ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ

వికీసోర్స్ నుండిఆత్మచరిత్రము

ద్వితీయ భాగము

ఆత్మచరిత్రము

ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ

1. బెజవాడ

1893 వ సంవత్సరము మార్చి 9 వ తేదీని నేను బెజవాడ కేగి, నాకు లభించిన యుద్యోగమునఁ బ్రవేశించితిని. నా కనుల కపుడు, విజయవాడయె కాక, జగతీరంగమంతయు నూతనకాంతులతో విలసిల్లెను. ఇదివఱకు తలిదండ్రుల పోషణమున నుండి, వారి చెప్పుచేతలకు లోనై, వినమ్రభావమున, నేను మెలంగితిని. నాహృదయమున గోదావరినదివెల్లువలవలె సంస్కరణవిషయములను గుఱించిన మహాశయము లుప్పొంగుచున్నను, కార్యస్వాతంత్ర్యము లేమింజేసి వాని నెల్ల నిరోధించి, లేనియోపికను దెచ్చుకొని మసలవలసినవాఁడనైతిని. ఇపుడన్ననో, నేను విద్యముగించి, వృత్తిఁ జేకొని, సంసారసాగరమును స్వతంత్రముగ నీదఁజొచ్చితిని. లోకమును గుఱించి వట్టి యూహా పోహములతోనే నే నిదివఱకుఁ గాలము గడిపితిని. ఇప్పుడొ, జీవిత మందలి కష్ట సుఖములు, మేలుకీడులును క్రమముగ నా కనుభవగోచరము కాఁజొచ్చెను. నా నూతనాశ్రమజీవితమును స్పష్టముగ సూచించుటలో యన నీనూతన పురనివాసమును నా కిపుడు సంఘటిల్లెను. బెజవాడ నే నిదివఱ కెఱుంగనిది కాదు. చెన్నపురి పోయి వచ్చు చుండినప్పుడు పలుమాఱు నేనీ పట్టణమును సందర్శించుచునే యుంటిని. కాని యిదివఱ కెపుడును, ఈనగర మామూలాగ్రముగ నేను బరిశీలింప లేదు. కావున విజయవాడపురము నా కెంతయుఁ గ్రొత్తగ నుండెను. ఇచటిప్రకృతిదృశ్యము లత్యంతరమణీయములు. కృష్ణవేణీనది, దాని కిరుపార్శ్వములనుండి ఱెక్కలవలె మింటి కెగయుపర్వతపంక్తులు, తూర్పున మొగలరాజపురపుకొండ, నదిమీఁదఁ గట్టినయానకట్ట రెయిలువంతెనలు, ఏటినుండి వెడలిన మూఁడు కాలువలు, దాపుననుండు కొండమీఁద వెలసిన కనకదుర్గాలయము, - ఇవి యన్నియు నేత్రోత్సవముఁ జేయుచుండును. బందరురైవిసుకాలువలమధ్య విచిత్రద్వీప కల్పమువలె నేర్పడిన బకింగుహాముపేట యుద్యానవనమువలె సొంపారుచుండును. బందరుకాలువ యొడ్డునందలి చిన్న బాటను చెట్లనీడను నడచిపోవునపుడు, కాలువనీటినుండి నీతెంచెడి చల్లనిగాలి ననుభవించుచు, పక్షుల మధురాలాపములు వినుచును, నే నేదో విచిత్రలోకవిహారము చేయునటు లనుకొనువాడఁను!

ఇచటివారికిని గోదావరిమండలజనులకును, వేషభాషాచారములం దనేకభేదములు నాకుఁ బొడఁకట్టెను. అయినను వీరును సోదరాంధ్రులే. కావున విద్యాబోధకరూపమున నాంధ్రావనియందు సాంఘిక సేవ లొనర్ప నే నవకాశములు గలిపించుకొనఁబూనితిని.

నేను బెజవాడ వచ్చిన మఱునాఁడే, ఆ పాఠశాలావిద్యార్థులకు బహుమతులు పంచి పెట్టఁబడెను. ఆ సభాసందర్భమున నచటికి విచ్చేసిన పౌరప్రముఖులతో ప్రథమోపాధ్యాయులగు శ్రీ ధన్వాడ అనంతము గారు నాకుఁ బరిచయము గలిగించిరి. మఱునాఁడు మా తండ్రి రాజమంద్రినుండి నా భార్యను, తమ్ముఁడు సూర్యనారాయణను బెజవాడకుఁ గొనివచ్చెను. మేము తాత్కాలికముగ నొక స్నేహితునియింట విడిసితిమి. పాఠశాల కొంతదూరమైనను, బకింగుహాము పేట వాస యోగ్య మగుటచేత, మే మచటనే యుండ నిశ్చయించితిమి. కాలువవంతెనకుఁ జేరువనుండు గోవిందరాజులవారియింటిలో నొకభాగమును మా తండ్రిగారు మాకుఁ గుదిర్చిరి. చదువుకొనుటకే సూర్యనారాయణ యిచటికి వచ్చినను, మా తల్లిని విడువనొల్లక, మూఁడునాలుగుదినములలో పయనమైన మాజనకునివెంటఁబడి యాపసివాఁడు రాజమంద్రి వెడలిపోయెను! మా క్రొత్తకాపురమునకు వలయు వస్తుసముదాయమును బజారునుండి కొనితెచ్చియిచ్చి, మా తండ్రి మమ్ము విడిచివెళ్లెను. అనంతముగారియొక్కయు, ద్వితీయోపాధ్యాయులగు దేవసహాయముగారియొక్కయు సాయమువలన, కూర్చుండుటకు కుర్చీలు బల్లలు మున్నగు సామాను నేను కొని, నూతనపురనివాసమున కాయత్తమైతిని.

కాని, జీవితమున నన్ను గాసిఁబెట్టుటయే వినోదముగఁ గైకొనిన వికటవిధి నా కిపుడైన మనశ్శాంతి లేకుండఁజేసెను! నూతన ప్రదేశమునఁ గ్రొత్తకాపుర మారంభించిన నా కాశాభంగ మొనరించెడి యుదంత మొకటి యంతట సంభవించెను. బెజవాడ పాఠశాలాధి కారియు, బందరు నోబిలుకళాశాలాధ్యక్షుఁడును, నా యుద్యోగ ప్రదాతయునగు రెవరెండుక్లార్కుదొర నాకొకలేఖ నిపుడు వ్రాసెను. నేను యల్. టి. పరీక్షలో పూర్తిగ విజయమందనిహేతువున నామూలమునఁ దమవిద్యాలయమునకు దొరతనమువారినుండి యాదాయ మేమియు రాదు గావున, తా నిదివఱ కేర్పఱచినట్టుగ డెబ్బదిరూపా యిలు కాక, అఱువదియే నాకు జీతమిచ్చెద నని యాయన తెలియఁబఱిచెను ! ఈ సంవత్సరమైన డెబ్బదిరూప్యము లిప్పింపుఁ డని వారికి వ్రాసికొని, ఆనాఁడే తమ్ముఁడు వెంకటరామయ్య పంపినజాబు ననుసరించి, అమలాపురము పాఠశాలలో ద్వితీయోపాధ్యాయుని యుద్యోగమునకై ప్రయత్నింప నే నారంభించితిని !

నా మనోవ్యాకులతను బూర్తిచేయుట కీ యుదంత మొకటియే చాలదేమో యనునట్టుగ, ఆ మొదటిదినములలో మాకింకఁ గొన్ని యిక్కట్టులేర్పడెను. దినదినప్రవర్ధమానమగు బెజవాడవేసవియెండలు మా యుభయులను మిగుల వేధించెను. ఇరువురమును కురుపులచేత బాధపడితిమి. కడుపునొప్పి, జ్వరము మున్నగు వ్యాధులు నా భార్యను బీడించెను. ఆ కష్టసమయములందు, ఇంటియజమానురాలగు శ్రీమతి సుబ్బమ్మగారు మా కమితముగఁ దోడ్పడిరి. మంచమెక్కిన నాభార్యకు చికిత్సాపరిచర్యలు చేయుచును, నాకు వేళకు నన్నపానము లొనఁగూర్చుచును, ఆయిల్లాలు మాకు రెండవతల్లి యయ్యెను !

16 వ మార్చిని మాపాఠశాలలోని "విద్యార్థిసాహితీసమాజము"వారు నన్నుఁ దమ యధ్యక్షునిగ నెన్నుకొనిరి. ఆ సమాజమునకు నే జేయవలసిన సేవనుగూర్చియు, దాని యభ్యున్నతికై నే గావింపవలసిన యపారప *శ్రమనుగుఱించియుఁ దలంచుకొనినపుడు, నా మేను పులకరింపఁదొడంగెను ! ఇంతియ కాదు, పాఠశాలలోని యనుదిన విద్యాబోధనాకార్యనిర్వహణమందే నాకు నిరుపమానందము గాన వచ్చెను. సతికి విద్యగఱపుట ముఖ్యవిధిగ నే జేసికొని, భారతాది గ్రంథములందలి కథలును, 'సత్యసంవర్థనీ' పత్రికకు నేను వ్రాయు వ్యాసములును, ఆమెకుఁ జదివి వినిపించుచుండువాఁడను. ఆబాలకు ముఖ్యముగ మతబోధనము చేయ నాసక్తి గొనియుంటిని. సంఘ సంస్కరణ విషయములను సతితోఁ జర్చించుచును, తీఱిక సమయములం దుత్తమవిషయములనుగుఱించి సంభాషించుచును, ప్రొద్దుపుచ్చుండు వాఁడను.

ఉద్యోగమునఁ బ్రవేశించినను నా వృత్తిసమస్య యింకను పరిష్కారము కానివిధముననే, మతమునుగుఱించి బాహాటముగ ప్రసంగములు సల్పుటకును వ్యాసములు వ్రాయుటకును నే నేర్చి యుండినను, నా విశ్వాసము లింకను జీవితమునఁ బెనఁగలసి, క్రియా రూపమున వెలువడ నేరకుండెను! ఒక నిముసమున నధిక పవిత్రస్థానము నధివసించెడి నాహృదయము, మఱుక్షణముననే హేయవిషయ వాంఛల నోలలాడుచుండును ! ఈశ్వరచరణకమల ధ్యానమే జీవిత కర్తవ్య మని నమ్మిననామనస్సు, పలుమాఱు విషయలాలసా పంకమున బ్రుంగుచుండెడిది ! తప్పించుకొనఁ బ్రయత్నించినకొలఁది కామోపభోగములందు నా మనస్సు మఱింత గాఢముగఁ గూరుకొనిపోవు చుండును ! ఒకనాఁటి మనోనిశ్చయము మఱునాఁటికి హాస్యాస్పదమగుచున్న దనియు, ఈ చిత్తచాంచల్యమునుండి నన్నుఁ దప్పింపు మనియు, దైన్యమున నే నెంతవేఁడుకొనినను, దీనరక్షకుఁడగు దైవము నా మొఱలు వినిపించుకొనక, చెవులు మూసికొని కూర్చుండునట్లు తోఁచెను !

మార్చినెల తుదిదినములలో నొకసాయంకాలము, మరల తన పుస్తకములు విప్పి యాంగ్లము నభ్యసింపుమని భార్యకు బోధించి, నేను బందరుకాలువయొడ్డున షికారుచేయుచు, నాప్రకృతదురవస్థను జ్ఞప్తికిఁ దెచ్చుకొని, నన్ను రక్షింపు మని దేవదేవుని వేఁడుకొంటిని. నామానసిక స్థితినంత నేను విమర్శించుకొంటిని. నా లోపపాపములలో, అసూయ, విషయవాంఛ, నిగ్రహరాహిత్యము, అసమగ్రభక్తియును ప్రముఖము లని నేను గనిపెట్టి, వీనిని సవరించి నా కాత్మవికాసము గలిగింపు మని పరాత్పరుని వేఁడుకొంటిని. లోకమందు భక్తులచిత్తములు నిరతము భగవదున్ముఖములగుచుండఁగా నాకుమాత్రము లోక విషయములె మఱింత హృదయరంజకము లగుచుండుటకు నే నెంతయు విషాదమందితిని !

2. ప్రార్థనసమాజము

రాజమంద్రి ప్రార్థనసమాజవార్షిక సభకు నా కిపుడు పిలుపు రాఁగా, ఆసందర్భమునఁ జదువుటకై "ఆస్తికమతాధిక్యము" అనునొక యాంగ్లోపన్యాసమును నేను సిద్ధపఱిచితిని. ఏప్రిలు 6 వ తేదీని నేను రాజమంద్రి వెళ్లితిని. మాయమ్మ యపు డారోగ్యవతిగ లేదు. మఱునాఁటిప్రొద్దున తమ్ముఁడు వెంకటరామయ్య యుపన్యాసము జరిగెను. ఆ సాయంత్రము నేను బ్రసంగించితిని. పలువురు సభికులు నా యుపన్యాసమును మెచ్చుకొనిరి. అందలి ముఖ్యవిషయము లిందుఁ బొందుపఱుచుచున్నాను : -

"ప్రార్థంసమాజమువారిమతము ఆస్తికమత మనియు, వారి యర్చనల కధిదేవత పరమాత్ముఁ డనియు నుడువనగును. ఇతరమతములకును దైవమే ముఖ్యమైనను, అవి యామహామహునికంటె నాతని యవతారములకును, ప్రవక్తలకును, ప్రతినిధులకును ప్రాధాన్య మొసంగుచున్నవి. పరిశుద్ధాస్తికమతమునకు మాత్రము దైవభక్తియె ప్రధానాంగము. దీనికి గొప్ప సిద్ధాంతగ్రంథములతోఁ బ్రసక్తి లేదు. మనష్యుని బాహ్యాంతరప్రకృతులే దేవదేవుని యునికికి సాక్షీభూతములు. జగత్తె యీశ్వరనిర్మితమగు దివ్యభవనము. మనస్సాక్షి మానవచారిత్రాదు లాస్తిక్యమునకు ముఖ్యనిదర్శనములు. పాప మనఁగ మానవశాసనోల్లంఘనముమాత్రమే గాక, పరమాత్ముని పవిత్రాజ్ఞా తిరస్కరణముకూడను. అఘోరవిపత్తునుండి మనుష్యుని రక్షించునదియే మతము. ఈశ్వరసాక్షాత్కారము వడయుటకు సాధనములు భక్తిధ్యానానుతాపములు, సత్కర్మవిచయమును. ఈ సాధనకలాపమున ప్రజ్ఞాశక్తులందు పెనుపొంది, జీవాత్మ పరమాత్మనుఁ జేరఁగలదు.

"తక్కిన మతములకు వలెనే ఆస్తికమతయాథార్థ్యమునకును సాక్ష్యము లేకపోలేదు. ఈ మతధర్మములచొప్పున జీవితయాత్ర జరుపుకొని ధన్యులైన యుత్తమజనులచరితములె దీనికి గొప్పసాక్షులు. రామమోహనరాయలు, దేవేంద్రనాథకేశవచంద్రులును, భరతఖండమున నిటీవల నీ మతప్రచారము సలిపి చరితార్థత నొందిన మహామహులు. ఈ సమాజసభ్యులగు మేము వారితో సరిపోల్పఁదగినవారము గాక, మా యాశయముల కుచితమగు నున్నతపదవినైన నందకున్న యల్పుల మైనను, స్వయంకృషిచే దినదినాభివృద్ధి నొందఁగోరుచున్న వారము. అజ్ఞానతిమిరమునుండియు, పాపకూపమునుండియు దైవానుగ్రహమున మే మొకింత తప్పించుకొని, సత్పథగాములమై సాగిపోవ నుద్యమించి యున్నారము."

ఆమఱునాఁడు ప్రార్థనసమాజమువారు బీదల కన్నదానముఁ జేసిరి. సాయంకాలము వీరేశలింగముపంతులుగారు "జీవితముయొక్క పరమార్థము, దానిని పొందు మార్గము" అను విషయమున నొక దీర్ఘోపన్యాసముఁ జేసిరి. మఱుసటిదినమున నేను బెజవాడ వెళ్లి, పాఠశాలలోని పనులు నెఱవేర్చుకొంటిని.

అప్పటికిఁ గొన్ని దినములకు వెనుకనే నాకు క్లార్కుదొరనుండి ప్రత్యుత్తరము వచ్చెను. యల్. టి. పరీక్షనిచ్చినపిమ్మట రెండు వత్సరము లీ పాఠశాలలో నుందునని వాగ్దానము చేసినఁగాని నా కిప్పటి జీత మీయఁజాల నని యాయన చెప్పివేసెను ! దీనికి నేను సమ్మతింపలేదు. నాతో క్లార్కుదొర జరిపెడిబేరములు విని మిత్రులు నవ్వసాగిరి. ఇతరోద్యోగ మేమియు సమకూర్చుకొనక, చేతనున్న పని వదలివేయఁగూడదు గదా. ఐనను, 10 వ ఏప్రిలు తేదీని నేను కోపమున క్లార్కుదొరకుఁ బంప నొకయుత్తరము లిఖించితిని. కాని, అనంతముగారి సదాలోచనము ననుసరించి, యది సవరించి, మఱి పంపితిని. ఇప్పటి జీత మీయనిచో నే నిచట నుండఁ జాల నని చెప్పివేసితిని.

అనంతముగా రొకనాఁడు నాతో మాటాడుచు, మావలెనే మా యాఁడువాండ్రును అపుడపుడు సమావేశమై సంభాషించుకొను చుండుట శ్రేయోదాయకమని సూచింపఁగా నే నందుల కంగీకరించితిని. 21 వ ఏప్రిలుతేదీని మే మిరువురమును అనంతముగారి గృహమును సందర్శించితిమి. ఆదంపతులు మాకు సుస్వాగత మొసంగి ఫలహారము లిడిరి. నే నొకింత భుజించినను, తన కుపాహారములు సరిపడవని నాభార్య చెప్పివేసి వానినిఁ గైకొనలేదు.

ఆదినములలో నొకప్రొద్దున దేవసహాయముగారు, యతిరాజులుపిళ్ళగారి తమ్ముఁడు, మఱి యిద్దఱు మువ్వురు స్నేహితులును వెంట రాఁగా, నేను కృష్ణదాటి, ఉండవల్లిపోయి, యచటఁ గల గుహలను వీక్షించితిని. మేడయంతస్తుల వలె కొండఁదొలిచి నిర్మాణముఁ జేసిన యాగుహలను జూచి మే మాశ్చర్య మందితిమి. అనంతశయనుఁడగు విష్ణుని విగ్రహము మా కచటఁ గానఁబడెను. పూర్వ మక్కడ ఋషి సత్తములు సమావేశమై, యీశ్వరధ్యాననిమగ్ను లగుచుండి రని మే మనుకొంటిమి. మిగుల దయతో మాకు పిళ్ల గారు కాఫీ, రొట్టె మున్నగు నుపాహారములు సిద్ధపఱిచిరి. మే మానాఁ డెంతో సంతోషమునఁ బ్రొద్దుపుచ్చితిమి.

రాజమంద్రికళాశాలావిద్యార్థులలో పట్టపరీక్షలో నాంగ్లమునఁ బ్రథమునిగ నుత్తీర్ణత నొందుటచే నాకు బహుమతి చేయఁబడిన స్కాటువిరచిత కథావళిని నే నీసమయమునఁ జదువుచువచ్చితిని. ఒక్కొక్కసారి యింగ్లీషు పుస్తకములలోని యంశములును, ఆంధ్రగ్రంథములును, పత్నికిఁ జదివి వినిపించుచుందును. ఏప్రిలు 27 వ తేదీని, స్కాటువ్రాసిన 'ఐవాన్‌హో'నవలను బూర్తిచేసితిని. కథా నాయికయగు 'రిబెక్కా'కాంతవిషయమై కృతికర్త పక్షపాతబుద్ధిఁ జూపె నని నే నసంతృప్తిఁ జెందితిని. ఆ యంగన యౌదార్యసచ్ఛీలతాసౌందర్యముల కనురూపమగు సౌభాగ్యగరిమ మామె కొసంగ లేదనియు, ఐవాన్‌హోను బరిణయమై రిబెక్కా సౌఖ్యాబ్ధి నోలలాడెనని కవి వర్ణింప లేదనియును, నేను విషాదమందితిని.

ఏప్రిలు 25 వ తేదీని అమలాపురము పాఠశాలాప్రథమోపాధ్యాయునియొద్దనుండి నాకొక జాబు వచ్చెను. నా కాపాఠశాలలో ద్వితీయోపాధ్యాయునిపదవి నీయుఁ డని పాఠశాలలపరీక్షాధికారియగు నాగోజీరావుపంతులుగారు సిఫారసు చేసినట్లు వారు వ్రాసిరి. ఈ సంగతిని గుఱించి తలపోయుచు నామనస్సు మరల చంచలగతి నందెను !

నాలుగవ మేయితేదీని అనంతముగారు సతీసమేతముగ మమ్ము సందర్శింపవచ్చిరి. వారు మాయింటికి వచ్చినందుకు ఇంటి వారు తప్పు పట్టెదరేమో యని మేము భీతిల్లితిమిగాని, యట్లు జరుగ లేదు. సజ్జనులగు ననంతముగారి యెడ బెజవాడ వాస్తవ్యుల కమిత భక్త్యనురాగములు గలవు. "ఇస్లాము విశ్వాసము" అను నాంగ్లగ్రంథము నే నపుడు చదివి, మహమ్మదీయ మతసిద్ధాంతములను గ్రహించితిని. ఆపుస్తక మందలి ముఖ్యాంశములను నేను వ్రాసిపెట్టుకొంటిని. ఎంతో శ్రమకోర్చి నే నాకాలమునఁ జదివి యిట్లు సారము వ్రాసికొనినవ్రాఁత పుస్తకము లింకను నాయొద్ద నున్నవి.

6 వ మేయితేదీని స్నేహితులు గంగరాజు కనకరాజుగార్లు చెన్నపురినుండి వచ్చిరి. మేము మువ్వురమును గూడి యానాఁడు వీరేశలింగముగారి రాకకై బెజవాడరెయిలుస్టేషనునొద్దఁ గనిపెట్టుకొని యుంటిమి. పంతులుగారు భార్యాసహితముగా వచ్చి మాపొరుగున నుండు పాటిబండ వెంకటరమణయ్యగారి యింట విందారగించి, వెంటనే చెన్నపురి రెయిలెక్కిరి. మేము వారిని సాగనంపి వచ్చితిమి. మఱునాఁ డాస్నేహితులు రాజమంద్రి వెడలిపోయిరి. మాపాఠాశాలను వేసవికి మూయుటచేత, మేమును 8 వ తేదీని రాజమంద్రి బయలుదేఱితిమి.

3. వేసవిసెలవులు

9 వ మెయి తేదీని తమ్ముఁడు వెంకటరామయ్యతోఁ గూడి రాజమంద్రియందలి స్నేహితులను సందర్శింపఁ బోయితిని. 'సత్యసంవర్థనీ' సంచికను వేగమే ముద్రింపుఁ డని "వివేకవర్థనీ ముద్రాక్షరశాల"లోఁ జెప్పి, మిత్రులు పాపయ్య, రంగనాయకులు నాయుఁడు గార్లను వీక్షించితిని. మధ్యాహ్నము మృత్యుంజయరావు, నరసింహరాయుఁడుగార్లనుఁ జూచివచ్చితిని. మృత్యుంజయరా విపుడు నవీనముగ రాజమంద్రిలో స్థాపితమైన దొరతనమువారి బోధనాభ్యసన కళాశాలలో నుపన్యాసకుఁడు. నరసింహరాయుఁడుగా రేతత్కళా శాలలో బోధనాభ్యసనముఁ జేయుచుండిరి. స్నేహితు లిట్లు గురు శిష్యు లయిరి !

10 వ తేదీని నన్నుఁజూచుటకు మృత్యుంజయరావు మాయింటికి వచ్చెను. ఇటీవల రాజమంద్రిలో జరిగిన ప్రార్థనసమాజ సమావేశమున నన్ను గుఱించియు, నా తమ్ముని గుఱించియు నతఁడేల ద్వేష భావమున మాటాడి, మామీఁద నపనిందలు వెలయించెనని యాతని నడిగితిని. అతఁడు ప్రత్యుత్తర మీయలేదు. మిత్రుల పోరాటములు లెక్కసేయక యథాప్రకారముగ నేను "సత్యసంవర్థని"కి వ్యాసములు వ్రాసి యచ్చున కిచ్చుచుంటిని. కాని, కొలఁదిరోజులలో నరసింహరాయుడుగారిని నేను గలసికొని, యిటీవలి యల్లరికిఁ గారణ మడుగఁగా, "మీ రెప్పటివలెనే నిరంకుశాధికారముఁ జెల్లింపఁ బ్రయత్నించుచున్నారు. ముం దట్లు సాగనీయము. సరియైన త్రోవను మీరు పత్రికను నడపిననే మే మందఱమును మీకు సాయముచేతుము" అని యాయన చెప్పెను. ఈమాటలు విని నే నిఁక "సత్యసంవర్థనీ" పత్రికతోడి సంబంధము విడువ నుద్యమించితిని. పత్రిక విషయమున కనకరాజు, మృత్యుంజయరావు, నరసింహరాయుడుగార్లు మామీఁదఁ గినుక వహించుట నేను సవిస్తరముగ గ్రహించి, దానితో జోక్యము వదలుకొన నిశ్చయించితిని.

శ్రీ మల్లాది వెంకటరత్నముగారి కోరికమీఁద, శ్రీమతి సత్యనాథము కృపాబాయిగారు ఇంగ్లీషున రచించిన "సగుణచరిత్రము"ను నేను తెలుఁగుఁ జేయనారంభించి, అచ్చువేయుటకై కొన్నిప్రకరణములు వారికిఁ బంపితిని. లివింగ్సుటను చరిత్రమును జదివితిని. అమహామహుని యపారదైవభక్తికి నే నాశ్చర్యమంది, నాజీవితము నటులే ధన్యముఁ జేయు మని దైవమును వేఁడితిని. నామనస్సు నిప్పుడు కలఁచెడి విషయములు కొన్ని కలవు. పెద్దచెల్లెలు కనకమ్మ వివాహసంబంధనిశ్చయ మింకను గాలేదు. కొన్ని సంబంధములు వచ్చినవి. మా తండ్రియు తమ్ముఁడును వీనిని గుఱించి మిక్కిలి తిరిగిరి. ఏదో యొక సంబంధము శీఘ్రమే నిర్ణయింపవలెనని నాకోరిక. మాతల్లి తనపెద్దకోడలిమీఁద నాగ్రహపడి, ఆకోపము నామీఁదఁ జూపసాగెను ! నాకిది యాశ్చర్యవిషాదములు గొలిపెను. ఇపుడు మాయింటితీరు నాకు బాగుగఁ గనఁబడలేదు. చిన్న పిల్లలు తలిదండ్రుల యెడఁ దగిన గౌరవములేక, వారిని బరిహసించుచు, సత్యదీక్షలేక నవ్వుటాలతోఁ బ్రొద్దుపుచ్చుచుండిరి! వారికి నాభార్యకు నిపుడు మనసు గలియక, ఉభయులు చిన్న చిన్న కయ్యములకుఁ గాలుద్రవ్వుచుండిరి !

అప్పుడప్పుడు నేను మిత్రుఁడు రంగనాయకులునాయఁడు గారినిఁ గలసికొనుచువచ్చితిని. తన భావికార్య ప్రణాళికను గుఱించి యాయన చెప్పుచుండువాఁడు. తాను ఉద్యోగమునుండి విశ్రాంతిఁ గొనినపిదప, రాజమంద్రిలో స్వకీయవైద్యాలయ మొకటి స్థాపింతు ననియు, అచట మందులిచ్చుటకై తన పెద్దకొడుకున కీలోపుగ మూలి కాజ్ఞానమును సమకూర్చు చదువు చెప్పింతు ననియు నాయన యనుచుండువాఁడు. ఇపుడు జబ్బుపడిన నాభార్యకు, చెల్లెండ్రకును నాయఁడుగారు మంచిమందు లిప్పించిరి.

ఈ సమయమున నాకు నాబావమఱఁది వెలిచేటి వెంకటరత్నముగారితో స్నేహము పెంపొందెను. ఆయన క్రమక్రమముగ ప్రార్థన సమాజముపట్లను, సంఘసంస్కరణ విషయములందును, సుముఖత్వముఁ జూపుచు నాకు సాయపడుచువచ్చెను. కాని, క్రొత్తస్నేహితులు నాకు లభించుకొలఁది, ప్రాఁతవారి తోడినేస్తము విడివడుచుండెను! సమాజ సత్యసంవర్థనుల గుఱించి యిటీవలప్రబలిన గడిబిడ యేమని నేను వ్రాయఁగా, కనకరాజు పాలకొల్లు నుండి ప్రత్యుత్తరమిచ్చెను. ఆతనిమనస్సు లేఖలో ధారాళముగ ప్రతిబింబత మయ్యెను. ఆతనియెడ నేను వైరభావమూని నిరంకుశాధికారము సల్పుచుంటిననియు, మిత్రు లారోపించెడి లోపము లన్నియు నాయందుఁ గలవనియు, నాతని యభిప్రాయము ! మాతమ్మునిదెసఁ గూడ నీతనికి వైరస్యమే. మే మిరువురమును సత్యసంవర్థని కధ్వర్యము వదలుకొని, మృత్యుంజయరావున కాపదవి కట్టఁబెట్టి, పత్రికా విలేఖకులముగ మాత్ర ముండినచో, తానును బత్రికకు వ్రాయుచుందునని యాతఁడు చెప్పివేసెను! ఈమిత్రునివైఖరి చూచి నాకు వెఱ్ఱికోపము వచ్చెను. నిజముగా నా వర్తనమునం దీపెద్ద లోపము లుండెనా ? ఇపుడు నన్నుగుఱించి మొఱపెట్టుటలో మిత్రులు సద్భావమున మెలంగిరా ? నేను మిగుల విలపించి నిరుత్సాహమందితిని. నేను మిత్రులనుకొనినంత దోషిని గాననియు, ఈవిషయమున వారైన నిర్దోషులు గారనియు, నా నిశ్చయాభిప్రాయము! స్నేహితుల సోదరప్రేమ మిట్లు కోలుపోయిన నాకు, సోదరుని స్నేహ ప్రేమములు పెంపొందఁ జొచ్చెను.

నే నీకాలమున ప్లేటో విరచితమగు "ప్రజాస్వామికత్వము"ను పఠించితిని. బహుదేవతారాధనాది మతోన్మాదములను నిరసించిన ప్లేటో, 19 వ శతాబ్దమందలి యాస్తికునివలె గనఁబడెను. ఐనను స్త్రీసామాన్యతా సిద్ధాంతమును సమర్థించిన ప్లేటో మొఱకుమానిసి వలెఁ గన్పించెను. ఇందుఁ బ్రతిఫలితమగు సోక్రటీసుని యాకార మునకును, ఏకపత్నీత్వముమున్నగు నీతినియమములను సముద్ధరించిన జీససునకును నెంతయో యంతరము గలదు !

నా మనస్సునకుఁ గళవళపాటు కలిగించిన యొకవిషయమును గూర్చి యిచటఁ బ్రస్తావించెదను. ఇపుడు మా కెన్నియో చిల్లర యప్పులుండెను. ఇవియన్నియుఁ దీర్చివేయుటకై యెచటనైన మూఁడువేలరూపాయల పెద్దయప్పునకు మేము ప్రయత్నించితిమి. నా స్వల్పశక్తితో నీ ఋణము నెట్లు తీర్చివేయఁగలనా యని నేను తల్ల డిల్లితిని. ఋణవిముక్తుఁడనై మఱి చనిపోవునటు లనుగ్రహింపు మని పరమేశ్వరునికి మ్రొక్కులిడితిని. జూన్ 19 వ తేదీని యీ యప్పు సంగతి రంగనాయకులునాయఁడుగారితోఁ బ్రస్తావింపఁగా, కొంచెము వడ్డికి నా కీసొమ్ము లభించునట్టుగ ధనికులగు తమస్నేహితులతోఁ జెప్పెదనని యాయన వాగ్దానముఁజేసెను.

4. "జనానాపత్రిక"

నా పూర్వ గురువులగు మల్లాది వెంకటరత్నముగారు 1893 వ సంవత్సరము జూలై నెలలో స్త్రీవిద్యాభివృద్ధి నిమిత్తమై "తెలుగు జనానాపత్రిక" యనునొక మాసపత్రికను నెలకొల్పి, యొక సంవత్సరము నడిపి, అది యిపుడు విరమింప నుద్యమించి, నే నద్దానినిఁ గైకొని సాగింతునా యని, మెయి 28 వ తేదీని నాకు వ్రాసిరి. "సత్యసంవర్థని" ని గుఱించి మొగము తిరిగిన నాకు, "జనానాపత్రిక" వంటి వేఱొకపత్రిక చేతనుండుట కర్తవ్యమని తోఁచెను. ఆ జూను మొదటి వారమున జబ్బుగనుండు మాముత్తవతల్లిని జూచుటకు వేలివెన్ను వెళ్లియుండునపుడు, బావమఱది వెంకటరత్నముతో నూతన పత్రికను గుఱించి నేను ముచ్చటించితిని. మిత్రులతోడి తగవులకుఁ గారణమైన సత్యసంవర్థనిని నేనిఁక విడిచివైచి, జనానా పత్రికను జేపట్టుట యుక్తమని నా కాతఁ డాలోచనఁ జెప్పెను. అంత నేను రాజమంద్రి తిరిగి వచ్చిన పిమ్మట, సోదరుని యాలోచనఁ గూడఁ గైకొని, 6 వ తేదీని మల్లాది వెంకటరత్నముగారికి జాబు వ్రాసితిని. నా సంపాదకత్వమున జరుగు జనానాపత్రికకుఁ దాము నిర్వాహకులుగ నుండి కొంతకాల మది నడపుచుందు మని వెంకటరత్నముగారు ప్రత్యుత్తరమిచ్చిరి. నే నపుడు వ్రాసిపంపిన "పూవుల"ను గుఱించినదియె యాపత్రికలో నామొదటి వ్యాసము.

చిన్ననాఁడు నాకెంతో సంతోషదాయకముగ నుండిన "డాన్ క్విగ్జోటు" నవల నీవేసవిని మిగుల తమకమునఁ జదివితిని. నే నీకాలమున నమితముగఁ జదువుచుండుటవలననే కనులకును శరీరమందును బలహీనత హెచ్చిపోయెను.

ఈకాలమున నా దైవభక్తిని గుఱించియు ప్రార్థనలరీతిని గుఱించియు నొకింత తెలుపవలెను. నేను నిత్యవిధిగ వ్రాసెడి దినచర్య పుస్తకములందు నా ప్రార్థనానుతాపముల పోకడలు నానాఁట సూచితమగుచుండెను. శత్రుమిత్రులు నాలోపము లెన్ను చుండిరని నే నొక్కొక్కప్పుడు కటకటఁబడుచుంటిని కదా. ఇతరుల కన్నులకుకంటె నాచక్షువులకే నాలోపపాపముల మిగుల స్ఫుటముగఁ దోఁచుచుండెను. ఆత్మోపాలంభనములో పరుల దోషారోపణము లొకవీసమైన కఱకు లేకుండెను ! నా పాపచింతనమునకును కుటిల వర్తనమునకును, నేను సంతతానుతాపానలమున దగ్ధుఁడ నగుచుండియు, మరల నీవక్రచర్యలకే గడంగుచుందును ! స్వకీయపాపలేకమునుఁ బరిశోధించుటయందును, లోపముల వివరములను గుర్తెఱుంగుటయందును, న న్నెవరును మించియుండరు ! కాని, యీ పాప పరిశీలనాశక్తియును, అనుతాపతీవ్రతయును, అపరాధములు చేయకుండు నా బుద్ధినేల యరికట్టనేరకుండెనని యచ్చెరువొందు చుందును. నాకుఁ గల యమిత మతాభినివేశము, అపార దైవభక్తియును, మనస్సును అన్యాయపథమునుండి యేల మరలింపఁజాల కుండెనో గ్రాహ్యము గాకుండెను !

జూన్ 8 వ తేదీని నేనును, మృత్యుంజయరావును, రెయిలు స్టేషనుకుఁ బోయి బెజవాడలో జరిగెడి కేష్ణామండలసభ కేగుచుండు వెంకటరత్నము నాయఁడుగారిని సందర్శించితిమి. బెజవాడ వీడవలదనియు, ఎమ్. ఏ. పరీక్షకుఁ జదువుమనియు నాయుఁడుగారు నాకు సలహా నిచ్చిరి. వారు రాజమంద్రి వచ్చి జూన్ 15, 16 తేదీలలో నచట నుండిరి. 16 వ తేదీని మేము చేయించిన బహిరంగసభలో, "సువిశాల మిదం విశ్వం" అను శీర్షికతో నాయఁడుగా రొక యాంగ్లోపన్యాస మిచ్చిరి.

తలిదండ్రులయొద్దను బంధుమిత్రులయొద్దను సెలవుఁగైకొని, 20 వ జూనున బెజవాడకు ప్రయాణమై, మధ్యాహ్నమున కచటఁ జేరి, నా వస్తువులు, పుస్తకములును, సరదికొంటిని. ఉపాధ్యాయ మిత్రుఁడగు దేవసహాయముగారితోఁ గలసి మాటాడునప్పుడు, ఈపాఠశాలలోనే నేను రాఁబోవు సంవత్సరమునఁ గూడ నుండి, ఆయన ఖాళీచేయఁబోవు ద్వితీయోపాధ్యాయపదవి నలంకరింపఁగల ననెడి యాశను నా కాయన గలుగఁజేసిరి.

5. మరల బెజవాడ.

బెజవాడ పాఠశాలలో పని జూన్ 21 వ తేదీని మరల ప్రారంభ మయ్యెను. మఱునాఁడు ఉపాధ్యాయులసభ జరిగెను. అందు విద్యార్థులను గుఱించిన ముఖ్యమగుసంగతులు కొన్ని చర్చించుకొంటిమి. శిష్యులందుఁగల దురభ్యాసములు నిర్మూలించుటకును, మరల నుత్సాహముతోఁ బనిచేయుటకును, మేము దృఢసంకల్పులమైతిమి.

23 వ తేదీని "నీతిధైర్యము"ను గుఱించి నేనింట మాటాడితిని. కష్టము లాపాదించిన తరుణమున ధృతిఁ దొఱఁగకుండ నిలువవలయునే కాని, అవి తొలఁగిపోయినపిమ్మట ధైర్యమూనిన లాభ మేమి యని పలికిన సతిపలుకులందు సునిశిత సత్యవిచక్షణశక్తి నాకుఁ గానఁబడెను.

25 వ తేదీని మద్రాసునుండి రాజమంద్రి వెడలిపోవుచుండు వీరేశలింగముగారిని, వారిభార్యను, నేను రెయిలు స్టేషనులోఁ గలసి కొంటిని. నే నంత వారితో కనకరాజు మున్నగు మిత్రవర్గమునకు నన్ను గుఱించి కలిగిన దురభిప్రాయములను గూర్చి ప్రస్తావించితిని. తనకును నామీఁద నిటీవలఁ బొడమిన సందియముల నాయన యేకరువు పెట్టెను. ఆయనపలుకులవలన నా కేమియు నోదార్పు గలుగలేదు!

రాజమంద్రినుండి వచ్చిన వారమునకు నా తమ్ముఁ డొక యుత్తరము వ్రాసెను. నేను బెజవాడకు బయలుదేఱిన రెండురోజులకు కనకరాజు రాజమంద్రి వచ్చి, మార్చి యేప్రిలు నెలల సత్యసంవర్థనీపత్రిక మొదటి ఫారములో నేను అచ్చొత్తించిన "వార్తలు: అభిప్రాయములు" అను శీర్షికతోఁ జివర నింగ్లీషున నేను వ్రాసిన భాగము మాననష్టమున కెడ మిచ్చు ననియు, అందు నేను మహాపవిత్రుఁడ ననియు, నితరులు దుర్మార్గు లనియు సూచించితి ననియును, వీరేశలింగముగారు రాజమంద్రి వచ్చువఱకును ఆపత్రిక ప్రకటింపవలదనియును స్నేహితులతోఁ జెప్పెనఁట ! నేనీ వార్తను విని మిగుల ఖిన్నుఁడనై, హృదయపరిశోధకుఁడగు దైవసమ్ముఖమునఁ గన్నీరు విడిచితిని. నాతమ్ముఁడు పిమ్మట నాకు వ్రాసిన జాబువలన నిందలి రహస్యము కొంత బయలుపడెను. నే నిటీవల నొక కాకినాడ స్నేహితునితో మనసిచ్చి మాటాడుచుఁ బ్రస్తాపవశమునఁ జెప్పిన సంగతు లాయన కనకరాజునకు నివేదింపఁగా, ఆతఁడు నా వ్రాఁతలకి ట్లపార్థ కల్పనఁ జేసెనని తేలెను ! ఈశ్వరభక్తులు తమ దుస్థితినిఁ దలపోయుచు దైవసాహాయ్యమును వేడుచుండు విషయమును, నేను కొంతకాలము నుండి కొన్ని యింగ్లీషు పత్రికలలోని వ్రాఁతల ననుసరించి, యుత్తమపురుషైకవచనముననే వర్ణించు నభ్యాసముఁ జేసికొంటిని. అట్లు వ్రాయుటకుఁ గారణము, పాఠకుల కందలి సంగతులు మఱింత స్పష్టముగఁ ద్యోతక మగుననియె. స్నేహితులు దీనికింత రట్టేలచేసి, యెన్ని కష్టములు పడియైన సత్యసంవర్థనికి వ్రాయుచుండు నాకు నిరుత్సాహముఁ గలిగించిరో, దురూహ్యముగ నుండెను !

1 వ జూలై తేదీని నాకు మృత్యుంజయరావు వ్రాసిన జాబులోఁ బూర్వోదాహృతమైన పత్రిక సంచికలోని భాగము తొలఁగింప నిర్ధారిత మైనటులుండెను. నేను దీనికి సమ్మతింప లేదు. నామనస్సు మిగుల వ్యాకులము నొందెను.

నా వ్యాకులచిత్తత కిది యొకటియే హేతువు కాదు. సతికి నాకునుఁ దగినట్టుగ మనస్సు గలియకుండెను. జూలై 2 వ తేదీని నాకు జీతము రాఁగా, ఆసొమ్ములోఁ గొంతతో నింటికిఁ గావలసిన పాత్రసామగ్రిఁ గొనుఁడని యామె పట్టుపట్టెను. రాజమంద్రిలోని కుటుంబవ్యయములకును, ఇతర కర్చులకును సొమ్ము వెచ్చింపవలసిన నే నట్లు చేయ లేకుంటిని. మాకిద్దఱికి నంత సంఘర్షణ మేర్పడెను. నా కామె లోభగుణ మారోపించి నన్నుగుఱించి యపోహములం దెను! ఒక ధనవ్యయ విషయముననే గాక, మఱికొన్ని సంగతులందును దంపతుల కభిప్రాయభేద మేర్పడెను. నే ననుదినమును సాయంకాలమున కాలువయొడ్డున షికారు పోవుచుండు నప్పుడు, నాతోఁగూడ రమ్మని సతి నాహ్వానించుచుండువాఁడను. ఆమె యట్లు చేయనొల్ల కుండెడిది. పదునాఁఱేండ్ల బాల పతితోఁ గలసి వాహ్యాళి కేగుట, ఆకాలముననే కాదు, ప్రకృతమందును, సాహసకృత్య మని హిందూ సంఘ మెంచుచున్నది ! చెన్న పురివంటి మహాపట్టణములలో హిందూ యువిదల కిట్టి స్వేచ్ఛావర్తనమున కవకాశము గలుగును గాని, బెజవాడవంటి చిన్న పట్టణములలో నిట్టి చర్య లిరుగుపొరుగుల యమ్మలక్కల వికట వ్యాఖ్యానములకుఁ దావలమగుచుండును ! ఇట్టిపనులవలన తరుణవయస్కులగు నబలలకు తోడి కులకాంతలలోఁ దలవంపులు గలుగుచుండును.

6. అమలాపురోద్యోగము

నా "బెజవాడ - అమలాపురముల" యుద్యోగములకుఁ జాల కాలమువఱకు ద్వంద్వయుద్ధము సాగెను ! వేసవిపిమ్మట నేను బెజవాడపాఠశాలఁ జేరిన కొలఁదిదినములకు, అమలాపురపుఁ బని తప్పక యిచ్చెద రని మాతమ్ముఁడు రాజమంద్రినుండి నాకు వ్రాసెను. 17 వ జూలై తేదీని అమలాపురము పాఠశాలాప్రథమోపాధ్యాయుఁడు నాకుఁ దమపాఠశాలలో ద్వితీయోపాధ్యాయపదవి నిచ్చి రని వ్రాసి, నే నది స్వీకరింతునా యని యడిగెను. అందువలన మరల నామనస్సున కలజడి గలిగి, నాఁడే మాప్రథమాధ్యాపకుని యొద్దకుఁ భోయి, యీసంగతి యాయన కెఱిఁగించితిని. ఆయన దిగులుపడి, క్రొత్తపనిఁ గైకొనవలదని సలహానిచ్చెను. కొలఁది దినములలో క్లార్కుదొర బెజవాడ వచ్చు ననియును, అపుడాయనతోఁ దాను నాకష్టములఁగూర్చి చెప్పెద ననియును, అనంతముగారు వాగ్దానముఁ జేసిరి. ప్రకృతఁపుఁబని నాకు ఖాయము చేయుఁడనియు, రాఁబోవు వత్సరమున యల్. టి. పరీక్ష పూర్తిచేసినచో నెనుబదిరూపాయి లీయుఁడనియు, పరీక్షయందు తప్పిపోయినచో నీడెబ్బదియే చాలు ననియు నేను బలికితిని. నా యభీష్టము నెఱవేఱుచో నే నిచటినుండి కదలనక్కఱయె లేదుగదా !

జూలై 23 వ తేదీని క్లార్కుదొర మాపాఠాశాలకు వచ్చి, నా తరగతులలోఁ గొంతసేపు కూర్చుండి, నా బోధనమునకు సంతృప్తి నొందితి ననియు, నాకోరికను జెల్లింతుననియును జెప్పి, నా మనోనిశ్చయ మేమని యడిగెను. ఆరోజుననే మా తమ్ముని యొద్దనుండి వచ్చిన యుత్తరములో, నేను బెజవాడ విడిచి క్రొత్తప్రదేశమున కేగుట శ్రేయమని యుండుటచేత, నా నిర్ధారణమును వెల్లడించుట కొకవారము గడువుఁ గైకొంటిని. 28 వ తేదీని రాజమంద్రి వెళ్లి పరిస్థితులు కనుఁగొంటిని. రాజమంద్రి సబుకలెక్టరే అమలాపురము తాలూకాబోర్డు ప్రెసిడెంటు. ఆ యుద్యోగస్థానమున నడుగఁగా, నాకు హుకు మింకను పంపలేదనియు, అచట నా కెన్నటికి నఱువదిరూపాయలజీతమే యిచ్చెద రనియుఁ దేలెను ! ప్రథమోపాధ్యాయుఁడు నిరంకుశాధికారి యనికూడఁ దెలిసెను ! బెజవాడ "వేడిమంగల"మైనను, నాగరికత కావాసమయిన యానగరము విడిచి, పూర్వాచార పరాయణతకుఁ బట్టుగొమ్మయైన అమాలాపురగ్రామము వెళ్లుట శ్రేయము గాదని నాకుఁ దోఁచెను. బంధుమిత్రుల నటులె చెప్పిరి. కావున నేను బెజవాడలోనే యుండుటకు నిశ్చయించి, ఆసంగతి మచిలీపట్టణము వ్రాయఁగా, దానికిఁ దన యామోదమును క్లార్కుదొర నాకు వెంటనే తెలియఁబఱచెను.

నే నిపుడు బెజవాడలో నుండుటకే స్థిరపఱుచుకొని, మంచములు మున్నగు సామానులు కొంటిని. ఇదివఱకే "జనానాపత్రికా"ధి పత్యమును బూనితిని. ఆపత్రిక చందాదారులకు నాపే రెఱుక పడువఱకు నొక సంవత్సరము పత్రికమీఁద నాపేరుతోఁ బాటు వెంకటరత్నముగారి నామమును బ్రకటింపఁబడెను. కాని, వ్యాసాదులన్నియు నేనే వ్రాసి పంపుచుంటిని. ఇట్లు "సత్యసంవర్థని"ని వదలి వైచిన నాచేతు లొకమాసమైన నూరకుండక, నూతన పత్రికయగు "జనానాపత్రికా" వ్యాసరచనమునఁ దగిలియుండెను !

బెజవాడలోని మా వేఱింటికాపురపుఁ దొలిదినములను గూర్చి యొకింత ప్రస్తావింపవలెను. ఆనాఁటి నా దినచర్య పుస్తకములు పరికింప నా కాశ్చర్యము పొడముచున్నది. నా కప్పు డిఱువదిమూఁడేండ్ల వయస్సు. భార్యకుఁ బదునాఱు వత్సరములు. యువవిద్యాధికుఁడగు పతి బజారుపనులు మున్నగు నిత్యకృత్యములు నిర్వర్తించుట కంటె, విద్యాగంధము లేక బాల్యావస్థ దాటియుదాటని సతియే తనగృహకృత్యములు బాగుగఁ జక్కబెట్టుకొనఁగలిగెను ! ఇంట వంటకముల రుచి కేమాత్రము భంగము వాటిల్లి నను నేను భార్యమీఁద మండిపడుచుందునే కాని, నే దెచ్చిన పుచ్చు పెసలకును, పచ్చి కట్టెలకును, ఆమె యించుక విసిగికొనిన సహించువాఁడను గాను ! ఇంతియ కాదు. భర్తశాసనము చొప్పున ననుదినమును భార్య పాఠముఁ జదివి, వ్రాఁత వ్రాసి, ఆయన బోధనమును జెవియొగ్గి వినుచుండవలయునే కాని, తనవిధులు నెరవేర్చుటయం దావంతయు ప్రాలుమాలికఁ జూపరాదు. స్త్రీవిద్యాభిమానియగు పెనిమిటి స్త్రీస్వాతంత్ర్య మభిల షించియే యిట్లు చేయుచున్నాఁడు గాన, ప్రథమమున సతి విద్యావతియై పిమ్మట స్వేచ్ఛాస్వాతంత్ర్యముల ననుభవింపఁ గోరవలయును ! "పిల్లికి సెలగాటము, ఎలుకకు బ్రాణపోకటమనునట్టుగ, భర్తకఠిన విధానము భార్యమీఁది నిరంకుశాధికారముగఁ బరిణమించెను !

కావుననే నా యుద్యోగపు ప్రధమదినములలో, ఒడుదుడుకు నేలను మోటుబండిపయనమువలె మాసంసారయాత్ర మిగుల కష్టముగ సాగెను ! ఇంటియందలి చిన్నచిన్న పొరపాటులకుఁ బెనిమిటే చీటికిమాటికిఁ జీదరపడుచుండువాఁడు. మగనిపెళుసుమాటలకు మగువ కినుకఁ జెందుచుండునది. ఇట్లు, లోకానుభవము చాలని యాదంపతులు, పరిస్థితు లాడించు కీలుబొమ్మ లయిపోయిరి ! కోపము కోపమునఁ గాక యోరిమిచేతను లాలనవలనను చల్లారునని యాయువ దంపతులకుఁ దెలియ దయ్యెను. కావున, నూతనాశయములతోను, నవీనమనోరధములతోను విలసిల్ల వలసిన యాయౌవనసుఖదినములందు, ఆ కుటుంబమున, పతి యనుతాపవహ్నియందును, సతి యశ్రుధారా తోయములందును గడుప దీక్షావ్రతముఁ గైకొనినవారివలె మెలంగు చుండిరి !

7. ధన్వాడ దంపతులు.

పెద్దలును, మా పాఠశాలాప్రధమోధ్యాయులును నగు శ్రీ ధన్వాడ అనంతముగారు బెజవాడప్రాంతములందలి ప్రజలచే నెక్కువ మన్న నలఁ బడయుచుండిరి. వారా మండలము వారే గౌరవ మార్ధ్వకుటుంబమున జనించి విద్యాధికులైన అనంతముగారు, జీససు మహనీయుని యమూల్యాదేశముల ననుసరించి, స్వసంఘములోని తమ యున్నతస్థానత్యాగ మొనరించి క్రైస్తవమతావలంబము చేసినవారగు టచేత, హిందువులు క్రైస్తవులును వారియందు సమానగౌరవమును గలిగియుండిరి. ఇదివఱకు వారు క్రైస్తవమతబోధకులలో నాయకులుగనుండి, ఆ మత సంఘము వారి కోరిక చొప్పున నిటీవల బెజవాడ పాఠశాలాధ్యక్షతను వహించిరి. జ్ఞాన సంపన్నులును, అనుభవశాలురును నగు వారు, నాకిపుడు పాఠశాలలో పైయధికారు లగుటయే కాక, లోకజ్ఞానసంపాదన విషయమున గురుప్రాయులు కూడనయిరి. అనుదినమును పురవీథులయందు నడచిపోవునపుడు, కనఁబడిన పరిచితుల యోగక్షేమ మారయుచు, వారి కష్టసుఖములు తెలిసికొనుచును, అనంతముగారు లోకబాంధవు లనిపించుకొనిరి. నూతన ప్రదేశమునఁ గ్రొత్తకాపుర మేర్పఱుచుకొనిన యువదంపతుల మగు మా సేమము పలుమారు వారు గనిపెట్టుచు, ప్రేమాస్పదులగు జనకునివలె మాకు సదాలోచనములు చెప్పుచునుండువారు. శాస్త్రజ్ఞాన లాభమందినను అనుభవమునఁ గొఱవడిన నా కా బాల్య దినములలో, వారి హితబోధనమును, ముఖ్యముగ వారి పవిత్ర జీవితమును, సత్పథగమనమున నమితముగ సహకారు లయ్యెను.

ప్రథమ దినములలో నాకుఁ బలుమారు, ధనసాహాయ్యము కావలసివచ్చెను. క్రొత్తకాపుర మనఁగనే ధనవ్యయ మధికము. దీనికిఁదోడుగ, రాజమంద్రి యందలి కుటుంబ వ్యయమునకును, తమ్ముల విద్యాపరిపోషణమునకును, నేను నెలనెలయును సొమ్ము పంపవలసివచ్చుచుండెడిది. చదువు వార్తా పత్రికలకును, కొను పుస్తకములకును, తఱచుగ డబ్బు కావలసివచ్చెడిది. అట్టి యక్కఱలకెల్ల, అనంతముగారు, నా జీతములోనుండి సొమ్ము ముందుగ నిచ్చుచుండెడివారు. నే నిట్టి యప్పులకు తఱచుగ వారియొద్దకుఁ బరుగులిడుచు, ఆచిరకాలముననే వారిని విసింగించితిని ! ఒకటిరెండు మాఱులు అనంతముగారు నాకు ధన విషయమున జాగరూకత యత్యావశ్యమని మెల్లగ సూచించిరి. కాని నాకది బాగుగ నచ్చకపోవుటచేతనో, నాయవసరము లసంఖ్యాకము లగుటచేతనో, నాయప్పులకు తెంపు లేకుండెను ! ఆగష్టునెల చివర నొకనాఁడు నే నాయనను సొమ్మడుగఁగా, అది యొసంగుచు, యువకులు అప్పులపాలు గాకుండుట కర్తవ్యమని నను వారు హెచ్చరించిరి. ఆయన వాక్కులు నాహృదయమునం దీమాఱు సూటిగ నాటెను ! ఇంకఁ బలుమా ఱీయప్పులు చేయకుందు నని నామనస్సును దిట్టపఱుచుకొంటిని. అప్పుడును, పిమ్మట పెక్కువత్సరముల వఱకును, నా ఋణబాధ శమింపకుండినను, చిట్టి యప్పులకై చీటికి మాటికి చెలికాండ్ర చెంత చేయిచాచు నలవాటు చాలించుకొంటిని !

అనంతము గారి స్నేహము మఱికొన్ని సందర్భములందును నాకు లాభకారి యయ్యెను. ఆయనకు ప్రథమకళత్రమువలన రామచంద్రరావు, ఆనందరావు నను పుత్రులు గలరు. వీ రపుడు మా పాఠశాలావిద్యార్థులు. భార్యమరణానంతరమున అనంతముగారు చెన్న పురియందలి యొకగౌరవక్రైస్తవ కుటుంబములోని సౌభాగ్యవతి యను పడతిని బరిణయమయిరి. సౌభాగ్యవతి తనసుందరాకారమున కెనయగు సుగుణసంపత్తిని దాల్చియుండెను. విద్యావంతుఁడును, అకుంఠిత దైవభక్తిపరుఁడును నగు భర్తయం దీమెకు భక్తిగౌరవములు మెండు. సవతికుమారులయం దీసతి యమితపుత్రవత్సలతఁ గాంచియుండెను. నాయం దీసుదతికి సోదరభావము గలదు. నాభార్య కీమెతోఁ బరిచయము గలిగినప్పటినుండియు, పలుమారీయునిదలిరువురును గలసికొని, యొకరి కష్టసుఖము లొకరు చెప్పుకొనుచు వచ్చిరి. సతివిద్యాభ్యున్నతి విషయమై సంతత పరిశ్రమముఁ జేయుచు, అపరిమితమగు నలజడి పాలగుచునుండెడి నాకీ సుదతీమణి, చిన్ని తమ్మునితోవలె, భార్యను నేను ప్రేమించి లాలింపవలె ననియు, నగలవిషయమందామెకుఁ గల చిన్నకోరికలు చెల్లింపవలె ననియును, మెల్ల మెల్లగ హితబోధనముఁ జేయుచుండెడిది. గర్భసంబంధమగు వ్యాధికి లోనయిన నాసతికి, తరుణముననే చికిత్స చేయించి, గార్హస్థ్యజీవితమును సుఖప్రదముగఁ జేసికొమ్మని ప్రేమపూరిత హృదయయగు సోదరివలె నీసౌశీల్యవతి నా కుద్బోధనము చేయుచుండెడిది.

ఆ పత్నీ పతుల యన్యోన్యానురాగము కడు శ్లాఘాపాత్రముగ నుండెను - ఎన్నఁడుగాని అనంతముగారు తమసతీమణిమీఁద నలుక చెందుట నేను గాంచియుండలేదు. ఆకోమలి పతిమీఁదఁ గినుక వహించుటయు నెఱుఁగను. సంతత కోపావేశమునను, పరుషవాక్య ప్రయోగమునను, సతీహృదయమును చీకాకుచేసి, స్వకుటుంబశాంతినిభంగ పఱచుకొనియెడి నాకు, వీరి యనుకూలదాంపత్య మాదర్శప్రాయముగ నుండెను. ఒకనాఁడు, సంసారసౌఖ్యరహస్యమును గుఱించి అనంతము గారు నాతో ముచ్చటించుచు, మలయమారుతపుఁదాఁకుననె సౌరభము నొకింత కోలుపోవు కోమలకుసుమముతోఁ గుటుంబ సౌఖ్యమునుఁ బోల్చి, భావగర్భితముగ మాట్లాడిరి. దాంపత్య జీవితమున కామ సుఖలాలసయే ప్రధానమని భావించు స్త్రీలోలుఁ డెన్నఁడును, ఏతత్సుఖానుభవమునకు దూరుఁడగుచుండు నని నే నపుడు గ్రహించితిని. కాని, యౌవనప్రాదుర్భావమునఁ జెలంగువారలకు జితేంద్రియత్వ భాగ్య మొక్కసారిగ లభించుట కడు దుర్లభముకదా.

8. యం. యే. పరీక్ష.

ఆగష్టు 20 వ తేదీని వేకువనే నేను షికారుపోయి, నా భావికాల కర్తవ్యములనుగుఱించి యీజించితిని. నేను యల్. టి. పరీక్ష పూర్తిచేసినఁ గాని నా కీవృత్తిలో వేతనాభివృద్ధి గలుగ దనుట స్పష్టము. ఆ పరీక్షలో జయ మందుటకు వేఱుగ ప్రయత్న మక్కఱయే లేదు. నన్నుగుఱించి పరీక్షాధికారులు సదభిప్రాయ మందుటయే నా విజయమునకు హేతువు. ఇట్టి యదృష్టముమీఁద నేను బూర్తిగ నాధారపడక, స్వయంకృషిచేత దీని కంటె నుత్తమపరీక్ష నిచ్చి, బోధకవృత్తిని చిరస్థాయిగఁ జేసికొనవలదా ? అదియే యం. యే. పరీక్ష. నే నందు జయ మందినచో, యల్. టి. లో మరలఁ దప్పిపోయినను, ఏ కళాశాలలోనైన నిప్పటికంటె మిగుల గౌరవస్థానమును బడయనర్హతను గాంచియుందును. కావున నేనా యున్నత పరీక్షకుఁ జదువ నిపుడు దీక్షవహించితిని. ఆంగ్ల సాహిత్యమునందు నా కభిరుచి మెండు. అయినను దానిలోకంటె తత్త్వశాస్త్రముననే నేనా పరీక్షకుఁ జదివినచో, వినోదములును, జ్ఞానదాయకములునునగు మహత్తరవిషయము లనేకములు గ్రహింప నా కవకాశము గలుగును. ఇట్లే చేయుమని వెంకటరత్నమునాయఁడుగారు మున్నగు మిత్రులును నాకుఁ జెప్పిరి. కావున నేను తత్త్వశాస్త్రమున యం. యే. పరీక్షకుఁ జదువ నుద్దేశించుకొంటిని.

నే నానాఁడు నిశ్చయించుకొనిన సంగతి యింకొకటి కలదు. నా కీలోకమునఁ బ్రియతమమగు విషయములలో పరిశుద్ధాస్తికమతవ్యాపనమొకటి. ఇది మెల్లగఁ గొనసాగించుటకుఁ బ్రార్థనసమాజస్థాపన మావశ్యకము. ఈబెజవాడపట్టణమం దిదివఱకు బ్రార్థనసమాజము లేకుండినను, ఏతత్సమాజాభిమానులు లేకపోలేదు. కాని, వయసు వచ్చినవారినికంటె, విద్యార్థియువకులనే ప్రార్థనసమాజసభ్యులగఁ జేర్పఁబ్రయత్నించుట శ్రేయము. బాల్యమున విద్యార్థిమనోక్షేత్రమునఁ బడిన మతబీజములు సకాలమున మొలకలెత్తి భావిజీవితమున విజృం భించి సత్ఫలముల నొసంగఁగలవు. కావున ప్రార్థనసమాజ మిట స్థాపించి, నా విద్యార్థిస్నేహితుల నందుఁ జేర్పింప నే నుద్యమించితిని. ఒకనాఁడు సంభాషణసందర్భమున అనంతముగారితో నే నీసంగతి ప్రస్తావింపఁగా, వారు క్రైస్తవమతవిశ్వాసకు లయ్యును ప్రార్థనసమాజస్థాపనము విద్యార్థుల నైతికాభివృద్ధికి లాభకరమని యొప్పుకొని, నాకుఁ బ్రోత్సాహముఁ గలిగించిరి. క్రైస్తవమతస్థుల కన్యమతప్రచార మంతరంగమున నసమ్మత మని నామిత్రులును, పాఠశాలలో నాంధ్రోపాధ్యాయులునునగు జానపాటి కామశాస్త్రులుగారు సదా హెచ్చరించుచుండినను, ప్రార్థనసమాజాదర్శములు మొత్తము మీఁద క్రైస్తవుల కిష్టములే యనియును, మాపాఠశాలాధికారులగు క్రైస్తవసంఘమువారు నాయెడ సానుభూతిఁ జూపుదురనియును దలంచి, నే నీకార్యమునకుఁ గడంగితిని. 25 వ ఆగష్టు శనివారమునాఁడు ప్రార్థనసమాజస్థాపనము జరుగునని పాఠశాలలోని పైతరగతులలో నేను బ్రకటించితిని.

కాని, ఆరోజున "హిందూబాలసమాజము" నెలకొల్పఁ బడునని నేనొక ప్రకటనము చూచితిని. కాన నాఁడు ప్రార్థనసభ జరుగుటకు వలనుపడ దనియు, ప్రార్థనసమాజస్థాపన మొకవేళ నా యుద్యోగమునకే భంగకరముగఁ బరిణమింపవచ్చు ననియును నేను దలంచి, "సంఘపారిశుద్ధ్య సమాజము"ను నెలకొల్పినచో, నే నెవరియీర్ష్యకును లోనుగాక విద్యార్థిలోకమునకు మే లొనరింపఁగలనని యెంచితిని. "హిందూబాలసమాజము" విద్యార్థుల నీతిపోషణమునకు సహకారి కాక, విగ్రహారాధనాది మూఢవిశ్వాసములకుఁ బ్రోత్సాహకరముగ మాత్రముండునని నమ్మి, ఆసమాజమునఁ జేరవలదని నావిద్యార్థులకు బోధించు చుండువాఁడను. హిందూమత మనిన నాకెంతో వెగటుగను విగ్రహారాధనము కంటకసదృశముగను నుండెడిది. మా చిన్న మేనమామ వెంకయ్యగారు మమ్ముఁ జూచిపోవుటకు సెప్టెంబరు 5 వ తేదీని బెజవాడ వచ్చి, కృష్ణానదిని కనకదుర్గాలయమును దమకుఁ జూపింపుమని నన్ను గోరిరి. నేనీ పట్టణము వచ్చి కొన్ని నెలలైనను, దుర్గాదేవిదర్శన మింకను జేసికొనియుండలేదు. మామేనమామ ప్రోత్సాహమున నేనిపుడు ఆగుడి కేగితిని. పర్వతమధ్యమున నొక రమ్యప్రదేశమునం దాదేవాలయము నిర్మింపఁబడెను. ఆ పరిసర దృశ్యము లత్యంత రమణీయములు. మామామ నన్ను గర్భాలయములోని కాహ్వానింపఁగా, ఆయనను సంతృప్తిపఱచుటకే నేను లోని కేగినను, దుర్గ విగ్రహమునకు మ్రొక్క నాకుఁ జేతులు రాలేదు! భక్తిపారవశ్యమున వినమ్రుఁడైన తనసరసను, చేతులు జోడింపక, చెట్టువలె నిలువఁ బడిన నామీఁద మామామ మిగుల విసువుఁజెందెను. దేవునికిని పూజారికిని కాసైనఁ జెల్లింపక నే నెటులో యంతట బయటపడితిని !

సెప్టెంబరు 8 వ తేదీని బెజవాడపట్టణ మమితకల్లోలమున కాకర మయ్యెను. కొన్ని దినములక్రింద నచటి కొక మార్వాడీవర్తకుఁడు వచ్చి, యెక్కువ వడ్డీనిచ్చి, జనులనుండి చిన్న చిన్న యప్పులఁ గొనఁజొచ్చెను. రూపాయి బదులిచ్చినవానికి వారమురోజులపిమ్మట పావులావడ్డితో అసలీయఁబడుచుండెడిది ! ఈమనుజునిచుట్టును జనులు మూఁగుట చూచి, యీతనివలెనె మఱికొందఱు ఎక్కువవడ్డీకి బదుళ్లు పుచ్చుకొనసాగిరి. అంతకంతకు వడ్డీపరిమితి పెరిఁగి, వారమునకు రూపాయికి రూపాయి యయ్యెను ! పేదజను లీ వ్యాపారవ్యామోహమునఁ బడి, తమ వృత్తులు కట్టిపెట్టి, తమకుఁగల ధనమంతయు బదుళ్లలోఁ ద్రిప్పసాగిరి. ఒకనాఁడు నామిత్రుఁడును, వాణీముద్రా క్షరశాలాధికారియును నగు శ్రీ దాసు కేశవరావుగారియింటికేగి, యచట ముద్రితమయ్యెడి ప్రకటనపత్రిక నొకటి నేను జూచితిని. "అత్యా పేక్షాధైర్యసంఘము" అను పెద్దపేరు పెట్టుకొనిన యొక వడ్డీవ్యాపారస్థుని సంస్థనుగుఱించిన కాకితమే యిది! అత్యా పేక్ష ధైర్యమునకైనను అధైర్యమున కైనను, ఎడమీయు నని యిందలి ధ్వన్యర్థ మని నవ్వుచు స్నేహితుఁడు నాకుఁ జెప్పెను. నదీప్రవాహమునఁ గన్పడు బుడగలవంటి యీవర్తకసంఘములు, దురాశచే నేర్పడు నవియేగాని సదుద్దేశముతో నెలకొల్పఁబడునవి కావు. అప్పుపుచ్చుకొన్న కొంచెపు మొత్తములతో విరివిగ నేవర్తక వ్యాపారములు స్వల్ప కాలమున సాగఁగలవు? కావున కేవల ద్రోహ చింతనముతోనే యీసంఘములు వెల సె ననుట స్పష్టమయ్యెను. ఈద్యూతవ్యాపారము ప్రబలు దినములలో రక్షకభటులు, ప్రభుత్వోద్యోగులును ఏచర్యనుఁ బుచ్చుకొనక, 8 వ సెప్టెంబరున నకస్మాత్తుగ సంఘమువెంటసంఘము దివాలుచేయుటచేత సొమ్ము పోఁగొట్టుకొనిన జనుల కోలాహలము ప్రబలినప్పుడుమాత్రమే, వారు తమ కర్తవ్యమునకుఁ గడంగుటకై కనులు తెఱచిరి ! పురమం దెచటఁ జూచినను కొద్దిగనో గొప్పగనో సొమ్ము పోఁగొట్టుకొని విలపించుజనులే గానవచ్చిరి ! మాపాఠశాల బంట్రోతు కనకయ్య తన సంగతి నాకుఁ జెప్పెను. తాను మూఁడు నాలుగు రూపాయి లీ యప్పులకు ముందు పెట్టుబడి పెట్టి, కొద్ది రోజులలో ముప్పది రూపాయలవఱకును బెంచి, దానిలోఁ జాలవఱకిపుడు కోలుపోయినను, తనయొద్ద నింకను పది పదునైదు రూపాయిలు నిలిచియుండె నని చెప్పెను. కడుధైర్యముతోనైనను అధైర్యముతోనైనను అతిలోభబుద్ధితో జరిగెడియిట్టి వ్యాపారద్యూతము, జనసామాన్యమునకు తుదకు చేటు తెచ్చుననుట కీయుదంతమే తార్కాణము!

9. కష్టకాలము, శుభకార్యము

అమలాపురోద్యోగపుఁజిక్కు లింతటితోఁ దొలఁగలేదు. నేను బెజవాడయందలి యుద్యోగమున నుండుటకే నిశ్చయించుకొంటిని కాని, అమలాపురోద్యోగము వదలితి నని వ్రాసివేయలేదు ! వదలుకొనుటకు ముందుగ, ఆపని నాకీయఁబడె నను కాకితమే యింతవఱకును నాచేతి కందలేదు! కావునా నా కీయుద్యోగ మక్కఱలేదని నే నెట్లు వ్రాసివేయఁగలను? ఎట్టకేలకు, 8 వ సెప్టెంబరున అమలాపురపుఁబని నా కిచ్చితి మని నాగోజీరావు పంతులుగారి నుండి హుకుము వచ్చెను. నా కిటు లొసఁగఁబడినట్టియు, దొరతనమువారి కొలువుతో సమానస్థిరత్వముగలిగినట్టియు, బోర్డుపని వలదని చెప్పివేసి, క్రైస్తవపాఠశాలను నమ్ముకొని యుండుట భద్రమా యని నే నంత సందేహ మందితిని. బెజవాడమీఁదుగఁ బ్రయాణము చేయు నాగోజీరావుపంతులుగారిని నేను రెయిలుస్టేషనులో 11 వ తేదీని గలసికొంటిని. వెంటనే బెజవాడ పని వదలి, అమలాపురము పొమ్మని వారు ఖచితముగఁ జెప్పివేసిరి! మరల నే నీ విషమద్వంద్వావస్థలోఁ జిక్కుకొనిపోయితిని !

ఇపుడు కొన్నిరోజులు సెల వగుటచేత 16 వ సెప్టెంబరున రాజమంద్రి వెళ్లి, సబ్‌కలెక్టరును జూచి మాటాడితిని. ఈవిషయమై తా నేమియుఁ జేయలే ననియును, నేను నాగోజీరావుగారినే సంప్రదించి చిక్కు విడదీసికొనవలె ననియును, ఆయన చెప్పివేసెను. అమలాపురమందలి యుద్యోగమును స్వీకరింపఁజాలనని నేనంత పంతులుగారికి వ్రాసివేసితిని.

రాజమంద్రిలో నాకనుల కెల్లెడలను కష్టదృశ్యములే కానవచ్చెను. పాపము, దొరతనమువారికళాశాలలో నూఱురూపాయిల వేతనముగల మంచిఉద్యోగము దొరకిన మృత్యుంజయరావున కేమియు సౌఖ్యము లేదు. కఠినవ్యాధి వానిదేహమును బీల్చి పిప్పి చేయుచుండెను ! తోడిబోధకు లాతనిదెస నసూయాగ్రస్తులై యుండిరి. మా కుటుంబములో చిక్కులు మిక్కట మయ్యెను. తండ్రియు తమ్ముఁడు నెంత ప్రయత్నించినను మాచెల్లెలి కింకను వివాహసంబంధము కుదురలేదు. మేము రాజమంద్రిలో నిలిచిన యానాలుగుదినములలోనె మాయింటియం దత్తకోడండ్ర సామరస్యము వెల్లడి యగుచుండెను! ఈ కష్టపరంపర వీక్షింపలేక, నాయక్షులు సంక్షోభించెను.

అంత మేము 23 వ సెప్టెంబరున బెజవాడకు వెడలిపోయితిమి. కొన్ని దినములకుఁ బిమ్మట ననంతముగారు నాతో మాటాడుచు, తా మిటీవల క్లార్కుదొరతో సంభాషించితి మనియు, నేను గోరినచో డిసెంబరులో అమలాపురము వెడలిపోవచ్చు నని యాయన పలికి రనియుఁ జెప్పిరి ! బెజవాడ వీడుటకుమాత్రము నాకు మన సొప్పకుండెను.

అక్టోబరు 13, 14 వ తేదీలలో సతీపతులుభయులము బంధు సందర్శనార్థమై ఏలూరు వెళ్లియుంటిమి. అచటఁ గ్రొత్తగఁ గాపురమునకు వచ్చిన నామఱఁదలు శ్యామలాంబకు, ఆమెభర్తయగు వెంకటరత్నముతోను, ఆతని తల్లితోను మనస్పర్థలు ప్రబలుట విని, వారి గృహకల్లోలము లొకింత శమియింపఁబూనితిమి, ఇంట నంతఁగఁ బొత్తులేని మేమంతట యాయువదంపతులకుఁ జెలిమిచేకూరు సుద్దులు చెప్పి, బెజవాడకు మరలివచ్చితిమి.

ఒకనెల జీతము ముందుగఁ దీసికొని, మాచెల్లెలి వివాహమునకై యుభయులమును అక్టోబరు 20 వ తేదీని రాజమంద్రి పోయి తిమి. తమ్ముఁడు కృష్ణమూర్తి సన్నిపాతజ్వరముచేఁ బీడితుఁడై యుండెను. నాలుగుదినములలో జరుగఁబోయెడి మాచెల్లెలి వివాహమునకు బంధువులను బిలుచుటకై మాతండ్రి రాజమంద్రినుండి వెడలిపోయెను. అర్తమూరు సంబంధము మే మంత నిశ్చయించి, పెండ్లికుమారుని తలిదండ్రులకుఁ దెలియఁబఱచితిమి. ఒక మూల పెండ్లిపనులు, వేఱొక మూల రోగికిఁ బరిచర్యలు !

వివాహదినమగు బుధవారము సమీపించినకొలఁది, మా యలమట మఱింత హెచ్చెను. బంధువుల పిలుపునకుఁ బోయిన మా తండ్రి పెండ్లి వెనుకటిరోజునకైన నిలు సేరలేదు ! తమ్మునివ్యాధి నిమ్మళింపలేదు. ఎట్టకేలకు మంగళవారమురాత్రికి మాజనకుఁడు బంధుసమేతముగ నింటికి వచ్చెను. పెండ్లివారుకూడ ధవళేశ్వరమునకు వచ్చియుండిరని తెలిసెను.

పెండ్లికొమార్తెకు జ్వరము వచ్చుటచే వివాహము మఱునాఁడు జరుగలేదు. ఎట్టకేలకు 25 వ అక్టోబరు, గురువారము ప్రాత:కాలమున ధవళేశ్వరమున జనార్దనస్వామి యాలయమున మాచెల్లెలు కనకమ్మను పులుగుర్త సీతాపతిరావున కిచ్చి వివాహము చేసితిమి. మాతమ్ముఁడు కృష్ణమూర్తి వ్యాధిగ్రస్తుఁ డగుటవలన వానిని విడిచి మా తలిదండ్రులు రాఁజాలక పోయిరి. కావున నేను భార్యయును కన్యాదానము జరిపితిమి. ఒక జాములోనే వివాహము పూర్తి కాఁగా మేము రాజమంద్రి వచ్చి చేరితిమి.

అంత మా తమ్ముని జ్వరము మఱింత హెచ్చెను. రంగనాయకులు నాయఁడు గారు మిగుల శ్రమపడి రోగి కౌషధము లిచ్చుచుండిరి. కొలఁది దినములలోనె పెండ్లికూఁతునికీ జ్వరము సోఁకెను. నేను మరల 29 వ అక్టోబరు సోమవారమే నా యుద్యోగమునఁ బ్రవేశింపవలెను గాన, మేము ఉభయులమును వెనుకటిరోజుననే బెజవాడకు వెడలిపోయితిమి.

10. బెజవాడ స్నేహితులు

పెండ్లిలోనే యారంభమైన మాచెల్లెలి యస్వస్థతయు సన్ని పాతజ్వరముగనె బరిణమించెను ! మిత్రుఁడు రంగనాయకులు నాయఁడుగారు నాయందలి యవ్యాజసోదరబావమున నా తమ్మునికిఁ జెల్లెలికిని మిగుల శ్రమపడి వ్యాధి నివారణముఁ జేసిరి. జ్వరవిముక్తులై తెఱపిని బడిన వారిరువురును మిగుల బలహీనదశ నుండిరి. శరీరమున సత్తువ పుట్టుటకై నాయఁడుగారు వారికి మంచిమందు లొసఁగిరి. ఎట్టకేలకు వా రిరువురును పూర్ణారోగ్యవంతులైరి.

బెజవాడ "స్వయంకృషి సమాజము" వారు తమ సమాజవర్థంతికి న న్నధ్యక్షునిగాఁ గోరఁగా, నా యుపన్యాసము సిద్ధపఱచితిని. 10 వ నవంబరునం దాయుత్సవము జరిగెను. అనుకొనిన యంశము లనేకములు ప్రస్తావింప నే మఱచిపోయినను, మొత్తముమీఁద నా యుపన్యాసము సమగ్రముగనే యుండెను. దానిసారము వార్తాపత్రికలకుఁ బంపితిని. నా యాధిపత్యమున జరుగు జనానాపత్రికకే కాక, యితర వార్తాపత్రికలకును దఱచుగ నేను వ్రాయుచుండువాఁడను. నే నిట్లు వ్రాయుచుండుటవలన, నయూహలకు సుస్థిరత్వమును, పదజాలమునకు సులభగమనమును, కాలక్రమమునఁ బట్టువడెను.

మత సంఘ సంస్కరణ విషయముల గుఱించి నేను దీఱికసమయములందు పాఠశాలలో బాహాటముగఁ బ్రసంగించుచుండువాఁడను ఆకారణమున విద్యార్థుల మనస్సులలోఁ గొంత సంచలనము గలిగెను. క్రైస్తవ పాఠశాలలోని హిందూవిద్యార్థులు, అన్యమతధర్మములను గుఱించియు, సంఘసంస్కరణావశ్యకమును గుఱించియు వినుచుండు వారలయ్యును, హిందువునగు నానోటనే యట్టి వాక్యము లాకర్ణించుట కచ్చెరువొందుచుండువారు. దేవళ్రాజు అనంతరామయ్య యను మా పాఠశాలలోని ప్రవేశపరీక్షతరగతి విద్యార్థి, విగ్రహారాధనమును నిరసించి, తోడివిద్యార్థుల యాగ్రహమునకుఁ బాల్పడియెను. "హిందూబాలసమాజ" సభకు నే నొకమాఱు పోయి, అచట విగ్రహారాధనమును గుఱించి జరిగిన చర్చలోఁ బాల్గొంటిని. సంస్కరణ పక్షాభిమానులగు విద్యార్థిబృందమునకు నే నిట్లు నాయకుఁడ నైతిని. పాఠశాలలోను బయటను, సంస్కరణ విషయములను గుఱించి విద్యార్థులతో నేను జర్చలు సలుపుచుండువాఁడను. 15 వ నవంబరున పాఠశాలలో "విద్యార్థి ప్రసంగసమాజ" సంవత్సరోత్సవము జరిగెను. ఆ సందర్భమున సమాజసభ్యులను హెచ్చరించుచు నా యధ్యోక్షోపన్యాసము చదివితిని. సభకగ్రాసనాధిపతి యగు డిస్ట్రిక్టుమునసబు కొప్పరపు రామారావు పంతులుగారు నా యుపన్యాసమును గొంత నిరసించినను, సభ్యుల కది సమ్మోదముగ నుండుటచే నాకుఁ బ్రోత్సాహము గలిగెను.

లోకమున నెట్టి సాధుజనులకు నొక్కొక్కతఱిని శాంతముగ దినములు గడువవు. ఆ నవంబరునెలలో మా యుపాధ్యాయులలోఁ గొందఱి కాకాశరామన్న యుత్తరములు వచ్చెను. ఒక పుణ్యవతి వర్తనమును గుఱించి యందు హేయమగు నపవాదములు సూచింపఁ బడెను ! ఊరునకుఁ గ్రొత్తనగు నా కిట్టిలేఖలు రాకుండినను, మిత్రుల వలన నీసంగతి విని నేను మిగుల విషాదము నొందితిని. ఆదంపతుల కెంతో మనస్తాపము గలిగె నని వేఱె చెప్ప నక్కఱలేదు. "మానవ మాత్రులు భూషణదూషణములకు సరిసమానముగఁ దలయొగ్గవలయు" నను లోకోక్తిని ఆకష్ట సమయమున నొకమిత్రుఁడు వచించుచుండుట నాకిప్పటికిని జ్ఞాపకము.

నేను బెజవాడ వచ్చిననాఁటినుండియు ద్వితీయోపాధ్యాయుఁడగు దేవసహాయముగారికిని నాకును మంచి స్నేహము కలసెను. మే మిరువురము సమవయస్కులము ; పలువిషయములందు పరస్పర సానుభూతి గలిగియుండువారము. క్రొత్తగ నుద్యోగమునఁ బ్రవేశించిన యువకుఁడనగు నాకష్టసుఖము లాయన యారయుచు, సోదరునివలె నిరంతరము నన్నుఁ బ్రేమించుచుండువాఁడు. ఈసంవత్సరాంతముననే యాయన బెజవాడ విడిచి మద్రాసులో నుద్యోగస్వీకారముఁ జేయ నుద్దేశించెను. నే నీపాఠశాలయం దెట్లు మెలఁగవలయునో, ఎవరి నెట్లు చూడవలయునో, నా కాయన బోధించుచుండువాఁడు. ఇరువురమును ప్రథమోపాధ్యాయునిదెస గౌరవభావము గలిగియేయుండెడివారము. ఐనను కొన్ని చిన్న సంగతులందు వారితో మాకుఁగల యభిప్రాయభేదములె, మాయిద్దఱి పొత్తును వృద్ధిచేసెను. దేవసహాయముగారు బెజవాడ వీడుదినములు రాఁగా, విద్యార్థులు తమగురువునకు బహుమానపూర్వకమగు విజ్ఞాపనపత్ర మొసంగ నిశ్చయించి, మాయిరువురికిని గల చెలిమిని బాటించి, నన్నే యాపత్రము సిద్ధపఱుపఁగోరిరి. 7 వ డిసెంబరున పాఠశాలలో జరిగిన బహిరంగసభలో నేనే విజ్ఞాపనపత్రమును జదివితిని. సహృదయుఁడు సరళ స్వభావుఁడు నగు దేవసహాయమహాశయునకుఁ దగినట్టుగ, సద్భావ పూరితముగను, లలితపదయుతముగను వినతిపత్ర మలరారుచుండెనని సదస్యులు సంతోషభరితులైరి. నా కాపాఠశాలలోఁ బ్రియమిత్రులయిన యింకొక యుపాధ్యాయుని గుఱించి కూడ నిచటఁ జెప్పవలయును. వీరు ఆంధ్రపండితులగు జానపాటి కామశాస్త్రిగారు. ఇంచుమించుగ నాయీడువారే. నావలెనే బకింగుహాముపేటలోఁ గాపురము. సామాన్యముగ మే మిద్దఱమును గలసియే పాఠశాలకుఁ బోవుచు వచ్చుచుండెడివారము. ఉభయులము పాఠశాల యావరణమున సాయంకాలమున బంతు లాడు చుందుము. సామాన్యదేశభాషాపండితులవలెఁ గాక, కామశాస్త్రిగారు ఉన్నతయాంగ్లవిద్య నభ్యసించిన యధ్యాపకునివలె విద్యార్థులను మంచియదుపులో నుంచి, వారి గౌరవ లాలనములకుఁ బాత్రు లగు చుండువారు. తాను గొంతవఱకు పూర్వాచారపరుఁ డయ్యును, కాలానుగుణ్యముగ సంఘమున కావశ్యకమైన కొన్ని సంస్కరణముల నీయన యామోదించుచుండువాఁడు.

తఱచుగ నాంధ్రవ్యాసములు రచించుచును మాసపత్రిక నొకటి ప్రకటించుచును నుండునాకు, వీరిసాయము నిరతమును గావలసి వచ్చెడిది. సరసులు, సాధుపుంగవులు, స్నేహపాత్రులును నగు శాస్త్రిగారు విసు వనుమాట నెఱుంగక, నావ్రాఁతలు దిద్దిపెట్టుచు నిరుపమాన స్త్రీవిద్యాభిమానమున నొప్పుచుండువారు.

నా కీ కాలమున పాఠశాలలోని బోధకులే గాక విద్యార్థులును గొందఱు స్నేహితులైరి. విగ్రహారాధనమును గుఱించి తనకుఁ గల స్వతంత్రాభిప్రాయములకొఱకు, సహచరుల యెత్తిపొడుపులకు గుఱియై నాయాదరము వడయుచుండిన అనంతరామయ్యను గుఱించి యిదివఱకే చెప్పితిని. మానికొండ రాజారావు, టేకుమళ్ల రాజగోపాలరావుగార్లు, తక్కినవారిలో ముఖ్యులు. మొదటి యాతఁ డానగరనివాసి. నేను షికారు పోవునపుడు ఆతఁడు నన్ను వెంబ డించుచు, పట్టణవార్తలు విడ్డూరములును బ్రస్తావింపుచుండువాఁడు. శిష్యుఁ డని యీసడింపక, అవ్యాజప్రేమమున నే నాతనిని మన్నించు చుండువాఁడను. రాజగోపాలరా వనిన రాజారావున కంతగఁ బడెడిది కాదు. ఆజానుబాహువగు రాజారావువలెఁగాక రాజగోపాలరావు పొట్టిగ సన్నముగ నుండి, ఆంధ్రసారస్వతమునఁ జక్కని యభిరుచి గాంచియుండుటచే నే నాతనిఁ బ్రేమించువాఁడను. పిమ్మట నీతఁడు నాపత్రికకు "స్త్రీచరిత కదంబము" అనుపేరిట కథలు వ్రాయుచుండువాఁడు.

1894 సంవత్సరము డిసెంబరులో మద్రాసున జాతీయ సభలు దర్శించుటకై, వీరేశలింగముపంతులు రంగనాయకులునాయఁడు గార్లు రాజమంద్రినుండి ప్రయాణముఁ జేసి, మార్గమధ్యమందలి బెజవాడలో నొకనాఁడు నా కతిథులైరి. వీరేశలింగముగారు మాయింట విడియుటకు నింటివారు తప్పుపట్టక, మీఁదుమిక్కిలి వారికి వంట చేయుటయందు నాభార్యకు సాయముఁగూడఁ జేసిరి. నేను మా తమ్ముఁడు వెంకటరామయ్యతోఁగూడి వారితోఁ జెన్న పురికిఁ బ్రయాణమైతిని. రాజమంద్రిస్నేహితుల మంత దేశీయమహాసభకుఁ బోయెడి తక్కినవిద్యాధికులతోఁ గలసి యొకబండిలో నెక్కితిమి కాన, ప్రయాణకష్టము మాకేమియుఁ దోఁపలేదు. పూర్వాచారాపరులగు సహచరులతో సంఘసంస్కరణమునుగుఱించి యత్యధికముగ వాదించుట వలన, వీరేశలింగముగారికి రెయిలులో గొంతు బొంగుపోయెను !

ఆ సంవత్సరమున జాతీయసభ కధ్యక్షుఁడు, వృద్ధుఁడు, బ్రిటిషుపార్లమెంటు సభ్యుఁడునునగు ఆల్ ఫ్రెడు వెబ్బుదొర, రెండవ నాఁటి యుపన్యాసకులలో పార్ల మెంటు సభ్యుఁడగు 'కీ' ముఖ్యుఁడు. ఈతఁడు తడవుకొనక, చేతనుండు కాకితమువంకనైనఁ జూడక, గంటల కొలఁది ఝరీవేగమునఁ బ్రసంగము చేయఁజాలినవాఁడు. సద్వర్తనముఁ గోలుపోయె నను కారణమున గొప్పవక్తయు ప్రసిద్ధన్యాయవాదియు నైన యొకదొరను సభలో మాటాడనీయవలదని ముల్లరుకన్య తెచ్చిన తీర్మానమును అధ్యక్షుఁడు త్రోసివేయుట, మిత్రుఁడు వెంకటరత్నమునాయఁడుగారు మున్నగు కొందఱి క సమ్మతమయ్యెను.

28 వ తేదీని నేను మహాసభకుఁ బోక, పూర్వగురువులు మిత్రులు నగు మల్లాది వెంకటరత్నముగారిని సందర్శించితిని. ముందు చెన్నపురిలో న్యాయవాదిపరీక్షకుఁ జదువఁబూనిన నాతమ్ముని కాయన తన యింట నొకగది యిచ్చెను. 29 వ తేదీని నేను కాంగ్రెసులోఁ గాంచిన యుపన్యాసకులలో నెల్ల సురేంద్రనాథబెనర్జీ మదనమోహన మాళవ్యాగార్లు అధిక ప్రతిభావంతులుగఁ దోఁచిరి.

డిసెంబరు 30 వ తేదీని బ్రాహ్మమందిరములో జరిగిన యొక బ్రాహ్మవివాహమును జూచితిని. జగద్విఖ్యాతిఁ గాంచిన భండార్కరు పండితుఁడు ఆసందర్భమున పురోహితుఁడు. ఇతఁడు సప్తపది మంత్రములు పఠించి, వధూవరులచే నడుగులు వేయించి వాని భావము విప్పి చెప్పునప్పుడు, పూర్వకాలపు ఋషివర్యు లెవరో యిపు డధ్వర్యము చేసి యీ యార్యవివాహామును నడపించుచుండినట్లు గాన వచ్చెను ! మఱునాఁడు క్రైస్తవకళాశాలలో చెన్నపురి సంఘసంస్కరణ సమాజ వార్షి కసభ జరిగెను. రేనడే, భండార్కరుగార్లు మహోపన్యాసము లొసంగిరి.

11. నూతన వత్సరము

1894 వ సంవత్సరము జనవరి 5 వ తేదీని నేను చెన్నపురినుండి తిరిగి బెజవాడ వచ్చినపుడు, దేశీయమహాసభ ప్రతినిధురాండ్ర: యొక్కయు, ఇతర ప్రతిభావతులయొక్కయు ప్రతిమలు కొన్నికొని చట్టములు కట్టించి నాతోఁదెచ్చితిని. ఇంట వెలిగించుకొనుటకు కాంతిమంతములగు గాజుదీపములును, ముఖము చూచుకొనుటకు ముకురములును గొనివచ్చితిని. రాత్రు లీదీపముల వెలుఁగున గోడలకుఁ దగిలింపఁబడిన పటములు ప్రతిమలును తళతళ మని మెఱయుచు, గాంధర్వలోకదృశ్యములను సూచించుచుండెను. దేశీయమహాసభయందును, తదితర మహాసభలందును నే నాకర్ణించిన సురేంద్రనాథబెనర్జీ, మదనమోహనమాళవ్యా ప్రభృతులగు మహావక్తల ప్రసంగములు నా వీనుల నింకను వినుపించునట్లే యుండెను. ఎచటఁ జూచినను నా కనులకు సౌందర్యవాహిని గోచరించెను. పక్షుల కలస్వనములందును, మానినీమణుల మందహాసములందును, ప్రకృతికాంత వదనముకురమందును, నాకు సర్వేశ్వరుని సుందరాకారము ప్రతిబింబితమయ్యెను. ప్రాచ్యదైవభక్తుల హృదయసీమలందలి బహుదేవతా విశ్వాసమున కిట్టి దృశ్యములే హేతుభూతములై యుండవచ్చునని నేను దలపోసితిని.

పాఠశాల కింకను సెలవు లుండినందున మేము రాజమంద్రివెళ్లి బంధుమిత్రులను జూచితిమి. మృత్యుంజయరావున కిటీవల జ్వరమువలన బలహీనత యతిశయించినను, ఇపుడు కొంచెము నెమ్మదిగ నుండెను. మిత్రుల మిరువురమును భగవద్విషయములను గుఱించి ముచ్చటించుకొంటిమి. ఈమధ్య వ్యాధి ముదిరి, పరిస్థితులు తలక్రిందైనపుడు తన్నావరించిన నిబిడాంధకారము నొక్కింతఁ దొలఁగించి, తన యాత్మముం దొక విద్యుద్దీపము వెలిఁగెనని నామిత్రుఁడు పలికినపుడు, నే నది యీశ్వర సాక్షాత్కారమే యని గ్రహించితిని. అనుభవసిద్ధమగు నిట్టియీశ్వరసందర్శనమే మతమునకు ప్రధానాంగము కాని, సూత్రములు సిద్ధాంతములు గావని నాకు ద్యోతకమయ్యెను. కుటుంబఋణము పెరుఁగుచుండుటచేత, అది తీర్చివేయు నుద్దేశమున మాభూము లమ్మఁజూపుటకై తండ్రియు నేనును గోటేరు మున్నగు ప్రదేశముల కపుడు ప్రయాణమైతిమి. ఈపద్ధతి మాతల్లికి సమ్మతముగ లేదు. ఈ సందర్భమున నా కామె దుర్గుణదురుద్దేశము లారోపింప వెనుదీయకుండెను ! అప్పులన్నియు విద్యాపరిపూర్తిఁజేసిన నేనును, నాపెద్ద తమ్ముఁడును మాత్రమే తీర్చివేసి, ఆస్తి యందఱమును సరిసమానముగఁ బంచుకొనుట న్యాయమని యామె తలంచెను. కుటుంబమరియాద నిలువఁబెట్టు విషయమున నాకుఁగల సద్భావ మామె సంశయించుటకు నేను మిగుల వగచితిని.

జనవరి 9 వ తేదీని మానాయనయు నేనును రాజమంద్రి నుండి బయలుదేఱి, రాత్రికి వేలివెన్నును, మఱునాఁటికి గోటేరును జేరితిమి. గోటేరులో ఋణదాత రామభద్రిరాజుగారు మాభూములు కొనుటకు మొదట సమ్మతింపకుండినను, మేము పట్టుపట్టినపిదప నద్దాని కొప్పుకొనెను. మేము తణుకులో నొకటిరెండురోజులు నిలిచియుంటిమి. నాపూర్వ సహపాఠి జనమంచి వెంకటరామయ్యగారచటి మాధ్యమికి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుఁడు. జనానా పత్రికకు వ్రాయుటకాయన సమ్మతించెను. మే మంత రేలంగి వెళ్లి బంధువులను జూచితిమి. పట్టపరీక్ష నిచ్చి, ఉద్యోగస్వీకారము చేసి, స్వగ్రామ సందర్శనముఁ జేయవచ్చిన నన్ను గ్రామస్థులు మిగుల మన్నించిరి. కుటుంబ కలహములవలన మాపెద్ద పెత్తండ్రి మొదట నాతో మాటాడకుండినను, పిమ్మట నా కెంతయో దయ చూపించెను. న న్నాయన ముద్దాడి, కంట నీరు దెచ్చుకొనెను. మే మంత బయలు దేఱి, రాజమంద్రి తిరిగి వచ్చితిమి. నేను మరల మృత్యుంజయరావును గలసికొని మాటాడితిని. సత్యసంవర్థనితోడి సంబంధము కొన్ని మాసములనుండి నేను వదలుకొనినను, నాస్నేహితునిరీతిఁ జూచి, మార్చి నెలనుండి యాపత్రికకు వ్రాయుదు నంటిని. అంత నందఱి యొద్దను వీడ్కోలు గైకొని బెజవాడకు వెడలిపోయితిమి.

చదువు నిమిత్తమై తమ్ములు కృష్ణమూర్తి సూర్యనారాయణులను బెజవాడకు మాతోఁ గొనివచ్చితిమి. వారిని మాతో నంపుటకు మాతల్లి కెంతో కష్టముగఁ దోఁచెను. 16 వ తేదీని మేము బెజవాడ చేరితిమి. మాపాఠశాల మంచిస్థితిలో లేకుండుటకు నే నెంతయుఁ జింతిల్లితిని. ఇది కారణముగ బెజవాడలో నాయునికి కంతరాయము గలుగవచ్చు నని భయమందితిని.

17 వ తేదీని వీరేశలింగముగారు సకుటుంబముగ మద్రాసు నుండి రాజమంద్రికి వచ్చుచు, మార్గమధ్యమున భోజనము నిమిత్తమై బెజవాడలో మా యింటికి వచ్చిరి. అపుడు మాయింట నన్న మమర కుండుటవలన, వేఱుచోట వారు భుజించిరి. ఈయశ్రద్ధకై భార్యమీఁద నేను గోపించితిని.

అందఱు నొకచోట నివసించినచో కుటుంబవ్యయము తగ్గునని నేను జెప్పఁగా, రాజమంద్రిలోని కాపుర మెత్తివైచి, బెజవాడలో నాయొద్ద నుండుటకు మా తలిదండ్రులు సమ్మతించిరి. తగినంతస్థలము సమకూరుటకై గోవిందరాజులవారి యింటిలో నుత్తరభాగము విడిచి, విశాలమగు దక్షిణభాగమును, దానితోఁ జేరియుండు వీథివసారాగదియును మేము నెల కైదు రూపాయీల బాడుగకుఁ దీసికొని, దానిలోనికిఁ గాపురము తరలించితిమి. ఆకాలమున బెజవాడలో డిస్ట్రిక్టుమునసబుగనుండిన కొప్పరపు రామారావుగా రిచ్చిన కొన్నివేల రూపాయిల విరాళముమీఁద వచ్చెడి వడ్డితో, ఏఁటేఁట నాంధ్రదేశమం దున్నతవిద్య నేర్చెడి పేద నియోగి బాలురకు వేతనము లీయఁబడుచుండెడివి. ఈ "యాఱువేల నియోగివిద్యార్థి సహాయకసమాజ" కార్యనిర్వాహక సభలో న న్నిటీవల సభికునిగ నెన్నుకొనిరి. 19 వ జనవరిలో జరిగిన సభకు నే నధ్యక్షుఁడను. వర్ణభేదములను బాటింపని నే నీనియోగులసమాజమునఁ జేరుటకు సందేహింపమికి, అది వట్టివిద్యాసంస్థ యని భావించుటయే కారణము.

మా తలిదండ్రులు రాజమంద్రివిడిచి బెజవాడ రాలేకపోయిరి. బెజవాడలో నాతో నాతమ్ములిద్దఱుండుటచేత, ఇంటి పని యొక్కతెయుఁ జేసికొనిలేక, నాభార్య మూలుగుచు, నామీఁద చిరచిర మనుచుండెడిది. తలిదండ్రులను విడచి యుండుటకు సూర్యనారాయణ లోన బెంగపెట్టుకొనియుండెను. నేను "జనానాపత్రిక"కు వ్రాసినవ్యాసములు వానిచేఁ జదివించుచును, పత్రికకు సొంతముగ వ్రాయుమని హెచరించుచును, ఎటులో వానిదృష్టిని జదువునకు మరలింపఁ జూచితిని. ఇంకను బలహీనుఁ డగు కృష్ణమూర్తికి బలముపట్టు మందు లిప్పించుటకై రంగనాయకులునాయఁడుగారితో నే నుత్తరప్రత్యుత్తరములు జరిపితిని.

సంసార లంపటయు నింద్రియలోలత్వమును నాయందు పెచ్చు పెరిఁగి, నామనస్సు నీశ్వరధ్యానమునుండి మెల్ల మెల్లగఁ దొలఁ గించుచుండెను. దైవభక్తియందు నాకుమరల తీపి గలిగింపఁగల యుదంత మొకటి యిపుడు సంభవించెను. నాపూర్వపరిచితులగు దుగ్గిరాల రామమూర్తిగా రీపాఠశాలలో ప్రకృతిశాస్త్రబోధకులుగ నియమింపఁబడిరి. ఆయన బ్రాహ్మమతవిశ్వాసియు, స్నేహపాత్రుఁడును. పాఠశాలలోఁ గొన్ని క్రొత్తయేర్పాటులు చేసితిమి. విద్యార్థుల యుపయోగార్థమై పఠనాలయము నెలకొల్పితిమి. నే నీయేఁడు ద్వితీయోపాధ్యాయుఁడ నైతినిగాన, దేవసహాయముగారి స్థానమున పాఠశాలలో వ్యాయామాధికారినైతిని.

మా పాఠశాలాప్రవేశపరీక్షాఫలితము లంత తెలిసెను. అనంతరామయ్య యొకఁడు మాత్రమే జయమందెను. మేము దీనికి నిరుత్సాహ మందక, పరిస్థితులు ముందు బాగుపడు నుపాయము లాలోచించితిమి. పాఠశాలలో పాఠనిర్ణయపట్టికలు సిద్ధము చేయు పని నే నిపుడు నిర్వహింపవలసివచ్చెను. ఈపని నే నెంత సద్భావముతోను నిష్పాక్షికబుద్ధితోను నెరవేర్పఁబూనినను, నామూలమున తమపని యందు చిక్కు లధికమయ్యె నని సణుగుకొనుచు, బోధకులు కొందఱు నాకు దుర్గుణము లారోపింప వెనుదీయకుండిరి !

ఫిబ్రవరి 14 వ తేదీని మమ్ముఁ జూచిపోవుటకు, మా చిన్న చెల్లెలు కామేశ్వరమ్మతోఁ గలసి మాయమ్మ బెజవాడ వచ్చెను. మృత్యుంజయరావు చిన్నకూఁతురు రామాబాయి చనిపోయె నని వారివలన విని మే మెంతయు విచారపడితిమి.

12. నిత్యవిధులు

నేను యల్. టి. పరీక్షకు మార్చినెలలో మద్రాసు వచ్చి కొన్ని రోజు లుంటిని. అచట నాతమ్ముఁడు వెంకటరామయ్యతోను, మిత్రులు వెంకటరత్నము, నారాయణస్వామినాయఁడు, కనకరాజు, గంగరాజు గార్లతోను నేను బ్రొద్దుపుచ్చితిని. నా తమ్ముఁడు పట్టపరీ క్షలో నాంగ్లమున తప్పి, ఆపరీక్ష కిచట చదుటకై చెన్నపురి క్రైస్తవకళాశాలలోఁ జేర నుద్దేశించెను. కలకత్తా భారనగరమున తాను నెలకొల్పి నడిపెడి "వితంతు శరణాలయమున"కు చందాలు పోగుచేయుటకై మద్రాసు వచ్చియుండిన శశిపాద బెనర్జీగారిని 5 వ మార్చి ని మిత్రులతో నేను సందర్శించి. నాకుఁ దోఁచిన కొంచెము చందా వారి కిచ్చితిని.

యల్. టి. పరీక్ష రెండవభాగమున నీరెండవసారికూడ నే నపజయముఁ గాంచుటచేత, ఆ లోపమును గొంత పూరించుటకై నేను యం. యె. పరీక్ష కింటఁ జదువ నుద్దేశించితిని. డాక్టరు సత్యనాధముగారిని జూచి, తత్త్వశాస్త్రమున యం. యే. పరీక్షకుఁ జదువ వలసిన పుస్తకములను గుఱించి వారి యాలోచనలు గైకొంటిని. కొన్ని పుస్తకములు కొని బెజవాడ తెచ్చుకొంటిని. చెన్నపురి కళాశాలలోఁ దనకు సౌకర్యము గలుగని కారణమున, వెంకటరామయ్య నాతో బెజవాడకు వచ్చి మాతల్లిని చెల్లెలిని దీసికొని రాజమంద్రి వెడలిపోయెను. బెజవాడలో మాతో నుండలేక, తమ్ముఁడు సూర్యనారాయణ వారిని వెంబడించెను !

పాఠశాలలో తోడిబోధకులగు రామమూర్తిగారు నాకీ కాలమున నిత్యసహవాసులైరి. విద్యాశాలలోను, బయటను మే మిరువురమును గలసి మాటాడుకొనుచు కాలము గడుపు చుందుము. ఆయన బోధనము ననుసరించి నే నిపుడు కార్లయిలు విరచితమగు "సార్టరు రిసార్టసు" అను గ్రంథరాజమును జదువ మొదలిడితిని. నేను యం. యే. పరీక్షకును, ఆయన బి. యే. పరీక్షలోని రెండవభాగమునకును మిగుల దీక్షతోఁ జదువ నారంభించితిమి. విద్యాపరిశ్రమమునకు ప్రాత:కాలమే మంచిసమయ మని యెంచి, మేము వేకువనే లేచి, యింటఁ బుస్తకములు ముందు వేసికొని కూర్చుండువారము. కాని, కడుపులో నాహారము లేక దేహమున నిస్సత్తువుగ నుండు సమయమునఁ జదువుట మంచిది కా దని తెలిసినవారము గాన, మే మిరువురమును నానురొట్టెను, కోకోను స్వీకరింప నారంభించితిమి. కోకోనీరు త్వరగఁ జేసికొనుటకు మరప్రొయ్యి మున్నగు పరికరములు సిద్ధము చేసికొంటిమి. కాని, యీ యుపాహార వస్తువులు సమకూర్చుకొను నాటోపమునందే విలువగల ప్రాత:కాలము వ్యయమగుచు వచ్చెను ! ఇదివఱకు పరగడుపునఁ బనిచేయుట కష్టముగఁ దోఁచెడి మాకిపుడు, నిండుకడుపుతోఁ బరిశ్రమించుట కష్టతరమయ్యెను ! అంతట, ఫలాహారములతో నారంభమైన ప్రొద్దుటి చదువు సాగియు సాగకమునుపే, సకాలమున పాఠశాలఁ జేరుటకై మేము భోజనసన్నాహము చేయవలసివచ్చెడిది ! చదువు వంటఁబట్టుట సందేహాస్పదమైనను, అజీర్ణరోగము, ఫలాహారాభ్యాసమును మాత్రము వెంటఁబడుట స్పష్టమని మే మంత భయపడి, యుపాహారములను త్యజించి యదేచ్ఛగ నుంటిమి !

పాఠశాలలో నంత నర్థసంవత్సర పరీక్ష లారంభమయ్యెను. పరీక్షాపత్రము లన్నియు నేనే చేతియంత్రమున నచ్చొత్తితిని. దీనివలనఁ దమపని సులువయ్యెనని సంతసించుటకు మాఱుగఁ గొందఱు బోధకులు, తమ పరీక్షాపత్రములు వేళకు నా కందీయక, నన్నుఁ జిక్కులుపెట్టి, మీఁదుమిక్కిలి నిందింప సాగిరి ! ఎట్టకేలకు పరీక్షలు పూర్తికాఁగా, వేసవికి పాఠశాల కట్టివేసిరి. 3 వ మేయి తేదీని, ఏప్రిలు "జనానాపత్రిక" నందుకొని, మేము రాజమంద్రి వెడలిపోయితిమి.

మే 10 వ తేదిని మిత్రుఁడు రంగనాయకులు నాయఁడుగారి యత్తగారు చనిపోఁగా, ఆమెశవమును కోటిలింగక్షేత్రమునకుఁ గొని పోయిరి. అదివఱకె యచట నాయఁడుగారి భార్యసమాధి వెలసియుం డెను. దానిచెంతనె వృద్ధురాలియస్తికలు చేర్పఁబడెను. నాయఁడుగా రాసమయమున ప్రార్థన సలిపిరి.

అప్పు పంచుకొని, నావంతు తీర్చివేయుమని తలిదండ్రులు పెద్దతమ్ముఁడును నా కిపుడు బోధించిరి. ఎటులో నన్ను ఋణవిముక్తునిగఁ జేసినచో నొక వేయిరూపాయి లిచ్చెద నని నేను వారలకుఁ జెప్పితిని. ఇది యుక్త మని మా మామగారును అభిప్రాయమందిరి.

నే నా రోజులలో సత్యనాధము కృపాబాయి గారిచే విరచితమగు "కమల" చదివి వినోదించితిని. మల్లాది వెంకటరత్నముగారి కోరిక ననుసరించి మాతమ్ముఁ డిదివఱకె యీపుస్తకమును తెనుఁగు చేయఁగా, దానిని సవరించి యిపుడు చెన్నపురికిఁ బంపితిని.

ఆసెలవుదినములలో, పాపము, మృత్యుంజయరావునకు వ్యాధి ప్రబలమయ్యెను. అతనిఁ జూచి మిత్రులు విషాదమందిరి. మా తల్లికీ వేసంగిలో మూర్ఛ యంకురించెను. ఆమె బాధకై మేము విచారించుచుండువారము. యం. యే. పరీక్షకై నే నీ సెలవులలో రాజమంద్రికళాశాలా గ్రంథాలయమందలి యుద్గ్రంథములు కొన్ని చదివి యందలి ముఖ్యాంశములను నాపుస్తకములలో వ్రాసికొంటిని.

25 వ మెయి తేదీని తండ్రి, పెదతమ్ముఁడు నేనును మా భూముల విక్రయమునకై రేలంగి పయనమై వేలివెన్ను చేరితిమి. అచట మాతమ్మునిమామ నరసయ్యగారు మాకుఁ గానఁబడి, తమ కూఁతుని శుభకార్యమునకు వలసిన ప్రయత్నములు జరిగిన వనియు, ఆలస్య మైనచోఁ దనకెంతో ధననష్ట మగు ననియు మొఱవెట్టెను. వధూవరుల కింత లేఁబ్రాయమున శుభకార్యము తలపెట్టగూడ దని నేను జెప్పివేసి, ఆయనపుర్ణాగ్రహమున కాహుతియైతిని ! మా మూఁడవ పెత్తండ్రి పద్మరాజుగారిని జూచుటకై మే మంత రాత్రికి పెనుగొండ వెడలిపోయి మఱునాఁడు రేలంగి వచ్చితిమి. ఆదినములలో రేలంగిగ్రామస్థులు కొందఱు రెండుకక్షలక్రింద నేర్పడి, ఒకరితో నొకరు ఘోరయుద్ధము జరుపుచుండిరి. ఈద్వంద్వయుద్ధ సందర్భమున, నిరపరాధులగు మాబోటివారును చిక్కులలోనికి రావచ్చునని నేను భీతిల్లితిని. భూములయమ్మకమునకై మాతండ్రి యంతట చుట్టుప్రక్కల గ్రామములు తిరిగెను. అపుడు మేము రేలంగి మండపాక కేతలి వడ్డూరు గ్రామములలోఁగల మాభూము లమ్మివేసితిమి. మా పెద తండ్రికుమారుఁడు మా యుభయ కుటుంబములకు నిపుడు జరుగు వ్యాజ్యెములకు వివాదములకును ముఖ్యకారణ మని వింటిమి. అతఁడు తన తప్పునొప్పుకొనినను, నేను జెప్పిన సామమార్గమునకు సులభముగ నొడంబడలేదు. ఎటులో మే మంత సమాధానపడితిమి.

ఇంకముందునుండి కుటుంబవ్యయములకుఁ గొంత సొమ్ము నెలనెలయును సరిగా రాజమంద్రి పంపుచు, కొంత సొంత కర్చులకు వ్యయపఱచుకొని, మిగిలినదానితో నప్పులు తీర్చివేసెద నని నేను నిర్ధారణచేసికొంటిని. మేము రాజమంద్రి వచ్చునప్పటికి, మాతల్లియుఁ దమ్ముడును జబ్బుగ నుండిరి. గర్భసంబంధమగు వ్యాధికి లోనయిన నాభార్య, ఇంటఁ దాను బడుకష్టములనుగుఱించి మొఱపెట్టెను. స్కాటు మెట్కాపు దొరలను సందర్శించి, పాపయ్య మృత్యుంజయరావుగార్లు మున్నగు స్నేహితుల వీడుకొలంది, నేను పత్నీ సమేతముగ జూను 19 వ తేదీని బెజవాడ బయలుదేఱితిని. తల్లిని గూర్చియు తమ్ములనుగూర్చియు నా కెంతో విచారము గలిగెను. వారలకుమాత్రము నాచిక్కు లెఱుకపడవుగదా ! మే మంత స్టీమరు ఈపేజి వ్రాయబడియున్నది ఈపేజి వ్రాయబడియున్నది. మీఁద గోదావరి దాటి, కొవ్వూరునొద్ద రెయిలెక్కి, బెజవాడ చేరితిమి. అనంతముగారిని, స్టేషనునొద్ద మేము చూచితిమి.

జూను 20 వ తేదీని పుస్తకములు సరదికొని, మిత్రులను సందర్శించి వచ్చితిని. విద్యార్థు లనేకులు నన్నుఁ జూడవచ్చిరి. బెజవాడ మకాముచేసియుండు మన్నవ బుచ్చయ్యపంతులుగా రిపుడు నాకుఁ గానఁబడిరి. నే నిచటనె యింక రెండు సంవత్సరము లుందు నని క్లార్కుదొరకు వ్రాయనా యని అనంతముగారితో నేననఁగా, అది తమకు సమ్మతమె యైనను, దొరకు వ్రాయుట సమంజసము గాదనియు, సమయము చూచి తామె యీసంగతి వారికిఁ దెలియఁజేతు మనియు వారు చెప్పిరి.

ఈ జులై నెలనుండియు, "జనానాపత్రిక" నాయొక్కని యాధిపత్యముననె ప్రచురింపఁబడుచుండెను. గతసంవత్సరమున నాకోరిక చొప్పున వెంకటరత్నముగారు తోడిపత్రికాధిపతులుగ నుండి సాయము చేసిరి. తమ కిఁకఁ దీఱదని వారు చెప్పివయఁగా, పత్రికా నిర్వహణభారము నేను వహింపవలసివచ్చెను. అంతటినుండి "జనానాపత్రిక"ను గూర్చిన పనులన్నియు నామీఁదనె పడెను. పాఠశాలలో విద్యాబోధనమును, ఇంటఁ బరీక్షాగ్రంథపఠనము, పత్రికానిర్వహణమును జేయవలసివచ్చి, తీఱిక లేక నేను తల్లడిల్లితిని. పనులు బాగుగ నెరవేర్పకుండెననియు, పాఠములు సక్రమముగఁ జదువుచుండలే దనియును నేను భార్యను సదా తప్పుపట్టుచు, నావాక్కున నిట్లు మార్దవము లేకుండఁజేసిన విధిని దూరుచు, లోనఁ బరితపించుచు, దినములు గడుపుచుండువాఁడను !

13. సహవాసులు

ఆ సంవత్సరము జూన్ 29 వ తేదీని మద్రాసునుండి రాజమంద్రి వచ్చెడి వీరేశలింగముగారిని వారిభార్యను గలసికొనుటకై, రామమూర్తిగారు నేనును రెయిలుస్టేషనుకుఁ బోయితిమి. మేము నలువురము నంత బుచ్చయ్యపంతులుగారి వసతిగృహమున కేగి యచట విందారగించితిమి. రాజ్యలక్ష్మమ్మగారి నొకదినము బెజవాడలో నిలుపఁగోరిన గురువమ్మగారు, వీరేశలింగముగారి ప్రతికూల వికటవచనములకు నిరుత్సాహులై యూరకుండిరి !

ఆరోజులలో రామమూర్తి నాకు గుండెకాయయే ! అనవరతమును చదువుసాములు సరససల్లాపములు నా కాతనితోడనే ! పలు విషయములం దిరువురము నేకాభిప్రాయలము. జులై 5 వ తేదీని పాఠశాలలో "విద్యార్థిసాహితీసమాజ" సభలో మే మిరువురమును ప్రసంగించితిమి. నా వాక్యము లేమియు సారస్యముగ లేవని నేను మొఱవెట్టఁగా, అట్లు కాదనియు, నా పలుకులింపుగను సొంపుగను నుండెననియు పలికి, మిత్రుఁడు నాకుత్సాహము గలిగించెను. మే మిరువురము తఱచుగ నుపన్యాసము లొసంగ నుద్యమించితిమి.

జూలై 25 వ తేదీని రామమూర్తిగారి పుత్రునికి జబ్బుచేసి, కొన్ని గంటలలోనే వానికి మృత్యువు సంభవించెను. మా కెంతో మనస్తాపము కలిగెను. ఈపిల్లవాని యన్నప్రాశనశుభకార్యము కొలఁది కాలముక్రిందటనే యతివైభవముగ జరిగెను ! మనుష్యజీవిత మింత యస్థిరమగుటకు మే మాశ్చర్య మందితిమి.

ఆగష్టునెలనుండి "జనానాపత్రిక"లో ప్రకటించుటకై "గృహనిర్వాహకత్వ"మను పుస్తకమును వ్రాయఁదొడంగితిని. కీలీదొరసాని వ్రాసిన చిన్న పుస్తకము నారచనకు మాతృక, అప్పటినుండియు నెల నెలయును నేనా పుస్తక ప్రకరణములను జనానాపత్రికలోఁ బ్రకటించుచుంటిని. కమలాంబచరిత్ర తర్జుమా బాగుగ లేదని వెంకటరత్నముగారు చెప్పుటచేత నేనా పుస్తకమును మరల తెలుఁగు చేసితిని. 11 వ ఆగష్టు ఆదివారమురోజున రామమూర్తియు, నేనును, బెజవాడలో "ప్రార్థనసమాజ" స్థాపనముఁ జేసితిమి. నేను ప్రార్థన సలిపి, దైవభక్తిని గుఱించి ప్రసంగించితిని. నామిత్రుఁడు సమాజోద్దేశముల విషయమై యుపన్యాస మొసంగెను.

ఆకాలమున చెన్నపురి రాజధానిలోని ఆంధ్రమండలముల ప్రతినిధులు శాసననిర్మాణ సమాజసభ్యుల నేర్పఱుచుటకై బెజవాడలోఁ గూడుచువచ్చిరి. ఈమాఱు 15 వ ఆగష్టున నీ సభ బెజవాడలో జరిగెను. పురపాలక సంఘముల పక్షమున శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగా రెన్నుకొనఁబడిరి. ఇది మా కందఱకును సంతోషకరముగ నుండెను.

ఈ సంవత్సరపు పరీక్షాఫలితములైన బాగుగలేనిచో, తానీ పాఠశాల వదలివేయుదు నని అనంతముగారు చెప్పివేసిరి. అందువలన నా కెంతో యలజడి గలిగెను. నేనిపుడు ప్రథమసహాయోపాధ్యాయుఁడనై, ఆటలు పాఠక్రమపట్టిక మున్నగు పనులయం దాయనకుఁ దోడ్పడుచుండుటచేత, నా కాయన పలుకులు కొంత భీతిని జనింపఁ జేసెను. పాఠశాలాభివృద్ధికొఱ కెంతో పాటుపడితిమి.

16 వ ఆగష్టున మాపెద్దపెత్తండ్రి చనిపోయె నని తెలిసి తమ్ముఁడు నేనును మిగుల విషాదమందితిని. 22 వ ఆగష్టున బాలికా పాఠశాలాధికారిణి యగు బ్రాండరుదొరసాని దగ్గఱనుండి నా కొక జాబువచ్చెను. "జనానాపత్రిక" వ్యాసశైలి కఠినపాకమున నున్నదను మొఱ విని, నే నాశ్చర్యవిషాదముల నందితిని !

24 వ సెప్టెంబరున అనంతముగారు, రామమూర్తిగారు నేనును సకుటుంబముగ విద్యార్థులు కొందఱితోఁ గలసి, కొండపల్లి కొండను జూచుటకై రెయిలుమీఁద బయలుదేఱి, అచటి సత్రములో రాత్రి విడిసితిమి. మఱునాఁడు వేకువనే చలిదియన్నము తిని, అందఱము కొండయెక్క నారంభించితిమి. విద్యార్థులు మాముందు దుముకుచు కోఁతులవలె కొండ కెగఁబ్రాకిరి. ముందు పురుషులము, వెనుక స్త్రీలు నంత బారుగ నేర్పడి, నడువసాగితిమి. అచటి దృశ్యము లత్యంతరమణీయములుగ నుండెను. దారి కిరుకెలంకులను చెట్లు, పొదలును గలవు. వానిమీఁదఁగూర్చుని పక్షులు మధురరుతములు చేయుచుండెను. సుందరలతలు, కమ్మఁదావుల వెదజల్లువృక్షములు, వృక్షములఁ దల దాల్చిన పర్వతశిఖరములును, కనుల పండువు సేయుచుండెను. సృష్టిలో ప్రస్ఫుటమైన సర్వేశ్వరుని సుందరాకారము మాకు చక్షుగోచర మయ్యెను. కొండమీఁద "కిల్లా" మా కపుడు కానవచ్చెను. పాడుపడిన ప్రాచీనపుకోటగోడలు చూచి పూర్వకాలపుసంగతులు నాకు స్ఫురణకు వచ్చెను. ఈదృశ్యము లాధారముగఁ గైకొని ముందు నేనొక చిత్రకథ గల్పింప సంకల్పించుకొంటిని ! కొనకొండమీఁదికి మే మంత వేవేగమే ప్రాఁకిపోయితిమి. అచట గీతములు పాడి వినోదమునఁ గాలక్షేపము చేసితిమి. రాత్రి యగుసరికి మేము కొండ దిగి, సత్రమున కేగి, మరల నచట వంటచేసికొని సుఖభోజనము చేసితిమి. మఱునాఁడు చలిదియన్నము తిని రెయిలుస్టేషనుకు వెడలిపోయితిమి. కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి కెక్కినది. బోగముమేళములు, కలెక్టరుకచేరి, తాడిదానిమ్మలు, ఆవులు, పాములు మొదలగు జంతువులు, మున్నగు వానియాకారములు చిన్నచిన్న కొయ్యబొమ్మలరూపమునఁ జెక్కఁబడి, కొద్దినెలల కమ్మఁబడుచుండెను. ఈబొమ్మలు కొన్ని కొని మేము రెయిలులోఁ గూర్చుండి, మధ్యాహ్నమునకు బెజవాడఁ జేరితిమి.

ఆ దసరా సెలవులలో "జనానాపత్రిక"కుఁ గ్రొత్తచందాదారులను సమకూర్చుటకై 27 వ సెప్టెంబరున బుచ్చయ్యపంతులు గారితోఁ గలసి నేను గుంటూరు వచ్చితిని. ఆయనద్వారా నాకు కళాశాలలో నుపన్యాసకులగు పసుపులేటి వెంకటకృష్ణమ్మనాయఁడు గారు పరిచితులైరి. ఆయన సజ్జనులు, విశాలహృదయలును, గుంటూరు పురపాలక సంఘాధ్యక్షులగు నాయఁడుగారి కచట మిగుల పలుకుబడి కలదు. ఆయన నన్నుఁ దమస్నేహితులయిండ్లకుఁ గొనిపోయి, నా పత్రికకుఁ జందాదారులై స్త్రీవిద్యకుఁ బ్రోత్సాహము గలిగింపుఁ డని వారితో నొక్కి చెప్పిరి. ఈకారణమున గుంటూరులో నాపత్రికకుఁ గొందఱు చందాదారు లేర్పడిరి. ఈలాభమునకంటె నెన్ని మడంగులో విలువగల సహృదయులగు నాయఁడుగారి పరిచయలాభము నాకీ సందర్భమునఁ జేకూరెను.

రాజమంద్రిలో వ్యాధిగ్రస్తులైన తమ యన్న రంగనాయకులునాయఁడుగారిని సందర్శించుటకై చెన్నపురినుండి డాక్టరు నారాయణస్వామినాయుఁడుగారు అక్టోబరు 2 వ తేదీని బెజవాడ వచ్చిరి. బెజవాడ పరిసరములనుండు బుడమేరునది అంతకుఁ గొన్నిదినముల క్రిందటనె కురిసిన యధికవర్ష ములవలన నకస్మాత్తుగఁ బొంగుటచేత, రెయిలుకట్ట కాలువగట్టులును తెగిపోయెను. ఆకారణమున రెయిలు బెజవాడనుండి యేలూరునకు సరిగా నడచుచుండుట లేదు. పడవల రాకపోకలు కూడ క్రమముగ లేవు. నారాయణస్వామి నాయఁడుగారికి నే నంత ననంతముగారి పరిచయము గలుగఁజేసితిని. నాయఁడుగారు వారి యింట భోజనము చేసి, మేము కుదిర్చిన పడవలో నేలూరు వెళ్లిరి. మిత్రుఁడు రంగనాయకులునాయఁడుగారు సన్నిపాతజ్వరము వాతఁబడి మరణించిరని కొలది రోజులలోనే మాకుఁ దెలిసెను. ఆ దు:ఖవార్త విని నేను మిక్కిలి విలపించితిని. అక్టోబరు 10 వ తేదీని నారాయణస్వామినాయఁడుగారు తనసోదరిని, తమ్ముని పిల్లలను, రాజమంద్రినుండి తీసికొనివచ్చిరి. పిల్లలందఱు మాయింట భోజనము చేసిరి. క్రైస్తవులగు నాయఁడుగారు వారి సోదరియును అనంతముగారి యతిథులైరి. ఆ సాయంత్రము వారందఱును మద్రాసు రెయిలెక్కి పోయిరి.

13 వ అక్టోబరున మా బకింగుహాముపేట పఠనాలయ వార్షికోత్సవము జరిగెను. మిత్రుఁడు రామమూర్తి యాతరుణమున చక్కని యుపన్యాస మొసంగినను, రామారావుగారు దానిమీఁది వికటవ్యాఖ్యానములతోఁ దమ యధ్యక్షోపన్యాసమును ముగించిరి !

"శీలము" అను పేరితో నేనొక దీర్ఘోపన్యాసము వ్రాసి, 11 వ నవంబరు సోమవారము జరిగిన "విద్యార్థిసాహితీసమాజ" వార్షికసభలోఁ జదివితిని.

డిసెంబరు 8 వ తేదీని నేను స్నేహితులకొఱకు రెయిలుస్టేషనులో కనిపెట్టుకొని యుంటిని. మద్రాసునుండి వీరేశలింగముపంతులు గారు వచ్చి, వెంటనే రాజమంద్రి వెడలిపోయిరి. కాని, మిత్రులు కనకరాజు, గంగరాజుగార్లు ఆరోజున మాయింట నిలిచియుండిరి. శీతకాలపు సెలవులకు పాఠశాల మూయఁబడుట చేత, డిసెంబరు 9 వ తేదీని సతీపతు లిరువురమును స్నేహితులతో బెజవాడనుండి బయలుదేఱి రాజమంద్రి వెడలిపోయితిమి. ఈ యిద్దఱు మిత్రులు నేనును గలసి మృత్యుంజయరావును మఱునాఁడు చూచి వచ్చితిమి. అతని కిపుడు వ్యాధి ప్రబలియుండెను. సాయంకాలము వీరేశలింగముగారినిఁ జూచివచ్చితిమి. స్నేహితు లంత నరసాపురము వెడలిపోయిరి.

రాజమంద్రిలో నున్న రోజులలో నేను మా నాయనతోను, పెద్దతమ్మునితోను కుటుంబఋణముల తీరుమానమును గుఱించి మాటాడితిని. మిత్రుఁడు రామమూర్తి తాను బూర్తిచేయవలసిన బి. యే. పరీక్షకుఁ జదువుటకై రాజమంద్రి యిపుడు వచ్చెను కాని, యాయన చదువు చాలించుకొని కొలఁదిదినములలోనే స్వగ్రామ మగు నేలూరు వెడలిపోయెను. పాపము, మృత్యుంజయరావున కంత్యదినములు సమీపించుచుండెను. ఇపు డాతఁడు తీవ్రజ్వరపీడితుఁ డయ్యెను. ఆతని స్థితినిగూర్చి మిగుల వగచితిని. ఇట్టి నిరపరాధి నేల వేధించెద వని దేవదేవుని సంప్రశ్నించితిని. మానవులు మొఱపెట్టక, తమ విధికృత్యములు నెరవేర్చు చుండుటయే కర్తవ్యముకదా !

వ్యాధిగ్రస్తుఁడగు మృత్యుంజయరావు సెలవు పొడిగించుఁ డని మెట్కాపుదొర నడుగుటకై, పాపయ్యగారు నేనును ఆ క్రిస్మసుదినములలో దొరగారిని సందర్శించితిమి. మృత్యుంజయరావునకు సెలవిచ్చెదమని దొరగారు ధైర్యము చెప్పిరి.

29 వ తేదీని నేను కోటిలింగక్షేత్రమున కేగి, యీమధ్య చనిపోయిన స్నేహితుఁడు రంగనాయకులునాయఁడుగారి సమాధిచూచి వచ్చితిని. కాలగతి నొందిన మిత్రుఁడగు నాయఁడుగారిని గుఱించి విచారమందితిని. నెచ్చెలుని సుగుణగుణవర్ణనము చేయుచు నొక పద్యమాల రచింప నూహించితిని. ఒకటిరెండు రోజులలో పరీక్ష నిమిత్తమై వెంకటరామయ్య మద్రాసు వెడలిపోయెను. మేము బెజవాడకు మరలివచ్చితిమి.

14. ప్రాఁతక్రొత్తలు

కడచిన సంవత్సరమున నేను జేసిన పనులను విమర్శించుకొనుచు, 1896 వ సంవత్సరము జనవరి మొదటితేదీని నేనొక పట్టికను వ్రాసికొంటిని. అందులో గత సంవత్సరమున పరీక్షకొఱకును వినోదార్థమును జదివిన పుస్తకములఁ బేర్కొని, ముందు సంవత్సరమునఁ జదువఁ బూనిన ముఖ్యగ్రంథముల నామముల నుదాహరించితిని. గతసంవత్సరము నేను జదివిన యుద్గ్రంథములలో ముఖ్యములైనవి, మిల్లువిరచితమగు "మతవిషయికవ్యాసత్రయము", కార్లయిలుని "సార్టారు రిసార్టను", ఇమర్సునుని "మానుష ప్రతినిధులు", రీననుని "క్రీస్తుజీవితము"ను, మిత్రుఁడు రామమూర్తిగారి సహవాసమహిమముననే నా మనస్తత్త్వమున కిపుడు ఇమర్సను, కార్లయిలులు సరిపడుట చేత, ఈసంవత్సరము కార్లయిలుని "శూరులు" "భూతవర్తమానములు" అను పుస్తకములు చదువ నేర్పఱుచుకొంటిని. తమ్ముఁడు కృష్ణమూర్తి రాజమంద్రిలో నున్నప్పటికంటె జ్ఞానశీలాదులంయం దభ్యున్నతి నొందుచుండెను. ఈ సంవత్సర మాతని గుఱించి నే నెక్కువగ శ్రద్ధ వహించి, ప్రవేశపరీక్షలో నాతఁడు జయమందునట్లు చేయ నుద్యమించితిని. భార్య విద్యావిషయమైకూడ మిగుల పాటుపడి, మత సంఘ సంస్కరణములయం దామె కభిరుచి కలిగింప నుద్యమించితిని.

ఆ కాలమున నా దేహమును బీడించు పెనుభూతమగు మలబద్ధమును నిర్జించుటకై, నిద్రాభోజనాదులందు మితత్వముఁ గలిగి, నిత్య మును వాహ్యాళి కేగుటయు, డంబెల్సుతో కసరతు చేయుటయును ముఖ్యసాధనము లని నాకుఁ దోఁచెను. విద్యావిషయమై నే నతిజాగ్రతతో నుండఁగోరి, రాత్రి పదిగంటల పిమ్మట చదువవలదనియు, తెల్లవాఱుజామున మూఁడు నాలుగుగంటలకు మెలఁకువ వచ్చెనా తిరిగి నిద్రింపక, చదువునకుఁ గాని ప్రార్థనవ్యాయామములకుఁ గాని గడంగవలె ననియు నియమముచేసికొన నుద్యమించితిని.

నా యాత్మోజ్జీవనవిషయమును విమర్శనఁ జేసికొనుచు నే నిట్లు వ్రాసితిని : - "గతసంవత్సరమునకంటె నే నిపుడు మంచి స్థితి నున్నాను గాని, యిపుడైనను భగవంతునికి హృదయపూర్వక ప్రార్థనలు చెల్లింపనేరకుండుట శోచనీయము గదా ! అనుదినప్రార్థన మభ్యాసము చేసికొని, కోపదు:ఖములు పొడసూపు నుద్రేక సమయములందును, విషయలాలసయందును, దైవమును స్ఫురణకుఁ దెచ్చుకొనుట వలన నాత్మోజ్జీవనము కలుగును. నీ సంభాషణాది యనుదినకార్యక్రమమునందె దైవభక్తి ప్రకటీకృత మగుచుండవలెను. శీలసౌష్ఠవ మొకటియే ప్రాణోత్క్రమణ సమయమందు నిన్నుఁ జేయి విడువని పరమమిత్రుఁ డని నమ్ముము ! ఉత్తమజనులస్నేహమును సముపార్జించి, నీరసుల సముద్ధరింపఁబూనుము. మిక్కిలి యోగ్యమగు పుస్తకములే చదువుచుండుము. సౌహార్దమె మానవులయం దేకీభావ మొనఁగూర్చు దివ్యమంత్ర మని నమ్ముము". ఇట్లు నేను మానసబోధముఁ గావించు కొంటిని.

గత సంవత్సరమున బెజవాడలో ప్రార్థనసమాజము నెలకొల్పితిమి. జనానాపత్రికను నడిపి, పాఠశాలలోని కార్యక్రమమును సరిగ జరిపితిని. ఈసంవత్సర మింకను ఈపనుల నెక్కువశ్రద్ధతో నాచరించుచు, జనోపయుక్తములగు నుపన్యాసము లిచ్చుచు, సంఘసంస్క రణ సమాజమును నెలకొల్పి కార్యసాధనముఁ జేయవలెనని నేను సంకల్పించుకొంటిని.

స్నేహితుఁడు రామమూర్తి 1896 వ సంవత్సరారంభమున బెజవాడ విడిచి పోయి, బందరు నోబిలుకశాశాలలో నుపాధ్యాయుఁ డయ్యెను. కావున కామశాస్త్రి, రాజారావు, రామస్వామిశాస్త్రిగార్లు మున్నగు మిత్రులతోఁ గలసి, నే నీకాలమునఁ బ్రొద్దుపుచ్చుచుండువాఁడను. "సత్యసంవర్థని"కి దఱచుగ వ్రాయుచు, "జనానాపత్రికను" బ్రచురించుటయే కాక, మద్రాసునందలి "స్టాండర్డు" పత్రికకుఁను, "సంఘసంస్కారి" పత్రికకును, ఆంగ్ల వ్యాసములు లిఖించుచును వచ్చితిని.

ఈ 1896 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో మిత్రుఁడు మృత్యుంజయరావు క్షయరోగపీడితుఁడై తుదకు మృత్యువువాతఁ బడుటకు నే నెంతయు వగచితిని. అతనిని గుఱించి "సంఘ సంస్కారిణీ" పత్రికలో నొక వ్యాసము వ్రాసి, కళాశాలదినములలో ప్రార్థన సమాజమునకును, సత్యసంవర్థనీ పత్రికవిషయమునను, అతఁడు చేసినకృషి నభినందించి, వితంతూద్వాహములఁ బ్రోత్సహించిన సంఘసంస్కారి యనియు, నిక్కమగు దైవభక్తుఁ డనియు నాతనిని బ్రశంసించితిని. రాజమంద్రిలో "ఆస్తికపాఠశాల" నెలకొల్పసమకట్టిన సుజనుఁ డనియు, అతని మృత్యువువలన మా సమాజమునకే కాక, ఆంధ్రావని కంతకును తీఱనికొఱఁత వాటిల్లె ననియు నేను వక్కాణించితిని.

శరీరదార్ఢ్యములేని నాకును అతనికివలెనే యకాలమరణము సంభవించి, మాకుటుంబమును మితిమీఱిన కష్టములపాలు చేయవచ్చునని భీతిల్లి, అట్టిపరిస్థితులలో సతికి జననికిని గొంత జీవనోపాధిఁ గలిగింప విధ్యుక్తమని యెంచి, నేను ఈసంవత్సరము ఏప్రిలునెలలో నాజీవితమును "ఓరియంటల్ భీమాకంపెనీ"లో నాలుగువేలరూపాయిలకు భీమా చేయించి, మూఁడు "పాలిసీలు" తీసికొంటిని. కుటుంబ ఋణము లెప్పటికి తీఱినను, ఆపత్సమయమునం దీభీమాసొమ్ము మావారలకుఁ గొంత లాభకారిగ నుండఁ గల దని నమ్మి, అప్పటినుండియు నేను మనోధైర్యమున నుంటిని.

ఈ సంవత్సరము వేసవిసెలవులలో నెప్పటివలెనే పత్నీ సమేతముగ నేను రాజమంద్రి వెళ్లి యుంటిని. అప్పుడు నాభార్య తీవ్రజ్వరముచేఁ గొన్నిదినములు బాధపడెను. రెయిలువేవైద్యుఁడు జే. రంగనాయకులు నాయఁడుగారు మం దిచ్చి వ్యాధినివారణము చేయఁగా, ఆమె తన పుట్టినింటికి కట్టుంగ వెడలిపోయెను. అచట వెంకటరత్నమునకు విడువని దారుణజ్వరము వచ్చుచుండె నని మామామగారు కొలఁదిదినములలోనే నాకొఱకు రాజమంద్రి బయలుదేఱి వచ్చిరి. నే నపుడు కట్టుంగ వెళ్లి చూడఁగా, జ్వరముతీరు సవ్యముగ లేదు. ఆ కుగ్రామమునుండి రోగిని గదల్చి రాజమంద్రికిఁ గొనిరానిచో నతఁడు జీవింప నట్టుగఁ దోఁచెను. అంత నా వడివేసవిదినములలో నొకరాత్రి సవారిలోఁ గూర్చుండఁబెట్టి రోగిని రాజమంద్రి చేర్చితిమి.

రాజమంద్రి ఇన్నీసుపేటలో నిదివఱకు మాకుఁగల నివేశమునకుఁ జేరిన యింకొక స్థలమును మాతండ్రి యిటీవల కొనెను. ఆరెండింటియందును నుండినవి తాటియాకులయిండ్లే యైనను, సొంత యింటఁ గాపురము మాకు సుఖప్రదముగ నుండెను. మాతలిదండ్రులు, సోదరులును వెంకటరత్నమున కమితముగఁ బరిచర్యలు చేసిరి. ఒక నెలవఱకును, సన్నిపాతజ్వర మాతనిఁ బీడించెను. ఆతని ప్రాణమును గుఱించి మే మాదినములలో నధైర్యపడినను, దైవానుగ్రహమున నెట్టకేల కాతనికి శరీరస్వాస్థ్యము కలిగెను. సెలవులపిమ్మట మేము మువ్వురమును బెజవాడ వెడలిపోయితిమి.

తమ్ముఁడు కృష్ణమూర్తి వెనుక రాజమంద్రిలోవలెఁ గాక యిపుడు చదువునం దెంతో శ్రద్ధవహించి యుండెను. ఆటలందును నతఁ డెక్కువ చుఱుకుగనుండెను. ఆరెండు సంవత్సరములును పాఠశాలలో నాటలనుగూర్చిన యేర్పాటులు నేనె చేయుచుండువాఁడను, సోదరుఁడు, స్నేహితులు, విద్యార్థులు మున్నగువారలతోఁ గలసి నేను కాలిబంతి, బాడ్మింటను బంతులాట లాడుచుండువాఁడను. మే మెంతో పట్టుదలతో నాడుచుండుటవలన, రెండుమూఁడు సారు లెదటికక్షలో నుండు సోదరుని వలననే నాకు కాలిబంతిదెబ్బలు పెద్దవి తగిలెను !

మాతండ్రి నా కాదినములలో వ్రాసిన యీ క్రిందియుత్తరము వలన, మాకుటుంబవ్యవహారములు, ఆయన శీలభావలేఖ నాదుల వైచిత్ర్యములునెగాక, ఆకాల పరిస్థితులును గొంతవఱకు తేటపడఁగలవు:-

"29 - 8 - 96 స్థిరవారం, రాజమంద్రి, యిన్నిసుపేట.

శ్రీరాములు.

"చిరంజీవులయిన మా కుమారుడు రాయసం వెంకటశివుడును సుబ్బారాయుడు చిరాయవులుగాను దీవిస్తిమి.

"తరువాత యిక్కడ అంత్తా క్షేమం. యీనెల16 తేది లగాయతు 23 తేదీవర్కు గోదావరి పుష్కరములు. తూర్పుపడమర ప్రజలు రెయిలు వుండుటచేత అన్కేమంది జనం వచ్చినారు. కోట్లింగాలవద్ద సరకారువారు విస్తారం పాకలు వేయించ్చినప్పట్కి, అనే కేమంది బస్తీలోనే ప్రవేశించ్చినారు. రేవులవద్దను వీధులలోనూ గలిబిలి జర్గకుండా 400 కనిస్టేబిలు పిల్పించ్చి ఘాట్లు ఫారాలు యేర్పర్చినారు. చోరీలు మొదలయ్నివి యేమీ జర్గకుండా సబుకల్కటరుధొరవారు శ్రధన్ పుచ్చుకున్నారు.

"వేలివెన్ను పశువేదలవారు యావన్మందింన్ని, ధవిళేశ్వరం నుంచ్చి చింనప్పామన్ను, క్నకంమ అత్తగారుంన్ను ఆమె నాలుగో కుమార్డు కృష్ణమూర్తిగారుంన్ను యిక్కడ మ్నయింట్కి వచ్చినారు. నింన కొంత్తమందింన్ని, యీరోజున కొంతమందిన్ని వారివారి గ్రామములకు వెళ్లినారు.

"షుమారు 10 రోజులునుంచ్చి విశూచి జాడ్యములు కనిపించ్చి రోజు 1 కి షుమారు 10 మంది జ్నంచొప్పున చనిపోతుంన్నారు. యిక్కడ యితరదేశపు ప్రజలు వారివారి దేశముల్కు వెళ్లిపోయ్నీరు.

"లక్ష్మీపతిగారి నింన్ని రామచెంద్దర్రావుగార్నింన్ని చూచినాను. తమకు యివ్వవలశ్ని వెంకటచెలంపంత్తులు గారు యింక్కా యివ్వ లేదనింన్ని యిచ్చిన వెంటనే పయిసలు చేయిస్తానని లక్ష్మిపతిగారు శల్వుయిచ్చినారు. వెంకటచెలంపంత్తులుగారు య్నీం అంమ్మకమయ్నిసొంము యీగ్రామంలో మెర్కవీధికాపులవద్ద నిలవ వుంన్నది. రామచెంద్రరావుగారు చెప్పిన దేమనగా, కొంతదస్తు శిధంగా వుంనదనింన్ని తతింమ్మాదస్తు 10 రోజులలో తాము జమీగ్రామములలో నుంచ్చి రాబడుననింన్ని తప్పకుండా యిప్పిస్తామనిన్ని చెప్పినారు. *** రామభద్దిర్రాజు గారు 4 రోజులకిందట కోటున్ పనినిమిత్తం రాజమంద్రికి వచ్చినారు. వీరభదృడు కూడా వుత్తరం వ్రాసినాడు. 4 రోజులలో రేలంగి వెళ్లి యిలిందలపర్తి వ్యవహారం పరిష్కారం చేస్తాను. అత్తిలి వెంకటరత్నంగారిపేర వుత్తరం 15 రోజులకిందట వ్రాశినాను. జవాబు లేదు. నేను వెళ్లి అత్తిలి వగైరాలు కనుక్కుని వారం రోజులలో తిర్గి రాజమంద్రికి చేరి వుత్తరం వ్రాస్తున్నాను."

ఆ సంవత్సరము డిశెంబరులో జరిగెడి ప్రవేశ పరీక్షకు తమ్ముఁడు కృష్ణమూర్తి పోయియుండెను. శీతకాలపు సెలవులలో మే మిరువురమును రాజమంద్రి వెడలిపోయితిమి. అక్కడనుండి నాభార్య తన పుట్టినింటికి కట్టుంగ పోయెను. రక్తగ్రహణిచే నే నాదినములలో నధికముగ బాధపడితిని. అత్తిలి భూముల యమ్మకమునకై నన్ను రేలంగి రమ్మని చెప్పి ముందుగ మాతండ్రి రాజమంద్రినుండి బయలుదేఱెను. కొంచెము నీరసముగ నుండినను నేను రేలంగి ప్రయాణమైతిని. ఎంతో ప్రయాసపడి నే నచటికి డిశంబరు తుది దినములలోఁ జేరితిని. కాని అప్పటి కింకను వ్యవహారము తెమలకపోవుటచేత, భార్యను రాజమంద్రి కొనిపోవుటకై యచటినుండి నేను కట్టుంగ పయనమైతిని.

15. కీళ్ల వాతము

నేను రేలంగినుండి డిసెంబరు 31 వ తేదీని ప్రొద్దుననే బయలు దేఱి, కాలినడకను మధ్యాహ్నమునకు కట్టుంగ జేరితిని. నాఁడు కటిస్థలమున నొప్పిగ నుండినను, నే నది లెక్కసేయ లేదు. ఆగ్రామములో మాయత్తమామలు, వారి కుమారుడు, కొమార్తెలు నుండిరి. మాబావమఱఁదితో ముందలి సంగతు లాలోచించుచు, జనవరి 1, 2. తేదీలలో నేనచటనే యుంటిని. ఈసంవత్సర మైనను నేను యల్. టి. పరీక్షలో గెలుపొందనిచో, నా కిష్టములేని న్యాయవాదివృత్తిలోఁ బ్రవేశించుటకై, న్యాయశాస్త్ర పరీక్షకుఁ జదువ నాయుద్దేశమని చెప్పి వేసితిని. ఇది యాతఁ డామోదించెను. భార్యతోను, బావమఱదిఁతోను పడవమీఁద బయలుదేఱి, నేను 3 వ తేదీకి రాజమంద్రి వచ్చితిని. మాతండ్రి యదివఱకే వచ్చి యుండెను. స్నానము చేయునపుడు నా కుడి మోకాలిమీఁద కొంచెము వాఁపు కనుపించెను. అక్కడ కొంత నొప్పిగ కూడ నుండెను. ఇది లెక్కసేయకయే నా పనుల మీఁద నేను పట్టణమునఁ దిరుగాడితిని. మఱునాఁటి సాయంకాలమునకు నా కించుక జ్వరము సోఁకెను. నా మోకాలికీలు పొంగి, అడుగు తీసి యడుగు వేయ లేనిస్థితికి వచ్చితిని ! రాత్రి యెంతో బాధపడితిని.

మఱునాఁడు రంగనాయకులునాయఁడు గారు వచ్చి, యిది కీళ్ల వాతము కాదని చెప్పి, వాఁపుమీఁద రాయుటకు కర్పూరతైల మంపిరి. దానివలన లాభము లేకపోయెను. అత్తిలిలోని భూములదస్తావేజు వ్రాసి ఆవ్యవహారము పూర్తిపఱుచుటకు మా నాయనయు, పెద్ద తమ్ముఁడును, ఆ సాయంకాలమే పడవమీఁద వెడలిపోయిరి. నాకు శరీరములో నెటులుండినను, ఒకటిరెండురోజులలో నేను అత్తిలి తప్పక వచ్చి, అచట పనియైన పిమ్మట నే నింటికి తిరిగి రావచ్చునని వారు చెప్పిరి. అట్లే చేయుదు నంటిని.

మూలుగుచునే నే నానాఁడు "జనానాపత్రిక"కు వ్యాసములు వ్రాసితిని. రాత్రి యంతయును, మోకాలిపోటు చెప్పనలవి కాకుండెను. మఱునాఁడు నాయఁడుగా రిచ్చినమందు మ్రింగితిని కాని, నా కేమియు నుపశమనము గలుగ లేదు. ఆ రోజుకూడ పత్రికకు వ్రాయుచునేయుంటిని.

7 వ తేదీకి నావ్యాధి ముదిరిపోయెను. తమ్ముఁడు కృష్ణయ్యచే పత్రికకు వ్యాసములు వ్రాయించి, ఆ కాకితములు అచ్చునకై బెజవాడ కంపివేసితిని. నే నిపుడు నడచుట యటుంచి, సరిగా నిలుచుం డుటకైన శక్తిలేక యుంటిని ! ఈ దురవస్థలో నేను అత్తిలి రాఁజాల నని మాతండ్రికిని తమ్మునికిని దెలిపి, త్వరగా వారిని రాజమంద్రి తోడితెమ్మని తమ్ముఁడు కృష్ణయ్య నచటికిఁ బంపితిని. ఇంట నాకు మందుమాకులు తెచ్చి యిచ్చుటకుఁ బసివాఁడగు సూర్యనారయణ యొక్కడే కలఁడు. ఐన నాతనివి యినుపకాళ్లు ! పగలనక రాత్రి యనక యాతఁడు నామందులకొఱకై తిరుగాడఁ జొచ్చెను. రాత్రులు కాలిపోటు లెక్కువయై నేను తీవ్రవేదన నొందునపుడు, హాస్యపుఁబలుకులు పలుకుచు, మా చిన్న తమ్ముఁడు నాచెంతఁ గూర్చుండువాఁడు. లోకువయగు వానిని నే నపుడు తిట్టుచుఁ గొట్టుచును, రోగముమీఁది కసి చిన్న వానిమీఁద దీర్చుకొనుచుండువాఁడను ! తీవ్రవేదనకు నేను దాళలేనపుడు, అతఁడు నాకు 'పెర్రిడేవిసు'ని "పెయిన్ కిల్లరు" తెచ్చి పూయుచుండుటవలన, 'పెర్రిడేవిసు' అను నామమిడి, తమ్ముని నిరసనతోఁ బిలుచుచుండువాఁడను ! వేదనాభరమున నే నాడెడి దూషణోక్తులకు వాఁ డించుకయుఁ గినియక, నాపిచ్చిపలుకులను గాకితముమీఁద నెక్కించి చదివి నాకు నవ్వు తెప్పించుచు, అందు మూలమున నా కొకింత బాధాశమనము గల్పించుచుండువాఁడు !

తీవ్రవేదనకు లోనగు నాకుఁ బగలు రాత్రియు నొకటియే యయ్యెను ! ఎన్నిదినములకును తండ్రియుఁ దమ్ములును అత్తిలినుండి రాకుండిరి. ఎట్టకేలకు 11 వ జనవరి సాయంకాలమునకు సోదరులు వచ్చిరి. కొలఁదిదినములలో తాను న్యాయవాదిపరీక్షకుఁ బోవలసి యుండియు, నారోగోపశమనమునకై తమ్ముఁడు వెంకటరామయ్య యెంతో ప్రయత్నించెను. అంత వైద్యము మార్చివేసితిమి. డిస్ట్రిక్టు సర్జను డాక్టరు సార్కీసు దొర యొద్ద మాతమ్ముఁడు నాకు మందు తెచ్చి యిచ్చెను. అదియు నా కేమియుఁ బ్రయోజనకారి కాకుండెను. ఆరోజులలో ముఖ్యముగ రాత్రులందు నరకలోకమున నుండునట్లు నాకుఁ దోఁచుచుండెను. ఆబాధలో భగవంతుని ప్రసక్తియె నా మనస్సునకు గోచరించెడిదికాదు ! మీఁదుమిక్కిలి నే నాయనకు మఱపు వచ్చితి ననియె భావించుచుండు వాఁడను ! వివేకము తెచ్చుకొని కొంచె మాలోచించునపుడుమాత్రము, విసు వెఱుంగక అహర్నిశము నాకొఱకుఁ బరిశ్రమించు మాతాసతులమూర్తులందె దేవుని యవ్యాజ ప్రేమ కళ యొకింత నాకుఁ బొడగట్టుచుండెడిది !

మాతమ్ముఁ డంత నన్నుఁ బరీక్షించుటకై 24 వ జనవరిని డాక్టరు సార్కీసును మాయింటికిఁ గొనివచ్చెను. ఆయన నన్నేమియు నడుగక గోప్యాంగపరీక్ష చేసి, రుగ్ణత సుఖవ్యాధులచే సంక్రమింప లేదని నిర్థారణచేసికొని, మంచిమం దిచ్చెద నని నన్నోదార్చెను. నావేదనాప్రకోపమును, మాపర్ణకుటీరనివాస రహస్యమును గనిపెట్టిన యా సహృదయుఁడు మే మీయబూనిన పారితోషికమును గైకొనకయే వెడలిపోయెను. కొలఁదిదినములలో బెజవాడపాఠశాల తీసెదరు కావున, అచట నాకు బదులుగ బోధకుఁడుగ నుండి పనిచేయుటకై మాబావమఱఁది వెంకటరత్నమునకుఁ గబురంపితిని. అతఁడు 15 వ తేదీని వచ్చి పరీక్షాపత్రములు దిద్దుటయందు నాకుఁ దోడ్పడి, 17 వ తేదీని బెజవాడ వెడలిపోయెను. ఆనాఁడే వడ్లుపట్టుకొని మాతండ్రి రాజమంద్రికి వచ్చెను.

ఆమఱునాఁడు రాజమంద్రిలో మాయింటికిఁ జేరువనుండు డెబ్బది యెనుబది పూరిండ్లు తగులఁబడిపోయెను. మాకుటీరముకూడ పరశురామప్రీతి యగునని భీతిల్లితిమి. వేదనతో నుండియు ప్రాణము లందలి తీపిచే నేను గేకలు వేయఁగ, తమ్ముఁడు కృష్ణయ్యము నాభార్యయు నన్నొక బండిలోఁ గూర్చుండఁ బెట్టి, ఎద్దులేని యా బండిని తామె లాగి, మా తోడియల్లుని బసకు నన్నుఁ జేర్చిరి !

24 వ తేదీవఱకును నావ్యాధి మరలక, ముఖ్యముగ రాత్రులందు పెనుభూతమై నన్నుఁ బీడించుచుండెను ! కంటిమీద ఱెప్ప వేయక భార్య నామంచమునొద్ద కనిపెట్టుకొని పరిచర్యలు చేయుచుండెడిది. తల్లియు నాకొఱ కమితశ్రమ పడుచుండెను. వారల యవస్థ తలంచుకొనునపుడు, నావ్యసనము మఱింత దుర్భర మగుచువచ్చెను !

ఎట్టకేలకు జనవరి 24 వ తేదీని, గోడ పట్టుకొని కొన్ని యంగలు వేయఁగలిగితిని. ఆరాత్రి నాకు బాధ లేకుండెను. దీనికై నేను దైవమునకుఁ బ్రణతు లొనర్చితిని.

కొలఁదిదినములలో నేను బెజవాడకును, వెంకటరామయ్య పరీక్షకై మద్రాసునకును బోవలయును గాన, భూము లమ్ముపని మాతండ్రి కొప్పగించితి మని ఆయనపేరిట మే మిరువురమును పౌరాష్ట్రనామా వ్రాసి యిచ్చితిమి. అనంతముగారీ తరుణముననే బెజవాడ వదలి వేఱొక యుద్యోగమునకుఁ బోవుచుంటి మని వ్రాయుటచేత, మేము బెజవాడ పయనమునకు సిద్ధమైతిమి. ఇట్టిస్థితిలో సోదరులను, తలిదండ్రులను విడిచిపోవ నాకు విషాదకరముగ నుండెను.

ఎట్టకేలకు 26 వ జనవరి ప్రొద్దున భార్యాసమేతముగ నేను బెజవాడకు బయలుదేఱితిని. మద్రాసుపోవలసిన తమ్ముఁడు వెంకటరామయ్యయు రంగనాయకులు నాయఁడుగారి పెద్దకుమారుఁడు నారాయణస్వామియును మాతో వచ్చి, నా కెంతయు సాయము చేసిరి. గోదావరి యావలి యొడ్డున రెయిలుబండిలోఁ గూర్చుండి మధ్యాహ్నమునకు మేము బెజవాడ చేరితిమి.

16. తుదకు విజయము

గత మూఁడు సంవత్సరములనుండియు బెజవాడలోని క్రైస్తవ పాఠశాలకు ధన్వాడ అనంతముగారు ప్రథమోపాధ్యాయులుగ నుండిరి. ఆయన సజ్జనులు ననుభవశాలురును. వారియందు నా కమిత భక్తి గౌరవములును, నాయెడ వారి కపారవిశ్వాస వాత్సల్యములును గలవు. ఇపు డాయనను క్రైస్తవమతసంఘమువారు "బైబిలు ఆంధ్రానువాదము సరిచూచు సంఘము!" లో సభ్యునిగ నియమించుటచేత సకుటుంబముగ వారు బళ్లారినగరము వెడలిపోవ సిద్ధముగ నుండిరి. అట్టి యుత్తమమిత్రుని విడిచి నాకును, వారి సతీతిలకమగు సౌభాగ్యవతమ్మ గారిని విడిచి నాభార్యకును, ఈప్రదేశమున నివసించుట మొదట కడు దుర్భరముగఁ దోఁచెను. బోధకులు విద్యార్థులును కోరుటచేత, అందఱు ననంతహారి కొసంగవలసిన విజ్ఞాపనపత్రమును నేనె సిద్ధపఱిచితిని. పాఠశాలకుఁ గ్రొత్తయధికారియైన టానరుదొర విశాల హృదయునివలెఁ గానవచ్చెను. అంత ఫిబ్రవరి మొదటి తేదీని పాఠశాలాభవనమున జరిగిన బహిరంగసభలో అనంతముగారి విజ్ఞాపనాపత్రమును నేను జదివితిని. నూతన ప్రథమోపాధ్యాయుఁడు లాలా బాలముకుందదాసుగారు నా కంటె వయస్సునందును బోధకానుభవమందును జిన్నవారు.

బావమఱది వెంకటరత్నము ప్రథ్మశాస్త్రపరీక్షలోను, తమ్ముఁడు కృష్ణమూర్తియు అనంతముగారి ప్రథమ పుత్రుఁడు రామచంద్రరావును ప్రవేశపరీక్షలోను గెలుపొందిరని విని మిగుల సంతసించితిమి. వెంకటరత్నము పట్టపరీక్షకును, కృష్ణమూర్తి ప్రథమశాస్త్రపరీక్షకును జదువుటకై రాజమంద్రికళాశాలలోఁ జేరిరి. కనకరాజు వెంకటరామయ్యయును ఫిబ్రవరి 3 వ తేదీని మద్రాసునుండి వచ్చిరి. మఱునాఁడు "హిందూమతముయొక్క భవిష్యత్తు"ను గుఱించి కనకరాజు బెజవాడలో నుపన్యాసమిచ్చెను. అం దాతఁడు హిందూమత దివ్యజ్ఞాన సమాజములను గూర్చి సద్భావము తెలిపినందుకు సభను సమకూర్చిన నా కమితకోపము వచ్చెను. ఆరెండు సంస్థలవలనను దేశమునకు లేశమైనను మే లొనఁగూడదని గురువర్యులగు వీరేశలింగముగారివలెనే నేనును ఆకాలమున నమ్మియుంటిని !

మా పాఠశాలనూతనాధికారియగు టానరుదొరకు నాకు నంతగ మనస్సు గలియలేదు. నేను జెప్పుపాఠములలో నా కనిష్టమగు మార్పు గలిగింపవలె నని యాయన యుద్దేశము. ఆయనకు సలహాదారు గోటేటి సాంబమూర్తిగారు. ఇపు డింకొక యుదంతముకూడ జరిగెను. ఏదో పనిమీఁద టానరుదొర బందరు వెళ్లినపుడు, యల్. టీ. పరీక్షా ప్రథమ భాగపు పలితములు తెలిసెను. వెంకటరత్నమునాయఁడు, బాలముకుందదాసుగా ర్లందు కృతార్థులైరి. ప్రథమ భాగ పరీక్షా పర్యవసానము తెలిసిన వెనువెంటనే, రెండవ భాగమునఁ బరీక్ష జరుగుచుండుట సాంప్రదాయము. అందువలన దొరతోఁ జెప్పకయే దాసుగారు నేనును మద్రాసు వెడలిపోయితిమి. దీనికై మాయిరువురి మీఁదను దొరగారికిఁ గోపోద్రేకము గలిగె నని నాకుఁ దెలి సెను. నా విధాయకకృత్యవిషయమై యధికారికి నిర్హేతుకముగఁ గలిగిన యాగ్రహమును నే నేమియు లెక్క సేయలేదు.

ఈమాఱు మద్రాసులో నాకాతిధ్యమొసఁగినవారు శ్రీ భూపతిరాజు వెంకటపతిరాజుగారు. వీరును మిత్రుఁడు సాంబశివరావును ఒకబసలోనే యుండి న్యాయవాదిపరీక్షకుఁ జదివెడివారు. నా పరీక్ష. పచ్చయ్యప్పకళాశాలలో జరిగెను. సైదాపేటలోని నా పూర్వగురువులగు వైద్యనాధయ్యగారు నా పరీక్షాధికారి యని ముందుగఁ బ్రకటింపఁబడినను, తుదకు స్కాటుదొరగారు నన్నుఁ బరీక్షించిరి. నేను క్రమముగనే బోధించితిని గాని, నా బోధనాసమయమందు స్కాటు, వైద్యనాధయ్యరుగా ర్లొకచోటఁ గూడి, నన్ను గుఱించియు, నాకును వీరేశలింగముపంతులుగారికినిఁ గల సంబంధ బాంధవ్యములను గుఱించియును గుసగుస లాడుకొనుచు, నాబోధన సంగతి మఱచిపోయినట్లే కానఁబడిరి ! పరీక్షానంతరమున నేను స్కాటుదొరబసకుఁ బోయి నాకు వారితోఁగల చనవుచేత నాపరీక్షా పర్యవసాన మే మని యడిగితిని. వారు మౌనముద్ర నూనియుండిరి. ఈమాఱుకూడ నేనీ పరీక్ష తప్పినయెడల, నేను బోధకవృత్తిని విరమించి, న్యాయవాదిపరీక్షకుఁ జదువవలసివచ్చు నని స్కాటుదొరతోఁ జెప్పివేసితిని. ఆయన యూఁకొట్టుచు సమాధాన మీయకుండెను. నేను వృత్తి మార్చుకొనుటయే నాకు మేలేమో యనికూడ స్కాటుమహాశయుఁ డనెనే కాని, పరీక్షాఫలితమును గుఱించి బొత్తిగఁ బ్రస్తావింపఁడు ! వీరి ధోరణిని బట్టి మరల నాకుఁ బరీక్షలో నపజయము తప్పదని నిర్ధారణచేసికొని నేను ఖిన్నుఁడనైతిని. నా విజయము నిశ్చయమని రాజుగారు మాత్ర మోదార్పుపలుకులు పలికిరి.

మద్రాసులోనే యల్. టి. పరీక్షాఫలితము విని మఱి యచటి నుండి కదలుట నా కాచార మయ్యెను. కాని, రెండుమూఁడుదినము లచటనే నిలచినను, ఆపరీక్షాపర్యవసానము తేలకుండుటచేత, నేను బెజవాడ వెడలిపోయితిని.

టానరుదొరకు నాయెడ దురభిప్రాయ మని యిదివఱకే సూచించితిని. ఇన్ని యేండ్లనుండియు నేను బోధించెడి గణిత శాస్త్రము నింకొక యుపాధ్యాయుని కిచ్చివేసి, నాకు వేఱొకపాఠ మొప్పగింప వీరిసంకల్పము ! ఈ మార్పువలన నాకుఁ గలిగెడి యవమానమునకై యుద్యోగము చాలించి పోయెదనని నేను జెప్పివేయ నుద్యమించితిని. ఎన్నాళ్లు వేచియుండినను నా పరీక్షాపర్యవసానము తెలియ దయ్యెను. మిత్రుల విజయవార్తలు మాత్రము వినవచ్చుచునే యుండెను. దీనినిఁబట్టి మరల నపజయ మందితినని నేను నిర్ధారణ చేసికొంటిని. పరిస్థితు లిటు లున్నను, తమపాఠశాల విడిచిపోయెదనని టానరుదొరతోఁ జెప్పివేయ 4 వ మార్చిని నేను బ్రయత్నించితిని. కాని యట్లు చేయుట కానాఁడవకాశము కలుగ లేదు.

ఆ రాత్రి నాకుఁ గంటికిఁ గూర్కు రాలేదు. ఆకఱవుకాలములో, మాటపట్టింపులకై మరల పరీక్షలో నోటువడిన నే నెటు లాకస్మికముగ నుద్యోగవిసర్జనము చేసి, కుటుంబపరిపోషణము చేసికొనఁగలనా యని రేయెల్లఁ దలపోసితిని. అట్లు చేయకున్న నేను పరాభవ మందుట స్పష్టముగదా. ఎటులో నేను మద్రాసు పోయి, బి. యల్. పరీక్షకుఁ జదివి, కంటక సదృశమగు న్యాయవాదివృత్తి నవలంబించి, సంసారసాగర మీదవలెనని నేను సమకట్టితిని !

నా నిర్థారణ మీనాఁడు పాఠశాలాధికారికిఁ జెప్పివేయ నే నుద్దేశించి, 5 వ మార్త్చి యుదయమున విద్యాశాలకుఁ బోవుచు, మార్గమధ్యమున తపాల కచేరిలోని కట్టె యడుగిడితిని. జవాను నాచేత నంత రెండు జాబులు వేసెను. మిత్రులు వెంకటరత్నమునాయఁడు గారియొక్కయు, గురువులు వెంకటరత్నముగారి యొక్కయు నభినందనము లందుఁ గలవు.

ఈక్లిష్టపరిస్థితులలో వారు నన్నభినందించుటకుఁ గారణ మే మని సందియమంది, జాబులు చదువుకొనఁగా, పరీక్షలో నేను జయమందినటు లందుండెను ! మఱునిమేషమున మనకొక భవ్యదృశ్యమును జూపించుటకే దైవ మొక్కొకప్పుడు మనకనుల నంధకారమునఁ గప్పుచుండునని నేను గ్రహించి, ఆనందపరవశుఁడనైతిని.

ఈ మాఱు నేను టానరుదొర బెదరింపులకు లెక్కసేయ నక్కఱలేదుగదా ! మఱునాఁడు ప్రొద్దున నేను కొండ యెక్కి దొరను జూచినప్పుడు, నావేతనాభివృద్ధి విషయమున క్లార్కుదొరకు వ్రాసెద ననియు, కాలక్రమ పట్టికయందలి నా పనిని గుఱించిన మార్పుమాత్రము స్థిరమనియు నాయన నుడివెను. ఈయనజ్ఞకు నే నొడఁబడ ననియు, వలసినచో నుద్యోగవిసర్జనము చేసి, వేఱొక చోటిలి వెడలిపోయెద ననియు దొరతో నే నంత గట్టిగఁ జెప్పివేసితిని. పర్యవసానము, నేను అట్లు చేయవలదని చెప్పి, దొర తన మార్పునె రద్దుపఱచుకొనియెను !

17 "ప్రత్యక్ష భగవత్సందర్శనము"

నాభార్య గర్భసంబంధమగు వ్యాధికి లోనగుటచేత, గుంటూరులో స్త్రీలకొఱ కిటీవల వైద్యాలయము స్థాపించి జరుపుచుండెడి కుగ్లరు దొరసాని కీమెనుఁ జూపింపనెంచి, గుంటూరు పయనమైతిమి. మొన్న నాతోఁ జెన్నపురినుండి ప్రయాణముచేసి, నావలెనే యిపుడె యల్. టి. పరీక్ష నిచ్చి, గుంటూరులో సంస్కృతపాఠశాలలో నధ్యాపకులుగ నుండు శ్రీ చావలి సూర్యప్రకాశరావు గారియింట బస చేసితిమి. కృష్ణమ్మ నాయఁడుగారు నాతో వచ్చి దొరసానితో నాకుఁ బరిచయము గలిగించిరి. అప్పు డామె నాభార్యనుఁ బరీక్షించి మందిచ్చెను. అపుడపుడు రోగి గుంటూరు వచ్చి తనకుఁ గనఁబడు చుండవలెనని యామె చెప్పుటచేత, మే మంతటినుండి గుంటూరు పోవుచు వచ్చుచునుంటిమి. నిరుడు మద్రాసులో న్యాయవాదిపరీక్షకుఁ జదివిన తమ్ముఁడు వెంకట రామయ్య ఆపరీక్షలో నపజయ మందినట్లు తెలిసి మేము విచారించితిమి. కనకరాజు రెండవ తరగతి న్యాయవాదిపరీక్ష నిచ్చుట సంతోషవార్తయే. బావమఱఁది సీతాపతిరావు మాధ్యమిక పరీక్షలోఁ దప్పిపోయెనని తెలిసెను. ఈసంవత్సరము తా నింట నూరకుండ నొల్లక వెంకటరామయ్య నలువది రూపాయిల జీతము మీఁద రేపల్లె మాధ్యమిక పాఠశాలలోని ప్రథమోపాధ్యాయ పదవిని స్వీకరించుటకు సంతోషించితిమి. ఇపుడు కుటుంబ పరిపోషణము చేయువారు, ఒకరి కిద్దఱ మగుట నా కెంతయుఁ బ్రోత్సాహకరముగ నుండెను.

మాఋణదాత పార్వతీశముగారు మామీఁద వ్యాజ్యెము వేసెనని చెప్పుటకు మాతండ్రి బెజవాడ 26 వ మార్చి తేదీని వచ్చెను. అప్పులను గుఱించి తలంచుకొనినపుడెల్ల నాకు మనస్తాపము గలుగు చుండెను. కాని, యధైర్యపడిన లాభము లేదనియు, ఎల్లకాలము చీఁకటిరాత్రులె యుండవనియు, మాతండ్రి నన్నోదార్చుచుండువాఁడు. మేముమాత్ర మట్టి సుదినములు గాంచ నోఁచుకొనలేదని నేను భయమందుచుండెడివాఁడను.

మా రేలంగి వాస్తవ్యుఁడును, ఆ దినములలో నేలూరులో "దేశోపకారి" పత్రికాధిపత్యము నెరపువాఁడును నగు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు నన్నుఁ జూచుటకు బెజవాడ వచ్చిరి. కొలఁది కాలములోఁ దాను ముద్రాలయ మొకటి కొని నావలెనే బెజవాడలో నివసించెదనని యాయన చెప్పునపుడు నే నానందపరవశుఁడనైతిని.

రాజమహేంద్రవర ప్రార్థనసమాజ వార్షికోత్సవము వీక్షింపఁ గోరి, నేను బెజవాడనుండి 15 వ ఏప్రిలున బయలుదేఱితిని. మార్గ మధ్యమున నేలూరులో వీరభద్రరావు, కామేశ్వరరావుగార్లు మమ్ముఁ గలసికొనిరి. సాయంకాలము పురమందిరమునకుఁ బోయి చూచుసరికి మఱునాఁడు ప్రొద్దున బీదలకు నన్నదానము చేయు నేర్పాటులు, గావించుచు, శ్రమపడుచుండెడి పావనమూర్తియగు పాపయ్యగారు కానఁబడిరి.

16 వ ఏప్రిలు తేదీని వీరేశలింగముగారు ప్రార్థనసమాజమున ప్రారంభోపన్యాసము గావించిరి. మధ్యాహ్నము పాపయ్యగారి యన్నదానమును, సాయంసమయమున నరసింహరాయఁడుగారి ధర్మోపన్యాసమును జరిగెను. నేను కొన్ని ప్రార్థనలు గావించితిని. మిత్రులు వెంకటరత్నము నాయఁడు రామమూర్తిగార్లు బందరునుండి వచ్చిరి. మఱునాఁటియుదయమున నాయఁడుగారు "తమసోమా జ్యోతిర్గమయ!" అను వాక్యముతో నారంభించి, ధర్మోపన్యాస మొసంగిరి. సాయంకాలమున వీరేశలింగముగారు తాము నూతనముగ నిర్మించిన "ప్రార్థన మందిరము"నుఁ దెఱచిరి. వెంకటరత్నమునాయఁడుగారు తమకు పంతులుగారిదెసఁ గల యసమాన భక్తివిశ్వాసముల నాసమయమున వెలిపుచ్చిరి. మఱునాఁడు సమాజసభ్యుల ఛాయాపటము తీయఁబడెను. మధ్యాహ్నము కూడిన ఆస్తికసభాసమావేశమునందు, ఏతత్సభా నిధికై 500 రూప్యములు విరాళ మొసఁగెదమని మిత్రులు వాగ్దానము చేసిరి. నేను సంవత్సరమునకు డెబ్బదియైదు రూపాయ లీయ నిశ్చయించితిని.

సత్యసంవర్థనిలోఁ బ్రరించుటకై "ప్రత్యక్షభగవత్సందర్శనము" అను శీర్షికతో నొక యాంగ్ల వ్యాసము వ్రాసి, అది వీరేశలింగముగారికి నే నిపు డిచ్చితిని. అది 1897 మార్చి "సత్యసంవర్థని"లోఁ బ్రచురింపఁబడెను. అందలి ముఖ్యాంశము లిటఁ బొందు పఱచుచున్నాను : - "ప్రార్థనసామాజికులకు దైవమే మతము. ఆయనను హృదయదర్పణమందును, ప్రకృతిముఖమునను సందర్శింపనగును. నిజమగు భక్తునికి, ఈశ్వరుఁడు తప్ప వేఱు స్వర్గమోక్షము లెవ్వియు లేవు! భగవత్సందర్శనమే భక్తుని పెన్నిధానము ! అట్టి భగవంతుని సూటిగనే మనము గ్రహింపనగును. మనుష్యుని మనస్సీమ ననేక లోపపాపములు పీడించుచున్నను, మనము దేవుని తిన్నగనే దర్శింపఁగలము. గ్రంథములు, గురుసహాయము మున్నగు పరికరములు భక్తునికిఁ గావలసియున్నను, అవి యెన్నఁడును దేవునిస్థానముమాత్ర మాక్రమింపలేవు. తన మహిమాధికారములు అవతారవిగ్రహాదులకు వదలి వైచినదేవుఁడు, దూరస్థదైవమే ! అట్టిదేవుఁడు మనుజుని జ్ఞానచక్షువునకును దూరస్థుఁడే. ఆదేవునికిని నాస్తికవాదుల కెఱుకఁబడనట్టియు, ఎఱుఁగరానట్టియు నీశ్వరునికిని భేదము లేనేలేదు ! సత్యదైవ మెపుడును మనచెంతనే పొంచియున్నాఁడు. ఇది మనుష్యకోటి కనుభవ సిద్ధవిషయమె.

"ఇట్టి భగవత్సందర్శనము ప్రజ్ఞాన్వితులకేకాని పామరజనులకు సాధ్యము గాదని యెవరైనఁ జెప్పవత్తురేమో. మనశ్శక్తులలో వ్యక్తిగత భేదము లున్నను, జ్ఞానసంపాదన విషయమునమాత్రము మనుజు లందఱు నొకకుటుంబములోనివారె. పండితపామరు లుభయులు నీశ్వరు నొక విధముగనే గ్రహింపఁగలరు. ఒకవిధముననే సాక్షాత్కారము చేసి కొనఁగలరు. ఈశ్వరసాక్షాత్కారము భక్తు లందఱికిని సుసాధ్యమగు కార్యమే."

రాజమంద్రిలో నుండు రోజులలో వీరభద్రరావుగారిని వీరేశలింగముగారి కెఱుక పఱచితిని. రావుగారి కొక ముద్రాలయము కొని పెట్టెదమని పంతులుగారు సెలవిచ్చిరి. వీరభద్రరావుగారు కొలఁది కాలములో బెజవాడ వచ్చునట్టును, మేమిరువురమును గలసి యచట నొకవార్తాపత్రిక నెలకొల్పునట్టును మే మేర్పఱుచుకొంటిమి.

18. "ప్రాచీన నవీన సైతానులు"

యల్. టి. ప్రీక్షలో గెలుపొందినపిమ్మట, ఉపాధ్యాయవృత్తి విరమింపవలసివచ్చునని మరల నే నెన్నఁడును మొఱలిడలేదు. బెజవాడ పాఠశాలాధికారులు నా కిపు డైదురూపాయిలు వేతనాభివృద్ధి చేయుటచేత, నాజీత మెనుబదిరూపాయిలయ్యెను. పాఠశాలలోని బోధన, పత్రికలకు వ్రాఁతపనియును నేను క్రమముగ నెరవేర్చు చుంటిని. వెనుకటివలెనే యీవేసంగి నేను రాజమంద్రిలో గడపితిని.

రాజమంద్రిలో నుండు దినములలో నేను సమాజకార్యములు దీక్షతో జరుపుచుండువాఁడను. ఆస్తికపుస్తకాలయమందలి పుస్తకములు సరిచూచి, మిత్రుల నడిగి నూతనగ్రంథములు తెచ్చి యందుఁ జేర్చితిని. సత్యసంవర్థనికి వ్యాసములు వ్రాసితిని. అప్పుడప్పుడు వీరేశలింగముగారిని గలసికొని, వారితో వితంతూద్వాహములనుగుఱించి ముచ్చటించు వాఁడను.

ఆ వేసవిని నేను జదివిన పుస్తకములలో మేరీ కొరెల్లీకన్యా విరచితమగు "సైతానువెతలు" అను నాంగ్లనవల ముఖ్యమైనది. అందు నాగరికాగ్రగణ్యయగు నింగ్లండుదేశమందలి పెద్దలోపములు రచ్చకీడ్వఁబడినవి. ఒక యాంగ్లేయజాతి యన నేల, మానవకోటి యంతయు నీ గ్రంథరాజముయొక్క యుపాలంభనమునకు గుఱియయ్యెను ! ఇచట ప్రదర్శితమైన సైతాను బైబిలులోని సైతాను గాఁడు. ఈతఁడు నవనవోన్మేషకాంతులతో మనచెంతనే విహరించుచు, విద్యానాగరికతలతో విలసిల్లెడి వినూతనశకపురుషుడు ! నేనీ నూతనాంశము నూఁతగఁగైకొని, బాగుగ నాలోచించి, "ప్రాచీననవీనసైతానులు" అను శీర్షికతో నొక యాంగ్ల వ్యాసమును లిఖించితిని. అది యా 1897 వ సంవత్సరము జులై నెల "సత్యసంవర్థని"లోఁ బ్రచురమయ్యెను. అందలి ముఖ్యాంశము లిందుఁ జేర్చు చున్నాఁడను : -

"సైతాను మన ముఖ్యబంధుమిత్రులలో నొకఁడు ! అతఁడు లేకున్నచో, మన మట్టివాని నొకనినిఁ గల్పించి తెచ్చుకొనవలసినదె ! ఆతఁడు లేని మతసిద్ధాంతము రాణింపదు. అనాదిగసైతాను లోకరంగమున విహరించి, నరుల వినమ్రప్రణామములు చేకొనుచున్నాఁడు. దేవుని కొక గుడి వెలయునప్పటికి, జగతిని సైతానుని కేఁబది యాలయము లేర్పడుచున్నవి.

"సైతానుని గూర్చి మానవుల మనస్సీమల నొక సక్రమపరిణామము గన్పట్టుచున్నది. బైబిలు ప్రాఁతనిబంధనలోని సైతాను వికృత సర్పవేషమున మన తొలియవ్వయగు హవ్వను శోధించెను. నూతన నిబంధనకాలము వచ్చునప్పటికి సైతాను తెలుఁగుమీఱెను. అపరూప ఫల మొకటి చూపించి యబలను మోసగించినసైతా నిపుడు, ఈశ్వరాంశసంభూతుఁ డగు జీససునకు జగత్సామ్రాజ్యము కట్టఁబెట్టెద నని భ్రమ పెట్టఁదలకొనెను ! సైతానుని కిపుడు గావలసినది మానవవైకల్యమును, ఆత్మాపహరణమును ! శోధితునితో పాటు శోధకుని స్వభావమును విచిత్రపరివర్తన మందెను.

"మిల్టనుకవి సృజించిన సైతా నింకను నైగనిగ్యము దాల్చియున్నాఁడు. ఆ కవివర్యుఁడు, తాను రచించిన "విశీర్ణస్వర్ణ" కావ్యమునకు ఆదామునకు మాఱుగ సైతానునె నాయకునిగఁ గైకొ నియె నని విమర్శకులు గేలిచేసిరి ! మిల్టనుని సైతానునందు నాచత్వ హీనత్వములు గానరావు. నరకలోకకుడ్యములు తన గంభీరోపన్యాస గర్జనములకు మాఱుమ్రోఁగునట్టుగ సహచరులతోఁ బ్రసంగించి, తన ధీరవచన గాంభీర్యమహిమమున వారల నందఱిని పరమేశ్వరుని మీఁది కెత్తివచ్చునట్టు పురికొల్పఁ గలుగుట సామాన్యప్రతిభము కానేరదు. మిల్టనుకవి, పుక్కిడిపురాణముల సైతానునిగాక, తన సోదరాంగ్లేయు లనుదినమును నగరఘంటాపథంబుల సందర్శించెడి స్వదేశీయ సమకాలిక సరసాగ్రగణ్యుఁడగు సైతానునే వారలకుఁ బ్రదర్శించెను !

"ఈ సైతానుకూడ ప్రకృతకాలమున పదనుడిగి ప్రాఁతగిల్లి పోయినవాఁడె ! అంత పందొమ్మిదవశతాబ్ద మధ్యమునఁ బ్రసిద్ధినొందిన కార్లయిలు రచించిన "సార్టారు రిసార్టసు" నందలి సైతాను వినూతనకాంతులతో విరాజిల్లెను. "సైతాను నీవెలుపల లేఁడు. నీ యంతరంగముననె యాతఁ డణఁగి మణఁగియున్నాఁడు !" అనువేదాంత రహస్యమె కార్లయిలుని సిద్ధాంతసారము.

"ఇంతకంటెను నూతనమగు సైతానుని మన మాధునికాంగ్ల సారస్వతమునఁ బొడఁగాంచఁగలము. మేరీకొరిల్లేకన్యక రచించిన "సైతానువెతలు" అను గ్రంథమునందు సైతానుని ప్రకృత వృత్తాంత కథనము గాననగును. ఇందలి కథానాయకుఁడగు 'టెంపెస్టు' , దరిలేని పేదఱిక మనుభవించుచు నొకనాఁ డాకస్మికముగ నైశ్వర్యవంతుఁడైన యొకలండనునగరనివాసి. ఆ సుదినమున లూసియోరైమానెజ్ అను నొక రాజకుమారుఁ డాయనకు స్నేహితుఁడు సహచరుఁడునై, టెంపెస్టు తనసర్వస్వమును గోలుపోయి మరల దుర్భరదారిద్ర్యదశకు దిగువఱకు నాతనికి విడనాడకుండెను ! అకాలమున లూసియో కనఁబఱచిన శక్తిసామర్థ్యము లన్నియు సైతానుని కళలె ! ప్రకృతకాలపు పురుష వర్యుల యతులిత మేధాశక్తి, వాక్చాతుర్యము, శృంగార విలాసములును, లూసియోయందుఁ జక్కఁగఁ బ్రదర్శితములయ్యెను. ఈ శోధనలలోఁ జిక్కువడవలదని శోధకుఁడు మాటిమాటికిఁ దన్ను వారించుచున్నను, కుశాగ్రబుద్ధియగు టెంపెస్టు ఆసుడిగుండములలోనే పడి కొట్టుకొని పోవుచుండెను ! ఇదియె ప్రకృతపు సైతానుని స్వభావలక్షణము. భాగ్యవంతుల మాయామర్మములందును, ధనికుల దురంత దుష్కృతములలోను, లక్ష్మీపుత్రుల లోభమోహములలోను, స్త్రీపురుషుల గూఢవ్యభిచారము లందును, - ఈనాఁటిసైతాను ప్రత్యక్షమగు చున్నాఁడు !

"ఈ నూతనమగు సైతానుని నమ్మిక లొక్కింత విమర్శింతము. సైతానునికి దైవవిశ్వాసము లేకపోలేదు. ఈశ్వరాజ్ఞోల్లంఘనము మాత్ర మతనికిఁ గడుప్రీతి. సైతాను 'పాపాలభైరవుఁడ'ని ఘోషించునవి బైబిలుక్రైస్తవమతములు మాత్రమె. కొరిల్లీకన్యక వర్ణించిన సైతా నట్లు వర్తింపక, మనుష్యుడు నూతనదుష్పథము త్రొక్కి చూచినపుడెల్ల దు:ఖాతిరేకమున వెతనొందుచుండును. కావుననె యీగ్రంథమునకు "సైతానువెతలు" అను నామకరణము గలిగెను. నరుఁడు చేయు పాపకార్యముల కెల్ల సైతాను వగచుచునేయుండును !

"ఈ పుస్తకమందలి సైతా నిట్లు ఘోషించుచున్నాఁడు : - 'స్త్రీపురుషుల పాపపరంపరయె దరిలేని నాదు:ఖాబ్ధి ! స్వేచ్ఛా పేక్షగల నన్ను బందీకృతునిఁ జేయుచున్న దిదియె. ఇదియె నాకు నరక లోకావరణమున గల్పించి, నన్ను మితిలేని వెతలపాలు చేయుచున్నది. ఇదియె నన్ను బంధించి, ఛేదించి, వికృతాంగునిఁ జేయుచున్నది ! " 'మతగురువులు నా కొనరించు నపకార మే మనఁగా, - పాపమె నావినోద మని నన్నుగుఱించి వారు నిందలువేసి, అపవాదములు వెలయించుచున్నారు ! మనుష్యుఁడా ! ఇపుడైన నీవు నిజము గ్రహింపుము. పాప మేరికైన సంతోషదాయక మగునా ? లోక వినాశకరమగు పాతక మెల్లయు మనుష్యకృతమెసుఁడీ. పాపము దేవుని కపచారము, నావెతల కాలవాలమును ! లోకమందెచట నేమనుజుఁడు దుష్కృతము లొనరించినను, అవి నావేదనల నభివృద్ధి చేసి, నా బానిసత్వమునకు దోహద మొసంగుచున్నవి. నిరతము నరుని శోధింతునని నేను నియమ మూనితిని. ఐనను, మనుజుఁడు నాకు లోఁబడ నక్కఱలేదు. కార్యస్వతంత్రుఁడై యతఁడు నన్ను ధిక్కరించినచో, నేను పలాయన మయ్యెదను. అతఁడు న న్నాదరించెనా, వాని యండనె నేను నిలిచియుండెదను !

" 'అనాదిగ మానిసివేసమున నేను పుడమిని గ్రుమ్మరుచున్నాఁడను. ప్రభువులకు ప్రధానులకును, శిష్యులకు శాస్త్రజ్ఞులకును, పిన్నలకు పెద్దలకును, వారివారి లోపముల ననుసరించి, నేను సాక్షాత్కార మగుచున్నాను ! కాని, యోగ్యులకు పవిత్రులకు విశ్వాసకులకును నేను నమస్కృతు లొనరించి, సంతోషమున వారిని వీడి పలాయితుఁడ నగుచున్నాఁడను. ఇదియె నా నిజస్థితి. నరుఁడు మన:పూర్వకముగ నన్నుద్ధరించి నాకు విముక్తి గలిగించువఱకును, నేను వానినె యాశ్రయించి, అవనియందె నిలిచి యుందును !' "

19. సంఘసంస్కరణసభ

రాజమంద్రిలో 28 వ మెయి తేదీని నేను పురమందిరమునకుఁ బోయి, అచటి పఠనాలయమునుండి "ఇమర్సనుని రచనలు" అను గ్రంథమును, ఆస్తిక పుస్తకాలయమునుండి కార్లయిలుని "శూరులు, శూరపూజ"యు, ఆడమ్సువిరచితమగు "నిరాడంబరజీవితము, ఉత్కృష్ట విచారము" అను పుస్తకమును జదువఁ దీసికొంటిని. ఒకటి రెండు దినములలోనే ఇమర్సనుని "ఆంగ్లేయుల గుణవిశేషములు", "పరమాత్మ", అను వ్యాసములును, కార్లయిలుని "వీరప్రవక్త" అను రచనమును జదివి వినోదించితిని. వీరిరువురును ప్రతిభాశాలురగురచయితలె. ఐనను, ఇమర్సనునికంటె కార్లయిలె నామనస్తత్త్వము నెక్కునగ నాకర్షించెను. ఇమర్సనునందు మౌనగాంభీర్యములు, బ్రహ్మజ్ఞానసంపత్తి, ఆత్మోపలబ్ధియును నతిశయించియుండెను. కార్లయిలునందు ధైర్యశూరతావాగ్విభవములు ప్రదర్శితములయ్యెను. ఇమర్సను ఆత్మవిచార దీక్షను, కార్లయిలు కార్యోత్సాహమును బురికొల్పుచుందురు. మొదటి రచయిత మనస్సును దేవునిదెసకు మరలుపఁ జూచును. రెండవవాఁడు మనుష్యుని నీచతాహేయత్వములను నిరసించును. ఇరువురు నసమాన ప్రతిభావంతులును, పరమార్థతత్త్వకోవిదులును.

ఈసెలవులలో మాయప్పుదారులలో నిరువురకుఁ దిరిగి క్రొత్త పత్రములు వ్రాసి యిచ్చి సంతృప్తిపఱచితిమి. మాకడగొట్టుతమ్ముఁడు సూర్యనారాయణకు వడుగు చేసితిమి.

ఈసంవత్సరము గోదావరిమండల సభలు ఏలూరులో జరుగుట కేర్పాటయ్యెను. రాజకీయసభకు రెంటాల వేంకటసుబ్బారావుపంతులుగారు అగ్రాసనాధిపతులు. సాంఘిక సభకు న్యాపతి సుబ్బారావుపంతులుగారధ్యక్షులుగ నుండుట కంగీకరించిరికాని, వారు రాలేకపోవుటచేత, కందుకూరి వీరేశలింగముపంతులుగా రగ్రాసనాసీనులైరి. సతీసమేతముగ నే నీసభల కేగ నిశ్చయించుకొనుట మాతల్లికి సమ్మతముగ లేదు. ఐనను, 7 వ జూనుతేదీని మే మిరువురమును ఏలూరు బయలుదేఱితిమి. సాంఘికసభా కార్యదర్శి శ్రీ సత్తిరాజు కామేశ్వరరావుగారియింట మేము విడిసితిమి. బహిరంగసభకు భార్య నాతఁడు గొనిపోవుట అతని సోదరులకును నంగీకృతము కాలేదు. కాని, యీవిషయమున నావలెనే కామేశ్వరరావుకూడ గట్టిపట్టు పట్టెను. 9 వ జూనున జరిగిన సాంఘికసభలోనికి కామేశ్వరరావు నేనును పత్నీసమేతముగఁ బోయితిమి. రాజ్యలక్ష్మమ్మగారును సభ కేతెంచిరి. ఇంకఁ గొందఱు స్త్రీలుకూడ సభకు వచ్చి, స్త్రీలకొఱకు బ్రత్యేకించినప్రదేశమున నాసీనలయిరి.

వీరేశలింగముగారి యధ్యక్షతక్రింద జరిగిన యాసభలో 'స్త్రీవిద్య' 'అతిబాల్యవివాహముల'ను గుఱించిన తీర్మానములను నే నుపపాదించితిని. సభ నిర్విఘ్నముగ జరిగెను. కొలఁదికాలము క్రిందటనే తండ్రి కాలధర్మమునొందిన నా తోడియల్లుఁడు సత్తిరాజు వెంకటరత్నమును, మామఱఁదలు శ్యామలాంబను బంధువులను మే మంత పరామర్శ చేసి, మఱునాఁటిరాత్రికి రాజమంద్రి చేరితిమి. అంత వీరేశలింగముగారి యధ్యక్షోపన్యాసమును నే నాంగ్లము చేసి, ఎల్లేపద్ది నారాయణశాస్త్రిగారి కిచ్చితిని. అది యాంగ్ల పత్రికలలోఁ బ్రకటననిమిత్తము మద్రాసు పంపఁబడెను.

22 వ జూను తేదీని విక్టోరియా మహారాణిగారి జూబిలీమహోత్సవము రాజమంద్రిపురమందిరమున నతివైభవమున జరిగెను. కలక్టరు బ్రాడీదొర అగ్రాసనాధిపత్యము వహించెను. వీరేశలింగముపంతులుగారొక తీర్మానమును ప్రతిపాదించుచు, రాణీగారి చరిత్రాంశములను జెప్పిరి. కొందఱు పద్యములు చదివిరి. వీథులలో పెద్ద యూరేగింపు జరిగెను. నాఁడు సభలోఁ జదువఁబడినపద్యము లింట నాఁడువాండ్రకు నేను జదివి వినిపించితిని.

23 వ తేదీని నేను సెలవుగైకొనుటకు వీరేశలింగముగారి యింటి కేగితిని. వారిచరిత్రమును నా "జనానాపత్రిక"లో బ్రచురింపఁగోరి, వారి జీవితమునుండి కొన్ని ముఖ్యాంశము లాసమయమున నేను వ్రాసికొంటిని. ఆకాలమున వీరేశలింగమహాశయునినామము స్మరించినంతనే నామనస్సున ధైర్యోత్సాహములు ముప్పిరిగొనుచుండెను. వారివలెనే సంస్కరణపక్ష మవలంబించి, నా జీవితమును సార్థకపఱుచుకొన నా మహదాశయము.

24 వ తేదీని జరిగిన రాజమంద్రిప్రార్థనసమాజ ప్రత్యేక సభలో, సత్యసంవర్థనీపత్రికను పునరుద్ధరింపవలె ననియు, ఆపత్రికకు నేనును కనకరాజును సంపాదకులముగను, సాంబశివరావు వ్యవహార కర్తగను నుండునటుల తీర్మానమయ్యెను. నే నంతగ నిచ్చగింప కున్నను, మరల "సత్యసంవర్థని" నా మెడ కంటఁగట్టఁబడెను !

తలిదండ్రులయొద్ద వీడ్కోలొంది నేను బెజవాడ పయనమయితిని. అంతకుముం దొకటిరెండు దినములక్రిందట, ఒకరాత్రి భోజన సమయమున నాకును మాతండ్రికిని కుటుంబవ్యయముల విషయమై కొంత వాగ్వాదము జరిగెను. ఇంటికర్చులకు నెల కెంత కావలయు నను నాప్రశ్నమునకు మానాయన కమితకోపము వచ్చెను. తమకుఁ గావలసినసొమ్ము నేను క్రమముగ బంపకుండుటవలననే, కుటుంబ ఋణము పెరుఁగుచుండె నని మాతండ్రి మొఱ. అంత మాయిరువురకును జరిగిన సంఘర్షణమునకుఁ బిమ్మట నేను మిగుల వగచితిని. వయసు చెల్లిన యాతండ్రిని, మూర్ఛలచేఁ గృశించిన యాతల్లిని విడిచిపోవుటకుఁ గాళ్లాడక, నే నెంతో దైన్యమందితిని.

20. చెన్నపురి యుద్యోగము

నేను సైదాపేట బోధనాభ్యసనకళాశాల విడువఁగనే, నూతనముగ వెలసిన రాజమంద్రిబోధనాభ్యసనకళాశాలలో నా కుద్యోగ మిప్పింపవలెనని మాగురువర్యులును, ఏతత్కళాశాలాధ్యక్షులును నగు మెట్కాపుదొరగారు సిద్ధపడిరి. కాని, నేను యల్. టి. పరీక్ష రెండవ భాగములోఁ దప్పిపోవుటచేత, ఆపని నాకుఁ గాక, నామిత్రుఁడు మృత్యుంజయరావున కీయఁబడెను. పిమ్మట నేను తమ దర్శనము చేయునపుడెల్ల, నేను యల్. టి. పరీక్ష పూర్తిపఱిచితినా యని దొరగారు నన్నడుగుచేనేవచ్చిరి. కాని, అది యేమిచిత్రమో కాని, 1897 వ సంవత్సరమువఱకును నే నాపరీక్ష నీయలేకపోయితిని. అందు చేత, మెట్కాపుదొరకు నాయం దెంత ప్రేమాభిమానము లుండినను, రాజమంద్రికళాశాలలో నాకుఁ బ్రవేశము కలుగలేదు ! 97 వ సంవత్సరారంభమునం దా దొరగారు తమ యుద్యోగమును జాలించుకొని ఇంగ్లండు వెడలిపోయిరి. నేనా మార్చినెలలోనే యల్. టి. లోఁ గృతార్థుఁడనైతిని !

అంత రాజమంద్రికళాశాలకు మిడిల్ మాస్టుదొర అధ్యక్షుఁడుగ నియమింపఁబడెను. వారి కళాశాలలోఁ దర్కశాస్త్రము బోధించుట కొక యుపాధ్యాయుఁడు కావలసినట్టు నాకుఁ దెలిసి, మద్రాసునుండి రాజమంద్రి ప్రయాణముఁ జేయుచు, బెజవాడరెయిలు స్టేషనులో దిగి యుండిన యాదొరగారిని జులై 5 వ తేదీని నేను సందర్శించి, నాసంగతి చెప్పుకొంటిని. నన్నాయన స్వయముగ నెఱుఁగడు కావున, నేను దరఖాస్తు చేసికొనినచో, తా నాలోచింతునని యాయన చెప్పెను. నేను దరఖాస్తుపెట్టి 9 వ జూలై తేదీని రాజమంద్రి బయలుదేఱి పోయితిని. అచట నాతలిదండ్రులు సోదరులును సేమముగనే యుండిరి. నా దరఖాస్తు చెన్నపురి కనుపఁబడెనని నాకుఁ దెలిసెను. తన కళాశాలకు, అనుభవశాలియును సంస్కృతజ్ఞానము గలవాఁడును నగు బోధకుఁడు గావలెనని దొర కోరెనఁట. అందువలన నాకు లాభము గలుఁగ దని నేను గ్రహించితిని. ఈవిషయమై నాపూర్వ గురువులగు స్కాటుదొరగారికి మద్రాసు తంతి నంపి, నన్నుగుఱించి డైరక్టరుగారికి సిఫారసు చేయుఁ డని నేను గోరితిని.

మే మిదివఱకు బెజవాడలో బసచేసియుండిన గోవిందరాజుల వారి యిల్లు జూలై 27 వ తేదీని మేము వదలి పోవలసివచ్చెను. వారి పెరటిలో మేము పెట్టిన చెట్లపాదులకు తుమ్మమండలు కొన్ని తెప్పించి నేను పాతించినందుకై, ఇంటియజమానుఁడగు సుబ్బారాయఁడుగారికి నామీఁద గోపము వచ్చెను.

ఆపేటలోనే కొంచెము దూరమున వేఱుగా నుండు నొక బంగాళాను నెల కెనిమిది రూపాయిల యద్దెమీఁద పుచ్చుకొని మే మచటికిఁ బోయితిమి. ఈక్రొత్తయింటి చుట్టును విశాలమగు పెరడు గలదు. కాని, చుట్టుపట్టుల దగ్గఱగ నిం డ్లేమియు లేకపోవుటవలన, నొంటరిగ మే మచట నుండుటకు మొదట కష్టముగ నుండెను. మాపాఠశాలలో చిత్రలేఖనా బోధకుఁడును నా స్నేహితుఁడునగు రామస్వామి శాస్త్రులుగారు వారి తల్లియును వచ్చి, జులై నెలాఖరున మా యింట నొక భాగమున దిగుటచేత, మాకు ధైర్యముగ నుండెను.

ఒకరాత్రి సంభాషణసందర్భమున, "చెన్నపురి ఆర్యపాఠశాల"లో ప్రథమోపాధ్యాయపదవి ఖాళీ యయ్యె ననియు, వారి కాంధ్రోపాధ్యాయుఁడు గావలెననియును శాస్త్రిగారు చెప్పిరి. ఆమఱునాఁటినుండియు నే నాపని నిమిత్తమై కృషి చేసితిని. ఆపాఠశాలాధికారి, "హిందూపత్రికా" ముఖ్యవిలేఖకులగు జి. సుబ్రహ్మణ్యయ్యరుగారు. వీరే కొన్ని సంవత్సరములక్రిందట నాకును మిత్రుఁడు మృత్యుంజయరావునకును తమపాఠశాలలో పేరునకు బోధకోద్యోగము లిచ్చినవారు. వీరికి నన్ను గూర్చి సిఫారసు చేయుఁడని రాజమంద్రి యందలి న్యాపతి సుబ్బారావుపంతులు, వీరేశలింగముపంతులుగార్లకును, మద్రాసునందలి బుచ్చయ్యపంతులుగారికిని నేను జాబులు వ్రాసితిని. వా రందఱును నన్ను గుఱించి అయ్యరుగారికి గట్టి సిఫారసులు చేసిరి.

అంత 11 వ ఆగష్టు తేదీని సుబ్రహ్మణ్యయ్యరుగారి యొద్దనుండి నాకొక లేఖ వచ్చెను. నాకు నెల కేఁబదిరూపాయిలు జీతమీయఁ గలమని వారు వ్రాసి, నే నెంత ర్వరలో తమపాఠశాలలోఁ జేరఁగలనో వ్రాయుఁడని యడిగిరి. ఆమఱునాఁడే నే నిట్లు అయ్యరుగారికి తంతి నంపితిని : - "వందనములతో నుద్యోగస్వీకారము చేయు చున్నాను. అఱువదిరూపాయి లియ్యఁగోరెదను. ఒక నెలలో చేరఁ గలను. నాపని తృప్తికరముగ నున్నచో, కొన్ని సంవత్సరములవఱకును మీపాఠశాలలో నుద్యోగము నాకు స్థిరమని చెప్పఁగోరెదను."

ఈ తంతి నంపి, మఱు నిమేషమునుండియె వారి జవాబున కెదురు చూచుచుంటిని ! కాని, మఱునాఁటి సాయంకాలము వఱకు నాకుఁ బ్రత్యుత్తరము రానేలేదు. అంత రాత్రి తొమ్మిది గంటలకు జవాను నాకొక తంతి తెచ్చియిచ్చెను. దానిలో నిటు లుండెను. "వందనములు. రాఁబోవుజనవరిలో నేఁబదియైదును, మఱుసటివత్సరము అఱువదియును ఇచ్చెదను. సెప్టెంబరు మొదటితేదీని మీరు చేరవలెను." ఈతంతి నందుకొని రాజమంద్రిలోనుండు తలి దండ్రుల యాలోచన నడుగుటకై నే నారాత్రియె రెయిలులో బయలుదేఱితిని. మాయింటి కదివఱకు వచ్చియుండిన నాపెద్దమేన మామయు, నాభార్యపెదమేనమామయును నాతో రాజమంద్రి కపుడె బయలుదేఱిరి.

నేను రాజమంద్రి చేరు నప్పటికి మాతల్లి వేలివెన్ను వెళ్లి యుండెను. ఇంట తండ్రియు, తమ్ములు నుండిరి. చిన్న చెల్లెలు జబ్బుగ నుండెను. రాజమంద్రిలో మావారల స్థితిగతులు దైన్యముగ నుండెను. నా చెన్నపురి ప్రయాణమునకు మా మామగారామోదించిరి. కాని, మాతండ్రి యేమియు ననకుండెను. ఆయనకు జ్యౌతిషమునం దభిమానమును, కొంత పరిచయమును గలవు. గోచారమును బట్టి నాకు త్వరలో "స్థానభ్రష్టత్వము, ధనక్షయమును" గలుగునని మాత్ర మాయన చెప్పెను ! ఈ యుద్యోగమునుతప్పక స్వీకరించి, యం. యే. పరీక్షకుఁ జదువు మని వీరేశలింగముగా రనిరి. నే నంతట బెజవాడ వెడలిపోయి, 17 వ సెప్టెంబరు చెన్నపురిలోని పనిలోఁ జేర గలనని అయ్యరుగారికి తంతి నంపితిని.

నే నిపుడు బెజవాడయుద్యోగముసంగతి యేమిచేయవలెనో తోఁపకుండెను ! నాపనికి రాజీనామా నీయవలె ననియె నేను మొదట నెంచితిని. కాని, యది మంచిది కాదనియు, కొంతకాలము సెలవు పుచ్చుకొని, క్రొత్తపనిలోఁ బ్రవేశించిచూచుట యుక్తమనియు, ప్రధానోపాధ్యాయులు దాసుగారు నాకు సలహానిచ్చిరి. సెప్టెంబరు 15 వ తేదీనాఁటికి మాపాఠశాలకు పరీక్షాధికారి తనిఖీ యగును గావున, అప్పటినుండి నా కిచ్చట సెలవు దొరకవచ్చు ననికూడ వారు చెప్పిరి. వారిసలహా చక్కఁగ నుండెను. నే నంతట పాఠశాలాధికారి టానరు దొరను జూడఁబోయితిని. నా కీళ్ల వాత మెటులుండె నని యాయన చేసిన కుశలప్రశ్నమె నాకు మంచిసందిచ్చెను ! ఏతద్రోగోపశమనమునకె నే నిపుడు మద్రాసు వెళ్లఁదలంచి, అచట పొట్టజరుగుట కొక చిన్న పనిలోఁ బ్రవేశింప నిశ్చయించితిని కాన నా కాఱునెలలు సెలవీయుఁ డనియు, నేను తిరిగి వచ్చు వఱకును మాతమ్ముఁడు నాస్థానమం దీపాఠశాలలో బోధకుఁడుగ నుండు ననియును నేను జెప్పితిని. మాతమ్ముని యుద్యోగముమాట యెటులుండినను, నాకు మాత్రము సెలవు దొరకు నని దొర చెప్పెను.

నారాక నిశ్చయమని అయ్యరుగారికి నే నంతట చెన్నపురి వ్రాసివేసితిని. తలిదండ్రుల కీ సంగతి తెలియఁబఱిచితిని. చెన్న పురిలో నాకు బాగుగ జరుగుచున్నచో, నే నచటనే నిలిచిపోవచ్చును గావున, నాసామాను నాతోఁ గొనిపోవ నిశ్చయించుకొని, అనవసర మగు పుస్తకములు వస్తువులును అమ్మివేసితిని. తలిదండ్రులను జూచుటకు మరల 11 వ సెప్టెంబరున నేను రాజమంద్రి వెళ్లితిని. మాతల్లి యపుడె దేహస్వాస్థ్యము నొందుచుండెను. రెండవ మఱఁదలికి జబ్బుగ నుండెను. మా తాటియాకుల యింటిలో తేమ యుఱియుచుండెను ! ఆకుటీరమున దరిద్రదేవత తాండవమాడు చుండెను ! నాకు వెఱ్ఱి దు:ఖము గలిగెను. జననీజనకుల దురవస్థ నే నెట్లు తొలఁగింపఁగలనా యని తలపోసితిని.

అంత వీరేశలింగముపంతులుగారు సాంబశివరావు మున్నగు స్నేహితులను జూచి, నేను బెజవాడ బయలు దేఱితిని. నాకు వీడ్కోలొసంగుటకు పెద్దతమ్ముఁడు రేపల్లెనుండి బెజవాడ వచ్చియుండెను. మాపాఠశాలతనిఖీ 14 వ సెప్టెంబరుతో ముగిసెను. సెప్టెంబరు "జనానాపత్రిక" యాదినముననే చందాదారుల కంపివైచి, పాఠశాలకుఁ బోయి, అచట నుపాధ్యాయులయొద్దను, విద్యార్థులయొద్దను వీడ్కో లొందితిని. నాలుగుసంవత్సరములు గలసి మెలసి యుండిన మిత్రుల నొకసారి వీడుట కష్టముగఁ దోఁచెను. తోడియుపాధ్యాయులగు అయ్యన్న గారు నన్నుఁ గౌఁగలించుకొని విలపించిరి ! నేను మాత్రము చిఱునవ్వు నవ్వి, త్వరలోనే మరలివచ్చెద నని వారి నూరడించితిని. అంత, సామానులు సరిదికొని, స్టేషనునకు వచ్చి, విద్యార్థులు బోధకులును వీడుకొలుపఁగా, మేము రెయిలులోఁ గూర్చుంటిమి.

21. ఆశాభంగము

మేము బెజవాడనుండి బయలుదేఱునాఁడే, చెన్నపురినుండి నాకొక 'యాకాశరామన్న' జాబు వచ్చెను. 'చెన్నపురి ఆర్యపాఠశాల'లో జీతములు సరిగా నీయ రనియు, మంచిపాఠశాల వదలి యిట్టి దిక్కులేని విద్యాలయమున కేగినచో సుఖమున నుండు ప్రాణమును దు:ఖములపాలు చేసికొందు ననియు నందుండెను ! ఐనను, మించినపనికి నే నిపు డేమి చేయఁగలను ?

ఆకాలమందు బెజవాడనుండి సరిగా, చెన్నపురికి రెయిలు పడ లేదు. మేము చిన్నబండి మీఁద గుంతకల్లుదారిని బోయితిమి. దారిలోని చెట్లు చేమలు, కొండలు కనుమలును జూచి, మా కనులు సేదదేఱెను. మఱునాఁటిరాత్రి గుంటకల్లులో బొంబాయిమెయి లెక్కితిమి. తిలకు మహాశయునికి 18 నెలలు కఠినశిక్ష వేసిరని రెయిలులో విని విచారించితిని. 17 వ సెప్టెంబరు ప్రొద్దున్నకుఁ జెన్నపురిచేరి, పరశువాక మేగి, మన్నవ బుచ్చయ్యపంతులుగారి యింట, బసచేసితిమి. పంతులుగారు నేనును గలసి తిరువళిక్కేణి వెళ్లి, సుబ్రహ్మణ్యయ్యగారిని సందర్శించితిమి. ఆయన దయార్ద్ర హృదయుఁడు. నన్నాయన పాఠశాలకుఁ గొనిపోయి, ప్రతియుపాధ్యాయునికి నెఱుక పఱచిరి. పాఠశాల కడు బీదస్థితిలో నుండెను. తిరువళిక్కేణిలో నుండు బంధువు మంత్రిరావు వెంకటరత్నమును నే నపుడు కలసికొని, అతఁడు త్వరగా స్వస్థలమునకుఁ బోయి, భార్యకు మంచిమం దిప్పించుట యగత్య మని చెప్పితిని.

మఱునాఁడు నేను తిరువళిక్కేణి వెళ్లి, పూర్వము "ఆర్య పాఠశాలా" ప్రథమోపాధ్యాయుఁడును, ఇపుడు "హిందూపత్రికా" సహాయవిలేఖకుఁడునునగు శ్రీ. కే. నటరాజనుగారిని, వారిమిత్రులనుఁ జూచితిని. మాపాఠశాలలోని యొకబోధకుఁడు నాకు బస కుదుర్చుటకై నాతో వచ్చి, కొన్ని యిండ్లు చూపించెను. బ్లాకుటవను పోయి మిత్రుఁడు శ్రీ కొల్లిపర సీతారామయ్యగారిని జూచితిని. మఱునాఁడు ఆదివారము బ్రాహ్మమందిరమునకుఁ బోయినపుడు, రాఁబోవు రామమోహనరాయలవర్ధంతి సందర్భమున నొకయుపన్యాసము చేయుఁడని మిత్రులు నన్ను గోరిరి.

నేను పాఠశాలలో వెంటనే పనిచేయ నారంభించితిని. ఆవిద్యాలయ మంచిస్థితిలో లేదు. ప్రవేశపరీక్షతరగతి క్రమము తప్పి యుండెను. నేను జేయవలసిన కృషి యత్యధికముగఁ గలదు.

"ఆర్యపాఠశాల"కు సమీపముననందు నొకచిన్న యింటిలో నేను అద్దెకు రెండుగదులు పుచ్చుకొంటిని. ఆ యింటిలో రెండవ భాగమున సుబ్రహ్మణ్యయ్యరుగారి బావమఱఁదులు కాపుర ముండిరి. సెప్టెంబరు 26 వ తేదీని బ్రాహ్మసమాజమువారు రాజారామమోహనుని వర్ధంతి జరిపిరి. వారి మందిరమునఁ గూడిన బహిరంగ సభకు రా. బ. పనప్పాకం ఆనందాచార్యులుగారు అధ్యక్షులు. నేను రామమోహనుని గుఱించి వ్రాసిన యింగ్లీషువ్యాసమును జదివితిని. అధ్యక్షులు నావ్యాసమును మెచ్చుకొని, బ్రాహ్మమతమును గుఱించి సదభిప్రాయము దెలిపిరి. అపుడు "సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రితమైన నావ్యాసమును, కలకత్తా సాధారణ బ్రాహ్మసమాజమువారి "ఇండియన్ మెసెంజరు" పత్రిక పునర్ముద్రితము చేసెను.

30 వ సెప్టెంబరు ప్రవేశపరీక్షకు దరఖాస్తు లంపుటకు తుది దినము. మా పాఠశాలనుండి 31 మంది బాలుర నా పరీక్షకంపి, యిద్దఱిని మాత్రము నిలిపితిమి. కాని, యా యిరువురు విద్యార్థులును పలుమాఱు యింటికి వచ్చి చేసిన దీనాలాపములకు జాలినొంది, వారినిఁ గూడఁ బంపివేసితిని.

నా మిత్రులు కనకరాజు గంగరాజుగార్లు బి. యల్. పరీక్షలో తప్పి, తిరిగి యాపరీక్ష నిచ్చుటకై అక్టోబరు 9 వ తేదీని మద్రాసు వచ్చిరి. మాయింటికి వారినిఁ గొనివచ్చి, కొలఁదిరోజులలో వారి కొక బస కుదిర్చితిని. ఇపుడు నేను మద్రాసులో నివసించుటచేత, 'జనానాపత్రిక' నిచటనే ప్రచురించి తపాలో పంపుచువచ్చితిని.

మద్రాసులో నొకనెల యుండునప్పటికే నా కచటి నివాసమునందు విసువు జనించెను. నెల కేఁబదిరూపాయిలతో నా కక్కడ జరుగకుండెను. ఆ జీతమైనను సరిగా నొక్కసారి చేతికి రాదు. పాఠశాలలో పనియు, బాధ్యతయును అధికము. ఫలము స్వల్పము ! తలిదండ్రుల పోషణమునకు రాజమంద్రి పంపుటకు నాయొద్ద సొమ్ము లేనేలేదు. కావున నేను త్వరలోనే యీ పట్టణమునుండి కానిన కనీస మీపాఠశాలనుండి కాని, వెడలిపోయి, వేఱొక యుద్యోగమునఁ బ్రవేశింపవలసినదే. నాపూర్వమిత్రులగు అనంతముగారికి నేనీ సంగతి వ్రాయఁగా, నేను మరల బెజవాడ వెడలిపోవుటయె శ్రేయమని వారు హితవుచెప్పిరి. వెనుక బెజవాడపాఠశాలలో నుపాధ్యాయ మిత్రులగు దేవసహాయముగా రిపుడు చెన్నపురి రాయపేట కళాశాలలో నుపాధ్యాయులుగ నుండిరి. ఆయనను నే నిపుడు సందర్శించి, వేఱు మంచియుద్యోగ మేమైన నిచట దొరుకునా యని యడుగఁగా, అచటి క్రైస్తవ పాఠాశాలాధికారుల నిద్దఱిని జూడు మని వారు చెప్పిరి. నే నట్లు చేసితిని. కాని, నాకు లాభ మెచటను గానఁబడలేదు. తిరిగి బెజవాడకు వెడలిపోవుటయె మే లని తోఁచెను. కావున 26 వ అక్టోబరున బెజవాడ పాఠశాలాధికారికి తంతినిచ్చి, డిశెంబరు ప్రారంభమున నేను మరల బెజవాడలో నాపనిలోఁ జేరెదనంటిని. వారు దాని కొప్పుకొనిరి. నే నిట్లు బెజవాడకుఁ బోవుటయే నిశ్చయించుకొంటిని.

సుబ్రహ్మణ్యయ్యరుగారును నా బెజవాడ ప్రయాణమునకు సమ్మతించిరి. నా తోఁటబంగళా నాకొఱకు నిలిపి యుంచుఁడని బెజవాడస్నేహితులకు నే నంత వ్రాసివేసితిని.

చెన్నపురిలో నుండునపుడు, తఱచుగ నేను మిత్రులు కనకరాజు గంగరాజుగార్లను గలసికొని, మాకుఁ బ్రియమగు సంస్కరణోద్యమమును గూర్చి ముచ్చటించువాఁడను. నాపత్రికపేరు బాగుగ లేదు కావున, శ్రవణానందకరమగు వేఱొక నామమును, ముఖపత్రము మీఁద నాకర్షణీయమగు స్త్రీప్రతిమయు నుండవలెనని కనకరాజు చెప్పెను. ఇంకను నాభార్యకు మత సంఘ సంస్కరణ విషయములు కంటకములుగఁ దోఁచెను. ప్రకృత హిందూస్త్రీల స్థితిగతులు సామాన్యముగ నిట్టివియే యని నేను మనస్సును గొంత సమాధానపఱుచు కొంటిని. మద్రాసులో నున్న దినములలో నే నప్పుడప్పుడు "సంఘ సంస్కరణ సమాజము" వారి విడిదికిఁ బోవుచుండువాఁడను. నన్ను వారు సభ్యునిగఁ జేర్చుకొనిరి. సభికులు వారమున కొక్కమాఱు తమబసలో సమావేశమై, తమలో సౌభ్రాతృత్వమును బెంపొందించు కొనుటకై యందఱును గలసి ఫలాహారములు చేయుచుండువారు. ఇది నా కంతగ తృప్తికరముగ లేదు.

నేను చెన్నపురికి వచ్చినపిమ్మట, "లండను నగర రహస్యములు" మున్నగు ననేకపుస్తకములు చదివితిని. కాని, నేనిచ్చటికి వచ్చిన ముఖ్యకార్యమె మఱచిపోయితినికదా ! ఎన్ని కష్టములు పడియైనను, ఇచట రెండుమూఁడు సంవత్సరము లుండి, యం. యే. పరీక్షకుఁ జదివి యందు జయ మందినచో, ఏకళాశాలలోనైనను నాకు మంచి యుద్యోగము లభింపఁగలదు. లేనిచో, బి. యల్. పరీక్షకైనను నేను మెల్ల మెల్లగఁ జదివి కృతార్థుఁడనైన బాగుండునని మా తలిదండ్రుల తలంపు. కాని, యీ పాఠశాలలో దినమున కాఱుగంటలు నేను పని చేయవలసివచ్చెను. ఇదిగాక, ప్రథమోపాధ్యాయుఁడ నగుటచేత, నాబాధ్యత యధికముగ నుండెను. పాఠశాలకు సొమ్ము చాలదు. బోధకుల కందఱికి నెలలకొలఁది జీతములు ముట్టుట లేదు ! ఇటువంటి విద్యాలయమున నే నెటులుండి యుద్ధరింపఁగలను ? ఈ పాఠశాలకుఁ జేరువనుండెడి "తిరువళిక్కేణియున్నత పాఠశాల"తో సరిసమాన మైన మంచిపేరు దీనికిని గొనిరావలదా యని సుబ్రహ్మణ్యయ్యరు గారితో నే నొకనాఁ డనఁగా, "మన పాఠశాల వేఱొకవిద్యాలయముతో పోటీ చేయ నక్కఱలేదు. మంచి విద్యార్థులు ఇతరపాఠశాలల కేగినను, మిగిలిన తక్కువరకపు బాలురే మనకుఁ జాలు" నని ఆయన చెప్పివేసిరి ! ఇంకొకసారి, ఇచటి యుపాధ్యాయులకు నెల నెలకును సరిగా జీతములు లభింపకుండుట చింతనీయ మని నే ననఁగా, "పంతులుగారూ, పట్నము సంగతులు మీకు బాగా తెలియవు. మనము జీతములు బాకీపడియుండుటయే మనబడికి శ్రేయము. ఉపాధ్యాయులు మన విద్యాలయమునుండి దాటిపోకుండ వారి కిదియే సంకిలి యగుచున్నది సుమీ !" అని అయ్యరుగారు నాకు సమాధాన మిచ్చిరి ! విద్యాశాలాధికారి కిట్లు ఉదారాశయములు లేకుండుట చేతను, తోడి బోధకుల కష్టములు నిరతము చూడలేకయు, నే నిట్టి పాఠశాలలో పాఁతుకొనిపోవుట వ్యర్థమని తలంచితిని.

ఇదిగాక, పెద్దపరీక్షలకుఁ జదువుటకు నాకీ పాఠశాలలో బొత్తిగ తీఱిక లేకుండెను. దీనికితోడు ఈ మహాపట్టణమున నేఁబది రూపాయిలతో నాకు జరుగదని నే నధైర్యపడితిని. అప్పులు తీర్చుట యటుండనిచ్చినను, తలిదండ్రుల పోషణమునకును, సోదరుల చదువునకును వలయు సొమ్ము మాసమాసమును నే నెట్లు సమకూర్పఁగలను ? ఈ కారణములచేత నేను బెజవాడకు సంసారమును తరలింపవలసి వచ్చెను.

నవంబరుమధ్యనే నేను సామానులు సరదుకొన నారంభించితిని. మద్రాసులో కొంతకాలము నివసించి యిచట సంస్కరణోద్యమ ప్రచారము సలుపు నుద్యమించిన వీరేశలింగముగారి సరకులు పుస్తకములు నపుడే రాజమంద్రినుండి వచ్చుచుండెను. నా సామానులు కొన్ని బకింహాముకాలువ పడవమీఁదను, కొన్ని రెయిలులోను వేసి, బెజవాడ కంపివేసితిని. అంత 26 వ నవంబరున మేము మద్రాసునుండి బయలుదేఱితిమి. చెన్నపురికాపుర మిట్లు కడతేఱెను ! తా నొకటి తలంచిన దైవ మొకటి తలంచును !

22. మరల బెజవాడ (2)

అనంతముగా రిపుడు సకుటుంబముగ బళ్లారిలో నివసించి యుండిరి. వారి యాహ్వానము ననుసరించి మే మపుడు మార్గమధ్యమందలి బళ్లారి పోయి యచట రెండుదినములు నిలిచితిమి. వారి స్నేహితులగు సి. యస్. సుబ్రహ్మణ్యమయ్యగారి యిల్లు మాకు విడిది యయ్యెను. అయ్యగారు సుప్రసిద్ధాంద్రులగు మీనాక్షయ్యగారి యల్లుఁడు. ఈ దంపతులు సాధుజనులు. అనంతముగారు మాకు బళ్లారినగరము చూపించిరి. పట్టణము చక్కనిదియె కాని, అందు దోమలబాధ మెండు. దివ్యజ్ఞానసామాజికులగు ఆర్. జగన్నాధయ్యగారును, వార్‌డ్లాపాఠశాలాధ్యక్షులగు కోటిలింగముగారును నా కచటఁ బరిచితులైరి. నా స్నేహితులును, బాలికాపాఠశాలల పరీక్షాధికారులునునగు శ్రీ పి. రామానుజాచార్యులుగా రచట నుండిరి.

30 వ నవంబరు ప్రొద్దున మేము మరల రెయిలులో కూర్చుండి డిశెంబరు 1 వ తేదీ యుదయమునకు బెజవాడ చేరితిమి. కడుఁ బ్రియమగు బెజవాడను మరలఁ గాంచి నా కన్నులనుండి యానందాశ్రువు లొలికెను. నాకొఱకు విద్యార్థులు రెయిలుస్టేషనులోఁ గనిపెట్టుకొని యుండిరి. మేము మాతోఁటబంగాళాకుఁ బోయితిమి. పెరటిలోని జామలు, సీతాఫలపుచెట్లును పండ్లతో నిండియుండి, మాకు సుస్వాగత మొసంగెను ! ఆసాయంకాలము టానరుదొరను, దాసుగారిని జూచి, మరల బెజవాడ పాఠశాలలోఁ బ్రవేశించితిని. మే మంత సంవత్సర పరీక్షలు జరుప నారంభించితిమి. డిశెంబరు 2 వ తేదీని మిత్రులతోఁ గలసి, రెయిలుస్టేషనులో వీరేశలింగముగారిని సందర్శించితిని. చెన్నపురిలోఁ గృషి చేయవలెనని గంపెడాసతోఁ గదలిపోవుచుండు పంతులుగారు నావలెనే విఫలమనోరథులై వెనుకంజవేయుదురేమో యని నేను వెఱగందితిని. దైవానుగ్రహమువలన వారి కన్ని శుభములు సమకూరవలయు నని కోరితిని.

నా సలహామీఁద శ్రీచిలుకూరి వీరభద్రరావుగా రిపుడు బెజవాడ రావలె నని యుద్దేశించిరి. 98 వ సంవత్సరారంభము నుండియు మే మిరువురమును గలసి యొక యాంగ్లాంధ్ర వారపత్రిక నెలకొల్ప నుద్యమించితిమి. రావుగారికిని వారి ముద్రాలయమునకు వలసిన యొక బస నేర్పాటు చేయుటకు మిత్రులు నేనును వెదకితిమి.

ఈ శీతకాలపుసెలవులలో కొంచెము జబ్బుగ నుండిన నా భార్యను జూచిపోవుటకు నా యత్తగారు, బావమఱఁదియు బెజవాడ వచ్చిరి. వెంకటరామయ్య రేపల్లెనుండి బెజవాడకు వచ్చి న్యాయవాదిపరీక్షకై మద్రాసు వెడలిపోయెను. తలిదండ్రులను జూచివచ్చుటకు నేను డిశెంబరు 18 వ తేదీని రాజమంద్రి వెళ్లితిని. కృష్ణమూర్తిభార్య నంజువ్యాధితో బాధపడుచుండెను. కుటుంబవ్యవహారములను గుఱించి తలిదండ్రులతోను, తమ్ముఁడు కృష్ణమూర్తితోను నేను మాటాడితిని. మా సంసారమున వ్యాధులవలెనే అప్పులును దినదినప్రవర్ధమాన మగుచుండెను ! బాధ్యతలు హెచ్చుచుండెను. దూరమున రాజమంద్రిలోనుండు జననీజనకులను నేను సరిగాఁ గనిపెట్టనేరకుంటిని కాన, పిల్లలతో వారు బెజవాడ వచ్చినచో, అందఱును సౌఖ్యమును మనశ్శాంతిని ననుభవింతు రని తలిదండ్రులకు బోధించి, వారలను విజయవాడ కాహ్వానించితిని. వా రొకవిధముగ సమ్మతించిరి.

పెద్దయప్పు లటుండనిచ్చి, మా చిల్లర యప్పులే రాజమంద్రిలో పెరిఁగిపోవుచుండెను ! మా సంసారము రాజమంద్రినుండి తరలించుటకు ముందుగ 250 రూపాయిలు కావలసివచ్చెను. సోదరినగలు కుదువఁ బెట్టినచో నీసొమ్ము మాకు దొరుకునని తెలిసెను. దీనికి చెల్లెలు సమ్మతించుటచేత, నగలతాకట్టుమీఁద సొమ్ము బదులు తెచ్చి యప్పులు తీర్చివైచితిమి. తలిదండ్రులను వెనుక నుండి రమ్మని చెప్పి, 22 వ తేదీని మామగారితో నే నేలూరు పయనమైతిని. అక్కడ వీరభద్రరావుగారిని గలిసికొని, వారితో మాటాడితిని. భూములు కొన్ని యమ్మివైచి, ఆ సొమ్ముతో ముద్రాలయము నొకటి కొని బెజవాడలో దాని నెలకొల్పెదనని ఆయన చెప్పిరి. నాకును గొంత సొమ్ము బదు లిచ్చెద మనిరి. మేము ఉభయులమును వారపత్రికను స్థాపింపఁబూనుకొంటిమి.

అంత నేను బెజవాడ వచ్చితిని. మద్రాసులో నారంభింపని న్యాయశాస్త్రపరీక్ష చదువులు బెజవాడలో నే నిపుడు మొదలు పెట్టితిని ! దాసుగారి నడిగి న్యాయశాస్త్రగ్రంథ మొకటి తెచ్చి ముందు వేసికొని కూర్చుంటిని. శరీరస్వాస్థ్యమునకై తొట్టిస్నానములు చేయఁబూనితిని. కాలక్రమమున మన యూహలందును క్రియల యందును మనకే విడ్డూరముగఁ దోఁచు విచిత్ర పరిణామ మొక్కొక తఱి నేర్పడుచుండెను !

23. "చిప్పలశివరాత్రి"

1898 జనవరి మొదటితేదీని మా యప్పులపట్టికను నేను దిరుగ వేసితిని. వడ్డితో మే మీనాఁటికి పద్దుపత్రముల మూలమున నీయవలసిన యప్పులును స్నేహితుల చేబదుళ్లును గలసి, సుమారు నాలుగువేల రూపాయి లగఁబడెను ! ఎట్లీ యప్పు తీర్చివేయఁగలమా యని నేను తల్ల డిల్లితిని. ఆరోజు దినచర్యపుటలో నే నిట్లు లిఖించితిని : - "ఈ సంవత్సరారంభము నా కెంతయు నశుభప్రదముగ నున్నది. మరణ మొకటియే నా బాధానివారణము చేయఁగలుగు నని తోఁచుచున్నది ! దేవుని యాస్తిక్యమునందు నాకు నమ్మిక తొలఁగలేదు గాని, పరమాత్మునిమహిమ మేమియు నాయాత్మలో ప్రతిఫలన మగుట లేదు !"

నేనీ సంవత్సరము చేయవలసిన కార్యములు రెండు గలవు. ఒకటి న్యాయశాస్త్రసంబంధమగు చదువు. రెండవది, నూతనవార్తా పత్రికాప్రకటనము. ఇదియును, పాఠశాలలోనిపనియు, "జనానా" "సత్యసంవర్థనీ" పత్రికాసంపాదకత్వమును గలసి నాకు దుర్భరభారముగఁ దోఁచెను !

జనవరినెలలో బెజవాడలో విశూచి ప్రబలియుండెను. మాయింట నొకభాగమున నుండు శ్రీఅయ్యగారి సుబ్బారాయఁడు గారి జవాను సుబ్బయ్యకు 8 వ తేదీని ఈవ్యాధి సోఁకెను. అంత వానిని వైద్యాలయమునకుఁ గొనిపోయితిమి. అక్కడ వాఁడా రాత్రి చనిపోయెను. చందావేసి వానికి దహనాదికర్మలు జరిపించితిమి.

కాబెట్టు విరచితమగు "యువజనహితోపదేశము" అను నాంగ్ల పుస్తకము నే నిపు డెంతో తమకమునఁ జదివితిని. ఈరీతి నాంధ్రమున గ్రంథరచన చేయ నే నభిలషించితిని. కాని, స్వానుభవమున నిన్ని యంశములు నా కెట్లు సమకూరఁగలవు ? నా యనుభవ మసమగ్రము, భావవిస్ఫురణము సంకుచితమును ! ముందైన సుఖదినములు గాంచ నోఁచితినా యని నేను బలవించితిని.

సతి కాంగ్లము బోధింప నే నాసక్తితో నుంటిని. కాని, యామెకుఁ జదువునం దిష్టములేదు. విద్యావతులగోష్ఠికంటె నజ్ఞాన స్త్రీల సహవాసమే యామె కభిమతము ! నా తమ్ముఁడు సూర్యనారాయణ లోవరుసెకండరీపరీక్షలో విజయమంది విజయవాడలోఁ జదువుటకై జనవరి 29 వ తేదీని వచ్చెను. బావమఱఁది సీతాపతియు నిక్కడఁ జదువఁగోరుచున్నాఁడు కాని, తలిదండ్రు లాతనిజీతమైన నీయఁజాల రని చిన్నతమ్ముఁడు చెప్పెను. నే నా నాహ్వానింపఁగా సీతాపతి 5 వ ఫిబ్రవరి బెజవాడ వచ్చెను. కృష్ణయ్యభార్యకు మిక్కిలి జబ్బుగా నుండెనను వార్త నాతఁడు గొనివచ్చెను. మాపాఠశాలలో నీసంవత్సరము ఐదుగురు ప్రవేశపరీక్ష యందు జయ మందుటకు మేమందఱము సంతసించితిమి.

వీరభద్రరావుగా రిచటికిఁ గొనివచ్చెడి ముద్రాలయమున కొక్క వసతి గృహము సంవత్సరమునకు నూఱురూపాయిల బాడుగకుఁ గుదిర్చితిమి. కాని, 8 వ ఫిబ్రవరిని ఆయన ముద్రాలయమును బెజవాడకుఁ గొనిరాఁగా, అదివఱకు బస యిచ్చెద ననిన పెద్దమనుష్యుడు వెనుకకు తగ్గెను ! అంతఁ గొన్ని రోజులకు వేఱొకయిల్లు సమకూడెను. ఈ ముద్రాక్షరశాలకు పని సంపాదించుట కెంతయో ప్రయత్నించితిని. నా "జనానాపత్రిక"నింతటినుండి యీముద్రాలయముననే ప్రచురించుట కేర్పఱిచితిని.

న్యాయవాదిపరీక్ష నిచ్చి వెంకటరామయ్య ఫిబ్రవరి 11 వ తేదీని మద్రాసునుండి వచ్చెను. కుటుంబవ్యవహారములను గుఱించియు, అప్పులతీర్మానమును గూర్చియును మేము మాటాడుకొంటిమి. రేలంగి రాజమహేంద్రవరములలోఁగల మాయిండ్ల నమ్మివైచి, ఋణము నిశ్శేషము చేయవలెనని నాపట్టు. ఇది యిట్లుండఁగా, బెజవాడ గవర్నరుపేటలో వేయిగజముల స్థలములోఁ గట్టిన యొకయిల్లు 800 రూపాయలకు విక్రయమునకు వచ్చెను. అది కొనుటకు నే నభిలషించితిని. మిత్రుఁడు రాజారావు నడుగఁగా, ఆయింటి తాకటు మీఁదనే నాకుఁ గావలసిన సొమ్మిచ్చెద నని యతఁ డనెను. వేగమే బెజవాడ రమ్మని యింటియజమానునికిని మాతండ్రిగారికిని తంతి నంపితిని. వారిరువురును వచ్చిరి. కాని, పూర్వ మొకవితంతువు అమ్మిన స్థలములో నీయిల్లు కట్టఁబడుటచేత, ఇంటి హక్కునుగుఱించి ముందు చిక్కులు రావచ్చునని భీతిల్లి, యిల్లుకొనుట మానుకొంటిమి.

ఇటీవల రాజమంద్రిలో నగలు కుదువఁబెట్టి తెచ్చినసొమ్ము నేను జెల్లింపనేలేదు. కాఁబట్టి నా కెటులో సొమ్మీయ సిద్ధమైన రాజారావునొద్ద 300 రూపాయిలు బదులు తెచ్చి, నగలు విడిపింపుఁడని యాసొమ్మును రాజమంద్రికిఁ బోవుచుండెడి మాతండ్రికిఁ దమ్మునికి నిచ్చివేసితిని.

ఆరోజులలో నాకుఁ దగినంత చిత్తశాంతి లేకుండెను. చేయుపనియు చదివెడిచదువును ఎక్కువయై, నాకిట్లు మనశ్శాంతి తొలఁగ లేదు. మీఁదుమిక్కిలి వానివలన నా కొకవిధమగు విరామమే కలిగెనని చెప్పవచ్చును. అట్టి కార్యవ్యాజమే లేకున్నచో, స్థితిగతులను గుఱించియు మా దురవస్థను గూర్చియు తలపోసి నా మనస్సు విచార పంకమున మఱింత గాఢముగ మునిఁగిపోయెడిదియే ! కనులముందట నే యప్పు పెరిఁగిపోవుచుండుటయును, చేత తగినంతసొమ్ము లేకుండుటయును నా యలజడికిఁ గొంత కారణము. దీనికిఁ దోడుగ నింట సతికిఁ బతికిని సామరస్యము లేకుండెను. బుద్ధిపూర్వకముగ నే నప్పులపాలగుచుంటినని భార్య యపోహము ! ఇంగ్లీషు నేరువు మనియు పూర్వాచార పరాయణత్వము వీడు మనియు నే నామెను శాసించు వాఁడను. ఒక్కతెయె యింటిపనులు చేసికొనవలసివచ్చిన యామె కీచదువు కంటకసదృశమయ్యెను. సతి ప్రాఁతయాచారముల నంటి పట్టుకొని యుండుట నాకుఁ గడు దుస్సహముగ నుండెను. కావున "ఇంటిలోనిపోరు ఇంతంత గాదయా"అను వేమనయోగిపలుకుల సత్యము మాకు ద్యోతకమయ్యెను. ఇట్టిగృహకల్లోల మొకటి ఫిబ్రవరి 19 వ తేదీని శివరాత్రినాఁడు మాకు సంభవించెను.

శివరాత్రికి కృష్ణస్నానమునకై వేలకొలఁదిప్రజలు చుట్టుపట్టుల నుండి బెజవాడకు వచ్చుచుందురు. ఆనాఁడు విశాలక్షమ్మగారితోఁ గలసి నాభార్య యేటికి స్నానము చేయఁబోయెను. ఇది నా కెంతయు నసమ్మతము. గృహిణిమీఁద గసి తీర్చుకొనుటకె యామధ్యాహ్నము నేను పింగాళీకంచమున నన్నము తింటిని ! నదీస్నానము చేసివచ్చిన తా నీగాజుచిప్పలు కడిగి మైలపడినది గావున, నాభార్య యానాఁడు భుజింప నని చెప్పివేసెను. దీనితో నాయాగ్రహము ప్రజ్వరిల్లెను. తా నుపవాసము చేయుట యయుక్తమును, నా కసమ్మతము నని నేను గట్టిగఁ జెప్పి కోపించుటచేత, ఎట్టకేల కామె రాత్రి భుజించెను. ఈపుణ్యదివసము మాయింటఁ గేకలతోను రోదనముతోను జరిగిపోవుటచేత, దీనికి నా చిన్ని తమ్ముఁడు సూర్యనారాయణ "చిప్పల శివరాత్రి" యని నవ్వుటాలకుఁ బేరుపెట్టెను !

ఈ సంవత్సరము న్యాయవాదిపరీక్షయందు తమ్ముఁడు వెంకటరామయ్య జయమందె నని మార్చి 15 వ తేదీని తెలిసి, సంతోషమున మిన్నందితిని.

"దేశాభిమాని" యనుపేర ఆంధ్రాంగ్లవారపత్రిక నొకటి ప్రచురింప వీరభద్రరావుగారు నేను నుద్దేశించితిమి. దాని కాంగ్ల రాజకీయ వ్యాసములు వ్రాసి, అవి దిద్ది పంపుఁ డని మిత్రులు వెంకటరత్నమునాయఁడుగారికి నేను బంద రంపితిని. కాని, నాయఁడుగా రవి దిద్దకపోవుటయేగాక, మరల మా కవి పంపనైన లేదు ! అందువల నను, వీరభద్రరావుగారి "విద్యాసాగరముద్రాలయము"నఁ బనులు సరిగా జరుగకుండుటవలనను, మేము పత్రికాప్రకటనమును విరమించు కొంటిమి !

మా యత్తగారికి జబ్బుగా నుండె నని జాబు వచ్చుటచే భార్యను రాజమంద్రి పంపితిని. ఆమెకుఁ గొంచెము నెమ్మది గలిగె ననియు, తమ్ముఁడు కృష్ణమూర్తిభార్య చనిపోయె ననియును నా కంతట లేఖ వచ్చెను. ఈబాలిక మరణవార్త విని మిగుల విచారపడితిని.

24. పెండ్లి బేరములు

ఇదివఱకే మాతలిదండ్రులు బెజవాడ వచ్చి నాతో నుందుమని వాగ్దానము చేసిరి కాని, యట్లు జరుగలేదు. దీనికి ముఖ్యకారణము, అందఱును బెజవాడ చేరినచో, తమమాట చెల్లదని పెద్దవారును, తమ మరియాద నిలువ దని చిన్నవారును, స్త్రీజనము తలంచుటయె ! ఆదినములలో మాతమ్ములలో నొకరు నాకు రాజమంద్రినుండి వ్రాసిన యీక్రింది యుత్తరము దీనికి వ్యాఖ్యానప్రాయముగ నున్నది : - "నీవు తెలివిహీనుఁడవు కాఁబట్టి యితరులమాయలలో పడుచున్నావు ! నీ అత్తగారు నెమ్మదిగనే యున్నది. వదెన నిపు డిచటికి నీవు పంపుట వట్టి అనగత్యకార్యము ! * * * * "

మాయింటను అయ్య గారివారియింటను స్త్రీ లీసమయమున లేకపోవుటచేత, రెండిండ్లలోను పురుషపాకమే ! దాని మాహాత్మ్యమున 5 వ తేదీని తెలవాఱుజామున అజీర్ణ సంబంధమైన పోటు నాకు కడుపులో బయలుదేఱెను. ఆనాఁ డంతయు మంచమెక్కితిని. వైద్యులు వెంకటసుబ్బయ్యగారు వచ్చి మందిచ్చిరి. భార్యను బంపుఁ డని నేను రాజమంద్రి తంతి యిచ్చితిని. తంత్రీసమాచారము విని మానాయన దు:ఖపరవశుఁడై, నన్ను గుఱించి వివరములు వ్రాయనందుకు సీతాపతి మీఁద కోపపడెనఁట. ఒకటి రెండురోజులలో నాఁడువాండ్రు బెజవాడకు వచ్చిరి.

ఈ కడుపునొప్పి నెమ్మదిపడిన కొన్ని దినములవఱకును నాకు నిస్సత్తువుగ నుండెను. కావుననే కాకినాడలో జరిగిన "ఆస్తికసమావేశము"నకు నేను వెళ్ల లేకపోయితిని. అచటికిఁబోయి 11 వ తేదీని తిరిగివచ్చిన వీరభద్రరావుగారు సభాసమాచారములు కొనివచ్చెను. మఱుసటిసంవత్సరసభ బెజవాడలో జరుపుటకు తీర్మానించిరి.

ఆ సంవత్సరమున బెజవాడపాఠశాలకు క్లార్కుదొరయే వ్యవహారకర్తగ నుండినట్లు కనఁబడుచున్నది. 11 వ ఏప్రిలు తేదీని పాఠశాలలో జరిగిన యుపాధ్యాయులసభలో, ప్రతి యుపాధ్యాయునిపనియు నెక్కువ చేయవలె నని క్లార్కుదొరయానతి యయ్యెనని ప్రకటింపఁబడెను.

14 వ ఏప్రిలు తేదీని నాకు తమ్ముఁడు కృష్ణయ్య వ్రాసిన జాబులో, ఆనెలలోనే తన ద్వితీయవివాహము చేయవలె నని మాతలిదండ్రులు సంకల్పించి, మంచి వరదక్షిణకొఱకుఁ బ్రయత్నించుచుండిరని యుండెను ! నామాట మావాండ్రు ధిక్కరించి రనియు, ఇట్టి యకృత్యములవలన కుటుంబమున కపకీర్తి వాటిల్లు ననియును, నేను మిగుల వగచితిని.

17 వ ఏప్రిలు తేదీని నాదినచర్య పుస్తకమునం దిట్లున్నది : - "బార్యసానుభూతి లేనికారణమున బ్రాహ్మమతస్వీకారము చేయవలె ననెడియాశ నామనస్సున నణఁగిపోవుచున్నది. ఎంతకాలము నేను సంఘమువారి భయముచే నిట్లు కృంగిపోవలెను ? నేను బ్రాహ్మసామాజికుఁడనై, భగవత్సేవ చేయుచు, అంతరాత్మయాదేశములచొప్పున జీవితము నడపుకొనవలె నని నాయుత్కృష్టాశయము. దీనికిఁబ్రబల విఘాతము గలుగుచున్నది!"

19 వ ఏప్రిలున వెంకటరామయ్య బెజవాడ వచ్చెను. భార్య పోయిన నెలలోనే తమ్మునికిఁ బెండ్లి తల పెట్టితివేమని నేను వానిని జీవట్లు పెట్టినను, పెద్దవారల నిర్ధారణమునకు పిన్న వారలను నిందించుట న్యాయము కాదని నేను గ్రహించి, పిమ్మట విచారించితిని. నా కోరికమీఁద వెంకటరామయ్య తాను బెజవాడ వచ్చి యిచటనే న్యాయవాదిగ నుందు నని చెప్పెను. 26 వ తేదీని అతఁడు రాజమంద్రి వెడలిపోయిను.

కొన్నిదినములకు నా కీ క్రిందియుత్తరము మా తండ్రిగారి యొద్దనుండి వచ్చెను.

"శ్రీరాములు. చిరంజీవులయిన మాకుమాళ్లు రాయసం వెంకటశివుడును సుబ్బారాయుడు చిరాయువులుగాను దీవిస్తిమి -

"వెంకట్రామయ్యవల్ల అంన్ని సంగతులున్ను తెలిశ్నివి. కృష్ణయ్యవివాహమునుగురించి యిదివర్కు 10 15 సంబంధములు వచ్చినవి. మనకు అనుకూలం లేనివారితో ప్రస్తుతం తలంపులేదని చెప్పినాము. కొంన్ని సంబంధములు తిర్గిపోయి మరివకర్కి ఏర్పర్చు కుంన్నారు. రెండుమూడు రోజులకిందట తాంన్యాడ గంగరాజు గారివద్దనుంచ్చి వకసంబంధం రాబడినది. వారు చాలా మర్యాదస్తులు. పిల్ల 11 సంవత్సరములు కలదై బహు మంచిదనింన్ని, ముఖ్యంగా ఈచింన్న దాంన్ని కృష్ణయ్యకు యివ్వడంకు గంగరాజు శెలవుప్రకారం తాను నరసాపురంనుంచి వచ్చినా ననిన్ని, యేవిధమయ్ని లోట్లూ లేకుండా యెక్కడ వివాహం చాయమంటే అక్కడ వివాహం చేస్తామనింన్ని, శీఘ్రంగా రోజులలో జర్గవలశియుంటుం దనింన్ని చెప్పినాడు. కాబట్టి వ్రాశేది యేమంటే, యీసంబంధం చేసుకోవడముకు మీఅప్పకున్ను నాకున్ను కోరిక కలిగియుంన్నది. దయవీక రాజీకములచేత ఈ సం. రం కృష్ణయ్య పరీక్ష ప్యాసైనా కాక పోయినా, యీకార్య అయివుంటే మంచిది. మనం చివర్కు ధవళేశ్వరంలో చాయమన్నప్పటికీ, చాయతల్చుకునియున్నారు. మనం వప్పుకుని అంగీకరించి ఉత్తరం వ్రాశినట్టుగానే, ముహూర్తం పెట్టి స్తిరపరుస్తుంన్నారు. నీవు 5, 6, రోజులలో యిక్కడికి వచ్చి 10, 15 రోజులలోపల ఈవివాహం చేయించి, తరువాత వెంటనే వెంకట్రామయ్య నీవుంన్ను బెజవాడ వెళ్ల వచ్చును. * * * * *

"మనకు శ్రమలేకుండా పిల్లవానికి వివాహం తటస్తమయినప్పుడు మానివేశి, తటస్తం కానప్పుడు ప్రయత్నం చాయడం యింత్తకంటె లోపం లేదు. ఈపిల్ల రెండుమూడుసంవత్సరములకు గాని కాపరముకు రాదు. అప్పట్కి కృష్ణయ్యకు కొంన్ని పరీక్షలు కాబడును. కృష్ణయ్యకు యిస్తామని వచ్చిన సంబంధముల పిల్ల లకు, మేము వప్పుకోనివాళ్లకు 1, 2, కి ధవిళేశ్వరంలో 4 రోజులు యీలోగా వివాహములు కాబడ్డవి. గన్కు అంన్ని సంబంధములుంన్ను కూడా యిదేప్రకారం దాటిపోగలవు. యీకార్యం అయ్ని తరువాత యింత్త తొందరకార్యములు తక్కినవి కావు. గన్కు యీవుత్తరం అందిన వెంటనే నీ జవాబు పంప్పిస్తే, నరసాపురం గంగరాజుగారి యిలాకా వారితో మాట్లాడి ముహూర్త నిర్ణయం యేర్పరుస్తున్నాము. యీ కార్యం చాయకుండా వుంటే మాత్రం మనకు లాభం లేదు. చేశినందువల్ల వచ్చే లుగసాను లేదు. కార్యం కావడం చాలా విశేషమై యున్నది.

రా. సుబ్బారాయుడు."

ఈ పైయుత్తరమునకు నే నేమి సమాధాన మిచ్చితినో నాకు జ్ఞప్తి లేదు. వేసవి సెలవులలో నేను రాజమంద్రి వచ్చినప్పుడు, అందఱమును గలసి మాటాడుకొని నిశ్చయింపవచ్చునని నేను వ్రాసి యుందును. కృష్ణమూర్తి ద్వితీయవివాహము వెంటనే చేయవలెననియు, నర్సాపురపు సంబంధమే నిశ్చయింపవలెననియు, మా తలిదండ్రుల దృఢసంకల్ప మని లేఖవలన స్పష్టము కాఁగలదు.

25. ఇంటితగవులు, మండలసభలు

ఈసమయమున మేము నివసించెడి బెజవాడ యింటిని గుఱించి కొంత వివాదము కలిగెను. నేను చెన్నపురి వెళ్లి పోవునపుడు, ఆయింటిని రెండవభాగమున నుండిన రామస్వామి శాస్త్రిగారి వశముఁ జేసితిని. కాని, మరల నిచ్చటికి వచ్చుటకు స్థిరపఱచుకొనిన వెంటనే, ఇ ల్లెవ్వరికి నీయవల దని వారికి వ్రాసివేసితిని. ఈలోపుగ నాయన యింటిలోని కొంతభాగమును సుబ్బారాయఁడుగారి కిచ్చినను, నేను జెన్నపురినుండి వచ్చినతోడనే, నాభాగము నాకు వదలివేసిరి. కాని, యంతకంతకు నాకును శాస్త్రిగారికిని అభిప్రాయభేదము లేర్పడెను. దీనికిఁ గారణము, ఆఁడువారల కలహములే ! మా బంగాళాలో నిపుడు నివసించు నారీమణుల సంఖ్య మూఁడు, ఏర్పడిన కక్షలు రెండు ! ఒక కక్షలో చిన్న వారలగు నా భార్యయు, సుబ్బారాయఁడుగారి పత్నియును. విశాలక్షమ్మ రెండవ కక్షిదారురాలు. పెద్దలకు చిన్నలకును ఆశయములందును, అభిప్రాయములందును భేదము లుండుట స్వాభావికము. చిన్నవార లిరువురును సతతము తనమీఁద చాడీలు చెప్పుకొనుచుందురని విశాలక్షమ్మయులుకు! "కలహకంఠీ!"యని యా పెద్దముత్తయిదువ వెంకమ్మగారి ననుచుండఁగ చెవులఁబడి నే నొక నాఁడు నవ్వుకొంటిని. సుబ్బారాయఁడుగారి భార్య వెంకమ్మగారికిఁ జదువు రాదు. "చూచితివమ్మా! నన్ను 'కలాలకంటీ' అని యీముసలవ్వ తిట్టుచున్నది" అని వెంకమ్మగారు రత్నమ్మగారితో ఫిర్యాదు ! అంత చిన్న లిద్దఱును సమ్మెకట్టి, ముసలమ్మతో మాటాడ మానివేసిరి.

చిన్నమ్మలను జూచి పెద్దమ్మ సదా మోము ముడుఁచుకొని యుండెడిది !

ఆఁడువారి మనస్పర్థలు మెల్ల మెల్లగ మగవారల కెగఁబ్రాఁకెను! శాస్త్రిగారిని ఏలూరునుండి రప్పించి, వారికా పాఠశాలలో నుపాధ్యాయునిపని నేనె యిప్పించితిని. మా కిరువురకును స్నేహమే. ఇరువురికిని మిత్రు లొకబృందమువారే. అద్దెలో చాలభాగము నేనె యిచ్చుచుండువాఁడను. స్త్రీలవైరము లడఁచుట యసాధ్య మని నేనిపుడు గ్రహించి, తా మింకొకయిల్లు చూచుకొనెదరా యని నేను శాస్త్రి నొకనాఁ డడిగితిని. దీని కాయన కోపించి, తాను గదల ననియు, వలసినచో నేనె యిల్లు విడిచిపోవచ్చు ననియును జెప్పివేసి, న న్నాశ్చర్యమున ముంచిరి ! ఈయింటికే కాదు, ఊరికిని ఉద్యోగమునకును నా యాహ్వానముమీఁదనే వచ్చినశాస్త్రి నా కీజవా బిచ్చుటకు నేను జిఱచిఱలాడితిని ! ఇంటియజమాని మద్రాసులో నుండెను. ఆయనబంధు వొకఁడు బెజవాడలో మాయొద్దనుండి యద్దె వసూలు చేయుచుండువాఁడు. ఈ తగవు పరిష్కరింపుఁ డని యాయుభయులను నే నిపుడు కోరితిని. బాడుగ నిచ్చుటకు నేనె యుత్తరవాది నని పలికి న న్నాయింట నుండుఁడని వారు చెప్పివేసిరి.

ఇపుడైనను శాస్త్రిమనసు మాఱలేదు. తనకు వేఱొకయిల్లు కుదురుటకు కొన్ని నెలలు పట్టు ననియు, అంతవఱకుఁ దా నిచటనే యుందు ననియును, ఆయన చెప్పివేసెను ! అంత యుభయుల మిత్రులగు రాజారావు సాంబమూర్తిగార్లతో నేనీ సంగతి చెప్పితిని. వారి హితవచనము లాలకించి, ఎట్టకేలకు శాస్త్రి యిల్లు వదలి పోయెను.

1898 సంవత్సరము వేసవి సెలవులలోఁ గొంత యాలస్యముగ మేము రాజమంద్రి పోయితిమి. దీనికిఁ గారణము, 'విద్యా సాగర, ముద్రాక్షరశాలలో నా "జనానా పత్రిక" సకాలమున నచ్చుపడ కుండుటయే. వీరభద్రరావుగారు సొమ్మునుగుఱించిన చిక్కులు తీర్చు కొనుటకు తఱచుగ రేలంగి పోవుచుండువారు. అందువలన బెజవాడలోని వారిముద్రాలయమున పని సరిగా జరుగుచుండెడిదిగాదు. పాఠశాలలో పని, పత్రికపనియును భారమైన నేను, ఎప్పుడోగాని క్రొత్తపేటలోని యీ ముద్రాలయకార్యములను బరిక్షింపఁ బోలేకుండెడి వాఁడను !

20 వ మేయి తేదీని, ఆనెల జనానాపత్రిక చందాదారులకుఁ బంపి, కొందఱు స్నేహితులతోఁ గలసి సాయంకాలమునకు గుంటూరు వెళ్లితిని. అచట కృష్ణామండలసభలు జరుగుచుండెను. రెయిలులో మిత్రులగు దాసు శ్రీరాములుపంతులుగారిని గలసికొని, మఱునాఁటి సంస్కరణసభా కార్యక్రమమునుగుఱించి మాటాడితిని. సభల కేతెంచిన ప్రాఁతనేస్తులు గుంటూరులోఁ బలువురు గానఁబడిరి. దుగ్గిరాల రామమూర్తిగారును వచ్చియుండిరి. ఆకాలమున గుంటూరుపురము పూర్వాచారపరాయణత్వమునకు ప్రసిద్ధి నొందెను. కావున వితంతూ ద్వాహములనుగుఱించిన తీర్మానము సభలోఁ గావించుటకు గుంటూరు వారి కిష్టము లేదు.

రాజకీయ సంస్కరణసభలకు మిత్రులు వెంకటరత్నమునాయఁడుగారే యధ్యక్షులు. 21 వ తేదీని జరిగిన సాంఘిక విషయ నిర్ధారణసభ కెటులో వితంతూద్వాహవిషయకమగు తీర్మానమును అంగీకృతముఁ జేసితిమి. మధ్యాహ్నము జరిగిన ముఖ్య సభలో నేను స్త్రీవిద్యను గుఱించిన తీర్మానమును ప్రతిపాదించితిని. నా యుపన్యాసానంతరమున అధ్యక్షులగు నాయఁడుగారు లేచి, నేను బ్రచురించెడి "జనానా పత్రికను" స్త్రీవిద్యాభిమాను లందఱును దెప్పించుకొనుట కర్తవ్య మని నొక్కి వక్కాణించిరి. ఇందుకు వారియెడల కృతజ్ఞుఁడనే కాని, నాకోరికమీఁద వా రిట్లు చెప్పిరని జను లనుకొందురేమో యని నేను సిగ్గుపడితిని !

అతిబాల్యవివాహ నిరసనమును గుఱించిన తీర్మానమునకు పలువురు విరోధు లేర్పడిరి. ప్రభుత్వమువారు వివాహవిషయమున వయోనిర్ణయము చేయుటకే పలువురు సమ్మతింపకుండిరి. కావున పండ్రెండేండ్ల యీడురాని బాలికలకు వివాహము చేయరాదను తీర్మానమున కనేక సవరణలు వచ్చెను. వయోనిర్ణయము 11 సంవత్సరముల కుండవలయునని యొకరును, 10 సంవత్సరముల కని యొకరును, అడ్డు తీర్మానములు తెచ్చి, సభాకార్యక్రమమును నవ్వులాటలోనికి దింపిరి. అంత మా ప్రార్థనమీఁద దాసు శ్రీరాములుగారు సభా వేదిక నెక్కి, తాము ధర్మశాస్త్రములు సాంగముగఁ జదివితి మనియు, అసలు తీర్మానమున కడ్డుపెట్టువారు జాతిద్రోహులు శాస్త్రద్రోహులు నని గంభీరస్వరమున నుపన్యసించిరి ! దీని పర్యవసానము, మొదటిసవరణ కొనివచ్చిన పండితంమన్యుఁడు సభ నుండి నిశ్శబ్దముగ నిష్క్రమించెను ! తీర్మాన మేకగ్రీవముగ నామోదింపఁబడెను ! నాఁడు వ్యవధానము లేకపోవుటచేతను, మరల భిన్నాభిప్రాయములతో సభ చీలిపోవు నను భయమునను, నాయఁడుగారు కార్యప్రణాళికనుండి వితంతూద్వాహమును గుఱించిన తీర్మానమును దీసివైచిరి. వారి యంత్యోపన్యాసము హృదయరంజకముగ నుండెను. ఈనాఁడే సుప్రసిద్ధరాజకీయవేత్తయగు గ్లాడుస్టనుగారు చనిపోయి రని తెలిసెను.

మఱునాఁడు (22, ఆదివారము) సంస్కృతపాఠశాలలో ప్రార్థన జరిపితిమి. ఇదియే గుంటూరు పుర ప్రార్థన సమాజ జననకాలము. మిత్రులతోఁ గూడి నేను బెజవాడ తిరిగివచ్చితిని. బెజవాడలో సంఘసంస్కరణ సమాజస్థాపనము యుక్తమని మాకుఁదోఁచి, 23 వ తేదీని యొకసభ చేసితిమి. పదునొక్క సభ్యులతోను, ఒక యభిమానితోను బెజవాడ "సంఘసంస్కరణ సమాజము" నెలకొల్పఁబడెను. దానికి శ్రీవేమవరపు రామదాసుపంతులుగారిని కార్యదర్శిగ నెన్నుకొంటిమి.

26. తమ్ముని వివాహము

ఇంటిలోని విలువగల వస్తువులను శిష్యుడు వెంకయ్య గదిలో నుంచి, మేము 25 వ మేయిరాత్రి బయలుదేఱి మఱునాఁటి ప్రొద్దునకు రాజమంద్రి చేరితిమి. తలిదండ్రులను తమ్ముఁ జెల్లెండ్రను జూచి సంతోషించితిని. సాయంకాలము పాపయ్యగారిని జూచి వచ్చితిని. వారి కొమార్తెను మాతమ్మునికిఁ జేసికొనవలె నని నాకెంతో మక్కువ గలదు. కాని మా యుభయ కుటుంబముల ప్రవరలకును విశ్వామిత్రఋషి. కలసి యీ కార్యమున కడ్డుపడెనని యాయన చెప్పెను. ఆ సంబంధమును వదలివేసి, మఱికొన్ని మే మప్పుడు వెదకితిమి.

నా "జనానాపత్రిక"ను ఆంధ్రదేశమందలి తమ బాలికాపాఠశాలల కన్నిటికిని దొరతనమువారు తెప్పించుకొనెడివారు. పత్రికలో 16 పుటలుమాత్రమే యుండుటచేత, తగినన్ని వ్యాసము లందుఁ బ్రచురింప సాధ్య మయ్యెడిదికాదు. కావున నీ జూలై నెలనుండియును చందా రెట్టింపుచేసి, పత్రిక విస్తీర్ణమును ద్విగుణీకృతము చేయ నిర్ధారణచేసికొని, ఈసంగతిని ప్రభుత్వపరీక్షాధిపురాలికిఁ దెలియఁబఱచితిని. దీనినిగుఱించి తమ యభిప్రాయ మేమని యామె యడుగఁగా, నామిత్రులును బళ్లారి సహాయపరీక్షాధికారియు నగు శ్రీ పి. రామానుజాచార్యులవారు తమ పరిపూర్ణానుమోదమును జూపిరి. కాని, రాజమంద్రి మండలోద్యోగియగు స్వామిరావుగారు ప్రత్యుత్తరము వ్రాయుచు, చందా యెక్కువచేయ వచ్చును గాని, పత్రికలో సంస్కరణవిషయములు ప్రకటింపఁగూడదని నుడివిరి. వారి వ్రాత యసమంజసము నప్రస్తుతము నని నేను దలంచితిని ! నేను సంఘసంస్కరణాభిమాని నైనను, వితంతూద్వాహములు సలుపవలె నని పత్రికలోఁ జాటుచుండుట లేదు. అపుడపుడు సంస్కరణమును గూర్చిన సంగ్రహవార్తలు మాత్రమే ముద్రించుచుంటిని. స్వామిరావుగారి హ్రస్వదృష్టికి ! నాకాశ్చర్యాగ్రహములు గలిగెను. ఈ విషయమై నాకు పరీక్షాధికారిణి బ్రాండరుసతి వ్రాసినలేఖకు నేను బ్రత్యుత్తర మిచ్చుచు, విద్యాధికులలోఁ గొందఱు సంకుచితభావమున సంస్కరణవిషయమై యామెకుఁ దెలిపెడి సంగతు లామె విశ్వసింపఁగూడ దని వ్రాసివేసితిని ! పత్రికలోని మార్పునకు దొరతనమువా రంతట సమ్మతించిరి.

నేను రాజమంద్రిలో నుండు దినములలోఁ దఱచుగ పురమందిరము పోయి, పత్రికలు చదువుచుండువాఁడను. "ఇంగ్లీషువారి సంసారపద్ధతులు" అను శీర్షికతో నొక యాంగ్లస్త్రీ వ్రాసిన వ్యాసములు హృద్యములుగ నుండెను.

నే నెచట నుండినను, నాకు పత్రికావ్యాసరచనమునుండి మాత్రము విరామము లేకుండెను ! ఆనెల జనానాపత్రికకు వ్యాసములు వ్రాయుచు, నేను తమ్ముఁడును జూన్ 8 వ తేది యంతయుఁ గడపితిమి. మఱునాఁడు మద్రాసునందలి "ఫెలోవర్కరు" పత్రిక కొక చిన్న యాంగ్లవ్యాసము వ్రాసి పంపితిని.

మా తమ్ముఁడు కృష్ణమూర్తి కిపుడు వచ్చిన యొకటి రెందు సంబంధములకు మే మంగీకరింప లేదు. మేయి 30 వ తేదీని మా నాయనయు, కృష్ణయ్యయును వివాహసంబంధ నిశ్చయమునకై కాళ్ళ గ్రామము వెళ్లి, నాల్గవ జూనుతేదీని రాజమంద్రి తిరిగివచ్చిరి. అచటి సంబంధమే తమకు నచ్చె ననియును, పెండ్లి 9 రోజులలో జరుగు ననియును వారు చెప్పిరి. 12 వ జూనున మే మందఱము బండ్లమీఁద ధవళేశ్వరము వెళ్లి, అచ్చట మాతోడియల్లుడు పోడూరి కృష్ణమూర్తి గారియింట బస చేసితిమి. పెండ్లి కూఁతునివారు సత్రములో దిగిరి జనార్దనస్వామి యాలయములో ప్రాత:కాలముననే వివాహము జరిగెను. పెండ్లికూఁతుని కను లొకించుక తెలుపైనను సౌందర్యవతియె యని చూప రనుకొనిరి. మా తలిదండ్రులు సాయంకాలమునకు రాజమంద్రి వెడలిపోయిరి. నేను, సోదరులు, మిత్రులును ఆదినమున ధవళేశ్వరములో నిలిచి, ఆనకట్ట మున్నగు దృశ్యములు చూచి వచ్చితిమి. మఱునాఁటి ప్రొద్దున పెండ్లివా రందఱిని రాజమంద్రియందలి మా యింటికి గృహప్రవేశమునకుఁ గొనివచ్చితిమి.

18 వ జూను సాయంకాలమున పురమందిరమున ప్రత్యేక ప్రార్థనసమాజసభ యొకటి జరిగెను. "సత్యసంవర్థనీ"పత్రిక యిఁక ముందు నా యాజమాన్యమున బెజవాడలో ముద్రణమై, రాజమంద్రిలో ప్రచురింపఁబడునట్టుగ తీర్మానమయ్యెను !

అంత మేము బెజవాడ వెడలిపోవలసిన తరుణము వచ్చెను. నాభార్య మాతో రాలేకపోయెను. అందువలన, నాకును చిన్న తమ్ముఁడు సూర్యనారాయణకును బెజవాడలో భోజనసౌకర్య మొనఁగూర్చుటకై, మా చిన్నప్ప మాతో వచ్చెను. 20 వ తేదీని మేము బెజవాడ చేరి, వీరభద్రరావుగారిని గలసికొంటిమి. తన చిన్నకుమారుఁ డిటీవల చనిపోవుటచేత, ఆయన దు:ఖతోయములఁ దోఁగియుండిరి.

27. ప్రహసన విమర్శనము

మరల బెజవాడపాఠశాలలోఁ జేరి నా కార్యక్రమమును జరుపుకొను చుంటిని. ప్రార్థనసమాజసభలు నితరసంస్థలును యథాప్రకారముగనేసాగుచుండెను. జూన్ 26 వ తేదీని జరిగిన ప్రార్థనసభలో నేను భాగవతమునుండి కొన్ని పద్యములు చదివి, వాని సారమునుగూర్చి ప్రసంగించితిని. ప్రార్థనసమయమున తమ్ముఁడు సూర్యనారాయణను సద్దు చేయవలదని వారించితిని. ఆరోజునసాయంకాలమునందు ప్రాఁత వలసిన ముఖ్యలక్షణములు, దీనికి లేకపోలేదు. ముందలి సంపుటముల యందు పాఠకులకు రుచి కలిగించుటకోయన, ఈ గ్రంథమున మతికెక్కిన పంతులుగారి ప్రహసనములు ముద్రితమయ్యెను. గ్రంథకర్తకు స్థిరకీర్తినాపాదించిన వారి హాస్యరసయుక్తసంభాషణా ప్రహసనము లిందుఁ గలవు. 'శకునములు' 'మూఢభార్య - మంచిమగఁడు' - 'ఆచారము', 'పెళ్లి వెళ్లినతరువాత పెద్దపెళ్లి', 'బాలభార్య - వృద్ధబర్తృ సంవాదము', 'హిందూమతసభ,' మున్నగు నీచిన్న చిన్న ప్రహసనముల చవిగాంచనివా రెవరు గలరు? ప్రకృతాంధ్రవచనమునకువలెనే, ప్రహసనరచనమునకును వీరేశలింగకవియే సృష్టికర్త ! ఇందలి హాస్యసంభాషణముల కీయన యిచ్చిన "హాస్యసంజీవని" యను పేరే తెలుఁగునప్రహసనమునకుఁ బర్యాయపద మయ్యెను. బాలవృద్ధులకును పండిత పామరులకును, - ఎల్లరికి నీరచనలు 'కరకర మని' రుచికరముగ నున్న యవి!

"ఈ ప్రహసనము లన్నియు గత 25 సంవత్సరములలో వ్రాయఁబడినవి. ఇవి బాలురు చదివి వినోదింతురు. పెద్దవారు గ్రహించి మెచ్చుకొందురు. సంఘసంస్కరణవిషయములనుగూర్చి యిందు చర్చలు గలవు. ఈ సంస్కర్తకు సంఘముతోడి సంరంభ మారంభమయినపుడు, మనలోఁ బలువురు చిన్న వారలుగ నుండిరి; కొందఱు జననమే కాలేదు. సంస్కారవిముఖమగు సంఘముతో నీవీరుఁ డొంటరిగ సమరము సాగించిన వీరి పూర్వకాలపుటపార పరిశ్రమమును, సభలు చర్చలు ప్రసంగములును ప్రబలినయీప్రశాంతసమయమున మనము సమగ్రముగ గ్రహింపక నేరక పోవచ్చును. ఆకాలమున ప్రసంగములును బహిరంగసభలును నిషిద్ధములు ! దుర్నీతి, వ్యభిచారము, మూఢవిశ్వాసములును గౌరవాస్పదమైన యాకాలమున నీశూరుఁడు దౌష్ట్యమును ఖండించి వైచెను. మతాచార్యులయాంక్షల వీరు లెక్క సేయలేదు. కలమే వీరి ఖడ్గము ! తమపలుకు క్రియారూపము దాల్చుపట్ల నీశూరుఁడు గొంక లేదు. సందియమనుమాట నీతఁ డెఱుంగకయె, సమరము సాగించెను. ఇట్టివాఁడేకదా, నిజమైన శూరుఁడు !

"ప్రకృతమున సంస్కారవేత్తలకు దుస్సాధ్యమగు కార్యముల నీధీరుఁ డానాఁడు ఒక్కరుఁడె సాధించెను. ఇట్టి క్రియాశూరుఁ డయ్యును వీరేశలింగముపంతులు హాస్యరసార్ద్రమగు మనస్తత్త్వముగలవాఁడు. ఇదిగాక పామరజనులతో మెలంగవలసినవాఁడు గావున, ప్రహసన మాయన కరముల కుచితపరికర మయ్యెను. శైలిసొంపులతోను, హాస్యంపుఁదళుకులతోను శోభిల్లెడి యీ ప్రహసనావళియందు, "దుష్టాంగమును ఖండించి శేషాంగస్ఫూర్తికి రక్షచేయు చికిత్సకునివలె" నీ రచయిత, సాంఘికానర్థముల నుఱుమాడెను ! ప్రభుత్వోద్యోగి యొకఁడు లంచము పుచ్చుకొనినను, పెద్దమనుష్యుఁ డొకఁడు వేశ్య నాదరించినను, ఆసంగతి యా వారపు "వివేక వర్ధని" నెక్కిరింపవలసినదే ! వ్యక్తులమనసులు నొచ్చిన నొవ్వనిండు, వ్యాజ్యెముల కెడమిచ్చిన నెడమీయనిండు, వీరేశలింగముపంతులు, సంఘమువారి చిన్న బాధలు లెక్కగొనక, తన విద్యుక్తకార్యములను మోమోటములేక నెఱవేర్పవలసినదియే !

"తమిళపత్రికలు సంఘసంస్కరణమున కంతగ సుముఖములు గావని కొందఱితలంపు. దీనిలో సత్యము లేకపోలేదు. ఏదేశమునఁగాని భాషకు భావమునకును గొంత యానుగుణ్య మేర్పడకతప్పదు. ప్రకృతాంధ్రసారస్వతము సంఘసంస్కారప్రచారమునకు సహాయకారియె యని చెప్పవచ్చును. తెలుఁగుపత్రికలు పుస్తకములును సామాన్యముగ సంఘసంస్కరణానుకూలములె. ఆంధ్రసారస్వతమునకును, ఆంధ్రజనుల లో సంఘసంస్కరణానుమోదమునకును నిట్టి సమ్మేళన మొనఁగూర్చినప్రతిష్ఠ, ఆంధ్రకవిశేఖరుఁడగు వీరేశలింగము పంతులకే ముఖ్యముగఁ జెందవలయును.

"ఆంధ్రజనులు, తమ కిష్ట మున్నను లేకున్నను, వీరేశలింగముపంతుల తలంపులే తలంచుచున్నారు. వారిపలుకులే పలుకుచున్నారు. కొలఁది కాలములో వారికార్యములే యాచరించెద రని మాయాశయము. ఇది భగవదుద్దేశము. లూధరు మహాసంస్కర్తను వెక్కిరించిన సమకాలికి లందఱు సమాధులలోని కెక్కినను, వారిసంతతివారే లూధరునికి స్మారకచిహ్నముగ మహాసౌధనిర్మాణము చేసిరి. వీరేశలింగ వ్యక్తియొక్క యూహలు పలుకులు పదములును శక్తిమంతము లైనను, ఆయనక్రియలే మనకు ముఖ్యములు మనము ధన్యులము కాఁగోరితిమేని, యా మహాశయుని బోధనలు విని, పలుకులు మననముచేసి, కార్యముల ననుకరింపవలయును"

28. "హిందూసుందరీమణులు"

1898 వ సంవత్సరము మార్చి 22 వ తేదీ శనివారము నేను 4, 5 తరగతుల విద్యార్థులకు పరీక్షలు చేసితిని. ఒకపిల్ల వాఁడు ప్రశ్నకాకితముల కుత్తరువులు వ్రాయుచున్న వానివలె నటించి, పరీక్షా సమయమున నేదో పుస్తకపుఁ బుటలు తిరుగవేయుచుండెను. నే నట్టె చూడఁగ, అది "కళాశాస్త్రము"! నే నా పుస్తకమును దీసికొని, ఈ సంగతిని విచారించి విద్యార్ధినిఁ దగినట్టుగ శిక్షింపుఁ డని యచట నిలుచుండిన ప్రథమోపాధ్యాయునిఁ గోరితిని. ఆ పిల్ల వానినిగుఱించి మిగుల విషాదమందితిని. విద్యార్థులకు నీతిబోధనము చేయుట కొక సమాజ ముండుట యావశ్యకమని తలంచితిని. పదిదినములు గడచిపోయెను. ప్రథమోపాధ్యాయుని కీవిషయమునఁ జీమకుట్టదయ్యెను ! అంతట 28 వ తేదీని గూడిన యుపాధ్యాయసభలో నే నీసంగతిని బ్రస్తావించి, పాఠశాలాధ్యక్షుని వైఖరిని గర్హించితిని. అతఁడు కుపితుఁడై విద్యార్థి చేష్టను సమర్థింపఁబూని, తనకా కళాశాస్త్రపుస్తకమును నే నీయకుండుటయే, దీనినిగుఱించిన కాలహరణమునకుఁ గారణ మని సాకు చెప్పెను. నా కతితీవ్రమైన కోపము వచ్చెను. నాఁడు పిల్ల వానిని నేనే శిక్షించి యుందు ననియును, పైయధికారియగు తా నచట నుండుటవలన, తమమీఁది గౌరవభావము చేతనే నీ నీసంగతి తనవిచారణ కొప్పగించితి ననియును, నేను బలికితిని. తాను బ్రహ్మచారి యగుటచేత స్త్రీల గోప్యాంగవర్ణ నాదికము గల యిట్టిపుస్తకము నేను తన కీయలే దనియు, ఇపుడైన నీయఁజాల ననియు, విద్యార్థిశిక్షనుగుఱించి తా నింక నుపేక్ష చేసినచో, పాఠశాలాధికారి కీసంగతి విన్నవించుట నావిధి యనియును నేను గట్టిగఁ జెప్పివేసితిని !

నామాటలకు ప్రథమోపాధ్యాయుఁ డుగ్రుఁడయ్యెను. కాని, నాతీవ్రప్రసంగఫలితముగనే యాతఁ డీవిషయమునఁ దనవిధ్యుక్తము నెఱవేర్ప నంగీకరించెను. మఱునాఁడు విద్యార్థు లందఱియెదుటను, ఆ బాలకుని నిలువఁబెట్టి, ప్రథమోపాధ్యాయుఁడు శిక్షించెను. ఈదురభ్యాసమునకులోనగు విద్యార్థిశిక్ష ఉపాధ్యాయు లందఱికిని సమ్మతమె కాని, యిట్టిపనులు విద్యార్థులు బహిరంగముగ జరుపుటయందలి రహస్య మొకింత యారయుట యగత్య మనియె వారలమొఱ ! ఇచటి ప్రథమోపాధ్యాయుఁడు మున్నగు కొందఱు ఉపాధ్యాయుల శోచనీయమగు చర్యలెదీనికిఁ గారణ మని యందఱికిని దెలిసియుండెను. "అత్తపనుల కారడులు లేవు." పూతచారిత్రుఁడగు క్రీస్తుమహాశయుని మతప్రచారమే ముఖ్యోద్దేశముగఁగల యిట్టివిద్యాలయములలో, నీతి విషయమున మంచిపేరు లేని బోధకుల నియమించెడి యధికారుల నే మనవచ్చును !

నా కాలమున వ్రాఁతపనియం దెంతో యాసక్తి. ఒక్కొకప్పుడు రాత్రి రెండుజాములకే నాకు మెలఁకువవచ్చి పిమ్మట మరల నిద్దుర పట్టకుండెడిది. ఊరక మంచము నంటిపట్టుకొని యుండనొల్లక, నే నంతఁ గలము చేతఁబట్టి, దీపముదగ్గఱఁ గూర్చుండువాఁడను. 'జనానాపత్రిక'కు సంపాదకుఁడ నగుటచేత, ఆపత్రిక కేదో సదా వ్రాయుచుండువాఁడను. 'సత్యసంవర్థనీ', 'ఫెల్లోవర్కరు', 'మద్రాసుస్టాండర్డు' పత్రికలకును, ఆంగ్ల వ్యాసములు వ్రాయుచుండువాఁడను. కాని, వీనియన్నిటికంటె "సంఘసంస్కారిణీ" పత్రికకు వ్రాయుటయందు నాకు మిగుల మక్కువ. నాకుఁ బ్రియములగు సంస్కరణములను గూర్చి నా యిచ్చవచ్చినచొప్పున నింగ్లీషున వ్రాసి, యారచనముల నాపత్రికకుఁ బంపుచుండువాఁడను. ఆపత్రికకు వ్రాయఁ గేలఁగలము పూనఁగనే, ఉత్సాహోద్రేకములు నాకుఁ గలిగి, పొంకమగు పదజాలముతో నొప్పెడి వాక్యములదొంతరలు కాకితముమీఁద దొరలుచుండెడివి ! రానురాను మృదుహాస్యరసయుక్తమగు వ్యాసరచన మాంగ్లమున నా కభ్యాసమయ్యెను. వ్రాయుకొలఁది నాకలమునకుఁ దీవ్రగమనమును లభించెను.

ఒకొక్కప్పుడు, ఆంధ్రరచనముకూడ నా కుత్సాహకరముగ నుండెడిది. కాని, యింగ్లీషునవలెఁ దెలుఁగున వ్రాయునపుడు, సామాన్యముగ నేను స్వతంత్రముగ నాలోచింప నక్కఱలేదు. మాతృక లగు నాంగ్లపుస్తకములు, పత్రికలును నా కీసందర్భములం దాధారములు. వానినుండి భాషాంతరముచేయుటయే తెలుఁగున నా ముఖ్యకార్యము. ఇపు డీ జూలైనుండియు నేను "జనానాపత్రిక"ను పొడిగించిన హేతువున నెక్కువగఁ దెలుఁగున వ్రాయవలసివచ్చెను. వెంటనే పుస్తక రూపమునఁ గొన్ని ప్రతులు తీయుట కనువుగ నుండుగ్రంథ మేదైన నారంభించుట యుక్త మని నాకుఁ దోఁచెను. తాత్కాలికోపయోగమునకై పత్రికలకు వ్యాసములు వ్రాయుట వ్యర్థకాలక్షేపము. అట్టి వ్యాసములు చదువరుల కెపుడు నుపయుక్తమై రుచించునట్టివిగ నుండవు. కావున స్థిరరూపము తాల్చు పుస్తకరచనమునకే నే నిపుడు పూనితిని. ఈ యొకపనిమూలమున, పత్రికాప్రచురణ పుస్తకముద్రణములను రెండుకార్యములు నేను సాధింపవచ్చును.

"జనానాపత్రిక"లో నిదివఱకు స్నేహితులపుస్తకము లీరితిని ప్రచురింపఁబడినవియె. "గృహనిర్వాహకత్వము" అను పుస్తకము నివ్విధముననే నా పత్రికలోఁ బ్రచురించితిని. స్త్రీల కుద్దేశింపఁబడిన పత్రికలో భారతదేశమున నిదివఱకుఁ బ్రసిద్ధినొందిన పుణ్యాంగనలకథ లుండుట సమంజసముగదా. ఈమేయినెల సంచికలోనే "శకుంతల" కథను వ్రాసితిని. ఇపుడు జూలై నుండియు "సీత"చరిత్రమును వ్రాసి ప్రచురించితిని. పిమ్మట 'సావిత్రి' మున్నగు స్త్రీలకథలువ్రాసి, 99 వ సంవత్సరము ఏప్రిలు నెల నాఁటికి "హిందూ సుందరీమణుల చరిత్రముల" మొదటిభాగమును బూర్తిపఱిచితిని. పత్రికలో ముద్రింపఁబడిన యీకథలు, వెనువెంటనే పుస్తకరూపమునఁగూడ బ్రచురింపఁబడెను.

మిగులఁ బరిశ్రమ చేసియే నే నీ పుస్తకములు వ్రాసితిని. అదివఱకే భారత, రామాయణాదులు చదివియుండినను, ఇపు డీకథలకొఱకై ఆయా పుస్తకములు నే నీమాఱు సమగ్రముగఁ జదువవలసివచ్చెను. ఇంతియకాక, ఒక్కొకచరిత్రలోని కథకొఱకు మూఁడునాలుగు పుస్త ములు నేను దిరుగవేయవలసివచ్చెను. ఆ పుస్తకములనుండి రమ్యములగు పద్యములుకూడ నుల్లేఖించితిని. కథలో రసహీనములగు భాగములు వదలివేసి, వినోదకరములును నీతిదాయకములును నగుపట్టులకుఁ బ్రాముఖ్య మిచ్చుచుండువాఁడను. పురాణేతిహాసములలోని కథాక్రమమును సామాన్యముగ మార్పకుండువాఁడను. మిక్కిలి యరుదుగనే నా సొంత యభిప్రాయములను చరిత్రములలోఁ జొప్పించుచుండువాఁడను.

ఈకథలలో నెల్ల సీతాద్రౌపదులచరిత్రములు ఉత్కృష్టములు. ప్రాచీనకాలహిందూసుందరు లందఱిలోను సీతయే శీలపవిత్రతలయందుఁ బ్రథమగణ్య. రాముఁడు సుగుణాభిరాముఁడె యైనను, హృదయేశ్వరియగు సీతయెడఁ దుద కాయన చూపిననిరసనమునకును, అందుమూలమున నా పుణ్యవతి కాపాదిల్లిన శోకకష్టములకును వగవానివా రుండరు. ఈకథలన్నిట్టిలోను ద్రౌపదిచరిత్రము కడు దీర్ఘమైనది. ఆ సుగుణవతిచరిత్రమున నెన్ని యంశములో యిమిడియుండుటచేత, కథ విపులముగఁ దెలుప నవకాశము గలిగెను.

29. పితృనిర్యాణము

విజయదశమిపండుగలకు నే నొకసారి మా తల్లిదండ్రులను జూచుటకు 24 వ సెప్టెంబరున రాజమంద్రి వెళ్లితిని. అందఱు నచట సుఖముగ నుండిరి. మిత్రులను సందర్శించితిని. మందిరములో ప్రార్థన జరిపితిని. స్నేహితులగు పాపయ్యగారికి పోలవరము సంస్థానాధికారి యుద్యోగ మగుటకు మా యభినందనములు తెలుపుచు నొక తీర్మానము గావించితిమి. మఱునాఁడు అత్తగారు మున్నగు బంధువులను జూచివచ్చితిని. నాకు రాజమంద్రికళాశాలలో నుద్యోగము దొరకు ననెడియాశ యిప్పటికిఁ దొలఁగిపోయెను ! 20 వ తేదీని తల్లి దండ్రులను సోదరులను విడువలేక విడిచి, రైలెక్కి బెజవాడ చేరితిని.

ఆ దినములలో బెజవాడపఠనాలయమున సాయంకాలము చీట్లాడుట పెద్దమనుష్యుల సంప్రదాయమయ్యెను. ఇది నాకును తక్కిన సంస్కారపరులగు మిత్రులకును సరిపడకుండెను. దీనిని నిరసించుచు నేను పత్రికలకు వ్రాసితిని. వీరభద్రరావుగా రొకప్రహసనము కల్పించిరి. మావ్రాఁతలు సభ్యులకుఁ గష్టముగాఁ దోఁచెను. మావ్యాఖ్యానము లసమంజసములని యొక బహిరంగసభలో నధ్యక్షుఁడు వాకొనియెను.

నా "గృహనిర్వాహకత్వ" మిదివఱకె ప్రకటింపఁబడినను, ముద్రితమైన మున్నూఱుప్రతులును వేగమె విక్రయమగుటచేత, కొన్నిమార్పులు చేసి, రెండవకూర్పునకు పుస్తకమును మద్రాసుపంపితిని. కాని, సొమ్మునుగుఱించిన చిక్కులవలన, అచ్చుపని యాఁపుఁడని నేను అక్టోబరు 5 వ తేదీని తంతి నంపినను, ముద్రాలయాధిపతి పుస్తక ముద్రణము మానివేయలేదు.

ఆకాలమునందు నాగ్రంథపఠనవైపరీత్యము నా దినచర్యపుస్తకమందలి యీక్రిందియుల్లేఖమువలనఁ దెలియఁగలదు : -

"1898 అక్టోబరు 6 గురువారము: 'లండనునగర రహస్యముల'లోను, కార్లయిలుని 'భూతవర్తమానముల'లోను కొన్ని పుటలు చదివితిని. 'మార్కసు అరీలియసునిమననములు,' 'సెనీకానుండి యుల్లేఖనములు' అనుపుస్తకములు చదువఁ దీసికొంటిని. ఉత్కృష్టములు నికృష్టములునగునిట్టి పరస్పరవిరుద్ధ విషయములను సమానప్రేమమున నాయాత్మ క్రోలుటకుఁ గారణము తెలియదు ! రైనాల్డ్సుని విషయవాం ఛావర్ణనమువలెనే కార్ల యిలు, అరీలియసుల తత్త్వశాస్త్రవిషయములును నాకు హృదయానుమోదము లే!"

హైదరాబాదు ప్రాంతములనుండి యారోజులలో బెజవాడ యొక స్వాములవారు వచ్చిరి. ఆయన గొప్పమాహాత్మ్యము గలవాఁడని జను లనుకొనిరి. స్వామివారిని సందర్శింపఁగోరి, 15 వ అక్టోబరు శనివారము వేఁకువనే కామశాస్త్రి వీరభద్రరావుగార్లు వెంటరాఁగా, నేను ప్రాఁతయూరు పోయితిని. స్వామివారు మౌనముద్ర నూనియుండుటచేత, వారి నిచటికిఁ గొనివచ్చిన బెజవాడ నివాసులగు శ్రీగోవిందరాజుల రామప్పగారితో మేము ప్రసంగించితిమి. స్వామివారు తమ వయస్సు 800 వత్సరములని నుడివి రని తెలి సెను. ఆయన నిరశనవ్రతులుకూడనఁట!

ఆ సెలవుదినములలోఁ గొందఱు మిత్రులతోఁ గలసి నే నొకనాఁడు కొండపల్లి వెళ్లితిని. పర్వతశిఖరమగు "నొంటిమన్యము"ను జూచితిమి. అచటి ప్రకృతిదృశ్యము లత్యంతరమణీయములు.

6 వ నవంబరునాఁటి దినచర్య యిటులుండెను: - "రాఁబోవు సంవత్సరము వెంకటరత్నమునాయఁడుగారు నోబిలుకళాశాలనుండి వెడలిపోవుదురను దుర్వార్త వినవచ్చెను. నాయఁడుగారు బ్రాహ్మసమాజప్రచారమునం దమితోత్సాహము గలిగియుండుట, కళాశాలాధ్యక్షుఁడగు క్లార్కుదొర కిష్టము లేకుండుటయే దీనికిఁ గారణము ! నేను నాయఁడుగారి కొక పెద్దయుత్తరము వ్రాసి, పూర్వము మే మనుకొనిన 'ఆస్తికపాఠశాల' నిపుడు నెలకొల్పఁగూడదా యని యడిగితిని. ఆకాశము మేఘావృత మగుటచేత నేఁడు దుర్దినము. మిత్రుఁడు నాయఁడుగారినిగూర్చిన దు:ఖవార్త వినుటవలన నామనస్సునకును నేఁడు దుర్దినమే !" ఇటీవల మాతల్లి తఱచుగ వ్యాధిపీడిత యగుచుండెడిది. మా తండ్రిమాత్రము సామాన్యముగ నారోగ్యభాగ్య మనుభవించుచునే యుండెడివాఁడు. కాని, 8 వ నవంబరున మాతండ్రికి జ్వరమువచ్చెనని తమ్ముఁడు వెంకటరామయ్య జాబువ్రాసెను. ఈరోజున వర్షము కురిసెను. నేను వ్యాకులచిత్తుఁడనైతిని. నాఁటిరాత్రి 9 గంటలకు రాజమంద్రిలోని మాతమ్మునియొద్దనుండి నాకు తంతివచ్చెను. మాతండ్రికి వ్యాధి యధికమయ్యెనని యం దుండెను. తమ్ముఁడు సూర్యనారాయణుని వెంటఁదీసికొని, నేనారాత్రి రైలులోనే బయలు దేఱితిని. దారి పొడుగునను మాజనకునిగుఱించిన దు:ఖకరమగు తలంపులు నామస్సును జీకాకుపఱిచెను.

మఱునాఁడు ప్రొద్దున మేము రాజమంద్రిచేరి, యింటికిఁ బోయి చూచునప్పటికి, మానాయన స్పృహతప్పి వేదనపడుచుండెను. అందఱమును విలపించితిమి. గతరాత్రి గడచుటయే దుర్లభమయ్యెనని మావాళ్లు చెప్పిరి. మాతండ్రి కేవిపత్తు సంభవించునో యని మేము భీతిల్లితిమి. భార్యను రమ్మని బెజవాడ తంతి నంపితిని. జాగ్రత్తతో మందులిచ్చుచు, మానాయనకు బరిచర్యలు చేసితిమి.

మాతండ్రికి సన్ని పాతము గానఁబడెను. దానికిఁదోడు, ఎక్కిళ్లుకూడ నారంభమయ్యెను. దేశీయవైద్యుఁడు కృష్ణమరాజుగారివలన లాభము లేదని యెంచి, రమణారావుగారి నేర్పఱిచితిమి. ఈవైద్యుల మార్పువలన రోగి కేమియు లాభము చేకూరదయ్యెను. 13 వ నవంబరు దీపావళినాఁడు మానాయనకు వ్యాధి ప్రబలమయ్యెను. నాడి క్షీణించెను. జ్వరము తగ్గినను, రోగి బొత్తిగ విశ్రాంతి లేక బాధపడు చుండెను. 14 వ నవంబరున మేము వైద్యాలయాధికారిని దీసికొనివచ్చితిమి. వాతము క్రమ్మిన దనియు, రోగి జీవింపఁ డనియు, ఆయనచెప్పి వేసెను. మాతండ్రి కదివఱకు చాయాపటము తీయనేలేదు. మంచము మీఁదనే పడియుండు రోగిపటము తీయుఁ డని యిపు డొకచిత్రకారుని గోరితిమి. ఆతఁ డొకపట మెత్తి, అది పాడయ్యె నని చాలదినములకుఁ బిమ్మట మాకుఁ జెప్పివేసెను !

శిశువును బెంచురీతిని, నలుగురు సోదరులమును అహర్నిశము జనకునికిఁ బరిచర్యలు చేసితిమి. కాని, యాయనదేహస్థితి క్షీణదశకు వచ్చెను. ఒక్కొక్కమాఱు మిల్లె గరిఁటెఁడు పాలయినను మ్రింగలేక, ఆయన స్పృహతప్పిపడి యుండెను. వెక్కిళ్లు వచ్చునప్పుడు మాత్రము కొంచెము తెలివిగలుగుచుండెను కాని, యాస్పృహయే యాయనవేదనను మఱింత పెంచుచుండెను ! 15 వ నవంబరు రాత్రి యెక్కిళ్లు మితిమీఱెను. పొత్తికడుపు దగ్గఱనుండి లోనయేదో యెత్తుగ పొంగి, పామువలె కడుపులో పైకెగఁబ్రాఁకి, గొంతుదగ్గఱకు వచ్చునప్పటికి, రోగి, యొక్కొక్కప్పుడు ఉక్కిరిబిక్కిరి యగుచుండెను. ఇ ట్లొక్కొక్కప్పుడు ఊపిరాడక, ఆయన పడిపోవుచువచ్చెను. మృత్యువాసన్న మయ్యె ననుకొనుచుందుము. మరల తెప్పిఱిల్లుచువచ్చినను నాడి క్షీణించిపోసాగెను.

16 వ నవంబరు ప్రాత:కాలమున మాజనకునికి ప్రాణోత్క్రమణసమయ మాసన్నమయ్యెను. మరల దేశీయవైద్యుని పిలువఁగా ఆయన ముసాంబ్రపుగంధము రోగికడుపుమీఁద పట్టువేయించెను. వేంటనే వెక్కిళ్లు కట్టెను. అందుచేత మాకుఁ గొంత యాశ కలిగెను. కాని, రోగినాడి క్రుంగిపోవుచున్న దనియు, లాభము లేదనియు వైద్యుఁడు చెప్పివేసెను. నే నంత దు:ఖపరవశుఁడనైతిని. ఈకర్ణకఠోరపుఁబలు కాడిన వైద్యుని దిట్టివైచి, నేను లేచి నిలువఁబడితిని. నా కింతలో, మా తండ్రితోడనే కాక, లోక మంతటితోను సంబంధము వీడిపోయెనను వెఱ్ఱిభ్రమ గలిగెను! బయటికి వెడలిపోవుచున్నా నని చెప్పివేసి, నే నంత వీథినిఁ బడితిని. వర్ణింపరాని గాఢాంధకార మేదియో జగము నావరించునటు లయ్యెను. నా దేహమున గగుర్పాటు గలిగెను. శరీరమనశ్శక్తులన్నియు నొక్కుమ్మడి నుడిఁగిపోవుచున్నట్లు తోఁచెను. స్పృహ దాదాపుగ నంతరించెను. చనిపోవుచుండు మాతండ్రి నంతవదలివేసి, నాభార్యయు మఱికొందఱును నావెంటఁబడి, నన్నుబట్టుకొని, పొరుగున నుండునొక మిత్రుని యిల్లు చేర్చిరి. నా కపుడు శైత్యోపచారములు చేసిరి. అపుడే వారియింటిలో వంట సిద్ధముకాఁగా, నా చేత ముఖము కడిగించి, నాభార్య, నాకుఁ గొంచెము మజ్జిగతోఁ గలిపిన యన్నము పెట్టి, వారివీధిగదిలో నిద్రపుచ్చెనఁట !

నాకు మెలఁకువ వచ్చునప్పటికి, పగలు పదిపదునొక్కగంట యయ్యెను: మానాయన యదివఱకే చనిపోయెను ! తమ్ముఁడు వెంకటరామయ్యయు నావలెనే కొంతసేపు మతి తొలఁగియుండెనఁట నేనపుడు మాయింటికిఁ జని, చనిపోయిన తండ్రికై విలపించితిని. మమ్ముఁ బెంచి పెద్ధవాండ్రను జేసి, విద్యాబుద్ధులు గఱపి సంరక్షించిన ప్రియజనకునికి మే మపుడు, గోదావరినదీసైకత ప్రదేశమున నగ్ని సంస్కారము జరిపితిమి. ఇటీవల నడ్డులేని పోఁకడలు పోవు నాపాపపుహృదయమును గుఱించియే మాకీ ఘోరవిపత్తు సంఘటిల్లె నని నేను విలపించితిని. మాసంసారము నిబిడాంధకారనిమగ్న మయ్యెను!

30. జనకసంస్మరణము

దినముల కొలఁది నిద్రాహారములు సరిగాలేక మేము తండ్రిని గనిపెట్టుకొని యుండుటవేతను, ఇపు డాయన పరలోకప్రాప్తిఁ జెందుటవలనఁ గలిగిన యాశాభంగపుఁ దాఁకుడుచేతను, మాసోదరుల కందఱికిని శరీరస్వాస్థ్యము తప్పిపోయెను. నన్ను రక్తగ్రహణి పట్టి పీడించెను. చిన్నతమ్ముడు సూర్యనారాయణకు తీవ్రజ్వరము వచ్చెను. అందువలన, ఇపుడు సంప్రాప్తమైన విపత్తును విచారమును మఱపించెడి యలజడికి కుటుంబము తావల మయ్యెను. కాని, క్రమముగ నందఱికిని దేహమున నెమ్మది గలిగెను. ఆదినములలో మాయందఱియాలోచనలకును మా తండ్రిని గూర్చిన సంగతులే ముఖ్యవిషయ మయ్యెను. మానాయన సదా పెరటిలోని చెట్లు పెంచుచుఁ బాటు పడుచుండువాఁడు. ఆయన నిరతము కూరగాయల మొలకలే పెంచు చుండును గాని, పూలచెట్లనిన మక్కువ లేశమును లేనివాఁడని వెనుక నే నే నాయన నొకటిరెండు మాఱులు గేలిచేసితిని. క్రియాపూర్వక మైన ప్రత్యుత్తరము నా కీయఁగోరిన వానివలె, మాతండ్రి యిటీవల నొక యాంగ్లేయుఁడు పట్టణము విడిచిపోవుచుండఁగా, జవానుల నడిగి, వానిపెరటిలోని క్రోటనులు పూలమొలకలు ననేకములు తెచ్చి, విశాలమగు మా పెరటిలో నాఁటెను. ఇపు డాచెట్లు, వింత రంగుల చిగురు జొంపములు వెట్టియు, సువాసన లీను పూవులు దాల్చియు కనులపండువు సేయుచుండెను. ఆయన మిగుల శ్రద్ధతోఁ బెంచిన నిమ్మచె ట్టీదినములలో పచ్చనిపండ్లతో నిండియుండెను. పెరటిలో నెచటఁ జూచినను మాతండ్రి పాటు గానవచ్చుచుండెను. ఆయన యేచెట్టునకుఁ గలుపు తీయుచునో, ఏమొలక తీఁగల సరదు చునో యుండునట్లు మేము భ్రమపడుచుండువారము. మాకనుల కిం కెన్నఁడు కనఁబడక, ఆయన యొక్క పెట్టున మృత్యువునోటఁ బడినట్టుగ మేము విశ్వసింపఁజాలకుంటిమి!

మే మిపుడు చేయు కర్మాంతరములవలన నా కొకింత తాపోపశమనము గలుగుట వాస్తవమే. కాని, యా వ్యర్థకర్మకలాపమువలననే జనకుని పవిత్ర సంస్మరణమునకుఁ గొంత కొఱంతయుఁ గలుగుచున్నదని నే నెంతయు విసుగుచుండువాఁడను.

ఆదినములలో మా కెల్లరకును దుర్భరముగఁ దోఁచినది పదవనాఁటి మా జనని వపనకర్మయే. దీని కంగీకరింపవలదనియు, ఆక్షేపించువారలకు మేము తగు సమాధాన మిచ్చెద మనియు, మే మెంత బోధించినను మాతల్లి వినక, పూర్వాచారపరాయణయై యీ క్రూర కర్మ కొడంబడెను. ఆసమయమున దు:ఖావేశమున నామె మూర్ఛిల్లి పోవచ్చు నని మేము భీతిల్లినను, దైవానుగ్రహమున నట్లు జరుగలేదు. తనయులవలెఁ గాక, యాకష్టసమయమున మాతల్లి ధైర్యము వహించి యుండెను. విధ్యుక్త మని తాను నమ్మిన మార్గమెంత దుస్సహమైనను, దానిచొప్పుననడచుకొనుట కాపుణ్యవతి యావంతయుఁగొంకకుండెను.

మాతండ్రి చనిపోయిన 11 వ నాఁడు రాజమంద్రి "ప్రార్థనసమాజము"వారు ప్రత్యేకసభ నొకటి సమకూర్చిరి. ఆసమయమున రెబ్బాప్రగడ పాపయ్యగారు అధ్యక్షులుగ నుండిరి. మా జనకునిగూర్చి నే నపు డొక యాంగ్లవ్యాసమును జదివితిని. అందలి ముఖ్యభావము లిచటఁ జేర్చుచున్నాను: -

"చనిపోవునప్పటికి మాతండ్రికి సుమా రఱువది సంవత్సరముల వయస్సు. ఆయన జన్మస్థలము తణుకుతాలూకాలోని గోటేరు. వారిది గౌరవనీయమగు నియోగిబ్రాహ్మణ కుటుంబము. విద్యాగంధ మెఱుంగని యాయన తండ్రి ప్రయాసమునఁ దనపెద్ద సంసారమును బోషించుకొనుచుండువాఁడు. ఆగ్రామమున నింటికిఁ జేరువనుండు తన పొలమును సొంతముగ సేద్యము చేసికొని, ఆయన సతీసుతులను బోషించుకొనుచుండువాఁడు. మాతాత కృష్ణమ్మగారి కైదుగురు పుత్రులును, ముగ్గురు పుత్రికలును గలరు. ఆయన కష్టములు నానాఁట ఫలించెను. కుమాళ్లు ఒక్కరొక్కరే పెద్దవారలు ప్రయోజకులునై, కుటుంబపోషణ భారమును తామే వహించిరి. చిన్నవాఁడు మా తండ్రికి విద్య నేర్చుటకు స్వస్థలమున నవకాశము లేకపోయెను. కాని, ఆయన యింట వ్యర్థకాలక్షేపము చేయనొల్లక స్వతంత్రజీవన సంపాద్యము చేయఁబూనెను. విద్య యంతగ రాకుండెడి యువకులకు జీవనోపాధి గలిపించుటకై యాకాలమున నరసాపురమున బోధనాభ్యసన పాఠశాల యొకటి యేర్పడియుండెను. మాతండ్రి యందుఁ జేరెను గాని, అచట బోధింపఁబడెడి చరిత్రము భూగోళము మున్నగు నూతన విషయములు తలకెక్కక, కొలఁది దినములకే యాయన యచటినుండి తప్పించుకొనిపోయెను ! అంత సర్వేశాఖలో నుద్యోగము సంపాదించి, పలుమాఱు పని విరమించుకొనుచు వచ్చినను, తన యుద్యోగకాల మంతయు నాయన, యా శాఖలోనే పనిచేసెను.

"సర్వేయుద్యోగమం దాయన యాంధ్రదేశ మంతటను సంచారము చేసెను. ఉత్తరజిల్లాలే కాక, దత్తమండలములుకూడ మానాయన సందర్శించెను. ఎక్కువగ ధన సంపాదనము చేసి, జ్యేష్ఠసోదరునికి సొమ్మాంపి, మంచిభూవసతి సంపాదించెను. ధన సంపాదన విషయమై మాతండ్రి త్రొక్కినత్రోవ సరియైన దని చెప్పువాఁడను గాను. కుటుంబపోషణము చేసికొనుటయం దెట్టి ప్రవర్తన మైనను కూడు నని సామాన్యజనులవలె నమ్మి, ఆయన తన చర్యలను సమర్థించు కొనుచుండువాఁడు.

1882 వ సంవత్సరమున తనయుల విద్యాభివృద్ధినిమిత్తమై మాతండ్రి రేలంగినుండి రాజమంద్రికి సంసారమును తరలించెను. త నున్నతవిద్య నభ్యసింపకున్నను, ఆంగ్లేయ విద్యాసంస్కారము కలిగినఁ గాని తనకుమాళ్లు వృద్ధినొందరని గ్రహించి, ఆయన వారి విద్యకొఱకై పడరాని పాట్లుపడెను. మేము రాజమంద్రిలోఁ జదువుచుండినపుడు, నెలకు పదునైదు రూపాయీల జీతముమీఁద మానాయన గోదావరి విశాఘపట్టణ మండలములందలి గడుమన్యములలోఁ దిరుగుచు, ఒక్కొక్కప్పుడు వన్యమృగములనోటఁ బడ సిద్ధ మగుచు, పుత్రుల విద్యాభ్యున్నతికై యపారస్యార్థత్యాగము చేసెను ! కాని, యిటీవల కొంతకాలమునుండి యాయన వ్యాధిగ్రస్తుఁడై యుద్యోగము లేక యుండుటవలన, కుటుంబము అప్పుల పాలయ్యెను. ఋణములు తీర్చి వేయుటకై కష్టార్జితమగు భూమినంతను అమ్మివేయుట కాయన సంశయింపకుండెను. ఆయన పడిన కష్టముల ఫలితముగ, కుమాళ్లలోఁ బెద్దవార మిరువురము విద్యాపరిపూర్తిచేసి ఉద్యోగమునఁ బ్రవేశించిమి. కాని, మా కష్టమంతగ ననుభవింపకయే, ఆయన పరలోక ప్రాప్తిఁ జెందిరి !

"ఈకష్టసమయమున నా హృదయమును దుర్భరవిషాదముచేఁ గలంచునది, ఆయనయెడ నేను జెల్లింపని విధ్యుక్తములసంస్మరణమే ! పలువిషయములలో మేము మాజనకునిదెస నపరాధులము ! మేము హాయిగ నుండునపుడు, ఆయన కష్టముల పాలయ్యెడివాఁడు. మాకొఱకింతగాఁ బాటుపడిన తండ్రినిఁ దగినట్టుగ సుఖపెట్టమైతిమిగదా యని మేము వగచుచున్నాము. ముం దాయన కెప్పుడో 'కట్నము గప్పుద' మను మా యాశ లన్నియును ఆయన మృత్యువువలన వట్టి యడియాస లయ్యెను !

"సంఘసంస్కరణమును గుఱించియును, ప్రార్థన సమాజము నెడలను మాతండ్రిగారి దృక్పథ మెట్టులుండినని మీ రడుగవచ్చును. ఆయన పూర్వాచారాపరుఁ డయ్యును, వివిధప్రదేశములు సందర్శించి విదేశీయోద్యోగులతోడి సంపర్కము గలిగియుండిన హేతువున, ఆయనభావములకుఁ గొంత వైశాల్య మబ్బెను. రాజమంద్రిలో తన కుమారులలో పెద్దవా రిరువురును సంఘసంస్కరణ సమాజమునఁ జేరి పాడగుచుండిరను వదంతులు ప్రబలినను, ఆయనకుఁ జీమకుట్ట దయ్యెను ! పుత్రుల మతాభిప్రాయములపట్ల నాయన మంచి సహన బుద్ధి గలిగియుండెను. నే నిచటి ప్రార్థనసమాజమునఁ జేరి తీవ్రముగఁ బనిచేయుచు, "సత్యసంవర్థనీ పత్రికను" నెలకొల్పి నడుపుచుండెడి 1891 - 92 సంవత్సర ప్రాంతములందు, నేను నాస్తికుఁడనై దుష్కార్యము లాచరించుచుంటి నని పలువురు మొఱలిడినను, ఆయన నిశ్చలుఁడై యుండెను ! మాతండ్రిగారి మత విశ్వాసములు కొంతవఱకు ప్రజాభిప్రాయములకు భిన్నములే. కావున నేకేశ్వరోపాసకుఁడనకు నాయం దాయన కొంత సానుభూతి గనఁబఱుచుచుండువాఁడు.

"లోకవ్యాపారములలో మాతండ్రి న్యాయశీలుఁడు. తా నెన్నఁడును న్యాయసభల కెక్క లేదనియు, అసత్య మాడలేదనియును ఆయన చెప్పుచుండువాఁడు. ఆయన యెవరిని గాని హింసించుటయు, మోసపుచ్చుటయు నే నెఱుంగను. పైకి మొరటుగఁ గానిపించినను, ఆయన కోమలహృదయమున నొప్పువాఁడు.

"మాతండ్రి మంచమెక్కి వేదన పడుచుండెడి యంత్యదినములలో, నలుగురు సోదరులమును రేయుంబవళ్లు ఆయనను కనిపెట్టి యుండువారము. రాత్రులు నిద్రను నిరోధించితిమి. అట్లుగాక, ఒకరి వెనుక నొకరము మేము మాతండ్రిని గాచుచు,. నిదురించుచుండుట మంచి దని బంధువులు యోజన చెప్పిరి. కాని, వంతులచొప్పున వేచి యుండుట యనునది, వంతులచొప్పున ప్రేమించుటవలె మాకుఁ దోఁచెను ! ఒక్కొక్కప్పుడు మాలో నెవరముగాని నిద్రాపారవశ్యమున నైనను, ఒండొరుల బోధనముననైనను, ఒకింత కునికినప్పుడు, తండ్రి మూలుగు చెవులఁబడగనే అదరిపడి లేచి కూర్చుండువారము ! ఇట్లు మేము చనిపోవుతండ్రిని మిగుల శ్రద్ధతోఁ గనిపెట్టితిమి. ప్రేమ పూరితహృదయు లగు పుత్రులు తనకు సపర్యలు చేయుచుండిరని గాంచి సంతృప్తి నొందుటకైన మాతండ్రి కొకింత స్పృహ వచ్చి ప్రాణము నిలుచునేమో యని మే మాశించుచుంటిమి. కాని, యీశ్వరోద్దేశము వేరయ్యెను.

"మా కత్యంతప్రేమాస్పదుఁడగు పితృని కళేబరము ఛితిపై నొక త్రుటిలో మటుమాయమయ్యెను. మృత్యుదేవతా ! మా జనకుని యసువులఁ గొనిపోయిన నీవు, విచ్చల విడిగ సంచారముచేసెడి నా విషయేచ్ఛల నేల సమయింపఁజాలవు? కొంతకాలముక్రిందట పాపచింతనలు నామనసునఁ జెలరేగి యుండునపుడు, ఒకచిన్న తమ్ముని మరణ రూపమున భగవంతుఁడు నాకు హృదయప్రబోధముఁ గలిగింపఁజూచెను. మరల నిటీవల నా యంతరంగము హేయవాంఛలకును పాపసంకల్పములకును నాటపట్టయ్యెను. నా మదోన్మత్తత నడగించుటకు నాకేదో మూఁడునని యెదురు చూచుచుంటిని. ఇవ్విధముగఁగాని నాకుఁ బ్రాయశ్చిత్తము గలుగదని యెంచి భగవంతుఁడు నా కీవిపత్సందేశము నం పెనని నే నెంచుచున్నాఁడను. "మా జనకుని పవిత్ర జీవితము మాసోదరు లందఱికిని పరస్పర ప్రేమముఁ బురికొల్పును గాక! మా తండ్రి కీలోకమున సమకూరని శాంతి సౌఖ్యములు పరాత్పరుని సన్నిధానమునఁ బ్రసాదిత మగునుగాక!"

నా ప్రసంగానంతరమున మిత్రులు పెద్దాడ సాంభశివరావు గారు మా జనకుని సౌజన్యమును గూర్చి ముచ్చటించిరి. అగ్రాసనాధిపతియగు పాపయ్యగారు మానాయన సుగుణములను బ్రశంసించిరి. ఎన్నఁడుగాని తనకుమారులు చెడువార లనియు నాస్తికు లనియు మాతండ్రి మొఱలిడలేదని వారు చెప్పిరి. అమిత సహన సౌజన్యములు గలిగి మాజనకుఁడు మనుచుండెడివాఁడని పాపయ్యగారు వక్కాణించిరి.

31. ప్రాథమిక పరీక్ష

మాతండ్రి చనిపోయిన చాలకాలమువఱకును, నా కాయనను గుఱించి భయంకరమగు కలలు వచ్చుచుండెడివి. మా కిపుడు కష్టపరంపర సంభవించె ననియు, మాతల్లి మున్నగు వారును మృతి నొంది రనియు నేను సుషుప్త్యవస్థయందు భ్రమనొందుచుండువాఁడను. ఇపుడు సంవత్సరపు తుదిదినము లగుటచేత మా పాఠశాలకుఁ బరీక్షలు చేయఁజొచ్చితిమి. నామిత్రులు వెంకటరత్నము నాయఁడుగారు కృష్ణామండలపూర్వభాగమునకు ప్రాథమిక పరీక్షాధికారిగ నియమింపఁబడిరి. ఆయన నన్నును, మఱికొందఱు స్నేహితులను సహాయ పరీక్షాధికారులుగ నియమించిరి. అందువలన నించుక ధనలాభమె కాక, మనసునకుఁ గొంత విరామమును, వారియొక్కయు నితర స్నేహితులయొక్కయు నమూల్య సహపాస భాగ్యమును నాకు లభించెను. నేను 4 వ డిశంబరు తేదీని, బెజవాడనుండి కంకిపాడు బయలుదేఱి, నాయఁడుగారి నచట సాయంకాలము గలసికొంటిని. చెన్నాప్రగడ భానుమూర్తిగారు నిడుగొంది నరసింహముగారును, వారికి సహాయకులుగ నుండిరి. రాత్రి చాలసేపటివఱకును నాయఁడుగారు తమ బందరు వృత్తాంతములు నాకుఁ జెప్పిరి. క్లార్కుదొర తనను నోబిలు కళాశాల విడిచిపొమ్మను సందర్భము వారు సవిస్తరముగఁ దెల్పి, ఆస్తికపాఠశాలా స్థాపనమున కిది యదను గాదని పలికిరి.

ప్రాథమిక పరీక్ష నితర గ్రామములోఁ జేయఁబోవుటకు నాకు సెలవు దొరకుట దుర్లభమయ్యెను. పాఠశాలలోని పని, "జనానాపత్రిక" పని, ఇపుడు పునర్ముద్రణ మగుచుండు "గృహనిర్వాహకత్వము" అచ్చుప్రతులు సవరించు పనియును గలసి, నా కెంతో ప్రయాసము గలిగించెను.

13 వ డిశంబరు విద్యాశాల సంవత్సరపు తుదిదినము. ఆరోజున వేవేగమే పాఠశాలా పరీక్షలు పూర్తి పఱచుకొని, నేను స్టేషనునకు వెళ్లితిని. చెన్న పురికిఁ బోవుచుండెడి కనకరాజు గంగరాజుగార్లను జూచి, నైజాము పోవుబండి యెక్కి, మదిరలో దిగితిని. ఆరాత్రియంతయు నాయఁడుగారు నేనును బండిపయనము చేసి, మఱునాఁటి యుదయమునకు నందిగామ చేరితిమి. రెండు రోజులలో నచటి పరీక్షలు పూర్తిచేసి, జగ్గయ్యపేట వెడలిపోయితిమి. 16 వ డిశెంబరున నచట పరీక్ష జరిగెను. ఇపు డక్కడ పూర్వ మిత్రుఁడు అయ్యగారి సుబ్బారాయఁడుగారు ఉద్యోగమున నుండిరి. వారి యింట నేను బసచేసితిని. బెజవాడయందలి వెనుకటి సౌఖ్య దినములు మా కప్పుడు జ్ఞప్తికి వచ్చెను. మఱునాఁడు బెజవాడ చేరితిమి. 19 వ తేదీని నేను రెయిలెక్కి రాజమంద్రి వెడలిపోయితిని. ఆప్రదేశమున మానాయన సంతోషానన మిపుడు గానరాక నేను మిగుల వగచితిని.

ఆ శీతకాలపు సెలవు రోజులలో నేనును తమ్ముఁడును చెల్లెలు కామేశ్వరమ్మ వివాహ సంబంధమునకు వెదకితిమి. అట్లపాడు సంబంధమే యేర్పాటు చేయఁదలఁచితిమి. దు:ఖాతిరేకమున వగచు మాతల్లికి ననుదినమును భాగవతము చదివి యర్థము చెప్పుచు, ఆమెను గొంత సేదదేర్చితిని. మా మఱఁదల కింకను, దేహస్వాస్థ్యము గలుగనేలేదు. ఐనను నేను భార్యాసమేతముగ 5 వ జనవరిని బెజవాడకు బయలు దేఱిపోయితిని.

మరల ప్రాథమిక పరీక్షలు జనవరి ప్రారంభమున నారంభించుటచేత నే నింత త్వరగ బెజవాడ రావలసివచ్చెను. నా భార్యయు, అత్తగారును బంధువులను జూచివచ్చెద మని యేలూరులో దిగిరి. కావుననే నాయఁడుగారు మున్నగు పరీక్షా స్నేహితులకు, ఇంట రెండవ భాగమున నుండు మిత్రులు వీరభద్రరావుగారే యాతిధ్య మొసంగిరి. నాయఁడుగారి సహాయకులగు దుగ్గిరాల రామమూర్తిగారు మొదలగు మిత్రులు మాయింటనే విడిసియుండిరి.

ఆకాలమునందలి నా శీల విశేషములు తేటపడుటకై, 1899 జనవరి 13 వ తేది సంక్రాంతిపండుగనాఁటి దినచర్య నిచట నుల్లేఖించుచున్నాను : -

"ఈనాఁ డంతయు విషయవాంఛలే నన్ను వేధించినవి! అనగత్యముగనే నేను వానికి లోఁబడుచున్నాఁడను. దేవా, వీనిబాధనుండి నా కెపుడు విముక్తి కలిగించెదవు? నేను కర్మకాండలోఁ జొప్పించి యెంత సలుపుచున్నను, నామనసునకు నయవినయాదిసుగు ణములు పట్టువడకున్నవి ! విషయవాంఛలు నాకు వారసత్వపు టాస్తివలె నయ్యెను. ఇంతకాలమునకైన పాపిష్ఠ చక్షువులకు వైరాగ్య మొనఁగూడకున్నది! భగవానుఁడా, నాకు హృదయపారిశుద్ధ్యము ప్రసాదింపుము."

ప్రాథమిక పరీక్షలమూలమున నాకు నిత్యసహవాసులైననాయఁడుగారితో పలుమాఱు ఆత్మీయవిషయములను గుఱించి ముచ్చటించు చుండువాఁడను. నావలెనే తానును గొన్ని లోపములకు లోనగు చుంటి నని యాయన మొఱపెట్టువాఁడు. సమయపాలన విషయమునం దాయన వెనుకఁబడి యుండిరి. మనవలెనే యితరులును లోపములకు లోనయిరని వినుటవలన, మనసున కొకింత శమనము గలుగుచుండును.

16 వ తేదీని మేము ప్రాథమికపరీక్షకై రేపల్లె వెళ్లినప్పుడు, అచట నిరుడు ప్రధానోపాధ్యాయుఁడుగ నుండిన తమ్ముఁడు వెంకటరామయ్యకును నాకునుగల పోలికలను గుఱించి యచటివారు చెప్పుకొనసాగిరి. సోదరుఁడు విడిసియుండు గృహము నా కచటివారు చూపించిరి. అతని మిత్రుఁడగు లక్ష్మీనారాయణగా రను నుపాధ్యాయుఁడు మాకు విందొనర్చెను.

ఒక్కొకనాఁడు ముమ్మరమగు పనితో నేను నలిఁగిపోవుచు వచ్చితిని. సెలవుదినములలో నా కీపను లెక్కువగ నుండెడివి. 22 వ జనవరి ఆదివారమునాఁడు నే నెన్నియో సభలకుఁ బోవలసి వచ్చెను. ఆనాఁడు సంఘ సంస్కరణ సభను జరిపితిమి. మా సమాజాదరణమున స్త్రీల సభలు సమకూర్చుటకును, బాలికాపాఠశాల నొకటి నెలకొల్పుటకును మేము నిశ్చయించుకొంటిమి. ఆఱువేల నియోగి సభా సమావేశములు రెండింటికిని నేను బోయితిని. కొంత శ్రమపడి బావమఱఁది వెంకటరత్నమునకు నియోగి సమాజమువారి వేతనమును సంపాదించితిని. ఇదిగాక నేను వ్రాసిన ద్రౌపది చరిత్రకు నేఁడు శుద్ధప్రతి వ్రాసితిని.

నిరుడు బెజవాడలో నాయొద్ద నాలుగవ తరగతిలోఁ జదివిన నాతమ్ముఁడు సూర్యనారాయణ, ఈసంవత్సరము బెజవాడ రానని జనవరి తుదివారములో నాకుఁ దెలియఁబఱిచెను. మాతండ్రి చనిపోయిన పిమ్మట బెంగపెట్టుకొని, తల్లిని విడిచి యిచ్చటికి వచ్చుటకు వాఁ డిచ్చగింపకుండెను.

యూనిటేరియను మత సంఘమువారి ప్రచురణము లనిన నాకిదివఱకు తలనొప్పిగ నుండెడిది. యూనిటేరియను గ్రంథకర్తయగు ఆరమ్‌స్ట్రాంగు వ్రాసిన "జీవాత్మ పరమాత్మలు" అను గ్రంథమును బాగుగ విమర్శనము చేసినవారికి బహుమతి నిచ్చెదమని ఆ మతసంఘమువా రిపుడు ప్రచురించిరి. మిత్రుఁడు రాజగోపాలరావునొద్ద నే నాపుస్తక ప్రతిని ఎరవు పుచ్చుకొని చదివితిని. అది రమ్యముగ నుండెను.

26 వ జనవరి తేదీని వెంకటరత్నమునాయఁడుగారు బందరునుండి వచ్చిరి. ఉద్యోగాన్వేషణమునకై వా రిపుడు హైదరాబాదు పోవుచుండిరి. ఇట్టి సుశీలుఁడు ప్రతిభావంతుఁడును క్రైస్తవ మతసంఘమువారి కొలువున నుద్యోగముఁ గోల్పోయెనే యని నేను విషాద మందితిని.

మరల నేను న్యాయశాస్త్ర పుస్తకములు విప్పితిని. మాతండ్రి చిన్ననాఁ డెంత బోధించినను నే నాచదువుదెస పెడమొగము పట్టియెయుంటిని. ఆయన చనిపోయిన పిమ్మట నా కా చదువునందు విపరీతాభిరుచి జనియించెను !

32. మనస్తత్త్వ పరిశోధక సంఘము

మాతండ్రి చనిపోయిన మొదటి దినములలో దు:ఖాతిరేకమున నాకు మతి తొలఁగిపోవునటు లుండుచువచ్చెను. మొన్న మొన్నటి వఱకును ఆరోగ్యానందము లనుభవించి మనుచుండెడి జనకుఁ డింత వేగమె మటుమాయ మగుట నా కాశ్చర్య విషాదములు గొలిపెను. మృత్యువుతో మన మనోవృత్తు లన్నియు నశించునా, లేక పిమ్మటకూడ నవి వేఱు పరిస్థితులలోఁ గార్యకలాపము సాగించునా యని నేను దలపోయువాఁడను. నేనా దినములలో నొకప్పుడు రాజమంద్రిలో "ఇండియన్ మెస్సెంజరు" పత్రిక చదువుచుండఁగా దానిలో "లండను మనస్తత్త్వ పరిశోధక సంఘము" వారి యొక్క నూతన గ్రంథ విమర్శనము కానఁబడెను. అది నే నతి కుతూహలమునఁ జదివియుఁ దనివి నొందక, ఏతత్గ్రంథకర్తయగు రిచర్డుహాడ్జిసను గారికి తమపుస్తకప్రతి నాకుఁ బంపుఁడని అమెరికాకు వ్రాసితిని. ఆయన నాకుఁ బంపిన పుస్తకము ప్రేమపూర్వకమగు లేఖయును, 1899 సంవత్సరము జనవరి 30 వ తేదీని నా కందినవి. ఆసాయంకాలమునుండియే నే నాగ్రంథపఠన మారంభించితిని. రాత్రులందును, పగలు పాఠశాలలో తీఱిక సమయమందును, నే నా పుస్తకమును జదువుచుండువాఁడను. అందలి "జి. పి. సందేశములు" అనుభాగము అత్యద్భుతముగ నుండెను. ఈవార్తలే యధార్థ మైనచో, మనస్సునకు మరణానంతరదశ కల దనుట స్పష్టము. హాడ్జిసనుగారికి నేను బుస్తకపువెల నంపుచు, పైపరు దొరసానిగారిని మాతండ్రిని గూర్చి ప్రశ్నలడుగుటకై యాయన జాబులు నే నంపవచ్చునా యని వ్రాసితిని. ఇపుడు చేరిన పుస్తకము చదివినకొలఁది నా కాశ్చర్య ప్రమోదము లతిశయించెను. పగ లనక రాత్రి యనక నే నా పుస్తకసారమును గ్రోలితిని. జీవాత్మ మరణావస్థకు లోనుగాకుండుట కింత యమోఘ నిదర్శనము గానవచ్చుటయే న న్నాశ్చర్యమగ్నుని జేసెను.

హాడ్జిసనుగారి యోజనచొప్పున నేను సమాజకార్యదర్శికి లండనునగరము వ్రాసి, అందు సహాయసభ్యుఁడ నైతిని. అప్పటినుండియు నాకు సమాజ ప్రచురణములు క్రమముగ వచ్చుచుండెను. హాడ్జిసను గారి పుస్తక విమర్శనము లనేకములు చదివితిని.

మేము బెజవాడలో నెలకొల్పిన "సంఘసంస్కరణసభ"కు నేను సభ్యునిగ నుండి, రామదాసుగారు పట్టణమున లేకుండుకాలమునం దా సమాజకార్యదర్శి నైతిని. ఆ సమాజమువా రిపుడు హిందూ బాలికా పాఠశాల నొకటి నెలకొల్ప 4 వ ఫిబ్రవరిని తీర్మానము చేసిరి. బెజవాడలో క్రైస్తవ బాలికాపాఠశాల లనేకము లుండెను. క్రైస్తవ విద్యాశాలలో బోధకుఁడనగు నేను వారిసంస్థలకుఁ బోటీగా నుండు విద్యాలయమును స్థాపించు సంఘమున నుంటినేని, మిత్రులు వెంకటరత్నమునాయుఁడుగారివలెనే క్రైస్తవమత సంఘమువారి యనుమానములకు గుఱియై యుద్యోగము గోలుపోవలసివచ్చు నని, నేను సంఘసంస్కరణ సమాజ సభ్యత్వమును విరమించు కొంటిని.

ఆసమయమున మా బెజవాడ పాఠశలలోని యుపాధ్యాయులలో కక్ష లేర్పడెను. ప్రథానోపాధ్యాయుని చర్య లెవ్విధమునను తృప్తికరముగఁ గానఁబడలేదు. కావున సహాయోపాధ్యాయులలో పలువురకు వారియం దిష్టము లేదు. క్రైస్తవ బోధకుఁడగు సాంబమూర్తిగారు బహిరంగముగ నాయనదెస నిరసన చూపుచుండువాఁడు. ఎందును తటస్థభావమున మెలఁగ నా కభ్యాస మయ్యును, సౌజన్య ములేని వారు నడుపు విద్యాలయమునఁ బనిచేయ నాకుఁ గష్టముగ దోఁచెను. ప్రధానోపాధ్యాయునికి నాతోఁగూడ నానాఁట వైమనస్య మేర్పడెను. చిక్కులలోనికి వచ్చి నా సాయ మపేక్షించినపుడు మాత్రము నే నాయనకు హితబోధనము చేయుచుండువాఁడను. ఆయనకు సాంబమూర్తికిని సామరస్యము కుదురుటకై మిగుల ప్రయత్నించితిని.

నే నపుడు చదివెడి పుస్తక మహిమమున, నాదృష్టి యెపుడును ఆధ్యాత్మిక విషయములకును, ముఖ్యముగ మా నాయనను గుఱించిన తలంపులకును బరుగు లెత్తుచుండెడిది. 12 వ ఫిబ్రవరిని మా జనకుని మాసిక సమయమున నేను దు:ఖపరవశుఁడ నైతిని. ఆనాఁటి దినచర్యయం దిట్లు గలదు:

"తండ్రీ నీ వెచటి కేగితివి ? ఇపు డెచట నున్నావు ? భూలోకమున నుండునపుడు నీకు వలయు సౌకర్యము లొనఁగూర్ప లేకుంటిని. ఇప్పటివలె గాఢానురాగమున నిన్నుఁ బ్రేమింపనైతిని. నిన్నుఁ గలసికొని, నీయాలింగనము గైకొన నేను వాంఛించు చున్నాఁడను."

పాఠశాలలో బోధించుటకు ముందుగ గణితపుస్తకమందలి ముఖ్యమగు లెక్కల నింటఁ జేయకుండు దురభ్యాసమువలని నష్టము నా కంతకంతకుఁ స్ఫుటముగ గానఁబడెను. ఒకగణితమె కాదు, ఏపాఠము నైనను ముందు బాగుగఁ జదివియే బోధకుఁడు తరగతిలోఁ బ్రవేశించుట కర్తవ్య మని నా కనుభవ గోచర మయ్యెను. చదువను సెరనుబడి కొంతకాలమునుండి నేను శరీరవ్యాయామము గట్టిపెట్టుట చేత, అనారోగ్యము పాలయితి నని తెలిసికొంటిని. దీని కేమిగాని, యెన్నిటికైన మందు కానవచ్చుచున్నది కాని, విషయ సుఖలాలస కౌషధము గానరాకున్నదే ! నా దేహమన స్తత్త్వములందు, స్థూలసూక్ష్మములు, మంచిచెడుగులును ఎంత విచిత్రముగ మిశ్రితములై యున్నవి !

"గృహనిర్వాహకత్వము" రెండవకూర్పు పుస్తకములు 5 వ మార్చిని నా కందెను. ఆపుస్తకము మాతండ్రిగారికిఁ గృతి యిచ్చి, కొంత మనశ్శాంతి నొందితిని. నాకోరికమీఁద నామిత్రులు కామశాస్త్రులుగారు కృతిపద్యములు రచియించి యిచ్చిరి. ఆ పుస్తకపు ప్రతులు పలువురు కొని చదివిరి. పుస్తకములు అమ్ముడు వోయిన కొలఁది, చేత సొమ్ము చేరి, నాకు ప్రోత్సాహము కలిగెను.

సుఖదు:ఖము లొకటి నొకటి వెంబడించుచుండును. 11 వ మార్చి, తేదీని చెన్నా ప్రగడ సూరయ్యగారు చనిపోయిరను దు:ఖ వార్త వింటిని. ఆయన సత్పురుషుఁడు. కొన్ని సంవత్సరములనుండి పరీక్షలో నపజయ మందుచుండు మిత్రులు కనకరాజు గంగరాజుగార్లు బి. యల్. పరీక్షలో నీమాఱు గెలుపొంది రని విని మిగుల సంతోషమందితిని.

12 వ మార్చిని బెజవాడ రెయిలుస్టేషనుకుఁ బోయి, ప్రయాణము చేయుచుండు వీరేశలింగముగారిని జూచి వారికి భోజన సదుపాయము చేసితిని. ఈ యుదారపురుషునికిఁ జిరాయు వొసఁగు మని దేవదేవుని వేఁడుకొంటిని. మిక్కిలి శ్రమపడి యెట్టకేల కీరోజున, "జీవాత్మ పరమాత్మలను" గూర్చిన నా విమర్శన వ్యాసమును రాత్రి 8 గంటలకు సిద్ధము చేసితిని.

33. చెల్లెలి వివాహము

నేనిదివఱకు వ్రాసిన "జీవాత్మ పరమాత్మల" విమర్శనము సరిచూడుఁడని వెంకటరత్నమునాయఁడుగారికి బందరు పంపితిని. ఆయన తది 20 మార్చిని నాకు మరల నంపివేసెను. వారిసూచనల ననుసరించి నే నా వ్యాసమున వలసినకొలఁది మార్పులు చేసి, శుద్ధప్రతి వ్రాసి, 3 వ మార్చిని కలకత్తాకుఁ బంపివేసి, మనస్సునఁ గొంతయుపశమనము గాంచితిని.

బాధపిమ్మట బాధనాకు గలుగుచువచ్చెను. ఇదివఱకు నేనారంభించిన 'హిందూసుందరీమణుల చరిత్రములు' పూర్తియగుచుండెను. న్యాయశాస్త్రపుఁజదువు లొకవిధముగ సాగుచుండెను. నన్నిపుడు వేధించునది కార్యభారము కాదు. నా కప్పిచ్చిన రాజారావు తనసొమ్మీయు మని తొందరచేయసాగెను. అప్పులనుగూర్చి తలంచుటయే నాకు బాధాకరముగ నుండెను. ఎటులో కష్టపడి, ధనసంపాదనము చేసి యప్పులు తీర్చుట పురుషధర్మమని నాకు నచ్చెను. సోదరుల తోడ్పాటున నీఋణశత్రువును సులభముగ నిర్జింపవచ్చునని యెంచితిని. 28 వ తేదీని ఆంధ్రసారస్వత విషయములను గుఱించి వీరభద్రరావుగారితో మాటాడుచు, వీరేశలింగముగారి జీవితచరిత్ర నేను వ్రాసెద నంటిని. "దరిద్రాణాం మనోరథా:"!

5 వ ఏప్రిలున మా పాఠశాలలో ఎడ్డీ యను యువ క్రైస్తవమతప్రచారకుఁడు ఉపన్యాసమిచ్చెను. అతనికి విపరీత క్రైస్తవమతాభి నివేశము గలదు. జ్ఞానవిచక్షణకంటె పట్టుదలయే యాతనియం దధికముగఁ గానిపించెను! ఈ మహనీయుఁడే నాయుఁడుగారు బందరునుండి కదలిపోవుటకు ముఖ్యకారణ మని నాకుఁ దెలి సెను. ఆతని వైఖరియు వేగిరపాటును, మా పాఠశాలలోని హిందూవిద్యార్థుల కందఱికి నొక్క మాఱుగ జ్ఞానస్నాన మిప్పింపఁగోరు చుండెను !

నేను సభ్యుఁడనైన లండను "మనస్తత్త్వ పరిశోధన సంఘము" వారి ప్రచురణములు నాకు క్రమముగ నందుచుండెను. వారి నూతన ప్రచురణము వినోదాంశములతో నిండియుండెను. ఆసమాజమువారి మాసపత్రికకూడ నాకు వచ్చుచుండెను. నాకోరికమీఁద వారు హిందూదేశమందలి సభ్యులకుఁ దమ గ్రంథముల ప్రతులు రెండేసియంపుట కంగీకరించిరి. అందువలన నాయుఁడుగారు నేనును గలసి యొక సభ్యునిచందా చెల్లించి, ఒక్కొక పుస్తకప్రతి నందుకొనుచుండువారము.

1899 సంవత్సరము 11 వ ఏప్రిలు వికారి సంవత్సరాది పండుగరోజున నా దినచర్య యిటు లుండెను : -

"ఏమికారణముననో కాని సతి నన్ను ప్రబలశత్రువునివలెఁజూచుచున్నది! తనకు ధన మీయలేదని నామీఁద పగఁబూనినది. ప్రస్తుత సంసారపరిస్థితులలో నే నెట్లు సొ మ్మీయనేర్తును ? ఆమెవిరోధ వై మనస్యములచే నా యుదారాశయములు తాఱుమా ఱగుచున్నవి! ఈశ్వరాదేశములగు నీయాశయముల నే నెట్లు త్యజింపఁగలను? * నేనిదివఱకు వ్రాసిన వ్యాసములు చదివి వినోదమునఁ గాలము గడిపితిని. కామశాస్త్రిగారితో నద్వైతమతమునుగూర్చి వాదించుచు, అందలి లోపములు వారికిఁ జూపించితిని."

మిత్రుఁడు వెంకటరత్నము నాయఁడుగారికి 120 రూపాయల జీతముమీఁద, సికిందరాబాదు మహబాబు పాఠశాలాధ్యక్షపదవి లభించిన దని తెలిసి నే నెంతయు సంతోషించితిని. మా తండ్రిగారు నా కిదివఱకు వ్రాసిన రెండు ఉత్తరములును నా కిపుడు పరిచితులయిన హాడ్జిసనుదొరగారి కమెరికా పంపితిని. పైపరుదొరసానికి మూర్ఛా సమయమున వీనిని జూపించి, మా తండ్రిని గుఱించి యామె యేమి చెప్పునో నాకుఁ దెలియఁజేయుఁడని వారినిగోరితిని. పాఠశాలలోఁ బ్రథమోపాధ్యాయుఁడు చేయునక్రమములను గుఱించి నా దినచర్యపుస్తకమం దీక్రిందివ్యాఖ్య గలదు  : -

"ఈక్రైస్తవబృందమువారికి మనుజుల వర్తన మెటు లున్నను వారిమతమే ప్రధానమని తోఁచుచున్నది ! సజ్జనులగు హిందువులకంటె దుశ్శీలురగు క్రైస్తవులే వీరికిఁ బ్రియులు ! దేవదూతవంటి పూతచారిత్రుఁడగు నాయఁడుగారి నీ మతసంఘమువారు తమ విద్యాలయము నుండి వెడలఁగొట్టిరే! శీలసౌష్ఠవముఁ గోలుపోయిన బోధకమహాశయుల నీ పాఠశాలనుండి యెవరును గదలింపలేకున్నారు ! ఇట్టి భూలోక దృశ్యములు దేవతల పరిహాసములకుఁ దావల మగుచున్నవి."

మా చెల్లెలిపెండ్లి 3 వ మేయి తేదీని జరుగునని తమ్ముఁడు వ్రాసెను. కాని, నేను వెళ్లుటకు వలనుపడదని ప్రథమోపాద్యాయుఁడు చెప్పివేసెను. పాఠశాలాధికారికి బందరు జాబువ్రాసివేసి, 1 వ మేయి తేదీని నేను రాజమంద్రి వెడలిపోయితిని. ఎంతో ప్రయాసపడి వస్తు సామగ్రి సిద్ధము చేసితిమి. ఎట్టకేలకు 3 వ తేదీన రాత్రి చెల్లెలి పెండ్లి జరిగెను. నాలుగవనాఁడు పురములోని యుద్యోగి మిత్రులకు విందు చేసితిమి. ఈపెండ్లికి స్వల్పముగనె సొమ్ము వెచ్చించితిమి.

నేను రాజమంద్రిలోనుండు దినములలోనే విడిగా తీయించిన "హిందూ సుందరీమణుల చరిత్రముల" ప్రతులు ప్రచురమయ్యెను. వానిలోఁ గొన్ని విమర్శనార్ధమై పత్రికాధిపతులకుఁ బంపితిని. ఇప్పుడు భర్తృవిహీనయై వనరుచుండెడి మా ప్రియజనని కీపుస్తకము కృతియిచ్చి, సంతృప్తి నొందితిని.

17 వ మేయి తేదీ దినచర్యయం దిట్లు గలదు : -

"నే నీ మనోనిశ్చయములను జేసికొన్నాను : - (1) కోపపరవశుఁడను గాకుండవలెను. (2) నామాటలవలన నెవనిమనస్సును నొప్పింపవలదు (3) ఈశ్వరధ్యానమునకై తీఱికకాలము వినియోగింపవలెను. వృథాకాలక్షేపము చేయఁగూడదు. (4) ప్రలోభనముల బారిఁబడకుండ తప్పించుకొనవలెను. మనస్సునుండి విషయాసక్తిని గోసివేయవలయును." ఇవి యన్నియు మంచినియమములే. వాని నాచరణమునఁ జొప్పించుటయే కష్టతరమగు విషయము!

ఈ వేసవిని రాజమంద్రిలో తమ్ముఁడు వెంకటరామయ్యతోఁ గలసి నేను న్యాయశాస్త్ర గ్రంథములను చదివితిని. ఆతఁడు రెండవతరగతి పరీక్ష నిచ్చి యిపుడు రాజమంద్రిలో న్యాయవాదిగ నున్నాఁడు. మొదటి తరగతిపరీక్ష కాతఁడును, రెండవతరగతికి నేనును బోవలెనను సంకల్పముతో నిపుడు శ్రద్ధతోఁ జదివితిమి. తమ్ముఁడు కృష్ణయ్యకు ప్రథమశాస్త్ర పరీక్ష యాంగ్ల పఠనీయపుస్తకములు బోధించితిని. పెద్దవార మిద్దఱము నింత జదువుచుండినను, చిన్న వారలు కృష్ణయ్య సూర్యనారాయణ వ్యర్థకాలక్షేపము చేయుచున్నారని వారలను జీవాట్లు పెట్టువాఁడను. నా యారోగ్యము నసిగా లేదు. నా కంటెను తమ్ముఁడు వెంకటరామయ్య బలహీనుడె యని విచారించు చుండువాఁడను. జనని వ్యాధినిగుఱించి వైద్యాధికారి నడుగఁగా, ఆమె రోగనివారణము కష్టసాధ్య మనియు, తశ్శాంతిమాత్రము చేయవచ్చు ననియును, ఆయన చెప్పెను. నా దేహారోగ్య మెటు లుండినను, ఆత్మారోగ్యము మాత్రము క్రమముతప్పి యుండెను. నా యాత్మకు పాపేచ్ఛ యనునది జీర్ణ వ్యాధిగఁ బరిణమించెను ! ఆత్మావ్యాధులు సులభ నివారితము లని పూర్వము నే ననుకొనువాఁడను గాని, అంతకంటె మొండిరోగము లుండవని నా కిపుడు ద్యోతక మయ్యెను.

1 వ జూన్ తేదీని మిత్రుఁడు కనకరాజు భార్య చనిపోయె నను దు:ఖవార్త విని, నా సంతాపమును సానుభూతిని దెలుపుచు నాతని కొకలేఖ వ్రాసితిని. 18 వ జూన్ ప్రొద్దున బెజవాడ పయనమయితిని. రెయిలులోఁ గూర్చుండి నే నిట్లు తలపోసితిని : -

"ఈ సెలవులలో రాజమంద్రిలో నుండురోజులలో నేను తల్లితో ధారాళముగ మాటాడలేకపోయితిని. విపరీత మిత భాషిత్వము నన్నావహించి యుండెను. దీనికితోడు, ఆమె రుసరుసమనుచు, విరోధ భావమున మెలంగెడిది. తుదిదినములలో మా తండ్రియు నిట్లే యుండెడివాఁడు. కావుననే నే నాయనతో మనసిచ్చి మాటాడనేరకుండెడివాఁడను !" రెయిలులో నేను విశాఖపట్టణమునుండివచ్చు దాసుగారిని గలసికొంటిని. మరల మేము మిత్రులమయితిమి. నేను బెజవాడలో దిగునప్పటికి నన్నుఁ గలసికొనుటకు రాజారావు, విద్యార్థి పానకాలును గనిపెట్టుకొని యుండిరి. రాజారావునింట నేను భుజించితిని. బెజవాడలో ఆస్తికసమావేశము జరిపింతుమని ప్రకటించిన రాజగోపాలరావు మీఁద నేను కోపించితిని.

34. "జీవాత్మ - పరమాత్మలు"

ఆ వేసవిసెలవుల పిమ్మట బెజవాడలో యథాప్రకారముగ నాపనులు నేను జేయుచువచ్చితిని. పుట్టినిల్లగు కట్టుంగ పోయి చాలదినములవఱకును నాభార్య బెజవాడ చేరకుండుటచేత, కొన్ని రోజులు శిష్యమిత్రులు నాకు వంట చేసిపెట్టిరి. ఒక్కొకప్పుడు వంటపని నామీఁద పడుచుండుటచేత పాఠశాలపనికిని, ఇతర పనులకును వ్యవధానము చాలక, చికమకలు పడుచుండువాఁడను. దీనికిఁ దోడు, నా మనస్సీమను పాపపుఁదలంపు లేపారి తిరుగాడుచుండెను ! ఎక్కువపనిచే నేను డస్సియుండినను, పలువిధములగు దుష్ట సంకల్పములు నన్ను విడువనొల్లక, నా మనోవీథిని స్వైర విహారములు సల్పుచుండెడివి ! జీవిత మొక విషాదాంతనాటకముగఁ బరిణమిల్లు నట్లు తోఁచెను. ఇదిగాక, జ్వరముచేఁ బీడింపఁబడినప్పు డైనను తోడి క్రైస్తవబోధకునివలె నొక దినమైనను నేను బడి మానరాదు ! ఐరోపావారు పక్షపాతబుద్ధితో భరతదేశమున క్రైస్తవమతప్రచారము సల్పుచున్నా రని నేను మొఱలిడువాఁడను. ఈ చిక్కులలో నేను మరల న్యాయశాస్త్రసంబంధమగు చదువు సాగించితిని.

ఇట్టి విషమస్థితిలో నాకు 7 వ జూలయిని రెండు జాబులు వచ్చెను. అవి రెండును మా ఋణములనుగుఱించినవియే ! తన కీయవలసిన వేయిరూపాయిలు నీయు మని యొక ఋణదాత నిర్బంధించెను. రెండవయుత్తరము మాతమ్ముఁడు వ్రాసినది. మాకు బదు లిచ్చిన వేలివెన్ను కమ్మస్త్రీ యొకతె మామీఁద వ్యాజ్యెము వేసినటు లందుండెను !

10 వ తేదీని నాభార్య తన పినతండ్రితో బెజవాడ వచ్చెను. రాజమంద్రిగాని బెజవాడగాని తనను దీసికొని వచ్చు బంధువులు లేకుండుటవలన తనరాక కీ యాలస్య మయ్యె నని యామె సమాధానము. వేలివెన్ను ఋణదాత కిచ్చుటకై పాఠశాలలో పండితులగు కామశాస్త్రిగారియొద్ద నిన్నూఱు రూపాయలు నే నప్పు పుచ్చుకొని, 15 వ జూలై శనివారమునాఁడు రెయి లెక్కి, నిడదవోలులో దిగితిని. అచట తమ్ములు కృష్ణయ్య వెంకటరామయ్యలు నన్నుఁ గలసికొనిరి. అట్లపాడుమీఁదుగ మేము పోవుచుండఁగా పింగళివారి పెద్దకోడలు అత్తమీఁదికోపమున కాలువలోఁ బడిపోయె నని మాకచటఁ జెప్పిరి.! శవ మింకను కానఁబడలేదు. రాత్రికి మేము వేలివెన్ను చేరి యచట జరిగిన వీథినాటకము చూచి సంతోషించితిమి.

మేము బాకీపడిన కమ్మస్త్రీతో రాజీ కుదరకుండ నొక తుంటరి యడ్డపడుటచేత, మఱునాఁడు గ్రామము విడిచిపోయితిమి. నేను బెజవాడ చేరినమఱునాఁడే మా పొరుగుననుండు యువతి యొకతె గృహల్లోలములచేత బందరుకాలువలోఁబడి యాత్మహత్య గావించుకొనెను ! మనదేశమునఁ గోడండ్ర ఘోరదుర్మరణము లెపుడంతరించునోకదా!

26 వ జూలయి తేదీ దినచర్య నా కా దినములలోఁగల బాధ నొకదానిని తేటపఱుచు చున్నది : - "న్యాయశాస్త్రపుఁ జదువులు, పాఠశాల పనులును - ఇపుడు నా నిత్యకార్యక్రమము. * * * ఈ భార్యతో నే నెట్లు వేఁగఁగలను? ఒకనాఁడు ముడుఁగుదామర, ఒకనాఁడు వికచపద్మమునగు నీ కలహాంతరితను పైసలేని నే నెట్లు ప్రసన్నవదనఁ జేయఁగలను ? ఎటు లాభరణములకు ధన మొసంగి సంతృప్తఁ జేయఁగలను ?"

తమ్ముఁడు రాజమంద్రిలో చిల్లరయప్పులు తీర్చి వేయుచుండెనని తెలిసి సంతోషించితిని. వేలివెన్ను వ్యాజ్యెము జరుగుచునే యుండెను. తమ చరిత్రమును నేను వ్రాయుటకు వీరేశలింగముగారు సమ్మతింపకున్నను, నే నీవిషయమున కృషి చేయఁదలంచితిని.

జూలయి 30 వ తేదీని మాపేట పఠనమందిర కార్యదర్శి పని మానుకొనఁగ, ఆ యుద్యోగము నా కిచ్చెద మనిరి. నే నొప్పుకొన లేదు. రాత్రి ఏడున్నరగంటలకు నా కొకతంతి వచ్చెను. రాజమహేంద్రవరమున మాతల్లికి మూర్ఛ లీనాఁడు విడువకుండ వచ్చుచుండుటచేత, నన్ను మా తమ్ముఁడు, వెంటనే రమ్మని కోరెను. కాఁబట్టి నే నారాత్రియె బయలు దేఱితిని. రెయిలులో నాకొన స్నేహితుఁడు కానఁబడి, ధవళేశ్వరమునందలి యొక వైద్యునిచే మాయమ్మకు మందిప్పించుమని చెప్పెను. రేవుస్టీమరులోనే నా కావైద్యుఁడు కానఁబడి, రాజమంద్రిలో దిగినతోడనె నాతో మాయింటికి వచ్చి మా తల్లిని బరీక్షించి వ్యాధినివారణ చేసెదనని పలికెను. వెంకటరామయ్య వృత్తి సంబంధమగు పనిమీఁద నిడదవోలు వెళ్లి, అక్కడనుండి మా వ్యాజ్యెమునకై తణుకు పోయెద నని చెప్పెను. నేను రాజమంద్రిలో నుండి మాయమ్మ కుపచారములు చేసితిని.

మఱునాఁడు వైద్యునికొఱకు ధవళేశ్వరము వెళ్లితిని. నాతల్లికి భార్యకునుగూడ నాయన మందులు నిర్ణయించి చెప్పెను. ఆరాత్రి బండిమీఁద విధిలేక నేను బెజవాడ బయలుదేఱితిని. మాతల్లి యెడ నాకుఁగల ప్రేమాతిశయము నే నెట్లు వెలిపుచ్చఁ గలను ? ఆసంగతి యా పరమాత్మునికే యెఱుక !

ఇపుడు నా "గృహనిర్వాహకత్వము", "హిందూ సుందరీమణుల" ప్రతులు బాగుగ నమ్ముడువడుచు నా కెంతయు నుత్సాహ ప్రమోదములు గలిపించెను. 7 వ ఆగష్టు మధ్యాహ్నమున తపాలజవాను నాచేత నొక యుత్తరమును నాలుగు పుస్తకములును బడవైచెను. "జీవాత్మ - పరమాత్మల" మీఁది నావిమర్శనమునకే యీనాలుగుపుస్తకములును బహుమతులని యాకమ్మయం దుండెను. ఇవి మార్టినోమహాశయుఁడు రచించిన "నీతిసిద్ధాంతములు" అను పుస్తకసంపుటములు రెండును, "మత విమర్శనము" అను పుస్తకములు రెండును. ఈ యమూల్యమగు పుస్తకము లందుకొని, నేను హర్షాంబుధి నోలలాడితిని.

హిందూదేశమునం దా సంవత్సరమున నీ బహుమతులకు పోటీచేసిన వారిలో నెల్ల, నా మిత్రులును బందరుపుర వాస్తవ్యులును నగు శ్రీ వేమూరి రామకృష్ణారావుగారికిని నాకును ఈ మొదటితరగతి బహుమానము లీయఁబడె ననియు, వేఱుప్రదేశములనుండు మఱి యిద్దఱికి రెండవతరగతి బహుమానములుగ మఱి కొన్ని పుస్తకము లీయఁబడిన వనియు, నాకుఁ బిమ్మట తెలిసెను.

"జీవాత్మ - పరమాత్మల" విమర్శనమున, ఈశ్వర విశ్వాసమునకు స్వభావజనితజ్ఞానమే ప్రధానమని గ్రంథకర్త చెప్పినవాక్యములు కొన్ని నేను విమర్శించి, ఈవిషయమున ననుభవముకూడ ముఖ్యమని నేను జెప్పితిని.

35. నిత్యవిధులు(2)

15 వ ఆగష్టున "సంఘసంస్కరణసమాజము" వారి యాజమాన్యమున బెజవాడలో నొక బహిరంగసభ జరిగెను. డిస్ట్రిక్టు మునసబు టి. కృష్ణస్వామినాయఁడుగారు అగ్రాసనాధిపతులు, నా పూర్వ మిత్రులగు కొరిటేపాటి నరసింహాచార్యులుగారు సంస్కరణ పక్షానుకూలముగఁ బ్రసంగించి రాజమంద్రిపండితులు చేసిన యాక్షేపణలను ఖండించి వైచిరి. నేను గొంచెము మాటాడితిని. సంస్కరణమునకు సుముఖుఁడగు నగ్రాసనాధిపతి, మెల్లఁగను క్రమక్రమముగను సంఘ సంస్కరణము దేశమున నల్లుకొనవలె నని చెప్పిరి.

24 వ తేదీ దినచర్యలో నే నిట్లు లిఖించితిని : -

"స్వార్థపరుని సంకుచిత స్వభావము, వాని ప్రతి పనియందును, పలుకునందును ప్రతిబింబిత మగుచుండును ! * * * నా కిపుడు కావలసినది, భాగ్యము కాదు, ఆరోగ్యము కాదు, తుదకు మనశ్శాంతి యైననుగాదు. ఇంద్రియ నిగ్రహ మొకటియే కావలయును ! దైవమా ! నాకి ది యేల ప్రసాదింపవు?"

14 వ సెప్టెంబరు దినచర్య యిటు లుండెను : - "నేఁడు భార్య, యిరువదిరూపాయిల కొక పట్టుచీర కొనుక్కొనెను. నేను గట్టిగ చీవాట్లు పెట్టఁగ విలపించెను. తుదకుఁ గావలసిన సొమ్ము కొంత నేనీయఁగా సుముఖియై సంతోషించెను. ధనమహిమ మిట్టిది గదా!"

ఇప్పుడు పఠనాలయమున జరుగుచుండెడి మా ప్రార్థనసమాజసభలకు పెక్కండ్రు విద్యార్థులు వచ్చుచుండువారు. ప్రతివారము నేదో విషయమునుగూర్చి నేను ఉపన్యాస మిచ్చుచుంటిని. ఆదివారప్రార్థన సభలేకాక బుధవార సంభాషణ సమావేశములుకూడ నేర్పఱిచితిమి. 20 వ సెప్టెంబరు బుధవారమున మొదటి ప్రసంగసభలో, "విగ్రహారాధనము" ను గుఱించి చర్చ రెండుగంటలవఱకును జరిగెను. విద్యార్థులలో పలువురు చర్చలో పాల్గొనిరి. కొందఱిమాటలలో, తెలివికంటె టక్కఱితనమే ప్రబలియుండినను మొత్తముమీఁద చర్చ సంతోషదాయకముగ నుండెను. మేము నివసించెడి యింటియజమానియగు గొల్లపూడి శ్రీనివాసరావుగారు కొంతకాలమునుండి నంజువ్యాధిచేఁ బీడింపఁబడి 24 వ సెప్టెంబరున మరణించిరి. ఆయనసతి రూపవతియు గుణవతియు నగు సుదతి. సంతానము లేదు. శవమును శ్మశానవాటికకుఁ గొనిపోవుట కెవరును రాలేదు. అంత రాజారావు వీరభద్రరావు మున్నగు స్నేహితులతోఁ గలసి నేను శవవహనమున సాయము చేసితిని.

27 వ తేదీని రామమోహనరాయల వర్ధంతిని జరిపితిమి. రాయలజీవితమును గుఱించి రాజగోపాలరావు తెలుఁగున వ్యాసము చదివి, తాను రచించిన పద్యపుస్తకములను బంచిపెట్టెను.

దసరా సెలవులకు మేము ఉభయులమును ఏలూరు వెళ్లితిమి. 20 వ అక్టోబరున నచటి పాఠశాలోపాధ్యాయుల తోఁటవిందునకు న న్నాహ్వానించిరి. కామేశ్వరరావుతోఁ గలసి నేను వెళ్లితిని. పురము వెలుపలి జామతోఁటలో కాఫీ మున్నగు ఫలాహారములు గొని, యాటలాడి వినోదించితిమి. మఱునాఁడు నాతోడియల్లుఁడు వెంకటరత్నమును, తరువాతిదినము వల్లూరి సన్న్యాసిరాజుగారును, మిత్రుల కుపాహారము లొసంగిరి. నేస్తులందఱమును గలసికొని ముచ్చట లాడు కొంటిమి. వెంకటరత్నముతోఁ గలసి షికారు పోవునపుడు, తన సంసార సమాచారముల నాతఁడు నాకుఁజెప్పెను. ప్రథమమునఁ గుటుంబ కలహములమూలమున భార్యకుఁ దనకును బొత్తు గలియకుండినను, ఇపుడు సామరస్య మేర్పడెనని యతనివలన విని సంతసించితిని. మే మంత బెజవాడ వెడలిపోయితిమి.

అక్టోబరు 23 - 24 తేదీలందు చట్టనిర్మాణసభలకు ప్రతినిధుల నెన్ను కొనుసభలు బెజవాడలో జరిగెను. మొదటిరోజున పురపాలక సంఘములపక్షమున గంజాము వెంకటరత్నముగారును, రెండవనాఁడు స్థానికసంఘములపక్షమున జంబులింగ మొదల్యారుగారును శాసననిర్మాణ సభాసభ్యు లయిరి. నే నా సభలకుఁ బోయి, "మద్రాసుస్టాండర్డు" పత్రిక ప్రతినిధిగా వార్తల నంపితిని. నా కాదినపత్రిక యుచితముగ వచ్చుచుండెడిది. రెండవనాఁడు యతిరాజులపిళ్లగారి చాయాపట ప్రదర్శనము జరిగెను. అంత 4 గంటలకు పిళ్ల గారి తోఁటవిందు జరిగెను.

నరసాపురోన్నత పాఠశాలకు ప్రథమోపాధ్యాయుఁడు కావలెనని యాదినములలో పత్రికలలోఁ బ్రకటన లుండెను. నే నీపనికి దరఖాస్తుచేసి సాయము చేయుఁడని స్నేహితులను గోరితిని.

మూఁడవ నవంబరున నేను రాజమంద్రి వెళ్లి, తల్లిని తమ్ములను గలసికొంటిని. మా తండ్రిగారి సాంవత్సరికమునకు మా పినతల్లి తప్ప మఱియెవరును రాలేదు. 6 వ తేదీని కర్మలు పూర్తిచేసికొని, నేను బెజవాడ వెడలిపోయితిని. 10 వ తేదీని న్యాయవాదిపరీక్షకు నేను దరఖాస్తు నంపితిని గాని, పరీక్షలో జయమందెదననెడి యాశగాని, జయమందినపిదప న్యాయవాది నయ్యెడికోరిక గాని, నాకు లేదు !

వేలివెన్ను వ్యాజ్యెమునకై నాకుఁ బిలుపు వచ్చుటచేత, 15 వ నవంబరున రెయిలులో నేను తాడేపల్లిగూడెము వెళ్లితిని. నాతోఁ గూడ వీరభద్రరావుగారు వచ్చి రేలంగి వెళ్లిపోయిరి. నేను తణుకు చేరితిని. అచట న్యావాదుల యభిమానమున వాది ప్రతివాదులము రాజీపడితిమి. కొంతసొమ్ము మేము వాది కిచ్చుట కంగీకరించితిమి. నే నంతట రాజమంద్రిమార్గమున బెజవాడ వెడలిపోయితిని. నేను పట్టణమున లేనిదినములలో పురప్రముఖులలో వొకరగు సింగరాజు లింగయ్యపంతులుగారు చనిపోయిరి. డిసెంబరు రెండవవారమున నాయఁడుగారు బెజవాడ వచ్చి, యీప్రాంతములందు ప్రాథమిక పరీక్షలు జరిపిరి. వారితో నేను తెనాలి నూజవీడు రేపల్లెగ్రామములు పోయి, యీ పరీక్షలో పాల్గొంటిని. నాయఁడుగారు 27 వ తేదీని మద్రాసు వెళ్లిపోయినపిమ్మట నాకుఁ గొంత విరామము గలిగి, న్యాయశాస్త్రపరీక్షకుఁ జదివితిని.

దాసు శ్రీరాములుగారి యేకైక పుత్రిక మరణించె నని 22 వ తేదీని విని మిగుల విచార మందితిమి. ఈమె విదుషీమణి.

న్యాయశాస్త్రపరీక్ష చదువులు నాప్రాణములు నమలివేయఁ జొచ్చెను ! నా కెపుడైన మనశ్శాంతి కుదురునా యని నే నాశ్చర్యపడితిని. 31 వ తేదీని "హిందూన్యాయశాస్త్రము" ను బూర్తిచేసి, తల తడిని చూచుకొంటిని. ఆసాయంకాలము ఆనకట్టుమీఁదనుండి కృష్ణానదిని దాఁటి, ఆవలియొడ్డునందలి దృశ్యములు మిత్రులతోఁ జూచివచ్చితిని. నూతనవత్సరకార్యముల నాలోచించుకొంటిని. ఇట్లు 1899 వ సంవత్సరము గడచిపోయెను.

36. "సతీయుతసంఘసంస్కారి"

ఈశీర్షికతో చిన్న యాంగ్ల వ్యాసము వ్రాసి, "సంఘసంస్కారిణీ" పత్రికకు నే నంపితిని. అది 1899 వ సంవత్సరము డిశంబరు 10 వ తేదీని ఆపత్రికయందు "బెజ" అను సంజ్ఞాక్షరములతోఁ బ్రకటింపఁబడెను. ఈ క్రింద నుల్లేఖింపఁబడిన యా వ్యాససారమును బట్టి, అందలి విషయములు కొంతవఱకు స్వకీయములెయని చదువరులు గ్రహింపఁగలరు : -

"ప్రేమాధిదేవతయగు మన్మథుడు, అంధుఁ డని యవనులకును, అనంగుఁ డని యార్యులకును విశ్వాసము. వివాహాధిదేవతస్థితి యంతకంటె నధమముగ నున్నది! ఈ యుభయదేవతలలోను మన్మథుఁడు మంచివాఁ డనిపించుకొనుచున్నాడు ! స్త్రీ పురుష హృదయ సమ్మేళనమే యాతనికిఁ బ్రీతికరము. వివాహాధిదేవత యన్ననో, ముఖ్యముగ మనదేశమున తగినంత కారణము లేకయే స్త్రీపురుషులకు నిర్బంధబాంధవ్య మేర్పఱుచుచున్నాడు ! ఈ కిరాతుని చేతలవలన పెక్కండ్రు స్త్రీ పురుషులు తమజీవితసౌఖ్యమును గోలుపోవు చున్నారు.

"సజ్జనుఁడగు నా మిత్రుఁడు 'సంస్కర్త' ను గూర్చి యిచటఁ గొంత ప్రస్తావించెదను. ఆయనయందు ప్రజ్ఞాసామర్థ్యములు విశేషముగ నున్నను, వానివలని మేలుమాత్రము కడు స్వల్పముగఁ గానవచ్చు చున్నది ! ఆయన విద్యావిశారదుఁడు సుగుణభూషితుఁడు నగు నవనాగరకుఁడైనను, వివాహమూలములగు వైషమ్యములవలన, ఆతని ప్రజ్ఞాలు క్రియాశూన్యములును, ఆశయములు నిష్ప్రయోజకములును నగుచున్నవి ! భావసంపదయు మహాశయభాగ్యమును గలవాఁడయ్యును, ఆతనివిలువ యెఱుంగక యాతనిసందేశములచొప్పున నడువ నొల్లని యొక యంగన కాతఁడు గట్టఁబడుట యెంతటి కాలవైపరీత్యము !

"తాను జెప్పినచొప్పున నాచరించుటయే పరమధర్మముగఁ జేసికొనినవాఁ డాపురుషుఁడు ! ఇదియే యాదంపతుల కలతలకుఁ గారణము. స్త్రీపురుషులకుఁ జిత్తవృత్తులందుఁ గొంత భేద మే కాలము నందును గాననగును. ప్రకృతమునం దాభేదము మిగుల నతిశయించి యున్నది. మోటుజాతులలో మగవానికి నాఁడుదానికి నెక్కువ యైకమత్య ముండును. ఇరువుర భావములు నాచరణములు నించు మించుగ నేక విధముననే సాగుచుండును. నాగరికత హెచ్చినకొలఁది పరిస్థితులలోను భావాదులలోను భేదము లేర్పడును. విద్యావంతుఁడగు పురుషుని యాశయములు విద్యాగంధ మెఱుఁగనిస్త్రీకి గొంతెమ్మ కోరికలవలెఁ గానిపించును ! శతాబ్దములనుండి స్త్రీవిద్యను నిరసించెడి యీ భారతదేశమున, స్త్రీపురుషులకుఁగల యీ యంతర మధికమై, ప్రకృతమందలి గృహకల్లోలములకుఁ గారణ మగుచున్నది.

"ఒడ్డుపొడుగులందు హనుమంతునికిని వాలఖిల్యులకును గలభేదము, బుద్ధివిషయమున "ఈ సంస్కర్త"కును అతని సతీమణికిని గలదు. గృహజీవితమునుగుఱించి యున్నతాశయములును, భార్యవిద్యాభ్యున్నతి విషయమై యుత్కృష్ట భావములును గల యీ'సంస్కర్త', జీవితమున పరాజయ మందెనే ! విద్యాధికులగు భారతీయులు పరిష్కరింపలేని సాంఘిక సమస్యల కై వారిని నిందింపఁదగదు. పురుషుఁడొక్కఁడే యీ పరాజయమునకుఁ గారణము గాఁడు. కుటుంబ విషయములలో నతనికి సర్వాధికారము లేదు. పశ్చిమదేశములలో భార్య యనఁగ సామాన్యముగ స్వయంవరయగు సుదతియె. అచ్చట వివాహబంధము భగ్న మైపోవుటకు భార్యాభర్త లిరువురలో తప్పక యొకరు ముఖ్యకారకు లని మనము గ్రహింపవచ్చును. భారతదేశమందట్లు కాదు. 'సంస్కారి' యాశయముల సద్భావము సంశయింప వలనుపడదు. కాని, యాతనిసతినిగూడఁ బూర్తిగ నిందింపనేరము. అజ్ఞానయై యటవీమృగమువలె నాయిల్లాలు పెరిఁగెను. అజ్ఞానయై నిరతము నడవియందే సంచరింప నామె వాంఛించుచున్నది ! ముఖ్యవిషయములం దాపొలఁతి పొరుగు ముసలమ్మలను గురువులఁగఁ జేకొని, భర్తకు ప్రాణసమానమగు నాశయముల నాశన మొనర్చి, అనుతాపలేశము లేక సంసారయాత్ర గడపుచున్న యది !"

37. న్యాయవాదిపరీక్ష

మహబూబు పాఠశాలలో బోధకుఁడును, నాయఁడుగారి స్నేహితుఁడును నగు కుప్పురామయ్యగారు, సకుటుంబముగ వచ్చి మాయింట జనవరిలో 10 దినము లుండిరి. 11 యేండ్లవయస్సుగల యాయనకొమార్తె వితంతు వయ్యెను. ఆమెకుఁ బునర్వివాహము చేయఁ దన కుద్దేశముగలదని యాయన నాతోఁ జెప్పఁగ, కాకినాడలోని నామిత్రు లొకరు తప్పక చేసికొందు రని చెప్పితిని. 11 వ జనవరితేదీని నేను రాజమంద్రి వెళ్లి యక్కడనుండి యాస్నేహితునికి జాబు వ్రాసితిని. ధైర్యముచేసి వా రీపిల్లను వివాహమాడుట ధర్మమనియు, అట్లు చేయకున్న తమరి నిఁక నెవ్వరును నమ్మరనియును, నేను వ్రాసివేసితిని !

ఆదినములలో బోయరుయుద్ధము సాగుచుండెను. ఉభయసైన్యములలోను పెక్కండ్రు నిహతు లగుచుండిరి. ధైర్యాశాలులును, అల్ప సంఖ్యాకులును నగు పగతురదెస బ్రిటీషు వారికిఁ గల వైఖరిని మేము నిరసించుచుండువారము.

మాతమ్ముఁడు వెంకటరామయ్య నాతో న్యాయశాస్త్ర పుస్తకములు చదువుచు, తన వృత్తిపనులు చక్క పెట్టుకొను చుండువాఁడు. మాతండ్రి గతించుటకు మేము మిగుల వగచితిని. 16 వ తేదీని నేను మరల బెజవాడ వెడలివచ్చితిని.

మా మఱఁదలు చామాలమ్మ తనపిల్లలతో బెజవాడ వచ్చి, మాతోఁ గొన్ని రోజు లుండెను. ఆరోజులలో నామెకొమార్తె నగ యొకటి పోయెను. మాయింట 'పాచిపనులు' చేయు నొకపిల్లమీఁద మే మనుమానపడితిమి. కామశాస్త్రిగారు నేనును దానియింటికిఁ బోయి, నగ యిచ్చివేయు మనియు, లేనిచో చిక్కులలోని కది వచ్చుననియుఁ జెప్పివేసితిమి. నగసంగతి తనకుఁ తెలియదని యపుడు చెప్పినను, మఱునాఁ డాస్త్రీ మావస్తువు మాకిచ్చివేసెను.

26 వ జనవరి దినచర్యయం దిట్లుండెను : - "పాఠాశాలాధికారి క్లార్కుదొర వచ్చుటచేత నేను తమ్ముఁడును న్యాయశాస్త్ర పరీక్షలకుఁ జెన్న పురి బయలుదేఱలేక పోయితిమి. సాయంకాలము పాఠశాలలో నుపాధ్యాయులసభ జరిగెను. బోధకులు దినమున కైదు గంటలు విద్యాలయమునఁ బని చేయవలయు ననియు, అట్లు చేయనొల్లనివారు పాఠశాల వదలిపోవలయు ననియును, క్లార్కుదొర సగర్వముగ సేనానివలెఁ జెప్పి వేసెను ! భారతదేశవిముక్తికొఱకు పాటుపడెడి క్రైస్తవమత ప్రచారకులపద్ధతు లిట్టివి ! ఓ జీససా, నీయనుచరుల చర్యలనుగూర్చి యశ్రువులెట్లు నీకనుగవనుండి యొల్కుచున్నదో కద !"

27 వ జనవరిని తమ్ముఁడు నేనును మద్రాసు బయలుదేఱితిమి. రెయిలులోకూడ మే మిరువురమును పరీక్షాపుస్తకములు తిరుగవేయుచుంటిమి. అంతకుముందె తెనాలిమీఁదుగ మధ్యమార్గమున రెయిలుచెన్న పురి పోవ నారంభించెను. కావున మఱునాఁడు ప్రొద్దునకే రాయపురము చేరితిమి. మిత్రుఁడు ములుకుట్ల సూర్యప్రకాశరావుగారు తిరువళిక్కేణిలో తమ బసయొద్ద మా కొకగది కుదిర్చి పెట్టిరి. 29 వ తేదీనుండి పరీక్షలు జరిగెను. మొదటి పరీక్షాపత్రము నందఱివలెనే నేనును పాడుచేసితిని. 2 వ ఫిబ్రవరితో పరీక్ష ముగియఁగా, తల తడివి చూచికొంటిని ! మంత్రిరావు వెంకటరత్నముతో మే మిరువురమును, పార్థసారథికోవెలను దర్శించితిమి. మఱునాఁడు ఫ్లెచ్చరు విలియమ్స్‌దొర యొసంగిన 'షేక్స్‌పియరును' గుఱించిన యుపన్యా సము విని, ఆయనతో మాటాడితిమి. 4 వ ఫిబ్రవరిని పరశువాకము వెళ్లి వీరేశలింగముగారిని జూచివచ్చితిమి. ఆయన యచట విశాలస్థలమున నొకభవనము కట్టి, అందు 'వితంతుశరణాలయము'ను నెలకొల్పి నడుపుచుండిరి. ఆసాయంకాలము మేము చెన్నపురి విడిచితిమి.

24 వ ఫిబ్రవరిని వీరభద్రరావుగారితోఁ గలసి నేను రెయిలు స్టేషనునకుఁ బోయి, వీరేశలింగముగారికొఱకుఁ గనిపెట్టుకొని యుంటిని. పంతులుగారు సకుటుంబముగ చెన్న పురినుండి ప్రయాణము చేయుచుండిరి. మేము కొనిపోయిన యన్నము వారు భుజించిరి. తాము విశాఘపట్టణముజిల్లా పోవుచున్నా మనియు, తమతో వచ్చెడి బాలవితంతువును న్యాపతి శేషగిరిరావుపంతులుగారి కిచ్చి యిక్కడ వివాహము చేతుమనియు, వివాహ మగువఱకు నే నీసంగతిని రహస్యముగ నుంచవలెననియును, పంతులుగారు చెప్పిరి. పెండ్లికుమారుని యన్న గారగు సుబ్బారావుపంతులుగారు రాజమంద్రిలో నుండుటవలన, ప్రమాదవశమున నీసంగతి వారికిఁ దెలిసినచో, వివాహమున కంతరాయము సంభవింపవచ్చు నని పంతులుగారి భయము !

ఈరోజుననే మాతల్లి, తమ్ముఁడు కృష్ణమూర్తి, చెల్లెలు కామేశ్వరమ్మయును, మమ్ముఁ జూచిపోవుటకు బెజవాడ వచ్చిరి. వైద్యుని బిలిపించి మాతల్లిని జూపించితిని. ఔషధ మిచ్చెద మని యాయన చెప్పిరి.

నాకు రెండువేలరూపాయిలు బదు లిచ్చెదరా యని నా పూర్వ శిష్యుల నిద్దఱిని నే నడుగఁగా, ఈయలేమని మోమోటముచేఁ జెప్ప లేక, వారు కొంత కాలయాపనము చేసిరి. ఈ సంగతిని స్పష్టముగఁ దెలిసికొనుటకై నేను వారియింటికిఁ బోఁగా, వారిలో నొకఁడు తన లెక్కలపుస్తకము నాముందు వేసెను. ఆయనయొద్ద దమ్మిడియైనను నిలువ లేనట్టుగ నంకె లందు వేయఁబడియుండెను ! లేదని చెప్పివేయుటకు శిష్యుఁడు త్రొక్కిన యీ చుట్టుత్రోవకు నాకు విస్మయము గల్గెను !

వీరేశలింగముగారు, వారిభార్యయు, 3 వ మార్చిని తిరిగి మద్రాసు వెడలిపోయిరి. మేము స్టేషనులో వారిని గలసికొంటిమి. ఈ పెండ్లి విషయమున పంతులుగారు చూపిన సాహసచాతుర్యములను మెచ్చుకొంటిమి.

4 వ మార్చి ఆదివారమున నా దినచర్య యిటు లున్నది : - "భోజన మాలస్యము, భార్యమీఁదికోపము ! చీ ! ఇట్టిబ్రదుకుకంటె మరణ మే మేలు? అవిధేయయగు భార్య, ఎక్కడఁ జూచిన నప్పులు, తగుమాత్రపు రాబడి, ఉన్నతాశయములు - వీనియన్నిటికిని సమన్వయ సామరస్యము లెట్లు పొసంగును ? * * * * * మేము ప్రార్థన జరిపితిమి. 'సత్యము, సర్వశ్వరుఁడు' అను విషయమున నేను ధర్మోపన్యాసము చేసితిని. అంత కృష్ణవైపునకు షికారు. మార్టినో విరచితమగు 'మతపఠనము'ను జదివితిని."

4 వ తేదీని మా కొక యాకాశరామన్న యుత్తర మందెను. లిపి బాగుగ లేనందున నందలిసంగతులు బాగుగఁ దెలియ లేదు. మఱునాఁడు వీరభద్రరావుగారికి నిట్టి యుత్తరము వచ్చిన ట్టాయన చెప్పి, నా కది చూపించెను. నాభార్య మాటకారి యనియు, గర్వి యనియు నం దుండెను ! నలుగురు విద్యార్థు లీయుత్తరముల వ్రాసె నని యందుఁ గలదు. ఇట్టి యాకాశరామన్న యుత్తరములు నే నెప్పుడు నెఱుఁగను! ఖిన్ను రాలగు నాభార్య యీసంగతి వీరభద్రరావుగారి సతితోఁ జెప్పఁగా, సర్వజ్ఞులగు కవు లింటనేయుండఁగా, పరులనుగుఱించి యనుమానప డెద రేమని సాభిప్రాయముగ నాసుదతి ప్రత్యుత్తర మిచ్చెను న్యాయవాది పరీక్షాఫలితములు 18 వ మార్చిని తెలిసెను. నేను తప్పిపోయితిని. వెంకటరామయ్య వెనుకటివలెనే రెండవతరగతిలోనే జయమందెను. రాజధాని యంతటిలోను మొదటితరగతిలో నొక్కరే గెలుచుటయు, నావలె రెండవతరగతి పరీక్షకు వచ్చినవారందఱు నపజయము గాంచుటయు, ఈపరీక్షలోని యైదుభాగములలో రెండింట నేను గృతార్థుఁడ నగుటయును, నాకుఁ గొంత యుపశమనము గావించెను !

'ఏలూరు యువజనసమాజ'సభలో వొక యుపన్యాస మీయుఁడని నా కిపుడు పిలుపువచ్చెను. "బాల్యస్వర్గము" అను విషయముపై నేనొక యాంగ్ల వ్యాసము వ్రాసి, 8 వ ఏప్రిలున ఏలూరులో జరిగిన సభలోఁ జదివితిని.

కొలఁది రోజులలోనే రాజమంద్రి ప్రార్థనసమాజవర్థంతి జరిగెను. ఆ సమయమున (15 వ ఏప్రిలు) మా తమ్ముఁడు "భూలోక స్వర్గము" అను తెలుఁగు వ్యాసమును, నేను "వీరసంస్కర్త" అను నాంగ్లవ్యాసమును జదివితిమి. వీరేశలింగముగారి జీవితవిమర్శనమే నా ప్రసంగమునకు ముఖ్యవిషయము. అఱవపల్లి సుబ్బారావుగారు మున్నగు విద్యాధికులు మెచ్చుకొనిరి గాని, నామిత్రుల కంతగ నారచనము రుచింపలేదు. 'పెరటిచెట్టు మందునకు రాదుగదా' యని తలపోసి నే నూఱడిల్లి తిని.

38. "బాల్యస్వర్గము"

మనుజుని రచనములు వాని యాలోచనముల ప్రతిబింబములు. 1900 వ సంవత్సరప్రాంతములందలి నాయూహాపోహములకును, ఆశయములకును, నే నాసంవత్సరమున లిఖియించిన రెండువ్యాసములు నిదర్శనములు. ఈరెండు నిదివఱకే సూచింపఁబడినవి. కావున వానిలోని మొదటిదగు "బాల్యస్వర్గము" అను వ్యాసమందలి ముఖ్యాంశము లిందుఁ బొందుపఱచు చున్నాను : -

శిశువు మనుజుని జనకుఁ డని వశ్డుసువర్తకవి నుడివెను. యౌవనపుఁబోకడలు బాల్యముననె పొడఁగట్టును. పండుసూచనలు పూవులోనె కానవచ్చును. కారణముననె కార్య మిమిడియున్నది. తన వంశమునకు భావికాలమున రానున్న విపద్దశ తొలఁగించుకొనుటకై, జ్యేష్ఠపుత్రుఁడు దుర్యోధనుని బాల్యముననె తాను తెగటార్చవలయు నని, ధృతరాష్ట్రునికి మంత్రులు హితోపదేశము చేసిరి. బాలకులు వికాసమునొందని. చిన్నిమనుజులు.

ఐనను, 'చిన్ని మనుజులని' చిన్నవారిని చిన్నగాఁ జెప్ప వొప్పదు. ఆకాశమంత యాశయు, అభివృద్ధినొంద నపరిమితావకాశము నఖండమనశ్శక్తులును గల చిన్నవారలొ, హ్రస్వదృష్టియు సంకుచిత స్వభావము నేర్పడిన పెద్దవారలో, నిజమయిన చిన్న వారలని చదువరులె నిర్ధారణచేసికొనఁ గలరు. ఎన్నిలోపము లున్నను శైశవముతోనె నాకు సానుభూతి. పెద్దవారలతోడి స్వర్గమునకంటె చిన్న వారలతోడి నరకమె, నాకు వాంఛనీయము !

బాల్యసుఖములె నిశ్చితమైన సుఖములు ! - పిన్నవాని పిన్న నవ్వు గగనతలమందలి బాలచంద్రునిఁ దోఁపించును. ఒక కవి వర్ణించి నట్టుగ, మనుజుని కపోలతలమునఁ బొడసూపు నల్లనివెండ్రుకలు మొలక లెత్తు పాపబీజములను స్ఫురించును. దీనితో బాలకుని నిష్కపటమగు మోముదమ్మిని బోల్చి చూడుఁడు ! స్ఫటికమువలె స్వచ్ఛముగను, వికసించు మల్లియవలె పరువముతోను, అయ్యది యొప్పుచుండును. స్వర్గలోకసుఖముల నిది స్ఫురించుచుండును ! స్వాభావికముగ సుగుణ మణియగు జీవాత్మ, ప్రాపంచిక కలుషములచేఁ గప్పఁబడి, రానురాను తన నై సర్గిక నైర్మల్యమును గోలుపోవుచున్నదని నేను నమ్మెదను.

బాల్యమునకుఁగల ప్రథమలక్షణము, అమాయికత్వము. అది వట్టి యజ్ఞానము గాదు. శైశవమందలి నిర్మలత్వము, ఆత్మకు నైసర్గికముగఁ గల పవిత్రతయె. ఎవ్వాని ఋజువర్తన ప్రభావమున వానియాత్మ యీసౌరభవిశేషమును గోలుపోవదో, వాఁడె ధన్యజీవితుఁడు !

అమాయికత్వ మనఁగా, నిరపరాధత్వమె కాదు, అపరాధ మాచరింప నేరకుండుటయును. శోధనలకు దూరముగ నుండుట కాదు, వానికిలోనయ్యును వాని తాఁకుడును లెక్కసేయ కుండుటయె, యీ యమాయికత్వమునకు గుఱుతు. సుగుణసౌందర్యరాశియగు జానకి యిట్టి యమాయికత్వమునకు గొప్ప తార్కాణము. లోకకష్టములు కలుషములు నాపుణ్యవతి యెఱుఁగకపోలేదు. కాని, యీ సుగుణప్రభావమున, ఆసుశీలకుఁ గలిగిన శోధనలబలము పటాపంచలయ్యెను. ఈ భూ నాటకరంగమున నాకాంత కార్యకలాపము ముగించుకొని, మరల తన జననీగర్భమునకు నిష్క్రమించెను !

శైశవమునకుఁగల ముఖ్యలక్షణము అమాయికత్వమని నావాదము. దీని సరికట్టుట వలన నే నైతికబాలారిష్టములు వాటిల్లుచున్న వని నామతము. పెద్దవారలగు మనలను జూచి బాగుపడుటకు మాఱుగా పిల్లలు మఱింత పాడగుచుండుట, మనకంటె వారలె సజ్జనులని సాటు చున్నది ! పెద్దవారలచేష్టలు చర్యలును పిన్నవారలకు మార్గప్రదర్శనములు గాకున్నవి. మన దురభ్యాసములు దురాచారములును ముఖ్యముగ బాలురు చెడిపోవుటకుఁ గారణము లగుచున్నవి. బాలురు మన దుర్వ్యసనములఁ గనిపెట్టుట లేదనుకొనుటకంటె పెద్ద పొరపాటు లేదు. వేయి కనులతో వారు మన యపరాధముల వీక్షించుచున్నారు. బాల్యలక్షణ మింకొకటి నిష్కాపట్యము. బాలురస్నేహములు, వారల మధుర భాషణములును సద్భావపూరితములు. ఒకపాఠశాలలో తరగతియందు నొక బాలకునిచెంతఁ గూర్చుండు మని యందున కిష్టపడని విద్యార్థిని నేను నిర్బంధింపఁగా నతఁ డేడ్చి, "మాయిద్దఱికిని విరోధమండి! మేము దగ్గఱగా నుండఁజాలమ"ని వాఁడు మొఱ పెట్టెను. ఆబాలకుని నిష్కాపట్యమునకు నివ్వెఱపడితిని. 'పెద్దవారలగు మా కిట్టి నీతి యుండిన నెంత బాగుండు!' నని నే నపు డనుకొంటిని. లోని తలంపులు బయల్పడకుండఁ జేసికొనుటయె పరమావధియని పెద్దవారల మనుకొనుచున్నాము! కావుననే యేండ్లు పైఁబడినకొలఁది మోక్షదూరుల మగుచున్నాము !

బాల్యలక్షణములలో నొంకొకటి విశ్వాసగుణము. కౌతుకాశ్చర్యములతో జ్ఞానోత్పత్తి యగుచున్నది. ఇవియె విశ్వాసమున కెల్ల మూలకందము. శైశవమున భూలోక మంతయు చిత్రవస్తుప్రదర్శనశాలవలెఁ గానిపించును! ప్రశ్నోత్తరములతో నిండియుండు బాలకుని మనస్సునకు విశ్వాసము పట్టుగొమ్మ యగుచుండును. జననీజనకులు, వయోవృద్ధులును, విశ్వాసపూరిత హృదయులగు బాలకులకుఁ బూజనీయు లగుచుందురు. పిన్న వారల భక్తిప్రేమము లందుకొన నర్హత గలిగి యుండుటకైనను, పెద్దలు పూజ్యత దాల్చియుండుట కర్తవ్యముగదా!

                          "క. గురువులు తమకును లోఁబడు
                               తెరువులు చెప్పెదరు విష్ణుదివ్యపదవికిన్
                               తెరువులు చెప్పరు, చీఁకటిఁ
                               బరువులు వెట్టంగ నేల బాలకులారా?"

అని బాలుఁడగు ప్రహ్లాదుఁడు తోడిబాలకుల కుద్బోధించెను. బాలహృదయములు గ్రోలుటకుఁ దగినమాధుర్యము లేక నిస్సారతను దాల్చియున్నవి, పెద్దలగు మన చరిత్రములు ! ఇ ట్లనుటవలన పెద్దవార లందఱు దుశ్చరితులని నేఁ జెప్పుటలేదు. చిన్నవారల చిత్తముల నాకర్షింపఁగల యోగ్యత మనలో మట్టుపడుచున్న దనియే నామొఱ !

బాలుర మంచిలక్షణముల పూర్తిపట్టిక నిచ్చుట నాతలంపు గాదు. అమాయికత్వము నిష్కాపట్యము విశ్వాసము మున్నగు సుగుణములు, బాల్యమునకుఁగల సౌందర్యగౌరవములకు హేతువులు. పెద్దలను గ్రిందుపఱుచుట నా యభిప్రాయము కాదు. సుగుణములతోఁ జెన్నొందు పెద్దఱిక మెప్పుడును శ్లాఘాపాత్రమె. అమాయికత్వాదిగుణ భూయిష్ఠమగు బాల్యము, సుజ్ఞానోపేతమగు పెద్దఱికముగఁ బరిణమింపవలయు ననియె నామతము. నిష్కపటుఁడగు బాలకుఁడు, నిర్మలినుఁడును, నియమబద్ధుఁడునగు పురుషునిగ వికసన మందవలయును. బాల్యమున వార్ధకపు దుర్గుణములును, వార్ధక్యమున యౌవనమదాంధత్వమును, బొడసూపుటకంటె ననర్థ మేమిగలదు? పెద్దవారలు తమపెద్దఱికమును నిలుపుకొను నుదార చరితులై, పిన్న వారలకు శీలసౌష్ఠవ మేర్పడుటకు సహకారు లయ్యెదరుగావుత !

39. "వీరసంస్కర్త"

నా రెండవ వ్యాస మగు "వీరసంస్కర్త" సార మిచట వివరింపఁబడుచున్నది : -

'కార్లైలు'శూరనామమును వివిధవృత్తులలోనుండువారల కొసంగి యున్నాఁడు. తన విధ్యుక్తములను ధైర్యసాహససద్భావములతో నిర్వర్తించువాఁడె శూరుఁడు. కత్తిగట్టి దేశస్వాతంత్ర్యమునకై పోరాడు సైనికునివలెనే, స్వదేశమును గలంచెడి దురాచారముల నెదుర్కొని, వానిని నిర్మూలన మొనరింపనూనెడివాఁడును శూరుఁడె. సంఘసంస్కరణ విషయమునఁగూడ శూరులు గానవచ్చు చున్నారు. దేశీయుల దురభిమానదుర్భ్రమలను లెక్కసేయక, సంఘశరీరము నందలి దుష్టాంగమును ఖండించివైచు చికిత్సకుఁడై, వలసినయెడ తనసుఖమును తనయసువులను తాను బూనిన యుత్తమకార్య నిర్వహణమునకై యర్పణచేయువాఁడె శూరుఁడు. సంఘసంస్కర్త కార్యకలాపము సుఖశయ్య యని తలంపరాదు. దైవముపట్లను తోడిమానవులదెసను జెల్లింపవలసిన విధ్యుక్తములు చెల్లించుటతప్ప నన్యాపేక్షలతో సంస్కరణరంగము చొచ్చువాని కాశాభంగమె కలుగును.

కావున సంస్కర్తయు శూరుఁడె. ఎంత హీనస్థితియం దుండిన జాతిలోనైనను శుభోదయసమయమున సంస్కర్త పొడసూపు చుండును. పరదేశీయులచే జయింపఁబడిన భారతదేశము తరతరముల నుండి యంతశ్శత్రులదాడికిని లోనగుచువచ్చెను. నిరర్థకకర్మలకును, హేయదురాచారములకును భారతమాత దాస్యము చెల్లింపుచుండెను. అంత వంగదేశమున రామమోహనుఁ డుద్భవించి, సహగమననిరోధము గావించి, స్త్రీస్వాతంత్ర్యమునకు రాజమార్గ మేర్పఱిచెను. ఈశ్వర చంద్రవిద్యాసాగరుఁడు వితంతువివాహములు నెలకొల్పెను. బొంబాయి రాజధానిలో విష్ణుపండితుఁ డీసంస్కరణమునకు ప్రాచుర్యము గలిగించెను.

ఇంక మనరాజధానిమాట యేమని యెవరైన నడుగవచ్చును. విద్యాధికతా ధనసంపన్నతలు వెలసియుండు దిక్కున సంస్కర్త యుద్భవము గాలేదు. దాక్షిణాత్యులలో నెల్ల నిట్టి భాగ్యము మన యాంధ్రులకే సంప్రాప్తమయ్యెను. 'నాటుపుర' మందలి యొక విద్యా బోధకునికీ గౌరవము లభించెను ! 1881 వ సంవత్సరము డిసెంబరు 11 వ తేదీని రాజమంద్రిలో జరిగిన ప్రథమవితంతువివాహము శ్రీకందుకూరి వీరేశలింగముపంతుల నామమునకు దేశవిఖ్యాతిని గలిగించెను. కారణము లేని కార్యమెన్నఁడును గలుగనేరదు. ప్రస్తుతమున నాంధ్రు లెంత హీనదశలో నున్నను, పూర్వకాలమున ప్రక్యాతిగనిన జాతియె వారిది. కృష్ణదేవరాయల కాలమున నాంధ్రరాజ్యము దక్షిణహిందూ దేశమంతటను వ్యాపించియుండెను. వారిభాష లాలిత్యనృదుత్వములకుఁ బర్యాయపదమయ్యెను. వారి కవితా సారస్వత మౌన్నత్యము దాల్చెను. అదివఱకె ఆంధ్రదేశమునకు రాజమహేంద్రవరము మధ్యస్థాన మయ్యెను. దక్షిణదేశవాహినులలో మిన్న యగు గోదావరినదీతీరమున నాపురము భాసిల్లుచుండెను. ఆపట్టణమున నన్నయభట్టు తన యాంధ్రభారతమును రచియించి, ఏలికయగు రాజనరేంద్రుని కంకిత మొనరించెను. ఆ ప్రాంతములందె ఆంధ్రకవిసార్వభౌముఁ డగు శ్రీనాథుఁడు గ్రుమ్మరుచుండువాఁడు.

వీరేశలింగకవి ఆంధ్రులలో నాంధ్రుఁడు. వీరిది విద్వద్వంశము. ప్రవేశపరీక్షవఱకె యీయన యాంగ్లవిద్య నేర్చియుండినను, ఆంగ్ల సారస్వత సారమును గ్రోలినవాఁడని చెప్పవచ్చును. విద్యాబోధకవృత్తి నవలంబించిన యీయువకుఁడు, స్త్రీ విద్యాభిమానియై బాలికాపాఠశాల నొకటి ధవళేశ్వరమున స్థాపించెను. పత్రికలకు వ్యాసములు వ్రాసి పంపుచు, పిదప 'వివేకవర్థని' యను పత్రికను నెలకొల్పెను. మొదట పద్యములు రచియించుటతోనె కాలము గడపినను, అంతకంత కీయన గద్యరచన మారంభించి, సంస్కరణ విషయములను జర్చింపసాగెను. వితంతూద్వాహములను ప్రోత్సహింప నొక సమాజమును స్థాపించి, అంత వీరేశలింగముపంతులు ఆసంస్కరణమును గుఱించి విజ్ఞాపనములు ప్రకటించెను. కార్యరూపము దాల్చినఁగాని యెట్టి సంస్కరణమునకును దృఢత్వస్థిరత్వము లేర్పడవనినమ్మి, యాయన 1881 వ సంవత్సరము 11 వ డిసెంబరున రాజమహేంద్రవరమున ప్రథమతితంతువివాహము జరిగించిరి.

వాక్కునకులేని చైతన్యవిశేషము కార్యమునకుఁ గలదు. మాటలకు లొంగక నిదురించెడి సంఘము పనుల కదఱిపడి లేచి, ఆలోచనచేయఁదొడంగెను. అంత, వితంతూద్వాహసంస్కరణము నణఁచి వేయ సంఘములోని పూర్వాచారపరులు విశ్వప్రయత్నములు చేసిరి. పంతులను పంతుల మిత్రులను వారు బహిష్కరించిరి. వీరేశలింగముగారి యనుచరు లంత నొక్కరె బహిష్కారభీతిచే నొత్తిగిల్లినను, ఆయనమాత్రము గొంకకుండెను. 1888 వ సంవత్సరమునఁ దన ప్రియమిత్రుఁడు గవర్రాజుగారు మృతినొందినను, వీరేశలింగము పంతులుగారు ధైర్య స్థైర్యములు వీడకుండిరి. తా నొకఁడె రణరంగమున నిలువవలసివచ్చినను, వీరేశలింగముపంతు లించుకయైనను జలింపని ధీరత్వమునఁ బోరు సల్పెను. కావుననె యా మహాశయునికిని, ఆయన చేపట్టిన యుద్యమమునకును సంపూర్ణ విజయము చేకూరెను. కాకినాడ వాస్తవ్యులు పైండా రామకృష్ణయ్యగారు వితంతూద్వాహములకు వలసిన ధనసాహాయ్యముచేసిరి. బహిరంగమున పంతులుగారితో భోజనముచేయ సాహసింపని విద్యాధికు లెందఱో యాయనకుఁ దోడుపడిరి. మొదటినుండియు విద్యార్థు లాయనకు సహచరులుగ నుండిరి. వీరేశలింగముగారి వితంతూద్వాహసంస్కరణము రానురాను దేశీయుల యామోదము వడసెను. ఆసంస్కరణ మిపుడు పల్లెలకును పట్టణములకును బ్రాకఁజొచ్చెను.

ఇట్టి వీరేశలింగసంస్కర్త శూరుఁడెకదా ! ఈతఁడు కట్టుకథలలోని ఓడిను, పరదేశవీరుఁడగు క్రాంవెలు, నరరక్తపాత మొనరించిన నెపోలియను, కనుల మిఱుమిట్లు గొలిపెడి కవితానై పుణ్యము గల షేక్స్‌పియరును గాకపోవచ్చును ! ఇతఁడు మన తోడియాంధ్రుఁడు. షేక్స్‌పియరురునకుఁగల కవితాశక్తియు, క్రాంవెలునకుఁ గల బాహుబలమును, ఈతనికిఁ గలదని చెప్పువాఁడను కాను. కాని, సంస్కరణ విషయమున వీరియందువలెనే యీయనయందును శౌర్యగుణము ప్రస్ఫుట మయ్యెను. శూరునికి సద్భావము ప్రథమలక్షణము. వీరేశలింగము పంతులను సద్భావమున మించువా రుండుట యరుదు. ఆచార కాలసర్పము కోఱలు పెఱికి, మఠాధిపతుల తీవ్రాస్త్రములను వమ్ముచేసి, సంఘమువారి శాపముల విఫలమువేసి, మన హాస్యములను క్రౌర్యములను సహనబుద్ధితో క్షమించిన యీధీరుని పేరు, లూధరు, తియొడోరు పార్కరు, రామమోహనరాయలు మున్నగు యోధుల నామముల ప్రక్క కనకాక్షరములతో లిఖియింపఁదగినదియెకదా ! ధైర్యమునందు, బుద్ధిస్వాతంత్ర్యమునందు, క్షితిని జయింపఁజాలిన క్షమా గుణమునందును, దక్షిణహిందూదేశమున నీతనితో సరిసమాను లెవ్వరు? ఉత్ప్రేక్షాతిశయోక్తులతోఁ బ్రొద్దుపుచ్చ నాయుద్యమము కాదు. కేవల సత్యమునుగూర్చిన నా నిశ్చితాభిప్రాయమె నేను వక్కాణించుచున్నాను. ఈనాయకుఁడు అసమానప్రజ్ఞయు, స్వతంత్రబుద్ధియు, సమధిక వాక్ఛక్తులతో వెలయుచున్నాఁడని చెప్పువాఁడను గాను. ఆయనకుఁగల లోపములు నాకంటె నెవరికిని బాగుగఁ దెలియవని చెప్పఁగలను. ఐనను, నిశ్చితబుద్ధి, స్వార్థత్యాగము, నయసంపద - వీనియందు మాత్రము ఉన్నతస్థానమునకును, అగ్రస్థానమునకును, నానాయకుఁ డర్హుఁడని నమ్మువాఁడను.

సంఘసంస్కరణము తీక్ష్ణత దాల్చియుండెడి యాపూర్వదినములలో వీరేశలింగ సంస్కర్తకు చెడుగనిన బొత్తిగ నోరిమి లేకుండె డిది. యుద్ధరంగమున మృదువగు సాధనములు ప్రయోగింప నాయన కిచ్చలేదు. దౌష్ట్యము నొక్క పెట్టున దుడ్డుఁగఱ్ఱతో మోదుటకె యాతఁ డభ్యాసపడియుండెను. ఆయన ప్రహసనములు వ్యక్తిగతములని యందఱు నెఱుఁగుదురు. ఆప్రహసనములందలి ముఖ్యపాత్రలు సజీవులగు మనుజులె. రాజమహేంద్రనగరవీథులలో రాత్రులు పడుపు టిండ్లకుఁ జేరెడి విటకాండ్రును, న్యాయసభలలో నున్నతాసనము లధిష్ఠించు నీతిదూరులగు నుద్యోగస్థులును - వీరందఱును తన ప్రహసనములకై ప్రత్యేకముగఁ గల్పింపఁబడిన పాత్రలనియె కాక, నీతిపథమునకు న్యాయమార్గమునకును ముఖ్యముగఁ దనకును ఆగర్భ శత్రువులనియె యాయన దలంచువాఁడు ! వారియెడ నాయన గాంచిన గాఢమైన, హృదయ పూర్వకమయిన, క్రోధమునకుఁగల రహస్య మిదియె !

తనప్రక్క టుపాకి వ్రేలాడుచుండ, ఒఱనుండి తీసిన కత్తిని ఝళిపించుచు యుద్ధసన్నద్ధుఁ డగు వీరభటునివలె వివేకవర్థనీ పత్రిక యాదినములలో వారమువారమును నీతిన్యాయముల నుల్లంఘించు వారలతోఁ బోరుసల్పుచుండెడిది. అందలి యుపన్యాసముల కెట్లు దౌష్ట్యద్రోహములు వడంకుచుండెనో యిప్పటికిని గొంద ఱెఱుంగుదురు. ఆయన ప్రహసనము కటువుగ నుండునట్లె, వారివ్యాసము గాంబీర్యము వహించి యుండెను.

వీరేశలింగముపంతులపేరు సంఘసంస్కరణ విషయములందు వలెనే సాహిత్యపునరుద్ధరణమునందును విఖ్యాతి గాంచెను. ఈరచయిత ప్రకృతాంధ్రవచన చతురాననుఁడు.

సంస్కృత సారస్వత సాంగత్యమున నాంధ్రకవిత్వము పూర్వము వినుతికెక్కినరీతిని, ఆంగ్లసాహిత్యసంపర్కమున ప్రకృతమున నాంధ్రవచనము సుస్థితికి వచ్చెను. ఈకార్యము వీరేశలింగకవి కృతమె కావున, దీనికీర్తి యంతయువారిదె. వీరిశీలమువలెనే, వచనశైలియు, స్వచ్ఛత, మృదుత్వము, బలిమియును దాల్చియున్నది.

మొదటి యాంధ్రకవులవలెనే యీప్రథమాంధ్ర వచనరచయితయు, భాషాంతర గ్రంథరచనముతోనె కాలము గడపవలసి వచ్చెను. అన్యభాషలోఁగల సొంపులను మాతృభాషలోనికిఁ గొనిరావలసిన భార మాయన వహింప వలసివచ్చెను. ఆయన సొంతకావ్యము లల్లుట కిదియె వ్యాఘాత మయ్యెను. ఇదిగాక, బంగాళీసారస్వతమున ప్రథమవచన రచయితలగు రామమోహన విద్యాసాగరులవలె, వీరేశలింగము పంతులు కూడ సంఘసంస్కరణమునకె వచనగ్రంథముల నధికముగ రచియించెను. సత్యమును విస్పష్టముగను, విపులముగను, మోమోటములేకయు నాయనఁ జెప్పవలెను గావున, ఆయన శైలియు స్వచ్ఛముగను స్పష్టముగను సూటిగను నుండెను ! ఇంతియకాదు. ఈ గుణములతోను, సంస్కరణాభిలాషతోడను విలసిల్లెడి వచన శైలిని మనయాంధ్రమునకుఁ గల్పించి కానుకగనొసంగిన కీర్తిని శాశ్వతముగ నీమహామహుఁడు సంపాదించెను !

40. సమష్టికుటుంబ కష్టములు

1900 సంవత్సరము 19 వ వ యేప్రియలున నాకష్టములను దలపోయుచు, ఎచటఁ జూచిన నప్పులు, ఇంటిలోనిపోరు, చెడుతలంపులు, కార్యగతముకాని సంకల్పములు, - ఇవియె నాముఖ్య శోధనములని గుర్తెఱిఁగితిని. 21 వ తేదీని జరిగిన 'నియోగి సహాయక సభ'కు నేనగ్రాసనాధిపతిని. నారెండవ పెదతండ్రికుమారుఁడగు పట్టాభిరామయ్యకు ముప్పదిరూపాయిలు వేతన మపుడీయఁబడెను. 23 వ అక్టోబరున ఆదిపూడి సోమనాధరావుగారు వచ్చిరి. సంఘ బహిష్కృతులగు నాయనకు మాయింటనే యాతిధ్యమిడితిని. రోజంతయు వారితోనే సంభాషణమున నుంటిని. ఆయన సాయంకాలమందొక చక్కని యుపన్యాస మిచ్చిరి.

28 వ తేదీని దివ్యజ్ఞానప్రచురణము నొకటి చదివి, మూఢత్వ మను గాఢాంధకారమున దివ్యజ్ఞానసామాజికులు చెరలాడుచుండి రని నే నెంచితిని. పశ్చిమఖండవాసుల విజ్ఞానమునకంటె ప్రాగ్దేశీయుల మూఢత్వమే యీ సమాజమువారికి ప్రియతరముగఁ గానవచ్చుచున్నది !

6 వ మేయి ఆదివారము తెల్లవాఱుజామున వైద్యాలయాధికారియగు డాక్టరు వెంకటసుబ్బయ్యగారి జవాను వచ్చి నన్నుఁ బిలిచెను. వారములు చేసికొని మాపాఠశాలలోఁ జదువుచు కాలిబంతి యాటలోఁ గడు నేర్పరియైన పి పులిపాక వెంకయ్య మిగుల జబ్బుగా నుండినట్లు వానివలన విని, నేను వైద్యునింటికేగితిని. పాపము వెంకయ్య వెనువెంటనే మరణించెను ! హృద్రోగమువలన నాతఁ డింత త్వరగ మృత్యువునోటఁ బడెనని వైద్యులు వెంకటసుబ్బయ్యగారి యభిప్రాయము. కొలఁదికాలముక్రిందటనే యాతనికి పెండ్లి యయ్యెను ! వెంకయ్య కిచట బంధువులు లేకుండుటవలన మేమే యాతనిశవమును శ్మశానవాటికకుఁ గొనిపోయి దహనాదిక్రియలు జరిపించితిమి. నిన్నటి వఱకును మందహాసమున బంతులాడెడి యీయువకుఁడు మరణించె ననుట మా కెవరికిని విశ్వసనీయము గాకుండెను! ఆహా ! జీవిత మెంత యస్థిరము !

7 వ మేయి పాఠశాల కీయర్ధసంవత్సరమున తుదిదినము. దాసు గారి కీపాఠశాలతోడిసంబంధ మీనాఁటితోఁ దీఱెను. చివరవఱకును సుగుణదుర్గుణములు మనుజుని వీడకుండునుగదా ! విద్యార్థు లాసాయంకాలమున విజ్ఞాపనపత్ర మాయన కర్పించిరి. ఆసమయమున మాబోటిప్రత్యర్థి బోధకులను బరిహసింప నొకసంభాషణముకూడ సిద్ధపఱచిరి ! కాని యది పిమ్మట విరమింపఁబడెను. పాటలు, విజ్ఞాపనము, వక్తలలో నొకరగు గోపయ్యగారు చేసిన ప్రసంగమును, సహాయోపాధ్యాయులగు మమ్మునుగుఱించిన యెత్తి పొడుపుమాటలతో నిండియుండెను. ఎంత శ్లాఘింపఁబడినను, చెడుగు మంచిగఁ బరిణమింపఁగలదా ?

ఈసమయమున మాతల్లియు, చిన్న చెల్లెలును మాతో బెజవాడలోనే యుండిరి. మాయమ్మకు వెనుకటి జబ్బు అప్పుడప్పుడు కానబడుచునే యుండెను. వైద్యుని బిలిచి, నేను మందు తెచ్చి యిప్పించితిని. తమ్ముఁడు కృష్ణయ్య తంత్రీశాఖాపరీక్షకు విశాఘపట్టణము వెళ్లి యుండుటచే, నేను రాత్రులు నిద్ర మాని వ్యాధిగ్రస్తయగు మా యమ్మకుఁ బరిచర్యలు చేసితిని.

10 వ మేయి తేదీని నే నొక దివ్యజ్ఞానసమాజ సభ్యునితోఁ బ్రసంగించితిని. తత్త్వశాస్త్రసంబంధ మగు నద్భుత విషయములు నాకును హర్ష దాయకము లయ్యును, వానిని విమర్శించునపుడు దివ్యజ్ఞాన సమాజమువారి పద్ధతిగాక, "లండను మనశ్శాస్త్ర పరిశోధక సమాజము" వారివిధానమె నాకు యుక్తముగఁ దోఁచెను. అంధప్రాయమగు విశ్వాసమునకంటె శాస్త్రబద్ధవిమర్శనమే నాకుఁ బ్రియము.

మే మంత, వేసవిసెలవులకు బెజవాడనుండి వెడలిపోయితిమి. తనతమ్ముఁడు శేషగిరిరావుగా రిటీవల చేసికొనిన వితంతువివాహ మశాస్త్రీయ మని దానిని రద్దుపఱిపింప సుబ్బారావుపంతులు గారు ప్రయత్నించుచుండి రని సాంబశివరావుగారివలన విని మేము విచార పడితిమి. చిరకాలస్నేహితులగు వీరేశలింగముగారు తనతోఁ జెప్పక తనతమ్ముని కిట్టిపెండ్లి చేయించిరని సుబ్బారావుగారు వీరేశలింగము గారియెడ నాగ్రహముఁ బూనియుండిరని వింటిమి.

23 వ మేయి దినచర్యలో నిటు లున్నది : - "మరల మాయమ్మ, మామఱఁదలితో వైరము సాగించుచున్నది. ఇదివఱకే నా భార్యకు మాతల్లియం దనుగ్రహముగదా! కర్తవ్య మేమి? ఆరోజులలో రాజమంద్రిలో విశూచిజాడ్యములు వ్యాపించియుండెను. 28 వ మేయిని మాపొరుగుననుండు వేపా లక్ష్మీనరసింహముగారికి విశూచి సోఁకెను. ఆయన కిచట భార్యయు, బిడ్డయు మాత్రము గలరు. అంత మే మాయనను వైద్యాలయమునకుఁ గొనిపోయి యచట విడిచివచ్చి, భార్యను పిల్ల వానిని మాయిల్లు చేర్చితిమి. మొదట మే మాయనను గుఱించి భీతిల్లితిమి గాని, కొలఁదిరోజులలోనే యాయనకు నెమ్మది కలిగెను.

మా కెచటనైన పెద్దయప్పు లభించినచో, చిల్లరబాకీలన్నియును దీర్చివేయుద మనుకొంటిమి. రాజమంద్రిన్యాయవాదులు మోచర్ల రామచంద్రరావుగారు తమ బావమఱఁదితో బాగుగ నాలోచించుకొని, నూటికి 12 అణాలు వడ్డీచొప్పున నొక వేయిరూపాయిలు మా నివేశన స్థలముల తనఖామీఁద మా కప్పిచ్చుటకు సమ్మతించిరి. 31 వ మేయి తేదీని మే మంత రామచంద్రరావుగారికి దస్తావేజు వ్రాసి రిజిస్టరు చేయించి, సొమ్ము పుచ్చుకొని, చిన్న యప్పులు తీర్చి, పెద్దఋణదాతలకుఁ గొంచెము కొంచెముగఁ జెల్లించితిమి.

17 వ జూను తేదీ దినచర్యయందు నే నిట్లు లిఖించితిని : - "తమ్మునితో పెద్దబజారు వెళ్లి, అతనిభార్య కీనాఁడు రెండుచీరలు కొంటిని. ఆమె యిదివఱకు రెండుకోకలతోనే గడపుకొనుచుండెనఁట! మాయమ్మకు నన్ను గుఱించి దురభిప్రాయములు గలవు. సంసార వ్యవహారములు నాకు నచ్చుచుండలే దని యామె యపోహము ! సత్యము సర్వజ్ఞునికే యెఱుక!"

జూను 18, 19 తేదీలలో నేను వెంకటరామయ్యయును కొక్కొండ వేంకటరత్నము పంతులుగారి బసకుఁ బోయి, ఆయనతో దీర్ఘసంభాషణము చేసితిమి. అరుంధతినిగుఱించి యాయన కొన్ని వినోదకరములగు నంశములను మాకుఁ జెప్పెను. మే మచట నుండునపుడు, మొదటినాఁడు వారి పసిబిడ్డ యుయ్యెలనుండి క్రిందఁ బడి పోయెను. వేగమే వచ్చి బిడ్డను దీయు మని యాత్రమున భార్యను బిలుచునపుడైనను పంతులుగారు గ్రామ్యభాషాప్రయోగము చేయకుండుట మా కాశ్చర్యమును గొలిపెను. !

ఓరియంటలు భీమాసంఘమువారు, మాతమ్ముఁడు వెంకటరామయ్యవలనఁ గొంచె మదనముగ సొమ్ము పుచ్చుకొని, భీమా కంగీకరించుటకు సంతోషించితిమి.

20 వ జూను తేదీని వస్తుఇవులను సరదికొని, భార్యతో నేను బెజవాడ బయలుదేఱితిమి. మాతల్లి మితభాషిణిగ నుండి, మేము ప్రయాణము చేయుటకుఁ గోపించెను ! రాత్రికి బెజవాడ చేరితిమి. పూర్వపు ప్రధానోపాధ్యాయుఁడు వెడలిపోవుటచేత, నాకుఁ బిమ్మటి సహాయాధ్యాపకులగు జాను కల్యాణరామయ్యగారు క్రైస్తవు లగుటచేత నిపుడు అగ్రస్థాన మలంకరించిరి.

22 వ తేది దినచర్యయం దిట్లున్నది : - "క్లార్కుదొర పాఠశాలకు వచ్చెను. 'నాతో మాట్లాడుటకు మీ కవకాశ మిచ్చెదనుఁ అని నా కభయహస్త మిచ్చినటు లాయన సెలవిచ్చిరి ! ఈశ్వరసేవకుల మని చెప్పుకొనువారివైఖరి యిట్టిది. ఈ పాఠశాలలో లెక్కలే నన్ని లోపములు కష్టములు నున్నవి ! దీని కీయన యజమాని. ఇట్లయ్యును, పాఠశాలలోఁగల చిన్నలోపములను గుఱించియైన నడుగుట కీమహనీయునికిఁ దోఁచదు, తీఱదు ! దైవమా యేమని చెప్పను !"

41. క్రొత్త హరికథలు

ఇదివఱకు నేను "హిందూసుందరీమణు" లను పేరుతో సీత సావిత్రి మున్నగు నేడుగురు సుదతుల కథలు వ్రాసితిని. ఇంకను ప్రాచీనకాలసుందరు లనేకులు కలరు. కొలఁదిదినములక్రిందట నేను రాజమంద్రిలో నుండునపుడు వెంకటరత్నముపంతులుగారు అరుంధతి మున్నగు స్త్రీలనుగుఱించి నాకుఁ జెప్పిరి. నామిత్రు కామశాస్త్రిగారిటీవల "కాదంబరీసారసంగ్రహము"ను రచియించి, అందలి మహాశ్వేతనుగుఱించి సూచించిరి. కావున నేను "జనానాపత్రిక" లో "హిందూసుందరీమణుల" రెండవభాగమును వ్రాయ నారంభించితిని.

ఆకాలమున బెజవాడలో కొంచెముసేపు రెయిళ్లు ఆఁగుచు వచ్చుటచేత, తమకుఁ గొంచెము అన్నము పంపు మని స్నేహితులు తఱచుగ నాకు వ్రాయుచు వచ్చిరి. 3 వ జూలయిని వీరేశలింగముగారు వచ్చుచుంటినని వ్రాసిరి. కాని, యానాఁడు బండి యాలస్యముగ వచ్చుటచేత నేను పాఠశాలకు వెళ్లి పోయితిని. స్నేహితులు వారిని గలసికొనిరి. మఱునాఁడు ప్రణతార్తిహర అయ్యరుగారు మద్రాసు నుండి రాజమంద్రి వైపునకుఁ బోవుచు, ఐదుగురికి అన్నము పంపుఁడని నాకు వ్రాయఁగా, ఒక బ్రాహ్మణవిద్యార్థిచే నన్నము పంపితిని. కాని యతఁ డాలస్యముగ వెళ్లుటచేత, వారు నిరాహారులై వెడలి పోయిరి ! 8 వ జూలయితేదీని వీరేశలింగముగారు వచ్చి మాయింట విడిసిరి. ఆరోజు ఆదివార మగుటచేత, పఠనాలయములో "ప్రవర్తనము" అను విషయమునుగుఱించి వారు ఉపన్యసించిరి.

12 వ జూలయిని కామశాస్త్రిగారు జబ్బుగా నుండుటచే వారినిఁ జూడఁబోయితిని. "మహిమ్న" స్తోత్రములోని శ్లోకము లాయన చదివి యర్థము చెప్పిరి. బ్రాహ్మమతమందలి యేకేశ్వర ప్రార్థనము నివి పోలియుండెను.

20 వ జూలయి తేదీని "విద్యార్థుల సాహితీసంఘ" సభకు నే నగ్రాసనాధిపతి నైతిని. నాటకవృత్తి గైకొనిన యువకుల దుర్నీతులనుగుఱించి ప్రస్తావవశమున నేను మాటాడితిని. ఈ ప్రాంతములు చూచిపోవుట కేతెంచిన ధన్వాడ అనంతముగా రా సభకు వచ్చి, నా యభిప్రాయములలో సత్యము గల దని నొక్కి చెప్పిరి. పిమ్మట నేను జాలసేపు వారితోఁ బ్రసంగించితిని. ఆరాత్రియే వారు మద్రాసు వెడలిపోయిరి.

1 వ జూలయి నేను బుట్టినరోజు. నాఁటి దినచర్యయం దిటు లుండెను : - "ఈరోజుతో నావయస్సు ముప్పదిసంవత్సరములు. ఇంతకాలము నా కాయురారోగ్యముల నొసంగినందుకు, దైవమా, నీకు వందనములు ! మనుజులు చెప్పు గొప్పసంగతులయొక్కయు చేయు ఘనకార్యములయుమాట యటుంచి, జీవించుటయే యొక విశేషముగదా ! మనుష్యుఁడు తృణప్రాయుఁడు గాఁడు. నే ననుభవమునఁ గాంచిన మహావిషయముల కెల్ల దేవునికిఁ గృతజ్ఞుఁడను. నామనస్సు కొన్ని సుసంకల్పములకును, పెక్కు చెడుతలంపులకును దావలము. నాకు జీవితము తెంపులేని సముద్రమువలెఁ గానవచ్చుచు న్నది ! దేవుఁడు న న్నాశీర్వదించి, నా కెక్కువ పవిత్రత యొసంగి, నేను సార్థకజీవితమును గడపునట్లనుగ్రహించునుగాక!"

ఈసంవత్సరము జూలయినుండియు "జనానాపత్రిక"ను వీరభద్రరావుగారి విద్యాసాగరముద్రాలయమునుండి తీసివైచి, మద్రాసు బ్రాహ్మ సమాజమువారి కార్యాలయమున నచ్చొత్తించుచువచ్చితిని. దీనికిఁ గారణము, రావుగారి ముద్రాలయము సరిగా పని చేయకపోవుటయే. ఆయన వ్యవహారపుఁజిక్కులలోఁ బడి, ముద్రాలయమును సరిగా నడుపనేరకుండెను.

జనానాపత్రికనుగూర్చిన పనులన్నియు సొంతముగ నేను జేయుచుండువాఁడను. నాభార్యయు, కొందఱు విద్యార్థులును పత్రికను చందాదారులకుఁ బంపు విషయమున సాయము చేయుచు వచ్చిరి. చాలినంతసొమ్ము పత్రికకు లేకుండుటచేత నిట్టిపనులు కొక పరిచారకును నియమింపలేకుంటిని.

ఆగష్టునెలలో మూఁడుదినములు సెలవగుటచేత, సకుటుంబముగ నేను ఏలూరు పోయితిని. కొన్నిరోజుల వఱకును నాభార్య మాత్రము తిరిగి రా లేదు. అందువలన బెజవాడలోని నేనే వంట చేసికొనుచుండు వాఁడను. ఇంట రెండవభాగమున నొంటరిగ నుండు వీరభద్రరావుగారికిని స్వహస్తపాకమే ! ఆనెల 23 వ తేదీని నేను మధ్యాహ్నమున బడికిఁ బోవుచు, దారిలో బందరు కాలువలోఁ బడిపోయిన స్త్రీ నొకతెను గట్టున కీడ్చుచుండు కొందఱిని జూచితిని. ఆత్మహత్య చేయవల దని వారించి యా మెను మాయింటికిఁ గొనివచ్చి భోజన మిడితిని. గృహకల్లోలములవలన తాను ప్రాణహత్యకుఁ గడంగితినని యాస్త్రీ చెప్పెను. ఆస్త్రీ చీర నీటఁ దడియుటచేత నాభార్యకోక యొకటి యామెకుఁ గట్టనిచ్చితిని. నీటిగండము తప్పిన యాదీనకు శరణ మొసంగినందుకు నన్ను మిత్రు లభినందించిరి. అంత నింటి తలుపు తాళము వేసికొని, మిత్రుఁడు ముద్రాలయమునకును, నేను బాఠశాలకును వెడలిపోయితిమి.

ఆ సాయంకాలమున నేలూరు రెయిలు దిగివచ్చిన నాభార్య చూచుసరికి, మాయింటివాక్లిట పరస్త్రీయొకతె మసలుచుండుటయు, ఆమె తనచీరయే సింగారించుకొని యుండుటయును, ఆ గృహిణికి వెఱ్ఱి యనుమానములు గలిపించెనఁట ! కొంతసేపటికి నేను రావుగారు నిలుసేరి, ఆస్త్రీ బంధువులకు వర్తమాన మంపితిమి. ఆ యువతి పుట్టినిల్లు రాజమంద్రి యనియు, ప్రవర్తనము మంచిది కాదనియు, భర్తతోఁ బోరాడి యానాఁడు పాఱిపోయివచ్చె ననియును వారు మాకుఁ జెప్పి, ఆమె నెట్లో భర్తృగృహముఁ జేర్చిరి.

7 వ సెప్టెంబరున ఆదిపూడి సోమనాధరావుగారు బెజవాడ వచ్చి మాయింట నొకవారము నిలిచియుండిరి. ఆపురమందు కొన్ని హరికథలును, ప్రసంగములును వారు గావించిరి. సోమనాధరావుగారి యుపన్యాసములు జనరంజకములుగ నుండెను. ప్రేక్షకులు వచ్చినను రాకున్నను నియమితసమయమునకె సరిగాఁ దమప్రసంగమును ప్రారంభించి, ఒకగంట మాటాడి యాయన కూర్చుందురు ! ఈ కట్టుఁబాటువలన సభ్యులు సమయమునకే వచ్చి యాసక్తితో వినుచుండువారు. ఆయన హరికథలు, క్రొత్తపద్ధతి ననుసరించి, సంస్కారమునకు సుముఖములుగనుండి, ప్రేక్షకుల కమిత ప్రమోదమును గొలుపుచుండెడివి.

ఆరోజులలో నాకు గుండెదగ్గఱ మండుచుండెడిది. మిత్రులు డాక్టరు వెంకటసుబ్బయ్యగారు నాహృదయము శ్వాసకోశములును బాగుగఁ బరీక్షించి, అం దేలోపము లేదనియు, కండర సంబంధమగు వాతమే బాధకుఁ గారణము కావచ్చు ననియును జెప్పిరి. నే నధికముగఁ బరిశ్రమము చేయుచు, నా వ్యాధిని గుఱించి పలుమాఱు తలపోయుచుండుటచేతనే నామంటలు హెచ్చుచుండవచ్చు నని కూడ వారి యభిప్రాయము !

42. "హిందూ సుందరీమణులు"(2)

1900 సం. సెప్టెంబరు మధ్యమున "హిందూ సుందరీమణుల చరిత్రముల" రెండవ భాగమును బూర్తిచేసితిని. దీనికిని మొదటిభాగమునకును గొంత భేదము లేకపోలేదు. కావున దీని పీఠికలో నే నిట్లు వ్రాసితిని : - "ఇందలి కథలలోఁ గొన్నింటిని గుఱించి యొకటిరెండు సంగతులు చెప్పవలసియున్నది. సత్యభామచరిత్ర నీ గ్రంథమున నేల చేర్చితి వని కొందఱు స్నేహితులు నన్నడిగిరి. సత్యభామ గయ్యాళి యనియు, ఆమెచరిత్ర మంతగా నీతిదాయకము గాదనియు వారల తలంపు. ఇది సరియైన యూహ కాదు. సీత, ద్రౌపది మొదలగు వనితల సుగుణములు శ్లాఘాపాత్రములే యైనను, వీరి చరిత్రములొకరీతినె ప్రాఁతవడిన గుణవర్ణనములతో నిండియుండి, నవీనుల కంతగా రుచింపకున్నవి. పతిభక్తియే వీరికిఁ గల గొప్పసుగుణము. ధైర్యసాహసాదు లంతగ వీరియందుఁ గానిపింపకున్నవి. ఇట్టిస్త్రీల చరిత్రములు చదివిచదివి, సత్యభామకథ చేతఁబట్టినవారి కింపగు భేదము గానఁబడును. నిర్మలప్రవర్తనమునం దితర ముదితలకు సత్య యావంతయుఁదీసిపోక, వారియందుఁ గానరాని ధైర్యాది నూతనసుగుణములు దాల్చి, హిందూవనితల యభ్యున్న తిని గాంక్షించెడివారల కానంద మొసంగుచున్నది ! మనదేశమందు భార్యయనునది భర్తవినోదార్థ మేర్పడిన కందుక విశేష మనియె భావించుచున్నారు గాని, ఆమెయును బురుషునివలెనే స్వబుద్ధి వినియోగించి, స్వతంత్రత నూని, ధైర్యసాహసాదులు గలిగి, ఘనకార్యములు నిర్వర్తించి, కృతకృత్య కావలెనని యెవరు నంతగఁ దలంచు చుండుట లేదు ! ఈ సుగుణములు దాల్చి, మగనిపరిచారికవలె మాత్రమె చరింపక, చెల్లింపవలసిన యధికారము చెల్లింపుచు, చేయవలసిన ఘనకార్యములు చేయుచు, తన ప్రజ్ఞాచాతుర్యములు మెఱయు నట్టుగ మెలంగినది పూర్వకాలస్త్రీలలో సత్యభామ యొక తెయే ! పత్నీధర్మ మెప్పటికిని పతి ననుసరించుటయే యని తలంచెడి మన దేశమున, ప్రజ్ఞయు, స్వతంత్ర బుద్ధియుఁ గలిగి సంచరించెడి సత్యభామవంటి చానలు జాణలని ప్రతీతి గలుగుటయం దేమియాశ్చర్యము ?

"ఈ గ్రంథమునఁ జేర్పఁబడిన యింకొకకథనుగూర్చి కూడ కొంత చెప్పవలయును. మొదటినుండియు సత్ప్రవర్తనగల స్త్రీయే సుగుణవతి గాని, ఒకప్పుడు ప్రమాదవశమున తప్పు చేసి పిదప పరితపించి సన్మార్గముఁ జొచ్చిన వనిత మంచిదికాదని మనదేశమునఁ బలువుర తలంపు. ఇది సరికాదు. ఇందలి 'కాంచనమాలిని' మొదట నాటవెలఁదియె యైనను, పిమ్మట గాఢానుతాపమున సన్మార్గ మవలంబించెను. ఇట్టి మానినులును మన మన్ననలకుఁ బాత్రలే."

మద్రాసునందలి "సంఘసంస్కారిణీ" పత్రిక నాపుస్తకమును విమర్శించుచు నిట్లు వ్రాసెను : - "ఈ గ్రంథకర్త తెలుఁగు జనానా పత్రికను బ్రచురించియు, సద్గ్రంథములు ప్రకటించియు, ప్రస్తుత పరిస్థితుల వైపరీత్యమున నజ్ఞాన తిమిరమున మునింగిన స్త్రీజాతి నుద్ధరింపఁ బ్రయత్నించుచున్నాఁడు. ఇట్టి పుస్తకములు మూలమున స్త్రీలకు ప్రమోదముఁ గలిగింప వీరియుద్యమము. ఎక్కువగఁ బరిశ్రమించి, పురాణములందుండిన యుత్తమస్త్రీల చరిత్రములు వీరు తెలుఁగున రచించి ప్రకటించిరి. ప్రాచీనప్రకృతభామినుల సుగుణములతో విలసిల్లు సత్యభామకు స్వానుభవసాహాయ్యమున ద్రౌపది చేసిన యమూల్యోపదేశములు, ఈకాలపుఁ బుణ్యాంగన లనుసరింప యోగ్యముగ నున్నవి. ధనాశచేఁ దన మానము నమ్ముకొని తుద కదృష్టవశమున పరితాపము నొంది నూతనజీవమున విరాజిల్లెడి కాంచనమాలినికథవలన, ఎంత దుస్థితికి వచ్చినయింతియైన నధైర్యపడక పూనికతోఁ శీలసౌష్ఠవముఁ బడసినచో బూజనీయ యగు ననుట స్పష్టము. * * * "

జనానాపత్రిక కొంతకాలమునుండి ముప్పదిరెండు పుటలు గల పుస్తకరూపము దాల్చెను. కావున నెలనెలయును సామాన్య వ్యాసములేకాక, యేదో యొకపుస్తకభాగముకూడ నందుఁ బ్రచురింపవలసి వచ్చెను. కొంతకాలముక్రిందట హిందూపత్రిక కొక యాంగ్లస్త్రీ "ఇంగ్లీషువారి సంసారపద్ధతు" లను గుఱించి వ్రాసిన వినోదకరములగు వ్యాసములు నేను, జదివియుంటిని. ఇపు డొకవిద్యార్థి చేతిలో నీ వ్యాసము లన్నియుఁ గూర్చిన పుస్తక మొకటి చూచితిని. గ్రంథకర్త్రి మైసూరు స్త్రీవిద్యాలయ ప్రథమోపాధ్యాయిని యగు రిడ్సుడేలుకన్యక యని నా కపుడు తెలిసెను. ఈపుస్తకము నాంధ్రీకరించి 'జనానాపత్రిక' లోఁ బ్రచురింప ననుజ్ఞ నీయుఁడని యామెకు 17 వ సెప్టెంబరున వ్రాయఁగా, అందుల కామె యిష్టపడెను.

19 వ సెప్టెంబరు దినచర్యయం దిట్లు గలదు : - "పాప హేయఁపుఁ దలంపులు నన్ను సదా వేధించుచున్నవె ! చెన్నరాజ ధానియందు ఆస్తిక మతప్రచారకుఁడవు కమ్మని నాకు నిన్న కొందఱు మిత్రులు వ్రాసిరి. ఆహా, ఈ పదవికి నే నెంతయు ననర్హుఁడనుగఁదా ! పాపి యగువాఁడు తోడిపాపుల కెట్లు తోడునీడ కాఁగలఁడు ? నా కీగౌరవము ముమ్మాటికిని వలదు ! నాకు పాప మాలిన్యములయందే యనురక్తి !"

నా కీమధ్య లభించిన మార్టినో రచనములు నే నిపుడు తఱచుగఁ జదువుచుంటిని. అప్పుడప్పుడు ఆంధ్రసాహిత్య గ్రంథములు చదివి సతికి వినిపించి యర్థము చెప్పుచుండువాఁడను.

30 వ సెప్టెంబరు ఆదివారము మధ్యాహ్నమున నేను గదిలోఁ జదువుకొనుచుండఁగా పొరుగునుండి కేకలు వినఁబడెను. నేను వాకిటికి వచ్చి చూడఁగా, మా జామచెట్టుమూల నొక ముసలివాఁడు దాఁగి యుండెను. వానిచేతిలో కంచుగిన్నె యొకటి యుండెను ! నా ప్రశ్నలకు వాఁ డేమియు ప్రత్యుత్తర మీయక, దిగాలుపడి చూచెను. ఇంతలో జనులు మా యావరణములోనికి వచ్చి యామనుష్యునిఁ బట్టుకొనిరి. పాప యాముసలివాని మొగము కడుదీనముగ నుండెను. గిన్నె దొరకెను గాన, వానిని వదలివేయుఁ డని నే నంటిని. ప్రజలు వానిని బోనీయక పోలీసు స్టేషనుకుఁ గొనిపోయిరి. పిమ్మట నొకరక్షక భటుఁడు వచ్చి దండనాధిపు నెదుట నేను సాక్ష్య మీయవలయు నని చెప్పి, నా పేరు వ్రాసికొని పోయెను. మఱునాఁడు నేను న్యాయస్థానమునకుఁ బోయియుంటినిగాని, నాసాక్ష్యము గైకొనకయే యధికారి దొంగకు మూఁడు నెలల ఖైదుశిక్ష విధించెను. ఈచోరీ విషయమున నన్ను బో నెక్కించి నాచే సాక్ష్యము పుచ్చుకొని, నాకు శ్రమయు నవమానము గలిగింపఁ దాను సమ్మతింపకుంటి నని న్యాయాధికారి యనునప్పుడు, నేను మరియాద కాయనకు వందనము లిడినను, న్యాయసభలో సత్యము పలుకుట నీచమా యని యాశ్చర్య పడితిని.

వీరభద్రరావుగారు బెజవాడనుండి వెడలిపోయిన పిమ్మట, మాయింట నొక వైదిక బ్రాహ్మణ కుటుంబమును రెండవభాగమున నుంచితిమి. ఆ పెద్దయావరణమున మే మొంటరిగ మసలుటయు, ఆ చిన్న యింట మాతోఁగలసి వేఱొకరు కాఁపురము చేయుటయును గూడఁ గష్టమే !

నాకు గుండెదగ్గఱ మంట యనుదినమును గనఁబడుచుండెను. కోకో గాని తమిదయంబలి గాని పుచ్చుకొని చూడు మని వైద్యుఁడు చెప్పఁగా, నే నిట్లు చేసితిని గాని లాభము లేకపోయెను. పాఠశాలలో పని యెక్కువ యగుటయే దీనికిఁ గారణ మని నేను నమ్మితిని. ఇది యొకటియే గాక, పత్రికలకు వ్రాయుట, సభలు సమావేశములు సమకూర్చుట, గృహచ్ఛిద్రములను గుటుంబ ఋణములను గూర్చి సదా తలపోయుట, - మున్నగు పను లన్నిటివలనను నా దేహపటుత్వము తగ్గుటయే దీనికిఁ గారణము కావచ్చును.

నే నిపుడు "ఇంగ్లీషువారి సంసారపద్ధతులు" తెలుఁగుచేసి, యీ సంవత్సరము అక్టోబరునుండియు "జనానాపత్రిక" లోఁ బ్రచురింపసాగితిని. పత్రికలో వ్రాసినభాగముల ప్రతులు పుస్తకరూపమున ప్రత్యేకముగఁ గొన్ని తీయించుచు వచ్చితిని. ఈవిధముగ నాపుస్తకమంతయు 'జనానాపత్రిక' యెనిమిదవ సంపుటాంతమున, అనఁగా 1901 సం. జూనునెల పత్రిక సంచికతోఁ బూర్తిపఱిచితిని. తెలుఁగుపద్యములు వ్రాయు నభ్యాసము నాకు లేదు. కావున మాతృకలో నుల్లేఖింపఁబడిన టెన్నిసను మున్నగు నాంగ్లకవులపద్యముల భావము నేను జెప్పఁగా, నామిత్రులు కామశాస్త్రిగారు చక్కని తెలుఁగు పద్యములు రచించి నా కిచ్చుచు వచ్చిరి. అవి నేను బుస్తకమునఁ జేర్చితిని.

43. చీఁకటివెన్నెలలు !

నేను మాతండ్రిగారి యాబ్దికమునకై అక్తోబరు చివరభాగమున రాజమంద్రి వెళ్లినపుడు, సంసారమును బెజవాడకుఁ దరలించుటను గుఱించి మా తమ్మునితో మరల ముచ్చటించితిని. అందఱము నొకచోటనె యుండినఁగాని మా రాబడి యెంత హెచ్చినను, మేము సొమ్ము కూడఁబెట్టలేమని గ్రహించితిమి కాని, మాచెల్లెలు కనకమ్మ పురుడు రెండునెలలలో రావచ్చును గావున, మావాండ్రు రాజమంద్రి యిపుడు విడుచుటకు వలనుపడకుండెను. అందుచేత వర్తమానమున మా సమష్టికాఁపురపు సంగతి కట్టిపెట్టితిమి.

30 వ అక్టోబరు వార్తాపత్రికలలో మోక్షమూలరు పండితుఁడు పరమపదముఁ జెందెనని యుండెను. ఆ మహామహుఁడు హిందూమతగ్రంథ ప్రచురణమునకై చేసిన యపార పరిశ్రమము కడు శ్లాఘనీయమైనది. ఆకాలమున దొరతనమువారు రాజమంద్రి కళాశాలను మూసివేతురనియును, ఒక క్రైస్తవ సంఘమువారు దానిని గైకొని నడుపుదు రనియును వదంతులు ప్రబలెను. ఇవి యందఱికిని విషాదమును గలిగించెను. అంతట ప్రభుత్వమువారు తమ మనస్సును మానుకొనినట్లు విని సంతోషించితిమి.

రచనావిషయమున నొకపనితో రెండుఫలితము లొనఁగూర్ప నేను బ్రయత్నించుచు వచ్చితిని. 11 వ నవంబరున నాగుండెమంట లొకింత చల్లార్చుకొనుటకో యనునట్టుగ, "వెన్నెల"ను గుఱించి యొక తెలుఁగువ్యాసము వ్రాసి, ఆనాఁడు జరిగిన ప్రార్థనసమాజసభలో ధర్మోపన్యాసముగ దానిని జదివితిని. అదియే యానెల 'జనానాపత్రిక' లో నొక వ్యాసముగఁ బ్రకటిత మయ్యెను. భారతమందలి "శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహార పంక్తులన్" అను పద్యమును నేను ఉల్లేఖించి యిట్లు వ్రాసితిని : - "తెల్ల వెన్నెల యను మహాసముద్రమున మునింగియున్న పదార్థసమూహమును జూచితిమా, మనస్సు ఆనందపరవశమై, చిత్రచిత్రమగు నూహలకును తలంపులకును జన్మభూమి యగుచుండును ! వెన్నెలరాత్రులందు సముద్రమును జూచి వినోదింపని కన్నులు గన్నులు కావు.

"చంద్రుఁడు వెన్నెలయును లేకుండినచో, భూలోక సౌందర్యమును, మనుజుని సౌఖ్యరాశియును మిగుల కొఱఁతపడియె యుండును ! * * * దేవతలలోని మువ్వురు సుందరాంగులలోను జంద్రుఁ డొకఁడు. ఆతఁడు విష్ణుని యెడమకన్ను, శివునితలపూవు. చంద్రుఁడు కవులకల్పతరువు * * సౌందర్యవతి చంద్రముఖి యగుచున్నది. లావణ్యవతుల నవ్వును వెన్నెలతోఁ బోల్చుచున్నాము. * * వెన్నెలవలెనే యిహలోకసౌఖ్య మస్థిరము. ఎన్నఁడు నస్తమింపని చంద్రుని, నెప్పుడును సమసిపోని చంద్రికను మనము వీక్షింపఁగోరెద మేని, పరమాత్ముఁడను మహాచంద్రునే మనము గాంక్షింపవలెను. ఆ మహామహునియెడ భక్తిప్రేమములు పెంపొందించుకొనుటకే, వెన్నెలవంటి సౌందర్య పదార్థములు మనకుఁ బ్రసాదింపఁబడి యున్నవి !"

పై వ్రాఁతయందలి తుదివాక్యములు పత్రికా వ్యాసమును ధర్మోపన్యాసముగ మార్చివేయుచున్నవి ! 1900 వ సంవత్సరాంతమున మరల ప్రాథమిక పరీక్షలు, నాయఁడుగారియొక్కయు వారియనుచరులయు స్నేహసహవాసములును ! ఇప్పటి ప్రధానోపాధ్యాయులు కల్యాణరామయ్యరుగారు, నామీఁద దయగలిగి, ఆపరీక్షలు చేయుటకు వలసినప్పుడు నన్ను, బోనిచ్చెడివారు. 27 వ నవంబరు తేదీని నేను బండిమీఁద వుయ్యూరు పయనము చేసితిని. 29 వ తేదీని నాయఁడుగారు నేనును బరీక్షలలో నుండఁగ, మాతమ్ముఁడు బెజవాడ కిచ్చినతంతి నా కిచటఁ జేరెను. మాతల్లికి నిన్న మరల మూర్ఛలు ప్రబలముగ వచ్చెనని యందలి దు:ఖవార్త ! పరీక్షలో నేఁ జేయవలసినపని వేగమే పూర్తిపఱిచి, పగలు 12 గంటలకు బండిమీఁద దిరిగి బయలుదేఱి, సాయంకాలమునకు బెజవాడ చేరితిని. అంత రాజమంద్రి తంతి నిచ్చి, తల్లికి నెమ్మది పడెనని తెలిసికొని, మనశ్శాంతి నొందితిని.

అంత తిరువూరు మున్నగు ప్రదేశములలో జరిగిన పరీక్షలలో నాయఁడు గారికి నేను సహాయకునిగ నుంటిని. రాఁబోవు సంవత్సరమున ననంతముగారు మరల నీపాఠశాలకు వచ్చుట కేర్పాటయ్యెను.

14 వ డిశెంబరున మాచెల్లెలు కనకమ్మ సుఖప్రసవమై కూఁతుని గనియెనని విని సంతోషించితిమి. ఆనెల 25 వ తేదీని మేము రాజమంద్రి వెళ్లి, చెల్లెలిని పిల్లను జూచితిమి. శిశువు మిగుల బలహీనగ నుండెను. మోగల్లులో మాతమ్మునిభార్య ప్రసవించె ననియు, కుమారుఁడు కలిగె ననియును మఱునాఁడు మాకుఁ దెలిసి, మే మమితానంద భరితుల మయితిమి.

డిశెంబరు 30 వ తేదీని మధ్యాహ్నమున తమ్ముఁడు నేనును వీథి చావడిలోఁ గూర్చుండి, యిన్నాళ్ల కీశ్వరుఁడు మరల మాకు సుఖదినము లొసంగెనే యని సంతోషమున ననుకొను చుంటిమి. మా మాటలను వెక్కిరించుటకో యన, ఆనిమేషముననే మాపెరటిలోనుండి కేకలు నేడ్పులును వినవచ్చెను ! పొరుగింటికిఁ బోయి వచ్చుచు, పెరటిలోని మా పెద్దబావిగట్టు దాటఁబోయి, మాపినతల్లి యాకస్మికముగ నీటిలోఁ బడిపోయెను ! వెంటనే మేము త్రాళ్లును గడలును వేయించితిమి. లాభము లేకపోయెను. అంతట పొరుగున నుండు నొక యువకుఁడును, మాతమ్ముఁడు సూర్యనారాయణయును నూతిలో నుఱికిరి. కాని, వీ రామెను వెలికిఁ దీయునప్పటికే యామె ప్రాణము లెగిరిపోయెను ! ఆమెకు మరల నూపిరి వచ్చుటకై యెన్నియో సాధనములు చేసితిమి. వేఁడిమి గలుగుటకై పాదములకు నరచేతులకును కర్పూరతైలము రాచితిమి. ప్రాణము రాలేదు. ఆరాత్రి యంతయు మే మామెశవము గనిపెట్టుకొని యుంటిమి. పాపము, మాముసలిముత్తువతల్లి మాతోడనే యుండెను. ఆమె దు:ఖ సముద్రమున మునిఁగిపోయెను ! వెనువెంటనే మా మేనమామలకు వేలివెన్ను తంతి నిచ్చితిమి. కూలివాని నంపితిమి. కాని, బంధువు లెవరును సకాలమున రాలేకుండుటవలన, మఱునాఁడు మేమె యామెకు దహనాదికర్మలు జరిపితిమి.

44. "మహలక్ష్మి మరణము"

1900 డిశెంబరు 30 వ తేదీని మరణించిన మాపినతల్లి, నాకంటె నాలుగైదుసంవత్సరములు మాత్రమే పెద్దది యగుటచేత, చిన్న నాఁడు వేలివెన్నులో నాకు సావాసురాలుగ నుండెడిది. బాల్యమున మాయుభయులకును మాతాతగారు పద్యములు లెక్కలును జెప్పుచుండువారు. దురదృష్టవశమున నీమెకు మంచి వివాహసంబంధము దొరక లేదు. వరునికి, ఆస్తిగాని విద్యగాని యంతగ లేవు. యౌవనమున దుర్వృత్తులలోఁ జేరి యాతఁడు తన స్వల్పభూవసతి కొల్లగొట్టెను. భార్యాభర్తలంత స్వగ్రామము విడువ వలసినవా రయిరి. మా పినతండ్రి యనేకగ్రామములలో బడులు నెలకొల్పి, కొన్ని నెల లచటనుండి, తన కచట బాగుగ జరుగుచుండలే దని యసంతృప్తి నొంది, మఱియొక ప్రదేశమున కేగుచుండువాఁడు ! ఇవ్విధమున ననేకగ్రామములు తిరిగినను, ఆయనపరిస్థితు లెంతమాత్రమును జక్కపడలేదు ! అప్పుడప్పుడు వా రిరువురును రాజమంద్రి వచ్చి కొంతకాలము మాతోఁ గడపి, మరల నెచటికైన వెడలిపోవుచుండు వారు.

నేను వారిసాహాయ్యమునకై కొంతకాలము నెలకుఁ గొంచెము సొమ్ము పంపుచుండు వాఁడను. వా రెటులో తమకు లభించిన కొలఁది యాదాయముతో కాలము గడపుకొనుచువచ్చిరి.

ఇటు లుండఁగా, మాచెల్లెలి ప్రసవసమయమున సాయము చేయుటకై మాపినతల్లి రాజమంద్రి వచ్చియుండెను. ఇంకఁ గొలఁది దినములు జీవించి యుండినచో, ఆమె తనభర్తయుండు గ్రామమునకు వెడలిపోయెడిదియే. కాని, యీశ్వరోద్దేశము వేఱుగ నుండెను ! 1901 వ సంవత్సరము జనవరి జనానాపత్రికలో నేను వ్రాసిన "మహలక్ష్మిమరణము" అను వ్యాసము, మాపినతల్లిని గుఱించినదియే. దానిలో నిటు లుండెను : -

'మంచివారికి మరణము ముందు' అను విదేశీయపుసామెతయు, 'సుకృతీ గతాయు:' అను స్వదేశలోకోక్తియు నొక యర్థమునే యిచ్చుచున్నవి. * * * "ఈ మధ్య స్వర్గస్థురాలైన శ్రీమతి మహలక్ష్మి హిందూ సద్వనితలలో నొకతె. * * * చనిపోవువఱకు నీమెకుఁగల బాధలు పలువురి కంతగాఁ దెలియవు. ఈమెహృదయము సముద్రమువలె గాంభీరమైన దని చెప్పవచ్చును. * *

"దేశాచారముచొప్పున నీమెను బాలప్రాయముననే యొక యువకుని కిచ్చి వివాహము చేసిరి. ఆచిన్న వాని విద్యాభివృద్ధి కెన్ని ప్రయత్నములు జరిగినను, తుద కతనికిఁ జదువు లభింపలేదు. * * కొంతకాలమునకు మహలక్ష్మి పతితోఁ గాఁపురము చేయునారంభింపఁగా, వాని యవగుణము లామెకు బోధపడెను ! * * ఆతని దుస్వభావము దుస్సహవాసములమూలమున మఱింత విజృంభించెను. సతిసుగుణము లాతనిమనస్సును ద్రిప్పఁజాలకపోయెను. దుశ్చేష్టల వలనను దుస్సాంగత్యమువలనను అతఁడు తన శరీర సౌష్ఠవమును గోలుపోయి నిరు పేద యయ్యెను. * * మహలక్ష్మి భర్తయెడఁ గొంచెమైనను కోపద్వేషములు వహింపక, అఱుగఁదీసినకొలఁది సువాసన లీను చందనమువలె బాధించు పతియెడ నమితదయతో నొప్పియుండెను.

"మహలక్ష్మి తన భర్తదుర్నయములను గుఱించి చుట్టములతోఁగాని చెలికత్తెలతోఁగాని ప్రస్తావింపదు. * * తన్నాతఁడు ప్రియురాలని భావింపకున్నను, వానికి హితబోధనము చేయుచు, వాని శ్రేయస్సునే కోరుచుండును. ఇదియేకదా నిజమైన పాతి వ్రత్యము !

"మహలక్ష్మి యిపు డీలోకము విడిచిపోయెను. ఎవని లోపములు గప్పిపుచ్చవలె నని యాసుదతి యహర్నిశము ప్రయత్నించెనో, అట్టి భర్తను వీడి తానే ముందుగ పరలోకప్రాప్తిఁ జెందెను. * * ఈమానినివలె ప్రశాంతియు నిర్మలప్రేమము నలవఱచుకొనిన సతీమతల్లులు స్వర్గలోకసుఖముల నందుటకు సందియము లేదు !"

ఈ 'జనానాపత్రిక' సంచికయె యింక రెండు మరణములు ప్రస్తావించెను. విక్టోరియా మహారాణిగారు జనవరినెల 22 వ తేదీని స్వర్గస్థు లయిరి. ఆనెలలోనే బొంబాయి ఉన్నతన్యాయస్థానమున న్యాయాధిపతులును దేశప్రముఖులును నగు రానడీగారు కీర్తి శేషులయిరి.

మా పినతల్లియుత్తరక్రియలు రాజమంద్రిలో మాయింటనే జరిగెను. తనచెల్లెలు చనిపోయిన యాఱవనాఁడు మాతల్లికి ప్రబలమగు మూర్ఛలు గానఁబడెను. అందువలనఁ గొన్ని దినములకుఁ గాని యా మెకు శక్తియు స్పృహయు రాకుండెను. కర్మాంతరము లైన పిమ్మట బంధువులు వెడలిపోయిరి. తనభార్యనగల సంగతి తేల్చినచోఁ దాను బోయివచ్చెద నని మాపినతండ్రి మాతో ననినపుడు నా కెంతో కోపము వచ్చినను, పిదప పరితాపము కలిగెను. తన భార్య కొంచెమునగలును జేత వేయించుకొని యాయన మన్యములలోనికి వెడలిపోయి మరల మాకంటఁ బడలేదు ! కొంతకాలమునకుఁ బిమ్మట మన్యములం దెచటనో యాయన చనిపోయె నని వారి బంధువులు చెప్పిరి.

నాతమ్ముఁడు వెంకటరామయ్య తిరిగి న్యాయశాస్త్రపరీక్షకు చెన్నపురి పోవలసివచ్చెను గావున, అతఁడు తిరిగి వచ్చువఱకును రాజమంద్రిలోని మాతల్లి సంరక్షణమునకై నాభార్య నచట నుంచి, నే వొకఁడనే 1900 జనవరిలో బెజవాడ వచ్చితిని. తమ్ముఁడు కృష్ణమూర్తి ప్రథమశాస్త్రపరీక్షలో తప్పెను. అతని చదువు సాములరీతి నా కేమియుఁ దృప్తికరముగ లేదు. 26 వ తేదీని అనంతముగారు బళ్లారినుండి బెజవాడకు వచ్చిరి. మే మందఱము రెయిలుదగ్గఱ వారిని గలసికొని పాఠశాలలో వారికొక విజ్ఞాపనము సమర్పించితిమి. మావిద్యాలయమున నలుగురు ప్రవేశ పరీక్షలో గెలుపొందిరి. తమ్ముఁడు సూర్యనారాయణ యాపరీక్ష నిచ్చెనని విని యానందభరితుఁడ నయితిని.

నా కిపుడు మరల గుండెమంటలు ప్రబల మయ్యెను. నేనే వంట చేసికొనుచువచ్చుటచేత, భోజనసౌకర్యము లేదు. అందువలన నాదేహమున నిస్సత్తువ యేర్పడెను. మాతమ్ముఁడు మద్రాసులో పరీక్ష నిచ్చి రాజమంద్రికి మరలివచ్చుటచేత, నాభార్య 11వ ఫిబ్రవరిని బెజవాడ తిరిగివచ్చెను.

45. "చిత్రకథామంజరి"

నేను దొరతనమువారి కొలువులోఁ జేర నిపు డాశింపఁ జొచ్చితిని! ఫిబ్రవరి 25 వ తేదీని నాకు స్కాటుదొరగారు వ్రాసిన జాబులో, నేను డైరక్టరుగారి కర్ఝీ పెట్టుకొనినచో, తాము చేయవలసినసాయము తాము చేతు మని యుండెను. మఱునాఁడు వీరేశలింగముగారియొద్దనుండికూడ లేఖ వచ్చెను. స్కాటుదొరగారి నాయన చూడఁబోఁగా, రాజమంద్రి కళాశాలలో నొక తాత్కాలికోద్యోగము చేయ నాకు సమ్మతమా యని దొరగా రడిగిరఁట. వెంటనే నే నొకయర్జీ నంపి, నా కీవిషయమున సాయము చేయుఁడని యుభయులను గోరితిని. ఈయూరు విడిచి రాజమంద్రి వెడలి పోవ మాయిద్దఱికి నిష్ట మే. ఈ సమయమున మాతమ్ముఁడు సూర్యనారాయణకు వివాహ సంబంధములు కొన్ని వచ్చెను. ఆతనికిఁ గట్నము లిచ్చెద మని పలువురు భ్రమపెట్టునప్పుడు, ఋణబాధతో నుండు మా కాతనిబెండ్లి యెడఁ గొంత సుముఖత్వము గలుగుచువచ్చెను. కాని, మే మావిషయమున నేనిర్ధారణమునకును రాఁజాల కుంటిమి.

"అక్కఱ కల్పనకు జనని" అను నొక లోకోక్తి యాంగ్లమునఁ గలదు. "జనానాపత్రిక" కు నెలనెలయును నేను బెక్కు వ్యాసములు వ్రాయవలసివచ్చెను. ఏదైన పుస్తక మారంభించి వ్రాయుచున్నచో, పత్రికకుఁ దగినంత మేఁత దొరకునని నే నిదివఱకు "హిందూసుందరీమణుల" రెండుభాగములును వ్రాసితినిగఁదా. ఇపుడు కొంతకాలమునుండి "ఇంగ్లీషువారి సంసారపద్ధతులు" కూడ తెలుఁగు చేసి పత్రికలోఁ బ్రచురించుచున్నాఁడను. కాని, యీపుస్తకములు వ్రాయుటలో నాస్వకపోలశక్తి యంతగ వ్యక్త మగుటలేదు. పద్యరూపమున నుండు పురాణకథలు గద్యమున లిఖించుటయందుఁగాని, యాంగ్లేయ పుస్తకము నొకటి యాంధ్రమున కనువదించుటయందుఁ గాని, స్వతంత్రరచనమున కవకాశ మేమిగలదు? సొంతకథ లల్ల నాకిపుడు కుతూహలము పొడమెను. 1901 మార్చినెల 'జనానాపత్రిక'లో "బాలాంబరాణి" యను నొక కథ వ్రాసి ప్రచురించితిని. దీని నాఱుప్రకరణములుగఁ జేసి, ప్రతిప్రకరణమునకు మకుటముగ నొకపద్యము నుల్లేఖించితిని. ఇదియొక విషాదాంతకథ. కొండవీటి రెడ్లనాఁటి కథగా దీని నేఁ జెప్పినను, చరిత్రాంశము లిం దేమియుఁ గానరావు. మఱుసటినెల పత్రికలో నింతె పరిమాణముగల "శారద" యనునొక సంతోషాంతకథను వ్రాసితిని. ఇట్లే తక్కినకథలును వ్రాసి, యీకథాసముదాయమునకు వీరేశలింగముగారి "నీతికథా మంజరి"ని బోలిన "చిత్రకథామంజరి" యను పేరిడితిని. ఈకథలలో మిగుల దీర్ఘమగునది "కృష్ణవేణి" ఇది కొంతవఱకు చరిత్రాత్మకమగు కథ యనవచ్చును. ఇటీవల చదివిన "కృష్ణామండల చరిత్రము" నుండి కొన్ని చిన్న యంశముల నూఁతగఁ గొని నే నీకథ నల్లితిని. ఇది నా కెంతో ప్రియమైనది. ఈ పుస్తకము మొదటి కూర్పులో చిత్రకథలు గానివికూడ కొన్ని చేర్పఁబడినవి. "నూర్జిహాను" "గాబ్రియలు సోదరి"యును చారిత్రగాథలే. 'ఉత్తమపుష్పము' ను చిన్నకథ యనుటకంటె వ్యాస మనియే చెప్పనగును !

మే మిటీవల బెజవాడలోఁ గొనినగేదెను కాయుటకు పొరుగుననుండు నొక బాలకుని నియమించితిమి. వాని యజాగ్రతచే నొకనాఁడది తప్పిపోయెను. దానిని వెదకుటకు వాని తలిదండ్రులు చూపిన యశ్రద్ధనుబట్టి వారల దుర్మంత్రములవలననే యీమోసము జరిగె నని మాకుఁ దోఁచెను. చుట్టుపట్టులగ్రామము లన్నియు నేను గాలించి వచ్చితిని. లాభము లేకపోయెను. పోలీసువారి వారింప లైన గమనింపక యాపిల్లవానితల్లి మమ్మూరక తిట్టిపోయసాగెను ! అంత పిల్లవానిమీఁదను వానితండ్రిమీఁదను మోసమునకు నే నభియోగము తెచ్చితిని. సబుమేజిస్ట్రేటు విచారణచేసి, పిల్లవానిని శిక్షించెను. కాని, పై న్యాయాధిపతి వానిశిక్షను రద్దుపఱిచెను.

ఇటీవల చనిపోయిన రానడిగారి సంగ్రహచరిత్రమును నే నాంగ్లమున వ్రాసి యొక బెజవాడసభలోఁ జదివి, "సంఘసంస్కారిణీ" పత్రికలోఁ బ్రచురించితిని. ఇంగ్లీషున "భీష్ము"ని గుఱించి యొక వ్యాసమువ్రాసి, రాజమహేంద్రవర ప్రార్థనసమాజవార్షిక సభలోఁ జదివించితిని. అదియు "సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రిత మయ్యెను. మూఁడేండ్లక్రిందటనే యల్. టి. పరీక్షలో విజయ మందినను, పట్టభద్రులసభ కిదివఱకు నేను వెళ్లియుండలేదు. 1901 మార్చి 27 వ తేదీని నే నాసభకుఁ బోవుటకు మద్రాసు బయలు దేఱితిని. బండిలో నరసింహరాయఁడుగారు మున్నగు మిత్రులు కానఁబడిరి. చెన్నపురిలో స్నేహితులు కొల్లిపర సీతారామయ్య గారియింట నేను బసచేసి, పరశువాక మేగి, వీరేశలింగము బుచ్చయ్యపంతులుగార్లను జూచితిని. మద్రాసు స్టాండర్డు పత్రికా సంపాదకీయ వర్గములోని బి. వరదాచార్యులుగారిని సందర్శించితిని. ఆయన మరల న న్నాపత్రికకు బెజవాడ యుపవిలేఖకునిగ నుండుఁడని కోరి, దినపత్రిక నంపుచువచ్చిరి. స్కాటుదొరను జూచితిని గాని యాయన నా కేమియు సాయము చేతుననలేదు.

మేరీకారిల్లయి వ్రాసిన "వెండెట్టా", "మైటీ ఆటమ్" అను నవలలను ఏప్రిలు నెలలోఁ జదివితిని. "సైతానువెతల" వలెనే 'వెండెట్టా'యును మిగుల మనోహరమగు విషాదాంత కథయే.

అంత మాపాఠశాలకు సెలవు లగుటచేత, మేయి 5 వ తేదీని బతలుదేఱి, ఏలూరుమీఁదుగ రాజమంద్రి వెడలిపోయితిమి. రాజమంద్రి స్టేషను నుండియే యత్తయు భార్యయు కాకినాడ పోయిరి. మాతల్లియు తమ్ములును త మ్మీచర్య చిన్న పుచ్చెనని తలపోసిరి !

46. వీరేశలింగముగారి సాయము

మా చెల్లెలికూఁతుని భారసాల 8 వ మే తేదీని జరుగఁగా పిల్లను దీసికొని తల్లిదండ్రులు అర్తమూరు మఱునాఁడె వెడలి పోయిరి. మా తమ్మునిభార్యను, పిల్ల వానిని మోగల్లునుండి తీసికొని రావలెనని నేను మాతమ్ముఁడును 12 వ తేదీని రాజమంద్రినుండి బయలుదేఱి, మఱునాఁటి ప్రొద్దున్న మోగల్లు చేరితిమి. అందఱు నచట సేమమె. పిల్లవాఁడు బాగుగనే యుండెను గాని, వట్టి బలహీనుఁడు. మావాండ్రను దీసికొనిపోయెద మని మే మనఁగా, మేము బారసాలను వైభవముగ నచట జరిపినఁ గాని తల్లిని పిల్లవాని నిపుడు పంప వలనుపడదనియు, లేనిచో రాఁబోవుసెలవులలో మా యింటికే వారిని మేము తోడుకొనివచ్చి బారసాల చేసికొనవచ్చుననియు, నరసయ్యగారు చెప్పివేసిరి ! కోపస్వభావుఁడగు మాబావ షరతులకు మే మంగీకరించి మరలి వచ్చితిమి.

అంతట సోదరుల మిద్దఱమును రాజమంద్రి వెంటనే విడిచి, వేలివెన్ను మార్గమున గోటేరు పోయి, మా ఋణదాత దర్శనముఁ జేసికొని, తణుకు వచ్చితిమి. అచట నొక యున్నతపాఠశాలను నెలకొల్పు ప్రయత్నములు జరుగు చుండెను. నన్ను దానికి ప్రథానోపాధ్యాయునిగ నుండుఁడని పలువురు కోరిరి. కాని, తగినంత స్థిరత్వము లేని పాఠశాలలోఁ బ్రవేశింప నా కిష్టము లేదు.

ఆ సంవత్సరమున గోదావరి మండలసభలు అమలాపురమున జరుగవలసి యుండెను. నన్నా సభలకు స్నేహితు లాహ్వానించిరి. సాంబశివరావు కామేశ్వరరావుగార్లతోఁ గలసి నేను 26 వ మేయి తేదీని అమలాపురము బయలుదేఱితిని. మండల రాజకీయసభకుఁ బోయి, "స్టాండర్డు" పత్రిక యుపవిలేఖకునిగ వార్తలు వ్రాసి యా పత్రిక కంపితిని. 28 వ తేదీని సంఘసంస్కరణసభ జరిగెను. దానికి గోటేటి శివరావుగా రధ్యక్షులు. 'వేశ్యాజననిషేధము' 'వితంతూవివాహప్రోత్సాహము' లను గుఱించిన తీర్మానములు నేను బ్రతిపాదించితిని. గోదావరిమండలస్థాయి సంఘములో నన్నొకసభ్యు నిగఁ జేరు మని యెంద ఱెంతగఁ జెప్పినను నేను సమ్మతింపలేదు ! వేఱుమండలమున నివసించునా కీ మండలసమాజసభ్యత్వము బరుపులచేటని నేఁ దలంచితిని. దీనికి నన్నుఁ గొందఱు నిందించిరి. మఱునాఁడు విద్యావిషయక సభ జరిగెను. 30 వ తేదీని మే మందఱము బయలు దేఱి రాజమంద్రి వెడలివచ్చితిమి.

1 వ జూను తేదీని నేను మా బంధువులను జూచుటకు కాకినాడ పోయితిని. నా కచట నొక వైద్యునితోఁ బరిచయము కలుగఁగా, తల్లికిని భార్యకును వారియొద్దఁ గొంతమందు పుచ్చుకొంటిని. అచట నున్నదినములలో 'రాజాగారి కళాశాల'లో నొక యుద్యోగము ఖాళీయగుననియు, నా కది లభింపఁగల దనియు మిత్రులు చెప్పిరి. 20 వ తేదీని మరల మేము బెజవాడ ప్రవేశించితిమి.

సంఘసంస్కరణోద్యమ ప్రచారమునకై నేను గొందఱు మిత్రులతోఁ గలసి, 6 వ జూలయిని బాపట్ల బయలుదేఱితిని. మార్గ మధ్యమున మమ్ముఁ గొందఱు మిత్రులు గలసికొనిరి. మే మందఱము నచట నుపాధ్యాయులగు బొప్పూడి వెంకటప్పయ్యగారియింట బస చేసితిమి. డిస్ట్రిక్టుమునసబుగారు బహిరంగసభ కధ్యక్షులు. విన్నకోట కోదండరామయ్య రాజగోపాలరావుగార్లు ప్రారంభించిన చర్చలో మే మందఱమును పాల్గొంటిమి.

పూర్వము పాఠశాలకార్యక్రమము సాగించుటలో అనంతముగారికి సామాన్యముగ నేను సహాయము చేయుచుండు వాఁడను. ఇపు డాయన, సాంబమూర్తిగారు మున్నగు క్రైస్తవ బోధకుల సలహా పుచ్చుకొనుచు, వారల చేతనే కాలనిర్ణయపట్టిక మున్నగునవి సిద్ధము చేయించుట. నాకును తక్కిన యుపాధ్యాయులకును నసమ్మతముగ నుండెను. పాఠశాలలో జరుగుచుండెడి దుర్నయములను గుఱించి నే నొక పెద్దయుత్తరము వ్రాసి, అనంతముగారికి 18 వ జూలయిని బంపితిని. ఆరోజునను మఱునాఁడును జబ్బుగా నుండుట చేత నే నింటనే యుంటిని. మిత్రులతోఁ గలసి యొకసాయంకాలమున ననంతముగారు నన్నుఁ జూడవచ్చి, కాలనిర్ణయ పట్టికను నన్నుఁ దయారుచేయు మనిరి. నే నందుకు సమ్మతింపనందున, సరియైన యేర్పాటులు జరుగకుండుటకు నేనే కారణముగదా యని వారనిరి ! కాని, యందఱియెదుటను నేను నిజము విప్పిచెప్ప సాహసింప కుంటిని.

క్రొత్తయేర్పాటులచొప్పున పాఠశాలలో నాకుఁ బని హెచ్చి తీఱిక తక్కువ యయ్యెను. నా దేహమున నిటీవల నసిగా నుండుటలేదు. సంవత్సరముల కొలఁది వార్తాపత్రికల పనులు చేయుటకు నే నెంతయు విసిగియుంటిని. 1901 వ సంవత్సరము జూను 'జనానాపత్రిక'లో స్వవిషయము అను శీర్షికక్రింద నే నిట్లు వ్రాసితిని : - "ఈ పత్రికతో మా 'జనానాపత్రిక' కెనిమిది సంవత్సరములు గడచినవి. జూలయినెలలో 9 వ సంవత్సరము ప్రవేశ మగును. * * * ఇంగ్లీషుమాసపత్రిక లెంత చక్కఁగ నుండునో చూడుఁడు ! వేల కొలఁది చందాదారు లుండుటచేతనే యాపత్రికలు చౌకగ నమ్మఁబడు చున్నవి. అందలి విషయములు బొమ్మలును రమ్యముగ నుండును. మనదేశమం దన్ననో, పత్రికాధిపతి తన తీఱిక కాలమును, సొమ్మును పత్రిక కుచితముగ నీయవలసినదే ! పత్రికకు వ్యాసములు వార్తలు మున్నగునవి ముఖ్యముగ నాతఁడే వ్రాయవలయును. ఇతరు లతనికి సాయము చేయరు ! పత్రికలను చందాదారుల కంపుట, ఉత్తర ప్రత్యుత్తరములు నడుపుట, సొమ్ము వసూలు చేయుట, మొదలగు పత్రికపను లన్నియు నాతనిమీఁదనే పడును ! కావున పత్రికాసంపాదకత్వము సంతోషజనకము గాక, యతని కొక శిక్షగా నగుచున్నది !

"ఇట్టి బానిసపనుల కీ జనానాపత్రికాధిపతియు లోనైయున్నాఁ డని వేఱె చెప్పనక్కఱలేదు ! ఎల్లకాలము నేకరీతిని కష్టపడుటకు మానవప్రకృతి యోరువఁ జాలదు ! * * * కాఁబట్టి మా కీ సత్కార్యమున సహాయము చేయుఁ డని యార్యులను విద్యాధికులను వేఁడుచున్నాము."

ఇపుడు చెన్నపురిలో ముద్రాలయమును నెలకొల్పి జరుపుచుండు వీరేశలింగము పంతులుగారిని, "జనానాపత్రిక" ముద్రణాదికార్యకలాపమును గైకొనుఁ డని కోరుచును, నేను పత్రికా సంపాదకునిగ నుందునని చెప్పుచును నే నొక లేఖ వ్రాసితిని. ఆయన దీనికి సమ్మతించి, తాము స్థాపింపనున్న యొక వార్తాపత్రికకు ఆంగ్ల వ్యాసములు వ్రాయుఁడని జూలయి 22 వ తేదీని నాకు లేఖనంపిరి. మఱునాఁడే వారికి వందనము లర్పించుచు నేను బ్రత్యుత్తర మిచ్చితిని. కాని, వెనువెంటనే బ్రాహ్మసమాజమువారి ముద్రాలయమునుండి నా పత్రికను దీసివేయలేకయు, పాఠశాలలోని పనితొందరవలనను, నే నొక నెల యాలసించి, ఆగష్టు 23 వ తేదీని పంతులుగారి కీ విషయమున జాబు వ్రాసితిని. దీనికి పంతులుగారు 28 వఆగష్టున పెద్ద ప్రత్యుత్తర మిచ్చిరి. నేను జేసిన యాలస్యమునకు నామీఁద వారి కాగ్రహము జనించెను. వా రిపుడైనను మా పత్రికకు సాయము చేయ సిద్ధముగ నుంటి మనుటచేత, నేను సెప్టెంబరుసంచిక మొదలు మాపత్రికను వారి కొప్పగింప నిశ్చయించుకొని, 30 వ ఆగష్టున మొదటివ్యాసము వ్రాసి వారి కంపితిని. 1901 సెప్టెంబరునుండియు "జనానాపత్రిక" వీరేశలింగముగారి 'చింతామణిముద్రాలయము'న నచ్చొత్తింపఁబడెను. సెప్టెంబరు పత్రికలో నే నిట్లు వ్రాసితిని : - "తెలుఁగుజనానాపత్రిక" విషయమై మేము పడుచుండు కష్టములు చూచి స్త్రీవిద్యాభిమానులలో నగ్రగణ్యులగు శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు మా పత్రికను నడుపుభారము కొంత తాము వహించెద మని దయతో వాగ్దానము చేసియున్నారు. ఈ సాహాయ్యమునకు వారి కెంతయు కృతజ్ఞులము. ముందునుండి మా పత్రిక వారి ముద్రాక్షరశాలలో ముద్రితమై చెన్నపురినుండి ప్రకటింపఁబడును. చందాధనము చెన్నపురికిని, వ్యాసములు మున్నగునవి బెజవాడకును, బంపవలయును. * * *

" * * * శ్రీ పంతులుగారు మా పత్రికను చౌకగనే ముద్రింపించెదమని సెలవిచ్చిరి. పత్రికాప్రకటనము, చందాల వసూలు, మున్నగు కష్టకార్యము లన్నియు నుచితముగఁ జేయ పంతులుగా రంగీకరించిరి. వీరి యౌదార్యమునకు వందనములు చేయుచున్నాము. * * *

"శ్రీ వీరేశలింగముగారి యాదరణమున నీపత్రిక వర్థిల్లఁగలదని యెంచుచున్నాము."

మొదటినెలనుండియే వీరేశలింగముగారు మా పత్రికకుఁ దాము వ్యాసములుకాడ వ్రాయుచువచ్చిరి. సెప్టెంబరు అక్టోబరు సంచికల యందలి "శ్రీ అలెగ్జాండ్రామహారాజ్ఞి చరిత్ర"యు అక్టోబరు సంచికలోని "ఉత్తమమాత" యును, వీరు వ్రాసినవియే. ఈ సాయమే కాక, తమయొద్దనుండు ప్రతిమల దిమ్మెలు మా పత్రిక యుపయోగమునకు వీ రొసంగుచుండెడివారు.

47. ఉద్యోగప్రయత్నము

వీరేశలింగముగారి సాయమున "జనానాపత్రికా" ప్రచురణ భారము నాబుజములనుండి చాలవఱకు తొలఁగిపోయెను. అనంతముగారే మరల బెజవాడపాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగను, అధికారులుగను వచ్చినను, ఈమాఱు వారి పరిపాలనము నా కంతగ నచ్చలేదు. ఆయనపేరు చెప్పి పెద్దయుపాధ్యాయులమీఁద చిన్నవార లధికారము చెల్లించుట కడు దుస్సహముగ నుండెను ! నాయెడ ననంతముగారి వైఖరి యిట్లు మాఱిపోవుట చూడఁగా, నే నీపాఠశాలలో నుండుట వారి కిష్టము లేకుండునట్లు తోఁచెను! కావున నే నీసంవత్సరాంతమున వేఱుపాఠశాలకుఁ బోఁయి, స్వగౌరపరక్షణము చేసికొనుట కర్తవ్యముగఁ గానిపించెను. అంత మాసిన న్యాయశాస్త్రపుఁజదువులు మరల నేను విప్పితిని. వెనుకటిచుఱుకుఁదనము లేకున్నను, ఒకరీతిని నే నాపుస్తకములు తిరుగవేసితిని.

మాతల్లికిఁ దఱచుగ వ్యాధి వచ్చుచుండుటవలనఁగూడ నా మనస్తాప మతిశయించెను. 4 వ సెప్టెంబరున మా తమ్మునియొద్ద నుండి వచ్చినయుత్తరములో, ఇటీవల చేసిన జబ్బులో నీరసముచేత ధృతిచెడి యామె యేడ్చెనని యుండెను !

అప్పుడప్పుడు నేను సమావేశపఱుచు సభలు మున్నగునవి నామనస్సున కొకింత యుపశమనము గావించెను. 7 వ సెప్టెంబరున ముగ్గురు స్నేహితులము మరల బాపట్లకు దండయాత్ర సాగించితిమి. మిత్రులు విన్నకోట కోదండరామయ్యగారు సంస్కారపక్షమువారి వాదమును వ్యక్తపఱిచిరి. పూర్వాచారపరుల పక్షమున నూజివీడు వాస్తవ్యులగు సూర్యనారాయణశాస్త్రిగారు, ప్రసంగించుచు, పూర్వ స్మృతికర్తలకు వితంతూద్వాహము లంగీకారమే కాని, పరాశరునికి మాత్ర మని యసమ్మత మని నుడివిరి. మఱియెవరును బ్రసంగింపకయె యధ్యక్షులు సభ విరమించి మా కాశాభంగ మొనరించిరి!

1901 సం. 9 వ సెప్టెంబరు వార్తాపత్రికలలో నెల్లూరు నందలి వెంకటగిరి రాజాగారి పాఠశాలకు ప్రథమోపాధ్యాయుఁడు కావలె ననుప్రకటనము గలదు. నేను దరఖాస్తు నంపితిని. నన్ను గుఱించి సిఫారసు చేయుఁడని యొకరిద్దఱు నెల్లూరుమిత్రులకు నేను వ్రాసినను, నా కీయుద్యోగ మగునని యాశలేదు.

మేము బెజవాడలో నివసించు బంగాళా నిశ్శబ్దమగు ప్రదేశ మందలి తోఁటలో నుండెను. చుట్టుపట్టులఁ జేరువ నిం డ్లేవియు లేవు. సమీపమున నుండునవి క్రైస్తవమహమ్మదీయుల గోరీలదొడ్లు మాత్రమే ! పాఠాశాలలోఁ బను లుండియు, బహిరంగసభలలోఁ బాల్గొనుచును, రాత్రులు నే నింటి కాలస్యముగ వచ్చునపు డెల్ల, ఒంటరిగ నింట నుండు నాభార్య దిగులుపడుచుండెడిది. 11 వ సెప్టెంబరున రాత్రి నే నాలస్యముగ నిలు సేరునప్పటికి నాభార్య విలపించు చుండెను. ఈ యిల్లు విడిచి యింకొక ప్రవేశమునకుఁ బోవుట యుక్త మని నా కంత తోఁచెను.

బాలికాపాఠశాలల పరీక్షాధికారి స్వామిరావుగారు 22 వ సెప్టెంబరున నా కగపడి, 'జనానాపత్రిక'లో మతవిషయక చర్చలు జరుగుచున్న వని పెద్దపరీక్షాధికారిణి కారుదొరసానిగారి యభిప్రాయ మని నాకుఁ జెప్పిరి. నే నేమిచేయను ? తెలుఁగుతెలియని యీ యధికారి ప్రముఖులు 'జనానాపత్రిక' ను గుఱించి వట్టి యపోహములు పడుచున్నారు ! కొలఁదిరోజులలో నే నాకాం తను బెజవాడలోఁ గలసికొని మాటాడఁగా, నిజము తెలిసికొని యామె నాపత్రికదెస మరల సుముఖి యయ్యెను !

17 వ అక్టోబరున నేను భార్యయు రాజమంద్రి వెళ్లి మావాండ్రను జూచితిమి. మా తమ్మునికుమారుఁడు నరసింహము, చెల్లెలికూఁతురు నరసమ్మయును మంచి యారోగ్యము లేకయుండిరి. కుటుంబ మంతయు బెజవాడ వచ్చినచో నందఱమును గలసి హాయిగ నుందు మని నేను మా తమ్మునికి బోధించితిని.

మఱునాఁటి "మద్రాసుస్టాండర్డు" పత్రికలో పర్లాకిమిడి కళాశాలలోని యుపాధ్యాయుఁ డొకఁడు నెల్లూరు వెళ్లిపోయె నని యుండుటచూచి, నా కా యుద్యోగము లభింపఁ బ్రయత్నింపుఁ డని మిత్రులు రాజగురువు పైడిగంటము కృష్ణారావుగార్లకు వ్రాసితిని. మే మంత బంధుదర్శనార్థమై కాకినాడ వెళ్లితిమి. నా కీ పర్లాకిమిడి యుద్యోగమునుగూర్చి సాయము చేయుడని స్కాటుదొరగారికి వ్రాసి, పర్లాకిమిడి కళాశాలాధికారికి దరఖాస్తు నంపితిని. పాఠశాలల పరీక్షాధికారినుండి సిఫారసు తీసికొని, యది పర్లాకిమిడి పంపితిని.

నేను బెజవాడకు 9 వ అక్టోబబరున తిరిగివచ్చితిని. అచట నాకు వెంకటరత్నమునాయఁడు గారు కానిపించి, తమ తమ్ముని భార్య చనిపోయె నను దు:ఖవార్త చెవిని వేసిరి. ఇపు డీ యన్నదమ్ము లిరువురును కళత్రవిహీను లయిరని వగచితిని. ఆసాయంకాలము నేను బసకు వచ్చుచుండఁగా, దారిలో నొకచోట విపద్దశనుండు నొక మనుజుని దీనాలాపములు వినవచ్చెను ! నే నచటికిఁ బోయి చూడఁగా, ఒక యూరపియను వలంటీరు తన చాకలివాఁడు సరిగా బట్ట లుదక లేదని కోపించి, వానిని మోదుచుండెను ! నే నడ్డుపడి, వానికి బుద్ధిచెప్పెద నని పలికి, చాకలిని విడిపించితిని.

నే నిపుడు పర్లాకిమిడి యుద్యోగమునకై గట్టిప్రయత్నము చేసితిని, అనంతముగారు తాము దయతో సిఫారసు చేయుటయేకాక, మద్రాసు నందలి తమతోడియల్లునికి నన్ను గుఱించి వ్రాసి, నాకుఁ దోడు పడుఁ డని వారిని గోరిరి. క్లార్కు పాలుదొరలను, నాగోజీరావు పంతులుగారిని, నా కీ యుద్యోగవిషయమై సాయము చేయుఁడని నేను వేఁడితిని.

48. తమ్మునివ్యాధి

నే నీమాఱు బెజవాడ యొంటరిగ వచ్చుటచేత, గోపాలమను విద్యార్థి యువకుఁడు నా కీదినములలో వంట చేసిపెట్టు చుండువాఁడు. ఆతనిది నెల్లూరువంట. వంటకము లన్నియు జిహ్వకు మందులవలెఁ దగులుచుండెను ! ఎటులో చేదు మ్రింగునట్లు నే నన్నము దినుచు, దినములు పుచ్చుచుంటిని.

విద్యార్థులు, తమ "ప్రసంగసమాజ" వార్షి కోత్సవ సమయమున నన్నొక యుపన్యాస మీయు మని కోరిరి. "బోధకుల విధులు" అను నొక యాంగ్లవ్యాసము వ్రాసి, 3 వ అక్టోబరున సమాజసభలోఁ జదివితిని. విద్యార్థులు నుపాధ్యాయులు నది మెచ్చుకొనిరి. "సంఘసంస్కారిణీ" పత్రికలో నది ప్రకటిత మయ్యెను.

రెండవ నవంబరున రాజమంద్రినుండి వచ్చిన యుత్తరములో, తమ్ముఁడు సూర్యనారాయణకు ఎక్కువగ జ్వరము వచ్చె ననియు, నన్ను తక్షణమే రమ్మనియు నుండెను. ఆ సాయంకాలమునకు రాజ మంద్రి చేరితిని. సూర్యనారాయణకు జ్వరము కొంత తగ్గె నని చెప్పిరి గాని, యింకను తీవ్రముగనే యుండెను. నారాక వలన వాని కెంతో ధైర్యము కలిగెను. తనకు గుంటూరుచెప్పులజోడు తెచ్చి పెట్టుమని వాఁడు ప్రాధేయపడెను. ఒక క్రొత్తపంచెయు గొడుగును నే నీయఁగా, వాఁ డెంతో సంతోషించెను. "అయ్యో నాదారిద్ర్య మెంత దు:ఖభాజనము ! తండ్రికి జీవితకాలమున సౌకర్యము లొనఁ గూర్పనైతిని. ఇపుడు నా తోఁ బుట్టినవానికోరికలు చెల్లింప నేరకున్నాను !" అని నేను లోలోన వగచితిని. త్వరలో నేను మరల వచ్చెద నని తమ్ముని సమాధానపఱిచి, 4 వ నవంబరున నేను బెజవాడ వెడలిపోయితిని. తమ ప్రియశిష్యుఁడు సూర్యనారాయణ జబ్బు పడె నని విని, నా యుపాధ్యాయమిత్రు లందఱు బెజవాడలో ఖిన్నులైరి.

బెజవాడలో 18, 19 నవంబరున చట్టనిర్మాణసభల కెన్నికలు జరిగెను. పురపాలకసంఘముల తరపున కృత్తివెంటి పేర్రాజు పంతులుగారును, స్థానిక సంఘములపక్షమున జంబులింగమొదలియారు గారును నియమింపఁబడిరి. నాతోడి బోధకుఁడు కల్యాణరామయ్యరుగారు మెయిలుపత్రికకును, నేను స్టాండర్డుపత్రికకును ప్రతినిథుల మై సభలలోనికి వెళ్లి, సమాచారములు వ్రాసి పత్రికల కంపితిమి.

నేను జేసిన కృషిఫలితముగ, పర్లాకిమిడి కళాశాలాధికారి యగు టెయిలరు దొరనుండి నాకొక జాబు వచ్చెను. తమ విద్యాశాలలోని క్రిందియుపాధ్యాయులకు క్రమముగ పైయుద్యోగము లిచ్చెద మనియు, అందువలన నాకు డెబ్బదిరూపాయల పనిమాత్ర మీయఁగలమనియు వారు వ్రాసిరి. ఇచటనే 85 రూపాయిలు జీతము గలనాకు 70 రూపాయిలపని యిచ్చెద మనుట నిరుత్సాహకర మయ్యును, నాసంగతి యాకళాశాలాధికారి తలపెట్టినందుకే నేను సంతోషించితిని ! కొలఁదినెలలలో నా కిచటనే 90 రూపాయిల జీత మిచ్చెదరు గాన, నాకుఁ దగినవేతన మొసఁగినచో, పర్లాకిమిడి వచ్చెదనని నేను మఱునాఁడే యాయుద్యోగీయునికి ప్రత్యుత్తరము వ్రాసితిని.

నే నిదివఱకే భీష్మునిగుఱించి యాంగ్లవ్యాస మొకటి వ్రాసి ప్రచురించితిని. ఇపుడు కార్లయిలుని "శూరుల" వంటిపుస్తకము నాంగ్లమున రచియింపఁబూని, "ప్రహ్లాదుఁడు - దేవుని ప్రియభక్తుఁడు", "అర్జునుఁడు - సాధకుఁడు" అను శీర్షికలతో నేను గొన్ని వ్యాసములను వ్రాయనెంచితిని.

23 వ నవంబరు దినచర్యలో నిట్లు గలదు : - "గతరాత్రి భార్యయు నేనును పర్లాకిమిడి యుద్యోగము నాకుఁ గావచ్చునని యెంచి, భావవిషయములను గుఱించి తలపోసితిమి. 'ఎపిక్టిటసు'చదివి, యందలి రమ్యములగు కథపట్టు లామెకు బోధపఱిచితిని. * * నేఁడు మరల గృహకల్లోలము ! అనుతాపలేశ మెఱుంగని గర్విణియగు సతితో సంసార మెట్లు పొసంగును ?"

8 వ డుసెంబరున బంగాళావాస్తవ్యులు విపినచంద్రపాలు గారు మద్రాసునుండి వచ్చి నా కతిథులయిరి. వారికిఁ గావలసిన సౌకర్యములు నే నొనఁగూర్ప లేకుంటిని. "కాఫీ" మేము చేయలేక పోయితిమి. కాఫీ చేయ నేరని కుటుంబపు జీవితము వ్యర్థమని వారు చెప్పివేసిరి ! ఆసాయంకాలము వా రొక యుపన్యాస మిచ్చి, మఱునాఁడు వెడలిపోయిరి.

19 వ డిసెంబరునాఁటికి పాఠశాలపనియు, ప్రాథమికపరీక్ష పనియుఁ బూర్తియయ్యెను. తమ్ముఁడు సూర్యనారాయణ జ్వరము తిరుగఁబెట్టెనని యా రోజుననే నాకు జాబు వచ్చినను, వెంటనే బయలుదేఱలేకపోయితిని. బెజవాడలో వ్రాఁతపని పూర్తిపఱుచుకొని, 21 వ తేదీని ఏలూరు వెళ్లితిని. పర్లాకిమిడినుండి మద్రాసు తిరిగిపోవుచుండు పాలుపీటరుపిళ్ల గారిని నేను రెయిలుస్టేషనులోఁ గలసికొంటిని. పర్లాకిమిడి పనికి ఇద్దఱు యం. యే. లును, పెక్కు మంది యితరులును దరఖాస్తు పెట్టిరనియును, నా కది లభింపవచ్చు ననియును వారు చెప్పిరి. మా పెదతండ్రి కుమారుఁడు పట్టాభిరామయ్య చనిపోయెనను దు:ఖవార్త 22 వ తేదీ సాయంకాలమున నేలూరులో నాకుఁ దెలిసెను. మఱునాఁడు ప్రొద్దుననే యుభయులమును రాజమంద్రి బయలుదేఱితిమి.

49. సూర్యనారాయణుని నిర్యాణము

1901 డిసెంబరు 23 వ తేది సాయంకాలమునకు రాజమంద్రిలో దిగి మే మింటికిఁ బోవునప్పటికి, సూర్యనారాయణకు మిక్కిలి జబ్బుగా నుండెను. గత రాత్రియే వానికి సంధిగుణము ప్రవేశించె నని చెప్పి వెంకటరామయ్య విలపించెను. రోగి నన్నుఁ జూచి మిగుల సంతోషపడెను. నే నేమి క్రొత్తవస్తువులు తెచ్చితినో చూపుమని వాఁడు నన్నడిగెను. 'నాకు బందరుచెప్పులు తెచ్చి పెట్టితివా?" యని వాఁ డడుగునపుడు, లే దని చెప్పుటకు నేను మిగుల నొచ్చుకొంటిని. వైద్యుఁడు కోటయ్యనాయఁడుగారిని దీసికొనివచ్చి చూపించితిమి. రెండు శ్వాసకోశములును బంధించె ననియు, సన్ని పోతము ప్రబలె ననియును, ఆయన చెప్పివేసిరి. మేము క్రమముగ మందు లిచ్చుచు రాత్రి జాగరము చేసితిమి. మఱునాఁటికి వానివ్యాధి ముదిరెను. శ్లేష్మప్రకోపమువలన రోగి యొత్తిగిలలేకుండెను ! ఊపిరి పీల్చుట కష్టమయ్యెను. అంత దేశీయవైద్యు నొక నిని బెట్టితిమి. ఆతని మందులును శ్లేష్మము నరికట్టలేకపోయెను. సంధి విజృంభించి, రోగిదేహము వణఁకెను. రాత్రి 11 గంటలకు మా తమ్ముఁడు మృత్యువువాతఁ బడిపోయెను !

మా చిన్ని తమ్ముఁడు మరణమొందె నని మేము నమ్మలేకపోయితిమి ! ఆ ముద్దుమోము, దృఢకాయము, ఉన్నతాకారము, నయ వినయములు, అసమానబుద్ధి వికాసమును, తలపోసి తలపోసి మేము విలపించితిమి !

మాకు ప్రపంచ మంతయు నంధకారబంధుర మయ్యెను ! మే మిట్టి దు:ఖావస్థ నెపుడు ననుభవింపలేదు. 3 సంవత్సరముల క్రిందట మరణము నందిన మాతండ్రియు, గత సంవత్సరమం దీదినము లందు కాలగతినొందిన మాపినతల్లియు, కొంతకాలము జీవించిన యనుభవశాలురు. ఇపుడు చనిపోయిన మా తమ్ముఁడు వట్టి పసరిక పిందెయే ! ముద్దుమాటలు, కొంటెతనఁపుఁ జేష్టలును, - వీని నింకను సరిగా వీడనేలేదు ! అట్టి పిల్లవానికి సంభవించిన యకాలమరణమునకై మే మమితముగ వెతనొందితిమి. ఈ పాపిష్ట రాజమహేంద్రవరపట్టణ మిఁక వదలిపెట్టి, బెజవాడవంటి క్రొత్తప్రదేశమునకు సంసారము తరలించుట మంచి దని మే మందఱము తలంచితిమి. 'జనానాపత్రిక' 1902 సంవత్సరము జనవరిసంచికలో మాతమ్మునిగూర్చి నే నిట్లు వ్రాసితిని : - "ఈ పత్రికాధిపతి కనిష్ఠసోదరుఁడగు సూర్యనారాయణ యను 18 సం. వయస్సుగల చిన్నవాఁడు గత డిసెంబరు 24 వ తేదీని జ్వరపీడితుఁడై లోకాంతరగతుఁ డయ్యె నని తెలుపుట కెంతయు విచారకరముగ నున్నది. ఈతఁడు 'జనానాపత్రిక' కు వ్యాసములు వ్రాయుచువచ్చెను. విద్యాధికత చేతను, బుద్ధి తీక్షణముచేతను, వినయాది సద్గుణములచేతను శోభిల్లు చుండెడి యీబాలుని యకాలమరణము మిగుల దుస్సహముగ నున్నది. దయామయుఁడగు భగవంతుఁ డీతనియాత్మకు శాంతి నొసంగుఁగాక !"

సూర్యనారాయణకు గణితశాస్త్రమునం దసమానప్రజ్ఞ గలదు. నాయొద్ద కొన్ని సంవత్సరముల క్రిందట బెజవాడ పాఠశాలలో 4 వ ఫారములో వీఁడు చదువుచుండునపుడు, తరగతిలో నే నెంత చిక్కులెక్క లిచ్చినను, అందఱికంటె మున్ముందుగనే లెక్కచేసి, ముసిముసినవ్వులు నవ్వుచు, నాయొద్దకు వచ్చుచుండువాఁడు ! అతఁడు ప్రవేశపరీక్షనిచ్చి రాజమంద్రికళాశాలలో ప్రథమశాస్త్రతరగతిలో 1901 వ సంవత్సరమునఁ జదివెను. గణితశాస్త్రమునం దితనికిఁ గల సమర్థతను గనిపెట్టి, అధ్యాపకులు వీనియం దమితానురాగము గలిగియుండిరి. కళాశాలలోఁ దానొకసంవత్సరమే చదివినను, ఈతఁడు గణితశాస్త్రపుస్తకము లందలి చిక్కులెక్కలు పెక్కులు చేసి తనపుస్తకమున నెక్కించి యుంచుకొనెను ! ఈతని యకాల మరణము ఉపాధ్యాయులకు, సహపాఠీయులకును గడు విషాదకరముగ నుండెను. ఇటీవల నింట చిన్న పను లన్నియు నీతఁడే చేయుచుండువాఁడు. ఈతని నయవినయములు దలఁచుకొనినప్పుడు, మా కందఱికిని గుండె నీఱైపోవుచుండెను ! మా సోదరుల కెవరికిని బ్రాప్తింపని యున్నతవిద్య నీతనికిఁ జెప్పించి ముందు మంచిస్థితి కీతనిఁ గొని రావలెనని మే మనుకొనెడివారము. ఇపుడు మాయాశ లన్నియు నీటఁగలసెను ! మాతల్లి కీపిల్లవాని మరణము కడు దుస్సహ మయ్యెను. అందఱము నీ దుర్భరవిషాద మనుభవింపవలసినవార మైతిమి !

50. సందిగ్ధావస్థ !

కాఱుమబ్బులు క్రమ్మిన యాకసమం దొకప్రక్క మేఘము తొలఁగిపోయి, సూర్యకిరణ ప్రసార మొకింత కలిగినట్లు, ఈ దు:ఖసమయమున మా కొక సంతోషవార్త వినవచ్చెను ! నాకు దొరతనమువారికొలువులో నుద్యోగ మయ్యె ననియు, నరసారావుపేటలో సహాయపరీక్షాధికారిగ నియమింపఁబడితి ననియు నొక స్నేహితుఁడు చెప్పెను. దీనినిగుఱించి విచారింపఁగా, ఇది సత్య మని తేలెను ! మరల మేము తల లెత్తుకొనసాగితిమి. అందఱము నరసారావుపేట పోవుట యుక్త మనుకొంటిమి. ప్రస్తుతమున నే నీపనిలోఁ బ్రవేశించినచో, కళాశాలలో నాకుఁ బిమ్మట మంచియుద్యోగ మిప్పింతు నని స్కాటుదొర వ్రాసి, మాతమ్ముఁడు చనిపోయినందుకు తన విచారమును దెల్పెను.

నా కీసమయమునందే, పర్లాకిమిడి కళాశాలలో నూఱురూపాయిల వేతనముమీఁద ప్రకృతిశాస్త్రోపన్యాసకపదవి నిచ్చితిమని, యాకళాశాలాధికారి టెయిలరుదొర వ్రాసెను ! నేను బెజవాడ పాఠశాలలోనే యుండినయెడల నెక్కువజీత మిప్పించెద మని అనంతముగారు వ్రాసిరి ! ఇట్లీ మూఁడు ఉద్యోగములలో నేది శ్రేష్ఠమో నిర్ణయించుకొనుట మాకుఁ గష్టముగఁ దోఁచెను !

ప్రభుత్వమువారి కొలువులోఁ బ్రవేశించుటకు వైద్యుని సర్టిఫికెటు కావలయును. కొంతకాలమునుండి దేహస్వస్థత లేని నా కాసర్టిఫికటు దొరకునో లేదో ముందు చూచుకొనుట మంచిదని నాకును తమ్ముఁడు వెంకటరామయ్యకును దోఁచెను. ఇపు డది యవసరము లేదని పరీక్షాధికారియగు విలియమ్స్ పిళ్ల గారు చెప్పినను, ఎందుకైన మంచిదని వారియొద్దనుండి యుత్తరము పుచ్చుకొని, నేను గుంటూరు పోయి, యచటి వైద్యాధికారితోఁ బరిచయము గలిగింపుఁ డని నామిత్రులు వెంకటకృష్ణయ్యనాయఁడు గారిని కోరితిని. కాని, వారికిని వైద్యాధికారియగు తమ్మనుసింగుగారికిని మిత్రభావము లేకుండుటచేత, నా కీసాయము గలుగ లేదు. వైద్యుఁడు నన్నుఁ బరీక్షించి, నాయందు హృద్రోగ చిహ్నములు గాన్పించెననియు, దొరతనమువారి కొలువులోఁ బ్రవేశింపవలదనియుఁ జెప్పిరి ! ఐనను నన్ను బాగుగఁ బరీక్షించి, నిజమంతయు వ్రాసివేయుఁ డని వైద్యుని నేను గోఱితిని ! పర్యవసాన మేమన, నేను ప్రభుత్వోద్యోగమున కనర్హుఁడ నని వైద్యుఁడు వ్రాసివేసెను !

నాయఁడుగారికిని తమ్మనుసింగుగారికినిత గల వైషమ్యములే నాదురదృష్టమునకుఁ గారణ మయ్యె నని పలువురు తలంచిరి ! నే నంత గుంటూరు నుండియే 11 వ జనవరిని రెండు తంతుల నంపితిని. ఒకటి పరీక్షాధికారికి, - నాకు వైద్యుఁడు కావలసిన సర్టిఫికెటు నీయలే దనియు, రెండవది పర్లాకిమిడి కళాశాలాధికారికి, - నేను వారి కళాశాలలో నుద్యోగము స్వీకరించితి ననియును, మఱునాఁడు ఉదయముననే నేను బెజవాడ వచ్చితిని. నా యలౌకిక చర్య కందఱు నాశ్చర్యపడిరి. దొరతనము వారికొలువు చేర నిశ్చయించుకొనినవాఁడు, వైద్యునియొద్దకు పొడిచేతులతోఁ బోవుటకు వారు నవ్విరి !

నాకు పర్లాకిమిడి యుద్యోగ మిచ్చితి మని తంతి యింకను రాలేదు. పెద్ద పరీక్షాధికారిని జూచి, వారిసాయమున నెటులో దొరతనమువారికొలువున నుద్యోగము సంపాదింపవలె నని యెంచి, ఆయన మకాముచేసియుండు నెల్లూరుపురమునకు నే నంతట వెళ్లితిని

1901. రాయసం రత్నమ్మ, వెంకటశివుడు

అప్పటి కప్పుడే యాయన మద్రాసు పోయె నని యచటఁ దెలిసెను. పూర్వము నాకు సైదాపేటకళాశాలలో సహపాఠియైన సంతాన రామయ్యంగారు, పర్లాకిమిడి కళాశాల వదలి యిపుడు నెల్లూరుపాఠశాలలో ప్రథమోపాధ్యాయు లయిరి. ఈయన నాకు నెల్లూరులోఁ గానఁబడి, నేను పర్లాకిమిడిలోని యుద్యోగము స్వీకరించుట యుక్తమని సలహా నిచ్చిరి.

అంతట నేను మద్రాసు పోయి, విలియమ్స్ పిళ్ల గారిని స్కాటుదొరగారిని మఱికొందఱిని సందర్శించితిని. జరిగినదానికి వా రేమియును జేయఁజాలకుండిరి. వీరేశలింగము గారితోను బుచ్చయ్య పంతులుగారితోను మాట్లాడితిని. ఇంతలో బెజవాడ వచ్చిన మాతమ్ముఁడు వెంకటరామయ్య నాకు మద్రాసునకు తంతి నిచ్చెను. నాకు పర్లాకిమిడి యుద్యోగమయ్యెననియు ఫిబ్రవరి ప్రారంభముననే నాకళాశాల చేరవలయు ననియును, అం దుండెను ! తల తడివిచూచుకొని, నే నంత బెజవాడ మరలివచ్చితిని.

ఇంకను నాకు దొరతనమువారి కొలువు విషయమై విరక్తి కలుగలేదు ! పైయధికారి యేమియుత్తర మిచ్చునో చూత మని వారికి తంతి నంపితిని. తుదకు 24 వ జనవరిరాత్రి వారియొద్దనుండి ప్రత్యుత్తరము వచ్చెను. నా కిచ్చినపని రద్దుచేసితి మనియు, పర్లాకిమిడి యుద్యోగము నన్నుఁ జేకొను మనియు నాకు వారు తెలియఁబఱిచిరి ! అందుచేత నేను దొరతనమువారి కొలువునం దాశ మానివేసి, బెజవాడయుద్యోగము విరమించుకొని, పర్లాకిమిడి పోవుటకు నిర్ధారణ చేసికొంటిని.

51. నూతనోద్యోగము

1902 వ సంవత్సరము జనవరి 28 వ తేదీని నాకు బెజవాడ పాఠశాలాభవనమున విద్యార్థులు నుపాధ్యాయులును గలసి వీడ్కో లొసంగిరి. అపుడు వారు సమర్పించిన విజ్ఞాపనపత్రము నందు, ఈ పాఠశాలలో నీ యెనిమిది సంవత్సరములనుండియు నందఱి మెప్పు నొందునట్టుగ నా విధ్యుక్తములు నెరవేర్చితి ననియును, విద్యార్థుల యవినీతి నడంచుటయందు నే నమితశ్రద్ధ వహింతి ననియు, బోధనమూలమునను సాహితీసంఘముల చర్చలలోఁ బాల్గొనుచును విద్యార్థుల మనోవికాసమునకు నే నధికప్రోత్సాహము గలిగించితి ననియు, విద్యార్థులతోఁ గలసి మెలసి యాటలాడుచు వారికి దేహారోగ్య భాగ్యము గలిగించితి ననియును వారు చెప్పిరి. నా కాసమయమున నొక వెండిగడియారముకూడ బహుమాన మీయఁబడెను.

ఇంతకాలమునుండియు బోధకునిగ నుండిన యీపాఠశాలను, ఈ నగరమును, విడిచిపోవ నా కమితసంతాపకరముగ నుండెను. ఆరాత్రి యధిక భావోద్రేకమున నాకంటికిఁ గూర్కు రానేలేదు ! ఇటీవల సంభవించిన నాకనిష్ఠసోదరుని మృతి, దొరతనమువారి యుద్యోగవిషయమై నే పడినయలజడి, నూతనోద్యోగమునందు నాకుఁ గలుగనున్న కష్ట సుఖములు, - వీనియన్నిటినిగుఱించియుఁ దల పోయుచు, నే నారాత్రి జాగరము చేసితిని ! మఱునాఁడు ప్రొద్దుననే లేచి భార్యసమేతముగ నేను రెయిలులోఁ గూర్చుంటిని. మాకు వీడ్కో లొసంగుటకు నుపాధ్యాయులు, వియార్థులు ననేకులు రెయిలుదగ్గఱకు వచ్చిరి. వారియొద్ద సెలవుగైకొని మే మంత రెయిలులో బయలుదేఱితిమి. మధ్యను ఏలూరులో నొకరోజు నిలిచి, మందు పుచ్చుకొనుటకై సతి నచట నుంచి, నేను రాజమంద్రి వెడలిపోయితిని.

నేను రాజమంద్రి చేరునప్పటికి నాకొక యుత్తర మచటికి వచ్చియుండెను ! నా పూర్వమిత్రుఁడును పర్లాకిమిడి కళాశాలలో నుపాధ్యాయుఁడును నగు శ్రీ జంధ్యాల సుందరరానయ్యగా రది వ్రాసిరి. నాకు పర్లాకిమిడియుద్యోగ మిచ్చిన టెయిలరుదొర మరణావస్థలో నుండె ననియు, ఆతఁడు చనిపోయినచో కళాశాల దుస్థితికి రావచ్చు ననియును, నామిత్రుఁడు తెలిపెను ! నే నెచటికి, బోఁదలచినను, దురదృష్టదేవత ముందడుగు వేయుచుండునట్లు కానఁబడెను.

నే నిపు డిచ్చినతంతి నందుకొని, తనయుత్తరము నాకుఁ జేరు వఱకు నిచటనే నిలిచియుండుఁ డనియు, తాను బయలుదేఱుచున్నాననియును, సుందరరామయ్యగారు రాజమంద్రికి మాఱుతంతినిచ్చిరి. కావున నింకను నాసందిగ్ధావస్థ తొలఁగనేలేదు ! ఆయన వ్రాసిన యుత్తరము నా కాలస్యముగఁ జేరెను. అందులో, టెయిలరుదొర చనిపోయె ననియు, నేను బాగుగ నాలోచించి మఱిరావలె ననియును మాత్రమే యుండెను ! ఇదివఱకు దొరతనమువారిపని పోయి, యిపుడు పర్లాకిమిడియుద్యోగఁపు సంగతి యిట్లు కాఁగా, ఎప్పటి బెజవాడయుద్యోగమే నాకు తుదకు గతి యగునట్లు తోఁచెను! కాని, వదలివేసిన పనికొఱ కాశించుట యగౌరవ మని మాకుఁ గానఁబడెను. దైవముమీఁద భారము వేసి, ముందుచూపు చూచి, పర్లాకిమిడికిఁ జనుటకే నేను నిర్థారణచేసికొంటిని. పర్లాకిమిడి మన్య ప్రదేశమనుట యసత్య మని యాప్రాంతములందు పనిచేసి వచ్చిన మిత్రుఁడు నరసింహరాయఁడుగారు నొక్కి చెప్పిరి. కావున నేను మాతమ్ముఁడు వెంకటరామయ్యతోఁ గూడి క్రొత్తప్రదేశమునకు వెంటనే బయలు దేఱితిని.

రాత్రి నౌపడా రెయిలుస్టేషనులో మేము సుందరరామయ్యగారిని గలసికొని మాట్లాడితిమి. వెంటనే యుపద్రవ మేమియుఁ గలుగకపోయినను, కళాశాలా పరిస్థితులు వెనుకటివలె నుండవేమో యని ప్రజలు భయపడుచుండి రని యాయన చెప్పిరి.

అంత 2 వ ఫిబ్రవరి యాదివారమునాడు మేము పర్లాకిమిడి చేరితిమి. మిత్రుఁడు పైడిగంటము కృష్ణారావుగారియింట మేము విడిసితిమి. స్నేహితులు, నితరులును పెక్కండ్రు మమ్ముఁ జూడవచ్చిరి. మే మొంటరిగ వచ్చుటచేత, కళాశాలా భోజనవసతిగృహము మేడగది నా విడిది యయ్యెను. 3 వ ఫిబ్రవరి సోమవారమున నేను కళాశాలకుఁ బోయి, నా క్రొత్తయుద్యోగమునఁ జేరితిని.