ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/ధూర్జటి కవి

వికీసోర్స్ నుండి

4. ధూర్జటి కవి

ఇతడు పాకనాటి యారువేల నియోగిబ్రాహ్మణుడు; భరద్వాజగోత్రుడు; ఆపస్తంబసూత్రుడు; కాళహస్తిపుర నిలయుడు; శివభక్తుడు. ఈతడు కృష్ణదేవరాయలకాలములో నున్నందున దాదాపుగా 1520 - 30 వ సంవత్సర ప్రాంతములం దున్నవాడని చెప్పవచ్చును. ఇతడు కాళహస్తిమహాత్మ్యమను నాలుగాశ్వాసములుగల పుస్తకమును, కాళహస్తీశ్వర శతకమును రచించి కాళహస్తీశ్వరున కంకితముచేసెను. ఈయన కవనము సలక్షణ మయి మిక్కిలి మధురముగా నుండును. ఈతని కవిత్వ మాధుర్యమున కాశ్చర్యపడి కృష్ణదేవరాయ లొకనాడు సభలో గూరుచుండి తన యాస్థానకవులకు చ. స్తుతమతి యైనయంధ్రకవి ధూర్జటిపల్కుల కేల కల్గెనో

యతులిత మాధురీమహిమ-


అని సమస్య యిచ్చినట్లును వారిలో నొక రీక్రిందిరీతిని సమస్యా పూరణము చేసినట్లును చెప్పుచున్నారు:


చ. స్తుతమతి యైనయంధ్రకవిధూర్జటిపల్కుల కేల గల్గెనో

యతులిత మాధురీమహిమ? హా తెలిసెస్ భువనైకమోహనో

ద్ధత సుకుమారవార వనితాజవతా ఘనతాపహారి సం

తత మదురాధరోదితసుధారసధారలు గ్రోలుటంజుమీ.


పయిపద్యమునుబట్టి చూడగా ధూర్జటికవి సంతత వేశ్యాప్రియుడయిన రసికపురుషు డయినట్టు కనుపట్టు చున్నాడు. అట్టి యఖండ శివపూజాధురంధరుడైన భక్తాగ్రేసరుని నిట్టి జారత్వదోష మేల విడువకుండెనో యూహింపజాలకున్నాము. మనదేశముయొక్క దౌర్భాగ్యము చేత జిరకాలమునుండి యిచ్చట విశుద్ధచరిత్రము మతమునుండి విడిపోయినది. ఎట్టి దుశ్చరిత్రముగలవా డయినను విభూతి, రుద్రాక్షలు మొదలయిన బాహ్యచిహ్నములను ధరించినమాత్రమున భక్తాగ్రేసరుడుగా బరిగణింపబడుచున్నాడు. అయినను క్రమముగా నిప్పుడిప్పుడు మతమునకు సత్ప్రవర్తన మావశ్యకమన్న సత్యము జనుల మనస్సులలో నాటుకొనుచున్నందున కెంతయు సంతసిల్ల వలసి యున్నది. ఈమహాకవియొక్క కవితాధార తెలియుటకయి కాళహస్తిమహాత్మ్యములోని కొన్ని పద్యముల నిం దుదహరించుచున్నాను:-


చ. అమితము లైనజంతువుల కక్కడ నుత్తమ మధ్య మాధమ

త్వము లరయంగ గాన మపవర్గరమాసతి బెండ్లియాడుచో

సమతయెకాని తత్త్పురముసాటిగ నన్యపురంబు లెన్నగా

సమరు నటన్న హస్తిమశకాంతర మంతియ వాసి చూచినన్. [ఆ.1]

చ. పరిచితబంధనైపుణి నపారకళానుభవప్రసక్తి నా

దరసవివేకసంపద సదాశుకవాక్యసుధానుభూతి మో

హరహితవృత్తి బ్రస్పురదనంగరహస్య విచారబుద్ధి న

ప్పురమున గామినీజనులు పొల్తురు యోగిజనంబుపోలికన్. [ఆ.1]


శా ఆవేళం బురపల్లవప్రకరనేత్రానందబాష్పాంబుధా

రావర్షాగమచంచలాలతిక దుర్వారప్రసూనాస్త్ర తే

జోవైశ్వానరసామిధేని రశనాసూత్రస్థితస్వర్ణ పే

టీవిన్య స్తకపర్ది యొక్క కలకంఠీరత్న మేతెంచుడున్. [ఆ.1]


మ. ప్రణతు ల్చేయుచు గాంచె గుంభజుడు లోసాముద్రతోగూడి ద

క్షిణకైలాసము నంబికాహరకృత శ్రీపాదుకాన్యాసమున్

మణిమంత్రౌషధవాసమున్ భవమహామాయావిపర్యాసమున్

గణనాతీత నటీవిలాసము సమగ్రశ్రీసముల్లాసమున్. [ఆ.1]


చ. పులులు కురంగముల్ కరటిపోతము లేదులు మన్ను బిళ్ళు దు

ప్పులు కణతుల్ కిటుల్ చెవులపోతులు కొర్నవగండ్లు భల్లుకం

బులు చమరీమృగంబు లెనుబోతులు కస్తురిపిల్లు లాదిగా

గల మృగరాజి బెక్కువిహగంబుల గానుక లంపె దండ్రికిన్- [ఆ.3]