ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/పెండ్లి బేరములు

వికీసోర్స్ నుండి

నను, వీరభద్రరావుగారి "విద్యాసాగరముద్రాలయము"నఁ బనులు సరిగా జరుగకుండుటవలనను, మేము పత్రికాప్రకటనమును విరమించు కొంటిమి !

మా యత్తగారికి జబ్బుగా నుండె నని జాబు వచ్చుటచే భార్యను రాజమంద్రి పంపితిని. ఆమెకుఁ గొంచెము నెమ్మది గలిగె ననియు, తమ్ముఁడు కృష్ణమూర్తిభార్య చనిపోయె ననియును నా కంతట లేఖ వచ్చెను. ఈబాలిక మరణవార్త విని మిగుల విచారపడితిని.

24. పెండ్లి బేరములు

ఇదివఱకే మాతలిదండ్రులు బెజవాడ వచ్చి నాతో నుందుమని వాగ్దానము చేసిరి కాని, యట్లు జరుగలేదు. దీనికి ముఖ్యకారణము, అందఱును బెజవాడ చేరినచో, తమమాట చెల్లదని పెద్దవారును, తమ మరియాద నిలువ దని చిన్నవారును, స్త్రీజనము తలంచుటయె ! ఆదినములలో మాతమ్ములలో నొకరు నాకు రాజమంద్రినుండి వ్రాసిన యీక్రింది యుత్తరము దీనికి వ్యాఖ్యానప్రాయముగ నున్నది : - "నీవు తెలివిహీనుఁడవు కాఁబట్టి యితరులమాయలలో పడుచున్నావు ! నీ అత్తగారు నెమ్మదిగనే యున్నది. వదెన నిపు డిచటికి నీవు పంపుట వట్టి అనగత్యకార్యము ! * * * * "

మాయింటను అయ్య గారివారియింటను స్త్రీ లీసమయమున లేకపోవుటచేత, రెండిండ్లలోను పురుషపాకమే ! దాని మాహాత్మ్యమున 5 వ తేదీని తెలవాఱుజామున అజీర్ణ సంబంధమైన పోటు నాకు కడుపులో బయలుదేఱెను. ఆనాఁ డంతయు మంచమెక్కితిని. వైద్యులు వెంకటసుబ్బయ్యగారు వచ్చి మందిచ్చిరి. భార్యను బంపుఁ డని నేను రాజమంద్రి తంతి యిచ్చితిని. తంత్రీసమాచారము విని మానాయన దు:ఖపరవశుఁడై, నన్ను గుఱించి వివరములు వ్రాయనందుకు సీతాపతి మీఁద కోపపడెనఁట. ఒకటి రెండురోజులలో నాఁడువాండ్రు బెజవాడకు వచ్చిరి.

ఈ కడుపునొప్పి నెమ్మదిపడిన కొన్ని దినములవఱకును నాకు నిస్సత్తువుగ నుండెను. కావుననే కాకినాడలో జరిగిన "ఆస్తికసమావేశము"నకు నేను వెళ్ల లేకపోయితిని. అచటికిఁబోయి 11 వ తేదీని తిరిగివచ్చిన వీరభద్రరావుగారు సభాసమాచారములు కొనివచ్చెను. మఱుసటిసంవత్సరసభ బెజవాడలో జరుపుటకు తీర్మానించిరి.

ఆ సంవత్సరమున బెజవాడపాఠశాలకు క్లార్కుదొరయే వ్యవహారకర్తగ నుండినట్లు కనఁబడుచున్నది. 11 వ ఏప్రిలు తేదీని పాఠశాలలో జరిగిన యుపాధ్యాయులసభలో, ప్రతి యుపాధ్యాయునిపనియు నెక్కువ చేయవలె నని క్లార్కుదొరయానతి యయ్యెనని ప్రకటింపఁబడెను.

14 వ ఏప్రిలు తేదీని నాకు తమ్ముఁడు కృష్ణయ్య వ్రాసిన జాబులో, ఆనెలలోనే తన ద్వితీయవివాహము చేయవలె నని మాతలిదండ్రులు సంకల్పించి, మంచి వరదక్షిణకొఱకుఁ బ్రయత్నించుచుండిరని యుండెను ! నామాట మావాండ్రు ధిక్కరించి రనియు, ఇట్టి యకృత్యములవలన కుటుంబమున కపకీర్తి వాటిల్లు ననియును, నేను మిగుల వగచితిని.

17 వ ఏప్రిలు తేదీని నాదినచర్య పుస్తకమునం దిట్లున్నది : - "బార్యసానుభూతి లేనికారణమున బ్రాహ్మమతస్వీకారము చేయవలె ననెడియాశ నామనస్సున నణఁగిపోవుచున్నది. ఎంతకాలము నేను సంఘమువారి భయముచే నిట్లు కృంగిపోవలెను ? నేను బ్రాహ్మసామాజికుఁడనై, భగవత్సేవ చేయుచు, అంతరాత్మయాదేశములచొప్పున జీవితము నడపుకొనవలె నని నాయుత్కృష్టాశయము. దీనికిఁబ్రబల విఘాతము గలుగుచున్నది!"

19 వ ఏప్రిలున వెంకటరామయ్య బెజవాడ వచ్చెను. భార్య పోయిన నెలలోనే తమ్మునికిఁ బెండ్లి తల పెట్టితివేమని నేను వానిని జీవట్లు పెట్టినను, పెద్దవారల నిర్ధారణమునకు పిన్న వారలను నిందించుట న్యాయము కాదని నేను గ్రహించి, పిమ్మట విచారించితిని. నా కోరికమీఁద వెంకటరామయ్య తాను బెజవాడ వచ్చి యిచటనే న్యాయవాదిగ నుందు నని చెప్పెను. 26 వ తేదీని అతఁడు రాజమంద్రి వెడలిపోయిను.

కొన్నిదినములకు నా కీ క్రిందియుత్తరము మా తండ్రిగారి యొద్దనుండి వచ్చెను.

"శ్రీరాములు. చిరంజీవులయిన మాకుమాళ్లు రాయసం వెంకటశివుడును సుబ్బారాయుడు చిరాయువులుగాను దీవిస్తిమి -

"వెంకట్రామయ్యవల్ల అంన్ని సంగతులున్ను తెలిశ్నివి. కృష్ణయ్యవివాహమునుగురించి యిదివర్కు 10 15 సంబంధములు వచ్చినవి. మనకు అనుకూలం లేనివారితో ప్రస్తుతం తలంపులేదని చెప్పినాము. కొంన్ని సంబంధములు తిర్గిపోయి మరివకర్కి ఏర్పర్చు కుంన్నారు. రెండుమూడు రోజులకిందట తాంన్యాడ గంగరాజు గారివద్దనుంచ్చి వకసంబంధం రాబడినది. వారు చాలా మర్యాదస్తులు. పిల్ల 11 సంవత్సరములు కలదై బహు మంచిదనింన్ని, ముఖ్యంగా ఈచింన్న దాంన్ని కృష్ణయ్యకు యివ్వడంకు గంగరాజు శెలవుప్రకారం తాను నరసాపురంనుంచి వచ్చినా ననిన్ని, యేవిధమయ్ని లోట్లూ లేకుండా యెక్కడ వివాహం చాయమంటే అక్కడ వివాహం చేస్తామనింన్ని, శీఘ్రంగా రోజులలో జర్గవలశియుంటుం దనింన్ని చెప్పినాడు. కాబట్టి వ్రాశేది యేమంటే, యీసంబంధం చేసుకోవడముకు మీఅప్పకున్ను నాకున్ను కోరిక కలిగియుంన్నది. దయవీక రాజీకములచేత ఈ సం. రం కృష్ణయ్య పరీక్ష ప్యాసైనా కాక పోయినా, యీకార్య అయివుంటే మంచిది. మనం చివర్కు ధవళేశ్వరంలో చాయమన్నప్పటికీ, చాయతల్చుకునియున్నారు. మనం వప్పుకుని అంగీకరించి ఉత్తరం వ్రాశినట్టుగానే, ముహూర్తం పెట్టి స్తిరపరుస్తుంన్నారు. నీవు 5, 6, రోజులలో యిక్కడికి వచ్చి 10, 15 రోజులలోపల ఈవివాహం చేయించి, తరువాత వెంటనే వెంకట్రామయ్య నీవుంన్ను బెజవాడ వెళ్ల వచ్చును. * * * * *

"మనకు శ్రమలేకుండా పిల్లవానికి వివాహం తటస్తమయినప్పుడు మానివేశి, తటస్తం కానప్పుడు ప్రయత్నం చాయడం యింత్తకంటె లోపం లేదు. ఈపిల్ల రెండుమూడుసంవత్సరములకు గాని కాపరముకు రాదు. అప్పట్కి కృష్ణయ్యకు కొంన్ని పరీక్షలు కాబడును. కృష్ణయ్యకు యిస్తామని వచ్చిన సంబంధముల పిల్ల లకు, మేము వప్పుకోనివాళ్లకు 1, 2, కి ధవిళేశ్వరంలో 4 రోజులు యీలోగా వివాహములు కాబడ్డవి. గన్కు అంన్ని సంబంధములుంన్ను కూడా యిదేప్రకారం దాటిపోగలవు. యీకార్యం అయ్ని తరువాత యింత్త తొందరకార్యములు తక్కినవి కావు. గన్కు యీవుత్తరం అందిన వెంటనే నీ జవాబు పంప్పిస్తే, నరసాపురం గంగరాజుగారి యిలాకా వారితో మాట్లాడి ముహూర్త నిర్ణయం యేర్పరుస్తున్నాము. యీ కార్యం చాయకుండా వుంటే మాత్రం మనకు లాభం లేదు. చేశినందువల్ల వచ్చే లుగసాను లేదు. కార్యం కావడం చాలా విశేషమై యున్నది.

రా. సుబ్బారాయుడు."

ఈ పైయుత్తరమునకు నే నేమి సమాధాన మిచ్చితినో నాకు జ్ఞప్తి లేదు. వేసవి సెలవులలో నేను రాజమంద్రి వచ్చినప్పుడు, అందఱమును గలసి మాటాడుకొని నిశ్చయింపవచ్చునని నేను వ్రాసి యుందును. కృష్ణమూర్తి ద్వితీయవివాహము వెంటనే చేయవలెననియు, నర్సాపురపు సంబంధమే నిశ్చయింపవలెననియు, మా తలిదండ్రుల దృఢసంకల్ప మని లేఖవలన స్పష్టము కాఁగలదు.

25. ఇంటితగవులు, మండలసభలు

ఈసమయమున మేము నివసించెడి బెజవాడ యింటిని గుఱించి కొంత వివాదము కలిగెను. నేను చెన్నపురి వెళ్లి పోవునపుడు, ఆయింటిని రెండవభాగమున నుండిన రామస్వామి శాస్త్రిగారి వశముఁ జేసితిని. కాని, మరల నిచ్చటికి వచ్చుటకు స్థిరపఱచుకొనిన వెంటనే, ఇ ల్లెవ్వరికి నీయవల దని వారికి వ్రాసివేసితిని. ఈలోపుగ నాయన యింటిలోని కొంతభాగమును సుబ్బారాయఁడుగారి కిచ్చినను, నేను జెన్నపురినుండి వచ్చినతోడనే, నాభాగము నాకు వదలివేసిరి. కాని, యంతకంతకు నాకును శాస్త్రిగారికిని అభిప్రాయభేదము లేర్పడెను. దీనికిఁ గారణము, ఆఁడువారల కలహములే ! మా బంగాళాలో నిపుడు నివసించు నారీమణుల సంఖ్య మూఁడు, ఏర్పడిన కక్షలు రెండు ! ఒక కక్షలో చిన్న వారలగు నా