ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"బాల్యస్వర్గము"
న్యాయవాది పరీక్షాఫలితములు 18 వ మార్చిని తెలిసెను. నేను తప్పిపోయితిని. వెంకటరామయ్య వెనుకటివలెనే రెండవతరగతిలోనే జయమందెను. రాజధాని యంతటిలోను మొదటితరగతిలో నొక్కరే గెలుచుటయు, నావలె రెండవతరగతి పరీక్షకు వచ్చినవారందఱు నపజయము గాంచుటయు, ఈపరీక్షలోని యైదుభాగములలో రెండింట నేను గృతార్థుఁడ నగుటయును, నాకుఁ గొంత యుపశమనము గావించెను !
'ఏలూరు యువజనసమాజ'సభలో వొక యుపన్యాస మీయుఁడని నా కిపుడు పిలుపువచ్చెను. "బాల్యస్వర్గము" అను విషయముపై నేనొక యాంగ్ల వ్యాసము వ్రాసి, 8 వ ఏప్రిలున ఏలూరులో జరిగిన సభలోఁ జదివితిని.
కొలఁది రోజులలోనే రాజమంద్రి ప్రార్థనసమాజవర్థంతి జరిగెను. ఆ సమయమున (15 వ ఏప్రిలు) మా తమ్ముఁడు "భూలోక స్వర్గము" అను తెలుఁగు వ్యాసమును, నేను "వీరసంస్కర్త" అను నాంగ్లవ్యాసమును జదివితిమి. వీరేశలింగముగారి జీవితవిమర్శనమే నా ప్రసంగమునకు ముఖ్యవిషయము. అఱవపల్లి సుబ్బారావుగారు మున్నగు విద్యాధికులు మెచ్చుకొనిరి గాని, నామిత్రుల కంతగ నారచనము రుచింపలేదు. 'పెరటిచెట్టు మందునకు రాదుగదా' యని తలపోసి నే నూఱడిల్లి తిని.
38. "బాల్యస్వర్గము"
మనుజుని రచనములు వాని యాలోచనముల ప్రతిబింబములు. 1900 వ సంవత్సరప్రాంతములందలి నాయూహాపోహములకును, ఆశయములకును, నే నాసంవత్సరమున లిఖియించిన రెండువ్యాసములు నిదర్శనములు. ఈరెండు నిదివఱకే సూచింపఁబడినవి. కావున వానిలోని మొదటిదగు "బాల్యస్వర్గము" అను వ్యాసమందలి ముఖ్యాంశము లిందుఁ బొందుపఱచు చున్నాను : -
శిశువు మనుజుని జనకుఁ డని వశ్డుసువర్తకవి నుడివెను. యౌవనపుఁబోకడలు బాల్యముననె పొడఁగట్టును. పండుసూచనలు పూవులోనె కానవచ్చును. కారణముననె కార్య మిమిడియున్నది. తన వంశమునకు భావికాలమున రానున్న విపద్దశ తొలఁగించుకొనుటకై, జ్యేష్ఠపుత్రుఁడు దుర్యోధనుని బాల్యముననె తాను తెగటార్చవలయు నని, ధృతరాష్ట్రునికి మంత్రులు హితోపదేశము చేసిరి. బాలకులు వికాసమునొందని. చిన్నిమనుజులు.
ఐనను, 'చిన్ని మనుజులని' చిన్నవారిని చిన్నగాఁ జెప్ప వొప్పదు. ఆకాశమంత యాశయు, అభివృద్ధినొంద నపరిమితావకాశము నఖండమనశ్శక్తులును గల చిన్నవారలొ, హ్రస్వదృష్టియు సంకుచిత స్వభావము నేర్పడిన పెద్దవారలో, నిజమయిన చిన్న వారలని చదువరులె నిర్ధారణచేసికొనఁ గలరు. ఎన్నిలోపము లున్నను శైశవముతోనె నాకు సానుభూతి. పెద్దవారలతోడి స్వర్గమునకంటె చిన్న వారలతోడి నరకమె, నాకు వాంఛనీయము !
బాల్యసుఖములె నిశ్చితమైన సుఖములు ! - పిన్నవాని పిన్న నవ్వు గగనతలమందలి బాలచంద్రునిఁ దోఁపించును. ఒక కవి వర్ణించి నట్టుగ, మనుజుని కపోలతలమునఁ బొడసూపు నల్లనివెండ్రుకలు మొలక లెత్తు పాపబీజములను స్ఫురించును. దీనితో బాలకుని నిష్కపటమగు మోముదమ్మిని బోల్చి చూడుఁడు ! స్ఫటికమువలె స్వచ్ఛముగను, వికసించు మల్లియవలె పరువముతోను, అయ్యది యొప్పుచుండును. స్వర్గలోకసుఖముల నిది స్ఫురించుచుండును ! స్వాభావికముగ సుగుణ మణియగు జీవాత్మ, ప్రాపంచిక కలుషములచేఁ గప్పఁబడి, రానురాను తన నై సర్గిక నైర్మల్యమును గోలుపోవుచున్నదని నేను నమ్మెదను.
బాల్యమునకుఁగల ప్రథమలక్షణము, అమాయికత్వము. అది వట్టి యజ్ఞానము గాదు. శైశవమందలి నిర్మలత్వము, ఆత్మకు నైసర్గికముగఁ గల పవిత్రతయె. ఎవ్వాని ఋజువర్తన ప్రభావమున వానియాత్మ యీసౌరభవిశేషమును గోలుపోవదో, వాఁడె ధన్యజీవితుఁడు !
అమాయికత్వ మనఁగా, నిరపరాధత్వమె కాదు, అపరాధ మాచరింప నేరకుండుటయును. శోధనలకు దూరముగ నుండుట కాదు, వానికిలోనయ్యును వాని తాఁకుడును లెక్కసేయ కుండుటయె, యీ యమాయికత్వమునకు గుఱుతు. సుగుణసౌందర్యరాశియగు జానకి యిట్టి యమాయికత్వమునకు గొప్ప తార్కాణము. లోకకష్టములు కలుషములు నాపుణ్యవతి యెఱుఁగకపోలేదు. కాని, యీ సుగుణప్రభావమున, ఆసుశీలకుఁ గలిగిన శోధనలబలము పటాపంచలయ్యెను. ఈ భూ నాటకరంగమున నాకాంత కార్యకలాపము ముగించుకొని, మరల తన జననీగర్భమునకు నిష్క్రమించెను !
శైశవమునకుఁగల ముఖ్యలక్షణము అమాయికత్వమని నావాదము. దీని సరికట్టుట వలన నే నైతికబాలారిష్టములు వాటిల్లుచున్న వని నామతము. పెద్దవారలగు మనలను జూచి బాగుపడుటకు మాఱుగా పిల్లలు మఱింత పాడగుచుండుట, మనకంటె వారలె సజ్జనులని సాటు చున్నది ! పెద్దవారలచేష్టలు చర్యలును పిన్నవారలకు మార్గప్రదర్శనములు గాకున్నవి. మన దురభ్యాసములు దురాచారములును ముఖ్యముగ బాలురు చెడిపోవుటకుఁ గారణము లగుచున్నవి. బాలురు మన దుర్వ్యసనములఁ గనిపెట్టుట లేదనుకొనుటకంటె పెద్ద పొరపాటు లేదు. వేయి కనులతో వారు మన యపరాధముల వీక్షించుచున్నారు. బాల్యలక్షణ మింకొకటి నిష్కాపట్యము. బాలురస్నేహములు, వారల మధుర భాషణములును సద్భావపూరితములు. ఒకపాఠశాలలో తరగతియందు నొక బాలకునిచెంతఁ గూర్చుండు మని యందున కిష్టపడని విద్యార్థిని నేను నిర్బంధింపఁగా నతఁ డేడ్చి, "మాయిద్దఱికిని విరోధమండి! మేము దగ్గఱగా నుండఁజాలమ"ని వాఁడు మొఱ పెట్టెను. ఆబాలకుని నిష్కాపట్యమునకు నివ్వెఱపడితిని. 'పెద్దవారలగు మా కిట్టి నీతి యుండిన నెంత బాగుండు!' నని నే నపు డనుకొంటిని. లోని తలంపులు బయల్పడకుండఁ జేసికొనుటయె పరమావధియని పెద్దవారల మనుకొనుచున్నాము! కావుననే యేండ్లు పైఁబడినకొలఁది మోక్షదూరుల మగుచున్నాము !
బాల్యలక్షణములలో నొంకొకటి విశ్వాసగుణము. కౌతుకాశ్చర్యములతో జ్ఞానోత్పత్తి యగుచున్నది. ఇవియె విశ్వాసమున కెల్ల మూలకందము. శైశవమున భూలోక మంతయు చిత్రవస్తుప్రదర్శనశాలవలెఁ గానిపించును! ప్రశ్నోత్తరములతో నిండియుండు బాలకుని మనస్సునకు విశ్వాసము పట్టుగొమ్మ యగుచుండును. జననీజనకులు, వయోవృద్ధులును, విశ్వాసపూరిత హృదయులగు బాలకులకుఁ బూజనీయు లగుచుందురు. పిన్న వారల భక్తిప్రేమము లందుకొన నర్హత గలిగి యుండుటకైనను, పెద్దలు పూజ్యత దాల్చియుండుట కర్తవ్యముగదా!
"క. గురువులు తమకును లోఁబడు
తెరువులు చెప్పెదరు విష్ణుదివ్యపదవికిన్
తెరువులు చెప్పరు, చీఁకటిఁ
బరువులు వెట్టంగ నేల బాలకులారా?"
అని బాలుఁడగు ప్రహ్లాదుఁడు తోడిబాలకుల కుద్బోధించెను. బాలహృదయములు గ్రోలుటకుఁ దగినమాధుర్యము లేక నిస్సారతను దాల్చియున్నవి, పెద్దలగు మన చరిత్రములు ! ఇ ట్లనుటవలన పెద్దవార లందఱు దుశ్చరితులని నేఁ జెప్పుటలేదు. చిన్నవారల చిత్తముల నాకర్షింపఁగల యోగ్యత మనలో మట్టుపడుచున్న దనియే నామొఱ !
బాలుర మంచిలక్షణముల పూర్తిపట్టిక నిచ్చుట నాతలంపు గాదు. అమాయికత్వము నిష్కాపట్యము విశ్వాసము మున్నగు సుగుణములు, బాల్యమునకుఁగల సౌందర్యగౌరవములకు హేతువులు. పెద్దలను గ్రిందుపఱుచుట నా యభిప్రాయము కాదు. సుగుణములతోఁ జెన్నొందు పెద్దఱిక మెప్పుడును శ్లాఘాపాత్రమె. అమాయికత్వాదిగుణ భూయిష్ఠమగు బాల్యము, సుజ్ఞానోపేతమగు పెద్దఱికముగఁ బరిణమింపవలయు ననియె నామతము. నిష్కపటుఁడగు బాలకుఁడు, నిర్మలినుఁడును, నియమబద్ధుఁడునగు పురుషునిగ వికసన మందవలయును. బాల్యమున వార్ధకపు దుర్గుణములును, వార్ధక్యమున యౌవనమదాంధత్వమును, బొడసూపుటకంటె ననర్థ మేమిగలదు? పెద్దవారలు తమపెద్దఱికమును నిలుపుకొను నుదార చరితులై, పిన్న వారలకు శీలసౌష్ఠవ మేర్పడుటకు సహకారు లయ్యెదరుగావుత !
39. "వీరసంస్కర్త"
నా రెండవ వ్యాస మగు "వీరసంస్కర్త" సార మిచట వివరింపఁబడుచున్నది : -
'కార్లైలు'శూరనామమును వివిధవృత్తులలోనుండువారల కొసంగి యున్నాఁడు. తన విధ్యుక్తములను ధైర్యసాహససద్భావములతో నిర్వర్తించువాఁడె శూరుఁడు. కత్తిగట్టి దేశస్వాతంత్ర్యమునకై పోరాడు సైనికునివలెనే, స్వదేశమును గలంచెడి దురాచారముల నెదుర్కొని, వానిని నిర్మూలన మొనరింపనూనెడివాఁడును శూరుఁడె.