ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"చిప్పలశివరాత్రి"
ముందుగ 250 రూపాయిలు కావలసివచ్చెను. సోదరినగలు కుదువఁ బెట్టినచో నీసొమ్ము మాకు దొరుకునని తెలిసెను. దీనికి చెల్లెలు సమ్మతించుటచేత, నగలతాకట్టుమీఁద సొమ్ము బదులు తెచ్చి యప్పులు తీర్చివైచితిమి. తలిదండ్రులను వెనుక నుండి రమ్మని చెప్పి, 22 వ తేదీని మామగారితో నే నేలూరు పయనమైతిని. అక్కడ వీరభద్రరావుగారిని గలిసికొని, వారితో మాటాడితిని. భూములు కొన్ని యమ్మివైచి, ఆ సొమ్ముతో ముద్రాలయము నొకటి కొని బెజవాడలో దాని నెలకొల్పెదనని ఆయన చెప్పిరి. నాకును గొంత సొమ్ము బదు లిచ్చెద మనిరి. మేము ఉభయులమును వారపత్రికను స్థాపింపఁబూనుకొంటిమి.
అంత నేను బెజవాడ వచ్చితిని. మద్రాసులో నారంభింపని న్యాయశాస్త్రపరీక్ష చదువులు బెజవాడలో నే నిపుడు మొదలు పెట్టితిని ! దాసుగారి నడిగి న్యాయశాస్త్రగ్రంథ మొకటి తెచ్చి ముందు వేసికొని కూర్చుంటిని. శరీరస్వాస్థ్యమునకై తొట్టిస్నానములు చేయఁబూనితిని. కాలక్రమమున మన యూహలందును క్రియల యందును మనకే విడ్డూరముగఁ దోఁచు విచిత్ర పరిణామ మొక్కొక తఱి నేర్పడుచుండెను !
23. "చిప్పలశివరాత్రి"
1898 జనవరి మొదటితేదీని మా యప్పులపట్టికను నేను దిరుగ వేసితిని. వడ్డితో మే మీనాఁటికి పద్దుపత్రముల మూలమున నీయవలసిన యప్పులును స్నేహితుల చేబదుళ్లును గలసి, సుమారు నాలుగువేల రూపాయి లగఁబడెను ! ఎట్లీ యప్పు తీర్చివేయఁగలమా యని నేను తల్ల డిల్లితిని. ఆరోజు దినచర్యపుటలో నే నిట్లు లిఖించితిని : - "ఈ సంవత్సరారంభము నా కెంతయు నశుభప్రదముగ నున్నది. మరణ మొకటియే నా బాధానివారణము చేయఁగలుగు నని తోఁచుచున్నది ! దేవుని యాస్తిక్యమునందు నాకు నమ్మిక తొలఁగలేదు గాని, పరమాత్మునిమహిమ మేమియు నాయాత్మలో ప్రతిఫలన మగుట లేదు !"
నేనీ సంవత్సరము చేయవలసిన కార్యములు రెండు గలవు. ఒకటి న్యాయశాస్త్రసంబంధమగు చదువు. రెండవది, నూతనవార్తా పత్రికాప్రకటనము. ఇదియును, పాఠశాలలోనిపనియు, "జనానా" "సత్యసంవర్థనీ" పత్రికాసంపాదకత్వమును గలసి నాకు దుర్భరభారముగఁ దోఁచెను !
జనవరినెలలో బెజవాడలో విశూచి ప్రబలియుండెను. మాయింట నొకభాగమున నుండు శ్రీఅయ్యగారి సుబ్బారాయఁడు గారి జవాను సుబ్బయ్యకు 8 వ తేదీని ఈవ్యాధి సోఁకెను. అంత వానిని వైద్యాలయమునకుఁ గొనిపోయితిమి. అక్కడ వాఁడా రాత్రి చనిపోయెను. చందావేసి వానికి దహనాదికర్మలు జరిపించితిమి.
కాబెట్టు విరచితమగు "యువజనహితోపదేశము" అను నాంగ్ల పుస్తకము నే నిపు డెంతో తమకమునఁ జదివితిని. ఈరీతి నాంధ్రమున గ్రంథరచన చేయ నే నభిలషించితిని. కాని, స్వానుభవమున నిన్ని యంశములు నా కెట్లు సమకూరఁగలవు ? నా యనుభవ మసమగ్రము, భావవిస్ఫురణము సంకుచితమును ! ముందైన సుఖదినములు గాంచ నోఁచితినా యని నేను బలవించితిని.
సతి కాంగ్లము బోధింప నే నాసక్తితో నుంటిని. కాని, యామెకుఁ జదువునం దిష్టములేదు. విద్యావతులగోష్ఠికంటె నజ్ఞాన స్త్రీల సహవాసమే యామె కభిమతము ! నా తమ్ముఁడు సూర్యనారాయణ లోవరుసెకండరీపరీక్షలో విజయమంది విజయవాడలోఁ జదువుటకై జనవరి 29 వ తేదీని వచ్చెను. బావమఱఁది సీతాపతియు నిక్కడఁ జదువఁగోరుచున్నాఁడు కాని, తలిదండ్రు లాతనిజీతమైన నీయఁజాల రని చిన్నతమ్ముఁడు చెప్పెను. నే నా నాహ్వానింపఁగా సీతాపతి 5 వ ఫిబ్రవరి బెజవాడ వచ్చెను. కృష్ణయ్యభార్యకు మిక్కిలి జబ్బుగా నుండెనను వార్త నాతఁడు గొనివచ్చెను. మాపాఠశాలలో నీసంవత్సరము ఐదుగురు ప్రవేశపరీక్ష యందు జయ మందుటకు మేమందఱము సంతసించితిమి.
వీరభద్రరావుగా రిచటికిఁ గొనివచ్చెడి ముద్రాలయమున కొక్క వసతి గృహము సంవత్సరమునకు నూఱురూపాయిల బాడుగకుఁ గుదిర్చితిమి. కాని, 8 వ ఫిబ్రవరిని ఆయన ముద్రాలయమును బెజవాడకుఁ గొనిరాఁగా, అదివఱకు బస యిచ్చెద ననిన పెద్దమనుష్యుడు వెనుకకు తగ్గెను ! అంతఁ గొన్ని రోజులకు వేఱొకయిల్లు సమకూడెను. ఈ ముద్రాక్షరశాలకు పని సంపాదించుట కెంతయో ప్రయత్నించితిని. నా "జనానాపత్రిక"నింతటినుండి యీముద్రాలయముననే ప్రచురించుట కేర్పఱిచితిని.
న్యాయవాదిపరీక్ష నిచ్చి వెంకటరామయ్య ఫిబ్రవరి 11 వ తేదీని మద్రాసునుండి వచ్చెను. కుటుంబవ్యవహారములను గుఱించియు, అప్పులతీర్మానమును గూర్చియును మేము మాటాడుకొంటిమి. రేలంగి రాజమహేంద్రవరములలోఁగల మాయిండ్ల నమ్మివైచి, ఋణము నిశ్శేషము చేయవలెనని నాపట్టు. ఇది యిట్లుండఁగా, బెజవాడ గవర్నరుపేటలో వేయిగజముల స్థలములోఁ గట్టిన యొకయిల్లు 800 రూపాయలకు విక్రయమునకు వచ్చెను. అది కొనుటకు నే నభిలషించితిని. మిత్రుఁడు రాజారావు నడుగఁగా, ఆయింటి తాకటు మీఁదనే నాకుఁ గావలసిన సొమ్మిచ్చెద నని యతఁ డనెను. వేగమే బెజవాడ రమ్మని యింటియజమానునికిని మాతండ్రిగారికిని తంతి నంపితిని. వారిరువురును వచ్చిరి. కాని, పూర్వ మొకవితంతువు అమ్మిన స్థలములో నీయిల్లు కట్టఁబడుటచేత, ఇంటి హక్కునుగుఱించి ముందు చిక్కులు రావచ్చునని భీతిల్లి, యిల్లుకొనుట మానుకొంటిమి.
ఇటీవల రాజమంద్రిలో నగలు కుదువఁబెట్టి తెచ్చినసొమ్ము నేను జెల్లింపనేలేదు. కాఁబట్టి నా కెటులో సొమ్మీయ సిద్ధమైన రాజారావునొద్ద 300 రూపాయిలు బదులు తెచ్చి, నగలు విడిపింపుఁడని యాసొమ్మును రాజమంద్రికిఁ బోవుచుండెడి మాతండ్రికిఁ దమ్మునికి నిచ్చివేసితిని.
ఆరోజులలో నాకుఁ దగినంత చిత్తశాంతి లేకుండెను. చేయుపనియు చదివెడిచదువును ఎక్కువయై, నాకిట్లు మనశ్శాంతి తొలఁగ లేదు. మీఁదుమిక్కిలి వానివలన నా కొకవిధమగు విరామమే కలిగెనని చెప్పవచ్చును. అట్టి కార్యవ్యాజమే లేకున్నచో, స్థితిగతులను గుఱించియు మా దురవస్థను గూర్చియు తలపోసి నా మనస్సు విచార పంకమున మఱింత గాఢముగ మునిఁగిపోయెడిదియే ! కనులముందట నే యప్పు పెరిఁగిపోవుచుండుటయును, చేత తగినంతసొమ్ము లేకుండుటయును నా యలజడికిఁ గొంత కారణము. దీనికిఁ దోడుగ నింట సతికిఁ బతికిని సామరస్యము లేకుండెను. బుద్ధిపూర్వకముగ నే నప్పులపాలగుచుంటినని భార్య యపోహము ! ఇంగ్లీషు నేరువు మనియు పూర్వాచార పరాయణత్వము వీడు మనియు నే నామెను శాసించు వాఁడను. ఒక్కతెయె యింటిపనులు చేసికొనవలసివచ్చిన యామె కీచదువు కంటకసదృశమయ్యెను. సతి ప్రాఁతయాచారముల నంటి పట్టుకొని యుండుట నాకుఁ గడు దుస్సహముగ నుండెను. కావున "ఇంటిలోనిపోరు ఇంతంత గాదయా"అను వేమనయోగిపలుకుల సత్యము మాకు ద్యోతకమయ్యెను. ఇట్టిగృహకల్లోల మొకటి ఫిబ్రవరి 19 వ తేదీని శివరాత్రినాఁడు మాకు సంభవించెను.
శివరాత్రికి కృష్ణస్నానమునకై వేలకొలఁదిప్రజలు చుట్టుపట్టుల నుండి బెజవాడకు వచ్చుచుందురు. ఆనాఁడు విశాలక్షమ్మగారితోఁ గలసి నాభార్య యేటికి స్నానము చేయఁబోయెను. ఇది నా కెంతయు నసమ్మతము. గృహిణిమీఁద గసి తీర్చుకొనుటకె యామధ్యాహ్నము నేను పింగాళీకంచమున నన్నము తింటిని ! నదీస్నానము చేసివచ్చిన తా నీగాజుచిప్పలు కడిగి మైలపడినది గావున, నాభార్య యానాఁడు భుజింప నని చెప్పివేసెను. దీనితో నాయాగ్రహము ప్రజ్వరిల్లెను. తా నుపవాసము చేయుట యయుక్తమును, నా కసమ్మతము నని నేను గట్టిగఁ జెప్పి కోపించుటచేత, ఎట్టకేల కామె రాత్రి భుజించెను. ఈపుణ్యదివసము మాయింటఁ గేకలతోను రోదనముతోను జరిగిపోవుటచేత, దీనికి నా చిన్ని తమ్ముఁడు సూర్యనారాయణ "చిప్పల శివరాత్రి" యని నవ్వుటాలకుఁ బేరుపెట్టెను !
ఈ సంవత్సరము న్యాయవాదిపరీక్షయందు తమ్ముఁడు వెంకటరామయ్య జయమందె నని మార్చి 15 వ తేదీని తెలిసి, సంతోషమున మిన్నందితిని.
"దేశాభిమాని" యనుపేర ఆంధ్రాంగ్లవారపత్రిక నొకటి ప్రచురింప వీరభద్రరావుగారు నేను నుద్దేశించితిమి. దాని కాంగ్ల రాజకీయ వ్యాసములు వ్రాసి, అవి దిద్ది పంపుఁ డని మిత్రులు వెంకటరత్నమునాయఁడుగారికి నేను బంద రంపితిని. కాని, నాయఁడుగా రవి దిద్దకపోవుటయేగాక, మరల మా కవి పంపనైన లేదు ! అందువల నను, వీరభద్రరావుగారి "విద్యాసాగరముద్రాలయము"నఁ బనులు సరిగా జరుగకుండుటవలనను, మేము పత్రికాప్రకటనమును విరమించు కొంటిమి !
మా యత్తగారికి జబ్బుగా నుండె నని జాబు వచ్చుటచే భార్యను రాజమంద్రి పంపితిని. ఆమెకుఁ గొంచెము నెమ్మది గలిగె ననియు, తమ్ముఁడు కృష్ణమూర్తిభార్య చనిపోయె ననియును నా కంతట లేఖ వచ్చెను. ఈబాలిక మరణవార్త విని మిగుల విచారపడితిని.
24. పెండ్లి బేరములు
ఇదివఱకే మాతలిదండ్రులు బెజవాడ వచ్చి నాతో నుందుమని వాగ్దానము చేసిరి కాని, యట్లు జరుగలేదు. దీనికి ముఖ్యకారణము, అందఱును బెజవాడ చేరినచో, తమమాట చెల్లదని పెద్దవారును, తమ మరియాద నిలువ దని చిన్నవారును, స్త్రీజనము తలంచుటయె ! ఆదినములలో మాతమ్ములలో నొకరు నాకు రాజమంద్రినుండి వ్రాసిన యీక్రింది యుత్తరము దీనికి వ్యాఖ్యానప్రాయముగ నున్నది : - "నీవు తెలివిహీనుఁడవు కాఁబట్టి యితరులమాయలలో పడుచున్నావు ! నీ అత్తగారు నెమ్మదిగనే యున్నది. వదెన నిపు డిచటికి నీవు పంపుట వట్టి అనగత్యకార్యము ! * * * * "
మాయింటను అయ్య గారివారియింటను స్త్రీ లీసమయమున లేకపోవుటచేత, రెండిండ్లలోను పురుషపాకమే ! దాని మాహాత్మ్యమున 5 వ తేదీని తెలవాఱుజామున అజీర్ణ సంబంధమైన పోటు నాకు కడుపులో బయలుదేఱెను. ఆనాఁ డంతయు మంచమెక్కితిని. వైద్యులు