ఆంధ్ర వీరులు/గౌతమీపుత్ర శాతకర్ణుడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2. గౌతమీపుత్ర శాతకర్ణుడు.

ఆంధ్రదేశము నందలి పురాతననగరములలో ధాన్యకటకము తొలుత యెన్నదగినది. బెజవాడకు మూడామడల దూరమున బశ్చిమదిశను గృష్ణాతీరమున అమరావతి చెంత నీజీర్ణనగరము గలదు. దీనినే మనమిపుడు ధరణికోట యని వ్యవహరించుచున్నారము. మిగుల నున్నతములగు మంటిదిబ్బలతో మనోహరములగు బౌద్ధస్థూపములతో నొప్పి పూర్వశోభల గోలుపోయిన యీప్రదేశము నొకమారు సందర్శించి మన పూర్వచరిత్రము స్మరింతుమేని ఆంధ్రరాజుల రాజధాని నగరమునకా యీదుర్దశ యని పరితాపము కలుగకమానదు.

ధరణికోట రాజధానిగ జేసికొని పాలించిన శాతవాహన వంశజులగు నాంధ్రరాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రథమగణ్యుడు. విజ్ఞానమునందును బరాక్రమమందును బరిపాలనాచాకచక్యమునందును నీత డసమానుడు. ఇతడు పలుమాఱు విజయయాత్రల కేగి యవనులను, శకులను, పహ్లవులను లోబఱచికొని ధాన్యకటక సింహాసనాశీనుడైన వెంటనే తన పెద్దకుమారుడగు వులమాయిని యువరాజపట్టాభిషిక్తుని గావించి ప్రతిష్ఠానపురమునం దాతని నుంచి తనపూర్వులు కోలుపోయిన రాజ్యములన్నింటిని గడించెను. ఈనృపాలుని వంశమును శాతవాహనవంశ మని యందురు. శాతవాహన నామము ఎటుల వచ్చినదో తెలుపు చిత్రకథయొకటి వాడుక లోనున్నది. ఆకథయందలి సత్యాసత్యముల జర్చింపక హృదయరంజకమగు నాకథ నిట వ్రాసెదము.

పరాక్రమశాలియు ధర్మమూర్తియు నగు దీపకర్ణిమహారాజు దక్షిణాపథమును బాలించుచుండెను. ఆతనికి రూపవతియు విద్యావతియునగు శక్తిమతియను భార్య కలదు. ఇరువురును మిగుల సౌఖ్యముగ గలసిమెలసియుండ వారి దాంపత్యము గాంచి దైవము కన్ను కుట్టెనేమోయన శక్తిమతి సర్పదష్టురాలై మరణించెను. దీపకర్ణి అనుకూలపత్నీ వియోగమునకు మిగుల దు:ఖించి యుత్తరక్రియు లన్నియు నిర్వహించి తనజీవితమునంతయు బ్రహ్మచర్యావస్థలోనే గడపుచుండెను. నాయనంతర మీమహారాజ్య మెవరిపాలుగానున్నదో, సంతానము లేదుగదా యను చింత దీపకర్ణిహృదయమును దహించు చుండెను. ఒకనాటి వేకువజామున సుఖనిద్రలోనుండ దీపకర్ణి కొక స్వప్నమువచ్చెను. కలలో నీశ్వరుడు కనిపించి నీవరణ్యములకు ఱేపు వేటకుబొమ్ము. నీకు సింహరాజముపై స్వారిచేయు నొకబాలుడు గనిపించును. వానిని గొనితెచ్చి పెంచి యీరాజ్యమును వానికి నిమ్మని చెప్పి యదృశ్యమయ్యెను.

తెల్లవారుగనే దీపకర్ణి పరిజనమును వెంటగొని వేటలాడుట కొక యరణ్యమునకుబోయి విహరించుచుండ మార్గమున బరుగెత్తుచున్న యొకసింహరాజము కనబడెను. దానిపై నమితతేజోరాశియు, సుందరాకారుడు నగు నొకబాలుడు

Andhraveerulupar025903mbp.pdf
బౌద్ధస్తూపము
కూర్చుండియుండెను. దీపకర్ణి స్వప్నమున గాంచినదెల్ల ప్రత్యక్షమగుటచే మిగుల సంతసించి పదునైన బాణమును వెంట సంధించి పరుగెత్తు సింగముపై బ్రయోగించెను. సింగము వెంటనే మరణించెను. సింహ దేహము నుండి యక్షుడొకడు బయలు వెడలి నమస్కరించి దీపకర్ణి నృపాలా! నేను సాతుడను వాడను. యక్షుడను. కుబేరుని సఖుడను. నే నొకముని కన్యను వలచి మునియనుజ్ఞ గొనకమున్ను గాంధర్వవిధి బెండ్లాడితిని. నాసాహసమునకు గోపించి మమ్మిరువుర సింగముల గండని ముని శపించెను. నాభార్య గర్భవతియై యీ బాలుని గని యకాలమరణ మొందెను. తల్లిలేని బిడ్డనెటులో పెంచుచుంటిని. నాశాపము తొలంగినది. నే నేగుచున్నాడను. ఈబాలుని పోషించు భారమంతయు నీదెయని సాతు డదృశ్యమయ్యెను. సాతుడే వాహనముగనున్న యా బాలకునకు సాతవాహనుడను నామమొసంగి దీపకర్ణి యాబాలుని మక్కువతో బెంచి పెద్దవాని గావించి శుభదినమున దన రాజ్యము నాబాలకున కొసంగి పట్టాభిషేకము గావించెను. సాతవాహనునే ప్రాకృత గ్రంథములందు శాలివాహనుడని వ్యవహరించిరి. ఈతని వంశమె శాతవాహనవంశమని వ్యవహరించుచుండిరి.

శాతకర్ణుడు బౌద్ధుడు. అతనికాలమున జైనబౌద్ధ శైవమతములు పరస్పర భిన్నాభిప్రాయములతో ద్వేషము పెంచుకొనుచున్నను దానందు బాల్గొనక సర్వమత సామరస్యమునకె పాటుపడెను. బౌద్ధభిక్షువులకేకాక యితరమతముల వారికి గూడ నీరాజు మిగుల సహాయము చేసెను. ఆ కాలమున బేరుగల రాజ్యము లన్నియు శాతకర్ణునకు బన్నుగట్టుచుండెను. శాతకర్ణుడు బౌద్ధమతావలంబియైనను విరోధిసంహారమున దయాదాక్షిణ్యములు వదిలి యెన్నియో కుటుంబములను రూపుమాపెను. తనకు దిరుగబడి సామంతులుగా నుండనీయ కొననందులకు గోపించి విరోధుల వంశములను నిర్మూలము గావించెను. యవన శక పహ్లావవంశములు పెక్కు రూపుమాపెను. సౌరాష్ట్రదేశముమీదికి దండెత్తి యాభాగమును బాలించు రాజవంశమును కూకటివ్రేళ్లతో బెరికి కూలార్చెను. పలువురు రాజులు శాతికర్ణికి లోబడి తమపూర్వమతములు వదలి బౌద్ధులుగా మాఱిపోయిరి. ఇతని పుత్రుడగు పులమాయి (పౌలోమి) గూడ విజయ యాత్రల యందు దండ్రికిదోడ్పడి విజయములు సమకూర్చి సామ్రాజ్యమును మిగుల విస్తరము గావించెను.

శాతకర్ణుని రాజ్యమును హరింపదలంచి యవనులు, శకనులు, పహ్లవులు పలుమారు దండెత్తివచ్చి పరాభవము నొంది పోవుటయేకాని జయము నొకమాఱేని గాంచి యెఱుంగరు. ఆకాలమున సుప్రసిద్ధులుగానున్న చేరదేశపాలకుడగు చెంకుడువాను భూపతియు సింహళమును బాలించు గజబాహునృపుడును మాళవదేశమును బరిపాలించు చస్తనుడును శాతకర్ణి కనుసన్నల మెలగుచు స్నేహము వాంఛించుచుండిరి. పశ్చిమాంధ్రదేశము పులమాయి యధికారము క్రిందను పూర్వాంధ్రదేశము ధరణికోట రాజధానిగా శాతకర్ణి పరిపాలనము క్రిందను నుండెను. శాసనములవలన గౌతమీపుత్రశాతకర్ణి ఆస్మిక, ఆసిక, మూలక, సురాష్ట్ర, కుకుర, అపరాంతక, అనూప, విదర్భ, అకరావంతి లోనగు దేశముల కధిపతియనియు వింధ్యావతము, పారియాత్రము, సహ్యము, కృష్ణగిరి, మలయము, మహేంద్రము, శ్రేష్ఠగిరి, చకోరము, మొదలగు పర్వతముల కధినాధుడుగా నుండెననియు దెలియుచున్నది. మగధదేశమునకు గూడ ధరణికోట యాకాలమున రాజధానిగానుండెను. ఉత్తరదిశను గంగానదిమొదలుకొని దక్షిణమున గాంచీపురివఱకు గల దేశమంతయు నాంధ్ర రాజుల పరిపాలనమున నున్నటుల నిశ్చయింప నవకాశములు గలవు.

శాతకర్ణి యాంధ్రుడైనను అతని కాలమున వ్యాప్తిలో నున్న ఆంధ్రభాషాస్వరూప మెట్టిదో నిశ్చయింప నాధారములు లభించుటలేదు. రాజకీయవ్యవహారములయందును శాసనములయందును సంస్కృతభాష మిగుల స్వల్పముగను విశేషముగ బ్రాకృతయు నుపయోగింపబడెను. శాతకర్ణి ప్రాకృతవాజ్మయమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ప్రాకృతభాషలో బెక్కు లుత్తమగ్రంథము లీనృపాలునికాలమునందే బయలు వెడలెను. విదేశవ్యాపారమునుగూడ నీతడు మిగుల నభివృద్ధిలోనికి దెచ్చి ద్వీపాంతరముల కిచటివస్తువులు పోవునట్లును ఇతరద్వీపవస్తువు లచటికి వచ్చునట్లును జేసెను. స్వయముగా బండితు డగుటచే శాతకర్ణి వర్ణాశ్రమధర్మముల గుర్తించి వర్ణములను సంకరముగాకుండ గట్టుదిట్టములను మిక్కిలి దిట్టముగాజేసెను. దండయాత్రలలో నీ దేశమునకు వచ్చి యిచటనే ప్రాతకాపులుగానున్న విదేశీయుల నాదరించి వారి కెట్టిపన్ను లవసరము లేకుండజేసి శాతకర్ణి వారి కెన్నియో సౌకర్యములు కలుగజేసెను. పూర్వరాజులు తమపేరుముందు మాతృనామ ముంచుకొని వ్యవహరించినటుల గానరాదు. శాతకర్ణి తన మాతృదేవియగు గౌతమీనామమును తన పేరుతో గలిపికొని గౌతమీపుత్ర శాతకర్ణియనియె వ్యవహరించెను. దీనిచే నీతనికి గల యపారమగు మాతృభక్తి వెల్లడి యగుచున్నది.

గౌతమీపుత్రుడు క్రీ.శ. 133 మొదలు 154 వఱకు రాజ్యమును బాలించియుండునని యింతవఱకు లభించిన శాసనా ద్యాధారములవలన దెలియుచున్నది. ఇతని ధర్మపత్ని వాసిష్ఠి. ఈరాజన్యుని జీవితమునందలి యపూర్వాంశము లెన్నియో కాలగర్భమున మరుగుపడియున్నవి. శాతకర్ణి యపూర్వ చరిత్ర మంతయు గీర్యంకములుగ బరిగణింపబడు శిలాశాసనములం దింకను అజ్ఞాతావస్థయందె యున్నదని యొప్పుకొనక తప్పదు. మహావిస్తృతమైన ఆంధ్రసాంరాజ్యమునకు నెలవైన ధాన్యకటకము నేడు పూర్వవైభవములన్నియు గోలుపోయి చిఱుపల్లెగా మాఱిపోయినది. ఆంధ్ర రాజుల వేడిరక్తముచే బూతమైన పుణ్యప్రదేశములలో రక్కెసకంపలు నిండిపోయినవి. ఆంధ్రరాజుల మహోన్నత దశనుగాంచి యానందించి విజయగీతములు పాడిన కృష్ణాస్రవంతి యిపుడు విపరీతకాల పరిణామమునకు బలవించుచు విషాదగీతికల బాడుచున్నది. ఆంధ్రుల దురదృష్టమువలె బెచ్చు పెరుగు పాటిదిబ్బలలో జారిత్రకరత్నము లెన్ని మరుగు పడియున్నవో సమగ్రమగు పూర్వచరిత్ర మాతృలోకమున కెన్నటికి జ్ఞాపకమునకు వచ్చునో యెవరు చెప్పగలరు?

_______

3. కులోత్తుంగ చోడదేవుడు.

భారతమును నన్నయభట్టారకునిచే ఆంధ్రీకరింప జేసి యంకితముగా గొన్న రాజరాజనరేంద్రుడు మనకు జిరపరిచితుడు. ఈతడు చాళుక్యవంశజుడు. చాళుక్యవంశజులు చంద్రవంశక్షత్రియులని భారతమునందు జెప్పబడెను. ఈనృపుని రాజరాజ విష్ణువర్ధనుడనియు రాజ రాజనియు గూడ వ్యవహరించుట కలదు. తన మేనమామయగు రాజేంద్రచోడుని కుమార్తెయైన అనుంగదేవి నతడు వివాహమాడెను. ఈ దంపతుల కుమారుడే మన కథానాయకుడగు కులోత్తుంగ చోడదేవ చక్రవర్తి.