ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/పునర్విమర్శనము
మించి, కూఁకటి వేళ్ల వఱకును శీలమున వ్యాపించెడిదియె. కాని, దైవానుగ్రహమునను, చిరకాలాభ్యస్త సన్ని యమప్రభావమునను, ఇతరస్నేహితుల సహవాసభాగ్యమునను, ఆచెడుగంతటితో నిలిచిపోయె నని నాకు స్పష్టపడెను !
కళాశాలావిద్యాభ్యాస మిఁకఁ గట్టిపెట్టి, వృత్తిస్వీకారమున కనుకూలించుచదువు చదువుటకు నేను న్యాయశాస్త్ర పుస్తకములు కొన్ని కొని ముందువేసికొని కొన్ని దినములు కూర్చుంటిని. కాని, నామనస్సున కవి వెగటయ్యెను. ఇంతలో పూర్వపరిచితుఁ డొకఁడు ధవళేశ్వరమునఁ దాను జరుపు మాధ్యమికపాఠశాలలో నొకనెల నన్ను ప్రథమోపాధ్యాయుఁడుగ నుండు మని కోరఁగా, వేతనము స్వల్ప మైనను, నే నందుల కియ్యకొంటిని. నా కీయవలసినజీతమైన నాతఁడు సరిగా నీయకుండినను, నేనొకమాసము ఉపాధ్యాయపదవి నుండి, శిష్యుల యనురాగము వడసి, మనస్సునకుఁ గొంత వ్యాపృతి గలిపించుకొంటిని. ఇంకొకనెల యొకవిద్యార్థికిఁ జదువు చెప్పితిని. ఇట్లు, విద్యాశాలను వీడినఁగాని పరిపూర్ణారోగ్యసౌఖ్య మందఁజాల నని యెంచి, చదువునకు స్వస్తి చెప్పి, తుదకు మొదటికే మోసము తెచ్చుకొనసిద్ధపడి, ఎటులో తప్పించుకొని తెఱపినిబడి, పరిపూర్ణారోగ్యభాగ్య మందుటకు చదువు సాగించుకొనుటయె మంచిసాధన మని నిర్ధారణచేసికొని, నేను, 1889 వ సంవత్సరారంభమున మరల కళాశాల చేర నుద్యమించితిని.
11. పునర్విమర్శనము
1889 వ సంవత్సర దినచర్య పుస్తకాంతమున నాజీవితములో నది యుత్తమదశ యని లిఖియించితిని. దీనియందుఁ గొంత సత్యము లేకపోలేదు. గతవత్సరమున నాశీలము కలుష భూయిష్ఠమై, కష్టశోధనలకు గుఱి యయ్యెను. నన్ను గాసిపెట్టిన దేహ మనశ్శత్రు వులమీఁద నిపుడు సంపూర్ణ విజయము సంపాదింప సమకట్టితిని. నా యాత్మరామాయణమున నారణ్యకాండకథ సంపూర్తి కాఁగా, యుద్ధకాండవిధాన మంత నారంభమయ్యెను !
భూతకాల కార్యకారణపరిశీలనమున నొకప్పుడు మన కనులు చెదరిపోవుచుండును. మన దుర్గుణదురభ్యాసములను బరులసహవాసమున కారోపించువిషయమున మన మప్రమత్తత నూనవలెను. దుష్టులనియెడి యొక ప్రత్యేకస్థాయిసంఘ మెందును లేదు ! నేఁటి కోరికలు రేపు క్రియ లగుచున్నవి. నిజ దుస్సంకల్పములను కార్యగతము చేయఁగోరి, తదనుగుణ్యమగు సహవాసము చేసి, మన శీలమున కపు డాపాదించిన నైతికకళంకమును మనము సహచరులమీఁదఁ బడవేయుచుందుము ! ఇట్లు చేయుట న్యాయసత్యములకు దూర మైనను, మన యహంభావమున కమితశమనము గలిగించుచుండును. పరస్పరసఖ్యమున సంక్రమించు సుగుణదుర్గుణములకు నుభయ సహవాసులును సమానభాగస్వాములె. పరులచెలిమివలనఁ దమశీలసౌష్ఠవము చెడె నని మొఱలిడువారు, తమసావాసమున నితరుల కటులె చెడుగు సోఁకియుండు ననియును తమ దుశ్చింతలె పరులమనములందు దుష్టబీజములను వెదజల్లి నారు పెంచియుండవచ్చు ననియును జ్ఞప్తి నుంచుకొనవలెను. "మనబంగారము మంచిదైన కమసాలి యేమి చేయును ?" అను సామెత నీసందర్భమున మఱవఁగూడదు. పరుల దుస్సహవాసమున మనము చెడితి మనుకొనుటకంటె, మన దురుద్దేశములె తోడి దుశ్శీలురను తోడితెచ్చె ననుటలోనె సత్యసారస్యము లెక్కువగఁ గలవు. ఇట్లు తలపోయుట, మానసబోధ గలిగి ఆత్మపరిపాక మందుటకు సహకారముకూడ నగును. అట్లు తలంపకుండుట, నొప్పి యొకచోట నుండఁగా, వాఁత వేఱొకచోటఁ బెట్టిన ట్లగును ! ఇదిగాక, నాతో కోనసీమకు వచ్చిన మిత్రుఁ డొక్కఁడే 1888 వ సంవత్సరమున నాకు సావాసుఁ డనియు, ఇతరస్నేహితు లందఱు నాశ్రేయస్సును గోరిన విశుద్ధప్రవర్తను లయ్యును ఆతరుణమున నాకు దూరస్థు లైరనియును, జెప్ప వలనుపడదు. అపుడును శాస్త్రి వెంకటరావు లిరువురును నాయాంతరంగిక మిత్రులె. పాపయ్యశాస్త్రితోకంటె వారితోనే నాకుఁ బ్రకృతమునను జనవెక్కువ. వారి. సంభాషణములుగూడ వొక్కొకతఱి కామోద్రేక జనకములుగ నుండెడివి. ఆకాలపు విద్యార్థులును "కొక్కోకము", "లండను నగరరహస్యములు" మున్నగు నిషిద్ధపుస్తకపఠనము చేయుటకు వెనుదీయకుండెడివారలె.
ఆసంవత్సరమున నాశీలమునకుఁ గలిగినశోధన, అవాంతరముగ నాపాదించిన యనర్థ మని చెప్ప వలనుపడదు. ఏండ్లకొలఁది జననీజనకులయదుపులో నుండి, సంతతవిద్యాభ్యాసమున కలవాటుపడి, యౌవనప్రాదుర్భావమున నిపు డొకసారిగ స్వేచ్ఛావిహారమును జని చూచిన యొకయువకుఁడు, దినములకొలఁది కట్టుఁగొయ్యనఁ బడియుండి మెడకొలికి సడలినపశువువలెఁ జెంగుచెంగునఁ బరువులిడుచు, మితిమీఱిన స్వచ్ఛందవర్తనమున మెలంగ నపేక్షించుట స్వాభావికమె. సంకల్పరూపమున నిదివఱ కణఁగియుండిన వాంఛా బీజములు, ఇపు డవకాశము దొరకినకారణమున మొలకలెత్తి విజృంభింపసాగును. దీని కొకరి ననవలసినపని లేదు. ఇట్టిపరిస్థితులలో పరులదుస్సహవాసము కేవల నిమిత్తమాత్రమె. కఠినశోధనల కెల్ల వేరు విత్తగు నాంతరంగిక దుస్సంకల్పముల నరికట్టలేక, పాపభారమును పరులబుజములమీఁదఁ బడవేయుట, ఇంటిదొంగను విడిచిపెట్టి బైటిదొంగకై పరుగులిడుటవలె నుండును ! ఈసందర్భమున నింకొకసంగతికూడ గమనింపవలెను. లోకమున బాహాటముగ నలుగురిలోఁ దిరుగ నారంభించినపుడె, మానవ శీలము వికాసము నొందఁగలదు. వివిధపరిస్థితులశోధనకు లోనగునపుడె, మనప్రవర్తన దృఢపడుట కవకాశ మేర్పడును. నీరు చొరని యీఁత దుస్సాధ్యము. లోఁతునీటఁ బడి మున్కలు వేసి కాలుసేతులు కొట్టి తేలి తప్పించుకొనునపుడె యీఁతలోఁ బ్రవీణుల మయ్యెదము. నీతినియమములు లోకానుభవపుఁదాఁకుడునకు నిలిచి గట్టిపడినపుడె శీలసౌష్ఠవముగఁ బరిణమింపఁగలవు.
శూన్యము ప్రకృతివిరుద్ధ మని యాంగ్లలోకోక్తి. తగినంత వ్యాపృతి యుండినఁగాని మనస్సునకు స్వాస్థ్యసౌఖ్యము లనుభావ్యములు గావు. సంపూర్ణస్వేచ్ఛయు, స్వచ్ఛందగమనమును చేతస్సున కానందదాయకము లనుకొనుట వట్టివెఱ్ఱి ! ఏదో యొకసత్పధము త్రొక్కి, కార్యనిమగ్నత నొందునపుడె, మనస్సునకు నిజమగు హాయియు నెమ్మదియుఁ జేకూరఁగలవు. కార్యభరమున నుండువ్యక్తి నుండియె పాపచింతనలు పలాయిత మగుచుండును. ఇదియె యీలోకమున శాంతిసౌఖ్యములకుఁ గొనిపోవు ఘంటాపథము. తక్కినవి పెడదారులు, ముండ్లత్రోవలును.
గతసంవత్సరవిశ్రాంతివలన తల బొప్పిగట్టి, 1889 వ సంవత్సరారంభమున కళాశాలాశాంతిభవనమునే మరల నేను శరణుఁ జొచ్చితిని. శరీరమును రోగమునుండియు, మనస్సు నొడిదుడుకులనుండియుఁ దప్పించుకొనుటకుఁ బరిపూర్ణవిశ్రాంతి సాధనము గా దనియు, నియమపూర్వకవిద్యాభ్యాసము, నియమబద్ధజీవితమును పరమసాధనము లనియు నే నిపుడు గనుగొంటిని.