ఆంధ్ర వీరులు - రెండవ భాగము/సాళ్వ నరసింహరాజు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ను బరిపాలించెను. ఇతనిశాసనములు నిజామురాష్ట్రము లోని యయ్యనవోలు, దేవరకొండ, రాచకొండ లోనగు చోటుల కానవచ్చు చున్నవి.)

________

సాళ్వ నరసింహరాజు.

బుక్కరాయల యనంతరము విద్యానగర సామ్రాజ్యమును(రెండవ) హరిహరరాయులు, మొదటి దేవరాయలు, ప్రౌడ దేవరాయలు, మల్లికార్జునరాయలు, విరూపాక్షరాయలు వరుసగ బాలించిరి. వీరిలో బ్రౌడరాయలు చిరకాలము రాజ్యము తన పూర్వులకు సమానముగా బాలించి మితిలేని ధనము భాండాగారమున జేర్చి క్రీ.శ. 1446 ప్రాంతమున మరణించెను. ప్రౌడదేవరాయలకు పొన్నలదేవివలన మల్లికార్జునరాయలు, సింహలదేవి వలన విరూపాక్షరాయలు జనించిరి. మల్లికార్జునరాయలు తనపూర్వులు సంపాదించిన రాజ్యమును జాగరూకతతో గాపాడుకొనుచుండెను. ఒక్క ప్రక్కను మహమ్మదీయులు పూర్వ వైరమును బురస్కరించుకొని కర్ణాట సామ్రాజ్యమును కబళింప నుండిరి. కటకపాలకుడగు కపిలేంద్ర గజపతివిస్తారమగు బలమును సమకూర్చుకొని ఆంధ్రదేశమునందలి ప్రసిద్ధ దుర్గముల నన్నిటిని లోబఱచికొని విద్యానగరమును ముట్టడించెను. మల్లికార్జునరాయలు ఘోరసంగరము చిరకాలము గావించి గజపతి నెటులో తరిమివేసెను. గజపతి యంతతో బోళ చిక్కిన దుర్గములను జిక్కినటుల లోగొనుచు జంద్రగిరికి బోవగా సాళ్వనరసింహరాజు గజపతిని దన పాలనమునం దడుగిడనీయక సరిహద్దులవఱకు దరిమెను.

మల్లికార్జున రాయల తరువాత విరూపాక్ష రాయలు విద్యానగర సామ్రాజ్యపాలకు డయ్యెను. సహజముగా జంచల స్వభావుడును భోగపరతంత్రుడును నగు నీ రాజు రాజకీయ వ్యవహారములలో గొంచెమేని జోక్యము కలుగజేసి కొనక యెల్లపుడు భోగస్త్రీలతో గ్రీడించుచు సురాపానమత్తుడై యుండెను. ఈ యసమర్థుని తెలివితేటలు గమనించి మహమ్మదీయులు గోవాపట్టణము నాక్రమించికొనిరి. కపిలేంద్ర గజపతి యనంతరము విరోధిజన దుర్గమమని పేరొందిన విద్యానగర రాజ్యమును అతనికుమారు డగు పురుషోత్తమ గజపతి ముట్టడించి సైన్యమును నోడించి అపరిమిత ధనమును రత్న సమూహమును సింహాసనమునుగైకొని కటకము చేరెను. రాజ్యమునందు బరులు ప్రవేశించుట కిదియెమొదలు. తురుష్కుల దండయాత్రలతో గొంత రాజ్యభాగము గూడ బరాధీనము కానుండెను. గజపతి విద్యానగర సామ్రాజ్యమును గబళింప దగినంతబలమును సమకూర్చుచుండెను. ఏడులక్షల వఱకు దండ్రికాలమునం దున్న సైనికబల మంతయు దరిగిపోయెను. మూలధనముగా దండ్రి సేకరించిన ఎనుబదియైదు కోటుల వరహాలుగూడ నాశమయ్యెను. సర్వవిధముల మహోన్నతదశయందుండి ప్రకృతిసహజమగు శైలదుర్గములచేతను దుంగభద్రావాహినిచేతను సురక్షితముగానున్న విద్యానగర సామ్రాజ్యమును జేసేతుల విరూపాక్షరాయలు పాడుసేయుటజూచి సామంతులు సేనానులుగూడ దిరస్కారభావముతో నుండిరి. ఇంక నుపేక్షించినయెడల బరిస్థితులు విషమించునని రాజశేఖరురాయలు తన తండ్రియగు విరూపాక్షరాయలను జంపించెను. ఇతనిసోదరుడగు రెండవ విరూపాక్షరాయలు రాజశేఖరు రాయలను జంపించెను. భ్రాతృహంతయగు రెండవవిరూపాక్షరాయలయెడ బ్రజలహృదయములం దసంతృప్తిజనించెను. రాజ్యమునం దంతటను దిరుగుబాటు లభివృద్ధియయ్యెను. ఎవనికి వాడె స్వాతంత్ర్యమును బ్రకటింప యత్నించుచుండెను. ఉదయగిరిరాజ్యము అంతకుముందె గజపతు లావరించుకొనుటయు జంద్రగిరి, పెనుగొండ, గండికోట రాజ్యములు సాళ్వ నరసింహభూపాలుని స్వాధీనమునందుంటయు గర్నాటరాజ్య దుర్బలస్థితికి దార్కాణములుగ నుండెను. ఈ స్థితిగతులలో బహమనీ సుల్తానులు కర్ణాట రాజ్యమును హరింప సిద్ధముగా నుండియు సాళ్వ నరసింహ భూవిభునిధాటికి వెఱచి యూఱకుండిరి.

'విద్యానగర రాజ్యము నుపేక్షించినచో యవనులు హరింపక మానరు. విద్యారణ్యాది మహానుభావులు తమశక్తి ధారవోసి నెలకొల్పిన యీమహారాజ్యమును గోలుపోతిమేని ఆర్షధర్మము లంతరించి దేశమంతయు సంక్షోభ మొందకమానదు, అని సాళ్వనరసింహరాయడు తలంచి తనక్రింద దుర్గాధ్యక్షుడుగానున్న తుళువనరసరాయలను బిలువనంపి విద్యానగరరాజ్యమును ముట్టడింపుమని యాజ్ఞాపించి తనయొద్దనున్న సైన్యమునంతయు సహాయముగా బంపెను. నరసరాయడు తనబాలమిత్రుడును రాజ్యకార్య విశారదుడును సంగరకౌశలుడు నగు తిమ్మరుసుమంత్రిని సహాయముగా గైకొని యొక శుభముహూర్తమున విద్యానగరమును ముట్టడించెను. సాళ్వనరసింహ భూపాలుని ధర్మపరిపాలనము నందు అభిమానముగల సేనానాయకులు నరసభూపాలునకు స్వాగతము నొసంగి విద్యానగర సామ్రాజ్యమును స్వాధీనపఱచిరి. తుళువనరసరాయలు మేళతాళములతో రాజవీధులలో నూరేగుచు నగరములోనికి వచ్చుచుండెను. ఒకభటుడు రాజమందిరములోనికి బోయి భోగపరాయణుడగు విరూపాక్షరాయలకు "సాళ్వనరసింహభూపాలునిపంపున దుళువ నరసరాజువచ్చి సామ్రాజ్యము నంతయు లోబఱచు కొనుచున్నాడు. వీలున్న బ్రతకృతి గావింపు"మని విన్నవింపగా సంతోషభంగకరమగు నిట్టి సందేశము దెచ్చితివాయని భటునవమానించి బైటికి బంపెను.నరసరాజు తానుసాధించిన నగరభాగముల నన్నింటిని భటులకప్పగించి రాజమందిరము ప్రవేశించెను. నరసరాజు దగ్గరకు రాగా నిక నుపేక్షింప దగదని యారాజమాత్రుడు అంత:పురకాంతలను రాజమందిరమును సంపదలను విడిచి ప్రాణభయముతో దొడ్డివాకిలి తెఱచికొని పారిపోయెను. నరసరాజు కోటను భాండాగారమును ధనకనకవస్తువాహనములను రక్తపాతము లేకుండ సాధించి యీవిజయవర్తమానము తన యజమానియగు సాళ్వ నరసింహరాజునకు దెలిపి పట్టాభిషిక్తుడగుటకు రమ్మని వర్తమాన మంపెను. ప్రజలందఱు మఱల సత్ప్రభువె తమకు లభించెనని మిగుల నానందించి పట్టాభిషేకమహోత్సవ మెపుడుజరుగునా యని నిరీక్షించు చుండిరి. నరసరాజు రాజకీయోద్యోగుల నందఱను బరిశీలించి పూర్వరాజ పక్షపాతు లగువారిని వెదకి యుద్యోగముల నుండి తొలగించి యాపదవులను విశ్వాసపాత్రులగు తన నౌకరుల కొసంగెను. విద్యానగర రాజ్యమునం దంతటను నూతనోద్యోగులను నరసరాజు నెలకొల్పి విప్లవోద్యమములకు దావేలేకుండ జేసెను.

శాస్త్రవేత్తలు పెట్టిన శుభముహూర్తమున బట్టాభిషేకమహోత్సవము జరుపుటకు నేర్పాటులు చేయబడెను. సామంతులకు రాజబంధువులకు గవులకు గాయకులకు సేనానాయకులకు ఉద్యోగులకు ఆహ్వానపత్రికలను నరసరాజు, తిమ్మరుసుమంత్రి స్వయముగా బంపిరి. సాళ్వ నరసింహభూపాలిని దామంద ఱంతకు మున్నె యెఱింగి యుంట రమునందలి ధనము విరివిగా నుపయోగించి పారశీదేశమునుండియు అరబ్బీ దేశమునుండియు ఉత్తమాశ్వములను దెప్పించెను. బ్రతికిన గుఱ్ఱమునకైనను మార్గమధ్యమున జచ్చిన గుఱ్ఱమునకైనను మూడు గుఱ్ఱములకు వేయివరహాల చొప్పున ధనమొసంగి అశ్వముల నెన్నింటినో కొని ఆశ్వికదళము నభివృద్ధి గావించెను. చచ్చిన గుఱ్ఱములతోకల జూపినంత మాత్రముననే విలువయొసంగు చుండుటచె యవనవర్తకులు ధారాళముగా అశ్వవ్యాపారముగావించి విజయనగర రాజ్యమును అశ్వబృందములతో నించివేసిరి. నరసింహరాజు ఆశ్విక దళసహాయమున దనశక్తి సామర్థ్యములు పూర్తిగా నుపయోగించి అన్యాక్రాంతములైన రాజ్యముల నన్నింటిని దిరుగ సంపాదించెను. ఉదయగిరి, రాయచూరు, కొండవీడు దుర్గములు సాధించుకొనుటకుగూడ యత్నించెను గాని యంతలో నాతడు కాలధర్మము నొందెను.

సాళువ నరసింహరాజు ఆంధ్రవాజ్మయమున కెంతయు జేయూత నొసంగెను. పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని సత్కరించి జైమిని భారతము నంకిత మొందెను. పలువురు కవు లీనరపాలుని గుణకీర్తనము గావించినటుల జాటువులవలన నెఱుంగ నగును. ఈయనయొద్ద మంత్రిగా నాదెండ్ల చిట్టిగంగనామాత్యు డను నియోగిబ్రాహ్మణుడుండెను. ఈయన విద్యానగరమును గృష్ణదేవరాయల కాలమునందు మంత్రిగానుండి పరిపాలించిన తిమ్మరుసుమంత్రికి మాతామహుడు. గొప్ప రాజకీయవేత్త యనియు మహాశూరు డనియు బేరొందెను.

నరసింహరాజు తన యంత్యకాలమున విశ్వాసపాత్రుడగు సేనానియు, విద్యానగరమును బట్టుకొనుటలో నెక్కువ సహాయపడినవాడును, తన అన్న మనుమడును నగు తుళువనరసరాజును బిలువనంపెను. ఆయనతో నిటుల జెప్పెను: "మిత్రమా! నా కంత్యకాలము సమీపించినది. నాకుమారు లిరువురు పసివాండ్రు. భాండారము, రాజ్యము నీచేతిలో నుంచుకొని పాలకుడవుగానుండి యుక్తవయస్సు వచ్చినపిమ్మట రాజ్యము నాకుమారుల కొసంగుము. ఈకార్యము నొనరించి సామ్రాజ్యము నుద్ధరించుటకు నీవుదక్క వేఱొకడు లేడు." నరసరాజు అంగీకరింపగనే నరసింహరా జతనికి బట్టాభిషేకము చేసి గతించెను. విశ్వాసవంతుడగు నరసరాజు చిరకాలము రాజప్రతినిధిగనే యుండి పరిపాలించెను. నరసరాజు అంతకుమున్ను కుంతలదేశంబు నందును చోళమండలము నందును శ్రీరంగము నందును ఘోరసంగరము లొనరించి విజయము నొందిన పరాక్రమశాలి గావున బౌరు లీతనిపరిపాలనమున కనుకూలురై యుండిరి. ఆంధ్రభాషాభిమానియై యీ నరపాలతిలకుడు నంది మల్లయ్య, ఘంట సింగయ్య అను జంటకవులచే వరాహపురాణమును రచింపజేసి అంకితమునొందెను. నరసరాజు సాళ్వ నరసింహరాజుపుత్రులలో బెద్దవానికి రాజ్యము నొసంగి తాను వ్యవహారముల జూచుచుండెను. నరసరాజువిరోధు లాతనియెడల నెపము గలిగింపనెంచి బాలరాజును జంపించి యాదురంతము నరసరాజునెడ నారోపించిరి. నరసరా జానింద దొలగించుకొనుటకు నరసింహరాజు రెండవ కుమారునకు విద్యానగర రాజ్యమును పట్టాభిషేకము గావించి రాజకీయ వ్యవహారములు తాను సవరించు చుండెను. నరసరాజు శ్రేయమునకు సహింపని దుష్టులగు కొందఱు రాజకీయోద్యోగులు బాలరాజునకు లేనిపోని కొండెములు చెప్పి "నీయన్నను జంపించినటుల నిన్నుంగూడ నరసరాజు చంపింప నున్నా" డని వీలువెంట నూరిపోసిరి. ప్రపంచజ్ఞానశూన్యుడగు నాబాలు డామాటల నమ్మి నరసరాజును ద్వేషింప మొదలు పెట్టెను. ఇంక నుపేక్షించిన బాలరాజు తన కపాయము చేయుటయేగాక విద్యానగరరాజ్యమును గూడ గొలుపోక మానడని తన పలుకుబడి నుపయోగించి సైన్యమునంతయు గూడగట్టుకొని యాతని బంధించి పెనుగొండదుర్గమున నుంచి ఆహారాదులకు స్వల్పభరణము నొసంగసాగెను. కొంతకాల మెటులో గడపి బాలరాజు మరణించెను. తుళువరాజు ప్రత్యర్థులగు నుద్యోగుల నందరను దొలగించి సామ్రాజ్యమును బునరుద్ధరించి యమితవిఖ్యాతి గడించెను.

సాళ్వనరసింహరాజు క్రీ.శ. 1490 ప్రాంతమున మరణించెను. ఈయన కాలమునుండి విద్యానగరము ఆంధ్ర సామ్రాజ్య మనదగి ఆంధ్రకవులకు ఆంధ్రులకు నభిమాన స్థలమయ్యెను. నరసింహరాయలు ధర్మపరిపాలనము చేయుతఱి నాతని పరిపాలనమునందున్న రాజ్యమునకు బరదేశీయులు నరసింగరాజ్యమని పేరిడిరి. ఈయన పరిపాలన కాలమున దురకలు శ్రీరంగము నాక్రమించుకొని వసతులన్నియు నూడలాగుకొనుటచే బ్రాహ్మణులందఱు లేచిపోయిరి. నరసింహరాజు తురకల బోదోలి నగరమును స్వాధీన పరచుకొని పూర్వవృత్తుల నన్నింటిని దిరుగనొసంగి శ్రీరంగస్థాపనాచార్య బిరుదము వహించెను. ఈయనచరిత్ర మంతయు సాళ్వభ్యుదయమను సంస్కృత కావ్యమునందు విపులముగా వర్ణింపబడియున్నది. ఈయనకుగల చితప్రబంధపరమేశ్వరుడు, అభినవనాటక భవభూతి, అష్టభాషా పరమేశ్వరుడు, రసికకవితా సామ్రాజ్య లక్ష్మీపతి మున్నగు బిరుదముల వలన గవియు రసికుడు గూడ నీనృపాలుడై యుండునని తెల్లమగుచున్నది. అదృష్టజాతకుడగు నీనృపుడు విద్యానగర సామ్రాజ్యోద్ధారకుడును, ఆంధ్రుడును గావున మనకెంతయు గణ్యుడు.

_________