ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/పావులూరి-మల్లన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పావులూరి - మల్లన


ఇతఁడు తెనుగున గణితశాస్త్రమును రచించిన మహాకవి. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; శివ్వన్నపుత్రుఁడు; ఆపస్తంభసూత్రుఁడు; గార్గ్యగోత్రుఁడు. గోదావరిమండలములోని పావులూరి *[1] గ్రామమునకు కరణము. గద్యము లోని "పావులూరి మల్లనామాత్య విరచితంబైన దశగణితశాస్త్రంబునందు" అన్న వాక్య మితఁడు నియోగి యని తెలుపుచున్నది. తక్కిన యంశము లనేకము లీతనిగణితములో నీ పద్యమునఁ జెప్పఁబడినవి.

        క. 'ఇలఁ గమ్మనాఁటిలోపల
            విలసిల్లిన పావులూరివిభుఁడను సూత్రా
            కలితాప స్తంభద్విజ
            కులతిలకుఁడ వినుతగార్గ్యగోతోద్భవుఁడన్."

ఈ పావులూరి గణితము మహావీరాచార్యులవారి సంస్కృతగణితసార సంగ్రహమునకు భాషాంతరీకరణము. ఇందలి పద్దతులు మాత్రమే పయి గ్రంథమునుండి తెలిఁగింపఁబడినవి గాని లెక్కలన్నియు మల్లనార్యునిచేత స్వతంత్రముగా గల్పింపఁబడినవే! ఈ పావులూరి గణితము గాక ప్రతాపరుద్రుని కాలములో రచియింపఁబడిన సూత్రగణిత మొకటియు, అచ్యుత దేవరాయని కాలములో వల్లభా మాత్యకవిచేఁ దెలిఁగింపఁబడిన లీలావతి గణితమును, వేంకటేశ గణితమును, ఎలుగంటి పెద్దనార్యుని ప్రకీర్ఘ గణితమును, తెలుఁగునందుఁ గలవు.

పావులూరి మల్లన తన గ్రంధమునఁ బూర్వకవుల నెవ్వరిని స్తుతించియుండ లేదు. ఈ కవి నన్నయభట్టుతోడి సమకాలికుఁ డయినటులు కనబడు చున్నాఁడు. ఈ కవి తనకు రాజనరేంద్రుఁడు పిఠాపుర సమీపమున నున్న నవఖండవాడ యను గ్రామము నిచ్చినట్లుగా నీ క్రింది పద్యములయందుc జెప్పకొన్నాఁడు:

          ఉ. శ్రీనిలయండు శివ్వనను జిమ్మనను న్మఱి సూర్యదేవునిన్
              ధీనిధిఁ బోలయార్యునిని దేజమున్ రవితుల్యు లై_న యా
              సూనుల నల్వురం బడసె సూరిజనస్తుతసత్యధారతీ
              జ్ఞాసులఁ బద్మ గర్భువదనంబులు నాలుగుఁబోల వారిలోన్.

          ఉ. శ్రీలలనేశుఁడాంధ్రనృపశేఖరుఁడై చను రాజరాజభూ
              పాలకుచేతఁ బీరపరిపార్శ్వమునన్ నవఖండవాడ యన్
              ప్రోలు విభూతితోఁ బడసి భూరిజనస్తుతుఁడై న సత్కళా
              శీలుఁడ రాజపూజితుఁడ శివ్వనపుత్రుఁడ మల్లనాఖ్యుఁడన్,

ఇందలి మొదటి పద్యము నప్పకవి తద్భవవ్యాజవిశ్రమమున కుదాహరణముగాఁ గై కొని యున్నాడు. దీనినిబట్టియే యితఁడు లాక్షణికకవి యని వేఱుగఁ జెప్ప నక్కఱలేకయే తెలిసికోవచ్చును. రాజనరేంద్రుని కాలము లోనే నన్నయభట్టు గాక యిట్టి కవిత్వమును జెప్పఁగల కవులితరులుండుటచేత నాంధ్రకవిత్వమునకు నన్నయభట్టారకుఁడు మొదటివాఁడు కాఁడనియు, అతనికాలమునందును నంతకుఁ బూర్వమునందుసు తెనుఁగు కవు లుండిరనియు వారట్టి కవిత్వముసు జెప్పటకుఁ గావలసిన లక్షణ గ్రంథము లా వఱ కే యుండిన వనియు, స్పష్ట మగుచున్నది. ఆ కాలమునందును, దత్పూర్వమునందును నుండిన తెనుఁగు కవులలోఁ దమ గ్రంథములందు మొట్టమొదట దేవతాస్తుతి నొక్క సంస్కృతశ్లోకములోఁ జేసి తరువాత దెనుఁగు పద్యముల నారంభించుట యాచారముగా సున్నట్లు కనఁబడుచున్నది. ఆ కాలమున గ్రంధములోఁ గవిస్తుతిని జేయుట లేదు; కృతిపతిని గూర్చి షష్ఠ్యంత పద్యములను జెప్పుట లేదు. ఈ యాచారము తిక్కనకాలమువఱకును వచ్చినది. తిక్కన తన నిర్వచనోత్తరరామాయణములోఁ బూర్వుల పద్ధతినే యనుసరించినను, భారతమున నూతన మార్గమును ద్రోక్కి గ్రంథాదిని తెలుఁగు పద్యమునే వేసి కవిస్తుతియు స్వప్న గాధ యు, షష్ట్యంతపద్యములును జేర్చినాఁడు. గతానుగతికులయి కవులందఱును బిమ్మటఁ దిక్కనచూపిన తోవనే నడుచుచున్నారు. పాపులూరి గణితము నందు మొదట నీ క్రింది శ్లోకమును, పద్యములును నున్నవి.

       శ్లో|| శ్రీకంఠం సగుణం సమస్త జగతాం కర్తార మీశం గురుమ్
            భూతో యానలచంద్రసూర్యపవనవ్యోమాత్మమూర్తిం విభుమ్
            నిత్యానందమయో పయో గిరిజయా సార్ధం ప్రజా వృద్దయే
            మాయా యోగ ముపైతి తం శివకరం వందే శివం శ్రేయసే.

       కం. ప్రణమిల్లి శివుని కీక్రియ
            నణిమాదిగుణాస్పదునకు నభినవస ఖ్యా
            మణిదీప్తి సారసంగ్రహ
            గణితసముద్రంబుఁ దఱియఁ గడఁగితిఁ బ్రీతిన్.

       శా. అర్కాదిగ్రహపంచకగ్రహణ కాలాన్వేషణోపాయమున్
            దర్కవ్యాకరణాగమాదిబహుశాస్త్ర ప్రోక్తనానార్ధసం
            పర్కాదివ్యవహారమున్ భువనరూపద్వీపవిస్తారమున్
            దర్కింపన్ గణిక ప్రవృత్తి వెలిగాఁ దార్కుం డెఱింగించునే?

       క. కావున గణితము దెనుఁగునఁ
           గావింపగ గణఁగితిన్సుకవిమల్లుఁడ గౌరీ
           వల్లభచరణ సరో
           జావాసితచిత్త మధుకరాత్ముఁడ జగతిన్.

ఈ ప్రకారముగా మొదట శ్లోకముతోఁ జేయఁబడిన పూర్వగ్రంథము లిప్పటికి నన్నయకృత భారతమును, భాస్కరరామాయణమును, నిర్వచనో త్తరరామాయణమును, ఈ పావులూరి గణితమును గనఁబడుచున్నవి. ఈ పుస్తకమునుండి శై_లిని జూపుట కొక పద్యము నుదాహరించుట దక్క గవినిగూర్చి వ్రాయదగిన దేదియుఁ గనుపట్టదు.

      చ. చెలికి షడంశమున్ బ్రియకు శేషములోపలఁ బంచమాంశమున్
         బొలుపుగ దాని శేషమున బోదకు నాలవపాలు నిచ్చి యం
         దులఁ దన పాలు దాఁ గొనియెఁ దొమ్మిది జేనలు రాజహంస మీ
         నలిన మృణాల మెంత సుజనస్తుత ! మా కెఱుఁగంగఁ జెప్పుమా.

నే నీ కవిచరిత్రమును వ్రాసి ప్రచురించిన తరువాత కొందఱు రాజరాజ నరేంద్రుఁడు నవఖండవాడ యిచ్చినది గణితము చేసిన మల్లనకుఁ గాదనియు నాతని తాత యైన మల్లన కనియు వార్తాపత్రికలలో వ్రాసి యున్నారు అందుచే నే నీ సంవత్సరమునందు బెంగుళూరికి బోవునపు డొక దినము చెన్నపురిలో నిలిచి ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునకును, నాంధ్రసాహిత్య పరిషత్పుస్తకభాండాగారమునకు బోయి యందున్న పావులూరి గణితములను జదివితిని. ఆంధ్రసాహిత్య పరిషత్పుస్తకభాండాగారములోని ప్రతులలో నొకదానియందు

     ఉ. 'శ్రీలలనేశుc డాంధ్రనృపశేఖరుఁ డై చనురాజరాజ భూ
         పాలకుచేతఁ బీరపురపార్శ్వమున న్నవఖండవాడ యన్
         ప్రోలు విభూతితోఁ బడసె భూరిజన స్తుతుఁ డైనసత్కళా
         శీలుఁడు రాజపూజితుఁడు శివ్వనపుత్రుఁడు మల్లఁ డున్నతిన్.

      క. గోత్రపవిత్రుఁడు సద్గుణ
         పాత్రుం డగు శివ్వనకును బతిహితశుభచా
         రిత్రారుంధతి గౌరమ
         ధాత్రీపతి కిరువురకును దనయుండ జగతిన్.'

అనియు, నింకొక ప్రతియందు

      ఉ 'శ్రీలలనేశుఁ డాంధ్రనృపశేఖరుఁడై .................
          ................ సివ్వనపుత్రుఁడు మల్లఁ డున్నతిన్.

      ఉ. శ్రీనిలయుండు సివ్వనయుఁ జిమ్మనయుం గుణసూర్యదేవుఁడున్
          ధీనిధి ప్రోలనార్యుఁడును దేజమునన్ రవితుల్యులై_న యీ
          సూనుల నల్వురం బడసె సూరిజన స్తుతున సత్యవి
          జ్ఞానులు పద్మగర్భు వదనంబులు నాలుగుఁబోలువారిలోన్

       క. గోత్ర పవిత్రుఁడు సద్గుణ
          పాత్రుడు సివ్వనకు మిగులఁ బతిహిత శుభచా
          రిత్రారుంధతిగౌరమ
          ధాత్రీసతి యిద్దఱికిని దనయుఁడ జగతిన్.'

అనియు నున్నది. ఇందు మొదటి ప్రతిలోని పాఠమునుబట్టి రాజనరేంద్రునిచే నగ్రహారమును బడసినవాఁడు గణితశాస్త్రకర్త యైన పావులూరి మల్లనయే యని స్పష్టముగాఁ గానవచ్చుచున్నది. రెండవ ప్రతిలోని పాఠమునుబట్టి గణితశాస్త్రకర్త యైన మల్లన తాత యగ్రహారమును బడిసినట్టు కనబడుచున్నది ఈ రెండు పాఠమ లలో మొదటి పాఠమే సరియైనదని నా యభిప్రాయము. గణిత శాస్త్రవేత్తయు లాక్షణిక కవియు నైన మల్లనకే రాజరాజనరేంద్రు డగ్రహారము నిచ్చి యుండును గాని ప్రసిద్దుండు గాని మల్లన కూరక యిచ్చి యుండఁడు. ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారములో నున్న ప్రతులలోని పాఠము రెండవ ప్రతిలో నున్నట్లే యున్నది. ఎక్కువ ప్రతులలో ని ట్లుండుటచేత గణితమును రచియించినకవి యగ్రహారమును సంపాదించిన మల్లనమను మఁడే యనుకొన్నను, అగ్రహారమిచ్చినది 10౩౦ వ సంవత్సర ప్రాంతమయిన పక్షమున నటుతరువాత ముప్పది నలువది సంపత్సరముల కనఁగా కాక ఒక 1060-70 సంవత్సర ప్రాంతములయందు గణిత శాస్త్రకర్త యయిన పావులూరి మల్లన యుండి యుండును.[2] ఈ పావులూరిమల్లన భద్రాద్రిరామశతకమును కూడ రచియించినట్లు చెప్పుదురు గాని తండ్రులు వేఱగుటచేత భద్రాదిరామశతకమును రచియించిన పావులూరిమల్లన వేఱొకఁడని తోఁచుచున్నది. ఈ మల్లనతండ్రి పేరు సివ్వన్న; రెండవ పావులూరిమల్లన తండ్రి పేరు రామన్న యని శతకములోని యీ క్రింది పద్యమునందున్నది.

          క. శ్రీమహితపావులూరిసు
             ధాముఁడ రామన్నమంత్రి తనయుఁడఁ గవిసు
             త్రాముఁడ మల్లనసచివుఁడ
             శ్రీమద్భద్రాద్రి ధామ శ్రీరఘురామా!

  1. [* ఇది గోదావరి మండలములోనిది కాదు; కమ్మనాcటిలోనిది కాన, గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోనిది. (చూ. ఆంధ్రకవితరంగిణి పు. 204)]
  2. ['శివ్వనపుత్రుఁడు మల్లఁడున్నతిన్' అను పాఠమే సరియైనదనియు, రాజరాజు వలన నఖండవాడc బడసినది గణిత శాస్త్రకర్త గాక యాతని తాతయే యనియు, మనుమఁడగు మల్లన క్రీ.శ. 1100 ప్రాంతము వాడనియు విమర్శకుల యాశయము మఱియుఁ బద్యమున బేర్కొనఁ బడిన రాజరాజు, రాజనరేంద్రుఁడని చెప్పుటకుఁ దగిన యాధారములు లేవనియు, అఖండవాడ వెలనాఁటి చోడరాజగు పృథ్వీశ్వరుచే కుంతీమాధవస్వామి కర్పింపcబడినట్లు క్రీ.శ. 1186 లోని శాసనము వలన దెలియవచ్చుచున్నదనియు, విూది పద్యము సరిగా నుండలేదనియు, 'తెనుఁగు కవుల చరిత్ర'లోఁ దెలుపఁబడియున్నది.(పుట.282) మల్లన, నన్నయ కించుమించుగఁ నే బదియేండ్ల తర్వాతి వాcడని శ్రీ తిమ్మవజ్ఝల కోదండ రామయ్య గారనుచున్నారు. ఈ 'పావులూరి మల్లనకవి'యు దిక్కనకు ముందురా వలసినవాఁడు]