Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/రావిపాటి తిప్పన్న

వికీసోర్స్ నుండి

రావిపాటి తిప్పన్న


ఈ తిప్పన్ననే త్రిపురాంతకుఁ డనియుఁ జెప్పదురు. ఈతఁడు చేసిన గ్రంథములలో త్రిపురాంతకోదాహరణము ముఖ్యమైనది. ఒక్కొక్క విభక్త్యంతమున నొక్కొక్క పద్యమును గలదయి ప్రతి పద్యము తరువాతను నొక్కొక్కకళికను దానితరువాత నొక్కొక్క యుక్కళికను గల గ్రంథ ముదాహరణ మని చెప్పఁబడుచుండెను. నన్నయాదులకుఁ బూర్వమునందును తత్కాలము నందును తెలుఁగున సాధారణముగా నుదాహరణగ్రంధములే ప్రబలముగా నుండి జనులచే నాదరింపఁబడుచుండెను. నన్నయాదులు భారతాది మహా కావ్యములను రచియింప నారంభించిన తరువాత నుదాహరణ గ్రంథములు మూలcబడి [1] క్షుద్రకావ్యములుగాఁ బరిగణింపఁబడుచుండెను. అయినను త్రిపురాంతకుఁడు శేషనార్యుఁడు మొదలైనవారు కొందఱప్పుడప్పుడుదాహరణ గ్రంథములను సహితము చేయుచు వచ్చిరి. ఈ తిప్పన యుదా హరణ గ్రంథమును గాక మదనవిజయము, చంద్రతారావళి, అంబికాశతకములను కూడ విరచించెను. ఈ కవి కాలమిదియని నిర్థారణ చేయుటకుఁ దగిన యాధారము లంతగాఁ గానరావు. అప్పకవి అప్పకవీయమున యతి ప్రాస ప్రకరణమైన మూcడవయాశ్వాసమున ననుస్వారసంబంధయతి కుదాహరణముగా రావిపాటి తిప్పన్న చాటుధార యని యీ క్రింది పద్యము నుదాహరించియున్నాcడు.

     మ. సరి బేసై రిపుడేల భాస్క_రులు? భాషానాధపుత్రా వసుం
         ధరయం దొక్కఁడు మంత్రియయ్యె వినుకొండ న్రామయామాత్యభా
         స్కరుఁడో?యౌ నయినన్ సహస్రకర శాఖ ల్లేవవే యున్నవే
         తిరమై దానము చేయచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయచో

ద్వాత్రింశన్మంత్రుల చరితములో రాయని భాస్కరుని కధయం దుదా హరింపఁబడిన యీ పద్యమున రామయామాత్యభాస్కరుఁ డనుటకు మాఱుగా రాయనామాత్యభాస్కరుఁడని యున్నది.

                  సీ. నిర్మించె నే మంత్రి నిరుపమప్రాకార
                               నవకంబు గా గోపీనాధపురము
                     గెలిచినాఁ డే మంత్రివిక్రమమునఁ
                               బ్రబలుఁడై యవనులబలము నెల్ల
                     నిలిపినాఁడే మంత్రి నియత వైభవమున
                               గోపికావల్లభుఁ గూర్మి వెలయ
                     పాలించె నే మంత్రి ప్రకటధర్మఖ్యాతి
                              మహిమ మీఱఁగ నాంధ్రమండలంబు

                     నతఁడు భూపాలమంత్రీంద్రసతతవినుత
                     ధీవిశారదుఁ డచ్యుతదేవరాయ
                     మాన్యహిత వర్తనుఁడు శౌర్యమహితయశుఁడు
                     భానుతేజుండు రాయనభాస్కరుండు.

అని కొండవీటిగోపీనాధస్వామివారి యాలయముఖద్వారశాఖయందు వ్రాయబడియున్న పద్యమునుబట్టి రామయభాస్కరుఁ డచ్యుత దేవరాయల కాలములో ననఁగా 1529 -వ సంవత్సరమునకుఁ దరువాత నుండుట స్పష్టము. సరిబేసై రన్న పద్యము రామయభాస్కరుని గూర్చినది గాక ద్వాత్రింశన్మంత్రుల చరితములో నున్నట్లు రాయన భాస్కరునిగూర్చిన దయిన పక్షమున

               శ్లో. శాకాబే వసువహ్ని వేదధరణీగణ్యేచ ధాత్రబ్దకే
                    వైశాఖే వినుకొండసీమని సుధీ ర్నాదెళ్ళ యప్పప్రభుః,
                    వాసిష్ఠాయ చ భర్తపూడి మఖిలం గ్రామం స్వనామాంకితం
                   ప్రాదా ద్రాయనభాన్కరాయ విదుషేష్టైశ్వర్యభోగాన్వితమ్.

అని నాదెళ్ళ యప్పయమంత్రి శాలివాహనశకము 1439 -వ సంవత్సరము నందు అనగా క్రీస్తుశకము 1516-వ సంవత్సరము ధాతృవత్సర వైశాఖ మాసమునందు వినుకొండ సీమలోని భర్తపూడి గ్రామమును రాయని భాస్కరపండితుని కిచ్చినట్టున్న దాన శాసనమునుబట్టి యతఁడు 1516-వ సంవత్సర ప్రాంతములం దుండుట స్పష్టము. రావిపాటి తిప్పన్న యీ రెండు కాలములలో నే కాలమునం దుండినను,1420 వ సంవత్సర ప్రాంతములయం దుండిన వల్లభామాత్యకవి యాతనిని తన క్రీడాభిరామములో క్రింది పద్యములో నిట్ట చెప్పట పొసఁగ నేరదు.

          ఉ. నన్నయభట్టతిక్కకవినాయకు లన్న హుళక్కిభాస్కరుం
              డన్నను జిమ్మపూడి యమరాధిపుఁ డన్నను సత్కవీశ్వరుల్
              నెన్నుదుటం గరాంజలులు [2] నిం తలుఁ జేయని రావిపాటి తి
              ప్పన్నయు నంతవాఁడ తగునా యిటు దోసపుమాట లాడఁగన్.

దీనినిబట్టి యాలోచింపఁగా 1420 వ సంవత్సరమునకుఁ బూర్వమునందు రామయభాస్కరుఁడో రాయని భాస్క_రుఁడో యెవ్వడో యొకఁ డుండి యుండవలెను. ఆ కాలమునందు రామయభాస్కరుఁ డెవ్వఁడును లేఁడు గాని 1386 వ సంవత్సరము మొదలుకొని రాజమహేంద్రవర రాజ్యమును పాలించిన కాటయవేమారెడ్డికాలములో రాయని భాస్కరుఁ డొకఁడున్నట్లీక్రింది పద్యమువలనఁ దేటపడుచున్నది.

          చ. కలయఁ బసిండిగంటమునఁ గాటయవేము సమక్షమందు స
              త్ఫలముగ రాయనప్రభునిబాచఁడు వ్రాసిన వ్రాల మ్రోఁతలున్
              గలుగలు గల్లుగల్లురనఁ గంటకమంత్రులగుండె లన్నియున్
              జలుజలు జల్లుజల్లురనె సత్కవివర్యులు మేలు మే లనన్.

పయి పద్యమునం దీ రాయనభాస్క_రుఁ డప్పకవీయములో నుదాహృత మైన వద్యమునందువలెనే వ్రాయుటయందు సుప్రసిద్ధుఁ డయినట్టు చెప్పఁ బడినందున రావిపాటి తిప్పన్న చెప్పిన సరిబేసైరన్న పద్య మీ రాయన భాస్క_రునిఁ గూర్చినదే యనియు నందుచేత తిప్పన్నకవి 1380 వ సంవత్సర ప్రాంతములయందుండెననియు నింతకంటె బ్రబలప్రమాణములు దొరకు వఱకును మన మూహింతము. ఈ రాయని భాస్కరుఁడు వ్రాయుటకే కాక దానము చేయుటకును రిపులను ఖడ్గముతో వేయుటకును గూడఁ బ్రఖ్యాతి చెందినవాఁడు. [ఇయ్యెడ 'ఆంధ్రకవి తరంగిణి" లో నిట్లున్నది. "ఈ చాటువు (కలయఁబసిండి గంటమున-) నాధారముగాఁ గొని శ్రీ వీరేశలింగముపంతులు గారు తిప్పన చాటుధారలో వర్ణితుడైన రాయన భాస్కరుఁ డీఁతడే యని నిర్ణయించి త్రిపురాంతకుని కాలము క్రీ శ.1380 ప్రాంతమని నిర్ణయించినారు. ఈ పద్యములోఁ గలముఁ ప్రస్తావనయేగాని కత్తివర్ణనము లేదు. అందుచేఁ ద్రిపురాంతకుని భాస్కరు డీఁతడు కాడు. మఱియు క్రీ శ. 1380 వఱకును ఆనవేమారెడ్డియే రాజ్యమునందున్నవాఁడు. ఆకాలములోఁ గాటయ వేముని కధికార ప్రసక్తి లేదు. ఇతఁడు అనపోతారెడ్డి కల్లుఁడు. అతని కుమారుడైన కుమారగిరి రెడ్డి రాజ్యమునకు వచ్చిన 1382 వ సంవత్సరము నుండియును, కుమారగిరిరెడ్డి వలన రాజమహేంద్రవర రాజ్యమును బడసిన కీ. శ. 1386- వ సంవత్సరమునకుఁ బిమ్మటను కాటయవేమన కధికార ప్రాప్తి కలిగినది. ఆపిమ్మట, తిప్పయ యీభాస్కరుని నుతించినాఁ డందు మేని త్రిపురాంతకుఁడు దాదాపుగా శ్రీనాధుని కాలమువాడగును. సమకాలిక గ్రంధము నాతc డాంధ్రీకరించుటయు, నాతనిని బొగడుటయు సంభవింపదు ... .... ... ఎట్లయినను, త్రిపురాంతకుఁడు ద్వితీయ ప్రతాప రుద్రుని కాలమునందున్నవాఁడని తలంచుటయే యుచితమని నాయుద్దేశము" [ ఆంధ్రకవి తరంగిణి నాలుగవ సంపుటము, పుటలు 41, 42] రాయని భాస్కరునిఁ గూర్చి కవులు చెప్పిన పద్యము లనేకము లున్నను జదువువారికి మనోహరముగా నుండునని వానిలోనుండి కొన్నిటి నించు క్రిందఁ బొందు పఱుచుచున్నాను-

       క. చేకొని రాయని బాచఁడు
           కాకాలు గుణించినపిన్న కాలమునాఁడే
           లా కేత్వ మియ్యనేరఁడు
           దాకును గొ మ్మియ్యఁ, డిట్టి దాతలు గలరే.

      క. ఏవ్రాలయినను వ్రాయును
           నా వ్రాయఁడు వ్రాసెనేని నవ్వున కయినన్
           సీ వ్రాసి తావ డియ్యఁడు
           భావజ్ఞుడు రాయనార్యభాస్కరుఁ డెపుడున్

       ఉ. రాజితకీర్తిశాలి యగు రాయని బాచ భవద్యశంబు ది
           క్పూజితమౌచు మించె సురభూధరభూధరభూధరేంద్రకాం
           తాజసు గోత్రరుగ్విభురథాంగరథాంగరధాంగశేషభా
           షాజలజాహితాహితతుషార తుషార తుషాంధాములనన్


       సీ. ఫణిరాజు తన శిరోమణి ఆర్థి కిచ్చునో
                      యనుచు విష్ణుని క్రింద అడఁగి యుండు
          కైలాసకుధర మెక్కడ నిచ్చునో యని
                      యుగ్రుఁ డక్కడc గావ లుండఁబూను;
          తనలోని మణుల నే తఱి నిచ్చునో యని
                      వనధి సంతతమును వణకుచుండు
          సురధరాధరము నెవ్వరి కిచ్చునో యని
                      తరణి యగ్గిరిచుట్టు దిరుగుచుండు

          నౌర! నీ దానవిఖ్యాతి యఖిలదిశల
          మించి వర్తించె నీ కీర్తి నెంచcదరమె?
          గాఢదారిద్య్రయామి నీ కాంతిచంద్ర
          భాగ్యదేవేంద్ర! రాయనభాస్కరేంద్ర!
 
      మ. అయలక్ష్మీనిధి రాయనప్రభుని బాచామాత్యుడ! శాంతమున్
          నియతిన్ బ్రాహ్మణపూజ చేయు టభివర్ణింపంగ శక్యంబె?
          త్ప్రియగేహంబున హేమపంజరమునన్ బెల్లర్చతప్రార్చత
          ప్రియమేధా యనుచుం బరించు శుకశారీకిన్నరీద్వంద్వముల్.

          శ్లో. కృతే యుగే బలి ర్దాతా
             త్రేతాయాం రఘనందనః,
             ద్వాపరే సూర్యపుత్రశ్చ
             కలౌ రాయనభాస్కరః.

ఇతఁడు 1516 వ సంవత్సరమునందుండినట్లు చెప్పఁబడిన రాయనిభాస్కరుని తాత యయి యుండును. ఈతని కాలమునందును దనకుఁ గొంత పూర్వమునందును నుండిన రావిపాటి తిప్పన్నకవిని సామాన్యక్షుద్రకావ్యకర్త యని జను లాతని కవిత్వమును తేలికగాఁ జూడగా నాతనిప్రేమాభిరామమును క్రీడాభిరామమను పేరఁ దెనిఁగించుచుండిన యభిమానముచేత వల్లభామాత్యకవి యాతనిని పూర్వకవులతో సమానుఁడుగాని సామాన్యుఁడు కాడని శ్లాఘించి యుండును. ఇట్లభిమానముచేతఁ చెప్పబడుటయే కాదు. తిప్పన కవిత్వము నిజముగానే శ్లాఘనీయముగా నున్నది.

    "ఆమంత్రి శేఖరుండు రావిపాటి త్రిపురాంతక దేవుండను కవీశ్వరుం డొనరించిన ప్రేమాభిరామనాటకమ్ము ననుసరించి క్రీడాభిరామంబను రూపకంబు తెనుంగు బాస రచియించినవాఁడు"

అని తిప్పనార్యుఁడు సంస్కృతమునఁ బ్రేమాభిరామనాటకమును రచించినట్టును దాని ననుసరించి వల్లభామాత్యకవి తెనుఁగున గ్రీడాభిరామమును రచించినట్టును క్రీడాభిరామప్రస్తావనలోఁ జెప్పబడినది. చిన్నతనములో తిప్పనకవియో యాతని తండ్రియో కడపటి ప్రతాపరుద్రుని యంత్యదశలో నోరుగంటిపురములో నుండుటచేత నాతని రాజధాని యైన యేకశిలానగరమును బ్రేమాభిరామములో రంగమునుగాఁ గవి చేకొని యుండును. కవికృతగ్రంథములలోనుండి కొన్ని పద్యముల నిందు బొందుపఱిచెదను.


1. త్రి పు రాం త కో దా హ ర ణ ము



            ఉ. శ్రీనగచక్రవర్తి తుదిశృంగము చూచెద నంచు నేటికిం
                బో ననిశంబు మానవుల పుట్టువుఁ జావును లేనిమందు నా
                చే ననుచుం బతాక యనుచేఁ దరుణాచల మెక్కి చీరుఁ బం
                చాననుఁ డిందుమౌళి త్రిపురాంతకదేవుఁడు భక్తలోకమున్

     కళిక. మఱియు సజ్జనభక్తగృహముల మరగి, తిరిగెడు కామధేనువుకఱద లెఱుఁగక
            వేఁడు దీనులఁ గదియుజంగవరత్నసానువు శైలజాముఖచంద్రరోచుల చవులఁ
            దవిలెడు నవచకోరము వేలుపుందపసులతలంపుల వెల్లిగొల్పెడు
            నమృతపూరము దేవతలు మువ్వురకు నవ్వలిదెస వెలుంగుచు నుండు
            నెక్కఱి భావవీధుల గలసి పలుకులఁ బట్టి చెప్పఁగరాని చక్కటి ఆఱు రేకుల
            మంత్రకుసుమము నందు వెలిఁగెడు చంచరీకము వేఱుసేయక యోగి
            జనములు వెదకి పొందెడి యూర్ధ్వలోకము.

ఉత్కళిక. అడుగుcదమ్ములఁ జొప్పవసి గని
            యడరి శునకాకృతులు గయికొని
            మీఱి చదువులు దవుల ముందటఁ
            బాఱు క్రోడము నేసి మందట
            లాడి తను మార్కొనఁగ వచ్చిన
            క్రీడి కోరిన వరము లిచ్చిన
            యాటవిక కులసార్వభౌముఁడు
            జూటభాస్వత్తు హినధాముఁడు.

        ఉ. ఆఱడియాస నీరసధరాధిపలోకమునిండ్లు వాకిళుల్
            దూఱుట మాని శ్రీనగము తూరుపువాకిలిఁ జొచ్చి పాపముల్
            నీఱుగఁ జేసి గంధవతినీటను గ్రుంకి మనంబులోని చి
            చ్చాఱఁగజేయు టొప్పుత్రిపురాంతకదేవునకై నమస్కృతుల్.

        ఉ. పోయెడుఁ గాల మన్యగతిఁ బొంధదు మోక్షము వెండికొండకుం
            బోయెడు త్రోవ కెఱుఁగబోలదు మానవులార రండు లేఁ
            బ్రాయపుగొండ కంచు శివభక్తులలోపల నద్రిరాజక
            న్యాయు పుణ్యమూర్తివలనం గడతేఱెడు జన్మఖేదముల్.

2. చం ద్ర తా రా వ ళి

       మ. చరమక్ష్మాధరచారుసింహముఖదంష్ట్రాకోటియో నాఁగ సం
           బరశార్దూలనఖంబొ నాఁగఁ దిమిరేభప్రస్ఫురద్గర్వసం
           హరణ! క్రూరతరాంకుశం బనఁగ నుద్యల్లీల నీరేఖ ని
           త్యరుచిం బొల్పగుఁ బెంపగున్ విదియచంద్రా ! రోహిణీ వల్లభా !

       మ. అమితధ్వాంతతమాలవల్లిలవనవ్యాపారపారీణదా
           త్రమొ సౌగంధికషండకుట్మలకుటీరాజీసముద్ఘాటన
           క్రమనిర్యాణధురీణ కుంచికయొ నాఁగం బెంపునన్ నీ కళా
           రమణీయత్వము చూడ నొప్పెసఁగుఁ జంద్రా ! రోహిణీ వల్లభా !

       మ. రతినాధుం డను మాయజోగి చదలం ద్రైలోక్యవశ్యాంజనం
           బతియత్నంబునఁ గూర్చి మౌక్తికమయం బై యున్న ప్రాంతంబునన్
           మతకం బేర్పడఁ బెట్టి దాఁచెనన నీ మధ్యంబునన్ మచ్చ సం
           తతముం గన్నులపండువై వెలయుఁ జంద్రా ! రోహిణీ వల్లభా !


3. అం బి కా శ త క ము


       ఉ. ఱెప్పలబోరుఁదల్పు లిసిఱింతలు వాజెడుచూపుఁగుంచియం
          ద్రిప్పి తళుక్కనం దెఱచి తిన్నని మోమునఁ గాయువెన్నెలల్
          ముప్పిరిగొన్న వేడుకలు మూఁగిన సిగ్గసియాడఁ బ్రీతి నీ
          వప్పర మేశుఁ జూచి తను వర్ధము గొంటి పొసంగ నంబికా !

      చ. బెడఁగగు రత్న దర్పణము బేరినవెన్నెల పోసి నిచ్చలుం
          దుడువక పాలసంద్రమునఁ దోఁచి సుధాకరుమేనికందు పోఁ
          గడుగక నేరెటేట సితకంజము ముంపక నైజకాంతి యై
          తొడరినఁ దల్లి ! నీమొగముతో సరిపోల్పఁగఁ జాలు నంబికా !

       ఉ. కూడెడివెండ్రుకల్ నిడదకూఁకటిఁ బ్రోవఁగ బొడ్డుపై వళుల్
          జాడలు దోపఁ గ్రొమ్మొలకచన్నులు మించు దొలంక సిగ్గునం
          జూడఁగ నేరముల్ మెఱుఁగుఁజూపుల నీన హిమాద్రియింట నీ
          వాడుట శూలికిన్ మనము వాడుట గాదె తలంప నంబికా !


4. మ ద న వి జ య ము


ఈ క్రింది పద్యములు రెండును మదనవిజయములోనివని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు త్రిపురాంతకోదాహరణ పీఠికలో నుదాహరించిరి.

       క. సతి గుణవతి యగునేనియు
          బతి కది రత్నంబ ప్రాణబంధువ యమృతం;
          బతివయ దుర్గుణి యగునేఁ
          బతి కెడపని చిచ్చు కాలుపక యది కాల్చున్

      మ. గుణమున్ సుందరరూపమున్ విభవముం గూటంబు సౌభాగ్యల
          క్షణముం జారుచరిత్రమున్ వినయమున్ జాతుర్యమున్ ధర్మభూ
          షణముం గల్గి పతివ్రతామహిమ మించన్ గల్గెనేఁ దత్సతీ
          మణి చింతామణి, దాని దాల్పఁ గలగన్ మర్త్యుండె ధన్యుండిలన్

  1. [క్షుద్ర కావ్యమనఁగా చిన్నకావ్యము. నీచమైన కావ్యమని యర్థము చేసికొనుట పొరపాటు.]
  2. [నింతురు జేయని అని పాఠాంతరము.]