ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/నంది తిమ్మన్న

వికీసోర్స్ నుండి

3. నంది తిమ్మన్న

ఈకవి కృష్ణదేవరాయని యాస్థానమునం దుండి ప్రసిద్ధిగన్న వారిలో నొకడు. ఇతడారువేల నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; కౌశికగోత్రుడు; నంది సింగన్నకును తిమ్మాంబకును పుత్రుడు; వరాహపురాణాది గ్రంథములను రచించి ప్రఖ్యాతి కెక్కిన మలయమారుతకవికి మేనల్లుడు. ఈతడు శివభక్తుడు. అఘోర శివగురుని శిష్యుడు. ఈకవిని సాధారణముగా ముక్కుతిమ్మన యని వాడుదురు.


శా. నానాసూనావితానవాసనల నానందించుసారంగ మే

లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కానం దపం బంది యో

షానాసాకృతిదాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసియై

పూనెం బ్రేక్షణమాలికామధుకరీపుంజంబు నిర్వంకలన్. అను ముక్కునువర్ణించిన యీ పద్యమును తిమ్మకవి రచియించెననియు, ఈపద్య చమత్కృతిని జూచి మెచ్చి రామరాజభూషణుడు నాలుగువేల వరాలిచ్చి కొని తన వసుచరిత్రమునందు వేసికొనియెనినయు, ముక్కుమీది యీ పద్యమును రచించుటచేతనే యీ కవిని ముక్కుతిమ్మన్న యని యెల్లవారును వాడుచు వచ్చిరనియు, లోకప్రవాదము కలదు. కాని యిదియు గవులను గూర్చి మనవారు సాధారణముగా జెప్పుకొను కల్పనాకథలలో జేరినదేకాని నిజమయినది కాదు. మొట్టమొదట రామరాజభూషణు డీకవికాలములో లేనేలేడు, ఒకవేళ నున్నాడనుకొన్నను వసుచరిత్రమువంటి మహాబ్రబంధమును రచియింప గలిగిన కవిగ్రామణి యింతమాత్రపు కల్పనను నాసికా వర్ణనముగూర్చి చేయలేకపోయెననుట పరిహాసాస్పదము. కాబట్టి యీ కథ యణుమాత్రమును విశ్వాసపాత్ర మయినదిగాదు. కాకపోయినయెడల నందివారని యింటిపేరుగల యీ కవిని ముక్కుతిమ్మన యని జనులేలపిలుతురని కొంద ఱడుగవచ్చును. ఈ కవికి ముక్కు పెద్దదనియు, అందుచేత నీతని నెల్లవారును ముక్కుతిమ్మన్న యని పిలుచుచు వచ్చిరనియు, ఇంకొక వాడుక గూడ గలదు. ఈతనిని ముక్కుతిమ్మన్నయని యాడుట కిదియే నిజమయిన కారణము కావచ్చును. ఈతనిపలుకులు ముద్దులు గులుకు చుండుటచేత నిటీవలివారు "ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు" అని గ్రంథములయందీతని మృదుపదరచనను శ్లాఘించియున్నారు. తిమ్మన కృతమయిన పారిజాతాపహరణము మృదుమధుర పదములతో రసిక జనహృదయరంజకముగా గూర్పబడినది

అల్లసానిపెద్దన నొక్కని విడిచిన పక్షమున గృష్ణదేవరాయ లీతనినే యెల్ల కవులకంటె నధికముగా గౌరవించుచు వచ్చెనని చెప్పవచ్చును. పెద్దనకృతమైన మనుచరిత్రమువలెనే తిమ్మనకృతమైన పారిజాతాపహరణ ప్రబంధమును గృష్ణదేవరాయనికే యంకితము చేయబడినది. ఇందు మించుగా బారిజాతాపహరణము మనుచరిత్రము రచియింపబడిన కాలమునందే రచియింపబడిన దగుటచేత హూణశకము 1520 వ సంవత్సరమునకు బూర్వముననే పారిజాతాపహరణము ముగింపబడినది. తదనంతరమీకవి కొన్ని సంవత్సరములుమాత్రము బ్రతికి కృష్ణదేవరాయడు జీవించియుండగానే మృతినొందెను. కాబట్టి యితడు దాదాపుగా 1526 వ సంవత్సరమువఱకును జీవించియుండెనని చెప్పవచ్చును. ఈకవియొక్క జన్మస్థలము గణపవరమని యొకరు వ్రాసియున్నారుగాని దానిసత్యమును నిర్థారణము చేయుటకు దగినయాధార మేదియు గానరాదు. మఱియు నీతనిని గృష్ణదేవరాయనిభార్య తన పుట్టినింటి యరణపు గవినిగా దెచ్చెనని చెప్పుదురుగాని యదియు పుక్కిటి పురాణమే. ఈతని పూర్వులు మొదటినుండియు రాయలవారి పూర్వులవద్దనే విద్వత్కవులుగా నుండి వారికి గృతు లిచ్చుచు వచ్చినట్లు గ్రంధ నిదర్శనములు గలవు. తిమ్మన పూర్వుడైన నందిమల్లనయు, మేనమామయైన మలయమారుతకవియు గృష్ణదేవరాయల తండ్రియైన నరసరాయల యాస్థానమునందుండి యిద్దఱును గలిసి వరాహపురాణమును దెనిగించి నరసరాజును దానికి గృతిపతినిజేసిరి. తిమ్మకవి తన పారిజాతాపహరణమున బ్రధమాశ్వాసములో గృష్ణుడు పారిజాతపుష్పమును రుక్మిణి కిచ్చుటవలన వచ్చిన కోపమును దీర్చుటకై సత్యభామకు మ్రొక్కెననియు, మ్రొక్కగా నాపడతి యెడమకాలితో నాతనితల దన్నెననియు, అందుల కాతడలుగక ముండ్లవంటి తనగగుర్పొడిచిన తలవెండ్రుకలు సోకి కాలు నొచ్చెనని యా ప్రియభార్య నూరార్చెననియు, ఆమె యంతటితోను బ్రసన్నురాలుగాక నాథుని నిష్ఠురోక్తులాడెననియు, ముద్దులు గులుకు పలుకులతో నీక్రింది పద్యములయందు జెప్పెను:ఉ. పాటలగంధి చిత్తమున బాటిలుకోపభరంబు దీర్ప నె

ప్పాటను బాటుగామి మృదుపల్లవకోమలతత్పదద్వయీ

పాటలకాంతి మౌళిమణిపజ్క్తికి వన్నియపెట్ట నాజగ

న్నాటకసూత్రధారి యదునందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్.


మ. జలజాతాసనవాసవాదిసుర పూజాభాజనంబై తన

ర్చులతాంతాయుధుకన్నతండ్రిశిర మచ్చో వామపాదంబునన్

దొలగం ద్రోచె లతాంగి యట్లయగు నాధు ల్నేరముల్సేయ బే

రలుకంజెందినయట్టికాంత లుచితవ్యాపారము ల్నేర్తురే?


క. కోపనపదహతి గుహనా

గోపాలుడు గాంచి మెయి గగుర్పొడవగ ను

ద్దీపితమన్మధరాజ్య

ప్రాపితుడై పలికె గూర్మి బయలుపడంగన్.


చ. నను భవదీయదాసుని మనంబున నెయ్యపుగిన్క బూని తా

చినయది నాకు మన్ననయె చెల్వగునీపదపల్ల వంబు మ

త్తనుపులకాగ్రకంటకవితానము తాకిన నొచ్చు నంచు నే

ననియెద నల్క మానవుగదా యికనైక నరాళకుంతలా.


చ. అన విని మానిసీతిలక మప్పుడు మేయరదోప నిక్కి వీ

డినకచపంక్తి బల్మఱు ముడి న్వెడద్రోపుచు బై చెఱంగు గ్ర

క్కున జనుదోయి జేర్చుచు మొగంబున లేజెమ రంకురింప జం

కెన నెఱచూపుచూచి పలికెం జలితాధరపల్లవాగ్రయై.


ఉ. ఈనయగారపుంబ్రియము లీపస లీమొగమిచ్చమాట లే

లా నిను నమ్మియుండినఫలం బిదె తోడనె కల్గె నీకు నీ

యాన సుమీ ననుం జెనకి యాఱడివెట్టిన నవ్వువారలం

గాన వెఱుంగునే పసులకాపరి భావజమర్మకర్మముల్. ఉ. ఇంకిటు నిన్ను నమ్మ నను నేమిటికిం గెరలించె దెంతయుం

బొంకముగాని యీవలనిబొంకులు మాచవిగావు రుక్మిణీ

పంకజపత్రనేత్రకును బ్రాణపదంబులుగాన వల్లవీ

కింకర చాలుజాలు నడకింపకు నింపకు లేనికూరముల్.


ఉ. గట్టివచేతలుం బసలు గల్లదనంబులు నీవు పుట్టగా

బుట్టిన వెందులేనిపలుబోకలమాయలు నీకు వెన్నతో

బెట్టినవౌ టెఱింగియును బేలతనంబున నిన్ను నమ్మి నా

గుట్టును దేజము న్మిగుల గోల్పడిపోయితి నేమిచేయుదున్.


చ. మునిపతివచ్చి పూ వొసగి మోదముతోడ భవత్ప్రియాంగనన్

వినుతి యొనర్పగా వినినవీనుల మాచవిగాని మాటలున్

వినవలసెంగదా యిపుడు నీ విటవచ్చుట పారిజాతావా

సన బ్రకటించి నాకు నెకసక్కెము చేయనకాదె చెప్పుమా.


క. మానంబె తొడవు సతులకు

మానమె ప్రాణాధికంబు మాన మఖిలస

మ్మానములకు మూలం బగు

మానరహిత మైనబ్రడుకు మానిని కేలా?


ఈపద్యములను విన్నపిమ్మట లోకమున బార్యాభర్తలలో నిట్టి వినోదము జరుగుట స్వాభావికము కాదని యెంచి రాజిది స్వభావవిరుద్ధమని పలికెనట! కవి యప్పు డేమియు బ్రత్యుత్తర మియ్యక యూరకుండెనట! అటుపిమ్మట గొన్నిదినములకే రాజు ప్రణయకలహము సంభవించినప్పుడు భార్యవలన దనకు నిట్టిగౌరవమే సంప్రాప్తముకాగా కామావేశపరవశు డయి యానందించి వెంటనే సభకు వచ్చి పుస్తకములో నెల్ల నీభాగమే మిగుల స్వభావసిద్ధముగా నున్నదని శ్లాఘించెనట! ఈకథనే కొంద ఱింకొకవిధముగా మార్చి పొలయలుకలో నొడలు తెలియక భార్య తనశిరస్సున వామపాదముతో నలంకరింపగా గోపించి రాజు భార్యతో సహశయ్యాసంభాషణములు మానివేసెననియు, కవి యీసంగతి తెలిసికొని యాదంపతులను మరల గలుపుటకై యీగ్రంథమును జేసి వినిపింపగా రాజు బుద్ధి తెచ్చుకొని కృష్ణునంతటివానికే యట్టి యవస్థ తటస్థించినప్పుడు తన కేమిలెక్క యని మరల భార్యతో గూడె ననియు చెప్పుచున్నారు.


ఈకవియొక్క దాతృత్వమునుగూర్చి యొక కథగలదు. ఇతడు పారిజాతాపహరణమును రాజున కంకితము చేసినప్పుడు రాజు చతురంత యానమహాగ్రహారములును మణికుండలములును బహుమానము చేసెను. ఆయమూల్యమణికుండలములను ధరించి తిమ్మన వాకిట గూరుచుండి యుండగా నొకబట్టు వచ్చి యాతని కవననైపుణి నిట్లు స్తుతించెనట!

క. మాకొలది జానపదులకె | నీకవితాఠీవి ? యబ్బునే కూపనట

ద్భేకములకు గగనధునీ| శీకరములచెమ్మ ? నంది సింగయతిమ్మా! స్తుతింపగానే యతడు తనయొద్ద నప్పుడు మఱేదియు నమూల్య వస్తువు లేకపోవుటచేత వెంటనే తనచెవి నున్నయమూల్యరత్నకుండల మొకటి యాబట్టుకవి కిచ్చెనట! మఱునాడు తిమ్మకవి యొంటిచెవి కుండలముతోనే రాజాస్థానమునకు బోయి యుండగా నచ్చటి కాబట్టు కవియు వచ్చెనట! అప్పుడు ప్రస్తావవశమున రాజాకుండలదానవృత్తాంతమును బట్టు చెప్పినపద్యమును విని,

క. మాకొలది జానపదులకె | నీకవితాఠీవి ? యబ్బునే కూపనట

ద్భేకములకు నాకధునీ | శీకరములచెమ్మ ? నంది సింగయతిమ్మా!


అని "గగన" యనుటకు మాఱుగా "నాక" యని యుండినచో మరింతసరసముగా నుండునని సెల విచ్చెనట! అప్పు డాపద్దెమునకు వన్నెధెచ్చితిరని చెప్పి తన చెవికుండలమును బట్టుకవియు, తనచెవికుండల మును తిమ్మకవియు, రాజుముందఱ బెట్టి సమర్పించిరట ! రాజు వారి యౌదార్యమునకును సరసత్వమునకును మెచ్చి యిరువురకును నర్హ బహుమతులుచేసి సత్కరించి పంపెనట!

రాయల యాస్థానమునందు గొంతకాల మొకబట్టుకవి ప్రబలుడుగా నుండి యితరకవులను సరకుగొనక యవమానించుచుండగా పెద్దనాది కవులందఱును గూడి యొకనాడు తిమ్మకవి వాకిట గూరుచుండి యాలోచించుచుండిరనియు, అప్పుడాబట్టామార్గమున బోవుచు వారిని జూచి వారికి వినబడునట్లుగా దనభటుడైన మాధవునితో


క. వాకిటికావలి తిమ్మని | వాకిటికవికోటి మాధవా కిటికోటే

అనిపలికి పరిహసించెననియు, అదివిని కుపితుడయి యాంధ్ర కవితా పితామహుడైన యల్లసాని పెద్దన

క. ప్రాకృత సంస్కృత ఘుర్ఘుర | మూకీకృతకుకవితుంగముస్తాతతికిన్

వాకిటికావలి తిమ్మన | వాకిటికవికోటి మాధవా కిటికోటే.


అని పద్యమును బూరింపగా బట్టుకవి సిగ్గుపడి తలవంచుకొని పోయెననియు ఒక కథను జెప్పుచున్నారు. వాకిటికావలి తిమ్మన నంది తిమ్మన కాడనియు అతడు రాజునొద్ద సేనాధిపతిగానుండి దుర్గసంరక్షణము చేయుచుండు మఱియొక తిమ్మనయనియు, అతడొకనాడు రాజభవనము వాకిట రాజిచ్చిన యమూల్యవస్త్రమును గప్పుకొని కావలి కాచుచుండగా రాజదర్శనార్ధము లోపలికి బోవుటకయి యచ్చటి కల్లసాని పెద్దనయు, ముక్కుతిమ్మనయు, బట్టుమూర్తియు, తెనాలి రామకృష్ణుడును వచ్చి యాతనిజూచి వారిలో బెద్దన మొదట


క. వాకిటి కావలితిమ్మా

అని పద్యము నారంభించి లోపలికి బోయెననియు, అటుపిమ్మట నందితిమ్మన

ప్రాకటముగ సుకవివరులపాలిటి సొమ్మా అని రెండవచరణమును పూరించి లోనికి జనియెననియు, తరువాత బట్టుమూర్తి


నీ కిదె పద్యము గొమ్మా

అనిపలికి లోపలి కరిగెననియు, కడపట వికటకవియైన రామకృష్ణుడు

నా కీపచ్చడమెచాలు నయమున నిమ్మా.


అని పద్యము పూర్తిచేయగా నతడు వెంటనే తనపచ్చడమును రామకృష్ణునిమీద వై చెననియు, రాజావార్తవిని యాతని సాహసౌదార్యములకు మెచ్చి గొప్ప బహుమానమిచ్చెననియు ఇంకొకకథను జెప్పుచున్నారు. ఇటువంటి కథలనేకము లున్నవి. ఒకనాడు రాయలవారాస్థానమున గొలువుండి తన పార్శ్వములనున్న తిమ్మన్నను పెద్దన్నను బట్టుమూర్తిని జూచి వరుసగా తామరాకులోని నీటిబొట్టును కుక్కుటమును వరాహమును దిరస్కరించుచు బద్యములను జెప్పుడని వేడగా వా రాశుకవిత్వముగా నీమూడు పద్యములను జెప్పిరట:-


ఉ. స్థానవిశేషమాత్రమున దామరపాకున నీటిబొట్ట నిన్

బూనిశ మౌక్తికంబనుచు బోల్చినమాత్రనె గర్వ మేటికిన్

మానవతీశిఖామణులమాలికలందును గూర్పవత్తువో

కానుక లియ్యవత్తువొ వికాసము దెత్తువొ మేలు దెత్తువో:- [ముక్కుతిమ్మన]


శా. రంతు ల్మానుము కుక్కుటాధమ దరిద్రక్షుద్రశూద్రాంగణ

ప్రాంతో లూఖలమూలతండులకణగ్రాసంబుచే గ్రొవ్వి దు

ర్దాంతాభీలవిశేషభీషణధణాంతర్మాంససంతోషిత

స్వాంతుండైన ఖగేంద్రుకట్టెదుట నీజంఝూటము ల్సాగునే- [పెద్దన్న] ఉ. తక్కక నేల ముట్టెగొని త్రవ్వగనేర్తు నటంచు దాకు తా

వొక్కటెజాతియంచు ముద మొందకు బుద్ధిని వెఱ్ఱిపంది నీ

నెక్కడ యాదిఘోణియన నెక్కడ యద్రిసముద్రదుర్గధూ

ర్భాక్కుతలంబు నొక్కయరపంటనె మింటికినెత్త నేర్తువే- [బట్టుమూర్తి]


ఈ తిమ్మకవి కవిత్వము శ్రుతికటువుగాక యర్థగాంభీర్యమును పదలాలిత్యమును గలదయి సలక్షణ మయినదిగా నున్నది. ఈయన శయ్యాలాలిత్యమును జూపుటకు బూర్వోదాహృతము లైన పద్యములే చాలియున్నను బారిజాతాపహరణములోని మఱికొన్ని పద్యములను గూడ నిందు బొందుపఱుచు చున్నాను:-


చ. అతులమహానుభావ మని యవ్విరి దానొకపెద్ద చేసి య

చ్యుతునకు నిచ్చకం బొదవ సూడిద యిచ్చిన నిచ్చెగాక తా

నతడు ప్రియంబు గల్గునెడ కర్పణచేసిన జేసెగాక యా

మతకరివేలుపుందపసి మమ్ము దలంపగనేల యచ్చటన్- [ఆ.1]


ఉ. ఓచెలి శౌరి కిచ్చెనట యొక్క లతాంతము దెచ్చి నారదుం

డాచపలాక్షి కిచ్చెనట యాతడు నవ్విరి యిట్టిమాట లా

హా చెవుల న్వినంబడియు బ్రాణము దాల్చెద మేన నింతగా

నోచితి నింక నెట్టిని కనుంగొని నెమ్మెయి నున్నదాననో- [ఆ.1]


చ. అరదమునెక్కి కేతనపటాంచలచంచల మైనతాల్మితో

దురగజవంబు ము న్గడవద్రోచి కడంగెడుతత్తరంబుతో

దిరిగెడుబండికండ్లపగిదిన్ భ్రమియించు మనంబుతోడ నా

హరి చమదెంచె సత్యసముదంచితకాంచనసౌధవీధికిన్- [ఆ.1]


మ. ఎలదేట ల్తమవాలుగన్గవలపై నిందీపరభ్రాంతిచే

మెలగం జేరల గప్పుకో నలవిగామిం జీదఱం జెంది యి చ్చల గాంక్షించిరి నిర్నిమేషజలజాస్య ల్మానుషత్వంబు ల

య్యళిభీతి న్ముకుళీకృతాక్షి యగుసత్యాకాంత నీక్షించుచున్. [అ.4]


ఉ. తానటె పారిజాతవసుధారుహముం గొనిపోవువాడు క

న్గానడు యాదవుం డనుచు గన్నులువేయుసు జేవురింప వై

శ్వానర ధర్మ దైత్యవర వారిధి పానిల యక్షనాయ కే

శానులదిక్కు చూచి కులిశంబు కరంబున బూన్చి పట్టినన్. [ఆ.4]


ఉ. సొమ్మన నెద్ది యే ననగ సొమ్మున కెవ్వండ గర్త నీవు నీ

సొ మ్మఖిలప్రపంచమును శూరకులంబు నలంకరించు నీ

వమ్మహి నుండు నంతకు ననన్యదురాపము పారిజాతభూ

జమ్మును నుండు నన్న వికసన్ముఖుడై హరి వీడుకొల్పుచున్. [ఆ.5]

                       _____________