ఆంధ్ర వీరులు - రెండవ భాగము/మాధవవర్మ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మిగుల బేరు ప్రతిష్ఠల గాంచెను. సోమరా జీతనికుమారుదు. ఇతడు పరాక్రమమున నాంధ్ర రాజ్యాధినేతలకు సర్వ విధంబుల సాటివాడై ప్రత్యర్థుల ననేకుల జయించి రాజ్యము మిగుల నభివృద్ధిలోనికి దెచ్చి కందారములో శత్రుజనాభేద్యముగ నొక గొప్ప కోటను గట్టించి తండ్రికాలము కంటె దన కాలమున నైశ్వర్యము నభివృధిలోనికి గొనివచ్చి పరాక్రమైక జీవనుడై ధర్మపరిపాలనము గావించు చుండెను. ఆంధ్రదేశమునకు జెందిన కొంతభూభాగము నీతడు నిరంకుశముగ పరిపాలించుచుండ దోడివారలకు గన్నెఱ్ఱ జనింపసాగెను. వీరవర్యుడగు సోమరాజు దైవమును దక్క తదన్నుని లెక్కసేయక పగవాడను వాడు లేకుండ బరిపాలించుచుండెను.

సోమరాజునకు సామంతులుగ నున్న రాజులు కొందరు అసూయపరులై స్వతంత్రముగ వర్తింప నిచ్చగించి యాకాలమున బలవంతుడుగ నున్న కటకపరిపాలకు నాశ్రయించి సోమరాజుపై గత్తిగట్టిరి. దురాశాపీడితుడగు కటక పరిపాలకుడు క్రమక్రమముగా మాటలతీయదనంబుచే సోమభూపాలుని సామంతుల నందఱ లోగొని యంతఃకలహముల నభివృధి జేయచుండెను. సోమరాజు కొంతకాలమునకు గటకేశ్వరుని దురంతమును గ్రహించి సామంతుల నందర సామదానోపాయములచే లోగొని కటకేశ్వరుని వంచనోపాయములతో వంచించి యాతని విషయమున గనుగలిగి మెలగు చుండెను. తనప్రయత్నము వ్యర్థమగుటచే నెటులేని సోమరాజునువంచించి వానిరాజ్యము లోగొనవలయునని నిశ్చయించుకొని కందారరాజ్యము నెటుల ముట్టడింప వీలగునాయని చిరకాలమునుండి కటకేశ్వరుడు తీవ్రప్రయత్నములు చేయు చుండెను. సోమరాజు చారులవలనను ఇంగితవేదులగు పరిజనులవలనను గటకరాజు తలంపు సమగ్రముగ నెఱింగి బలంబుల నభివృద్ధిగావించికొని శత్రుజనభీకరముగ వర్తించుచుండెను. ఉభయులహృదయములలో నంత:కలహము పెచ్చరిల్లి దినదినాభివృద్ధి గాంచుచుండెను. సోమరాజు కటకేశ్వరుని దురంతములు వినివిని చేయునదిలేక సమానుడగునాతని నెటులేని వంచింపవలయునని తీవ్రముగ బ్రయత్నము చేయుచుండెను. సామంతుల యభిప్రాయములు సరళముగ నుండకుంటచే నెటుపోయిన నెటువచ్చునో యని సోమరాజు తనకై తాను సంగ్రామమున కేగు ప్రయత్నమును మానుకొని ప్రత్యర్ధియే యెత్తివచ్చిన యాత్మసంరక్షణము గావించుకొనదగినంత బలమును వహించి వర్తింపసాగెను.

సోమరాజు గోవులయందు మిగుల భక్తివిశ్వాసము గలవాడగుటచే సామంతుల వలనగూడ గప్పము క్రింద గోవుల జేకొని విశాలమగు తన కాననంబుననుంచి మిగుల గూరిమితో దిలకించుచు సంరక్షణమునకై పెక్కండ్రు పరిపాలకుల నియోగించి ప్రేమింపసాగెను. ఆకాలమున రా లలో బశుధనమున సోమరాజును బోలిన భూపాలకుండు లేడయ్యెను. గోదావరీతీరమందలి సారవంతములగు నరణ్యములలో గడుపాఱ మేసి సాయంసమయమున లేగలకై యంబాయనియఱచుచు నేతెంచు గోకదంబంబును సోమరాజును నాతని ధర్మపత్నియు మిగుల బ్రేమతో దిలకించుచుందురు. సోమరాజుసతి సిరియాలదేవి. ఈదంపతులు సంతానహీనులగుటచే దమ లేగదూడలనే బిడ్డలుగ భావించి ప్రేమతో నిరంతరము దిలకించువారు. కాలవశమున ననావృష్టి దోషముచే గోదావరి ప్రాంతములయందలి యరణ్యములలో గోకదంబమునకు జాలినంత పచ్చిక లభింపదయ్యెను. పశువుల దు:స్థితికి సోమరాజు మిగుల విచారించి పుత్ర పుత్రికా జననమునకు మాఱుగజూచు తన ప్రేమపాత్రమగు నాలమందలను విధిలేక కందార రాజ్యమునకు సరిహద్దులోనున్న తమ యడవులలో జలము, తృణము సమృద్ధిగా నున్నటుల విని యటకు సాయుధులగు భటులతో గూడ బంపించెను. సోమదేవరాజు నాజ్ఞ శిరసావహించి పశుపరిపాలకు లా గోకదంబమును నహర్నిశలు జాగరూకతో దిలకించుచు దుష్టమృగములవలన నెట్టి యపాయము రాకుండునటుల జూచుచుండిరి. అసూయాసర్పదష్టుడగు కటకేశ్వరుడు సరిహద్దులలో సోమదేవ భూపాలుని గోకదంబ మున్నటుల చారులవలన నెఱింగి సోమరాజును సాధింప నవకాశము లభించినదని మిగుల నానం దించి యొకానొక దినమున సైనికబలముతో బయలుదేరివచ్చి పశుపాలకుల నందఱ శిక్షించి వారల వృక్షమూలములకు బంధించి గోకదంబము నంతయు దన దొడ్డికి దోలించెను. కొన్నిగోవు లా సందడికి బెదరి కందారరాజ్యము త్రోవబట్టెను. పశుధనము నంతయు సైనికులు కటకము జేర్చికొని సరిహద్దులను దాటి మేపినందులకు బ్రతిక్రియ గావించితిమనియు, శక్తిసామర్థ్యములున్నచో నీ యాలమందలగొనిపోవచ్చుననియు సోమభూపాలునకు గటకేశ్వరుం డొక సందేశమును రాయబారులచే బంపించెను.

అంతకంటె ముందు గోరాజములు, తరువాత పశుపాలకులు, కందారమునకు జేరినపిమ్మట సోమరాజు పసుపాలకుల గాంచి పశువు లిటుల భిన్నభిన్నముగ రా గతమేమని ప్రశ్నింప గలరూపు నెఱింగించిరి. కటకేశ్వరుని దురంతము లిప్పటికి ఫలరూపమునకు వచ్చినవని సోమరాజు కోపదృష్టితో బ్రతిక్రియ యోజింపుచుండు సమయమునకు నతనిచే బంపబడిన రాయబారులు వచ్చి సందేశపత్రిక నొసంగిరి. సామోపాయముతో నిక ఫలములేదనియు సంగ్రామమునగాని కార్యఫలము తేలదనియు సోమరాజు నిశ్చయము గావించుకొని యా భటులకు గొలదికాలములో సంగ్రామమునకు వచ్చి గోకదంబముతోబాటు గటకేశ్వరునిగూడ బంధించి తేనున్నాడనని ప్రత్యుత్తరము వ్రాసి యొసంగి సైనికుల నందఱ సమావేశపఱచి జరిగిన విషయము నంతయు నివేదించి స్వామిభక్తి పరాయణులు, శూరవర్యులు నగుసైనికుల నందఱ యుద్ధమునకు సిద్ధముకండని యాజ్ఞాపించెను.

సోమరాజు నాజ్ఞ సుగ్రీవుని యాజ్ఞ వంటి దగుటచే విశ్వాస పాత్రులగు నా సైనికులందఱు సంగ్రామమున కాయితులైరి. శుభ ముహూర్తమున తన రాజ్యమును గీర్తివర్మయను తన మంత్రియధీనము గావించి యుచితబలములతో సోమరాజు కటకమునకు బయలు వెడల సంగ్రామ భేరి మ్రోగించెను.

కటకేశ్వరుడు రాయబారుల వలన సోమరాజు కదనమునకు రానున్న యంశము గ్రహించి సాటి రజన్యులను సాయము రండని లేఖలు వ్రాసి పంపెను. పలువురు రాజులు బలములతో వచ్చి కటకేశ్వరునకు సాయపడిరి. రాను రాను గటకేశ్వరుని బల మమితమయ్యెను. సోమవర్మ సామంతులలో బలువురు స్వామిద్రోహ బుద్ధితో బ్రత్యర్థులై కటకేశ్వరునకు బలములతో దోడ్పడిరి. బల సంపన్నుడైన కటక పరిపాలకుడు తనస్థితికి సోమరాజుస్థితికి గల వ్యత్యాసము గ్రహించి తానును వెంటనే విజయ భేరి మ్రోగింప భటుల కాజ్ఞాపించెను. నియతకాలమున నిరువురు రాజన్యులు సంగ్రామము నిశ్చయించి కొనిరి. కటకేశ్వరుని బలమంతయు దుర్గమున సురక్షితముగ నుండి సంగరము ఘోరముగ గావించుచుండ (2)సోమరాజు సైన్యము విలయమునకు జంకక పగతుర యంపతాకుల లెక్కచేయక ముందునకు రాదొడ0గెను కొ0త సేపటికి సోమరాజు సైనికలడుగడుగునకు రక్తప్రవాహాములన్ కల్పించుచు గోటదరిసి ద్వారముల భేదింప సాగిరి. ద్రుడతరములగు ద్వారములు పగులవయ్యెను. కోటలో నుండి బురుజుల మిద నుండి ప్రత్యర్ది సైనికులు ద్విగునితొత్సాహముతో నాయుధములతొ సొమరాజు సైనికుల నురుమాడుచుండిరి దుర్గముననుటచే గటకేశ్వరుని సైన్యము సంరక్షితముగ నుండెను. నిలువనీడ లేక బహిరంగముగ నున్న సోమరాజు సైన్యము పలుచ బదెను. అపజయచిహ్నములు సోమరాజునకు సారెకుగానరాదొడంగెను. హితబ్రుందమంతమున్ పత్యర్ద్యులుగా మారి కతకేశ్వరునకు సాయపడెదరని యతడుకలనైన తలంపడయ్యేను కటకదుర్గము చెక్కు చెదరదయ్యెను కోటలోని సైనికులు నలయంతములు బల్లెములు చేతగొని చుట్టునుమూగియున్న కందారపు సైనికుల నందర జాలవరకు నురుమాడిరి. కటకేశ్వరుడొక యున్నతమగు బురుజనెక్కి సంగ్రామము నంతయుబరిక్షించి సోమరాజుదుర్బలస్థియు సైనికుల వినాశనము నెరింగి వెంటనే తన సైనికులనందర ద్వారములన్ దెరచి బయటకు వచ్చి హతశేషమైయున్న ప్రత్యర్ధి సైనికుల ముట్టడింపుడని యాజ్నాపించెను . కాలయమునకు దీసిపోని యా కటకేశ్వరుని భటులు కోటనుండి బయటకు వచ్చి యొక్క మాటు కందార సైనికుల నురుముచేయ సంకల్పించిరి. పరిస్థితులన్నియు విషయముగా నుండుటయు విజయము వ్యతర్దుల యెడ గానవచ్చుటయు దలంచి చేయునది లేక సోమరాజు వెంటనే తన సైన్యమును వ్రుత్యర్దులు ముట్టడింపక ముందే కందారమునకు బోవ నాగ్న్యాపించి విధిలేక తానును మరలి పోయెను. సోమరాజు సైన్యము మిగుల నిరుత్సాహముతో మరలి కందారము త్రోవబట్టెను. జయాపజయములు దైవాధీనములనుట యధార్ధము. కటకేశ్వరుని సైన్యము మిగుల నుత్సాహముతో బయలు వెడలి వచ్చెను. దుర్గము చుట్టును రాసులు రాసులుగ బీనుంగులు నిండిఫోయెను. సోమరాజు, నాతని సైన్యము కందార త్రోవ బట్టినటుల గ్రహించి కటకేశ్వరు డానందించి విజయకేతనము నెత్తించెను. కటకేశ్వరుడు విజయోత్సముల మిగుల వైభవముతో గావించి తోడిరాజన్యుల గౌరవించి పంపుచు గొలది కాలములో గందార రాజ్యముపైకి దండివెడలవలయుననియు బలములతో సర్వసిద్ధముగ నుండవలయుననియు బేరు పేరు వరుసల సేనాలకు దెల్పి వీడ్కొలిపి తాను సంగ్రామ ప్రయత్నములుగావించు చుండెను. సోమరాజు హతశేషమగు స్వల్ప బలముతో మిగుల విచారముతో నగరము జేరెను. మంత్రులు, పౌరులు, సోమభూపాలున కెదురేగి నమస్కరి0చి గతమునకు విచారి0ప బనిలేదనియు గట కేశ్వరుని వద్ది0ప నుపాయముల నరయుదమనియు ననేక విధముల దెల్పిరి. వీరపత్నియగు సిరియాల దేవి నాయకున కెదురేగి వికసితకునుమదామము క0ఠమున నల0కరి0చి పాదముల గడిగి శిరమున జల్లుకొని రాజన్యా గెలుపోదులు మానుషములు కావు. ప్రయత్నమునకు మాత్రము పురుషకారము కావలయును. క0ట్టమున బ్రాణ మున్న0తవరకు ద్వేషమును మరుమేని విజయము సాది0చుట దుష్కరకార్యము కాజాలదు. అని పౌరుషవాక్యములతో నాయకుని నుద్బోది0చెను. సోమరాజు పరాభవ మెరుగని వీరచూడామణీ. ఆ0ధ్రదేశమును శ0తిమ0తముగ బ్రజానుకూలముగ ధర్మబద్దముగ బరిపాలి0చిన ధర్మరాజు. కటకముదరి గడి0చిన యవజయ మాతని హ్రుదయమర్మముల భేది0చెను. రాజుమ0దిరమున చేరినదాది యాతని హ్రుదయమును నిట్టిదని నిర్వచి0పరాని విచారము ముట్టది0చెను. బుద్ది నిలుకడ దొల0గెను. ఈయా0దోళనములో ముని0గి సోమరాజు రాజ్యస్థితిగతుల బరిశీలి0ప మానెను. ధర్మమూర్తులగు మ0తులే విశ్వాసముతో రాజ్యపరిపాలనము నెట్టి లోపము లేకు0డ జాగరూకతతో గావి0పసాగిరి. సోమరాజు చి0తాజ్వర పీడితుడై ఆలోచనా సముద్రమున ముని0గి దారితెలియక తన్నుకొనుచు0డెను. క0దార


. రాజ్యమును మునుముందు బరిపాలింపదగిన వంశాంకురమా లేదు. ప్రత్యర్థియా! బలవంతుడై హృదయ శల్యమువలె బ్రవర్తించుచున్నాడు. ఆందోళనమున స్తబ్ధముగ నున్న యాతనిహృదయము కర్తవ్యము నిర్ణయింప నేరదయ్యెను. కటకేశ్వరు డేనాడెత్తివచ్చునో యను యోచన యతని హృదయమును గలచివేసెను. సిరియాలదేవి తన వీరోచితోపదేశములచే నాతని చిత్తవృత్తి చాలవఱకు సవరించి మఱల సంగరాభిముఖుని గావింప సహస్రభంగుల బ్రయత్నము చేసెను. సోమరా జా వీరపత్ని యుద్బోధనము శిరసావహించి కొంతకాలమున కమితమగు బలమును సమకూర్చుకొని కటకేశ్వరునిపైకి బయలువెడలెను. అంతకుమున్నె కందారమునకు బ్రయాణమగుచున్న కటకేశ్వరుడు మార్గమధ్యముననె సోమభూపాలకుని బలముతో బ్రతిఘటించి పోరాడెను. రెండుమాసము లుభయసైన్యములకు సమమగు సంగ్రామము జరిగెను. ఇరువాగులయందు బేరునకెక్కిన వీరులనేకులు నశించిరి. కటకరాజన్యునకు నాహారవస్తువులు, ఆయుధములు, సైనికులు, కావలసినంత ధనము కటకమునుండి వచ్చుచుండెను. సోమరాజున కట్టి సహాయము తటస్థింపదయ్యెను. కందారము మిగుల దూరముగనుంటచే నటనుండి మంత్రులెట్టి సహాయము నాయవస్థలో రాజన్యునకు చేయజాలరైరి. గ్రహచారవశమున సోమరాజు సైన్యమున కాహారవస్తువులైపోయెను. సైన్యము పలుచబారెను. దేవుడుసైతము ప్రతికూలుడై యపజయఫలము చవిచూప నిశ్చయించెను. మఱల సోమరాజు పరాజయము నొందెను.

జలాశయమున మకరీంద్రుని బల మతిశయించి నటుల స్థానమహత్త్వముచే కటకేశ్వరుని బలము దినదినాభివృద్ధి యగుచుండెను. సోమరాజు పరాజయముతో గృహముజేరి, సంగ్రామముపై జీవితము నాధారపఱచుకొనుట లాభదాయకము గాదని యనుభవముచే గ్రహించి తన రాజ్యమునందలి ధర్మపురి, మంత్రకూటము, కాళేశ్వరము, లోనగు గ్రామములలోనున్న సర్వశాస్త్రజ్ఞులగు బ్రాహ్మణోత్తముల రావించి వారల నందఱ నుచితవిధి గౌరవించి కటకేశ్వరుడు గావించిన గోధనాపరణమును సవినయముగ విన్నవించి గోధనమును మఱల గొనివచ్చి విరోధిని బంధింపగల సత్పుత్త్రు డేపుణ్య కర్మములు గావించిన జనించునో యానతిండని వేడుకొనెను. బ్రాహ్మణులు పెద్దయుంబ్రొద్దుయోజించి శాస్త్రముల బరిశీలించి తొల్లి దశరధమహారాజు గావించిన పుత్రకామేష్ఠివంటి వ్రతరాజము వేఱులేదని విన్నవించిరి. రాజు మిగుల నానందించి వలయు వస్తుసంభారమునంతయు సంగ్రహించి రాజబంధువులను సామంతులను సర్వజ్ఞులగు బ్రాహ్మణోత్తములను రావించి వ్రతదీక్ష వహించి తన ధర్మపత్నితో యాగవేదిక నలంకరించెను. అగ్నిహోత్రుడు సుముఖుడై ప్రజ్వలించెను. ఆ శూలగంధమై మారుతము వీచెను. భూతవ్రాతము సోమభూపాలుని దీక్షకు దానధర్మములకు మిగుల నానందించి స్వస్తి వాచకములు గావించుచుండెను. ఇంత యనరానివైభవమున వ్రతము ముగిసెను. అనంతరము సమాగతులగు సందఱ నర్హత ననుసరించి సత్కరించి వారి వారిదేశములకు బంపెను. దైవానుగ్రహమున సిరియాల దేవికి నెలమసలెను. పౌరు లాశుభవర్తమానము గ్రహించి రాజ్యమున నెడతెగకుండ నుత్సవములు గావించిరి. సోమరాజు మితిలేని సంతనమున ననేక ధర్మకార్యముల గావించెను. రాజ్యమునందంతటను శభచిహ్నములు నిబిడీకృతములై విరజిల్లెను. శుభప్రదర్శనములచే రాజన్యుడు, పౌరులు పరాజయచింత దిగనాడి భావ్యభ్యుదయ సూచకమగు రాజకుమార జననమునకై యెదురుచూచుచుండిరి. శుభోదయమునకై యెదురుచూచుచుండుటచే రాజన్యుడు, పౌరులు నమత్యాదులు కటకేశ్వరుని వలన రానున్న విపత్తులను లక్ష్యము జేయజాలరైరి. సమయము నెఱింగి వేగువాలండ్రు కందారమునకు భిక్షుకవేషముతో బ్రవేశించి రాజ్యరహస్యములు గ్రహించి కటకమున కేగి సైనికుల విశ్రాంతియు రాజ్యమునగల శుభోదంతము కందారనాయకుని నిర్భీతవర్తనము తమ యేలికకు నివేదించి మఃట్టడికిది మంచిసమయమని ప్రోత్సహించిరి. సంగ్రామ మూహూర్తమునకై యెదురుచూచుచున్న కటకేశ్వరుడు మిగుల నానందించి సైన్యములనన్నింటి ననతికాలమున నాయితము గావించి బలములను సమకూర్చి, కందారరాజ్యము ప్తెకి జతురంగ బలములతో దాడివెడలెను. దురదృష్టవశమున నీ వర్థమానము సోమరాజు గ్రుహింపజాలడయ్యెను.అతని బలములన్నియు ననాయత్తముల్తె యుండెను. సంగ్రామమునకు గటకరా జింతస్వల్ఫకాలములో నెత్తి వచ్చుని యతడెఱుంగడు.

ఆకస్మికముగ నేలయీనినట్లున్న కటకేశ్వరుని సైన్యము కందారమును ముట్ట్టడించి విజయదుందుభి మ్రోగించెను.రాజును మంత్రులు తహతహపడి చేయునదిలేక పౌరులలో గొందఱును నగరసంరక్షణమునకు నియోగించి సిద్డముగ దైవవశమున హస్తగతముగ నున్న కొలది సైన్యమునుగొని సంగరమునకు బయనమైరి

కటకేశ్వరుని బల మమితముగా నుంటవలనను సోమరాజు సంగ్ర్రామము జరుగునని తలంచి యుండక పోవుటవలనను జయాపజయములు క్షణములో బహిర్గత మయ్యెను. కటకేశ్వరుని సైనికులు విచ్చలవిడిగా విజృంభించి ఋరుజుల కెగ బ్రాకి ద్వారముల భేదించి పగతుర వధించి యనేక సాహస కార్యాములు గావింప సాగిరి. సోమభూపాలునకు జయముపై నాస తొలంగెను. చేయునది లేక యంతఃపురమున కేగి తన దర్మపత్నియగు సిరియాల దేవిని సందర్శించి జరుగుచున్న సంగ్రామమును గూర్చిన చరిత్రము నంతయు నివేదించి 'వీరపత్ని! నా కడసారి యానపరిపాలింపు'మని వేడుకొనెను. సిరియాల దేవి భర్తృదైన్యవదనము ఖేద మోదములు తాండవింప సందర్శించి 'విధేయురాలనగు నన్ను గూర్చి వేఱ యడుగవలయునా! మీ యాజ్ఞ పరిపాలించుటకు జీవితమునంతయు వ్యయము చేయుదును. ఆనతిం'డని సవినయముగ వేడుకొనెను. కొంతసే పా పుణ్యదంపతులు నిశ్శబ్దముగ నూఱకుండిరి. వారి హృదయములు నిస్తరంగ నీరాకరమువలె శాంతి తరంగములతో నావరింపబడి భావనా ప్రపంచమున లీనమయ్యెను. ప్రత్యర్థు లొనరించు విజయభేరి భాంకారములు స్వీయు లొనరించు హాహాకారములు వారి కాసమయమున వినబడవయ్యెను. ఇంతలో ద్వారమునుండి యొక వీరు డుచ్చైస్వరమున "రాజన్యా! ప్రత్యర్థులు పురమున బ్రవేశించినారు. మన సైనికు లడ్డుపడుచున్నారు గాని కృతార్థులు కాజాలరు. అంత:పుర సంరక్షణ మావశ్యకమని మనవిచేయుటకై యరుదెంచితి" నని పల్కెను. అశనిపాతమునకు దీసిపోని యావాక్య మిరువురి సంకల్ప సౌధముల నధోగతము గావించెను. సోమరాజు సిరియాలదేవిని సాదరముగా సందర్శించి వీరపత్నీ! నీవు వీరమాతవు కావలయును. దైవానుగ్రహమున నీ గర్భమునందొక పవిత్ర తేజము ప్రవేశించియున్నది. భారతీయాభ్యుదయమున కది మిగుల దోడుపడగలదని ప్రజలేకాక యస్మదాదులు గూడ విశ్వసించి యున్నారు. ప్రతిపక్షులు కోటలో బ్రవేశించుటకు ముందు నీవొత్మ సంరక్షనము గావించి కొనుట విధి. అపజయము కొలదికాలములో మనల నావరింప నున్నది. మన నోముల పంటయగు నీభ్రూణము కాపాడుకొనుట నీవిధి. ముందు నీ వీయంత:వురమును దాటి విశ్వాసప్రాతులగు భృత్యులగొని దేశాంతరములు చేరుము. ఏచెట్టుక్రిందననేని తలదాచుకొమ్ము. నీగర్భమున జన్మించు శిశువు మన కుభయులకే గాక వంశమున కంతటికి బ్రతిష్టదెచ్చి పరమందు బరాజయ చింతతో నధోలోకమునకు జేరనున్న మన యాత్మలకు శాంతి గూర్చుటకై కతకేశ్వరుని వధింప గలడు. ఇది వేద వేద్దంగవిదులగు బ్రహ్మజ్ఞలలు వాక్య 'మని సోమరాజు తెలిపి యావల మాటలాడలేక పోయెను. సిరియాలదేవి హృదయమ తారుమారయ్యెను. శుభచిహ్నముగ భావించి గర్భరణమునుగూర్చి యామె యెంత యానందించెసియిపు డంత విచారపడవలసి వచ్చెను. భర్తతో సమానముగ బరముజేర ననుకూలమగు సహగమనము గావించుటకు నాయమకు స్వతంత్రము లేదయ్యెను. నిరాశావృత మగు నాయమహృదయదృష్టికి బాహ్యప్రపంచమంతయు నంధకారబంధురముగా గానరా దొడంగెను. మాఱుపలుకక సిరియాలదేవి కనుల నీరుగార్చుచు డల నేలకు వ్రాలినిలిచెను. ప్రేమచ్చేదనము మిగుల కృపణ కార్యము. దంపతు లాప్రేమబంధము త్రెంచుకొన లేక చాలసేపు పరాధీనహృదయముతో వర్తించిరి. ఇంతలో ద్వారమున బ్రతికూలసైనికుల యట్టహాసములు వినవచ్చుచుండెను.

సోమరాజు సానకంపముగ బ్రియురాలిని సందర్శించి "యువతీమణీ! సంగరరంగమునకు బోవలసిన తరుణ మాసన్నమైనది విజయముపై నాసలేదు. పగతురచే జనిపోవుట నిశ్చయము. నీ సంతానము కొఱకు బరమందున సైతము నాయాత్మ ప్రతీక్షించుచుండును. సహగమన మాచరింపకుము సుమా!" యని సంగరరంగమున కుఱుకబోయెను. సిరియాలదేవి హృదయము నీరయ్యెను. ఆయమ్మ కనుగొలకులనుండి వేడి వేడి యశ్రువులు రాలుచుండెను. పెదవి కంపింపసాగెను. శోకావేశభరమున బ్రియుని గాడముగ గౌగిలించుకొని మైమఱచెను. వీరకర్మమున కుఱుకనున్న సోమరాజు కూడ జాలసేపు స్తబ్ధుడై యూఱకుండెను. తరువాత నంతరాత్మచే బ్రబోధితుడై పరవశురాలైన ధర్మపత్నిని మెల్లంగ వదలి రణరంగము ప్రవేశించెను. సోమరాజు సంగరరంగమున బ్రవేశించుటగాంచి ద్విగుణీకృతమగు సాహసముతో భటులు, మంత్రులు, పౌరులు వీరావేశమున ముందునకు దుమికిరి. తిమింగిల సంచలనముచే సముద్ర మాక్షోభించునటుల గటకేశ్వరుని సైన్యము సోమభూపాలుని సైన్యపు దాకిడికి గలగిపోయెను. అసంఖ్యాక పదాతి పరివేష్టితమగు కటకే కటకేశ్వరునకు బ్రబలప్రత్యర్థినియగు నీసిరియాలదేవి నెవరు చేరదీసి యవస్థలపాలగుట కియ్యకొందురు? అభిమానమువదలి కటకేశ్వరుని శరణుగోరుట కాయమపవిత్రహృదయ మంగీకరించునా ? సత్సంతానార్థియగు సోమరాజుమాత్రము తన ధర్మపత్ని కట్టియాజ్ఞ యొసంగలేదు. సిరియాలదేవికి దలదాచుకొన నెలవు కానరాదయ్యెను. ఎఱుకురాజను పరాక్రమశాలి పరిపాలించు హనుమకొండ కేగిన బ్రతుకవచ్చుగదా యని పరిచరులను వెంటగొని మాఱు త్రోవలబట్టి కొలది కాలమువకు హనుమకొండ జేరెను.

పరిచారకు లిరువురు సిరియాలదేవి నొకపాడుపడిన దేవళముచెంత నుంచి తా మెఱుకుదేవరాజు చెంతకేగి కటకేశ్వరుని దురంతమునంతయు నివేదించి గర్భభారాలస యగు సిరియాలదేవి కాశ్రయము నొసంగవలయునని సహస్రభంగుల బ్రార్థించిరి. సహజభీరువగు నెఱుకురాజు కటకేశ్వరుని ధాటికి వెఱచి తన రాజ్యమున నాయమనుంచుకొన వీలుకాదని ఖండితముగ బోధించెను. పరిచారకులు మిగుల దైన్యముగనున్న యామ జీవితచరిత్రము నంతయు నివేదించి ప్రసూతి పర్యంతమైన నిలువనీడ నీరాజ్యమున నొసంగుమని వేడికొన విధిలేక సోమరాజువలన దానొందిన లాభముల స్మరించికొని యంత:పురములో నుండ వీలుగాదనియు గ్రామములో నెచటనేని జీవితము గడుపుకొనుచో నభ్యంతరము లేదనియు నెట్టకేల కంగీకరించెను. పరిచారకులు సిరియాలదేవికి జరిగిన వృత్తాంతము నంతయు నివేదించి యామెను బ్రాహ్మణవీధికి జేర్చిరి. గర్భభారమునను గమనాయాసమునను గృశించి నడువలేక నడువలేక నడచుచున్న యాసీమంతిని విప్రవాటికలో బ్రవేశించి బ్రాహ్మణోత్తముల నందఱ వేఱు వేఱు సందర్శించి తన దీనచరిత్రమునంతయు నివేదించి పరిచారకురాలిగనేని యుంచికొని పట్టెడన్నము బెట్టుడని సవిచారముగ బ్రార్థించెను. రాజువలన నెట్టి మాటవచ్చునో యని యెవరు నాయమ కాశ్రయము నొసంగరైరి. కడకు మాధవశర్మయను నొక బ్రాహ్మణుడు దయదలంచి యాయమను దన గృహమునజేర్చి గృహిణిచే నాయమ కాహారాదికముల గాలానుకూలముగ నొసంగ జేయుచు మిగుల ననురాగముతో భక్తివిశ్వాసములతో దానును విచారించుచుండెను.

సిరియాల దేవికష్టము లొంతతో నంతరింపలేదు. 'తగిలిన కాలే తగులును, నొగిలినకొంపయే నొగులు' నన్నటుల నాయమనాపదలు మఱల మఱల జుట్టుముట్టెను. కటకేశ్వరుడగు బల్లహుడు కందారరాజ్యము నాక్రమించి సోమరాజును తదకు అనుచరులను బంధించి యంత:పురము ప్రవేశించి రాజ్ఞికొఱకు వెదకెను. ఆయమ గర్భమందు దైవాంశసంభూతు డభివృద్ధి నొందుచున్నట్లును నాతడు తన కేనాటికైన మారకుండనియు వినియుంటచే గరవాలముతో నాగర్భము ఛేదింపనులకించి యంత:పురము నంతయు గాలించెను. ఆతనికి నిజవర్తమానము తెలియదయ్యెను. రాణివాసమునందున్న పరిచారికలు ఘోరమగు మరణమునకు నియ్యకొనిరిగాని రాజ్ఞి యుదంతము బహిర్గతము గావింపజాలరైరి. కడకు భ్రాణభయము వలననో దురాశవలననో సిరియాలదేవి హనుమకొండ కేగినదని కొందఱు పౌరులు నివేదించిరి. విజయకేతనము స్థాపించి కొందఱు సైనికుల గందార రాజ్యముననుంచి రాజ్యము జాగరూకతతో సంరంక్షింప నియోగించి, తాను సపరివారముగ సిరియాలదేవి కొఱకై యన్వేషించుచు హనుమకొండకు జేరి పురసమీపమున విడిసి యెఱుకురాజునకు 'మీపురంబున సిరియాలదేవి యున్నటుల రూఢిగా దెలిసినది ఒసంగుదువా! లేక సంగ్రామమునకు వత్తువా!' యని తన భటులచే బల్లహుడు వార్త పంపించెను. భయకంపితుడై యెఱుకరాజు మిగుల జంచిలించి సిరియాలదేవిని నేనెఱుంగననియు రాజధాని నగరమున నెటనైన నున్న మీపరిచారకులచే వెదకించి బంధించుచో నా యభ్యంతర మేమాత్రము లేదనియు నేనట్టి ద్రోహకార్యముగావించి యేలిక యాగ్రహమునకు బాత్రుడగాననియు బల్లహునకు వెంటనే వార్తపంపెను.

ఎఱుకరాజు నిర్దోషియనియు సిరియాలదేవికి దనకై తా నాశ్రయము నొసంగి యుండడనియు బల్లహుడు నిశ్చయించెను. అంత:పురములో నుండి సంగ్రహించి తెచ్చిన సిరియాల దేవి ప్రతిచ్ఛందము బల్లహుడు తనభటుల కొసంగి 'యిట్టి యాకారవిశేషములు గల యువతీమణి యీపురమున నున్నది. రాజమందిరములు, రచ్చకూటములు, బ్రాహ్మణ గృహములు, పఠనమందిరములు పరిశీలించి యెటనేని యున్నచో బట్టితెచ్చిన యెడల గొప్ప పారితోషికము నొసంగుదు'నని బల్లహు డాజ్ఞాపించెను.

ఎఱుకరా జాత్మ సంరక్షణము నాశించి యంతకు మున్నె చనువు నొసంగిన వాడగుటచే బ్రతిబింబపటము గొని బల్లహుని భటులు స్వేచ్ఛగ సిరియాలదేవి కొఱకు వీధులన్నింటిని గాలించిరి. ఎట గూడ వారు తలంచిన కాంతామణి కానరాదయ్యెను. తుదకు భటులు మాధవశర్మ గృహమున బ్రవేశించి యనుమానాస్పదముగ నున్నదని సిరియాలదేవిని బంధించి బల్లహుని యొద్దకు గొనిపోయిరి. భయకంపితురాలై సిరియాలదేవి గడగడ వడకుచు విలపించు చుండెను. బ్రాహ్మణవాటిక లోని పిన్న పెద్దలందఱు నటజేరి యాతరుణ విలాసమును జూచి నిలువున నీరైరి. రాజభటులు నిర్దయులై యామెను రచ్చకీడ్చి లాగికొని పోవుచుండిరి. ఇంతలో ననుష్ఠానవేదిక నుండి లేచి విష్ణుశర్మ ముందునకు వచ్చి రాజభటుల జూచి "అక్కటక్కటా! యెందేని యీయన్యాయము కలదా! ఈయమ నాపుత్రి. గర్భవతియగుటచే మొన్ననే కొనివచ్చితిమి. బలవంతముగ లాగుకొని పోవుచుంటిరా? మీకు న్యాయము వలదా?" యని కఠినముగ మందలించెను. నివ్వెఱపోయి చూచు చున్న బ్రాహ్మణాంగన అందఱు బ్రాహ్మణ హింసవలన మీరాజకుటుంబము రూపుమాయ గలదని శపింప సాగిరి. భటులు చెంతగల ప్రతిచ్ఛందముతో సిరియాలదేవి యాకృతిని నొకమాఱు పోల్చిచూచి మాఱు మాటాడక యాయమను లాగికొని పోవుచుండిరి. ఆగర్భశ్రీమంతురాలు, ఆసన్నప్రసవ-సుకుమారీ మణి, యగు సిరియాలదేవి దుస్థ్సితికి బిల్లలు గలవాడును దయాశాలియు నగు మాధవశర్మ మిగుల విచారము నొంది బల్లహుని కంత్య కాలమునకె యిట్టిబుద్ధులు పుట్టుచున్న వనుచు జూచు చున్న బ్రాహ్మణ బ్రాహ్మణీ జనమును వెంటగొని యూరిబయట విడిసియున్న బల్లహునిపాలికి బోయెను.

దూరమునుండి బ్రాహ్మణ బృందము సంభ్రమముతో వచ్చువిధము గాంచి బల్లహుడు లేచి పూర్వాచారానుగుణముగ వారి కెదురేగి నమస్కరించెను. మాధవశర్మ యావందనము పరిగ్రహింపక కోపరక్తాక్షుడై 'బల్లహ రాజన్యా నీ యధర్మములు కడుపు లోని చల్ల కదలకుండ ఎఱుకరాజు ధర్మ పరిపాలనములోనున్న హనుమకొండ పౌరుల పని గూడ బ్రవర్తింప జేయ వలయునా! ఇంద్రుడు లీలావతిని లాగికొని వచ్చునటుల నేపాపము నెఱుంగని నా యేకపుత్రికను దుర్మార్గులగు నీభటులు లాగికొని వచ్చు చున్నారు. గర్భభారాలస యగు నాయమ మిగుల విచారము నొందుచున్నది. బ్రాహ్మణబృంద మంతయు నీఘోరకార్యమునకు చింతించుచు నెట్లు గుంపులుగ వచ్చు చుండెనో చూడుము. హృదయము లందఱకు రగులుకొనుచున్నవి. సాధుఘోష తగులక మానదు. దూరము యోచించి కీర్తి ప్రతిష్ఠల నిలువ బెట్టుకొని పాపాత్ము లగు భటుల దండించి నాపుత్రిక నొసంగుము లేదా మేమందఱము ప్రాయోపవేశము గావించి యిటనే సంఘమరణము నొందుదుము. భారతఖండమున నీ యపకీర్తి చిరస్థాయి కాగల దని మేఘ గంభీర స్వరముతో బలికెను. ఇంతలో భటులు సిరియాలదేవిని బల్లహుని చెంత నిల్పి ప్రతిచ్ఛందము నొసంగిరి. బల్లహుని కేమియు దోపదయ్యెను. బ్రాహ్మణుల కోపోక్తులు శ్రవణదారణములై చెలంగెను. సిరియాలదేవి శిరమువంచుకొని మొగమున గుడ్డ వైచుకొని విలపించెను. ఆసాధ్వీమణి పాపకర్ముడగు బల్లహుని కడకన్నులతోనైన జూడమానెను. బల్లహుడు ప్రతిచ్ఛందము లోని యాకృతితో సిరియాలదేవిని బోల్ప వీలుగాదయ్యెను. బ్రాహ్మణుల ఘోష మిన్ను ముట్టెను. యత్తరుడై కటకేశ్వరుడు నిలువబడెను.

సిరియాలదేవి మిక్కుటముగా విలపించు చుండెను. ఆయమ దీనవదనము బ్రాహ్మణోత్తముల పట్టుదలను మిగుల నభివృద్ధి పఱచెను. బల్లహుడు కొంచెము సే పాలోచించి బ్రాహ్మణుల వాక్యముల భటుల వాక్యముల నాలించి నిశ్చయము తేల్చుకొనజాలక భూసురులం గాంచి 'యీయమను బ్రాహ్మణి యనుచుంటిరిగదా! సమీపముననున్న సిద్ధేశ్వరుని సమ్ముఖమున నీయమ పెట్టునాహారమును భుజించెద రేని మీమాట విశ్వసింతు' ననెను. యుక్తిశాలియగు మాధవశర్మ బల్లహునితో 'రాజన్యా! అది యొక గొప్ప పరీక్ష కాదు. సర్వసిద్ధముగ నున్నారము. కాని యీయమ గర్భవతి. గర్భవతి యొసంగు పక్వపదార్థముల బుచ్చుకొనుట బ్రాహ్మణ ధర్మములకు విరుద్ధము. మతమునకు వ్యతిరేకముగ నడువ వలయునని కూడ మీయభిమతము గాదు గాన యుపాయాంతరము నెఱిగింతు రేని యటులె యొనరింతు' మని విన్నవించెను. శాస్త్ర బద్ధముగనున్న మాధవశర్మమాటలకు బ్రత్యుత్తరము జెప్పజాలక బల్లహుడు కొంచెముసేపు యోచించి యీమె యొసంగు నుచ్చిష్ఠమగు క్షీరమును సిద్ధేశ్వరాలయమున బుచ్చుకొందురేని బ్రాహ్మణిగా భావించి వదలుట కెట్టి యభ్యంతరము లే' దని తెల్పెను. బ్రాహ్మణులు మిగుల సంతోషించి యనాచార జన్మమగు కిల్బిషమును దమ తపోమహిమచే బోగొట్టు కొనవచ్చునని నిశ్చయించి యందుల కియ్య కొనిరి. బల్లహుడు చూడకుండ సిరియాలదేవి శిరోవకుంఠనముచే ముఖము నాచ్ఛాదించికొని పదార్థమును బ్రాహ్మణ జనమునకు వడ్డించెను. వారలందఱు నిరాటంకముగ నమృత మస్తని యా పదార్థమును స్వీకరించి సిరియాల దేవితో నిజ గృహములకు వెడలిపోయిరి.

బల్లహునిహృదయశల్య మటులనె యుండెను. సిరియాలదేవి గర్భస్థశిశువు తనమారకు డని యాత డాగతానాగతవేదుల వలన వినియుండెను. అందుచే బల్లహునకు సిరియాలదేవిని గుర్తించి బంధింపలేక పోతినేయను విచారము మెండయ్యెను. రాజభటులు సిరియాలదేవి యీమెయే యని చెప్పుచున్నను బ్రాహ్మణ శాపమునకు భయపడి బల్లహుడు చేత జిక్కిన యువతిని బుద్ధిపూర్వకముగ వదలిపెట్టెను. ఆయమ సిరియాలదేవి యని నిర్ణయించుటకు జాలి నన్ని యాధారము లాతనికి లభింప వయ్యెను. మాధవశర్మ తన కూతురనియు బ్రసూతికి వచ్చెననియు ఱాయిగ్రుద్ది వాదించు చుండ నాయమయే సిరియాలదేవి యని బల్లహుడెటుల సాహసించి వాకొనగలడు! సిరియాల దేవి బహుశ: సహగమనము గావించియుండు నేమో యనుకొని వెదకి వెదకి వేసారి కొలది కాలమునకు బల్లహుడు కటకము చేరెను.

పులినోటనుండి లేడికూన బయట బడినటుల దైవవశమున బల్లహునిబారినుండి సిరియాలదేవి బయటబడిన వెంటనే మాధవశర్మ యామెను మిగుల సంతోషముతో దవ యింటికి గొనిపోయి యధావిధి సుత నిర్విశేషముగ దిలకించుచుండెను. సాటి బ్రాహ్మణులందఱు హర్షించి సహస్ర హస్తములతో సిరియాలదేవి కుపచారములు గావించుచుండిరి. గ్రహములన్నియు శుభస్థానములయందున్న యొకానొక పవిత్రసమయమున సిరియాలదేవి కొక మగచిన్నవాడు జనించెను. మాధవశర్మ మిగుల బ్రేమతో జాతకకృత్యములన్నియు నిర్వర్తింపజేసి యొక సుముహూర్తమున నామకరణ మహోత్సవము గావింప సంకల్పించెను. సిరియాలదేవి మాధవశర్మను సందర్శించి వందనమాచరించి, "ఆర్యా! మీరు నాకు బితృసములు. నేను సుతవతినై భర్తృసందేశమును బరిపాలింప గలుగుట మీ యాశ్వీరచన ప్రభావముననే, దైవమైనను దేశికుడైనను మీరేకావున నాతనయునకు మీ పవిత్ర నామము గలసివచ్చినటుల మాధవవర్మ యని నామకరణము గావింతురేని నామస్మరణముచేతనైన గృతజ్ఞత వెల్లడించు కొందునని సవినయముగ విన్నవించెను. మాధవశర్మ యెట్టకేల కంగీకరించి యుత్తమోత్తములగు బ్రాహ్మణుల రావించి యాకుమారునకు జాతకర్మలన్నియు విధిచోదితముగ నిర్వర్తించి మాధవవర్మయని నామకరణము గావించి యందఱచే నమోఘాశీర్వాదములం జేయించెను. శుక్లపక్ష క్షపాకరుని మాడ్కి యాకుమారుడు దినదినప్రవర్థనమానుడై యుంట గాంచి పుత్ర పుత్రికాశూన్యుడగు నా బ్రాహ్మణోత్తముడు మిగుల గౌరవముతో జూచుచుండెను. దైవానుగ్రహమువలన మాధవశర్మ యమోఘాశీర్వాద ప్రభావమున గుమారుడు వర్ధిల్లసాగెను. మాధవశర్మ కుమారునకు స్వయముగా నైదవయేట నక్షరాభ్యాసము గావించెను. మేధాశాలియగు నాకుమారుడు మిగుల బుద్ధికుశలతతో స్వల్పకాలములోనె సర్వశాస్త్రములు పఠించెను. అమోఘ విద్యాధురీణుడగు మాదవశర్మ బోధన మహిమచే మాధవవర్మ కొన్నికొన్ని శాస్త్రములలో దేశికునకుసైతము సందేహములు తీర్ప సమర్థుడయ్యెను. సమయానుసారముగ గరిడిసాలలకేగి లక్ష్య విద్య నేర్చెను. వ్యూహనిర్మాణము, దుర్గభేదనము, కవచధారణము లోనగు సంగ్రామరహస్యములు స్వయముగానే యాతడు నేర్చికొనెను. హనుమకొండ పురముననున్న దేవళములలో బద్మాక్షి దేవ్యాలయము ప్రశంసా పాత్రమైనది. పద్మాక్షిదేవి ప్రత్యక్షదేవత, ఆయమ యనుగ్రహముచే నభీష్టసిద్ధి నొందని పౌరులులేరు. దూరదేశవాసులు సైత మాయమ యనుగ్రహము నపేక్షించి యాలయప్రాంతమున దవముగావించు నాచార మాకాలమున గలదు. మాధవవర్మ మాధవశర్మవలన నుపదేశమైన మహా మంత్రరాజములు పురశ్చరణము గావించుటకై శైలమేఖలయందున్న పద్మాక్షీ నికేతనమున కేగి నిత్యము గొంతకాలము కాలక్షేపము జేయుచుండెను. స్థిరసంకల్పము గల మాధవవర్మ యొకనాటి సాయంత్రము యధావిధి పద్మాక్షీసముఖమున కొకడ యేగి ధ్యానమున మైమఱచెను. ఆకసమునిండ మేఘములాక్రమించి భూనభోంతరములు జల ప్రవాహములతో నిండిపోవునటుల పెద్దవర్షము వచ్చెను. దిక్కటాహము లంధకార బంధురమయ్యెను. మాధవవర్మ యాప్రదర్శనములకు భయపడక నాటిరాత్రి యంతయు పద్మాక్షీ సమ్ముఖముననే గడుప నిశ్చయించి బీజాక్షరసంయుక్తములగు మహామంత్రముల మేఘరవము శ్రుతిజేసికొని పఠింపదొడంగెను. ధ్యాన నిశ్చలుడగు మాధవవర్మ హృదయస్థిమితమును బ్రళయకాల ఘనాఘన గర్జనములు గాని యేకాంతవాసము గాని భీమాంధకారస్తోమము గాని చలింప జేయ లేకపోయెను.

సమీపమున గుహలన్నియు జనస్తోమముచే నిబిడీకృతములై యుండెగాని స్థిరబుద్ధితోనున్న మాధవవర్మ కాయరిము తెలియదు. తెలిసికొనవలసిన యావశ్యకము సైతము లేదు. ఆవీరుని స్థిరబుద్ధికిమెచ్చి పద్మాక్షీదేవి ప్రత్యక్షమై "కుమారా! నీతపమున కానందించితిని. నీస్థిరదీక్షకు మెచ్చికొంటిని. నీవు బాల్యమునుండియు బ్రాహ్మణధర్మముల యందాఱితేఱిన మాధవశర్మ గృహమున బెఱిగియుంటచే సహమగు క్షత్రియధర్మములయందు బరిశ్రమ గావింపకున్నాడవు. నీజనకుడు బల్లహునితో బోరాడి రణరంగమున నిషతుడయ్యెను. జననియగు సిరియాలదేవి నా నావస్థకులోనై తన వేకటిని గాపాడుకొని పసివాడగు నీక్షేమము నపేక్షించుచు బరులపంచలలో బడియున్నది. స్వరాజ్యమగు కందార మున కీవేగనర్హుండవు. ఇదిగో ఖడ్గఖేటంబులను స్వీకరింపుము. దివ్యాయుధములగు వీని సహాయముచే నీవు విశాలమగు రాజ్యమును బాలించి పితృరాజ్యమును హరించిన కటకేశ్వరుని వధింపగలవని యానతిచ్చి యంతర్ధానమయ్యెను.

మాధవవర్మ యపరమితానందభరితుడై యాఖడ్గఖేటకముల బరిగ్రహించి దేవీమూర్తికి బున:పున:ప్రణామముల నాచరించి యాలయమును వదలి బయటికి వచ్చెను. విశాలాకాశమున నావరించిన జలదములు విచ్చిపోయెను. సోముడాకాశమధ్యభాగమున బ్రకాశించుచుండెను. అవ్యక్తస్వరములతో గీటకములు రొదచేయుచుండెను. కల్మషజలముచే నావరింపబడిన పల్వలములలో జంద్రునికిరణములు ప్రతిఫలించి యమోఘకాంతి నిస్తంద్రములై యలరారుచుండెను. మనోహరమగు నాప్రకృతిప్రపంచమును సవిమర్శముగ దిలకించుచు బద్మాక్షియనుగ్రహమునకు మిగుల నానందించుచు నట విశ్రమించెను. సమీప గుహాముఖమునుండి మనుష్యసంభాషణము వినవచ్చెను. మాధవవర్మ యదియు బద్మాక్షీమాహాత్మ్యముగా నూహించి యభయకరములగు నాయుధఖేటకములను గొని యా గుహాముఖమున బ్రవేశించి నలుగెలంకుల దిలకించెను. ముందు కొందఱు గుంపుగా గూడియుండిరి. మాధవవర్మ వారినిజూచి "మీరెవరు? ఇటకు రాగతమేమి?" యని ప్రశ్నింప వారలందఱు తాము కందార వాస్తవ్యులమనియు సోమదేవుడు గతిం చుటవలనను రాజ్యము కటకేశ్వరుని యధీనమగుట వలనను మి గుల శ్రమలొంది దిక్కుచెడి వలసపోవుచుంటిమనియు, వర్షము వచ్చుటచే నిట విశ్రమించితిమనియు నివేదించిరి. మాధవవర్మ వారు తెలుపు నంశములకు మిగుల నానందించి తన వృత్తాంతము వారల కెఱింగించి వలసపోవ నవసరము లేదనియు స్వల్పకాలమున నేను రానుంటిననియు నంతదనుక మాతృభూమినెటులో కాపురము చేయుడని ప్రబోధించెను. నశించినదనుకొనిన రాజవంశము నిలిచినందులకు, రాజకుమారుని పరిపాలనమున దాము సుఖముల నొందగలిగినందుల కాపౌరు లానందించి బల్లహుని ధుష్టపరిపాలనమునుండి విముక్తియగు సుదినముకొఱకు సహస్రభంగుల దపము గావించుచు నావార్త సహచరులకు విన్నవింప నిజపురమున కేగిరి.

ప్రతాపచరిత్రమున నీయంశ మించుక మార్పుగ నీక్రింది విధముగా గలదు. పద్మాక్షీదేవి ఖడ్గఖేటకంబుల నొసంగి మాధవవర్మను సప్రేమంబుగ దిలకించి "కుమారా ఈయాయుధంబులు నీయొద్దనున్నచో బ్రత్యుర్థులు నిన్నెదిరింపజాలరు. ప్రతిసంగ్రామంబున నీదివ్యాయుధముల సహాయమువలన విజయము చేకూర గలదు. చెంత నీశైలమున నొక గుహ కలదు. అందు నీవు ధైర్యముగ బశ్చిమ దిక్కునకు బొమ్ము. మధ్య కలుగు విఘ్నముల నించు కేని పాటిచేయ కుము. అట నీకు జతురంగ సేనలు లభించును. వాని సహాయముతో ననాయాసముగ బ్రతిపక్షుల జయించి రాజ్యాభివృద్ధిగావించు కొనుము. సంపదలు హెచ్చినకొలది నడకుప వృద్ధిజేసికొనుము. ఔదార్యమును వ్రతముగ గ్రహింపుము. లక్ష్మీనారాయణ పూజయు నుమామహేశ్వర పూజయు గోబ్రాహ్మణభక్తియు నాచరణీయ ధర్మములు. పరదారాపేక్షయు, నసత్యసంభాషణము వర్జించి యెంతకాలము వర్తింతువో యంతవఱ కీదివ్యాయుధములు వాంఛితము లొసంగుచుండు"నని పద్మాక్షీదేవి యానతీయ వెంటనే మాధవవర్మ గుహలో బ్రవేశించెను. ప్రతిభావతి యగు పద్మాక్షీదేవి ప్రభావము వలన మాధవవర్మ కామార్గమంతయు గంటకమయముగ గంపించెను. దానిని బాటిచేయక సాహసముతో ముందడుగు వేసెను. భూతప్రేత పిశాచ శాకినీ డాకి న్యాదిగ్రహసము దాయము భయంకరముగ ముందు గనుపించెను. వ్యాఘ్ర సింహ మాతంగ సర్పాదులు మార్గమున నావరించి యున్నటుల బొడకట్టెను. గుహాంతరము మాఱు మ్రోగునటుల భయంకర ధ్వానములు సారెసారెకు వినబడెను. ప్రతిపదమున కేదియో భయంకరమగు విఘ్నము తోచెను. వీరచూడామణియు ధైర్యశాలియు నిశ్చలచిత్తుడు నగు మాధవవర్మ యంత రాయముల నించుకేని పాటి సేయక యొక జాముసే పాగుహాంతరాళమున బ్రయాణము చేసెను. మం దొక కలకలము వినవచ్చెను. మఱికొంతదూర మటులె సాహసముతో జనుదేర వీరుల సింహ నాదములు, గజబృందముల ఘీంకారములు, తురంగముల హేషలు, కాహళ మృదంగభేరీ గోముఖాది వీరాంగనినాదములు ప్రళయకాల కాలాంభోధర గర్జాసన్నిభంబులై వినబడెను. అంతలో దెల్లవారెను. దట్టముగ గందరమందిరమున బెనగొన్న చీకటులు పలుచబడెను. బాలభానుని రక్తకిరణములు కంద రాంతరమున వసంతము జల్లుచుండెను. మాధవవర్మ యా యమకాల విభవమును జూచి యానందించుచు మిగుల నుత్సాహముతో నింక గొంత దూరము నిర్గమించెను.

ఒక విశాలమగు స్థలమున నఱువదివేల మదగజములు, పండ్రెండులక్షల తురంగములు, పదునేడు లక్షల పదాతి వర్గము మూకగ నుండెను. సేనానాయకుడు దివ్యాంబరంబులతో సువర్ణరాసులతో నిండిన యొక గుహద్వారమున శిలపై నాసీనుడై యుండెను. మాధవవర్మ యటకు బ్రవేశించెను. వెంటనే కరములు ముకుళించి పదాతులందఱు మాధవవర్మ కంకితులైరి. సేనానాయకుడు నమస్కరించి మాధవవర్మను సమీపించి "రాజకుమారా! పద్మాక్షీదేవీ యనుగ్రహమునకై కలకాలమునుండి యిట వేచియున్నారము. మానోములు ఫలించినవి. ఆయమ యాజ్ఞ యిచ్చిన మాధవవర్మ నీవే కానోపు. ఈ బలమునంతయు నీ యధీనము గావించుచున్నాడను. ధనకనక వస్తువాహన విశేషంబుల యధావిధి వినియోగించి అనుమకొండలో సామ్రాజ్య మొండు స్థాపింప వలయు" నని యాతండు తెలిపి యంతర్హితుండయ్యెను.

మాధవవర్మ దైవదత్తమగు నీ బలముతో బయలువెడలినటుల బ్రతాపచరిత్రమున గలదు. ఇది యమానుషమని కొందఱు విశ్వసింపరేమో! ఎటులైననేమి పద్మాక్షీదేవి యనుగ్రహాతిశయమువలన మాధవవర్మకు జతురంగబలము లభించెను. వెంటనే మాధవవర్మ బయలుదేరి బలము లన్నింటిని హనుమకొండ గవనియొద్ద నుంచి వారి కాహారాదికములకు వలయు నేర్పాటులు గావించి తా నొక్కరుండ గృహమున కరిగెను.

కొమారుండు రాత్రినుండి కాన రాకుంటచే సిరియాల దేవి యేమియు దోచక విచారసాగరమున మునింగియుండెను. మాధవశర్మయు నాతనిధర్మపత్నియు నాయమకు హితము నెఱింగించుచు గుమారుం డచిరకాలంబున రా గలండని యోదార్చుచుండిరి. పెంచిన కారణంబున సిరియాల దేవికంటె వీరిరువురు లోలోన బరితాపమునొందుచు గుమారుడు రామికి హేతువు లనేకవిధముల నూహింపసాగిరి. ప్రత్యర్థు లెవరేని బాలుని గడతేర్చిరేమో యను భయ మా మువ్వురిహృదయముల గలచి వేయుచుండెను. ప్రపంచ మంతయు వారికంధకారబంధురముగ శోకభూతమునకు నృత్యాగారముగ గానుపించెను. ఇంతలో మాధవవర్మ యటకు జనుదెంచి దేవీప్రదత్తములగు ఖడ్గఖేటకముల నొక వేదికపై నుంచి తల్లికి, మాధవశర్మకు, నాతని ధర్మపత్నికి నమస్కరించి రాత్రి తాను రాని కారణము తెలిపి పద్మాక్షీదేవి యనుగ్రహించిన యాయుధరాజముల వారికింజూపి గతరాత్రి కథాంశము లన్నియు బూసగ్రుచ్చినటుల వారికి విన్నవించెను. విద్యుద్వేగమున నీయంశమంతయు నగరము నలుగెలంకుల నెగబ్రాకెను. జనులంద ఱీ యంశము నాలకించి కుమారుని శక్తి సామర్థ్యములకు నచ్చెరువొందిరి. క్రమముగ నీవార్త హనుమకొండ రాజ్యము పరిపాలించు నెఱుకుదేవరాజుచెవి సోకెను. చిరకాలముక్రింద నాయన అనుమకొండకు సిరియాలదేవి యేతెంచి యాశ్రయము కోరుటయు బిమ్మట బల్లహుండు దండయాత్ర కరుదెంచి సిరియాలదేవిని వెదకించుటయు మాత్ర మెఱుగునుగాని పుత్రోత్పత్తియు నాపుత్రుని శక్తి సామర్థ్యము వినలేదు. కుమారుని యమోఘశక్తి సామర్థ్యములు వినగనే యెఱుకుదేవరాజు హృదయము సంచలించెను. అనుమకొండ రాజ్యమును బడయుటకై దేవిసన్నిదిని వరములు పొందివచ్చిన మాధవవర్మను శరణు గోరుటకంటె దనకు గత్యంతరము లేదని యాతడు నిశ్చయించికొని కర్తవ్యము నాలోచించు సమయమున నచ్చటికి జారు లేతెంచి 'నగర ద్వారమున మాధవవర్మయను రాజకుమారుడు బలములతో విడిసి యున్నాడు. నేల యీనినటుల జతురంగ బలములు కాన వచ్చుచున్నవి. ఏలిక కెఱిగింపవచ్చితి' మని విన్నవించిరి. ఎఱుకరా జున్నతమగు హర్మ్యము నెక్కి గవని యొద్దనున్న బలము నంతయు సందర్శించి దేవతావరప్రసాద విజయలక్ష్మీ పరిష్వంగు డగు మాధవవర్మకు విధేయుడై రాజ్యము నొప్పగింప కున్నచో నెంతటి రాజన్యు డేని మానుషము నిలుపుకొన జాలడని నిశ్చయించెను. గూడాచారులు సత్వరముగ నేతెంచి 'చతురంగ బలములతో ద్వారముచెంత విడిసిన మాధవవర్మ యను రాజపుత్రుండు భట్టాచార్యుం డగు మాధవశర్మగృహమున కేగెను. ఏలిక కెఱింగింప వచ్చితి' మని విన్నవించిరి. వెంటనే యెఱుకు దేవరాజు సర్వబలముల నాయిత పఱచి మంత్రి సామంతరాజ బంధు పరివృతుండై యుచిత వాహనంబు నెక్కి మాధవశర్మగృహమునకుం బయనం బయ్యెను. పౌరు లందఱు రాజన్యుని ప్రయాణమును గూర్చి పలువిధముల దమలో దాము తలపోయు చుండిరి.

భటులుచూపిన మార్గము ననుసరించి యెఱుకుదేవరాజు మాధవశర్మ గృహద్వారమున మదమాతంగమును డిగ్గి మంత్రి సామంతాదులతో గృహాంతరమున కేగి మాధవశర్మను, నాతని ధర్మపత్నిని, సిరియాలదేవిని, గోటిసూర్యప్ర కాశుడగు మాధవవర్మను సందర్శించి యట నాసీనుడయ్యెను. వైదికాచార పరాయణుడగు మాధవశర్మ యెఱుకుదేవరాజు తన గృహమున కరుదెంచుట తలంచి కుమారునకైనను దనకైనను నింతయనరాని సేగిమూడి తీఱునని నిశ్చయించుకొని దైవసంకల్ప మమోఘము గనుక చేయునది లేదని యనుకొనెను. సిరియాలదేవియు బ్రాహ్మణియు గుమారునకు దైవమెట్టి యాపత్తుల గూర్ప సంకల్పించెనో పరిపరి విధముల విచారము నొందుచుండిరి.

ఎఱుకదేవరాజు దేవీదత్తఖడ్గఖేటకములతో బ్రకాశించు మాధవవర్మను సమీపించి పాదములపై సాష్టాంగ ప్రణామము నాచరించి చేతనున్న వజ్రహారము నాతని కంఠముననిడి "రాజపుత్రా! పెద్దవాడనైతిని. చిరకాలము రాజ్యము పరిపాలించి తనిసితిని. పుత్రపుత్రికా సంతానము లేమింజేసి యీరాజ్యము నెవరికి సమర్పింప వలయునాయని కలకాలము నుండి యోచించుచుంటిని. నాకాంక్ష ఫలించెను. అనుమకొండరాజ్యలక్ష్మి యిప్పటికి గృతకృత్యురా లయ్యెను. రాజ్యలక్ష్మి వెదకుకొనుచు నీసన్నిధికి జనుదెంచినది. అనుమకొండ రాజ్యమును వందనపూర్వకముగ నీకు సమర్పించుచున్నాడను. దయచేసి పరిగ్రహింపు'మని సహస్రభంగుల వేడుకొనెను. మాధవశర్మ యనుమతి ననుసరించి మాధవవర్మ యందుల కంగీకరించి యెఱుకురాజుతో శుభముహూ ర్తమున మీ యిచ్చచొప్పున రాజ్య పరిగ్రహణము గావింతునని ప్రత్యుత్తరము నొసంగెను.

వందిమాగధులు స్తవముగావించుచుండ మంగళవాద్యముల ధ్వనులు భూనభోంతరములు నిండి మారుమ్రోయుచుండ భూసురాశీర్వాద పురస్సరముగ మాధవశర్మ నిర్ణయించిన శుభలగ్నమున మాధవవర్మ అనుమకొండ సామ్రాజ్యమునకు బట్టాభిషిక్తు డయ్యెను. ఎఱుకుదేవరాజు మాధవర్మకు సమస్తైశ్వర్యములు వశముగావించి దక్షిణకాశియనందగు నమరావతీ పుణ్యక్షేత్రమునకు దవము గావించుటకై వెడిలిపోయెను. పద్మాక్షీదేవి యొసంగిన సమస్త బలంబులు నెఱుకుదేవరాజొసంగిన బలంబులు కలిపి, రాజ్యము మిగుల నభివృద్ధిలోనికిం దెచ్చి మాధవవర్మ మిగుల జాగరూకతతో బరిపాలించుచు గృతజ్ఞతాసూచకముగ మాధవశర్మకు నాతనిదర్మపత్నికి ధన కనకవస్తువాహనంబులు చీనిచీనాంబరముల నొసంగి యిచ్చవచ్చిన గ్రామముల నగ్రహారముల నొసంగి యుత్తమోత్తములగు మంత్రుల యనుమతి ననుసరించి వర్తించు చుండెను.

రాజ్యవిభవముతో దృప్తినొంది సమస్తైశ్వర్యముల ననుభవించుచు అనుమకొండసామ్రాజ్యమును శత్రుజన భీకరముగ బరిపాలించుచున్న తన పుత్రరత్నమగు మాధవవర్మను వీక్షించి సిరియాలదేవి సానురాగముగ మాటల డుచు "గుమారా! నన్ను వీరమాతయని యనిపించుట ధర్మము. మీజనకుని చెట్టబట్టి సమస్తభోగముల ననుభవించి వీరపత్నీ ననిపించుకొంటిని. నీవలన వీరమాత నైతిని గృతార్థుల నయ్యెద" నని పల్కెను. మాధవవర్మకు దల్లియగు సిరియాలదేవి తెలుపు మాటలలోని భావము భోధకాదయ్యెను. తన ధర్మమును గూర్చి లోలోన బలుమాఱు యోజించి నిశ్చితాంశము నెఱుంగనేరక మాధవవర్మ స్పష్టముగ నీ యభిప్రాయము నెఱింగింతువేని యవశ్య మొనరింతునని ప్రతిజ్ఞ చేసెను.

సిరియాలదేవి కుమారుని ప్రతిజ్ఞ యాలించి యానంద పరవశమై యిటుల జెప్పెను. "పుత్ర రత్నమా! సర్వభోగ్య సంభరితమగు మనకందారరాజ్యము పరాధీన మగుటచే నిన్ని యిక్కట్టుల పాలైతిమి. ఇపుడు నీకతన పూర్వరాజ్యమును బడయగలుగుదునేని నేను వీరమాతలలో నగ్రగణ్య నగుదును. మనకందార రాజ్యమునకు బల్లహుడు పాలకుడై వర్తించుచున్నాడు. వానిచే నేను మిగుల బరాభవింప బడితిని. అక్రమముగ నాతడు కచ్చకు గాలుద్రవ్వి యన్యాయముగ బశుసమూహమును దొంగిలించుకొని పోవుటయేగాక విభవాస్పదంబైన కందార రాజ్యంబునంతయి విధ్వంసంబు గావించినాడు. ముం దుద్భవింపనున్న నాతనయునివలన నెట్టి యిడుమపాటు నొందవలసి వచ్చునోయని యా దురాత్ముడు అనుమకొండ కేతెంచి నాకొఱకై వెదకించి బంధింప బ్రయత్నించెను. పుణ్యశీలురగు నీవీటి బ్రాహ్మణులును దయామయుండగు మాధవశర్మ నన్ను బ్రతికించి నిన్నీ యాంధ్రదేశమున కొసంగి పరమోపకారంబు గావించిరి. కాన నీయందు రెండుధర్మము లిమిడియున్నవి. ధర్మ నిర్వహణానంతరము గాని నీవు ఋణ విముక్తుడవు కాజాలవు. పరమోపకారము గావించి చంద్రవంశమును శాశ్వతముగ నిల్చునటుల ననుగ్రహించిన యీ బ్రాహ్మణోత్తము లందఱుకు వృత్తిస్వాస్థ్యముల నొసంగి కృతజ్ఞత వెల్లడించుట ప్రధాన కర్తవ్యము. బల్లహుని ఖండించి తద్రక్తముతో బితృతర్పణము గావించి పూర్వాపహృతములగు పశువుల నన్నింటిని గొని తెచ్చి నాకు వీరమాతృనామము నొసంగుట నీ రెండవ ధర్మము. నీపవిత్రమగు జన్మము వలన నాజీవితము తరించినది. మీ జనకుడు బల్లహునిచే వధింపబడినటుల జనశ్రుతి కలదు. అదియ నిశ్చయమేని పరముననున్న యాతనియాత్మ కృతార్థత నొందగలదు, లేదా సజీవిగ నుండెనేని పుత్రసందర్శనముచే గృతార్థుడు కాగలడు" ఇట్లు కుమారునకు దెల్పి యంత:పురమునకు వెడలిపోయెను.

మాతృసందేశము, తన పూర్వచరిత్రము వినినదాది యుత్సాహ మతిశయించి ప్రత్యర్థిమారణమునకు మాధవవర్మ ప్రయాణము కా నిశ్చయించెను. భటులందఱు సంగ్రా మమునకు సర్వసిద్ధముగ నుండిరి. బలములన్నియు నాయితము గావింపబడియెను. విజయదుందుభులు దింగతరముల మాఱుమ్రోగు చుండ నొకానొక శుభముహూర్తమున వీరచూడామణి యగు మాధవవర్మ పితృతుల్యుడగు మాధవశర్మ పెట్టిన శుభముహూర్తమున విజయయాత్రకు బయన మయ్యెను. అనుకూల మృదులముగ వీచు పవమాన మా రాజన్యునకు సుస్వాగతము నొసంగెను. ప్రకృతియంతయు విజయచిహ్నముల సూచించుచుండెను. మాతృదేవీదత్తమగు శుభాశీర్వాదాదికము పరిగ్రహించి పద్మాక్షిదేవి ప్రదత్తములగు దివ్యాయుధములు ధరించి పుణ్యకాంతులు హర్మ్యాగ్రముల నుండి పుష్పాక్షతలు చల్లుచుండ గటకముపైకి సమస్త బలముతో మాధవవర్మ జైత్రయాత్రకు బయలువెడలెను. సామంతాదు లందఱు విధేయులై రాజన్యున కెదురేగి యుచితసత్కారములుగావించి చతురంగసేనల శక్తికొలది సహాయము గావించిరి. అపరిమిత బలముతో బయలువెడలి మాధవవర్మ కొన్నిమాసములకు బ్రత్యర్థిరాజ్యమగు కటకము చేరెను. సైనికులందఱు శిబిరముల నెలకొల్పికొనిరి. సేనానాయకులు సంగరమునకు సర్వసిద్ధముగ నుండిరి. కోపతీవ్రముచే బ్రత్యర్థి సంహరణ దివ్యాకాలము కొఱకు నిరీక్షించుచున్న మాధవవర్మ గూఢచారుల వలన గటకరాజ్యపరిస్థితులు, బలాదికములు రహస్యముగ నెఱింగి వ్యూహాదికముల నిర్ణయించి తెల్లవాఱున: గోటముట్టడింప వలయునని ప్రధాన సేనానాయకున కాజ్ఞాపించెను. ఆకస్మికముగ మ్రోగుచున్న జయభేరి నాలకించి బల్లహు డాశ్చర్యమునొంది యెవడు తస్న కోపాగ్ని కాహుతి గానెంచెనో తెలిసికొందునుగాక యని బల్లహుడు బలములనన్నింటిని దత్ క్షణముననే యాయత్త పఱచి ప్రతిపక్ష బలముతో బోరుచేయ నారంభించెను. ఇరువాగులు పోరునకు దలపడెను. మాధవవర్మ సైనికులనందఱ కుచితమగు స్థానములనొసంగి యుద్ధనిపుణులగు వారికి సేనానాయకత్వమునిచ్చి కోట నలువైపుల నొక్కమాఱె ముట్టడించెను. బల్లహుడు ప్రతిశిబిరమున కేగుచు భటుల బరామర్శించుచు నుచితవిధానముల నెఱింగించుచు దనబలమును మిగుల బ్రోత్సహించు చుండెను. కాని బల్లహునకు విజయముపై నాస యెన్నడో యంతరించెను. సంగ్రామప్రయత్నములో నాత డుండకపోవుటచే స్థలాంతరములలో నున్న బలమునంతయు రప్పింప వీలు కాదయ్యెను. ఆహారపదార్థములు సైతము చాలినంతగ లేకుండెను. ప్రతిపక్షుల సైన్యము లెక్కయిడరానంత విశేషముగ నుండెను. ఆసైన్యమునకు రాజెవ్వడో, యాత డేరాజ్యమునకు బరిపాలకుడొ, నాటి విజృంభణమున కేహేతువొ బల్లహు డెఱుంగడు. తీవ్రముగ బల్లహుని సైన్యము మాధవవర్మ సైన్యముతో గొన్నిమాసములు పోరాడెను. జవసత్వములు క్షీణించుటవలనను ఆహారపదార్థములు కొఱతపడుటవలనను చేయునది లేక పౌరుషము దిగద్రావి బల్లహుడు మాధవవర్మను శరుణు గోరెను. తీవ్రక్రోధపీడితుడగు మాధవవర్మ యాతని బంధించి తాను సోమభూపాలుని తనయుడననియు సోమరాజును వంచించినందులకు బశుధనమును దొంగలించినందులకు, సిరియాలదేవిని బరాభవింప యత్నించినందులకు గందారరాజ్యమును హరించినందులకు నీవెట్టిశిక్షకేని యర్హుడవు. క్షమింప వీలులేదుఅనుచు కఠినముగ నివేదించి వీరులగు సేనానులను బిలిపించి బశుధనమునంతయు గోష్ఠములనుండి తొలగించి కందారమునకు జేర్పుడని యాజ్ఞాపించెను. బల్లహుని సైన్యమంతయు మాధవవర్మ హస్తగతమయ్యెను. దయాభూషణుడగు మాధవవర్మ బల్లహునిచే జెఱబెట్టబడిన రాజులనందఱ విడిపించి వారల నుచితగౌరవంబులతో గందార రాజ్యమునకు గొనిరండని కొందఱు ప్రధానులతో దెల్పి వలయు సైన్యమును సహాయముగ బంపెను. మాధవవర్మ విజయస్తంభమును గటకములో నెలకొల్పి నిజపురాభిముఖుడై బంధితుండగు బల్లహునితో దదితర రాజన్యులతో బయలుదేరి కొన్నాళ్లు శ్రమనివారణార్థము మధ్యమధ్య నివసించుచు మార్గ మధ్యముననున్న రాజులవలన భూస్వాములవలన గప్పముల బుచ్చుకొని వారల సామంతులుగ జేసికొనుచు బితృస్థలమగు కందారమునకు జేరెను. ప్రధానమాత్యు డంతకు మున్ను బంపినచారులవలన మాధవవర్మ కటకేశ్వరుని సంగ్రామ రంగమున నిర్జించి జీవగ్రాహిగజేకొని పశుధనముతో జయలక్ష్మితో బితృరాజ్యమున కేగుదెంచు వార్తనాలకించి మాధవశర్మయు సిరియాలదేవియు సంతోషితాంతరంగులై కుమారుని ప్రజ్ఞాదికముల కానందించుచు, నిజనివాసమునుండి బయలువెడలి, కందారమునకు మునుముందె చేరి మాధవవర్మకు సుస్వాగతము నొసంగిరి. వినయముతో మాధవవర్మ సిరియాలదేవికి, మాధవశర్మకు నమస్కరించి విజయాదికము నంతయు నివేదించెను. వారిరువురు తనయు నాశీర్వదించి శుభముహూర్తమున బితృరాజ్యము మాధవవర్మకు బట్టాభిషేకము నిర్ణయించిరి. పురవాస్తవ్యులు పట్టరాని సంతసముతో సోమరాజుతనయుడు మఱల రాజ్యమునకు వచ్చుట శుభసూచకమని సహస్రభంగుల నానందించిరి. సర్వసంపత్సమృద్ధమగు నాకందారపురమును బౌరులు చక్కగ నలంకరించి పట్టాభిషేక సుదినమునకై ప్రతీక్షించుచుండిరి. సకాలమునకు బంధోన్ముక్తులగు రాజన్యులగు బశుధనమును జేకొని ప్రధానులు, సైనికులు, కందారరాజ్యమునకు జేరిరి. రాజ్యమునకు సంబంధించిన సర్వగ్రామములనుండి వేదవేదాంగ వేత్తలగు బ్రాహ్మణోత్తములు, సంగీత సాహిత్యవేత్తలు, వినోదజ్ఞులు, రాజకార్యధురంధరులు రావింప బడిరి.

సర్వ శాస్త్ర వేత్త యగు మాధవశర్మ యాగమానుసారముగ మంత్రముల బఠించి శాస్త్రోక్తముగ మాధవ వర్మకు గందారరాజ్యమును బట్టాభిషేకము గావించెను. మాధవవర్మ బంధవిముక్తులగు రాజన్యుల నందఱను గౌరవించి యుచితసత్కారములు గావించి కప్పముల నిర్ణయించి యెవరి రాజ్యమునకు వారల నంపెను. అందొక రాజన్యుడు తన పూర్వనివాసము తెలుపుమన శిరము వంచికొని మాఱుపలక డయ్యెను. అతనిదీనవదన మందఱకు విచారకరముగ నుండెను. మలినాంబరముతో మాసిన తలతోనున్న యాతని యాకారమును జూచి మున్నతని నెటనో కాంచి యుంటిమని ప్రజలు తలంచిరి. మాధవవర్మ యెన్నివిధముల సగౌరవముగా బ్రశ్నించు చున్నను నాబంధోన్ముక్తుండు ప్రత్యుత్తరము నొసంగ డయ్యెను. ఈయంశము నాలకించి సిరియాలదేవి సభారంగమున కేతెంచి యావ్యక్తిని గాంచి నిలువున నీరై నిలువబడి పోయెను. ఆవ్యక్తియు దన్మయుడయ్యెను. కొంతసేపటికి సిరియాలదేవి తెలివి దెచ్చుకొని రాజ్యలక్ష్మీ కలితుడగు కుమారుని హస్తము గొని యాబంధోన్ముక్తుని పాదములపై వ్రాలి, 'రాజన్యా! అజ్ఞాతను, అనన్య గతికను, దీనురాలను కరుణింపు'మని యతని పాదములపై వ్రాలి యశ్రుజలముచే బ్రక్షాళనము గావించుచు, మాధవవర్మా! ఈమహనీయుడె నీజనకుడు. కారాగార పరాభవాదికముచే మిగుల గృశించి యున్నాడు. దైవవశమున దానొందిన దుస్థ్సితిని దలంచుకొని నామ గోపనము గావిం చుచున్నాడని ముక్తకంఠముతో బలికెను. సభ్యులందఱు నిర్విణ్ణులై యా సోమభూపాలకుని కరణాస్వరూపమును జూచి మిగుల విచారపడిరి. మాధవసర్మ సోమరాజును బరామర్శించి దైవవశమున నెంతవారల కేని యవస్థలు రాక మానవనియు గష్టసుఖములు వెనువెంట ననుభవింప దప్పదనియు దెలుపుచు, సిరియాలదేవి కందారరాజ్యమును వదలినది మొదలు నాటివఱకు జరిగిన కథయంతయు నివేదించెను. విచార విన్మయములతో సోమరా జాయంశము నంతయు నాలకించెను. సర్వ మాతని కింద్రజాలమువలె నుండెను. తన ధర్మపత్నిని మరల సందర్శింప గలనని గాని కారాగారమునుండి విముక్తుడను గాగలనని కాని సోమరాజు తలంచి యుండక పోవుటచే నాత డెంతయో యానందించి తన సుకృతమును దానె ప్రశంసించికొనుచు మాధవశర్మకు నమస్కరించి యర్ధాంగి నాదరించి తనయుని గౌగిలించుకొని తన్మయమున జాలసేపు మాటలాడక పోయెను. ఈదృశ్యమునంతయు గాంచుచున్న పౌరులు చిత్తరువు వలె నిలువబడిపోయిరి. పాదపీఠముచెంత బంధితుడై పడియున్న బల్లహుడు దీనస్వరముతో 'సోమరాజా! నీకు మిగుల ద్రోహము గావించితిని. సిరియాలదేవి! నీయెడ మిగుల నపచారము గావించితిని. మాధవవర్మా! నీ ప్రభావము నెఱుంగక ప్రతిఘటించితిని, నన్ను క్షమించుట కర్తవ్యము. పూర్వ దురంతముల స్మరించి విచారపడు నీదీనునికనికరించుట కర్తవ్యమని యొక్కపెట్టున వాపోయెను. సోమరాజు బల్లహుని గరుణించి, తనయునిగాంచి 'పుత్రకా! యీతనివలన నపరాధంబు గొని యంకితుని గావించుకొని క్షమింపు' మని తెలిపెను. మాధవవర్మ బల్లహునివలన బదుమూడుకోట్లు సువర్ణనాణకముల నపరాధముక్రింద గొని యాదాయములో నాఱవభాగము సుంకముగ బ్రతిసంవత్సరము నిచ్చునటుల నాజ్ఞాపించి విడచి పెట్టెను.

మాధవశర్మ రాజకుమారుని జూచి "కుమారా! కలియుగంబున క్షత్రియప్రసాదంబు స్వీకరించుట బ్రాహ్మణులకుం దగదు. బల్లహుని దురితశమనార్థమై మేము సిద్ధేశ్వరాలయమున సిరియాలదేవి యొసంగిన ప్రసాదము స్వీకరించితిమి. ఈ యనాచారదోషము శాంతినొందుటకై మేమందఱము దీర్ఘకాలము జపతపోనియమాదులచే గాలక్షేపము గావింపవలయును. గాన నాజ్ఞయి"మ్మని యడిగెను. బ్రాహ్మణోత్తముల పాదములను బంగరుపళ్లెరములో గడిగి మాధవవర్మ యందఱకు వారి యర్హతానుసారముగ గోదావరితీరముననున్న రెండువేల గ్రామముల నగ్రహారములుగ నొసంగి యమోఘములగు నాశీర్వాదముల నొందెను. చోళేశ్వరుడు మాధవవర్మ పరాక్రమాదికముల నాలకించి తన పుత్రికనొసంగి కొంతరాజ్యమును సమర్పించెను. పితృసందేశమును మాతృసందేశమును లక్ష్యమునందుంచుకొని మాధవవర్మ యాంధ్రదేశమును జిరకాలము పరిపాలించెను. వీరచూడామణియగు నీమాధవవర్మ చరిత్రము చరిత్రాదులయందు శాసనాద్యాధారములచే నిరూపింప బడనంత మాత్రమున విశ్వసింపమనుట సాహసము. ఈతనిచరిత్రముకొఱకు నిజామురాష్ట్రమున మిగుల బరిశోధించుట యావశ్యకము. ఈరాజన్యుడు ధర్మబద్ధుడై చిరకాలము రాజ్యము పాలించి యనేక మహాకార్యముల గావించెను. క్రీస్తుశకము 200 ప్రాంతములో నీరాజ శిరోమణి యున్నటుల నూహింపవచ్చును.

మహామండలేశ్వరుడగు మాధవవర్మ చిరకాలము రాజ్యమేలి యాత్మానురూపులగు తనయులబడసెను. అందొక తనయుడు చింతగింజలమ్ముకొని జీవించు నొక పేదరాలి తనయుని ప్రమాదవశమున జంపెను. మాధవవర్మ యాయంశము మిగుల జాగరూకతగ విచారించి తనయుడు దోషియని తెలిసికొని పుత్రవాత్సల్యము దిగద్రావి యాతని కురిశిక్ష విధించెను. మల్లేశ్వరస్వామి మాధవవర్మ న్యాయబుద్ధి కానందించి మృతుడగు బీదబాలుని రాజపుత్రుని బ్రతికించుటయే గాక సువర్ణవర్షము సైతము కురిపించెను. ఈయంశము పండ్రెండవ శతాబ్దమున పల్లకేత భూపాలుండు బెజవాడ మల్లేశ్వరాలయములోని యొక శాసనములో వ్రాయించెను. దీని వలన మాధవవర్మ యెంత న్యాయశీలుడో ధర్మస్వరూపుడో తెలిసికొనవచ్చును. మాధవవర్మ గతించి చిరకాలమైనను నాతని కీర్తినేటికి శాశ్వతముగ నున్నది. ఆంధ్రరత్నమగు నీరాజన్యుని చరిత్రము ప్రశంసాపాత్రము.

(కొందఱు మాధవవర్మ బల్లహుని వధించి యాతని తనయునకు రాజ్యమునొసంగెననియు సోమరాజు బల్లహునిచే వధింపబడెననియు జెప్పుచున్నారు. అంతకంటె యుక్తియుక్తముగ నుంటచే నీకథ నిట నుదహరించితిమి. వీరశిరోమణియగు మాధవవర్మ జీవితము మనకందఱకు బఠనీయమని యాంధ్ర సోదరులకు విన్నవించు చున్నారము.)

________