ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/అనంతామాత్యుఁడు

వికీసోర్స్ నుండి

అనంతామాత్యుఁడు


అనంతామాత్యుఁడు పూర్వకవులలో నొకఁడు. ఈతడాఱువేల నియోగి బ్రాహ్మణుఁడు. ఈతని తండ్రి తిక్కన్న. తాత ముమ్మడన్న. ముత్తాత బయ్యన్న- ఈ బయ్యన్న మంత్రియై నట్టును, తిక్కన సోమయాజుల కాలములో నున్నట్లును ఈకవి భోజరాజీయము నందీక్రింది పద్యమునఁ జెప్పి యున్నాcడు.

     చ. క్షితిఁ గ్రతు[1]కర్తనానుమతి చేకొని పంచమవేదమైన భా
         రతముఁ దెనుంగుభాషాభిరామముగా రచియించినట్టి యు
         న్నతచరితుండు తిక్కకవినాయకుఁ డాదట మెచ్చి భవ్యభా
         రతిఁ యనఁ బేరు గన్నకవిరత్నము బయ్యనమంత్రి యల్పుఁడే.

కవిబ్రహ్మ యయిన తిక్కన సోమయాజిచేత భావ్యభారతి యని మెప్పు వడిసినంతటి మహాకవి బయ్యనచే రచియింపఁబడిన గ్రంథ మొకటి యుండిన యెడల నిప్పుడు దాని పేరయినను దెలియరాకున్నది. ఈ బయ్యన కవి యగుటయే కాక దండనాథుడు కూడ నయి యుండునని కవి యీ పద్యమునఁ జెప్పెను-

     చ. శరధిసుత స్వరించు లజాతవిలోచనుమాడ్కి శీతభూ
         ధరజఁ బరిగ్రహించు హిమధామకళాధరుపోల్కి సద్గుణా
         భరణ పవిత్రమూర్తి కులపాలిక నాఁ దగు ప్రోలమాంబికన్
         బరిణయమయ్యె నెఁయ్యమున బయ్యచమూపతి వైభవోన్నతిన్

ఈకవి తన తండ్రియైన తిక్కన కృష్ణా మండలములోని శ్రీకాకుళమునకొడయఁ డైన యంధ్ర వల్లభుని సేవ చేయుచుండినట్టు[2]ను తన తల్లి యైన మల్లమాంబ యక్కదండనాధుని పుత్రి యైనట్టును నీక్రింది పద్యములలో పయి గ్రంథమునందే చెప్పియున్నాఁడు.

              సీ. విలసితం బగు కృష్ణవేణి మలాపహా
                               రిణి భీమరథి నా ధరిత్రియందుఁ
                  దనరు నదీత్రయాంతర్వేది యగు పావ
                               నక్షేత్రమున శోభనముల కెల్ల
                  ధర నివాసంబగు పెరుమగూరిపురంబు
                               నందు విద్వజ్జనానందమైన
                  జీవనస్థితిచేతఁ జెన్నొంది వంశక
                               ర్తృత్వ సంపత్తిఁ బ్రభుత్వ మొంది

                  నెమ్మి బ్రత్యక్షపరమపదమ్మనంగ
                  నొప్పు శ్రీకాకుళంబున కొడయఁడైన
                  యంధ్రవల్లభహరి సేవ నలరచుండుఁ
                  బెక్కుభంగుల ముమ్మడి తిక్కవిభుఁడు.

              సీ. శ్రీవత్సగోత్రాబ్ధి శీతాంశుఁ డగు నక్క
                               దండాధినాథుఁ డీ తరుణితండ్రి
                  లావణ్యగుణపుణ్యలక్షణాన్విత యైన
                               యక్కమాంబిక యీ లతాంగితల్లి
                  చిరకీర్తినిరతులు చిట్టనమంత్రియు
                               నయ్యలార్యుఁడు నాతికగ్రజన్ము
                  లచ్యుతాంఘ్రిసరోరుహార్చనారతుఁడు త
                               మ్మనమంత్రి యీ యింతి యనుఁగుదమ్ముఁ

                  డనఘు డగు కోటకరుణాకరార్యుఁ డను ఘ
                  నుండు ముదునూరి పెద్దవిభుండు నివ్వ
                  ధూమణికిఁ గూర్మిగల మేనమామ లనిన
                  మగువ లెనయె తిక్కనమంత్రి మల్లమకును.

ఈ కవి తామాఱుగురన్నదమ్ము లయినట్లీ క్రింది పద్యములలోఁ జెప్పుకొనెను.

            ఉ. భూనుతకీర్తి ముమ్మడివిభుండు మదగ్రజుఁ డేను వైష్ణవ
                ధ్యాన సమూహితాత్ముఁడ ననంతసమాఖ్యుడ నాదుతమ్ముల
                జ్ఞానవిదూరు లక్కనయు సత్కవి చిట్టనయున్ వివేక వి
                ద్యానిధి రామచంద్రుఁడు నుదారుఁడు లక్ష్మణనామధేయుఁడున్.

            క. ఈ యార్వురు నొక్కొక్కఁడు
                వేయిండ్లకు మొదలుగాcగ వెలయుదురని కా
                దే యాాఱువేలపే రిడి
                రీ యన్వయమునకు నేష్య మెఱిగిన పెద్దల్.

ఈ కవి శ్రీనాధునికాలమునం దున్నవాఁడో యాతనికంటెఁ గొంచెము పూర్వమునం దున్నవాఁడో యని తెలియవచ్చుచున్నది. [ఈతని 'రసాభరణము' చివఱఁగల "జానొందన్-" అనుపద్యమునుబట్టిహూణశకము 1435 జనవరి 25 తేదీని రసాభరణమును ధ్రువపట్టన కంకిత మిచ్చినట్లు తెలియు చున్నదనియు, అప్పటి కీతనికి 50 సంవత్సరముల వయస్సుండెనని తలంప వచ్చుననియు, అది నిజమైనచో ఇతఁడు శ్రీనాధునికంటెఁ గొంచెము చిన్న వాఁడై యుండి, ఆతని కాలమున గ్రంథరచన సాగించి యుండునని చెప్పటకు సంశయింప నక్కఱలేదనియు "ఆంధ్రకవి తరంగిణి' కర్తల యాశయమైనట్లు తెలియుచున్నది.[ చూ. అయిదవ సంపుటము పుట 260.]

'జానొందన్' అను పద్యములోఁ బేర్కొనబడిన 'ధ్రువపట్టణ' మేదియో తెలియకున్నది. ఇది గుంటూరు మండలములో కృష్ణానదీ పాంతమునఁ గల ధూళిపూఁడి యను గ్రామమా? యని యూహ పొడముచున్నదని రసాభరణ పీఠికలో శ్రీకోపల్లె శివకామేశ్వరరావుగారు తెల్పియున్నారు. ధ్రువపురి కృష్ణా మండలములోని దరువూరని ఛందోదర్పణ పీఠికలో శ్రీనిడదవోలు వెంకట రావుగారు తెల్పియున్నారు. ధ్రువశబ్దము నకు "మఱ్ఱి మోడు" అను రెండ ర్థము లున్నందున మఱ్ఱిపూడి లేక మఱ్ఱివాడ లేక మోడుమూడి - అను గ్రామములలో నొకటియయి యుండవచ్చుననియు, మొత్తముపై నితఁడు కృష్ణామండల నివాసియనియు "ఆంధ్రకవి తరంగిణి" కారుల యాశయము.] ఈతనికవిత్వము రసవంతమై నిర్దుష్ట మయి మృదుపదకలితమయి హృదయరంజకముగా నున్నది.

ఈతఁడు రచియించిస గ్రంధములలో రసాభరణము, భోజరాజీయము, ప్రధానము లయినవి. రసాభరణము శృంగారాది రసాదులనుగూర్చి చెప్పఁబడిన లక్షణగ్రంధము. భోజరాజీయము వింతకధలను గలిగి చమత్కారముగా నుండును. ఈతఁడు భోజరాజీయమునం దెఱ్ఱాప్రెగడ వఱకును గల కవుల నీక్రింది పద్యముచేత స్తుతించి యున్నాఁడు.

 ఉ. నన్నయభట్టుఁ దిక్కకవినాయకు భాస్కరు రంగనాధుఁ బే
     రెన్నిక కెక్కినట్టి యమరేశ్వరు నెఱ్ఱనమంత్రి నాదిగాఁఁ
     జన్నకవీంద్రుల న్నవరసస్పుటవాణు లనంగ ధాత్రిలో
     నున్న కవీంద్రులం దలఁతు నుల్ల మెలర్పఁగ వాగ్విభూతికిన్.

అమరేశ్వరుని మహాకవినిగా ననేకులు పొగడి యున్నారు. కాని యాత డేకాలమునం దుండెనో, ఏ యే గ్రంథములను రచియించెనో, సరిగాఁ దెలియవచ్చినది కాదు. అమరేశ్వరకృతమైన విక్రమసేనములోని దని యొకానొక లక్షణగ్రంధమునం దొక పద్య ముదాహరింపబడియున్నది. ఇంకొక యుదాహరణ గ్రంథములో మఱికొన్ని పద్యము లుదాహరింపఁ బడినవి. అమరేశ్వరుని గ్రంధములవలెనే పూర్వకవుల గ్రంధము లనేకములు పేరు లేకుండ నశించి యుండును.

ఆంధ్రకవులలో ముగ్గురు నలుగురు మాత్రమే తమ కృతులలోఁ దా మున్న కాలమును వేసికొని యున్నారు. అట్టి కవులలో ననంతామాత్యుఁ డొకడు. ఈతఁడు రసాభరణమును శాలివాహనశకము 1356-వ సంవత్సరమునందనగా గ్రీస్తుశకము 1434-వ సంవత్సరమునందు రచియించినట్లా పుస్తకములోని యీ దిగువ పద్యముపలనఁ దెలియవచ్చుచున్నది.

       శా. జానొందన్ శకవర్షముల్ బుుతుశరజ్వాలేందులై యొప్ప న
           య్యానందాబ్దమునందు మాఘమునఁ గృష్ణైకాదశీభౌమయు
           క్తానామామృత వేళ నీకృతి యనంతాఖ్యుండు సమ్యగ్రస
           శ్రీనిండం ధ్రువపట్టణాధిపున కిచ్చెన్ భక్తిపూర్వంబుగన్.

కాఁబట్టి యీ కవి పదునేనవ శతాబ్దారంభమునం దుండినవాఁడు. 1434-వ సంవత్సరమునం దుండిన యీ కవియెుక్క ముత్తాత యగు బయ్యన యీతని కన్న నూటయేఁబది సంవత్సరములకంటె నధికపూర్వఁ డగుట పొసఁగక పోవుటచేతను, ఆ బయ్యన్న కవిత్వము చెప్పి తిక్కన సోమయాజిచే మెప్పొంది యుండుటచేతను, తిక్కనసోమయాజి హూణశకము 1290-వ సంవత్సర ప్రాంతమువఱకును జీవించి యున్నట్లించుమించుగా నిర్ధారణ మగుచున్నది. తిక్కనసోమయాజి నన్నయభట్టారకునికాలము లోనివాఁడు కాఁడని చూపుట కింతకంటెఁ ప్రబలసాక్ష్య మేమి కావలెను? బయ్యన మొదలుకొని కవివంశమును దెలుపు భోజరాజీయములోని పద్యములను నడుమ నడుమఁఁ గల వర్ణనాంశముల విడుచుచు నిం దుదాహరించుచున్నాను.

      చ. శరధిసుత న్వరించు జలజాతవిలోచనుమాడ్కి శీతభూ
          ధరజఁ బరిగ్రహించు హిమధామకళాధరుపోల్కి సద్గుణా
          భరణఁ బవిత్రమూర్తిఁ గులపాలిక నాcదగు ప్రోలమాంబికం
          బరిణయమయ్యె నెయ్యమున బయ్యచమూపతి వైభవోన్నతిన్.

      చ. గుణయుతు లవ్వధూవరులకు న్జనియించిరి త్రేత రామల
          క్ష్మణులయి పుట్టి ద్వాపరయుగంబు తుదిం దగ రామకృష్ణులై
          గణనకు నెక్కి - యీ కలియుగంబున నిట్లుదయించె లోకర
          క్షణుఁడగు విష్ణు దేవుఁ డన గంగనమంత్రియు ముమ్మడన్నయున్.

      చ. కడిమి గిరీటి దానమునఁ గర్ణుడుఁ భోగమున న్సురేంద్రుఁడె
          క్కుడు విభవంబునన్ హరి యకుంఠితబుద్ధిఁ బురందరేభ్యుఁడున్
          గడువగు ధీరతన్ సురనగప్రవరుం డనఁ బ్రోలమాంబ ము
          మ్మడి బెడఁగొందు రూపమహిమ న్మరుముమ్మడియై జగంబునన్.

      క. ఆ ముమ్మడి ప్రెగ్గడ శ్రీ
         రాముఁడు సీతను వరించు క్రమమున సుగుణ
         స్తోమాభిరామ నమితకృ
         పామండిత నెఱమాంబc బరిణయమయ్యెన్.

      క. ఆరమణీరమణులకు బ్ర
         భారమ్యుఁడు తిక్కవిభుఁడుఁ బ్రకటితకాంతి
         స్పారుండు సింగనయు నను
         వారలు పట్టి రిలఁ బుష్పవంతులమాడ్కిన్.

     చ. చిరతరశోభనుం డగు వసిష్ఠ మునీశ్వరుఁడయ్యరుంధతిన్
         బరిణయమై గృహస్థ గుణభాసితుఁడై వెలుగొందుమాడ్కిఁగా
         తరపరిరక్షణానవరతవ్రతశీలుఁడు తిక్కమంత్రి శే
         ఖరుఁడు వివాహమయ్యె గుణగౌరవశోభిని మల్లమాంబికన్.

     మ. అరిషడ్వర్గముఁ దూలదోలి ధరలో నైశ్వర్యషడ్వర్గ మీ
         వరుసన్ సంభవ మొందెనాఁగ సుతషడ్వర్గంబు జన్మించెఁ ద
         త్పురుషస్త్రీతిలకంబులందు ఘనసంతోషంబు తద్బాంధవో
         త్కరముం బొంద సమగ్రసంపద నిజాగారంబునం జెందఁగన్

తిక్కమంత్రికి మల్గమాంబికకును బుత్రుఁ డైన యనంతామాత్యకవి తన కవిత్వము తొంటి పెద్దలకవిత్వమువలె రుచించునో లేదో యని సంశయించుచు నీ క్రిందివద్యముతో నొకవిధమైన సంతుష్టిని వినయపూర్వకముగాఁ దెలిసి యున్నాఁడు.

      చ. వెలయఁగఁ దొంటిపెద్దల కవిత్వమువోలె రుచించు నొక్కొ యేఁ
          బలికెడు నూత్నకావ్యరసభావము లైనను భూమిఁ దల్లిదం
         డ్రులకు నిజాగ్రసూనులపటు ప్రచురోక్తులకంటెఁ జిన్నబి
          డల వెడతొక్కుఁబల్కులు దృఢంబగు ముద్దుల నీనకుండునే?

ఈ కవి తాను గవిత్వమును జెప్పఁబూనుటకును, నూతనమార్గమున భోజుని కధలను జెప్పఁబూనుటకును, కారణముల నీ క్రింది పద్యములలో మనోహరముగాఁ దెలిపి యున్నాఁడు.

           సీ. సకలవిద్యలయందుఁ జర్చింప గవిత యు
                        త్కృష్ణమం, డ్రది నిత్యకీర్తికొఱకు
              నర్థాప్తికొఱకు నావ్యవహారలక్షణం
                        బెఱిఁగెడుకొఱకు ననేకవిధము
              లగు నమంగళముల హరియించుకొఱకు ను
                        చితనిత్యసౌఖ్యసంసిద్దికొఱకు
              నొనరఁ గాంతాసమ్మితోపదేశంబునఁ
                        బ్రీతిమై హిత మాచరించుకొఱకు
            
              నయ్యెఁ గానఁ బెద్దలాచరించెద రంచు
              వేర్పుఁకొలఁదిఁ గృతి యొనర్పఁబూని
              యస్మదీయకృతికి నధిపతిఁ గావింప
              నర్హుఁ డెవ్వడొక్కొ యని తలంచి.

           సీ. నూతనం బయ్యుఁ బురాతనకృతులట్ల
                          సంతతశ్రవ్యమై బరగుననియు
              నాదిరాజసమానుఁ డగు భోజభూపతి
                         చరిత మీ కవితా ప్రసంగ మనియు
              నిందుఁ జెప్పెడి కథలిన్నియు నోలిఁ బ్ర
                         శస్తధర్మోపదేశంబు లనియు
              నఖిల జగన్నాధుఁ డగు నహోబిలనాధుఁ
                         డీ పుణ్యకృతికి నధీశుఁ డనియుఁ

              బృథివి నెల్ల జనులు ప్రియభక్తియుక్తిఁ బా
              టింతు రనియు నూఱడిల్లి యేను
              బరమసౌఖ్య మైన భవదాభిముఖ్యంబు
              నెమ్మిఁ బడసి యధికనిష్ఠతోడ

ఈ మహాకవియే యనంతచ్ఛందస్సను పేరం బరగిస యొక, మంచి ఛందో లక్షణమును గూడ రచియించి యున్నాడు.

అనంతుని కవిత్వరీతి తెలియటకయి యాయన కృతులనుండి కొన్ని పద్యముల నిం దుదాహరించు చున్నాను.


భో జ రా జీ యు ము


          ఉ. ఓలి గృహస్థధర్మముల నుండెడువానికి గ్రాసవాసముల్
              చాలఁగఁ గల్గి పుత్త్రుఁలు గళత్రము సౌఖ్యము నొంద బంధువుల్
              మేలన నార్యకోటి మది మెచ్చఁగ నుండుట యున్కిగాక యే
              చాలును లేక యీచెనఁటిజాలిఁ బడం బనియేమి చెప్పుమా! ఆ. 2

          చ. ఇటు తగునయ్య విప్రుడ వహీనగుణాఢ్యుఁడ వీవు; నీకు నే
              మిటి కిటువంటి దౌష్ట్యము? క్షమించునె మజ్జనకుండు నిన్ను ద
              క్కటి జను లేమి యండ్రు? మదిఁ గాంక్షయె కల్గిన నగ్నిసాక్షిగాఁ
              జిటికెన వట్టి కాక వృథ చేయుట ధర్మమె కన్యకాత్వమున్ ఆ.4

          ఉ. తెచ్చిన నేమి సర్వజగతీభరణక్షముఁడై న యచ్యుతుం
              డచ్చుగ నెల్లజీవులకు నారసి యన్నము వెట్టుచుండు నే
              నిచ్చట నొంటి నున్న తఱి నేల తలంపఁడు? జాఠరాగ్నిచే
              వెచ్చుచునున్న నన్నుఁ దగమే తనకింత యుపేక్ష చేయఁగన్. ఆ.5

         ఉ. ఆయతరీతిఁ దద్ధ్వని రసాయనమై చెవి సోఁక నప్పు డం
              బే యనుచుం బ్రతిస్వనము పెల్లుగఁ జూపుచుఁ బాఱి ధేనువున్
              డాయఁగఁ బోయి వేడుక నొడల్ కదలించుచు వాల మార్చుచున్
              బాయక గుప్పునం గుడిచె బాలవృషంబు నిజాంశ దుగ్ధముల్. ఆ.6


ఛ O ద స్సు


          క. కాకుస్వరయతి యగు నితఁ
             డే కదలక జలధిఁ బవ్వళించె ననగ బ్ర
             శ్నా కలితదీర్ఘమున నతఁ
             డే కవ్వడిరధము గడిపె నిమ్ముల ననఁగన్

        గీ. యరలవలు శషసహాలును నాదిబిందు
            యుతములై మకారవిరామయుక్తిఁ దనరు
            మారుతాత్మజాఁ డరిదిసంయమి యనంగ
            మదనజనకుఁడు దనుజసంహారుఁ డనఁగ.


ర సా భ ర ణ ము


       ఉ. కైరవబంధుబంధురవికాసవిలాసము లేల? మందసం
            చారత నొప్పు నమ్మలయశైలసమీరము లేల? యొప్పు నీ
            కీరముపల్కు లేల? పరికింపఁగ నవ్వనలీల లేల? శృం
            గారము లేల? నాకుఁ జెలి కంజదళాక్షుఁడు రాక తక్కినన్. ఆ.3

        ఉ. మక్కువఁ బూనఁ దేనె లగు మాటలు పల్కు నహర్నిశంబు నొ
            క్కొక్క నెపంబమై నలిగి యుగ్మలికిం దమకంబు తద్దయన్
            మిక్కిలి సేయు నొండొరుల మెచ్చఁగ గాఢతరప్రవీణతల్
            తక్కక చూపు శౌరి మిగులం గలదే మహి నెట్టిప్రౌఢకున్ ఆ.4

  1. [కర్తృతా మహిమ అని పాఠాంతరము.]
  2. [అనఁగా-ఆంధ్ర వల్లభ విష్ణునిభక్తుఁడని యభిప్రాయము.]