ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/మాదయ్యగారి మల్లన్న

వికీసోర్స్ నుండి

5. మాదయ్యగారి మల్లన్న

ఈతడుకూడ కృష్ణరాయని కాలములో నున్న లక్షణికుడయిన కవులలో నొకడు. ఆవరకు మల్లన్నయని మరియొక కవి యుండి యుండుటచేత నీతనిని తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు. ఇతడు శైవబ్రాహ్మణుడు. కొండవీటి పురమందుండినవాడు. ఈతనికి బూర్వమునందుండి యేకాదశీమాహాత్మ్య మనునామాంతరము గల రుక్మాంగదచరిత్రమును రచియించిన మల్లన ప్రౌఢకవి మల్లన్న యనబడును. మాదయ్యగారి మల్లన్న రాజశేఖరచరిత్రమను మూడాశ్వాసముల గ్రంథమును యౌవనారంభ దశయందే రచియించెనట ! ఈరాజశేఖరచరిత్రము నాదిండ్ల యప్పయామాత్యున కంకితము చేయబడినది. ఈకవి కృష్ణరాయల యనంతరము గూడ జీవించియుండుటచేత నించుమించుగా హూణశకము ---- వ సంవత్సరప్రాంతమువరకును బ్రతికియుండెనని చెప్పవచ్చును. ఈతని కవిత్వము మృదుమధుర పదగుంభనము కలదయి మనోహరముగా నున్నది. ఈకవి చరిత్రమునుగూర్చి మరియేమియు దెలియకపోవుటచేత రాజశేఖర చరిత్రమునుండి కొన్ని పద్యముల నుదాహరించుచు విరమించుచున్నాను-


ఉ. చొచ్చిన బోకుపోకు మనుచున్ నృపకేసరి తేరు డిగ్గి నీ

వెచ్చటి కెగిన న్విడుతునే పటుబాణపరంపరాహతిన్

బచ్చడి చేయువాడ నని ఫాలనటద్భృకుటీకరాళుడై

యిచ్చ నొకింతయేని చలియింపక తద్బిలవీధి దూఱగన్- [ఆ.2]


ఉ. సాహసికాగ్రగామి నృవసత్తము డట్లు తదీయ ఘోరమా

యాహమికల్ హరింపుచు నిరంకుశ విక్రమ కేళి జూప ను త్సాహము తక్కి యాత్మపురిచక్కటి నొప్పెడుకాళికా

గేహముచొచ్చి తద్దనుజకీటము సాటిలుభీతి పెంపునన్- [ఆ.2]


మ. కలమాన్నంబు ఘృతంబు బాయసము శాకవ్రాతము ల్పిండివం

టలు బా ల్తేనియ జున్ను వెన్నయిడి యానా లుక్కెర ల్చక్కెరల్

ఫలము ల్పానకము ల్రసాయనము లంబ ళ్ళూరుబిం డ్లూరుగా

యలు బజ్జు ల్దధిపిండఖండములు నం దావిర్భవించె న్వెసన్- [ఆ.2]


శా. కేళీకాంచనసౌధవీధికలచక్కిన్ దొట్లలో బెట్టి యో

ప్రాలేయాచలకన్య కాధనకృపాపారంగతా నిద్రవో

వే లావణ్యపయోనిధీ యనుచు నావిర్భూతమోదంబుతో

జోలల్పాడుదు రక్కుమారకునకున్ శుద్ధాంత కాంతామణుల్. [అ.2]


ఉ. రాహువుగాను ని న్నరగరాచినశూలినిగాను నీతను

ద్రోహముచేసినట్టియలరోహిణితండ్రినిగాను దజ్జ గ

న్మోహిని నీలనీలకచ ముద్దులచక్కెరబొమ్మ గూర్ప క

య్యో హరిణాంశ తావకమయూఖముఖంబుల నేచ నేటికిన్- [ఆ.2]


వెనుకటి కూర్పులయందు బయివిధమున బ్రకటించినతరువాత, ఈటీవల నాకు రాజశేఖరచరిత్రము సమగ్ర మయిన ప్రతియొకటి దొరకినది. అందలి యాశ్వాసాద్యంతముల యందుండిన ఈక్రింది పద్యములను బట్టి కృతిపతి యింటిపేరు నాదిండ్ల వారనియు, పేరప్పామాత్యుడనియు, అత డాఱువేల నియోగిబ్రాహ్మణు డనియు, కృష్ణమాంబా కుమారు డనియు, మంత్రియు దండనాధుడు ననియు, తెలియవచ్చుచున్నది.


శా. వైరించప్రతిభావదావదవచోవై యాత్య సాతత్యస

త్యారూడస్థితిపాండవాగ్రజ మహీయస్వచ్ఛకీర్తిచ్ఛటా

పారావారనిమగ్నశత్రుగణ శుంభత్పూర్వ భూభద్ధిశా

నారీమన్మధ బంధురక్షణచణా నాదిండ్ల వంశాగ్రణీ- [ఆ.1] మాలిని. హరిచరణపయోజధ్యానసంధానమార్గా

స్థిరమతిగుణధారా శిక్షి తాఘప్రచారా

సురసురభివితీర్ణి స్తోత్రపాత్రప్రకారా

గిరిచరదరివీరా కృష్ణమాంబాకుమారా! [ఆ.1]


క. శ్రీరమణీరమణీయవి | హారాయితనూత్నలోచనాంభోజయుగా

దోరమితికీర్తినిరసిత | తారకుభృత్కాశ యప్పదండాధీశా- [ఆ.2]

సుగంధి. పారదప్రభావిభాసిభద్రకీర్తివాహినీ

పూర దానధూతదివ్యభూజకామధేను దు

ర్వార యాఱువేలవంశవార్ధి పూర్ణ చంద్రమా

సారబుద్దిజాలనీతశత్రుభూమిభృద్రమా- [ఆ.2]


క. శ్రీచక్రచారుకుచయుగ | సూచకగడోపగూహసూచితపులక

ప్రాచుర్య తత్త్వతత్పర | యాచకసంస్తుత్య మంత్రియప్పామాత్యా-


ఈ యప్పామాత్యుడు కృష్ణదేవరాయని మంత్రియైన తిమ్మరుసున కల్లుడు. మాదయ్యగారి మల్లన్న తా నఘోరశివశిష్యుడయిన ట్లాశ్వాసాంతగద్యమున నిట్లు తెలిపికొనియున్నాడు:-

"ఇది శ్రీమ దఘోరశివాచార్యగురు కరుణావిశేషలబ్ధ సారసారస్వత మాదయామాత్యపుత్ర మల్లయనామధేయ ప్రణీతంబైన రాజశేఖర చరిత్రంబును మహాప్రబంధంబునందు సర్వంబును దృతీయాశ్వాసము."

ఈ యప్పామాత్యుడు కవిని,


ఉ. శంకరపాదసేవ నవశంపదమానస పంకజాత ని

శ్శంకవచోవిలాస రుచిసారవినిర్జితపూర్ణ పూర్ణిమై

ణాంక దురక్షరాన నభయంకర శౌనకగోత్రపాత్ర య

య్యంకిపురాగ్రహారవిభవాకర మారయమల్ల సత్కవీ.


అని సంబోధించి యుండుటచేత మల్లన శౌనకగోత్రసంజాతు డనియు, అయ్యంకిపురాగ్రహారస్వామి యనియు తెలియవచ్చుచున్నది. అయ్యంకి కృష్ణామండలములోని చల్లపల్లిసంస్థానములో మచిలీబందరునకు పదునాలుగు మైళ్ళదూరములో నున్నది. దీనినిబట్టి కవి కృష్ణామండలములోని వాడగుట స్పష్టము. ఈకవిశ్రేష్టుడు కృత్యాదియందు


గీ. సరససంస్కృతపుష్పగుచ్ఛప్రభూత

మగుతెనుంగనునెత్తావి కఖిలదిశల

దరుణపమానమగు కవిత్రయవిశేష

చతురవాచానిరూఢి కంజలి యొనర్చి

అని పూర్వకవిస్తుతి చేసి


క. చెప్పదగు గవిత రసముల్

చిప్పిల నప్పప్ప బళిబళీ యన లేదా

యెప్పుడు జేయకయుండుటె

యొప్పుజుమీ సుకవి కెంతయుచితజ్ఞడొకో.


శా. గాడార్థప్రతిపాదనక్రమకళాకౌశల్యము ల్లేక వా

చాడక్కార్భటితోడ దామ తము మఝ్ఝూయంచు గైవారముల్

ప్రౌడింజేయుచు బ్రాజ్ఞల న్నగుచు గర్వగ్రంధులై యుండు న

మ్మూడస్వాంతుల మెచ్చకుండుటయె సమ్మోదంబు మాబోంట్లకున్.


సుకవియగువాడు కవిత్వము జెప్పినచో రసము లుప్పతిల్లునట్లుగా జెప్పవలయును లేదా యూరకుండవలయు ననియు జెప్పి కేవల వాగాడంబరమును జూపువారియెడ దిరస్కృతినిజూపెను. కవి కృతిపతి మామగారును కృష్ణదేవరాయని మంత్రియు నయిన తిమ్మరుసును వర్ణించి, అప్పామాత్యుడు తిమ్మరుసు కూతురైన తిరుమలాంబను బెండ్లియైన వార్త నీక్రిందిపద్యములలో జెప్పెను-


సీ. ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియాతత్పరమానసోత్సాహశాలి

యేమంత్రిమణి మిత్రహితబాంధవాశ్రితప్రకరరక్షణకళాప్రౌడబుద్ధి

యేమంత్రిమణి వచోహేలాతినైర్మల్యశీతలతాధూతశీతరోచి యేమంత్రిమణి సుధాధామశాంభవధామధాళధళ్యసుతుల్యధవళకీర్తి


యట్టి మంత్రికులోత్తంస మహితనృపతి

పటలమకుటాగ్రఘటితపత్పద్మయుగళి

సకలకర్ణాటరక్షావిచక్షణుండు

దీనసురశాఖి సాళువతిమ్మమంత్రి.


గీ. అమ్మహామంత్రి కతనియర్థాంగలక్ష్మీ

సకలపుణ్యాంగనాజనశ్లాఘనీయ

లక్ష్మమాంబకు నుదయించి లలినిమెఱయు

తిరుమలాంబిక బెండ్లియై తేజరిల్లె.


కృతిపతియొక్క తమ్ముడైన గోపనయు గుత్తిదుర్గమునకు దండనాథుడయి యుండినట్లు కవి యీక్రింది పద్యమును జెప్పియున్నాడు-


ఉ. ప్రాపితరాజ్యవైభవ నిరాకృతిపాకవిరోధియైన యా

గోపనమంత్రి ధర్మధనగోపనసమ్మతిగుత్తిదుర్గల

క్ష్మీపరిపాలనక్రమసమిద్ధభుజాబలశాలి రూపరవ్

ఖాపరమత్స్యలాంఛను డయావహకార్యధురంధరుం డిలన్.


కృతిపతియైన నాదెళ్ల యప్పామాత్యుని ముత్తాతతమ్ము డైన చిట్టిగంగన్న కృష్ణదేవరాయని తాతయగు నీశ్వరరాజునకు బ్రభువుగా నుండినట్టియు జైమినిభారతకృతిపతి యయినట్టియు సాళువనారసింహ రాజునొద్ద మంత్రిగానున్నట్లు చెప్పిన యిక్రింది పద్యము కవికాలనిర్ణయమునకు దోడుపడునదియే యయినను దీనిసాహాయ్య మక్కఱలేకయే కృతిపతి తిమ్మరుసుజామాత యగుటచేతనే కవికాలము మనకు దెలియవచ్చినది.


ఉ. సాళువనారసింహమనుజప్రభుకార్యకళాధురంధరుం

డై లవణాబ్ధివేష్టితధరాధిపదుర్మతమంత్రమంత్రిశుం పే రెవ్వారు నెఱుంగరో యకట నిర్భీతి న్నరుండెవ్వడేన్

జేరన్వచ్చునె నన్ను బెబ్బులిపయిం జీంబోతునుం బంచునే- [ఆ.2]


ఉ. రమ్ము నృపాల నీదగుపరాక్రమకేళికి జాలమెచ్చి మా

యమ్మ భవాని సంయమికులాగ్రణికూరిమిబిడ్డ నిచ్చి రా

బొమ్మన వచ్చితిన్ శిఖరిపుత్రికసేవకురాల నాదుగే

హమ్మున నున్న యప్పడుచు నప్పనచేసెద నంచు బల్కినన్- [ఆ.2]


ఉ. ప్రన్ననిపాదముల్ చిలుకపాఱిన గందెడు మేనుదీగెయున్

వెన్నెలవారునెమ్మొగము నిద్దపుముద్దు మెఱుంగుజెక్కులున్

గ్రొన్నెలవంటి నెన్నుదురు గోమలబాహుమృణాళయుగ్మమున్

గన్నుల గట్టినట్లు పొడగానగనయ్యెడు నాకు నెచ్చెలీ- [ఆ.3]


చ. అగునగునయ్య యచ్చెలియ యట్టిద యెంత నుతింప నంతకున్

దగుదగు మర్త్యలోకవనితావినుతాంగి యానన

ద్విగుణితచంద్రమండల తదీయనిశాతకటాక్షపాతముల్

తగిలిన మారు డెవ్వరి హళాహళిసేయడు వాడితూపులన్- [ఆ.3]


మ. కులనిర్మూలనకారణంబు ప్రతిభాకుట్టాక ముద్వేగకో

పలతాదోహద మాజవంజవసుఖప్రత్యూహ మాత్మవ్యధా

జ్వలనజ్వాలిక కామినీనయనవీక్షాపాతసంరోధి ని

త్యలఘుత్వాశ్రయభూమి లేమి యది యాహా యేమి గావింపదే- [ఆ.3]


ఉ. రామలు కేళి కాననధరాస్థలికిన్ మును క్రీడసల్ప రా

రో మనసార గమ్మనినిరు ల్తమనేర్పుల గోసికొంచు బో

రో మదవృత్తి నీగతి మరుల్గొని పోరినవారి గాన మొం

డేమనువారమమ్మ తరళేక్షణ వ్రాతఫలం బిటుండగన్- [ఆ.3]


చ. కలితసుధారసంబు దొలకన్ సరసప్రియభాషణంబులం

బలికిన శీతకాలమగు బల్లవపాదములెత్తి లీలమై మెలగ వసంతకాలమగు మించుగనుంగవ దేఱజూచినన్

దలకొనుకారుకాలమగు దన్వివిలాసవిచిత్ర మెన్నగన్- [ఆ.3]


శా. డాకేల న్నిజకన్యకామణులకంఠశ్రేణి గీలించి వీ

క్షాకంజాతము లాత్మపాదనఖ రేఖందార్చి సంగీతవి

ద్యాకౌశల్యము గానరా మతికి నాహ్లదంబు సంధిల్ల గౌ

రీకళ్యాణము బాడిరప్పుడు పురంధ్రీరత్నము ల్వేడుకన్- [ఆ.3]

                          _____________