ఆంధ్ర వీరులు/బాలచంద్రుడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4. బాలచంద్రుడు.

వీరకుమారుడు బాలచంద్రుడు భారతవీరులలో సుప్రసిద్ధుడగు అభిమన్యునితో బోల్పదగినవాడు. ఈవీర బాలుని జీవితము జెప్పుటకు ముందు బూర్వకథ కొంచెము చెప్పుటయవసరము. మన కథా కాలమునకు గొంచెముముందు గురిజాల రాజధానిగ జేసికొని అనుగురాజు పల్నాటి రాజ్యమును బరిపాలించుచుండెను. అనుగురాజునకు ముగ్గురుభార్యలు. వీరవిద్యాదేవి, భూరమాదేవి, మైలమాదేవియని వారిపేరులు. భూరమాదేవియందు కామరాజు, నరసింహరాజు, జెట్టిరాజు, పెరుమాళ్ళురాజు అను నలుగురు కుమారులు. వీరవిద్యాదేవి యందు పెదమల్లదేవుడు, పినమల్లదేవుడు, బాలమల్ల దేవుడు అను మువ్వురు తనయు లుద్భవించిరి. వీరందరి కంటె మైలమాదేవి కుమారుడగు నలగామరాజు పెద్దవాడు. అనుగురాజు తన యంత్యకాలమునందు రాజ్యమును దనకుమారులను రేచర్లగోత్రుడును వెలమవీరుడు నగు శీలము బ్రహ్మానాయని చేతబెట్టి కుమారుల నుద్ధరించి రాజ్య తంత్రములను మంత్రివై నిర్వహింపుమని చెప్పి ప్రాణములు విడిచెను. బ్రహ్మనాయడు మృతభూపులకు క్షత్రియవంశాచారానుగుణముగా నుత్తరక్రియ లాచరించి కుమారులపక్షమున రాజ్యచక్రము తానె జయప్రదముగా ద్రిప్పుచుండెను. నలగామరాజు పెద్దవాడై గురిజాలరాజ్యము తాను స్వయముగా బాలింప దొడగెను. సోదరు లతని పోషణముక్రింద నే యుండిరి. వీరవిద్యాదేవియందు జనించిన పెదమల దేనాదులు మిక్కిలి చిన్నవారు. వీరి కేమేని యాపదకలిగింతురేమో యని బ్రహ్మనాయ డీబాలురను వెంటగొని మాచర్ల రాజధానిగ జేసికొని కొంత దేశమును బాలించుచుండెను. బ్రహ్మ నాయకుడు పేరునకు మంత్రియైనను రాజ్యవ్యవహారములు స్వయముగ నిర్వహించుచు పెదమల్లదేవాదుల వేయి కనులతో గాపాడుచు వారిసుఖము తన సుఖముగ భావించుచుండెను. బ్రహ్మనాయకుని సత్పరిపాలనమునకు బ్రజలుమెచ్చి పలనాటికృష్ణుడని యతనిని బ్రశంసించుచుండిరి. గురిజాల రాజ్యము స్వతంత్రముగ నలగామరాజు తక్కినసోదరుల నందఱ జెంతనుంచుకొని పాలించుచుండెను. నాగాంబయను నొకరెడ్డి కాంత నలగామాదుల దననేర్పుచే లోగొని గురిజాలరాజ్యమునకు మంత్రిణియై రాజ్యతంత్రములు నిర్వహించుచుండెను. ఈ యమనె నాయకురాలందురు. నాయకురాలు మంత్రిణిగ జేరినది మొదలు బ్రహ్మనాయకుని ద్వేషింపసాగెను. రెండు రాజ్యములవారు ఒకరినొకరు ద్వేషించుకొనుచుండిరి. నాయకురాలు దు సంత్రము లొనర్చి మాచర్లరాజ్యము నాశనము చేసి గురిజాల రాజ్యములో గలుప నెన్నియో ప్రయత్నములు గావించుచుండెను. బ్రహ్మనాయకుడు తన మెలకువచే నా చిక్కులు తొలగించుచు కాలము గడపుచుండెను. మనమిక బ్రధానకథలోనికి వచ్చుచున్నారము. బ్రహ్మనాయనికి సంతానము లేదు. ఆయనభార్య ఐతాంబ. చిరకాలము సంతానార్థము ఎన్నియో నోములు నోచెను. ఎన్నియో ధానధర్మము లాచరించెను. అన్నసత్రములు పెట్టించెను. సంతానము కలుగదయ్యె. కడకు గజనిమ్మనోము నోచెను. మాచర్ల చెన్నకేశవుని యనుగ్రహమున గర్భవతియై నవమాసములు నిండినవెనుక నొకశుభముహూర్తమున గుమారుని గనెను. జాతకర్మలాచరించి బ్రహ్మనాయకుడు బాలచంద్రుడని యాబాలునకు నామకరణము గావించెను. బాలచంద్రుని వలె నా బాలుడు దినదినాభివృద్ధి నొందుచు దల్లితండ్రులకు గనులపండువు గూర్చుచుండెను.

నాయకురాలు ఒకదినమున గురిజాలకు బ్రహ్మనాయడువచ్చుట గనిపెట్టి కోడిపందెముల వేయించుచు ఓడినకోడి బ్రహ్మనాయనిదని, గెలిచినకోడి తనదని పరిహాసము లాడుచుండెను.. బ్రహ్మనాయ డదిచూచి పౌరుషము నాపుకొనజాలక తాను స్వయముగా గోడిపందెమున బాల్గొని పుంజును విడచెను. నాయకురాలు వేఱొక పుంజును విడచెను. వట్టిపందెములతో లాభము లేదని యెవరిపక్షము కోడి యోడిన వారు పండ్రెండేడులు పరదేశమున వసింపవలె ననియు ఒకయే డజ్ఞాతవాసము గావింపవలెనని కట్టుదిట్టముల జేసికొనిరి. గ్రహచారవశమున బ్రహ్మనాయనికోడి యోడిపోయెను. అనుకొన్న పంతముచొప్పున బ్రహ్మనాయకుడు సపరివారసహితముగా వలసబోయెను. నానావస్థలకు లోనై రాజకుమారులతో వలసయందు బడవలసిన కష్టములన్నియు బడి బ్రహ్మనాయడు కడకు గడువుతుదను రాజ్యమునకు రానెంచి మాచర్లరాజ్యము తమకొప్పగింపుమని రాజకుమారులపక్షమున గురిజాలకు వర్తమానము పంపెను. నాయకురా లా దూతను జంపించెను. భాగమీయ వీలుగాదనెను. ఉభయపక్షములకు పల్నాటిసీమలోని నాగులేటి తీరమునందు కారెముపూడిచెంత భయంకర యుద్ధము జరుగవలసివచ్చెను. సమకాలికులగు రాజులందరు రెండుపక్షములలో దమ యన కూలములబట్టిచేరిరి. గురిజాల పక్షమున సర్వభారములు నాయకురాలు వహించి రాజులుగనున్న నలగామరాజును, నరసింహ రాజును, కీలుబొమ్మలుగ జేసి సంగ్రామ ప్రయత్నములు తానె స్వతంత్రించి చేయుచుండెను. నియతకాలమున నుభయ దళములు పరస్పర జిగీషతో యుద్ధము చేయుచుండెను.

బ్రహ్మనాయకుడు రాజకుటుంబమును తన కుటుంబమును వీర మేడపిలోనుంచి బాలచంద్రుని గొంత సైన్యమును సంరక్షణమున కుంచి సంగ్రామరంగ మలంకరించెను. బాలచంద్రుడు పదునాఱుసంవత్సరముల బాలుడు. మిగులగారాబముగా బెరిగినవాడు. ఇత డితరవ్యవహారములలో జోక్యము పెట్టుకొనక తన సవయస్కులగు అనపోతు, కమ్మర కాచెన్న, మంగల మల్లు, చాకల చందు, కుమ్మర పట్టి, వెలమ దోర్నీడు, కంసాల చందు, అను బాలురతో గలిసి క్రీడా విహారములతో గాలము గడపుచుండెను. లేక లేక పుట్టిన తనయుడుగాన దలిదండ్రు లీబాలకుని స్వేచ్ఛకు భంగము చేయరైరి. తండ్రి యుద్ధమున కేగినసంగతి వినిన బాలచంద్రు డేమి సాహసము చేయునో యని తల్లి యతని స్వతంత్రవిహారమున కెట్టియాటంకము కలుగజేయకుండెను. ఒకనాడు బాలుడు తన తల్లియొద్దకువచ్చి బొంగరములాడ దనకు గోరికగలదనియు బంగారు బొంగరములు చేయించి యిమ్మనియు బ్రార్థించెను. ఆయమ్మ తనకుమారుని బుజ్జగించి మన కివి చాలనిదినములు. మీతండ్రి దూరదేశము పోయుయున్నాడు. మనము వలసలోనున్నారము. ఆటలో బ్రమాదమున బొంగరము లెవరికి దగిలినను దగవులు వచ్చును. దానివలన ననేకకష్టములు ప్రాప్తించును. బొంగరములయాట మానుకొమ్మని యెన్ని తెఱంగులనో చెప్పెను. బాలచంద్రుడు తల్లిమాట వినక నాకు బంగారు బొంగరములె కావలయును. వానితో నేనాడుకొనితీరవలయునని మూర్ఖపు బట్టు పట్టెను. తల్లివిధిలేక సొన్నారుల బిలిపించి వారికి మేలిమి బంగారము నొసంగి బొంగరముల జేయించి కుమారున కొసంగెను. తన సవయస్కులు మిత్రులునగు బాలురనందరను వెంటగొని పొట్టేళ్ళపై నెక్కి, పందెములకు బికిలిపిట్టలు, కౌజులు, తగళ్ళను బట్టించుకొని బాలచంద్రుడు క్రీడారంగముగ నేర్పరచుకొనిన సోలురావులవద్దకు జేరిరి. అంతకు ముందె యాప్రదేశమునిండ రత్నకంబళములు, చాపలు పఱచిరి. బాలురంద ఱచట గూర్చుండి యాటలాడ నారంభించిరి. మొదట గొందరు బాలురు కసరత్తులు, పికిలిపిట్ట పందెములు కౌజుల పందెములు, పొట్టేళ్ళ పందెములు జరిపిరి. బంగారు బొంగరములతో బాలచంద్రు డాటలాడునని గ్రామములోని వారందరు చూచుటకు స్త్రీబాల సహితముగా వచ్చిరి. బాలచంద్రుడు బొంగరముల యాటలో మిగుల నేర్పరి. బరువైన యాబంగారు బొంగరమును బాలచంద్రుడు తీసికొని త్రాడుచుట్టి వేయబోవుసరికి బంట్రోతులు గుంపును వెనుకకు నెట్టివేసిరి. మధ్యనున్న విశాలస్థలమున బాలచంద్రుదు నిలిచి బొంగరమును లాగి విసరెను. బొంగరము రుంయి రుంయిమని మ్రోగుచు గిరగిర తిరుగుచుండ బాలచంద్రుడు దానిని తిన్నగ జేతిమీది కెక్కించి కొంతసేపాడించి తరువాత బాణము చివర నిల్పి కొంతసేపాడించెను. తిరిగి నే మీద నాడింప వలయునని బాలుడు బొంగరమును విసరి క్రిందికి వైచెను. అటనున్న యొక యెదురురాతికి గొట్టుకొని, బొంగరము బెడసి ఆవేడుక చూడవచ్చిన యొక కోమటిచిన్నదాని కాలికి దగిలెను. మొనగ్రుచ్చికొనుటచే గాలినుండి రక్తము చిమ్మినక్రోవితో జిమ్మి నటుల గారెను. ఆమె పేరు అన్నమ్మ. అన్నమ్మ మూర్ఛపోయెను. చూడవచ్చిన స్త్రీలంద రాయమకు శీతలోపచారములు గావించిరి. బాలచంద్రుడు తన ప్రమాదమునకు జిం తించి చేతులు కట్టుకొని యాకాంతకు జెంత నిలిచి విచారపడుచు అన్యాయముగ బరకాంతకు శ్రమగూర్చితినే యని లోలోన గృశించుచుండెను. కొంతసేపటికి అన్నమ్మకు దెలివి వచ్చెను. బాలచంద్రునకు బ్రాణములు లేచివచ్చెను.

అన్నమ్మ కనులు తెఱచువరకు బాలచంద్రు డెదుట గానవచ్చెను. బాధచే మైమఱచి అన్నమ్మ నీకండకావరము కాలిపోను, బొంగరముతో గొట్టుదువా? రాజుసొమ్ము తేరగా దిని యొడలు బలిసియున్నావు. నీచూచుకన్నులలో సూదులుగ్రుచ్చ, నీకాలిలో గత్తులుదిగ, నీతండ్రి, రాజు యుద్ధములో నుండ బోతుసింగమువలె బోతరించి యింట నుండునది ఆడువారిమీద నాగడము చేయుటకా, యని పెళపెళ దిట్టిపోసెను. బాలచంద్రుడు తిట్లన్నిటికి సహించి దోసలిమోడ్చి, తల్లీ! క్షమింపుము. ప్రమాదమునకు మన్నించుట విధి యని బ్రతిమాలి ఐదువందల మాడల నామెకిచ్చి తప్పు క్షమింప బ్రార్థించి తన తలపాగ చించి, యామె కాలికిం గట్టుకట్టించి మాతండ్రు లెచటనున్నారో చెప్పుమనెను. అన్నమ్మ బాలునిపై కోపమునాపుకొని "కోపముచే నేమంటినో నేనెఱుగను. మీతండ్రిగారి సంగతి నేనెఱుగననెను." బాలచంద్రుడు వెంటనే యింటికిబోయి తల్లియగు నైతమ్మను సమీపించి నాతండ్రి యెచట కేగెనో తెలుపుమనెను. ఏదో ప్రమాదముజరిగినది. బాలుడు సంగరమునకురుకు నటులున్నాడు. ఇంకనేమి చేయవలయునోయని యైతమ్మవిచారపడి, బాలుడా! మీతండ్రి యెటకేగినది నాకు దెలియదనెను. బాలుడు కోపించి, నేనెఱుంగ ననుకొంటివా? నాతండ్రియు బెదమల్ల దేవాదులు కారెమపూడివద్ద యుద్ధముచేయుటకు బోయిరి. తండ్రికి రాజునకు దేశమునకు గానికొడుకు కొడుకా? నే నిక నిట నుండజనదు. యుద్ధమున కేగెదనని పయనమునకు సిద్ధపడెను. ఐతమ్మ యెన్నివిధములనో నయమున భయమునం జెప్పెను. లాభము లేకపోయెను. నాయనమ్మ మాట వినునేమో యని తల్లి తన యత్తగారగు శీలమ్మను బిలిచెను. ఆమె మాటలు బాలచంద్రుడు నిరాకరించెను. జ్యోతిశ్శాస్త్రపండితుల బిలువనంపి బాలుని జాతకము జూప ఇక పదునైదు దినములలో నితనికి గొప్ప గండగలదని సంకోచించుచు జెప్పిరి. యుద్ధరంగము భయంకరముగా నుండునని చెప్పి శీలమ్మయు ఐతమ్మయు బాలుని భయపెట్టిరి. చావునకు దెగించిన బాలవీరునకు సంగ్రామరంగముకంటె సౌఖ్యకరమైన ప్రదేశములేదని బదులుచెప్పెను. ఐతమ్మ కన్నీరు నించుచు నాకు గడుపుశోకము పెట్టుదువా? యని వాయెత్తియేడ్చెను. బాలచంద్రుని హృదయము మఱింత మొద్దుబాఱెను. తాను వీర మరణమునకు సిద్ధముగా నున్నాడననిచెప్పెను. ఐతమ్మయు శీలమ్మయు యోజించి బాలుని ప్రయత్నము ఆపుట యసాధ్యము. ఐనను చేయగల యత్నములు చేయవలయునని రూపవతియగు భార్యను జూచియేని కామపరవశమున గదనము మానునేమో యనుకొని నీభార్యయగు మంచాలవద్ద సెల వొంది సంగరరంగ మలంకరింపుమని బాలచంద్రునకు జెప్పిరి. బాలచంద్రుడు సంతసించి కామవశమున గదనప్రయత్నమే మానుదునేమోయని వెంట బ్రాహ్మణ బాలుడగు ననపోతు నుంచుకొని యత్తవారింటికి బయలుదేరెను. వీరమేడపిలోనె మఱియొక వీధి బాలునియత్తవారిల్లు. పెండ్లి జరిగి యెన్నియో దినములు కాలేదు. నాడు పెండ్లిపీటలమీద సిగ్గుతో నేమి చూచెనోగాని బాలచంద్రు నాతనిభార్యయగు మంచాల తేరి పాఱజూచి యెఱుంగదు.

మంచాల అర్ఘ్యపాద్యాదులొసంగి యుచితవిధిని దన భర్తను, అనపోతుని బూజించెను. దంపతు లొకరినొకరు ప్రేమ పూర్వకములగు చూపులతో జూచుకొనిరి. అనపోతు తానీ సమయమున నచటనుంటకియ్యకొనక, 'మిత్రమా! బాలచంద్రా! ఏడుగడియలలో రావలయును., నేను ద్వారముకడ వేచియుందు'నని వెడలిపోయెను. బాలచంద్రుడు తాను నగరమున కేగుచుంటినని మంచాలకు జెప్పెను. ఆమె భర్త నాదరించి 'నాకు వీరపత్నియను పతివ్రతానామము సమకూర్చితివి. ఇంత కంటె నాకు గావలసినది ఏమియున్నది. ఇదుగో ఖడ్గము దీనితోవిరోధుల సంహరించి జయము సాధింపుము. బ్రాహ్మణులు ధర్మపరిపాలకులు. వారిని గాపాడుట రాజధర్మముగాన 'అనపోతును సంగరమునకు గొనిపోకుము. ఒక వేళ నాతడు సంగరమున మరణించిన బ్రహ్మహత్యాపాపము వచ్చునని వా కొనెను. బాలచంద్రుడు తన భార్యవద్దను అత్తయగు రేఖాంబవద్దను సెలవుగెకొని యింటికివచ్చెను! తలి కుమా రుని గౌగిలించుకొని 'తండ్రీ యుద్ధప్రయత్నము మానవా?' యని బ్రతిమాలెను. బాలచంద్రు డెంతకు వినడయ్యెను. కడకు ఐతాంబ ధైర్యము తెచ్చుకొని 'నేను మాత్రము వీరకాంతను కానా? నాభర్త వీరపత్ని బిరుదము, నా తనయుడు వీరమాతృబిరుదము నాకు బ్రసాదింపుచుండ జేజేత బోగొట్టనగునా' యని బాలచంద్రునకు బెరుగుతో నన్నము కలిపిపెట్టెను. బాలచంద్రుడు భోజనానంతరమున వీరవేషము దాల్చి తల్లికి నాయనమ్మకు నమస్కరించి వారి దీవనలనంది కదనరంగమునకు బయనమయ్యెను. పూర్వోక్తమిత్రులందఱు బాలచంద్రునితో సంగరమునకు బయలుదేరిరి. బాలుడు అనపోతును వెనుకకు బంపదలంచి కత్తియును డాలును ఉంగరమును మంచాలవద్ద మఱచివచ్చితిని. పరిచితుడవు నీవెపోయి దెమ్మనెను. అనపోతు పోకతప్పినదికాదు. అతని బోవనిచ్చి బాలుడు ఒకతాటియాకుమీద నేదియోవ్రాసి రావిచెట్టు కొమ్మకుగట్టి త్రిపురాంతకము, ముటుకూరు, గరికపాడు, మేళ్ళవాగుగ్రామములు దాటి బాలుడు పరిజనముతో వచ్చుచుండ మధ్యగ్రామములవా రీ వీరపుత్రుని గౌరవించిరి. తరువాత కనుమవద్దకు వచ్చువఱకు నాయకురాలు త్రోవగాచియుండెను. బాలుడు వేఱొకత్రోవను బయలు దేఱి నల్లగొండ నత్తమువకు మిత్రులతో నెక్కెను. గుట్టమీదనుండి నలగామ రాజుబలమును సేనానాయకులను శిబిరములను జూచెను. మంత్రిణియగు నాయకురాలిని సర్వసేనాధిపతియగు నరసింగ రాజును బాలుడు గుర్తించెను. కొదమసింగమువలె గుట్టపై నుండి విరోధిసేనమీదికి బాలు డుఱకబోవ మిత్రులు వారించిరి.

బాలచంద్రుడు గుట్టదిగి పెదమలిదేవుని శిబిరమునకు జేరబోవ గండుకన్నమనీడు వారించెను. త్రోసికొని రాజును సమీపించి, రాజా! సంధికి రాయబారముల కిది యదనుగాదు వనవాసములచే మీహృదయములు నీరసమైయున్నవి. దేహము శుష్కించినది. పరాభవ దైన్యముచే దలవ్రాలినది. ఇంక నేమని రాయబారములు చేయుచున్నారు, విరోధులను రణరంగమున బొరిగొనుటో మరణించుటయో మనవిధి. ఇదుగో! నేను రణరంగమున కుఱుకుచున్నాను. రాదలచినవారు రండు. లెండని బాలచంద్రుడు వైరిశిబిరముల కభిముఖముగా బోవ సమకట్టెను. కొమ్మరాజను నొక వీరుడు బాలునాపి వీర కుమారా! తొందరపడకుము. నా తనయుని నరసింహరా జక్రమముగా రాయబారమునకు బోవ జంపినాడు. నీవు వానిని జంపి నాకు శాంతిగూర్చెదవని నమ్మినాడను. కోపముతో గార్యముగాదు. కొలదిసేపులో సంగ్రామము కట్టాయితము కాగలదు. ఉపాయము లేనిది వైరిచిక్కడు. అని చెప్పుచుండు నంతలో రెండుపక్షముల వారికి సంధి కుదిరినది. యుద్ధప్రయత్నములింక నవసరములేదని పెదమల్లదేవుడు తన సేనామధ్యమున నిలిచి చెప్పెను. ఇంతలో నొకయువతి బాలచంద్రునివద్దకు వచ్చి అయ్యా! నేను మాడచి యనుదానను, మేడపిలో అంతిపురి కాపాడుదానను. నీవు రావి చెట్టునకు గట్టిన చీటి చదివి యుద్ధమునకు బాలుడు రావద్దనినాడు. నేను బ్రతికి లాభమేమని అనపోతు మెడగోసికొని మరణించుచు నీకిమ్మని వీరకంకణము జందెము ఇచ్చినాడు. అనపోతుభార్య సహగమనము చేసెనని చెప్పి కంకణము జందెము నొసంగెను. బాలచంద్రున కొడలెఱుగనంతటి యావేశమువచ్చెను. వీరకంకణము చేతికి ధరించుకొని జందెము మెడలోవేసికొనెను. అనపోతూ! మిగిలిపోకుము. నిన్ను స్వర్గమునకు జేరులోగ గలిసికొందునని బాలుడు పలికి సైనికుల నందఱను సంగరమునకు బురిగొల్పెను. నేను బాలుడనని మీరుసంకోచింపకుడు. ఒకప్పుడు నేను కుమారస్వామిని, ఇంకొకప్పుడు నేను అభిమన్యుడను. వేఱొకప్పుడు నేను సిరియాళుడను. దేహములు నశించుచున్నవిగాని ఆత్మ నశించుటలేదు. వీరునకు సంగరమరణమును బోలిన దింకొకటి లేదు. యుద్ధరంగమునకురండు. ఆలసింపకుడని బాలుడు పలికి యుద్ధమునకు త్రోవదీసెను. భోజనము చేయుచున్న వీరులందఱు విస్తళ్లు నాగులేటిలోవైచి ముందునకు దుమికిరి. ఈసంబరముజూచి యెదుట పక్షమువారు సిద్ధపడిరి. భగవంతునకుగూడ సంగరమిష్టము వలె నున్నది. చెన్న కేశవుని యనుగ్రహమెటులున్న నటులె జరుగునని బ్రహ్మనాయకుడు బాలచంద్రునకు ముందు, దక్కిన వారికి దరువాత శంఖముతో దీర్థమునొసంగి వీరగంథము మేనబూసి వీరతాంబూలము లొసంగి యుద్ధరంగమునకు సాగనంపెను.

రెండుపక్షములవారు భయంకరసంగరమునకు దారసిల్లిరి. రక్తము ప్రవహించెను. అనేకులు వీరులు వీరమరణ మొందిరి. ఒకప్రక్క నాయకురాలు, వేరొకప్రక్క నరసింగ రాజు బాలచంద్రుని బలమును జుట్టుముట్టిరి. కమ్మర కాచెన్న, మంగల మల్లు, చాకల చందు, కుమ్మర పట్టి, వెలమ దోర్నీడు, కంసాల చందులను బిలిచి వారివారి స్వాధీనమున గొంతసైన్యముంచి విరోధిసైన్యమును ఆవరించి రూపు మాపుట కన్నిదిక్కులకు బంపించెను. బాలచంద్రుడు స్వయముగా గొంత బలముతో నరసింగరాజు నెదిరించెను. నలగామరాజు మంచెపై నెక్కి తన బలము చెందు వినాశనమునకు బరితపించుచు, బ్రోత్సాహవాక్యములు పలుకుచుండెను. మలిదేవాదులు, బ్రహ్మనాయకాదులు బాలచంద్రుని యుద్ధ కౌశలమును వేయినోళ్ళ బ్రశంస చేయుచుండిరి. నరసింగరాజు బాలచంద్రుని ధాటికాగలేక వేఱొకత్రోవకేగి హతశేషమగు సైన్యమును సంగరమునకు బురికొల్పుచుండెను. తన ముందటనున్న మత్తగజముపై నెక్కినవీరుని నరసింహరాజని తలంచి బాలచంద్రుడు కుప్పించి ముందునకు దుమికి యేనుగుమీదివానిని గ్రిందికిలాగి వానితల జెండాడి తన బల్లెమునకు గ్రుచ్చుకొని తీసికొనిపోయి బ్రహ్మ నాయడు మలిదేవాదులముందు బెట్టి నాధర్మము నిర్వహించితినని చెప్పెను. కొమ్మరా జాతలను బరిశీలించి 'యిది నరసింహరాజు తలకాదు. నరసింహరాజును జంపవలసిన భారము బాలునిపైననే గల' దనిచెప్పెను. వెంటనే మిత్రులను పరిజనులను వెంటగొని లేడిపైకిదుముకు సింగపు గొదమవలె విరోధులమధ్య దుమికెను. సేదదీర్చుకొని నరసింహరాజు బాలచంద్రు నెదిరించెను. కర్ణార్జునులవలె నీ వీరులిద్దరు చాలసేపు పోరి, నరసింహరా జలసిపోయెను. బాలుడు నరసింహరాజెక్కిన యేనుగుతుండమునొక చంద్రవంక బాణముతో నఱకెను. ఏనుగు ముందునకు మొగ్గెను. బాలుడు ఏనుగు కుంభస్థలము మీదినుండి పైకెక్కి నరసింహరాజును క్రింది కీడ్చుకొనివచ్చి కత్తితో గుత్తుక గోసి బల్లెముచివరి బెట్టుకొని వెంట తమ్ములు జయవాక్యములు పలుకుచుండ బెదమలిదేవుని కొలువుకూటమున కా తల జేర్చెను. వీరు లందఱు బాలచంద్రుని పరాక్రమమునకు హర్షించిరి. తన యన్న చావునకు బెదమలిదేవాదులు వగచిరి. నేను చేతి మీదుగ బెంచిన నరసింహరాజున కెంతటి దుర్గతి. కుమారునివలన గలిగెనని బ్రహ్మనాయడు పలవించెను. తరువాత విచారము కోపముగా మాఱి తనయునిజూచి, బాలుడా! నిన్నీ సంగరమునకు బిలిచిన దెవరు? పిన్నవాడవని యుపేక్షింప బిడుగుతునుక వైతివే! యని బ్రహ్మనాయడు నొవ్వ నాడెను. బాలు డామాటకు గోపించి, 'తండ్రీ! నాడు పుత్రదు:ఖముతో నున్న కొమ్మరాజు నోదార్చి నన్నాయన చేతిలో బెట్టి యలరాజును జంపిన నరసింగరాజును బాలుడు చంపగలడంటివి. నాధర్మము నేను నెఱవేర్చితిననెను. బ్రహ్మనాయడు బాలచంద్రునిజూచి ఒక్కవీరుని జంపినంతనే శూరుడవైతివా? అరులకు వెన్నుజూపి పాఱివచ్చితివి గదాయని యెత్తిపొడిచెను. బాలచంద్రునియొడలు మండిపోయెను. విరోధిసైన్యమును జక్కాడి రాజుతల తెచ్చినందులకు వెన్నుజూపి వచ్చితినని కన్నతండ్రియే నొవ్వనాడినాడు. ఇక గదనమునుండి వెనుకకు బ్రాణములతోరాను. ఇదియె నాప్రతిజ్ఞయని బాలుడు నవయస్కులగు మిత్రులతో గదనరంగ మలంకరించెను.

'చిన్నవాడు గాడురాచిచ్చులపిడు'గని బాలునివిరోధులందఱు చుట్టుముట్టి వివిధాస్త్రములచే నొప్పించిరి. మొక్కబోని పరాక్రమమున బాలచంద్రుడు ముందునకు నడచుచుండెను. అభిమన్యుడు పద్మవ్యూహము భేధించినటుల బాలుడు విరీధిబలముల జించి చెండాడెను. కొంతసేపటికి విరోధులు చెలరేగి కమ్మర కాచెన్నను గడతేర్చిరి. మంగల మల్లును మది యించిరి. చాకలచందును జంపిరి. కుమ్మరపట్టిని గూల్చిరి. వెలమదోర్నిని చత్రవధ చేసిరి. బాలచంద్రుడు తన సైన్యమునంతయు నొకమాఱు పాఱజూచెను. మిత్రులందఱు మరణించిరి. అనపోతు అందఱికంటె ముందె మరణించెను. బ్రతికి లాభము లేదని బాలుడు తెగబడి చిక్కినవైరిని జిక్కినటుల నఱకు చుండెను. విరోధులందఱు బాలుని మేనినిండ బాణములను నించిరి. బాలునకు బ్రతుకుమీద నాశతీరెను. బాలచంద్రుడు తన మిత్రులందఱకు గన్నీటితో దర్పణాదులొసంగి అలుగుల నేలబ్రాతి తనమిత్రుల నెత్తుటిలో దడిపిన యక్షతలతో నాయలుగులకు బూజజేసి కనులు మూసికొని వానిపై నొరిగి మరణించెను. బాలునిమరణమున కుభయసైన్యములందు హాహాకారములు పెచ్చరిల్లెను.

బాలుని మరణవార్త విని మంచాల చిచ్చురికెను. బాలుని భౌతిక దేహము నీవిధముగా మహారణమధ్యమున బడి నశించెను. అతనియస్తికల గంగధారలోగలిపిరి. ఈకథ జరిగి యిప్పటికి దాదాపు ఎనిమిదివందల సవత్సరములు జరిగినను, మనము బాలచంద్రుని మఱచిపోవలేదు. కవులా-వీరుని జీవితమును వీరగేయములుగా వ్రాసిరి. శిల్పులా-వీరమూర్తి యాకృతి శిలలపై జెక్కిరి. వీరులా-బాలుని యాదర్శముగా గైకొనిరి. నేటికి బాలదాసరుల పూజయని బాలచంద్రుని యొక్కయు, నతని సోదరులు మిత్రులగు నితర బాలురయొక్కయు పూజ మనము చేయుచున్నారము. ఆంధ్ర బాలకవర్గమునకు త్యాగధనుడగు బాలచంద్రుని జీవితము ఆదర్శప్రాయమగుటకు భగవంతు డనుగ్రహించుగాత.

_______
Andhraveerulupar025903mbp.pdf