా కిచటఁ గొందఱు బాలురు నెచ్చెలు లైరి. గోదావరీనదీగర్భమందలి రెల్లు దుబ్బులు నిసుకతిన్నెలును మిత్రులతోఁ జుట్టివచ్చుచును, వరదకాలమున నొడ్డువఱకును వ్యాపించిన యేటి పోటుపాటులను దమకమునఁ గనుగొంచును, నేను బ్రొద్దు పుచ్చుచుండువాఁడను. ఆ సంవత్సరమున వరదలు మిక్కుటముగ నుండెను. మేము నివసించెడి యింటి చుట్టు గోడదగ్గఱ పోఁతగట్టు నానుకొనియె దినములకొలఁది గౌతమీనది భయంకరాకారమునఁ బ్రవహించుచుండెను. ఏటఁ గొట్టుకొనివచ్చిన యొకమొసలి యా గ్రామమున కనతిదూరమున నివాస మేర్పఱచుకొని, నీళ్లు చొచ్చిన మేఁకలను దూడలను వేఁటాడుచుండెను. ఒక యడవి పందిని అప్పుడే తెగటార్చిన యచ్చటి రాజకుమారుఁడు, ఒక నాఁడా మకరిని బట్టి వధించి తెచ్చెను. అంత దానిపొట్టఁ గోసి చూడఁగా, ఉంగరములు, బంగారుపోగులు నందు గాననయ్యెను అవి, రెండు రోజులక్రిందటనే ప్రమాదవశమున దానినోటఁ బడిన పసులకాపరి యగు నొక యర్భకునివి ! పుత్రశోకార్త యైన వానితల్లి యవి చూచి గోలుగోలున నేడ్చెను.

ఏడవయేటనుండియే నాకు నెచ్చెలుల సావాసము మరగి నునుట యలవా టయ్యెను. నాయీడు బాలురు మా యింట నెవరును లేరు. నా రెండవతమ్ముఁడు వట్టిశిశువు. పెద్దవాఁడగు వెంకటరామయ్య మూఁడేండ్లు వయస్సు కలవాఁడు. ఐనను, వచ్చియురాని మాటలతో నుండి, తప్పుటడుగులు వేయుచుండెడి యా పసివానికిని, సతతము స్నేహితులతోడి సుఖసంభాషణములకుఁ జెవి కోసికొనుచు, ఇంటఁ గాలు నిలువక చెంగుచెంగునఁ బెత్తనములకుఁ బరుగు లిడు నాకును సఖ్యము సమకూరకుండుటచే, బయటిసావాసులే నాకు శరణ మగుచుండిరి. ఎప్పుడును ఏవింతలో చూచుచును, ఏవార్తలో వినుచును, ఏపనియో చేయుచును నుండినఁగాని నాకుఁ బ్రొద్దు పోయెడిదికాదు. సుజనులో దుర్జనులో సావాసులతో నుండుటయె నా కప్పటి యభ్యాసము ! చెలికాండ్ర చెలిమి గోరువారికి విరోధులతోడి వైరము కూడ నేర్పడుచుండును. ఇదిగాక, సదా మిత్రులతోఁ గలసిమెలసి యుండువాఁడు, సమయానుగుణ్యముగఁ దాను వారిని నాలుగు కొట్టుటయు, వారిచే నాలుగు పడుటయును సామాన్యముగ సంభవించుచుండును. శైశవదశ నుండు నా పెద్దతమ్ముని కీ స్నేహసారస్య మేమియెఱుక ? చీటికి మాటికి నేను జేయు చిన్న దండయాత్రలలో నన్ను వాఁడు చేరఁగోరి, వల్లె యనినను వల దనినను నాపాలిఁటి విధి దేవతవలె నన్ను వెన్నాడుచు, సమీపించినచోఁ దన్ని పోవుదు నను భయమున దూరమున నుండియే వాఁడు మా చిన్న కలహముల నుపలక్షించి, నా యుద్ధకౌశల మావంతయు మెచ్చుకొనక, నా జయాపజయము లైన బాగుగఁ బరిశీలింపక, వాయువేగమున నింటికిఁ జని, మహాప్రసాద మని యా వార్త తలిదండ్రులకు నివేదించుచుండువాఁడు ! అంత మా నాయన యింట నుండినచో, నా కానాఁడేదియో మూఁడినదే ! శత్రుని పిడికిలి పోటులు శరీరమున శమింపకమున్నే, పండ్లు కొఱికి వచ్చెడి పితరుని తాడనపీడకు మరల నా దేహము తావలము గావలసినదే ! ఒక్కొకప్పుడు పలాయితు లగు శత్రుమిత్రులును నా వలెనే మా జనకుని యాగ్రహానలమున కాహుతి యగుచుందురు.

నా కానాఁడు లభించిన యొక సావాసుని గుఱించి యిట నొకింత ప్రస్తావింపక తీరదు. ఆతఁడు నాకంటె నైదాఱేండ్లు పెద్దయై, పొడుగుగ నుండెడివాఁడు. అ గ్రామనివాసియు ననుభవశాలియు నగు వానివాక్కులు నాకు వ్యాసప్రోక్తములు! నీట రాళ్లు రువ్వి కప్పగంతులు వేయించుట, కొయ్యతెరచాప లమర్చిన కాకియోడలను ప్రవాహమున కెదురుగ నడిపించుట, మా పెంపుడుకుక్కను రాజుగారి సీమకుక్కమీఁద కుసికొలిపి దానిని గఱిపించుట, - ఇవి నా కనులు మిఱిమిట్లు గొనునట్టుగ నా మహనీయుఁడు దినదినమును ప్రదర్శించెడి విచిత్రవ్యాయామములు! అట్టి మేటినాయకుని నూఁతగఁగొని, వాని యడుగుజాడలనే నడువఁబూనుటయం దేమి యాశ్చర్యము? నేను విశ్వసించెడి రామరావణులు వట్టి క్షుద్రు లనియు, వీరికి మిన్న యగి వేలుపు గలఁ డనియు నతఁడు సూచించి, నాచెవులు చిల్లులు పడునట్టుగ నతని పేరు "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుఁ" డని నుడివినపుడు, నే నెట్లు వానిని గౌరవింపకుందును? ఇతఁడు వేవేగమే నాకు మార్గప్రదర్శకుఁడును నయ్యెను! పొగచుట్టయొక్క ప్రాశస్త్య వర్ణన మాయనయొద్ద నేను విని, అద్దాని కర్మకాండవిషయమై యాతనియొద్దనే మంత్రోపదేశముఁ గైకొంటిని. అంత మూఁడుదినముల వఱకును నే నేమి తినినను త్రాగినను, వమనము చేసికొనుచు వచ్చితిని. ఇట్టికష్టముల కోర్చి పట్టువిడువక యలవాటు చేసికొనినచో, చుట్ట కాల్చుటయందు తనవలెనే నే నాఱితేఱి సుఖింతు నని యతఁడు నా కుద్బోధించెను. కాని నా యీ నూతనవిద్యారహస్యము, మా తమ్ముని వలన విని, మా తల్లి యానాఁడు త్రాటితోఁ గొట్టిన దెబ్బలు, అర్ధశతాబ్దము గడచినవెనుకఁగూడ నా వీపున చుఱ్ఱు మనుచునే యున్నవి. చుట్ట గాని, దాని చిన్ని చుట్టము లెవ్వి గాని పిమ్మట నెపుడును నా దరిచేరకుండుట యందలి రహస్యము, బాల్యమం దానాఁడు మా జనని ప్రయోగించిన దివ్యౌషధప్రభావమె యని నేను బలుమారు తలపోసితిని!

3. బంధువియోగము

గోపాలపురమున బాలభోగములందు లగ్న మానసుఁడనై నే నుండునపుడు, పిడుగువంటివార్త యొకటి మాకు వినవచ్చెను. మాపెద్దమేనమామ చామర్తి వెంకటరత్నముగారు కడచిన వేసవి తుది దినములందు కలపవర్తకమునకు భద్రాచలపరిసరములకుఁ బయనము గట్టెను. ఒకసాహుకారునొద్ద రాజమహేంద్రవరమున గుమాస్తాగా నుండి, అతనితో నిపుడు కలపవర్తకమున భాగస్వామియై యెక్కువగ డబ్బు సంపాదింపఁగోరి, బందుమిత్రులు వల దని వారించిను వినక మన్యప్రదేశముల కాయన ప్రయాణ మయ్యెను. కాని, గమ్యస్థానము చేరిన కొలఁదిదినములకే యాయన జ్వరపీడితుఁడై, ఉద్యమము విరమించుకొని యింటిమొగము పట్టెను. రాజమంద్రియందలి ఘనవైద్యు లెవరుగాని యాయనకు దేహస్వాస్థ్యముఁ గలిగింపనేరకుండిరి. ఇపు డాయన ప్రాణావశిష్టుఁ డయ్యె నని మాకు జాబు వచ్చెను. ఆ వానకాలమున మా తల్లిని మువ్వురు బిడ్డలను దీసికొని మానాయన పడవలో బయలుదేఱెను. అపుడే బొబ్బరలంకలాకు తెగిపోవుటచేత, ఈవలిపడవ లావలకుఁ బోవుటలేదు. మా తండ్రి మమ్మందఱిని యావలి పడవలో నెక్కించి, తాను వెనుకకు మరలెను. మిక్కిలి యలజడితో మే మంతట రాజమంద్రి చేరి, మా మేనమామ యదివఱ కొకటిరెండు దినములక్రిందటనే చనిపోయె నను దు:ఖవార్త వింటిమి. మా తల్లివిచారమునకు మేర లేకుండెను. మా మువ్వురు మేనమామలలోను ఈయనయే జ్యేష్ఠుఁడును ప్రయోజకుఁడును. కోప స్వభావుఁ డయ్యును, ఆయన కోమలహృదయము గల సత్పురుషుఁడు. చదువుకొనక దుస్సహవాసముల మరగి కాలము వ్యర్థపుచ్చెడి మా మూ డవ మేనమామయగు వెంకయ్యగారిమీఁదఁ గోపించునపు డెల్ల నేనును భీతిల్లుచుండినను, నన్నాయన గారాబముతోఁ జూచుచుండువాఁడు. మా తల్లితోఁ గలసి వెళ్లి రాజమంద్రిలో వారియింటనే నుండినరోజులలో, నన్నాయన పెద్దబజారున నుండు తన కొట్టునొద్దకుఁ గొనిపోయి, తనకు నాచేత మా తల్లి వ్రాయించిన యుత్తరములు పొరుగు వారలకుఁ జూపించి, నా విద్యాకౌశలమును వారికి వర్ణించి చెప్పుచు, ఎఱ్ఱనిపంచెలు చిలుకల రుమాళ్లును నాకుఁ గొనిపెట్టుచుండువాఁడు. సాయంకాల మాయన యింటికి వచ్చునపుడు పిల్లలమగు మాకు మిఠాయిపొట్లములు తెచ్చి యిచ్చుచుండును. శ్యామలదేహవర్ణముతోను, చంచలవిశాలనేత్రములతోను నొప్పుచుండి, ఆయన మా జననిని మిక్కిలి పోలియుండెను. ఆయన యకాలమరణము మమ్మందఱిని దు:ఖార్ణవమున ముంచివేసెను.

కొన్నిదినములు రాజమంద్రిలో నుండి పిమ్మట గోపాలపురము వెడలిపోయినమేము, ఐదాఱునెలలలోనే మరల నచ్చటికి రావలసి వచ్చెను. పుత్రశోకార్తుఁడైన మా మాతామహుఁడు మనోవ్యధచే శీఘ్రకాలములోనే మంచ మెక్కెను. మేము వచ్చినపుడు, ఆ వృద్ధుఁడు మాట పడిపోయి యుండినను, మా మాటలు వినునపుడు ఆయనకు స్పృహవచ్చెను. చిన్నపిల్లలమగు మమ్మును గౌఁగలించుకొని, కన్నుల నీరు విడిచెను. తన పేరిఁటివాఁడును, ప్రియపౌత్రుఁడును నగు మా తమ్ముఁడు వెంకటరామయ్య నాయన అక్కున నదిమినపుడు, దు:ఖోద్రేకమున నపుడే యాయనప్రాణము లెగిరిపోవు నని యందఱు భీతిల్లిరి. ఒకటిరెండుదినములలో మా తాత కాలగతి నొందఁగా, ఇంట నందఱును దు:ఖవిహ్వలులైరి. మా తాతగారు వేలివెన్నులో నివాస మేర్పఱచుకొని, క్రోశ దూరమందలి సత్యవాఁడ కనుదినమును కరిణీకఁపుఁ బనులమీఁదఁ బోవుచుండెడివారు. ఆయనకు చాప లల్లుట, విసనకఱ్ఱలు కట్టుట మొదలగు చిన్న పనులయం దాసక్తి. ఈ పనులు నెరవేర్చుచు, ఆయన నాకును మా పిన్నికిని పద్యపాఠములు చెప్పుచుండువాఁడు. పసివాఁ డగు మా తమ్ముఁడు వెంకటరామయ్యకును ఆయన దాశరధీశతకములోని పద్యములు నేర్పెను. ఇట్టి ప్రియబాంధవుని వియోగము మాకు కడు దుస్సహముగ నుండెను.

4. రేలంగి

నా యెనిమిదవయేట అనఁగా 1878 వ సంవత్సరమున, మా తండ్రి యుద్యోగము చాలించుకొని స్వస్థలమగు రేలంగి చేరెను. రేలంగి రెండేండ్లక్రితమువఱకును మేము నివసించిన గ్రామమైనను, ఇపు డది నాకన్నులకుఁ గ్రొత్తగ గానిపించెను. అచట మాపెద్ద పెత్తండ్రి గంగన్న గారిపుత్రికలు, పుత్రుఁడు వీరభద్రుఁడును నా కిపుడు సావాసు లైరి. వీరిలో పెద్దది యగు రత్నమ్మ నాకంటె పదియేండ్లు పెద్దదియై, తాను నేర్చిన "లంకాయాగము" రాత్రిపూట శ్రావ్యముగఁ బాడి, నా కానందము గలిపించుచుండును. నా కీరీతిని రామాయణ కథ విపులముగఁ దెలిసి, నా మనోవీథిని గొప్పయాశయములు పొడమెను. రెండవది యగు చిట్టెమ్మ నాకంటె కొంచెము పెద్దది యై, గ్రామమందలి మాయీడు బాలబాలికలతోడి యాటపాటలకు నన్నుఁ గొనిపోవుచు వచ్చెడిది. వీరభద్రుఁడు నా పెద్దతమ్మునికంటె కొంచెము పెద్దవాఁడై, వాని కీడుజోడై యుండెను. రాత్రి భోజనానంతరమున నొక్కకప్పుడు, మా పెదతండ్రిగారి కుటుంబమును మేమును నొకచోటఁ జేరి, తంపట పెట్టినతేగలో, ఆనపకాయలో తినుచు, ఉబుసుపోకకు లోకాభిరామాయణము చెప్పుకొనుచుందుము. మా పెత్తండ్రి మిగుల పొట్టిగను చూచుటకుఁ గొంత భయంకరముగను నుండినను, కుటుంబసంభాషణములం దమితచతురతను బ్రదర్శించుచుండువాఁడు. ఆయన హాస్యోక్తులు పిల్లలకు పెద్దలకును మిక్కిలి నవ్వు పుట్టించెడివి. మా కుటుంబపూర్వచరిత్ర మాయన కన్నులార చూచినట్టుగ వర్ణించి చెప్పుచుండువాఁడు. మా తండ్రి, తాను ఉద్యోగకార్యములలోఁ దిరిగిన వివిధాంధ్రమండలముల యాచారసమాచారములును, అచటి తన యనుభవములును వివరింపుచుండువాఁడు. పిల్లల మగు మాకుఁ దోఁచిన వ్యాఖ్యలు మేమును జేయుచుండెడివారము. సత్యకాలపు ముతైదువయగు మాపెత్తల్లి యచ్చమ్మ, ఏ వెఱ్ఱిమొఱ్ఱి ప్రశ్న వేసియో, చేతకాని పని చేయఁజూచియో, అందఱి పరియాచకములకుఁ బాత్ర యగుచుండును.

ఒకటి రెండు సంవత్సరములలో మా రెండవపెత్తండ్రి, మూడవపెత్తండ్రియు రేలంగి చేరిరి. వీరిలో మొదటివారగు వెంకటరత్నముగారు మాపూర్వుల నివాసస్థల మగు గోటేరులో నింతకాలము నుండి, యిపు డచట నొంటరిగ నుండలేక రేలంగి వచ్చిరి. ఉపాధ్యాయుఁడుగ నుండిన పద్మరాజుగారు తాను జిరకాలము నివసించిన దేవరపల్లి విడిచి, సోదరులతోఁ గలసి యుండుటకై రేలంగి ప్రవేశించెను. అందువలన పూర్వపుపెంకుటిల్లు మూఁడు చీలికలై మా మువ్వురు పెత్తండ్రులకు నిపుడు నివాసస్థల మయ్యెను. మా జనకుఁడు నిర్మించిన పర్ణకుటీరమున మేము కాపుర ముంటిమి. మా పెత్తండ్రులలో జ్యేష్ఠులగు గంగన్న గారితో పాఠకుల కిదివఱకే కొంత పరిచితి కలిగినది. ఆయన లౌక్యవ్యాపారములందును ముఖ్యముగ న్యాయసభలందలి వ్యాజ్యెములందును, ఎంతయో యభిరుచి గలిగి, వానియం దమితానుభవము నలవఱుచుకొని యుండెను. ఆప్రాంతమందలి మొఖాసాదారులగు క్షత్రియప్రముఖు లాయన యనుచరులు. ఆయన మంచి ధనార్జనపరుఁడు వెంకటరత్నముగారు గోటేరు మున్నగు గ్రామములందు రాజులపక్షమున కరణీకము చేయుచువచ్చెను గాని, ఆయన యభిమానవిద్య యాంధ్రసాహిత్యము. పద్మరాజుగారు చిరకాలము ఉపాధ్యాయుఁ డై యుండినను, ధన సంపాదనమున తన రెండవయన్నవలెనే కొంత వెనుకఁబడి, ఆయన వలెనే సాహిత్యవిషయములం దభిరుచి గలిగి యుండెను. మా తండ్రి పెద్దయన్నకుఁ గల లౌకిక కార్యదక్షతకును, ద్వితీయ తృతీయసోదరుల సాహితీపాండిత్యమునకును నోఁచుకొనక, బాల్యముననే సర్వేశాఖలో నుద్యోగము సంపాదించి, మధ్యమధ్య పని విరమించుకొని యిలు సేరుచుండినను, ఆశాఖలోనే మరలమరల నుద్యోగము చేయుచువచ్చెను. ఇట్లు వివిధమండలములం దాయన సంచారము చేసి సంపాదించిన సొమ్మును సమష్టికుటుంబ పోషణమునకై పెద్దయన్నకుఁ బంపించుచు వచ్చెను. గంగన్నగా రాద్రవ్యమును జాగ్రతపఱచుచు తణుకు తాలూకాలోని కొన్ని గ్రామములలో మంచిభూములు కుటుంబోపయోగార్థమై కొనఁగలిగిరి.

నా పదియవ సంవత్సరమున నేను రేలంగిలోని పాఠశాలలో నాంగ్లేయభాషాభ్యాస మారంభించితి నని జ్ఞప్తి. మా ప్రథానోపాధ్యాయుఁడు చామర్తి అన్నమరాజుగారు. ఆయన ప్రవేశపరీక్షవఱకును జదివినవారు. వేలుపూరులో నివాసమేర్పఱచుకొని, అనుదినమును వేకువనే రేలంగి నడిచి వచ్చి, పాఠశాల నడుపుచుండెడివారు. పెద్దతరగతులపాఠములు, ముఖ్యముగ నింగ్లీషుభాషయు, ఈయన బోధించుచుండెడివారు. రేలంగినివాసులగు కందిమళ్ల సుబ్బారాయుఁడుగారు సహాయోపాధ్యాయులు. వీరు ఖచితముగ నాంధ్రము గఱపుట యందును, శిష్యుల నదుపులో నుంచుటయందును ప్రసిద్ధి నొందిరి. ఉపాధ్యాయు లిరువురును సామాన్యముగ నొకరితో నొకరు సంప్రదించి సంభాషింప కుండెడి సఖ్యవిశేషమున నొప్పుచుండువారలు. ఆప్రదేశమందలి నా సహాధ్యాయులను గూర్చియు వారి చర్యలనుగుఱించియు కొంత చెప్పవలయును. దేశమున నింగ్లీషువిద్య యంత ప్రాచుర్యము కాని యాకాలమున, పాఠశాలలో నాంగ్లేయభాష నేర్చుచుండుటకే మిడిసిపడుచుండెడివారము. ఐనను, వేషభాషలందును, అభిరుచులందును మేము వట్టి జానపదులవలెనే సంచరించెడివారము. ఆటపాటలవిషయమున పట్టణములఁగల సౌకర్యములు మాకు లేకపోవుటవలన, ఉప్పట్లు, చెడుగుడి, దూళిబంతి, గూటీబిళ్ల మొదలగు ప్రాఁతయాటలనే మే మంటిపెట్టుకొని యుంటిమి. సెలవుదినములలో మే మొకచోటఁ జేరి, యుద్యోగస్థులవేషములు వేసి నాటకము లాడి, వినోదింతుము. ఒక్కొకతఱి పొలములోనికిఁ బోయి నేరెడుచెట్లెక్కి, నల్లనిపండ్లు కోసి, యింటినుండి తెచ్చినయుప్పు కారములపొడిలో నవి యద్ది భుజింతుము. మే మెంత జాగ్రతపడినను, నాలుక నల్లబడి గొంతుకు బొంగుపోయి, కొన్ని దినములవఱకును దగ్గుపడిసెములకు లోనై, మేము తలిదండ్రుల తిట్లకు తల లొగ్గుచుందుము. అప్పుడప్పుడు వీథులలో నాడెడి భాగవతము, జలక్రీడలు, తోలుబొమ్మలును, మా కమితాహ్లాదకరములుగ నుండి, కొన్నాళ్లవఱకును మా చిన్ని యాటల కొరవడు లగుచుండును. మా రెండవ పెదతండ్రికుమారుఁడు కృష్ణమూర్తి, తాటియాకులతో చిన్న బొమ్మలు చేసి, గుడ్డతెర మీఁద వాని నాడించుట మా చిన్నికన్నులకుఁ గడుచోద్యముగ నుండెను!

ఇపుడు నాకు 11 సంవత్సరముల వయస్సు. విద్యాభిరతియు స్నేహాభిలాషయు నాకు మిక్కుటముగ నున్నను, గృహకృత్యనిర్వహణ మనిన నేను బెడమొగము పెట్టువాఁడను కాను. మాతల్లి కడు బలహీనురాలు. కని పెంచెడి పిల్లల సంఖ్య పెరిఁగి కుటుంబభార మధికమైనకొలఁది, ఆమె నిస్సహాయత యినుమడించెను. శైశవదశలో నే నెంత వ్యాధిపీడితుఁడనై జననీజనకుల నలజడిపాలు చేసినను, నాలుగైదేండ్లు వచ్చినప్పటినుండియు శరీరసౌష్ఠవ మేర్పడి, నాయంతట నే నాఁడుకొనుచు వచ్చితి ననియు, తన కమిత సాహాయ్యము చేయుచు వచ్చితి ననియును మా యమ్మ మురియుచుండెడిది. ఆయిల్లా లంతగ గడుసుఁదన మెఱుఁగని పూర్వకాలపు స్త్రీ. కుటుంబనిర్వాహకమునందు తగిన జాగ్రత' లేకుండె నని మొదటిదినములలో మాతండ్రి యామెను బాధించుచుండెడివాఁడట. కాని, నాకు ప్రాజ్ఞత వచ్చినది మొద లాయన యిట్టికార్యములు కట్టిపెట్టవలసివచ్చెను. మా తల్లిని దూషణోక్తు లాడి హింసింపఁబూనునపుడు, నే నాయన తలకెగఁబ్రాకి, జుట్టుపట్టి వంచి, వీపుమీఁదఁ గొట్టుచుండెడి బాల్య దినములు నాకు బాగుగ జ్ఞాపకము. రేలంగి కాపురఁపు తుది దినములలో మాతల్లి సంతానము నలుగురు కుమారులు నొకకొమార్తెయు. మా జనని యొక్కతెయె యింటిపనులు జరుపుకొనవలసివచ్చెడిది. తల్లి కష్టము లూరక చూచుచుండనొల్లక, నే నామెకుఁ దోడుపడెడివాఁడను. పాఠశాలనుండి వచ్చినతోడనే, పుస్తకము లొకమూల వైచి, కాలు సేతులు గడిగికొని, ఏడ్చెడి శిశువు నెత్తికొని యాడించుచు, నే నామెకు సాయము చేయుచుండువాఁడను. ఆమె యింట లేనపుడు నేనే మడిగట్టి, నా వచ్చియురాని వంటతో సోదరులకు భోజనము సమకూర్చుచుందును. రాజమంద్రి వెళ్లనపిమ్మట పాఠశాలలోని చదువునకు నే నెక్కువ శ్రద్ధ వహింపవలసిన కాలమందును, ఇంటఁ దల్లికిఁ దోడుపడుట నా కార్యక్రమమున నంతర్భాగ మయ్యెను. దీనికి బంధువులు సహచరులు నన్నొక్కొకమాఱు గేలి చేసినను, జననీ సేవయు సోదరపరిపోషణమును నవమానకరమని తలంపక, విద్యా నిరతికిని గృహకృత్యనిర్వహణమునకును ఆవంతయు విరోధము లేదని బాగుగ గుర్తెఱిఁగి మెలఁగితిని.

5. దుష్కార్యము.

నేను 11 వ యేటఁ జేసిన యొక దుష్కార్యమువలన నామనస్సు మెరమెరలాడు చుండును. నాలుగవతరగతి పఠనీయపుస్తకములలోని "ఆసియాభూగోళము" నాకు లేదు. ఎన్ని సారులు కొను మని వేడినను మాతండ్రి యాపుస్తకము నాకుఁ గొనిపెట్టలేదు. మాసహపాఠులలో అచ్యుతరామయ్య యనువాఁడు కారణాంతరములచేతఁ జదువు మానివేసి, నాకుఁ దనపుస్తక మమ్మఁజూపెను. దానివెల నాలుగణాలు. తరువాత డబ్బిచ్చెద ననఁగా, నా కాతఁడు పుస్తక మిచ్చివేసెను.

ఆతఁ డెన్నిసారులు తన డబ్బడిగినను, నే నేదో మిష చెప్పి తప్పించుకొనువాఁడను. ఒకనాఁడతఁడు పాఠశాలకు వచ్చి, సొమ్మీయుమని గట్టిగ నడిగి, "నా పావులా యిచ్చువఱకును నీపుస్తకము లీయ" నని చెప్పి, నాపుస్తకములబొత్తి లాగివైచెను. పుస్తకములకై మే మిద్దఱము పెనఁగులాడినప్పుడు, అవి క్రిందఁ బడిపోయెను. అందఱిలో న న్నీతఁ డవమానము చేయుటకు నేను గోపించి, వాని మీఁదఁ గసి తీర్చుకొన నొక యుపాయము చేసితిని. నాఁడు ప్రొద్దున నే నడుగఁగా మాతండ్రి పుస్తకము ఖరీదు నా కిచ్చివేసె ననియు, అది యాతని కొసంగుటకై యొక పుస్తకములో నుంచితి ననియు, అచ్యుతరామయ్య నాపుస్తకములు చిందరవందరగఁ జేసినపు డాపావులా యెక్కడనో పడిపోయె ననియును నే నంటిని ! తనమూలముననే పావులా పోవుటవలన నాతఁడె నష్టపడవలె నని నావాదము. ఈ యొక పన్నుగడమూలమున రెండుపనులు సమకూరు నని నాయాలోచన, - ప్రాఁతయప్పు తీఱిపోవుట యొకటి, పరాభవము చేసినవానిమీఁదఁ బగ సాధించుట మఱియొకటి!

మొదట నేను బరియాచకమునకె యిట్లనుచుంటినని యచ్యుతరామయ్య తలంచెను. కాని, మొగము ముడిఁచి, మాటిమాటికి పుస్తకములో పావులా యుంచితి నని చెప్పుచుండుటచేత, నామాట లాతఁడును దగ్గఱవారును నమ్మి, నాపుస్తకములు పలుమాఱు తిరుగవేసి చూచిరి. క్రిందిదుమ్ములో వెదకిరి. ఎక్కడను పావులా కానఁబడ లేదు. పావులా నే నింటియొద్దనుండి తెచ్చుటయె నిజ మైనచో, తన మూలముననే యది పోయెను గావున, తానె యానష్టము వహింతునని యచ్యుతరామయ్య చెప్పివేసెను.

ఐన నింత సులభముగ నీయుదంతము సాంతము కాలేదు. ఆప్రొద్దున మాతండ్రి నాచేతికి పావులా యిచ్చివేసె నని స్పష్టపడవలెను. కావున నచ్యుతరామయ్య నన్ను బ్రమాణము చేయు మనెను. ఒక యబద్ధ మాడువాఁడు తనమాట నిలువఁబెట్టుకొనుటకు పెక్కు లసత్యములు పలుకవలెను. నే నపు డెన్ని యొట్టులో పెట్టుకొంటిని; ఎన్ని ప్రమాణములో చేసితిని ! నాయసత్యతములు పెరుగుచుండుటకు మనస్సున వెత నొందుచున్నను, డబ్బుమీఁదఁ గన్ను వేసి, అన్నమాట పోవునను భయమున, నే నెన్ని బాసలకును వెఱవలేదు! నా స్థిరత్వము నా సత్యవాదిత్వమున కమోఘనిదర్శన మని యచట నందఱును రూఢిచేసికొనిరి. ఈసిద్ధాంతమును స్థిరపఱచుట కింకొకసంగతియె కావలెను. అది మా తండ్రి సాక్ష్యము. కాని, దానినిగూర్చి నా కేమియు భయము లేదు. పిమ్మట నేను నెమ్మదిగ మానాయనతో మాటాడి లాభకరమగు నామాటను సమర్థించునటు లాయన నెటులో యొడఁ బఱుపఁగల నని నాయాశయము! కావున నే నీరుజువునకును సమ్మతించి ధైర్యమున నుంటిని.

కాకతాళన్యాయముగ మాతండ్రి యపుడె యాదారిని బోవుచుండెను. అచ్యుతరామయ్య యాయనను గలసికొని, తనపుస్తకపు బాకి నిప్పింపు డని మెల్లగ నడిగెను. ఒకటిరెండు రోజులలో తప్పక యిచ్చివేయుదు నని మానాయన పలికి, అచ్యుతరామయ్య ప్రశ్నింపఁగా, తా నాప్రొద్దున నాచేతికి డబ్బేమియు నీయలే దని చెప్పివేసెను!

పరిభవభారమున నాశిర మంత నేల కొరగిపోయెను! పిమ్మట నేనుగనఁబడినపు డెల్ల, అచ్యుతరామయ్య నన్ను దెప్పుచు, నాయొట్లు బాసలు నాకు జ్ఞప్తికిఁ దెచ్చి, నామనస్సునందలిపుండును రేఁపుచుండువాఁడు! కొంతకాలమువఱకును సహచరులమోములు చూచుటకు నేను సిగ్గుపడుచుండువాఁడను. జరిగిపోయినది మాపుట దుస్సాధ్య మైనను, ముం దిట్టిసత్యములకును మోసపుఁబనులకును బాల్పడనని మనోనిశ్చయము చేసికొంటిని!

6. రాజమహేంద్రవరము

రేలంగి పాఠశాలలోని మిక్కిలి పెద్దతరగతిపరీక్షలో జయమంది, నేనును మఱికొందఱు విద్యార్థులును మా ప్రథమోపాధ్యాయు వొద్ద ప్రత్యేకముగ నింగ్లీషు మూఁడవపాఠపుస్తకము చదువ నారంభించితిమి. ఇట్టి యసంపూర్ణ ప్రయత్నములవలన నంతగ లాభము లేదని గ్రహించి, మాతలిదండ్రులు మాయున్నతవిద్యాభివృద్ధికై మమ్ము రాజమంద్రి కొనిపోఁదలఁచిరి. మారెండవ పెత్తండ్రి పెద్దకొడుకు నాగరాజు, వయస్సున నాకంటె నైదారేండ్లు పెద్దవాఁడు, ఆంగ్ల విద్యనిమిత్తమై రాజంద్రి యంతకుమునుపే వెడలిపోయెను. దేశమంతయు తిరిగి, ఇంగ్లీషువిద్య నేర్చినవారికే యెల్లెడల నున్నతపదవులు లభించుట కనిపెట్టిన మాజనకుఁడు, మే మింక స్వగ్రామమున నుండుట ప్రయోజనకారి కా దనియు, కుటుంబమును పట్టణమునకుఁ జేర్చినచో మరల తనకుద్యోగసంపాదనమును మావిద్యాపరిపోషణమును గలుగు నని యెంచి, 1882 సం. జూలైనెలలో మమ్మందఱిని రాజమంద్రికిఁ గొనిపోయెను. ఇన్నిసుపేటలోని గొట్టుముక్కలవారి యింటిలోని మొదటిభాగము, పూర్వము మా మేనమామలు నివసించి యుండునది. మే మిప్పుడు నెల కొకరూపాయ యద్దెకుఁ బుచ్చుకొంటిమి. ఇప్పటివలె నింటిమీఁద నిల్లుండి, దోమలకును దుర్వాసనలకును తావలము గాక, ఆకాలమం దా పేట యుద్యానవనమువలెఁ జెన్నొందుచుండెను. మే మున్నయింటిపెరడు విశాలముగ నుండి, చూతనారికేళాది ఫలవృక్షముల కాకరమై, కొనసీమతోఁటవలెఁ జెలువారుచుండెను. పేటమధ్యమున పండ్లయంగడులు కాయగూరల దుకాణములు తదితర వస్తువిక్రయశాలలు నొప్పారుచుండెను. పెద్దవీధి కిరుకెలంకులందును పలురకముల పూలచెట్లు వెలసియుండెను. ఈదృశ్యములు మాచిన్ని కన్నుల కద్భుతామోదములు గొలుపుచు, స్వర్గలోక సౌదర్యముల స్ఫురింపఁజేయుచుండెను.

1882 వ సంవత్సరమున రాజమంద్రిలో "దేశాభిమాని పాఠశాలా"ధికారి సాహాయ్యమున వారిపాఠశాలలో ప్రవేశించి, ఆఱునెలలుమాత్రమే చదివి, ఆసంవత్సరాంతమున నేను వెంకటరామయ్యయును వరుసగా 3, 1 తరగతులపరీక్షల నిచ్చితిమి. మరుసటిసంవత్సరమున దానికంటె చేరువను క్రమముగ జరుగుచుండెడి "ఇన్నీసుపేట పాఠాశాల"లో మే మిరువురమును జేరితిమి. 1883 వ సంవత్సరాంతమున "తారతమ్యపరీక్ష"లోను, మరుసటి సంవత్సరమున "మాధ్యమికపరీక్ష"లోను, నేను గృతార్థుఁడ నైతిని. నావలెనే నాతమ్ముఁడును విద్యాభివృద్ధిఁ గాంచుచుండెను.

రాజమంద్రిలో మావిద్యావిషయమై మా జననీజనకులు పూనిన శ్రద్ధనుగుఱించి యొక్కింత ప్రస్తావింపవలెను. మా చదువుసాములు క్రమముగ నెరవేరుటకై మాతండ్రి మరల సర్వే యుద్యోగములోఁ జేరి సాధారణముగఁ బరదేశమున నుండెడివాఁడు. తా నెన్ని కడగండ్లుపడి యెట్టిశోధనలకు గుఱి యయ్యును, మా విద్యాభివృద్ధికిని కుటుంబ పరిపోషణమునకును వలయుధనము నాయన సముపార్జనము చేసి మాకుఁ బంపుచుండువాఁడు. ఈసొమ్ముతో మాతల్లి యిల్లు నడుపుచు, మాచదువులు సాగించుచువచ్చెను. తండ్రి యింట లేని బాలకులు, దుస్సహవాసముల మరగి, దుష్ప్రవర్తనలకు దిగి,కాలము దుర్వినియోగము చేసెద రను గట్టినమ్మకమున నామె, పాఠశాలకును బజారు వెచ్చములకును బోవునపుడు తప్ప తక్కినకాలమందు, మమ్ము గడపదాటనీయకుండెడిది! ఇది మాస్వేచ్ఛ కమితప్రతిబంధకమై కుఱ్ఱవాండ్రము సణుగుకొనుచుండెడివారము. మారెండవ పెద్దతండ్రి కుమాళ్లు, తలిదండ్రులను లెక్కసేయక, మాముందే స్వేచ్ఛావిహారములు సలుపుచుండుటకు మా కనులు మఱింత కుట్టెను.

గృహపాలనమున మాజనని పూనిన కఠినపద్ధతివలనఁ గొంత చెఱుపు కలిగె నని చెప్పక తప్పదు. తిరిగెడి కాలునకును చూచెడి కనులకును అడ్డంకి కలిగినచో, దేహమనశ్శక్తులు గిడసఁబారు ననవచ్చును. కూపస్థమండూకములవలె నిరతము నింటి నంటిపెట్టుకొనుటచే, తోడి బాలురకుండు గడుసుఁదనము లేక మేము లోకజ్ఞానవిషయమునఁ గొంతవఱకు వెనుకఁబడి యుంటిమి.

ఐనను, తల్లి యదుపులో నుండుటచే మొత్తముమీఁద మాకు మేలే చేకూరెను. ఆయిల్లాలిమాట జవదాటకుండుట వలననే, క్రొత్త ప్రదేశమందలి దుశ్శోధనములకును దురభ్యాసములకును మేము లోను గాకుండుటయు, మంచినియమములు కొన్ని మేము బాల్యమందె నేర్చుకొనుటయును సంభవించెను. రాజమంద్రి వచ్చిన క్రొత్తఱికమున మాతమ్ముఁడు వెంకటరామయ్య బడికిఁబోవుటయందుఁ గొంత కొంటె తన మగఁబఱచెను. ఇంటినుండి వాఁడు నాతో బయలుదేఱినను కొంతదూరము వచ్చినపిమ్మట మెల్లగ వెనుకఁబడి, ఏసందుగొందులలోనో దాగియుండి, నేను బడినుండి మరలి వచ్చు సమయమున ముందుగ నడుగు లిడి యిలు సేరుచుండును ! నావిద్యాధోరణినే యుండిన నే నీసంగతి కొన్ని దినములవఱకును గమనింపక, పిమ్మట వానిమీఁద ననుమానము కలిగి, వానితరగతివారి నడిగి వాని టక్కరితనము తెలిసికొని, ఈసమాచారము మాయమ్మ కొకనాఁడు చెప్పివేసితిని. అపు డామె పెరుగు చిలుకుచుండెను. మాతమ్ము నంతట ప్రశ్నించి, తగినసమాధానము వాఁ డీయ నేరకుండుటచేత, కవ్వపుఁ ద్రాటితో వాని నామె చిదుకఁగొట్టెను. నాఁటినుండియు మే మెవ్వరమును బొంకులకును బడిదొంగతనములకును బాల్పడువారము కాము !

మా పెదతండ్రికొడుకులు స్వయముగ ధనికుల నాశ్రయించి విద్యాసంపాదనము చేయుచుండుటకు సంతసించి, జననీజనకులు వారిజోలి కెపుడును బోకుండిరి. అందువలన నాపిల్లవాండ్రు, ఇచ్చవచ్చినపోకడలు పోయి, నాటకసమాజములఁ జేరి, తుదకు ఆయురారోగ్యములకే ముప్పు తెచ్చుకొనిరి. మమ్ముఁ జూచినపు డెల్ల లోకజ్ఞాన విషయమందు మేము వెనుకఁబడియుండుటకు వారు విచారించుచు, ఊరక మమ్ము నాటకములకుఁ గొనిపోవుదు మనియు, ఉత్సవాదులు చూపింతు మనియు జెప్పి మమ్ము శోధించుచువచ్చిరి. మేము వారివలలోఁ బడక, చీటికి మాటికిని వారు పలుకు చిన్నకల్లల కచ్చెరు వొందుచుందుము. అంత వ్యాధిగ్రస్థుఁడై ప్రవేశపరీక్ష తరగతిలోనే పెద్దవాఁడును, పిమ్మట కొంతకాలమునకు రెండవవాఁడును, అకాల మరణమువాతఁ బడిరి.

మాతల్లి మమ్ము రాత్రులు నాటకాదులకే కాక, పగలు చదువుకొనుటకు సావాసులయిండ్లకును బోనీయకుండును ! ఈకఠిన నియమము మాకును మిత్రులకును మొదట మిగులఁ గష్టముగఁ దోఁచినను, పిమ్మట నెంతో శ్రేయోదాయక మయ్యెను. స్వయంకృషిచేఁ జదువుకొనుటకు మాకు మహావకాశము లొదవెను. చదువుకొనునంత సేపును చదువుకొని, సోదరులము మాలో మేమే యాఁడుకొనుచుందుము. విద్యార్థుల కతిసూక్ష్మముగఁ బట్టుబడు బూతులు బాసలు నందువలన మాకు దూరీకృతము లయ్యెను. చదువుకొనుటకు మమ్ము రాత్రులు సహపాఠులయిండ్ల కెన్నఁడును ఆమె పోనీయదు. వారితోఁగలసి చదువుకొనుట మాకంతగ నావశ్యకమయ్యెనేని, వారినే మాయింటి కాహ్వానము చేయుఁ డని యామె చెప్పి, చదువుకొనుటకు మాకు సదుపాయములు గల్పించును. వారిమాటలు చేష్టలును బరిశీలించి, సుగుణ దుర్గుణములు గనిపెట్టి, దుస్సహవాసుల బారినుండి మమ్మామె తొలఁగించుచుండును.

ఎల్లకాలము మావిద్యాసౌశీల్య పరిపోషణకార్యమందు మా యమ్మ మఱు పెఱుంగని యిట్టితీక్ష్ణ జాగరూకతను జూపఁగలిగెనని నే జెప్పఁజాలను. సంతానము పెరిఁగి యోపిక తగ్గినకొలఁది, పిల్లల చదువుసాముల పెంపునుగూర్చి యామె వెనుకవలె శ్రద్ధ వహించుటకు సాధ్యపడలేదు. అద్దాని యావశ్యకమును పిమ్మట లేదయ్యెను. 1887 వ సంవత్సరమునుండి మాతండ్రి యుద్యోగము చాలించుకొని, సామాన్యముగ నింటనే విడిసియుండెను. నేనును నాతరువాతి వాఁడగు వెంకటరామయ్యయును, పెద్దతరగతులకు వచ్చు వఱకును మాయమ్మ మమ్ముఁ గనిపెట్టి కాపాడెను. చిరకాలాభ్యాసమున సోదరుల మిరువురమును సాధువర్తనము వీడక, విద్యయం దభివృద్ధి నొందుటయే, తక్కినవారికి మార్గప్రదర్శకమయ్యెను. బాల్యదశలో జనని యాజ్ఞానుసరణమువలెనే, యౌవనమున జనకుని ప్రేమానుభవమే మమ్ము న్యాయమార్గమును వీడకుండునట్లు చేసెను.

7. అల్లరిచేష్టలు

మాధ్యమికపరీక్షలో జయమంది నేను 1885 వ సంవత్సరరాంభమున నైదవ తరగతిలోఁ జేరితిని. నావలెనే యా పరీక్షలోఁ గృతార్థులై సంతోషమున మిన్నందు మిత్రబృందముతోఁ గలసి నేను వినోదించుచుండువాఁడను. మాకు గణిత ప్రకృతిశాస్త్ర ములు బోధించుటకు శర్మగారను నొక నూతనోపాధ్యాయుఁడు చెన్నపురినుండి వచ్చెను. ఆయన యెంతో బుద్ధికుశలతయు నుత్సాహమును గలవాఁడె కాని, శిష్యులయెడ కాఠిన్యముఁ బూనుచుండెడివాఁడు. మా చిన్న లోపములకుఁ బెద్దశిక్షల నొసఁగుచుండును. పాఠశాలలో నింకేయుపాధ్యాయుఁడు నిట్లు మమ్ముఁ బీడించువాఁడు కాఁడు. పట్టణమునుండి యేతెంచిన తాను తక్కిన యుపాధ్యాయులకంటె ప్రజ్ఞావంతుఁడ ననియు, పెద్దజీతకాడ ననియు శర్మ విఱ్ఱవీగుచుండువాఁడు. ఈతని తలబిరుసుతనమెటు లణఁగునా యని తక్కిన యుపాధ్యాయులు తలపోయుచుండిరి.

పదిమంది సహపాఠుల మంతఁ గూడి, పాఠశాలాధికారి కొక విజ్ఞాపనము వ్రాసికొంటిమి. శర్మచర్యలు శర్మచేష్టలును బేర్కొని, యీ నిరంకుశాధికారి యుపాధ్యాయత్వమునుండి మమ్ముఁ దప్పించి, పాఠశాల మంచిపేరు నిలుపుకొనుఁ డని మేము ప్రార్థించితిమి. కాని, యెన్నిదినములకును మామొఱ లాలకింపఁబడలేదు. మా 'యర్జీ బుట్టదాఖ' లయిన దని మే మంత తలపోసి, అధికారులకు మా సంగతి నచ్చఁజెప్పుటకై పాఠశాలకుఁ బోకుండ మేము సమ్మె గట్టితిమి ! పుస్తకములు చేతఁబట్టుకొని పాఠశాలకుఁ జేరువనుండు నొక సావాసునిగదిలో మేము చేరి, మాసమ్మెను గూర్చినమాటలతో దినమంతయుఁ గడపి, సాయంకాలమం దింటికిఁ బోవుచుండుట చేత, పెద్దవారలకు మాసమ్మెనుగూర్చి యంతగఁ దెలియలేదు. సహపాఠులంత మాగదిలోనికి వచ్చి, మమ్మునుగూర్చి శర్మ తరగతిలో బలికెడి కటువుపదములు, తక్కినయుపాధ్యాయుల సానుభూతివాక్యములును, మాకుఁ దెలుపుచుండువారు. మాసమ్మెమూలమున పట్టణమందలి విద్యార్థిలోకమున నెంతయో కలవరము గలిగెను. అందఱికంటె నా కెక్కువగా భావోద్రేకము గలిగెను. కొంతకాలముక్రిందట రాజమహేంద్రవరమునొద్ద గోదావరిలో పడవయొకటి మునిఁగిపోయి, జనులనేకులు చనిపోయిరి. ఆ విపత్తును గుఱించి యాంగ్లమున నే నొకపద్యమాల రచియించితిని. ఇపుడీ పాఠశాలలోని యుదంతమునుగుఱించికూడ నింగ్లీషున నొకగీతమాల కల్పించితిని. మాయాగ్రహమునకుఁ బాత్రుఁడైన యుపాధ్యాయుని చేష్టలు గుణములును బేర్కొని, పేరు మార్చి, దుర్గుణములు పెంచి, కథానాయకుని వర్ణించితిని !

ఎట్టకేలకు మావిజ్ఞాపనవిషయమును విమర్శించుటకై పాఠశాలాధికారి పార్షి శ్రీనివాసరావుగారు విద్యాశాలకు వచ్చిరి. పిలుపు రాఁగా, సమ్మెదారుల మందఱమును తరగతిలోఁ బ్రవేశించితిమి. మావృత్తాంతము వా రడుగఁగా, ఎవరికిఁ దోఁచినమాటలు వారము చెప్పివేసితిమి. నావాదమున నుత్ప్రేక్ష లుండుట నాకుఁ దెలియును. మా గురువు క్రూరుఁ డనియు, కఠినచిత్తుఁ డనియు, స్థిరపఱచుటయే నాయుద్దేశ్యము !

మాసాక్ష్యము విని, విజ్ఞాపనవిషయములు విమర్శించుచు, విద్యార్థు లిట్టిఫిర్యాదులలోను, తిరుగుబాటులలోను నుండుట కడు విచారకర మని యధికారి తలంచి, అర్జీ దారులనే దోషు లని నిర్ధారణ చేసిరి. మావాదమును బట్టి మాలో మిగుల పొడుగుగా నుండెడి వాఁడును, మిగుల పొట్టివాఁడును, మొనగాండ్రని యాయన పలికెను. పొడుగాటివాఁడు తణుకు చలపతి; పొట్టివాఁడను నేను. అంతట మే మాఱేసి బెత్తపు దెబ్బలు తింటిమి. కాని, యనతికాలములోనే శర్మగారు మదరాసు పయనము గట్టిరి ! ఇది జరిగిన చిరకాలమునకుఁ బిమ్మట శర్మగారును నేనును రైలులోఁగలసికొంటిమి. అపు డాయన మద్రాసులో న్యాయవాదిగను, నేను బెజవాడలో నుపాధ్యాయునిగను నుంటిమి. "మీప్రస్తుతానుభవమునుబట్టి మీచిన్న నాఁటిచర్య వట్టి యల్లరిచేష్ట యని మీరం గీకరింపరా?" యని యాయన యడిగినప్పుడు, మే మిరువురమును నవ్వుకొని లోకవిశేషములు మాటాడుకొంటిమి !

8. స్నేహ సహవాసములు

మేము రాజమంద్రి చేరిన కొంతకాలమునుండి 1887 వ సంవత్సరమువఱకును, అప్పుడప్పుడు ఏకొలఁదిమాసములో తప్ప తక్కినకాలమంతయును, మాతండ్రి యుద్యోగఁపుఁబనుల మీఁద విదేశమున నుండుచువచ్చెను. మా రెండవమేనమామ తఱచుగ రాజమంద్రి వచ్చి, బజారునుండి వస్తువులు కొని తెచ్చి మా కిచ్చి స్వగ్రామము వెడలిపోవుచుండువాఁడు. కావున సంసారము నడిపి మా చదువుసాములు సాగించు భార మంతయు మాతల్లిమీఁదనే పడెను. పిల్లలలో నెవరికైన జబ్బు చేసినయెడల, ఆమె రాత్రి నిద్దుర మాని కూర్చుండును. ఇరుగుపొరుగున దొంగలు పడినయెడల, రాత్రు లామెకు కునుకు పట్టనేపట్టదు ! ఇట్టిబాధలు 1884 వ సంవత్సరము వేసవికాలమున మిక్కుటమయ్యెను. రాజమంద్రి వేసవిగడుపుట కనువగు ప్రదేశము కానేకాదు. దీనికిఁ దోడుగ, ఆయేఁట నెండ లతిశయించి యుండెను. పట్టణమున మశూచి ప్రబలెను. మేము భయపడినట్టుగనే, స్ఫోటకదేవత శీఘ్రమే మాయింట పీఠము వేసికొనెను. నాకుఁ జిన్న నాఁటనే మశూచకము గానిపించెనఁట. వెంకటరామయ్య తప్ప తక్కినపిల్ల లందఱికి నిపుడు స్ఫోటకము సోఁకెను. పాటెక్కువయై కొందఱు మిగుల బాధపడిరి. రోఁతవిసువులు వీడి నేను దల్లితోపాటు పిల్లలకుఁ బరిచర్యలు చేసితిని. వెలివెన్ను పోయి మాయమ్మమ్మను పట్టణమునకుఁ గొనివచ్చితిని. దైవానుగ్రహమున పిల్ల లందఱును కాలక్రమమున నారోగ్యస్నానము చేసి సుఖముగ నుండిరి.

మే ముండునింటికిఁ జేరువ మమ్మెఱిఁగినవారును బంధువులును నంతగ లేనందున, 1885 వ సంవత్సరమున మా పెద్దతండ్రిగారును, ఇంకఁ గొందఱు కావలసినవారును నివసించెడి రాఘవయ్యగారి కొట్లలోనికి మేము వెడలిపోయితిమి. అందువలన నొంటరిగ నుండవలసిన కష్టము మాకుఁ గొంతవఱకుఁ దొలఁగిపోయెను.

ఆ సంవత్సరముననే మా సోదరులలో నాలుగవవాఁ డగు సాంబయ్యను మా మేనమామలు తమ గ్రామమునకుఁ దీసికొని పోఁగా, అచ్చట పొంగు చూపి వాఁడు చనిపోయెను. అందఱిలోను వాఁడు మిగుల నీరసుఁడు. ముద్దుమోమున నుండెడి యాబాలకుని మరణము మమ్మందఱిని దు:ఖాబ్ధిని ముంచివైచెను. ఇదివఱకు పుత్రశోక మెఱుఁగని మాతల్లి వెఱ్ఱిదు:ఖమున వేఁగెను. ఆ మఱుసటి సంవత్సరమున మా కుటుంబమున నిం కొకమరణము తటస్థించెను. మా రెండవ పెద్దతండ్రికుమారుఁడు, నాగరాజు, నావలెనే ప్రవేశపరీక్షకుఁ జదువుచుండెను. అతని కపుడు వ్యాధి యంకురించి, కొలఁదిదినములలోనె వానియసువులను గొనిపోయెను. పాప మాతఁడు విద్యాస్వీకారమునకై గంపెడాసతో రాజమంద్రి కేతెంచి, పడరానిపాట్లు పడి, విఫల మనోరథుఁడై, తుద కకాలమృత్యువువాతఁ బడెను ! కొలఁదికాలము క్రిందటనే యాతని భార్య కాపురమునకు వచ్చియుండెను.

జ్యేష్ఠపుత్రుని మరణమున కోపక, తీర్పరాని మనోవ్యధకు లోనైన మా పెదతండ్రి కంతట రాచకురుపు వేసి, 1887 వ సంవ త్సరారంభమున నాయనజీవములఁ గొనిపోయెను. అన్న వ్యాధిసమాచారమును సకాలమున నేను దెలుపకుండిన హేతువున, కన్నులార నాయనను గడసారి చూడలేకుంటి నని మాతండ్రి మిగుల వగచెను.

రాజమంద్రి పోయినది మొదలు ఉన్నతపాఠశాలలో నేను జదువు పూర్తిచేసిన యైదు సంవత్సరములలోను, నేను దమ్ములును బయటి సహవాసుల నంతగ నెఱుఁగమనియే చెప్పవచ్చును ! ఇంట మాతమ్ములు చెల్లెండ్రు, పాఠశాలలో సహపాఠులును, మా ముఖ్యసహవాసులు. నేను మాధ్యమికపరీక్షతరగతిలోఁ జదువునపుడు, అనఁగా 1884 వ సంవత్సరమున, మా తరగతిలోని నా పరిచితులలో కూనపులి కొండయ్యశాస్త్రి ముఖ్యుఁడు. తరగతిలోఁ దెలివి గలవారలలో శాస్త్రి యొకఁడు. అచిరకాలములోనే నే నీతనిని మించి మొదటివాఁడ నైతిని. అప్పటినుండియు నా కితఁడు సహవాసుఁ డయ్యెను. ప్రభుత్వమువారి మాధ్యమికపరీక్షలో మాపాఠశాలలో మొదటితరగతిని జయము నొందిన నలుగురిలో నే నొకఁడను. కొండయ్యశాస్త్రి మాత్రము మూఁడవతరగతి నైనఁ దేఱక, మరలమరల క్రింది తరగతియందే కాలము గడుపచుండెను. ఈతఁడు నావలెనే ఇన్నిసుపేటలో నివసించెడివాఁడు. సాయంకాలమునను, సెలవు దినములందును, శాస్త్రి మాయింటికి వచ్చి, నన్ను షికారునకుఁ గొనిపోవుచుండును. నా వెనుకటి సహపాఠియు, మొగమెఱిఁగిన విద్యార్థియు నగుటచేత, నే నాతని సావాసమున నుండుటకు మాతల్లి యభ్యంతరము పెట్టెడిది కాదు. లోకవిషయములు నాకుఁ దెలుపుచు, పాఠ్యగ్రంథములందు నిమగ్న మైన నామనస్సునకు, శాస్త్రి కొంత విరామము గలిగించుచుండువాఁడు. సాహిత్య విషయములందు తనకుఁగల యభిరుచి నాకును గలిపింప నితఁడు ప్రయత్నించుచుండువాఁడు. ఇతనిసం భాషణ మతిశయోక్తులతోఁ గూడియును, మొత్తముమీఁద జ్ఞానదాయకముగను సంతోషకరముగను నుండెడిది.

నా రెండవమిత్రుఁడు బంధకవి వెంకటరావు. రాజమంద్రిలో మొదటినుండియు నా కితఁడు సహాధ్యాయుఁడు. పరిస్థితుల వైపరీత్యమున నితఁ డిటీవల విద్యాభ్యాసమున నంతగ శ్రద్ధ వహింపకుండినను, తరగతిలోఁ దెలివిగలవారలలో నొకఁడు. నాతోఁ జెలిమిచేసి చదివినచో, తన కడగండ్లు కొంత మఱచిపోయి, తాను పరీక్షలో సులభముగ జయ మందఁగల నని యాతనియాశయము. అందువలన నీతఁడు నేనును మా యింటికిఁ జేరువ నొకగది పుచ్చుకొని, ప్రవేశపరీక్ష తరగతిలోఁ గొంతకాలము చదివితిమి. ఆసంవత్సరము వెంకటరావు పరీక్షలోఁ దప్పిపోయినను, నన్నుఁ బలుమారు గలిసికొనుచు, నాతో సుఖసంభాషణములు సలుపుచుండువాఁడు.

ఈ యిరువురు మిత్రులును నాకంటె వయస్సునఁ గొంత పెద్దలై, ఎక్కువ లోకానుభవము సంపాదించినవారలు. అంతకంతకు వారలను నేనును, నన్ను వారును విడువనొల్లని ప్రాణమిత్రులమైతిమి. వారలలో నొకరి కొకరికి మాత్రము సరిపడియెడిది కాదు! నన్నుగుఱించి వా రేకసమయమున వచ్చి యొకరి నొకరు కలిసికొనినపుడు, ఒకరి కొకరు ప్రేమభావము చూపక, వట్టి ముఖపరిచితులుగ మాత్రమే మెలంగుచువచ్చిరి ! ఇంతియ కాదు. నేను మూర్ఖుఁడనై, కన్నులు మూసికొని, వారలలో నొకని సహవాసము చేయుచుంటి నని రెండవవాఁడు కొన్ని సమయముల నన్నుఁ బరియాచకము చేయుచుండును ! స్థిరచిత్తుఁడు గాఁడనియు, నియమదూరుఁ డనియు నొకనినిగుఱించి యొకఁడు మొఱ పెట్టుచుండువాఁడు ! ఐనను నేను వారిలో నెవ్వనిఁగాని రెండవవానియొద్ద నిందింపక, నా మిత్రు లిద్దఱును సజ్జనులే యని నమ్ముచుండువాఁడను. నిజమునకు, మేము మువ్వురమును ఉదారాశయములతో నొప్పియుండియు, అనుభవలేశము లేని వట్టి విద్యార్థులమె ! మాలో నెవ్వనికిఁ గాని యింకను శీలబలము, చిత్తస్థైర్యము నేర్పడలేదు. ఐనను, కొలఁదికాలములోనే, పరిస్థితులప్రభావమున, మాయభిప్రాయము లందును, నీతినియమాదులందును గొంత దృఢత్వ మేర్పడెను. ఈసంగతి ముందలి ప్రకరణముల యందుఁ దేటపడఁగలదు.

9. కళాశాలలో ప్రథమవత్సరము

1887 వ సంవత్సరము జనవరినెలలో నేను రాజమంద్రియందలి ప్రభుత్వకళాశాలలో ప్రథమశాస్త్ర పరీక్షతరగతిలోఁ బ్రవేశించితిని. నా సహపాఠి ముఖ్యప్రాణరావు నేనును ఆమండలమున ప్రవేశ పరీక్షలో నుత్తీర్ణు లైనవారిలో ప్రథమతరగతియం దుండుటచేత, మా కిరువురకును విద్యార్థివేతన మీయఁబడెను. ముఖ్యప్రాణరావు కడచిన నాలుగు సంవత్సరముల నుండియు, మాపాఠశాలలోనే నా సహాధ్యాయుఁడు. ఆతనినమ్రతను, కుశాగ్రబుద్ధిని మెచ్చనివారు లేరు. విద్యాభ్యాసమే జీవితనియమముగఁ గైకొనిన విద్యార్థి యాతఁడు. పాఠము చదువక యాతఁడు బడికి వచ్చినరోజు గాని, అపజయమందిన పరీక్ష గాని, లేదనియె చెప్పవచ్చును. ఆతని జ్ఞాపకశక్తి యత్యద్భుతము. ఒకసారి చదివినతోడనే యాతని కెంత కఠినపాఠమైనను ముఖస్థమయ్యెడిది. కావుననే యతఁడు ప్రతితరగతియందును, ప్రతిపరీక్షయందును, ప్రథమస్థాన మలంకరించి యుండెడివాఁడు. అతనిని విద్యావిషయమున మించుట యటుండఁగా, సమీపించుట కైన నేసహపాఠికిని వలను గాకుండెను. ఆసంవత్సరము రాజమంద్రిలో ప్రవేశపరీక్ష యందు ప్రథమతరగతిలో జయ మందినది మే మిద్దఱమే. కాని, అతనికి నాకును పెక్కుస్థానముల యంతరము గలదని, యిప్పటివఱకును నాకు జ్ఞాపకము !

ముఖ్యప్రాణరావు బుద్ధివైశద్యమున నసమానుఁడని లోక మెఱుఁగును గాని, ఏ తద్విద్యాపరిశ్రమమునకై దేహారోగ్యమును యౌవనముననే ధారవోసిన దురదృష్టవంతుఁడని యెవరికిని దెలియదు. కళాశాలలో నొకవత్సరము చదువకమునుపే, ఆ సుకుమార శరీరుఁడు అనివార్యరోగపీడితుఁడై మృత్యువువాతఁ బడెను. వానితో సరిసమానమగు మేధాశక్తి గల రామయ్య యను మా యింకొకసహపాఠిని గూడ, ఆదినములలోనే మృత్యుదేవత తనపొట్టఁ బెట్టుకొనెను. ఈ యనుంగునేస్తుల యకాలమరణముఁ గాంచి నే నతివ్యాకులచిత్తుఁడ నైతిని. ప్రజ్ఞాన్వితు లగు నిట్టి ప్రియమిత్రులను బాసి, పాడువడిన యీపుడమిని దినములు గడుపుట దుస్సహముగఁ దోచెను.

ఇట్లు తోఁచినది నా కొక్కనికే కాదు. నా మిత్రవర్గమున నందఱు దుర్భరవిషాదమునకు లోనయిరి. నన్నుఁ బొడగాంచిన సహవాసులు, "రామయ్యముఖ్యప్రాణుల సంగతి చూచితివిగదా. నీరసస్థితిలో నున్న నీ వారోగ్యమును గాపాడుకొననిచో, వారివలనే చేటు తెచ్చుకొనెదవుసుమీ !" యని యాత్రమున నన్ను హెచ్చరించుచుండువారు. నిజముగ, కళాశాలఁ జేరిననాఁటనుండియును దేహమున నాకు సపిగా లేదు. ఉష్ణాధికతచేతను, పైత్యప్రకోపమువలనను, తఱచుగ నాకుఁ దలనొప్పులు వచ్చుచుండును. ఉన్నటులుండి యాకస్మికముగఁ గనులు చీఁకటులు గ్రమ్మును. లోక మంతయు దిర్ధిరఁ దిరుగునట్లు దోఁచును. తోడనే తలనొప్పి తలచూపి, దిన మంతయు నన్ను వేధించును. కడుపులో వికారముగ నుండును. ఇవి యన్నియు ధాతుదౌర్బ ల్యలక్షణము లని వైద్యులు చెప్పెడివారు. నాయీడునఁ దాను నిట్టిబాధలకు లోనైతి నని మాయమ్మ చెప్పెడి మాటలు, నా కోదార్పుగలిగించుటకు మాఱుగ, మఱింత భీతిని బెంచుచుండెను ! స్వాభావికముగనే నేను దుర్బలశరీరుఁడను. ఆసమయమున నాకుఁ గొంచెము శరీరాస్వస్థత యేర్పడెననుట సత్యము. కాని, మాటి మాటికి నేను మననము చేయుచుండుటచేతను, చెలికాండ్రు సదా స్ఫురింపఁజేయు చుండుట వలనను, నా నీరసము గోరంతలు కొండంత లయ్యెను ! కావున, తగిన జాగ్రతతో నౌషధసేవ చేయక వ్యాధిని ముదురఁబెట్టినచో, నాకును మిత్రులు రామయ్య ముఖ్యప్రాణుల గతియే నిజముగఁ గలుగు నని నమ్మి నేను భీతిల్లితిని.

ఇట్లు భయమున వెతనొందెడి నాచికిత్సకై 1887 వ సంవత్సరమున మాతండ్రి పడిన శ్రమకు మేఱ లేదు. రాజమహేంద్రవరమునఁగల వైద్యశిఖామణులయొద్దకు నన్నాయన కొనిపోయి, నా చేయి చూపించి, యాలోచన లడుగుచుండువాఁడు. నానిమిత్త మాయన గ్రహింపని కూరగాయవైద్యములు, తెలిసికొనని 'గోసాయిచిటికలు'ను లే వని చెప్పవచ్చును. ఐన నేను సేవించిన యౌషధముల వలన నా కించుకంతయు లాభము సమకూరదయ్యెను.

ఎట్టకేలకు కళాశాలయందు మొదటివత్సరము గడచిపోయెను. సంవత్సరపరీక్షలో ప్రథమస్థానమున నుత్తీర్ణ మగుట యేవిద్యార్థికైన హర్ష దాయకముగ నుండును గాని, నామనస్సు నది మఱింత విచారతోయముల ముంచివై చెను ! నా యీకడపటి విజయమే కడపటి విజయముగఁ బరిణమించు నేమోగదా ! ఇపుడైన నేను మృత్యు ముఖమునుండి తప్పించుకొనుటకై యారోగ్యాన్వేషణము చేయవలదా ? నామిత్రుఁడు వెంకటరావు ప్రవేశపరీక్షలో నపజయము గాంచి, తాను ముందు కళాశాలలోఁ జేరునప్పటికిఁ దనసహపాఠులుగ ప్రాతఁనేస్తు లెవ్వ రుందురా యని చూచుచుండెను. నే నిపు డాతనిఁ గలసికొనఁగా, "ఒరే, నీ వొకయేడు చదువు మానివేయరా. దానితో అన్ని జబ్బులును చక్కబడతవి !" అని యతఁడు పలికెను. ఈతని యాలోచన కేవల పరోపకారబుద్ధిచే జనించినది కాదుగదా !

తలిదండ్రులతో నెమ్మదిగ నాలోచింపక, వారలకు నాయుద్దేశమైన సూచింపక, నేను కళాశాలాధ్యక్షునియొద్దకు రివ్వునఁ జని, నా విపరీతవ్యాధివృత్తాంత మెఱిఁగించి, ఒక వత్సరము విద్య విరమింప ననుజ్ఞ వేడితిని ! మెట్కాపుదొరకు నాయం దమితానురాగము. నాముఖ మంతఁగ రోగకళంకితము గాదని పలికి, మండలవైద్యాధికారికి 'సిఫార్సు' చేసి నాకు మంచిమందిప్పించెద నని యాయన ధైర్యము చెప్పెను. ప్రాత:స్నానములు, శీతలోపచారములును జేసిన సులువుగ నాకుఁ బునరారోగ్యము గలుగు నని యాయన యూరడించెను. కాని, ఆయన హితబోధనము లెంతసేపటికిని నాతల కెక్క లేదు. అంతట ఆయన, "అట్లైన మంచిది. నీ వొక సంవత్సరము హాయిగఁ దిరిగి, శరీరము నెమ్మదిపడి రా. మరల నాసాయమున విద్యాభివృద్ధి గాంతువులే !" అనువచనములతో నావీపు తట్టి, కళాశాలనుండి నాకు వీడ్కో లొసంగెను.

10. స్వైరవిహారము

నిజ మారసినచో, నాశరీర మంతగ వ్యాధిపీడితము గాకుండినను, విరామము లేని చదువనిన నేను విసిగి వేసారితి నని తేలక మానదు. ఒకసంవత్సరము కాలు సాగునట్లు నేను సంచారము చేసినచో, దేహమున కారోగ్యము, మనస్సునకు నెమ్మదియుఁ జేకూరఁగల వని నే నాశించితిని. జరుగుచదువున కంతరాయము గలుగుట తలిదండ్రులకు మొదట దుస్సహ మైనను, అచిరకాలముననే నే నారోగ్యవంతుఁడనై, వచ్చిననష్టమును వేగమె కూడఁదీయఁగలనని వారు నమ్మియుండిరి. 1888 వ సంవత్సరము ఫిబ్రవరి 18 వ తేదీని నేను కళాశాల మానుకొంటిని. ఆనెల 22 వ తేదీని మమ్ముఁ జూచి పోవచ్చిన మా రెండవ మేనమామతో, నన్ను వారి గ్రామ మంపి, అచట నాకు సదుపాయములు చేయింపు మని మాయమ్మ తనతమ్ముని మఱిమఱి వేడెను. అంతఁ గొంతకాలము నే నాగ్రామమున నివసించితిని. ఆదినములలో వేలివె న్ననిన మేము ఉవ్విళ్లూరుచుండెడి వారము. అది మాసోదరులలో మువ్వురికి జన్మస్థానము. మా ముత్తవ తల్లి, మేనమామలు మున్నగు బంధువర్గము నివసించు ప్రదేశము. పట్టణము విడిచి పల్లెయం దుండుట మొదట కొన్నిదినములవఱకు నాకుఁ గడు సంతోషముగ నుండినను, వేవేగమె గ్రామనివాసము నాకు మొగముమొత్తెను. ప్రాతస్సాయంకాలములందు నేను కాలువ గట్టుమీఁద విహారము సలుపుచుండువాఁడను. కాని, తక్కినకాలము గడచు టెట్లు ? పట్టణమందలి స్నేహసహవాసములు, వార్తాపత్రికలు, బహిరంగసభలు, ఇక్క డెట్లు సమకూరును ? అహర్నిశమును నాతో నుండు తమ్ములు చెల్లెండ్రు నిచట లేరుగదా ! పీల్చుటకు నిర్మలవాయువు, త్రావుటకు శుద్ధోదకము మున్నగునవి వలసినంత యిచట నుండుట వాస్తవమె. కాని, సుఖించునది మనస్సును విడిచిన శరీరముకాదు గదా ! కుగ్రామనివాసముమీఁద విసువుఁ జెందినపుడెల్ల నేను పట్టణము వచ్చి, తలిదండ్రులను సోదరీసోదరులను జూచి పోవుచుంటిని. తోడి విద్యార్థి యువకులు కళాశాలయందు విద్యాభివృద్ధి నొందుచుండఁగా, ఆరోగ్యాన్వేషణమునకనియును, హాయి ననుభవింతుననియును, నేను బడి యెగవైచి, పల్లెటూళ్ల యందు వ్యర్థ కాలక్షేపము చేయుచుంటి నని నే నంత గ్రహించి విచారించితిని. స్వయంకృతాపరాధమునకు పరిహార మేమి గలదు ? నాపూర్వ సహపాఠి యగు పాపయ్యశాస్త్రి సహవాసము మరగి, రాజమంద్రిలో నపుడపుడు నేను దినములు వెళ్లఁబుచ్చుచుండువాఁడను. స్వస్థలమగు కోనసీమకుఁ దాను బోయెద ననియు, వలసినచో నన్నుఁ గొనిపోయి యందలి దర్శనీయములగు తావులు చూపింతు ననియు నాతఁ డొకనాఁడు నాతో ననెను. ఇపుడు నేను గోరుచుండినదే యిట్టిమార్పు. మార్గమందు మా మేనత్తగారి నివాసస్థల మగు అమలాపురము ఉండుటచేత, అచటికిఁ బోయి నేను కొన్నిరోజులు నివసించుటకు మా తలిదండ్రులు సమ్మతించిరి. అంత 19 వ ఏప్రిలున సహచర సమేతముగ నేను బ్రయాణ మైతిని.

అప్పటి కప్పుడె అమలాపురపు కాలువ కట్టివేయుటచే, మేము ధవళేశ్వరము పోయి, అచటినుండి పడవపయనము చేసి, మఱునాఁడు దాక్షారామము చేరితిమి. శ్రీనాధుని "భీమఖండము" నేను జదువకున్నను, ఆంధ్రకావ్యములందు మక్కువగలిగి, నాతో "విజయవిలాస" "పారిజాతాపహరణము" లు గొనిపోయితిని. ప్రయాణమున నా కివియె నిత్యపారాయణగ్రంథము లయ్యెను. కాని, నాచెలికాఁడు రసజ్ఞత లేని రసికుఁడు. నూతనప్రదేశముల రామణీయకమును, ప్రాచీనదేవాలయముల పూర్వవాసనలును నా మనసు నమితముగ నాకర్షించెను. అచటనుండి కోటిపల్లి, ముక్తేశ్వరము మున్నగు క్షేత్రములు దర్శించి, 21 వ తేదీని మేము అమలాపురము చేరితిమి.

ఆపట్టణమున కనతిదూరమందలి యీదరపల్లి మా మేనత్తగారినివాసస్థలము. కొన్ని దినములవఱకును వారియిల్లు నావిడిది యయ్యెను. నామిత్రుఁడు అమలాపురమున బసచేసి, నన్నుఁ జూచుట కీగ్రామము వచ్చుచుండువాఁడు. నా కిచ్చట సావాసులు లేని లోపము లేదు గాని, సత్సాంగత్యమె సమకూరకుండెను. నా సహచరుఁడు ప్రవేశపరీక్షలోఁ దప్పుచుండెడి ప్రాఁతకాలపు విద్యార్థి. చప్పనిపాఠ్యపుస్తకములచవియె కాని, సాహిత్యగ్రంథరుచి యాతఁ డెఱుఁగడు ! ప్రకృతియందలి సుందరదృశ్యములు, గానకళాదుల రామణీయకమును, వానికి హృదయాకర్షక విషయములు గావు. స్నేహపాత్రతాదిగుణములు కొన్ని గలిగియుండియును, ఈతఁడు, అనుభవరహితులగు నాబోటిచిన్న వారల కాదర్శప్రాయుఁడగు సుశీలుఁడుగాఁడు. నీళ్లు నమల నేల ? నామమాత్రావశిష్టుఁడగు బ్రహ్మచారియె యీతఁడు ! రచ్చ కెక్కిన జారుఁడు గాకున్నను, శీలసౌష్ఠవము గోలుపోయి, తనప్రకృతలోపములకు, తనయేకాకిత్వమును విషమపరిస్థితులను ముడివెట్టి మనసు సరిపెట్టుకొనినసరసుఁడు ! ఇట్టియువకుల వలపుపలుకలు, రసికత్వపుఁబోకడలును లోకానుభవము లేని పసివారలకు విపరీతకామోద్రేకము గలిగింపఁజాలియుండును. ఈతని సహవాస సంభాషణములు నా భావపవిత్రతకు భంగము గలిగించి, నీతినియమములను నీటఁ గలుపుటకు సంసిద్ధము లయ్యె నని నే నపుడు గ్రహించితిని !

8 వ మెయితేదీని కోనసీమసంచారము ముగించి, రాజమంద్రి చేరితిమి. మా తలిదండ్రులకు నా నేస్తకానిని గుఱించిన నిజము తెలిసిన యెడల, ఆగ్రహమున వారు నన్ను మ్రింగివేసియుందురు ! ఐన నీసహవాసుని దురాకర్షణ మహిమమునను, అతని దుష్ప్రసంగశ్రవణాసక్తి చేతను, ఇంకఁ గొంతకాలము నేను వానినే యంటిపెట్టుకొని యుంటిని. నాచిత్తపారిశుద్ధ్యమునకుఁ గలిగిన చెఱుపు, క్రియారూపముగఁ బరిణ మించి, కూఁకటి వేళ్ల వఱకును శీలమున వ్యాపించెడిదియె. కాని, దైవానుగ్రహమునను, చిరకాలాభ్యస్త సన్ని యమప్రభావమునను, ఇతరస్నేహితుల సహవాసభాగ్యమునను, ఆచెడుగంతటితో నిలిచిపోయె నని నాకు స్పష్టపడెను !

కళాశాలావిద్యాభ్యాస మిఁకఁ గట్టిపెట్టి, వృత్తిస్వీకారమున కనుకూలించుచదువు చదువుటకు నేను న్యాయశాస్త్ర పుస్తకములు కొన్ని కొని ముందువేసికొని కొన్ని దినములు కూర్చుంటిని. కాని, నామనస్సున కవి వెగటయ్యెను. ఇంతలో పూర్వపరిచితుఁ డొకఁడు ధవళేశ్వరమునఁ దాను జరుపు మాధ్యమికపాఠశాలలో నొకనెల నన్ను ప్రథమోపాధ్యాయుఁడుగ నుండు మని కోరఁగా, వేతనము స్వల్ప మైనను, నే నందుల కియ్యకొంటిని. నా కీయవలసినజీతమైన నాతఁడు సరిగా నీయకుండినను, నేనొకమాసము ఉపాధ్యాయపదవి నుండి, శిష్యుల యనురాగము వడసి, మనస్సునకుఁ గొంత వ్యాపృతి గలిపించుకొంటిని. ఇంకొకనెల యొకవిద్యార్థికిఁ జదువు చెప్పితిని. ఇట్లు, విద్యాశాలను వీడినఁగాని పరిపూర్ణారోగ్యసౌఖ్య మందఁజాల నని యెంచి, చదువునకు స్వస్తి చెప్పి, తుదకు మొదటికే మోసము తెచ్చుకొనసిద్ధపడి, ఎటులో తప్పించుకొని తెఱపినిబడి, పరిపూర్ణారోగ్యభాగ్య మందుటకు చదువు సాగించుకొనుటయె మంచిసాధన మని నిర్ధారణచేసికొని, నేను, 1889 వ సంవత్సరారంభమున మరల కళాశాల చేర నుద్యమించితిని.

11. పునర్విమర్శనము

1889 వ సంవత్సర దినచర్య పుస్తకాంతమున నాజీవితములో నది యుత్తమదశ యని లిఖియించితిని. దీనియందుఁ గొంత సత్యము లేకపోలేదు. గతవత్సరమున నాశీలము కలుష భూయిష్ఠమై, కష్టశోధనలకు గుఱి యయ్యెను. నన్ను గాసిపెట్టిన దేహ మనశ్శత్రు వులమీఁద నిపుడు సంపూర్ణ విజయము సంపాదింప సమకట్టితిని. నా యాత్మరామాయణమున నారణ్యకాండకథ సంపూర్తి కాఁగా, యుద్ధకాండవిధాన మంత నారంభమయ్యెను !

భూతకాల కార్యకారణపరిశీలనమున నొకప్పుడు మన కనులు చెదరిపోవుచుండును. మన దుర్గుణదురభ్యాసములను బరులసహవాసమున కారోపించువిషయమున మన మప్రమత్తత నూనవలెను. దుష్టులనియెడి యొక ప్రత్యేకస్థాయిసంఘ మెందును లేదు ! నేఁటి కోరికలు రేపు క్రియ లగుచున్నవి. నిజ దుస్సంకల్పములను కార్యగతము చేయఁగోరి, తదనుగుణ్యమగు సహవాసము చేసి, మన శీలమున కపు డాపాదించిన నైతికకళంకమును మనము సహచరులమీఁదఁ బడవేయుచుందుము ! ఇట్లు చేయుట న్యాయసత్యములకు దూర మైనను, మన యహంభావమున కమితశమనము గలిగించుచుండును. పరస్పరసఖ్యమున సంక్రమించు సుగుణదుర్గుణములకు నుభయ సహవాసులును సమానభాగస్వాములె. పరులచెలిమివలనఁ దమశీలసౌష్ఠవము చెడె నని మొఱలిడువారు, తమసావాసమున నితరుల కటులె చెడుగు సోఁకియుండు ననియును తమ దుశ్చింతలె పరులమనములందు దుష్టబీజములను వెదజల్లి నారు పెంచియుండవచ్చు ననియును జ్ఞప్తి నుంచుకొనవలెను. "మనబంగారము మంచిదైన కమసాలి యేమి చేయును ?" అను సామెత నీసందర్భమున మఱవఁగూడదు. పరుల దుస్సహవాసమున మనము చెడితి మనుకొనుటకంటె, మన దురుద్దేశములె తోడి దుశ్శీలురను తోడితెచ్చె ననుటలోనె సత్యసారస్యము లెక్కువగఁ గలవు. ఇట్లు తలపోయుట, మానసబోధ గలిగి ఆత్మపరిపాక మందుటకు సహకారముకూడ నగును. అట్లు తలంపకుండుట, నొప్పి యొకచోట నుండఁగా, వాఁత వేఱొకచోటఁ బెట్టిన ట్లగును ! ఇదిగాక, నాతో కోనసీమకు వచ్చిన మిత్రుఁ డొక్కఁడే 1888 వ సంవత్సరమున నాకు సావాసుఁ డనియు, ఇతరస్నేహితు లందఱు నాశ్రేయస్సును గోరిన విశుద్ధప్రవర్తను లయ్యును ఆతరుణమున నాకు దూరస్థు లైరనియును, జెప్ప వలనుపడదు. అపుడును శాస్త్రి వెంకటరావు లిరువురును నాయాంతరంగిక మిత్రులె. పాపయ్యశాస్త్రితోకంటె వారితోనే నాకుఁ బ్రకృతమునను జనవెక్కువ. వారి. సంభాషణములుగూడ వొక్కొకతఱి కామోద్రేక జనకములుగ నుండెడివి. ఆకాలపు విద్యార్థులును "కొక్కోకము", "లండను నగరరహస్యములు" మున్నగు నిషిద్ధపుస్తకపఠనము చేయుటకు వెనుదీయకుండెడివారలె.

ఆసంవత్సరమున నాశీలమునకుఁ గలిగినశోధన, అవాంతరముగ నాపాదించిన యనర్థ మని చెప్ప వలనుపడదు. ఏండ్లకొలఁది జననీజనకులయదుపులో నుండి, సంతతవిద్యాభ్యాసమున కలవాటుపడి, యౌవనప్రాదుర్భావమున నిపు డొకసారిగ స్వేచ్ఛావిహారమును జని చూచిన యొకయువకుఁడు, దినములకొలఁది కట్టుఁగొయ్యనఁ బడియుండి మెడకొలికి సడలినపశువువలెఁ జెంగుచెంగునఁ బరువులిడుచు, మితిమీఱిన స్వచ్ఛందవర్తనమున మెలంగ నపేక్షించుట స్వాభావికమె. సంకల్పరూపమున నిదివఱ కణఁగియుండిన వాంఛా బీజములు, ఇపు డవకాశము దొరకినకారణమున మొలకలెత్తి విజృంభింపసాగును. దీని కొకరి ననవలసినపని లేదు. ఇట్టిపరిస్థితులలో పరులదుస్సహవాసము కేవల నిమిత్తమాత్రమె. కఠినశోధనల కెల్ల వేరు విత్తగు నాంతరంగిక దుస్సంకల్పముల నరికట్టలేక, పాపభారమును పరులబుజములమీఁదఁ బడవేయుట, ఇంటిదొంగను విడిచిపెట్టి బైటిదొంగకై పరుగులిడుటవలె నుండును ! ఈసందర్భమున నింకొకసంగతికూడ గమనింపవలెను. లోకమున బాహాటముగ నలుగురిలోఁ దిరుగ నారంభించినపుడె, మానవ శీలము వికాసము నొందఁగలదు. వివిధపరిస్థితులశోధనకు లోనగునపుడె, మనప్రవర్తన దృఢపడుట కవకాశ మేర్పడును. నీరు చొరని యీఁత దుస్సాధ్యము. లోఁతునీటఁ బడి మున్కలు వేసి కాలుసేతులు కొట్టి తేలి తప్పించుకొనునపుడె యీఁతలోఁ బ్రవీణుల మయ్యెదము. నీతినియమములు లోకానుభవపుఁదాఁకుడునకు నిలిచి గట్టిపడినపుడె శీలసౌష్ఠవముగఁ బరిణమింపఁగలవు.

శూన్యము ప్రకృతివిరుద్ధ మని యాంగ్లలోకోక్తి. తగినంత వ్యాపృతి యుండినఁగాని మనస్సునకు స్వాస్థ్యసౌఖ్యము లనుభావ్యములు గావు. సంపూర్ణస్వేచ్ఛయు, స్వచ్ఛందగమనమును చేతస్సున కానందదాయకము లనుకొనుట వట్టివెఱ్ఱి ! ఏదో యొకసత్పధము త్రొక్కి, కార్యనిమగ్నత నొందునపుడె, మనస్సునకు నిజమగు హాయియు నెమ్మదియుఁ జేకూరఁగలవు. కార్యభరమున నుండువ్యక్తి నుండియె పాపచింతనలు పలాయిత మగుచుండును. ఇదియె యీలోకమున శాంతిసౌఖ్యములకుఁ గొనిపోవు ఘంటాపథము. తక్కినవి పెడదారులు, ముండ్లత్రోవలును.

గతసంవత్సరవిశ్రాంతివలన తల బొప్పిగట్టి, 1889 వ సంవత్సరారంభమున కళాశాలాశాంతిభవనమునే మరల నేను శరణుఁ జొచ్చితిని. శరీరమును రోగమునుండియు, మనస్సు నొడిదుడుకులనుండియుఁ దప్పించుకొనుటకుఁ బరిపూర్ణవిశ్రాంతి సాధనము గా దనియు, నియమపూర్వకవిద్యాభ్యాసము, నియమబద్ధజీవితమును పరమసాధనము లనియు నే నిపుడు గనుగొంటిని.

12. చర్వితచర్వణము

నా పూర్వగురువులగు మల్లాదివెంకటరత్నముగారిని గతసంవత్సరమున నపుడపుడు కలసికొనుచు, నా యారోగ్యమునుగుఱించి యాలోచనలు గైకొనుచువచ్చితిని. ప్రాత:కాలవ్యాయామము, శీతలోదక స్నానము, గోక్షీరపానమును, ఆరోగ్యప్రదము లని యాయన బోధించెను. ఆ డిశంబరు 26 వ తేదీని మా మామగారిసాయమున బొమ్మూరులో నొకయావును కొంటిమి. అది పూట కొకసేరు చిక్కని కమ్మని పా లిచ్చుచుండెడిది. స్నానపానాది దినకృత్యములు క్రమముగ జరుపుకొనుచు, 89 వ సంవత్సరారంభము నుండియు నేను మరల విద్యాభిముఖుఁడ నైతిని. జనవరిమూఁడవతేదీని నేను పుస్తకములు సవరించుకొని, చదువుసన్నాహము చేసితిని. ఇదివఱకే ప్రథమతరగతి పరీక్ష నిచ్చితిని గాన, జనవరి 21 వ తేదీనుండి రెండవ తరగతిలోనికిఁ బోయి కూర్చుండుచువచ్చితిని, గణితశాస్త్రాధ్యాపకులగు తంజావూరు సుబ్బారావు పంతులుగారు శిష్యులను పరియాచకము చేయు నభ్యాసము గలవారు. ఆయన నామీఁద ధ్వజ మెత్తినట్టు నా కిపు డగఁబడెను ! ఇదివఱకు విచ్చలవిడిగా వీధులఁ గ్రుమ్మరుచుంటిననియో, ఒకప్పుడు నేను తమ్మును వెక్కిరించితి ననియో, ఆయన నాపని నిపుడు పట్టించెను ! దేహస్వాస్థ్య మింకను గుదురక తికమకలఁ బడియెడి నాకిది ""పులిమీఁద పుట్ర" యయ్యెను. ఈయనదాడినుండి తప్పించుకొనుటకు నా కంత నొకయుపాయము తోఁచెను. కళాశాల మొదటితరగతి కీయనజోక్యము లేదు. మరల నే నం దేల చేరరాదు ? అట్లు చేసినచో, కొంతకాలము వీరిపోరు తప్పుటయెకాక, వెనుకఁబడి యుండిన ప్రాఁతనేస్తులతోఁ గలసి చదువు భాగ్యము గలిగి, తొందర లేనిచదువులో హాయిగ నింకొకయేఁడు గడిపి, యారోగ్యము చక్కఁ బఱచుకొనవచ్చునని తలంచితిని. ఇది మంచిపనియె యని వెంకటరత్నముగా రనిరి. వెంకటరా విది విని యెగిరి గంతిడెను. అతఁ డిప్పు డీ తరగతిలోనే చేరనుండెను. కావున నేను 10 వ ఫిబ్రవరి తేదీని మా తండ్రిని వెంకటరత్నముగారి యొద్దకుఁ గొనిపోయి, నేను క్రిందితరగతిలోనే చేరుట కర్తవ్య మని యాయనచేఁ జెప్పించితిని ఆయనయెదుట మాతండ్రి సరే యన్నను, ఇంటికి వచ్చి మాతల్లితో నిది చెప్పి, నా మీఁదఁ గోపపడెను. ఇదివఱకే యొకయేఁడు నేను బడి యెగురఁగొట్టి, కొంటెతనమున మరల చదువులో వెనుకంజ వేయఁజూచుటకు వారు నన్ను నిందించిరి. నే నిట్టి కుతంత్రములు పన్నినచో, కుటుంబమును స్వగ్రామమునకుఁ దరలింతు నని మాతండ్రి చెప్పివేసెను !

కాని, నేను గట్టిపట్టు పట్టితిని. కళాశాలాధ్యక్షునియొద్దకు నేను జని, నాదేహస్థితి వారికి విన్నవించి, మరల మొదటితరగతిలోఁ జేరుదు నంటిని. గతసంవత్సరము నేను విద్య విరమించుటకె యచ్చెరువొంది యసమ్మతిఁ జూపిన మెట్కాపుదొర, నా క్రొత్తరాకడకు మఱింత విస్మయ మందెను. కాని, నాయనారోగ్యమునుగుఱించి మరల నే వొత్తిపలుకుటచేత, ఆయన తుట్టతుదకు, "వెంకటశివుడూ ! నీవు నాశిష్యులలో తెలివిగలవాళ్లలో నొకఁడ వని నే నెఱుఁగుదును. ఏధో కష్టము లేనిచో నీవంటివాఁడు క్రిందితరగతిలోఁ గూర్చుండుట యందలి నష్టావమానముల కొడంబడడు. నాకళాశాలలో నీయిష్టము వచ్చినతరగతిలో నీవు కూర్చుండవచ్చును. జీత మీయనక్కఱలేదు. ఇంకఁ బోయిరా !" అని చిఱునవ్వుతో నాకుఁ గళాశాలకుఁ బునస్స్వాగత మిచ్చెను !

నే నంత మొదటితరగతిలోఁ దిరిగి చేరితిని. కొలఁదిదినములలోనె యింటను విద్యాలయమునను నావింతపనిని గుఱించిన విస్మయ మణఁగిపోయెను. కళాశాలకుఁ బ్రాఁతకాఁపు నగుటచేత నన్ను తరగతికిఁ బెద్దగ నియమించిరి. ప్రాఁతమిత్రులను గుశలప్రశ్న చేయుచును, క్రొత్తవారి పరిచయభాగ్య మందుచును, నేను కళాశాలలో సుఖముగ నుంటిని.

ప్రవేశతరగతి యింకను దాటని కొండయ్యశాస్త్రి నా కిపుడును నిత్యసహవాసుఁడు. వెంకటరావు నాతరగతిలోనె యుండువాఁడు కావున, తఱచుగ నాతో నిష్టాగోష్ఠి నుండును. క్రొత్తగ స్నేహము కలిసినవారిలో ముఖ్యులు, పోలవరము జమీందారు రాజా కొచ్చర్లకోట వెంకటకృష్ణారావుగారు, మహమ్మదు బజులుల్లాసాహెబు గారును. ఆవేసవి సెలవులలో, బజులుల్లా వెంకటరావులు నావలెనే రాజమంద్రిలో నుండి, మేము క్రొత్తగాఁ గొనినస్థలములో వేసిన కుటీరమున నన్నుఁ గలసికొనుచుండువారు. ఏదో సాహిత్యవిషయమును గూర్చి మేము ప్రసంగించుచుండెడివారము. బజులుల్లాకు సాహిత్యాభిమానము మెండు. ఉర్దూభాషలోఁ దాను పద్యరచన చేయుచుందునని మాకుఁ జెప్పెడివాఁడు. ఇంగ్లీషులో నావలెనే యనేకపుస్తకములు చదివియుండెను. అతనికి డిక్వెన్సీయం దమితప్రీతి. అతని ప్రేరణముననే నే నపుడు ఆ రచయిత గ్రంథరాజమగు ""నల్ల మందుభాయి" యను పుస్తకమును వినోదమునఁ జదివితిని. కవులు కవిత్వము ననిన నాతఁడు చెవి కోసికొనువాఁడు. నే నావేసవిని డ్రైడను కోల్రిడ్జికవుల పద్యకావ్యములు, మూరుని "లాలారూకు" యును జదివితిని.

అప్పుడప్పుడు మేము షికారుపోవుచుండువారము. బొమ్మూరు కొండదగ్గఱకుఁ గాని, ధవళేశ్వరము ఆనకట్టయొద్దకుఁ గాని మేము నడచిపోయి, సృష్టివైచిత్ర్యములను కనుల కఱవు దీఱునట్టుగ వీక్షించు చుండువారము. నే నిట్లు మరల పాఠశాలలోఁ బ్రవేశించి, విద్యాధోరణిని బడి, నాశరీరదౌర్బల్యమును మఱచిపోఁజూచుచుంటిని. సహపాఠుల స్నేహ సహవాసముల మరగి, లోకము పాపభూయిష్ఠ మని విస్మరించెడి వాఁడను. కళాశాలలో నే నిపుడు వడ్రము నేర్చుచు, కసరతు చేయుచు, సెలవురోజులలో షికారుపోవుచు, శరీరవ్యాయామమును గుఱించి యెక్కువగ శ్రద్ధ వహించియుంటిని. తల్లి యింట నాకుఁ బ్రత్యేకముగ భోజన సౌకర్యము లొనఁగూర్చుచుండెడిది. సద్గోష్ఠి సత్సహవాసములకుఁ దోడు నే నీకాలమున ననుదిన ప్రార్థనములు చేయుట కభ్యాసపడితిని. ఇ ట్లిన్నివిధముల నాయారోగ్య సౌఖ్యములు పెంపొందుటకు సాధనకలాప మేర్పడియుండెను.

13. నియమబద్ధజీవితము

1889 వ సంవత్సరము జూలై 28 వ తేదీని నాప్రియమిత్రుఁడు కొండయ్యశాస్త్రితోఁ గూడి నేను టాడు విరచితమగు "యువజనహితోపదేశము" అనునొక యాంగ్ల పుస్తకమును మిగుల తమకమునఁ జదివితిని. మాబోటి విద్యార్థుల కుపయుక్తములగు ననేక యంశము లిందుఁగలవు. వానిచొప్పున వర్తనప్రణాళిక నేర్పఱచుకొని యాచరణమునకుఁ గడంగినచో, సర్వానర్థకములకును మూలకందమగు ప్రాలుమాలికను పారఁద్రోలి, పాటుపడుట కలవాటుపడి, శ్లాఘనీయముగ జీవిక గడపవచ్చు నని నాకు స్పష్టపడెను. నాఁటినుండియే యేతద్గ్రంథబోధన మనుసరింప నిర్ధారణము చేసికొంటిని. విధికార్య నిర్వహణమందు కాలనియమమును ఖచితముగఁ బాటింపవలయు ననియే యందలి ముఖ్యవిధానము. మఱునాఁడు చేయవలసినపను లీనాఁడే నిశ్చయించుకొని, ఒకచిన్న పుస్తకమునం దవి యుదహరించి, సమయాను గుణ్యముగ వానిచొప్పున నాచరించి, యింక నెన్నిమిగిలెనో పిమ్మట సిరిచూచుకొనవలెను. క్రమముగ నిత్యవిధు లివ్విధమున నెర వేర్చు చుండినచో, సచ్ఛీలత దానియంత నదియే యలవడు నని యిందలి ముఖ్యోపదేశము.

అదివఱకే, అనఁగా 1888 వ సంవత్సరారంభమునుండియు, "దినచర్య" పుస్తకము లుంచునభ్యాసము చేసికొంటిని. ఏనాఁడు చేసిన పనులు, తలంచినతలంపులు, తటస్థించిన మేలుకీడులును, ఆనాఁటి రాత్రియే యీపుస్తకములందు సంగ్రహముగ లిఖియింపఁబడుచుండెను. దైవప్రార్థన, ప్రాత:కాలస్నానము, శరీర వ్యాయామము మొదలగు నలవాటులు చేసికొంటిని. పూర్వోదాహృతపుస్తకపఠన మప్పటినుండియు, నే నదివఱ కవలంబించినపద్ధతి మఱింత కట్టుదిట్టములతోఁ గూడుకొని జరుగుచుండెను. అందువలన నాకిపుడు నియమానుసారజీవిత మేర్పడెను.

ఆదినములలో నానిత్యకర్మానుష్ఠాన మీవిధముగ నుండెను : - ప్రాత:కాలముననే స్నానవ్యాయామము లైనపిదప, నేను ప్రార్థన సలుపుచుందును. అంత "బైబిలు - నూతననిబంధన"లోని మూఁడు నాలుగధ్యాయములు పారాయణము చేయుచుందును. దినపాఠము లన్నియుఁ జదివి, కళాశాల కేగి విద్య గఱచి, అచటనే సాయంకాలము వడ్రము నేర్చు చుందును. శరీరసాధకము చాలనిచో, డుబెల్సుతో కసరతు చేసి, అవశ్యమగు నింటిపని చక్క పెట్టుకొని, రమ్యప్రదేశ మేదేని సందర్శించియో, ఉద్గ్రంథపఠనము చేసియో సాయంప్రార్థనముతో దినకృత్యములు ముగించుచుందును.

ఇట్లు నేను 29 వ జూలైనుండి 12 వ అక్టోబరువఱకును ఏర్పఱుచుకొనిన నిత్యకర్మానుక్రమణపట్టికలు నా రెండవ దినచర్య పుస్తకమునఁ గలవు. ఈ కడపటితేదీనుండి యాపుస్తకమునం దివి యాగిపోవుటకుఁ గారణము, పుస్తకము రెండవవైపునుండి లిఖించిన దినచర్య భాగము అక్కడవఱకును వ్యాపించి యుండుటయే. మచ్చునకు వానిలో రెండుదినముల కార్యక్రమము నిట మల్లేఖించెదను : -

3 వ ఆగష్టు 188

  • 1. స్నానవ్యాయామానంతరమున దైవప్రార్థన.
  • 2. చలిదిపిమ్మట, తెలుఁగు : ప్రాతకవులు మువ్వురు.
  • 3. 1-3 గంటలమధ్య - ప్రార్థనసమాజకార్యము.

4. ఇంగ్లీషుపద్యకావ్యము : ఆర్కేడీసులో 30, ఇల్‌పెన్సి రోజోలో 10, లల్లీగ్రోలో 20 పంక్తులు.

  • 5. విద్యార్థి సమాజసభ : అచట నెవనిమనస్సు నొప్పింపక మెలంగుట.
  • 6. శరీరవ్యాయామము.

7. ప్రార్థన.

6 వ అక్టోబరు

  • 1. ప్రార్థన.
  • 2. బ్లాకీనుండి వ్రాయుట.

3. చరిత్రము.

4. గణితము.

5. మిల్టనులో కొంత.

  • 6. ప్రార్థన సమాజసభ.

7. వీలైనయెడల, వీరేశలింగముగారి ప్రార్థనసభ కేగుట. 8. మిత్రసందర్శనము.

  • 9. ప్రార్థన.

(షరా : - * అనుగుర్తుగల విషయములు, ఆచరింపఁబడినవనుట).

ఇట్లు నే ననుసరింపవలసిన కార్యక్రమము ముందుగ నేర్పఱచికొని, ఆప్రకారము నెరవేర్చితినో లేదో నాఁటిరాత్రియే చూచికొని వలసినచో, చేయనిపనులు కొన్ని మఱునాఁటి ప్రణాళికలోఁ జేర్చు చుండుటవలన, స్వేచ్ఛావిహారవిషయమున నాపాదములకు నేనే సంకెలలు తగిలించుకొనుటయై, నాకు గట్టిబాధ్యతయు జాగ్రతయుఁ బట్టుపడెను ! శరీరవిధులు, పాఠశాలలోని పనులును ఎప్పటి వప్పుడే నెరవేర్చుచుండుటచే, నామనస్సునకు హాయి గలిగెను. నా శీలప్రవర్తనములనుగుఱించిన సంగతులు దినచర్య దిన ప్రణాళికలయందు ఎప్పటి వప్పుడే లిఖింపఁబడుచుండుటవలన, అకార్యకరణమునకు సామాన్యముగ నా కరము లూనుచుండెడివి కావు. ఏనాఁటి లోపపాపము లానాఁటిప్రార్థనయందును దినచర్యపుస్తకములందును సూచింపఁబడుచుండుటచేత, మనస్సునకు మంచి ప్రబోధమును, న్యాయ మార్గానుసరణమున కమితప్రోత్సాహమును జేకూరెను.

14. వైష్ణవక్రైస్తవమతములు

ఎవని మతవిశ్వాసచరిత్రము వాఁడు విమర్శించుకొనునపుడు హృదయ మాశ్చర్యప్రమోదములకుఁ దావల మగుచుండును ! ఏడవ సంవత్సరమునకుఁ బూర్వము దేవునిగుఱించి నాయూహ లెటు లుండెడివో నాకు జ్ఞప్తిలేదు. ఆసంవత్సరమున గోపాలపురమున మేము బసయుండునింటఁ గొంతకాలము అధ్యాత్మరామాయణపారాయణము జరిగెను. శ్రీరాముని వనవాసకథ యాసమయమున నావీనులఁ బడెను. రాక్షసు లనిన భయము, రామలక్ష్మణులయందు ప్రేమమును నా హృదయమున నంకురించెను. ఆమఱుసటియేఁట రేలంగిలో చెలికాండ్ర సహవాసమహిమమున కృష్ణుఁడు నా కిష్టదైవత మయ్యెను. మాతల్లికి రామునియందు భక్తి. మాతండ్రి శివభక్తుఁ డయ్యును, ఒకటిరెండుమాఱులు నాచేత బాగవతములోని 'బాణాసురకథ' చదివించి, నాకర్థము చెప్పెను. అందలి విష్ణుని యుత్కర్ష నాబాల్యవైష్ణవమును ముదురఁబెట్టెను ! తదాదిగ, 1888 వ సంవత్సర మధ్యకాలమువఱకును, శివకేశవులలో కేశవు నధికునిగ నెంచి, నేను భారతభాగవతాది గ్రంథములు చదువుచు, నారాయణభక్తిపరుఁడ నై యుంటిని.

ఇటీవల కొంతకాలమునుండి నేను జదువు బైబిలుగ్రంథము, చేయుక్రైస్తవస్నేహితుల సహవాసమును, నాకు క్రైస్తవమతాభి మున ముదయింపఁజేసెను. ఆసంవత్సరము ఆగష్టు 7 వ తేదీదినచర్య యందు, "ఆపరమపవిత్రప్రవక్త యగుయేసుక్రీస్తును గుఱించి చదివితిని" అని యున్నది. 9 వ తేదీపుటలో, "భగవంతుడా ! ఐహిక విషయములను గుఱించి నామనస్సును కళవళపడనీయకుము. నే ననవరతము నీప్రేమామృతమును గ్రోలనిమ్ము. ఎపుడును నిన్ను ప్రార్థింతునుగాక !" అని లిఖింపఁబడెను. అప్పటినుండియు కష్ట మావహిల్లి నపు డెల్ల, భగవన్నామచింతనము నాదినచర్యయందు సూచింపఁబడు చుండెను. అక్టోబరు 28 వ తేదీని, "క్రైస్తవదేవాలయమునకు వెళ్లితిని" అని యుండెను. మఱునాఁటిదినచర్యయందు, నేను కొలఁదికాలములో మృత్యుముఖముఁ జొచ్చుట నిశ్చయ మని యెంచి నే గావించిన యొకదీర్ఘప్రార్థనము గానఁబడుచున్నది. అందు, నేను పాపి ననియు, తలంపులందు కలుషితుఁడ నినియు, నాదుశ్చింతలే యాత్మ శాంతిని బారఁద్రోలి శరీరమును మనస్సును గాకుచేసి నా నీతికుసుమ మును ముకుళింపఁజేసె ననియు, నేను వగచితిని. ఆజన్మము మనోవాక్కర్మలందు పవిత్రత ననుభవించినను, గత యేప్రిలు మధ్యకాలము నుండి నేను దుశ్చింతల పాలైతి నని నే మొఱపెట్టి, లజ్జావిరహితమగు నా హృదయమును భగవంతుని హస్తగతము చేయుచు, శీఘ్రమే తనసన్ని ధానమున నన్నుఁ జేర్చుకొనుఁ డని నేను దేవుని ప్రార్థించితిని !

1889 వ సంవత్సరము జనవరి మొదటితేదీదినచర్య బైబిలునందలి "ప్రభువుప్రార్థనము"తో ప్రారంభ మయ్యెను. ఆసంవత్సరము మేనెల మొదటితేదీనికూడ ప్రభువుప్రార్థన పూర్తిగ లిఖింపఁబడెను. నాదుశ్చింతల నరికట్టు మని దేవుని వేడుకొనుట అప్పుడప్పుడు కానవచ్చుచున్నది. మే 15 వ తేదీని ప్రార్థన మిటు లున్నది : - "దయామయా ! నీతనయులము అవివేకమున పాపకృత్యములకుఁ గడంగుచున్నాము. కాన నీవు మావర్తనము గాపాడి, కరుణాళు వగు జనకుని వలె మాతప్పులు సైరింపవలయును." ఈ మేనెలనుండి నవంబరువఱకును వరుసగ ప్రతి యాంగ్లేయమాసారంభ దినచర్యము ప్రభువుప్రార్థనముతో ప్రారంభమగుచుండెను. అప్పుడప్పు డొకానొకదినమున నిటులే యాప్రార్థన ముల్లేఖిత మగుచుండెను.

జూలై 18 వ తేదీని, దసరాసందర్భమున వ్రాయఁబడిన ప్రార్థనము లిచట వివరింపవలసియున్నది : - "పరమపితా ! నీయెడ నాకుఁగల గాఢానురాగము అనిర్వచనీయము. ఈ దుర్బలునికి నీమృదు కరస్పర్శసుఖ మొకింత యొసంగుము ***ద్రోహకౌటిల్యములు ప్రబలిన యీలోకమున నెట్టిసజ్జనుఁడును సైతానుప్రేరణమునకు లోనగుచున్నాఁడు. పావనచరితా, నాహృదయము బలవత్తరమగు దృఢ దుస్సంకల్పముల కిరవు గాకున్నను, ఒక్కొకతఱిని, అసూయ గర్వము మోహము మున్నగు హేయభావములకు గుఱియగుచున్నది. దీనిలో మొదటిది కడపటిదియు నాపరమశత్రువులు. ఈశత్రులబారినుండి నన్నుఁ దప్పింపుమని వినయాతిశయమున వేడుకొనుచున్నాను."

"భగవానుడా ! రాఁబోవు సంవత్సరము దసరానాఁటికి నే నెటు లుందునో తెలియదు. గతదసరాకును ఇప్పటికిని నాలో నెంతయో మార్పు కానుపించుచున్నది. ముఖ్యముగ పవిత్రుఁడగు జీససుప్రభువుమూలమున నే నిపుడు సత్యదైవభక్తుఁడ నైతిని. లోకమునుగుఱించి నా యభిప్రాయము లిపుడు గంభీరములు నాగరికములునై విరాజిల్లుచున్న యవి. ఇపుడు నేను పూర్వమువలె గాక నీతిపరుఁడను ఆరోగ్యవంతుఁడను !"

పైన నుల్లేఖింపఁబడిన దినచర్యభాగములనుబట్టి, మామనసున కిపుడు క్రైస్తవమత సంపర్కము కొంత సోఁకినట్టు తేటపడఁ గలదు. కాని, యెపుడైన నేను సంపూర్ణక్రైస్తవమత విశ్వాసి నైనటుల నాకు జ్ఞప్తిలేదు. ఆ మతగ్రంథములఁ గల భక్తిపోషకములగు ప్రార్థనాదుల పోకడలుమాత్రము కొన్ని నే నిపుడు బాహాటముగఁ గైకొంటిని. జీససుమహాశయుఁడు చూపిన రాజమార్గమున నడచుటకు నాభక్తి యిపు డభ్యాసపడెను. ఇదివఱకు వైష్ణవమువలెనే, ఇపుడు క్రైస్తవముకూడ, నాభక్తికాంత ధరించిన వస్త్రవిశేషముమాత్రమె. క్రైస్తవమతాభిమానము నాకు పట్టుపడుటకుఁగల సందర్భము నొకింత నిచట ప్రస్తావించెదను.

'నేను రాజమంద్రికళాశాలలోఁ జేరినది మొదలు, అందలి యుపాధ్యాయులలో నెల్ల శ్రీమల్లాదివెంకటరత్నముగారు నాకుఁ బ్రియగురువు లైరి. మే మపుడు నివసించుకొట్లదగ్గఱ నొక గృహమున వారు కాపుర ముండుటచేత, తఱచుగ నేను వారిని సందర్శించుచు వచ్చితిని. క్రైస్తవుఁడగు నాయన, ఏతన్మతప్రాశస్త్యమునుగూర్చియు బైబిలునుగుఱించియు నాతోఁ బ్రసంగించుచుండువాఁడు. నావిద్యారోగ్యాభివృద్ధులనుగూర్చి యాయన పలుమారు సదాలోచనలు చెప్పెడి వారు. క్రైస్తవమతస్వీకారము చేయుమని మాత్ర మెన్నఁడును వారు నాకు బోధింపలేదు. అంతియ కాదు. కొన్ని సమయములందు క్రైస్తవమతస్వీకారావశ్యకతనుగూర్చి నేను గ్రుచ్చిగ్రుచ్చి యడుగఁగా, పరమాత్ముఁడు కోరునది హృదయపవిత్రతయేగాని, బాహ్యవేషాదులు గావని యాయన నన్ను హెచ్చరించుచుండువాఁడు. గతసంవత్సరమున నాతో కోనసీమ కేతెంచినస్నేహితుఁడు కారణాంతరములచే క్రైస్తవమతస్వీకారము చేసెద నని నన్ను వేధింపఁగా, నేను 4 వ ఆగష్టుతారీఖున వెంకటరత్నముగారియొద్ద కాతనిని గొనిపోయితిని. ఈవిషయమై వారియమూల్యాలోచన లడుగఁగా, ఆయువకుఁడు క్రైస్తవమతస్వీకారము చేయుట కాయన సమ్మతింపలేదు. అంత నేను క్రైస్తవమతమునుగుఱించి నాయభిమానమును మాగురువునకుఁ దెలిపితిని. నేను నిత్యమును బైబిలుపారాయణము చేయుచు, జీససు బోధన ననుసరించి దైవప్రార్థనలు సలుపుచుంటి నని చెప్పినప్పుడు, అట్టివారలే నిజమైనక్రైస్తవు లని నన్ను వెంకటరత్నముగారు అభినందించి, నా కమితోత్సాహము గలిగించిరి.

నే నిట్లు క్రైస్తవమతావలంబకుఁడను గాకున్నను, క్రైస్తవారాధనయు క్రైస్తవాచార సంప్రదాయములును నా కెంతో రుచికరము లయ్యెను. ప్రపంచమున విస్తరిల్లెడి ప్రకృతిశాస్త్రజ్ఞానాదిశుభముల కెల్ల క్రైస్తవమతమే మూలాధార మని నేను నమ్మి, ఏతన్మతస్వీకారము చేసి క్రైస్తవాచారముల ననుసరించినఁ గాని మనదేశమున కైహికాముష్మికములు లే వని విశ్వసించెడివాఁడను ! ఇట్టియూహలలోఁ గొంత సత్య మున్నను, ఇదియే యమోఘ సత్యము గా దని నేను గ్రహించి, మతవిషయమై నామనస్సున మఱికొంత మార్పు నొందినసందర్భ మిఁకఁ దెలిపెదను.

15. రామభజనసమాజ సంస్కరణము

1888 వ సంవత్సరాంతమున మాతండ్రి ఇన్నిసు పేట మధ్యభాగమున నొకచిన్న యిల్లు స్థలమును గొనెను. మఱుసటి సంవత్సరారంభమున మే మచటికిఁ బోయి, దాని కెదురుగ నున్న దేవరకొండవారియింటఁ గాపుర ముంటిమి. చెంతనుండు నొకయింట ప్రతి శనివారమురాత్రియుఁ గొందఱు యువకులు చేరి, రామభజన జరుపుచుండి, నన్ను తమసమాజమున కధ్యక్షునిఁ జేసిరి. రాత్రులు చాలసేపు ఎలుగెత్తి వారు గీతములు పాడుటవలన నిరుగుపొరుగువారల నిద్రకు నెమ్మదికిని భంగము గలుగుచుండెడిది. మాయింట రెండవ భాగమునఁ గాపురముండు నొకయుద్యోగి యొకనాఁడు, "ఈ రామభజన కడు బాధాకరముగా నున్నదే !" యని మొఱపెట్టఁగా, నే నాయనతో వాదమునకు డీకొని, బాలపామరుల కట్టి భజన లాభదాయక మని చెప్పివేసితిని. ఒకటి రెండుమాఱులు మా తండ్రియును రామభజనసమాజమువారిని గుఱించి విసిగికొని, వారితో జోక్యము కలుగఁజేసికొన వలదని నన్ను మందలించెను. అంతకంతకు రామభజనసమాజమువారి పోకడలు నాకును దుస్సహము లయ్యెను. ప్రార్థన సమయమున వారు రామునిపటమును ముందుంచుకొని, దానికి ధూప దీపనై వేద్యములు సమర్పించెడివారు. క్రీస్తుబోధనానుసారముగ మాన సికారాధన చేయ నభ్యాసపడిననే నంత రామభజనసమాజప్రణాళికను సంస్కరింప నుద్యమించితిని.

ఈవిషయమును జర్చించుటకై "రామభజనసమాజ" ప్రత్యేక సభ 6 వ అక్టోబరున జరిపితిమి. నా పూర్వసహపాఠి క్రొవ్విడి జగన్నాధరావు ఆసభ కగ్రాసనాధిపత్యము వహించెను. సంకుచితమగు పౌరాణికభజనము గాక, సర్వజనీనమును విశాలభావోపేతమునునగు మానసికారాధనము సలుపుటయె కర్తవ్య మని నే నానాఁడు దీర్ఘోపన్యాసము చేసితిని. పొరుగుననుండు పద్మనాభ మనువిద్యార్థి వ్యతిరకాభిప్రాయుఁడై, నాప్రతిపాదనమును ప్రతిఘటించెను. ఇరుకక్షల వారు నుద్రేక భావపూరితహృదయు లైరి. రెండుసమ్మతు లధికముగ వచ్చుటచేత నాతీర్మానము సభలో నంగీకరింపఁబడెను. నేను దిగ్విజయము చేసితి ననుకొంటిని. మఱునాఁటినుండియె మేము సమాజ పునరుద్ధారణమునకుఁ బూనితిమి. సత్యదైవమును నమ్మిన మాకూటమునకు "ప్రార్థనసమాజ" మని పే రిడితిమి. ఈ నూతనసమాజములో నాతో మిగుల తీవ్రముగఁ బనిచేసినవారు జగన్నాధరావు రాజగోపాలరావులు. పూర్వపు రామభజనసమాజమునకై వసూలు చేయఁబడిన సొమ్ము వారి కిచ్చివేయుటకు మేము సమ్మతింప లేదు. అందువలన నిరుకక్షలవారికిని పోరు ఘోర మయ్యెను. ఒకరిమనోభావముల నొకరు గేలి చేయసాగిరి.

మా నూతనసమాజవిధానమునుగుఱించి మే మంత తలపోయ సాగితిమి. నామిత్రుఁడు జగన్నాధరావు నన్నొక యాదివారమున కందుకూరి వీరేశలింగముగారు జరుపుచుండెడి ప్రార్థనసమాజసభకుఁ గొనిపోయెను. ప్రార్థనసమయమున నచట శ్రీ వడ్డాది సుబ్బారాయ కవికృత భగవత్కీర్తనములును, చెన్నపురి బ్రాహ్మసమాజమువారి గీతములును పాడుచుండిరి. ఆపుస్తకప్రతులు కొన్ని తెచ్చి మేము నుపయోగించుకొంటిమి. మాయిండ్లకుఁ జేరువనుండు మాధ్యమిక పాఠశాలాగృహమున మా సమాజప్రార్థనలు జరుపుకొనుచువచ్చితిమి.

నా కిపుడు సంఘసంస్కరణమే ప్రథానాశయ మయ్యెను. మిత్రులఁ గలసికొనినపుడు, వారలతో సంస్కరణావశ్యకతను గుఱించి యుద్రిక్తభావమునఁ బ్రసంగించు చుందును. నా దృష్టిపథమున సంస్కరణాభిముఖులు సజ్జనులు; తద్వ్యతిరేకులు కాపురుషులు, సంకుచితస్వభావులును ! నానాఁట నాసంస్కరణాభిమానము పలుకులు ప్రసంగములును దాటి క్రియాసోపానముఁ జేరెను. సంస్కరణపరాయణులు స్వేచ్ఛానువర్తనులుగ నుండవలయును. ప్రథమమున స్వగృహముననే వారు అనుష్ఠానమునకుఁ గడంగవలయును. ప్రకృతకాలమున పాఠశాలావిద్యార్థులలోఁ బలువురు కత్తిరించిన జుట్లతో నుండుట యాచారము. ఆకాలమున నగ్రవర్ణములం దట్టిపని కడు గర్హితము ! ఐనను, నాబోటి సంస్కరణాభిమాని జనాభిప్రాయములను లెక్కగొనక, ధైర్యమున నూతనపథము త్రొక్కవలదా ? తలనొప్పులు కనుల మంటలు నా కాకాలమున సన్నిహితబంధువులే ! కత్తితో క్షౌరమువలన నాకు నెత్తి మండుచుండెడిది. పుణ్యపురుషార్థము లిట్లు కలసిరాఁగా, నేను తలముందలి వెండ్రుకలు కత్తిరించుకొనుట కలవాటు చేసికొంటిని. క్రైస్తవులవలె నే నిట్లు తల పెంచుకొని, యింటను బైటను మనుజుల విపరీతవ్యాఖ్యానములకు గుఱి యైతిని. తల్లికి, తమ్ములకు, నౌకరులకు, తుదకు క్షురకర్మ చేయు మంగలికిని, నాచర్యలు విడ్డూరముగఁ దోఁచెను ! కాని, నేను స్థైర్యముఁ బూనియే యుంటిని.

16. హిందూధర్మమా, బ్రాహ్మమతమా ?

రామభజనసమాజము విడిచి పెట్టిన మొదటిదినములలో నాకు ప్రార్థనసమాజ మూలసిద్ధాంతములను గుఱించి యంతగఁ దెలియదు. హిందూసంఘదాస్య మొకింత తొలఁగించుకొని సంస్కరణాభిమానుల సహవాసభాగ్య మలవఱుచుకొనినచో, నేను పరిపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్ర్యముల ననుభవిం తు ననియు, నాకుఁబ్రియమగు క్రీస్తుసందేశములచొప్పున నప్పటినుండియు నడుచుకొనవచ్చు ననియు, నేను దలపోసితిని ! అంతియ కాని, ప్రార్థనసమాజాదర్శములకును క్రైస్తవమత విశ్వాసములకును, ఉత్తరదక్షిణ ధృవముల కుండెడియంతరము గల దని కలనైన నే ననుకొనలేదు ! అక్టోబరు 27 వ తేది సాయంకాలము, ప్రార్థనసమాజసభయందు వీరేశలింగముగారు "ఈశ్వరదత్తపుస్తకములను" గూర్చి యుపన్యాస మొసంగిరి. హిందూమతాభిప్రాయములనే యాయన నిరసించు నని నే నిదివఱ కెంచుచుంటిని. ఆయన నా కిష్టమగు బైబిలి, క్రైస్తవమతముల మీఁదఁగూడ నిపుడు దాడి వెడలుటకు మొదట మిగుల కంటగించితిని. కాని, అంతకంతకు నేను ప్రార్థన సమాజసిద్ధాంతముల కఱకుఁదనమున కభ్యాసపడితిని.

కొన్ని నెలలనుండి ప్రతి మాసారంభమునను, క్రీస్తు ప్రబోధించిన "ప్రభుప్రార్థన"ను నాదినచర్యపుస్తకమునఁ బూర్తిగా వ్రాయనభ్యాసపడితి నని యిదివఱకే చెప్పితిని. ఇపు డీనవంబరు మొదటి తేదీని లిఖింపఁబడిన ప్రార్థన మిటు లుండెను : - "భగవానుఁడా ! నీవు నానీతిప్రవర్తనమును గాపాడి, నాశీలపవిత్రతను సంరక్షించితివి. దేహమనశ్శక్తులందు వట్టిదుర్బలుఁడ నగునేను గతమాసమున నావర్తననైర్మల్యమును నీకృపాసాహాయ్యముననే నిలువఁబెట్టుకొనఁగల్గితిని." అక్టోబరు నెలలో నాకుఁ దటస్థించిన క్లిష్టశోధనము నా మతాభి ప్రాయములలోఁ గలిగిన కలవరమే. నాభక్తి కత్యంతావశ్యకము లని నే నదివఱకు నమ్మిన క్రైస్తవవైష్ణవసిద్ధాంత సాంప్రదాయములు అనగత్యములని నే నిపుడు విడనాడితిని. ప్రార్థనసమాజ మతసూత్రములే నా కింతటినుండి రుచికరము లయ్యెను. కావుననే నాదినచర్య పత్రములనుండి క్రైస్తవమతవాసనలు అప్పటినుండియు నదృశ్యమగుచున్నవి. ఈ నూతనసమాజాదర్శములు తగినంత దృఢముగ నుండెనో లేదో యిఁకఁ జూడవలసియున్నది.

విశాఘపట్టణవాస్తవ్యులగు మహామహోపాధ్యాయ పరవస్తు రంగాచార్యులుగారు రాజమంద్రి వచ్చి యుపన్యాసములు చేయ నున్నా రని మాపట్టణమునఁ గొంతకాలమునుండి వదంతులు గలవు. పాండిత్య వాగ్ధోరణులయందు ఆచార్యులవారు అసమానప్రతిభాన్వితులని జనూ నిశ్చితాభిప్రాయము. నవంబరు మూఁడవతేదీని విజయనగర మహారాజుగారి బాలికా పాఠశాలలో రంగాచార్యులవారు చేసిన యుపన్యాసము నేను వింటిని. హిందూదేశమునందు ప్రబలిన వివిధమతములనుగూర్చి వా రతిహృద్యముగఁ బ్రసంగించిరి. రంగాచార్యుల వారి యుపన్యాసము వినినవారలకు మతవిషయములనుగుఱించి మనస్సున గొప్పసంచలన ముద్భవించెను. మఱునాఁడే నామిత్రులగు రాజాకృష్ణారావుపంతులుగారితో కళాశాలలో మాటాడుచు, ప్రాచీన హిందూమతాదర్శము లున్నతమైన వయ్యును, గురువుల సంకుచిత భావములవలన మతమున కప్రతిష్ఠయు దేశమున కనర్థమును వాటిల్లుచున్న వని నేను నొక్కిచెప్పితిని. ఆయన నాకు పూర్తిగ సానుభూతిఁ జూపెను. హిందూమతసౌష్ఠవమును గాపాడవలె ననినచో, శంకరాచార్యులు మున్నగు పీఠాధికారుల నిరంకుశాధికారము నరికట్టి, శాస్త్రగ్రంథపరిశోధనము గావించి, అందలి యమూల్యసత్యములను ప్రజలకు బోధించుట విద్యాధికుల కర్తవ్యమని నాకుఁ దోఁచెను. ఇట్టి స్వచ్ఛందప్రచారకులలోఁ జేరుటకు నే నువ్విళు లూరితిని.

ఆనాఁడు సాయంకాలము రంగాచార్యులుగా రింకొక యుపన్యాస మొసంగిరి. ఇట్టియభిప్రాయమే ఆయనయు తన యుపన్యాసమున వ్యక్తపఱచిరి. మహారాష్ట్రపాఠశాలాధ్యక్షుఁడగు ముత్తుస్వామిశాస్త్రిగా రీసభలో, తన కిదివఱకుఁగల క్రైస్తవమతవిశ్వాసములను పరిత్యజించి, హిందూమతసీమకు పునరాగమముఁ జేయుచుంటి నని చెప్పివేసిరి ! నాసహాధ్యాయుఁ డొకఁ డంత లేచి, విద్యార్థులనీతి మతోద్ధరణమునకై పెద్దలు గట్టి కృషి సలుపవలె నని కోరెను. మఱునాఁటియుదయమున కళాశాలలో మిత్రులు నేనును మతసంస్కరణమునుగుఱించి ప్రసంగించితిమి. ఆసాయంకాలము రాజా కృష్ణారావుగారియింట మేము మరల కలసికొని యీవిషయమునుగుఱించి చర్చించితిమి. హిందూమతదౌర్బల్యమునకు ముఖ్య హేతువు, హిందూసంఘము శాఖోపశాఖలుగఁ జీలిపోవుటయే. కావున ప్రప్రథమమున చాతుర్వర్ణములలోఁగల యుపజాతులు తమతమ యంతర్భేదములను బాపుకొని యేకీభవించినచో, వేగమే దేశమున కైకమత్య మేర్పడఁగలదు. ఈసంగతిని మఱునాఁడు కళాశాలలోఁ జర్చింప మేము నిశ్చయించు కొంటిమి.

6 వ తేదీని రంగాచార్యులుగారు కర్మనుగుఱించి చేసినప్రసంగధోరణి నా కింపుగ లేదు. మఱునాఁడు మాతరగతిలోని విద్యార్థుల మందఱము కళాశాలలో సభ చేసి, చాతుర్వర్ణ్యములోని యుపశాఖల సమ్మేళన మెట్లొనఁగూడునా యని యాలోచించితిమి. మనలో నీసంఘీభావ మేర్పడెనేని, భారతీయు లందఱును సోదరబృందముగఁ బరిణమించి పరమేశ్వరుని పరమపితగఁ జేకొందు రని రాజాగారు నేనును నొక్కి చెప్పితిమి. అగ్రాసనాధిపతియగు వెంకటరావు తన యుపన్యాసమున నిట్లు నుడివెను : - "మన మొనరింపఁబూనిన యీ సంస్కరణ మత్యంతలాభప్రద మైనదియే. కాని, మున్ముందుగ మనము మతగ్రంథములను పఠియించి, తోడిమతములగు క్రైస్తవమహమ్మదీయ మతములను బరిశోధించి, సమన్వయమునఁ దేలిన సత్యసిద్ధాంతములను జనులకు బోధింప నుపదేశికులను దేశమున పల్లెపల్లెకును, పట్టణపట్టణమునకును బంపినచో, హిందూమతపునరుద్ధరణము లెస్సగ జరుగఁగలదు." ఈమతప్రచారకార్యము తాను నేనును ప్రారంభింప విధిచోదిత మని యాతఁడు చెప్పినప్పుడు, నేనానందపరవశుఁడ నైతిని !

ఇట్లు రాజమహేంద్రవరమున రంగాచార్యులవారి యుపన్యాసముల ఫలితముగ, విద్యార్థులమగు మామనస్సులు అత్యంతోద్రేకపూరితము లయ్యెను. కృష్ణారావు, వెంకటరావు నేనును మతసంస్కరణాభినివేశ మను సుడిగుండమున నిపుడు పడిపోయితిమి. మా కిపుడు రేయింబవళ్లు సంస్కరణమునుగూర్చిన యాలోచనలతోనే కాలము గడచిపోయెను. 6 వ తేదీని మేము మువ్వురమును పాఠశాలకుఁ బోవుట మానివైచి, పోలవరము జమీందారుగారిమేడలోఁ గూడి, సంస్కరణ సంగతులు చర్చింతిమి. "మేము ప్రథమమున వేదములు మొదలగు హిందూమతగ్రంథములును, ముఖ్యపరమతగ్రంథములును నాలుగైదేండ్లు చదివి, మతవిషయములందు నిపుణులమై, అంతట రాజమంద్రి నివాసుల కేకీభావము గలిగించి, యచట సత్యమతమునకు శంకుస్థాపన మొనరించెదము. ఇచటనుండి చుట్టుపట్టులనుండు ప్రదేశముల కంత దేవునిసువార్త వెదజల్లి దేశోద్ధరణముఁ గావించెదము !" అని మేము నిర్ధారణ చేసికొంటిమి. మా సహపాఠి బజులుల్లాసాహేబు, మామువ్వురికిని మనసు గలిసినమిత్రుఁ డయ్యును, అన్యమతకూటస్థుఁ డగుటచేత, తగిన సానుభూతి చూపింపనేరక, మామనస్తాప మంతయు వట్టితాత్కాలికోద్రేక మని భావించి, మమ్ము పరిహసించుచు నొకచిన్న యాంగ్లేయ ప్రహసన మాదినములలోఁ గలిపించెను. భూమినుండి చంద్రునివఱకు నొకపెద్దవంతెన కట్టవలె నని యోజించెడి మువ్వురు ఉన్మత్తులతో మమ్మతఁడు పోల్చెను. పిచ్చియాలోచనలు చేయుచుండె నని రాజా కృష్ణారావునకు సత్యకాలప్రభు వనియు, చలచిత్తుఁ డని వెంకటరావునకు గాలిచక్ర మనియు, ఆవేశపూరితుఁడ నని నాకు భావోద్రేకమనియుఁ బేరులు పెట్టి, మామువ్వురిని తనప్రహసనమునఁ బాత్రలుగఁ జేసి యతఁడు వినోదించెను !

నా కీసమయమున సంఘసంస్కరణాభిమానులగు మిత్రు లిఁకఁ గొందఱు లభించిరి. వీరిలో నొకఁడు గోటేటి కనకరాజు. ఇతఁ డా సంవత్సరము ప్రథమశాస్త్రపరీక్షకుఁ బోయెడి విద్యార్థి. రాఁబోవుసంవత్సరమునందు ఉపాధ్యాయవృత్తిలోఁ బ్రవేశించి, తనహృదయమున కానందదాయకమగు ప్రార్థనసమాజాదేశముల చొప్పున ఋజువర్తనమున జీవితము నడపుకొనుట కీతఁ డుద్దేశించెను. ఇతనికంటె నదికాశాపరుఁ డగు వాఁడు ముత్తుస్వామిశాస్త్రి. ఈయన పట్టపరీక్షనిచ్చి, మహారాష్ట్రపాఠశాలను నడుపుచుండెడి విద్యాధికుఁడు. పెక్కుగ్రంథములను జదివి కొంత లోకానుభవము సమకూర్చుకొనిన ప్రజ్ఞావంతుఁడు. కాని, తాత్కాలికభావోద్రేకమునఁ గార్యరంగమునకు దుమికెడి వేగిరపాటువాఁ డనియు, చీటికి మాటికి మతము మార్చుకొను చుండెడి చంచలచిత్తుఁ డనియు, నీతనిని జనుల పరిహసించుచుండిరి. ఇందుఁ జాల సత్యము గల దని నాకును ద్యోతక మయ్యెను. ఆ దినములలో నేను క్రైస్తవమత ప్రచారసంఘమువారి ప్రచురణమగు "మతసంస్కరణము"నుగూర్చిన పుస్తకములు అత్యంతతమకమునఁ జదివితిని. క్రైస్తవుఁ డగుగ్రంథకర్త పక్షపాతబుద్ధి పుస్తకములలోని పత్రపత్రమునను నుబుకుచున్నను, హిందూమతమును గూర్చియు, సంస్కరణసంస్థలగు నార్యబ్రాహ్మమతములను గుఱించియు నా కిపుడు కొన్నియమూల్యాంశములు బోధపడినవి. అన్నిటికంటెను బ్రాహ్మమతధర్మమువలె నాకు యోగ్యములుఁగ గానఁబడినవి. నవంబరు 29 వ తేదీని నేను కళాశాలలో వీరేశలింగముగారితో బ్రాహ్మసమాజమునుగూర్చి ప్రసంగించితిని. ఆయన నాయభిప్రాయములను దృఢపఱిచెను. కావున నే నిపుడు పరిశుద్ధాస్తికమత మవలంబనీయ మని విశ్వసించి, స్నేహితుల కది ప్రబోధింప మొదలిడితిని. కనకరాజు, జగన్నాధరావుల కిది ప్రీతికరమె గాని, కొండయ్యశాస్త్రి మున్నగు వారలకుఁ గంటకసదృశముగ నుండెను. !

కొంతకాలమునుండి రేలంగిలో శరీరస్వాస్థ్యము తప్పియుండి యిపుడు నెమ్మదిపడిన మాతండ్రిని, డిశెంబరు రెండవవారమున మా తల్లియు తమ్ములును రాజమంద్రి తీసికొనివచ్చిరి. నాప్రకృతవిపరీత చర్యలు కనిపెట్టి యాయన యుగ్రుఁ డయ్యెను. ఇటీవల నే నవలంబించిన సంస్కరణపద్ధతులకథన మాయన కపుడు వినవచ్చెను. రాజమంద్రిలో సకుటుంబముగ నివసించుచుండెడి నా మామగారు మఱి కొందఱును నా వికారపుచేష్టలను మాజనకుని కెఱిఁగించిరి. నేను క్రైస్తవునివలె జుట్టు పెంచితి ననియు, బొట్టు పెట్టక, మడి గట్టక, భుజించుచుంటి ననియు, జందెము తీసివైచి నాస్తికుల సావాసము చేయుచుంటి ననియు, నామీఁద నేరారోపణములు చేయఁబడెను ! కాని, నేను శాంతము వహింపవలె ననియు, పూర్వాచారపరాయణులగు తలిదండ్రులపోషణమున నుండెడి యీ విద్యాభ్యాసకాలమున, బొట్టు జుట్టు మొదలగు బాహ్యవిషయములను గుఱించి యనగత్యముగ నేటి కెదురీదవల దనియు, సంస్కారప్రియులగు స్నేహితులు నాకు హితోపదేశము చేసిరి. అంతటినుండి యీవిషయములందు నే నెంతో జాగ్రతతో మెలంగితిని. కాని, నాకుఁ బ్రియతరములగు మతవిషయిక గ్రంథములు మనసార పఠించి, నాయభిప్రాయముల నితరులకు బాహాటముగఁ దెలుపుటకు పరిపూర్ణావకాశ ముండుటవలన, నేను వెనుకటికంటె నధికోత్సాహమున బ్రాహ్మమతగ్రంథములు చదివితిని. ఇంతియ కాదు. మిత్రులు కనకరాజు జగన్నాధరావు నేనును బ్రాహ్మ సమాజ ముఖ్యసూత్రములు విశ్వసించితి మని ప్రతిజ్ఞ చేసికొంటిమి. మావలెనే యింకఁ గొందఱు మిత్రులును మమ్ముఁ జేరినచో, మేము రాజమంద్రిలో బ్రాహ్మసమాజము నెలకొలుప నుద్యమించితిమి !

17. సోదరీనిర్యాణము

చిన్నితమ్ములను చెల్లెండ్రను ఎత్తికొని యాడించుట చిన్ననాఁటనుండియు నా కెంతో ముచ్చట. ఏడ్చుచుండెడి నెలగ్రుడ్డులను సైతము శమింపఁజేయురహస్యము బాల్యముననే నాకుఁ బట్టువడినటు లుండెను. శిశువులను శాంతింపఁజేయ నేను బడెడి శ్రమను జూచి, మాపెద్దపెదతల్లి నన్ను "పెంపుడుతల్లీ !"యని నవ్వుల కనుచుండెడిది. పాలు ద్రావునపుడును భుజించునపుడును దక్క మిగతకాలము, చిన్ని తమ్ములు చెల్లెండ్రును సామాన్యముగ నాచెంతనే గడపెడివారు. వారి నెటుల లాలింపవలయునో బుజ్జగింపవలయునో, మాయమ్మకు వలెనే నాకును దెలిసియుండెను. బాల్యమందు వారలకు నే నిడిన ముద్దుపేళ్లకును, ఉల్లాసము గలుగునట్టుగ వారితో నేను భాషించెడి చిన్ని పలుకులకును, మితి లేకుండెను. కావుననే నాయెడల వారలుకును, మించిన ప్రేమానురాగము లుండెడివి.

1888 వ సంవత్సరము ఆగష్టు 24 వ తేదీని జన్మించిన మాచిన్ని చెలియలు లక్ష్మమ్మ అను వెంకటరత్నమ్మ నాకు బహి:ప్రాణమె ! చామనచాయమేనితో నొప్పి, బక్కపలుచనియాకారము గల యాబాలిక, శైశవముననే తనసోగకనులతో ననుఁ జూచుచు, తన నెత్తికొనుమని నామీఁదికి వాలుచుండును. నాకుఁ జేత నెంతపని యుండినను, చెల్లెలిని దీసి యాడించుచుందును. తనతో నే నాడెడి ముద్దుపల్కులయర్థము తాను గ్రహించినట్టుగనే, ఆశిశువు, మృదుమంద హాసము చేయుచు, తనచిన్నిచేతులతో నామొగము నిమురుచుండును. దానికి నాకును భాష నపేక్షింపని వింతప్రేమ మమరియుండెను. దూరమున నామాట వినఁబడఁగనే యాబాలికి, తనమో మెత్తి, నన్నుఁ జూచి, నాముద్దులు గైకొనుట కాయత్తపడుచుండును !

1889 వ సంవత్సరము వేసవికాలమునకుఁ బూర్వమె దాని శరీరమున విషవ్యాధి యంకురితమయ్యెను. చూచుచుండఁగనే శిశువు కృశించి, మూలుగ నారంభించెను. నే నిలు సేరి యెదుట నిలిచినపుడు, నన్నుఁ దన నిడుద కనులెత్తి చూచి, తన నెత్తుకొమ్మని చేతులు నాదెసఁ జాచుచుండును. తా నమితవేదనకు లోనయ్యును, నాచేతుల నుండు నించుకసేపును హాయిగ నుండునట్లు కానఁబడు చుండును.

ఏమందులు నెట్టిచికిత్సలును ఆశిశువుపట్ల నిష్ప్రయోజనము లయ్యెను. వేసవివడ సోఁకిన చిగురుటాకువలె ననివారిత వ్యాధిపీడిత యైన యాబాలిక కమలిపోయెను. బాలికకు మృత్యు వాసన్న మయ్యెననియె గాక, దాని యపారవేదన కొకింతయైన నుపశమనము గావింప నేరకుంటి మనియు మేము దుర్భర మనోవ్యధకు లోనైతిమి.

మెల్లగ లేఁజివురు వెట్టుచుండు నాయాత్మ కీసందర్భమునఁ గలిగిన కఠినశోధనమునుగూర్చి యొకింత ప్రస్తావించెదను. ఆగస్టు 14 వ తేదీని నాదినచర్యపుస్తకమున లిఖితమైనవాక్యము లిచట నుల్లేఖించుచున్నాను : -

"నేఁడు మధ్యాహ్నము నేను కళాశాలనుండి యింటికి వచ్చునప్పటికి, ఇంట నెవరును లేకుండిరి. మాసొంతపెరటిలోనికిఁ బోయి చూడఁగా, అతిఘోరదృశ్యము నాకుఁ గానవచ్చెను. చనిపోవుచుండు మాకడగొట్టుచెల్లెలిచుట్టును మాతల్లి తమ్ములు చెల్లెండ్రును జేరి విలపించుచుండిరి. శుష్కించిపోయిన యాబాలిక శరీరమునుండి చిన్నదీపకళికవలె ప్రాణము రెపరెప మని యారిపోవుచుండెను ! ఆ కళేబరమునుండి యుచ్ఛ్వాస మొకటిరెండుసారులు వింటిమి. తుదిమరణవేదన ననుభవించి, ఆశ్రుపూరితములగు మాకనులయెదుటనె యా చిన్నిప్రాణ మంత నస్తమించెను.

"దు:ఖ మేమియో యెఱుంగని మా చిన్ని తమ్ముడు సూర్యనారాయణ, మే మందఱము విలపించునంతసేపును దూరమున నూరకు చూచుచుండి, శవము గొనిపోఁబడునపుడు అకస్మాత్తుగ నేడువసాగెను !

"ఇపుడు మృత్యువునోటఁ బడిన మాముద్దుచెలియలు సరిగా నొకవత్సరమె యీభూలోకజీవిత మనుభవించెను.

"కుటుంబమున తలిదండ్రులకును గొమరితకును, అన్న యక్కలకును జెల్లెలికిని, ఎడఁబాటు కలిపించిన యీదిన మెంతటికఠిన దుర్దినము ! హృదయశల్యమగు నిట్టి కష్ట మాపాదించిన యీ నికృష్టదినము నా కెన్నటికైన మఱపువచ్చునా ?

"విపత్తు సంభవించిన నాఁటిరాత్రియె నా యాంతరంగికమిత్రమగు నీదినచర్యపుస్తకమునకు నామనోవేదనను వినిపించుచున్నాఁడను. నేను సంతాపనిమగ్నుఁడనైయున్నాను. దు:ఖాతిరేకముననే నాహృదయము మొద్దుపాఱియున్నది. నే నెవరినో నాకుఁ దెలియదు ! నేఁడు మధ్యాహ్నము మాకు సంభవించిన కష్టమున కర్థము గ్రహింపనేరకున్నాను. చెల్లెలి చావనఁగ నేమి ? నాకన్నులు పొడివాఱిపోయినవి. ఇందువలన నాహృదయము దు:ఖార్ద్రము గా దనుకొనకుమీ ! గాఢ సంతాపాసలమె నానయనముల తేమ నార్చివైచినది ! కాన, నాగుండియ రాతిగుండె యైపోయినది.

"ముద్దులచెలియలా ! నీ వెచటి కేగితివి ? జ్ఞానప్రసారకములగు నీకనుగలువలు, నీవిశాలవదనకమలము, నీసుకుమారశరీరకోరకమును - ఆహా, ఐదునెలలనుండి నిను వేఁచినవ్యాధివలన నెట్లు కమలిపోయినవి ! ఇప్పటికి నీవెతలు పరిసమాప్తి నొందినవి. ఆహా ! చిరంజీవిని వైన నీ వెంతటికీర్తి గడించియుందువోగదా ! అయ్యో, ఇది యెంత రిత్తకోరిక !

"నశరీరులైన మానవులకు అశరీరులగు జీవులతోఁ బ్రస్తావింప సాధ్య మయ్యెనేని, ప్రియసోదరీ, ఈతరుణమున నిన్నొకింత ప్రశ్నింపఁ గాంక్షించుచున్నాఁడను. అతిబాల్యముననె ప్రేమాతిరేకమున నీవు నన్ను 'అన్నా' యని పిలిచెడిదానవు. చెల్లీ ! దు:ఖభూయిష్ఠమగు నీభూలోకమున నీ వేల యావిర్భవించితివి ? నీ విపుడు మృత్యువువాతఁబడి మటుమాయ మైపోయితివిగదా. విఫల మనోరథుఁడనగు నాకు నీయెడఁగల ప్రేమాతిశయము నెట్లు నీ కింక వ్యక్తపఱుపఁగలను ? ఎవ్విధమున నీస్మారకచిహ్న మిచట నెలకొల్పనగును ?"

18. నూతన దృక్పథము

నూతన మతాన్వేషణమునుగుఱించి 1889 వ సంవత్సరమధ్యమున నాకుఁ గలిగిన యుత్సాహోద్రేకములు, ఆ సంవత్సరానంతరము వఱకును నా మనస్సును గలఁచివైచినవి. ఇదమిద్ధ మని నేను నమ్మవలసినది వైష్ణవమా క్రైస్తవమా, సంస్కరింపఁబడిన హిందూమత ధర్మములా, ప్రార్థనసమాజవిధులా; - యని నే నా యాఱునెలలును తల్ల డిల్లి తిని. ఈవిషయమై సత్యనిరూపణము చేసికొనుటకు స్నేహితులతోఁ జెలిమి చేసితిని, సావాసులతోఁ జర్చలు సలిపితిని, సభలలో నుపన్యాసములు వింటిని, సద్గ్రంధపఠనముఁ గావించితిని. వీనియన్నిటి పర్యవసానము, ఆ సంవత్సరాంతమున నేను బ్రాహ్మమతధర్మవిశ్వాస మలవఱచుకొంటిని. అప్పటినుండియు నేను మతాన్వేషణమునకై మరల తత్తరపడలేదు. ఉన్నతపర్వతాగ్రమున నిర్మితమగు గృహరాజమువలె, నామతవిశ్వాసము లింతటినుండి స్థిరములు సుందరములునై విరాజిల్లెను. మతగ్రంథపఠన మతపరిశోధనములు చేయుటకును, ఆత్మాభివృద్ధి ఆత్మపారిశుద్ధ్యములు గాంచుటకును వలసిన పరిశ్రమము ఇంతటితో నంతరించిన దని నేను జెప్పుటలేదు. వీని యన్నిటికిని మఱింత యనుకూల మగు నావరణ మేర్పఱిచెడి దృఢత్వ స్థిరత్వములు నా మతవిశ్వాసముల కిపుడు లభ్యమయ్యెననియే నేను జెప్పుచున్నాను.

నా దృష్టిపథమునఁ గలిగిన యీపెద్దమార్పు, 1889 డిశంబరు 31, 1890 జనవరి 1 వ తేదీలదినచర్యలలో స్పష్టముగ వివరింపఁబడెను. అందలి ముఖ్యభాగము లిచట నుల్లేఖించుచున్నాను : "31 - 12 - 89 : - దయామయుఁడవగు తండ్రీ ! నేను ఈ సంవత్సరారంభమున, స్థిరసంకల్పము గాని, దృఢవిశ్వాసము గాని లేకుండెడియువకుఁడను. ఇపు డేస్థితిలో నున్నాను ? అజ్ఞానతిమిరము నుండి నీ జ్యోతిర్మయమండలమువైపున కొక యంజ వేసితిని. ఈ వత్సరమున శరీరమందును, మనస్సునందును, ముఖ్యముగ నీతివిషయమునను, నే నెన్నియో మార్పులు చెందినాఁడను. సత్ప్రవర్తనమున నేనీ వత్సరమున నుచ్చదశ ననుభవించితిని. మనుజుని సచ్ఛీలతా సత్ప్రవర్తనములు దేవదేవునికిఁ బ్రియతమము లని తుదకు నేను గనుగొంటిని." *** "1 - 1 - 90 : - 'సర్వసమర్థుఁడా ! నాశత్రువులనుండి నన్ను రక్షింప నీవే యోపుదువుగాని, కడు దుర్బలుఁడ నగునేను గానుసుమీ !, యని ప్రారంభప్రార్థన సలిపి, నూతనసంవత్సరమున నేను జెల్లింపవలసిన విధులనుగూర్చి యోజించితిని. ప్రథమశాస్త్రపరీక్షకు బాగుగఁ జదువవలె ననియు, తమ్ములయొక్కయు చెల్లండ్రయొక్కయు విద్యాపరిపోషణముఁ గావింపవలె ననియు, పరిశుద్ధాస్తికమతప్రచారము సలుపవలె ననియు, నేను కృతనిశ్చయుఁడ నైతిని. విధికార్య నిర్వహణవిషయమున నే జేసికొనిననియమములఁ గొన్ని యిచట నుదాహరించుచున్నాను : -

1. శరీరసాధకమునుగూర్చి ముఖ్యముగ శ్రద్ధ వహింపవలెను.

2. కోపము, గర్వము, అసూయ, లోభము - వీని నదుపులో నుంచవలెను.

3. ప్రేమ, మతోత్సాహము మున్నగువానిపట్ల మితి మీఱరాదు. 4. నిరర్థకవిషయములనుగుఱించి కాలము వ్యర్థ పుచ్చఁగూడదు.

5. ఏపరిస్థితులందును పరనింద చేయరాదు.

6. మంచిసంగతి నైనను, అధిక వ్యామోహమునఁ జింతింపరాదు.

  • * * *

10. పరీక్షలో నఖండవిజయమున కైన నారోగ్యముఁ గోలుపోవరాదు.

11. ఈవిధులను జెల్లించుచు, దుస్సహవాసములు, దుస్సంకల్పములు, దృష్టదృశ్యములు - వీనిని త్యజింపవలయును."

మతములలో నెల్ల నాకు బ్రాహ్మధర్మము రుచిరముగ నుండెను. బ్రాహ్మసమాజశాఖలు మూఁడింటిలో నాకు సాధారణ బ్రాహ్మసమాజము ప్రియతమ మయ్యెను. నే నిపుడు కళాశాలలోఁ జదువు ప్రాచీనగ్రీసుచరిత్రములోఁ గన్పట్టెడి రెండు రాజకీయపక్షములలోను, ప్రజాయత్తపరిపాలనాపక్షమే నా కిష్ట మయ్యెను. ప్రభు పక్షమువారగు స్పార్టనులు నా కాజన్మశత్రువు లనియు, ప్రజాస్వామిక పరిపాలకులగు అథీనియనులు పరమమిత్రు లనియు నే నెంచువాఁడను. అదేరీతిని, ఆంగ్లేయరాజ్యతంత్రమునఁగల పూర్వాచారపరులు సంస్కారప్రియులును వరుసగా నాకు శత్రుమిత్రకోటిలోనివారైరి ! ఏతత్కారణముననే నేను హిందూసంఘమునఁగల పూర్వాచారపరులను నిరసించుచు, సంస్కర్త లనిన సంతసించువాఁడను. ఆంధ్ర దేశమున నాకు నచ్చిన సంస్కర్త మాగురూ త్తములగు వీరేశలింగము పంతులే. ఆయన సంస్కారప్రియత్వము, ఒకసాంఘికపథముననే గాక, మతరాజకీయాదివిషయములకును వ్యాపించియుండెను. కావున నే నాయన నత్యంతగౌరవమునఁ జూచుచుండెడివాఁడను. కాని, ఆయనతో నేను పలుసారులు సంభాషించుట కిపుడు వలనుపడెడిదికాదు. ఆయన పరీక్షాపత్రములు దిద్దునప్పుడు ఒక నెల మే మాయనతోఁ బ్రసంగింపరాదు. ఇదిగాక, ఆకాలమం దాయన ఏలూరి లక్ష్మీనరసింహముగారి యభియోగములలోఁ జిక్కుకొనియుండుటచేత, పలుమాఱు న్యాయవాదులతో మాటాడుచును, న్యాయ సభల కేగుచును నుండెడివాఁడు. పంతులవంటి సంస్కర్త, సమదర్శి, సత్యసంథుఁడును, సామాన్యజనుల వగపువెఱపులకు లోనగుచు, వ్యక్తిగతకక్షలు సాధించుటకై న్యాయస్థానముల కెక్కుచుండుట, నాకే కాదు, సంస్కారప్రియులగు నామిత్రులకును నెంతయు నసమంజసముగఁ దోఁచెను ! నా స్నేహితులలో నొకఁడు, తానే పంతులవలె సంస్కర్తయై తనమీఁద వ్యాజ్యెము వచ్చినచో, ఆయనవలె న్యాయసభలు చొచ్చి, అందు న్యాయముఁ బడయఁగోర ననియు, న్యాయాధిపతి తనకు విధించునన్యాయమగు దండనమే మౌనమున నంగీకరించి, వలసినచో, కారాగారమున కేగెద ననియును, పలుకుచుండెడివాఁడు ! ఇట్టితలంపులలోఁ గొంత పటుత్వము లేకపోలే దని మే మనుకొనెడి వారము ! ఆ ఫ్రిబ్రవరి 11 వ తేదీని, నేను వెంకటరావు మాటాడు కొనుచు, వీరేశలింగమహాశయుని సమకాలికులముగ నుండుభాగ్యమనుభవించు చుండుమేము, వారిజీవితమునుగుఱించిన యమూల్యసత్యములను సంపాదించి, ఆ యుదారపురుషునిచరిత్రము లోకమునకుఁ బ్రకటిత మొనరించుట మా ముఖ్యధర్మ మని తలంచితిమి. ఆనెల 16 వ తేదీని నేను నా పూర్వస్నేహితుఁడగు శ్రీతోలేటి వెంకట సుబ్బారావుగారిని సందర్శించితిని. వీరేశలింగముగారిచరిత్రము తాను వ్రాయుచుంటి నని యాయన చెప్పెను. నా కిది మిగుల విపరీతముగఁ దోఁచెను. కొలఁదిదినములక్రిందటనే యీసంగతినిగుఱించి వెంకట రావుతో మాటాడునప్పుడు, ఇట్టి జీవితచరిత్రములలో సత్యము ప్రథాన మని తలంచితినిగదా. ఈ చరిత్రకారుఁడు లోఁతుచొరని వికటకవి యని నా యప్పటితలంపు. దైవసహాయ మున్నచో, వీరేశలింగముగారి జీవితచరిత్రమును మెకాలెవలె సంగ్రహవ్యాసరూపమున నేను రచింప నుద్దేశించితిని. నాయాశ్చర్య మే మని చెప్పను ? ఆమఱుసటిదినమే కాంతయ్యగారిని నేను గలసికొనినప్పుడు, పంతులుగారికిని, గౌరరాజు లక్ష్మీనరసింహముగార్లకును గలభేదములనుగూర్చి యాయన నాతో ముచ్చటించెను. వీరిలోఁ గడపటివారు మొదట వితంతూద్వాహపక్షపువా రయ్యును, పంతులుగారియెడ మనస్పర్థ లూని తనపేరునకుఁ గళంకము తెచ్చుకొనె నని చెప్పెను. పంతులుగారి శీలమునఁగల కొఱంతలును కొన్ని యాయన సూచించెను.

మతవిశ్వాసములందు నా కిపుడు కొంత స్థిరత్వము గలిగినను, హిందూసంఘమున నల్లి బిల్లిగ నల్లుకొని, జనులయభ్యుదయ మరికట్టెడి దురాచారప్రాబల్యము కనిపెట్టినపు డెల్ల నాడెందమున నాగ్రహ ముప్పొంగెడిది ! పూర్వాచారపరాయణత్వము నా ప్రబలవిరోధి యని పరిగణించువాఁడను. ఆజనవరి 3 వ తేదీని, మాతల్లి వలదని ఘోషించుచుండినను, నా చెవిపోగులు తీయించివైచి, దిగ్విజయము చేసితి ననుకొంటిని ! ఆమార్చి 21 వ తేది సంవత్సరాదిపండుగనాఁడు, అభ్యంగనము మానివైచి, పూర్వాచారధిక్కారము చేసితినని యుప్పొంగితిని ! ప్రాఁతనేస్తుల సావాసము నా కిపుడును ప్రియమయ్యును, వారిలో పూర్వాచారాపరాయణులగు కొండయ్యశాస్త్రి వంటివారిమీఁద కొంత "మోజు" తగ్గెను. వెంకటరావు నా కాంతరంగికమిత్రుఁ డయ్యెను. మతవిశ్వాసములందు భిన్నాభిప్రాయుఁ డయ్యును. సంఘదురాచారనిరసనమున నా కాతఁడు పరిపూర్ణసాను భూతిఁ జూపుచువచ్చెను. కాని, యాచారసంస్కరణవిషయమై శాంతనార్గ మవలంబనీయ మని నా కాతఁడు హితవు చెప్పుచుండెడివాఁడు. దురాచారమును ఆగర్భశత్రువుగఁ జూచుచుండెడివాఁడను నేను. ఎట్టిదురాచారనిరసనమందైన, మనశ్శాంతిని గోలుపోక, కుటుంబ సౌఖ్యమును, సాంఘికసామరస్యమును జెండాడవల దని బోధించు చుండువాఁ డాతఁడు. మాయాసంస్కరణవ్యాసంగమునఁబడి యారోగ్యముఁ బోగొట్టుకొనుచుంటి నని శాస్త్రి మున్నగు స్నేహితులు నన్నుఁ బలుమాఱు హెచ్చరించిరి. మా పెద్దతమ్ముని పెండ్లిమాట లిపుడు జరుగుచుండెను. ఇపుడు వివాహము వలదని నే నింట తలిదండ్రులతో మిక్కిలి పట్టుదలతో వాదించుచుంటిని. నా తీవ్రవాదన యర్థము సరిగా లోకులు గ్రహింపక, లేనిపోనియుద్దేశములు నా కారోపింతు రనియు, కాన, నేను గడుసుఁదనమున మితభాషిత్వ మూమటయె శ్రేయ మనియు వెంకటరావు నాకు బోధనఁజేసెను.

30 - 3 - 90 తేదీన సంస్కరణవిషయమై ముత్తుస్వామిశాస్త్రికిని నాకును దీర్ఘ సంభాషణము జరిగెను. సంస్కరణముల నాచారణమునఁ బెట్టుటయందు భార్యసానుభూతిసాహాయ్యము లత్యంతావశ్యకము లని యతఁడు చెప్పెను. హిందూయువతులకు పాతివ్రత్య మనునది యమూల్యాభరణము. దాని నూఁతగాఁ గొని, పురుషుఁడు స్త్రీపై నిరంకుశాధికారము చెల్లింపవచ్చును. క్రొత్తగఁ గాపురమునకు వచ్చిన భార్య నొకసారిగాఁ దనసంస్కరణమహార్ణవమున ముంపఁబూనక, సంస్కరణపక్షమునం దామె కభిరుచి పుట్టించుటకై సంస్కర్త మెల్ల మెల్లగ ప్రబోధము గావించుచుండవలెను. తలిదండ్రులయెదుట నైనను మన సంస్కరణతీవ్రతను జూపింపక, విచారపూరితమగు మన మౌన మితభాషిత్వములుచూచి వారు ప్రశ్నింపఁగా, అపుడు మాత్రమే, హిందూసంఘవృక్షమునకు వేరుపురుగులగు దురాచారముల సంగతి వారికి మనము సూచింపవలె ననియు శాస్త్రి నాకు బోధించెను. వేగిరపాటు నైజగుణముగఁగల నాకీ సామపద్ధతి సంకెలవలెఁ దోఁచెను ! సంఘసంస్కర్త సమష్టికుటుంబజీవితమును త్యజించినఁగాని, అతనికి సతికిని బొత్తు గలియ దనియు, భార్యాభర్తలకు బాహాటముగా సంభాషణములు జరుగుట కవకాశ మేర్పడినఁగాని సంస్కరణవిషయము లందు పత్ని కామోదము గలుగ దనియు, నానిశ్చితాభిప్రాయము. ఐనను, మిత్రులయాలోచనలలోఁగల యమూల్యసత్యముములనుమాత్రము నేను గ్రహించుచుండువాఁడను.

19. సంఘసంస్కరణసమాజము

1900 మార్చిమాసారంభమునుండి సంఘసంస్కరణ విషయమున నా యుత్సాహము కడు తీవ్రముగ నుండెను. సహపాఠియగు చెన్నాప్రగడ నరసింహము నేనును ఆనెల మొదటితేదీని మాటాడుకొనుచు, సంస్కరణోద్యమవిధుల ననుసరించి నడువఁగోరితిమేని హిందూసంఘ దురాచారముల కెల్ల మూలకందమగు సమష్టికుటుంబ జీవితమున కొడంబడక, భార్య కాపురమునకు వచ్చినది మొదలు వేరుగ నుండుట ప్రథమకర్తవ్య మని మేము నిర్ధారించుకొంటిమి. ఆమఱునాఁడు వెంకటరావు, ఇంకొకస్నేహితుఁడు నేనును సంస్కరణవిషయమై ప్రసంగించితిమి ఉద్రిక్తచేతస్కుఁడనగు నాకుఁ గల కార్యతీవ్రత తనకు లేమింజేసి, జీవితమున నా నాయకత్వ మనుసరించి, నిరతము నా యడుగుజాడల నడచుచు, నా యుద్వేగమును తగ్గింపవలసినపు డెల్ల నన్ను దా వెనుకకు లాగుచుందు నని వెంకటరావు చెప్పినప్పుడు, అహంభావమున నేను మిన్ను ముట్టితిని. ఆ యేడవతేది రాత్రి కనకరాజు వెంకటరావు నేనును గలసికొని, సంస్కరణోద్యమమును కార్యాచరణమునకుఁ గొనివచ్చుటనుగూర్చి ముచ్చటించితిమి. మా మువ్వురిలోను గృహస్థాశ్రమానుభవము గలవాఁడు కనకరా జొక్కఁడే. విద్యాగంథ మెఱుఁగని భార్యయు, పూర్వాచారపరాయణ యగు పినతల్లి యు, తన సంస్కరణనిరతికి విముఖలై తనకు గుదిబండలుగ నున్నా రని యాతనిమొఱ ! జనాభిప్రాయభీతిచే నామిత్రునిమనస్సు మిగుల తల్ల డిల్లుచుండెను.

ఆతని యూహలలోఁగల సత్యము మాకును నచ్చెను. బ్రాహ్మమతస్వీకారఫలితముగ హిందూసంఘమును పూర్తిగా త్యజించుటకుఁ బూర్వము, స్నేహితుల మందఱము నొకకూటముగ నేర్పడి, యేతన్మత గ్రంథములను జదివి, చిత్తబలిమిని సంపాదించుచుండుట కర్తవ్య మని మాకుఁ దోఁచెను. ఇంతలో మా స్నేహబృందమునఁ గొన్నిమార్పులు గలిగెను. వెంకటరావు చదువు మానుకొని, ఆరోగ్యాన్వేషణమునకై స్వగ్రామమునకు వెడలిపోయెను. 12 వ తేదీని కనకరాజు నాతో మాటాడుచు, మాకళాశాలలో పట్టపరీక్ష మొదటితరగతిలోఁ జదువు నొక యోఢ్రయువకుఁడు తనతీవ్రసంస్కారాపేక్షచే సంఘబహిష్కృతుఁ డయ్యె ననువార్త చెప్పెను. మా కిపుడు కావలసినదే యిట్టివారల సావాసము ! నాఁటిసాయంకాలమే గంగరాజు కనకరాజు నేనును, రాజగురు వనుపేరుగల యావిద్యార్థిని గలసికొని, మతసాంఘికవిషయములను గుఱించి మాటాడుకొంటిమి. నాఁడే వీరేశలింగముగారి యింటికిఁ బోయి, సంస్కరణోద్యమమును గుఱించి వారితో రాత్రి యెనిమిదిగంటలవఱకును చర్చ సలిపితిమి. విద్యాపరిపూర్తియై స్వతంత్రుల మైనపిమ్మట, మేము జాతిభేదములను త్యజించి యభీష్టమార్గ మవలంబింపవచ్చు ననియు, ఈమధ్యగ మే మందఱము నొకసంఘముగ నేర్పడి, సంస్కరణమునుగూర్చి జనులలో సంచలనముఁ గావింపవలె ననియును మేము నిర్ణ యించుకొంటిమి.

నా సంస్కారప్రియులగు మిత్రులలో మఱికొందఱినిగుఱించి యిచటఁ జెప్పవలయును. తాడినాడ గంగరాజు కళాశాలలో ప్రథమ వత్సరముననే నా సహపాఠి, నరసాపురనివాసి యగుటచే నితఁడు కనకరాజున కిదివఱకే స్నేహితుఁడు. ప్రప్రథమమున నీతఁడు మతవిశ్వాసము లేనివాఁ డైనను, సంఘసంస్కరణ మనిన నావలెనే చెవిగోసికొనువాఁడు. హిందూదేశమందలి ప్రస్తుత పరిస్థితులనుబట్టి, ఆస్తికులు గానివారు సంస్కరణోద్యమమును జనరంజకముగఁ జేయఁజాల రని మిత్రులము బోధించుటచేత, క్రమముగ నీతనికి బ్రాహ్మమత విశ్వాస మంకురించెను. పర్లాకిమిడి వాస్తవ్యుఁడగు రాజగురువు, బ్రాహ్మమతవిశ్వాసి యైనను గాకున్నను, దానియం దధికాభిమానము గలవాఁడు. సంఘసంస్కరణము నందు మా కెవరికిని దీసిపోని పట్టుదల గలిగి, వాక్కర్మలం దేమాత్రమును వేగిరపాటు లేక మెలఁగ నేర్చినవాఁడు. మంచి యొడ్డుపొడుగు కలిగి, వట్టి విద్యార్థివలెఁ గాక యేయుద్యోగివలెనో యితఁడు గానఁబడుటచేత, నిదానమున నీతఁడు చెప్పుమాటలు శాంతమూర్తి యగు ననుభవశాలినోటినుండి వెడలు హితవాక్కులవలె వినవచ్చుచుండెను. మితవాది యగు నిట్టివాఁడు మధ్యవర్తిగ నుండుట మంచి దని తలంచి, మాసభలకు దఱచుగ నీతని నగ్రాసనాధిపతిగ నెన్ను కొనుచుందుము.

సత్తిరాజు మృత్యుంజయరావు పట్టపరీక్షయం దొక శాఖలో గెలుపొంది, సంఘసంస్కరణముపట్ల నమితాభిమానము గలిగియుండువాఁడు. ఇతనిసోదరు లిరువురు నాకు సహపాఠు లైనను, వారలతో కంటె నీతనితోనే నాకు చన వెక్కువ. పఠితలకు ముత్తుస్వామిశాస్త్రి పరిచయ మిదివఱకే కలిగినది. ఇతఁడు మాయందఱివలెనే మతవిషయములందు పెక్కు మార్పులు చెందినను, వానిని వెనువెంటనే లోకమునకుఁ బ్రచురింప వేగిరపడు చుండుటవలన,నిలుకడ లేనివాఁడని పేరుపడెను. ఐనను, అప్పటి కప్పుడే యుద్యోగి గృహస్థుఁడు నైన సంస్కారప్రియుఁ డగుటంజేసి, ఈతఁడు వయోవిద్యాదులందు వెనుకఁబడియుండు మాయందఱకు నాదర్శప్రాయుఁడగు నాయకుఁడు గాకున్నను, అనుభవజ్ఞుఁడును ఆలోచనాపరుఁడునునగు సహాయకుఁ డయ్యెను. వట్టి విద్యార్థుల మగు మాకు సంస్కరణమహావిషయములందు దోఁపని యాలోచనలు చెప్పుచు, మాభావములకు దోహదములు గలిపించుటయం దాతఁడు చక్కని నైపుణ్యమును జూపుచుండువాఁడు.

ఇట్టి సంఘసంస్కారప్రియు లందఱికి నేకీభావము నొడఁగూర్చి, వారలను కార్యరంగమునకు దింపఁగల సాధనమునకై మే మిన్నాళ్లును యోజించితిమి. తుట్టతుదకు, సంఘసంస్కరణ సమాజ స్థాపనార్థమై 15 వ మార్చి తేదీని మేము సభ చేసితిమి. నూతన సమాజోద్దేశములనుగుఱించి ప్రసంగించుచు నేను, "తమ హృదయము లందు మతాభినివేశమును, ప్రజాక్షేమాభిలాషయుఁ గలిగి, స్వార్థ త్యాగమున కాయత్తు లగువారలే యీ సమాజసభ్యత్వమున కర్హు"లని యుద్రేకమునఁ బలికినపుడు, మొదటనే యిట్టి తీవ్రనియమాచరణమున కెవరును సమకట్ట రని కొందఱు చెప్పివేసిరి. ఎట్టకేలకు సంఘసంస్కరణసమాజము స్థాపిత మయ్యెను.

ఆనెల 21 వ తేది సంవత్సరాదిపండుగనాఁడు. ఏతత్సమాజ విధుల నేర్పఱుచుటకు బాలికాపాఠశాలలో సభ కూడెను. ముత్తుస్వామిశాస్త్రి అగ్రాసనాధిపుఁడు. "సంఘసంస్కరణసమాజ మను పెద్ద పేరు పెట్టుకొనుటవలన ముందుగనే మనము జనుల యసూయాగ్రహముల కనవసరముగ గుఱి కావలసివచ్చును. మన సమాజసభ్యులలోఁ బలువురు విద్యార్థులే. కావున నట్టివారు మున్ముందుగనే తమ తలిదండ్రులద్వేషమున కాహుతియై తమ చదువునకు స్వస్తి చెప్పవలసి వచ్చును. కావున మనము సాధువులగు నామవేషములు దాల్చి శాంతముగఁ బనులు చక్కపెట్టుకొనుట శ్రేయము." అని యాయన యోజన చెప్పెను. రాజగురువున కీ 'రాజీ' సూత్రము రుచింపక, "అయ్యా, మన కీవిషయములందు సరళ ప్రవర్తనమే శ్రేయోదాయకము. గూఢవర్తనము ముమ్మాటికిని బనికిరాదు !" అని యతఁడు చెప్పివేసెను. నే నంత లేచి, "ఈసమస్యకుఁగల రెండు దృక్పథములును మన కిపుడు గోచరించినవి. అతివాదులకు సంఘసంస్కరణసమాజమనుపేరు నిలుపుకొనవలె ననియు, మితవాదుల కందు మార్పు చేసి కొనవలె ననియు సంకల్పము. మన మిది పర్యాలోచింపవలెను. పేరు నందు మార్పు అగత్యమా ? ఉన్న పేరు తీసివేసి యింకొకటి గైకొని నంత మాత్రమున, విధాన మేమియు మారదుగదా ? కావున బొత్తిగ నంధప్రాయులు కానిచో, ఏదేని యొక సంస్థను జనులు దానిపేరునుబట్టి గాక, దాని గుణకర్మలనుబట్టియే విమర్శింతురు. కావున ప్రస్తుతనామము ప్రజల యాగ్రహమును బురికొల్పు ననుమాట వట్టిది. * * *" అని ప్రసంగించితిని.

అపుడు స్థాపితమైన మాసంఘసంస్కరణసమాజము వారము వారమును బాలికాపాఠశాలలోఁ గూడెడిది. ఆభవనమునందే ప్రార్థనసమాజసభయును ప్రతివారము జరుగుచుండెడిది. రెండు సమాజముల సభ్యులు సామాన్యముగ నొక్కరే యగుటచేత, ఒకరిచర్యల కొకరు బాధ్యత వహింపవలసివచ్చెడిది. ఇపు డీ ప్రార్థనసమాజకార్యక్రమ మున జరిగిన యొక యుదంతమునుగూర్చి చెప్పవలెను. ఆదినములలోనే ప్రార్థనసమాజవార్షికోత్సవము జరిగెను. ఉత్సవఁపుఁ గడపటినాఁడు, సభికులు పట్టణమున కనతి దూరమందలి సారంగధరపర్వతమునకుఁ బోయి, ఆ నిశ్శబ్దస్థలమున, ప్రార్థనానంతరమున, తమసమాజ సౌభ్రాతృత్వమునకు సూచకముగఁ గలసి ఫలాహారములు చేయుట యాచారమయ్యెను. ఇది గర్హ్యమని హిందూసంఘమువా రెంచి, యిట్టి సంఘసభ్యులను బహిష్కృతులను గావించుటకు గుసగుసలు సలుపుచువచ్చిరి. ఆనెల 22 వ తేదీని ప్రార్థనసామాజికులము సారంగధరుని మెట్టకుఁ బోయితిమి. ఫలాహారము చేసినవారికి సంఘబహిష్కార మగు నని మాకుఁ దెలిసెను. ఇట్టిబెదరింపులకు భయపడవల దనియును, కష్టనష్టము లాపాదించినచో సహనబుద్ధితో మెలంగుట సంస్కరణ పరాయణులకర్తవ్య మనియును నేను జెప్పితిని. కనకరాజున కీ మాటలు కోపము కలింగించెను. తనపొడ కిట్టనిచో, మాకు ప్రతిబంధకము గాక, తాను వెడలిపోయెద నని యాతఁడు చెప్పివేసెను ! ఎట్ట కేల కాతనిని శాంతింపఁజేసి కొండమీఁదికిఁ గొనిపోయితిమి. ప్రార్థన ఫలాహారము లైనపిమ్మట, పర్వతము దిగి, ముత్తుస్వామి శాస్త్రి బ్యాండుస్వరము పాడుచుండఁగ, మే మందఱము, సైనికనికాయము వలె పదతాడనము చేసి నడుచుచు, బాలికాపాఠశాలయొద్ద విడిపోయి, యెవరియిండ్లకు వారు వెడలిపోయితిమి.

20. జననీజనకులతోడి సంఘర్షణము

నేను సంఘసంస్కరణమును గుఱించి తీవ్రాభిప్రాయములు గలిగి, నిర్భయముగ వానిని వెల్లడి చేయుచుండుటచేత, నా కెల్లెడలను విరోధు లేర్పడిరి. ఇంటను, బయటను సంస్కరణమును గుఱించి నిరతము ప్రసంగించుటయె నా కపుడు ముక్తిమోక్షము లయ్యెను ! దీనిపర్యవసానము, సమాజమిత్రులు నన్ను 'సుబోధకు' డని పిలువసాగిరి ! రాజగురువు నన్ను 'పవిత్రగురువు' అని సంబోధించుచుండువాఁడు! హాస్యార్థమే వారు నా కిడినయీకితాబులకు నేను గులుకుచుండు వాఁడను ! అతిమితభాషి నని న న్నిదివఱకు గేలి చేసినబంధుమిత్రులు, వాచాలుఁడ నని న న్నిపుడు దిసంతులుగొట్టిరి ! సంస్కరణాభిలాషము మనసున కెంత హాయిగ నున్నను, ఒక్కొక్కప్పు డదియె నన్ను జిక్కులలో ముంచి, వ్యాకులతపాలు చేసెను. దీని కప్పటిసంగతులు రెండు ఉదాహరణములు లిచ్చుచున్నాను.

మా మేనత్తకుమారుడు మంత్రిరావు నరసయ్యగారు, తన పెద్దకుమార్తెను మాతమ్ముఁడు వెంకటరామయ్య కిచ్చి వివాహము చేయ నిశ్చయించుకొనిరి. దీనికి మా తలిదండ్రులు సమ్మతించిరి. నాకుమాత్ర మిది బొత్తిగ నిష్టము లేదు. నాయసమ్మతికిఁ గారణము నాసంస్కరణాభిమానమే గాని, వ్యక్తిగతమైన యాక్షేపణ మేదియుఁ గాదు. వథూవరు లిదివఱకె దగ్గఱబందుగులై బాల్యదశయం దుండుట నాయాక్షేపణమునకు విషయము. మార్చి 16 వ తేదీని యీసంగతిని గుఱించి మాతమ్మునితో మాటాడితిని. విద్యాస్వీకారము చేయుచుండెడి యాతఁడు నాయాలోచన విని, సంస్కరణపక్ష మవలంబించుట న్యాయ మని వక్కాణించితిని. నేను జెప్పినదాని కాతఁడు సమ్మతించెను గాని, తలిదండ్రులు పట్టుపట్టిన నేమిచేతు నని యడిగెను. విద్యాప్రాజ్ఞతలు గల వరుని కిష్టము లేని వివాహము జరుగ దనియె నేను జెప్పితిని. తన కెప్పటికిని పరిణయ మసమ్మత మని యతఁడు పలికినపుడు, విద్యాపరిపూర్తి యైన యౌవనసమయమున విద్యావతిని వివాహమాడుట తనవిధి యని యంటిని. సోదరున కిట్టిబోధన చేయుట యందుకాలుష్య మేకోశమందైన దాఁగొనియెనా యని నేను హృదయ పరిశోధనము గావించుకొని, నాసంస్కారాభిమానమే దీనికిఁ గారణమని స్పష్టపఱుచుకొంటిని ! నే నింతటితో నూరకుండక, వధువు సోదరుఁడును, కళాశాలాసహవాసుఁడును నగు వెంకటరత్నముతో నీ సంగతిని గూర్చి మాటాడి, యీబాల్యవివాహమున కడ్డపడు మని వానికిని బోధించితిని. అతఁడు సమ్మతించినను, తనకుఁగూడ వివాహము చేయఁ బూనిన తండ్రి, తనమాటలు వినకుండు నేమో యని భీతిల్లెను.

అంతటఁ గొన్నిదినములకు నరసయ్యగారు మాయింటికి వచ్చి, మాజనకుఁడు గ్రామాంతరమున నుండుటచేత, తాను సంకల్పించుకొనిన యీవివాహమును గుఱించి నా యభిప్రాయ మడిగిరి. ఆయనతో ధారాళముగ మాటాడ నొల్లక, నాబోటిపసివారు అభిప్రాయ మీయఁ దగ రని చెప్పివేసియూరకుంటిని ! నాయసమ్మతిని మితభాషిత్వమున మాటుపఱిచి, గర్వమునఁ గులుకుచుంటి నని నన్నాతఁ డెత్తిపొడువఁగా, వివాహమును గుఱించి వరుఁడె పలుకవలయును గాని, యితరుల యూహ లేమిప్రయోజన మని యంటిని. అంత టాయన, "వరుఁడు బాలుఁడు కావున, నతనిసమ్మతితో మనకు ప్రసక్తి లేదు. నాకుమారునిసంగతి చూడు ! ఈసమయమందే వానివివాహమును గదా. పెండ్లిని గుఱించి ప్రస్తావము వచ్చినపు డెల్ల, వాఁడు తల వాల్చియుండును. కాఁబట్టి యిట్టిబాలురవిషయములో పెద్దవాళ్లె యోచింపవలెను " అని పలుకఁగా, నేను, "కావుననే పిల్లలమగు మ మ్మాలోచన లడుగక, పెద్దలగు మీరును, మాతండ్రియును మీచిత్తము వచ్చినట్టె చేయరాదా ?" అని రోషముతోఁ బ్రత్యుత్తర మిచ్చితిని.

రెండవసంగతి, యిటీవల జరిగిన ప్రార్థనసమాజ వార్షికోత్సవ సందర్భమునఁ గలిగిన యాందోళనము. కళాశాలలో పండితులగు కస్తూరి శివశంకరశాస్త్రిగారు పూర్వాచారపరాయణత్వమునకుఁ బట్టు గొమ్మ. మొన్నటి ఫలాహారములకై ప్రార్థనసామాజికులకు సంఘబహిష్కార మగు నని యాయన కొందఱితో ననెను. ఇది తెలిసి మా తలిదండ్రు లలజడి నొందిరి. ఆనెల 27 వ తేదీని ప్రొద్దున నేను భోజనము చేయుచుండఁగా, మాతల్లి నాతో, "నాయనా ! మనది పెద్దకుటుంబము. పిల్లల కందరికీ పెండ్లిండ్లు పేరంటములు కావలసియున్నవి. మ మ్మందరినీ చిక్కులపాలు చేయదలచుకొన్నావా యేమి?" అనినపుడు, "ఏమి టిది? నే నేమిచేసినానో చెప్పితే సమాధానము చెప్పుతాను !" అని పైకి గంభీరముగఁ బలికితినే గాని, మాతమ్మునికి వెంకటరత్నమునకును వివాహ మాడవల దని నే జేసిన రహస్యబోధన వారిచెవులఁ బడినదా యని లోన నేను భీతిల్లితిని ! మాతల్లి సూచించినసంగతి యిది గాక, మొన్న సారంగధరుని మెట్టమీఁది ఫలాహారముల యాందోళన మని తెలిసి, తల తడివి చూచుకొని, "దాని కేమిలే! కిట్టనివాళ్లు పరిపరివిధముల చెప్పుకుంటారు - వీరేశలింగముగారి యింట తయారైన ఫలాహారములు పుచ్చుకొనేవెఱ్ఱివారము కాములే ! మాతోపాటు కచేరీగుమస్తా లనేకులు ఫలాహారములు చేసినారులే !" అని నేను సమాధానము చెప్పితిని.

ఉదంతము లింత సులభముగా నంతమొందినవి గావు. కొన్ని దినములపిమ్మట, రాత్రి భోజనసమయమున, మాతండ్రి నాతో మతమునుగుఱించి సంభాషించుచు, :భగవంతుడు హృదయాలయమందే దర్శింపఁదగినవాఁ డనుట వాస్తవమే. కాని మనము జనాభిప్రాయమునకు వెరవక తప్పదు జాతిమతభ్రష్టు లై పోయిన క్రైస్తవులపాట్లు దేవునికి తెలుసును" అని పలికెను. నేనుమాత్ర మిది యొప్పుకొనక, సత్య మని నమ్మినచొప్పున నడుచుకొనెడివారిని దురదృష్టవంతు లన వీలు లే దనియు, బుద్ధిపూర్వకముగ స్వీకరించిన మార్గమునఁ గలిగిన కష్టసుఖములను సమత్వమున వా రనుభవించుట న్యాయ మనియును నేను జెప్పివేసితిని.

మా దీర్ఘ సంభాషణ ఫలితముగఁ దేలినసంగతులు నేను దినచర్య పుస్తకమున నిట్లు విమర్శించితిని : - "మా జనకుఁడు జనాభిప్రాయమును శిరసావహించెడిభీరుఁడు; నే నన్ననో, స్వబుద్ధి సూచించిన సత్యపథమునఁ బోయెడిధీరుఁడను. ఆయన, పామరజనాచారములను గౌరవించి యనుసరించువాఁడు; నేను, వానిని నిరసించి నిగ్రహహించెడి వాఁడను. వే యేల, మా నాయన పూర్వాచారపరాయణుఁడు; నేను నవనవోన్మేషదీధితుల నొప్పెడి సంస్కారప్రియుఁడను !" పాఠకులు నా యౌవనమునాఁటి యహంభావమునకు వెఱ గంద కుందురు గాక !

21. ముత్తుస్వామిశాస్త్రి విపరీతవిధానము

ముత్తుస్వామిశాస్త్రి నాసహవాసు లందఱిలోను విద్యాధికుఁడును, మేధాశక్తిసంపన్నుఁడును. ఒక్కొకసరి యాతఁడు సంఘ సంస్కారవిషయములందు చోద్యములగు సూత్రములు సిద్ధపఱచు చుండువాఁడు. ఆయేప్రిలు 10 వ తేదీని నేను మృత్యుంజయరావుతోఁ గలసి, శాస్త్రిదర్శనమున కార్యాపుర మేగితిని. మే మనేకసంగతులను గుఱించి మాటాడుకొంటిమి. అంత మాసంభాషణము సంస్కరణములదెసకు మరలెను. "ఏటి కెదు రీదినంతమాత్రమున మనము సంస్కారులము కాఁజాలము. పూర్వాచారపరాయణులవలెనే మనమును కర్మ కలాపమును విసర్జింపక, నిరర్థక మని నమ్మినయాచారకాండ ననుష్ఠానమునకుఁ దెచ్చి, సంఘమును మెల్ల మెల్లగ మనవైపునకుఁ ద్రిప్పుకొనవలెను." అనునాతనిమాటలు మాకు హాస్యాస్పదములుగఁ దోఁచెను. "ఈపద్ధతి నవలంబించినచో, జనులలో నిరసించెడి కాపట్యమును మనమె పూనుచుండుటలేదా ?" అని నే నడిగితిని. అట్లు కాదని యాతఁడు సమాధానము చెప్పుచు, "పూర్వాచారపరులకంటె మనమె మంత్రతంత్రములు బాగుగ పఠించి, కర్మకాండ జరుపుట యందు ప్రవీణుల మైతిమేని, ఇపుడు వారిదెసకుఁ బ్రవహించెడి ద్రవ్య వాహినిని మనవైపునకు మరలించుకొనవచ్చును. ఇట్లు మనము జనులను సంతృప్తిపఱచి, సంస్కరణపథమునకు మెల్లగ వారిచిత్తములఁ ద్రిప్పవచ్చును" అని శాస్త్రి బోధించెను. ఇట్లు పై కెంతో మంచివిగఁ దోఁచెడియెత్తు లాతఁడు వేయుచుండువాఁడు. పిమ్మట నేను వీరేశలింగముపంతులుగారితో నీసంగతి ప్రస్తావింపఁగా, "శాస్త్రిప్రణాళిక నవలంబించినయెడల, ఇప్పటి వైదికబృందమువలెనే మనమును తిండిపోతులముగను కుక్షింభరులముగను బరిణమించి, వట్టి భ్రష్టులమైపోయెదము !" అని యాయన వక్కాణించెను.

మే మాతనిని గలసికొని మాటాడినపు డెల్ల, శాస్త్రిలో నేదో యొకవింతమార్పును గనిపెట్టుచుండెడివారము ! భూపతనము నొందు పాదరసమువలెను, సంగీతపాటకునినోట 'సరిగమపదనిసల'వలెను, అతని మనస్సు సదా పలుపోకలు పోవుచుండెడిది ! ఉచితజ్ఞత యనునది యాతనిలో లేనేలేదు ! ఊహకు నూహకును గల పరస్పరసంబంధము కనిపెట్టి మఱి మాటాడుట కతని కోపికయె లేదు. కావుననే, స్థిరత్వము లేని చపలస్వభావుఁ డను నపయశస్సు ఆతని కావహిల్లెను. వివిధములు పరస్పరవిరుద్ధములు నగు విధానములఁ బన్నఁగలట్టియు, ఒరులనవ్వులు దుమదుమలును లెక్కసేయక తన విపరీతభావసందోహమును సమర్థింపఁగలట్టియు శక్తి శాస్త్రియందు మూర్తీభవించెను ! కాని, ఆతనియాలోచనలు మామిత్రుల కావశ్యకము లయ్యెను. దైవము గలఁ డని యొకమాఱును లేఁ డని యొకమాఱును సిద్ధాంతరాద్ధాంతములతోఁ గూడిన హేతువాదనలతో నాతఁడు మాయెదుట వాదించు చుండును ! గట్టిప్రయత్నములు చేసి దేశక్షేమంకరములగు సంస్కారములు నెలకొల్పుట విద్యాధికులధర్మ మని యొకతఱియును, మానుష ప్రయత్నము నిష్ప్రయోజన మనియు, కాలప్రవాహమునఁ బడి లోకము శక్తివీడి గొట్టుకొనిపోవుచున్న దని యొకతఱియును, అతఁడు వాదించుచుండును ! వీనిలో ప్రతియొకవాదనయు సహేతుకముగఁ గానవచ్చినను, ఇట్టి వన్నియు నొకపుఱ్ఱెలోనే పుట్టి, ఒక నోటనె బయలువెడలుట గాంచిన యువకుల మగు మేము విభ్రాంత చేతస్కుల మగుచుందుము !

22. జనకుని విచిత్ర చిత్తవృత్తులు

ఇంతలో కళాశాలకు వేసవికాలపుసెలవు లిచ్చిరి. విద్యార్థులగు హితు లెవరిగ్రామమునకు వారు వెడలిపోయిరి. మాకుటుంబముకూడ రాజమంద్రి విడిచెను. మా తమ్మునివివాహ మిపుడు నిశ్చయమయ్యెను గాన, మేము ముందుగ వేలివెన్ను పోయి, అచటినుండి రేలంగి వెళ్లితిమి. అక్కడనుండియె మేము పెండ్లికి తరలిపోవలెను. వివాహమునకు వలయుసన్నాహ మంతయు జరుగుచుండెను.

వివాహమునకు ముందలిదినములలో నింట మాతండ్రి వెనుకటివలెనే సంస్కరణవిషయములనుగూర్చి నాతోఁ జర్చలు సలుపుచుండెడివాఁడు 22 వ ఏప్రిలురాత్రి భోజనసమయమున మా తండ్రి మాటాడుచు, పోలవరముజమీందారు క్రైస్తవుఁ డయ్యె నని మాకువినవచ్చినవార్తమీఁద వ్యాఖ్య చేసి, మతభ్రష్టత్వమును గర్హించి మితిమీఱిన కోపావేశము గనఁబఱచెను. "జాతిబాహ్యుఁడైపోకుండ నెవఁడుగాని సంఘములో నిలిచియె తన యిచ్చవచ్చినట్టుగ నీశ్వరుని ధ్యానింపఁగూడదా ?" అని యాయన ప్రశ్నము. మా నాయన యెపుడు నిట్లు పూర్వాచారపరాయణతయె గనఁబఱచినను కొంత మేలే ! కాని, ఆయన స్థిరత్వము లేక, ఒకప్పు డొకవిధముగను, ఇంకొకసారి యింకొకరీతిని మాటాడుచుండువాఁడు. అందువలన నే నాయనను గపటి యని తలంచువాఁడను. దీనికిఁ దగినంత కారణము లేకపోలేదు.

1. "బ్రాహ్మణులు మహిమాన్వితులు, బ్రహ్మవర్చస్సున తేజరిల్లుమహానుభావులు. వారిని నిరసించి పరాభవించువారికి పుట్టగతులు లే"వని యొకమాఱును, "బ్రాహ్మణులు మ్రుచ్చులు ! వారిని గర్హింపవలెను" అని యింకొకమాఱును.

2. జాతినిగుఱించి మాటాడుచు, "అగ్రవర్ణమున నుండుటయె బ్రాహ్మణునిగౌరవము తెల్పుచున్నది. స్వజాత్యాభిమానము మన ముఖ్యధర్మము" అని యొకప్పుడును, "అన్నిజాతులు నొకటియె. భోజనసమయమున బ్రహ్మణేతరులను జూచుటకు బ్రాహ్మణులు సంకోచపడ నక్కఱలేదు. బొంబాయి ప్రాంతములందలి బ్రాహ్మణులు మనవలె దృష్టిదోషమును పాటింపరు." అని యొకప్పుడును

3. వేదములనుగూర్చి ప్రసంగించుచు, "వేదములు దేవదత్తములు. వేదాధ్యయనసంపన్నుఁడైన బ్రాహ్మణుఁడు దైవసమానుఁడు, పాముమంత్రమునకు దయ్యముమంత్రమునకును పటిమ యుండగా, వేదమంత్రములకు మహత్తు లేకుండునా ? విగ్రహములకు మహిమ లేక పోలేదు." అని యొకప్పుడును, "విగ్రహము లనిన నాకు తలనొప్పి, హృదయమే యీశ్వరాలయము. పూజల కని నేను బ్రాహ్మణులను ప్రార్థింపను." అని యొకప్పుడును మాతండ్రి పలుకుచుండువాఁడు ! ఆయనకుఁ గల యిట్టి పరస్పరవిరుద్ధభావములు చూచినపుడు ఆశ్చర్యమంది, ఆయన కీవిషయములందు కాపట్య మారోపించి నేను కొంత వఱకు సేదదేఱుచుందును !

దినదినమును మా తండ్రిచర్యల వైపరీత్య మతిశయించుచుండి నట్లు నాకుఁ గనఁబడెను. రేలంగిలో నొకనాఁటిరాత్రి మా పురోహితునితో మాటాడుచు, మాజనకుఁడు నన్నుఁ జూపించి, "మతమును గుఱించి చర్చ చేయుటకు మావాఁడు మిక్కిలి సమర్థుఁడు. మొన్న రాజమంద్రిలో వీడు వీనిస్నే హితులును ఒక స్వాములవారితో వేదములు మొదలగువాటినిగుఱించి చర్చ చేసి జయించిరి. దేవు డొక్కడే యనిన్ని, మనుష్యు లందరు సమాను లనిన్నీ మావాడు వాదింపగలడు" అని ఆయనతోఁ జెప్పివేసెను !

దీనినిఁబట్టి మాతండ్రి నాయభిప్రాయములను బాగుగ గుర్తెఱిఁగియె యుండె నని నేను స్పష్టపఱుచుకొంటిని.

ఇది జరిగిన కొలఁదిదినములకు నే నొకప్రొద్దున, "సంస్కరణావశ్యకత" ను గూర్చి తెలుఁగున నొకవ్యాసము వ్రాయుచుంటిని. అప్పుడప్పుడు నాదగ్గఱకు వచ్చి మాతండ్రి నావ్రాఁత కనిపెట్టు చుండెను. రాత్రి భోజనానంతరమున నేను జదువుకొనుచుండఁగా, ఆయన మాపురోహితుని మఱికొందఱిని వెంటఁబెట్టుకొని నాదగ్గఱకు వచ్చి, ప్రొద్దున వ్రాసినకాగితము చదువు మని నన్నుఁ గోరెను. "మా వాడు రాజమంద్రిలో ఒక మతసభకు కార్యదర్శి. జాతు లన్ని యు నొక్కటె యని యతనిమతము. మతవిషయములగుఱించి మీలో నెవరితోనైనను వీడు వాదించగలడు ! మావాడు యింగ్లీషున వేద ములు చదివినాడు" అను నతిశయోక్తులు పలికి, మాతండ్రి నావ్యాసమును వినఁగోరెను. నే నేమి చేతును? బెదరు తీఱి నావ్యాసము చదివి, సంతోషభరితుఁడ నైతిని. భవిష్యత్తున నేను మాహావక్తనై యుపన్యాసములు గావించెద నని యుప్పొంగిపోతిని. ఒకటిమాత్రము నా కింతట స్పష్ట మయ్యెను. సంస్కరణమందు నాకుఁగల గట్టిపట్టుదల మానాయనకు ద్యోతక మయ్యెను. కాని, నాయాశయము లెన్నటికిని కార్యరూపముఁ దాల్చక, కేవల సంకల్పదశయందె యుండు నని మా తండ్రివాంఛ కాఁబోలు !

23. వెంకటరావు సావాసము

నా పూర్వమిత్రుఁడగు వెంకటరావు, ఆ దినములో తన యారోగ్యమునిమిత్తము రేలంగి వచ్చెను. అతనిమామగారు అక్కడనే జమిందారీయుద్యోయై, కుటుంబముతో నుండెను. వేసవి సెలవులు నేనును రేలంగిలోనే గడపుటచేత, నాస్నేహితునిఁ దఱచుగఁ గలసికొనుచు వచ్చితిని. వ్యాధిప్రకోపమువలన నానేస్తునిదేహము మిక్కిలి శుష్కించిపోయెను. ఆనవాలు పట్టలేని రీతిని శరీరము చిక్కియున్నను, అతని మాటలు, అతనివైఖరియును, వెనుకటివలెనే ఝంకరించుచుండెను ! ఆతఁడు రాజమంద్రి విడిచి వచ్చినపిమ్మట నచ్చటి సమచారములు, సంఘసంస్కరణసమాజ స్థాపనము, సారంగధరునిమెట్టమీఁది మాఫలాహారములు, అదికారణముగ బయలువెడలిన మాబహిష్కార వృత్తాంతములు, ఇవియన్నియు సమగ్రముగ నేను వినిపించి, సంస్కరణము పట్ల నతని సాహాయ్యసానుభూతులు స్నేహితుల మాశించుచుంటి మని పలికితిని. తా నెన్నఁడును తలంపనివిధమున మేము పట్టణమునఁ గార్యసాధనము చేయుచుండుట కాతఁడు ముదమంది, నే నభివృద్ధి నొందుట కభినందించెను. ఆ మేనెల 3 వ తేదీని మోగల్లులో మాతమ్మునియొక్కయు, పెత్తండ్రికుమారునియొక్కయు వివాహములు జరిగెను. శుభకార్యానంతరమున మేము రేలంగి వచ్చితిమి.

నా కీ గ్రామమున ప్రాఁతనేస్తుని సావాసము మరల లభించినదని చెప్పితిని. వెంకటరావు నేనును మా యాశయముల గుఱించి దీర్ఘ సంభాషణములు చేయుచువచ్చితిమి. అద్దమున ముఖము గోచరించువిధమున, స్నేహితునిభావము నందు మనశీలము ప్రతిబింబితమగు చుండును. మనసిచ్చి నెచ్చెలులతో మాటాడునప్పుడు, మన యాంతరంగిక రహస్యములు బయటపడుచుండును. మిత్రునిచేష్టలు మన కనులకు గోచరించునట్టె, మనచర్య లాతనికిని గానుపించి, యాతనివ్యాఖ్యానములకుఁ దావల మగుచుండును. వెంకటరావుసహవాసమున నా శీలపరిశీలనముఁ జేసికొనుచు, మిత్రునిగుణావగుణములను గ్రహించుటకు నా కవకాశము గలిగెను.

11 వ మే తేదీని నేను వెంకటరావును జూచుటకు వారింటి కేగితిని. అపు డతఁడు స్త్రీలచేఁ బరివేష్టితుఁడై, వారితో సరససల్లాపములు చేయుచుండెను. నా కిది మిగుల జుగుప్సావహముగ నుండెను. ఆఁడుపటాలము వెడలిపోయిన వెంటనే, చెలికానిని దల వాచునట్టుగఁ జీవాట్లు పెట్టితిని. అంగనల సరసను గూర్చుండి, ఆతఁడు కామోద్రేక ప్రసంగములఁ గాలము గడపుట చింతనీయ మని నే జెప్పివేసితిని ! సుదతులతోడి సద్గోష్ఠి సమంజసమే. కాని, వారు చెంత నుండినపుడు మృదువు మీఱినపలుకులు పురుషుల పెదవులనుండి వెడలినచో, రాను రాను స్త్రీలును తమ నై సర్గికమగు సిగ్గును విడనాడి, వెలయాండ్రవలె వలపుగొలుపు పలుకులు వచించుటకు వెనుదీయరు ! సద్భావపూరితుఁడగు నా స్నేహితునివంటి సంస్కారప్రియుఁడే, సంఘముయొక్క నైతికస్థితి నుద్ధరించుటకు మాఱుగా పామరజనపద్ధతులనే యవలంబించినచో, విద్యాధికులకంటె కపటనటు లెవరుందు రని నేను గట్టిగ నడిగివేసితిని !

రేలంగిలో నున్న దినములలోనే వెంకటరావునకు పునస్సంధానము జరిగెను. జీవితమునందలి తన యున్న తాశయములనుగుఱించి తన చిన్ని భార్యతో నపుడె ప్రస్తావించితి ననియు, ఆమె విద్యాభివృద్ధిఁ గావించుకొనినచో, స్వచ్ఛమగు పతిప్రేమముతోఁబాటు స్వాతంత్ర్యము నాసుదతి పడయఁగలదనియు, నామిత్రుఁడు నుడివెనఁట.

ఆ జూను 3 వ తేదిని నేను వెంకటరావును గలసికొనుటకు వారింటి కేగితిని. ప్రాఁతనేస్తుల మపు డా సాయంకాలమున మా వెనుకటిచరిత్రమును సింహావలోకనము చేసితిమి. తనసంగతి ముందతఁడు ప్రస్తావించెను. తా నెన్నియో బాధలకు శోధనలకును దావలమైతి నని నా మిత్రుఁడు పలికెను. దుష్టులలో నెల్ల దుష్టులతోను, శిష్టులలో శిష్టులతోడను తాను జెలిమిచేసి, తనవర్తననైర్మల్యమును గోలుపోకుంటి నని నాస్నే హితుఁడు నుడివెను. పలుమారు తాను సుడిగుండములఁ బడినను, ఆర్తరక్షకుని కృపామహిమమున శీలసౌష్ఠవ మనుభవించుచుంటి నని నాచెలికాఁడు చెప్పినప్పుడు, హర్ష పులకాంకితుఁడ నైతిని !

అంత నేను నాసంగతి విప్పితిని. మిత్రునకంటె దుర్బలశరీరుఁడ నైనను, దైవానుగ్రహమునను, సత్సహవాసమహిమమునను, నా శీలపవిత్రత సురక్షిత మని నా యుపోద్ఘాతము. కొలఁదికాలము క్రిందటనే, అనఁగా 1889 వ వత్సరమధ్యమున, వొక చెలికాని సహవాసఫలితముగ నేనును 'సైతాను' తాఁకునకు వశము కాలేదా ? గతసంవత్సరము వఱకును హిందూక్రైస్తవబ్రాహ్మమతాదులనుగుఱించి నాకుఁ దెలియనే తెలియదు. ఇపు డట్లు కాదు. నీతి మతసంఘ సంస్కరణములనుగూర్చి నా కిపుడు కొంత తెలిసియున్నది.

నే నొకఁడ నన నేల? నా మిత్రబృందమును మంచిప్రబోధము గలిగియుండిరి. గతసంవత్సరమున చివరభాగమున, పరిస్థితుల ప్రభావమున నా మస్సున భక్తిబీజములు పడి, సంస్కరణావేశ మను మొలక లెత్తినవి. నా సావాసు లందఱు మంచి యభివృద్ధిఁ గాంచిరి. నా చెలికాండ్రందఱికిని నా కభిమతమగు సంస్కరణోద్యమము హృద్య మగుట కడు చోద్యము ! ఈమార్పు రాజమంద్రిలోని సదావరణప్రభావమున ప్రభవించినను, మఱియేకారణమున నుద్భవించినను, ఇపుడు నాసుహృదు లందఱును సంస్కారప్రియులై యుండి రనుట స్పష్టము !

ఇంక చెంకటరావునుగుఱించి : అతఁడు మంచివాఁ డనియె నానమ్మిక. కాని, దుశ్శీలుఁ డని యపవాదము లాసమయమున ప్రబలియుండెను. దీనినిగుఱించి నేను బ్రశ్నింపఁగా, నాకువలెనే తనకును వితంతువివాహసంస్కరణ మామోద మగుటచేత, ఎన్ని కడగండ్లకో యోర్చుచుండెడి యొకబాలవితంతువుదెస తాను సానుభూతి గనఁబఱిచిన తప్పిదమున తాను నిందలపా లైతి నని చెప్పి నా మిత్రుఁడు కన్నీరు తెచ్చుకొనియెను ! మానవహృదయావలోకనము చేయఁగల పరమాత్మునకె యిందలిసత్య మవగాహన కాగల దని నమ్మి, నా మనస్సును సమాధానపఱుచుకొంటిని.

ఇది జరిగిన కొన్ని దినములకుఁ గలసికొనినపుడు, మే మిరువురము నా భావజీవితమునుగుఱించి తలపోసితిమి. పరమజ్యోతిష్కుని వలె వెంకటరావు నన్ను గుఱించి యిట్లు చెప్పెను : - "నీ వీసంవత్సరము పరీక్షలో జయ మంది, రాఁబోవువత్స రారంభమున గృహస్థాశ్రమమునఁ బ్రవేశింతువు. సంస్కరణోద్యమము కొనసాగించుటకు చెన్నపురి పోలేక, రాజమంద్రిలోనే నీవు పట్టపరీక్షకుఁ జదివెదవు. ఒకటి రెండు వత్సరములలో నీకు సంతానప్రాప్తియుఁ గలుగును. గృహభారము శిరమునఁ బడిన నీభార్య విద్యాభివృద్ధి నొనరించుకొన నేరదు. సంస్కారావేశము గలుగునపు డెల్ల, కావింప నేరని సంస్కారములనుగూర్చి నీవు పరితపించుచుందువు ! ఐదాఱువత్సరములలో నీవు ప్రభుత్వోద్యోగ మనునెరను బడి సంస్కరణాపేక్షను పూర్తిగ మఱచిపోయి, మీఁదు మిక్కిలి నీతినియమములకే మోసము తెచ్చుకొందువుసుమీ !"

చెలికానిజోస్యమె నిజ మయినచో, జీవితమునకంటె మరణమే వేయిమడుంగులు మేలుగ నాకుఁ దోఁచెను ! ఉన్నతాదర్శపూరిత హృదయము సతతము నాకు దయచేయు మని దయామయుని వేడుకొంటిని.

24. కమలామనోహరులు

స్వకుటుంబములోనే బాల్యవివాహముల నిరోధింపలేక యూరక చూచుచుండు నామనస్సున వివాహసంస్కరణాగ్ని మఱింత తీవ్రముగ వెలుఁగఁజొచ్చెను. ఆ జూనుమొదటితేదీ సాయంత్రము నేను రేలంగిలో కాలువగట్టున షికారు పోవుచు, నాకు, బ్రియమగు నీవివాహసంస్కరణవిషయమునుగుఱించి తలపోసితిని. మలయమారుతము వీచుచుండెను. కోకిలకూజితము శ్రవణానందకరముగ నుండెను. అయినను, వీనివలన నాహృదయవేదన యుపశమింపకుండెను. ఉష్ణ బిందువులు కనులనుండి జలజల రాలెను. నా మనస్తాపము భావోద్రేకముగఁ బరిణమిల్లెను. అంత నేను సంస్కరణవిషయిక మగు కథ నొకటి కల్పించుకొని వినోదించితిని. రాత్రి యంతయు కథావిమర్శనమునఁ గడపుటచేత కంటికిఁ గూర్కు రాలేదు. మఱునాఁటి దినచర్యపత్రములం దాకథ నింగ్లీషున లిఖించి, భావికాలమున దానిని తెలుఁగున పద్యరూపమునఁ గూర్ప నాశించితిని. ఈజన్మమున నా కిఁక కవిత్వభాగ్య మబ్బుట కవకాశము లేమింజేసి, దాని నాంధ్రమున ననువదించి, "కమలామనోహరులు" అను శీర్షికతో "ఆంధ్రపత్రిక" లో 18 - 1 - 1930 తేదీని ఇట్లు ప్రచురించితిని : -

(1)

నలువది సంవత్సరముల క్రిందట వసంతపురమున నొకబాలుఁడు నొకబాలయుఁ గలరు. సమానప్రాయముగల వా రిరువురును, గ్రామమున నొకశ్రేణినె కాపురమున్న భిన్న శాఖలకుఁ జెందిన సాధు విప్ర కుటుంబములలో జన్మించిరి. కమలామనోహరు లాజన్మమిత్రులు. వీరి స్నేహ సౌహార్దములు పూర్వజన్మఁపునాఁటివే యని లోకు లనుకొను చుందురు ! ఆట పాట లందును, విద్యాలయమునను వా రొకరి నొకరు విడిచియుండువారు కారు. దేహములు వేరైనను, ప్రాణములు వారి కొకటియె ! ఒక్కొకతఱి వారు అనతిదూరమందలి సెలయేటి యొడ్డున కేగి, పెద్దరాతిపలకమీఁదఁ గూర్చుండి, భూమ్యాకాశములు తిలకించి, సుఖసంభాషణములు జరుపుచుందురు.

లోకమున సౌఖ్యకాల మెంత త్వరితగతి నంతరించుచున్నది ! బాల్యవివాహాచారబద్ధు లగు జననీజనకులు, కమలకు పండ్రెండు వత్సరములకె పాతికయేండ్లు నిండునట్లు భావించి, కొమార్తె వివాహ మేర్పఱిచిరి. కమలపెండ్లి మిత్రు లందఱికివలెనే మనోహరమునకు నానందదాయక మయ్యెను. ఏకారణముననో కాని, పెండ్లికూఁతునకే సంతోషావహముగ లేదు. పురుషునికంటె స్త్రీకి, భవిష్యద్దాంపత్య జీవితరహస్యము, అతివేగముగను, స్ఫుటముగను బొడకట్టుచుండును. తన కీపెండ్లి యక్కఱలేదను కమల పలుకులు, అబద్ధమని నిరసించుటకుఁగాని, నిజమని నమ్ముటకుఁగాని తలిదండ్రులకుఁ దోఁపకుండెను. పసిరిక మొగ్గవంటి బాలికమాటలు చెవియొగ్గి వినుటయె వెఱ్ఱియని తుదకు తలిదండ్రులు తలపోసి, కమలను తమబంధువులలో నొకని కిచ్చి పరిణయము గావించిరి.

పూర్వదిశాంగనాముఖము, ప్రాతస్సమయమున నొక్కొక్క పరి పలువన్నెల మబ్బులచే మాటుపడియు, భానూదయకాంతుల ప్రథమస్పర్శముననె వికాసముఁ జెందుచుండును. పెండ్లిపీటలమీఁద నుండునపుడు, కమల వదనబింబ మొకించుక విచారమేఘావృత మయ్యును, తలంబ్రాల సమయమునకు కళంకరహిత మయ్యెను. బాల్యదశయందు సుఖదు:ఖములు స్వల్పనిమిత్తములకు వశవర్తు లగు చుండును. కాని, బాల్యకాలపు టూహలు నుద్దేశములు నొక్కొక్కప్పుడు, జీవితభూమిని వేళ్లువాఱి, ఆమరణమును పెకలింప నసాధ్య మగుచుండును !

(2)

అది ప్రాత:కాలము. వసంతభానుఁ డింక నుదయాద్రి నధిష్ఠింపలేదు. గృహారామమున చూత నారికేళాదివృక్షములు, పూవులమొలకలును, గుబురుగఁ బెరుఁగుచున్నవి. విరుల నెత్తావులు గాలి యంతటను ప్రసరించియున్నవి. లేఁజివురులు మెసవుచు కోకిల శ్రావ్యనాదములతో జనలోకమునకు స్వాగతగీతము లర్పించుచున్నది. జగమెల్లయు నరుణోదయచ్ఛాయల నలరుచు, ఆనందవీచికల నోల లాడుచుండెను.

కమల నిషేకముహూర్త మీదినముననె జరుగవలసియున్నది. నీలాలకములు గప్పిన సుందరవదనమును వంచి, చెట్టుక్రిందఁ గూర్చుండి, తనయశ్రుజలముతోఁ జెంతప్రవహించు చిన్న కాలువ పొంగునట్టుగ, దైన్యమున విలపించెడి యీసుందరి యెవరు ? లోకమెల్ల నానందమున నోలలాడెడి యీసుఖసమయమున నీకోమలి యిట్లు కుందుటకుఁ గారణ మేమి ? సమీపమున నాసీనుఁడగు నీయువకుఁ డెవడు ? వారు ప్రేయసీప్రియులవలెఁ గానిపించు చున్నారు. అంత తనదు:ఖ మొకింత త్రోసివైచి యాతరుణి, "జీవితేశ్వరుఁడవగు మనోహరా ! నేఁటితో మనస్నేహవృక్షమున కాయువు చెల్లి పోయెనుగదా !" యని పలికి, హృదయము శోకపరవశము కాఁగా, మౌనముద్ర నూనియుండెను.

మనోహర మా మానిని నిటు లోదార్చెను : "కమలా, ప్రాణ సఖీ ! ఏల నీవు విచారమునఁ బ్రుంగుచున్నావు ? నీసంతుష్టవదన సందర్శనమును, నిష్కల్మషహృదయసూచకము లగు లోచనవిలోకనమును గనుల పండువుగఁ జేకొనినమిత్రు నేల దు:ఖాతిరేకమున నెత నొందించెదవు? ఓహో, జ్ఞాపకము వచ్చినది ! మన ప్రేమసఖ్యముల కీనాఁడు ప్రబలవిరోధిగ పరిణమించిన ప్రపంచమునుజూచి యిన్నాళ్లు నెట్లు భ్రమపడితిమి !" అని పలుకుచు మనోహరము, ప్రేయసిని దు:ఖానలమునుండి తొలఁగింపఁబూని తానే సంతాపమున కుమిలి పోయెను ! ఆయువతీయువకు లెంతసేపు దు:ఖతోయములఁ దోఁగుచుండిరో తెలియదు. బాలసూర్యుని యరుణకిరణములు తన శోక తిమిరమును దొలఁగించినట్టుగఁదోచి, గమల కనులువిప్పి చూచునప్పటికి, మనోహర మెచ్చటను గానరాకుండెను !

సూర్యబింబము సువర్ణకాంతులతో వియత్పథమున వెలుఁగు చున్నను, కమల కన్నుల కాదివసము కాఱుమబ్బులు గ్రమ్మిన కేవల దుర్దిన మయ్యెను ! ఆసాయంకాలము చెలికత్తెలు శుభకార్యమున కనువగు నలంకారములు తనకుఁ జేయునపుడు, చుక్కల నడుమనుండు చందురునివలె కమల వారలమధ్యఁ గొమరారుచుండెను. అపుడె యింటి కేతెంచిన యెఱుకతచేఁ జేయిచూపించుకొనుమని యామెచెలులు పట్టు పట్టిరి. తమగతి తమ కెఱుకపడినవారి కెఱుకలు జోస్యములు నేల? ఐనను, నెచ్చెలుల కోరిక చొప్పున కమల చేయిచాచెను. కన్నులు కరమం దున్నను, ఎఱుకత కెపుడును, మనస్సు ముఖముననె దవిలీయుండును ! అది యిట్లు లోనఁ దలపోసెను: "ఈ శుభసమయమున సొబ గొందవలసిన యీసుందరి ముఖపద్మ మేల ముకుళించి యున్నది? ఎందుల కీ సోగకనులు సోలియున్నవి ? ఈమె హృదయము వ్యాకులితమై యుండవలెను. ఇది గుప్తముగ నే గనిపెట్టెదను !" ఐనను, కుతూహల లగు నా కోమలులఁ దనియింపఁబూని యెఱుకత, "ఈ ముద్దరాలి కడుపున పదిమంది పుత్రులు పుట్టెదరు." అని పలికి, చెలులందఱు సంతోషకోలాహలమున నుండునపుడు, నాఁటిరాత్రి యొకసారి తోఁటలోనికి రమ్మని కమలకు మెల్లగఁ జెప్పి వెడలిపోయెను.

పిమ్మట తోఁటలో నెఱుకత కమల కిట్లనెను: "నీచేయి చూచి సమయమున కేదో కల్ల బొల్లి కల్పించితినిగాని, నీమనసున విచార మున్నట్లు కానఁబడెను. ఆరహస్యము తెలిపితివేని, నీ యభీష్టము నెరవేర్చి, బాధ తొలఁగించెదను. నిజము చెప్పు, నీ హృదయము పరపురుషునిమీఁద..............."

కమల దాని నోరణఁచునట్టుగ నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను: "తల్లీ! నీవు నా హృదయశల్యమును పెకలింప పాల్పడినందుకు సంతోషమె. కాని, యటుచేయుట కదను తప్పినది. రానున్నది నాకుఁ దెలిసియె యున్నది. ఇంక మన మిచట మసలఁగూడదు. అదిగో పురోహితుఁడు నారాక కెదురుచూచుచున్నాఁడు. నన్నుఁ గొనిపోవుట కిదిగో మాయమ్మ వచ్చుచున్నది !" అనిపలికి, దానిచేత నొక్కింత రాలిచి పొమ్మనెను. ఆ సుశీలమీఁది జాలిచే కంట నీరు గ్రమ్మి, యెఱుకత వెడలిపోయెను.

(3)

మఱునాఁడు వసంతపురమున కమల యకాలమరణమునకు విలపింపని మనుజులు లేరు. "ఏమి యీ సౌభాగ్యలక్ష్మికి శుభదినమె తుదిదిన మయ్యెనే !" యని కొందఱును, "పూవు పుట్టఁగనే పురుగు నోటవేసికొనెనే!" యని కొందఱును, కమల మృతినిగూర్చి చెప్పుకొనసాగిరి. "మానవజన్మము బుద్బుదప్రాయముగదా !" యని ప్రజలు వైరాగ్యవచనములు చెప్పుకొనిరి.

కమల యవసానకాలమున గుఱించి పెండ్లికుమారుఁ డిట్లు చెప్పెను : - "నిన్న రాత్రి తలుపు మూయఁగనే, కమల శయ్యయొద్ద నిలిచి, నన్నుద్దేశించి 'అయ్యా! నన్ను విధి తఱుముకొని వచ్చు చున్నది ! కాని నేను త్వరితముగ మీతో కొన్నిమాటలు చెప్పవలెను. వివాహ బంధమువలన మన మిద్దఱము భార్యాభర్తల మైతిమని లోక మెంచుచున్నను, చిన్ననాఁటనుండియు నామనస్సు మనోహరము మీఁదనే యున్నది. అతఁడె నా హృదయాధి నాధుఁడు. భూలోక కిల్బిషము లెవ్వియు సోఁకకుండ దైవము మా ప్రేమలత నిన్నాళ్లును బ్రోచుచుండెను. అట్టి పవిత్రప్రేమ కాధారమగు ప్రియుని వదలి పరపురుషుని జేపట్ట నొల్ల కున్నను, ఇంతవఱకు నా నిజాభిప్రాయము వెల్లడింపమికి ప్రాణత్యాగమే ప్రాయశ్చిత్తముగఁ జేకొనుచున్నాను ! నా తుదితలంపులు దెలుపు లేఖను మనోహరమున కందఁజేయ మిమ్ము వేడుచున్నాను !' అని యాయువతి, కలము కాకితమును గైకొని యీ రెండు కమ్మలును వ్రాసెను. ఇవి లిఖించినపు డా తరుణి ముఖబింబమున తాండవించిన తేజోవిశేష మేమని వర్ణింతును ? ఆ సుందరవదనమున ప్రస్ఫుటమైన యాత్మవికాసము భూలోక సంబంధమైనది గాక, ఏ దివ్యలోకమునుండియో దిగి మరల నా భవ్యలోకమును వేవేగమె పొంద కాంక్షించునట్టిదిగఁ దోఁచెను! రెండవలేఖ పూర్తి కాకమునుపె, ఆ చెలువ చిన్ని వేళ్లనుండి కలము పట్టుతప్పెను ! ప్రచండవాయుచలనమున నేలపాలగు చూతలవలె నాలతాంగి పుడమి మీఁద కోరగిల్లి పడిపోయెను !

"ఆ సుందరి వ్రాసియుంచిన కమ్మలివె!" అని యా పెండ్లి కుమారుఁడు జేబునుండి యవి తీసియిచ్చెను. అందొకటి తలిదండ్రులకును రెండవది మనోహరమునకును కమల వ్రాసెను.

మనోహరుని కమ్మలో నిటులుండెను : - "ప్రియసఖా! ఇది నా తుది యుత్తరము. ప్రేమబంధమున మన జీవితము లొక్కటియగు నని నేను మొదటినుండియు నువ్విళ్లుగొనుచుండుధానను. కాని, నే నిష్టపడకున్నను, తలిదండ్రులు చిన్న నాఁడె నాకుఁ బరిణయము చేసిరి. స్వేచ్ఛయుండిన నెవరిని జెట్టవట్టియుందునో చెప్పవలెనా ! పరిస్థితులు సవ్యముగనె యుండినచో మనోహరుఁడె నాకుఁ బతియై యుండెడివాఁడు ! ఐనను, నిరపరాధు లగు తలిదండ్రులను నేను నిందింపను. హృదయంగతమగు కోరికలు తెలుప మన సెంత తహతహపడుచున్నను, లజ్జాతిరేకమున పెదవి మెదలుపనేరకున్న పసిబాలిక మాటలు, జననీజనకులు బాగుగగ్రంహింపనేర్తురా? గ్రహించియు, పూర్వాచారపరాయణు లగు తలిదండ్రులు శాఖాభేదములు పరిగణింపక మన కిద్దఱి కానాఁడు పెండ్లిచేయుదురా ? కాన, నా కకాలమరణ మవశ్యమని గుర్తెఱిఁగియె కాలము గడిపితిని. ఇప్పటికి గడువు సమీపించినది. నేను పరలోకయాత్రకు వెడలిపోవుచున్నాను. శాఖా భేదములు పాటించి, ఆచారమును శిరసావహించి, వదూవరుల యభీష్టము నారయక జనులు జరిపెడి యీ యతిబాల్యవివాహము లచిరకాలముననె యంతరించుఁగాక! బలవత్తరమైన యాచారపిశాచమునకు బలియై యబలను నేను గతించినను, సుగుణములకాకరమును, మహదాశయములకుఁ దావలమును నగు నీవు సత్కార్యసాఫల్యమున ధన్యుఁడవై చిరకాలజీవియై, వర్ధిల్లెదవుగాక!'

25. ఏకాంతజీవితము

స్నేహితులతో నే నాకాలమునఁ జర్చింపని రహస్య మేమియును లేదు. నేను రేలంగిలో నున్నరోజులలో పలుమారు వెంకటరావును జూచి, అతనితో లోకాభిరామాయణమే గాక, సంస్కరణోద్యమమునుగూర్చియును బ్రసంగించుచుండెడి వాఁడను. నేను వ్రాసిన 'కమలామనోహరుల' కథ నాతనికి వినిపించితిని. కథలోఁ గొన్ని పట్టులఁ దగినచతురతఁ గనపఱచలేదని యతఁ డసంతృప్తిఁ జెందెను. అనగత్యముగను, అకస్మాత్తుగను నేను కొన్ని యుదంతముల నందుఁ జొప్పించితి ననియు, ప్రేమాకుసుమమును పొంకముగఁ జిత్రింపలే దనియును, అతఁడు చిఱాకుపడెను. నా కథయందు వర్ణనములకుఁ దావు లేదనియు, ముందు రచించెడి కథాసంగ్రహమే నే నిందు సూచించితిననియు, నా సమాధానము. అచటనచట సొంపులు లేక పోలేదని యతఁడు పలికెను.

మరల రాజమంద్రి చేరినపిమ్మట మే మిరువురమును విచిత్ర లేఖలు కొన్ని వ్రాసి, ఒకస్త్రీ వ్రాయునట్టుగా వానిని "వివేకవర్థని"లోఁ బ్రచురింప నుద్యమించితిమి. 13 వ జూన్ తేదీని వెంకటరావు నేనును, "వీరేశలింగముపంతులు నిజమైన సంస్కర్తయేనా?" యను విషయమునుగుఱించి చర్చించుకొంటిమి. మతసాంఘికవిషయములందు సంస్కర్తకర్తవ్య మేమి ? లోకముదెస నాతనివర్తన వ్యవహారములు నిష్కళంకములుగ నుండవలయును. అతనికి శత్రువులు, ముఖ్యముగ వ్యక్తిసంబంధమగు శత్రువులు, నుండరాదు. వీరేశలింగము పంతులు కోపస్వభావులై, కక్షలకుఁ గడంగి రని మే మనుకొంటిమి. ఏకైకస్నేహితుఁడగు గవరరాజుగారు అకాలమరణము నొందుటచేత, కలసి పని చేయుట కెవరును తోడు లేక, ఏకాకియై పంతు లిపుడు దినములు గడుపుచున్నాఁడు వితంతూద్వాహపక్షమువారు, వీరేశలింగముగారిని విడిచి, ఆయనపలుకులకు క్రియలకు వికటవ్యాఖ్యలు సలుపుచుండు నొక ప్రబుద్ధుని యండఁజేరి రని మేము చెప్పి పంతులను వారింప నుద్యమించితిమి.

12 వ తేదీని నేను వెంకటరావును గలసికొంటిని. అతఁడు స్త్రీలోలత్వమునుగుఱించి ప్రసంగింపఁబూనఁగ, అది గర్హ్య మని నేను బలికితిని. తుంటరులనుగుఱించి యతఁ డంత ప్రస్తావించెను. చెడుగును గుఱించి వచించుట కాతఁడు వెనుదీయకుండుటయు, ఎందును తనప్రాముఖ్యముఁ దెలుపుచు మాటాడుటయు, నా కాతనిసంభాషణమునకు ముఖ్యచిహ్నములుగఁ దోఁచెను. అతిశయోక్తులతో నుపన్యసించుటయు నతని కభ్యాసము. సహచరునియలవాటు పట్టుపడి, అపుడపుడు సంభాషణమున నతిశయోక్తులు చొప్పింప నేనును వెఱువకుండెడి వాఁడను !

కళాశాల తీయు దినములు సమీపించుటచే నేను, తమ్ము లిద్దఱును రాజమంద్రి పయనము కావలసివచ్చెను. నేను వెంకటరావు నొద్ద వీడ్కోలు గొంటిని. మరల వానినిఁ గలసికొనకయె నేను మృత్యువువాతఁ బడినచో, నన్ను గుఱించియైన నాకుఁ బ్రియమగు సంస్కరణపక్ష మవలంబింపు మని వానినిఁ గోరితిని. 17 వ జూన్ మధ్యాహ్నమున తమ్ము లిద్దఱితో నేను బయలుదేఱితిని. రేలంగి యిల్లు 'మరమ్మతు' అగుచుండుటచేత, మా తలిదండ్రులు, చిన్నపిల్లలును మాతో రాలేకపోయిరి. మరల విద్యాశాలఁ జేరవలె ననెడి యాశ మమ్ము వేగిరపెట్టగ, వర్షములోనే మేము నడచిపోవ సమకట్టితిమి. రెండు పెద్దమూటలు మేము మోయవలసి వచ్చెను. దారిలో వాన హెచ్చినను రాత్రికి వేలివెన్ను చేరవలె ననెడియాశచే మేము బురదలోనే పయనము చేసితిమి. ఎట్టకేలకు కాల్ధరికాలువగట్టు చేరితిమి. కాలువ పూర్తిగఁ బ్రవహించుచుండెను. దాటుటకు బల్లకట్టు లేదు. ప్రవాహమును దాటింపుఁ డని ఆవలియొడ్డున బట్ట లుదుకుకొను వ్యవసాయదారులను వేడితిమి. వారు సాయపడక, చిన్న తమ్ముని పెద్దవార మిరువురము చేతులు పట్టుకొని నీట నడిపించినచో, కాలువ దాటవచ్చు నని యాలోచన చెప్పిరి. కాఱుమబ్బుచే నల్ల బడిన యాకాశము ప్రతిఫలించి యిపుడు భయంకరాకృతిఁ దాల్చిన కాలువనీట మే మంత చొరఁబడితిమి. కొంత నడచునప్పటికి, నీటి లోతు హెచ్చి, నేను మాచిన్నితమ్మునిచేయి యట్టె వదలివేసితిని ! వెంకటరామయ్యమాత్రము పిల్లవాని చేతిపట్టు విడువలేదు. అంత మేము మువ్వురము వెనుక మొగము పట్టి, మాకుఁ దోడ్పుడుఁ డని మరల నా మనుష్యులను వేడితిమి. వారిలో నొకఁ డంత నీదుకొని వచ్చి, ఒక్కొక్కరినే మమ్మావలియొడ్డు చేర్చెను. పిల్లవానిని నిష్కారణముగఁ జంపివేసియుందు రని యచటివారు మమ్ము నిందించిరి. మా మేనమామలయిల్లు చేరి, బందుగులకు మా ప్రయాణవృత్తాంత మెఱిఁగించితిమి. నాఁడా గ్రామమందలి బాలికలు బొమ్మలపెండిండ్లు చేసికొనుచుండిరి. వారిలో నాభార్యయు, నా పెద్దచెల్లెలు నుండిరి.

మఱునాఁడే మేము రాజమంద్రి పయన మయితిమి. వాయు వతితీవ్రముగ వీచుచుండెను. ఒక్కొకప్పుడు గాలి తాఁకునకు నెత్తి మూటలతో మేము తూలిపోవుచుంటిమి. ఎటులో విజయేశ్వరముఁ జేరితిమి. ఆనాఁడు స్టీమరు రా దని తెలిసెను. ఆపెనుగాలిలో పడవ లేవియు నీటిమీఁదిపయనమునకు సాహసింపలేదు. ఇంతలో వాడపల్లిరేవున నొక రహదారీపడవ మునిఁగె ననియు, కొందఱుప్రయాణికులు చనిపోయి రనియు, మాకు వినవచ్చెను. మేము వాడపల్లికి నడచి పోయితిమి. మునిఁగిపోయినపడవ యొడ్డున కొకింత దూరమునఁదేలు చుండెను. చనిపోయినవారినిగూర్చి యేమియుఁ దెలియదు. రాజమంద్రినుండి యంత నొకస్టీమరు వచ్చి యెంత ప్రయత్నించియును, బోరగిలినపడవను తిరుగఁదీయ లేకపోయెను. ఇపుడు చీఁకటి పడుచుండుట చేత, రాత్రిభోజనమునకు మేము వెనుకకుఁ బోయి, విజయేశ్వరము సత్రమున బస చేసితిమి. మఱునాఁడు (20 వ తేది) మేము విజయేశ్వరమునుండి మరల వాడపల్లి పోయితిమి. ఏదైన పడవమీఁద ధవళేశ్వరము చేరుదమా యనుకొనుచుండఁగనే, రేవుస్టీమరు వచ్చెను. ఇపు డది మునిఁగిన పడవను తిరుగఁదీయఁగా పడవగదిలో నిరుకుకొని చనిపోయిన యొకస్త్రీ, ఆమెకొడుకు కూఁతురు నందు గానవచ్చిరి! ఆశవములు చూచి యందఱమును దైన్యము నొందితిమి. మే ,మంత స్టీమరుమీఁద రాజమంద్రి వెళ్లితిమి.

ప్రియపట్టణమగు రాజమంద్రిని నేను మరల సందర్శించుట కమితానందభరితుఁడనైతిని. సంస్కారప్రియుఁడగు మిత్రుఁడు రాజగోపాలరావు నన్నుఁ జూచుటకు స్వగ్రామమునుండి యిక్కడకు వచ్చియుండెను. చెలికాఁడు కొండయ్యశాస్త్రికూడ నిచట నుండెను. ఆతఁ డీమాఱు సంఘసంస్కరణమునెడల సానుభూతి గనపఱుచునట్లు తోఁచెను. వేంకటరావును గుఱించి మాటాడుకొంటిమి. ఆతనికి నియమానుసరణమునకంటె సమయానుకూలవర్తనమే ప్రియతర మైన దని సిద్ధాంతపఱుచుకొంటిమి. ఆదినములలో వీరేశలింగముగారు కట్టించు చుండెడి పురమందిరము వీక్షింపఁబోయితిమి. ఆ సంస్కర్తనుగుఱించి యచటివా రెవరో పరిహాసముగఁ బలుకఁగా నేను జిన్నపోయితిని. సమాజమిత్రుఁడు, సచ్ఛీలుఁడునగు పాపయ్యగారు, "క్రైస్తవ మతబోధకులవలె శాంతమతితో మనము కష్టములకుఁ గటువుపదములకు నోర్చుకొనుచు, పట్టుదలతోఁ బనులు చేసినచో, మనకు విజయము చేకూరును" అని పలికి నన్నోదార్చెను.

జూలై 1 వ తేదీన మా యనుంగుమిత్రుఁడు లక్ష్మీనారాయణగారు రాజమంద్రి వచ్చి, సంఘసంస్కరణవిషయమున నా కృషిని గూర్చి తాను మిత్రులవలన వింటి నని చెప్పి, నన్నభినందించెను అయినను, నాకుఁ బ్రియమగు స్త్రీ స్వాతంత్ర్యము నాయన పరిహసించి, స్త్రీలను మఱింత బంధింపవలె నని చెప్పి, సంస్కరణనిరసనము చేసినపుడు నా కధికవిచారము గలిగెను. బంధువును, మిత్రుఁడును నగు కొండయ్యశాస్త్రియొక్క విపరీతపు ప్రాఁతమతాభిప్రాయముల నీతఁడు సమర్థించునటు లగఁబడెడివాఁడు! కాని, యీయన చిత్తవృత్తి యపు డేకవిధమున నుండెడిదికాదు. కేశవచంద్రసేనుల యాంగ్లేయోపన్యాసముల నత్యుత్సాహమున మా కీయన చదివి వినిపించి,ఉద్రేకము గలిగించుచుండెడివాఁడు. ఆకాలమున నా సహచరులలో నొకరగు శ్రీ ఆనూరి కాంతయ్యగారినిగూర్చి కొంత చెప్పవలెను. పూర్వము తానును సంస్కరణములయం దమితాభినివేశము గలిగియుండెడివాఁడ ననియు, కాని యావిషయమునఁ దా నిపుడు కాఁగి చల్లారిన పాలవలె తటస్థుఁడ నైతి ననియు, ఆయన పలుకుచుండెడివాఁడు. చాత్తాద వైష్ణవుఁ డయ్యును, ఆయన సామాన్య బ్రాహ్మణయువకులందుఁ బొడఁగట్టని పారిశుద్ధ్య మనోనిగ్రహములచే నొప్పెడివాఁడు. సాధువర్తన మితభాషిత్వము లాయన సొ మ్మగునటు లుండెడివి ! ఆసమయమున పట్టపరీక్ష రెండవశాఖకుఁ జదువుచు, తర్కమనశ్శాస్త్రములు అభిమానవిద్యగాఁ గైకొని, నీతిశాస్త్రమందలి మంచికథపట్టులు మాకు వినిపించుచుండెడివాఁడు. ఆ సంగతులు మిగుల చిత్తాకర్షకములుగ నుండి, పట్టపరీక్షకుఁ జదివినచో, ఆశాస్త్రపఠనమే చేయ నాకు సంకల్పము గలిగెను.

మా తలిదండ్రు లింకను రేలంగిలో నుండుటచేత, సోదరులు మువ్వురము రాజమంద్రిలో నొంటరిగ నుండి, మావంట మేమే చేసికొనుచువచ్చెడివారము. పెద్దవాఁడనగు నామీఁద సామాన్యముగ వంటపని పడుచువచ్చెను. ప్రొద్దున పదిగంటలకే మేము మువ్వురము వంట చేసికొని భోజనము చేసి పాఠశాల కేగవలసివచ్చుటచేత, మా కెంతో కష్టముగ నుండెడిది. వీనికిఁదోడు, సంస్కారప్రియులగు మిత్రుల సందర్శనసంభాషణములు నా నిత్యానుష్ఠానములో నంతర్భాగములె ! ఇంట పాఠములు దిట్టము చేసికొనుటకే మాకు వ్యవధి చాలకుండెను. ఈమధ్యగ భోజనసదుపాయము లేమింజేసి మాతమ్ముఁడు కృష్ణమూర్తి జబ్బుపడియుండెను. ఆసమయమందు మా యలజడి మఱింత హెచ్చియుండెను. మా స్నేహితు లా దినములలో సంస్కరణము పట్ల చూపిన యశ్రద్ధ మిగుల నిరుత్సాహకరముగ నుండెను. అద్దానిని గుఱించి రాజగురునితో నేను మొఱపెట్టఁగా, దీనివిషయమై మా సంస్కరణసభలో నొకనాఁ డాతఁడు తీవ్రముగ మాటాడెను. కనక రాజు ఆమాటలకుఁ గుపితుఁడయ్యెను. పాపయ్యగారు పలికిన చల్లని పలుకులును, వీరేశలింగముగారి సంస్కరణోపన్యాసమును ఆతని కోపము నొకింత చల్లార్చెను.

సంస్కరణసమాజకార్యక్రమమే నా యసంతుష్టికి హేతువయ్యెను! ఈసమాజమున కాస్తికమతముతో సన్నిహితసంబంధము గలసినఁగాని దీనికి మోక్షము లేదని నానిశ్చితాభిప్రాయము! 27 వ జూలై తేదీని జరిగిన సంస్కరణసభకు లక్ష్మీనారాయణగా రగ్రాసనాధిపతి. సంఘసంస్కరణమునుగుఱించి కష్టపడి వ్రాసినవ్యాసము నేను జదివితిని. భీమశంకరము వ్యతిరేకాభిప్రాయ మిచ్చినను, కనక రాజు నాకు సానుభూతిఁ జూపెను. 3 వ ఆగష్టున జరిగినసభకు నే నగ్రాసనాధిపతిని. వివాహమునుగుఱించి కృష్ణమయ్యంగారు వ్యాసము చదివిరి. మిక్కుటమగు సభాకంపమునకు లోనైనను, నే నెటులో నావిధులు నిర్వర్తించితిని. మాటలకొఱకు నేను తడవికొనుచువచ్చితిని. నా యుపన్యాస మతిదీర్ఘముగ నుండెను. అంత్యోపన్యాసము ముగించి నేను గూర్చుండుసమయమున శంభుశాస్త్రిగారు లేచి, కొన్ని మితసంస్కరణములు సూచించి, అవి మాసంఘమువా రవలంబించుట మంచిదని చెప్పెను. అంత నేను మరల లేచి, యీ సాంఘికవ్యాధికి బాల్యవివాహనిర్మూలనమే తగినచికిత్స యని వక్కాణించితిని. నాయీ తీవ్రసంస్కార పద్ధతి యావక్తను మరలమరల మాటాడ నుద్రేకింపఁగా నేనును సముచిత ప్రత్యుత్తరము లిచ్చుచువచ్చితిని. అంతట పాపయ్యగారు లేచి కొన్ని సామవచనములు చెప్పినమీఁదట, ఇంకొకవారమునకు సభ నిలిపివేసితిమి. పిమ్మట జరిగిన ప్రార్థనసమాజసభలో తమయధ్యక్షోపన్యాసమున వివాహసంస్కరణావశ్యకతను గూర్చి చెప్పుచు, వీరేశలింగముపంతులుగారు నా యభిప్రాయములను సమర్థించిరి. సభికు లందఱి మన్న నలకుఁ బాత్రమైన యగ్రపీఠము నధిష్ఠించినందు కెంతయు ముద మందితిని. నా పరిచితు లనేకు లానాఁడు సభ కేతెంచిరి. మధ్యమధ్య నాంగ్లేయపదములు పడి నేను గొంత చుట్టుత్రోవఁ ద్రొక్కినను, నాయుపన్యాసము నా నిశ్చితాభిప్రాయములను స్పష్టీకరించెను. నిజముగా నేను కీర్తి కెక్కు చుంటినా యని సంప్ర్రశ్నించుకొంటిని !

4 వ ఆగష్టు మధ్యాహ్నము పాఠశాలనుండి యింటికివచ్చినతోడనే, రేలంగినుండి యపుడె వచ్చిన మాతల్లిదండ్రులు తమ్ములు చెల్లెండ్రును గానఁబడి మోదమున మేము మిన్నందితిమి. ఇన్నాళ్ల నుండియు మువ్వురు సోదరులమును ఇంటిపను లన్న విసిగియుంటిమి. చదువుకొనుటకు వ్యవధాన మేమియులేదు. ఇంకముందు మా భారమంతయు తల్లి దండ్రులె వహింతురు గాన, క్రమముగఁ జదువుకొన వచ్చునని మేము సంతసిల్లితిమి. రాఁబోవు డిసెంబరులోనే నేను ప్రథమశాస్త్రపరీక్షకును, నాతమ్ముఁడు ప్రవేశపరీక్షకును బోవలయును గావున, కాలము వ్యర్థముచేయక, పెక్కు భోజనసదుపాయములకై తల్లిని వేధింపక, విద్యాపరిశ్రమముఁజేయ నిశ్చయించుకొంటిమి. ఆదినమే మిత్రుఁడు వెంకటరావు వచ్చికలసికొనుటచే నాయానందమునకు మితి లేకుండెను. నాఁడు నలుగురు స్నేహితులము నడిరేయివఱకును సంభాషణలతోఁ బ్రొద్దు పుచ్చితిమి. నా స్నేహితుఁడు కొండయ్యశాస్త్రి తాను జదువుకొనుటకు మా కావలివీథినున్న యొకయింట చిన్న గది యొకటి యద్దెకు పుచ్చుకొనెను. ఇపుడు నేను మాతమ్ముఁడును, దాని కెదురుగ నున్న గదిలోఁ బ్రవేశించి చదువనారంభించితిమి. ఆకాలమున బాడుగలు మిగుల స్వల్పము. మాగది యద్దె పావలామాత్రమె !

15 వ తేది ప్రొద్దున నాగదిలో మూఁడునాలుగు గంటలు చదివినపిమ్మట నింటికి భోజనమునకు వచ్చితిని. ఆఁకలిచేత నాకుఁ బ్రాణములు కడఁబట్టుచుండెను ! ఆ యసమయమున మా యమ్మ ప్రశాంతమనమున నొకకందమొలకకుఁ బూజలొనర్చుచుండెను ! నే నేమిచేతును ? గోరుచుట్టుమీఁద రోకలిపో టనునట్టు, నాయాఁకలి బాధకు నా ప్రబలవిరోధియగు విగ్రహపూజా సందర్శనము తోడై, నా కోపవహ్నిని రగులుకొలిపెను. దేవదేవునికిఁ జెల్లింపవలసిన పూజాపురస్కారము లీక్షుద్రవస్తువున కేల సమర్పించితి వని మా తల్లిమీఁద మండిపడి, నోటికి వచ్చిన వాక్కులు ప్రయోగించితిని ! కాని, కొంతసేపటికి చిత్తనిరోధము చేసి, శాంతించి, "సదుద్దేశమున నీ యిల్లాలు చేసెడిపూజల కేల నేను నొచ్చుకొనవలెను ? సాధువాక్యములతోనే సత్యదేవునివై పున కామెమనసును మరల్పుట కర్తవ్యము కదా !" అని నన్ను నేను సంప్రశ్నించుకొంటిని. హిందూ స్త్రీల మూఢత్వమునకై దైన్యమునఁ గన్నీరు విడిచితిని. తాము చేయు పనుల యర్థము గ్రహింపని భారతనారుల దుస్థితిని తొలఁగింపు మని దయామయుఁడగు దేవదేవుని వేడికొంటిని.

మఱుసటినెల 20 వ తేదిని రాజగురు మృత్యుంజయరావులు నన్నుఁ గలసికొని, మిత్రులందఱమును గూడి చదువుకొనుట కొక పఠనాలయము స్థాపించుటనుగూర్చి నాయభిప్రాయము తెలుపుమనిరి. నేను సమ్మతింపక, దీనికి బదులుగా చందాలు వేసికొని బీదలకు సాయము చేయుట మేలని చెప్పితిని. నన్ను తమవైపునకుఁ ద్రిప్పుకొన పరిపరివిధముల వారు ప్రయత్నించినను, వారికి సాధ్యము కాలేదు. తమ మురిపఁపుపేళ్ల తో నన్ను వారు నిందించినను నేను నాపట్టు విడువలేదు. అంతట రాజగురువు, "నీబోటివా రిఁక నైదుగురు దొరికిరేని, రాజమంద్రి నంతటి నొక్కపట్టున సంస్కరణ వాహినియందు ముంపఁగలను !" అని చెప్పివేసెను. ఆతని యర్థము నాకు బాగుగ వ్యక్తము గాకున్నను, నా కధిక నైతికధైర్యము గలదని పలికినట్లు నమ్మితిని. నాకు ధైర్యసాహసము లింకను ప్రసాదింపు మని భగవానుని వేడుకొంటిని

30 వ సెప్టెంబరున నాకు శరీరమునందు నీరసము, కనుల బలహీనతయు నేర్పడుటచేత రాత్రి చదువు మానితిని. ఆనాఁడె కళాశాలలో అధ్యక్షుఁడగు మెట్‌కాఫ్‌దొర నన్ను గుఱించి మాటాడుచు, భాషాభాగమున నాచదువు బాగుగనున్నను, గణితమున మంచి కృషి చేసినఁగాని పరీక్షలో తప్పిపోవుదు వని నన్ను హెచ్చరించెను. ఆరాత్రి ప్రార్థనసమయమున నే నిట్లు తలపోసితిని : -

"ప్రభువా ! తన నియమితకార్యము సగము కొనసాగించిన పిమ్మటనే మిల్టనుకవి కంధత్వము సంప్రాప్తమయ్యెను. నాకర్తవ్య మొకిం తయుఁ జేయకమునుపే, జీవిత ప్రథమ సోపానముననే, నాదేహము వ్యాధిపా లగుచున్నది ! నా విధికృత్యములు నెరవేర్పఁబూనినచో, ఈ దుర్బలశరీరము తుత్తునియ లైపోవునేమో గదా ! పరిశుద్ధవర్తనము వీడకుండ జరుపుకొనునటుల నా కనుగ్రహింపుము !"

26. పరీక్షాపూర్వదినములు

1900 అక్టోబరునెలలో ప్రథమశాస్త్రపరీక్షకుఁ బోవువారిని నిర్ణయించుటకు జరిగిన కళాశాలాపరీక్షలో, ఇంగ్లీషులో నేను బాగుగ వ్రాసినను, లెక్కలలో గుణములు నాకు కనీస మైనను రా లేదు. బజులుల్లాసాహేబు నాకంటెను తగ్గియుండెను. గణితమున తరగతిలో మే మిరువురము నధమాధములము ! అయినను క్రిందటి సంవత్సరపు పరీక్షలో నాతఁడు నేనును తరగతిలో క్రమముగ ప్రథమ ద్వితీయస్థానములం దుండుటచేతను, ఇప్పటిపరీక్షలోఁ దక్కిన యన్ని పాఠములందు మేము సరిగా నుండుటచేతను, మమ్ముఁగూడ పరీక్ష కంపిరి. అప్పటినుండియు నేను మఱింత శ్రద్ధతోఁ జదువుచుంటిని. నా నిత్యకార్యక్రమము వెనుకటివలెనే జరుగుచుండెను. వ్యాయామము, ప్రాత:స్నానము, ప్రార్థనము, మిత్రులతోడి గోష్ఠి - ఇవి కొన్నిమార్పులతో నిపుడును నా దినచర్యలోని యంతర్భాగములే. పరీక్ష సమీపించినకొలఁది చదువునకు ప్రాముఖ్య మిచ్చితిని.

కాని, నా శరీరారోగ్యము అసంతృప్తికరముగనే యుండెను. నే నెంత జాగ్రత్తతో నుండినను, అనుదినము నేదోబాధ వచ్చి మూలుగుచుందును. తలనొప్పి, నీరసము, అత్యుష్ణము, పైత్యప్రకోపము, మున్నగు బాధలు నాకు సన్నిహితబంధువులె ! వీని పీడఁ బడుచుండు నేనాకాలమున నెట్లు చదువు సాగించికొనుచు, సభల కేగుచు, మిత్రులతో సంభాషణలు సలుపుచునుంటినో యని నా కాశ్చర్యము గలుగుచున్నది !

ఒకానొకనాఁడు ఆత్మపరిశోధనసమయమున నే నిట్లు తలపోసితిని : -

"పరాత్పరా ! సాహసమున ని న్నీరీతిని సంప్రశ్నించుచున్నందుకు నన్ను మన్నింపుము. ఇంత దుర్బలశరీరముతో పాటు నా కిట్టి యున్నతాశయము లిచ్చుటయందు నీయుద్దేశ మేమి? ఈశరీర మనతి కాలములోనే కృశించి నశించిపోవనున్నది. ప్రబలమేధాశక్తికిఁ గాకున్న నపార పరోపకార చింతనమునకుఁ దావలమగు నామనస్సు, దుర్బలశరీరమున కిట్లు బంధింపఁబడి యేమిచేయఁగలదు ? పాపమను పెనురక్కసిచే నావహింపఁబడిన యీహృదయమున కేల యిట్టి పరహితైకబుద్ధియు పరార్థప్రాపకత్వమును ? అకాలమరణమే నీ వాసన్నము చేయ నుద్యమించినచో, వెనువెంటనే నా కది ప్రసాదింపక, జా గేల చెసెదవు?"

ఆసమయమున వీరేశలింగముగారికిని ఏలూరి లక్ష్మీనరసింహము గారికిని జరిగెడి యభియోగముల విచారణ మగుచుండెను. విద్యార్థులమగు మేము తీఱిక సమయములం దావివాదవిషయములు వినుటకు న్యాయసభల కేగుచుండెడివారము. మాలోఁ గొందఱు వాదిపక్షమును, కొందఱు ప్రతివాదిపక్షమును గైకొనుచుండువారు !

13 వ అక్టోబరున గంగరాజు నేనును షికారుపోయి సంస్కారములనుగుఱించి మాటాడుకొంటిమి. తన భవిష్యత్తునుగుఱించి చెప్పుచు నతఁడు, విద్యాపరిపూర్తి యైనపిమ్మట తాను న్యాయవాదియై, దురాచారములు నిరసించి, సంస్కరణపక్ష మవలంబించి, సత్యమతమును జేకొందు నని చెప్పెను. నాసంగతియు నేను బ్రస్తావించితిని - సంస్కరణోద్యమవిజయమునకై నేను జీవితము ధారవోయ నిశ్చయించితి ననియు, నాతో మనసుగలసి పనిచేసెడి నెయ్యునికొఱకు నేను వెదకుచుంటి ననియుఁ జెప్పితిని. అంత, గంగరాజు తను నట్టిచెలికానిగా నేను జేకొనవచ్చు ననియు, వలసినచో నాకుఁ దాను ధనసాహాయ్యమును జేయుచుందు ననియు నుడివెను. తాను బోషింపవలసిన సోదరాదు లెందఱో యున్నను, తాను జేపట్టిన యుద్యమమునకు సంపూర్ణ విజయము చేకూర్చితీరెద నని వక్కాణించెను. నామీఁద గంగరాజునకుఁ గల యనురాగమునకు నా కృతజ్ఞతను దెలిపి, రాఁబోవు వత్సరమున నేను వేఱింటికాఁపురము పెట్టినప్పుడు, నాకు సాయము చేయు వా రొకరైన నుండుటకు సంతసించితిని.

ఆమఱునాఁడు నేను కాంతయ్య కొండయ్యశాస్త్రి లక్ష్మీనారాయణగార్లును గలసి ముచ్చటించుకొనుచు, షికారుపోయితిమి. కాంతయ్యగారు వేదాంతోన్మాదమునకు లోనై నట్లు గానవచ్చెను ! శాస్త్రి లక్ష్మీనారాయణగార్లు మిత్రుఁడు వచించినదాని కెల్ల తాళము వైచుచు, యోగమహిమను గూర్చి తమసుముఖత్వమును దెలిపిరి ! ఆరాత్రి నే నిట్లు తలపోసితిని : - "నా మిత్రులజీవితమువలన మానవహృదయముయొక్క దౌర్బల్యచౌంచల్యములు నే నొకింత గ్రహించితిని. కొమ్మనుండి కొమ్మ కెగురుపక్షివలె నా హృదయము మతము నుండి మతమునకు గంతు లిడకుండును గాక ! నేను నిరతము ఆస్తిక బుద్ధి గలిగి, మానవసేవాతత్పరుఁడనై, వలసినచో నాయాశయములకై యసువుల నర్పింతును గాక !"

22 వ తేదీని వెంకటరావు కుటుంబముతోఁ గాఁపుర ముండుటకు రాజమంద్రి వచ్చెను. మఱునాఁడు రాజమంద్రి పురమందిరప్రవేశ మహోత్సవము జరిగెను. ప్రాత:కాలమున ప్రార్థన జరిగెను. "ప్రార్థనయొక్క యావశ్యకత"ను గుఱించి వీరేశలింగముగారు మంచియుపన్యాసము చేసిరి. సాయంకాలము బహిరంగసభ జరిగెను. పరీక్షాధికారి నాగోజీరావు పంతులుగారు అధ్యక్షత వహించి, సద్భావమున పౌరుల యుపయోగార్ధమై కట్టించిన మందిరమునకు పంతులనభినందించిరి. యం. రంగాచార్యులవారు ఉపన్యాసము చేయుచు, వీరేశలింగముగారు చేసినభాషాసేవ నుగ్గడించుచు, ఆమహామహుఁడు జనుల నైతిక సాంఘిక పరిస్థితులయభ్యున్నతికొఱకై పరోపకారబుద్ధితోఁ గావించిన సత్కార్యముల నాయన ప్రశంసించెను. వాసుదేవశాస్త్రి గారి పద్యము లైనపిమ్మట కాల్పఁబడిన బాణసంచావెలుఁగున నూతన మందిరము సౌందర్యమునఁ జెలువారుచుండెను.

ఆరాత్రి నిద్రపోవుటకు ముందుగ, వీరేశలింగముగారికి కుడి బుజమై నిలిచి, త్యాగబుద్ధితోఁ గార్యసాధనము చేయు పాపయ్యగారినిగుఱించి నే నిట్లు తలపోసితిని : - "ఈపురుషుఁ డెట్టిసహృదయుఁడు, సచ్చారిత్రుఁడు ! తా నెపుడును వెనుకనే నిలిచి యుండఁ గోరెడి యీయన వినమ్రత యెంత శ్లాఘనీయము ! ఈయనకు నాకు నెంత యంతరము గలదు ! మహాగర్వి నైననే నీసత్పురుషుని గోటి నైనను పోలఁగలనా ?"

30 వ తేదీని వీథులలో నొక వింతసాటింపు వింటిని. దొండపూడికి వేలకొలది ప్రజలు వచ్చుచుండుటచేత అక్కడ విశూచి యంకురించె ననియు, జనులు రావల దనియు సర్కారువారు సాటింపు చేయించిరి. ఆగ్రామములో నొకవైద్యునిపే రీమధ్య పైకి వచ్చెను. ఆతఁడు జనుల రోగములను సులభముగ నివారణ చేయుచుండెనని ప్రతీతి గలిగెను. అందువలన నచటికి తండోప తండములుగ రోగులు వచ్చుచుండిరి. రోగి నొకచోట స్నానము చేయించి, "నీ రోగనివారణ మైనది, పో ! ఇది దేవునియాజ్ఞ !" అని వైద్యుఁడు పలుకుచుండునఁట! దీనినిగుఱించి జనులలోఁ గొంత చర్చ జరిగెను.

ఈ వైద్యరహస్యము నా కపుడు తెలిసినది. ఆగ్రామమందలి చెఱువునీటిలో లోహద్రవ్యములు గలసియున్నవి. దీనివలననే జనుల కుపశమనము గలుగు చున్నది గాని, వైద్యునిమహిమమునఁ గాదు! మాతండ్రికిఁగూడ దొండపూడివైద్యుని మహాత్మ్యమును గుఱించి నమ్మకము లేదు.

మఱునాఁడు కాంతయ్యగారితో నేను వాదమునకు డీకొంటిని. అనర్థదాయకమగు దురాచారముల నైన నీయన యిపుడు బాహాటముగ సమర్థించుచుండెను ! వేశ్యజాతివలన హిందూసంఘమునకుఁ గలుగులాభము లీయన పేర్కొనఁజొచ్చెను ! ఇపు డీయన విగ్రహారాధనాతత్పరుఁ డయ్యెను ! అయ్యో, యీతఁడు నేర్చిన తర్కవేదాంతములపర్యవసాన మిదియేనా?

దారిద్ర్యదేవత తాండవ మాడెడి మా సంసార పరిస్థితులఁ దలపోసి, 3 వ నవంబరున నే నిట్లు వెతనొందితిని : - "ఓ దారిద్ర్యమా ! నా బోటియువకులు నిర్మించెడి యాకాశహర్మ్యములను నీ వెట్లు గాల్చి వేయుచున్నావు ! ఉన్నతోద్యమములకును ఉదార భావములకును నీవు ప్రబలవిరోధివి. మాగృహమునుండి ని న్నెటులు తఱిమివేయఁ గలను ? నీ విచట నివాస మేర్పఱుచుకొని, నా విశాలాశయముల యసువులఁ దీసివైచుచున్నావు ! నీప్రేరణకు లోఁబడి, ప్రేమాస్పదమైన యాదర్శములను త్యజింపనా ? నా సౌశీల్యమును నీకు ధారవోసి నా నియమానుసారజీవితమును నీకొఱకు నీటఁగలుపనా ? నే నట్లు చేయను. సర్వసమర్థుఁడును, దయాసముద్రుఁడును నగు దేవదేవుఁడె నాకు శరణ్యము !"

కొలఁదిదినములలో కలకత్తాలోని "సాధారణ బ్రాహ్మసమాజ" ప్రచారకుఁడగు పండిత శివనాథశాస్త్రి యిచ్చటికి రానున్నాఁ డని మా కిపుడు తెలిసెను. ఆరాత్రి నే నింట మాటాడుచు, వీరినిగుఱించి ప్రస్తావించితిని. బ్రాహ్మమతమునుగుఱించి మావాళ్లతో నేను బ్రసంగించితిని. అపుడు మానాయనయు, పెద్దతమ్ముఁడును నన్ను ముట్టడించిరి. "హిందూమతము ఈశ్వరు నొప్పుచుండఁగా, నీ కేల దూరపు బ్రాహ్మమతము గతి యయ్యె ?" నని మాతండ్రి న న్నెత్తిపొడిచెను. ప్రసంగవశమున మాతమ్ముఁడు నాస్తికతను సమర్థించెను ! అలయుచు డయ్యుచు నే నంత నాపక్షమును నిలువఁబెట్టుకొనఁ బ్రయత్నించితిని.

ఆరాత్రి నాప్రార్థనమం దిటు లుండెను : - "ఓ భగవంతుఁడా ! నీ పుత్రకు లెంతటి మూఢత్వమున మునిఁగియున్నారు ! నీభక్తు లెట్లు బద్ధజిహ్వులై వారిమధ్య మసలుచున్నారు ! మతమునకు మానవహృదయమునకు సంబంధము లే దనియు, వర్ణ భేదముల పట్టింపులు, వట్టి బాహ్యపటాటోపములును మాత్రమే మతసార మనియు వా రనుకొనుచున్నారు ! నీ సత్యస్వభావము వా రెప్పటికి గుర్తెఱుఁగఁ గలరు ?"

11 వ నవంబరున నలుగురు స్నేహితులమును షికారుపోయితిమి. మాసంభాషణమునందు, కాంతయ్య లక్ష్మీనారాయణ కొండయ్యశాస్త్రిగార్లు మువ్వురును దివ్యజ్ఞానవిశ్వాసకు లని నా కీనాఁడు స్పష్టపడినది ! కావుననే వా రెపుడును మతో న్మాదమూఢాచారము లను సమర్థించుచు, సంఘసంస్కరణవిముఖు లైయున్నారు. ఇట్టి యసభ్యస్నేహితులసహవాసమున నాయుత్తమాదర్శములు రిత్తవోవునని నేను వెతనొందితిని. !

15 వ తేదీని ఉదయమున పండితశివనాధశాస్త్రిగారు రాజమంద్రి వచ్చిరి. ప్రార్థనసామాజికులము వారికి సుస్వాగత మిచ్చితిమి. ఆయన సాధురూపము మృదువచనములు మాహృదయములనుఁ జూర గొనెను. ఆసాయంకాలమున పండితుఁడు పురమందిరమున "నూతన భారతదేశము, అందలి నూత నాశయములు" అనువిషయమునుగుఱించి యుపన్యాసము చేసెను. వారిప్రసంగమున నవీనభావములు వెల్లివిఱిసి ప్రవహించెను. భావోద్రేకమున నాకును గంగరాజునకు నాతరుణమున చక్షువులనుండి బాష్పజలము స్రవంతియై పాఱెను. సభానంతరమున గంగరాజు నన్నుఁ గౌఁగిలించుకొని, తన యభిప్రాయభేదములను నీటఁగలిపి కార్యసాధనము నాతోఁ గలసివచ్చెదనని చెప్పివేసెను ; మే మిరువురము నానందపరవశుల మైతిమి.

మఱునాఁడు కొందఱు స్నేహితులము శివనాథపండితుని సందర్శించి, పెక్కువిషయములను గుఱించి యాయనతో సంభాషించితిమి. ఆసాయంకాలము బ్రాహ్మసమాజవిధులను గుఱించి శాస్త్రిగా రుపన్యసించిరి. పురమందిర మానాఁడు ప్రేక్షకులతోఁ గిటకిటమను చుండెను. శివనాథపండితుని యుపన్యాస మతితీవ్రముగను చిత్తాకర్షకముగను నుండెను. అప్పుడు ముత్తుస్వామిశాస్త్రి భావోద్రేకపూరితుఁడై పండితునికిఁ బ్రణమిల్లి, తా నీమాఱు బ్రాహ్మమత మవలంబించితి నని చెప్పివేసెను ! నే నింటికి రాఁగానే తండ్రియుఁ దమ్ముఁడును నాతో వాదమునకు దిగి, శివనాధపండితుఁడు వట్టి జడుఁ డనియు మూర్ఖుఁ డనియును బలికి, నా కమిత హృదయవేదనమును గలిగించిరి.

17 వ తేదీని, ప్రాత:స్నానానంతరమున నేను కనకరాజు గంగరాజుగార్లతోఁ గూడి, వీరేశలింగముగారి యింటికి వెళ్లి, వారి మేడగదిలో నున్న శివనాధశాస్త్రిగారిని సందర్శించితిని. సంస్కరణముల ననుష్ఠానమునఁ బెట్టువిషయమున మే మాయన యాలోచన యడిగితిమి. శాస్త్రిగారు తన జీవితమును గుఱించి ప్రస్తావించిరి. దృఢసంకల్పుఁడగు తండ్రివలన తనకుఁ గలిగినయిక్కట్లు, విద్యార్థిదశ యందె తన యుపదేశానుసారముగ నొకవితంతువును బరిణయ మాడిన స్నేహితునికష్టములు, ఆతనికిఁ దోడ్పడుటయందుఁ దాను జూపిన స్వార్థత్యాగము, ప్రథమశాస్త్ర పరీక్షాదినము లందలి తన యధిక పరిశ్రమము, తన యుద్యమవిజయము, ఈశ్వరవిశ్వాసము, మున్నగు స్వవిషయములను శాస్త్రిగారు మాకుఁ బూసగ్రుచ్చినట్లు వినిపించిరి. అంత మాకోరికమీఁదఁ గొన్ని సదుపదేశము లాయన మాకుఁ జేసిరి.

ఆయన సెలవు గైకొని మే మిండ్లకు వెడలిపోయితిమి. అందఱము నమితానంద పరవశుల మైతిమి. నా జీవితమునం దెపుడు నింత సంతోష మనుభవింపలేదని నే ననుకొంటిని. నాగురువు, ప్రవక్త, మార్గదర్శియు శివనాథమహాశయుఁడే యని నేను విశ్వసించితిని. ఇంతకంటె నాకుఁ గావలసినయానంద మేది, భాగ్యవి శేష మేమి ?

అమితభావోద్రేకమున నాఁ డంతయు నే నేదో విచిత్రలోకమున నుండునట్లు తోఁచెను. శివనాథుని సుస్వరూపము నాకనుల యెదుట నృత్యము సలుపుచుండెను ! ఇట్టి మహాత్మునికిఁగల శీల సంపద, దైవభక్తియు నే నెపు డైన ననుభవింతునా ? ఈయనవలె నీశ్వరసంసేవనార్థమై ప్రచారము సలుపుటకు నోఁచుకొందునా యని నన్ను నే సంప్రశ్నించుకొంటిని.

27. పరీక్షలు

23 వ తేదీని వెంకటరావు వ్యాధిగ్రస్తుఁ డయ్యె నని విని యాతనిఁ జూచుటకుఁ బోయితిని. ఆతఁ డిపుడు పడకనుండి లేవనే లేఁడు ? తీవ్ర ధాతుదౌర్బల్యమునఁ బడిపోయియుండెను. ఒక గొప్ప మహమ్మదీయవైద్యుఁడు మం దిచ్చుచుండెను. వ్యాధి నెమ్మదిపడు ననెడి యాశ లేకున్నను శక్తివంచన లేక తాను మం దిచ్చెద ననియు, రోగి దైవముమీఁదనే భారము వేయవలె ననియు, వైద్యుని యభిప్రాయ మని, నామిత్రుఁడు హీనస్వరమునఁ బలికెను. దైవమును నమ్ముకొనినయెడల, అతనికి రోగనివారణ మగు నని దైర్యము చెప్పితిని. కాని, తా నిపుడు సేవించు మందువలెనే నా మాటలును, నెగటు కాఁగా, వెంకటరావు : - "మిత్రుఁడా, న న్నీ సంగతిలో బాధింపకండి. దేవుఁడు గీవుఁడు అనెడి అసత్యానగత్య విషయములన్ని బైటనే పెట్టి, మరీ గదిలోకి రం డని వేడుకుంటున్నాను. నిజమైన యే యిహలోకవిషయమును గురించి యైన నాతో మాటాడ రాదా ? దైవమునుగురించి అప్రస్తుతప్రశంస చేసి, నా మనశ్శాంతికి భంగము కలిగింప వద్దని, నీకు, నీ దైవమునకు నమస్కారాలు చేస్తాను !" అని చెప్పివేసెను.

ఇంతకంటె విషాదకర మైనసంగతి యేది ? ఐనను, మన మేమియుఁ జేయలేని యిట్టివిషయములోనుపేక్షయే యుత్తమముగదా. వెంకటరావువంటివారల యజ్ఞాన నాస్తికత లెట్లు పాయునా యని నేను విచారించితిని.

ఆ రోజులలో నే నొకప్పుడు షికారు పోవుచుండఁగా, పెద్దాడ సాంబశివరావు నాకుఁ గానఁబడి, మీ పను లెట్లు సాగుచున్నవని యడిగెను. అంత మే మిరువురమును పోఁతగట్టుమీఁదికిఁ బోయి కూర్చుండి మాటాడుకొంటిమి. అదివఱ కతఁడు సంఘసంస్కరణ సమాజసభ్యుఁ డైనను, విగ్రహారాధన, జన్మాంతరము మొదలగువాని యందు విశ్వాసము గలిగియుండువాఁడు. పండిత శివనాథశాస్త్రి యిక్కడకు వచ్చి యుపన్యాసము లిచ్చుతరుణమునఁ దన సందియము లన్నియు నివారణ మయ్యె ననియును, తన కిపుడు ప్రార్థన సమాజసిద్ధాంతములందు నమ్మిక గలుగుచున్న దనియు నాతఁడు చెప్పెను. నా మాటలందు గౌరవము చూపిన యాతని మనస్సునకు నచ్చునట్టుగ నే నిట్లు పలికితిని : - "అన్ని సంస్కరణములకును ప్రార్థనయే మూలకందము. భగవంతుని నిష్కల్మష హృదయమున ప్రార్థించి, ఆయన యొసఁగిన జ్ఞానజ్యోతిసాహాయ్యమున మన విధుల నెఱవేర్పవలెను."

పిమ్మట నేను గంగరాజు గదిలోఁ బ్రవేశించితిని. శివనాథశాస్త్రి వీరేశలింగముగార్లను గుఱించి మేము చెప్పుకొంటిమి. ఈమధ్యనే వీరేశలింగముపంతులు శాస్త్రిగారితో మాటాడుచు, తన కేమి తటస్థించినను లెక్క సేయ నని పలికెనట ! పంతులచిత్తస్థైర్యమును నేను గొనియాడితిని. ఈఘను లిరువురు నిశ్చలభక్తిపరులు. కావుననే జనుఁ భూషణదూషణములను పాటింపక, తమ యుద్యమనిర్వహణమును వారు కొనసాగింపఁగలిగి రని నే జెప్పి, "మిత్రమా, మన జీవితావధి సమీపించుచున్నది. ఇంతవఱకు మన మేకార్యమును జేయలేదు. ముందును విద్యయందే మన మనస్సులు లగ్న మైయున్నచో, జీవితారంభదశనే మన మీలోకమును వీడవలసియుండు నేమో!" యని నే నంటిని.

30 వ తేది సాయంకాలమున నేను షికారుపోవుచు, చీఁకటి పడుచుండుటచే మార్కండేయాలయము చొచ్చి యొకవేదికపైఁ గూర్చుండి, యందలి సందడిని గనిపట్టుచుంటిని. కోమట్లు కర్షకులు ననేకులు గుడిలోనికి వచ్చి గంట కొట్టి దేవునికిఁ బ్రణమిల్లుచుండిరి. విద్యార్థులును నచటఁ గలరు. వారిపూజలు నేను నిరసింపక, యేమియు లేనిదానికంటె నీమాత్రము భక్తి మంచిదిగదా యని తలపోసితిని. దేవాలయప్రవేశము, విభూతిధారణము, జేగంటకొట్టి నందికి నమస్కరించుట, కనులు మూసి యొకింతసేపు దేవుని స్మరించుట, పూజారిచే శఠగోపము పెట్టించుకొని వానిచేతఁ గొంతరాలిపి బిల్వపత్రము లందుకొనుట, - ఇదియే యచట జరిగెడి కార్యప్రణాళిక !

హృదయాంతర్యామి యగు పరమాత్ముని మదిలో దర్శించి, విశుద్ధప్రవర్తన మూని యుండుట పరమార్థ మని ప్రజ లెపుడు గ్రహింతురా యని నేను బరితపించితిని.

2 వ నవంబరు : - ఈదిన మంతయు దేహమున ససిగాలేదు. పరీక్షలోని యేవిషయమును నేను బాగుగఁ జదువకుండుటచే, అందు జయ మందుదు నను ఆశ యంతరించిపోయినది. ఎక్కువగఁ జదివి యారోగ్యము చెడఁగొట్టుకొనుటకు నేనిపుడు సమకట్టలేదు. పిలిచినచో నాదేహమునుండి రోగము పలుకుచున్నటు లుండెను ! పెందలకడనే పుస్తకము మూసివైచి, వ్యాయామమున కేగితిని. కాని, దారిలో చెలి కాండ్రు కానఁబడినందున, షికారు మాని సంభాషణమునఁ బాల్గొంటిని.

రాత్రి, సంభాషణసందర్భమున కొండయ్యశాస్త్రి, వీరేశలింగముగారి పాండిత్యప్రకర్షమును నిరసించెను. ఓపికతో నే నూఁకొట్టుచుంటిని. అంతకంత కాతనిప్రల్లదము పెచ్చు పెరిఁగి, "ఇతనికంటె దుర్నీతిపరు లెవరు?" అని శాస్త్రి వదరెను ! నే నిఁక పట్టలేక, "ఈ మహాసంస్కర్తను గూర్చి నీ విట్లు కాఱులు ప్రేలి, నీ యవివేకము నవినీతియు వెల్లడించుకొనుచున్నావు ! నోటికిఁ గొంత బుద్ధి చెప్పుము !" అని వానిని వారించితిని. అంత శాస్త్రి, "వీరేశలింగము చేసిన భ్రష్టులేకఁదా యీ విద్యార్థిలోకము ! ఎంతమందిబాలు రీతిని యుసురు పోసికొని యధమగతిపా లైరి ! ఇం తేల ? సంస్కరణములను పేరుతో నీవు నమ్మెడి వంకరటింకర సూత్రములకు ఈదుష్టగ్రహమే కారకుఁడుగదా !" అని రోషావేశమునఁ బలికి, యీసంస్కర్తప్రహసనాదులందు తమ ప్రవర్తనమును వెల్లడించి వెక్కిరించుటచేత జీవితములను గోలుపోయిన కొందఱు సజ్జనులను గుఱించి శాస్త్రి పెద్ద సోదె చెప్పుకొనివచ్చెను !

నాకు తీవ్రమైన యాగ్రహము జనించినను, శాంతించి, నే నిట్లు తలపోసితిని : - "దైవమా ! పంతులవంటి గొప్పవారిని పామరజనులే కాక, శాస్త్రివంటి విద్యాధికులుగూడ నెట్లు దురభిప్రాయులై దూషించుచున్నారు ! ఇంక వారి కేది శరణ్యము !"

శాస్త్రితలంపులు వికృతములు విపరీతములును ! అంతరంగ మెంత కలుషిత మైనను, మందహాససుందరవదనమున భాసిల్లి, సంస్కృతభాషాపాండిత్యము, పూర్వాచార పరాయణత్వమును సమృద్ధిగగలవారే శాస్త్రిమెప్పు వడయువారలు !

ఈ యన్నిటియందును శాస్త్రికి నాకును చుక్కయెదురే ! కాని, ఈ దుసమయమున, మా సామరస్యమును భంగపఱిచెడి చర్య లెవ్వియు నే నవలంబింపరాదు. నే నిట్లు తలపోసితిని : - "ఇంట నే నిపుడు తటస్థముగ నుండి, యెట్టిచర్యలలోను పాల్గొనక, కాలమును శక్తియుక్తులను నిక్షేపించుకొనుచున్నాను. శాస్త్రివంటి మనస్తత్వము గలవారితోఁగూడ వాగ్వాదములు పెట్టుకొన నిది యదను గాదు. దైవానుగ్రహ మున్నచో, పిమ్మట నిట్టివారలకుఁ దగు సమాధానము చెప్పితీరెదను. ఇదిగాక, సగము మతి చెడి దివ్యజ్ఞానవిశ్వాసకు లైన కాంతయ్య లక్ష్మీనారాయణగార్ల కీతఁడు కూరిమి నెయ్యుఁడే కదా."

తన సమాచార మిట్టి దయ్యును, శాస్త్రి యూరకుండువాఁడు కాఁడు. అపుడపు డతఁడు సంస్కారప్రియత్వమును సూచించుమాటలు మాటాడి, తాను విశాలమనస్కునివలెఁ బ్రసంగింప వెనుదీయఁడు. కాని, యొక్కొకతఱి నీతఁడు, అగ్ని పర్వతమువలె సంస్కర్తలమీఁద నిప్పులు గ్రక్కుచుండును !

డిశంబరు 5, 6, తేదీలందు, అధికముగఁ జదువుటవలన నేను శ్రమఁ జెందితిని. పెందలకడనే పుస్తకములు మూలఁ ద్రోచి ధవళేశ్వరమువైపునకు గోదావరియొడ్డున నేను షికారుపోయితిని. పచ్చనిచెట్లు, పండఁబాఱిన సస్యములును జూచి నా కనులు సేద దేఱెను. కొమ్మలమీఁది పక్షులరుతములు, సేద్యగాండ్ర కూనరాగములు, నా వీనులకు శ్రావ్యసంగీతనాదము లయ్యెను. వ్యవసాయకులు కేక లిడుచున్నను, జొన్నకంకులమీఁదఁ జివాలున వాలి, చంచువులతో గింజ లందుకొని చతురతతోఁ బరుగులిడు పక్షుల నవలోకించుచు, నే సాగిపోయితిని. ఆహా! శీతకాలవాయువు లెంత సుఖదాయకములు ! తన్నుఁ బరిశీలించెడివారి శ్రమకు ప్రకృతికాంత యెంతయుదారహృదయమునఁ బారితోషిక మొసంగుచున్నది !

15 వ తేదీనుండి మద్రాసు సర్వకళాశాలాపరీక్షలు ప్రారంభ మయ్యెను. ఎంత ప్రయత్నించినను కొన్ని రాత్రులు నాకంటికిఁ గూర్కు రాకుండుటవలన, పరీక్షాదినములలో నా దేహము మిగుల నిస్సత్తువఁ జెందియుండెను. నే నెటులో ప్రశ్నపత్రములకు సమాధానములు వ్రాసితిని. నే ననుకొనినంత బాగుగఁ గాకున్నను పరీక్షలో జయ మందుటకుఁ జాలినట్టుగ వ్రాసితి నని తలంచితిని. గణితమునందు నాకు గండము తప్పవలెను ! ఎటులో జయింపవచ్చు నని యాశించి యూరడిల్లితిని.

19 వ తేదీతో మాపరీక్షలు పూర్తియయ్యెను. మఱునాఁడె నాకు జ్వరము సోఁకెను. శాస్త్రి మున్నగు స్నేహితులు నన్నుఁ జూడవచ్చి, మంచిమందు పుచ్చుకొమ్మని చెప్పిరి కాని, గోల్డుస్మిత్తువలె నేను సొంతవైద్యము చేసికొనఁగోరితిని ! ఈ జ్వరము నాలుగైదు రోజులలో నెమ్మదించినను, నాకనుల కిపు డొక క్రొత్తరోగము ప్రాప్తించినటు లుండెను. కన్నులయెదుట ముత్యాలసరమువంటి చిన్న చుక్కలబారు కనపడ నారంభించెను ! కంటివైద్యము చేయించుకొన నే నపుడు వేగిరపడితిని.

28. పరీక్షావిజయము

1889, 91 వ సంవత్సరములమధ్య నా జీవితమునఁ గలిగినంత గొప్పపరిణామము, అంతకుఁ బూర్వమునఁ గాని, పిమ్మటఁగాని యింతస్వల్పకాలమున సంభవింపలేదని చెప్పవచ్చును ! ఇష్టవిహారము, నియమానుగుణ్యజీవితము, ఆస్తికమతావలంబనము, సంస్కరణాభిరతి, మొదలగు దోహదవిశేషములచే నావ్యక్తిలతిక వర్ధిల్లి వికసించెను. ఆయాపరిస్థితుల ననుసరించి నాశరీరమనశ్శక్తులు, ఒకప్పుడు కష్టములఁ గ్రుంగుచు, ఒకప్పుడు సంతోషమునఁ బొంగుచుచును, మెల్ల మెల్లఁగ నభ్యున్నతి గాంచుచుండెను. నా శీలప్రవర్తనములు వివిధశోధనలకుఁ దావలమై, క్రమక్రమముగ క్రమమార్గానుసరణమున ప్రవర్ధమాన మగు చుండెను. ఇపుడు నా మతవిశ్వాసములందు సుస్థిరతాదృఢత్వములు, ప్రవర్తనమున నిశ్చిత నీతిపథానుసరణమును, స్పష్టముగఁ గానవచ్చెను. ఈ నూతనవత్సరమున విద్యాభివృద్ధి, దేశాటనము, గృహస్థాశ్రమారంభము, వార్తాపత్రికాస్థాపనముల మూలమున నా లోకానుభవమునకు విశాలత సమకూడి, నా సంస్కరణాభినివేశము నవీనములును క్రియా పూర్వకములు నగుదారులు త్రొక్కుట కవకాశము గలిగెను.

1891 వ జనవరి 1 వ తేదీని, నూతనవత్సరప్రార్థనసమయ మందు నే నిట్లు తలపోసితిని : - "భగవానుఁడా ! నిరు డీనాఁడు నే జేసికొనిన నియమముల నేఁడాదిపొడుగునను నే నంతగ ననుసరింపనందుకు వగచుచున్నాను. ఈ క్రొత్త సంవత్సరమున నీ యీ నిబంధనల నవలంబింతు నని ప్రగల్భములు పలుకక, నీ పాదకమలసేవయె చేతునని నేను నిర్ధారించుకొనుచున్నాను." అంత నూతన సంవత్సరకార్యవిధాన మిట్లు సూచించితిని : -

"1. పరీక్షలో జయమందినచో పట్టపరీక్షకును, లేనిచో మరల నీ పరీక్షకును, జదివెదను.

2. విజయము చేకూరునట్టుగ క్రమపద్ధతిని జదువు సాగింతును.

3. ఆరోగ్యమును గుఱించియు, ముఖ్యముగ నేత్రముల గుఱించియు శ్రద్ధఁ బూనెదను.

4. నా యుద్యమసాఫల్య విషయమై, సమత్వకార్యవాదిత్వములతోఁ గృషి చేసెదను."

అంత నే నిట్లు ప్రార్థన సలిపితిని : - "అనంతా ! ఈ దుర్బలశరీరముతో, నీకును, నీ సంతతయగు మానవకోటికిని నా వివిధవిధుల నెట్లు నెరవేర్పఁ గలను ? పరిశ్రమ యనఁగనే దుర్బలతచే నామేను కంపించుచున్నది ! ఐనను, ఒడలు దాచుకొనుట భావ్యము కాదు. నీ వొసఁగినగడువు మీఱక మున్నె, నావిధులు చెల్లించి, నీదయకుఁ బాత్రుఁడ నయ్యెదనుగాక !"

పరీక్షలు జరిగినపిమ్మట, నాసహపాఠి మిత్రులు తమ సెలవులకు వెడలిపోయిరి. అందుచేత రాజమంద్రిలో నే నేకాకిగ నుండవలసి వచ్చెను. జనవరి మొదటితేదీని వెంకటరావు బసకుఁ బోయి, యాతనిఁ జూచితిని. తండ్రి తనమీఁద గోపించె నని యతఁడు ఖిన్నుఁ డయ్యును, నన్నుఁ జూచి కొంత సేదదేఱెను. రాత్రివఱకు నే నచటనే నిలిచి, యూరట గలిగించితిని.

నేఁడు మే మొక వింతసాటింపు వింటిమి. కొందఱు దుష్టులు శిశువులను దొంగిలించి, యిపుడు బెజవాడదగ్గఱఁ గట్టెడి యేటివంతె నపని జయప్రదముగ జరుగుటకై కృష్ణానదీదేవతకు బలి యిచ్చుటకు వారి నచటి కెగుమతి చేయుచున్నా రని వదంతులు ప్రబలెను ! కావున జనులు తమపిల్లల నింటియొద్ద జాగ్రత్తపెట్టుకొనవలె నని సర్కారు వా రిపుడు సాటింపించిరి. మా కుటుంబ స్థితిగతు లిపుడు విషాదకరముగ నుండెను. 1300 రూపాయలయప్పు పెరిఁగెను. పాపము, నిరుద్యోగి యగు మాతండ్రి యిది యెట్లు తీర్పఁగలఁడు ? నే నన్ననో, ముక్కుచు మూలుగుచు నున్నాఁడను. కనులకుఁగూడ నేదియో మూఁడినది ! ఇంక పరీక్షలో నపజయ మాపాదించెనేని, నాయదృష్టము పరిపూర్తి యగును ! తమ్ముఁడు వెంకటరామయ్య ప్రవేశపరీక్షకుఁ బోయియుండెను. అతఁడు క్రమక్రమముగ బుద్ధిమంతుఁ డయ్యెను. కాని, కృష్ణమూర్తి యింట నవిధేయతఁ గనఁబఱుచుచు, చదువునందు శ్రద్ధ లేకయుండువాఁడు. అతనిని, తక్కిన పిల్లలలోఁ గొందఱిని నదుపులో నుంచుట మాకుఁ గష్టముగ నుండెను ! విషమపరిస్థితులలో నేను ధైర్యము విడువక, ఈశ్వరపాదకమల స్మరణమే సర్వానర్థ హర మని నమ్మియుంటిని.

జనవరి 5 వ తేదీని లక్ష్మీనారాయణగారితో నేను షికారు బయలుదేఱి, మండలవై ద్యాధికారియగు కరూధర్సు డాక్టరును జూడఁ బోయితిని. కచేరిగదియందుఁగాక, నేను లోపలిగదియొద్దకుఁ బోయి తనను జూచినందు కాయన నామీఁద మండిపడెను ! యూరోపువారి యాచారపద్ధతులు నాకుఁ దెలియమియే దీనికిఁ గారణ మని నే జెప్పుటచేత, ఆయన నాతప్పు సైరించి, మఱునాఁడు నాకనులు పరీక్షించెను. రెండుకన్నులలోను చిన్న చుక్క లున్న వనియు, ముం దవి యెట్లు పరిణమించునో తెలియ దనియు, అవి పువ్వులక్రింద నేర్పడి నేత్రదృష్టి పూర్తిగఁ దొలఁగినపుడు శస్త్రము చేయవచ్చు నని యును, ఆయన చెప్పెను. అంతవఱకును నేను సులోచనములు పెట్టుకొనవలెనఁట ! చెన్నపురి వెళ్లి, సర్కారునేత్రవైద్యాలయమందలి నిపుణులచే వైద్యము చేయించుకొనుట మంచిదని స్నేహితులు చెప్పిరి. ఈసంవత్సరము జరుగనున్న జనాభాపనులలో నేను స్వచ్ఛంద సేవకునిగఁ బని చేతు నని పురపాలకసంఘమువారికి మాట యిచ్చి యుంటిని. నాబదు లెవరును పనిచేయ నొప్పకుండినందున, వెను వెంటనే నేను చెన్నపురి పోవుటకు వలనుగాకుండెను. నా నేత్ర రోగమును గుఱించి తలిదండ్రులు సోదరులును మిగుల ఖిన్నులైరి.

ప్రతియేఁడును జనవరిలోనే ప్రథమశాస్త్ర పరీక్షాఫలితములు తెలియుచుండెను. స్నేహితుఁడు కాంతయ్యగా రిపుడు తమ పట్టపరీక్షార్థమై చెన్నపురికిఁ బోయియుండిరి. ముందుగనే నాసంగతి తెలియఁబఱతు నని యాయన నన్ను నమ్మించినను, అట్లు జరుగనందున నాయలజడి హెచ్చెను. మద్రాసులో పరీక్షాపర్యవసానము ప్రచురమయ్యె నని విని నేను రెండవ ఫిబ్రవరిని రిజిష్ట్రారునకు తంతి నంపితిని. జవాబు లేదు ! మఱునాఁడు నే నింట వ్రాసికొనుచుండఁగా, వెంకటరత్నము వచ్చి నా విజయవార్త వెలుఁగెత్తి చెప్పెను. ఆనాఁడెల్లనూ యానందమునకు మేర లేకుండెను ! మిత్రులు పరిచితులును నన్నభినందనములలో ముంచివైచిరి ! కనకరాజు గంగరాజు లపజయ మందుటవలన నాముఖ మంత తేటగ లేకుండెను.

రాజమంద్రి కళాశాలలో నేను జేరి పట్టపరీక్షకుఁ జదువవలె నని మా తలిదండ్రులయుద్దేశము. కాని, నే నొకసంవత్సరము విద్య విరమించినచో, నేత్రదృష్టియు దేహారోగ్యమును చక్కపడు నని వెంకటరావు మున్నగు మిత్రుల యభిప్రాయము. రాజమంద్రిలోనె చదువుటకును, రాఁబోవు వేసవిలో చెన్నపురి పోయి నేత్రవైద్యము చేయిం చుకొనుటకును, నే నంతట నిశ్చయించుకొంటిని. పరీక్షలో తిరిగి యపజయమందిన మిత్రులగు కనకరాజును గంగరాజును పరామర్శ చేయుటకు నేను నర్సాపురము పోయి వచ్చితిని. మార్గమధ్యమున వేలివెన్నులో నే నొకదినము నిలిచియుండఁగా, అచటి బంధువులు నా పరీక్షావిజయవార్త తెలిసి యానందమందిరి. నే నిఁక జదువు చాలించి యుద్యోగము చేతు నని కొందఱును, న్యాయవాది నయ్యెద నని కొందఱును, అచటఁ జెప్పుకొనిరి. వారికి నాయూహలతోను, ఆశయములతోను బ్రసక్తియె లేదు !

కొలఁది రోజులలో ప్రవేశపరీక్షా ఫలితములును దెలిసినవి. తమ్ముఁడు వెంకటరామయ్య జయమందెను. కొండయ్యశాస్త్రి మరల తప్పెను. సోదరుల మిరువురము పరీక్షల నిచ్చి, కళాశాలలో నున్నతవిద్య నభ్యసింప నున్నందుకు నే నానందనిమగ్నుఁడ నైతిని. మా విద్యాపరిపోషణము చేయవలసిన జననీజనకుల బాధ్యతాభారము మాత్ర మతిశయించుచుండెను !

నేను వెంకటరావును జూచుటకు 13 వ తేదీని పోయినప్పుడు, పాపము, అతఁ డవసానదశయం దుండెను ! అపుడును న న్నాతఁ డానవాలు పట్టెను. వెంటనే వైద్యుని బిలువు మనియు, తనదేహమున నిముసనిముసమును ఉబుకుచుండెడి నీటియూటను దోడివేయించి తన జీవములను గావు మనియును, రోగి యాత్రమున నన్ను వేఁడుకొనెను ! నే నచట నిలువలేక పోయితిని. వైద్యుఁడు శక్తివంచనలేక పని చేయుచుండినను, నీటిపొంగు సరికట్టుట దుస్సాద్య మని యచట నుండువారు నాకుఁ జెప్పి వేసిరి ! దైన్యమున నే నింటికి వెడలి పోయితిని. మఱునాఁడు నాతఁ డట్లె యుండెను. అంతకంతకు రోగికి దాహ మతిశయించెను. ఆ మఱుసటి దినమున వెంకటరావు మృత్యుగర్భము సొచ్చెను ! ఆ బాల్యస్నేహితుని యకాలమరణము నాహృదయనౌకను దు:ఖజలధిని ముంచివైచెను. ఓ మరణదేవతా ! నీచేష్టల నిరోధించు సాధనకలాప మీభూలోకమున నెచటను లేనేలేదా ?

29. చెన్నపురిప్రయాణము

రాజమంద్రికళాశాలలో పట్టపరీక్షతరగతిలో నేనును, ప్రథమశాస్త్రపరీక్షతరగతిలో మాతమ్ముఁడును జేరి చదువుచుంటిమి. మా స్నేహితులు కనకరాజు గంగరాజులు తిరిగి రాజమంద్రి వచ్చి ప్రథమ శాస్త్రపరీక్షకును, కొండయ్యశాస్త్రి ప్రవేశపరీక్షకును మరలఁ జదువుచుండిరి. అంతకంతకు సంఘసంస్కారప్రియుల సావాసము మరిగి. శాస్త్రి మున్నగు పూర్వాచారపరులతోడి సంసర్గము నేను విరమించు కొంటిని.

సంఘసంస్కరణసమాజము వెనుకటివలెనే పనిచేయుచున్నను, క్రమక్రమముగ దానిప్రాశస్త్య మణఁగిపోయి, ప్రార్థనసమాజప్రాముఖ్యము హెచ్చెను. నిజమునకు రెండుసమాజముల సభ్యులు నొకకూటము వారే. చర్చనీయాంశముల విషయనవీనత నానాటికి వన్నెవాసి, చేయుపని యంతగఁ జేతులకు లేకపోవుటచే, సంస్కరణసమాజ వ్యాపనము ప్రార్థనసమాజకార్యక్రమమున నంతర్లీనమై, కాలక్రమమున నేతత్సమాజము ప్రత్యేకవ్యక్తిత్వమును గోలుపోయెను ! ఇట్లనుటవలన, సంస్కరణాభిమానము సభ్యుల మనస్సీమనుండి వీసమంతయుఁ దొలఁగె నని తలంపఁగూడదు. ప్రార్థనసమాజసభ్యత్వము సంస్కరణాభిమానమునకుఁ బర్యాయపద మగుటచేత, ఏకోద్దేశమున రెండుసభలు జరుపుట యనగత్యమై, ప్రార్థనసమాజము పేరిటనే మత సంఘ సంస్కరణవిషయముల ప్రసంగప్రణాళిక యంతయు నింతటినుండి జరిగెను.

ఇవి ప్రార్థనసమాజ వార్షికోత్సవదినములు. మద్రాసునివాసులు, సంఘసంస్కారులు నగు మన్నవ బుచ్చయ్యపంతులుగా రిపుడు కొన్ని దినములనుండి రాజమంద్రిలో వీరేశలింగముగారియింట బసచేసి యుండిరి. ఏప్రిల్ 9 వ తేదీని బుచ్చయ్యపంతులుగారు "ఈశ్వరసేవ"ను గుఱించి ప్రసంగించిరి. వయస్సు తీఱిన యనుభవశాలి యగు పంతుల వాక్కులను యువకులము మేము సగౌరవముగ నాకర్ణించితిమి. ఆ మఱుసటిదినము సారంగధరపర్వతమున భగవన్నామసంకీర్తనముచేసి, గీతములు పాడుచు, పురప్రవేశము చేసితిమి. నా కన్నుల కాసమయమున నాచార్యపదవి నధిష్ఠించిన యిద్దఱుపంతుళ్లును ఋషిసత్తముల వలెఁ గానవచ్చిరి. కొన్నిదినములక్రిందటనే కళాశాల వేసవికి మూయఁబడెను. 11 వ తేదీని నేను వీరేశలింగముగారియొద్దకుఁ బోయి, నేత్ర వైద్యమునకై చెన్నపురి కేగవలెనని చెప్పితిని. ఆయనయు, బుచ్చయ్య పంతులును సకుటుంబముగ మఱునాఁడే చెన్నపురిప్రయాణము పెట్టుకొనియుండుటచేత, నన్ను దమతోఁ దీసికొనిపోయెద మనిరి.

కొంతకష్టముమీఁద నా చెన్నపురిపయనమునకు మా తలిదండ్రులు సమ్మతించిరి. వీరిని, తమ్ములను చెల్లెండ్రను నేను విడిచిపోవునపుడు, అందఱమును కంట నీరు పెట్టుకొంటిమి. కొందఱు స్నేహితులతో పడవప్రయాణముచేసి, 13 వ తేదీని కాకినాడ చేరితిని. మఱునాఁడు ప్రొద్దుననే సహచరుఁడగు మద్దిరాల రామారావుగారియింట భోజనము చేసి, ఒకడబ్బాతో మంచినీరు, ఇంకొకదానితో పెరుగును కొంత మిఠాయియు వెంటఁదీసికొని, నేను చిన్న పడవమీఁదఁ బోయి, సాయంకాలమున పొగయోడ నెక్కితిని. ఇదివఱకు నే నెన్నఁడును సముద్రదర్శనము చేసియుండలేదు. నాకన్నుల కిపుడు లోక మంతయు వింతవన్నెలు దాల్చినటు లుండెను ! బిడియముచేత పొగయోడలో వీరేశలింగముపంతులు మున్నగు పరిచితు లుండుచోటఁగాక వేఱొకచోటఁ గూర్చుంటిని. ఓడ మఱునాఁటియుదయమునకు బందరురేవు చేరి, సామా నెక్కించు కొనుచు నచటనే సాయంకాలమువఱకును నిలిచియుండెను. ఒక్కొకసారి పెద్దయలలు చెలరేగుటవలన బందరురేవు కల్లోలముగ నుండును. నాఁ డంతయు పొగయోడ పెద్దకెరటములతాఁకున కుయ్యల వలె నూఁగుటచేత, పైత్యప్రకోపమున నాకు వాంతులయ్యెను. సాయంకాలము పొగయోడ కదలిపోయినపుడు శమనము గలిగి, కొంచెము ఫలాహారము చేసితిని. మఱునాఁటి యుదయమునకు చెన్నపురి సమీపించితిమి. అనతిదూరమున నగరము సముద్రముమీఁద మిగుల రమణీయముగఁ గానవచ్చెను. అపుడు వీరేశలింగము బుచ్చయ్యపంతులు గార్లు కనఁబడి, కుశలప్రశ్న చేసి, పట్టణమందలి తమబసకు నన్నాహ్వానించిరి. క్రొత్తప్రదేశము చూచి బెదరిననాకు, చేరఁబిలిచిన యీ ప్రాఁతపరిచితులు ప్రాణరక్షకులవలెఁ గానఁబడిరి ! వారితో నే నంత పరశువాక మేగితిని. అచ్చట బుచ్చయ్యపంతులుగారి కొక లోగిలి గలదు. ఆసాయంకాలమే వీరేశలింగముగారితో నేను గుజిలీబజారు మున్నగు పురభాగములు సందర్శింప వెడలితిని.

నేను చెన్నపురిలో బుచ్చయ్యపంతులుగారియింటనే విడిసి వీరేశలింగముగారియతిథిగ నుంటిని. ఒకొక్కప్పుడు బుచ్చయ్యపంతులుగారితోఁగూడ భోజనము చేయుచుందును. నేత్రవైద్యాలయమునకుఁ బోవునపుడు తప్ప, తక్కినకాలమందు నే నింటనో బయటనో వీరేశలింగముగారితోనే యుండుచువచ్చితిని. రాజమంద్రియందు నాకుఁ బ్రాప్తింపని పంతులుగారి నిరంతరసహవాసభాగ్యము నా కిచట లభించెను. నీతిమతసాంఘికసాహిత్యాంశములందు ఆమహనీయుని యూహలు నుదారాశయములును నే నిపుడు గ్రహించి యానందింపఁ గలిగితిని. భార్యయగు రాజ్యలక్ష్మమ్మగారితోను, అభిమానపుత్రకుఁడగు చిన్న వీరేశలింగముతోను, ఆయన మాటాడి మెలఁగుచుండురీతి నేను గనిపెట్టితిని. వ్యర్థకాలక్షేపము చేయక, పంతులుగారు సదా సద్గ్రంథపఠనమునను, పుస్తకరచనమునందును లగ్న మానసు లై యుందురు.

29 వ తేదీని నా కనులు డాక్టరు బ్రాకుమను పరీక్షించి, అందేమియు జబ్బు కానఁబడకపోవుటచేత, నే నింటికి వెడలిపోవచ్చు నని చెప్పివేసిరి. ఇది సంతోషకరమైన సంగతి యైనను, కనులముం దాడెడి చుక్కలనుగుఱించి వైద్యుఁడు ప్రస్తావింపకపోవుటచేత, ఆయన వానిని గుర్తింపలేకుండెనేమో యని నేను సంశయమందితిని. ఐనను, నేత్రవైద్యవేత్త యగు బ్రాకుమనుని నిశ్చితాభిప్రాయము నే నెట్లు శిరసావహింపకుందును? కావున నేను తిరుగుపయనమున కాయత్తపడితిని.

మే 1 వ తేదీని వీరేశలింగముగారితోఁ బోయి, రాజధానీ కళాశాలను జూచితిని. అందలియాంధ్రభాషావర్ధనీసమాజసభ కాయన యధ్యక్షుఁడై యొక చక్కనియుపన్యాస మొసంగిరి. బుచ్చయ్యపంతులుగారు, బ్రాహ్మమతస్వీకారమునుగూర్చి నాతో మనసిచ్చి మాటాడిరి. అదివఱ కాయన చిరకాలము మద్రాసునందలి బ్రాహ్మ సమాజనున సభ్యులుగ నుండి, సమాజాభివృద్ధికై మిక్కిలి పాటుపడి, మందిరనిర్మాణముఁ గావించిరి. ఆ సమాజమువారికిని పంతులుగారికిని సరిపడనందున, వారినుండి యాయన విడిపోవలసివచ్చెను. అంత మద్రాసున స్వంతముద్రాలయమును స్థాపించి, "హిందూజన సంస్కా రిణి" అను మాసపత్రికను నెలకొల్పి, పంతులు జరుపుచుండెను. బుచ్చయ్యపంతు లిపుడు హిందూమత పునరుద్ధారణము ప్రధానాదర్శముగఁ జేసికొని, పండితులసాహాయ్యమున నర్థతాత్పర్యసహితముగ హిందూధర్మశాస్త్రము లాంధ్రమునఁ బ్రకటించుచుండిరి.

మే 2 న తేదీని బళ్లారి "సరసవినోదినీ నాటకసమాజము" వారు తాము ప్రదర్శించెడి యొక నాటకమునకు వీరేశలింగముపంతులుగారి నాహ్వానింపఁగా, నేనును వెళ్లితిని. నాటకము మిగుల రమ్యముగ నుండెను. ఆ మఱుసటిదినము పంతులుగారితోఁ గలసి బ్రాహ్మమందిరమున కేగితిని. ఉపాసనసమయమున సామాజికు లందఱును గలిసి కీర్తనలు పాడుటకు మాఱుగా, జీతమునకుఁ గుదిరిన యొకపాటకుని గీతము లూరక వినుచుండిరి ! ఇది నాకు రుచింప లేదు. వీరేశలింగముగా రంతట "ఐహికాముష్మిక సుఖముల"నుగూర్చి యుపన్యాసముచేసిరి.

నేను చెన్నపురిలో నుండురోజులలోనే, స్విప్టువిరచిత మగు "గల్లివరునిప్రయాణముల" ననుసరించి, "సత్యరాజాపూర్వదేశయాత్రలు" అను విచిత్రకథను పంతులుగారు రచింపఁదొడంగిరి. ఏనాఁడు వ్రాసిన ప్రకరణముల నానాఁడు పంతులు నాకుఁ జదివి వినిపించి, నాయభిప్రాయము గైకొనుచుండెను. ఓడప్రయాణమందలి నాబాధలసంగతి నేఁ జెప్పగా విని, సమయోచితముగ నందుఁ గొన్నిటిని సత్యరాజున కాయన యారోపించుట చోద్యముగ నుండెను. హాస్యరసకల్పనా విషయమున పంతులుగారు అడ్డిసనునికంటె స్విప్టునే యెక్కువగఁ బోలియుండె నని నే నంటిని. అడ్డి నుని మృదుహాస్యప్రయోగము తెలుఁగునఁ జొప్పింప పంతులయాశయము. అది కడు దుస్సాధ్య మని నేను జెప్పితిని. పంతులుగారి నిరంతరపరిశ్రమము నా కాశ్చర్యానందములను గొలిపెను. వారివలెనే నేనును పాటుపడనెంచి, నే నక్కడ కొనిన 'ఈసపుకథల'ను తెలిఁగింప మొదలిడితిని. ఈవిధముగ నేను చెన్నపురిలోఁ గొన్నికథల ననువదించితిని.

5 వ తేదీసాయంకాలము వీరేశలింగము బుచ్చయ్యపంతులు గార్లకు అద్వైతమతమునుగుఱించి పెద్దచర్చ జరిగెను. బుచ్చయ్యపంతు లిపుడు అద్వైతమతాభిమాని. వీరేశలింగముగారి మనస్తత్వమున కామతము బొత్తిగా సరిపడకుండెను. దానియం దణుమాత్రమును సత్యము లే దని యాయననిశ్చితాభిప్రాయము. అంత బ్రాహ్మధర్మమందలిలోపములను బుచ్చయ్యపంతులుగారు వెలువరింపఁగా, వీరేశలింగముగారు వారివాదమును ఖండించిరి. నేను వీరేశలింగముగారి పక్షమునే యవలంబించితిని.

6 వ తేదీని, ఈయిరువురు మహాశయులయొద్దను, జననులవలె నిన్నాళ్లును నాకు భోజనసౌకర్యములు గలిగించిన వారిసతీమణుల యొద్దను, నేను సెలవు గైకొని, మద్రాసునుండి బయలుదేఱితిని. వెనుకటి యనుభవములు మఱచిపోయి, నాస్వాభావికరుచుల ననుసరించియె, పొగయోడలో భుజించుటకు తీయని యుపాహారములే యీమాఱును నేను వెంటఁదీసికొనిపోయితిని ! కాని, యోడలో పయనము చేయుచుండు నామిత్రుఁ డొకఁడు, సముద్రయానమందు పైత్యోద్రేకకరములగు మధురపదార్థములు పనికిరావని నాకుఁ జెప్పి, తాను దెచ్చుకొనిన పచ్చడియూరుగాయలతోఁ గలిపినయన్నము నాకుఁ బెట్టెను. ఈమాఱు నాపయనము హాయిగ నుండెను. 8 వ తేదీమధ్యాహ్నము కాకినాడ తీరము చేరి, బండిమీఁద మఱునాఁటి సాయంకాలమునకు రాజమంద్రి వచ్చితిని. సుఖముగ నే నిలు చేరినందు కందఱు నానందపరవశులైరి.

30. జనకుని వ్యవహారదక్షత, శకటవ్యాపారఫలితము

ఇటీవల మాతండ్రి, దూరదేశము పోలేక, ఉద్యోగము విరమించుకొని, యింటిపట్టుననే యుండెను. ఎవరితోడనో మాటలసందర్భమున బండివ్యాపారము లాభకర మైన దని యాయన వినెను. త్రాడు బొంగరములు లేని వ్యవహారములలోఁ జొరఁబడుటకు నే నిష్టపడు వాఁడను కాను. నా చెన్నపురిప్రవాససమయమున మాజనకుఁడు మా తల్లిని, పెద్దతమ్ముని నెటులో యొప్పించి, కొంతసొమ్ము బదులుచేసి, బండిని ఎద్దులజతను కొనెను. బాడుగకు బండి తోలుటకై యొకజీతగాఁడు నియమింపఁబడెను. బండివలన దినమున కొకరూపాయి వచ్చి, ఖర్చుల కర్ధరూపాయి వ్యయ మైనను, కనీస మెనిమిదణాలు మిగులునట్లు తేలెను. కావున నింకొకబండియు నెద్దులజతయును శీఘ్రమే మాతండ్రి కొనెను. దినకృత్యములు చేసికొనుటయె భారముగ నుండెడి మాతల్లి, సాయంకాల మగునప్పటికి, ఎద్దులు నాలుగింటికిని, చిట్టుపొట్టులుకుడితియు గుగ్గిళ్లును సమకూర్పవలసివచ్చెను ! రెండుబండ్లకును పని కుదుర్చుట, పనివాండ్రు సరిగా పని చేసి సొమ్ము తెచ్చి యిచ్చుట మొదలగుకార్యభార మంతయు మాతండ్రిమీఁదఁ బడెను. మాతమ్ము లాయనకు సాయముచేయుచుండిరి. ఈశకటవ్యాపారవ్యామోహము మాతో నిలిచిపోయినదికాదు ! మా మామగారికిని మా తండ్రికిని చెలిమి యెక్కువ. ఆయనయు మా నాయనవలెనే తనపుత్రుని విద్యాభివృద్ధికై సకుటుంబముగ నిచ్చటికి వచ్చి, ఇపు డూరకయే కాలము గడపుచున్నారు. వారును బండి యొకటి కొని, కుటుంబాదాయ మేల వృద్ధిచేసికొనరాదు ? మాజనకుని ప్రేరేపణమున, కొలఁదిరోజులలో వారికిని నొక బండి యెద్దులజతయు సమకూడెను ! ఇపుడు వారు మాపొరుగునకుఁ గాఁపురము వచ్చిరి. కావున నీయుభయకుటుంబముల కును, తెల్ల వాఱుసరికి శకటవ్యాపారసందర్భమునఁ జేతులకుఁ బనియు, మనస్సున కలజడియు సమృద్ధిగఁ జేకూరెను ! ఒకరియెద్దులకంటె నొకరివి మంచి వనియు, ఒకరిబండికంటె నొకరిదాని కెక్కువలాభము వచ్చు ననియు నెంచెడి యీర్ష్యాజనకములగు నభిప్రాయములు గలిగి, పరస్పరస్నేహసౌహార్దములకు భంగకరము లగు పరిస్థితు లేర్పడెను !

నేను చెన్నపురినుండి యింటికి వచ్చునప్పటికి, నాకీ క్రొత్త సంగతు లన్నియు ద్యోతకమయ్యెను. తన వ్యవహారదక్షతనుగుఱించియు, మా కుటుంబమున కిపుడు గలుగు ధనలాభమునుగూర్చియు మా తండ్రి నాకుఁ జెప్పఁదొడంగెను ! నాకుమాత్రము మాకుటుంబమున కింతసులభముగ నే గొప్పయదృష్టమును పట్టునను నమ్మకము లేదు ! మా యదృష్టముమాట యటుంచి, మా జనకుని యాలోచనాసౌష్ఠవమునుగూర్చి విచారించినను, నా మనస్సున కేమియు సంతృప్తి గలుగదయ్యెను. ఆయన వ్యాపారకౌశలమునుగూర్చి నాచిన్న తనమున రేలంగిలో నొకగాథ వినుచుండువాఁడను. ఇప్పటివలెనే మాతండ్రి యపుడును ఉద్యోగము చాలించుకొని, యింట దినములు గడపుచుండెను. ఆ కాలమున చింతపండు అమితప్రియ మయ్యెనఁట. వీసె ముప్పావలా దాఁటిపోయెను. ఒకటేల, చింతపండుధర హెచ్చుచుండుటచేత, వర్తకులు దానిలో ఖర్జూరపుపండు మిశ్రమము చేసి యమ్మి లాభము గడించుచుండిరి ! ఈతరుణమున చింతపండువర్తకము చేసి మంచిలాభ మేల సంపాదింపరాదని మా తండ్రిమనస్సునకు స్ఫురించెను. ఇట్టి వ్యాపారపరిశ్రమమం దీయనకుఁ దీసిపోని ప్రజ్ఞానుభవములుగల యాయనపెద్దయన్న దీనికి వల్లె యనెను ! అంత మా నాయన రాజమంద్రి వెళ్లి, కొన్ని కంట్లముల చింతపండుకొని, రహదారిపడవమీఁద సరకు రేలంగి తీసికొనివచ్చెను. ఈబుట్టల యమ్మకమున మితిమీఱిన లాభము రానున్న దని యన్నదమ్ములు గుసగుసలాడుకొనిరి ! ఇంకను విరివిగా నీవ్యాపారము సాగించినచో, సులభముగ వందలు వేలును లాభము మూటగట్టవచ్చు నని యాసోదరులు తలపోసిరి. అంత మా జనకుఁడు సొంతచేతులతోనే యాచింతపండు తూఁచి యమ్ముటకు తక్కెడయు రాళ్లును తయారు చేసికొనెను !

గాలిపాటువలె వర్తక పరిస్థితులును నిముసనిముసమును పరివర్తన మందుచుండును ! మఱునాఁటినుండియె చింతపండుధర తగ్గసాగెను, పూర్తిగ లాభము తీయవలయు ననుపేరాస ప్రేరింపఁగా, మాతండ్రి కాలానుసారముగ కొంతధర తగ్గించి, తా నెటులో సరకు నమ్మివేయుటకు సమ్మతింపలేదు. రానురాను చింతపండు చౌక యైపోయెను. స్వల్పలాభమునకో నష్టమునకో సకాలముననే సర కమ్మలేనివారు, అది కారుచౌక యగునపుడు, ఎక్కువనష్టమునకు తెగించి యమ్మివేయఁ గలరా? పర్యవసాన మేమన, మా నాయన తెచ్చినచింతపండుబుట్టలు, తెచ్చినవి తెచ్చినట్టుగనే నిలువయుండి, పదు నుడిగి, బూజు పట్టి, గడ్డగట్టిపోయినవి ! ఇపు డవి యెవరికిఁ గావలెను? ఇంట నైన నుపయోగింప వలనుపడకుండెను. మావాండ్రు నీళ్లపొయిలో చింతపండు అడలు వేయుచుండువారు ! శీతకాలమందు ప్రొద్దున చలిమంటల కివి యుపకరించుచుండెను. మంట యారిపోవ నున్నపు డెల్ల, "ఇంకొక అడ తెచ్చివేయండిరా !" అనుమాటలు చిన్న నాఁడు నేను వినుచుండిన జ్ఞాపకము ! ఈచింతపండువ్యాపారప్రస్తావము తెచ్చి, మావాండ్రు, అప్పుడప్పుడు మాతండ్రిని పరియాచకము చేయుచుండువారు. అపు డాయన ముసిముసినవ్వులు నవ్వుచు నుండువాఁడు !

ఇపు డీబండ్లవ్యాపారము నటులే పరిణమించు నని నేను వాక్యము పెట్టితిని ! కాలము గడచినకొలఁది, బండ్ల'గిరాకి' తగ్గెను. బండి'కిరాయి' తగ్గుటచేత, స్వల్పలాభము స్వల్పనష్టముక్రింద దిగెను. ఇదే బండ్లమ్మివేయుట కద నని నేను మాతండ్రిని హెచ్చరించితిని. ఒక బండి యమ్మివేయుట కాయన యొడఁబడుటచే, కొంచెమునష్టమునకు దానిని, దానియెద్దులను అమ్మివేసితిమి. కష్టనష్టములు పెరుఁగుచుండుటచేత, రెండవబండిని ఎద్దులనుగూడ పోకడపెట్టితిమి. మా మామగారి సంగతి కూడ నిట్లే జరిగెను. ఉభయకుటుంబములును, ఈ బండ్లవ్యాపారమున మూటగట్టుకొనినది, శ్రమయు ఋణమును మాత్రమే! ఈయప్పు భావికాలమందలి కుటుంబఋణమునకు ప్రాతిపదికము కూడ నయ్యెను !

31. రచనావ్యాసంగము

చెన్నపురినుండి వచ్చిన మఱుసటిదినముననే నా పుస్తకములు సరదుకొని, చెలికాండ్రను జూచివచ్చి మద్రాసులో నారంభించిన వ్రాతపని సాగింపఁబూనితిని. నా గురువర్యులగు వెంకటరత్నముగారిని చూచినపుడు, తెలుఁగులోనికి తర్జుమా చేయు మని యాయన నా కొక యింగ్లీషుపుస్తక మిచ్చెను. అది నేను ముందు వేసికొని, యింటఁ గూర్చుంటిని. తెలుఁగున గద్యపద్యరచనము చేయ నే నుద్యమించి, పోపు విరచిత మగు "సార్వజనికప్రార్థన"ను, 'గ్రే' వ్రాసిన "పెంపుడుపిల్లి" యను గీతమును, పద్యరూపమున ననువదించితిని. చేంబర్సు "నీతిపాఠక పుస్తక" మందలి పాఠములు కొన్ని చదివి తెలుఁగు చేసితిని. వీనిలోఁ గొన్ని కరపత్రములుగఁ బ్రచురించి ప్రార్థనసమాజ పక్షమున జనుల కుచితముగఁ బంచిపెట్టుట మంచి దని తలంచితిని. వీరేశలింగముగారు తెప్పించుకొనుచుండు "ఇండియన్ మెసెంజర్" అను బ్రాహ్మసమాజ వారపత్రికను జదువుటకు వారమువారమును వారిం టికిఁ బోవుచుండువాఁడను. ఆపత్రికలోఁ బ్రచురమగు మంచివ్యాసముల నిపుడు ఆంధ్రీకరింపసాగితిని. కడచిన రెండుసంవత్సరముల నుండియు రాజమంద్రిలో ప్రచుర మగు "వివేక వర్ధనీ" వారపత్రికను దెప్పించి సంతోషమునఁ జదువుచుండువాఁడను. ఇపుడు కొలఁది కాలమునుండి యాపత్రిక పడిపోయెను. మా చేతులలోనే యిట్టి వార్తాపత్రిక యొకటి యుండినచో, నే నిటీవల వ్రాయుచువచ్చిన పద్యములు వ్యాసములు నందుఁ బ్రచురింపవచ్చునుగదా ! నావలెనే ప్రార్థన సమాజమిత్రులును వ్రాసెడి వ్యాసములు, సభలలోఁ జదివెడి యుపన్యాసములును, ఇట్టి వార్తాపత్రికలలో ముద్రింపవచ్చును.

వార్తాపత్రికా స్థాపనమును గుఱించి నే నంతట కొందఱు సమాజమిత్రులతోఁ బ్రస్తావించితిని. వారు దాని నామోదించిరి. మే 27 వ తేదీని మృత్యుంజయరావు నేనును వీరేశలింగముగారితో మాటాడి, గోదావరియొడ్డున షికారుపోవుచు, పత్రికాస్థాపనమును గుఱించి మాటాడుకొంటిమి. మిత్రునితో నే నిట్లు చెప్పితిని : - "వీరేశలింగముపంతులుగారు తాము విరమించిన వివేకవర్థనీ స్థానమున చింతామణి యను మాసపత్రికను నెలకొల్పఁ దలఁచుకొన్నారు. మనబోటివారు వ్రాయు వ్యాసము లందుఁ బ్రచురింపరు. బొంబాయి బంగాళాదేశములలోని ప్రార్థన సమాజములకు స్వంత వార్తాపత్రిక లున్నవి. మనకుఁగూడ నొక పత్రిక యుండుట కర్తవ్యము. ముందుగా నొక చిన్నపత్రిక నేర్పఱిచి, దానిని క్రమముగఁ బెంపు చేయవచ్చును. ప్రార్థనసమాజమే దీని యాజమాన్యము వహింపవలెను. ఈ పట్టణమున నుండు సభ్యులు కార్య నిర్వాహక సంఘముగ నేర్పడి పత్రికను సాగింపవచ్చును." మృత్యుంజయరావు నాతో నేకీభవించెను. అంత మే మిరువురము పత్రికను గుఱించి మాటాడుకొని, చందాలు పోగు చేయఁదలంచితిమి. భావోద్రేకమున నా కారాత్రి మంచి నిద్దుక పట్టలేదు.

ఒకటి రెండు రోజులు జరిగినపిమ్మట, మే మిద్దఱము మరలఁ గలిసికొని పత్రికాస్థాపనమును గుఱించి సంభాషించితిమి. ఆఱునెలలవఱకును తాను దానిని బోషింతునని నామిత్రుఁడు చెప్పినప్పుడు, అటులైన పత్రిక తప్పక వెలయఁగల దని నే ననుకొంటిని. మఱునాఁటిసాయంకాలము మే మిరువురము వీరేశలింగముగారి యింటికిఁ బోయి, నూతనపత్రికను గుఱించి వారితో మాటాడితిమి. దీని కాయన మిగుల సంతోషించి, మావలెనే యౌవనమున దాను "వివేక వర్ధనీ" పత్రికను బ్రకటించినసందర్భము జ్ఞప్తికిఁ దెచ్చుకొని, ఆపత్రిక వెనుకటిప్రతులలోనివ్రాఁతలు కొన్ని మాకుఁ జదివి వినిపించెను. పత్రిక నెలకొల్పుటకుఁ జేయవలసిన కార్యక్రమము మాకుఁ దెలియఁబఱచెను. వలసినచో నేను పత్రికాధిపతిగ నుండెద నంటిని.

ఆమఱునాఁటి యుదయమునుండియె నూతనపత్రికాస్థాపన విషయమై నేను దలపోయసాగితిని. వివేక వర్థినిని బ్రారంభించుటకు వీరేశలింగముగారికిఁ గల యాశయములె మా దృష్టిపథమునను వెలసి యుండుటచేత, పేరున నించుక మార్పు చేసి, నూతనపత్రికకు "సత్య సంవర్థిని" యని నామకరణము చేసితిని. క్రొత్తపత్రిక కంతట "విజ్ఞాపనము" వ్రాసి 6 వ తేదీని నే నది పంతులుగారికిఁ జూపించితిని. అది బాగుగ నుండె ననియు, కొంచెము తగ్గించినయెడల, అదియే పత్రికలో ప్రథమవ్యాసముగ ముద్రింపవచ్చు ననియుఁ బంతులుగారు చెప్పఁగా, నే నెంతో సంతోషపడితిని. అప్పటినుండియు నేను "సత్య సంవర్థనీ" పత్రికకు వ్యాసములు వ్రాయుటతోఁ గాలము గడిపితిని. "అను తాపము" అనువ్యాసము నే నీసమయమున రచించి, సవరించి, పత్రికకు సిద్ధపఱిచినదియె.

నూతన పత్రికా వ్యాసంగమున నే నిట్లు తనిలియుండుటకుఁ గారణమారయఁగా ఆనాఁటి నామనస్తత్త్వ సమాచారము నాకు స్ఫురణకు వచ్చుచున్నది. నాశరీరదౌర్బల్యము సంగతి మాటిమాటికి నా మనస్సున కింకను దట్టుచు, నాబాధలను బెనుచుచుండెను. ఈ బాధలు నే లెక్క గొనక మఱచిపోవుటకు, నామనస్సున కపుడు నిరంతర పరిశ్రమ మేదియో యొకటి యావశ్యక మయ్యెను. ప్రార్థన సంఘ సంస్కరణ సమాజ ప్రణాళికలు నామనసున కట్టి వ్యాసంగము కొంత గలిపించినమాట వాస్తవమే. కాని, సమాజసభలు వారమున కొకటి రెండు గంటలు మాత్రమే జరుగుచుండెను. సభాప్రసంగము లందును, సఖులతో సంభాషణమునందును, ఉపన్యాసాదుల యందును నేను దఱచుగఁ బొల్గొనుచుండెడివాఁడను. కాని, యిట్టి చర్య లనుదినమును జరుగుట కవకాశము లేదుగదా.

ఇదిగాక, ఉపన్యాసములు, వాదోపవాదములును నా కంతగ రుచెండివికావు. మీఁదుమిక్కిలి నా సంస్కరణ వ్యాపనమునకుఁ గూడ నివి కొంత ప్రతిబంధములని నాకుఁ దోఁచెను. వ్యాసరచనయు పత్రికావిలేఖనమును ముఖ్య కర్తవ్యములుగ నా కగఁబడెను. దీనికి హేతువులు లేకపోలేదు. తగినంత వేగముగను విస్పష్టముగను సభలలో నేను నా భావములను వ్యక్తపఱుప లేకుండెడివాఁడను. తెలుఁగున మాటాడునపుడు ఇంగ్లీషుపదములు దొరలుచుండెడివి ! భావోద్రేరమున నా వచోధోరణి కుంటుచు నడుచుచుండెడిది. పదలాలిత్యాది సొంపులు లేక, నాభాష పరుషముగను, పలుకులు కటువులుగను నుండెడివి. ఇట్టి వాక్శక్తి లోపమువలన, హృదయమున లేని కాఠిన్యమునకును, మనసున లేని కాపట్యమునకును, నేను ఉత్తరవాది నగుచు వచ్చితిని.

నిశబ్ద మగుచోటఁ గూర్చుండి కలము చేతఁ బట్టినప్పుడు, ఉపన్యాసవేదికమీఁదను సభామధ్యమునను నాకుఁ గానవచ్చెడి తొట్రుపాటులు తొలఁగిపోయెడివి. భావమును వ్యక్తపఱిచెడి భాషయు, అభిప్రాయముల కనువగు పదసంఘటనమును, వ్రాఁత లభింపఁజేసెడిది. కలము చేతఁ బూనినపుడు, అవమాన మేమియుఁ గలుగకుండ మన తలంపులు మనము మార్చుకొనవచ్చును. మిత్రుల పరిహాసములకును, వైరుల వ్యాఖ్యానములకును నెడ మీయకుండ వెనువెంటనే మన వాక్యములు మనము సరిచేసికొనవచ్చును. కావున నన్ని విధములను వ్రాఁతపనియె నాకుఁ గర్తవ్యముగఁ గానఁబడెను.

32. పత్రికాస్థాపనము

"సత్యసంవర్థని"ని బ్రచురింప వీరేశలింగముగారు మిత్రులును సమ్మతించిరి కాన, ఆ పత్రికాస్థాపనవిషయమై వలయు ప్రయత్నములు నేనంతట చేసితిని. "వివేక వర్థనీ"పత్రికకు వెనుకటి వ్యవహారకర్త యగు శ్రీరాములుగారితో నేను జూలై 2 వ తేదీని కలసి మాటడఁగా, పత్రికను నడుపురీతిని నా కాయన చెప్పి, తానే యాపని చేసిపెట్టెద ననెను. పత్రికను టపాలో నంపువిషయమై మాటాడుట కానాఁడె నేను టపాలాకచ్చేరికిఁ బోయితిని. సబుకలెక్టరువొద్ద కేగి, నేను "సత్యసంవర్థనీ" పత్రికాప్రచురణకర్త నని కాగితముమీఁద సంతకముచేసి వచ్చితిని. సత్యసంవర్థనిని తమపత్రికఁగా ప్రార్థనసమాజము అంగీకరించుట యావశ్యకము గాన, ౫-వ తేదీని సమాజప్రత్యేకసభ నొకటిఁ గూర్చితిమి. సమాజపునరుద్ధరణము జరిగినపిదప, పత్రికాప్రచురణమున కందఱు నొప్పుకొనిరి. ఎవరికిఁ దోఁచినచందాలు వారు వేసిరి. అంతట సమాజము చేసికొనిన తీర్మానములచొప్పున, పత్రికానిర్వహణకార్యము మాలో నైదుగురు సభ్యుల కొప్పగింపఁబడెను. వీరిలో శ్రీరాములుగారు పత్రికావిలేఖకులు నిర్వహకులును; నేను ప్రచురణ కర్తను, కోశాధికారిని. సాంబశివరావు పత్రికను జందాదారుల కందఁజేయుకార్యము నిర్వహించువాఁడు.

నే నిట్లు పత్రికాప్రచురణమును గుఱించి ప్రయత్నించు చుండఁగా, 17-వ తేదీని వీరేశలింగముగారు నాతో మాటాడుచు, జనసామాన్యమున కుద్దేశింపఁబడిన యాపత్రికలో తెలుఁగు వ్యాసములే యుండవలె నని చెప్పిరి. ఇంతియ కాదు. ప్రార్థనసమాజము పేరిట నీపత్రిక ప్రచుర మగుటయె యుక్తము కాదనిరి. నేను గారణ మడుగఁగా, సమాజసభ్యులలోఁ బలువురు విద్యార్థులె యగుటచేత, పత్రికయందు మంచివ్యాసము లుండవనియు, చేతఁగాని వ్రాఁతలవలన సమాజమునకును అధ్యక్షులగు తమకును నపకీర్తి యాపాదించుననియు, కావున నాపేరిటనే పత్రిక వేయుట యుక్తమనియు పంతులుగారు చెప్పిరి!

ఇది నాకు సమంజసముగఁ గనఁబడలేదు. పత్రికాప్రకటనము, సమాజాదర్శముములను బ్రకటించుటకే కాని, నా సొంతయభిప్రాయముల నెలకొల్పుటకుఁ గా దని నేను జెప్పివేసితిని. సత్యసంవర్ధనిని సమాజపత్రికగాఁ బ్రచురింపఁ గోరితిమేని, అందుఁ దనురచనలకు ప్రాముఖ్యము గలుగవలె నని యంతట పంతులుగా రనిరి. నే నందుకు సమ్మతించితిని. ఎట్టకేలకు సత్యసంవర్ధనిని సమాజపత్రికగా పంతులుగా రంగీకరించి నన్ను పత్రికాసంపాదకునిగ నిర్ణ యించిరి.

జూలై 29 వ తేదీని పత్రికమొదటిసంచిక వెలువడెను. దీనిలో, తెలుఁగున పంతులుగారును, ఇంగ్లీషున నేనును, విజ్ఞాపనము వ్రాసితిమి. 'అనుతాపము' అను వ్యాసమునకు నేనును, 'పుణ్యపాప మార్గములు' అనుదానికి పద్మనాభరాజుగారును రచయితలము. ఇవి గాక రెండు సంగ్రహవార్తలుమాత్రమే యాసంచిక యందుఁ గలవు. మచ్చునకై యీ వ్యాసములలోని కొన్ని భాగము లిచట నుల్లేఖించు చున్నాను.

(తెలుఁగు) విజ్ఞాపనము : "మన హిందూదేశమందు సమస్తమును మతముతో సంబంధించియున్నది. మతమునం దక్రమముగ ప్రవేశించిన దురాచారములను తొలఁగింప బ్రయత్నింపనిపక్షమున, మన దేశమునం దితర విషయములయం దభివృద్ధి కలిగించుట సాధ్యము కాదు. మతమే సమస్తాభివృద్ధులకును మూలాధారము మతమే నీతి వృక్షమునకు కుదురు. కాఁబట్టి సామాన్యజనులయభివృద్ధికయి మత విషయములయిన సత్యములను, నీతిని, సద్వర్తనమును బోధించెడిపత్రిక యొక్కటి యత్యావశ్యకమయియున్నది. అట్టికొఱఁతను కొంతవఱకయినను తీర్పవలె నని యిక్కడి ప్రార్థనసమాజమువా రిప్పు డీచిన పత్రికను ప్రచురింపఁబూనుకొన్నారు."

అనుతాపము : "ప్రతిదినమును తాను జేసినయపరాధముల మనసునకుఁ దెచ్చుకొని, వానికై పరితపించుటచేత, ఎవరిదుర్గణములు వారికిఁ దెలియును. లోకములో జనులకు సాధారణముగ తమ కీలోపము లున్నవని బాగుగ తెలియవు. ఒకవేళ తెలిసినను అవి యున్న వని యెవరైనఁ జెప్పిన, అందునకు రోషపడియెదరు. అట్లుండ, ఆలోపముల నివారించుటకు వారి కెట్లు ఊహ పుట్టును ? ఎట్లు సాధ్యమగును ? పరితపించువా డన్ననో, తన కీదుర్గణశేషము లున్నవని గ్రహించి, వానిని విడనాడుటకు సర్వదా ప్రయత్నము చేయుచుండును. తన కీసుగుణములు పూర్ణముగా లేవని, సచ్చారిత్రుల నడవడి ననుసరించి, సకలకల్యాణగుణపరిపూర్ణుఁడగు ఈశ్వరుని జేర యత్నముఁ జేయుచుండును."

పుణ్యపాపమార్గములు : - "మొదటిదారి పాపమార్గము. లోకమందు పాప మాచరించుట బహుసులభము. దానివలన మొట్టమొదట ననేకఫలములు గనుపించును. శరీరాయాస మక్కఱలేకయే ప్రతిమనుజుఁడును పాపాయుధమువలన తాను వలయువస్తువు సాధింపవచ్చును. అయిన నెంతకాలము సాధింపఁగలడు ? 'కలకాలపుదొంగ దొరకఁగలఁ డొకవేళన్‌' అనునట్లు వానిపాపములే వానికాళ్లకు బంధములై తగులుకొన సర్వవిధముల చెడి, యజ్ఞానాంధకారమగ్నుఁడై, తుద కెన్నరానిదురవస్థల కిల్లగు నరకగృహప్రవేశంబు చేయును."

సత్యసంవర్ధనీపత్రిక నే నిట్లు ప్రారంభించి, నెలనెలయును బ్రచురించితిని. ప్రథమోత్సాహమున సభ్యులలోఁ బలువురు పత్రికకు వ్రాసెద మని చేసిన వాగ్దానమును చెల్లింపలేకపోయిరి. ఏవియో కొన్ని పంక్తులు గీకి, అవి ప్రచురింపుఁ డని కొందఱు కోరుచుండిరి. ప్రతినెలయును కార్యనిర్వాహకవర్గము కూడి, పత్రికలో ముద్రింప వలసిన వ్యాసములు నిర్ణ యింపవలయును. అధికముగ నిట్టివ్రాఁతలు రాకుండుటవలన నుండువానిలో నేవియో కొన్ని వారు పత్రికలో వేయ నిశ్చయించుచుండువారు. రానురాను, సభ్యులు సమావేశ మగు టయె దుర్లభ మయ్యెను. ఒకటి రెండు నెల లై నపిమ్మట, వీరేశలింగముగారు నాతో పత్రికనుగుఱించి మాటాడుచు, ఒకసంచికలో వేయుటకు కార్యనిర్వాహక సంఘమువా రేర్పఱిచిన వ్యాసములలో నేను వ్రాసినది యొకటి తప్ప మిగిలిన వన్నియును పనికిమాలిన వగుట చేత, వానినిఁ ద్రోసివేసితి నని యాయన చెప్పెను ! నెల నెలయును వ్యాసనిర్ణయమునకై నేను బడెడిశ్రమ నంత పంతులుగారికి నివేదించి, పత్రికమూలమున సమాజమిత్రుల యాదరణమును గోల్పోయి, వారి యసూయకుఁ బాల్పడుచుంటి నని నేను మొఱలిడితిని. పత్రికాధిపత్యము నేనె వహించితిని గాన, ఇతరులసాయ మున్నను లేకున్నను, మంచి వ్యాసములు వ్రాసి యిచ్చుచుండుట నావిధి యని పంతులు వక్కాణించెను. ఇంతియ కాదు. తమపనులు చేయ నసమర్థులగు కార్యనిర్వాహకసంఘమువారి సభలు సమకూర్చుటయందు కాలము వ్యర్థము చేయక నేనె వ్యాసనిర్ణయము చేయవచ్చు ననియు, ఈ పనిలో తమరు నాకు సాయము చేతు మనియు, పంతులుగారు చెప్పివేసిరి ! పత్రికాసంపాదకత్వమునకు వలయుస్వాతంత్ర్య మందు వలస నాకు సమకూరెను.

పత్రికలో నింగ్లీషువ్యాస లుండుటకు పంతులుగారు మొదట సమ్మతింపకున్నను, అవి లేనిచో నెవరికిని పత్రిక రుచింపదని నేను నొక్కి చెప్పుటచేత, దీనికిని వా రొప్పుకొనిరి. కావున మొదటినుండియు సత్యసంవర్థనిలో తెలుఁగు వ్యాసములతోపాటు ఇంగ్లీషురచనములును నుండుచువచ్చినవి. విద్యార్థి నగునే నాంగ్లభాషలో వ్యాసరచన చేయుటకు మొదట భయపడెడివాఁడను. మాకాంగ్లేయపండితులగు స్కాటుదొరగారు మిగుల దయతో నాయింగ్లీషువ్యాసములు దిద్దుచుండెడివారు. మొట్ట మొదట నేను రెండుభాషలలోని వ్యాసములును వ్రాయుచువచ్చినను, అంతకంత కింగ్లీషు వ్రాయుటకే నే నేర్పఱుచుకొనుటచేత, తెలుఁగువ్యాసములు మిత్రుఁడు కనకరాజు వ్రాయుచుండువాఁడు. పత్రికలో నింగ్లీషుభాగమునకు నేను బాధ్యత వహించుటచేత, వీరేశలింగము పంతులుగారు తెలుఁగు భాగము సరిచూచుచుండువారు. అందువలన కనకరాజు తాను వ్రాసిన తెలుఁగువ్యాసములు పంతులచే దిద్దించుకొనుచు, ఆయన కోపమునకు గుఱి యగుచుండెను ! ఐన నందువలననె యతఁ డాంధ్రరచనయందు శీఘ్రముగ నిపుణుఁ డయ్యెను. ఇంగ్లీషురచనలోనే మునుఁగుచుఁ దేలుచు నుండుటచేత, తెలుఁగున బెదరుతీఱి వ్రాయుటకును, ముఖ్యముగ పంతులుగారి సుశిక్షఁ బడయుటకును, ఆ బాల్యదినములలో నా కంతగ నవకాశము లేకపోయెను.

మొదట "సత్యసంవర్ధని" యెనిమిదిపుటలతో నారంభమై, క్రమక్రమముగఁ బెరిఁగి, రెండవసంపుటమునుండియు పైపత్రముగల పదునాఱుపుటల పుస్తకరూపమున వెలువడుచుండెను. పత్రికయందు నీతి మత సంఘసంస్కరణ విషయములు బాహాటముగఁ జర్చింపఁబడు చుండెను. వీరేశలింగముగారి రచనములు, విద్యార్థి సభ్యులమగు మా వ్యాసములు నందుఁ బ్రచురమగుచువచ్చెను. మాయభిప్రాయము లిపుడు లిఖితరూపముఁ దాల్చుటచేత, మే మెక్కువ జాగరూకత నలవఱుచుకొంటిమి. పత్రికాపాఠకుల నోళ్ల కెక్కి, ప్రజలవ్యాఖ్యానములకు గుఱి యగుచుండుటచేత, మాకు ధైర్యసాహసాదులు పట్టుపడెను. ఇపుడు ప్రార్థనసమాజము, వారమున కొకమాఱు ప్రార్థనలు చేసికొనుటకుఁ గూడుచుండెడి వట్టి భక్తసమావేశము కాక, ఒక శాశ్వత సంస్థక్రింద నేర్పడెను. ఆ సమాజమువారి ప్రార్థనలు నుపన్యాసములు మున్నగు కార్యక్రమమంతయును బత్రికల కెక్కుచు, లోకులవాద ప్రతివాదసంభాషణములకు నిషయమగుచుండెను ! చెన్నపురిసమాజమును జూచి వచ్చిననేను, ఆసమాజపద్ధతులను ప్రణాళికలను గొన్నిటి నిచటికిఁ గొనివచ్చితిని. కొలఁదికాలములోనే "దానపు పెట్టె" యొకటి మందిరపుగోడకు వ్రేలాడుచుండెను ! "ఆస్తికపుస్తకాలయము"న కంకురార్పణ జరిగెను. సమాజసభ్యు లింకను శాశ్వతమగు సంస్థ నొకటి స్థాపించుట కర్తవ్య మని మిత్రులము తలపోసితిమి. దీనినిగుఱించి ముందలిప్రకరణములలోఁ జెప్పెదను.

33. క్రొత్తకోడలు, క్లిష్టపరిస్థితులు

రాజమంద్రి యిన్నెసుపేటలోని మాసొంతస్థలములోఁ జిన్న పెంకుటిల్లుం డెడిది. పెద్దయిల్లు కట్టుకొనువఱకు నందె కాలము గడుపుద మని మా తలిదండ్రుల యభిప్రాయము. నేను దీని కంగీకరింపక, ఆ చిన్నయిల్లు తీయించివైచితిని. మాస్థలమున నొక తాటియాకులయిల్లు వేయించితిమి అందు మేము చదువుకొనుచుండువారము. పెద్దపెంకుటిల్లు వేయుటకు నిశ్చయించి, పునాదులవఱకుఁ గట్టించితిమి. కాని, యాసమయముననే మాస్వగ్రామమున తనయన్నలతోఁ గలసి మాతండ్రి యొక పెంకుటిల్లు కట్టించుచుండుటచేతను, రాజమంద్రిలో ముందు వేయఁబడనున్న రెయిలుమార్గము మావీథినుండియె పోవచ్చునని వదంతి కలుగుటచేతను, మారాజమంద్రి యింటిపని యంతటితో నిలిచిపోయెను.

రేలంగిలోని క్రొత్తయింటికిని, మాచదువులకును, కుటుంబపోషణమునకును చాల సొమ్ము వ్యయమై, అప్పు పెరిఁగెను. ఇట్టి కష్ట పరిస్థితులందు కుటుంబవ్యయము తగ్గింప నెంచి, రాజమంద్రిలోని మాసొంత కుటీరములోనికి 1890 అక్టోబరులోఁ గాపురమునకు వెడలితిమి. ఇంటి చుట్టును విశాలస్థల ముండుటచేతను, స్వతంత్రత ననుభవించుటవలనను, కుటీరనివాసమె మాకు సుఖప్రదముగ నుండెను. కాని, అంతకంతకు మా కిచ్చటి కష్టములు బోధపడెను. ముం దుండెడి యెత్తగు పునాదుల మీఁద వేసినచో, ఈశాలయె యెంతో సౌఖ్యదాయకముగ నుండెడిది. అట్లుగాక వెనుకభాగమందలి పల్ల పునేల నుండుటచేత, వర్ష కాలమున నిల్లు చెమ్మగిల్లుచుండెను. ఆయింట వంట చేసికొనుట కొకగదిమాత్రమే ప్రత్యేకింపఁబడియుండుటచేత, పిల్లలము చదువుకొనుటకుఁ గాని, వచ్చిన బంధుమిత్రులు మసలుటకుఁ గాని, వసతి లేకుండెను.

మాతల్లి సీతమ్మ, తన జన్మస్థలమగు వేలివెన్నులో, సమవయస్సు గల అచ్చమ్మ యను బంధువులబాలికతోఁగలసి బాల్యమున నాడుకొను చుండెడిది. వీరిరువురు బొమ్మలపెండ్లిండ్లలో వియ్యపురాండ్రై వినోదించుచుండువారు. సీతమ్మ సామాన్యముగ పెండ్లికొడుకుతల్లియు, అచ్చమ్మ పెండ్లికూఁతునితల్లియు నగుచుండిరి. ఇపుడు వా రిరువురు పెద్దవారై పిల్లలతల్లు లయిరి. నేను సీతమ్మ పెద్దకుమారుఁడను. విద్యాభ్యాసకాలమున నాకు వివాహసంబంధము లనేకములు వచ్చినను, మాతల్లి, చిన్ననాఁటి చెలికత్తెతోనే వియ్య మంది, ఆమె పెద్దకూఁతురు రత్నమ్మను తన పెద్దకుమారునికిఁ జేసికొనఁగోరెను. అంత నాయిరువురుపిల్లకును, వారియొక్కయు వారితల్లులయొక్కయు జన్మస్థలమును. చిన్ననాఁటి యాటపాటలకుఁ దావలమును నగు వేలివెన్నులో, 1887 వ సంవత్సరము వేసవిని వివాహమయ్యెను.

1889 వ సంవత్సరమునందు, మామామగారగు వెలిచేటి బుచ్చిరామయ్యగారు, తమపిల్లల చదువునిమిత్తము స్వగ్రామమగు కట్టుంగ విడిచి, మావలెనే రాజమంద్రి కాపురము వచ్చిరి. ఆయన యేకపుత్రు డగు వేంకటరత్నము ఇన్నిసుపేటపాఠశాలలోఁ జేరి చదువుచుండెను. పుత్రికలలో నీడు వచ్చిన పెద్దకొమార్తె గాక, తక్కినయిద్దఱును బాలికాపాఠశాలలో నిపుడు చదువుచుండిరి. సంబంధబాంధవ్యము గలిసిన యీరెండుకుటుంబముల వారును, ఇపు డేకపట్టణవాస్తవ్యులై, ఒకరి స్థితిగతులు, గుణగుణములు నొకరు బాగుగ గ్రహించి, స్నేహవిరోధములు లేని తటస్థభావమున మెలంగుచుండిరి.

నేను చెన్నపురినుండి యింటికి వచ్చిన కొలఁది దినములకే నాభార్య కాపురమునకు వచ్చెను. వసియించుటకు విశాలమగు గృహమును, వాడుకొనుటకుఁ బుష్కలముగ ధనమును లేని క్లిష్టపరిస్థితులలో, క్రొత్తకోడలికాపురము కష్టతరముగనె యుండును. పదమూఁడేండ్లు నిండని యావధువుకోమలహృదయము నిపుడు గాకుచేసినది, పరిస్థితులవ్యత్యయము గాక, పతి విపరీతసంస్కరణాభిమానకథనమె! ఇప్పటికంటె నాకాలమున విద్యావంతుఁడగు భర్తకును విద్యావిహీన యగు భార్యకును గల యంతర మధికముగ నుండెను. తనపతి జనసమ్మతము గాని సంస్కరణాభిరతుఁ డనియు, సంఘబహిష్కృతుఁడైన వీరేశలింగముపంతుల ప్రియశిష్యుఁ డనియు నందఱు చెప్పుకొనునపుడు, పూర్వమె బాలసతి కలజడి గలుగుచుండెడిది. వెనుక వీనుల వినినదాని కంటె నిపుడు కనులఁ గాంచిన విశేషములు మిగుల కష్టముగనుండెను? ఆతఁడు విపరీతమతసాంఘికాదర్శప్రియుఁ డగుటయె కాక, ఏపాప మెఱుంగని యాపడఁతికి సంకరధర్మములు బోధించి, వానిని విశ్వసింపుమని నిర్బంధించుచున్నాఁడు! పాప మాబాలిక యేమి చేయఁగలదు? పూర్వాచారపరులగు పెద్దలమార్గ మవలంబింపవలయునా ? ప్రాచీన సంప్రదాయవిరోధియగు పతియడుగుజాడల నడువవలయునా ? ఇపుడు నా సంస్కరణాభిమానము, వేరుదన్ని మొగ్గతొడిగిన పూలమోకయై, సంస్కారప్రియులకు నయనాకర్షకమైనను, ప్రశాంత జీవితము గడపఁగోరు పూర్వాచారపరులగు జననీజనకులకుఁ గంటక వృక్ష మయ్యెను ! నా సావాసులు కనకరాజు మృత్యుంజయరావు మున్నగువారల సమాచారము తలిదండ్రులు మొదలగువారు చెప్పుకొనునపుడు వినిన నాభార్య, సంస్కారదేవత మూర్తీభవించినట్లు వా రిపుడు నన్నుఁ జూడ మాయింటికి వచ్చునప్పుడు, పతివిపరీత భావములకు వీరు పట్టుగొమ్మగదా యని భయభ్రాంత యగుచుండెను ! నా "సత్యసంవర్థనీ"పత్రికాప్రచురణము కుటుంబపుగుట్టును రచ్చఁబెట్టెను. అనుదినమును వీథిని పతియే రెలుగెత్తి యఱచి, జాబులు పత్రికలును దెచ్చి యిచ్చు తపాలజవానుకేక, పెనిమిటి సంఘసంస్కర్త యని లోకమునకు సాటెడివానిశబ్దమై, తనగుండియ కదరు గలిపించె నని క్రొత్త కోడలిమొఱ " "సత్యసంవర్థని"యందలి వ్రాఁతలు నింటఁ జిన్నలు పెద్దలును జదువునపు డెల్ల, భర్త మాయాసంస్కరణకూపమున మఱింతఁ గూరుకొనిపోవుచున్నాఁ డని తలంచి యాబాలిక భీతిల్లు చుండును !

ఇంక, తీవ్రసంఘసంస్కరణాభిమానమునఁ దేజరిల్లు పతిని గూర్చి యొకింతఁ బ్రస్తావింపవలెను. అతనిసంస్కరణాభినివేశ మిల్లు కట్టుకొని వసియింప వసుమతి నవకాశము లేనటు లుండెను ! గృహస్థాశ్రమారంభదశలో తనసతికి సంస్కరణ సుముఖత చేకూరుపట్ల నెట్టిప్రతిబంధము నుండఁగూడ దని యాతనిపట్టు ! మొదలు, పూర్వాచారపరాయణత్వము ప్రబలియుండు సమష్టికుటుంబజీవితమే యతని కనిష్టముగ నుండెను ప్రథమమునుండియు తనభార్య విద్యావికాసము గాంచి, పరిపూర్ణ సంస్కరణామోదినియై విలసిల్లవలె నని యాతని వాంఛ !

ఇప్పుడు, గృహస్థాశ్రమప్రథమరంగముననే, తనసతి విద్యారహితత్వసంస్కారవిముఖత్వములు, ఆతనినయనములకు ప్రదర్శితము లయ్యెను ! ముందైన నాయువిదకు విద్యాసంస్కరణామోదము రుచించు నవకాశము చేకూరునట్ట దోఁపకుండెను. ఆతఁడు నెమ్మదియు నిదానమునుగల కార్యవాది యై యుండెనేని, ప్రకృతమున సతికి విద్యాబోధనము చేయుటతోనె సంతృప్తి నొంది, తాను స్వతంత్రుఁడై తనపరిస్థితులు సుముఖమైనపుడు, సంస్కరణాంకుర మామెహృదయమున నాటఁజూచియుండును. కాని, యాతనిసంస్కరణావేశము మె ట్లెక్కకయె మేడఁ జేరఁగోరెను ! ఆతనివేగిరపాటు, నాందీముఖముననే, నాటకాంత్యరంగసందర్శనముఁ జేయఁగోరెను ! భర్తకు భార్య యర్ధాంగియు సహధర్మచారిణియును గావున, సంస్కరణమే జీవితవ్రతమైన పతికి, సంసారయాత్రయందు సతి చేయూఁతయై నిలువ నిశ్చయింపవలయును; లేదా, గృహస్థాశ్రమారంభమే, ఏతదాశ్రమవిచ్ఛేదకదశాప్రారంభ మని యాగృహిణి పరిగణింప వలయును !

ఇట్టి కఠినసమస్య నెదుర్కొన నెవరు వెఱవరు ? కాని, యెంతటిచిక్కునైనను నైసర్గిక సౌశీల్యప్రభావమున స్త్రీ యవలీలగ విడఁదీయ నేర్చును. ఫతి కభిమతమగు సంస్కరణామార్గము తనకును సమ్మత మని యా కలికి పలికి, తనసౌజన్య కార్యసాధకనై పుణ్యములను వ్యక్తీకరించెను !

నేర్పుటకంటె మాన్పుట కష్టతరము. ఆకాలమున పామరజనులు, విద్యాధికులకును, సంఘసంస్కారులకును, ఆరోపింపని యవగుణ మేది యును లేదు ! విద్యాధికులు నీతినియమములు పాటింపనివారు ! సంస్కారులకు దేవుఁడు దయ్యము నను వివక్షలు లేవు ! వీరలలో నగ్రేసరుఁడగు వీరేశలింగముపంతులు పరమనాస్తికవాది, సర్వసంకరములకును మూలకందము ! ఇట్టిదురూహలు సతిమనసునుండి పాఱఁద్రోలి, విద్యావంతులు సంస్కారప్రియులును సుగుణసంపత్తికి దూరులు గారనియు, మీఁదుమిక్కిలి వారు స్వార్థరహితజీవితమునకు నాదర్శప్రాయు లనియు బోధించుట నా కిపుడు ప్రథమగార్హస్థ్యధర్మ మయ్యెను. కాని, ఆనాఁటి నా యసంపూర్ణ బోధనలకంటె ననుభవపూర్వకమగు స్వయంకృషిచేతనే యాపొలఁతి నానాఁట తెలివి గలిగి, పిమ్మట "జనానాపత్రిక"లో బ్రచురమైన "శారద" కథానాయిక వలె, పతి కాశ్చర్యము గొలిపెడి సువిద్యాప్రబోధముఁ గాంచి యుండెను !

34. పెద్ద పలుకులు !

ఒకనాఁడు నా పూర్వసహపాఠి యొకఁడు నాయొద్దకు వచ్చి, తన్ను నీచకులస్థుఁ డని కళాశాలలోని మిత్రులు గేలి చేయుచుండిరని చెప్పి, విచారము నొందెను. ఇతఁడు వేశ్యకులజుఁడు. విశాలభావము లలవఱచుకొనవలసిన విద్యార్థులు, గుణసంపన్నుఁడగు నీతనిని నిరసించుట శోచనీయ మని నేను కళాశాలలో మిత్రులతోఁ బలికితిని. వారు నామాట లూఁకొట్టిరే కాని, మనస్సు మార్చుకొనినట్లు గానఁబడలేదు !

పట్టపరీక్షతరగతులలో మాకొక పంచమజాతిక్రైస్తవుఁడు సహపాఠిగ నుండెడివాఁడు. ఒకనా డాతఁడు నాబల్ల యొద్దకు వచ్చి, తా నచటఁ గూర్చుండవచ్చునా యని యడిగెను. విద్యార్థి తర గతిలో నెచటనైనఁ గూర్చుండవచ్చును గాన, నే నాతనిప్రశ్న కాశ్చర్య మందితిని. కాని, హీనజాతివాఁడ నని మిత్రులు తన్ను హేయముగఁ జూచి, తమదరిఁ జేరనీయకుండి రని యతనివలన విని, నా కమితమగు కోపము వచ్చెను. తరగతిలో ననేకులు జాతిభేదములు పాటింప మని చెప్పుకొను ప్రార్థనసామాజికులు. వీ రిట్లు సంకుచితభావములతో నీతనిపట్ల మెలఁగుట నా కాశ్చర్యవిషాదములు గలిగించెను. తెలివిగలవాఁడును, తెలుఁగులో నందఱికంటె మిన్నయును నగునీసహచరు నిట్లు అవజ్ఞ చేయుట తగదని నేను రెండుమూఁడు మాఱులు స్నేహితులతో నొక్కి చెప్పఁగా, వారొకరిమొగ మొకరు చూచుచుండిరే కాని, తమనడవడికి విచారపడలేదు ! అందువలన నావిషాదము మఱింత హెచ్చెను. ఎక్కువచనవుగల యొకమిత్రుఁ డంత మెల్లగ నాతో, "నీకుఁగల సోదరభావము మాకును లేకపోలేదు. కాని, గోమాంసభక్షకుఁడైన యాతఁడు చెంతఁ గూర్చుండు నపుడు మే మచట నిలువఁజాలము !" అని పలికెను. ఈతని మాటలలోఁ గొంత సత్యము లేకపోలేదు గాని, తమతో సమానునిగఁ జూచెడి నలుగుర మధ్య మెలఁగ నవకాశ మున్నప్పుడే యట్టియువకుఁడు ఎక్కువ శుచి శుభ్రములు గలిగి, ఎక్కువజాగ్రతతో సంచరింపఁగలఁ డని నేను నమ్మి, పంచమసహాధ్యాయుని ప్రేమించువాఁడను.

కళాశాలయొద్దనుండు కొట్లలో నే నెఱిఁగిన యొక పూఁట కూళ్ల ముసలమ్మను చుట్టుపట్టుల నుండు విద్యార్థులు, "జలపాత" మని పేరు పెట్టి, వేధించుచుండి రని నాకు వినవచ్చెను ! విద్యాధికులును, ప్రార్థనసమాజికులును గూడ నిట్లు చేయుటకు నే నెంతయు వగచితిని. ఇట్టిసహాధ్యాయులఁ గొందఱి నొకచోటికి నేను బిలిచి, విద్యాధికు లగువారు తమబాధ్యతలను గుర్తింపక, దిక్కులేని పేద పూఁటకూటిదానిని బరిహసించుట సిగ్గులచేటని నొక్కిచెప్పితిని. వీరి మధ్యనుండు సాంబశివరా వంత నందుకొని, నే నందఱిలోను మొనగాఁడ ననుకొని మిడిసిపడుచుంటి ననియు, ప్రార్థనసమాజమునకు నిరంకుశాధికారి నని భావించుకొనుచుంటి ననియు, తానుమాత్రము నన్నావంతయు లెక్కసేయ ననియుఁ జెప్పి వెడలిపోయెను ! ఇది జరిగిన యొకటిరెండు మాసములవఱకును నాతో నతఁడు మాటాడక, సదా మౌనమున నుండువాఁడు ! చనవరియు సరసుఁడునునగు సాంబశివరావే యిట్లు నాతో మాటాడకుండుటకు నేను వగచి, ఒకనాఁ డాతని బిలిచి, "జలపాత"సందర్భమున నే వాడిన నిష్ఠురోక్తులకు నన్ను మన్నింపు మంటిని. నాచెలికాఁ డంత పసిపాపవలె గోలుగోలున నేడ్చి, నామాటలకుఁ దా నేమియు తప్పుపట్టలే దనియును, తనజిహ్వ నరికట్టుటకే తా నీదీర్ఘమౌనవ్రతమవలంబించి ప్రవర్తనమున లాభ మందు చుంటి నని చెప్పెను ! పిమ్మట మే మిరువురమును వెనుకటివలెనే, మనసుగలసిన నేస్తుల మైతిమి.

కాని, యెల్లరును సాంబశివరావు వంటి నిష్కాపట్యహృదయులు గారు. మితిమీఱిన గర్వము నహంభావమును ప్రేరించుటచేతనే నే నిట్లు పెద్దమాటలు చెప్పుచున్నా నని యెంచి, ప్రార్థనసామాజికులలోఁ బలువురు నన్ను లోలోన ద్వేషించిరి. దీనిపర్యవసానము, కొంతవఱకు, కళాశాలాంత్యదినములలో నాకుఁ గానఁబడెను.

35. రంగనాయకులు నాయఁడు గారు.

నేను చెన్నపురి పోయి వచ్చినను, నా నేత్రములబాధ నివారణము గాలేదు. ఎక్కువసేపు చదివినను వ్రాసినను, కనులు మండుచుండును. "పెండ్లికి వెళ్లుచు పిల్లిని వెంటఁగోనిపోయిన" వానికివలె, మద్రాసు పోయి వచ్చినప్పటినుండియు నాకు వ్రాతఁపని వెంటఁబడెను ! అందువలనఁ గనులమంటలు హెచ్చెను. 4 - 6 - 91వ తేదీని నేను వీరేశలింగముపంతులుగారి యింటికిఁ బోయి, రాజ్యలక్షమ్మగారు జబ్బుగ నుండి రని తెలిసి, ఆమెను జూచితిని. అపుడె శరీరము నెమ్మదిపడుచుండెడి యాయిల్లాలు కుశలప్రశ్నము చేయఁగా నా కనుల సమాచారము తెలిపితిని. దీని కామె విచారపడి, పెద్దచెరసాలలో వైద్యులగు రంగనాయకులనాయుఁడుగారు కంటివైద్యములో మంచి సాధకులని పలికి, పంతులుగారి ద్వారా వారి నెఱుకఁజేసికొని వారిసాయము పొందు మని నా కాలోచన చెప్పిరి.

ఆనెల 17 వ తేదీని నేను పంతులుగారిని సందర్శించినపుడు, ఆయన తన "ఆంధ్రకవుల చరిత్రము"ను పూర్తిచేయుటకై యాఱు నెలలు సెలవుతీసికొని చెన్నపురిలో నుందు మని చెప్పిరి. ఆసందర్భమున నాకనులసంగతి వారితోఁ బ్రస్తావించి, రంగనాయకులు నాయఁడు గారియొద్దకు నన్నొకమాఱు కొనిపొం డని వారిని గోరితిని. అందుకు వారు సమ్మతించిరి.

21 వ జూలై తేదీని పంతులుగారు నేనును కారాగారమునొద్దకుఁ బోయితిమి. అపుడు నాయఁడుగారు రోగులకు మందుచీ ట్లిచ్చుచుండిరి. కుర్చీ కొకపెడ నిలిచి, ఖైదీ యొకఁడు విసనకఱ్ఱ వేయుచుండెను. నాయఁడుగారు స్థూలకాయులును, మంచి యొడ్డుపొడుగు గలవారును. మందహాసము చేయునపుడు, సహజసౌజన్యము వారి వదనకమలము నుండి వెల్లి విఱిసి నలుదెసలను బ్రసరించునటు లుండెను. ఆయన పంతులుగారిని ప్రేమపూర్వకముగ సమ్మానించెను. కుశలప్రశ్నము లైనపిమ్మట, వీరేశలింగముగారు నన్ను గుఱించి నాయుఁడుగారితోఁ జెప్పిరి. నాకనులు చూచి, నేను కొంతకాలము చదువు విరమించుట శ్రేయ మని వైద్యుఁడు వక్కాణించెను. అప్పటినుండియు నేను నాయుఁడుగారిని జూచుచు, వారొసఁగు మందులు సేవించుచు, కొంచెముకొంచెముగ లాభము నొందుచుంటిని

కొంతకాలమునకు రంగనాయకులు నాయుఁడుగారిని నగరవైద్యశాలలోనికి మార్పఁగా, పట్టణమధ్యమునకు వారు కాపురము వచ్చిరి. సహజసౌజన్యమహిమమున నాయుఁడుగారు శీఘ్రకాలములోనే జనానుమోదము నొందిన వైద్యు లను కీర్తిఁ గాంచిరి. దయా స్వభావు లగు వారికి ధర్మసంస్థలం దమితప్రీతి. ఆయన సద్భావయుతుఁడగు సంస్కరణాభిమాని. నాయుఁడుగారును, వారిధర్మపత్ని జానకీబాయిగారును, సహృదయులు; జీససు మహనీయునియం దధిక విశ్వాసము గలవారలును. పెరిఁగెడి సంసారబాధ్యత నౌదలఁ గలవారగుటచేత వారు బహిరంగముగ క్రైస్తవులు గాకపోయినను, సామాన్యక్రైస్తవులకంటె నెన్నిమడుంగులో ఈశ్వరభక్తి సంపన్నులును, సదాచారనిష్ఠాసమన్వితులును. పలుమాఱు తమయింటికిఁ బోయి తమతో సంభాషించుచుండు నామీఁద, ఆదంపతు లిరువురు సవ్యాజ సోదరభావము గలిగియుండిరి. నాయందలి వత్సలతచేత నాయుఁడుగారు నా బంధుమిత్రులకును దయచూపి, ఉచితవైద్యసాహాయ్య మొనరించుచుండువారు. ఆదినములలో నేను పెద్దబజారునకు వెళ్లి వచ్చునపు డెల్ల, పెద్దరస్తాప్రక్క నొకబీదముసలిది బిచ్చ మడుగుచుండెడిది. అంతకంతకు, వార్ధక్యము ముదిరి, దృష్టి తప్పి, అది కూర్చుండుచోటనుండి కదలలేకపోయెడిది ! దానికి వేవేగమే మతికూడ తప్పిపోవుచుండెను. తూష్ణీంభావులగు జనుల మధ్యమం దీనుసలి దాని దైన్యము నిస్సహాయతయును జూచినపు డెల్ల, నాగుండె నీ రగు చుండెడిది. ఈస్త్రీ సమాచార మొకటి రెండుమాఱులు నాయుఁడు గారితో నేను బ్రస్తావింపఁగా, దురవస్థ నుండు నిట్టివారిసంరక్షణ కే ధర్మసంస్థయు నేర్పడక యుండుట కాయన వగచి, తా నే సాయమైనఁ జేతు నని చెప్పెను. జను లందఱివలెనే నాయుఁడుగారును దిక్కుమాలిన యాముసలిదాని సంగతి మఱచిపోయి రని నేను దలంచితిని.

ఒకనాఁడు నేను రంగనాయకులునాయుఁడుగారిని జూచి వచ్చుటకు వైద్యాలయమున కేగితిని. ఆయన నాతో సంభాషించుచు, కొంత సేపటికి నా కొకచిత్రము చూపింతు నని చెప్పి, వైద్యశాల వెనుక నున్నయొక మాఱుమూలకు నన్నుఁ గొనిపోయెను. నాయుఁడుగా రొసంగిన తెల్లనివలువ దాల్చి, ఆబీదగ్రుడ్డిముసలిది, పెండ్లికూఁతునివలె నచటఁ గులుకుచుఁ గూర్చుండెను ! వార్ధక్య దారిద్ర్యములు తప్ప వేఱు వ్యాధి లేని యాముదుసలి, నాయుఁడుగారి దయచే వైద్యాలయమున రోగిగఁ జేరి, సువార మారగించుచుండెను ! దిక్కు లేక బాటప్రక్క గాసిల్లుగ్రుడ్డిది, వైద్యాలయమందలి సౌకర్యములచే నిపుడు నునుపెక్కి, తేటమొగమున నుండుట చూచి, మాయిరువురకును గనుల నీరు గ్రమ్మెను. నాయుఁడుగారిమాట వినఁబడి, వృద్ధురాలు దండముపెట్టి, ఆయనను జేరువకుఁ బిలిచి, ఏదో మాటాడెను. ఆయన చిఱునవ్వు నవ్వుచు, "దీనికి నల్ల మందు అలవాటు. కాని, అది వైద్యశాలలో నెవరికిని వాడము. దానికి మాఱుగ నేదో సరది యిచ్చెదను లెండి!" అని నాతో ననెను. నాయుఁడుగారిని దలంచుకొనినపుడు "తల్లి దండ్రుల భంగి ధర్మవత్సలతను, దీనులఁ గానఁ జింతించువాఁడు" అను ప్రహ్లాదుని గుఱించిన కవివచనము నాకు స్ఫురణకు వచ్చు చుండును.

36. సత్యసంవర్థని

ఏ వార్తాపత్రికనైన నెలకొల్పుటకుఁ బూర్వమే సంస్థాపకునికి స్వేచ్ఛ యుండును గాని, పిమ్మట కాదు. అది యారంభ మైనప్పటినుండియు క్రమము తప్పక నడుచుచుండవలసినదే. పత్రికాధిపతి వట్టి కీలుబొమ్మవలెను, గడియారపు యంత్రమువలెను, విసుగు విరామము లేక పని చేయవలె ననియే పాఠకజనులయుద్దేశము ! సత్యసంవర్థని మాసమున కొకతూరి ప్రచుర మగు చిన్న పత్రిక యైనను, చేయవలసినపనిమాత్ర మెక్కువగ నుండెను. సాయము చేతునని మొదట వాగ్దానముచేసిన సమాజమిత్రులు, ఏదో యొకమిష పెట్టి, సాకు చెప్పి, తప్పించుకొనుచువచ్చిరి. వ్యాసరచన తమ కభ్యాసము లే దని కొందఱును, తమరచనములు ప్రచురము కాలేదని కొందఱును. వానియందు మార్పులు చేసి రని కొందఱును, మొఱవెట్టి, యీవ్యాజమునఁ దమ వాగ్దానములను తుదముట్టించుచువచ్చిరి ! వీరేశలింగముపంతులు కనకరాజుగార్లు ప్రతినెలయును పత్రికకు వ్రాయుచునేయుండిరి. పెద్దవారగు పంతులుగారికిఁ గాని, పరీక్షకుఁ జదువు కనకరాజునకుఁ గాని, పత్రికను గూర్చిన కనులకుఁ గానఁబడని యెన్నియో చిన్నపను లప్పగించుట యనుచితముగదా. కావున మిగిలిన వ్యాసములువ్రాసి, చిత్తులు దిద్ది, పత్రికను ముద్రింపించి, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు నేనే జరుపవలసివచ్చెను. అందువలన నా కనులబాధ విస్తరిల్లెను.

పూర్వాచారపరులగు మా కళాశాలాధ్యాపకు లొకరు, పాపఁపుప్రార్థనసమాజములోఁ జేరినకారణమున నాకనులు పోవుచుండె నని పలికిరి ! సత్యసంవర్థనీ కార్యభారముననే నా నేత్రదృష్టి ధ్వంస మగు చుండె నని నుడివియుండినచో, ఆయనమాటలు సత్యవాక్యములుగ నుండెడివి. వ్రాఁతపని యెక్కువ యై నాకనులకు మాంద్యము గలుగు చుండెను. ఏతత్కారణముననే నాదేహారోగ్యమును జెడుచుండెనని రంగనాయకులునాయుఁడుగారు పలికి, కొంతకాలము నేను పరిపూర్ణవిశ్రాంతి నొందవలె నని హితవు చెప్పిరి. నే నందువలన సహపాఠులు చదువుచుండఁగ విని యెటులో కళాశాలలోని నిత్యవిధులు నిర్వహించుచువచ్చితిని గాని, పత్రికపని యట్లు జరుగదయ్యెను. చెన్నపురిలో పరిచితులైన శ్రీరఘుపతి వెంకటరత్నమునాయుఁడు గారి సాయము కోరఁగా, వారు రెండువ్యాసములు వ్రాసిరి. ఇట్లు నేను 1891 ఆగష్టుమాసములో వ్రాసిన "అసహనము"నకు వారు అక్టోబరులోను, నేను నవంబరులో వ్రాసిన "ప్రేమక్షమలు" అనుదానికి వారు డిశంబరులోను అనుబంధవ్యాసములు వ్రాసి పంపిరి. ఈయిరువురు రచయితలవ్యాసములకును చాల యంతరము గలదు. నావ్యాసములు భావమునను భాషావిషయమునను మిగులఁ గొఱవడియుండెను. నాయుఁడుగారివ్యాసము లన్ననో, విశాలభావములతోను విశిష్టభాషా నైపుణ్యముతోను విరాజిల్లుచుండెను.

వ్యాసమునకు వ్యాసమునకును, సంచికకు సంచికకును, ఇట్టి వ్యత్యాసము లుండుట సత్యసంవర్థని సంప్రదాయ మయ్యెను ! వెనుకటిప్రకరణములలో నొకదానియందు, మొదటిసంచికలోని వ్యాసభాగములు మచ్చునకుఁ జూపఁబడినవి. ప్రతిసంచికలోను ఆంగ్లమున నొకవ్యాసమును, తెలుఁగున రెండు మూఁడును నుండెడివి. అందుచేత నింగ్లీషువ్యాసములలోకంటె నాంధ్రవ్యాసములందే యిట్టితారతమ్యములు స్ఫుటముగఁ గానఁబడియెడివి. విఖ్యాతరచయితలగు వీరేశలింగముగారి వ్యాసరాజములకును, నాబోటి విద్యార్థి ప్రయాసమునఁ జెక్కినవానికిని గలభేదములు, కనులు గలవారి కెవరికి గోచరింపవు? రెండవసంచికలో పంతులుగారు "ఈశ్వరచంద్రవిద్యాసాగరు" లను గూర్చియు, నేను "పరోపకారము"నుగుఱించియు వ్రాసితిమి. మూఁడవ సంచికయందు పంతులుగారి "సౌదామినిరాయి"యు, నావిరచితమగు "సత్యము"ను గానవచ్చెను. ఇవిగాక, ఆసంపుటమున నిఁక రెండుమాఱులే తెలుఁగువ్యాసములు నేను వ్రాసితిని. అవి 5 వ సంచిక యందలి "శరత్కాలము", 7 వ సంచికలోని "మిత్రత్వము"ను. వీనియన్నిటిని బరిశీలించినచో, నే నెట్లు ఇంగ్లీషువ్యాసముల యొరవడిని గైకొని, భావముననే కాక, భాషావిషయమునఁగూడ, ఆంగ్ల సంప్రదాయముల ననుకరించుచుంటినో తెలియఁగలదు. 'మీఁగాళ్లవాఁపు మొగమే తెలుపు' ననునట్టుగ, నావ్యాసముల మొదటివాక్యములే వాని యన్యభాషాసంప్రదాయాను సరణమును వెల్లడించుచున్నవి !

ఏదో యొకయింగ్లీషుమాతృకను గైకొనియో, కల్పన చేసికొనియో, ఆంగ్ల భావములను, ఆభాషాసంప్రదాయముల ననుసరించి యాంధ్రవ్యాసము లల్లుటకంటె, తోఁచినవిషయము చేకొని, యిచ్చవచ్చినచొప్పున తెలుఁగు వ్రాసియుండినచో, నా కలము బాగుగ సాగి పోయెడిది. 3 వ సంచికలో "సత్యవాది" పేరు పెట్టిన జాబు నే వ్రాసినదియే. అది పంచమజాతిసమస్యను గుఱించినది. లేకరి గ్రామాంతరము పోయి తిరిగి వచ్చు నపుడు, ఒకబ్రాహ్మణుని యింట భోజనము చేసెను. భోజనసమయమందు, ఇంటియజమానునికొఱ కెవరో వచ్చి వీథిలో నిలుచుండి రని తెలిసెను. వాఁడు చెప్పరానివాఁ డనిగృహిణి పలికెను. అపు డా చెప్పరానివాని గుఱించి యజమానుఁడు లేకరితో ప్రస్తావించుచు, అతఁడు తమ పాలేరనియు, విశ్వసనీయుఁ డనియుఁ బలికెను. ఈసంభాషణసమయుమునందు, ఇరువురు శ్రోతలు చెప్ప రానివాఁ డనఁగఁ దెలియక తల్లడిల్లుచుండిరి. యజమానుని చిన్న కొమరితకు, ఆపదమున కర్థము తెలియకుండెను. భోజనసమయమునఁ జెప్పరానివానినిగుఱించి విప్పిచెప్పుట తప్పిద మని దానిని తండ్రి వారించెను. యజమానుని మాటలనుబట్టి యా చెప్పరానివాఁడు "చెప్పఁదగువాఁడే" యని లేకరి తలంచినను, తా నాయనతో వాదమునకు డీకొనినచో కృతఘ్నుఁడ నయ్యెద నను భయమునను, సందియము లొకటికి రెండై బాలిక రొదచేయు ననువెఱపునను, ఆతఁ డూరకుండెను ! భూత దయాదిసుగుణముల కాకరమగు నగ్రకులమువారు హీనవర్ణజులను భోజనసమయమునఁ దలపెట్టనేకాడదా ? పేరు పెట్టినను లేకున్నను, మనోనేత్రమునెదుటఁ గానిపించునది వ్యక్తియొక్క యాకారమేకదా ! జాతికంటె నీతియే ప్రధాన మైనచో, గుణవంతుఁడైన యీచెప్పరానివాఁడు చెప్పఁదగువాఁడే కదా? - ఇదియే యా లేఖాసారము.

"చిత్తము శివునిమీఁదను భక్తి చెప్పులమీఁదను" అను నట్టుగ, ఆకాలమున నా యాంధ్రవ్యాసరచనము విచిత్రద్వంద్వవిధానము నను సరించుచుండెడిది ! భావకల్పనము ఆంగ్లమునను, వాగ్విధానము ఆంధ్రమునను జరుగుచుండెడిది. కాని, యింగ్లీషులో వ్రాయునపుడు, నా కీకష్ట మెంతమాత్రమును గనిపించెడిదికాదు. ఆంగ్ల సాహిత్యము ప్రథమమునుండియు నా యభిమానవిద్యా విషయము. మొదట కొంత భీతి జనించినను, నా గురువర్యులగు స్కాట్ దొరగారు నా వ్యాసములు దిద్దుచుండుటవలన, నా కచిరకాలముననే బెదరు తీఱి, ఆంగ్లమున బాహాటముగఁ గలము సాగుచువచ్చెను. పూర్వోదాహృతములగు నాంగ్ల వ్యాసములు గాక నేను ప్రథమసంపుటమున, "మత మననేమి" "విశ్వాసహీనత" "పవిత్రప్రేమము" "బహుత్వముననేకత్వము" "భక్తిమాధుర్యము" అను మకుటములుగల వ్యాసములు వ్రాసితిని. వీనిలోఁ గల భావసౌమ్యతా రచనాసౌష్ఠవములలో వీసమంత యైన నాయాంధ్రవ్యాసములందుఁ గనుపడకుండెడిది !

అంతకంతకు నాకలమునకు సంపూర్ణ స్వేచ్ఛానువర్తనము వాంఛనీయ మయ్యెను. స్కాటుదొర సజ్జనులలో సజ్జనుఁడు. కాని, ఆయనకు విరోధములగు విషయములను గుఱించిన నా యింగ్లీషురచన లాయన సవరించునా ? నైల్సు అను నొకక్రైస్తవుఁడు మాపత్రిక కొకయాంగ్లేయలేఖ వ్రాసెను. అది పత్రికలోఁ బ్రకటింపవలదా ? ప్రకటించినచో, క్రైస్తవాభిప్రాయములు సమర్థించెడి యాజాబునకుఁ దగుప్రత్యుత్తర మీయవలదా ? అంత నే నాలేఖను బ్రచురించి, దానికి సమాధానముగ నొక పెద్దయాంగ్ల వ్యాసము వ్రాసి, యది నేనే దిద్దుకొని, ఆసంచికయందే ప్రకటించితిని. సంకుచితాదర్శ యుతమగు క్రైస్తవమత మెన్నఁటికిని ఏకేశ్వరారాధన ప్రబోధకమగు బ్రాహ్మధర్మము కానేర దనియు, క్రైస్తవమతము సిద్ధాంతమున విగ్రహారాధనమును నిరసించుచున్నను ఆచరణమున నాదరించుచున్నదనియును, నిరాకారుఁడగు పరమాత్ముని ధ్యానించుటకు హిందువునకు పాంచ భౌతిక విగ్రహము కావలసినట్టే క్రైస్తవునికి క్రీస్తుజీవితము ఉపాధిగ నుపకరించుచున్నది. గావున రెండు మతములవారును విగ్రహారాధకు లనియును, బ్రాహ్మమతస్థు లిట్టి బాహ్యసాధనముల నపేక్షింపక, పరమాత్ముని మనసున ప్రత్యక్షముగ ధ్యానింపనేర్తు రనియును, నేను సమాధానము చెప్పితిని. నావాదన, నావాక్కులు, నావైఖరియును, ప్రార్థనసామాజికులకు హృదయరంజక ముగ నుండెను.

37. చెన్నపురిస్నేహితులు

నేను కొన్ని నెలలు పూర్తిగఁ జదువు విరమించినను, నాకనులు నెమ్మదిపడలేదు. మరల నేను చెన్నపురి పోయి కన్నులు పరీక్షింపించు కొని, అనుమానరహితము చేసికొని వచ్చుట కర్తవ్య మని రంగనాయకులునాయఁడుగారు చెప్పి, తమతమ్ములును రాజధానీవైద్యకళాశాలలో నధ్యాపకులును నగు నారాయణస్వామినాయఁడుగారికి నన్ను గుఱించి వ్రాసిరి. నేనంత కళాశాలకు శీతకాలపు సెలవు లీయకమునుపే గుంటకల్లుమార్గమున రెయిలులో చెన్నపురికిఁ బోయితిని. వెంకటరత్నమునాయుఁడుగారి యేర్పాటుచొప్పున నేను బ్రాహ్మమందిరమున విడిసియుంటిని.

మరల నేత్రవైద్యాలయమున నాకనులు పరీక్షింపఁబడెను. ఈమా ఱచట వైద్యాధికారియగు కింగు అనుదొర నాకనులు పరీక్షించి, అం దేమియు దోషము లే దని చెప్పివేసెను. ముత్తెపుసరములవంటి చుక్కలు కనులనరములమీఁద నుండినను, వానివలన దృష్టికేమియు విఘాతము గలుగదనియు, కనులమంటలు శరీరదౌర్బల్యమున జనించిన వగుటచేత, బలమునకు మందు పుచ్చుకొనవలెననియును ఆయన నుడివెను. ఈయభిప్రాయమును వెంకటరత్నము నాయుఁడుగారి మిత్రులగు వైద్యులు నంజుండరావుగారు స్థిరపఱిచిరి. కావున నేను కనులనుగుఱించి భీతిల్లక, క్రొత్తనేస్తులగు వెంకటరత్నమునాయఁడు, నారాయణస్వామినాయఁడుగార్ల సావాసమునఁ గొన్ని దినములు గడపితిని.

నారాయణస్వామినాయఁడుగారు తమయన్న వలెనే క్రైస్తవమతవిశ్వాసులే కాక, క్రైస్తవధర్మస్వీకారము చేసినవారును. ఆయన బ్లాక్‌టౌనులోఁ గాఁపుర ముండిరి. సోదరునివలెనే వీరును సహజ సౌజన్యస్వభావులును, దయార్ద్రహృదయులును. అన్న దమ్ములకుఁ గల భేదములును నేను గనిపెట్టితిని. అన్న గంభీరస్వాభావుఁడు, తమ్ముఁడు సరళశీలుఁడు. ఈ భేదము మతానుష్ఠానమునందును ప్రస్ఫుట మయ్యెను. కుటుంబ సాంఘికపరిస్థితుల వ్యత్యయముచే రంగనాయకులునాయఁడు మతాంతరుఁడు కానొల్లక యుండినను, నిజమతవిశ్వాసములను దాఁపఱికము లేక స్నేహితుల కెఱిఁగించి, హిందూసంఘ సంస్కరణపరాయణుల యెడల పరిపూర్ణసానుభూతి చూపెడి విశాల హృదయుఁడు. నారాయణస్వామినాయఁడు తన విశ్వాసముల చొప్పున నడచుకొనుట కావంతయు వెనుదీయకుండెడి ధైర్యవంతుఁడు. సంస్కరణాభిరతులయెడ నీయనకును అభిమాన ముండినను, తాను నమ్మిన సత్యక్రైస్తవదీక్ష నెల్లరు నేల గైకొన రని యాయన సంప్రశ్నము. క్రైస్తవమతావలంబనమే మానవులకు మోక్షప్రదాయకమని యాయన మనసార నమ్ముచుండువాఁడు. రంగనాయకులునాయఁడు నిరంతర మందహాసమున నొప్పెడి ప్రశాంతచేతస్కుఁడు. నారాయణస్వామినాయఁడు కాపట్య మెఱుఁగని కోపస్వభావుఁడు. బాలకునివలె సహృదయుఁడై, బాలకునివలెనే తాత్కాలి కాగ్రహాది భావోద్రేకాదులకు వశవర్తి యగుచుండును. మనసు గలసిన మిత్రునికి వలసిన సాయము చేయుట కీయన వెనుదీయకుండువాఁడు. అన్న యన్ననో, తమ్మునకుఁ దీసిపోని నైసర్గికసౌజన్యమునఁ జెలంగుచుండియు, పరిస్థితుల వై పరీత్యమునకుఁ జెక్కుచెదరని శీలసమత్వమునఁ జెన్నొందెడి శాంతమూర్తి. సుగుణోపేతులగు నీసోదరుల యరమరలు సవరించి, యిరువురికి సామరస్యము నొడఁగూర్ప నే నానాఁడు ప్రయత్నించితిని.

చెన్నపురిలో నీమాఱు నాకు లభించిన మిత్రు లింకొకరు శ్రీ వెంకటరత్నము నాయఁడుగారు. ఈయన యప్పుడే యమ్. యే. పరీక్ష నిచ్చి, పచ్చప్పకళాశాలలో నుపాధ్యాయుఁడుగ నుండెను. సునిశిత బుద్ధివికాసమునకును, ఆంగ్ల సారసత్వమున పాండిత్యగరిమమునకును, అనర్గళవచోవిభవమునకును, చెన్నపురియం దీయన మంచి కీర్తి గడించెను. నీతిమతవిషయములం దసమానమగు ప్రజ్ఞయు పట్టుదలయు వీరికిఁ గలవు. ఇట్టికీర్తిప్రతిభలతో నొప్పెడివారికి నిరువదియైదువత్సరములలేఁ బ్రాయముననే పత్నీ వియోగము సంభవించెను. ఒక కొమార్తెమాత్రము గలదు. ఎంద రెంతఁగ బోధించినను, పునర్వివాహము చేసికొనలేదు. బంగారమునకు వెలిగారమువలె, ఈమహాశయుని సచ్చారిత్రమునకును మతాభినివేశమునకును, ఆయనవైరాగ్యబుద్ధియు బ్రహ్మచర్యనిష్ఠయు మఱింత వన్నె గొనివచ్చెను.

నే నీసమయమున నిట్టి సచ్ఛీలుఁడగు బ్రాహ్మధర్మవిశ్వాసుని సావాసమునే మిక్కిలి కాంక్షించుచుంటిని. వీరేశలింగముపంతులు లౌకికవిద్యయందువలె పారమార్థికవిషయములందును నా గురూత్తములే. ఐనను, వారిప్రజ్ఞానైపుణ్యములు సంఘసంస్కరణరంగముననే ముఖ్యముగ ప్రదర్శితము లగుచుండెను. ఆయనకుఁ బ్రియమగు మతము బ్రాహ్మధర్మమే. బ్రాహ్మసమాజాదర్శములు వారికిఁ గొట్టినపిండియే. కాని, యింగ్లీషువిద్యయే పరమావధి యైన యాకాలపువిద్యాధికులకు, ఆవిద్యలో నున్నతస్థాన మలంకరించిన నాయఁడుగారివంటివారు చేసెడి ధర్మప్రసంగములే మతవిషయములందు పరమప్రమాణములు. నేను జదువవలసినగ్రంథములు, జరుపవలసిన విధానములనుగూర్చిన యనేకవిషయములు నేను వారివలన గ్రహించితిని.

నాకంటె నాయఁడుగారు 6, 7 సంవత్సరములు మాత్రమే పెద్దలు. నామనస్సునఁ దోఁచిన పలుసందియముల నాయన సోదరభావమునఁ దీర్చుచుండువారు. ఇంతియ కాదు. బ్రాహ్మధర్మమున కాయువుపట్టగు ప్రేమగుణము వారియందు మూర్తీభవించినటు లుండెను ! వయోవ్యత్యాస మెక్కువగఁ గలిగి, ఆగ్రహ మితభాషిత్వములతో నొప్పెడి వీరేశలింగముపంతులుగారి నెన్నఁడునుగాని మేము వేయ వెఱగండెడిప్రశ్నములకు, సమవయస్కులగు నాయఁడుగారు సౌమ్య భావమున సదుత్తరము లిచ్చు చుండువారు. యువజనహృదయాకర్షము చేయుసమర్థతయు, వారలను సన్మార్గమునకుఁ బురిగొల్పెడి సౌజన్యమును, వారియందుఁ గలవు. కావున నేను గనులనుగుఱించి చెన్నపురికిఁ గట్టినపయనము వ్యర్థ మని యెంచక, అంతర్చక్షువికసనమున కిది సందర్భ మయ్యెనని మిగుల సంతసించితిని.

చెన్నపురియందు నే నుండు దినములలోనే యచటి బ్రాహ్మసమాజవర్ధంతి జరిగెను. ఆసందర్భమున నాయఁడుగా రొక యుపన్యాసము చేసిరి. ఆయుత్సవానంతరమున, 1892 జనవరి 4 వ తేదీ సోమవారమున చెన్నపురినుండి నే నింటికి బయలుదేఱితిని.

38. సంరంభము

ఆకాలమున చెన్నపురి నుండి యుత్తరాంధ్రమండలములకు రెయిలుపయనము చేయువారు మిగుల మెల్లగను, మిక్కిలి చుట్టు మార్గమునను పోవలసివచ్చెను. మద్రాసు నుండి గుంతకల్లువఱకును మెయిలులో నొకరాత్రి; గుంతకల్లునుండి కంభమువఱకు నొకపగలంతయు; అంత, కంభము చలిలో నిర్బంధ విశ్రమము రాత్రియంతయు; కంభమునుండి బెజవాడకు మఱునాఁటి యుదయమునుండి సాయంకాలము వఱకును. నేను పయనము చేయుబండిలో నదృష్టవశమున మద్రాసునుండి బెజవాడవఱకును ఇంజనీరింగ్ కాలేజివిద్యార్థు లుండిరి. వారిలో నా పూర్వసహపాఠి రంగనాయకులుగారుండుటవలన నాకుఁ గాలక్షేపము సుకర మయ్యెను. బెజవాడలో నే నెక్కినపడవలోనే నాగపూరులో జరిగినదేశీయమహాసభకుఁ బోయి వచ్చుచుండెడి కొందఱు మిత్రు లుండిరి. వీరిని రాజమంద్రి కొనిపోవుటకు పాపయ్యగారు మున్నగు స్నేహితులు వచ్చిరి. కాఁబట్టి పడవలోఁగూడ నాకు సుఖముగ నుండెను. 8 వ తేదీని రాజమంద్రి చేరితిని.

13 వ తేదీని సంక్రాంతినాఁడు రాజమంద్రి పురమందిరములో కీ. శే. బసవరాజు గవఱ్ఱాజుగారి ఛాయాపటము నెలకొల్పు సందర్భమున నొకబహిరంగసభ జరిగెను. కళాశాలాధ్యక్షులు మెట్కాపు దొరగారు ఆసభ కధ్యక్షులు.

చెన్నపురినుండి వచ్చినపిమ్మట, మద్రాసు బ్రాహ్మసమాజ పద్ధతులను జూచివచ్చినహేతువున, మతవ్యాపనమం దెక్కువ శ్రద్ధ వహించితిని. సమాజమునకు నూతన సభ్యులను జేర్చితిని. ఇన్నిసుపేటలో రెండవ ప్రార్థనసభ నేర్పఱిచితిమి. జనవరినుండియు సత్యసంవర్థనీవ్యవహారకర్తగఁ బని చేయుటకు సాంబశివరావు సమ్మతించుట చేత, ఆపని యాతని కొప్పగింపఁబడెను. తమ్ముఁడు నేనును జదువుకొనుట కొకగది పెద్దరస్తా సమీపమునఁ గుదిర్చితిమి. అది యిపుడు సమాజాభిమానులు తఱుచుగఁ గూడి సంస్కరణవిషయములు, పత్రికా వ్యవహారములును జర్చించుకొను రచ్చసావడి యయ్యెను. ఇంతలో విశ్వవిద్యాలయ పరీక్షాఫలితములు తెలిసెను. కొండయ్యశాస్త్రి ప్రవేశపరీక్షయందును, కనకరాజు గంగరాజులు ప్రథమశాస్త్ర పరీక్షయందును నుత్తీర్ణులైరి. పట్టపరీక్షకుఁ జదువుటకై గంగరాజు చెన్నపురికిఁ బోయెను. చదువు చాలించి యుద్యోగము చేయఁజూచిన కనకరాజు, మిత్రులమగు మా ప్రోత్సాహమున రాజమంద్రి కళాశాలలో పట్టపరీక్షతరగతిలోఁ జేరెను. ఇంతియ కాదు. నే నిదివఱకు మిత్రులతోఁ గలసి యాలోచించుచుండిన "ఆస్తికపాఠశాలా" స్థాపనవిష యమై యిపుడు గట్టిగఁ దలపోయసాగితిమి. ఈ సంవత్సరము పట్ట పరీక్ష పూర్తిచేసి, బోధనాభ్యసనమునకై రాఁబోవువత్సరము తాను సైదాపేటకుఁ బోయెదనని మృత్యుంజయరావు చెప్పెను. నేనును పాఠశాలలోఁ బనిచేయ నిశ్చయించి, నరసింహరాయఁడుగారిని గూడఁ జేరున ట్లొప్పించితిని. కనకరాజు కూడ చేరెద ననెను.

సమాజప్రార్థనలతోఁ దనివి నొందక, నిత్యకుటుంబప్రార్థనలు జరుపుట కర్తవ్యమని వీరేశలింగముపంతులుగారు మాకు హితబోధనము చేసిరి. తమరు వారమువారమును జరుపు ప్రార్థనసభలకు నాతల్లిని భార్యను బంపు మని రాజ్యలక్ష్మమ్మగారు నన్నడిగిరి. లక్ష్మీనారాయణగారు నేనును మాటాడుకొనుచు, స్నేహితులసతీమణు లందఱు నొకచోట సమావేశమై చదువు సాగించుకొనుట యుక్తమని భావించితిమి. కాని, సమష్టికుటుంబములలో కూరుకొనిపోయెడి చిన్న కోడండ్రు ధైర్యమున బయటపడి, తమచదువు సాగించుటకుఁ గాని, ప్రార్థనసభలు జరుపుటకుఁగాని యెట్లు సాధ్య మగును?

లక్ష్మీనారాయణగా రిపుడు ప్రార్థనసమాజాదర్శములనుగుఱించి యెక్కువ సానుభూతిఁ జూపుచుండెడివారు. అపుడే జరిగిన యొక బోగముమేళమునుగుఱించి యాయన యొక పెద్దజాబు వ్రాసి, అది మాపత్రికలోఁ బ్రచురింపఁగోరెను. అంత పెద్దలేఖకుఁ దావు లేనందున, అది సంగ్రహవార్తగ ఫిబ్రవరిపత్రికలోఁ బ్రచురింపఁబడెను. ఆకాలమున మిత్రులలోఁ గలవరమునకుఁ గారణ మయ్యెను గావున, దాని నిచట నుల్లేఖించుచున్నాను. కనకరాజుయొక్క కటుపద ప్రయోగములతోఁ గూడిన దిద్దుఁబాటు లిందుఁ గానఁబడగలవు : -y

"కడచిన మకరసంక్రాంతినాఁడు, మన పట్టణములో పట్ట పరీక్షయందు తేరినవారు కొందరును, ఆపరీక్షకు పోదలచినవారు కొందరును, నిర్వ్యాపారులై కాలమువ్యర్థపుచ్చు మరికొందరును, మనయెదుటనే యెన్నియో సంసారముల గూలద్రోచి, ప్రస్తుతము కోరలు పెరికిన వృద్ధకాలసర్పమువలె నున్న ఒకవేశ్యాకాంతయొక్క ముద్దుకూతురిచే గజ్జె కట్టించిరి. కామశాస్త్రోపాధ్యాయి యగు ఆమెయు తనగాత్రముయొక్క అభివ్యక్తిచేతను, నేత్రవిలోకములచేతను, అభినయముచేతను, పాడినగీతముల దుర్నీతులచేతను, 'బ్రదుకుదినముల మోక్షంబు వెదుక నేల ?' అను మృగధర్మమును వారిమనస్సులకు నాటునట్లు బోధించి చెనెను. పామరజనులను సన్మార్గమునకు పురికొల్పవలసిన పట్టపరీక్షావిద్యార్థులే కులటల నాదరించుచున్నపుడు, మనదేశ మెప్పు డున్నాతస్థితికి వచ్చునో తెలియకున్నది."

ఈవార్త పత్రికలోఁ బ్రచురించినందున కనేకులు నన్ను నిందించిరి. సభకు వెళ్లిన విద్యార్థులు కొందఱు రోషపడిరి. తమ్ము నవమానించినందుకు నామీఁద నభియోగము తెచ్చెద మని కొందఱు భయపెట్టిరి. నామీఁద వ్యాజ్యెము తెమ్మని యా వేశ్యను కొందఱు పురికొల్పిరి. నామూలమునఁ దామును జిక్కులలోనికి వచ్చెద మని సమాజమిత్రులు కొందఱు భయపడిరి. తమ లేఖామాతృకను దమ కిచ్చి వేయుమని భీతిల్లిన లక్ష్మీనారాయణగారు నన్ను వేఁడిరి. నే నది యిచ్చివేసితిని. ఒకనాఁడు నాపూర్వసహచరుఁ డొకఁడు నాగదిలోనికి వచ్చి, "ఈసత్యసంవర్థనీపత్రికను నడపువారు, మీవిద్యార్థులే కాక, మీనాయకుఁడు వీరేశలింగముపంతులుకూడను కాదా ? పత్రికాధిపత్యమునందు ఆయనకును బాధ్యత యున్నదికాదా ? " అని నన్నడిగెను. ఆయనకూడ పత్రికాధిపత్యమున భాగస్వామియే యని నే జెప్పితిని. "పెద్దవారగు పంతులుగారియాలోచన పుచ్చుకొనియే మీరీపత్రిక నడుపుచున్నారుకాదా ?" అని నాసహచరునిప్రశ్న. "అవును. పంతులుగారు పత్రికాధిపత్యమందును మాకు నాయకులే !" అని నాసమాధానము.

ఈసంభాషణ జరిగిన యొకటిరెండురోజుల కీసావాసుఁడు మరల నాకుఁ గనిపించి, మానరక్షణమును గుఱించి వేశ్య వ్యాజ్యెము తెచ్చుట మానుకొనె నని చెప్పెను. కారణ మడుగఁగా, వెనుకటిసారి నాతో నతఁడు మాటాడునపుడు, ఆవేశ్య నాగదిప్రక్కగదిలో నిలుచుండి సంభాషణ యంతయు విని, పెద్దపులివంటి వీరేశలింగము పంతులే యీవ్యవహారములో నుండుటచేత, తనయాటలు సాగవని భీతితో నుద్యమము విరమించుకొనె నని చెప్పెను ! వేశ్యాజన ప్రియుఁడగు నా యీ పూర్వసహచరుఁడే, ఆ స్త్రీ యాప్రక్కగదిలోనికి వచ్చిపొంచుని వినునట్టి యేర్పాటు చేసేనట !

సత్యసంవర్థనీ పత్రికాధిపతిమీఁదను, ప్రార్థనసమాజముమీఁదను జనులకుఁ గొందఱికిఁగల యాగ్రహ మింతటితో నంతరింప లేదు. 19 వ మార్చితేదీని పురమందిరమున జరిగిన నాటకసందర్భమున, ప్రహసనములో ప్రార్థనసామాజికులు పత్రికాధిపతియును వెక్కిఱింపఁబడిరి. ఇది జరిగిన కొలఁదిదినములకే ప్రార్థనసమాజవార్షి కోత్సవము జరిగెను. ఏఁటేఁటను, ఈ సందర్భముననే ప్రార్థనసమాజమువారిని వెలివేయుటకు యత్నములు జరుగుచుండెడివి. పూర్వాచారపరులకు మామీఁద నిపుడు పూర్తిగ నాగ్రహము గలిగెను. ఉత్సవదినములలో నన్నదానమునకై వంట చేయుటకు బ్రాహ్మణులు రాకుండఁజేయు ప్రయత్నములు జరిగెను. వంటపందెర మీఁద రాళ్లు రువ్వఁబడెను. సారంగధరుని మెట్టమీఁద ఫలాహారములు చేసిన వారిని వెలివేయుట కిపుడు ప్రయత్నములు సాగెను. ఈసందర్భమున పూర్వాచారపరులను బురికొల్పుటకు కళాశాలోపాధ్యాయులు కొందఱును వారి శిష్యులు కొందఱును పట్టుదలతోఁ బనిచేసిరి. ప్రార్థనసామాజికులకు పూఁటకూళ్ల యిండ్లలో రెండుదినములు భోజనము దొరకకుండఁ జేసిరి. అంత, కనకరాజు నేనును కళాశాలాధ్యక్షుని దగ్గఱకుఁబోయి, ఉపాధ్యాయుల కుట్రను వారి కెఱిఁగించితిమి. ఆయన మాకుఁ దోడుపడెద నని చెప్పి, ఆయుపాధ్యాయులను వారించెను. బహిష్కరణప్రమాద మంతట మెల్ల మెల్లగఁ దొలఁగి పోయెను. కాని, ప్రార్థనసమాజ శత్రుల యీర్ష్యారోషము లింతటితో నస్తమింపలేదు. 11 వ ఏప్రిలు తేదీని "రాజమంద్రి యందలి ప్రస్తుత పరిస్థి"తుల ను గూర్చి యొక న్యాయవాది పురమందిరమున నుపన్యాస మిచ్చెను. వాదప్రతివాదనల తీవ్రతచేత సభ యల్లకల్లోల మయ్యెను. ఆసమయమున మిత్రుఁడు కనకరాజు చేసిన యప్రస్తుత ప్రసంగమునకు స్నేహితులము వానిని నిందింపఁగా సమాజము వదలివేతు నని యాతఁడు చెప్పివేసెను గాని, పాపయ్యగారి శాంతవచనములచే మనస్సు మార్చుకొనెను.

నా పూర్వమిత్రుఁడగు మహమ్మదు బజులుల్లా సాహేబు, ఒక బ్రాహ్మణ స్నేహితునితోఁ గలసి యిపుడు "సత్యాన్వేషిణి" యనునొక యింగ్లీషు వార్తాపత్రికను నెలకొల్పెను. దాని మొదటి సంచిక 12 వ ఏప్రిలున వెలువడెను. మతసాంఘిక విషయములు చర్చింప నుద్యమించిన యీతోడి మాసపత్రికకు ఏప్రిలు సంచికలో సత్యసంవర్థని సుస్వాగత మిచ్చెను గాని, సంస్కరణ నిరసనమే ముఖ్య కార్యముగఁ జేసికొన బయలువెడలిన యీనూతనపత్రికకు మాకును ముందు పోరు ఘోరముగ జరుగు నని మేమెఱిఁగియే యుంటిమి.

౩౯. స్నేహభాగ్యము

౧౮౯౨ వ సంవత్సరము మార్చి తుదివారమున జరిగిన మా ప్రార్థనసమాజ జయంత్యుత్సవసమయమున సభ్యుల మందఱము నమితోత్సాహమున నుంటిమి. వీరేశలింగముగారు "మానుషధర్మము"ను గుఱించియు, నరసింహరాయఁడుగారు "విశ్వాసము"ను గూర్చియు, కనకరాజు "దేవేంద్రనాధు"నిగూర్చియు, నేను "ప్రేమపారిశుద్ధ్యము"నుగుఱించియు,ధర్మోపన్యాసములు చేసితిమి. బీదజనులకు అన్నదానము చేయఁబడెను. ఏకాంతప్రార్థనమునకై సారంగధరపర్వతమునకుఁ బోయి వచ్చితిమి.

వేసవికి కళాశాల మూయుటచేత పట్టణమునుండి సమాజ మిత్రులు తమ తమ గ్రామములకు వెడలిపోయిరి. సత్యసంవర్థనిని విడిచి వెంటనే నే నెచటికిని బోలేకపోయితిని. పత్రికకు వ్యాసములు వ్రాయుచును, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు నడపుచును, నేను రాజమంద్రిలో చల్లనిగాలి ననుభవించుచుంటిని! ఇపుడు స్కాటు దొరగారు నాయింగ్లీషువ్యాసములు దిద్దుటకు నిరాకరించుటచేత, ఆంగ్లేయవ్యాసరచనయం దెక్కువజాగ్రత్త వహించితిని.

ప్రార్థనసమాజసంపర్కము వదలుకొను మని తండ్రియు మామయు నాకు హితబోధము చేసిరి. పత్రికమూలమున నాతలంపులు కార్యములును రచ్చ కెక్కుచుండెను. ఇపుడు వేలివెన్ను నుండి వచ్చిన నాభార్య, సమాజవార్షిక సమయమందలి మాచర్యలు, అచటిచుట్టముల హృదయములను గలంచివైచె నని చెప్పెను. నేను విద్యాభ్యాసమును గూర్చి శ్రద్ధఁబూని, యుద్యోగసంపాదనమునకుఁ గడంగవలయునే కాని, నిరర్థక సంస్కరణములవిషయమై కాలమును వ్యర్థపుచ్చరా దని, మనుమనిపురోభివృద్ధి గోరి వృద్ధురాలగు మాయమ్మమ్మ పంపినట్టియు, పతిసేమ మారసి నాభార్య భద్రముగఁ గొనివచ్చినట్టియు, సందేశవిశేషము ! ప్రాఁతగిల్లినప్రేమను జూపు ముత్తువమాటలు మనుమనికి నచ్చినను నచ్చకున్నను, నవయౌవనమున విలసిల్లు సతినూతనానురాగ యుతమగు హితోక్తులు పతిచెవి కెక్కు ననుట స్పష్టము కావున, సంస్కరణోద్యమముదెస నెటులైన నాకు విముఖత్వము గలిగింప నీయాఁడువా రిద్దఱు నాలోచించుకొనిరి !

ఈవేసవిలో వీరేశలింగముగారు చెన్నపురి వెళ్లి పోయిరి. ఆయన బయలుదేఱుటకు మునుపు, ఇంటియొద్ద వారిని జూచితిని. సంస్కరణాంశములం దాయన నామనసునకు నచ్చినట్టి అతివాదియె. కాని, యాయనలోపము లెంత బయలుపడియున్నవి ! అహంభావము, ఆత్మశ్లాఘనమును వీరి వాక్కులయందుఁ జూచి నేను జింతించి, ఈశ్వరకృపచే నివి తొలఁగవలె నని కాంక్షించితిని. ఆస్తికపాఠశాలస్థాపన విషయమై పాపయ్యగారు పరిపూర్ణసానుభూతిఁ జూపుచుండువారు. ఇపుడు నాకు మాతమ్ముఁడు వెంకటరామయ్యయు, మృత్యుంజయ రావును నిత్యసహచరు లయిరి. నవీనముగా స్నేహము గలసినను, మృత్యుంజయరావునెడల నాకు చన వెక్కువ. మితభాషి యైనను, మనసుగలసినమిత్రులతోఁ దన యాదర్శములను విశ్వాసములను ఆతఁడు వెల్లడించుటకు వెనుదీయకుండువాఁడు. భవిష్యత్తునందలి మాకార్య ప్రణాళికనుగుఱించి ముచ్చటించుచుండువారము. మిల్లు వ్రాసిన "స్త్రీ నిర్బంధము" అనుపుస్తకమును అమితతమకమునఁ జదివితిమి. జన లోకముయొక్క కనులువిప్పి, ఉత్కృష్టసాంఘిక సమస్యలను నిర్భయముగ నెదుర్కొనిన యాయుత్తమరచయితవాక్కులు విని నామిత్రుఁడు హర్షోద్రేకమున మిన్ను ముట్టుచుండువాఁడు. ఈమిత్రుఁడు వక్తయు వ్రాయసకాఁడును కాఁడు. సఖులతోడి సుఖసంభాషణములందు మాత్రము, ఆతనికంటె నధికమగు బుద్ధివైశద్యము సదుద్దేశసద్భావములును గనఁబఱచెడివా రరుదుగ నుందురు ! అతనికి స్త్రీవిద్యాభిమానము మెండు. అందఱివలె మాటలతోఁ దనివి నొందక, తనభార్య మాణిక్యాంబ కాతఁడు విద్యాసౌకర్యము లెన్నియో కలిగించెను. ఇపుడు నాప్రోత్సాహమున నతఁడు "పండిత రామాబాయిసరస్వతి"ని గుఱించి వ్యాసము వ్రాయఁగా, అది జూన్‌పత్రికలోఁ బ్రచురించితిమి.

రాజమంద్రినివాస మనిన నే నంత విసు వంది, ఏప్రిలుపత్రిక తపాలో నంపినవెంటనే, వేలివెన్ను, నర్సాపురము మున్నగుప్రదేశములు తిరిగి వచ్చితిని. ఈ సెలవులలో వీరేశలింగముపంతులు కనకరాజును పట్టణమున లేనందున, మే, జూను పత్రికలలోఁ బ్రచురింప వలసినవ్యాసములు నేనే నిర్ణయించితిని. ప్రాఁతవ్యాసములలో "అహం బ్రహ్మాస్మి" అను నద్వైతమతఖండనము నాకనుల కగపడెను. అది కనకరాజు వ్రాసినది. వేదాంతవిషయములలో మాకు పంతులుగారి తరువాత కనకరాజే ప్రమాణము ! అద్వైతము బ్రాహ్మమతమునకుఁ బరమశత్రు వని యాతనిమతము. ఇపు డీవ్యాసము గాటుగ నుండుట చేత, మేనెల పత్రికలో దానినిఁ బ్రచురించి, దేశోద్ధరణము గావించితి మని సంతసించితిమి. తప్పులతడకగ నుండిన యీ యసంపూర్ణ వ్యాసము తనకుఁ జెప్పక యేల ప్రచురించితి రని పిమ్మట కనకరాజు కోపపడెను. ఆతఁ డనుకొనినట్టుగనే, బళ్లారి "సన్మార్గబోధినీ" పత్రికలో నీవ్యాసముమీఁద పెద్దఖండనము ప్రచుర మయ్యెను. వేసవి సెలవు లయినపిమ్మట, ఈఖండనమునకుఁ బ్రత్యుత్తరము లిచ్చితిమి.

మరల కళాశాల తీసినవెనుక మృత్యుంజయరావుని యాలోచన ననుసరించి, ప్రార్థనసమాజసభ్యులము కొందఱము, ఇతరవిద్యా ర్థులు కొందఱితోఁ గలసి, విద్యాలయమునకుఁ జేరువ నుండు నొక మేడను అద్దెకుఁ దీసికొంటిమి. నాచదువున కందు నిశ్శబ్దమగు గది యొసఁగబడెను. చుట్టుపట్టుల నిండ్లలో నివసించియుండు కనకరాజు మృత్యుంజయరావు మున్నగుస్నేహితులు తఱచుగ మాబసకు వచ్చి, మాతో సంభాషించుచుందురు. మృత్యుంజయరా విపుడు కళాశాల చేరి పట్టపరీక్ష రెండవభాగమునకుఁ జదువుచుండెను. ఇపుడు కనకరాజు పట్టపరీక్ష మొదటితరగతిలోఁ జేరి, యెక్కువ విశ్రాంతి గలిగియుండుటచేత, పత్రికవ్యవహారము లతఁడు చూచుచువచ్చెను. చదువుకొనుటకు ప్రత్యేకవసతి యేర్పడుటచేత, ఆఱునెలలలో రానున్న పట్టపరీక్షకై కృషిసలుప నుద్యమించితిని. కాని, నా యారోగ్య మింకను సరిగ లేదు. ఆదినములలో రోగము నాదేహముతో 'సెలగాటము' లాడుచువచ్చెను ! ఆతరుణమున నామిత్రులు కొందఱు నాకు సాయము చేసిరి. రామారావుగారు ఉపహారములు చేయించి పెట్టుచును, మృత్యుంజయరావు అపుడపుడు భోజనసదుపాయము లొనరించుచును, రంగనాయకులునాయఁడుగారు ఔషధపానీయముల నంపుచును, నా కెంతయో తోడ్పడిరి.

ఇంట భోజనవిషయమున మాతల్లి యెన్నియో సదుపాయములు నాకు సమకూర్చుచుండెడిది. అప్పుడప్పుడు జబ్బుపడుచుండినను, మొత్తముమీఁద మాయింట నుండునందఱిలోను సుఖానుభవమున నేనే యధిపుఁడను ! చదువుకొనుటకు శయనించుటకును నాకు విశాలమును నిశ్శబ్దమునునగు ప్రత్యేకమగు మేడగది కలదు. వర్ష కాలమున మా కుటీరనివాసము కడు బాధాకరముగ నుండెడిది. ఆపర్ణశాలలో నేల మిగుల తేమగును, పెరడు బురదగను నుండుటవలన, అహర్నిశ మచట తిరిగి పనులు చేసికొనుచుండు మాతల్లికిని తక్కిన యాఁడు వాండ్రకును, కాళ్లు ఒరసికొనిపోయి పుండ్లు పడెను. ఆయిల్లు విడిచి చేరువనుండు నేపెంకుటింటికైనఁ గాపురము తరలింపు డని నేను మొఱపెట్టినప్పుడు, మాతండ్రి, "ఇపు డీ నేల యివరగా నున్నది గాని, కొంచె మారినయెడల, ఇక్కడనే కొబ్బరికాయలు కొట్ట వచ్చును సుమా !" అని పలుకుచు, నాయాలోచన లెగురఁగొట్టు చుండువాఁడు. అందువలన మాతల్లికి దేహారోగ్యము చెడిపోవుటయు, అందఱికి నసౌఖ్యము గలుగుటయుఁ దటస్థించి, నన్నలజడిపాలు చేసెను.

40. రోగారోగ్యములు

ఆకాలమున నా యారోగ్యమునుగుఱించి నే నెంతయో శ్రద్ధవహించెడివాఁడను. ఏమాత్ర మనుమాన ముండినను, మిత్రుఁడు రంగనాయకులునాయఁడుగారు నన్నుఁ బరీక్షించి మం దిచ్చుచుండువారు. రాత్రులు చదువకుండుటయె నియమముగఁ జేసికొని నేను భోజనానంతరమున నెనిమిదిగంటలకే పాన్పు చేరుచుండువాఁడను. కాని, అత్యాతురతచే నాకనులు పొడివాఱి, కునుకు పట్టకుండెడిది ! ప్రక్కగదులలోఁ జదువుస్నేహితులను చదువు మానుఁ డనియును, కనీసము మెల్లఁగఁ జదువుకొనుఁ డనియును వేఁడుచుండువాఁడను ! చన వెక్కువ గలవారి గదిలోని దీప మార్పివేసి, వారికి నిర్బంధవిశ్రాంతి చేకూర్చుచుండు వాఁడను. కాని, యెన్ని పూజలు సల్పినను, నిద్రాదేవత నాకుఁ బ్రసన్న మయ్యెడిదిగాదు. చీఁకటిపడుటయె తడవుగా పడకఁ జేరి, పొడిగ్రుడ్లుపడి యాపసోపములతో గంటలు లెక్కించెడి నాకంటె, కాలనియమము లేని చదువున నొడ లెఱుఁగక దీపముచెంతనే నిదురించు పొరుగుసహచరు లదృష్టవంతు లని యచ్చెరు వందుచుందును. నా వైద్యమిత్రుఁ డిచ్చు నిద్రాకరమగు మందె నాకు వికారము గలిగించి నిదురను బాఱఁద్రోలుచుండును ! నిద్ర యెట్లు పట్టునా యని యాలోచించినకొలఁది నా కది దూరస్థ మగుచుండును !

రాత్రి నిద్దురమాట యెటు లుండినను, పగటికాల మేమాత్రమును వేథచేయక నేను చదువుచుందును. ఏమాత్రము చదువుపా లెక్కువయైనను, ఒక్కొకసారి బొత్తిగఁ జదువుకున్నను, నాకురోగము ప్రత్యక్ష మగుచుండును. బంగారము తూఁచుత్రాసువలె, మిగుల చిన్నమార్పుననైనను నాదేహము రోగముదెస కొఱగుచుండును. అయినను, వ్యాధినుండి యొకింత తెఱపి గలిగినేని, నేను మరలఁ జదువుచు పత్రికకు వ్రాయుచు, కాలమును సద్వినియోగము చేయ నుంకించుచుందును. ఈసంగతి, ఆనాఁటి నాదినచర్యపుస్తకములలోని క్రిందియుల్లేఖమువలన తేటఁబడఁగలదు: -

"బుధ. 13 జూలై 1892 : నాకు బాధ హెచ్చెను. తయారు చేసిన వ్యాసమును అచ్చున కిచ్చితిని. వేదన అతిశయంచెను. ఊపిరి సరిగా విడువనేరక నేను పండుకొనియుండుట చూచి, కనకరాజు కంట తడిపెట్టుకొనెను. నాయఁడుగారిమందు వలన కొంత యుపశమనము గలిగెను. బంధుమిత్రులు నన్నుఁ జూడవచ్చిరి. భగవానుఁడా, యెటులయినను నేను నీవాఁడనెకదా !"

"సోమ. 18 జూలై :- ప్రొద్దుననే నా పూర్వశత్రువు గుండె నొప్పి మరల పొడసూపెను. రోజంతయు బాధనొందినను కళాశాలకుఁ బోయితిని. గదిలోనివస్తువులు సరదుకొంటిని. అచ్చుచిత్తులు దిద్దితిని. లోకాక గూడ నుండెను." "మంగళ. 19 జూలై. దేహ మింకను ససిగా లేదు. ప్రొద్దున ముద్రాలయమున కేగి పని చేసితిని. ప్రాఁతశత్రువగు కనులత్రిప్పు మరల రెండుసంవత్సరముల కీనాఁడు గనఁబడినది. దాని వెన్నంటి యుండు తలనొప్పిచే రోజంతయు బాధపడితిని. ఆరోగ్య మిట్లు ఊఁగులాడుచున్నది !"

పైని జెప్పినదానిలో రెండుసంవత్సరముల కనునది రెండునెలలని యుండవలయును. రెండునెలలకైనను, రెండుసంవత్సరములకైనను, శరీరముపై మోయలేని బరువులెత్తుటచేతనేకదా ప్రాఁతరోగములు బయలుపడుచుండును ! విద్యార్థులకు పరీక్షాకాలము పెద్దపరీక్షాకాలమె !

రోగముతో నిట్లు నిరంతరయుద్ధము సల్పుచుండు నాదేహము, అక్టోబరు చివరభాగమున మరల వ్యాధిగ్రస్థ మయ్యెను. శరీరమందు ససిగా నుండనిసమయమున పాఠములు చదువుచును, పరీక్షలకుఁ బోవుచును, పత్రికకు వ్రాయుచును, విందులు గుడుచుచును నుండుటచేత' అక్టోబరు 27 వ తేదీని నాకు పెద్దజ్వరము వచ్చెను. వేసినమందు వికటించి రోగము హెచ్చెను. ఆమఱునాఁడు నన్ను లంకణ ముంచిరి. రాత్రి పదిగంట లగుసరికి నాకు తల తిరిగెను. ప్రాణ మెగిరిపోవు నటు లుండెను. చూచుచుండఁగనే కాలుసేతులు చివరనుండి చల్లఁబడి మొద్దుపాఱఁజొచ్చెను ! స్పృహమాత్రము స్ఫుటముగ నుండెను. ఇది యంత్యావస్థ యని నే ననుకొని, ఒక కేక వేసితిని. జీవిత మంతయుఁ జేసెద ననుకొనిన ఘనకార్యములు సాధింపకయే నే నిట్లగుచుండుట కాశ్చర్య మందితిని. భోజనము చేయుచుండు నా తల్లియు, భార్యయు నంతట లేచివచ్చిరి. అంత పొరుగువీథి నుండిన యొకవైద్యుని గొనివచ్చిరి. ఇపుడు నా దేహమునిండ చెమ్మటలు పట్టెను. నిదానముగల యావైద్యుఁడు నాచేయి చూచి, నాడిలో దోషము లేకుండుట గ్రహించెను. జ్వరము విడుచుటచేత ముచ్చెమటలు పట్టి నాకు నిస్సత్తువ గలిగె నని నిశ్చయించి, నా కాయన, పేలాలజావ పోయించెను. నేను తెప్పిఱిల్లితిని. ఆవైద్యునియౌషధమువలన నొకవారమునకు నాకు నింపాందించెను.

41. వైరివర్గము

మహమ్మదీయ సంపాదకునిచే నడుపఁబడుచుండెడి "సత్యాన్వేషిణీ" పత్రిక, హిందూసంఘ దురాచార నిరసనము నెఱపుచుండెడి మా "సత్యసంవర్థని" యెడ సానుభూతి చూపు నని లోకు లనుకొనవచ్చును కాని, అట్లు జరుగలేదు. జనన మొందినది మొదలు, "సత్యాన్వేషిణి" ప్రార్థన సామాజికులను, "సత్యసంవర్థని"ని దూషించుటతోనే కాలము గడపెను. ఈదూషణ మైనను, సిద్ధాంతములలోను విధానములందును గల యభిప్రాయభేదము లాధారముగఁ జేసికొనిన ధారాళవిమర్శన మైనచోఁ గొంత సారస్యముగ నుండెడిది. అట్లు గాక, "సత్యాన్వేషిణి" వ్యక్తిగత దూషణములు చేయఁ జొచ్చెను. ప్రార్థన సామాజికులకు లేనిపోని యవగుణము లారోపించి, వారి యాదర్శములను వెక్కిఱింపఁ జొచ్చెను. మా సమాజమువా రెంత యోపికతో నూరకుండినను, సత్యాన్వేషిణి నోరు కట్టువడలేదు. అంతట వీరేశలింగముపంతులు, మహమ్మదీయసంపాదకునిచేతను, బ్రాహ్మణకార్యనిర్వాహకునిచేతను బ్రకటింపఁబడెడి యాపత్రికకుఁ దగుసమాధాన మీయఁదొడంగెను. సెప్టంబరు "సత్యసంవర్థని" లో "సాభిప్రాయవిషయ వ్యాసము" వ్రాసినది వీరె. దీనిలో "సత్యాన్వేషిణి" వ్రాఁతలలోని వంకరలను, వేశ్యాజనాభిమానము, పూర్వాచార పరాయణత్వము, స్మార్తకర్మలు, స్త్రీ గౌరవము, సత్యము, అను శీర్షికలతో పంతులుగారు ఖండించివైచిరి. ఇంతటితోఁ దనివి చెందక, పంతులు హిందూ మతోన్మాదములను, దురాచారములను సమర్థింపఁజూచెడి పండితాభాసులవాదనలను చర్యలను గర్హించుచు, ఆగస్టు నెలనుండియే ప్రహసనములు వ్రాయఁజొచ్చెను. ఆనెలలోఁ బ్రచురింపఁబడిన "హిందూమతసభ" వీరి ప్రహసనములలో నెల్ల కఱకుఁదనమునకుఁ బ్రసిద్ధి కెక్కియున్న వానిలో నొకటి. అది చదివి వినోదించుటకై యనేకు లాపత్రిక సంచికలను గొనిరి. ఇట్టి ప్రహసనము లుండుటవలన "సత్యసంవర్థని" జనరంజక మగు చుండుట విని, పంతులుగారు అప్పటినుండియు కొంతకాలము పత్రిక కొక్కొక చిన్నప్రహసనము వ్రాయఁజొచ్చిరి. ఇట్లీ సమయమున మాపత్రికలో పంతులుగారు వ్రాసిన ప్రహసనములలో "యోగాభ్యాసము," "కలిపురుషశనైశ్చర విలాసము"ను ముఖ్యములు.

ఆ నవంబరునెల తుదివారములో, రాజమంద్రికి కోటయ్య సెట్టిగా రను దివ్యజ్ఞానసమాజోద్యోగి యొకరు వచ్చి, అక్కడ కొన్ని యుపన్యాసము లిచ్చి, విద్యార్థులతో సంభాషణములు జరిపిరి. మిత్రులతోఁ గూడి నే నాసభకుఁ బోయి, సెట్టిగారి యభిప్రాయములను గ్రహించి, వానిని గుఱించి విపులమగు విమర్శనము ఆంగ్లమున వ్రాసి మాపత్రిక నవంబరు డిసెంబరు సంచికలలోఁ బ్రచురించితిని. ప్రకృతమున "దివ్యజ్ఞాన సమాజము" వారు సంఘసంస్కారమునకు సుముఖులుగ నున్నను, ఆకాలమున వారు హిందూమతమును, హిందూసాంఘికాచారములను ఆమూలాగ్రముగ సమర్థించుటయె తమ ధర్మమని విశ్వసించెడివారు ! కావున సంఘ సంస్కారములకును, దివ్యజ్ఞాన సామా జికులకును పూర్వకాలమున పోరు ఘోరముగఁ జెలరేగుచుండెడిది. సెట్టిగారి యభిప్రాయములందుఁ గానిపించిన లోపములను నేను గర్హించి, ఖండించి, ఆ సమాజ సిద్ధాంతములమీఁద నాకుఁగల కసి తీర్చుకొంటిని.

ఆకాలమునందు ప్రహసనరూపమున, వాదప్రతివాదములు జరుపుట యాచారమయ్యెను. ప్రహసనమెంత వ్యక్తిగత మైనను సరే, అది తగినంత కఱకుగను, చమత్కారముగను నుండినచో, పాఠకుల కుల్లాసము గలుగుచుండెడిది !

1 వ అక్టోబరున మా కందిన "ఆంధ్రప్రకాశిక" సంచికలో నొక ప్రహసన ముండెను. అందు వీరేశలింగముగారిని, కనకరాజు సాంబశివగార్లను, మాఱు పేరులు పెట్టి, మాప్రతికక్షులు వెక్కిఱించి వినోదించిరి.

ప్రతికక్షులగు భిన్నకూటస్థు లొకరి నొక రిట్లు నిరసించుకొనుట స్వాభావికమే. కాని, మా సమాజసభ్యులు రానురాను తగినంత పరస్పర ప్రేమానురాగములు లేక, ఒకరియం దొకరు ఈర్ష్యా ద్వేషములు వహించి భిన్నభిన్న కక్షలక్రింద నేర్పడిరి. సత్యసంవర్థనీ పత్రిక నాధారము చేసికొని, నేను ప్రార్థన సమాజ వ్యవహారము లన్నిటిలో నిరంకుశ ప్రభుత్వమును నెఱపుచున్నా నని మామిత్రుల యపోహము ! నాస్నేహితుఁడు కనకరాజు రెండుమూఁడు సారులు నాయందు మిత్రుల కేర్పడిన యీ ద్వేషభావమును గూర్చి నాయొద్ద ప్రస్తావించెను. కాని, యాతఁడు వేగిరపాటుచేత మిత్రులమీఁద ననగత్యమగు ననుమానములు పడుచుండెనని నేను దలంచుచుండెడి వాఁడను. సమాజాభివృద్ధికై యెంతయో కృషి సల్పుచు, సమాజ పత్రిక విషయమై నా చదువు నాకాలము నాయారోగ్యమును ధారవోయు నన్ను గుఱించియె మిత్రులు సందియము లందుచుండుటకు విస్మయ మందితిని. సత్యసంవర్థనికి మాఱుగా వచ్చెడి పత్రికలు సభ్యుల కందఱికిని బంపుచు వచ్చినచో వారి మనస్సులు కొంత శాంతించు నని కనకరాజు ఆలోచన చెప్పుటచేత, అట్లు పంపుచువచ్చితిమి. కాని, పత్రిక పనులు చేయుటకు నెలకు రెండుమూఁడు రూపాయిల జీతముమీఁద నేర్పడిన యొకపిల్లవాఁ డొకఁడె యీపనిని నిర్వహింపవలసివచ్చుటచేత, క్రమముగ పత్రిక లందఱికిని నందకుండెడివి. సమాజము యొక్క నౌకరుచేత నే నింటి చాకిరి చేయించు కొనుచు, వాని నితర సభ్యుల పరిచర్యలకు వదలకుంటి నని సభ్యుల మొఱ ! దీనిలోఁ గొంత సత్యము లేకపోలేదు. ఏయుద్యోగ సంబంధ మైన జవానుగాని పరిచారకుఁడు గాని యా యుద్యోగి యింటఁ గనఁబడుటయె తడవుగా, ఆడంగుల నియామకమున నాతఁడు ఇంటి నౌకరుగఁ బరిణమించుచున్నాఁడు ! ఇట్టిపనులు వానికి నియమించుట కూడని పనియె యైనను, ఏయుద్యోగి తనభార్యమీఁదను బిడ్డలమీఁదను అహర్నిశమును ఈచిన్న సంగతిని గూర్చి యుద్ధము సలుపఁగలఁడు? ఇది కారణముగ, ఆకాలమున నేను స్నేహితుల సుముఖత్వమును గోలుపోయితిని. సహనబుద్ధియు కార్యవాదిత్వమును బూని, పరిస్థితుల కెటులో సరిపెట్టుకొని, స్నేహసఖ్యములె యన్నిటికంటె ప్రధాన మని గ్రహించి, సమభావమున మెలంగుటకు, మే మెవరము గాని వయసు మీఱిన యనుభవ శాలులము గాము. స్వల్పవిషయము లందె గొప్ప పట్టుదలలు గల బాల్యావస్థయందె మే మెల్లరము నుండుటచేత, మా సమాజసభ్యులలో నిట్టి ద్వేషభావములు క్రమముగఁ బెరుఁగజొచ్చెను. మేము పరీక్ష నిమిత్తమై చెన్నపురి బయలుదేఱవలసిన దినములు వచ్చెను. ఆ సమయమునందు, నామీఁద గల వైరభావము స్నేహితులు వెలిపుచ్చ నారంభించిరి. వీరలలో నగ్రేసరుఁడు నా మిత్రుఁడు మృత్యుంజయరావె యగుటకు నే నెంతయు వగచితిని. ఇట్టి స్వభావము గలవారితోఁ జెలిమి చేసి, యేల నే నీసమాజమునఁ బని చేసితినని విచారించితిని. నేను చెన్నపురికిఁ బోవునపుడు సెలవు గైకొనుటకు వీరేశలింగముగారియొద్ద కేగఁగా, ఆయన మా యంత: కలహముల సంగతి విని, స్నేహితు లందఱిని సమావేశపఱచి, మాలో మరల మిత్రభావము నెలకొల్పఁ బ్రయత్నించిరి. వారిమాటలు శిరసావహించి మే మందఱమును వారి హితవచనముల చొప్పున మెలఁగ వాగ్దానము చేసితిమి. ఇపు డందఱము కూడి ప్రయాణము చేయ సమ్మతించుటయె యీ స్నేహ పునరుద్ధరణమునకు సూచన.

42. సౌఖ్య దినములు

రోగములు, మనస్పర్థలు, మున్నగు శోధనల కెంత లోనైనను, 1892 వ సంవత్సరమున తుదియాఱు నెలలును నాకు నా స్నేహితులకును విద్యార్థిదశలో నెల్ల సుఖతమదినము లని చెప్పవచ్చును. మిత్రుల మందఱమును గలసియుండెడి యా యిల్లపుడు రాజభవనము వలె నాకును నా స్నేహితులకును గానఁబడియెడిది ! ముఖ్యముగ సంఘసంస్కరణాభి మానుల కది యాటపట్టయ్యెను. అచటినుండి వీచుగాలియె సంస్కరణాభిమానబీజములను నలుదెసలకును వెదచల్లు నటు లుండెను. సంస్కరణమును గూర్చి చర్చలు, ప్రసంగములు, సంభాషణములును, ఎల్ల సమయములందును, అచట వినవచ్చు చుండెను. సంస్కరణమును గూర్చిన పత్రిక లచటఁ జదువరులకు లభ్య మగు చుండెను. సంస్కరణాభిమానులగు చిన్నలు పెద్దలు, విద్యార్థులు విద్యాధికులును పలుమా ఱచట సమావేశ మగుచు నొకరి యూహా పోహము లొకరు గ్రహించుచుండిరి. రాజమంద్రిలో జరుగు సంస్కరణకార్యప్రణాళిక యంతయు నిచట నారంభమై, మున్ముందుగఁ బ్రచుర మగుచువచ్చెను.

సంస్కరణ పక్షమున కెట్టి సంబంధము గలవారు పట్టణమునకు వేంచేసినను, వారలను గూర్చిన వార్తలు ప్రథమమున నిచ్చటనే ప్రభవించుచుండెను. ఆసమయమున నొక భూతవైద్యుఁడు రాజమంద్రి వచ్చి, ఎవరియింటనో బసచేసి, వైద్యము చేయుచుండెను. మే మాయనతో వాద ప్రతివాదనలు చేయుటకు వారియొద్దకుఁ బోవుచుండెడివారము. దయ్యములను జూపింపు మనియు, పట్టింపు మనియు, మాలోఁ గొందఱ మాయనతో డీకొని వాదించితిమి. ఆయన యట్లు చేసెద నని పలికియు, తుద కేమియుఁ జేయలేక వెడలి పోయెను. హిందూమతము, దివ్యజ్ఞాన సమాజములను గూర్చి ప్రసంగించుటకు, మేము సాహసమున బయలుదేఱుచుందుము.

మాయందఱికిని వివాహ సంస్కరణము ప్రియతమమగునంశము. వితంతూద్వాహములు చేసికొనినవారిలోఁ బెక్కండ్రు మాకు సావాసులే. వారియిండ్లు మామేడ కంటియె యుండెను. వారినిజూచి పోవుటకు వచ్చెడి వీరేశలింగము పంతులు మున్నగు సంస్కర్తలు, మామేడమీఁదికి వచ్చి మాతో మాటాడి పోవుచుందురు. మే మచట నుండు దినములలో రెండుమూఁడు వితంతూద్వాహములు దగ్గఱ యింటిలోనే జరిగెను. ఆ పెండ్లి పెద్దలలో మామిత్రులె ముఖ్యులు. మృత్యుంజయరావు ప్రోత్సాహముననే యందొక పెండ్లి జరిగెను. ఆ పెండ్లికుమారునికి పెండ్లికుమార్తెకును పునర్వివాహావశ్యకతను గుఱించి బోధించి, వారి కాలోచనలు చెప్పి, వారి చిక్కులు విడఁదీసి పరిణయము జరిగించినవారు మృత్యుంజయరావు, ఆతని సతీతిలక మగు మాణిక్యాంబయును.

అచట జరిగిన యింకొక వివాహసందర్భమునఁగూడ మా స్నేహితులే యధ్వర్యము చేసిరి. ఆసమయమున నచటికి వచ్చిన పెద్దలను మేమె సన్మానించితిమి. వివాహదినములలో వధూవరులను జూచి పోవుటకు కళాశాలాధ్యక్షులగు మెట్కాపు దొరయును ఆయన సతీమణియు వేంచేసిరి. ఇంటిచూరు పొట్టిగ నుండుటచేత, ఆసమయమున దొరగారికి ముఖముమీఁద కొంచెము గాయమయ్యెను.

విద్యార్థులతోఁ గిటకిట మనుచుండు మా మేడ చూచి పోవుటకు పిన్నలుపెద్దలు వచ్చుచుందురు. నాతమ్ములు చెల్లెండ్రును నన్నుఁ జూచి మాటాడు నెపమున తఱచుగ నా బసకు వచ్చుచు, మేడ మీఁదినుండి చుట్టుపట్టుల యిండ్లు చెట్లును జూచి వినోదించుచుందురు. దూరమునందలి యీ మేడగదిలో నేనుండుట, ఈనిశ్శబ్ద ప్రదేశమున విద్యాపరిశ్రమము చేయుటకుఁ గాక, ఇచ్ఛావిహారము సల్పుటకె యని బాల్యమున నుండువా రనుకొనుచు వచ్చిరి ! నేను రాజాది రాజుల భోగము ననుభవించుచుంటి నని మాపెద్దచెల్లె లానాఁ డను చుండెడిది !

43. పట్టపరీక్ష

నే నిపుడు పట్టపరీక్షకుఁ జెన్నపురి పోవలసియుండెను. తేమ యుబుకుచుండెడి మా పర్ణ కుటీరమునుండి కుటుంబమును ఎదురుగ నుండెడి యింటికిఁ జేర్చినఁగాని నాకుఁ దోఁచలేదు. స్నేహితులతోఁ గలసి నే నంత పట్టణమునకుఁ బ్రయాణ మైతిని. మార్గమధ్యమున పడ వలో "సత్యసంవర్థని"కి వ్యాసములు వ్రాయుచుంటిని. గుంటూరిలో మృత్యుంజయరావునకు బంధువు లుండుటవలన మే మందఱము నచట నొకదినము నిలిచి చెన్నపురి ప్రయాణ మైతిమి. స్నేహితులతో నాడుచు పాడుచుండుటచేత, ఆ దీర్ఘ ప్రయాణమువలని బడలిక నా కగఁబడలేదు. లింగి సెట్టివీథిలో నుండు రామలింగయ్య పూఁటకూళ్ల యింటి మేడలో నామిత్రుఁడు గంగరాజు నివసించెను. అది నా కతఁ డిచ్చి, శీతకాలపు సెలవులకుఁ దాను నర్సాపురము వెళ్లిపోయెను. మృత్యుంజయరావు, అతని భార్యయును, పరశువాకము వెళ్లి, అచ్చట మన్నవ బుచ్చయ్య పంతులుగారియింట బసచేసిరి. నాకుఁ జేరువనె సాంబశివరావు మున్నగు స్నేహితులు విడిసిరి. నా ప్రాఁతస్నేహితులగు వెంకటరత్నము నాయఁడుగారిని, నారాయణస్వామి నాయఁడుగారిని గలసికొని, వారితో సంభాషణములందు తీఱికకాలమును గడుపుచుంటిని. నే నిచట శ్రద్ధతోఁ జదువుచుంటిని. రాజమంద్రి స్నేహితుఁడు పానుగంటి అప్పారావుగారితోఁ దఱచుగ నేను ప్రాఁత పాఠములు తిరుగవేయుచుండువాఁడను.

నా సహాధ్యాయుఁడు రామారావుగారు పరశువాకములో జబ్బుపడుటచేత, అతని నాబసకుఁ గొనివచ్చి, వైద్యుఁడు నారాయణస్వామి నాయఁడుగారిచే మందిప్పించితిని. అతనికి నాకును నాయఁడుగారు తమ సహజకృపావిశేషముతో మందు లిచ్చుటవలన మాకు స్వస్థత గలిగెను. డిశంబరు చివరభాగమున చెన్నపురి బ్రాహ్మమందిరములో "ఆస్తికసమావేశము," బ్రాహ్మసమాజ వార్షికసభలును జరిగెను. సమాజ పత్రికయగు "ఫెల్లోవర్కరు" పత్రికను పున నుద్ధరించుటకు వెంకటరత్నము నాయఁడుగారు సమాజమిత్రులును నిశ్చయించిరి. నేనును వ్రాయుచుందు నని వాగ్దానము చేయకుండినను, నాచేతనైనసాయము చేయ నుద్దేశించుకొంటిని.

మద్రాసులో నేను పలుమాఱు వెంకటరత్నము నాయఁడుగారిని సందర్శించి, ఆత్మోజ్జీవనమును గుఱించియు, దుష్టసంకల్పముల నరికట్టి మనస్సును ఋజుమార్గమున నడిపించు విషయమును గూర్చియు, వారి యమూల్యాలోచనములను గొనుచువచ్చితిని. వైద్యుఁ డయ్యును నారాయణస్వామి నాయఁడుగారికి మత ధర్మములను గుఱించి మంచి యనుభవము గలదు. పలికెడి పలుకులందుకంటె చేసెడి కార్యములందాయన సౌజన్యము బాగుగఁ గానవచ్చు చుండెను. ఏమాత్రము విసివి కొనక, నాకోరికచొప్పున నామిత్రుల కెల్ల నాయన యుచితముగనే వైద్యసహాయము చేయుచుండువారు.

చెన్నపురియందుఁగూడ నేను ఆరోగ్య విషయమున మిగుల జాగరూకతతో నుండువాఁడను. మిగుల మితముగఁ జదువుచు, సాయంకాలమున సముద్రతీరమునఁ జాలసేపు చల్లనిగాలి ననుభవించుచు, నేను దినములు గడపుచువచ్చితిని. దేహమున పుష్టి గలుగుటకును, కనులకుఁ జలువ చేయుటకును నేను వలసిన మందులు సేవించుచుండువాఁడను.

ఎట్టకేలకు పరీక్షాదినములు వచ్చెను. మొదటి పరీక్షాపత్రము చేత నందుకొనిన పావుగంటవఱకును నందలి విషయములు నామనస్సున కెక్కలేదు ! నేనీ పరీక్షయందు తప్పినచో ముందు కుటుంబపోషణ నెట్లు జరుగునా యని నే నాలోచింపఁ దొడంగితిని. అంత నేను మనసును పరీక్షాప్రశ్నల దెసకు మరలించుకొంటిని. పరీక్ష రెండవనాఁడు ప్రొద్దుననే, న న్నదివఱకు సంవత్సరముల కొలఁది వేదించుచు వచ్చిన నేత్రమాంద్యచిహ్నములు గానఁబడెను. వ్యాధి యీనాఁడు పొడసూపెనా, రోజంతయు నాకు దృష్టిమాంద్యము, తలనొప్పియుఁ గలిగి మిగుల బాధపడియెడివాఁడను ! అట్టి పరిస్థితులలో నే నెట్లు ప్రశ్నములకు సమాధానములు వ్రాయనేర్తును ? అందుచే నేను మిగుల వగచితిని. విచారావేశముచే జనించిన దైన్యమున దేవదేవుని సాహాయ్యము నేను వేఁడికొంటిని. ఆదయామయుని యనుగ్రహమున నా కీజబ్బు రా దనియె నేను గట్టిగ నమ్మితిని. నా యాశ్చర్య మేమని చెప్పను ? భగవంతుని పరిపూర్ణానుగ్రహమునను, ఉద్రేక సమయమందలి సంకల్ప బలమునను, చూచుచుండగనే వ్యాధి పలాయిత మయ్యెను. ఇంతియ కాదు. ఈశత్రువుమీఁద సమగ్రవిజయ మీతరుణముననే నాకుఁ జేకూరెను. అప్పటినుండి నేఁటివఱకు మరల నెన్నఁడును నేనీ రుగ్ణతబారిఁ బడలేదు.

ఇంగ్లీషులో మొత్తముమీఁద నేను బాగుగ వ్రాసినను, ఆంధ్ర సాహిత్యమునందు ప్రశ్నలు మిగుల కఠినముగ నుండుటచేత, నే నందపజయ మొందుదు నని భయ మందితిని. కాని, నాస్నేహితులు సాంబశివరావు నరసింహరాయఁడుగార్లవలె నేను పరీక్షలోని రెండవ భాగమును వదలిపెట్టక, మఱువారమునం దాపరీక్షకుఁగూడఁ బోయితిని. 25 వ జనవరినాఁటితో నా పట్టపరీక్ష పూర్తి యయ్యెను. ఆ సాయంకాలమున వ్యాయామమున కొకమిత్రునితోఁ బోయి, గుజిలీ బజారు చూచి, అచట నొకపుస్తకము కొని తెచ్చికొంటిని. ఐనను, నేను పూర్తియగు విరామము నాలుగుదినము లైన ననుభవింప నోఁచు కొననైతిని! సైదాపేటలోని బోధనాభ్యసనకళాశాల యదివఱకె తెఱచిరి. అందుఁ జేరి, యల్. టి. పరీక్షకుఁ జదువవలె నని మృత్యుంజయరావు నేనును ఉద్యమించుకొంటిమిగదా. ఆమఱునాఁడె మేము భయులమును సైదాపేట పోయితిమి. యల్. టి. తరగతి కిటకిట మను చుండెను. పెద్దగుమాస్తాను జూచితిమి. మాయిద్దఱికి నచట ప్రవేశము దొరకఁగల దని యాయన యాశ కలిగించెను. అధ్యక్షుఁడు నాఁడు కళాశాలకు రాకుండినందున, ఆయనను జూచి, తరగతిలోఁ జేరుటకై 30 వ తేదీ సోమవారము తిరిగి వచ్చెద మని మద్రాసు వెడలి పోయితిమి.

కళాశాలలోఁ జేర్చుకొనుటకు అధ్యక్షుఁ డిష్టపడినచో, మమ్మొకవైద్యుఁడు పరీక్షింపవలెను. ఆవిషయమై మాకు సాయము చేయుదు నని వైద్యుఁడు నారాయణస్వామినాయఁడుగారు చెప్పిరి. ఆదివారమునాఁడు సత్యసంవర్థని క్రొత్తసంచికకుఁ గొన్ని వ్యాసములు వార్తలును వ్రాసి, ఇపుడు రాజమంద్రి వెడలిపోవుచుండు స్నేహితులచేత కవి యిచ్చి పంపితిని.

సోమవారము మరల మృత్యుంజయరావు నేనును సైదాపేట పోయితిమి. అచట మమ్ముఁజేర్చుకొనుట కధ్యక్షుఁ డంగీకరించి, మమ్ముఁ బరీక్షింపు మని రాయపేట వైద్యాధికారికి జాబు వ్రాసెను. మఱునాఁడు వైద్యాధికారియొద్ద కేగితిమి. మే మెంత భయపడినను, మే మారోగ్యవంతులమనియె వైద్తుఁడు వ్రాసివేసెను. ఆదినమె మేము సైదాపేట పోయి, అచట కొన్ని పాఠములు బోధించితిమి. జీవితకాల మంతయు విద్యావృత్తిలో నుందు నని నిశ్చయించుకొనియె నే నాకళాశాలలోఁ జేరితిని.

44. ఉపాధ్యాయవృత్తి

రాజమంద్రికళాశాలలోఁ జదువుకాలమున నపుడపుడు భావి కాలమున నే నవలంబింపవలసిన వృత్తినిగుఱించి యాలోచించుచుండె డివాఁడను. సంస్కరణావేశమునకు లోనగునప్పటినుండియు నా కీ విషయమునఁ గొన్ని నిశ్చితాభిప్రాయములు గలిగెను. న్యాయవాదివి కమ్మని మాతల్లిదండ్రులు హితవు చెప్పుచువచ్చిరి. నే నావృత్తి చేకొనినచో, మిక్కటముగ ధనయశస్సంపాదనము చేయుదు నని మాజనకుని తలంపు. కాని, కీర్తిధనాదులమీఁద నాదృష్టి లేదనియు, న్యాయమార్గమున నడచుటకు న్యాయవాది కవకాశము లేదనియు నేను వాదించుచుండువాఁడను. అటు లైనచో నేను కలెక్టరుకచేరిలోఁ గాని మఱియే కచేరీలోఁగాని యుద్యోగము సంపాదించుట మంచి దని మాతండ్రి చెప్పుచుండువాఁడు. దొరతనమువారికొలువున లంచములు పుచ్చుకొనవలసివచ్చును గాన నా కది బొత్తిగ నిష్టము లే దని నే జెప్పివేయుచుండువాఁడను. సర్కారుకొలువున నన్యాయముల కొడి గట్టకయె వ్యవహరింపవచ్చుననియు, శ్రమపడినంతకాలము చాలినంత జీతమును, వార్ధకమున పింఛనును బడయవచ్చుననియు, మాతండ్రి పలుకుచుండువాఁడు. కాని, మతసంఘసంస్కరణోద్యమములఁ బనిచేయుటకు న్యాయవాదుల కవకాశమును, సర్కారు ఉద్యోగులకు స్వాతంత్ర్యమును లభింప దని నేను దలంచి, ఈరెండువృత్తులనుండియు పెడమొగము పెట్టివేసితిని. నాస్నేహితుఁడు కాంతయ్యగారు, రిజిష్ట్రేషను శాఖలో కావలసినంత తీఱికయు స్వతంత్రతయు నుండుట చేతఁ దా నందుఁ బ్రవేశించి, అందు లభించు కొంచెముజీతముతోనే తృప్తినొందెద నని చెప్పుచుండువాఁడు. దొరతనమువారికొలు వనఁగనే యన్యాయమున కెడము గలుగు నని నానమ్మిక. కావున నెవ్విధమునఁ జూచినను, ఉపాధ్యాయత్వమె యుత్తమవృత్తిగ నాకుఁ దోఁచెను. ఈవృత్తిని నాగురువర్యులగు వీరేశలింగముగారును స్వీకరించి ధన్యజీవితు లగుచుండిరికదా ! సంఘసంస్కరణాది విషయములందు వారి పాదముద్రలనే యడుగులు వేయఁజూచునాకును ఉపాధ్యాయత్వమె యుక్త మైనదిగఁ గానఁబడెను. చిన్న నాఁడు ధవళేశ్వరమున నేనొక నెల యుపాధ్యాయునిగ నుంటిని. అపుడు విద్యా బోధనకార్యము నా కానందదాయకముగ నుండెను. నా తత్త్వమునకు సరిపడిన వృత్తి యిదియె యని నేను నిశ్చయించుకొంటిని.

మతసంఘసంస్కరణములలో బాగుగఁ గృషిచేయుటకై స్నేహితులము కొందఱము "ఆస్తికపాఠశాల" నొకటి రాజమంద్రిలో స్థాపించి, అందు నుపాధ్యాయుల మైనచో, "ఏక క్రియా ద్వ్యర్థకరీ" అనునట్టుగ నొకమూల జీవనసంపాదనము, ఇంకొకమూల జీవితాదర్శ సాఫల్యమును, బొందఁగల మని మేము తలపోసితిమి. ఇదివఱకె మండపేటలో నుపాధ్యాయుఁడుగ నుండిన మృత్యుంజయరావు, ముందు కూడ నదేవృత్తిలో నుండ నిశ్చయించి, యీసంవత్సరము రాజమంద్రి కళాశాలలో పట్టపరీక్షఁ బూర్తిచేసి, రాఁబోవుసంవత్సరమందు సైదాపేట బోధనాభ్యసనకళాశాలలోఁ బ్రవేశించి, యల్. టీ. పరీక్షలో జయ మందఁగోరెను. నేనును ఉపాధ్యాయునిగ నుండుటకే నిశ్చయించు కొంటిని. వీరేశలింగము వెంకటరత్నము నాయుఁడు గార్లు మున్నగు స్నేహితులు దీనికామోదించిరి. మాతోఁబాటుగ "ఆస్తికపాఠశాల"లో బనిచేయునుద్దేశముతో, రాఁబోవువత్సరమున సైదా పేట కళాశాలలోఁ జేరుట కింక నిద్దఱు ముగ్గురు స్నేహితులు సిద్ధముగ నుండిరి. కావున నేను పట్టపరీక్ష యైనతోడనే కాలయాపనముచేయక, బోధనాభ్యసన కళాశాలఁ జేరుట కర్తవ్య మని తోఁచెను. పిమ్మట నెటులైనను, మొట్టమొదటి రోజులలో నెక్కువజీతము విద్యాధికుల కనులఁ కగఁబడెడి వృత్తి యాకాలమున నుపాధ్యాయత్వమె. ముందు వెనువెంటనే కుటుంబభారము వహింపవలసిన నాకు, సర్వవిధములను ఉపాధ్యాయ వృత్తి నవలంబించుటయె కర్తవ్యముగఁ దోఁచెను.

స్వతంత్రబుద్ధియు, మనోనిశ్చయమును గలిగి కార్యసాధనము చేయుట విద్యాధికులధర్మ మనుట నిజమె. కాని, నిన్నటి వఱకును తలిదండ్రుల పరిపోషణముననుండి, తన విద్యావిషయమై వారిని మితిలేని వ్యయప్రయాసములపాలు చేసి, ఈనాఁడు విద్యాపరిపూర్తిచేసి, స్వతంత్రజీవనసంపాద్యము చేయుటకు శక్తి వచ్చినతోడనె, వారికి తన యూహాపోహలు సవిస్తరముగఁ దెలుపక, వారి యాలోచనలు సాకల్యముగ నాకర్ణింపక, బాధ్యతాయుతమగు వృత్తిసమస్యను తా నొకఁడె వేవేగముగఁ బరిష్కరింపఁబూనుట, ఏయువకునికిని సాహసకృత్యమె !

ఇంకొక కారణమువలనఁగూడ నా వృత్తినిర్ణయకార్యము, అసమగ్రము, అసంతృప్తికరము నయ్యెను. నే నిపుడు స్నేహితులతోఁ గలసి ఆస్తికపాఠశాలాసంస్థలోఁ బని చేయ నుద్యమించితినిగదా. అందలి యుపాధ్యాయు లందఱితోఁబాటుగ నాకు నచట నీయఁబడెడి స్వల్ప గౌరవవేతనముతో మా పెద్దకుటుంబమునకుఁ బోషణ మెట్లు జరుగఁ గలదు ? నేనుదక్క మాయిల్లు చక్క పెట్టఁగలవా రెవరు నీసమయమున లేరుకదా ? పోనిండు, స్వార్థచింతనము విడిచి, పారమార్థిక బుద్ధితోనె నే నీపాఠశాలానిర్వహణ మను గుండములో దుముక సిద్ధపడితి ననుకొన్నను, నన్నుఁ బెంచి పెద్దవానినిఁ జేసి నా శ్రేయస్సుగోరి, నామీఁద నాధారపడిన తలిదండ్రుల కీసంగతి ధారాళముగ నెఱిఁగించి, ముందు వారిదారి వారు చూచుకొనుఁడని చెప్పి వేయుట న్యాయ్యముగదా ! ఇవ్విథమున ముందలి సాధకబాధకములు బాగుగ నాలోచించుకొనక, పట్టపరీక్షాఫలితములు తెలియకమున్నె, వేవేగముగ నేను బోధానాభ్యసనకళాశాలకుఁ బరుగిడితిని !

45. సైదాపేట

1893 వ సంవత్సరము ఫిబ్రవరి 1 వ తేదీని సైదాపేట బోధనాభ్యసనకళాశాలలో మృత్యుంజయరావు నేనును జేరితిమి. ఆ విద్యాలయములో జ్ఞానకాండమునకంటె కర్మకాండమునకే ప్రాముఖ్య మీయఁబడుచుండెను. ఒక్కొక్కప్పుడు, జ్ఞానసంపాదనమున కచట బొత్తిగ నవకాశము గలిగెడిదియెకాదు ! అచ్చటి నిరంతరకర్మకలాపము విద్యార్థులను వట్టి కీలుబొమ్మలగఁ జేయుచుండెను ! వేకువనె డ్రిల్లు, పిమ్మట డ్రాయింగు. ఈరెండును పూర్తియగునప్పటికి తొమ్మిదిగంటలు. పదిమొదలు నాలుగు నాలుగున్నరవఱకును బడి. పిమ్మట కసరతుగాని, సభగాని, సాయంత్రమువఱకును. మొత్తముమీఁద విద్యార్థి చదువుకొనుట కేమియు వ్యవధి లేకుండెడిది. కసరతు అయినను, శరీరమున కేమియు వ్యాయామ మొసంగని వట్టి డ్రిల్లు. ఇందు సరిగా కీలుబొమ్మలవలెనే సాధకులు వికృతాంగ వైఖరులతో నటునిటుఁ దిరుగుచు కాలక్షేపము చేయుదురు !

ఒకపూట ఉపాధ్యాయులు మాకు బోధింతురు. ఈబదులు తీర్చివేయుటకా యనునట్టుగ మే మింకొకపూట మావిద్యార్థులకు బోధింతుము ! కళాశాలనుండి మేము గ్రహించినది విద్యావిశేషమేమియు నందు లేదనియె ! ఇచటి బోధనాప్రభావ మింతటితో నిలువక, జ్ఞానబోధకపుస్తకములు మేము చదువ నవకాశముకూడ లేకుండఁ జేసెను ! సహాయాధ్యక్షుఁడగు డెన్హాముదొర ప్రవీణుఁడు. ఆయన విద్యావిశారదుఁడును, విశాలహృదయుఁడును. ఆ విద్యాలయమందలి విద్యనిరర్థక మని చెప్పివేయ నాయన వెనుదీయఁడు ! ఇంగ్లండుదేశమందలి విద్యార్థులనుగుఱించియు, విద్యాశాలలనుగుఱించియు, వినోద విషయములాయన వలన వినుచుందుము.

మే మచట మా విద్యార్థులకుఁజేయు బోధనావిధానమును గుఱించి కొంచెము చెప్పవలెను. ఇంచుమించుగ నందఱు విద్యార్థులును నిరక్షరకుక్షులె. విహారార్థమె వారు విద్యాశాలకు వేంచేయుచు, బోధకవిద్యార్థులగు మాబోటి క్రొత్తవారిని జూచి పరిహసించుచు, మాప్రశ్నలను వినుపించుకొనక వాని కపసవ్యసమాధానము లిచ్చుచు, చదువు నేరువవలె నను వాంఛ యేకోశమునను లేక, గురువుల కడ్డంకులు గలిగించుచు వ్యర్థకాలక్షేపము చేయుదురు ! విద్యార్థుల నేపట్టునను గొట్టక తిట్టక మఱి విద్యాబోధన చేయవలె నను విపరీత సిద్ధాంత మా విద్యాశాలయందు ప్రాచుర్యమున నుండుట గ్రహించి, విద్యార్థులు వినయవివేకములు వీడి, సర్వస్వతంత్రులై మెలఁగు చుండిరి. ఇచటి వికారపువిద్యలు విపరీతవిధానములును జూచి, ఏదో యొకవింతలోకమున నుంటి మని కొన్నాళ్లవఱకును మే మనుకొంటిమి.

మృత్యుంజయరావు, అతనిభార్యయును ఇపుడు సైదాపేటలో నొకచిన్న యింటఁ గాపుర ముండిరి. నేను అఱవ పూటకూటింట భుజించుచు, స్నేహితునిబసలో నివసించుచుంటిని. కొలఁదిదినములలో ప్రథమశాస్త్రపరీక్షాఫలితములు తెలిసెను. మాతమ్ముఁడు వెంకటరామయ్య ఆపరీక్షలో నుత్తీర్ణుఁడై, పట్టపరీక్షతరగతిలోఁ జేరెను. మృత్యుంజయరావు తమ్ముఁడు కామేశ్వరరావు చెన్నపురిలో పట్టపరీక్షకుఁ జదువుచు, సైదాపేటలోని యన్న యింట విడిసియుండెను. ఆర్య పాఠశాలాధికారియు, హిందూపత్రికాసంపాదకులును నగు జి. సుబ్ర హ్మణ్యయ్యరుగారు, బుచ్చయ్యపంతులుగారిసిఫారసుమీఁద, బోధనాభ్యసనానంతరమున మిత్రుని నన్నుఁ దమవిద్యాలయమున బోధకులగ నియమింతుమని వాగ్దానము చేసిరి. కొలఁదిదినములకే మాపట్టపరీక్షాఫలితములు తెలిసెను. గణితశాస్త్రమునందు జయ మందుటచేత మృత్యుంజయరావును, మూఁడుభాగములందు నొకమాఱె యుత్తీర్ణ మగుటచేత నేనును, పట్టపరీక్షఁ బూర్తి చేసితిమి. కావున మేము బోధనాభ్యసన కళాశాలలో నుండుట నిశ్చయ మయ్యెను.

పైని చెప్పిన నిత్యకర్మానుష్ఠానమున మునిఁగి మిత్రుఁడు నేనును మేయి 10 వ తేదీవఱకును సైదాపేటలో నుంటిమి. మాకుఁ బ్రియమగు భావికాలమునందలి "ఆస్తికపాఠశాల"నుగుఱించి మే మిరువురము మాటాడుకొనుచుందుము. ఆవిద్యాలయము నెలకొల్పుట సాధ్యమని యొకమాఱును కా దని యొకమఱును మాకుఁ దోఁచుచుండెను. పాఠశాలాస్థాపనము నిజమైనచో, రాజమంద్రిలో ముందు మేము సమాజవిధులు, పత్రికపనులు నెట్లు జరుపుదుమా యని యాలోచించు కొనుచుందుము.

మృత్యుంజయరావు స్మేహపాత్రుఁడె. కాని, యతఁ డొక్కొకసారి యమితమితభాషిత్వ మూని, తన మనస్సునందలి సందియములను సహచరుఁడను సహాధ్యాయుఁడను నగు నాతో ధారాళముగఁ జెప్పకుండెడివాఁడు. పరదేశమున నొకరికష్టసుఖముల కొకరు కావలసిన మా కిరువురకు నందువలనఁ దగినంత సౌహార్దమేర్పడక, మీఁదు మిక్కిలి యరమరలు జనించెను. తక్కిన మిత్రులైనను, మాపొరపాటులను సవరించి, మాకుఁ బొత్తు గలిగింపనేరకుండిరి.

సైదాపేట మద్రాసునకంటె నెక్కువ యారోగ్యప్రదమైనది. ఆకాలమున బోధనాభ్యసన కళాశాలచెంతనే "వ్యవసాయకళాశాల" కూడ నుండెడిది. ఆకళాశాల కనుబంధముగ మంచిపొలము లుండెడివి. పెద్దపెద్దయావులు వర్ధిలుచుండెడివి. స్వచ్ఛముగనుండు నచటియావు పాలును, ఆపొలములలో పైరగు కూరగాయలును మేము కొనుక్కొను చుండెడివారము. ఆవైపునకు షికారు పోవునపుడెల్ల నిర్మలవాయువును బీల్చుచు, మనోహరములగు పూలమొలకలను జూచుచు నుండెడివారము.

సైదాపేట యెంతటి చక్కని నిశ్శబ్దప్రదేశమైనను, మే మచటి సౌకర్యముల ననుభవింప వలనుపడకుండెను. కళాశాలాదినములలో మే మెచటికిని కాలు గదుపుటకు వ్యవధానమె లేదు. నేను అఱవ పూటకూళ్ల వారియతిథిని, అచటివంటకములు మొదట కొన్ని దినములు చోద్యముగ నుండినను, పిమ్మట నోటికి వెగ టయ్యెను. చప్పనికూరలు, సారహీనములగు పప్పుపచ్చడులును, నేయిలేని యన్నమును, అనుదినమును భుజించి, నానాలుక బరడుగట్టిపోయెను ! అఱవవారిసాంప్రదాయములు, ద్రావిడాచారములును జూచి, మా తెలుఁగుకన్నులు కాయలుగాచిపోయెను ! ఎపుడు పాఠశాల గట్టివేయుదురా యని మేము రోజులు లెక్కించుకొనుచుంటిని. తుదకు 11 వ మేయి తేదీని మిత్రులయొద్ద వీడుకో లొంది, నేను రెయిలులో రాజమంద్రి బయలుదేరితిని.

46. వేసవిసెలవులు

నేను రాజమంద్రికి వచ్చుటయే తడవుగా, మరల నచటిసమాజముకొఱకు పాటుపడితిని. "సత్యసంవర్థని"కి వ్యాసములు రచింపఁ బూనితిని. కనకరాజు నేనును సమాజపుస్తకములను సరిదితిమి. నే నాతనితో "ఆస్తికపాఠశాల"నుగూర్చి ముచ్చటించునపుడు, సానుభూతి నగఁబఱచి, మిత్రులమనస్పర్థలు పోఁగొట్ట నాతఁడు ప్రయ త్నింతు ననెను. పాపయ్యగారితోను, నాపూర్వగురువులగు వెంకటప్పయ్యగారితోను, పాఠశాలనుగూర్చి ప్రస్తావింపఁగాఁ, ఆమోదము చూపి సహాయము చేసెద మనిరి.

మే మిట్లు రాజమంద్రిలో "ఆస్తికపాఠశాలా" స్థాపనమును గూర్చిన ప్రయత్నములమీఁద నుండఁగా, ఆ విద్యాలయమును గుఱించి మేము ఔదాసీన్యము వహించియుంటిమని మృత్యుంజయరావు మామీఁద నుత్తరములు గుఱిపించుచుండెను !

మా కుటుంబమునకై మే మిదివఱకు వేఱువేఱుచోట్ల చేసిన యప్పులన్నియుఁ దీర్చివైచుటకై, ఇపుడు గోటేటి రామభద్రిరాజుగారియొద్ద పెద్దఋణము తీసికొని, ఆయనకు మాతండ్రియు నేనును గలసి పత్రము వ్రాసియిచ్చితిమి. ఆసందర్భమున వివిధప్రదేశముల నుండుబంధువులు జూచి వచ్చితిని.

కొంతకాలమునుండి "వివేకవర్థని" ప్రచురింపఁబడుచుండుట లేదు. వీరేశలింగముగారు దాని నిపుడు పునరుద్ధరింప నెంచి, తాను దొరతనమువారికొలువున నుండుటచేత, ఆపత్రిక కొకసంపాదకుని గుదుర్చుట కాలోచించుచుండిరి. నేనిపుడు పట్టపరీక్షలోఁ దేఱి, పత్రికాసంపాదకత్వమునఁ గొంత యనుభవము సమకూర్చుకొనుటచేత వారికన్ను నామీదఁ బడెను. ఈగౌరవమునకు హర్ష మందినను, పత్రికాధిపత్యమునకు నేను సమ్మతింపలేదు. సైదాపేటలో విద్యార్థిగ నుండు నేను రాజమంద్రిలోని వారపత్రికకు సంపాదకుఁడనగుట సమంజసమా యని నాప్రశ్నము. నామకార్థము నేను పత్రికాధిపతి నైనచో, రాజమంద్రిలో తానే పని నంతయుఁ జక్క పెట్టుదు నని పంతులసమాధానము. నూతనపత్రికను తమప్రహసనములతో నింపివేసి, పంతులు నన్నుఁగూడ నభియోగములపాలు చేయు నని నాభయము. తనయం దీమాత్రపు విశ్వాస ముంచనేరని నాబోటివారలతోఁ గలసి సమాజసంస్థలలోఁ దా నెట్లు పని చేయ నేర్తు నని పంతుల బెదరింపు. పెద్దవాఁడగు పంతులమాట శిరసావహింపుమని కనకరాజుని హితోపదేశము. అహంభావ స్వార్థపరత్వముల ప్రేరణమున నే నిట్లు మిడిసి పడుచుంటి నని వా రిరువురు న న్నంత నిందించిరి. అంత్యనిష్ఠురమున కంటె నాదినిష్ఠురమే మేలని నేను స్థిరత్వముఁ బూనియుంటిని. ఆపత్రిక నొకన్యాయవాది నడపుట కంగీకరించె నని తెలిసి, నా కీగండము తప్పుటకు నే నంత సంతోషమందితిని !

11 వ జూన్ తేదీని, ఆఱు నెలలపిల్ల యగు మాచిన్న చెల్లె లేకారణముననో విడువక యేడువ నారంభించెను. దేహముమీఁద దానికి పొక్కులు గానిపించి, బాధ యతిశయించెను. శస్త్రము చేసినయెడల కురుపులు నిమ్మళించు నని నామిత్రుఁడు రంగనాయకులునాయఁడు గారి యభిప్రాయము. దీనికి మాతలిదండ్రులు పెద్దతమ్ముఁడును సమ్మతింపలేదు. శస్త్రము చేయించినఁగాని రోగి జీవింపదని నానమ్మకము. అంతకంతకు రోగి కడు బలహీనయై వేదన నొందుచుండుటచేత మా కెల్లరకు మనస్తాపము గలిగెను. బంధువులప్రేరణమువలన మా తలిదండ్రులు బాలిక నంతట సావరము గొనిపోయి, అచటివైద్యునిచే మం దిప్పించిరి.

"ఆస్తికపాఠశాల"స్థాపనమునుగూర్చి నేను మిత్రులును బాగుగ సంభాషించుకొంటిమి. మృత్యుంజయరావు భార్యను దీసికొని సైదాపేటనుండి యిక్కడకు వచ్చెను. పాఠశాలస్థాపనమునుగుఱించి యతని కెక్కువయలజడి గలిగెను. ఈవిషయమై కళాశాలాధ్యక్షులగు మెట్కాఫ్‌దొరను జూచి మాటాడుట ముఖ్య మని మాకుఁ దోఁచెను. కాని, "వివేకవర్థని" పత్రికాధిపత్యమునుగుఱించి నేజూపిన యసమ్మతిని గంటకించిన వీరేశలింగముపంతులుగారు మాతో వచ్చుట కిష్టపడలేదు. కావున కనకరాజు నేనును మెట్కాఫ్‌దొరదగ్గఱకు వెళ్లి మా నూతనపాఠాశాలనుగుఱించి సవిస్తరముగ మాటాడితిమి. దొరతనమువా రిఁక ముందు రాజమంద్రిలో నున్నతపాఠాశాలావిద్యను తమ చేతులలోనికే తీసికొందురనియు, కావున మాపాఠశాల కచట నవకాశము లే దనియు, ఆయన చెప్పివేసిరి ! మఱునాఁడు నాలుగవ జూలై తేదీని, మే మిరువురమును పంతులుగారి కీవార్త తెలిపితిమి. ఎన్ని కష్టముల నైన సహించి, పాఠశాలను స్థాపించి, అందు మేమందఱమును పని చేసెదమని పంతులుగారితోఁ జెప్పివేసితిమి.

6 వ జూలై తేదీని, మద్రాసు ప్రయాణము తలపెట్టుకొంటిమి. ఈమాఱు భార్యతో నే నచటికి బయలుదేఱితిని. గంగరాజు కామేశ్వరరావులు వారిపత్నులతోఁ బ్రయాణ మయిరి. గోదావరి దాటుటకు మే మందఱమును స్టీమరురేవునకు వచ్చునప్పటికి, మాకు వీడుకోలొసంగుటకు పంతు లచటికి వచ్చి వేచియుండెను. ఆస్తికవిద్యాలయములోఁ బని చేయుదు నని జెప్పినపు డాయన మిగుల సంతోషభరితుఁ డయ్యెను.

మిత్రు లందఱమును గూడి పోవుచుంటిమి గాన, మాకుప్రయాణ కష్టము గానఁబడలేదు. కంభము సమీపమందలి గుహలు వనములు పర్వతములు మున్నగు సుందరదృశ్యములు మా కనులకుఁ బండుగు చేసెను. ఎనిమిదివతేదీని మద్రాసు చేరితిమి. భార్యతో సైదాపేటలోఁ గాపుర ముండి, అన్న గారికి భోజనసదుపాయము చేయవలె నని కామేశ్వరరావు అదివఱకు సంకల్పించుకొనియుండెను. గంగరాజు నాకంటెను నిదాన మెఱుఁగని వేగిరపాటు గల మనుష్యుఁడు. ఇపు డాతని యాలోచనచొప్పున, గంగరాజు కామేశ్వర రావుగార్లు పరశువాకములో బుచ్చయ్యపంతులుగారియింటఁ గలసి కాపురము చేయునట్టుగను, సైదాపేటలోఁ గాపురముండు నేను మృత్యుంజయరావునకు భోజనసౌకర్యము చేయుటకును, ఏర్పాటు లయ్యెను ! సహాధ్యాయుఁడు కొల్లిపర సీతారామయ్యగారు సకుటుంబముగ నుండు నింటిభాగమున మేము సైదాపేటలోఁ గాపుర మేర్పఱుచుకొంటిమి. కురుపులబాధతో మాకడగొట్టుచెల్లెలు చనిపోయెనని తెలిసి మిగుల విషాద మందితిమి.

47. వ్యాధిగ్రస్తత

నేను సైదాపేటలో పాదము పెట్టుటయే తడవుగ నాశరీరమున మరల వ్యాధి యంకురించెను. జ్వరముతో నారంభించినరోగము మెల్లగ నజీర్ణవ్యాధిగఁ బరిణమిల్లెను. నా జఠరము మిగుల బలహీన మయ్యెను. మద్రాసునందలి మిత్రుఁడు నారాయణస్వామినాయఁడు గారు మంచిమందు లిచ్చెనేగాని, రోగములొంగక లోలోననే రగులు చుండెను. నీరసము హెచ్చెను. కొంచెము నెమ్మదిగ నుండినపుడు పాఠాశాలకుఁ బోయి విద్య గఱపుచును, బజారువెచ్చములకై యెండలోఁ దిరుగుచును నుంటిని. ఈమధ్యగ నొకటిరెండుసారులు నాభార్యయు జబ్బుపడెను. ఎటులో నా పనులు చేసికొనుచు, నేను దినములు గడుప నెంచితిని.

"లంకణములలో మనుగుడుపు" అనునట్టుగ, కష్టపరిస్థితులందు నాభార్యకుఁ జదువు చెప్పుటకును, ధర్మసూత్రములు బోధించుటకును నేను బూనుకొంటిని ! నాసహచరుఁడు సీతారామయ్యగారిసతియు జననియు చెల్లెండ్రును నాభార్యయం దమిత ప్రేమానురాగములు గలిగి వర్తించిరి. క్రొత్తనెచ్చెలుల సావాసమున నాభార్యకు విద్యయందభిరుచి కలిగెను. నాగురువర్యులగు మల్లాది వెంకటరత్నముగారు ఆజూలై నెలనుండియుఁ బ్రచురించెడి "తెలుఁగుజనానాపత్రిక" ప్రతులును, "సత్యసంవర్థనీ" పత్రికయును, ఇతరపుస్తకములందలి కథలు మున్నగు నవియును జదువుచు, నాభార్య విద్యయం దభివృద్ధిఁగాంచుచుండెను.

నా నీరసస్థితిని గ్రహించి కళాశాలలో ప్రథమోపాధ్యాయుఁడు నేను బోధింపవలసినపాఠములు తగ్గించెను. ఇప్పుడు నేను ప్రవేశపరీక్షకుఁ జదివెడి యొకవిద్యార్థికి తెలుఁగుమాత్రమే చెప్పవలెను.

రాజమంద్రిలోని క్రైస్తవపాఠశాలాధికారి తనవిద్యాలయము నందు ప్రథమోపాధ్యాయపదవి నా కిచ్చెద నని జూలైతుదిని వ్రాసెను. నా కిది యక్కఱలేదని యానాఁడే యాయనకుఁ బ్రత్యుత్తర మిచ్చి, యీసంగతి కనకరాజునకుఁ దెలియఁబఱచితిని.

కష్టసుఖములందును రోగారోగ్యములందును, పత్రికాపుత్రిక యగు సత్యసంవర్థని యభ్యున్నతికై నేను పాటుపడితిని. ఇప్పుడు నెలనెలయును ఆంగ్లేయవ్యాసములు నేనే వ్రాసి సరిచూచి పంపుచు వచ్చితిని. ఇవిగాక, వార్తలు విశేషములు, ఉల్లేఖనములును నేనే సిద్ధపఱచుచును, అప్పుడప్పుడు ఆంధ్రవ్యాసములు రచించుచునువచ్చితిని. ఇప్పుడు కనకరాజు పట్టపరీక్షకు కొలఁదిమాసములకే పోవలసినవాఁ డగుటచేత, ఆపరీక్ష మొదటితరగతిలోఁ జదువుచుండు నాతమ్ముఁడు వెంకటరామయ్య "సత్యసంవర్థనీ" సంపాదకత్వమున నాతనికి సహాయుఁ డయ్యెను.

రాఁబోవు సంవత్సరమునుండియు రాజమంద్రిలో మొదటితరగతి బోధనాభ్యసనకళాశాల నెలకొల్పఁబడు ననువార్తను ఆగష్టు నాలుగవ తేదీని "హిందూపత్రిక"లో నేను జూచితిని. ఇదియే నిజ మైనచో, మెట్కాఫ్‌దొర చెప్పినట్టుగ రాజమంద్రిలోని యున్నతపాఠశాలా విద్య యంతయు దొరతనమువారి హస్తగత మగును ! అందువలన మాయుద్యమమునకు తప్పక భంగము గలుగును. ఇది చూచిన మృత్యుంజయరావునకును నాకును మతి పోవునటు లయ్యెను. 6 వ ఆగష్టు ఆదివారమున, నేను మృత్యుంజయరావును గలసి చెన్నపురి వెళ్లి, హిందూపత్రికాధిపతియగు సుబ్రహ్మణ్యయ్యరుగారితో సంభాషించితిమి. రాజమంద్రికళాశాలనుగుఱించి నేను వ్రాయువ్యాసము లాయన తన పత్రికయందుఁ బ్రచురించుట కంగీకరించెను. "ఆంధ్రప్రకాశిక" పత్రికాధిపతులగు పార్థసారధి నాయఁడుగారు నిటులె చేయుటకును, నాకుఁ దమపత్రిక నుచితముగఁ బంపుటకును దయతో సమ్మతించిరి.

ఆసాయంకాలము మరల మేము సైదాపేట వచ్చునప్పటికె హిందూపత్రికకు నాప్రథమవ్యాసము పూర్తియయ్యెను ! మఱునాఁడె నే నది యాపత్రికకుఁ బంపివేసితిని. కడుపులోనివికారముతో బాధ నొందుచుండినను, వ్యాసరచనావ్యాసంగమున నే నుంటిని ! ఆదినములలో కామేశ్వరరావుభార్య పరశువాకములో జబ్బుపడుటచేత, ఆమెసహాయార్థమై నాభార్య నచటికిఁ బంపువేసితిని. నా కంతకంతకు శరీరమున వ్యాధి నీరసములు హెచ్చుచుండెను. ఒక నెల సెల వీయుఁడని వైద్యాలయాధికారియొద్దకుఁ బోయితిని. సర్టిఫికేటు "రేపిచ్చెదను, మాపిచ్చెదను" అని న న్నాతఁడు త్రిప్పి బాధించెను. కళాశాల రైటరుమాత్రము సజ్జనుఁడు, శాంతచిత్తుఁడును. నాకు సదుపాయము చేయుదునని యతఁడు వాగ్దానము చేసెను. నావ్యాధి దినదినమును ముదురుచుండెను. నాకు వైద్యుని సర్టిఫికేటు దొరకినను దొరకకున్నను, రాజమంద్రి పోయి ప్రాణములు దక్కించుకొన నేను నిశ్చ యించుకొని, 12 వ ఆగష్టు శనివారమురోజున మృత్యుంజయరావుతో పరశువాకమునకుఁ బయన మైతిని.

ఆకాలమున సుప్రసిద్ధవైద్యులగు వరదప్ప నాయఁడుగారియొద్ద మందు పుచ్చుకొనుచు, చెన్నపురిలోనే యుండు మని బుచ్చయ్యపంతులు గంగరాజుగార్లు నా కాలోచన చెప్పిరి. నాయఁడుగారి మందువలన నేను గొంచెము తెప్పిఱిల్లి, వెంకటరత్నమునాయఁడు గారు మున్నగు మిత్రులను సందర్శించుచుంటిని. కాని, 17 వ ఆగష్టు నుండి నావ్యాధి ప్రకోపించెను. నాయసహాయస్థితిఁ జూచి, నా భార్యయు, మిత్రుఁడు గంగరాజును గన్నీరు తెచ్చుకొనిరి. రాజమంద్రి తిరిగి చూచినఁగాని నాకు దేహస్వాస్థ్యము గలుగదని చెప్పివేసితిని. ఆమఱునాఁటిసాయంకాలము భార్యతో నేను రాజమంద్రి పయనమైతిని. ఈనీరసస్థితిలో నేను బ్రయాణము చేయవలసివచ్చినందుకు మిత్రులు విచారము నొందిరి.

ఐనను, రెయిలులో నాజబ్బు హెచ్చలేదు. కృష్ణానది యావలి యొడ్డున సీతానగరమునందు రెయిలు దిగి, యిసుకలో నడచి, చక్రముల పడవ మీఁద బెజవాడయొడ్డు చేరి, రెయి లందుకొను నప్పటికి, నాకు తలప్రాణము తోఁకకు వచ్చెను ! ఎటులొ రాత్రికి రాజమంద్రి చేరితిమి. "విశీర్ణగ్రామ" కథానాయకునివలె స్వస్థలముననే నేను స్వస్థుఁడను గాఁగోరితిని ! తలిదండ్రులు తమ్ములు చెలియండ్రును నాయెడఁ బ్రేమాతిశయమున నుండిరి.

రాజమంద్రి వచ్చినకొన్నిదినములవఱకును నాకు దేహమున ససిగాలేదు. ఇచట కనకరాజు వీరేశలింగముపంతులు మున్నగుమిత్రులు నన్నుఁ జూచిరి. రంగనాయకులునాయఁడుగారు, తియ్యనిమందు లిచ్చి నా యారోగ్యము చక్కపఱతునని నన్నుఁ బ్రోత్సహించిరి. సత్యసంవర్థనికి వ్యాసములు వ్రాయుట, చందాదారులకుఁ బత్రికలంపుట, సమాజపుస్తకాగారము సరిచూచుట మున్నగుపనులతో దినములు గడపితిని. స్కాటు, షేక్‌స్పియర్ మున్నగు కవులరచనములు చదివి వినోదించుచుంటిని.

ఒక్కొక్కప్పుడు కడుపులోనిబాధ యుద్రేకించి నన్ను వేధించు చుండెను. రంగనాయకులునాయఁడుగారు ప్రీతిపూర్వకముగఁ జేసిన వైద్యమువలన, శరీరమునఁ గొంతస్వస్థత గలుగుచుండెను. పరిపూర్ణారోగ్యము లభించుటకు నే నిచ్చట నింకొకనెల యుండవలయునని స్నేహితు లనిరి కాని, సైదాపేటకళాశాలాధ్యక్షునికోరికమీఁద గాని, నా సెలవు పొడిగింప వీలుపడదని మండలవైద్యాధికారి చెప్పివేసెను. మరల సైదాపేట పోవుట తప్ప నాకు గత్యంతరము లేదు ! నే నంత ప్రయాణసన్నాహము చేసితిని. 10 వ సెప్టెంబరున చెన్నపురి సుఖముగఁ జేరి, కళాశాలలో మఱునాఁడు ప్రవేశించితిని.

48. ఆస్తికపాఠశాల

నేను తిరిగి సైదాపేట సేమముగ వచ్చినందుకు సహచరులు సంతోషించిరి. కళాశాలకుఁ బోయి, యథాప్రకారముగ నాపనులు చూచుకొనుచువచ్చితిని. ఐనను, నాశరీరమునుండి రోగాంకురములు పూర్తిగఁ దొలఁగిపోలేదు. అపుడపుడు నాకు జ్వరము, అజీర్ణమును గానిపించుచునేయుండెను. నాభార్యకుఁగూడ జబ్బుచేయుచునే వచ్చెను. సైదాపేట శీతలప్రదేశ మగుటచేత, తఱచుగ మా కస్వస్థత గలుగుచుండె నని మిత్రు లనుచువచ్చిరి. 26 న సెప్టెంబరు వీరేశలింగముగారు చెన్నపురి వచ్చిరి. వారిని జూచుటకు మేము పరశువాకము పోయితిమి. చెన్నపురి యందలి యితరమిత్రులు నచటి కేతెంచిరి. మఱునాఁడు, పంతులుగారికి మేము విందు చేసితిమి. ప్రార్థనసభలో పంతులుగారు ఉపన్యాసము చేసిరి. పట్టణము పోయి నేను స్నేహితులను జూచి వచ్చితిని. పంతులు గారికిని, మాకును స్నేహితులు విందులు చేసిరి. పంతులు గారి కంత మేము వీడ్కో లొసంగతిమి.

ఈవిందులు గుడిచిన నాకు మరల శరీరమునం దస్వస్థత యేర్పడెను. దీనికిఁ దోడుగ, మావిద్యాసంస్థను గుఱించి గంగరాజునకు నాకును భిన్నాభిప్రాయములు గలిగెను. మనశ్శరీరములు డస్సి నే నంతట సైదా పేట వెడలిపోయితిని.

ఆదినములలో నామనస్సు నమితముగఁ గలంచినవిషయము, "ఆస్తికపాఠశాల"నుగూర్చినదియె. ఆపాఠాశాలా స్థాపనముతోనే నాయుద్యోగసంపాదనాసమస్యయుఁ బెనఁగలసి యుండెను. పాఠశాల యేర్పడు నని యొకమాఱును, లే దని యొకమాఱును మాకుఁ దోఁచు చుండెను. "సంగీతముచేత బేరసారము లుడిగెన్" అనునట్లు, ఆస్తికపాఠశాల నెలకొల్పువిషయమున భిన్నాభిప్రాయము లేర్పడి, మా స్నేహితులలో వైషమ్యములు జనించెను. ఒకచోటనే చదువు సాగించు కొనుచుండెడి మృత్యుంజయరావునకు నాకును పూర్వసౌహార్దసామరస్యములు వేగముగ నెగిరిపోవుచుండెను !

కొలఁదికాలములోనె మే మిచట విద్యాపరిపూర్తి చేసి, యుద్యోగసంపాదనము చేయవలెను. రాజమంద్రిలో "ఆస్తికపాఠశాల"స్థాపిత మైనచో, మిత్రులతోఁ గలసి నే నందు పని చేసెదను. లేనిచో, కుటుంబపోషణమునకై నేను వెంటనే మఱియొక పాఠశాలలో నుద్యోగమును సంపాదింపవలెను. ఈ ద్వంద్వరాహిత్య మైనఁగాని, నాకు ముక్తిగానఁబడదు !

నవంబరు నాలుగవతేదీని మృత్యుంజయరావుతోఁ గలసి నేను పట్టణము పోయితిని. దుగ్గిరాల రామమూర్తిగారుఁ వెంకటరత్నమునాయఁడుగారు, మే మిరువురము నంత పెరంబూరుపోయి, డైరక్టరుగారి యాంతరంగికకార్యదర్శి యగు శేషాద్రిఅయ్యంగారిని గలసికొని, ఆయనతో రాజమంద్రిలో బోధనాభ్యసనకళాశాల యేర్పడుటను గూర్చి సవిస్తరముగ మాటాడితిమి. రాఁబోవుసంవత్సరమునుండియు, రాజమంద్రిలో దొరతనమువారు బోధనాభ్యసనకళాశాల నెలకొల్ప నిశ్చయించి రనియు, దాని కనుబంధముగ నుండు నున్నతపాఠశాలకు పోటీగా నింకొకపాఠశాల నాప్రదేశమున వారు స్థాపింపనీయరనియును, ఆయన నిష్కర్షగఁ జెప్పివేసెను. మేమంత సైదా పేట వచ్చివేసితిమి. నేను నాముందలిప్రణాళిక నేర్పఱుచుకొంటిని. రాజమంద్రిలో "ఆస్తికపాఠశాల" స్థాపించుట కవకాశము లేదు గావున, నే నింకొకయుద్యోగమునకై ప్రయత్నము చేయుటకు నిశ్చయించు కొంటిని. ఈసంగతులు తెలియఁబఱచుచు, వీరేశలింగముగారికి నాసోదరునికిని 17 వ నవంబరున నేను రాజమంద్రికి జాబులు వ్రాసితిని.

వీరేశలింగముగా రంత నింకొక యాలోచన చేసిరి. ఉన్నతపాఠశాల నెలకొల్పుట యసంభవ మైనచో, మాథ్యమికపాఠశాల స్థాపింపఁ గూడదా ? పరిస్థితు లనుకూల మైనపిమ్మట, ఆచిన్న పాఠశాల పెద్దది కావచ్చును. ఈ మాథ్యమిక పాఠశాలాస్థాపననిమిత్తమై పంతులుగారు రెండుమూఁడువేల రూపాయలు విరాళ మిచ్చెదరు - ఈమాఱు నాయుద్దేశ మేమి ? 26 వ నవంబరున నేను మృత్యుంజయరావుతోఁ బరశువాక మేగితిని. అక్కడకు పట్టపరీక్షనిమిత్తమై కనకరాజు వచ్చియుండెను. గంగరాజును కనకరాజును మే మిరువురమును నూతనపాఠశాలను గుఱించి సవిస్తరముగ మాటాడుకొంటిమి. మాధ్యమికపాఠశాలలో నేను బని చేయ నని చెప్పివేసితిని. అంతట కనకరాజు నరసింహరాయఁడు, మృత్యుంజయరావుగార్లు ముగ్గురును గలసి, మాధ్యమికపాఠశాల నెలకొల్పెద మనియు, "సత్యసంవర్థని" ని వారపత్రికగాఁ జేయుదు మనియుఁ జెప్పిరి. సత్యసంవర్థనితో వివేకవర్థనిని జేర్చుట నా కిష్టమా యని వీరేశలింగముగారు నాకు వ్రాసిరి. "ఆస్తికపాఠశాల"లో నా కిఁక జోక్యము లే దనియు, "సత్యసంవర్థని" నెటులైన మార్పవచ్చు ననియు, నేను పంతులుగారికి వ్రాసివేసితిని. రాజమంద్రిలో నొంకొక మాధ్యమిక పాఠశాలనైన దొరతనమువా రంగీకరింప నట్లు తెలిసికొంటి నని మృత్యుంజయరావువార్త గొనివచ్చెను.

నే నంతట వేఱు ఉద్యోగమునకై ప్రయత్నించితిని. రాజమంద్రిలో దొరతనమువారు స్థాపింపనున్న బోధనాభ్యసన కళాశాలలో నాకుఁ బని దొరకవచ్చును. కాని, దొరతనమువారి కొలువులో నేను జేరఁదలఁచుకొనలేదు. రాజమంద్రిక్రైస్తవపాఠశాలలో ప్రథమోపాధ్యాయపదవిసంగతికూడ నింకను స్థిరపడలేదు. యలమంచలి, అమలాపురము పాఠశాలలలో ఖాళీ లున్న వని తెలిసి, నేను దరఖాస్తుల నంపితిని. ఏదేని యొకయుద్యోగములోఁ బ్రవేశించి, కుటుంబపోషణముఁ జేసికొనఁగోరితిని. సైదాపేటకళాశాలలోని నాచదు వంతట ముగిసెను. నేను భార్యయు పరశువాకము వచ్చి, బుచ్చయ్యపంతులు గారియింట విడిసియుంటిమి. అపుడపుడు వ్యాధిపీడితుఁడ నగుచుండియు, నేను బరీక్షకు శ్రద్ధతోఁ జదివితిని. 1894 సం. 22 వ జనవరిని మా యల్. టి. పరీక్షలు జరిగెను. మే మంతట బయలుదేఱి, రాజమంద్రి వచ్చివేసితిమి.

మృత్యుంజయరావున కంతట బెజవాడక్రైస్తవపాఠశాలలో నుద్యోగమై, యతఁడు వెడలిపోయెను. ఇంతలో మే మిరువురమును యల్. టీ. పరీక్ష మొదటిభాగమున జయ మందితి మనువార్త వచ్చెను. అంత మేము రెండవభాగమందలి పరీక్షకుఁ బోయితిమి. మార్చినెలలో పరీక్షా ఫలితములు తెలిసెను. మిత్రుఁడు జయ మందెను ; నేను దప్పి పోయితిని. అంతట, మృత్యుంజయరావు బెజవాడలోని యుద్యోగము వదలి, ప్రథమోపాధ్యాయుఁడుగ యలమంచిలి వెడలిపోయెను. తన పాఠశాలలోనే నా కీయఁబడిన రెండవయుపాధ్యాయపదవి స్వీకరింపుమని యతఁడు నాకు బోధించెను. మనసు గలియని మేమిరువురము నొకచోట నుద్యోగముఁ జేయుట మంచిది గాదని నాకుఁ దోఁచెను. ఈప్రాంతములందు నా కుద్యోగము లభింపనిచో, హైదరాబాదు వెడలిపోవఁదలచితిని. నాయవస్థనుగుఱించి నేను మిగుల విచారపడితిని. అంతట, మార్చి 8 వ తేదీని బందరునుండి నాకు తంతి వచ్చెను. బెజవాడక్రైస్తవపాఠశాలలో డెబ్బదిరూపాయలు వేతనముగల యుద్యోగము నా కీయఁబడెను. దైవమునకు నామీఁద నెట్ట కేలకు దయ కలుగుటకు నేను ముదమందితిని.

9 వ మార్చితేదీని ప్రొద్దున నేను రాజమంద్రినుండి బయలుదేఱి, మధ్యాహ్నమునకు బెజవాడ చేరి, పాఠశాలా ప్రథానోపాధ్యాయులగు శ్రీధన్వాడ అనంతముగారినిఁ జూచితిని. ఆయన సజ్జనులు. నాకెంతో దయ గనఁబఱిచిరి. నేను ఉద్యోగమునఁ జేరితిని. నాకుఁ జూపినకృపావిశేషమునకు దేవదేవునికి హృదయపూర్వక నమస్కృతు లొనర్చితిని.

49. సైదాపేట చదువు

విద్యార్థిదశయంతటిలోను ఈతుదివత్సరమే నా యారోగ్య విషయమున నధమకాలము. సైదాపేటలో నే నుండినయేఁడాది పొడుగునను, నేను రోగపీడితుఁడ నగుచునేయుంటిని. దీనివలన నావిద్య కెంతో భంగము కలిగెను. రెండవ యర్ధసంవత్సరమున కుటుంబముతో నుండిన లాభము నే నంతగఁ బొందలేదు. నా వ్యాధిగ్రస్తతఁ జూచి, నామీఁద జాలిగొని, నాచదువుచెప్పుపని తేలికచేసినప్రథమోపాధ్యాయునిసాయమే నాకు విషమించెను ! ఆంధ్రవిద్యార్థుల కావిద్యాలయమున చదువు చెప్పుట కొప్పగింపఁబడు తెలుఁగుబాలురతరగతులు చిన్నవిగ నుండెను. ఇంగ్లీషు చెప్పుటకు నా కీయఁబడిన మూఁడవతరగతిలో నైదారుగురే విద్యార్థు లుండిరి. పిమ్మట నాకు పని కలిగిన చిన్న పాఠశాలలో నిద్దఱు విద్యార్థులే కలరు. ఆవేసవియెండలకో, నాబోధనమహిమముననో, వీరిద్దఱును తరగతిలో నిద్దురపోయెడివారు ! రెండవ యర్ధసంవత్సరమున వ్యాధి ముదురుటచేత నొకవిద్యార్థి మాత్రమే కల తెలుఁగుతరగతి నా కీయఁబడెను. ఆరోగ్యము చేకూరినపిమ్మటఁ గూడ, నాకు కొలఁదిమందిగల చిన్న తరగతులే సంప్రాప్త మయ్యెను. ఇట్లు నే నాకళాశాలలోఁ గడిపిన యేఁడాదియు తగినంత విద్యాబోధనానుభవమును సమకూర్చుకొన లేకపోయితిని. బోధించుటకు అధిక సంఖ్యగల పెద్దతరగతులు తమ కీయుఁ డని తోడిబోధకవిద్యార్థులు గురువులను బీడించుచుండఁగా, నాకోరిక యెపుడును స్వల్పసంఖ్యగల తరగతులు గావలయు ననియే !

ఈకారణములవలన నేను విద్యాబోధన కౌశలమునందు వెనుకఁ బడియుంటిని. కావుననే సంవత్సరమునందు రెండుమూఁడు సారులు నే నిచ్చిన విమర్శనపాఠములందు నేను గురువులయొక్కయు సహాధ్యాయులయొక్కయు సదభిప్రాయమును బడయనేరకుంటిని. శరీరము నందలి నీరసము దీనికిఁ దోడుపడుటచేత, నాబోధన మెవరికిని నచ్చ కుండెను. సహజమగు వేగిరపాటునకు సభాకంపము, శరీరదుర్బలతయుఁ దోడై, పలుకునకు తొట్రుపాటును, దేహమునకు వణఁకును అట్టిసమయములందు గలిగించెడివి ! ఒకప్పుడు కళాశాలాధ్యక్షుఁడు విమర్శనము చేయుటకై కూర్చుండిన నా సహపాఠులకు నన్నుఁ జూపించి, "గుడికిఁ గొనిపోవు మేఁకపోతువలె నీబోధకుఁ డెట్లు భయమందుచున్నాఁడో పరికింపుఁడు !" అని పలుకునపుడు, నాయలజడి మఱింతహెచ్చెను. అంత నాసహాధ్యాయులలో పెద్దవాఁ డొకఁడు లేచి, "ఇతనికి జబ్బుగా నున్నది. మీ ఱెఱుఁగరు కాఁబోలు !" అని నిర్భయముగఁ జెప్పఁగా, నే నానాఁడు చెప్పవలసిన పాఠము మఱుసటివారమునకు వాయిదావేయఁబడెను. రెండవమాఱుకూడ నే నిట్టి దుస్థితినే యుండుటఁ జూచి, వెనుకటి సహాధ్యాయుఁ డొకయుపాయము చేసెను. నే నపుడు బోధించిన పాఠము బాగుగ లేదని యందఱికిని దెలిసియె యుండెను. ఈయభిప్రాయ మధ్యక్షుఁడు పుస్తకమున లిఖించినయెడల నా కపకారము కలిగెడిది. తమతమ యభిప్రాయము లీయుఁ డని యధికారి సదస్యుల నడిగెను. నాయాశ్చర్య మేమి చెప్పను ! నాపాఠము మిక్కిలి చక్కగ నుండెనని కొందఱును, మార్గప్రదర్శకముగ నుండెనని కొందఱును జెప్పివేసిరి ! ఈశ్లాఘనము వినిన యధ్యక్షుఁడు తనయభిప్రాయమునే మార్చుకొని, నాపాఠము మొత్తముమీఁద బాగుగనే యుండె నని నిర్ణయించెను !

బోధనాభ్యసనకళాశాలలోని పని సామాన్యముగ బూటక మని యందఱు నెఱిఁగినదియె ! ఐనను, నాటకరంగమున కేతెంచిన నటుఁడు, పాత్రానురూపమగు నభినయము చేయకతీఱునా ? బ్రదుకు తెఱవెఱిఁగిన నాసహపాఠులలోఁ బలువురు, బోధనసమయమున లేని వికాసమును చుఱుకుఁదనమును దెచ్చుకొని, మృదుమందహాసములతో బోధనకార్యము నెఱపి, కృతకృత్యు లగుచువచ్చిరి. ఇట్టి కపటనటన మయోగ్యమని యెంచిన నేను, నాబోధనమును తగినంత సొగసుగను సారవంతముగను జేయ ప్రజ్ఞానుభవములును, కనీసము వాంచాబలమైనను లేక, బోధనకార్యమం దపజయము గాంచుచుంటిని ! ఈకారణముననే, అదివఱ కే పరీక్షలోఁగాని పరాజయ మెఱుంగని నేను, యల్. టీ. పరీక్షలోని బోధనభాగమున పిమ్మట ముమ్మాఱు తప్పి, వృత్తిలో నాకుఁ జేకూరెడి లాభమును జాలభాగము గోలుపోయితిని !

50. పత్రికాయౌవనము

ద్వితీయసంవత్సరప్రారంభముననే సత్యసంవర్థనికి యౌవన దశాసంప్రాప్త మయ్యెను. దీని కొకచిహ్నముగ, రెండవసంపుటము నుండియు మాపత్రిక, ముప్పదిరెండుపుటలు రంగుకాగితపు ముఖపత్రమునుగల రమ్యపుస్తకరూపమున విలసిల్లెను. బాహ్యవేషముతోనే పత్రికమిసమిసలు తుదముట్టలేదు. నా యాంగ్ల వ్యాసములందును, కనకరాజునియాంధ్రరచనములందును, చక్కని యభివృద్ధి గాన వచ్చెను. 1892 సంవత్సరము జూలైనెలసంచికలో నే నాంగ్లమున వ్రాసిన "మానవజీవితమందలి త్రివిధశోధనముల"లోనె పత్రికయౌవనపుఁబోకడలు గనఁబడెను. అప్పటినుండియు నా సత్యసంవర్థనీ వ్యాసములు వెనుకటివానివలె మొండిముక్కలు గాక, నిడుదలై, భావవిస్ఫురణ వాక్యసౌష్ఠవములతో విరాజిల్లుచుండెను. ఆ సెప్టెంబరుసంచికలోని నా "అనుష్ఠానికధర్మము"నం దీసంగతి విస్పష్ట మయ్యెను. 93 వ సంవత్స రారంభమునుండి నాయింగ్లీషువ్యాసము లింకను దీర్ఘములై భాషాసారస్యమున నొప్పారుచుండెను. ఆసంపుటములో నేను వ్రాసిన "అంతరంగికమతము." "ఈశ్వరధ్యానము", జాగ్రన్మోక్షము", "స్త్రీస్వాతంత్ర్యము" మున్నగువ్యాసములలో విద్యానుభవములందు దినదినాభివృద్ధి నొందెడి మనశ్శక్తుల వికాసము విస్పష్టమయ్యెను. ఆంగ్లసాహిత్య మనస్తత్త్వశాస్త్రములలో నాకుఁ దెలిసిన నూతనాంశములను, నేను విశ్వసించిన పరిశుద్ధాస్తిక మత సిద్ధాంతములతో సమన్వయము చేసికొని, నా యభిప్రాయములను వ్యక్తీకరించితిని. నాశైలి యిపుడు పొంకమును గాంభీర్యమును దాల్చియుండెను.

సత్యసంవర్థనియందలి యితర రచయితల వ్యాసములందును, అభివృద్ధి గాననయ్యెను. వీరేశలింగముపంతులుగా రదివఱకె విఖ్యాతిఁ జెందినగ్రంథకర్త లైనను, సత్యసంవర్థనికిఁ దఱచుగ వ్రాయుకొలఁది వారివ్రాఁతలును నునుపెక్కెను. 1893 వ సంవత్సరమున వీ రాపత్రికలో, "వర్ణము", "విద్యాధికులధర్మములు" నను దీర్ఘోపన్యాసములు వ్రాసిరి. ఇవి వారియుపన్యాసములలో నెల్ల ప్రథమగణ్యములు. మొదటిది విషయబాహుళ్యముచేతను, రెండవది వాదన పటుత్వమునను, లలితవాక్యసంఘటనమునను బేరెన్నిక గన్నది. మాతమ్ముఁడు వెంకటరామయ్య, 93 మే సంచికలో వ్రాసిన "కేశవచంద్రబ్రహ్మానందులు", 94 వ సంవత్సరరాంభమున వ్రాసిన "నీతిమతములు"ను, అపుడె రమ్యవ్యాసరచన మాతనికిఁ బట్టుపడుటను సూచించుచున్నవి. అందఱి కంటెను కనకరాజుని వ్రాఁతలలోని యభివృద్ధి మిగుల స్పష్టముగ నుండెను. వ్యాసరచనమందును, గ్రంథవిమర్శనమునను, అతనికలము కఱకుఁదనము గాంచియుండెను. 93 జూనులోఁ బ్రచురింపఁబడిన "శ్రీవడ్డాదిసుబ్బరాయకవి విరచిత ప్రబోధచంద్రోదయ విమర్శన" మాతని రచనమె. ఇపు డీతనివ్రాతలు వీరేశలింగముగారి రచనములఁ బోలియుండెను. సామాన్యపఠితల కీయిరువురు రచయితల వ్రాఁతలకును భేదము గానిపించెడిది కాదు !