ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/అల్లసాని పెద్దన్న

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2. అల్లసాని పెద్దన్న

అల్లసాని పెద్దనార్యుడు నందవరీక నియోగిబ్రాహ్మణుడు; చొక్కనామాత్యుని పుత్రుడు; బళ్లారి ప్రాంతములయందున్న దూపాడు పరగణాలోని దొరాలగ్రామ మీతని జన్మస్థలము; కృష్ణదేవరాయల యాస్థానకవీశ్వరులలోనెల్ల నితడు ముఖ్యుడు. ఈతడు కృష్ణదేవరాయల యనంతరముగూడ కొంతకాలము జీవించుయుండుటచేత, ఇంచుమించుగా 1535 వ సంవత్సరము వరకును బ్రతికియుండెనని చెప్పవచ్చును. కృష్ణదేవరాయలు మృతి నొందిన తరువాత నీతడు చెప్పిన జాలిని పుట్టించెడి యీక్రింది పద్యమీతడు రాయలయనంతరమున జీవించియున్నట్టు తెలుపుచున్నది-


సీ. ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి

కే లూత యొసగి యెక్కించుకొనియె

మనుచరిత్రం బందుకొనువేళ బుర మేగ

బల్లకి తనకేల బట్టియెత్తె

బిరుదైన కవిగండ పెండేరమున కీవె

తగు దని తానె పాదమున దొడిగె

గోకటగ్రామా ద్యనే కాగ్రహారము

లడిగినసీమలయందు నిచ్చె

నాంధ్రకవితాపితామహ యల్లసాని

పెద్దనకవీంద్ర యని నన్ను బిలుచునట్టి

కృష్ణరాయలతో దివి కేగలేక

బ్రతికియుండితి జీవచ్ఛవంబ నగుచు.


అంతేకాక కృష్ణదేవరాయలు లోకాంతరగతుడు కాగానే కటకమునుండి గజపతి దండెత్తివచ్చినట్లును, అల్లసాని పెద్దన యీ క్రింది పద్యమును వ్రాసిపంపగా నతడు సిగ్గుపడి మరలిపోయినట్టును జెప్పుచున్నారు:-


సీ.రాయరావుతుగండరాచయేనుగువచ్చి

యారట్లకోట గోరాడునాడు

సంపెటనరపాలసార్వభౌముడు వచ్చి

సింహాద్రి జయశిల జేర్చునాడు

సెలగోలుసింహంబు చేరి ధిక్కృతి గంచు

తల్పుల గరుల డీకొల్పునాడు

ఘనతరనిర్భరగండపెండెర మిచ్చి

కూతు రాయలకును గూర్చునాడు

నొడ లెఱుంగవొ చచ్చితో యుర్వి లేవొ

చేరజాలక తల చెడి జీర్ణమైతొ

కన్నడం బెట్లుచొచ్చెదు గజపతీంద్ర

తెఱచినిలుకుక్క చొచ్చిన తెఱగుతోప.


ఈ కవి రూజునొద్ద మిక్కిలి గౌరవముపొందినవా డయి, రాజు చెప్పుమన్నప్పుడు గాక తనయిష్టమువచ్చినప్పుడు మాత్రమే కవిత్వము చెప్పు స్వాతంత్ర్యము గలవాడనియు, రాజొకనాడు కృతి చెప్పుమనివేడగా నతడు చెప్పక యీ క్రిందిపద్యమున జెప్పననియు వాడుక గలదు:-


చ. నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చుక

ప్పురవిడె మాత్మ కిం పయినభోజన ముయ్యెలమంచ మొప్పత

ప్పరయురసజ్ఞ లూహ తెలియంగలలేఖకపాఠకోత్తముల్

దొరకినగాక యూరక కృతు ల్రచియింపుమటన్న శక్యమే?


ఈ కవియే కవిత్వ ముండవలసిన రీతినిగూర్చి యీక్రింది పద్యమును గూర్చెనని చెప్పుదురు:చ.ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూడముగాక ద్రావిడీ

స్తనగతి దేటగాక యరచాటగునాంధ్రవధూటిచొక్కపుం

జనుగవలీల గూడతయు జాటుతనంబును లేక యుండ జె

ప్పినయదెపో కవిత్వ మనిపించు నగిం చటుగాక యుండినన్.


ఈ పద్యము వేంకటనాథకవికృత మగు పంచతంత్రమునందు గానబడుచున్నది. పెద్దనార్యుడు సంస్కృతాంధ్రములయం దసమానసాహిత్యము గలవాడు. ఇత డొకనాడు కృష్ణదేవరాయల యాస్థానములో సకలకవీశ్వరులు నుండగా రాజు కోరికమీద నుభయభాషా పాండిత్యము వెల్లడి యగునట్లుగా నొక యుత్పలమాలిక నాశుకవిత్వముగా జెప్పి సభవారినందఱిని మెప్పించి కాలికి బిరుదందె వేసికొన్నవాడు. రాజు కవిగండపెండేరమును బసిడిపళ్లెరమున నునిచి, సంస్కృతాంధ్రములందు సమానముగా కవిత్వము చెప్పగలవారు దీనిని ధరింపనర్హులని పలికినప్పుడు పెద్దనార్యుడు లేచి యీక్రింది యుత్పలమాలికను జదువగా రాజు మెచ్చి తానే యాకవిగండపెండేరమును కవిపాదమున దొడిగెనట-


ఉ. పూతమెఱుంగులున్ బసరుపూపబెడంగులు చూపునట్టివా

కైతలు జగ్గునిగ్గు నెనగావలె గమ్మున గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురా:హొయల్ చెలియారజంపుని

ద్దాతరితీపులంబలెను దారసిలన్వలె లో దలంచినన్

బాతిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకలోనిపల్లటీ

కూత లనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్

జేతికొలంది గౌగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్ని మే

ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టిచూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱదొండపండువలె వాచవిగావలె బంట నూదినన్ గాతల దమ్మిచూలిదొరకైవసపుంజవరాలి సిబ్బెపు

న్మే తెలియబ్బురంపుజిగినిబ్బరపుబ్బగుగబ్బిగుబ్బపొం

బూతలనున్న కాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నబంతి బయకారపు గన్నడగౌళపంతుకా

సాతత తానతానల పసం దివుటాడెడు గోటమీటు బల్

మ్రోతలునుం బలెన్ హరుపు మొల్లముగావలె నచ్చతెన్గు లీ

రీతిగ సంస్కృతం బుపచరించినపట్టున భారతీవధూ

టీ తపనీయ గర్భనికటీభవదానస పర్వసాహితీ

భౌతికనాటకప్రకరభారతభారత సమ్మతప్రభా

శీతనగాత్మజా గిరిశశేఖర శీతమయూఖ రేఖికా

పాతసుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్భటీ

జాతకతాళయుగ్మ లయసంగతి మంచువిపంచికామృదం

గాతత తేహిత త్తహిత హాధిత దంధణు ధాణుదింధిమి

వ్రాత నయానుకూలపద వారకుహూద్వహ హరికింకిణీ

నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝూళఝళీమరంద సం

ఘాతవియద్ధునీ చకచకద్విక చోత్పల సారసంగ్రహా

యాతకుమారగంధవహ హారిసుగంధ విలాసయుక్తమై

చేతము చల్ల జేయవలె జిల్లున జల్లవలె న్మనోహర

ద్యోతక గోస్తనీఫల మధుద్రవ గోఘృత పాయసప్రసా

రాతి రసప్రసార రుచిరప్రతిమంబుగ సారెసారెకున్.


పెద్దనార్యుడు హరికథాసారము, స్వారోచిషమనుచరిత్రము మొదలైన పెక్కుగ్రంథములను రచియించెను. వానిలోనెల్ల మనుచరిత్రము మిక్కిలి ప్రసిద్ధమై యెల్లయెడల వ్యాపించి యున్నది. ఈయనకుం బూర్వమునం దున్నకవు లెవ్వరును స్వకల్పనమును విశేషముగా జేర్చి ప్రబంధములను రచియించి యుండలేదు. వారు పురాణేతిహసాదులను మాత్రము తెనిగించిరి. ఈతడే మార్కండేయ పురాణమునుండి స్వారోచిష మనుసంభవ కథను గైకొని పెంచి స్వకపోలకల్పనతో మొట్టమొదట మనుచరిత్రమును బ్రబంధరూపమున రచియించిన కవి యగుట చేత నీతని కాంధ్రకవితాపితామహు డన్న బిరుదనామము కలిగినది. ఈతనికాలము మొదలుకొని రామరాజభూషణుడు వసుచరిత్రము చేయువఱకును గల కవులందఱును జాలవఱకు దమ ప్రబంధములను మనుచరిత్రరీతినే చేసిరి. ఈ కవి జన్మముచేత స్మార్తుడే యయినను, నడుమ వైష్ణవము పుచ్చుకొని వైష్ణవాగ్రేసరుడయి విష్ణ్వాలయములకు భూదానాదులను జేసెను. ఈవిషయమే యెకంజీ దొరవారు సంపాదించి యుంచిన రాజకీయప్రాగ్దేశపుస్తక భాండాగారమునందలి వ్రాతపుస్తక ములయందు దెలుపబడియున్నది. అందున్న కోకటాగ్రహారమును గూర్చిన యంశము నిందు క్రింద వ్రాయుచున్నాను-


"అల్లసాని పెద్దయ్యంగారు బ్రాహ్మణుడు, నందవరీకుడు, చొక్కరాజుగారి కొమారుడు. కోకటగ్రామమును శ్రీకృష్ణదేవరాయలవారీ కవీశ్వరుని కియ్యగా, అతడు వైష్ణవము పుచ్చుకొని యీగ్రామము శ్రీవైష్ణవుల కగ్రహారము చేసియిచ్చెను. అప్పుడు దానికి పెట్టినక్రొత్తపేరు శఠగోపపురము. ఈ కవి శాలివాహనశకవర్షములు 1440 బహుధాన్యసంవత్సర వైశాఘశుద్ధ 15 లు నాడు ఈ గ్రామమునందుండు పకలేశ్వరస్వామికి నైవేద్య దీపారాధనలకై రెండు పుట్లచేను ధారపోసియిచ్చి సదరు దేవాలయములో శిలాశాసనము వేయించినాడు. పయిసంవత్సరము కార్తికశుద్ధ12 శి నాడు చన్నకేశవస్వామికి నాలుగున్నర పుట్లభూమి ధారపోసి శాసనము వేయించినాడు...... కృష్ణదేవరాయలతర్వాత సదాశివదేవరాయల కాలములోను, రామరాయలకాలములోను, నంద్యాలరాజైన మట్లఅనంతరాజు కాలములోను కోకటాగ్రహారము బ్రాహ్మణులకు జెల్లెను." ఈకవి కోకటాగ్రహారమునకు శఠగోపపురమని పేరు పెట్టుటయేకాక తన మనుచరిత్రములోను హరికథాసారములోనుగూడ శఠగోపయతిని దనగురువునుగా స్తుతించి యున్నాడు-


క. కొలుతు న్మద్గురు విద్యా

నిలయం గరుణాకటాక్ష నిబిడజ్యోత్స్నా

దళితాశ్రితజనదురిత

చ్ఛలగాఢధ్వాంతసమితి శఠగోపయతిన్. [మనుచరిత్ర]


క. శఠగోపయతికి శఠతరు

కుఠారకోపమమతికిని గురుమతహృ త్క

ర్మఠనిరతికి జతురాగమ

పఠనాయతనియతికి నజపాసంభృతికిన్. [హరికథాసారము]


లక్షణగ్రంథములయం దక్కడక్కడ* నుదాహరింపబడిన పద్యములు లభించుటయేకాని హరికథాసారము పూర్ణముగా దొరికినదికాదు. హరికథాసారములోని యీరెండు పద్యములును రంగరాట్చందస్సునం దుదాహరింపబడి యున్నవి-


క. అంబరముపగుల నార్చి ప్ర

లంబాసురు డాగ్రహము వెలయ గదిరినవే

ళం బలరాముడు చేముస

లంబున వానితల ద్రుంచె లావు మెఱయగన్. [హరికథాసారము. ఆ 4]


క. తెంపరియై మది యింత చ

లింపక యనిలోనదెగియె నెవ్వ డతడు నై

లింప సభ నుండు ననుడు బ

దంపడి యాచార్యుతోడ దా ని ట్లనియెన్. [హరికథాసారము] ఈకవియే మొట్టమొదట దెలుగు గ్రంథములలో తురకమాటలు లోనగు నన్యభాషాపదములను స్వేచ్ఛముగా బ్రయోగింప నారంభించినాడు. ఆంధ్రకవితాపితామహుని యీక్రింది చాటుపద్యములో దురుష్కభాషావాక్యమే వేయబడినది.


మ. సమరక్షోణిని గృష్ణరాయలభుజాశాతాసిచే బడ్డ దు

ర్దమదోర్దండపుళిందకోటియవసవ్రాతంబు సస్తాశ్వ మా

ర్గమునం గాంచి శబాసహో హరిహరంగాఖూబు ఖోడాకి తే

తుముకీబాయిల బాయిదేమలికియందు ర్మింటికిం బోవుచున్.


ఈతని జూచి యాకాలమునందలి యితరకవులును దమచాటు పద్యములలోను గ్రంథములలోను యవనభాషావాక్యాదులను జొప్పించిరి. అట్టివారిలో నొక్క డగు నందితిమ్మన్న యొకచాటుపద్యములో-


శా. రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్రక్రూరఖడ్గాహిచే

గాయం బూడ్చి కళింగదేశనృపతుల్ కానిఝ్ఝరీపోషణీ

మాయాభీకుముటూకులోటుకుహుటూ మాయాపటా జాహరే

మాయాగ్గేయ మడే యటండ్రు దివి రంభాజారునిన్ యక్షునిన్.


అన చెప్పియున్నాడు. ఈలాగుననే పెద్దనార్యుడు గ్రంథములలో నన్యభాషాపదములను బ్రయోగించినందుకు మనుచరిత్రములోని యీక్రిందిపద్యమును దృష్టాంతముగా జూపవచ్చును-


సీ. పచ్చనిహురుమంజివనివాగెపక్కెర పారసిపల్లంబు పట్టమయము

రాణ నొప్పారు పైఠాణంబుసింగిణి తళుకులకోరీలతరకసంబు

మిహి పసిండిపరుంజు మొహదాకెలంకుల ఠావుగుజ్జరివన్నె కేవడంబు

డా కెలంకునసిరాజీకరాచురకత్తి కుఱగట గ్రొవ్వాడి గొఱకలపొది

పీలికుంచె తలాటంబు పేరొజంబు

మణులమొగముట్టు బన్ని సాహిణియొకండు కర్తయెదుటికి గొనివచ్చె గంధవాహ

బాంధవం బగునమ్మహాసైంధవంబు. [మనుచరిత్రము. ఆ.4]


ఈయనను జూచి యాకాలపువా డయిన ధూర్జటికవియు దనకాళహస్తి మాహాత్మ్యమునం దీక్రిందిరీతి పద్యములం దన్యభాషాపదములు చేర్చి కూర్చినాడు-


సీ. బిజమాడుదేవర నిజకృపామహిమ జెన్నారునాయిల్లు బిడారునీకు

నాకునీపాదార్చనముసేయనడలింగమూర్తి చేకుఱెవచ్చిమూర్తమాడి

యొడయచిత్తేశ నాయునికి నీమజ్జనమాడు శివార్చన మాడుబేకు

విచ్చేయు డిది బూదివీడియం బందుకో జంగమస్వామి నాసదనమునకు


నోగిరంబులు మంచిమే లోగిరమున

నావటించెద బదుడు మీ రారగింప

బ్రతిదినంబును జంగమార్చనము లేక

దనువు వడనొల్ల రూపకందర్ప యనగ. [కాళహస్తిమాహాత్మ్యము]


ఈయన మనుచరిత్రమునుగూర్చి వ్రాయుచు నొకరు "కొన్ని యెడల నైషధమార్కండేయ పురాణములయందలి వాక్యములకును నిందలి వాక్యములకును సుంతయేనియు భేదమగపడక" యున్నదని యించుక దోషారోపణము చేసియున్నారు. మార్కండేయ పురాణము నందు విపులముగా జెప్పబడిన స్వారోచిషమను సంభవకథనే గ్రహించి మారన తెనిగించిన యా పురాణమును జదివియే పెద్దన మనుచరిత్రమును రచియించినందున నందలి కొన్ని వాక్యము లిందు బడియున్నవి. అంతేకాక యాకవి శ్రీనాథుని కవిత్వమునం దత్యాదరము కలవాడయి యున్నట్లీతని గ్రంథపఠనమువలన స్పష్టముగా గానవచ్చుచున్నది. మొట్టమొదట తెనుగు కవిత్వమునందు సాంస్కృతిక దీర్ఘసమాసములను విస్తారముగా నుపయోగించినవాడు శ్రీనాధుడు. ఆతని కవనరచనయందత్యాదరము కలవాడయి పెద్దన యాతని గ్రంధములను బలుమాఱు చదివి యొక్క చతుర్థాశ్వాసమునుదక్క దక్కినపుస్తకము నంతను, ఆతనివలెనే సంస్కృతపద భూయిష్ఠముగా రచియించి యుండుటచేత శ్రీనాథు డుపయోగించిన వాక్యములును గొన్ని మనుచరిత్రమునందు బడినవి. అంతమాత్రముచేత నీతనియందు గ్రంథచౌర్యము నారోపించుట న్యాయముకాదు. ఈత డొక్కడు మాత్రమేకాక యిటీవలి కవులనేకులు కొన్నిచోట్ల పూర్వకవుల వాక్యములను దమకబ్బములయందు జొప్పించియున్నారు. మఱియు నల్లసాని పెద్దనార్యుడు శ్రీనాథుని నైషధమునుండి కొన్ని వాక్యములను గ్రహించుటయేకాక యాతని పద్యములను జదివి యారీతి పద్యములనే పెక్కింటిని మనుచరిత్రమునందు గూర్చియున్నాడు. అందుకు నిదర్శనముగా నొకటి రెండుపద్యముల నిందు జూపుచున్నాను:-


సీ. నలినసంభవువాహనమువారువంబులు

కులముసాములు మాకు గునలయాక్షీ

చదలేటి బంగారుజలరుహంబులతూండ్లు

భోజనంబులు మాకు బువ్వబోడి

సత్యలోకముదాక సకలలోకంబులు

నాటపట్టులు మాకు నబ్జవదన

మధురాక్షరము లైనమామాటల వినంగ

నమృతాంధసులు యోగ్యు లనుమాంగి

భారతీదేవి ముంజేతి పలుకు చిలుక

సమదగజయాన సద్బ్రహ్మచారి మాకు

వేదశాస్త్ర పురాణాదివిద్య లెల్ల

దరుణి నీయాన ఘంటాపథంబు మాకు- [శృంగారవైషదము.ఆ.2] సీ. చిన్నివెన్నెలకందు వెన్ను దన్నిసుధాబ్ధి

బొడమినచెలువ తోబుట్టు మాకు

రహిపుట్టు జంత్రగాత్రముల ఱా ల్లరగించు

విమలగాంధర్వంబు విద్య మాకు

వనవిల్తుశాస్త్రంబు మినుకు లావర్తించు

పని వెన్నెతోడ బెట్టినది మాకు

హయమేధ రాజసూయము లన బేర్పడ్డ

సవనతంత్రంబు లుంకువలు మాకు

గనకనసీమ గల్పవృక్షములనీడ

బచ్చరాగట్టుగమి రచ్చపట్టుమాకు

పద్మసంభవవైకుంఠ భర్గసభలు

సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర- [మనుచరిత్రము.ఆ.2]


ఉ. వాని బ్రశంసచేయ దగు వాడు కృతార్థతముండు వానిచే

నీనిఖలంబు పావన మహీనకృపావిభవం బెలర్ప నె

వ్వానిగృహాంగణంబునకు వచ్చినత్రోవరజంబులందు నీ

మానితపాదయుగ్మక మమర్చు బ్రపుల్లసరోజదామమున్- [నైషధ. ఆ.3]


ఉ. వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయిన్

వాని దవంధ్యజీవనము వానిదెజన్మము వేరుసేయ కె

వ్వానిగృహాంతరంబున భవాదృశయోగిజనంబు పావన

స్నానవిధాన్నపానముల సంతస మొందుచు బోవు నిచ్చలున్- [మను.ఆ.1]


ఇట్టివాని నింకను బెక్కులు చూపవచ్చును. పెద్దన చెప్పిన పద్యములను గొన్నిటిని తెనాలి రామలింగకవి యాక్షేపించినట్లు కొన్ని కథలు గలవుగాని యవి విశ్వాసార్హములు గావు. అయినను దీనిం జదువు వారికి వినోదకరముగా నుండవచ్చునని యెంచి యందొక పద్యమును దానిమీది యాక్షేపణమును నిందుదాహరించు చున్నాను:-


క. కలనాటిధనము లక్కఱ| గలనాటికి దాచ గమలగర్భునివశమా

నెలనడిమినాటివెన్నెల| యలవడునే గాదెబోయ నమవసనిసికిన్.


అనుపద్యమును పెద్దన రచియింపగా నందలి "యమవసనిసి" యన్నప్రయోగము నవ ప్రయోగమునుగా భావించి రామకృష్ణకవి యపభ్రంశపదములతో గూడిన యీక్రిందిపద్యముచేత నాతని నాక్షేపించి యున్నాడని చెప్పుచున్నారు:-


క. ఎమితిని సెపితివి కపితము

బ్రమపడి వెఱిపుచ్చకాయ వడి దిని సెపితో

యుమెతక్కయ దిని సెపితో

యమవసనిసి యన్నమాట యలసని పెదనా.


"అమవసనిసి" యన్నమాట తప్పు కాకపోవుటచేతను, రామకృష్ణకవి యలసానిపెద్దన కాలములో నున్నవాడు కాకపోవుటచేతను, ఈకథ కేవలకల్పితమే కాని యిందు సత్య మెంతమాత్రమును లేదు. కృష్ణదేవరాయల యాస్థానమునకు వచ్చిన విద్వత్కవీశ్వరులను బరీక్షించుటకయి యాంధ్రకవితాపితామహుడె నియమింపబడుచు వచ్చెననియు, అత డావచ్చిన కవీశ్వరులకు నానావిధము లయిన సమస్యలనిచ్చి వారు పూరించిన పద్యపూరణములనుబట్టి వారి సామర్థ్యమునను నిర్ణయించుచు వచ్చెననియు జనశ్రుతి గలదు. ఒకనాడు రాధామాధవు డనుకవి తదాస్థానమునకు వచ్చినప్పుడు పరీక్షార్థముగా పెద్దన్న "నగరు" "తగరు" "తొగరు" "వగరు" అను పదములు ప్రాసస్థానములందుంచి రామాయణ పరముగా బద్యమును గూర్పు మనగా నాకవి యిట్లు చెప్పెనట:చ. సగరు పగాయె నింక విపినంబుల కేగుడు రాజ్యకాంక్షకుం

దగరు కుమారులార యని తల్లి వగ ల్మిగులంగ దోపగా

దొగరున రక్షగట్టి మది దోచక గద్గదఖిన్నకంఠయై

వగరుచుచున్న జూచి రఘువంశవరేణ్యుడు తల్లి కిట్లనున్.


అని చెప్పగా సంతోషించి యీప్రాసములతోనే భారత భాగవతపరముగా గూడ బద్యములను రచింపు మని యడుగగా నాకవీశ్వరుడు వరుసగా నీక్రింది రెండు పద్యములను జెప్పి తనప్రావీణ్యమును జూపెనట:-


చ. తొగరుచి కన్నుదోయి గడుదోచగ గర్ణుడు భీమసేనుపై

దగరు ధరాధరంబుపయి దాకినభ్ంగిని దాకి నొచ్చి తా

వగరుచుచున్ వెపం బరుగువాఱిన నచ్చటిరాజలోకముల్

నగరు సుయోధనాజ్ఞ మది నాటుటజేసి ధరాతలేశ్వరా.


చ. వగరపుమాత్రమే వరుడు వశ్యుడుకాడు సఖీనఖత్వ మె

న్న గరుడవాహనుండు మము నా డటు డించుటయెల్ల నుద్ధవా

తగ రని కాక మోహపులతాతనువైన విడంగ జూతురే

తొగరుచి యోషధీశునకు దోపగజేయునె వీడనాడగన్


అల్లసానిపెద్దన్నది మృదుశైలి; కవిత్వము సలక్షణముగాను మధురముగాను నుండును. ఈవిషయమునే కృష్ణరాయలు "కృతి రచింపుము మాకు శిరీషకుసుమవేశల సుధామయోక్తుల బెద్దనార్య" యన్నవాక్యము బోధించుచున్నది. మనుచరిత్రము శృంగారరస ప్రధానమయినదిగా నున్నది. ఆగ్రంథము సాధారణముగా సంస్కృతపద భూయిష్టముగా నున్నను, కొన్నిచోట్ల మనోహరముగా సంస్కృతాంధ్రపదములు రెండును సమానముగా గలిసినదిగాను నాలవయాశ్వాసము కేవలాంధ్రపదభూయిష్టమైనదిగాను నున్నది. ఈతని కవిత్వమునందలి పదవాక్యజటిలత్వమునుబట్టి "యల్లసానివాని యల్లిక బిగియును" అను ప్రసిద్ధి వచ్చినది. ఈయన కవితారీతిని దెలుపుట కయి మనుచరిత్రము నుండి కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను:-


చ. అటజని కాంచె భూమిసురు డంబరచుంబిశిరస్సరజ్ఝ రీ

పటలముహుర్ముహుర్లురదభంగతరంగమృదంగనిస్వన

స్ఫుటనటనానురూపపరిపుల్ల కలాపకలాపిజాలమున్

గటకచరత్క రేణుకరకంపితసాలము శీతశైలమున్. [ఆ.2.]


మ. అకలంకౌషధసత్త్వముం దెలియ మాయా ద్వార కావంతి కా

శి కురుక్షేత్ర గయా ప్రయాగముల నే సేవింప కుద్దండ గం

డక వేదండ వరాహ వాహరిపు ఖడ్గవ్యాఘ్ర మిమ్మంచు గొం

డకు రాజెల్లునె బుద్ధిజాడ్యజనితోన్మాదుల్గదా శ్రోత్రియుల్. [ఆ.2]


ఉ. ఎక్కడియూరు కాల్నిలువ కింటికి బోయెదనంచు బల్కె దీ

వక్కడి మీకుటీరనిలయంబులకు స్సరిరాకపోయెనే

యిక్కడిరత్నకందరము లిక్కడినందనచందనోత్కరం

బిక్కడి గాంగసైకతము లిక్కడియీలవలీనికుంజముల్. [ఆ.2]


ఉ. చేసితిజన్నముల్ తపము జేసితి నంటి దయావిహీనతం

జేసినపుణ్యము ల్ఫలము జెందునె పుణ్యము లెన్నియేనియుం

జేసినవాని సద్గతియె చేకుఱు భూతదయార్ద్రబుద్ధి నో

భూసురవర్య యింత తలపోయపు నీచదు వేల చెప్పుమా. [ఆ.2]


ఉ. ఎంతతపంబు చేసి జనియించినవారొకొ మర్త్యభామినుల్

కాంతు డవజ్ఞ జేసినను గాయము బాయుదు రే నమర్త్యనై

చింతలపంతలం జివికి సిగ్గరితి స్మృతిలేనినాదుచె

ల్వింతయు శూన్యగేహమున కెత్తినదీపిక యయ్యె నక్కటా. [ఆ.3]


ఉ. ఓయి దయావిహీనమతి యూరక యీపసిబిడ్డ గొట్టగా

జే యెటులాడె నీకు నిది చేసిన దేమి వృథాశపింతురే