ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/ఇంటితగవులు, మండలసభలు
కార్యం చాయకుండా వుంటే మాత్రం మనకు లాభం లేదు. చేశినందువల్ల వచ్చే లుగసాను లేదు. కార్యం కావడం చాలా విశేషమై యున్నది.
రా. సుబ్బారాయుడు."
ఈ పైయుత్తరమునకు నే నేమి సమాధాన మిచ్చితినో నాకు జ్ఞప్తి లేదు. వేసవి సెలవులలో నేను రాజమంద్రి వచ్చినప్పుడు, అందఱమును గలసి మాటాడుకొని నిశ్చయింపవచ్చునని నేను వ్రాసి యుందును. కృష్ణమూర్తి ద్వితీయవివాహము వెంటనే చేయవలెననియు, నర్సాపురపు సంబంధమే నిశ్చయింపవలెననియు, మా తలిదండ్రుల దృఢసంకల్ప మని లేఖవలన స్పష్టము కాఁగలదు.
25. ఇంటితగవులు, మండలసభలు
ఈసమయమున మేము నివసించెడి బెజవాడ యింటిని గుఱించి కొంత వివాదము కలిగెను. నేను చెన్నపురి వెళ్లి పోవునపుడు, ఆయింటిని రెండవభాగమున నుండిన రామస్వామి శాస్త్రిగారి వశముఁ జేసితిని. కాని, మరల నిచ్చటికి వచ్చుటకు స్థిరపఱచుకొనిన వెంటనే, ఇ ల్లెవ్వరికి నీయవల దని వారికి వ్రాసివేసితిని. ఈలోపుగ నాయన యింటిలోని కొంతభాగమును సుబ్బారాయఁడుగారి కిచ్చినను, నేను జెన్నపురినుండి వచ్చినతోడనే, నాభాగము నాకు వదలివేసిరి. కాని, యంతకంతకు నాకును శాస్త్రిగారికిని అభిప్రాయభేదము లేర్పడెను. దీనికిఁ గారణము, ఆఁడువారల కలహములే ! మా బంగాళాలో నిపుడు నివసించు నారీమణుల సంఖ్య మూఁడు, ఏర్పడిన కక్షలు రెండు ! ఒక కక్షలో చిన్న వారలగు నా భార్యయు, సుబ్బారాయఁడుగారి పత్నియును. విశాలక్షమ్మ రెండవ కక్షిదారురాలు. పెద్దలకు చిన్నలకును ఆశయములందును, అభిప్రాయములందును భేదము లుండుట స్వాభావికము. చిన్నవార లిరువురును సతతము తనమీఁద చాడీలు చెప్పుకొనుచుందురని విశాలక్షమ్మయులుకు! "కలహకంఠీ!"యని యా పెద్దముత్తయిదువ వెంకమ్మగారి ననుచుండఁగ చెవులఁబడి నే నొక నాఁడు నవ్వుకొంటిని. సుబ్బారాయఁడుగారి భార్య వెంకమ్మగారికిఁ జదువు రాదు. "చూచితివమ్మా! నన్ను 'కలాలకంటీ' అని యీముసలవ్వ తిట్టుచున్నది" అని వెంకమ్మగారు రత్నమ్మగారితో ఫిర్యాదు ! అంత చిన్న లిద్దఱును సమ్మెకట్టి, ముసలమ్మతో మాటాడ మానివేసిరి.
చిన్నమ్మలను జూచి పెద్దమ్మ సదా మోము ముడుఁచుకొని యుండెడిది !
ఆఁడువారి మనస్పర్థలు మెల్ల మెల్లగ మగవారల కెగఁబ్రాఁకెను! శాస్త్రిగారిని ఏలూరునుండి రప్పించి, వారికా పాఠశాలలో నుపాధ్యాయునిపని నేనె యిప్పించితిని. మా కిరువురకును స్నేహమే. ఇరువురికిని మిత్రు లొకబృందమువారే. అద్దెలో చాలభాగము నేనె యిచ్చుచుండువాఁడను. స్త్రీలవైరము లడఁచుట యసాధ్య మని నేనిపుడు గ్రహించి, తా మింకొకయిల్లు చూచుకొనెదరా యని నేను శాస్త్రి నొకనాఁ డడిగితిని. దీని కాయన కోపించి, తాను గదల ననియు, వలసినచో నేనె యిల్లు విడిచిపోవచ్చు ననియును జెప్పివేసి, న న్నాశ్చర్యమున ముంచిరి ! ఈయింటికే కాదు, ఊరికిని ఉద్యోగమునకును నా యాహ్వానముమీఁదనే వచ్చినశాస్త్రి నా కీజవా బిచ్చుటకు నేను జిఱచిఱలాడితిని ! ఇంటియజమాని మద్రాసులో నుండెను. ఆయనబంధు వొకఁడు బెజవాడలో మాయొద్దనుండి యద్దె వసూలు చేయుచుండువాఁడు. ఈ తగవు పరిష్కరింపుఁ డని యాయుభయులను నే నిపుడు కోరితిని. బాడుగ నిచ్చుటకు నేనె యుత్తరవాది నని పలికి న న్నాయింట నుండుఁడని వారు చెప్పివేసిరి.
ఇపుడైనను శాస్త్రిమనసు మాఱలేదు. తనకు వేఱొకయిల్లు కుదురుటకు కొన్ని నెలలు పట్టు ననియు, అంతవఱకుఁ దా నిచటనే యుందు ననియును, ఆయన చెప్పివేసెను ! అంత యుభయుల మిత్రులగు రాజారావు సాంబమూర్తిగార్లతో నేనీ సంగతి చెప్పితిని. వారి హితవచనము లాలకించి, ఎట్టకేలకు శాస్త్రి యిల్లు వదలి పోయెను.
1898 సంవత్సరము వేసవి సెలవులలోఁ గొంత యాలస్యముగ మేము రాజమంద్రి పోయితిమి. దీనికిఁ గారణము, 'విద్యా సాగర, ముద్రాక్షరశాలలో నా "జనానా పత్రిక" సకాలమున నచ్చుపడ కుండుటయే. వీరభద్రరావుగారు సొమ్మునుగుఱించిన చిక్కులు తీర్చు కొనుటకు తఱచుగ రేలంగి పోవుచుండువారు. అందువలన బెజవాడలోని వారిముద్రాలయమున పని సరిగా జరుగుచుండెడిదిగాదు. పాఠశాలలో పని, పత్రికపనియును భారమైన నేను, ఎప్పుడోగాని క్రొత్తపేటలోని యీ ముద్రాలయకార్యములను బరిక్షింపఁ బోలేకుండెడి వాఁడను !
20 వ మేయి తేదీని, ఆనెల జనానాపత్రిక చందాదారులకుఁ బంపి, కొందఱు స్నేహితులతోఁ గలసి సాయంకాలమునకు గుంటూరు వెళ్లితిని. అచట కృష్ణామండలసభలు జరుగుచుండెను. రెయిలులో మిత్రులగు దాసు శ్రీరాములుపంతులుగారిని గలసికొని, మఱునాఁటి సంస్కరణసభా కార్యక్రమమునుగుఱించి మాటాడితిని. సభల కేతెంచిన ప్రాఁతనేస్తులు గుంటూరులోఁ బలువురు గానఁబడిరి. దుగ్గిరాల రామమూర్తిగారును వచ్చియుండిరి. ఆకాలమున గుంటూరుపురము పూర్వాచారపరాయణత్వమునకు ప్రసిద్ధి నొందెను. కావున వితంతూ ద్వాహములనుగుఱించిన తీర్మానము సభలోఁ గావించుటకు గుంటూరు వారి కిష్టము లేదు.
రాజకీయ సంస్కరణసభలకు మిత్రులు వెంకటరత్నమునాయఁడుగారే యధ్యక్షులు. 21 వ తేదీని జరిగిన సాంఘిక విషయ నిర్ధారణసభ కెటులో వితంతూద్వాహవిషయకమగు తీర్మానమును అంగీకృతముఁ జేసితిమి. మధ్యాహ్నము జరిగిన ముఖ్య సభలో నేను స్త్రీవిద్యను గుఱించిన తీర్మానమును ప్రతిపాదించితిని. నా యుపన్యాసానంతరమున అధ్యక్షులగు నాయఁడుగారు లేచి, నేను బ్రచురించెడి "జనానా పత్రికను" స్త్రీవిద్యాభిమాను లందఱును దెప్పించుకొనుట కర్తవ్య మని నొక్కి వక్కాణించిరి. ఇందుకు వారియెడల కృతజ్ఞుఁడనే కాని, నాకోరికమీఁద వా రిట్లు చెప్పిరని జను లనుకొందురేమో యని నేను సిగ్గుపడితిని !
అతిబాల్యవివాహ నిరసనమును గుఱించిన తీర్మానమునకు పలువురు విరోధు లేర్పడిరి. ప్రభుత్వమువారు వివాహవిషయమున వయోనిర్ణయము చేయుటకే పలువురు సమ్మతింపకుండిరి. కావున పండ్రెండేండ్ల యీడురాని బాలికలకు వివాహము చేయరాదను తీర్మానమున కనేక సవరణలు వచ్చెను. వయోనిర్ణయము 11 సంవత్సరముల కుండవలయునని యొకరును, 10 సంవత్సరముల కని యొకరును, అడ్డు తీర్మానములు తెచ్చి, సభాకార్యక్రమమును నవ్వులాటలోనికి దింపిరి. అంత మా ప్రార్థనమీఁద దాసు శ్రీరాములుగారు సభా వేదిక నెక్కి, తాము ధర్మశాస్త్రములు సాంగముగఁ జదివితి మనియు, అసలు తీర్మానమున కడ్డుపెట్టువారు జాతిద్రోహులు శాస్త్రద్రోహులు నని గంభీరస్వరమున నుపన్యసించిరి ! దీని పర్యవసానము, మొదటిసవరణ కొనివచ్చిన పండితంమన్యుఁడు సభ నుండి నిశ్శబ్దముగ నిష్క్రమించెను ! తీర్మాన మేకగ్రీవముగ నామోదింపఁబడెను ! నాఁడు వ్యవధానము లేకపోవుటచేతను, మరల భిన్నాభిప్రాయములతో సభ చీలిపోవు నను భయమునను, నాయఁడుగారు కార్యప్రణాళికనుండి వితంతూద్వాహమును గుఱించిన తీర్మానమును దీసివైచిరి. వారి యంత్యోపన్యాసము హృదయరంజకముగ నుండెను. ఈనాఁడే సుప్రసిద్ధరాజకీయవేత్తయగు గ్లాడుస్టనుగారు చనిపోయి రని తెలిసెను.
మఱునాఁడు (22, ఆదివారము) సంస్కృతపాఠశాలలో ప్రార్థన జరిపితిమి. ఇదియే గుంటూరు పుర ప్రార్థన సమాజ జననకాలము. మిత్రులతోఁ గూడి నేను బెజవాడ తిరిగివచ్చితిని. బెజవాడలో సంఘసంస్కరణ సమాజస్థాపనము యుక్తమని మాకుఁదోఁచి, 23 వ తేదీని యొకసభ చేసితిమి. పదునొక్క సభ్యులతోను, ఒక యభిమానితోను బెజవాడ "సంఘసంస్కరణ సమాజము" నెలకొల్పఁబడెను. దానికి శ్రీవేమవరపు రామదాసుపంతులుగారిని కార్యదర్శిగ నెన్నుకొంటిమి.
26. తమ్ముని వివాహము
ఇంటిలోని విలువగల వస్తువులను శిష్యుడు వెంకయ్య గదిలో నుంచి, మేము 25 వ మేయిరాత్రి బయలుదేఱి మఱునాఁటి ప్రొద్దునకు రాజమంద్రి చేరితిమి. తలిదండ్రులను తమ్ముఁ జెల్లెండ్రను