ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/చర్వితచర్వణము
12. చర్వితచర్వణము
నా పూర్వగురువులగు మల్లాదివెంకటరత్నముగారిని గతసంవత్సరమున నపుడపుడు కలసికొనుచు, నా యారోగ్యమునుగుఱించి యాలోచనలు గైకొనుచువచ్చితిని. ప్రాత:కాలవ్యాయామము, శీతలోదక స్నానము, గోక్షీరపానమును, ఆరోగ్యప్రదము లని యాయన బోధించెను. ఆ డిశంబరు 26 వ తేదీని మా మామగారిసాయమున బొమ్మూరులో నొకయావును కొంటిమి. అది పూట కొకసేరు చిక్కని కమ్మని పా లిచ్చుచుండెడిది. స్నానపానాది దినకృత్యములు క్రమముగ జరుపుకొనుచు, 89 వ సంవత్సరారంభము నుండియు నేను మరల విద్యాభిముఖుఁడ నైతిని. జనవరిమూఁడవతేదీని నేను పుస్తకములు సవరించుకొని, చదువుసన్నాహము చేసితిని. ఇదివఱకే ప్రథమతరగతి పరీక్ష నిచ్చితిని గాన, జనవరి 21 వ తేదీనుండి రెండవ తరగతిలోనికిఁ బోయి కూర్చుండుచువచ్చితిని, గణితశాస్త్రాధ్యాపకులగు తంజావూరు సుబ్బారావు పంతులుగారు శిష్యులను పరియాచకము చేయు నభ్యాసము గలవారు. ఆయన నామీఁద ధ్వజ మెత్తినట్టు నా కిపు డగఁబడెను ! ఇదివఱకు విచ్చలవిడిగా వీధులఁ గ్రుమ్మరుచుంటిననియో, ఒకప్పుడు నేను తమ్మును వెక్కిరించితి ననియో, ఆయన నాపని నిపుడు పట్టించెను ! దేహస్వాస్థ్య మింకను గుదురక తికమకలఁ బడియెడి నాకిది ""పులిమీఁద పుట్ర" యయ్యెను. ఈయనదాడినుండి తప్పించుకొనుటకు నా కంత నొకయుపాయము తోఁచెను. కళాశాల మొదటితరగతి కీయనజోక్యము లేదు. మరల నే నం దేల చేరరాదు ? అట్లు చేసినచో, కొంతకాలము వీరిపోరు తప్పుటయెకాక, వెనుకఁబడి యుండిన ప్రాఁతనేస్తులతోఁ గలసి చదువు భాగ్యము గలిగి, తొందర లేనిచదువులో హాయిగ నింకొకయేఁడు గడిపి, యారోగ్యము చక్కఁ బఱచుకొనవచ్చునని తలంచితిని. ఇది మంచిపనియె యని వెంకటరత్నముగా రనిరి. వెంకటరా విది విని యెగిరి గంతిడెను. అతఁ డిప్పు డీ తరగతిలోనే చేరనుండెను. కావున నేను 10 వ ఫిబ్రవరి తేదీని మా తండ్రిని వెంకటరత్నముగారి యొద్దకుఁ గొనిపోయి, నేను క్రిందితరగతిలోనే చేరుట కర్తవ్య మని యాయనచేఁ జెప్పించితిని ఆయనయెదుట మాతండ్రి సరే యన్నను, ఇంటికి వచ్చి మాతల్లితో నిది చెప్పి, నా మీఁదఁ గోపపడెను. ఇదివఱకే యొకయేఁడు నేను బడి యెగురఁగొట్టి, కొంటెతనమున మరల చదువులో వెనుకంజ వేయఁజూచుటకు వారు నన్ను నిందించిరి. నే నిట్టి కుతంత్రములు పన్నినచో, కుటుంబమును స్వగ్రామమునకుఁ దరలింతు నని మాతండ్రి చెప్పివేసెను !
కాని, నేను గట్టిపట్టు పట్టితిని. కళాశాలాధ్యక్షునియొద్దకు నేను జని, నాదేహస్థితి వారికి విన్నవించి, మరల మొదటితరగతిలోఁ జేరుదు నంటిని. గతసంవత్సరము నేను విద్య విరమించుటకె యచ్చెరువొంది యసమ్మతిఁ జూపిన మెట్కాపుదొర, నా క్రొత్తరాకడకు మఱింత విస్మయ మందెను. కాని, నాయనారోగ్యమునుగుఱించి మరల నే వొత్తిపలుకుటచేత, ఆయన తుట్టతుదకు, "వెంకటశివుడూ ! నీవు నాశిష్యులలో తెలివిగలవాళ్లలో నొకఁడ వని నే నెఱుఁగుదును. ఏధో కష్టము లేనిచో నీవంటివాఁడు క్రిందితరగతిలోఁ గూర్చుండుట యందలి నష్టావమానముల కొడంబడడు. నాకళాశాలలో నీయిష్టము వచ్చినతరగతిలో నీవు కూర్చుండవచ్చును. జీత మీయనక్కఱలేదు. ఇంకఁ బోయిరా !" అని చిఱునవ్వుతో నాకుఁ గళాశాలకుఁ బునస్స్వాగత మిచ్చెను !
నే నంత మొదటితరగతిలోఁ దిరిగి చేరితిని. కొలఁదిదినములలోనె యింటను విద్యాలయమునను నావింతపనిని గుఱించిన విస్మయ మణఁగిపోయెను. కళాశాలకుఁ బ్రాఁతకాఁపు నగుటచేత నన్ను తరగతికిఁ బెద్దగ నియమించిరి. ప్రాఁతమిత్రులను గుశలప్రశ్న చేయుచును, క్రొత్తవారి పరిచయభాగ్య మందుచును, నేను కళాశాలలో సుఖముగ నుంటిని.
ప్రవేశతరగతి యింకను దాటని కొండయ్యశాస్త్రి నా కిపుడును నిత్యసహవాసుఁడు. వెంకటరావు నాతరగతిలోనె యుండువాఁడు కావున, తఱచుగ నాతో నిష్టాగోష్ఠి నుండును. క్రొత్తగ స్నేహము కలిసినవారిలో ముఖ్యులు, పోలవరము జమీందారు రాజా కొచ్చర్లకోట వెంకటకృష్ణారావుగారు, మహమ్మదు బజులుల్లాసాహెబు గారును. ఆవేసవి సెలవులలో, బజులుల్లా వెంకటరావులు నావలెనే రాజమంద్రిలో నుండి, మేము క్రొత్తగాఁ గొనినస్థలములో వేసిన కుటీరమున నన్నుఁ గలసికొనుచుండువారు. ఏదో సాహిత్యవిషయమును గూర్చి మేము ప్రసంగించుచుండెడివారము. బజులుల్లాకు సాహిత్యాభిమానము మెండు. ఉర్దూభాషలోఁ దాను పద్యరచన చేయుచుందునని మాకుఁ జెప్పెడివాఁడు. ఇంగ్లీషులో నావలెనే యనేకపుస్తకములు చదివియుండెను. అతనికి డిక్వెన్సీయం దమితప్రీతి. అతని ప్రేరణముననే నే నపుడు ఆ రచయిత గ్రంథరాజమగు ""నల్ల మందుభాయి" యను పుస్తకమును వినోదమునఁ జదివితిని. కవులు కవిత్వము ననిన నాతఁడు చెవి కోసికొనువాఁడు. నే నావేసవిని డ్రైడను కోల్రిడ్జికవుల పద్యకావ్యములు, మూరుని "లాలారూకు" యును జదివితిని.
అప్పుడప్పుడు మేము షికారుపోవుచుండువారము. బొమ్మూరు కొండదగ్గఱకుఁ గాని, ధవళేశ్వరము ఆనకట్టయొద్దకుఁ గాని మేము నడచిపోయి, సృష్టివైచిత్ర్యములను కనుల కఱవు దీఱునట్టుగ వీక్షించు చుండువారము. నే నిట్లు మరల పాఠశాలలోఁ బ్రవేశించి, విద్యాధోరణిని బడి, నాశరీరదౌర్బల్యమును మఱచిపోఁజూచుచుంటిని. సహపాఠుల స్నేహ సహవాసముల మరగి, లోకము పాపభూయిష్ఠ మని విస్మరించెడి వాఁడను. కళాశాలలో నే నిపుడు వడ్రము నేర్చుచు, కసరతు చేయుచు, సెలవురోజులలో షికారుపోవుచు, శరీరవ్యాయామమును గుఱించి యెక్కువగ శ్రద్ధ వహించియుంటిని. తల్లి యింట నాకుఁ బ్రత్యేకముగ భోజన సౌకర్యము లొనఁగూర్చుచుండెడిది. సద్గోష్ఠి సత్సహవాసములకుఁ దోడు నే నీకాలమున ననుదిన ప్రార్థనములు చేయుట కభ్యాసపడితిని. ఇ ట్లిన్నివిధముల నాయారోగ్య సౌఖ్యములు పెంపొందుటకు సాధనకలాప మేర్పడియుండెను.
13. నియమబద్ధజీవితము
1889 వ సంవత్సరము జూలై 28 వ తేదీని నాప్రియమిత్రుఁడు కొండయ్యశాస్త్రితోఁ గూడి నేను టాడు విరచితమగు "యువజనహితోపదేశము" అనునొక యాంగ్ల పుస్తకమును మిగుల తమకమునఁ జదివితిని. మాబోటి విద్యార్థుల కుపయుక్తములగు ననేక యంశము లిందుఁగలవు. వానిచొప్పున వర్తనప్రణాళిక నేర్పఱచుకొని యాచరణమునకుఁ గడంగినచో, సర్వానర్థకములకును మూలకందమగు ప్రాలుమాలికను పారఁద్రోలి, పాటుపడుట కలవాటుపడి, శ్లాఘనీయముగ జీవిక గడపవచ్చు నని నాకు స్పష్టపడెను. నాఁటినుండియే యేతద్గ్రంథబోధన మనుసరింప నిర్ధారణము చేసికొంటిని. విధికార్య నిర్వహణమందు కాలనియమమును ఖచితముగఁ బాటింపవలయు ననియే యందలి ముఖ్యవిధానము. మఱునాఁడు చేయవలసినపను లీనాఁడే నిశ్చయించుకొని, ఒకచిన్న పుస్తకమునం దవి యుదహరించి, సమయాను