Jump to content

ఆంధ్ర వీరులు - రెండవ భాగము/అనపోతనాయడు

వికీసోర్స్ నుండి

తో బూజించుటకంటె నా యనఘుని యాచరణముల నాదర్శముగా దీసికొనుటయే మనభావ్యభివృద్ధికి హేతువు.

________

అనపోతనాయడు

ఇత డప్రతిమానశూరుడై యాంధ్రదేశములోని చాలభాగము మిగుల బరాక్రమముతో బాలించి విఖ్యాతి గాంచెను. శూరవర్యుడగు నీమహానుభావుని జీవితచరిత్రము పఠనీయమనుటలో సందియము లేదు. కాకతీయ వంశాలంకారుడగు ప్రతాపరుద్ర చక్రవర్తి యోరుగల్లు రాజ్యము పాలించుతఱి సింగమనాయడు సేనానాయకుడై ప్రతిఘటించిన సామంతరాజుల దర్పమడంచి యాంధ్రసామ్రాజ్యమును నిష్కంటకము గావించి స్వామిభక్తి వెల్లడించెను. ప్రతాపరుద్రచక్రవర్తి యవనులచే బంధితుడైన పిమ్మట నాంధ్ర సేనానాయకు లంద ఱాంధ్రసామ్రాజ్యమును విచ్చలవిడిగా బంచుకొని పాలించుచుండిరి. నిజాము దేశములోని యాంధ్రదేశము నాసమయమున సింగమనాయ డాక్రమించుకొనెను. ప్రస్తుత కధానాయకు డీశూరుని పుత్రుడె. ఇతడు రేచెర్ల గోత్రీయుడు. వెలమకుల భూషణుడు. ఈవీరుని చరిత్రమును దెలిసికొందము. అనపోతనాయకుని చరిత్రమును నరయుటకుముం దాతని జనకుడగు సింగమనాయనిచరిత్రము కొంతవఱకు దెలిసి కొనుట యావశ్యకము. సింగభూపాలుడు ప్రతాపరుద్రదేవుని యొద్ద సేనానాయకుడుగ నుండి మగతలయను గ్రామ సమీపమున భయంకరసంగ్రామ మొనరించి సామ్రాజ్యమునకు వ్యతిరేకించిన మచ్చకొమ్మనాయకుడను శూరుని వధించెను. జిలుగుపల్లి యొద్ద రుద్రనాయడను వీరుని ఘోరయుద్ధమున జయించి ప్రతాపరుద్రునిమన్ననకు బాత్రుడయ్యెను. ఇతడు మచ్చనాయకగండ, సామంతరాగోల యను బిరుదములనే కాక యెనుబది వరములనుసైతము ప్రతాపరుద్రుని వలన నొంది యసీతివరముల సింగమనాయడని విఖ్యాతి గాంచెను. ఆంధ్రకవు లనేకులు సింగమనాయని వీరజీవితము గానము గావించి కృతార్థులైరి. సింగమనాయనిచరిత్రము గ్రహింప నీక్రిందిపద్యములు సాయము కాగలవు.

"ఉ|| లాలితశౌర్యశక్తి నవలక్ష తెనుంగుదళంబు నాజిలో
     దోలిన పాండ్యభూవిభునితోడి పెసంకువ కోర్చి సన్నుతిన్
     వ్రాలి ప్రతాపరుద్రుసభ వర్ణనకెక్కిన యెఱ్ఱదాచ భూ
     పాలసుతుండు సింగని కభంగుని కేబిరుదైన జెల్లదే||

ఉ|| దాచయ సింగభూవిభుని దాడికి నోడి యరాతిసంఘముల్
     వే చని యీరముల్ పొదలు వృక్షచయంబులుదూరమేను

   లన్| దోచిన కంటకక్షతులు తోయజలోచన లాగ్రహంబుతో|
   జూచి నిజేశులందలిగి చూతురు పాయక చూతురుగ్రతన్||"

సింగమనాయడు త్యాగశీలుడు దేవబ్రాహ్మణభక్తి పరుడునై యనేక ధర్మకార్యములు గావించుటయే కాక యేలేశ్వరమున ననేక బ్రహ్మప్రతిష్టలు గావించినటుల సర్వజ్ఞ సింగమనేడు "రసార్ణవ సుధాకరము" లో జెప్పియున్నాడు. సింగమనాయ డప్రతీప ప్రతాపంబున నాంధ్రదేశములోని రాచకొండ దేవరకొండ దుర్గముల స్వాధీనము గావించుకొని యాంధ్రదేశము బాలించుతఱి నితర దుర్గపాలకులకు నితనికి నంత:కలహములు పెచ్చరిల్లెను. సామంతులుగ నున్న జల్లిపల్లి దుర్గపు రాచవారు పలుమారు ప్రతిఘటించి యపజయము గడించి శూన్యసంకల్పులైరి.

వీరవర్యులగు జల్లిపల్లిరాచవారు పలుమాఱు సింగమనాయనితో బ్రతిఘటించి నష్టపడియు నిరుత్సాహము నొందక యొకానొక సంగ్రామములో నాతని బావమఱదియగు చింతపల్లి సింగమనాయ డనువీరుని బట్టి తమకోటలోని కారాగారమున బంథించిరి. సింగమనాయ డది తెలిసికొని యావీరుని వదలి పెట్టుడని యనేక పర్యాయములు రాచవారికి వర్తమానము చేసెను. ఫలములేకపోయెను. సింగమనాయడు మిగులగోపించి జల్లెలల్లి దుర్గము నిర్మూలము గావించి రాచవారి వధించి యెటులేని చింతపల్లి సింగమనాయని బంధ విముక్తుని గావింపదలంచి తన సైనికబలము నంతయు వెంటగొని దాడివెడలెను. జల్లెపల్లి రాచవారు సింగమనాయని విజృంభణమునంతయు జూచి యపజయము తప్పదని నిశ్చయించుకొని వెఱవు వేఱుగానక దురాత్ముడు మాయాకుశలుడగు తమ్మళ దమ్మాజియను నొకవీరుని జల్లిపల్లి రాచవారు రాయబారమంపిరి. తమ్మళ దమ్మాజి తనరాకముందు రాజభటులచే సింగమనాయకున కెఱుంగజేసి యాతని సమ్ముఖమున కేగి చింతపల్లి సింగమనాయని యా క్షణముననె విడచిపెట్టుటయే గాక యపరాధముగూడ చెల్లింతుమనియు క్షమింపుమనియు వేడుకొనెను. సింగమనాయ డానందించి సైనికుల నందఱును రణోద్యోగము చాలింపు డని యాజ్ఞాపించెను. దమ్మాజి సింగమనాయనితో జాలసే పిష్టగోష్ఠిగ భాషించి భాషించి నమ్మిక పుట్టునటుల వర్తించి కాసెలోనున్న బాకుతో సింగమనాయని వక్ష:స్థలమున నిటునటు దిగునటుల గాఢముగ బొడిచి యావార్త బహిరంగము కాకముందె పాఱిపోయెను.

క్షణములో నీవార్త సైనికనివేశములో నల్లుకొనెను. వీరవర్యులు కొందఱు కోపమాపుకొనలేక దమ్మాజినిబట్టి తేవలయునని యున్నతాశ్వములనెక్కి బయలువెడలిరిగాని యాత డంతకంటె శీఘ్రముగ దుర్గముజేరెను. విచారకరమగు నీఘోరవార్తవిని సైనికులందఱు చాల విచారించిరి. సింగమ నాయనిపుత్రులగు అనపోతనాయడు, మాదనాయడు తండ్రి వెంట నా సంగ్రామమునకు వచ్చియె యుండిరిగాన నావార్త వినగనే తండ్రిసమ్ముఖమునకు జేరిరి. సింగమనాయ డాయుదముతో మరణశయ్యయందుండియు గొంచెమేని విచారము నొందక దు:ఖమునొందు తనయుల నిర్వుర జేరజీరి బుజ్జగించి విచారముతో నిటులనెను. "కుమారులారా! ఈబాధతో నింక బ్రాణముల గొంచెముసేపేని నిలుపజాలను. బాకు పెకలించిన వెంటనే నాప్రాణముపోవ సిద్ధముగనున్నది. పరమునందేని నాయాత్మ శాంతినొందుటయే మీయభిప్రాయమైనచో, మీరు నిజమైన పుత్రులగుచో, రేచర్లగోత్రీయుల పరాక్రమరక్తము మీరక్తనాళములలో బ్రవహించు చున్నచో జల్లెపల్లి రాచవారొనరించిన దురాగతమునకు బ్రతిఫలముగ వారలరక్తముచే నాకు దిలతర్పణముల నొసంగ గోరెదను. మీరిరువురు తడవుసేయక యంగీకారము నెఱింగించి యాయుధోత్పాటనము గావింపుడు." సింగమనాయడు కన్నులు మూసికొనెను. భీమార్జునులకు దీసిపోని యాసోదర వీరు లిరువు రేకకంఠముగ 'మీయాజ్ఞనెఱవేర్చి పితృఋణము నుండి విముక్తలమయ్యెద' మనుచు జనకునిహృదయమున నాటికొనిన యాయుధము బెకలించిరి.

పితృమరణసందర్శనముచే బాలురగు ననపోత నాయనికి మాదానాయనికి బౌరుష మతిశయించెను. పితృవాక్య పరి పాలనము గావించుటయో, శక్తిలేకున్న ఘోరసంగ్రామమున శక్తియున్నంతవరకు బోరి మరణించుటయో కర్తవ్యమని వారికి దోచెను. బ్రతుకుపై నిరాశ జనించెను. పేరుజెందిన శూరలంద ఱాసమయమున నాకుమార రాజన్యుల సమ్ముఖమున కేతెంచి బుజ్జగించి 'మేమందఱము చంపను జావను సర్వ సిద్ధముగా నున్నారము. సింగమనాయడు మీకు జనకుడు, మాకు బాలకుడుగావున నాతనియాజ్ఞపాటించుట మనయందఱకు సమానధర్మము గావున మీరు నాయకత్వము వహింపుడు. ఇపుడు రాచవారిమారణమున కుపక్రమింత' మని హెచ్చరించిరి. కర్తవ్యము నారయు నాకుమారు లత్యుత్సాహముతో దండ్రికి దహనాది సంస్కారములు గావించి సైనికుల నందఱ సమావేశపఱచి పిత్రాజ్ఞ నివేదించిరి. స్వామిభక్తి పరాయణులగు నాయాంధ్రవీరు లందఱు కరవాలముల జళిపించుచు దమ యంగీకారములను వెల్లడించిరి.

స్వల్పకాలమునకె దేవరకొండ, రాచకొండలలో నున్న మూలబల మంతయు రప్పింపబడెను. జల్లెపల్లి ప్రాంత మంతయు వెలమవీరుల సైన్యముతో నేల యీనినటు లుండెను. జల్లెపల్లిలోని క్షత్రియులగుండె లదరెను. విజయముపై నాస తొలంగెను. ఐనను శక్తికొలది పోరాడి సంగ్రామరంగమున మరణించుటయే యిహపరసాధకమని భావించి వారును సంగరమున కాయితమైరి. సింగమనాయని యాజమాన్యము క్రింద నుండ నొల్లని స్వతంత్ర శీలురగు రాచవారు, కమ్మవారు, రెడ్డివారు జల్లెపల్లి రాచవారికి సైన్యముతో నేతెంచి తోడ్పడిరి.ఉభయ వీరులు సంగ్రామమునకు జెంజెర్ల ప్రాంతము రంగస్థలముగా నిర్ణయించు కొనిరి.

జల్లెపల్లి దుర్గాధీశ్వరులగు చంద్రవంశ చాళుక్య రాజుల పక్షమున గోన మల్లారెడ్డి, మంగళపూడి యిమ్మడిరెడ్డి, రావులవరపు మల్లారెడ్డి, పోలూరి పోలారెడ్డి, బండికోటారెడ్డి, వినుకొండ మారారెడ్డి, కుంట్లూరు మారారెడ్డి, అరవపల్లి గౌరిరెడ్డి, కొత్తపల్లికొండారెడ్డి, గౌరారెడ్డి, నాగారెడ్డి, కొలెచెలమకొండ మాచారెడ్డి మొదలగు రెడ్డిరాజులను రామగిరి దుర్గపరిపాలకులును అనంతగిరి, కందికొండ, జమ్మిలోయలోనగు రెండువందలదుర్గముల బరిపాలించు సామంతులును సైన్యముతో వెలమసైనికుల బ్రతిఘటించుటకై తలపడిరి. జల్లెపల్లి రాచవారందఱు మూలబలముల నన్నింటిని మొగలూరు దుర్గమున సురక్షితముగ నుంచుకొని మిగుల సాహస విక్రమములతో వెలమవారి సైన్యమును బ్రతిఘటించిరి. ఇరువాగులవారి కింతయనరాని నష్టముకలిగెను. వీరవర్యులనేకులు గతించిరి. సంగరరంగ మంతయు రక్తప్రవాహముచే బంకిలమయ్యెను. ప్రతిపక్షుల హేతిఘాతములకు జంకక వెలమవారి సైన్యములు మృత్యు దేవతా వదనగహ్వరమును జొచ్చినటుల జగతుర సేనలో జొఱబడి నుగ్గు నూచము గావించిరి. రాచవారి సైనికులు వెలమసైనికుల కెందును దీసిపోక విక్రమముతో బ్రతిఘటించిరి. యుద్ధము చాల విరామముగ జరిగినను జయాపజయములు నిర్ణయింప నసాధ్యమయ్యెను. పిత్రాజ్ఞను నెఱవేర్ప కుండగనే యంతరించుట తమకు గర్తవ్యము కాదని యారాజుసోదరులు భావించి సైనికుల బేరు పేరు వరుసల బిల్చి బహుకరించి యిటులనిరి: 'పదాతులారా! మిమ్ము వేల్పులు స్వర్గద్వారములు తెఱచి సగౌరవముగ నాహ్వానించు చున్నారు. సూర్యమండలము మీకు స్వాగతము నొసంగుచు దన సొరంగములనుండి మిమ్ము స్వర్గలోకము జేర్పగలదు. కాని రాచవారి రక్తముచే బితృదర్పణములు మేమొనరింపక ముందు బరముననున్న సింగమనాయని సందర్శించుటకంటె నక్రమము వేఱులేదు. మీపై గర్తవ్యభారము మిక్కుటముగా గలదు. పగతురవధించి మా యుద్యమము గట్టెక్కింప వలయును. లేదా వంశాంకురమైన లేకుండ మనమందఱము గతింపవలయును." ఈవాక్యములు వినగనే ప్రతిపక్షులు చలించిరి. వెలమవారి సైనికు లినుమడించిన యుత్సాహముతో బ్రతిపక్షులబలములను జిందరవందర గావించుచు వీరవిహారము గావింపసాగిరి. సైనికులతో సమముగ రాజసోదరులుగూడ రణరంగమున కుఱికిరి.

కొంతకాలమునకు రాచవారి బలములన్నియు వినాశనము గావింపబడెను. పరాజయ భయముచేగొందఱు రాచ బలిగావించి అష్టదిగ్రాజ మనోభయంకర, సోమకులపరశురామాది' బిరుదములు గాంచి సమకాలిక రాజన్యులలో మిన్నయై యనపోతనాయడు మిగుల విఖ్యాతి నార్జించెను. అనపోతభూపాలుడు సోమకుల పరశురామాది బిరుదముల వహించినటుల నాతని శాసనములయందె గాక రసార్ణవసుధాకరమున సైత మీతనిపుత్రుడగు సర్వజ్ఞ సింగభూపాలుకు డీక్రింది విధముగా వ్రాసియుంటచే నీకథ విశ్వసనీయ మైయున్నది.

శ్లో|| సోమకుల పరశురామే భుజబలభీమేధిభూమిగోపాలే
    యత్రచ జాగ్రతి శాస్తరి జగతాం జాగర్తి నిత్యకళ్యాణం||

(సోమకుల పరశురాముడు, భుజబల భీముడు, రణదేవేంద్రుడు మొదలగు బిరుదరాజములు గల యన్నపోత భూపాలుడు రాజ్యము పరిపాలించుచుండగా లోకములో శుభపరంపర వెలయసాగెను.)

అనపోతనాయకుడు జల్లెపల్లి క్షేత్రమున గావించిన ఘోర సంగ్రామముతో నాతనిప్రశస్తి దశదిశా పరివ్యాప్త మయ్యెను. ప్రతిఘటింపవచ్చిన రాజవంశీయు లందఱకు సంపూర్ణమైన పరాభవము కలిగెను. అనపోతనాయనిపౌరుష మా విజృంభణముతో నాటివారికి దెలియుటచే విద్వేషభావమును మానికొని ప్రతిపక్షులు శాంతమార్గగాములై సంచరించిరి. అనపోతనాయని విజయముల దెల్పునీక్రిందిగద్యమును నామన గల్గునివాసులగు బట్టులు నేటికి బఠింపుచున్నారు. "బిరుదునకై వసించు నిందువంశపు రాజులు ఐదులక్షల యిరువదివేలు బలంబులతో ద్రిభువనరాయ బిరుదాంకుండని యెఱుంగక జిల్లెపల్లి వీరక్షేత్రంబున నెదిరించిన అఱువదివేల గుఱ్ఱంబులతోను, ఏనూరు మత్తేభంబుల తోడను, పదిలక్షల కాల్బలంబులతోను నెదురునడచిన పద్మజులకును తెనుంగులకును గంధ కస్తూరీ పరిమళద్రవ్యంబు లొసంగి తమ్మెదిరించిన యహంకార మహామానుష భార్గవులైన పద్మజులను రణరంగ దుర్జయులైన తెనుంగులను రణోత్సాహులై వీరసాహ సాహంకారంబులతోను మెఱయు రాజులను కమ్మనాయకులను రంకెలువైచు బిరుదురాహుత్తులను సముఖపు చరుపర్లతో గూడి కలహమందు నుగ్గునుగ్గాడి నూటొక్క రాజులశిరములు ఖండించి యెనుబది యొక్క రాజుల కీకసంబులుగా నుగలాడించి, పదియుమువ్వురు రాజుల రణబలిగావించి, ఆ రణక్షోణినర్చించి దిగంబరుడై కాళీ, మహాకాళీ, శాకినీ, డాకినీ భూతప్రేత పిశాచాలం దలంచి రణదేవ పోతరాజ కలహకంట కాది దేవతల నారాధించి ధ్యానించి రణరాజ రణశూర రణవీరాది నిజబలంబులకు జయంబు గలుగునట్లుగా వైరిరాజులను బలిగావించి బట్టురాజును తానును రణంబు గుడిపి తనవీరాధివీర సాహసంబులు పొగడించుకొని తన ఖడ్గధారల దునిగినవారల స్వర్గంబున కనిపి, తన రేచర్ల గోత్రోద్భవుల కాచంద్రతారార్క మభ్యుదయాభివృద్ధి కలుగునట్లు దేవీ వరంబుబడసి ......" అనపోతానాయ డొనరించిన జల్లెపల్లి క్షేత్రవీరవిహార మీగద్యమువలన విదితము కాగలదు.

క్షత్రియవీరులు సారెసారె కనపోతనాయనితో బ్రతిఘటించి వీరమరణము నొందుచుండిరి. ఆకాలమున నినుగుర్తియను నొక దుర్గమును పూసపాటివారి సంబంధులగు క్షత్రియులు పరిపాలించు చుండిరి. స్వతంత్ర శీలురగు నారాచవారు బలముల నాయితము జేసికొని యనపోతానాయకునితో బ్రతిఘటింప నెంచిరి. నాటివారినందఱ సామంతులను గావించికొని యావదాంధ్రదేశము నేకచ్ఛత్రముగ బరిపాలింప సంకల్పించిన యనపోతనాయడు రాచవారినడంప సంకల్పించి తమ్ముడైన మాదానాయకునకు సర్వసేనాధిపత్యము నొసంగి సంగరమునకు బయనమయ్యెను. మాదానాయకునితో 60000 కాల్బలములు, 20000 ఆశ్వికులు, 7000 ఏనుగులు, 10000 సేనానాయకులు రణమునకు బయనమైరి. సైన్యమును ముందు నడపుచు ననపోతానాయకు డొక యున్నత గజమునెక్కి పోవుచుండెను. వెలమసోదర వీరుల విజృంభణము నంతయు జారులవలన నాలకించి రాచవారందఱు యుద్ధమునకు సన్నద్ధులై బురుజులపై వీరవర్యులనిల్పి ద్వారముల కుభయపార్శ్వముల నాగ్నేయ యంత్రముల నెలకొల్పి ప్రతిపక్షులరాక కెదురు చూచుచుండిరి.

అనపోతనాయనికి సామంతులై యుండనోపని రెడ్డివారు, కమ్మవారు, రాచవారు, నినుగుర్తి దుర్గపాలకులకు దోడ్పడి సంగ్రామమున కాయితమైరి. అన్ని ప్రదేశములనుండి యరుదెంచిన యారాచవారిబలము 5,60,000కు మించి యుండెను. అనపోతనాయకుని ప్రభుత్వము విధ్వంసము గావింప వలయునని రాచవారును, రాచవారి విజృంభణము నశింపజేయ వలయునని వెలమవారు విక్రమించి ఘోర సంగ్రామమును గావింపనాయతమైరి.

విశ్వాస పాత్రులును స్వామిభక్తులునగు వెలమసేనా నాయకులు బహిరంగ స్థలమునందుండియు దుర్గములయందు దాగి యగ్నిగోళములను కుమ్మరించి సైన్యము నంతయు నురుముగావించుచున్న రాచవారికి లొంగక విజృంభించి దుర్గద్వారముల భేధింపదొడగిరి. రాచవారు బలముల నన్నింటిని దుర్గద్వారము చెంతజేరి ద్వారము పగిలిపోయినచో బ్రతిపక్షసైన్యమును బ్రతిఘటింపవచ్చునని సంగ్రామప్రయత్నముల గావించుచుండిరి. అనపోతానాయకుడు, మాదానాయకుడు మదగజంబుల నారోహించి ద్వారమును పొడిపింపసాగిరి. గజశిరోఘాతములచే ద్వారము భిన్నమగుచుండెను. గజముల శిర:ప్రదేశము లాద్వారపుగుబ్బలు తగులుటతోడనే వ్రయ్యలై రక్తము ప్రవహించెను. వెంటనే యావీరులు వేఱొక యేనుగులజంటను రప్పించి వానినారోహించి ద్వారభేదనమునకుదలపడిరి. ఇట్లు విశ్వప్రయత్నముమీద బద్మనాయక వీరులు ద్వారమును భేదించి ముందడుగువేసిరి. రాచవారు మూర్తీభవించిన ధైర్యమో యనునటుల స్థానము వదలక లోని కేతెంచు ప్రతిపక్షవీరుల నందఱ యథావిధి నురుమాడి దుర్గ సంరక్షణమున నప్రమత్తులై విక్రమించిరి. బురుజుల చెంత నున్నసైనికుల మాటిమాటికి బద్మనాయక సైన్యముతో దలపడి పోరుచు నాగ్నేయాస్త్రముల విచ్చలవిడిగా బ్రయోగించుచు నింతయనరాని విప్లవము ఘటించిరి. సంగరమర్మజ్ఞు డగు ననపోతనాయడు ప్రత్యర్థుల యొక్కయు దన యొక్కయు బలాబలములు విచారించి దుర్గములో నెటులేని ప్రవేశింపకున్నచో నపజయము తటస్థించి తీరునని నిశ్చయించి సైనికులనందఱి ద్వారమునుండి లోనికి జొఱబడ నాజ్ఞాపించెను. సముద్రమువలెనున్న పద్మనాయక సైన్యము ద్వారము గాపాడు రాచవారిబలముల నురుమాడుచు గొంచెముసేపటికి దుర్గములోని యన్నిభాగములకు బ్రవేశించి యాయుధశాలల నాక్రమించుకొని ప్రతిపక్షుల నెక్కడివారి నక్కడ నురుమాడిరి. కొన్నిదినంబు లుభయదళంబుల కింతయనరాని ఘోరసంగ్రామము జరిగెను. కడకు జయముపై నాసవదలి యుద్ధకార్యము నిర్వహించు రాచవారు ప్రాణభీతిచే దుర్గ శిఖరమునగల రహస్యగృహమున కేగి దాగికొనిరి. నాయకులు లేమిచే గొలదికాలము మాత్రము పోరాడి యుక్తాయుక్త మెఱుంగక రాచవారిసైన్యమంతయు వెలమవారికి వశమయ్యెను. హతశేషులగు సైనికులు బ్రతుకుము జీవుడా యని పిఱికి పందలై దొంగత్రోవలను బట్టి పారిపోయిరి. కొంతసేపటికి కినుగుర్తిదుర్గము రాజకులమువారి యధీనమునుండి తొలంగి పద్మనాయకుల హస్తగతమయ్యెను. రాచవారు కొందఱు శిఖరమున దాగియున్న సంగతి రహస్యజ్ఞులచే ననపోతానాయకుదు, మాదనాయకుడు గ్రహించి శైలమునెక్కి యాగృహమునన్వేషించి ద్వారమును ముట్టడించి దొంగత్రోవలన్నింటి నరికట్టి సాహసించి లోనబ్రవేశించి యందున్న కొండ రాఘవరాజు, కొండ్రాజు, జగ్గరాజు, గోవిందరాజు, జూటూరు సూరరాజు, స్వర్ణనేనమరాజు, సాళ్వ రాఘవరాజు, తిరుమల ప్రోలరాజు, కుప్పరాజు, నరసరాజు, శ్రీనాధగౌతమీ భూనాధరాజు, శ్రీపతిరాజు, బాలదేవరాజు, మొదలగువారి నందఱను బంధించి యాక్రందనము గావించుచున్నను శరణుగోరినను, పాదములపై వ్రాలి క్షమార్పణము కోరుచున్నను వదలక దయాశూన్యులై వధించిరి.

బలవంతులగు ననపోతరాయునిచే మాదనాయనిచే ముం దెట్టియపాయములు వచ్చునోయని యాప్రాంతముల నాశ్రయించి జీవించు రాజవంశీయులందఱును దేశత్యాగము గావించి ప్రచ్ఛన్నముగ నటనట జీవింపసాగిరి. అనపోతనాయ డును దయాశూన్యుడై రాచపురుగును మిగుల్తు మేని యేనాటికైన నపాయము రాకమానదని తనయాజమాన్యమున గల దేశమంతటనుగల రాచవారలనందఱను బాలురనక వృద్ధులనక స్త్రీలనక శిశువులనక తెగటార్చి సోమకుల పరశురామ బిరుదము సార్థకము గావించుకొని శత్రుజనకంటకుడై రాజ్యము పాలించెను.

కాలక్రమమున దాదాపుగ నిజామురాష్ట్రములోని యాంధ్రదేశమంతయు ననపోతభూపాలకుని హస్తగతమయ్యెను. అతడు భువనగిరి, ఓరుగల్లు, రాచకొండ, రామగిరి, గోలకొండ, కంబముమెట్టు, దేవరకొండ దుర్గములు స్వాధీనముగావించుకొని విరోధియనువాని దలయెత్తనీయకుండ సర్వైశ్వర్య సంపన్నుడై వయ:కాలమునంతయు బరరాజ్యాకర్షణముతో విజయయాత్రలతో గడుపు చుండెను. విజయయాత్రల కేగుచు మార్గమధ్యముననున్న యయ్యనవోలు మైలారుదేవుని సందర్శించి యాగ్రామము నంగరంగ వైభవాదికములతో నుత్సవాదికములు జరుగుటకై దానమొనరించి యనపోతనృపుడట నొకశాసనము స్థాపించెను. ఈవీరవతంసుని విక్రమజీవితము చాలవఱ కాశాసమున లిఖింపబడియున్నది. అందు సోమకుల పరశురాముడగు నీ యనపోతరాజుపరాక్రమ మీవిధమున వర్ణింపబడి యున్నది.

"శ్లో|| ముని రజనిపరశురామ:
     స్థానే వినియుజ్య వైష్ణవం తేజ:
     సోమకులపరశురామే
     దరామవ త్యన్న పోతభూపాలే||"

(తా|| పరశురాముడు తన విష్ణుసంబంధమగు తేజము నంతయు సోమకుల పరశురాముడగు ననపోతభూపాలకుని స్థానమునం దుంచెను.)

అనపోతనాయకు డాంధ్రదేశమునంతయు వశము గావించుకొని రాచకొండ రాజధానిగ నొనరించుకొని శత్రు జనభీకరముగా రాజ్యము చిరకాలమేలెను. ఈరాచకొండ నిజామురాష్ట్రములో నల్లగొండమండలమున నున్నది. ఇది హైదరాబాదునకు దూర్పుగా 34 మైళ్ళదూరమున గలదు. అనపోతనాయని రాజ్యవిస్తృతి బలసామర్థ్యములు గ్రహింప నుద్దేశింతుమేని యీదుర్గచరిత్రము తెలిసికొనుట యావశ్యకము. గ్రామముచుట్టు మిగుల దృడతరమైన కోటయు మిగుల లోతుగల యగడ్తయు గలవు. దుర్గమునకు నాలుగువైపుల నాలుగు ద్వారములు కలవు. అందు దూర్పుద్వారము మట్టివాడ దర్వాజాయనియు, దక్షిణద్వారమును భైరవునిగం'గ యనియు, బడమటి ద్వారమును నేనుగుల దర్వాజాయనియు, నుత్తర ద్వారమును భువనగిరి గండియనియు వ్యవహరింప బడుచున్నవి. ద్వారము లన్నింటిసమీపమున గండభేరుండ వీరాంజ జనేయ కాలభైరవాది వీరవిగ్రహములును వానిక్రింద ననపోతనాయకుని బిరుదములు సమగ్రముగ జిత్రింపబడి యున్నవి. కోటయొక్క యంతరాళమున రాచకొండ యనుగ్రామమును ధన్మధ్యమున రెండుకొండలు గలవు. అందొకటి రాచకొండనియు మఱియొకటి నాగనాయనికొండ యనియు బిలువబడుచున్నవి. రాచకొండ రాజువసించునది. ఇందు రాజనివాసోచితములగు చిహ్నము లనేకములు నేటికి గానవచ్చు చున్నవి. రాచకొండపై శిలామయములును శత్రుజనాభేధ్యములు నగు న్రాలుగుకోటలును నున్నతములగు బురుజులును దర్శనీయములై యలరారుచున్నవి. రెండవకొండయగు నాగనాయనికొండపై గూడ నొక దృడతరమగు దుర్గముకలదు. నాగనాయడను శూరవర్యు డాదుర్గమును నాశ్రయించి యుంటచే దానికాపేరు వచ్చెను. నాగనాయనిచరిత్రము ముందు బఠింప నవకాశము కలదు. అనపోతానాయని సోదరుడగు మాదనాయకుడు దేవరకొండయను దుర్గమున నుండి యగ్రజుని యాజ్ఞాను సారముగ రాజ్యము పాలించుచుండెను. ఈయుభయ దుర్గములు 30 మైళ్ళదూరములో నుండెను. ఆకాలమున నాంధ్రదేశములో ననపోతానాయకుని యంతటి బలవంతుడగు రాజులేడు. డిల్లీ పాలించు నవాబుతక్క ననపోతనాయని నెదుర్కొను రాజు మధ్యదేశమున లేడనుట సహజోక్తియే. అగ్రజునకు సహాయముగ దేవరకొండదుర్గము పరిపాలించు మాదానాయని చరిత్రము పఠించుటయు మనకు బ్రకృతముకాదు. మాధవనాయకుడు పరిపాలించు దేవరకొండ దుర్గము సామాన్యమైనది కాదు. రాచకొండ దుర్గమును మించినదనియె చెప్పవచ్చును. దేవరకొండ దుర్గమున 360 బురుజులు 9 రాజద్వారములు 32 దొడ్డిత్రోవలు కలవు. దుర్గమున గొన్ని దేవాలయములు 32 పెద్దబావులు కలవు. అనపోతనాయని పరిపాలన కాలములో నీదుర్గమును జూపల్లివారు, వేనేపల్లివారు, కటికినేనివారు, మునుగోటివారు, గుమ్మడపువారు, క్రొత్తవారు, మిర్యాలవారు, పానగంటివారు, గుగ్గిలపువా రనుతొమ్మిదిమంది వెలమనాయకులు సైన్యాధ్యక్షులై సంగ్రామధర్మముల నిర్వహించుచుండిరి. మాధవనాయకుడు మిగులత్యాగశీలుడై విక్రమశాలియై యనేక ధర్మములు గావించి ప్రతిసంగ్రామమున నగ్రజునకు సాయపడి కృతకృత్యు డయ్యెను.

మాధానాయకుడు శ్రీశైలమున సోపానములు గోపురమండప ప్రాకారములు గట్టించిన శ్రీశైలోత్తర ద్వారమున నొకమండపము నిర్మించెను. ఇతడు సర్వవిధముల ననపోతరాజునకు సమానుడనుట కీపద్య మాధారము కాగలదు.

సీ|| "పరశురాముడు తండ్రి . పగ సాధ్యముగ జేసి
           తరతరము నృపుల . తలలు నఱకె
     సగరుండు తండ్రికై . పగగిని రోషించి
           తాలజంఘాదుల . తలలు రాల్చె
     దఱిమి యశ్వత్థామ . తండ్రికై యెంతయు
           నల పాండుసైన్యంబు . తలలుద్రుంచె
     మహిమీద సింగయ . మాధవోర్వీశుడు
           తండ్రికై రాజుల . తలలుగోసె

గీ|| గాక యబ్బంగి సంగరాం . గణములందు
     వైరివీరుల గెలువ నె . వ్వాడు చాలు
     దనర భార్గవ నగరులు . ద్రౌణి రావు
     మాధవుడుదక్క శూరులు . మఱియు గలరె||"

ఆకాలమున మహారాష్ట్రదేశములోని చాలభాగము, ఆంధ్రదేశములోని కొలది భాగమును తనయధీనమునందుంచుకొని అల్లాయుద్దీన్ షాహయను మహమ్మదీయుడు కలుబరిగి ముఖ్యపట్టణముగ రాజ్యముపాలింప దొడంగెను. విద్యానగరమునకు ననపోతనాయని రాజ్యమునకు దనరాజ్యము సరిహద్దులలో నుంటచే గాలము గనిపెట్టి యారెండురాజ్యములలోని దుర్గములను అల్లాఉద్దీను గొన్నింటిని స్వాధీనము గావించికొనెను. సరిహద్దులలోనుండి యామహమ్మదీయుడు గావించు దుర్నయము నంతయు విద్యానగరము బరిపాలించు బుక్కరాయలు, రాచకొండ పరిపాలించు ననపోతరాజు గ్రహించి సమీపముననున్న యవనుని మట్టుపెట్టుట కెంతయో యత్నించుచుండిరి.. ఇంతలో అల్లాఉద్దీన్ షాహ క్రీ.శ. 1358 లో గతించెను. అతని రెండవకుమారుడగు మహమ్మద్‌షాహ పితృరాజ్యమునకు వచ్చెను. ఆనూతనుని పరిపాలనమున రాజ్యమం దశాంతి మెండయ్యెను. సేనానాయకులు రాజద్వేషముతో వర్తించుచుండిరి. ప్రజలుగూడ రాజుపై నసూయ జూపసాగిరి. ఈస్థితిలో నాతనితల్లి మల్లికాజెహాన్ విశేషముగ ద్రవ్యము సైన్యము దీసికొని మక్కా మదీనా యాత్రలు గావించుటకై తురుష్కదేశమున కేగెను. ఈ సందిగ్ధస్థితి గనిపెట్టి బుక్కరాయలు, అనపోతనాయడు నైకమత్యము వహించి మహమ్మదీయరాజ్యము నంతము నొందింప నిశ్చయించుకొని మహమ్మదుషాహ సంస్థానమునకు జెరియొక రాయబారిని బంపుచు 'మీతండ్రిహరించిన మాయాంధ్రదేశములోని భాగములు మాకు వదలివేయవలయును, లేకున్నచో మేమిరువురము మీరాజ్యముపైకి సంగ్రామమునకు రానున్నార' మను సందేశమును దెలుప బంపిరి.

రాయబారు లిరువురు కలుబరుగ జేరి మహమ్మదుషాహాను సందర్శించి తమరాజన్యుల సందేశమునంతయు నివేదించిరి. సందిగ్ధావస్థలోనున్న మహమ్మదుషాహ యేమియు బ్రత్యుత్తరము జెప్పజాలక 'యిదిగో అదిగో ప్రత్యుత్తరము నొసంగుదు' నని చాలకాలము గడపి రాజ్యమునం దశాంతి నెలకొల్పు నుద్యోగుల దొలగించి ప్రభుభక్తిపరాయణులు విశ్వాసవంతులు నగు నూతనోద్యోగుల కధికారపదవుల నొసంగి పౌరులపై గ్రొత్తపన్నులు విధించి బొక్కసము క్రమక్రమముగా వృద్ధిగావించి సైనికబలమును స్వల్పకాలములోనె మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. వంచనోపాయముతో దనబలము సంగ్రామమునకు జాలినంత సమకూర్చికొని యాంధ్రులగు రాయబారుల జూచి 'మీరు స్వస్థానముల కేగ వచ్చును. కొలదికాలము సైనికులతో మేము స్వయముగా వచ్చి మీరాజన్యులకు బ్రత్యుత్తరము నొసంగెద' మని మహమ్మద్‌షాహా వారిని పంపివేసెను. 'పదునెనిమిది మాసములుంచికొని చెప్పవలసినసంగతి యిదియా' యని యా నవాబును దెప్పి చేయునదిలేక కలరూపునంతయు దమరాజన్యుల కెఱింగించి సంగ్రామప్రయత్నములో నుంట మేలని వా రిరువురు నిజనివాసములకు జేరిరి. అనపోతనాయడు మహమ్మదుషాహా దురంతము విని యాగ్రహించి సంగ్రామ ప్రయత్నములు చేయుచు బలముల నన్నింటి నొరంగల్లు దుర్గమునకు జేర్చెను. బుక్కరాయలు కొంత సైన్యమును ననపోతనాయని సహాయార్థమై యోరుగంటికి సకాలమునకు బంపెను.

మహమ్మదుఖాను ఓరుగల్లు ముట్టడించుటకై యమితమగు సైన్యము నొసంగి సైన్యాధిపతియగు బహదూరుఖానును బంపెను. దురాశయుడగు నాతడు గోలకొండ హద్దుజేసికొని మధ్యనున్న గ్రామము లన్నింటిని దోచుచు దురంతములు గావించుచు దేవాలయములను మత మందిరములను రూపుమాపుచు గొలదికాలమునకె ఒరంగల్లు సమీపించెను. మహమ్మదీయులబల మమితముగా నుండుటచేతను దమ సైనికులందఱు వ్యాధులచే గృశించియుంట వలనను సంగ్రామము గావింప నశక్తుండై యామహమ్మదీయవీరునితో ననపోతానాయకుడు సంధి కంగీకరించెను. సంధి నియమముల ప్రకారము రావలసిన రొక్కమునంతయు దీసికొని యవన నృపాలుడు గృహాభిముఖుడై త్రోవల గొట్టుచు నమితోత్సాహమున నిజనివాసంబున కేగి యేలికకు దన విజయ వార్త నంతయు నెఱింగించి యుచితసత్కారముల నొందెను.

'దినము మంచిదైన యూరెల్ల దొంగిలు' మన్నట్లు మహమ్మదుషాహ మఱల నేకశిలానగరమును ముట్టడింప వలయునని యుద్దేశించెను. ఇంతలో గొందఱు మహమ్మదీయులు మహమ్మదుషాహ సమ్ముఖమున కేగి యనపోతనాయకుడు తమయొద్ద గొన్ని యశ్వములను గొని సరియగు వెల నొసంగక యవమానించెననియు బ్రతిక్రియ గావించి యవమాన దు:ఖమును వారింపుమనియు ననేకవిధముల వేడుకొనిరి. మతావేశపరుడగు మహమ్మదుషాహ వారల కభయ హస్త మొసంగి యాంధ్రరాజన్యుని బంధించి తీరెదనని పకీ రులముందు వీరప్రతిజ్ఞ గావించెను. "మహమ్మదు సిరాజుద్దీన్" అనునొక భక్తుడు విజయము మనకు గలిగి తీఱునని పది దినము లేకధాటిగ ప్రార్థనములు గావించి పదునొకండవ దినమున యుద్ధమున కేగ మహమ్మదుషాహాను బ్రేరేపించెను. ఆ శుభముహూర్తమున మహమ్మదు షాహా సైయఫద్‌ద్దిను గోరి యనువానికి రాజ్యము నొప్పగించి యమితమగు బలముతో ననపోతానాయకుని బ్రతిఘటింప బయలువెడలి కొంత కాలమునకు గళ్యాణపురము జేరి యట ప్రయాణాయాసమును దీర్చికొని సైన్యము నెక్కువగా వెంటగొని పోయిన జాల కాలమగుటయే గాక వ్రయప్రయాసలు సైతము మిక్కుటముగ నగునని తలంచి వెంటవచ్చిన సైన్యములో జాలభాగము వెనుకకు బంపి నాలుగు వేలమంది యాశ్వికులను బదివేలమంది సైనికులను మాత్రము వెంటగొని యాంధ్ర నగరరాజమునకు జేరెను. మహమ్మదుషాహ కొంచెము ముందుగ నలువురు భటులనుబిల్చి ఓరుగల్లుద్వారముకడ నిల్చి ద్వారరక్షకులను బ్రమత్తులగావించి యేదియో వ్యవహారము బెట్టుకొని యున్నచో దా నాకస్మికముగ బలముతో వచ్చి ద్వారమును భేదింతునని చెప్పిపంపెను. నలువురు యవనులటులె యొరంగల్లు ద్వారముచెంత జేరి తాము గుఱ్ఱపు బేరగాండ్రమనియు ననపోతభూపాలుని కొఱకు గొన్ని యశ్వములను దూరదేశమునుండి కొనివచ్చితి మనియు భాషించు చుండగా ద్వారరక్షకు లావార్తలు నిజములని విశ్వసించి యుచితవిధుల మఱచి వారితో బ్రసంగించు చుండిరి. ఇంతలో నాకస్మికముగ మహమ్మదీయ సైన్యమువచ్చి ద్వారమును సమీపించి లోన బ్రవేశించెను. ద్వారపాలకు లులికిపడి ద్వారములు బంధింప బ్రయత్నించిరి. గాని దృడతరములగు నాద్వారములు వేయుట యసాధ్యమయ్యెను. ప్రచ్ఛన్నముగ భాషింపుచున్న యానలువురు యవనులు నిలువుటంగీలలో గుప్తముగనున్న కరవాలములబెఱికి ద్వారపాలకుల వధించిరి. ఆ యదనున మహమ్మదుషాహ బలములన్నింటిని ద్వారము నుండి పురములోనికి గొనిపోయెను. స్వామిభక్తుడును విక్రమశాలియునగు (నాగనాయడు) నాగయ రుద్రదేవుడు వారల నెదిరించి పురద్వారముచెంత నడ్డగించి సమీపమున గల బురుజునాశ్రయించి స్థిరముగ నిలువబడెను. మహమ్మదీయు లాధీరుని ధాటికాగజాలక బురుజునకన్నివైపులమంటలబెట్టి యీటెలతో బైనున్న నాగయ రుద్రదేవుని క్రుమ్మిరి. చాలసేపు ప్రతిపక్షుల దురంతములకు బ్రతిక్రియ గావించి కావించి యలసి జాఱి యగ్నిహోత్రమునబడి యావీరుడు వీరమరణము నొందెను.

ఎంతయో ప్రయాసపడి యవనసైనికులు పురములో బ్రవేశించిరి. ఆంధ్రవీరులు కోటగోడలమీదను బురుజులమీదను మేడలమీదను నిల్చి యవనదళములపై విచ్చల విడిగ నాగ్నేయగుళికల గ్రుమ్మరింపసాగిరి. పేరుజెందిన యాంధ్రవీరు లనేకులు కరవాలము లుభయహస్తముల గీలించి మార్తుర బలములతో దలపడి ఘోరసంగ్రామము గావించిరి. ఆనాడాంధ్రులు చూపిన యద్భుతవిక్రమమున కనపోతరా జాశ్చర్యము నొంది తానొక యున్నతాశ్వము నెక్కి సైనికుల కుచితధర్మము నెఱింగించుచు బ్రతిపక్షసైన్యముల నురుమాడించుచుండెను. ఆంధ్రులధాటి కాగలేక యవనసైన్యమంతయు ఱాతిపైబడిన గోలికాయలవలె తలకొక త్రోవను బాఱిపోయిరి. అనపోతనాయడు స్వయముగ మహమ్మదుషాహ నెదిరించి యాతనితో జాలసేపు పోరాడెను. అనపోతనాయనిచే మరణముదప్పదని యాతడు నిశ్చయించి కొని ప్రాణముపై దీపిచే బాఱిపోయెను. ఆంధ్రసామ్రాజ్యమునకు విజయార్థమరుదెంచి పరాభవము గడించినందులకు గుర్తుగ మహమ్మదుషాహశరీరముపై ననపోతరాజన్యుడు రెండుమూడు బలమైనగాయములు చేసి పాఱిపోవువానిని వధించుట మగటిమికాదని వెనుకకుమరలెను. మహమ్మదుషాహ చావగామిగిలిన పదునైదువందల సైనికులతో దలప్రాణముతోక బట్టగా గలుబరగపురమునకు బరాభవరూపమగు నభాగ్యదేవతతో గూడ బ్రవేశించెను.

చెప్పరాని పరాభవముతో గలుబరగ జేరియు మహమ్మదుషాహ మఱల నాంధ్రనగరమును ముట్టడింప బలంబుల నాయితము చేయుచుండెను. కలుబరగ బహమనీవంశము నిర్మూలముగావింపకున్న నేసమయమున నేయపాయము కలుగునో యని యనపోతనాయడు చాలతడవు విచారించి డిల్లి చక్రవర్తిగానున్న ఫిరోజీషాహకడ కొకరాయబారము పంపెను. రాయబారులు డిల్లినగరమున కేగి ఫిరోజిషాహాను దర్శించి బహమనీ రాజ్యము నంతమొందించి కలబరగ డిల్లిలో గలుపుకొందురేని యనపోతభూపాలుడు మీకు సర్వబలములతో సహాయము రానున్నా" డనియు లేక మీ రుచితబలముల బంపుదురేని తనబలములతోగూడ ననపోతభూపాలుడు సంగరకార్యము నిర్వహించు'ననియు విన్నవించిరి. నవా బపుడు కుటుంబకలహములలో మగ్నుడైయుంటచే గర్తవ్యశూన్యుడై రాయబారులకు బ్రత్యుత్తరము నొసంగక ప్రకృతము తానా యుభయమార్గముల నంగీకరింప జాలడనియు బరులకు సహాయము గావింపదగినంతబలము తనచెంతలేదనియు దమరాజుతో దెలుపుమని మాత్రముచెప్పెను. రాయబారులు నిరుత్సాహముతో నాంధ్రనగరమునకేగి జరిగినయంశము నంతయు ననపోతభూపాలున కెఱింగించిరి.

అనపోతనాయడు డిల్లినవాబుతో మంత్రాంగము చేయుచున్న సంగతి గూడచారులవలన మహమ్మదుషాహ యాలకించి కోపము నొందినవాడై యనపోతరాయని రాజ్యచ్యుతుని గావించుటయో యతనిచే నంతరించుటయో కర్తవ్య మని యమితబలసమన్వితుడై యేకశిలానగరమునకు దాడి వెడల యత్నించి తనయావద్బలమును రెండుగా విభజించి యం దొకభాగమును "అజీము హుమాయూన్" అనువాని యాధిపత్యముతో విదర్భదేశమును ముట్టడింప బంపి మిగిలిన సగముబలమునకు సరదరుఖానుని యధ్యక్షునిగావించి యాతనివెంటనే తాను స్వయముగా నోరుగంటికి బయనమయ్యెను. ఈసమయమున మునుపటివలెనే సయఫియుద్దీనుగోరీయే సైన్యాదికముల స్వల్పముగా నుంచికొని కలబరగ దుర్గము గాపాడుచుండెను. మహమ్మదీయబలము కొంతకాలమునకు ఒరంగల్లుచేరెను.

యవనబలము లాకస్మికముగ నోరుగల్లు ప్రవేశించు వఱ కచట తగినంతమంది సైనికులు లేకుండిరి. ఒకపద్మనాయక వీరుడుమాత్రము ద్వారమును గొలదిబలముతో గాచుకొనియుండెను. సైనికులందఱు ననపోతనాయనివెంట గొండవీటిరెడ్డిరాజుల బ్రతిఘటించుటకై ధరణికోటప్రాంతముల కేగియుండిరి. మహమ్మదీయులు స్వల్పబలముతోనున్న యేకశిలానగరము నవలీలభేదించి యేయాటంకము లేకుండ లోనబ్రవేశించిరి. మహమ్మదీయులు రాజ్యమునబ్రవేశించి యనేక దురంతముల గావించిరి. వేగులవా రీయుదంతము నంతయు ధరణికోట కేగి యనపోతనాయని కెఱింగించిరి. వెంటనే యనపోతనాయడులికిపడి రెడ్డివారితో నెటులొ సంధిగా వించుకొని యేకశిలానగరము ప్రవేశించెను. మహమ్మదీయ సైన్యము విజయసూచకముగా గోటలో గుడారములో విడిసియుండిరి. ప్రతిఘటించినచో విజయ మసాధ్యమని సంగర మర్మజ్ఞుడగు ననపోతనాయనికి స్ఫురించెను. అదిగాక రెడ్డివారితో జాలకాల మెడతెగకుండ బోరాడుటచే నాంధ్రసైన్యమంతయు భిన్నభిన్నమై యుండెను. మహమ్మదీయ బలమంతయు జెక్కుజెదరక కోటలో స్థిరవాసము నేర్పఱచుకొని యేకశిలానగర రాజ్యమును మ్రింగివేయవలయునని బయలుపందిరులు వేయుచుండెను. దైవముకూడ వారలపక్షముననె యున్నటుల ననపోతనాయని కశుభసూచనము లనేకములు గోచరించెను.

పుట్టినదాదిగ ననపోతరా జపజయము నొందినవాడు కాడు. ఆకాలమున గల యాంధ్రరాజన్యులలో నాతడె పైచేయిగ నుండెను. అనపోతనాయ డొకసేనానాయకుని కుమారు డను నంశము మాపాఠకులు మఱచియుండరు. తన బాహుబలము, శక్తిసామర్థ్యములు, బలసాహసములు వ్యయము గావించి యాతడు నిరాటంకముగ నాంధ్రదేశములోని చాలభాగమును తన ఛత్రచ్ఛాయక్రిందకు జేర్చికొనెను. మొక్కవోని పరాక్రమముగల యనపోతరాజన్యుడు తనదైన్యమునకు విచారించి కొందఱు రాయబారులను మహమ్మదుషాహయొద్దకు బంపెను. అనపోతనాయడు రాయబారము లకు వచ్చినదెచాలునని మహమ్మదుషాహ సంతోషించి తన దుర్బలస్థితి దలంచుకొని గోలకొండ ప్రాంతముల నొసంగినచో వెనుక కేగెదనని వర్తమానమంపెను. కాల పరిస్థితులను గాడముగ యోజించి చేయునదిలేక కట్టకడ కనపోతభూపాలుడు కొంతద్రవ్యము, గోలకొండదుర్గము, దానికి సంబంధించిన గ్రామములు మహమ్మదుషాహ కొసంగ నంగీకరించెను. మధ్యవర్తులుచెప్పిన సరిహద్దులు వెంటనే యేర్పాటుచేసికొని సంధిరూపకముగ నొసంగిన యపరిమిత ధనమునుగొని గోలకొండరాజ్యముతొ దృప్తిపడి మహమ్మదుషాహ గృహముచేరెను. అనపోతనాయడు తన జీవితకాలములో నొందిన పరాజయ మిదియొకటియె యని చెప్పవచ్చును. అనపోతనాయకుని విక్రమజీవితము వెల్లడించు పద్యములు కొన్ని యాంధ్రజనులు పఠించుచున్నారు. చరిత్ర జిజ్ఞాసువుల యభిరుచి నుద్దేశించి యాపద్యములలో ముఖ్యములగువానిని గొన్నింటి నీక్రింద నుదాహరించి యీశూర వర్యుని విక్రమజీవిత గ్రంథము ముగించుచున్నారము.

ఉ|| ఆలములోన సింగవసుధాధిపనందను డన్నపోతభూ
    పాలకమౌళి కోడి యని బారిన వైరుల నాలభంగినే
    తోలునుగాని చంపడట దోసమటంచును నౌర రాయగో
    పాలున కుర్విలోన బశువర్గము గాచుట సాజమేకదా!

మ|| చిరకాలవ్రతశీలుడై నరుడు కాశీతీర్థ నిర్మగ్నుడై
     స్థిరలీలన్ వృషభంబునెక్కి రజతాద్రింజెంది ముక్కంటియౌ

     టరుదే సింగయ యన్నపోత విభుబాహా ఖడ్గనిర్మగ్నుడై
     యదివీరుండు గజంబునెక్కి సురరాజౌ టద్భుతంబెన్నగన్.

సీ|| అశ్వరేవంతుండు . హయమునునెక్కిన
            దండిరాజులగుండె . తల్లడిల్లు
    దరిని దద్భీకర . కరవాలహతికిని
            గర్ణాటసేనలు . కళవళించు
    సంగ్రామపార్ధుని . చాపటాంకృతులకు
            దెలుగురాజ్యంబెల్ల . దిగులుకొనును
    బ్రథన నిశ్శంకకు . బల్లెంబు డాకకు
            నుల్కుల్కు పడుచుందు . రొడ్డెరాజు

తే.గీ|| లతడు దరిమినచో నుండు . వితములేక
      సొరది సురధాని రాజులు . సొంపుదప్పి
      యోటమందిరి సిందూరి . కోటబయల
      సన్నుతఖ్యాతి యనపోత . మన్నెరాజు||

ఉ|| ఒక్కడు జారముఖ్యు డొకడూరకరోజు బరేతపాలకుం
    డొక్కడొకండు రాత్రిచరు డొక్కడు చాల జడుండు
    చంచలుం|డొక్కడొకండు యక్షఘనుడొక్కడు భిక్షుకు
    డేటి దిక్పతుల్|దిక్కుల నన్నపోత జగతీతల నాధుడుదక్క మేదినిన్||

(అనపోత భూపాలుడు క్రీస్తుశకము 1344 మొదలు 1380 వరకు రాచకొండ ముఖ్యపట్టణముగ నాంధ్రదేశము ను బరిపాలించెను. ఇతనిశాసనములు నిజామురాష్ట్రము లోని యయ్యనవోలు, దేవరకొండ, రాచకొండ లోనగు చోటుల కానవచ్చు చున్నవి.)

________

సాళ్వ నరసింహరాజు.

బుక్కరాయల యనంతరము విద్యానగర సామ్రాజ్యమును(రెండవ) హరిహరరాయులు, మొదటి దేవరాయలు, ప్రౌడ దేవరాయలు, మల్లికార్జునరాయలు, విరూపాక్షరాయలు వరుసగ బాలించిరి. వీరిలో బ్రౌడరాయలు చిరకాలము రాజ్యము తన పూర్వులకు సమానముగా బాలించి మితిలేని ధనము భాండాగారమున జేర్చి క్రీ.శ. 1446 ప్రాంతమున మరణించెను. ప్రౌడదేవరాయలకు పొన్నలదేవివలన మల్లికార్జునరాయలు, సింహలదేవి వలన విరూపాక్షరాయలు జనించిరి. మల్లికార్జునరాయలు తనపూర్వులు సంపాదించిన రాజ్యమును జాగరూకతతో గాపాడుకొనుచుండెను. ఒక్క ప్రక్కను మహమ్మదీయులు పూర్వ వైరమును బురస్కరించుకొని కర్ణాట సామ్రాజ్యమును కబళింప నుండిరి. కటకపాలకుడగు కపిలేంద్ర గజపతివిస్తారమగు బలమును సమకూర్చుకొని ఆంధ్రదేశమునందలి ప్రసిద్ధ దుర్గముల నన్నిటిని లోబఱచికొని విద్యానగరమును ముట్టడించెను. మల్లికార్జునరాయలు ఘోరసంగరము చిరకాలము