Jump to content

ఆంధ్ర వీరులు - రెండవ భాగము/రుద్రదేవ చక్రవర్తి

వికీసోర్స్ నుండి

రుద్రదేవ చక్రవర్తి.

ఆంధ్రరాజన్యులలో గాకతీయులు మిగుల సుప్రసిద్ధులు. "కాకతి" యను పదము దేవికి బర్యాయనామము. ఈవంశీయులు పూర్వము కాకతి దేవతకు భక్తులైయుంటచే వీరలను నాటనుండి కాకతీయులని వ్యవహరించు చున్నారు. "కాకతి" జైన దేవతనియు నీవంశీయులలో బూర్వులు జైనులుగనుండి యా దేవతను బూజించుచు నుండుటచే గాకతీయులుగ వ్యవహరింపబడిరని తెలియుచున్నది. కాకతీయులలో బూర్వుడు మహామండలేశ్వర బేతరాజు.

త్రిభువన మల్ల విక్రమాదిత్యుడను చాళుక్యరాజన్యు డాంధ్రకర్ణాట దేశంబుల బాలించుచు బలువురను బ్రతినిధులుగ ముఖ్యనగరములయం దుంచి వారలచే రాజ్యము నేలించి సుంకముల బడయుచు యాజమాన్యము దనయం దుంచు కొనెను. ఆకాలమున రాజప్రతినిధులుగ నున్నవారిలో గాకతీయవంశీయులుగూడ జేరియుండిరి. కాకతీయులు మొట్టమొదట జాళుక్యులయొద్ద సామంతరాజులుగ రాజప్రతినిధులుగనుండి పరాక్రమముచే బలుకువాసిచే బలము నభివృద్ధి గావించికొని, లోకువగనున్న సామంతుల గొల్లగొని, రాజ విప్లవములలో విజృంభించి సమీపదేశము నాక్రమించు సైనికులనందఱ సమావేశపరచి రొక్కమునంతయు వ్యయము గావించి ప్రజాద్రోహము గావించుచు జనకంటకులై వర్తించున్న పూర్వసామంత రాజులనందఱ బంధించి సన్మార్గావలంబనులగు నూతనులను సామంతులుగను రాజ ప్రతినిధులుగను నియోగించి అనుమకొండలో నాంధ్రసామ్రాజ్యమును స్థాపించెను. దేశమంతయు నశాంతిమంతమై యున్న సమయములో జాతీయతా వర్థనమునకై యాంధ్ర సామ్రాజ్యము నెలకొల్పి, యాఱిపోయిన చాళుక్యపరాక్రమవహ్నిని రగులజేసి మాతృ సేవగావించిన ప్రోలరాజన్యుని జీవితము మన కసమగ్రముగ లభించియున్నది. ప్రోలరాజు నెలకొల్పిన సామ్రాజ్యము నేటికి విస్మృతికి వచ్చినను నాటి శుభచిహ్నము లింతవఱకు అనుమకొండ ప్రాంతమున గానవచ్చుచున్నవి. జీర్ణచిహ్నములతో నాటిదుర్గములు, దేవళములు, ధర్మశాసనములు, రాచబాటలు, సరోవరములు, సింహద్వారములు గానవచ్చుచు నేటికి గూడ బ్రాచీనాంధ్ర దేశ చరిత్రకారులకు జరిత్ర భిక్ష పెట్టుచున్నది.

ప్రోలరాజు కాలమున వర్థమాన పురము, పొలవాస, ధర్మపురి, మంత్రకూటము, దేవగిరి, కళ్యాణ పురములోనగు చోటుల బలవంతులగు చాళుక్య రాజ ప్రతినిధులూ రాజ్యము చేయుచుండిరి. ఎవరికి వారు స్వతంత్రులై సంఘైకమత్యమున గల మేలులు మఱచి వర్తింప దొడంగిరి. ఆంధ్ర దేశము భిన్న భిన్నముగ నుండెను. ఆంధ్రదేశమునకు బ్రత్యేకరాజ్యము లేకున్న లాభము లేదని ప్రోల భూపాలుడు అనుమకొండలో నాంధ్రసామ్రాజ్యమును స్థాపించినది మొదలు తక్కు దుర్గాధీశ్వరులకు బ్రోలరాజునకు వైరము పెచ్చరిల్లసాగెను. ప్రోలరాజు తనయావజ్జీవితము సంగ్రామరంగముననె గడపెను. దేశమంతయు నొక్కటి, యాతడొక్కడు నొకటి యగుటచే నెడతెగక బలమువృద్ధిజేసి ప్రతిఘటించిన రాజన్యుల నందఱను సామంతులుగ జేసికొనువఱకు జాలకాలము పట్టెను. మనము పఠింపబోవునది రుద్రదేవుని చరిత్రమైనను అతని పవిత్రజీవితమున కాధారభూతుడగు ప్రోలరాజు జీవితముగూడ బఠించుట యావశ్యకము కాకపోదు.

ప్రోలరాజు ఆంధ్రదేశ రత్నమనదగు అనుమకొండలో నాంధ్రసామ్రాజ్య రాజధానిని నెలకొల్పి చిరకాలమునకు దేశమున శాంతి స్థాపించెను. మరల జాళుక్యరాజులలో నొకడు కొంతబలమును సంపాదించికొని ప్రోలరాజును లోబరచికొనినగాని తనపూర్వ రాజ్యమంతయు హస్తగతము గాదని తలంచి విశ్వనాధ దేవుడను వీరవర్యుని సేనానాయకుని గావించి యుచిత పరివారముతో గుదురుకొన నున్న యాంధ్రసామ్రాజ్యము కూలద్రోయింప బంపెను. ప్రోలరాజు మొక్కవోని పరాక్రమముతో సేనానాయకుని సైన్యమును జెండాడి మూలచ్ఛేదనము గావింపకున్నచో శత్రువృక్షము మఱల జిగి రించునని కళ్యాణపురమును ముట్టడించి రాజవంశమును జెండివైచి విరోధియనువానిని లేకుండ జేసి, ఖడ్గముదాల్చి తానొనర్చిన తానొనర్చిన కూరకృత్యములు, హత్యలు స్మరించి పాపపరిహారార్థమై గంగాతీరమున దేవళములు, కోనేరులుగట్టించి జీవితశేషము పారమార్థిక చింతనముతో గడప నిశ్చయించెను.

ప్రోలరాజు అనుమకొండరాజ్యము పాలించుతఱి నొక చిత్రకథ జరిగెను. దూరవాసులగు పౌరులు కొందఱు రాజధానికి బండ్లతో వచ్చుచుండ అనుమకొండ రెండుక్రోసుల దూరములో నుండ నొకబండికాలు నేలలో దిగబడెను. మిగిలిన బండివాండ్రదఱు నాశకటచక్రమును బైకిలాగ నెంచి కృతార్థులు కారైరి. ఆ శకటములకు సంబంధించిన జనులందఱు గ్రామములోనికేగి అనుమకొండ వాసుల కీయవస్థతెలిపి జన సమూహమును సహాయముగొని బండ్లాగిన చోటు జేరి నేలలో నిరికికొనిన శకటచక్రము బలమంతయు నుపయోగించి లాగసాగిరి. కొంతసేపటికి భూగర్భమునుండి శకటచక్రము బయట పడెను. దానికమ్మి యంతయు సువర్ణమయ మయ్యెను. కాలు దిగబడినచోట సువర్ణచ్ఛాయ వెల్లివిరియు చుండెను.

పౌరు లావింత వేగమునబోయి ప్రోలరాజున కెఱిగించిరి. అతడు పరివారముతో బయలు వెడలి యాప్రదేశము సందర్శింప నటనొక సువర్ణలింగము జ్యోతిర్మయమైనది కానవచ్చెను. రాజన్యుడు వెంటనే దానిని ద్రవ్వించి యాశకటముపై నెక్కించి రాజధానిలో బ్రతిష్టింపనెంచెనుగాని యెంతప్రయత్నించినను ఎద్దు లాశకటమును లాగజాలవయ్యెను. చెంత నున్న బండ్ల విప్పించి కాండ్లుకట్టి తోలినను యెద్దులు మోర బిగించి ముందడుగు వేసి పోవ నెంత ప్రయత్నించినను బండి కదలకపోయెను. అది దైవమహత్త్వముగ భావించి దైవస్వరూపులు, మహానుభావులు, సర్వజ్ఞశిరోమణులు, కాళేశ్వర నివాసులు నగు రామారణ్య శ్రీపాదులను, త్రికూట నివాసులు, హిడింబాశ్రమ నివాసులు నగు త్రిదండమహామునుల రావించి వారి కీవిషయము ప్రోలరాజు విన్నవించెను. వారలు పూర్వోత్తర కథనంతయు నాలకించి యాసువర్ణలింగమునకు నత్యంత భయభక్తులతో నభిషేకము చేయించి విభూతి శ్రీచందన మలంది వేదోక్తముగ సహస్రనామపూఝ గావించి బిల్వపత్రముల బైనిగప్పి మహానైవేద్యమును సమర్పించి 'హరహరా!' యని యెద్దులను దోలుమనిరి. శకటము తేలికగా నడువ సాగెను. ప్రజ లామహాత్ముల శక్తికి విస్మయమునొందిరి.

రాజ్యాంగరహస్యవేత్తయు, పరబ్రహ్మస్వరూపుడు, విజ్ఞానరాశియగు రామారణ్యశ్రీపాదులు ప్రోలరాజుతో 'ఇది సామాన్య సువర్ణలింగము కాదు. స్పర్శవేదలింగము. దీనిని సోకినచో నినుము బంగారమగును. నూతనముగ నాలయముగో పురము గట్టించి యందు దీనిని బ్రతిష్ఠింపవలయునని యాత తీయ సమ్మతించెను. రామారణ్యశ్రీపాదులు శ్రీవిద్యాధర చక్రమునుబట్టి కోటకు రేఖలువ్రాసి యగడ్తలు త్రవ్వించి అనుమకొండవైపొక ద్వారమేర్పరచి చెంత నొకదివ్యాలయమున నాగలింగమును బ్రతిషచేయించెను. నూతనముగ నిర్మించిన పురమునకు నేకశిలానగరమని పేరు బెట్టి శ్రీపాదులు నిజనివాసమున కరిగిరి. స్పర్శవేదలింగమునకు సోకించినమాత్రమున దినమునకొక పుట్టియినుము అంతియ బంగారుమగుచుండెను. రాజన్యుడు దానిని ధర్మార్థము వినియోగము చేయుచుండెను.

చిరకాలమునకు బ్రోలరాజున కొకపుత్రుడుజనించెను. విధివిహితంబుగా నా బాలునకు నామకరణాది శుభకార్యంబులు నెరవేర్చి మహోత్సవాగతులకు విద్వాంసులముందు రాజన్యుడు కుమారుని జన్మకాలనక్షత్రాదికముల విన్నవించి బాలకుని భవిష్యజ్జీవితము నిర్ణయింప బ్రార్థించెను. బ్రాహ్మణోత్తములు తమలో దాము సంశయించుచు రాజుతో మాఱాడ వెఱచిరి. చకితుడై రాజన్యుడు విద్వాంసుల సందర్శించి యంజలి మోడ్చి "కానక గన్న యీకందువునకు బాలారిష్టములు లేవుగదా! ఈశ్వరవరప్రసాదమున సంతానవృక్షమునుండి లభించిన యీ ఫలము మాచేతినుండి తొలంగిపోవ భగవత్సంకల్పముకాదుగదా! ఆజ్ఞయిం"డని సదైన్యముగ బ్రశ్నించెను. విద్వాంసులు దూరమాలోచించి,

కం|| తనయెఱిగిన యర్థంబొరు
     డనఘా! యిది యెట్లు సెప్పుమని యడిగిన

    ప్పనివాడును సత్యము జె
    ప్పనివాడును ఘోరనరక పంకమునబడున్.

అను నీతివచనమును దలంచుకొని సత్యము చెప్పక దాచగూడదని రాజన్యునితో "ఆర్యా! ఈ కొమారునివలన మీకు మరణము గలుగును. కొమారుడు చిరాయుశ్శోభితుడనుట కెట్టిసందియము లేదు" అని విన్నవించిరి. రాజు బ్రాహ్మణుల సగౌరవముగ బంపివైచి ప్రోలరాజు తనధర్మపత్ని కీరహస్య మేకాంతమున నెఱింగించెను. ఆయమయు నొకవైపు పుత్రప్రేమము మఱియొకవైపు భర్తృభక్తి హృదయము నుర్రూతలూప జాలసేపు నిశ్చేష్టురాలై కర్తవ్యభారము భర్తపైనుంచెను. ప్రోలరాజు కానకగలిగిన నెత్తురు కందును విడువజాలక ఆత్మమరణమున కియ్యకొనజాలక పత్నియనుమతిచొప్పున నాబాలకుని నర్థరాత్రమున రహస్యముగ గొనిపోయి స్వయంభూస్వామి మండపమున బొత్తులుపఱచి యందు బరుండబెట్టి పుత్రమోహవిషణ్ణయగు పత్నిచే బిడ్డనికి బాలిప్పించి పుత్రబంధము ద్రెంపుకొనజాలక యెటులో బయట బడెను.

మఱుసటిదినమున ఆలయ పరిచారకులు చూచుసరికి గేవు కేవుమని యేడ్చు నీనెత్తురుకందువు కాన్పించెను. వారలు వెంటనే యీరహస్యము నంతయు నర్చకులకు నివేదించిరి. వా రాశిశువును గాంచి దివ్యాకారశోభితుడగు నీబాలకుడు చక్రవర్తులయింట జనింపదగినవాడు. ఇట్టి దుర్గతికి లోనుగావలసినయవస్థ యేమికలిగెనో యని వానిని గొనిపోయి యింట నుంఛి యారహస్యమును బ్రోలరాజులకు నివేదించిరి. రాజా బాలుడు తనకుమారుడె యని యెఱింగియు నెఱుంగని యటుల నటించి ప్రేమము జంపుకొని యర్చకునితో ఎవడైన నేమి! పసిబిడ్డడు. రక్షింపదగినవాడు యుక్తవయస్సు వచ్చు వఱకు గాపాడి విద్యాబుద్ధులునేర్పి వానిని సంస్థానమున కప్పగింతురేని స్వతంత్రముగ జీవింపగలవాడగును. వీనిచే మీకు బుణ్యము పురుషార్థము కలుగును. బాలకుని పోషణమునకగు వ్యయమును సంస్థానమే భరింపగల"దని చెప్పి బాలకుని సంరక్షణమునకై కొందరు విశ్వాసయోగ్యులగు భటుల నియోగించెను. అర్చకులలో బెద్దయగు రుద్రజియ్యయనునాత డా బాలుని పోషణభారము దన తలపై నుంచుకొని యుక్తవయస్సు వచ్చినపిదప విధ్యుక్తముగ నుపనయనము గావించి బ్రాహ్మణ ధర్మానుసారముగ వేదశాస్త్రాదికము, క్షత్రియ ధర్మానుగుణముగ ధనుర్విద్యాదికము నేర్పి జాగరూకత నాబాలుని గాపాడసాగెను. అర్చకు డా బాలునకు రుద్రదేవుడని నామకరణము గావించెను. ఈతడె మన కథానాయకుడు. పవిత్రవంశమున జనించినవాయను ఆంధ్రవాజ్మయమునకు ఆంధ్రదేశమునకు బ్రత్యేకవ్యక్తిత్వము సమకూర్పదగిన మహానుభావుడగుటచే గాబోలు నీబాలకుడు స్వల్పపరిశ్రమచేతనే సర్వశాస్త్రపరిజ్ఞా నము శస్త్రవిద్యానైపుణ్యము గడించి సాటివారిలో సర్వవిధముల నెన్నికకెక్కి యౌవరాజ్యపట్టాభిషేకమునకు దగుప్రాయము గలవాడయ్యెను.

ప్రోలరాజు షట్కాలశివపూజానిరతుడు. స్వయంభూస్వామి యాలయమున కాత డొంటరిగా వచ్చి పూజాదికములు గావించిపోవు నాచారముగలదు. కొంత కాలమునకు స్వయం భూస్వామి యనుగ్రహమున వేఱొకకుమారుడు కలిగెను. వానికి మహాదేవరాయలని నామకరణము గావించి వాత్సల్యముతో బెంచుచుండెను. ఒకనాడు ప్రోలరాజు ప్రయాణము కానిశ్చయించి వేకువజామున లేచి పరివారముతో బయలుదేరి ద్వారమున ననుయాయులనుంచి తా నొక్కరుడ యీశ్వరసాన్నిధ్యమున కేగి పూజాదికములను శ్రద్ధాభక్తులతో నొనరింపదొడగెను. రాచనగరులో నుదయకాలమున మంగళగీతలు వినరాసాగెను. ప్రోలరాజు పూజాదికములు ముగించి శివనిర్మాల్యము గొనివచ్చుచుండ మండపమున నిదురించుచున్న యొక దివ్యమంగళవ్యక్తి గోచరించెను. ప్రోలరా జట గూర్చుండి యావ్యక్తిదివ్యాకారమును రూపరేఖావిలాసములు గాంచి యాశ్చర్యపడుచు దనలో దానుచింతించుచు దలయూపుచు నిశ్చేష్టుడై చాలసేపుగడపెను. తుదకు బ్రయాణ మనివార్యమగుటచే లేచి యావ్యక్తిని నొక్కమాఱు కౌగిలించుకొనిన గాని పోవజాలనని నిశ్చ యించి తరంగముల వంటి బాహువులు సాగించి నిదురలో మైమఱచియున్న యావ్యక్తిని గౌగిలింప బోయెను. వెంటనే గాఢనిద్రలో నున్న యావ్యక్తి యులికిపడి లేచి విద్యుద్వేగమున బ్రోలరాజును కోశనిర్ముక్తమగు పదనుకత్తితో వక్షమునుండి యావలకు దూరునటుల బొడిచెను. వెంటనే వృద్ధుడగు ప్రోలరాజు మొదలు నరికిన కదళీతరువు వలె బడిపోయెను. గంటవలె వెలుగుచున్న దీపపు వెలుగున నావ్యక్తి తనకత్తి కెఱయైన పురుషుని బోల్చికొని ప్రోలరాజని గుర్తించి గుండెల బాదుకొనుచు "అన్యాయముగా రాజన్యుని జంపితిని. రాజద్రోహము గావించిన నాకిక నధోలోకమే శరణ్యము. ఎంత యనాలోచితమునకు బాల్పడితిని! నిద్రావస్థలో జోరుడని చేయిమిగిలితిని. ఈ పాపకార్యము రాజనగరమున నివేదించి దోషమునకు దగినశిక్ష నొందుదుగాక"యని యావ్యక్తి బయలు వెడలెను. ఈసమ్మర్దము నాలకించి ద్వారమున నిలిచియున్న పరివార మంతయు మహామండలేశ్వరుని సమీపించి యీ విపరీతావస్థగాంచి నివ్వెరపోయిరి. ప్రోలరాజు కొంతసేపటికి దెలివినొంది యూర్థ్వశ్వాసములచే మరణవేదన మొందుచుండ రాజకీయోద్యోగులు రాణివాసపు వారుగూడ నీకథవిని సంభర మముతో వచ్చి పలుదెఱంగుల వాపోవుచు ఖడ్గప్రహారము గావించిన నూతన వ్యక్తి జంప వలయుననియు గత్తికొక ఖండముగ జేయవలయు ననియు బలుక దొడగిరి. నోటమాట వెడలుటయే కష్టముగానున్న యా మరణావస్థలో తెఱప జేసికొని తీవ్రవాదులగు నారాజభక్తుల నందఱవారించి "మిత్రులారా! శాంతివహింపుడు. హంతకుడు స్వామిద్రోహికాడు. నాకుమారుడె. అతడు రుద్రదేవుడు. భవిష్యదాంధ్రసామ్రాజ్యచక్రవర్తి. ఇతని జననకాలముననె జ్యోతిష్కులు జాతకములవ్రాసి పితృమారకుడగునని సెలవిచ్చిరి. విపత్తునుండి బయటపడనెంచి వీని నాలయమున రహస్యముగజేర్చి యర్చకుల యాధీనమునం దుంచితిని. నేటితో నాకాయువు పరిపక్వమైనది. ఇప్పటికి నాకు డెబ్బదిరెండు వత్సరములు వచ్చినవి. భోగములపై విరక్తికలిగినది. మన:పూర్వకముగ నాబాలుండాంధ్ర సామ్రాజ్యమునకు భారవాహకు డగుటకు నేను సమ్మతించు చున్నాడను. మీరందఱు నాపై జూపిన గౌరవ మీ బాలకునిపై జూపుట కర్తవ్య"మని ప్రోలరాజు పల్కి స్తబ్ధుడై చూడసాగెను.

ప్రజలందఱు భయవిస్మయములచే దరంగితులై చిత్ర ప్రతిమలవలె నిలుచుండి యాదృశ్యమును దిలకించుచుండిరి. అనుకొనిన దొకటి అయిన దొకటి. రుద్రదేవుడా ప్రోలరాజు వాకములు వినిన సదాది "రాజద్రోహినేకాక పితృద్రోహినిగూడనైతినా ఈ పాపమున కిక శిక్షలేదు. నాయంతపాపి భూలోకమున లేడని తండ్రిపై వ్రాలి విలపించెను. ప్రోలరాజు తనయుని గాఢముగ కౌగిలించుకొని "కుమారా! విచారింపకుము. దె వనిది నెరవేరినది. ఖడ్గము నూడ బెఱకుము. బాధతో బ్రాణముల భరించుట చాలకష్టముగ నున్నది. సహగమనమునకు మీతల్లి సిద్ధురాలయ్యెనేని వలయు నవకాశముల గల్పింపుము. నీ సోదరుడు మహాదేవ రాయల భారము నీతలపైననే గలదు. ఇవి పద్మాక్షీదేవి ప్రసాదించిన దివ్యాయుధములు. మన పూర్వులు యాయుధముల దాల్చి విక్రమైకజీవనులై యుభయ లోకములలో బేరుగాంచిరి. పరిజనులారా! పౌరులారా! మీయందరి యొద్ద సెలవునొందుచున్నాడనని ప్రోలరాజు పంచాక్షరీ జపము చేయుచు గనులు మూసికొనెను. రుద్రదేవు డపనతముఖుండై పితృదత్తములగు నాయుధము లందుకొని తండ్రియురమున గాటముగ నాటుకొనిన ఖడ్గము నూడబెఱికెను. చిమ్మనగ్రోవితో గొట్టినటుల రక్తధారలు రుద్రదేవుని మెయినిండ బడెను. ముఖ్యులగు నమాత్యు లాయదనున రుద్రదేవుని నటనుండి తొలంగించి ప్రోలరాజు కళేబరమున కర్హమగు సంస్కారముల గావించిరి. రాజపత్నియు గుమారుని కౌగిలించుకొని యానందబాష్పములతో నాతని మేను దడిపి భర్తృచితిపై వ్రాలి వీరస్వర్గ రాజ్యమును జూరగొని జ్వాలా గర్భమున నందర్హిత యయ్యెను.

ఒక శుభముహూర్తమున రుద్రదేవ చక్రవర్తి యాంధ్ర సాంరాజ్యమునకు బట్టాభిషిక్తు డయ్యెను. దేశము మిక్కిలి సంకులస్థితిలో నుండెను. తన సహోదరుడగు మహాదేవరాయ పితృహత్యాకర్తయగు నన్నతో గలిసిమెలసి యుండడయ్యెను. ప్రోలరాజు కాలములో సామంతులుగనుండి పన్నులు చెల్లించిచుచు విధేయులై యున్నవారిలో బలువురు తిరుగబడి స్వతంత్ర పతాకముల నూపి యశాంతి సమీరము నతిశయింప జేయుచుండిరి. హృదయశల్యమువలె బితృహత్యా విచారము మనస్సును దీవ్రవేదనపాలు గావించుచుండెను. ముందు బితృహత్యాఘమునుండి విముక్తుడైన గాని తనజీవితము పవిత్రము గాదనియు, దా నపవిత్రుడై యున్నంతవఱకు బ్రజావిశ్వాస దూరుడు కావలసి వచ్చుననియు, నిశ్చయించి రుద్రదేవుడు రాజధానియగు అనుమకొండలో గొప్ప శివాలయము గట్టించి సహస్ర స్తంభమండపము దీర్పించి గొప్ప దీర్ఘికను ద్రవ్వించెను. ఒరంగల్లులో బెక్కుశివాలయముల బ్రతిష్ఠించెను. పూజారులచే బూజాపురస్కారముల నందికొనుసిద్ధేశ్వరునకు విశాలాక్షీ దేవికి నిత్యనైవేద్య దీపారాధనాదులకు గ్రొత్త వస్త్రములు నొసంగి బొక్కసములోని ధనముతో రాజథాని కాఱుక్రోసుల దూరములోనున్న అయ్యనవోలులోని విశాల ప్రదేశమున మైలారుదేవున కొకగొప్ప యాలయమును గట్టించి, ఒరంగల్లుకోటలో గల ద్వారములవంటి విచిత్రశిల్పాభిరామములగు ద్వారముల నాలుగువైపుల బ్రతిష్ఠించి అనుమ కొండకు బరుగుదూరములో నున్న వడ్డెపల్లిలో గొప్ప తటాకమును ద్రవ్వించి చెంత సిద్ధివిఘ్నేశ్వరుని బ్రతిష్ఠించి యచట విశాల మగు నాలయము మండపము గట్టించెను. ఇంతియగాక మొగిలిచర్లయనుచోట నేకవీరాదేవి యను శక్తిని బ్రతిష్టించి గొప్ప దేవళము గట్టించి వస్తువాహనములు సమర్పించి మరల రాజధానిచేరి తనపేర, దనతండ్రిపేర బెక్కుగ్రామములు గట్టించి యాగ్రామములు వేదవేదాంగ ప్రవీణులగు బ్రాహ్మణోత్తములకు ధారవోసి యంతతో దృప్తినొందక దిగ్విజయపరుడై వివిధరాజుల వశంవదుల గావించుచు శ్రీశైలఫ్రాంతము తన హస్తగతము గావించుకొని యట బత్నీయుక్తుడై రత్నమాషణములు మడిమామాన్యములు సమర్పించి పాండ్యాధీశ్వరులపై దండయాత్రవెడలి కాంచీనగరము శ్రీరంగములోనగుపుణ్యక్షేత్రములు దర్శించి పాండ్యుల సామంత రాజులను గాలించి సేతుబంధన రామేశ్వరునియొద్ద కేగి తులాభారములు పెక్కు తూగి ధనుష్కోటిలో స్నానాదికముల గావించి జయములనెలకొల్పి రుద్రదేవచక్రవర్తి జయలక్ష్మీ ద్వితీయ రాజధానికి జేరెను. మఱియొకమాఱు వారణాసీప్రాంతాలకు దండయాత్రకు వెడలి గంగాస్నానములు గావించి శోడ శోపచారములతో విశ్వేశ్వరునకు బూజాదికములు గావించి యనంతరము గయకేగి పితృదేవతలకు బిండప్రదానము సభక్తికముగ నిర్వహించి యిప్పటికి బాపవిముక్తుడ నైతినని రుద్రదేవచక్రవర్తి రాజధానినగర మగు ననుమకొండకు జేరెను. మహాదేవరాయలు విజయయాత్రలకు బుణ్యక్షేత్రములకు రుద్రదేవు డేగినపుడెల్ల రాజ్యవ్యవహారములు నిర్వహించుచు రాజద్రోహులతో గలిసి రుద్రదేవుని గడముట్టించు నుపాయము లారయుచు సమయమునకై నిరీక్షించియుండెను. ఇది గ్రహించి రుద్రదేవుని విరోధులగు సామంతరాజులు ఆంధ్రసామ్రాజ్యమును హరింపనెంచి మహాదేవరాయలతో రాయభారములు జరిపి విప్లవోద్యమమున బాల్గొన వాగ్దానము గావించిరి. రుద్రదేవు డిదియంతయు గ్రహించి తనతండ్రి యవసానకాలమున గావించిన హితోపదేశము జ్ఞాపకముంచుకొని సోదరుని క్షమించెను. ప్రతిపక్షులుమాత్రము మహాదేవరాయలు తమపక్షమువాడుగ విశ్వసించి యుంటచే నియతకాలమున అనుమకొండ రాజ్యమును ముట్టడింప బయలుదేరివచ్చిరి. ఈవిపరీత పరిస్థితులన్నియు రుద్రదేవుడు సమగ్రముగా గ్రహించి విరోధులతో సోదరుడు కలియకుండునటుల వలయు గట్టుదిట్టములు తొలుతగావించి ప్రత్యర్థుల మట్టుపెట్టుటకు సైనికబలమును మిగుల వృద్ధిజేసి విరోధు లరుదెంచు మార్గముల దెలిసికొని త్రోవలనరికట్టి వధింప గొంతబలమును బంపెను. మహాదేవరాయల యొద్దనుండి తమకు సరియగు నుత్తర ప్రత్యుత్తరములు నడుపకున్నను, దురాగతులగు ప్రత్యర్థిరాజులు అనుమకొండరాజ్యము హరింప సకాలమునకు వచ్చి రుద్రదేవుని ధాటి కాగజాలక ప్రాణమానముల గోల్పోయిరి. ఆకాలమున రుద్రదేవుని నెదిరించిన రాజులలో బలువురు ప్రసిద్ధులు గలరుగాని వారి ప్రత్యేక చరిత్రములు సమగ్రముగా దెలియ వచ్చుటలేదు. దొమ్మరాజు బలవంతులలో నగ్రగణ్యుడు. ఈతడు అనుమకొండరాజ్యమును హరింప వలయునని సమధికబల సమేతుడయివచ్చి కోటముట్టడించెను. ఈముట్టడి కొన్నిమాసములు జరిగెను. కాకతీయ సైన్యములు దొమ్మరాజు సైన్యముల జించిచెండాడెను. విజయముపై నాసమాని బ్రతుకుజీవుడాయని దొమ్మరాజు గుఱ్ఱమునెక్కి పారిపోవుచుండగా రుద్రదేవుడు వెంబడించి బాణముల బ్రయోగించి యాతనికాయము గాయము గావించెను. దొమ్మరాజు తన యశ్వారోహణనైపుణ్యము ప్రాణరక్షణముకొఱ కుపయోగించి యెందో దాగెను. రుద్రదేవుడీ యదనుగ్రహించి పరివారసహితముగా దొమ్మరాజు రాజ్యమునందు బ్రవేశించి కోట బగులగొట్టి రాజధాని గొల్లగొని విజయస్తంభమును బ్రాతించి తనప్రతినిధి నారాజ్యము నందుంచి వెనుకకు మరలెను. రుద్రదేవుడు దొమ్మరాజుతో బోరుచున్న సమయము తమ కనుకూలముగా గ్రహించి మేడరాజు, మేళగిదేవుడు అనుమకొండపైకి దాడివెడలిరి. అనుమకొండయందున్న మూలబల మావీరయుగముతో బోరాడుసరికి రుద్రదేవుడు రాజధానిజేరి వ్యూహముల బన్ని విరోధిబలములను బంచబంగాళము గావించెను. మేడరాజు, కందకములను బూడ్పించి రాజధానినంతయు దగులబెట్టించి యుపవనముల రూపుమాపి నగరమును బాడుచేసెను. తల దాచుకొనుటకు దావులేక భీమరాజు అంత:పుర కాంతలతో దోబుట్టువులతో రక్తసంబంధులతో నెందోపాఱిపోయి రుద్రదేవుని పేరు వినబడినంతవఱకు దలయెత్త డయ్యెను. అంతలో కందూరు వర్థమానపుర రాజ్యములు రుద్రదేవుని హస్తగతములయ్యెను.

చోడోదయుడను నొకరాజు విస్తార సైనికబలముతో స్వతంత్రుడై తిరుగబడగా రుద్రదేవు డాతనినగరమును ముట్టడించెను. అనుమకొండ సైనికులు చోడోదయుని నగరమును ధ్వంసము గావించిరి. రుద్రదేవుడు బాణముల బ్రయోగించి చోడోదయుని దేహమంతయు గాయములతో నిండునట్లు చేసెను. ఆయువుపట్లలో బాణములు గ్రుచ్చుకొనుటచే జోడోదయు డొడలెఱుంగక రాజమందిరము విడిచి కానల వెంటబడి ప్రాణములు విడిచెను. సమర్థులగు రాజులందఱు రుద్రదేవునకు సామంతులైరి. మహాదేవరాయలు రుద్రదేవుని యసాధారణ పరాక్రమమునకు ముగ్దుడై ద్వేషము మాని కార్యాలోచనములం దన్నతో సర్వవిధముల నేకీభవించు చుండెను.

రుద్రదేవుడు పరాక్రమాతిశయముచే ఆంధ్రదేశమంతయు నాక్రమించుకొనెను. అంతియగాక కర్ణాటదేశము నందలి భాగములను ద్రవిడదేశములో గొంతభాగమును సరిహద్దులందున్న మహారాష్ట్రదేశమును సాధించెను. రుద్రదేవుని రాజ్యమునకు హద్దులు తూర్పుదిక్కున సముద్రమనియు, దక్షిణదిక్కున శ్రీశైలమనియు, బడమటిదిక్కున జాళుక్యరాజథాని యగు కల్యాణపురమనియు, ఉత్తరపుదిక్కున మాల్యవంతమనియు జెప్పబడెను. ఇంత విశాలరాజ్యమును బరాక్రమముచే నార్ఝించి శాశ్వతస్థాయిగా గాకతీయ సామ్రాజ్యమను పేర నిలిచియుండుటకు బాటుపడిన రుద్రదేవుని పవిత్రసంకల్పము సర్వజనసంభావనీయ మనుటలో సంశయము లేదు. ఈ వీరాధివీరుని పరిపాలనముతో బట్టు దప్పిన చాళుక్య చోడ రాజ్యము దాదాపుగ నంతరించెను.

రుద్రదేవుడు లలితకళలను మిగుల బ్రేమించి పోషించెను. అనుమకొండలో నపూర్వ శిల్పరమణీయమగు నొక దేవాలయము గట్టించి ముందు వేయిస్తంభములతో గొప్ప మండపము గట్టించెను. ఇపు డామండపము చాలవఱకు గూలి పోయినది. ఆలయముమాత్రము నేటికి దర్శనీయమై మనోహరముగ నున్నది. ద్వారములందు గల లతాచిత్రములు స్తంభములపై గల పురాణకథావిగ్రహములు జీవకళ లుట్టి పడుచు గనువిందు గూర్చుచున్నవి. నాడుపెట్టిన మెఱుగు నేటికి గొంచెమేని కనుమాయక యచ్చెరువు కలిగించుచున్నది. గర్భాలయ ద్వారబంధములపైగల శిల్పములు, విగ్ర హములు ప్రత్యేకదర్శనీయములు. ఆలయాభిముఖముగ నున్న నంది చూచి యానందింపదగినది. ఇంక నాకాలమున రుద్రువిభుని త్యాగాధారమున బ్రతిష్టింపబడిన యపూర్వ శిల్పదేవాలయములు కలవుగాని వాని వర్ణనమిచట గావించుట ప్రకృతము కాదు. రెండవ ప్రతాపరుద్రుని కాలమున యవనులు గావించిన దండయాత్రలో నీ యాలయము రూపుమాపబడెను. హతశేషమగు నాలయభాగము,రుద్రదేవుని విజయకథల దెలుపుశాసనము, కోనేరు నేటికిని దర్శనయోగ్యములుగ నున్నవి. రుద్రదేవుడు నగరము చుట్టు పెద్దమట్టికోట గట్టించి యన్నివైపుల గట్ట నాధారపఱచి తటాకముల బ్రతిష్టించెను. సేనానాయకులుగూడ బెక్కుతటాకముల ద్రవ్వించి రాజ్యమంతయు సుభిక్షము గావించిరి. ఆంధ్రసామ్రాజ్యమున నా కాలమున క్షేత్రములు సస్యసంపూర్ణములై మనోహరముగా నొప్పుచుండెను.

రుద్రదేవుడు శైవమునం దభిమాన బావము గలవాడు. అట్లుండియు నా కాలమున మిగుల వ్యాప్తముగానున్న జైనమతమునెడనెట్టి విద్రోహమును గావించి యెఱుంగడు. తన యాస్థానమునందు వీరశైవ, జైన, అద్వైత, విశిష్టాద్వైత పండితులకు సమగౌరవము లొనరించెను. పలుమారు తులాభారముల దూగి సువర్ణము విద్వాంసులకు బంచియొసంగెను. అనుమకొండ సామ్రాజ్య నగరముగా నుండుటకు దగినదిగా దోచకపోవుటచే దన తండ్రికాలమునుండి కట్టింపబడుచున్న ఏకశిలానగరమునకు లక్షలకొలది ధనము వ్యయముగావించి బురుజులు, కోటలు, కందకములు, కొత్తళములు నిర్మించెను. రుద్రదేవుని యాస్థానమునందున్న కవులలో పాలకురికి సోమనాధుడు, గురు మల్లికార్ఝున పండితారాధ్యుల వారు, రామేశ్వర భట్టారకుడు లోనగు ప్రముఖులు పలువురుగలరు. రుద్రదేవుడు కవులతో నిష్టగోష్ఠులు గావించి వినోదించుటయేగాక తాను స్వయముగా గవిత్వమును చెప్పనేర్చి కర్ణాటసంస్కృతాంధ్ర బాషలలో నసమాన పాండిత్యము నార్జించి "విద్యాభూషణు" డను బిరుదము బడసెను. ఇంతియగాక రాజకీయధర్మములు, రాజవిధులు చర్చించు నీతిసారమును నొక పద్యకావ్యమును రచించి యాంధ్రభాష నలంకరించెను. ఇపు డాగ్రంథము లభింపకపోవుట సంతాపకరము. ఈయన యాస్థానమునందున్నటుల బై చెప్పిన గురుమల్లికార్జున పండితారాధ్యులవారు దండనాధుడుగ నుండి యాస్థానము నందు విద్యావినోదములలో బాల్గొనుచు శివస్తోత్ర గ్రంథముల బెక్కింటిని రచించెను. రుద్రదేవుని నడిమివయస్సున నీ పండితారాధ్యులు మరణించిరి.

పాలకురికి సోమనాధుడు మల్లికార్జున పండితారాధ్యుల వారి యనంతరము కొంతకాలమునకు రుద్రదేవుని యాస్థానమున బ్రవేశించి మృధుమధురమగు దనయాంధ్రకవిత నాధారముగ జేసికొని వీరశైవమతము మిగుల వ్యాప్తిలోనికి దెచ్చెను. మతావేశపరశుడగు నీసోమనాధుడు జైనుల బౌద్ధుల జంపించె నని స్థానికచరిత్రములందు గలదు. ఇతని గ్రంథములు పరమతదూషణము, స్వమతస్తుతి గలవి గాని నీతనియెడ నారోపించిన దోషము లాకాలపు జరిత్రము సమగ్రముగా నెఱింగిన వారికి సత్యములని తోచుటకు సంశయ ముండదు. రుద్రదేవునియొద్ద సేనా నాయకులుగ నున్న బేతిరెడ్డి, నామిరెడ్డి, రుద్రదేవ సేనాని లోనగు వీరుల చరిత్రము సమగ్రముగ దెలిసికొనవలసి యున్నది. రుద్రదేవుని సోదరుడు మహాదేవరాయలు మూడుసంవత్సరములు రాజ్యము పాలించినటుల జరిత్రములందు గలదు. రుద్రదేవుడు జీవించియుండగా శౌణదేశాధీశ్వరుడును యాదవ నరపాలకుడునగు జైత్రపాలుడు త్రిలింగదేశము మీదికి దండెత్తి వచ్చినపుడు మహాదేవరాయ లెదిరింపబోయి మడిసినటుల జరిత్రములందు గలదు. శాసనము లందు రుద్రభూపాలుని యనంతరము రాజ్యము పరాదీనము కాగా వీరవతంసుడగు రుద్రసేనాని పునరుద్ధరించినటుల గన్పట్టుచున్నది. మహాదేవరాయలు జీవించి యనంతరము మూడుసంవత్సరములు రాజ్యమును బాలించినదే సత్యమైనచొ రుద్రదేవుని యనంతరము రాజ్యము పరాధీనము గావలసిన యవసరములేదు గావున మహాదేవ రాయలు రుద్రదేవుని కంటె ముందుగానే మరణింప వలయును. ఇదియె యుక్తియుక్తమగు మార్గము.

రేచెర్లగోత్రీయులగు వెలమవీరులలో బలువురు కాకతీయులకడ సేనానాయకులుగ నుండి కాంచీనగరము భేదించి చోడరాజుల జయించితిమనియు గాంచీరాజ్యలక్ష్మిని గాకతీయుల కైవసము గావించితిమనియు వ్రాసికొనియున్నారు. ఆంధ్రదేశమునకు గాంచీరాజ్యము మిగుల దూరముగా నుండుటచే గాకతీయులు మాటిమాటికి గాంచీనగరములో బఱచికొనుటయు మఱల గొల్పోవుటయు బలుమాఱు జరిగియుండును. రుద్రదేవుని కాలమున గాంచీనగరమును రేచెర్ల నామిరెడ్డి జయించి చోడరాజు నవమానపఱచి తద్రాజ్యలక్ష్మిని రుద్రదేవుని యధీనము గావించినటుల శాసనదృష్టాంతములు గలవు. రుద్రదేవుడు తన యవసాన దశలో గణపతిదేవునకు రాజ్యము నొసంగెను. గణపతిదేవుడు మహాదేవరాయలకుమారుడు. రుద్రదేవునికాలము క్రీ.శ. 1140 మొదలుకొని 1196 వఱకై యుండునని చరిత్రగ్రంథమువలన దెలియుచున్నది. ఆంధ్రజాతీయతకు ఆంధ్రవికాసమునకు ఆంధ్రజాత్య భ్యుదయమునకు సహకారిగ నాంధ్రసామ్రాజ్యము స్థాపించిన వీరవతంసుడగు రుద్రదేవుని జీవితచరిత్రము పఠనీయము. ఈ మహనీయుని చరిత్రమెంతయో గ్రంథస్థము గావలసియున్నది చరిత్రకారు లీతని బ్రథమప్రతాపరుద్రుడని వ్యవహరించు చున్నారు. ప్రతాపరుద్రనామమె యీయనకు లేనపుడు రుద్రదేవుడని వ్యవహరింపక ప్రతాపరుద్రుడనుట యుక్తముగ లేదని మేము రుద్రదేవుడనియే వ్యవహరించితిమి.

_______


కన్నమదాసుడు.

పలనాడు రాజ్యము పాలించు నరసింగరాజు, నలగామరాజు అను రాజులయొద్ద నాయకురాలను రెడ్డియువతి మంత్రి పదవియందు బ్రవేశించి యంతకుముందు మంత్రిగానున్న రేచెర్లగోత్రుడును వెలమ వీరుడునగు శీలము బ్రహ్మనాయని వెడలనడిపించెను. బ్రహ్మనాయడు బాలమలిదేవాది రాజకుమారులను వెంటబెట్టుకొని గురుజాలకు గొంచెము దూరమునందున్న యడవిప్రదేశము తెగనఱకి మాచర్లయను నగరము కట్టించి యందుండెను. బ్రహ్మనాయకుడు పేరునకు మంత్రియైనను రాజ్యచక్రము తానే త్రిప్పుచుండెను. పలనాటి సీమలో బ్రహ్మనాయని దేవునిగా భావించుచుండిరి. ఒక పంచమకాంత చిరకాలము సంతానము లేక పరితపించి బ్రహ్మనాయకుని యనుగ్రహమువలన గొడుకు జనించెనేని ఆయన పాదములచెంతనే పడవేయుదునని మ్రొక్కుకొనెను. దైవవశమున బంచమాంగన నవమాసములు నిండినవెనుక నొక