ఆంధ్ర వీరులు - రెండవ భాగము/హరిహరరాయలు - బుక్కరాయలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పుటకు బరితాపము కలుచున్నది. చిరకాలము వేమారెడ్డి బాహుదర్పమున మొక్కవోని పరాక్రమమున రాజ్యమును బరిపాలించి తన జ్యేష్ఠపుత్రుడును ధర్మవిదగ్రగణ్యుడునగు అనపోతారెడ్డికి రాజ్యభారమునర్పించి కీర్తికాంతను భూలోకమున శాశ్వతముగా నెలకొల్పి స్వర్గలోక మలంకరించెను.

________

హరిహరరాయలు - బుక్కరాయలు

ఆనెగొంది రాజధానిగా జేసికొని ఆంధ్రకర్ణాట దేశములను బాలించుచున్న జంబుకేశ్వరరాయలు డిల్లినుండివచ్చిన మహమ్మదీయ సైన్యముతో జిరకాలము పోరాడి వీరమరణమొందెను. రాజ్యాంగవిదుడగు మహమ్మదీయనృపుడు తన కెంతకును రాజ్యము స్వాధీనము గాకపోవుటచే బ్రజావిశ్వాసపాత్రుడగు హరియప్ప వడయరు అనుమంత్రిని రాజుగజేసి సుంకములు సకాలమున జెల్లించు కట్టుబాటులొనర్చి తన రాజ్యమునకు వెడలి పోయెను.

కాకతీయ సామ్రాజ్యము విచ్ఛిన్నమై ప్రతాపరుద్ర చక్రవర్తి బంధీకృతుడుగ డిల్లికి యవనులచే గొనిపోవ బడిన పిమ్మట మరల స్వతంత్రరాజ్యస్థాపనమున కవకాశములు కలుగకపోయెను. యవనులధాటి కాగజాలక ప్రజలు సుభిక్ష ముగానున్న యితర ప్రదేశములకు వెడలిపోయిరి. వెలమవీరుడగు అనపోతానాయకుడు స్వతంత్రరాజ్యము స్థాపించెను గాని సరియగు దుర్గములు, విశ్వాసపాత్రులగు పరిజనులు లేకపోవుటచే యవనులధాటివలన నారాజ్యముగూడ క్షీణించుచుండెను. ఈపరిస్థితులు గమనించి ఆంధ్రసామ్రాజ్యమునందు సుగంధ భాండాగారాధ్యక్షులగు హరిహరరాయలు, బుక్కరాయలు అను వీరసోదరులు అమితధనసంపత్తితో, వస్తువాహనములతో, బరివారముతో విద్యారణ్య స్వాములవారి ప్రోత్సాహమున స్వతంత్రరాజ్యము స్థాపించుటకు అనుకూల ప్రదేశములు వెదకుచు గొన్నిదినములకు బైనిచెప్పిన ఆనెగొందికిజేరి రాజును లోబఱచికొని తామెరాజుగ రాజ్యము పాలించుచుండిరి. విద్యారణ్యులు నూతన సామ్రాజ్య స్థాపనకు వలయుప్రయత్నములు చేయుచుండెను.

హరిహరరాయలను బుక్కరాయలను వెంటనిడుకొని విద్యారణ్యస్వామి యొకదినంబున నూతన సామ్రాజ్యము స్థాపించుటకు అనుకూలప్రదేశ మెచటనున్నదో వెదకుటకు బయలుదేరెను. కొంతదూరము పోవగా జుట్టును గొండలచే నావరింపబడి సురక్షితమగు నొకవిశాలప్రదేశము తుంగభద్రాతీరమున వారికి గోచరించెను. ఆప్రదేశము మనోహరముగా నుంటచే నందు సంచరించుచు విశేషముల నరయుచునుండ గొన్ని వేటకుక్కలు కుందేళ్లచే దరుమబడి పరుగెత్తుట కన బడెను. విద్యారణ్యులవా రదిచూచి మిగుల నాశ్చర్యపడి రాజసోదరుల కావింతజూపించి: 'రాజకుమారులారా! ఈప్రదేశము నూతనరాజధాని కనువగుతావు. ఇచట రాజ్యమును స్థాపించితిమేని చిరకాలము వెలుగొంద గలదు. ఇదియె నాకభిమత ప్రదేశ' మనగా వారును ఆమోదించిరి. విద్యారణ్యులు శ్రీ విద్యాచక్రానుసారముగ సరిహద్దులు నిర్ణయించి నగరవీధులు రాజమందిరములు, ప్రకృతిజనుల నెలవులు, దుర్గమములకు దావులు నిశ్చయించి శుభముహూర్తమున విద్యానగరమను పేరుతో నూతననగరరాజప్రతిష్ఠ గావించెను. ఆ శుభముహూర్తబలముననో, రాజసోదరుల అదృష్టవశముననో అచిరకాలములో విద్యానగరము మహాపట్టణముగా మాఱెను. విద్యారణ్యులు పెట్టిన శుభముహూర్తమున హరిహరరాయలు తన రాజధానిని ఆనెగొందినుండి విద్యానగరమునకు మార్చుకొని హితబంధు సామంతరాజసమక్షమున మహోన్నత వైభవముతో బట్టాభిషిక్తుడాయెను. పరాక్రమశాలియు న్యాయమూర్తియునగు బుక్కరాయలను బ్రజానుమతంబున విద్యారణ్యులవారు విజయనగర సామ్రాజ్యయువరాజు నొనరించెను. రాజసోదరు లిరువురు నాటగోలె నూతనరాజ్యమును విస్తరింపజేయుటకు సర్వశక్తులు థారవోసి విజయయాత్రలకు బరికరములు సమకూర్పదొడగిరి. విద్యానగరపు సరిహద్దులలో బల్లాలదేవుడను హొయిసలి రాజ్యమును బరిపాలించుచుండెను. అతనిరాజ్యము నెటులేని హరించి తమ రాజ్యములో గలుపుకొన వలయునని హరిహరరాయలు, బుక్కరాయలు తీవ్రకృషిచేయుచుండిరి. ఆకస్మికముగా మహమ్మదుతుగ్లకు హొయిసలరాజ్యమునకు రాజధానియగు ద్వారసముద్రమును ముట్టడించి కోటబగులగొట్టి సంపదల నన్నింటిని జూరగొనెను. ఇక నిటనున్నచో నెప్పటికైన నపాయము తప్పదని బల్లాలదేవుడు దక్షిణార్కాడు మండలములోని తిరువణ్ణామలకుబోయి యది రాజధానిగా జేసికొని పాలించుచుండెను. హరిహరరాయలు తన సహోదరులగు కంపభూపతి, బుక్కరాయలు, మారభూపాలుడు, ముద్దరాజు అను నలువురకు విశేషసైన్యమును ఇచ్చి సమస్త రాజుల జయించిరమ్మని పంపగా వారు సమీపముననున్న చిన్నచిన్న రాజుల నంకితులను గావించుకొని రాజధాని చేరిరి. అపుడె బల్లాలరాజుయొక్క రాజ్యము పూర్తిగా గర్ణాటరాజ్యములో గలసిపోయెను. ఆంధ్రదేశమున సుప్రసిద్ధ దుర్గములగా గణింపబడు పెనుగొండ, చంద్రగిరి, ఉదయగిరి, కనకగిరి దుర్గములు విద్యానగర రాజ్యములో గలసిపోయెను. దినదినక్రమమున విద్యానగరరాజ్యము అభివృద్ధిలోనికి వచ్చుట జూచి చిన్నచిన్నరాజులు తమంతతామె యంకితులై సుంకములు చెల్లింపనంగీకరించిరి. కల్పవృక్షములవలె దనకన్ని విధముల సహ కారులగు నలువురు సోదరులను నాలుగుచోటుల శాంతిస్థాపనమునకు బంపుచు విద్యారణ్యుల సహాయమున దుర్గములను గోటలను బలపరచుచు జిరకాలము రామరాజ్యమువలె హరిహరరాయలు పాలించుచుండెను. క్రమముగా గర్ణాటదేశము, ద్రవిడదేశములోని కొన్నిభాగములు సముద్రప్రాంతములు వనవాసి, మహిశూరు లోనగు రాజ్యములన్నియు హరిహరరాయల పరిపాలనములోనికి వచ్చెను. విశాలమగు తనరాజ్యమున బ్రజాసుఖమె తన సుఖముగా భావించి అవసరమగు తావులకు దన సోదరుల బంపి ప్రజాసౌఖ్యములు విచారించుచు హరిహరుదు రాజ్యము ధర్మబద్ధముగా బాలించెను.

కర్ణాటరాజ్య మీవిధముగా దినదినాభివృద్ధియగుచుండగనే ధూమకేతువు వలె బహమనీరాజ్యమొకటి స్థాపింప బడెను. డిల్లీచక్రవర్తియొద్ద సేనానాయకుడుగా నున్న హసన్ గంగూ అను మహమ్మదీయుడు అల్లా ఉద్దీను షాహ అను బిరుదనామముతో నీనూతన రాజ్యమును క్రీ.శ. 1347 లో దక్షిణాపధమునందు (డక్కన్ దేశమున) నెలకొల్పి క్రమముగా నభివృద్ధికి దెచ్చుచుండెను. మహమ్మదీయులు ముందునకు వచ్చి విజయనగర రాజ్యమును గూడ గబళింప దీవ్రకృషి చేయుచుండిరి. విజయనగరాధిపతి తన బలములో విశేషభాగమును సరిహద్దులలోనుంచి తురకలను రాజ్యమునం దడుగైన బెట్టకుండ జేసెను. యవనుల దాడికి లోనుగాక సురక్షి తముగా నుంటచే విద్యానగరరాజ్యమె మనకు శరణ్యమని పలువురు ప్రజలు దక్కను భూములను విడిచి కర్ణాట రాజ్యమునకు వచ్చిరి. హరిహరరాయల కాలమున బ్రసిద్దు డైన నాచన సోమనాధమహాకవి పెక్కుగ్రంథముల నాంధ్రభాషలో రచించెను. ఈకవి హరిహరరాయల రాజ్యకాలమునం దుండి బుక్కరాయలచే బంపాసరోవర సమీపమునందున్న విరూపాక్షస్వామి సన్నిధానమునందు బుక్కరాయ పురమును అగ్రహారముగా బడసెను. ఆంధ్రకవులకు విద్యానగరమునకు జిరకాలమునుండి సంబంధము గలదనియు గర్ణాటరాజ్యాధీశ్వరు లనబడు విద్యానగర ప్రభువులందఱు ఆంధ్రకవుల బోషించి భాషను బెంపొందించిరనియు జెప్పుటలో గొంచెమేనియు నతశయోక్తి యుండదు. ఆనా డింక నెందఱు కవులు మహారాజు ప్రాపు బడసి సుఖముగా జీవించిరో తెలుపు నాధారములు లేవు.

హరిహరరాయల కాలమున విద్యానగరరాజ్యము ఆఱు భాగములుగా విభజింపబడి యుండెను. అందు ఉదయగిరి రాజ్యమొకటి. ఈరాజ్యమును దొలుత కంపభూపతియు నతని యనంతరము పెద్దకుమారుడగు సంగమరాజు, శావన్న యొడయలు బాలించిరి. విద్యారణ్యుల సోదరుడగు సాయనాచార్యులు సంగమరాజునొద్దమంత్రిగానుండి నెల్లూరునందు నివసించుచుండెను. రెండవది పెనుగొండరాజ్యము. ఇందు గుత్తి, చంద్రగిరి రాజ్యములు కలిసియుండెను. ఈరాజ్యములు రెంటిని గలిపి హరిహరరాయల సోదరులలో నొకరు పాలించుచుండిరి. మూడవది ఆరగమలె రాజ్యము. ఇందు వనవాసి, చంద్రగుత్తి, గోవారాజ్యములు చేరియున్నవి. ఇందు గొంత బాగమును మారభూపాలకుడు గౌడబ్రాహ్మణుడగు మాధవమంత్రిని సచివునిగా నుంచుకొని నుంచికొని పాలించుచుండెను. షిమొగజిల్లాయను, ఉత్తరకన్నడ జిల్లాయును గలసి ఆకాలము నందు ఆరగమలెమండల మనుపేరుతో వ్యవహరింప బడుచుండెను. నాలుగవది ములువాయిరాజ్యము. ఇది మద్దభూపతి పరిపాలనమునం దుండెను. ఐదవది తుళురాజ్యము. ఇందు బరకూరు, మంగటూరు చేరియుండెను. దీనిని హరపాదగౌడ రా జనునాతడు మంత్రిగానుండి పాలించుచుండెను. ఆఱవది రాజగంభీర రాజ్యము. దీనిని బుక్కరాయల కుమారుడగు కుమార కంపరాయలు పాలించుచుండెను. ఈవిధముగా రాజ్యము ఆఱుఖండములుగా విభజింప బడుటచే బరిపాలనమునకు సుకరముగా నుండి విరోధులకు దుర్గమముగా నుండెను. వలసిన తావులకు విద్యానగరమునుండి సైన్యము, ధనము సకాలమునకు జేరునటుల నేర్పాటులు చేయబడెను. అందుచే జిన్నరాజులెవరును రాజ్యములోని భాగములనేని దేరిచూడ లేకపోయిరి. హరిహరరాయల జననకాలము గుర్తింపదగు నవకాశములులేవు. ఆయన రాజ్యమునకువచ్చి విద్యానగరమునందు బట్టాభిషిక్తుడై క్రీ.శ. 1336 నుండి క్రీ.శ. 1355 వఱకు పందొమ్మిది సంవత్సరములు పాలించి పరలోక మలంకరించెను. యువరాజుగ నుండి పేరొందిన బుక్కరాయలు అన్నగారు మరణించినవార్త వినినవెంటనే హోసపట్టణమునం దొక ప్రతినిధిని నిలిపి తాను విద్యానగరరాజ్యమునకు వచ్చి పట్టాభిషిక్తు డాయెను.

బుక్కరాయలు పరాక్రమాదికమున హరిహరరాయల కించుకేనియు దీసిపోవువాడు గాడు. విద్యానగర రాజ్యమున కీతడు పాలకుడుగా వచ్చుసరికి బహమనీసుల్తాను మహమ్మదుపాదుషా, ఓరుగల్లు ప్రాంతములను బరిపాలించు అనపోత భూపాలుని యేలుబడిలోనున్న భువనగిరి, గోలకొండ దుర్గములను వారించి కర్ణాటరాజ్యమును లోగొనుటకు సిద్ధముగా నుండెను. బుక్కరాయలు ముందున కడుగుబెట్టకుండ సరిహద్దుల నెన్నివిధముల గాపాడుచున్నను మహమ్మదుషా విజయనగరముమీదికి దండయాత్రకు అపరిమితబలముతో వచ్చి ఘోరసంగ్రామము గావించెను. కడకు బుక్కరాయలె జయించుటచే మహమ్మదీయులు నష్టావశేషమగు సైన్యముతో నింటిత్రోవ బట్టిరి. బుక్కరాయలు పరాజయము నెఱుంగక వీరవతంసమని పేరొంది ప్రతి సంగరమునందును జయమెవడ యుచు జిరకాలము రాజ్యము పాలించెను. కొంతకాలము గడచినమీదట మహమ్మదుషాహ బుక్కరాయలు సంధిగావించికొని ఒకరి రాజ్యముపైకి వేఱొకరు రాకుండ గట్టడి గావించుకొనిరి. అదిమొదలు బుక్కరాయలు సరిహద్దులను గాపాడు యత్నముమాని తిరుగబడిన సామంతరాజుల పైకిని నూతన రాజ్యములమీదికిని దండయాత్రలకు బయలువెడలి కర్ణాటరాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను.

బుక్కరాయలు రాజ్యము పాలించుసమయమున నతని పెద్దకుమారుడగు కంపరాయలు పలుమాఱు విజయయాత్రల కేగి విజయలక్ష్మీ ద్వితీయుడై తిరిగివచ్చెను. దక్షిణదిశకు జైత్రయాత్రకేగుతఱి నీ నృపాలునివెంట గోపమంత్రియు, సాళువమంగరాజును సహాయులుగా నుండిరి. ద్రవిడదేశపాలకుడగు సాంపరాయలకును గంపభూపతి సైన్యమునకును గొప్పసంగరము జరిగెను. సాంపరాయ లమితబలముతో బాలేరు నాధారముచేసికొని ప్రతిపక్షసైన్యము నెదిరించెను. కంపరాయని సైన్యము సంగరమున నారితేరినదగుటచే ఉపాయాంతరములచే బాలేరుదాటి ఆకస్మికముగా బైనపడి ద్రవిడసైన్యమును దునుమాడెను. సాంపరాయలు వడవీడు దుర్గమునందు జేరెను. ధైర్యస్థైర్యములతో జిరకాలము పోరాడి కంపభూపాలుడు సాంపరాయలను వశపఱచికొని ఆతనిని సామంతునిగా నేర్పరచి సాంపరాయస్థాపనాచార్య బిరు దము వహించెను. మహమ్మదీయులు మధురజయించి దేవళములు రూపుమాపుచుంటచే అర్చకులు శ్రీరంగములోని విగ్రహమునుదెచ్చి తిరుపతిలో దేవస్థానమునందు దాచిరి. ఈ సంగతి కంపభూపతి సేనానాయకుడును జెంజీసీమాపాలకుడును విష్ణుభక్తుడునగు గోపనార్యుడువిని తురుష్కుల బాఱదోలువఱ కావిగ్రహమును శృంగవరపు గోటయందు జేర్చి పూజించునటుల గట్టడిచేసెను. దేవాలయ ధ్వంసకుడగు మహమ్మదీయసేనాని మధురనుండి శ్రీరంగమునకు వచ్చి దేవళముననే బసగావించి కొన్నిదినముల కనారోగ్యముగా నుండి సమయవరమను గ్రామమునకు స్వల్పపరివారముతో నేగెను. అతని దుర్బలస్థితిని గనిపెట్టి గోపనార్యుడు చెంజి నుండి బయలువెడలి సంహరించి శ్రీరంగములో మఱల విగ్రహమును బ్రతిష్ఠించెను. ఈ మహమ్మదీయునకు వెఱచి సత్యమంగలమునందు దలదాచు కొనుచున్న వేదాంత దేశికులు శ్రీరంగమునకు వచ్చి తనకవితా కల్పనలచే గోపమంత్రిని సంతోష పఱచెను. కంపరాయలు గడించిన ప్రతివిజయమునందును గోపమంత్రియే గాక సాళ్వమంగు గూడనుండి యుండెను. సాళ్వమంగు ఆకాలమున బేరెన్నిక గన్నవీరులలో నొకడు. బుక్కరాయలటుల బుత్రుని సహాయమునం గూడ సామ్రాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ప్రసిద్ధి వహించిన వ్యాపార స్థలములను రేవు పట్టణములని పేరొందిన గోవా పట్టణ మాకాలమున విదేశ వ్యాపారమున కాస్పదముగా నుండెను. విజయనగర సామ్రాజ్యమునకు ద్రవిడదేశమునందలి చాలభాగము బుక్కరాయని కాలమున లోబడియుండెను. మళయాళము, సింహళము లోనగు దూరదేశములను బాలించు రాజులుసైతము బుక్కరాయల ధాటికి వెఱచి యెప్పు డెట్టియపాయము గలుగునోయని సామంతులవలె రాయబారులచే వస్తువాహన రత్న సువర్ణాదులు కానుకగా బంపు చుండువారు.

బుక్కరాయలు సర్వసమత్వము, పాపభీతి, దైవభక్తి, పరోపకారబుద్ధిగల ఉత్తమగుణసంపన్నుడు. ఈయన శైవమతమునం దాదరభావము గలవాడైనను అన్యమత ద్వేషము లేక కాలము గడపెను. వైదికమతమునం దెక్కుడు అభిమానము గలవాడుగ నుండి విద్వాంసులగు బ్రాహ్మణులకు విశేషించి వృత్తుల నొసంగి మిక్కిలి యాదరించెను. బుక్కరాయలు సముద్రము, నాగవ్వచెఱువు, బచ్చప్ప చెఱువు లోనగు ప్రసిద్ధములగు తటాకముల నీనృపాలుడు నెలకొల్పి రాజ్యమునందు కఱవు లేకుండ జేసెను. బుక్కరాయలు కళింగదేశము, ఓడ్రదేశము గూడ జయించి మహేంద్రగిరివఱకు దండయాత్ర గావించి నటుల గొన్నిచోటుల జెప్పబడెను. ఈయన మంత్రులలోనొకడగు మల్లినాథు డనబడు భోజనమల్లుడు యవనుల జయించిన మహావీరుడు. విద్యానగర సామ్రాజ్య నిర్మా తల పవిత్ర జీవితములను బఠించు సందర్భమున సామ్రాజ్య స్థాపకుడును వైదికమతాభిమానియు అపరశంకరుడని ప్రశంసింపదగిన వాడును నగు మాధవవిద్యారణ్యులవారి జీవితము నెఱుంగుట చాల నవసరము.

మాధావాచార్యులు, సాయణాచార్యు లను నిరువురు సోదరులుగలరు. వీరు జగద్విఖ్యాతులగు విద్వాంసులు. వీరిది యజుర్వేదము, బోధాయన సూత్రము, భారద్వాజగోత్రము. యవనవ్యాప్తిచే దేశమందు అరాజకము ప్రబలి వైదికమతమునకు విప్లవము కలుగనుంటచే మాధవాచార్యులు హరిహరరాయ బుక్క రాయల బ్రోత్సహించి విద్యానగర రాజ్యమును స్థాపింప జేసెను. పేరునకు రాజులుగ నాసోదరరాజుల నుంచి రాజ్యచక్రము నంతయు మాధవాచార్యులే స్వయముగా బొంగరమును ద్రిప్పినటులద్రిప్పి మతధర్మములను గాపాడుటకు దన జీవితమునంతయు ధారపోసెను. మాధవాచార్యులు, సాయణాచార్యులు సంస్కృతములో సమస్తవిషయములందును గ్రంథములను రచించి గీర్వాణభారతి కఖండమగు సేవ గావించిరి. మాధవాచార్యులు సన్యాసము స్వీకరించి విద్యారణ్య స్వామియను నామాంతరము వహించి శృంగేరీపీఠమున కధ్యక్షుడయ్యెను. సన్యాసాశ్రమమునందు సైతము విద్యారణ్యులు విద్యానగర సామ్రాజ్యక్షేమమునకు బాటుపడు చుండెను. మాధవ విద్యారణ్యులవారు విద్యానగరమును బరి పాలించిన ప్రథమ హరిహరరాయల బుక్కరాయలద్వితీయ హరిహరరాయల కాలములలో మంత్రిగ ధర్మోపదేశికుడుగా నుండి రాజ్యక్షేమమె వైదికమతక్షేమముగా భావించి ఆయారాజులను వైదికధర్మప్రపక్తులుగ నేర్పఱచి నూఱు సంవత్సరములకంటె నెక్కుడుకాలము జీవించి క్రీ.శ. 1386 లో సమాధిగతు డయ్యెను. తమ్ముడగు సాయణాచార్యులుగూడ సంగమరాజు నొద్ద మంత్రిగానుండి విద్యానగరమునకు దగినసేవ గావించి రాజ్యసహాయమున మతసంరక్షణమున నెక్కువ పాటుపడెను.

విద్యారణ్యులవారి యుపనిష ద్భాష్యములు, వేదాంత పంచదశి, వివరణ ప్రమయసంగ్రహము, బ్రహ్మవిదాశీర్వాద పద్ధతి లోనగు గ్రంథములు అద్వైతమతప్రవిష్టులగు విద్వాంసులు మిగుల బూజ్యభావముతో బఠించుట యీ మహామహుని ప్రశస్తికి దార్కాణము. తొలుత రాజ్యమును నిలువ బెట్టుకొన్నగాని మతధర్మముల గాపాడుకొన జాలవని మహా సామ్రాజ్యమును నెలకొల్పి దాని క్షేమమె తన క్షేమమని భావించిన విద్యారణ్యుల జీవితము నేటి పండితలోకమున కాదర్శప్రాయ మయ్యెనేని భరతఖండము సర్వవిధముల నభ్యున్నతికి రాకపోదు. మానవజీవితమునకు, మతమునకు విజ్ఞానమునకు, స్వరాజ్యమునకు సంబంధము కలుగజేయుట మహాత్ముడగు విద్యారణ్యుల యాశీర్వచనమున నాంధ్రులకు బట్టువడ బరమాత్ము డనుగ్రంచుగాత! హరిహర రాయలకు బుక్కరాయలకు ఉత్తరవయస్సు నందు మాధవమంత్రియను మఱియొక విద్వాంసుడు విద్యానగర సామ్రాజ్య ధూర్వహుడై మంత్రి పదవి యందుండి మిగుల బేరొందెను. కొందఱు మాధవవిద్యారణ్యులు మాధవమంత్రి యొకడని తలంచుట భ్రాంతిమూలము. ఇరువుర గోత్రము, తలిదండ్రుల పేరులు చూచిన వేఱువేఱు పురుషులని స్పష్టముగా దెలియుచున్నది. మాధవమంత్రి గీర్వాణము నందు బెక్కు గ్రంథముల రచించెను. నాస్తిక మతమును ఖండించెను. బుక్కరాయల ప్రభుత్వకాలమున నీతడు పశ్చిమదిశ కధిపతిగానుండి విరోధిరాజులకు వీరస్వర్గము ప్రసాదించు చుండెను. ఈ వీరుడు గోవాపట్టణమును జయించి యందు బాదుకొనియున్న మహమ్మదీయులను బోదోలి యాదవుల కారాజ్యము ప్రసాదించెను. ఈయన జీవిత చరిత్రము నింకను దెలిసికొనవలసి యున్నది. ఇంక నెందఱు స్వార్థత్యాగు లీ సామ్రాజ్య సహాయులైరో యెఱుంగనయితికాదు. విద్యారణ్యులవారు మకుటములేని చక్రవర్తియై విద్యానగర రాజ్యమును సర్వవిధముల నభ్యున్నతికి దెచ్చెను. ఆకాలమున గేవల విద్యావినోదములతో గాక సంగర రంగములతో గాలయాపనము జేసిన మాధవమంత్రి, సాయణాచార్యులు, సాళ్వమంగు, గోపప్రధాని యొనరొంచిన మహత్తర సేవవలనను వైదికమత మింతవఱకు మనదేశమున నిలుచుట కవకాశము గలిగినది. ధర్మ సంరక్షణమునకై రాజ్యము స్థాపించి ప్రజా శాంతి కొఱకు సర్వస్వము ధారపోసి మతమునకు జాతికి జన సముదాయమునకు గల్పతరువువలె నున్న విద్యానగర రాజుల జీవితములు పఠనీయములు. విద్యానగర సామ్రాజ్యము నందలి యాదాయములో జాలభాగము ఆకాలమునం గవులకు, మఠాధిపతులకు, విద్వాంసులకు నుపయోగింపబడు చుండెడిది. ప్రతిపౌరుడు సామ్రాజ్య రక్షణమును గృహకృత్యముగా భావించు చుండువారు.

రాజన బ్రజలకు సేవకుడు. ప్రజాసౌఖ్యముల కాతడుత్తరవాది. సమస్త ధర్మముల నాచారణములో బెట్టి దేశమును సత్పథమున నడపుటకు రాజె బాధ్యుడు. ఇట్టి బాధ్యతల గురుతెఱింగి రాజ్యస్థాపనమునందు గాక రాజ్యాభ్యుదయ కాలమున గూడ స్వధర్మము మఱువని హరిహరరాయ బుక్కరాయల జీవితము అనంతరము విద్యా నగరరాజ్యము ఏలిన నృపులందఱకు నాదర్శప్రాయముగ బరిణమించెనేని పరాధీనత ఆంధ్రులకు దటస్థించునదికాదు. విద్వాంసులు సామ్రాజ్యాభ్యుదయమునకు బాటుపడుటయు సన్యాస స్వీకరణానంతరము మఠాధిపతిగా నుండియు దేశమునెడ ననురాగము వహించుటయు విద్యారణ్యుల జీవితమునందు గల పవిత్రాంశములు. మహామహుడగు విద్యారణ్యుని దైవభక్తి తో బూజించుటకంటె నా యనఘుని యాచరణముల నాదర్శముగా దీసికొనుటయే మనభావ్యభివృద్ధికి హేతువు.

________

అనపోతనాయడు

ఇత డప్రతిమానశూరుడై యాంధ్రదేశములోని చాలభాగము మిగుల బరాక్రమముతో బాలించి విఖ్యాతి గాంచెను. శూరవర్యుడగు నీమహానుభావుని జీవితచరిత్రము పఠనీయమనుటలో సందియము లేదు. కాకతీయ వంశాలంకారుడగు ప్రతాపరుద్ర చక్రవర్తి యోరుగల్లు రాజ్యము పాలించుతఱి సింగమనాయడు సేనానాయకుడై ప్రతిఘటించిన సామంతరాజుల దర్పమడంచి యాంధ్రసామ్రాజ్యమును నిష్కంటకము గావించి స్వామిభక్తి వెల్లడించెను. ప్రతాపరుద్రచక్రవర్తి యవనులచే బంధితుడైన పిమ్మట నాంధ్ర సేనానాయకు లంద ఱాంధ్రసామ్రాజ్యమును విచ్చలవిడిగా బంచుకొని పాలించుచుండిరి. నిజాము దేశములోని యాంధ్రదేశము నాసమయమున సింగమనాయ డాక్రమించుకొనెను. ప్రస్తుత కధానాయకు డీశూరుని పుత్రుడె. ఇతడు రేచెర్ల గోత్రీయుడు. వెలమకుల భూషణుడు. ఈవీరుని చరిత్రమును దెలిసికొందము.