Jump to content

ఆంధ్ర వీరులు/చాణక్యుడు

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

ఆంధ్ర వీరులు.

1. చాణక్యుడు.

భరతఖండమునందలి దేశములన్నిటెలో మగధ మిగుల బ్రసిద్ధమైనది. మగధదేశము చిరకాలము వీరాధివీరులు, పరాక్రమశాలురు, ధర్మస్వరూపులు నగు రాజులకు రాజధానిగ నుండెను. పాండవులను శ్రీకృష్ణుని ఉఱ్ఱూతలూపిన వీరవతంసుడగు జరాసంధుని రాజధాని యీ మగధదేశమందలి గిరివ్రజము. దీనిచెంతనే బింబిసారుడు రాజగృహ మను నగరమును నిర్మించెను. తరువాత గొంతకాలమునకు అజాతశత్రుడు రాజ్యమునకువచ్చి గంగాతీరమునందున్న పాటలియను నొక పల్లెచెంత గొప్ప దుర్గమును గట్టెను. అతని మనుమడగు ఉదయనుడు పాటలీదుర్గముచెంత పాటలీపుత్రమను గొప్పనగరము నిర్మించెను.

పాటలీపుత్రము గంగ, శౌణ, గోగ్ర మొదలగు నదులు సంగమస్థలము చెంత నిర్మింపబడెను. బుద్ధాది మహానుభావు లచే నీ పాటలీపుత్రము పవిత్ర మొనర్పబడియెను. మన కథాకాలమున నీ రాజ్యమును మహాపద్మనందుడు తన యెనమండ్రు కుమారుల సాయముతో బాలించుచుండెను. మహాపద్మునకు ఇళ, ముర యను నిరువురు రాణులు గలరు. ఇళ యందు ఎనిమిదిమంది కుమారులు జనించిరి. మహాపద్మునితో గలిపి వీరిని నవనందు లని యాకాలమున బేర్కొనుచుండిరి. రెండవ భార్యయగు మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు. తేజశ్శాలియు బుద్ధిమంతుడు నగు చంద్రగుప్తునియెడ సవతియన్న లెనమండ్రును పగ బూని యెటులేని మట్టుపెట్ట జూచుచుండిరి. మహాపద్ముడు ముదుసలియగుట చేతను జంద్రగుప్తుడు మిగుల జిన్నవాడగుట చేతను, రాజ్యభారమంతయు ఎనమండ్రునందులకు గైవసమయ్యెను. చంద్రగుప్తుని మట్టు పెట్ట నెన్నియో కపటోపాయములను బన్నుచు నందులెనమండ్రు దురాలోచనము జేయుచుండిరి. చంద్రగుప్తుడు మిగుల శ్రమలందుచు దైవ సహాయమున నెటులో యాపదనుండి గట్టెక్కుచు గాలయాపనము దినమొక యేడుగ జేయుచుండెను. కడకు జంద్రగుప్తుడు పొట్టకూటికి వెరవు చాలక సత్రాధికారిగనుండి దీనుడై కాలము గడుపుచుండెను.

నందు లహంకరించి మహామంత్రియు నేర్పరియునగు రాక్షసుని మాటనేని పాటింపక మిగుల స్వతంత్ర భావముతో వర్తించుచుండిరి. ఒకదినమున చాణక్యు డను యువకుడు పండితవతంసుడు నందరాజుల సభకువచ్చి యటగల యొక యున్నతాసనమున నాసీనుడై యుండెను. నందు లచటకువచ్చి యుత్తమ పీఠమునందున్న యాపేదబాపని మిగుల దిరస్కారభావముతో జూచి సింహాసనమునుండి పడ లాగిరి. అమాత్యరాక్షసుం డిది యక్రమమనియు బండితులు పూజనీయులనియు బోధించెను కాని లాభములేకపోయెను. సిగముడి వీడ నున్న తాసనమునుండి లాగబడిన చాణక్యుడు నందులను గోపముతో దేఱి పాఱజూచి "ఓ నందాధము లారా! బహుజనమధ్యమునందు నన్నిటల అవమానించితిరి. మిమ్మిటులే సింహాసనమునుండి లాగి మీతలలను నరికి మీచే నూడ దీయబడిన యీ తలవెండ్రుకల ముడి వేసు కొనను" అని సభామందిరమును వదలి వెడలిపోయెను.

చాణక్యు డిటుల గోపించి పోవుటజూచి చంద్రగుప్తుడు మాఱుత్రోవను బోయి యొక యేకాంత ప్రదేశమున జాణక్యుని గలిసికొని సాగిలి నమస్కరించి నందాదులచే దానొందు నవస్థల దెలిపి తన్నను గ్రహింపుమని వేడుకొనెను. చంద్రగుప్తుని లేవనెత్తి చాణక్యు డాదరించి నందరాజ్యమునకు నిన్ను బట్టాభిషిక్తునిగావించుట నారెండవ ప్రతిజ్ఞయని నాడు మొదలు చంద్రగుప్తుని తనయొద్దనే యుంచుకొని నందకుల నిర్మూలమునకై ప్రయత్నములు చేయుచుండెను.
చాణక్యుడు సర్వశాస్త్ర పారంగతుడు, రాజనీతివిదుడు, దూరాలోచనపరుడు నగు చాణక్యుడు తన మిత్రుడును సహాధ్యాయయు నగు నిందుశర్మను సమీపించి జరిగిన యంశము తన ప్రతిజ్ఞయు దెలిపి 'నీ వెటులేని క్షపణక వేషముతో అభిచారిక విద్యచే నందులను, రాక్షసుని లోగొని యచటి రహస్యములను చారులచే నెఱింగించుచు, జంద్రగుప్తునకు నందరాజ్యమును ధారవోయుటకు దోడ్పడు' మని కోరెను. ఇందుశర్మ యటులె యని యంగీకరించి నందుల చెంతకేగి చెలిమిగడించి రాక్షసుని చెంత బ్రాపకము నార్జించి తలలో నాలుకవలె గలిసిమెలసి యుండి రాజ్యరహస్యము లన్నియు నెప్పటికప్పుడు చాణక్యున కెఱింగించుచుండెను. చాణక్యుడు చంద్రగుప్తుని వెంటగొని హిమాలయపర్వత ప్రాంతమునందున్న యరణ్య భాగములను బాలించుపర్వతరాజు చెంత జేరి యతని స్నేహమును సంపాదించి నందసంహారమున కాతని బ్రోత్సహించెను. గెలిచిన యెడల నందరాజ్యమునందు సగము పర్వతరాజునకొసంగుటకు గూడ జాణక్యుడు వాగ్దానము గావించెను. జయించితిమేని జాణక్యుని జంద్రగుప్తుని వంచించి నందరాజ్యము నంతయు హరింప వచ్చునని పర్వతరాజు తలంచి సామంతుల యొద్దనుండి మిత్రుల యొద్దనుండి యసంఖ్యాకమగు సైన్యమును రప్పించి చాణక్యుడు పెట్టిన సంమూర్తమున నందరాజ్యముపైకి దా వెడలెను. పర్వతరాజు వెంట నాతని సైన్యమె కాక శక, యవన కిరాత, కాంభోజ, పారసీక, బాహ్లి కాది సైన్యములుగూడ వచ్చెను. చాణక్యుడు, చంద్రగుప్తుడు సైన్యమును మూడు భాగములుగా భాగించి తాము చెరియొక భాగమును దీసికొని గండకీ ప్రాంతమునకు బోయి పాటలీపుత్రమును ముట్టడించిరి. పర్వతరాజు కడమ మూడవభాగమును వెంటగొని గంగా శోణా సంగమప్రదేశము చెంత పాటలీపుత్రమును ముట్టడించెను. ఇందుశర్మ నందులనందఱ జీలదీసి చాణక్యునకు మోసముగా బట్టియిచ్చెను. చాణక్యుడు ఎనమండ్రు నందులను సంహరించి తన మొదటిప్రతిజ్ఞను నిర్వహించి యప్పుడు తల వెండ్రుకలను ముడివైచికొనెను.

నందుల నాశము జూచి మంత్రియగు రాక్షసుడు మిగుల జింతించి చీలిన సైన్యమునంతయు గూడబఱచి పర్వతరాజు సైన్యముతో బాటలీపుత్రసైన్యమును భయంకరముగా యుద్ధము జేయించెను. నందరాజులమరణము విన్న రాక్షసుల సైన్యము కొంతసేపటికి బర్వతరాజు సైన్యమునకు లొంగిపోయెను. పాటలీపుత్రమునందు అమాత్య రాక్షసున కెక్కుడు పలుకుబడి యుండుటచేతను వెంటనే రాజ్యమున బ్రవేశించినచో జంద్రగుప్తునకైనను దనకైనను నపాయము గలుగవచ్చుననియు బర్వతరాజు నందరాజ్యమంతయు దానే లోగొను నేమోయనియు సంశయించి చాణ క్యుడు జయించిన రాజ్యమున బ్రవేశింప నగరబహిర్భాగమున బరిజనముతో విడిసి యుండెను.

రాక్షసు డెటులేని జంద్రగుప్తుని జాణక్యుని జంప దలంచి మాయోపాయములు దక్క వేఱు గతిలేదని యొక యుపాయము పన్నెను. రాక్షసు డొకబాలికను విస మలవాటు చేసి పెంచుచుండెను. ఆబాలిక విసము జీర్ణించుకొనుట కలవాటుపడి యౌవనవతియై సర్వాంగసుందరియై యుండెను. ఆసుందరి తాకినయెడ విసముసోకి మనుజులు మరణింతురు. ఆమెను బిలువనంపి రప్పించి తనచెంత విశ్వాసపాత్రునివలె క్షపణకవేషథారియై వర్తించుచు జీవసిద్ధియను పేరుతోనున్న ఇందుశర్మను బిలిచి యీబాలికను జంద్రగుప్తునకు నేను సమర్పించితి ననియు బరిగ్రహించి మమ్ముల ననుగ్రహింపు మనియు జెప్పి పంపెను. జీవసిద్ధి 'చిత్త మటులనే కావింతు'నని విసకన్యను వెంటగొని చాణక్యునికడకు బోయి జరిగిన యుదంత మంతయు రహస్యముగా దెలిపి విషకన్యను సమర్పించెను. నందరాజ్యము నంతయు హరింపనెంచిన పర్వతరాజును జంప నిదియ తరుణమని చాణక్యుడు విషకన్యను బర్వతరాజునొద్దకు బంపెను. కామాతురుడగు పర్వతరాజు విషకన్యనుజూడగనే యొడలుప్పొంగి కౌగిలించుకొని విషము తల కెక్కి మరణించెను. రాక్షసుని యాన యడుగంటెను. నందరాజ్యమునంతయు హరింపదలంచిన పర్వతేశ్వరుడు గతించుట చాణక్యుని సంకల్పమునకు సర్వవిధముల సహాయకారి యయ్యెను. పర్వతరాజుమరణము విని యతని కుమారుడగు మలయ కేతువు విచారపడుచుండ బ్రతిపక్షుల సేనానయకుడగు భాగురాయణుడు వచ్చి చెలిమి సంపాదించుకొని 'మలయ కేతూ! చాణక్యుడు నీతండ్రిని జంపించినటులె నిన్నును జంపింప నున్నాడు. బ్రదుక దలచిన నిటనుండి వెడలిపోవుట మంచి'దని తెల్పెను. అతని మోసపుమాటలు నమ్మి మలయ కేతువు భాగురాయణుని మంత్రిగ జేసికొని తన పర్వత రాజ్యమునకు వెడలిపోయెను.

పర్వతరాజ కాలమరణ మొందుటయు మలయకేతువు పాఱిపోవుటయు జూచి యిదియె యదనని చాణక్య చంద్రగుప్తులు మంగళవాద్యములతో బాటలీపుత్రమున బ్రవేశించిరి. రాక్షసుడు సైన్యముల బ్రోత్సాహపఱచి చాణక్య చంద్రగుప్తుల బలము మీదికి దన బలమును నడపెను. ఉభయ బలములకు భయంకరమగు సంగరము జరిగెను. రాక్షసుడు ఈ యదును గనిపెట్టి నందులపక్షమున జేరి, చంద్రగుప్తునకు బట్టాభిషేకము చేయరాదని చాటించెను. అంతతో బోక మహానందుని ఒక సురంగ మార్గమున దపము జేసికొనుటకు బంపి యతని స్వీకారపుత్రుని రాజ్యమునందు బ్రతిష్ఠింపవలయునని రాక్షసుడు నిశ్చయించెను. చంద్రగుప్త చాణక్యులు పాటలీపుత్రమున బరిచయము సంపాదించుకొనిన కొలది తన కపకారము కలుగక తప్పదని రాక్షసుడు గర్భవతి యగు తన భార్యను పుత్రుని ప్రాణమిత్రుడగు చందనదాసునియింట రహస్యముగా నుంఛెను. తన యంతరంగ మిత్రుడగు శకటదాసునకు గోశాగారమునందలి ధనము నంతయు నొసంగి నందపక్షమునకు సహాయముచేయు నేర్పాటు చేయించెను. అంతతో దృప్తినందక చంద్రగుప్తుని మట్టుపెట్టిన గాని చాణక్యుడు లొంగడని యమాత్యరాక్షసుడు తలంచి దారు వర్మయను శిల్పిని బిలిపించి చంద్రగుప్తుడు నగరమున జేరునపుడు ద్వారము కూలునటుల జేయుమనెను. ఏనుగు నెక్కి నపుడు చంద్రగుప్తుని చుఱకత్తితో బొడిచి చంపుమని మావటీనిని బ్రోత్సహించెను. రాజవైద్యునితో జంద్రగుప్తునకు విషప్రయోగము చేయుమనియు, శయనాధికారితో నిదురించునపుడు తలనఱకు మనియు గొందఱు ఘాతుకులను గోడ సందులలో బంధించి సమయము జూచి చంపుమనియు రాక్షసుడు కట్టుదిట్టములు చేసెను. చాణక్యుడు తన యసాధారణ ప్రజ్ఞచే రాక్షసుని మాయోపాయము లన్నియు గమనించి చంద్రగుప్తున కెట్టి యపాయము గలుగకుండ గాపాడి హంతకుల నందఱ జంపించెను. సర్వార్థసిద్ధిని వెదకించి చాణక్యుడు కొందఱు హంతకుల బంపి చంపునటుల జేసెను. తన ప్రయత్నము లన్నియు విఫలమగుటయు బర్వతరాజు, సర్వార్థసిద్ధి మరణించుటయు మలయ కేతువు పాఱిపోవుటయు జూచి రాక్షసుడు తాన్విక బాటలీపుత్రమున నున్న గావంతయేని లాభములేదని సురంగమార్గమున నగరుదాటి పర్వతరాజ్యమునకు వెడలి పోయెను. ఇట్లు రాక్షసుడు మలయ కేతువు నొద్దకేగి యతనితో చాణక్యుడె నీతండ్రియగు పర్వతరాజును జంపించెననియు బాటలీపుత్రమును ముట్టడించి తండ్రిని జంపిన పగ దీర్చు కొమ్మనియు బ్రోత్సహించెను. మలయ కేతువునకు శక, గాంధార, యవన, శచీన, హూణాదిరాజులు సైన్యసహితముగా సాయము రానుండిరి.

చంద్రగుప్తుని బట్టాభిషిక్తుని జేయుటతో దనభారము తీరలేదని చాణక్యుడు తలంచి తన యంతరంగ మిత్రుడగు జీవసిద్ధిని బిలువనంపి నీవు విషకన్యను బ్రయోగించి పర్వతరాజును జంపితివి గాన రాజ్యమునం దుండదగవని వెడల నంపెను. ఈయవకాశమును బురస్కరించుకొని జీవసిద్ధి మలయ కేతువును శరణుగోరి రాక్షసునకు మలయ కేతువునకు విరోదము కలుగజేయుచు విషకన్యను బ్రయోగించి రాక్షసుడె పర్వతరాజును జంపెనను ప్రవాదము నందందు గలుగ జేసెను. జీవసిద్ధి యవకాశమున్నపుడెల్ల నచటి రహస్యములు చాణక్యాదులకు గూడచారులచే దెలియబఱచుచు బయటికి మలయ కేతువు పక్షమువానివలె నటించుచుండెను. చాణక్యుడు పాటలీపుత్రమున రాక్షసుని పక్షము వారెటనుండిరొ తెలిసికొనుటకు జారులను నియోగింప వారు వెదకి వెదకి చందనదాసుని యింటిలో రాక్షసుని భార్యయు బిడ్డలు నుండిరని తెలిసి కపటో పాయములతో దామార్జించిన రాక్షసుని ముద్రికను జాణక్యున కొసంగిరి. చాణక్యు డాముద్రికా సహాయమున గొన్ని పత్రికలను సృష్టించి జీవసిద్ధి చేతికిచ్చి ప్రచారము లోనికి దెప్పించి, రాక్షసునకు మలయ కేతువునకు విరోధము కలుగు నటుల జేసెను. అందుచే మలయ కేతువు నిశ్చయించిన దాదియు విఫలమయ్యెను. రాక్షసునకు మలయకేతువు నొద్ద ప్రాపకము తగ్గెను. తనతండ్రిని రాక్షసుడే చంపెనని మలయ కేతువు ద్వేషముగూడ వహించెను. 'మృతినొందిన నందాదుల యాత్మ శాంతికొఱకు జాణక్యుని గాని చంద్రగుప్తుని గాని సాధింపలేక పోతినిగదా, నేను జీవించి ఫలమేమని రాక్షసుడు పరితపించు చుండెను. రాక్షసుని నెటులేని చంద్రగుప్తునకు మంత్రినిగా జేసిన బాగుండునని సర్వవిధముల జాణక్యుడు ప్రయత్నించెను గాని నందపక్షపాతియగు రాక్షసుడందుల కంగీకరింపక పోయెను.

రాక్షసుని లోబఱచికొన నేవెరపుగానక చాణక్యుడు కడకొక యుపాయమును బన్నెను. రాక్షసుని భార్య సుతులు చందనదాసుని యింట బాటలీపుత్రమున నుండిరి. చందనదాసుడు రాక్షసునియెడ భక్తివిశ్వాసములు గలవాడు. చాణక్యుడు చందనదాసుని రప్పించి రాక్షసుని భార్యా శిశువుల దన యధీనము గావింపుమని నిర్భంధించెను. స్వామి భక్తిపరాయణుడగు చందనదాసు డందుల కంగీకరింపక తిరుగబడుటచే జాణక్యుడాతని కురిశిక్ష విధించెను; ఈసంగతి రాక్షసుడు విని నిరపరాధియు దన ప్రాణమిత్రుడు నగు చందనదాసునకు దన మూలమున ఘోరమరణము ప్రాప్తింప దున్నందులకు మిగుల వగచి యెటులేని యంత్యకాలమునందేని పరమ విశ్వాసపాత్రుడగు చందనదాసుని గలిసికొని తన ప్రాణము లొసంగియేని యాతని గాపాడనెంచి వధ్యస్థానమునకు జేరెను. హంతకులు చందనదాసుని వధ్యస్థానమునకు జేర్చి యురిదీయబోవు తరుణమున రాక్షసు డడ్డుపడి నిరపరాధియగు చందనదాసుని వదలి నన్ను జంపుడని ముందునకు వచ్చెను. చాణక్యు డది యంతయు జూచి రాక్షసామాత్యా! నీవు చంద్రగుప్తునకు మంత్రిగానుండుటకు ఇష్టపడెదవేని దోషియగు చందనదాసుని వదలుదుము. లేకున్న ఉరిదీయక తప్పదని చెప్పెను.మిత్రసంరక్షణమె తన కవశ్యకర్తవ్యము గావున విథిలేక రాక్షసుడు చంద్రగుప్తునకు మంత్రిగానుండుట కంగీకరించెను. చంద్రగుప్తుడు రాజనీతివిశారదుడగు రాక్షసుడు మంత్రిగనుండుట కెంతయో సంతసించెను. తన ప్రతిజ్ఞలగు నందసంహారము, చంద్రగుప్త పట్టాభిషేకము నీవిధముగా ముగించి రాజ్యము బ్రశాంత మొనరించి చాణక్యు డాథ్యాత్మికవిచారము గావింపనెంచి రాజకీయరంగమునుండి తొలంగెను. గతము నంతయు మఱచి రాక్షసుడు చంద్రగుప్తునిచే ననేక దండయాత్రల నొనరింప జేసి పరాజయము నెఱుంగని విజయములతో పాటలీపుత్రరాజ్యమును మిగుల విస్తరింప జేయుటయేగాక హిమాలయమున కావలి దుర్గమ రాజ్యభాగములుగూడ సాధించెను. మలయ కేతువు చంద్రగుప్తునకు సామంతుడై యుండెను. పర్వతరాజు ఫిలిప్పాస్ అను గ్రీకురాజనియు శల్యూకసు మలయకేతు వనియు నిప్పటి చరిత్రవిదు లూహించుచున్నారు.

చాణక్యుడు ఉత్తమచరిత్రుడు. క్షాత్రమున నీతడు పరశురామునకు, స్వామిభక్తియందు సుగ్రీవునకు, గార్యదక్షత యందు నాంజనేయునకు సమానుడు. చాణక్యుని గుణప్రశంస పురాణాదులయందును కామందకాది రాజనీతి గ్రంథములందును గలదు. రాజనీతిశాస్త్రము లన్నిటియందును దొలుదొలు చాణక్యునిప్రశంస గనబడుచున్నది. చాణక్యుడు వ్రాసిన నీతి శాస్త్రము నీతిగ్రంథములన్నిటిలో మిగుల బ్రశస్తిగాంచియున్నది. చాణక్యుడు "ఇదంక్షాత్ర మిదం బ్రాహ్మ్య"మను ధర్మ సూక్తికి దార్కాణముగ బ్రాహ్మణధర్మములగు పారమార్థిత విజ్ఞానములయందును క్షాత్రధర్మములగు చతురుపాయముల యందును సమర్థుడై మౌర్యరాజ్యమును భరతఖండమున జిరకాలము నిలుచునటుల జేసి సామ్రాజ్య సంరక్షణమునకు బరపక్షకోటిలోనివాడగు రాక్షసుని నియోగించి తాను తపోవనంబున కగెను.

చాణక్యుడు చందనదాసుని స్వామిభక్తికి సంతసించి యాతని విడుచుటయు రాజనీతివిదుడగు రాక్షసుని మంత్రిగ నేర్పాటు చేయుటయు బర్వతరాజును భాగము గోరకుండు జంపుటయు జూడ గుణము గ్రహించుటయం దప్రతిమానుడనియు రాజనీతికొఱకై యెట్టి దురంత కార్యమునకు జంకువాడుకాడనియు దెలిసికొనవచ్చును. చాణక్యు డాంధ్ర బ్రాహ్మణుడని యాధునికులు విశ్వసించుచున్నారు. కాదనుటకు అగుననుటకు బలవత్తరములగు నాధారములు లభించువఱకు ననుమానమె శరణ్యము.

నాడు చంద్రగుప్తుని కైవసమాచరించిన మౌర్యరాజ్యము రూపుమాసినను జాణక్యుని ప్రశస్తిమాత్రము దేశీయులు మఱచిపోవలేదు. మహాత్ముల జీవితము లజరామరములై భవిష్యత్సంతతికి మార్గదర్శకములుగ నాచంద్రార్క స్థాయిగ నుండుననుటకు సంశయములేదు.

చంద్రగుప్తుడు రాజ్యమును బాలించిన కాలము క్రీస్తు శకమునకు బూర్వము 322 - 297 వఱకు నైయుండు నని చరిత్రములవలన దెలియుచున్నది. చంద్రగుప్తునికంటె జాణక్యుడు వయస్సున బెద్దవాడు గాన నతనికి గొంతముందుగ బ్రసిద్ధికివచ్చి చంద్రగుప్తునకు ముందె గతించి యుండును.

చాణక్యుని పాండిత్యమును విద్యాకౌశలమును గూర్చి విశేషించి వ్రాయవలసియున్నను, ఇందు వీరజీవితమును జేర్చుటయే మాసంకల్పముగాన నింతటితో విరమించు చున్నారము.

_______