ఆంధ్ర వీరులు - రెండవ భాగము/విష్ణువర్ధనుడు

వికీసోర్స్ నుండి

విష్ణువర్ధనుడు.

ఆంధ్రవీరులలో జాళుక్యులు మిగుల బ్రసిద్ధులు. వీరల నామము దేశచరిత్రములయందు జిరకాలమునుండి వినబడుచున్నది. మనచరిత్రకారులు విషయసుబోధనమునకు గాను రాజమహేంద్రవరప్రాంతము పాలించినవారిని దూర్పుచాళుక్యులనియు నిజాంరాష్ట్రమునందలి కుంతలదేశమును పాలించినవారిని బశ్చిమచాళుక్యులనియు బేరిడిరి. మనమిపుడు చదువబోవు ప్రసిద్ధపురుషుడును వీరోత్తంసుడునగు విష్ణువర్ధనమహారాజీ యుభయవంశజులకు మూలపురుషుడు. చాళుక్యరాజుల చరిత్రములలో నీయనఘుని జీవితచరిత్రము మేలుబంతిగా నున్నది.

చాళుక్యుల జన్మాదికములను గూర్చి యనేకకథలు గలవు. గ్రంథములందు శాసనములందును జాళుక్యులు చంద్రవంశ క్షత్రియులుగా జెప్పబడిరి. బ్రహ్మదేవు డొకనాడు పేరోలగమున నుండగా నచటకు సురపరివృతుడగు దేవేంద్రు డరుదెంచి యుచితసత్కారములొంది యాసనాసీనుడై 'వాణీ వల్లభా! కలియుగమాహాత్మ్యమునగ బోలు ధర్మము సన్నగిల్లినది. మనుజులు యజ్ఞయాగాదిక్రతువులు చేయుట లేదు. ప్రజలను ధర్మమార్గమున ద్రిప్పగల రాజును సృజింపు'మని వేడుకొనెను. బ్రహ్మ యందుల కంగీకరించి ఇంద్రుని బంపి వేసెను. ఉత్తముడగు రాజును సృజింపవలయునను నాందోళనములోనుండి బ్రహ్మ అర్ఘ్యమిడుటకై జలము పైకెత్తగా నతని చులుకము (పుడిసిలి) నుండి తేజస్సంపన్నుడు వీరవతంసుడునగు నొకమహాపురుషు డుద్భవమయ్యెను. ఆవీరుడు బ్రష్మనుజూచి 'నన్నేల సృజించినాడవు? నాకర్తవ్యమేది?యని యడుగగా 'నీవు చులుకమునందు జనించితివిగావున చాళుక్యుడవు. ధర్మము దప్పనీయక ప్రజల బాలించి యుత్తమక్షత్రియవంశమునకు గర్తవుగ'మ్మని యాశీర్వదించి వానిని భూలోకమునకు బంపెను. తరువాత చాళుక్యుడు తపస్సంపదచే గొప్పశక్తిగడించి రాజ్యము స్థాపించెను. ఈయన రాజధాని యయోధ్య. ఈయనవంశము మిగుల బ్రసిద్ధులగు హరితుడు, మానవ్యుడు అను నిద్దరు వీరులు జనించిరి. తరువాత నీవంశీయులలో గొందరు దక్షిణాపథమునకు వచ్చి స్వతంత్ర రాజ్యములు స్థాపించి యార్షమతము నుద్ధరించిరి. ఈ చాళుక్యులను మానవ్యసగోత్రులని వ్యవహరించుచున్నారు.

దక్షిణాపథమున బ్రసిద్ధుడై యున్న విజయాదిత్యుడను చాళుక్యరాజు అపరిమిత సైనికబలముతో దండయాత్రకు బయలువెడలి త్రిలోచనపల్లవుడను సుప్రసిద్ధనృపాలుని రాజ్యమును హరింపనెంచి చిరకాలము యుద్ధముగావించెను. పరాక్రమశాలియగు త్రిలోచనపల్లవుడు ఆకాలమున బ్రసిద్ధులగు పల్లవరాజులను సహాయముగా దీసికొని విజయాదిత్యు నితో నెలలతరబడి పోరాడి యాతని మడియించెను. సైనికులందఱు రాజుపడుటజూచి చెల్లాచెదరైపోయిరి. విజయాదిత్యుని పట్టపుభార్య యా సమయమున గర్భవతిగానుండెను. స్వార్థపరాయణులగు సైనికులు భటులు తమత్రోవను దామేగుటచే రాణి దిక్కుమాలినదై విరోధిరాజులచే బట్టుపడిన నాపద కలుగునేమోయని చాల విచారపడెను. గర్భవతిగానుంటచే జాళుక్యవంశాంకురమును దగ్ధముచేసి సహగమనము గావించుట కంగీకరింపకపోయెను. త్రిలోచనపల్లవుని ధాటికి వెఱచి రాజ మహిషి కెవరును తావొసంగరైరి. విశ్వాసపాత్రురాండ్రగు పరిచారికలు, పురోహితుడు జాగరూకతగా రాజపత్నిని గాపాడి శిబిరమునుండి యర్ధరాత్రమున నామెను వెంటనిడికొని మహారణ్యమునకు జేరి కొన్నిదినములకు ముదివేము అను నగ్రహారమునకు జేర్చిరి. అగ్రహారాధిపతి పేరు విష్ణువర్ధనభట్టారకుడు. సమస్తశాస్త్ర పారంగతుడు. అతిధిపూజా పరాయణుడగు నీ బ్రాహ్మణుడు తన యగ్రహారమునకు వచ్చిన నూతనుల నందఱను గృహమునకు రావించి యాతిధ్యమొసంగి సత్కరించెను. చాళుక్యపురోహితుడగు బ్రాహ్మణుడు విష్ణువర్ధన భట్టారకునితో నేకాంతమున జాళుక్యవంశమునకు గలిగిన విప్లవము, విజయాదిత్యుని యకాలమరణము నివేదించి రాజపత్ని నాయనపాదములపై బడవేసి చాళుక్య వంశాంకురమును గర్భమున ధరించిన యీసాధ్విని గాపాడమని వేడుకొనెను. విజయాదిత్యుని, నాతని ధర్మపత్నిని స్వయముగా నెరింగినవాడుకాన విష్ణువర్ధనుడు గతమునకు జింతించి రాజపత్నిని నోదార్చి పుత్రికాభావముతో బ్రేమింతునని వాగ్దానము గావించి రాజపత్నిని దనయింట నుంచికొని వేయికనులతో గాపాడుచుండెను.

విష్ణువర్ధన భట్టారకుడు సమయోచితములగు పురాణ కథాదికముచే భర్తృచింతయంతయు రాజపత్నికి మఱపునకు వచ్చునటులజేసి వీరమాతవు గమ్మని యాశీర్వదించెను. నవమాసములు నిండినపిమ్మట నొక శుభ ముహూర్తమున రాజపత్ని తేజోవంతుడును, రూపవంతుడునునగు నొక కుమారుని గనెను. విష్ణువర్ధన భట్టారకు డాబాలుని జననకాలమును బట్టి జాతకమువ్రాసి యీబాలుడు పూర్ణాయుర్దాయ సముపేతుడై యాంధ్రదేశము నంతయు బరిపాలించురాజు కాగలడని తెలిసికొని మిగుల వైభవముగా జాతకర్మాదికిములు ముగించెను. రాజపత్ని, విష్ణువర్ధనభట్టారకుడు తన కొనరించిన మేలునకు, దనవంశమునిలిపి కావించిన మహోపకారమునకు బ్రతిఫలముగ దనకుమారునకు విష్ణువర్ధనుడని నామకరణము గావించెను. కొడుకులు లేరను విచారముమాని విష్ణువర్ధన భట్టారకు డాబాలుని దన కుమారునివలెనే గారాబముతో బెంచి పెద్దవానినిజేసి బాల్యముననె పురాణవీరుల విక్రమములు బోధించి వేదము, శాస్త్రము, ధనుర్విద్య నేర్పిం చెను. సమస్తవిద్యలయందును నాబాలుడు ప్రవేశముగలవాడై సర్వశాస్త్రప్రారంగతుడై యొకానొక దినమున దనతల్లియొద్ద కేగి "మనలను క్షత్రియులని లోకులు చెప్పుకొనుచున్నారు. మనము బ్రాహ్మణ గృహములో జిరకాలమునుండి యుండుటకు గారణమేమి? నాతండ్రి యెవరు? నేనేశాఖకు జెందినవాడనో యాజ్ఞయి"మ్మని యడిగెను. కుమారుని మాటలు విన్నంతన పట్టరాని దు:ఖమున రాజపత్ని పరితపించి కుమారున కేమియు బదులు చెప్పజాలకపోయెను.

విష్ణువర్ధన భట్టారకుడు విచారపరవశురాలై యున్న రాజపత్నిని జూచి "చింతల గారణమేమి? నావలన నేమేని ప్రమాదము జరుగలేదుగదా? గడుసరియై నీకుమారు డేమేని నొవ్వనాడెనా? తెలుపు"మని పలువిధముల నడిగెను. విచారాతిశయమున రాజపత్ని బదులాడజాలకపోయెను. విష్ణువర్ధనుడు బ్రాహ్మణోత్తమునకు నమస్కరించి తానే తల్లి విచారపడుటకు గారకుడనియు దనకులశీలాదికముల బ్రశ్నించుటచే నిటుల బలవించుచున్నదనియు నివేదించెను. విష్ణువర్ధన భట్టారకుడు బాలునిజేరజేరి గతవృత్తాంతము, తల్లి యచటికివచ్చిన హేతువు, తానామెను తనను సాదరమున బోషించుచున్నవిషయము నివేదించెను. రాజకుమారుడు కనుల నెఱుపెక్క 'బ్రహ్మజ్ఞ శిరోమణీ! తెలియక ముందు నీసొమ్ముదింటిని. నీకు ఋణపడి యున్నాను. ఈజన్మమున నీఋణము తీర్చుగొన గలుగుదు నేని ధన్యుడను. నాతండ్రినిజంపిన పల్లవుల మారణముగావించుటయు నచిరకాలమున మహాసామ్రాజ్యము స్థాపించి మాకుటుంబమునెడ ననురాగముజూపిన ధన్యుల గౌరవించుటయు నాకర్తవ్యము. నేనిక నాజ్ఞపుచ్చుకొందు సెలవిం'డని పలికెను. బ్రాహ్మణుడు బాలుని పుత్రప్రేమతో బెంచిన వాడగుటచే నెడబాటునకు సహింపజాలక నేనును నీవెంట వచ్చి నీకనుకూలమగు పరిచర్యగావింతుననెను. రాజపత్నియు గుమారుని విడుపజాలక తాను రానుద్దేశించెను. బాలు డెట్టకేలకు దండ్రివలె దన్నుబెంచు బ్రాహ్మణోత్తముని దల్లిని ఒప్పించి వారివలన దివ్యాశీర్వాదములను బడసి తపశ్శక్తిచే గాని విజయము లభింపజాలదని మహారణ్యములకు బోయెను. రాజకుమారునకు బయలుదేరినదిమొద లనేక శుభశకునములయ్యెను. అన్నియు దన భావ్యాభివృద్ది సూచకములుగా దలంచి దేవతానిలయమనియు జాళుక్యులతపో భూమియనియు బేరొందిన చాళుక్యపర్వతమున కేగి రాజకుమారుడు చిరకాలము తపస్సుచేసెను. సప్తమాతృకలతో గుమారస్వామి యాబాలునకు బ్రత్యక్షమై "నీవెచటికేగినను సింహమువలె విజయము గడింతువు గాన విజయసింహనామము ధరించుమనియు, దిరుగ మీవంశము నిలుచుటకు విష్ణువర్ధన భట్టారకుడె కారకుడుగాన వంశీయులందఱు నామాంతమున విష్ణువర్ధనపదము జేర్చుకొను డని చెప్పి యాశీర్వదించి యంతర్ధాన మాయెను. కొంతసేపటికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై వరాహధ్వజము నొసంగి యీ ధ్వజసహాయమున విరోధిరాజుల జయించి పేరుగాంచగలవని యాశీర్వదించి యదృశ్యమయ్యెను. విజయసింహ బిరుదాంకుడగు విష్ణువర్ధనుడు గృహముచేరి బ్రాహ్మణోత్తమునకును దన తల్లికిని దానొందినవరములను దెలిపెను. విష్ణువర్ధన భట్టారకుడు మిగుల సంతోషించి విజయసింహునకు దిగ్విజయయాత్ర గావింప నొక శుభముహూర్తము నిశ్చయించెను. తల్లి బాలునకు వీరవేషమువేసి యాశీర్వదించి పంపెను.

విజయసింహుడు దైవబలముతో జైత్రయాత్రకు బయలుదేరు చున్నాడని విని రాష్ట్రకూటులయెడలను బల్లవుల యెడలను ద్వేషభావము గల పౌరు లనేకులు జయసింహునకు ధన సహాయము గావించిరి. తన తండ్రినాటి భటులలో బలువురు తమకు దామ వచ్చి జయసింహుని గలిసికొనిరి. అపరిమిత బలముతో బయలు దేరిన విజయసింహుని ధాటికి రాజు లెవ్వరు నాగజాలక పోయిరి. ఆకాలమున బ్రసిద్ధులుగా నున్న కదంబరాజులు, గాంగరాజులు కొంతవఱ కెదిరించి పరాజయశరణ్యులై యంకితులైరి. రాష్ట్రకూటులలో గృష్ణుడను రాజాకాలమున బ్రసిద్ధుడుగా నుండి విస్తార విశాలమైన దేశమును బాలించుచుండెను. అతని కుమారుడు ఇంద్రవర్మ. తండ్రిని మించి తనరాజ్యమున విరోధియను వాడు లేకుండ జేసి శత్రుజనభీకరుండై రాజ్యము నేలు సమయమున విజయసింహు డాతనిపైకి దండయాత్రకు వెడలెను. ఉభయ సైన్యములకు జిరకాలము భయంకర సంగ్రామము జరిగెను. దురదృష్ట వంతుడగు ఇంద్రవర్మబలము సన్నగిల్లెను. చేయునది లేక యపజయము నిశ్చయమని తెలిసికొని విజయసింహుని శరణు వేడగా శరణాగతత్రాణ బిరుదాంకుండగు నారాజన్యుడు అపరాధముగా గొంతధన మాతని నుండి కైకొని సామంతుడుగ నేర్పాటు చేసెను. పల్లవులపై సహజ ద్వేషభావముగల యీ రాజతిలకుడు చిక్కినపల్లవరాజును జిక్కినటుల బంధించి తండ్రినాటి పగను వడ్డితో గూడ దీర్చికొని దక్షిణాపథమున నింతటి రాజు లేడను ప్రతిష్ఠ వహించెను.

విజయసింహుడు విజయయాత్ర ముగించి యగ్రహారమునకు జేరి తన విజయకథలు తండ్రితో సమానుడగు విష్ణువర్ధన భట్టారకునకు దల్లికి నివేదించెను. తరువాత నొకశుభ ముహూర్తమున చాళుక్యసామ్రాజ్యమును వాతాపియను నగరమునందు స్థాపించి ప్రాక్పశ్చిమ చాళుక్య వంశముల రెంటికిని మూలపురుషు డయ్యెను. కాంచీ నగరమునందు బల్లవరాజ్య మొకటి యాకాలమునందు సుప్రసిద్ధము గానున్న వార్తవిని విజయసింహు డపరిమిత బలసమేతుడై దండయాత్రకు బయలువెడలెను. పల్లవరా జీవర్తమానమువిని ప్రతి ఘటించినచో బరువుదక్కుట దుస్తరమని తనకుమార్తె నాతని కొసంగి పరిణయముగావించి రాజ్యములో గొంతభాగము నరణముగా నిచ్చెను. విజయలక్ష్మితో నర్థాంగలక్ష్మితో విజయసింహుడు తననగరముజేరి విజయాదిత్యుడను కుమారుని గాంచెను. ఈనృపాలుడు క్రీ.శ. 450 ప్రాంతమున నుండి యుండునని చరిత్రమువలన దెలియుచున్నది. ద్రవిడాంధ్ర కర్ణాటమహారాష్ట్ర దేశములు చిరకాలము పరిపాలించి ధర్మసంస్థాపనము గావించిన లోకోత్తరకీర్తిధుర్యులగు చాళుక్యులలో విజయసింహుడు ప్రథమగణ్యుడు. ఈయన సంపూర్ణ జీవితము నెఱుంగదగు నాధారము లింతవఱకు వలసినన్ని లభింపనందున విస్తరించి తెలుప వీలుకాదయ్యెను. అసహాయ స్థితియందుండి స్వశక్తిచే లోకోత్తర ఖ్యాతినొందిన విజయసింహుని కార్యదీక్ష కార్యశూరులగు నాంధ్రసోదరులకు మార్గదర్శక మగుగాక!