Jump to content

ఆంధ్ర వీరులు - రెండవ భాగము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక.

శ్రీ శేషాద్రి రమణ కవులు రచియించిన ఆంధ్ర వీరుల చరిత్రమును జూచితిమి. అటువంటి సుప్రసిద్ధ కవీశ్వరులు వ్రాసిన గ్రంథములకు బీఠిక వ్రాయు నధికారము మాకేమాత్రమును లేదు. నిరర్గళధారగవారు బాఱించు చరితావాహిని తరతరముల బాలురకు బాలికలకు జ్ఞానప్రదాయిని యగుగాకయని పరమేశ్వరుని బ్రార్థింతుము. ఆంధ్రదేశ చరిత్రమును గథలమూలముగ బాఠకులకు సుబోధమగునట్లు గావించనెంచిన యుద్యమ మెంతయు శ్లాఘనీయము. అట్టి యుద్యమమును సాధించుటకు దోడ్పడినందులకు వేంకరామ్‌ కంపెనీవారికి, యాంధ్రదేశ మెన్నటికిని మఱువలేదు. మనవారికి ఆత్మ చరిత్రజ్ఞాన మత్యల్పముగ నున్నది. ఇప్పటి S. S. L. C. చదువులో హిందూదేశ చరిత్ర పఠనమునకు ఆంధ్రచరిత్ర పఠనమునకు వలయునంత యవకాశము లేదు. మన చరిత్రజ్ఞానము లేకుండ B. A. పరీక్షలో నుత్తీర్ణు లగుటకు వీలులేర్పడి యున్నవి. ఇట్టి సందర్భమున మన చరిత్రకు సంబంధించిన కథల చదివియైన దాని జ్ఞానమున సంపాదించ గలుగుటకు ఈలాటి పుస్తకము లాధారములు కాగలవు. ఇవి IV, I & VI ఫారములలో Non-detailed పఠనీయ గ్రంథములుగ నేర్పరచుట కెంతయు ననుకూలములుగ నున్నవి. వీనిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, S. S. L. C. Board వారు నామోదించి కవుల యుద్యమమును గంపెనీవారి యుత్సాహమును సాగింతురుగాత మని యెంచుచున్నాము.

హిందూ హైస్కూలు, బందరు, 1927.

వారణాసి శ్రీనివాసరావు, ఎం. ఏ. (ఆనర్సు) ఎల్. టి.

పీఠిక.

సహృదయులారా !

ఆంధ్రవీరు లను పేరుతో జరిత్రవిషయికమగు వీరకథలతో బ్రథమభాగము కొన్నిమాసముల క్రిందట బ్రచురించి యుంటిమి. విద్యభిమాను లాగ్రంథమును మిగుల నాదరించి సదభిప్రాయముల నొసంగిరి. భాషావిదులగు నుపాధ్యాయులు మాయుద్యమమునెడ నభిమానించి యున్నత తరగతులకు బఠనీయ గ్రంథముగా నేర్పఱచి మాకెంతయు దోడ్పడిరి. ప్రజాభిమానమును గుర్తించి యీరెండవ భాగమును గూడ నుత్సాహముతో బ్రచురింప గలిగితిమి.

సాధారణముగా జరిత్రగ్రంథములందు జిరకాలము విశాలరాజ్యమేలిన రాజుల చరిత్రములె విపులముగా గానవచ్చుచుండును. రాజుల చరిత్రముతో బాటు రాజ్యస్థాపకుల చరిత్రముగూడ మనకు బఠనీయముగాన నీరెండవభాగమున రాజ్యస్థాపకుల చరిత్రమునకె యుచితస్థాన మొసంగితిమి. ఆంధ్రరాజుల చరిత్రము చాలవఱ కగమ్యముగా నున్నది. పురాణగ్రంథములందలి యాంధ్రరాజ వంశములకు జరిత్రము లందలి యాంధ్రరాజులకు సంబంధములు కలుపబడుటకు దీవ్రయత్నములు జరుగుచున్నవి. ఆంధ్రవాజ్మయమునందును శాసనలిపియందును, పూర్వచరిత్రములందును అపూర్వాంశ ములు పరిశోధకులు కనిపెట్టుచున్నారు. ప్రత్యేక వ్యక్తిత్వము నిలువబెట్టు కొనుటకు సహస్రభంగుల సర్వతోముఖముల ఆంధ్రులు యత్నించుచున్నారు. ఈ శుభావసరమున గళాశాల లందును ఉన్నత తరగతులందును జదువుకొను బాలుర కాంధ్రదేశాభిమానము ఆంధ్రభాషాభిమానము గావించుట కుపరించుననియే యీ చరిత్రగ్రంథములు వ్రాయ నారంభించితిమి. ప్రమాణ గ్రంథముల నుండియు శాసనముల నుండియు నిం దుదాహరింప బడిన వీరచరిత్రములకు విషయ సంగ్రహణము గావించితిమి. మొదటి నుండి మే మభిమానముతో జేయు పరిశోధనము గూడ నీగ్రంథ రచనమున కెంతయు సహాయకారి యయ్యెను. కాకతీయ రుద్రదేవుడు, అనపోతనాయకుడు, సోదనాద్రి రెడ్డి మున్నగు వీరుల చరిత్రములకు వలయు జరిత్రాంశములు కొన్ని మేము చేయుచున్న నిజామురాష్ట్ర పరిశోధనమున లభించినవి. రెడ్డిరాణి పత్రికలో శ్రీ సురపురపు ప్రతాపరెడ్డి బి. ఏ., బి. ఎల్. గారు వ్రాసిన సౌమనాద్రి యను విలువగల వ్యాసమునందలి భాగములు కొన్ని యిందలి సోమనాద్రి చరిత్రము నందు జేర్చితిమిగాన వారికి బ్రత్యేకించి కృతజ్ఞత దెలుపుకొనుట యవసరము. దేశ మిపుడు పంచమ సంఘము నాదరించు చున్నది. అస్పృశ్యతా నివారణమునకు, పంచమోద్ధరణమునకు మిగుల బాటుపడు చున్నది. పూర్వము పంచమ సోదరు లొందిన యభ్యున్నతికి దార్కాణముగా నిందు బలనాటి వీరులలో బేరొందిన కన్నమనాయని చరిత్రమును సేకరించి యీ గ్రంథమునందు జేర్చితిమి.

ఆంధ్రుల పూర్వచరిత్ర మగాధముగా నున్నది. ఉన్నంతలో నసమగ్రభాగములు మెండు. కథారూపముగా నభిరుచితో బఠింప వీలగు నాదర్శ పురుషుల జీవితసారముల నీ గ్రంథమున జతపరచితిమి. ప్రథమభాగమువలె నీ ద్వితీయ భాగముగూడ బ్రజాదరణపాత్ర మయ్యెనేని మేము ధన్యులము. ద్వితీయ ముద్రణము నాటి కిందలి దొసంగులున్న సవరించుకొని నిర్దుష్టము గావించు కొందుము. ప్రకృతము దేశసేవగావించు విజయనగరము, గద్వాల, వెంకటగిరి, బొబ్బిలి, పిఠాపురము, మున్నగు సంస్థానములకు స్థాపకులగు రాజుల చరిత్రముగూడ నిందు సేకరించితిమి. విజయరామరాజు స్వతంత్రాభిరతులగు విజయనగర రాజులలో గడమవాడు. ఈయన కార్యదీక్ష, స్వాతంత్ర్యతృష్ణ నిరుపమానములు, అనపోతనాయకుడు వేంకటగిరి, పిఠాపురము, జటప్రోలు, మైలవరము, బొబ్బిలి సంస్థానముల మూలపురుషుడు. ఈమహావీరుని జీవిత ముద్రేకకరముగ నుత్సాహకరముగా నుండును. గద్వాల సామ్రాజ్య నిర్మాతయగు సోమనాద్రి యవనరాజులకు బ్రబలప్రత్యర్థి; స్వాతంత్ర్యము కాపాడుకొని దేశీయకళల బోషించిన వీరచూడామణి. ఈ గ్రంథ మునం దుదాహరింప బడిన పదిమందివీరులలో నీమువ్వురి రాజ్యములుమాత్రము నేటి కాంధ్రజాతీయతకు దృష్టాంతముగ నిలిచియున్నవి. మిగిలిన యేడ్వురచరిత్రము కేవలచరిత్ర శరణ్యముగా నున్నది.

కొలదికాలములో మూడవ భాగముగూడ బ్రచురింపనున్నారము. అందు బెద్దాపురము, వనపర్తి, ఆత్మకూరు, బొబ్బిలి మున్నగు రాజ్యములను బాలించిన పూర్వరాజుల చరిత్రములు వ్రాయదలంచితిమి. ఆంధ్రవీరులకు సవిమర్శమగు తొలిపలుకు వ్రాసి గ్రంథప్రశస్తికి గారకులైన బందరు హిందూహైస్కూలు ప్రథానోపాధ్యాయులగు బ్రహ్మశ్రీ వారణాసి శ్రీనివాసరావు పంతులు ఎం.ఏ.,ఎల్.టి. గారియెడ గృతజ్ఞులము.

ఈగ్రంథములు వ్రాయుటలో మమ్మ మిగులబ్రోత్సహించుటయెగాక ముద్రించి యచిరకాలమున వ్యాప్తికి దెచ్చిన వేంకటరాం అండ్ కో, బెజవాడవారు కృతజ్ఞతా పాత్రులు.

ఇట్లు భాషాసేవకులు,
శేసాద్రి రమణకవులు
శతావధానులు.
నందిగామ,
1 - 8 - 1927.
________