ఆంధ్ర వీరులు/ప్రతాపరుద్ర చక్రవర్తి

వికీసోర్స్ నుండి

విశ్వసింపవచ్చును. స్వామిభక్తిపరాయణతయందును. శూరత్వమునందును నీవీరవతంసుడు ఆంధ్ర వీరసందోహమునందవతంసప్రాయుడై యున్నాడు. ఆంధ్రుల పునరభ్యుదయమున కీవీరుని సంకల్పము దోహద మొసంగుగాక.

______

ప్రతాపరుద్ర చక్రవర్తి.

మన కథానాయకుడగు ప్రతాపరుద్రచక్రవర్తి క్షత్రియ వంశజుడు. వీరాధివీరుడగు నీరాజసింహుని చరిత్రము తెలిసికొనుటకు ముం దీయన పూర్వులను గుఱించి తెలిసికొనుట యావశ్యకము. తొలుత కళ్యాణపురరాజులగు పశ్చిమచాళుక్యులకడ దండనాయకుడుగ నున్న ప్రోలరాజను వీరుడు తద్రాజ్యపతనానంతరము హనుమకొండ రాజధానిగా జేసికొని స్వతంత్రపతాకము స్థాపించి యాంధ్రదేశములో జాలభాగము తన పరిపాలనమున జేర్చుకొనెను. ఈనరపాలుని పుత్రుడగు రుద్రదేవుడు పితృసంపాదితమగు రాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ఈ నరపాలుడు శిల్పములకు లలితకళయగు కవితకు గూడ నభివృద్ధి మార్గముల నన్వేషించెను. ఈయన యనంతరము ఇతని తమ్ము డగు మహ దేవరాయల పుత్రుడు గణపతి దేవుడు రాజ్యమునకు వచ్చెను. ఈనృపుని కాలమునాటికి ఓరుగల్లుకోట పూర్తి యయ్యెను. తన సామ్రాజ్యము నీత డోరుగల్లులో స్థాపించి చాళుక్యులను చోళులను జయించి యభివృద్ధిలోనికి దెచ్చెను. పుత్రసంతానము లేకపొవుటచే నీయనపుత్రి రుద్రమదేవి రాజ్యమునకు వచ్చి చిరకాలము మహత్తరముగ నాంధ్ర సామ్రాజ్యమును బాలించెను. పితృ దత్తమగు రాజ్యము నీయమ విస్తరింపజేసి తిరుగబడిన రాజుల బిలుకుమార్చి యాంధ్రజాతియం దంతర్హితమైన పరాక్రమము నీయమ యొక్కమాఱు బ్రజ్వలింపజేసెను. ఈయమకు బురుషసంతతి లేదు. ముమ్మడమ్మ, రుయ్యమ్మయను నిరువురు కుమార్తెలు గలరు. ముమ్మడమ్మను చాళుక్యాన్వయుడగు వీరభద్రరాజు, రుయ్యమ్మను ఇందులూరి అన్నభూపతియు బెండ్లాడిరి. అల్లుండ్లిరువురు ప్రత్యేక మండలాధిపతులైనను రుద్రమదేవికి గుడి భుజముల వలె నుండి సంగరములం దాయమకు సాయపడుచు విజయలక్ష్మిని గనుసన్నలలో నుంచిరి. రుద్రమదేవి తనపుత్రికలకు బుత్రసంతానము గలిగెనేని వారికి రాజ్యము స్వాధీనము జేసి కృతార్థురాలు గావలెనని సంకల్పించెను. పెక్కువ్రతములు గావించెను. ఎన్నియో యాలయములు గట్టించెను. కానవచ్చిన దేవరలకెల్ల దాను మ్రొక్కి కుమార్తెలచే మ్రొక్కించెను. అయినవోలు మైలారుదేవరకు, కొలనుపాక సోమనాథునకు, వేములవాడ రాజేశ్వరునకు, మొగిలిచర్ల ఏకవీరాదేవికి మహోత్సవముల జేయించెను. దైవానుగ్రహమున ముమ్మడమ్మ గర్భ వతి యయ్యెను. ప్రజ లీశుభవార్తవిని యుత్సవము లొనర్చిరి. శాలివాహనశకము...... ఆనందనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి గురువారము బ్రాహ్మీముహుర్తమందు సూర్యుడు, అంగారకుండు, బుధుడు, బృహస్పతి, యుచ్చస్థానమునను, శని స్వక్షేత్రమున నున్న శుభసమయమున నొకబాలు డుద యించెను.

ఓరుగల్లునగరమున నానా డొనరింపబడిన వేడుకలకు మితము లేదు. పురమంతయు నలకరింపడెను. ఆలయము లన్నింటియందు మహోత్సవములు జగన్మోహనముగా జరుపబడెను. మంగళవాద్యము లెడతెగక మ్రోయింపబడెను. రుద్రమదేవి నామకరణోత్సవము మహావైభవముగ నెర వేర్ప జేసి ప్రధానమంత్రియగు శివదేవయ్య యనుమతిచే నాబాలునకు శ్రీమన్మహారాజ వీరప్రతాప రుద్రదేవ చక్రవర్తియని నామకరణ మొనరించెను. శుక్లపక్షచంద్రునివలె నాబాలు డభివృద్ధి నొంది బాల్యమునందె ధనుర్విద్యయు, వ్యాయామ విద్యయు, సంస్కృతాంధ్రములు, రాజనీతియు గురువులకడ నభ్యసించి ముత్తవయగు రుద్రమదేవితో రాజసభామందిరమున ఆసీనుడై పరిపాలనా విధానమును గూడ బసితనముననె నేర్చు కొనెను.

రుద్రమదేవి తనవార్ధకమున మనుమడగు ప్రతాపరుద్ర దేవునకు బట్టాభిషేకము జేయసంకల్పించెను. ఈశుభసంకల్పము వినినంతన ప్రతాపరుద్రుడు పట్టాభిషేకానంతరము విశ్రాంతి


ప్రతాపరుద్ర చక్రవర్తి చాలదని తనమంత్రిని సైన్యమును వెంటగొని యొకమాఱు విజయయాత్రకు వెడలి పలువురు స్వతంత్రరాజులను సామంతులుగా గొని కొన్నిచోటుల జయస్తంభముల స్థాపించి నియమిత కాలమునకు రాజధాని చేరెను. ఓరుగల్లు నగరము మిక్కిలి రమణీయముగా నలంకరింప బడెను. స్వయంభూదేవాలయము నందును, జెన్న కేశవాలయము నందును మహోత్సవములు జరుప బడెను. జరుపబడిన వేడుకలకు మితములేదు. మంగళవాద్యములచే భూనభోంతరములు మాఱుమ్రోగెను. వివిధ ప్రాంతములతో బుణ్యనదులనుండి తెచ్చిన శుద్ధోదకముచే బ్రతాపరుద్రచక్రవర్తిని బట్టాభిషిక్తుని గావించిరి. ప్రజల యుత్సాహము మేరమీఱెను. రుద్రమదేవి యాశుభావపరము బురస్కరించుకొని యుద్యోగులందఱకు సత్కృతు లొనరించెను.

ప్రతాపరుద్రుడు రాజ్యమునకు వచ్చిన క్రొత్తలో గొంద ఱాతని నిరాకరించి కప్పములొసంగుట మానిరి. కొందఱు స్వాతంత్ర్య సంపాదమునకు గుట్రలు చేయసాగిరి. మనుమగండగోపాలుడు, అంబయదేవమహారాజు, త్రిపురారి దేవుడులోనగు నెల్లూరు మండలపాలకులు తిరుగబడిరి. ప్రతాపరుద్రుడు తనసైన్యమునంపి మనుమగండ గోపాలుని దెగటార్పించి రాజ్యమున శాంతి స్థాపింప జేసెను. అంబయ దేవ త్రిపురారి దేవాదులు తమంతతాము లోబడిరి. ప్రతాపరుద్రుడు స్వాతంత్ర్యము ప్రకటించుటకు యత్నించుచున్న పాండ్య చోళ కేరళ దేశాధిపతుల జయింపనెంచి కోటలు కొత్తళములు బాగుచేయించి సైన్యమును మిగుల వృద్ధికిదెచ్చెను. ఆ తరుణమున దేవగిరిదుర్గమున యాదవవంశజుడగు రామదేవుడు పాలించుచుండెను. ఇతడు భోగలాలసుడై కాలము గడుపుచు రాజ్యవ్యవహారములలో నంతగ జోక్యము పుచ్చుకొనకుండెను. ప్రతాపరుద్రుని త్రిలింగసామ్రాజ్యము మహోన్నత దశలోనుండుటచే నుత్తరహిందూస్థానమును బాలించు మహమ్మదీయ నృపాలురకు దేవగిరిని లోగొని యాంధ్రసామ్రాజ్యమును హరింపవలెనను కోర్కి జనించెను.

డిల్లీ సామ్రాజ్యమును జలాయుద్దీను ఫిరోజు పాలించు కాలమున అల్లాఉద్దీను అపరిమితసైన్య సహాయముతో నొకమాఱు దండయాత్ర కరుదెంచి దేవగిరిని ముట్టడించి జయించి రామదేవునివలన గొంతధనము, అమూల్యరత్నములు, బంగారము గైకొని సామంతునిజేసికొని వెనుకకు మఱలెను. ఆంధ్ర సామ్రాజ్యముగొప్పతన మపు డతడు వినెనుగాని సైన్యమలసి యుండుటచే ముందునకేగ మానెను.

అల్లాఉద్దీను తన మేనమామయగు జలాలుద్దీను ఫిరోజును జంపి తాను క్రీ.శ. 1296 లో బ్రభువయ్యెను. ఇతడు ఓరుగల్లు రాజ్యమును జయింపనెంచి సైనికబలమును ఆయుధసామగ్రిని మిగుల నభివృద్ధిపరచి క్రీ. 1303 లో మల్లిక్ నాయబ్ కాపూరనువాని సేనాధిపతిగ నొనర్చిపంపెను. మల్లిక్ నాయబ్ కాపూరు పదివేల గుఱ్ఱపుదళము నలుబదివేల సైనికులతో బయలుదేరి దేవగిరిచేరి యంతకుమున్ను యంకితుడైన రామదేవునియొద్ద నాతిధ్యముల గైకొని ఆంధ్రనగరము మీదికి బయలువెడలెను. ఈవార్త ప్రతాపరుద్రదేవుడు వినినంతనె యవనసైన్యమునకు బరాభవము సులభముగ జేయవచ్చునని పాండ్య చోళ కేరళదేశములపైకి బోవ సర్వసిద్ధముగా నున్న యాత్మీయసైన్యమునకు దన తమ్ముడగు అన్నమదేవుని యధ్యక్షుని గావించి యెదిరింపబంపెను. పురవరి మహాదేవనాయకుడు, సాహిణిమారుడు, మేచయనాయకుడు బెండపూడి అన్నయమంత్రి, ముప్పడినాయకుడు లోనగు మహావీరులకు గొంతబలము నొసంగి తాను గోదావరీతీరమువఱకు యవనసైన్యము నెదిరింపనేగెను. ఆంధ్రసైనికులు మహమ్మదీయ సైన్యమును గోదావరి దాటకుండ బెక్కువిధముల నరికట్టిరి. పడవలలో వచ్చుసైనికులను సుడిగుండములలో గూలద్రోసిరి. పడవలు బగులగొట్టిరి. ప్రాణములకు దెగించి హతశేషులగు యవన సైనికులు గోదావరి దాటి యీవలకు వచ్చినంతనె ఆంధ్రమహమ్మదీయ సైన్యములకు మహాసమరము జరిగెను. ఆంధ్రవీరులు మొక్కవోని పరాక్రమమున ముందున కుఱికి యవన సైన్యము నంతయు జిందరవందర గావించి రణరంగము నంతయు బ్రతిపక్ష రక్తప్రవాహములతో నించిరి. ప్రాణముల మీది యాసతో జెట్టునకొకరు గుట్టకొక----------విడిచి మైమఱచి తురు: సైన్యమునుజెండాడి విజయలక్ష్మీద్వితీయులై యాంధ్రసైనికు లేకశిలానగరము జేరిరి. పరాభవదు:ఖముతో హతశేషమగు సైన్యమును సమకూర్చుకొని మల్లిక్ కాపూరు డిల్లీకి జేరెను.

రణమున జయించి సైన్యమును జెండాడి నగరమున కేతెంచిన యాంధ్ర వీరులనందఱను బ్రతాపరుద్ర చక్రవర్తి గౌరవించి యుచిత సత్కారములగావించి గౌరవించెను. ప్రజలు తమ సామ్రాజ్యజయమున కానందించి వీరులకు హారతులొసంగి మహోత్సవము లొనరించి మృతవీరుల పొలికలనిలో స్మరణ చిహ్నముల నెలకొల్పిరి. ఏకశిలానగర రాజ్యమును గబళింప నెంచిన త్రిపురాంతకుడు అంబయదేవుడు ప్రతాపరుద్రుని వంచింప నిదియ తరుణమని యోరుగంటికోటపైకి వచ్చిరి. సోమయగన్నవీరు డపరిమిత సైన్యబలముతో వారి నెదిరించి సైన్యసహితముగ దునుమాడి వారిరాజ్యము నాంధ్రసామ్రాజ్యములో గలిపివేసెను. యవనసైన్యము డిల్లీకేగినది మొదలు అల్లాఉద్దీను ఆంధ్ర సామ్రాజ్యమును హరింపనైతినే యనిమిగుల నాందోళనపడి యచిరకాలమున మఱల దండయాత్ర కేగనిశ్చయించి సైనిక బలమునభివృద్ధి జేయుచుండెను. అపుడు దేవగిరిని డిల్లీకంకితుడై పాలించు మహారాష్ట్రుడగు రామదేవుడను నామాంతరముగల రామచంద్రదేవుడు డిల్లీసామ్రాజ్యమునకు బన్నునొసంగమానెను. అల్లాఉద్దీను రెండవదండయాత్ర కాంధ్రకోశముమీదికి మల్లికాపూరునుబంపెను. అతడు తొలుత దేవ గిరిని ముట్టడించి రామచంద్రదేవుని బంధించి డిల్లీకిబంపి యచటిబలము నంతయును హరించి ఏకశిలానగరముమీదికి దాడి వెడలెను. కాని తీరని పరాజయము నొంది యవనసైనికులు చిందరవందరయై బ్రదుకుము జీవుడాయని ఇంటిత్రోవబట్టిరి. పరుష స్వభావముతో నీయవనసైనికులు ఆంధ్రదేశమున బ్రవేశించినపుడును బారిపోవునపుడును. గూడ ఆలయముల రూపుమాపి నగరములను గాల్చి దీనుల హింసించి ప్రజాపీడ సమకూర్చిరి. ఆంధ్రసామ్రాజ్యమంతయు యవన దురంతములచే గల్లోలమై క్షోభనొందెను. నష్టపడిన ప్రజలందఱకు బ్రతాపరుద్రుడు బొక్కసమునుండి ధనము తెప్పించి యొసంగి వారి యాపత్తుల జాలవఱకు నివారించెను.

క్రీ.శ.1319 సంవత్సరమున అల్లాఉద్దీను మూడవ పర్యాయము ఆంధ్రసామ్రాజ్యమును జయించుటకు మల్లికాపూరు, ఖ్వాజాహాజీయను వారల యధ్యక్షతక్రింద నపరిమిత సైన్యమును నొసంగి పంపెను. దేవగిరిచెంత నెట్టిప్రతిఘటనను లేకుంటచే యవనసైన్య మాకస్మికమున ఇందూరు మీదుగా వచ్చుచుండ స్వామిభక్తపరాయణులగు సైనికు లెదిరించి వీరమరణమొందిరి. మహమ్మదీయులు సిరిపురదుర్గమును ముట్టడించిరి. దుర్గపాలకుడగు వాణీకవిదేవుడు భయంకరసంగ్రామ మొనరించి యవనసైనికుల యాగ్నేయాస్త్రములకు గుఱియై అవరోధకాంతలతో గూడ దగ్థమయ్యెను. అతని సోదరుడు సర్వవైభవ సంపన్నమగు దుర్గము మహమ్మదీయులకు స్వాధీనమయ్యెను. అనంతరము సముద్రమువలె బొంగి పొరలివచ్చు యవనసైన్యమును సూనార్పారు దుర్గమువద్ద నాంధ్రు లెదిరించిరి. ఉభయపక్షములవారికి భయంకరసంగరము జరిగెను. దురదృష్టవశమున నాంధ్రు లోడిరి. మహమ్మదీయ సైన్యము ఆంధ్రనగరము ముట్టడింపవఛ్ఛు వార్తవిని ప్రతాపరుద్రదేవుడు శూరులనందఱ బిలువనంపి చాపకూడుగుడిచి, యుచిత రీతి సత్కరించి ప్రతిపక్షుల నెదిరింప బంపెను.

ఆంధ్రసైనికు లప్రతిమాన పరాక్రమముతో యవన సైన్యము నెదిరించిరి. మహమ్మదీయులు పట్టుదలతో నిలిచి యాంధ్రనగర దుర్గముల కన్నింటికి శతఘ్నులు బారుచేసి కాల్పసాగిరి. ఓరుగల్లుకోట కన్నివైపుల యవన సైనికులు మూగిలోనికెటుల బ్రవేశింపవలయునో తోచక కలవరపడు చుండిరి. చుట్టును పుట్టకోటయు దానిచుట్టు మిగుల విశాలమగు అగాధజల పూరిత పరిఘయు నుంటచే మహమ్మదీయులు ముందులకుబోవ జంకిరి. కోటగోడపై నున్న వీరులు పరిఘలో గాలుంచిన వీరుని నుంచినటుల ఖండింప దొడంగిరి. ఇట్లు నెలల కొలది గడచెను. ఆంధ్రనగరము యవనులకు సాధ్యము కాదయ్యెను. ప్రతాపరుద్రదేవుడు శైవమత పక్షపాతియని భావించి యానృపాలుని ద్వేషించు జైనాచార్యులు కొందఱు రహస్యముగ మహమ్మదీయుల గలసికొని కోటయాకృతి యంతయు దెలిపిరి. ఆకస్మికముగ నున్నటులుండి యవనులు ఏనుగుల సహాయముతో నగడ్తదాటి యర్థ రాత్రమున మంటికోటనెక్కి లొనున్నపౌరులను సైనికులను హింసింప దొడంగిరి. తెల్లవారు వఱకు ఱాతికోటవఱకు మహమ్మదీయ సైన్యములు వచ్చెను. అగడ్త వారి నాటంకపఱచెను. అగడ్త పూడ్వసాగిరి. పైనుండి యాంధ్రసైనికులు ఆగ్నేయాస్త్రములు, ఆయుధవర్షము గురిపించి యవనదళము జెండాడుచుండిరి. తగనిపట్టుదలతో యవనవీరులు ఱాతికోటకు బగ్గమువేసి ప్రాకుచుండిరి. ప్రతాపరుద్రదేవు డీవార్త నాలించి యిక విజయము దుర్లభ మని తలంచి యాంధ్రుల దురదృష్టమునకు గాలమే కారణమని సంధికియ్యకొనెను. మధ్యవర్తులు సంధికి రాయబారముల నడిపిరి. ప్రతాపరుద్రుడు 312 ఏనుగులు, 20,000 గుఱ్ఱములు 96,000 మణుగుల బంగారము, పెట్టెడు రత్నములు నొసంగి డిల్లీసామ్రాజ్యమునకు బన్నుకట్టుట కొప్పుకొనెను. మల్లికాపూరు జయమును గడించి 1310 సంవత్సరము మార్చి 19 వ తేదిన డిల్లీ సామ్రాజ్యాభిముఖుడై హతశేషసైన్యముతో వెడలి పోయెను.

ఓరుగల్లురాజ్యమును మహమ్మదీయులు ముట్టడించిరనియు బ్రతాపరుద్రుడు సంధి కియ్యకొనెననియు విన్నంతనె సామంతులలో బెక్కండ్రు తిరుగబడి కప్పములీయ వద్దని నిశ్చయించిరి. కాంచీపుర పాలకుడు స్వతంత్రత బ్రకటింప బ్రతాపరుద్రు ని సేనానాయకుడును రేచర్ల గోత్రుడునునగు ఎఱ్ఱదాచానాయకుడు కాంచీపురరాజ్యము కాకతీయులవశము గావించెను. కులశేఖరవర్మ తరువాత కాంచీరాజ్యమును హరింప ముప్పడి నాయకు డేగి యాతనిజయించి తెలుగు చోడులలో నొకడగు మానవీరుని సింహాసనమున జేర్చెను. చిన్నచిన్న రాజ్యములు గూడ దిరుగబడుట చూచి స్వయముగా దండయాత్ర చేయకున్న వీలుగాదని దుర్గరక్షణమునకు వలయు బలమును ఆంధ్రనగరమునందుంచి యపరిమిత బలముతో బ్రతాపరుద్ర చక్రవర్తి దండయాత్రకు బయలుదేరి పాండ్య, కొంకణ, తెంకణ, మలయాలాది పశ్చిమదేశాధీశ్వరుల నంకితులుగ జేసికొని పుణ్యక్షేత్రముల దర్శించి మణి మాన్యాదికము లొసంగి ఓరుగల్లు చేరెను. పూర్వముకంటె దృడతరముగ దుర్గమును బాగుచేయించి కందకమును విశాలముచేయించి యాంధ్రనగరమును శత్రుజనాభేద్య మొనర్చెను. శైవమతాభిమానియై బ్రాహ్మణోత్తములకు బెక్కు వృత్తులనొసంగి కవుల బహూకరించి యుత్తమకావ్యముల రచింప బ్రోత్సహించి తటాకముల నభివృద్ధిపఱచి రాజ్యము రామరాజ్యమ గావించెను. నాడు నిర్మింపబడిన కాకతమ్మబావి, శోభనాల బావి, సవతుల బావి, గడియారముల బావి, కుషిమహలు, ఏకశిలామహలు లోనగు కట్టడము లాంధ్రవీరుల శిల్పిప్రశస్తికి దార్కాణముగ నేటి కలరారుచు నేత్రపర్వముగ నున్నవి. కేశవాలయము, స్వయంభూదేవాలయము మిగుల వైభవో పేతములుగ నుత్సవములచే నలరారుచుండెను. కొలది కాలములో ఆంధ్రసామ్రాజ్యము మహోన్నతదశకుకు వచ్చెను.

ఇంతలో డిల్లీరాజ్యమున బెక్కువిప్లవములు జరిగెను. అల్లాఉద్దీను గతించెను. డిల్లీసామ్రాజ్యసామంతులు తిరుగబడిరి. దేవగిరియాదవులు స్వతంత్రులైరి. ప్రతాపరుద్ర చక్రవర్తి గూడ పన్నుకట్టుట మానికొనెను. మల్లికాపూరు సింహాసన మెక్క విశ్వప్రయత్నముగావించెను. ఆతని వధించిరి. తరువాత ముబారకు అనుపేరుగల అల్లాఉద్దీను రాజ్యమునకు వచ్చి దేవగిరి మీదికి దండయాత్రకేగి దుర్గాధిపతియగు హరిపాల దేవుని నోడించి రాజ్యమధ్యమున బ్రతికియుండగ మిగులక్రూరముగ నతని మేనితో లొలిపించెను. ముబారకు రాజ్యమునకు జేరగనే ఖుస్రూఅను సేనాధిపతి వానిని జంపించి తాను రాజయ్యెను. తరువాత నైదు మాసములకు ఘాజీబేగుతుగ్లక్ ఖుస్రూను సంగరరంగమున జంపి ఘియాజుద్దీను తుగ్లక్ అనుపేరుతో క్రీ.శ. 1321 ఆగష్టు 22 తేదిని డిల్లీసామ్రాజ్యమునకు రాజయ్యెను. ఇతడు రాజనీతివిదుడగుటచే నలువైపుల నుండి శత్రుసైన్యములు రాకుండ కట్టుదిట్టములు చేయించెను. ప్రతాపరుద్రుడు పూర్వవైరము పురస్కరించుకొని డిల్లీ సామ్రాజ్యమును మ్రింగివేయునేమో యను భయమాతని హృదయమును దహించివేయుచుండెను. తుగ్లక్ తన కుమారుడగు అలూపుఖానునకు అపరిమితమగు సైన్యమును సహాయముగ నొసంగి యాంధ్రసామ్రాజ్యమును ముట్టడింపబంపెను. ఇది నాలుగవ ముట్టడి. ప్రతాపరుద్రుడీ వార్త విన్నంతనె సమీపదుర్గములందున్న సైన్యమును సేనాధిపతులను రప్పించి రాతికోటలోని ప్రతిదుర్గమునకు ఒక్క వెలమవీరుని గొంతసైన్యమును గాపుంచి ద్వారములన్నింటినిండ వీరాధివీరులగు సైనికులనుంచి తేరాల బచ్చిరెడ్డి, కొలిపాక సిద్దయ్య, శ్రీరంగమదేవుడు, మహాదేవనాయకుడు, గన్నయ్య సేనాని, కుమారరుద్రదేవుడు లోనగుమహావీరులు సవలక్ష సైనికులతో నాంధ్రసామ్రాజ్యము సంరక్షించుటయో సంఘమరణ మొందుటయో కర్తవ్యమని రణమునకు దలపడిరి. రాచర్లవద్ద విడిసిన యవనసైన్యము ముందునకు వచ్చెను. మహాత్ముడగు శివదేవయ్య వీర చందనము విభూతిగైకొని వీరులందఱును నాశీర్వదించి తిలకము మొగమునిండ, గందము మేన బూసి రణమున కంపెను. అద్వితీయపరాక్రమముతో నాంధ్రులుపోరాడిరి. రాజ్యమునందున్న ప్రతిపౌరుడు రణమున బాల్గొనెను. చుట్టుపట్టునగరముల వారందఱు పగతుర సైన్యము ననేకవిధముల జెండాడిరి. కడకు మహమ్మదీయసైన్యము సంపూర్ణముగ నాశనమయ్యెను. సరదారులు పలువురు మరణించిరి. యుద్ధోపకరణములన్నియు నూడలాగికొని ఆంధ్రవీరులు మహమ్మదీయుల గోదావరితీరము దనుక బాఱదోలిరి. అలూపుఖాను మూడువేల గుఱ్ఱపుదళముతో డిల్లీచేరి తన పరాజయ కథయంతయు దండ్రికి నివేదించెను. సుల్తాను, చుట్టుపట్టులనున్న చందేరీ, బూదావూన్, మాళవదేశములనుండి తక్షణమె యసంఖ్యాక సైన్యమును రప్పించి యలూపుఖానున కొసంగి త్రిలింగసామ్రాజ్యమును హరించి రాజును బంధించిగాని నాయొద్దకు రావద్దని పంపెను. యవన సైన్యము రాత్రుల నడవిత్రోవల బయనము చేసి ఆకస్మికముగా నోరుగల్లుకోటమీదపడి నిర్భయముగా నసహాయముగానున్న ద్వార రక్షకసైన్యమును దెగటార్చి లోనికిజొచ్చెను. యుద్ధముముగిసి రెండునెలలైన గాలేదు. ఇంతలో యవనులవలన నెట్టి యుపద్రవముండదని వీరులకు విశ్రాంతి యొసంగి ప్రతాపరుద్రుడు పరిమితబలముతో నగరమధ్యమునందలి మహాసౌధమున నుండెను. యవనసైన్యము ఱాతికోటకు ఫిరంగులు బారు పెట్టికాల్చుట లాంధ్రసైనికులు విని నివ్వెఱపోయిలేచి దుర్గరక్షణమునకు బూనుకొనిరి. యవన సైనికులుకోట బైటిద్వారములన్నిటిని మూయించి క్రొత్తసైన్యము నగరము జేరకుండ కట్టుదిట్టముచేసి రాతికోట బగులగొట్టనారంభించిరి. ప్రతాపరుద్రచక్రవర్తి యేనుగునెక్కి సైనికుల బురికొల్పుచు బ్రతిపక్ష సైన్యమును బంచబంగాళము చేయించుచుండెను. ఆంధ్రసైనికులు పరాజయమందుచుండిరి. ప్రతాపరుద్రు డీవిపరీత పరిస్థితులగాంచి స్వయంభూ దేవాలయమున కేగి జ్యోతిర్లింగమును సందర్శించిన నది ప్రకాశవంతముగ గోచరింపదయ్యె. పద్మాక్షియాలయమునకేగి యాయుధములటనిడి నమస్కరింప బోవ నాయుధములు సర్పాకారముదాల్చి గుహలోనికి బోయెను. ఈపరిస్థితులు అపశకునములుగ నెంచి ప్రతాపరుద్రదేవుడు జయముపై నాసవీడి ఖడ్గముపుచ్చుకొని మహమ్మదీయ సైన్యముపై దుమికెను. అలూపుఖాను ప్రతాపరుద్రుని బంధించి రహస్యముగా దనశిబిరమున జేర్పించెను. రాజింక యుద్ధము చేయుచున్నాడని సైనికులు ఘోరముగ బోరాడుచుండిరి. అలూపుఖాను ఆరాత్రినుండియే సైన్యముతో ప్రతాపరుద్రుని డిల్లీకిబంపెను. ఎటులో నీవర్త ఓరుగల్లు నగరమునందంతటను బ్రాకెను. ఆంధ్రభటులు రాజునువిడిపింప శిబిరముల కడకుఱికి భయంకరసమరము చేయుచుండ మహమ్మదీయ సైనికులు కోటలు బగులగొట్టి ఆలయముల గూలద్రోచి రాజమందిరము అంగడి వీధులుదోచి డిల్లీత్రోవబట్టిరి. మహమ్మదీయ శిబిరములందు దమరాజు లేకుండుటకు వగచి డిల్లీకి గొనిపోవుచుండిరేమో త్రోవలో నడ్డగించి రాజును విడిపింతమని యవనసైనికులు పోయిన త్రోవనుబట్టి యాంధ్రులు రామగిరియొద్ద ప్రతిపక్షసైన్యమును గలసికొని ఘోరసంగరమునకు దలపడిరి. ఆంధ్రసైనికులు రాజును విడిపించుటకు భొవుచున్నారని విని ఓరుగల్లు ముట్టడించు మహమ్మదీయ సైనికులు రామగిరివద్ద తమసైన్యములను గలిసికొని ఆంధ్రసైనికులతో బోరుచుండ యుక్తిశాలియగు నొక మహమ్మదీయసేనాని కొంత పరిజనముతో రాజు నీసంరంభములో గోదావరి దాటించెను. ఆంధ్రసైనికులు యవన సైన్యమును జెండాడి పరిశీలింప రాజు కనబడ డయ్యెను. దురదృష్టవశమున నాంధ్రులు పరాధీనులై యవనపాలనమున నున్న నిజనగరము చేరిరి. ఆంధ్రదేశ మద్వితీయవిక్రమముతో బాలించి ఆంధ్రజాతికి శరణ్యుడైన ప్రతాపరుద్రుడు 1323 లో బంధీకృతుడయ్యెను. ప్రతాపరుద్రుడు జీవగ్రాహిగ బట్టువడినందులకు డిల్లీనవాబు ఆఱుమాసము లుత్సవము జరిపెనట. డిల్లీ నవాబు దయదలచి విడిచిపెట్ట ప్రతాపరుద్రుడు కాళేశ్వరమునకు వచ్చి యట గొంతకాల ముండి మరణించినటుల స్థానికచరిత్రము చెప్పుచున్నది ఆంధ్రసామ్రాజ్యమునకు ముఖ్యస్థానమగు ఓరుగల్లు పూర్వవిభవమంతయు ప్రతాపరుద్రుడు బంధీకృతు డగుటతో దీరిపోయెను. నాటి సామ్రాజ్య చిహ్నము లనదగు శిలాద్వారములు, కూపములు, ఆలయములు, దుర్గద్వారములు, క్రీడాసరోవరములు స్మరణ చిహ్నములవలె నేటికి జరిత్రాభిరతుల సంతాపాశ్రుసేచన ముతో దృప్తినొందుచు ఓరుగల్లుకోటలో గనుపించుచున్నవి. ఆంధ్రసోదరులారా! హతశేషములగు చిహ్నముల గాంచియేని యానందింపరా ?


_______