Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/ఎఱ్ఱాప్రెగడ

వికీసోర్స్ నుండి

ఎ ఱ్ఱా ప్రె గ డ


ఎఱ్ఱాప్రెగడ యను కవి నియోగిబ్రాహ్మణుఁడు ఈతని యింటిపేరు చెదలవాడవారు; నివాసస్థలము నెల్లూరిమండలమునందలి కందుకూరి లోని గుడ్లూరు గ్రామము; [ఎఱ్ఱాప్రెగడ గృహనామమును గూర్చియు, నివాసమును గూర్చియు నభిప్రాయ భేదము లున్నవి. ఇతని గ్రంధములను బట్టి యాతని గృహనామమును నిర్ణయింపఁజాలము. విప్రనారాయణ చరిత్ర మును రచించిన చెదలువాడ మల్లనకవి తానెఱ్ఱాప్రగడ వంశజుఁడనని చెప్పికొనుటచే నీతని గృహానామము "చెదలువాడవా" రగునని కొందఱి తలంపు ఎఱ్ఱాప్రెగడ"చెదల్వాడ నిలయుఁ డని మల్లన చెప్పియున్నాఁడు

ఎఱ్ఱాప్రెగడ తాతయైన "ఎఱపోతసూరి" వేఁగినాట కరాపర్తి వృత్తిమంతుఁడcట! కాన నతని నివాసము కరాపర్తి కావచ్చును. భారతారణ్య పర్వ శేషము చివరికి పద్యములంబట్టి యితని నివాసము పాకనాటి యందలి గుడ్లూరైనట్లు తెలియుచున్నది. ఈతఁడు గుడ్లూరిలో నున్నపుడే ఆరణ్యపర్వ శేషమును, నృసింహ పురాణమును రచించెననియుc, దర్వాత మల్లారెడ్డి పరిచయము సంపాదించి, అతని మూలమున నతనియన్న వేమారెడ్డి నాశ్ర యించి అద్దంకిలోఁ గొంతకాలము నివసించి, రామాయణ, హరివంశముల నచటనే రచించి యా వేమారెడ్డికే కృతిచేసె ననియు, వార్ధక్యమునఁ జెదలువాడలో నివసించి యుండుననియు "ఆంధ్రకవితరంగిణి" లోఁ గలదు. (నాలుగవ సంపుటము-పుట 58) తండ్రి సూరన్న: తల్లి పోతమ్మ; ఈతనిది శ్రీవత్సగోత్రము. ఇతడు తిక్కనసోమయాజి తరువాత నించు మించుగా నేఁబది సంవత్సరముల కాలమున నుండినవాఁడు. ఇతఁడు తిక్కనసోమయాజి కవిత్వమునం దత్యంత గౌరవము కలవాఁడయి యాతని వలెనే కవిత్వము చెప్పఁ బ్రయత్నించినవాఁ డగుటచే విరాటపర్వములోఁ దిక్కనసోమయాజి తన తండ్రి కలలో వచ్చి గ్రంథరచన చేయవలసినదని చెప్పినట్టే, తన తాత తన భావము నందు తోఁచి చెప్పినట్టు నృపింహపురాణ మున నిట్లు వ్రాసియున్నాడు.

        సీ. ప్రజ్ఞాపవిత్రుఁ డాపస్తంభసూత్రుండు
                  శ్రీవత్సగోత్రుఁడూర్జితచరిత్రుఁ
           డగు బొల్లనకుఁ బ్రోలమాంబకుఁ బుత్రుండు
                  వెలనాటిచోడునివలన మిగుల
           మన్నన గన్న భీమనమంత్రిపౌత్రుండు
            [1] ప్రేకమాంబా మనఃప్రియుఁడు పోత
           మాంబికా విభు సూరనార్యు మజ్జనకుని
                 బొల్లధీనిధికిని [2]బ్రోలనకును
   
            జన్ననకు ననుజన్మునిఁ గన్న తండ్రి
            వేఁగినాట గరాపర్తి వృత్తిమంతుఁ
            డనఘుఁ డెఱపోతసూరి కంసారిచరణ
            కమలమధుకరపతి సారవిమలయశుఁడు.

వ. మదీయభావంబున నావిర్భావంబు నొంది సదయానంద మధురవాక్యం బుల నన్ను నిట్లని యనుగ్రహించె.

       ఉ. ఉన్నతసంస్కృతాది చతురోక్తిపదంబులఁ గావ్యకర్తవై
            యెన్నికమైఁ బ్రబంధపరమేశుఁ డనంగ నరణ్యపర్వ శే
            షోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పఁగ నిర్వహించి తౌ
            నన్నయభట్ట తిక్కకవినాధుల కెక్కిన భక్తి పెంపునన్.

        క. గిరిశపదభక్తిరసత
            త్పరభావముకలిమి శంభుదాసుఁ డనంగా
            బరఁగిన గోవిందగుణా
            దదసంభృత సౌమనస్యధన్యుఁడ వెందున్. [పీఠిక 15-18]

ఈతని కాలమువరకును నన్నయభట్టు విడిచిన యారణ్యపర్వశేషము తెనిఁగింపఁబడక భారతము కొఱఁతపడి యుండుట చూచి యితఁడు తాను దానిని తెనిఁగింప నెంచియు తన పేరిట నాంధ్రీకరించినచో నన్నయభట్టారకునిఁ బోలెఁ దనకు నేదో కీడు మూడునని భయపడి మిగిలిన భాగమును రాజరాజనరేంద్రున కంకితముగా నన్నయభట్టు పేరితోనే రచియించెను. భారతములో నీతఁడు రచియించినభాగములోని మొదటి పద్యము

       చ. "స్పురదరుణాంశురాగరుచి బొంపిరివోయి నిరస్తనీరదా
            వరణములైదళత్కమలపైభవజృంభణ ముల్లసిల్ల ను
            ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనము ల్చెలంగఁగాఁ
            గరము వెలింగె వాసరముఖంబులు శారద వేళఁ జూడఁగన్."

అనునది. కాబట్టి యీ కవి రచియించిన దారణ్యపర్వములో సగమకంటె నధికము నుండును.

ఎఱ్ఱాప్రెగడ కవిత్వము మృదువును మధురమునయి. కదళీపాకమై, చాల వఱకు సోమయాజులకవిత్వమును పోలియుండును. ఇతఁడు రచియించిన భారతభాగమునం దించుమించుగా సంస్కృతపదములును, తెలుఁగుపదములును సమానముగా నుండును ఇతని భాషాంతరమును పయి యిరువుర దానివలెనే మూలమైన సంస్కృతగ్రంథానుసారముగా నుండదు. ఈక్రింది శ్లోకములను పద్యములును కొంతవఱకీ యంశమును తేటపఱుపవచ్చును.


                     సంస్కృతారణ్యపర్వము.
          శ్లో. తవ వశ్యా హి సతతం పాండవాః ప్రియదర్శినే
              ముఖప్రేక్షా శ్చతే సర్వే తత్త్వమేత ద్బ్రవీహి మే.
             వ్రతచర్యా తపో వాస్తి ప్నానమంత్రౌషధాని వా,
             విద్యావీర్యం మూలవీర్యం జపహోమాగదాస్తదా.
                          తెలుఁగు
              సీ. నీ ప్రియభర్తల నిర్మలవృత్తులC
                        బ్రకట తేజుల లోకపాలనిభులఁ

                  బార్థుల నీ వొకభంగిన వదలక
                         చెలువ యెబ్బంగి భజింతు దగిలి ?
                  యొక్కఁ డొక్కనికంటె నువిద నీ కెక్కుడు
                         ననురక్తు లగుట యత్యద్భుతంబు
                  నగుమొగంబులకాని నాతి నీదెస నెప్డు
                         బతులకుఁ గిన్క యెప్పాట లేదు

                  వ్రతము పెంపొ మంత్రౌషధవైభవంబొ
                  సరసనైపథ్యకర్మకౌశలమొ చతుర
                  విభ్రమోల్లాసరేఖయొు వెలఁది నీవి
                  శేషసౌభాగ్య హేతువుఁ జెపుమ నాకు."

ఇందలి సీసపాదముల నాలిగింటను మూలములో లేని నిర్మలవ్పత్తులఁ బ్రకట తేజుల మొదలయిన విశేషణాదులచేత గ్రంథము విస్తారముగా బెంపఁబడినను గీత పాదములయందు మూలమునందలి తపస్సు స్నానము జపము హోమము మొదలైనమాటలు విడిచిపెట్టఁబడినవి.

 
                             సంస్కృతము

       శ్లో. "యదైవ భర్తా జానీయా న్మంత్ర మూలపరాం స్త్రియమ్,
           ఉద్విజేత తదై వాస్యాః స ర్పా ద్వేశ్మగతా దివ.
           ఉద్విగ్నస్య కుత శ్శాంతి రసాంతస్య కుత స్సుఖం,
           న జాతు వశగో భర్తాస్త్రీయాః స్యాన్మంత్రకర్మణా.
           అమిత్ర ప్రహితాంశ్చాపి గదాన్ పరమదారుణాన్,
           మూలప్రచారైర్హి, విషం ప్రయచ్ఛంతి జిఘాాంసవః.
           జిహ్వయా యాని పురుష స్త్వచా వా ప్యుప సేవతే,
           తత్ర చూర్ణాని దత్తావి హన్యు క్షిప్ర మసంశయః.
           జలోదరసమాయుక్తాః శ్విత్రిణః ....స్తథా,
           అపుమాంసః కృతా శ్రీభిః జడాంధబధిరస్తథా.

            పాపానుగాన్తు పాపాస్తాః పతీ నుపసృజం త్యుత.
            న జాతు విప్రియం భర్తుః స్త్రీ యా కార్యం కధంచన ”
                           
                                  తెలుఁగు

        చ. ఆలయక మంత్రతంత్రవివిధౌషధభంగులఁజేసి యెంతయున్
            వలతురు నాథు లంట మగువా ! కడు బేలతనంబు దానమున్
            గలిగిన ప్రేమయుం బొలియుఁ గాని యొకంటను సిద్ధిఁ బొంద ద
            ప్పొలఁతులతోడి మన్కియహిపొత్తుగఁ జూచు విభుం డెఱింగినన్.

        చ. మగువ యొనర్చువశ్యవిధి మందులు మాయలు నొండుచందమై
            మగనికిఁ దెచ్చు రోగములని మానక మూకజడాదిభావముల్
            మొగి నొనరించు నద్దురితిముల్ తన చేసినచేతలై తుదిన్
            జగమున కెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్."

వీనిని చదువుటవలననే మూలగ్రంథములోని కొంత భాగము వదలి వేయఁబడినట్టు స్పష్టమగును. గనుక సత్యాద్రౌపదీ సంవాదము నందలి పద్యములలో నొక్కదానిని మాత్రము వ్రాసి యిఁక నీ విషయము విడిచిపెట్టెదను.

                                శ్లోకము
            
             ఏతాజ్ఞానా మ్యహం కర్తుం భర్తృసంవననం మహత్
             ఆపత్ స్త్రీణాం సమాచారం నాహం కుర్యాం న కామయే."
                           
                                పద్యము

         గీ. ఇట్టి వర్తకముల నెపుడుఁ బాండవులకుఁ
             దగిలి ప్రియము సేయఁదగితిఁ గాని
             మగువ నీవు చెప్ప మందులు మాకులు
             నింద్ర జాలములను నే నెఱుంగ '

ఈ కవియొక్క కవిత్వశైలి తెలియుటకయి యీ పద్యములే చాలి యున్నను, మఱియొకభాగములోని పద్యములను రెంటిని కూడ నిందు వ్రాసెదను.

        ఉ. నారలు కట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో విప
            ద్భారము నొంది వందరినఫల్గును నుజ్జ్వలరాజ్యవైభవో
            దారుల మై కనుంగొని ముదంబును బొందఁగ గాంచుకంటెనిం
            పారఁగ వొండుగల్గునె కృతార్థత యెందును గౌరవేశ్వరా.
                                                   ఆర.ప. ఆ.5
        ఉ. శాతవశాఖాగ్రఖండితలసన్మదకుంజర కుంభముక్తము
            క్తాతతశైలకందరగుహాంతరసుప్తమృగేంద్ర కేసర
            వ్రాతము వేడ్క. నాచికొన నారక చేరుట గాదె క్రోధవి
            ర్ఘాతమహోగ్రు భీము జెనకం దలపోయంట నీకు నెమ్మెయిన్.'
                                                   ఆర. ఆ. 6

భారతము రచించిన యీ ముగ్గురు కవులునుప్రామాణికాగ్రగణ్యులు. నర్వవిధములచేతను వీరి కవిత్వము మిక్కిలి శ్లాఘ్యమైనది. వీరిని కవిత్రయ మందురు. కవిత్రయ విరచిత మయిన యాంధ్రభారత మారంభింపఁబడిన మూఁడు వందలసంవత్సరములకు సంపూర్ణ మైనది. కవిత్రయము ప్రయోగించిన పదములనే కాని వేఱు పదములను కవులు ప్రయోగింప గూడదని వీరికి వెనుక కవిరాక్షసుడను నతఁడు తాను రచియిం చిన కవిరాక్ష సీయ మను లక్షణ గ్రంథము నందు నియమము చేసినాఁడట. అయినను తరువాతి కవులు మాత్ర మీ నియమము నంతగా పాటింపలేదు.

ఎఱ్ఱాప్రెగడ శివభక్తుఁడగుటచేత శంభుదాసుఁ డనియు, ప్రబంధ ధోరణిని భారతారణ్యపర్వశేషమును చమత్కారబంధురముగా రచించుటచేత ప్రబంధ పరమేశ్వరుఁ డనియు, బిరుదనామములు గలవు. ఈతఁడు చేసిన యితర గ్రంథములు రామాయణము, హరివంశము, *[3] లక్ష్మీనృసింహ పురాణము. ఇందలి కడపటి పుస్తకమున కహోబిలమహాత్మ్య మని నామాంతరము.

హరివంశ మీ కవి కొండవీటి ప్రభువైన *[4] పోలయవేమారెడ్డి కంకితముచేసెను. ఇయ్యెడ "ఆంధ్రకవి తరంగిణి'(నాలుగవ సంపుటము-పుట 97)లో నిట్లున్నది. "హరివంశకృతిపతి వేమా రెడ్డి కాదనియు, నాతని మూడవ కుమారుఁడైన యనవేమారెడ్డి యనియు గొంందఱు భ్రమపడుచున్నారు ... ఆశ్వాసాంత పద్యములను బట్టి హరివంశకృతిపతి కోమటి ప్రోలయ వేముఁడు కాని వేమారెడ్డి కుమారుఁడైన యనవేమారెడ్డి కాఁడని నిశ్చయము"] అనవేమారెడ్డితండ్రి యైన యీ పోలయవేమారెడ్డి ప్రతాపరుద్రుని ప్రభుత్వ దినములలో నొక సేనానాయకుడుగా నుండి 1323 వ సంవత్సరమున ప్రతాపరుద్రుడు తరుష్కులచేత కారాగారబద్ధుఁడుగాఁ జేయఁబడిన కొన్నిసంవత్సరముల కనఁగా 1328 వ సంవత్సరమునందు స్వతంత్రుఁడయి వినుకొండరాజ్యము నాక్రమించుకొని 1349 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసెనని చెప్పఁబడియున్నది. కొని యీతని శాసనములు 1320 వ సంవత్సరమునుండియే కానcబడు చున్నందున నితఁ డా సంవత్సరమునందే రాజ్యపాలన మారంభించి యుండుసు. అందుచేత నీ పోలయవేమారెడ్డి [5]1320 వ సంవత్సరము మొదలుకొని 1349 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసి యుండవలెను, ఇతఁడు మొదట సామంతుఁ డయి కాకతీయ రాజ్యావసానదశ యందు స్వతంత్రరాజయి యుండును. ఈతని ప్రధమపుత్రుఁడు ఆనపోతారెడ్డి 1350 వ సంవత్సరము మొదలుకొని 1361 వ సంవత్సరమువఱకును, ద్వితీయపుత్రుఁడు సుప్రసిద్ధుడై న యన వేమారెడ్డి 1363 మొదలుకొని 1380 వఱకును రాజ్యముచేసిరి. ఈ యనవేమారెడ్డి రాజమహేంద్రవరమువఱకును తెనుఁగు దేశమును జయించి ప్రసిద్ధికెక్కుటయే కాక, సంస్కృతాంధ్రములయం దసమానపాండిత్యముకలవాఁడయి యమరుక కావ్యమునకు సంస్కృతవ్యాఖ్య వ్రాసి ప్రఖ్యాతి కెక్కెను. [అమరుకకావ్యమునకు సంస్కృతవ్యాఖ్యానమగు "శృంగారదీపిక"ను రచించిన యాతఁ డీ యనవేమారెడ్డి కాఁడు. పెదకోమటి వేమారెడ్డి.ఇతడు క్రీ.శ.1400-1420 నడుమ నుండెను] పోలయవేమారెడ్డి 1320 వ సంవత్సరము మొదలుకొని 1349 సంవత్సరమువఱ కును రాజ్యముచేసినందున. ఇతని యాస్థానకవీశ్వరుఁడయిన యెఱ్ఱాప్రెగడ యిప్పటి కయిదువందలయేబది సంవత్సరముల క్రిందట నున్నట్లు నిశ్చయింపవలసి యున్నది. పోలయవేమారెడ్డిపూర్వు లంత పేరుపడినవారు కారు గనుకనే యెఱ్ఱాప్రెగడ హరివంశమునందు పోలయ పయివారి నెవ్వరిని వంశవర్ణనయం దుదాహరింపలేదు. పోలయవేమారెడ్డి కద్దంకి రాజధాని యయినట్టు హరివంశములోవి యీ క్రిందిపద్యమువలన విశద మగుచువ్నది.

           గీ. "తనకు నద్దంకి తగు రాజధానిగాఁ బ
               రాక్రమంబున ది బహుభూము లాక్రమించి
               యనుజతనుజబాంధవమిత్రజనుల కిచ్చె
               నెదురెె యెవ్వారు వేమమహీశ్వరునకు."

ఎఱ్ఱాప్రెగడ హరివంశమునందీ క్రిందివద్యములచేత నన్నయ తిక్కన సోమయాజుల నిద్దఱిిని మాత్రమే పూర్వకవులనుగా స్తుతించినాఁడు.

            ఉ "ఉన్నత గోత్రసంభవము నూర్జితసత్వము భద్రజాతి సం
                పన్నము నుద్దతాన్యపరిథావి మదోత్కటము న్నరేంద్రపూ
                జోన్నయనోచితంబు నయి యొప్పెడు నన్నయభట్టకుంజరం
                బెన్న నిరంకుశోక్తిగతి నెందును గ్రాలుటఁ బ్రస్తుతించెదన్."

            మ. తనకావించినసృష్టి తక్కొరులచేతం గాదునా నే ముఖం
                బునఁ దాఁ బల్కిన పల్కు లాగమములై పొల్పొందునా వాణి
                నత్తను వీతం డొకరుండునాఁ జను మహత్త్వా ప్తిం గవిబ్రహ్మనా
                వినుతింతుం గవితిక్కయజ్వ నఖిలోర్వీదేవతాభ్యర్చితున్.

ఇతడు హరివంశమును రచియించుటకుముందే రామాయణమును రచించి నట్లు వేమారెడ్డి కవి నుద్దేశించి యన్నట్లు చెప్పఁబడిన యీ క్రింది పద్యము వలనఁ దెలియవచ్చుచున్నది.

           శా. "నా తమ్ముండు ఘనుండు మల్లరథినీనాధుండు ని న్నాతత
               శ్రీతోడ న్సముపేతుఁ జేసి యెలమి జేపట్టి మా కిచ్చుటం

        జేతో మోద మెలర్ప రామకథ మున్ జెప్పించి యత్యుత్తమ
        ఖ్యాతిం బొందితి వింకనం దనియ నేఁ గావ్యామృతాస్వాదనన్."

హరివంశములోని మొదటి పద్యమునందలి “యన్నమవేమభూవిభున" కన్నదావి "నన్నయవేమభూవిభున కని భ్రమపడి యూ కవి తన హరి వంశమును అనవేమభూపాలున కంకిత మొనర్చినట్టు చెప్పఁబడెనుగాని యది సరికాదు. ఎఱ్ఱాప్రెగడ యనవేమారెడ్డి నెఱుఁగునో యెఱుఁగఁడో యని సందేహింపవలసి యున్నది. మనకవి యూక్రింది పద్యమునందు

     శా. వేమక్ష్మాధిపుకూర్మిపుత్రుఁడు దయావిభ్రాజి యవ్యాజతే
         జో మార్తాండుఁడు కీర్తనీయసుగుణస్తోమంబులం దేమియున్
         రామస్పూర్తికి లొచ్చుగాక సరియై రాజిల్లె రాజార్చితం
         డాముష్యాయణుఁ డెందుఁ బోతయచమూపాగ్రేసరం డిమ్మహిన్

ప్రోలయవేముని జ్యేష్టపుత్రుఁడైన యనపోతారెడ్డిని, ఈ క్రిందిపద్యమునందు

     క. "దానంబునఁ గర్ణుని సరి
         మానంబున పేర్మి ననుపమానుఁడు బుధస
         న్మానచతురుండు మాచయ
         సూనుఁడు కోమటి సమ ససులభుఁడు కరుణన్."

ప్రోలయవేమునియన్నకుమారుఁ డైన కోమటిరెడ్డిని, వర్ణించినను హరివంశమునం దెక్కడను అనవేమునిపేరైన నెత్తలేదు అందుచేత హరివంశరచనాకాలమునాఁటి కనవేముఁడు పుట్టెనో లేదో. పుట్టినను మిక్కిలి పసివాడుగా నుండెనో, యని యూహింపవలసి యున్నది. పయిపద్యములో "మాచయసూను" డన్నచోటఁ గొన్ని ప్రతులలో "పోలయసూనుఁ"డని యున్నది. మాచయసూనుఁ డన్న పాఠమే సరియయినది. [ఈ పద్యమును జర్చించుచు 'ఆంద్రకవితరంగిణి"లో నీక్రిందివిషయము వ్రాయబడినధి.]

"క. దానంబున . . . ప్రోలయసూనుఁడు కోమటి సమస్తసులభుడు కరుణన్" అను కందపద్యము ముద్రిత ప్రతిలోను, కొన్ని తాళపత్ర ప్రతుల లోను నట్లే యున్నది. అందు "ప్రోలయ' అను శబ్దము పొరపాటు. ప్రోలయకుఁ గోమటి యను సూనుఁడు లేనేలేఁడు. "ప్రోలయ" యను పదము సరికాదనియు, నచట "మాచయ" యను పదముండవలెననియూ శ్రీ వీరేశలింగము పంతులుగారు వ్రాసి యున్నారు. కాని "మాచయ" యను పదముకూడ సరికాదనియు, నచ్చట వేమయ యమ పదముండవలెనవియు నాయభిప్రాయము. కవి యీ కథా సందర్భమున వేమారెడ్డి వంశమును, నాతవి మాతృసంబంధులను మాత్రమే వర్ణించుచున్నాఁడు గాని వేమారెడ్డి కగ్రజుఁడయిన మాచన వంశమును జెప్పుటలేదు. ఇంతియగాక యూ కంద పద్యమునకుఁ బై న "అతని యనుజుఁడు" అని చెప్పియుండుటచే వేమారెడ్డికి ప్రధమపుత్రుఁడై న పోతయ చమూపతికిఁ దమ్ముఁడును వేమారెడ్డి కి రెండవ పుత్రుఁడు నైనవానిని బై కంద పద్యములో వర్ణింపనెంచెననుట నిశ్చయము. కానిచో 'అతని యనుజుండు' అను వాక్యము నిరర్ధకమగును. కావున పై పద్యములో "ప్రోలయ” అనుటకు బదులుగా వేమారెడ్డివి సూచించు వేమయ యను మాట యుండఁదగినది.

శ్రీపంతులుగారు శ్రీనాథకవి చారిత్రమున వేమారెడ్డికి "కోమటిరెడ్డి" యను పుత్రుఁడున్నాడని యంగీకరించుచు, "ఎఱ్ఱాప్రెగడ హరివంశము రచించు నాఁటి కన వేమారెడ్డి మిక్కిలి పసివాఁడు. కోమటిరెడ్డి మృతుడయ్యెను. హరివంశమునందే యీతని పెదతండ్రి కుమారుఁ డయిన కోమటిరెడ్డి యిట్లు వర్ధింపఁబడెను. అని వ్రాసి 'దానంబునఁ గర్ణుని ..? అను పద్యము నుదాహరించుచు నందలి "ప్రోలయ” అను పదమును 'మాచయ" అని మార్చి వేసిరి. ...........హరివంశ రచనము నాఁటికి వేమారెడ్డి రెండవ కుమారుడైన కోమటిరెడ్డి జీవించియే యున్నాఁడు. ఆతcడే పై కంద పద్యమువ వర్ణింపఁబడినవాఁడు"

(ఆంధ్రకవితరంగిణి నాలుగవ సంపుటము, పుటలు 95, 96)

             క. శ్రీ సంభావితవక్షో
                భాసురమణిహారకిరణపరిచయచతురో
                ల్లాసమృదుహాసయవిరత
                భూసురగృహరచిత హేమ ! పోలయవేమా !'

 అని పూర్వభాగము షష్ఠాశ్వాసప్రారంభమునందును,

             క. 'శ్రీనందనసమ సౌంద
                 ర్యానందితయువతిహృదయ ! యధికాభ్యుదయా
                 యానతజన హృద్యదయా
                 భూనుతజయశక్తి భీమ ! పోలయవేమా !

అని యుత్తరభాగమున నష్టమాశ్వాసప్రారంభమునందును, కవి కృతిపతిని "పోలయవేమా !" యని సంబోధించుటచేతను,

             చ. కులజలరాశిచంద్రుఁడగు కోమటిపోలనయన్ నితంబినీ
                 తిలకము పుణ్యురాలు పతిదేవత యన్నమయుం గృతార్థతా
                 కలితులు ధీరు వేమవిభుఁ గానఁగఁ గాంచిన పుణ్య మొద్ది యే
                 కొలఁదుల నెన్ని జన్మములఁ గూర్చిరొనాఁ బొదలున్ జనస్తుతుల్."

అని కృత్యాదియందు వేమనను గన్నవారు పోలనయు నన్నమయునని స్పష్టముగాఁ జెప్పుటచేతను, హరివంశమును గృతి నందినవాఁడు పోలయ వేమారెడ్డియే యనుట నిశ్చయము. అంతేకాక కృత్యాదియందు నెఱ్ఱనయే కృతిపతితో నిట్లనియెను --

             క. "కావునఁ జెప్పెదఁ గళ్యా
                 ణావహమహనీయరచన హరివంశము స
                 ద్భావమున నవధరింపుము
                 భూవినుతగుణాభిరామ ! పోలయవేమా!"
ఇంతవఱకును బయల్పడిన శాసనాదులనుబట్టి రెడ్ల ప్రభుత్వకాలమును, సంబంధమును తేటపడుటకయు వారి వంశవృక్షము నిచ్చట నిచ్చుచున్నాను--

[మీఁది వంశవృక్షములో "అనితల్లి" తల్లి మల్లాంబిక యని తెలుపఁబడినది. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులు గారు 'శృంగార శ్రీనాధము'న కాటయవేమనను గూర్చి వ్రాయుచు 'ఈతఁ డు కాటయకు బుత్రుఁడు అనపోత నృపాలుని కల్లుఁడు, తల్లాంబిక, దొడ్డాంబిక, మల్లాంబిక యని యీతనికి ముగ్గురు భార్యలు తెలియవచ్చు చున్నారు తల్లాంబికయందుఁ గుమారగిరి యని కుమారుని, దొడ్డాంబిక యందని తల్లియని కుమార్తెను గాటయ వేమన కాంచినాఁడు. మల్లాంబికకు సంతానము కలదో, లేదో తెలియదు.

(పుట 58) అని తెలిపియున్నారు.]

1,2,3,4,5, 6 సంఖ్యలు వేసినవారు వరుసగా రాజ్యమునకు వచ్చిన రెడ్డి రాజులు. వారు రాజ్యము చేసినకాలము వారిక్రింద వేయఁబడినది. ఇందు వేయఁబడిన కాల మిప్పటివఱకు దొరకిన శాసనములనుబట్టి నిర్ణయింపఁబడినది. ముందు లభింపఁబోయెడు శాసనములను బట్టియైనను వీరి కాల మంతగా మాఱక రెండు మూఁడు సంవత్సరము లెక్కువతక్కువగా సరిపోవును గాని యంతకంటె నెక్కువ వ్యత్యాసముండదు. మూఁడవవాcడై న యనవేమారెడ్డి రాజధానిని అద్దంకినుండి కొండవీటికి మార్చెను. నాలవవాఁ డయిన కుమారగిరిరెడ్డి రాజమహేంద్రవరరాజ్యమును తనచెల్లెలయిన మల్లాంబ కరణముగా నిచ్చినందున నామెభర్తయు, మేనత్తకొడుకు నయిన కాటయవేముఁడా రాజ్యమును 1386 మొదలుకొని 1400-వ సంవత్సరము వఱకును పాలించెను. కాటయవేముని తండ్రి కాటయ కుమారగిరి తండ్రి చెల్లెలయిన దొడ్దాంబను వివాహమాడెను. అనవేముని మనుమరాలయిన వేమాంబికను వివాహమాడిన యల్లాడ రెడ్డి కాటయవేముని దండనాధుఁడుగా నుండి రాజ్యము నాక్రమించుకొని 1416 -వ సంవత్సరము మొదలుకొని 1426 వఱకును తన పేరనే రాజ్యము చేయ నారంభించెను గాని: పిమ్మట కాటయ వేమునిపుత్రిక యైన యనితల్లిని తన ద్వితీ యపుత్రుఁడైన వీరభద్రారెడ్డికిఁ బెండ్లిచేసి రాజ్యము వారి కిచ్చి చేసెను. కొందఱు కాటయవేమునికి కొమరగిరి యను పుత్రుఁడు పసివాఁడనితల్లి తమ్ముఁ డొకఁ డుండెననియు, ఆతని బాల్యములో తాను మంత్రిగా నుండి యల్లాడ రెడ్డి శత్రుభయము లేకుండc గాపాడి యాతని పక్షమున రాజ్యము చేసె ననియు, అతఁడు మృతినొందఁగా రాజ్య మనితల్లి, వశము చేసెననియు, చెప్పుచున్నారు. స్థానికచరిత్రములలో రెడ్ల రాజ్యకాలపరిమితినిగూర్చి యీ క్రింది పద్యము కానఁబడుచున్నది.

          సీ "పోలయవేమన్న పొలుపొరఁ బండ్రెండు
                      వత్సరంబులు గాచె వసుధ యెల్ల
             అటువెన్క, ముప్పది యనపోత వేమన్న
                      వన్నెవాసికి నెక్కి వసుధ యేలె
             ధర్మాత్ముఁ డన వేమధరణీకళత్రుండు
                      పదియునేనిట భూమి పదిలపఱిిచె
             ప్రజల కు...సముగ బదునాలు గేఁడులు
                      కొమరగి రేలెను సమయుదాక

             నేలెఁ గోమటి వేమన యిరవదేండ్లు
             రాచవేమన్న నాల్గు వర్షంబు లేలె
             మించి కట్టిరి గృహరాజు మేడ కొండ
             వీట నూఱేండ్లు రెడ్లు భూ విదితయశులు."

ఈ పద్యమెంతవఱకు విశ్వసింపఁదగినదో చదువరులే యోచించుకోవచ్చును. రెడ్ల చరిత్రము నింతట విడిచి యిఁక మన కవిచరిత్రమునకు వత్తము.

కవియింటిపేరు చెదలువాడవారు. ఈ సంగతి ఎఱ్ఱాప్రెగడ వంశజుఁడయిన చెదలువాడ మల్లన రచించిన విప్రనారాయణచరిత్రములోని యీ క్రింది పద్యమువలన స్పష్టపడుచున్నది.

      సీ. "ప్రతిభతో నారణ్యపర్వశేషముఁ జెప్పెఁ
                గవులకుఁ జెవులపండువులుగాఁగ
           వల్మీకభవువచోవై ఖరి రామాయ
                ణంబు నాంధ్ర ప్రబంధంబుఁ జేసె

           నారసింహుని పురాణ మొనర్చె హరి మెచ్చి
                      నన్ను నెన్నఁడు చూచినాఁడ వనఁగఁ
           బ్రౌఢిమై హరివంశభాగముల్ రెండును
                      రచియించె సభలందు బ్రాజ్ఞు లెన్న
           
            దురితహరుఁ బ్రబంధపరమేశ్వరునిఁ జెద
            ల్వాడనిలయు నాదు వంశకర్త
            ధన్యమూర్తి శంభుదాసు నెఱ్ఱా ప్రెగ్గ
            డను నుతింప బ్రహ్మకును దరంబె.

కవియింటిపే రేర్చూరివారని పడుట యెఱ్ఱన లనేకు లుండుటచేతనే.

        సీ 'భవ్యచరిత్రుఁ డాప స్తంభసూత్రుండు
                       శ్రీవత్సగోత్రుండు శివపదాబ్ద
            సంతతధ్యానసంసక్తచిత్తుఁడు సూర
                       నార్యునకును బోతమాంబికకును
            నందనుం డిలఁ బాకనాటిలో నీలకం
                       ఠేశ్వరస్థానమై యెసఁక మెసఁగు
            గుడ్లూరి నెలవున గుణగరిష్ఠత నొప్పు
                       ధన్యుఁ డద్వైతైకతత్పరాత్ముఁ

            డెఱ్ఱనార్యుండు సకలకవీంద్రవినుతుఁ
            డైన నన్నయభట్టమహాకవీంద్రు
            సరససారస్వతాంశ ప్రశస్తి తన్నుఁ
            జెందుటయు సాధుహర్షణ సిద్ధిఁ గోరి.'

అను భారతారణ్యపర్వశేషములోని పద్యమునందుఁ గాని.

         సీ. ప్రజ్ఞాపవిత్రుఁ డాప స్తంభసూత్రుఁడు
                       శ్రీవత్సగోత్రుఁ డూర్జితచరిత్రుఁ
             డగు బొల్లనకుఁ బ్రోలమాంబకుఁ బుత్రుఁడు
                       వెలనాటిచోడనివలన మిగులు

   మన్నన గన్న భీమనమంత్రిపౌత్రుండు
                    ప్రేకమాంబామనఃప్రియుఁడు పోత
         మాంబికా విభు సూరనార్యు మజ్జనకుని
                     బొల్ల ధీనిధికిని బ్రోలనకును

         జన్ననకు ననుజన్యునిఁ గన్నతండ్రి
         వేఁగినాట గరాపర్తివృతిమంతుఁ
         డనఘు డెఱపోతసూరి కంసారిచరణ
         కమలమధుకరపతి సారవిమలయశఁడు."

అను నృసింహాపురాణములోని పద్యమునందుఁ గాని, తన గృహనామమును జెప్పక తా నాప స్తంభసూత్రుఁడ ననియు శ్రీవత్సగోత్రుఁడ నవియు శివపదాబ్ద సంతతధ్యాన సంసక్తచిత్తుఁడ ననియు మాత్ర మెఱ్ఱన చెప్పకొనుటచేతను,

     సీ "శ్రీవత్సగోత్రుండు శివభక్తియుక్తుఁ డా
                 పస్తంబసూత్రుc డపారగుణుఁడు
          నేర్చూరిశాసనం దెఱ్ఱనప్రెగ్గడ
                 పుత్రుండు వీరనపుణ్యమూర్తి
          కాత్మజుఁడైన గాదామాత్యునకుఁ బ్రోల
                 మాంబకు నందను లమితగుణులు
          కసువనామాత్యుండు ఘనుఁడు వీరనమంత్రి
                 సింగధీమణియు నంచితచరిత్రు
   
          లుద్బవించిరిత్రేతాగ్నులో యనంగ
          సొరిది మూర్తిత్రయం బన శుద్ధకీర్తిఁ
          బరఁగి రందులఁ గసువన ప్రభువునకును
          ముమ్మడ మ్మనుసాధ్వి యిమ్ములను వెలసె."

అను పద్యములో భాగవతషష్ఠస్కంధము రచియించిన సింగయ శ్రీవత్స గోత్రుఁడును, శివభక్తియుక్తుఁడును నాపస్తంబసూత్రుఁడు నగ నేర్చూరి

యెఱ్ఱనప్రెగ్గడ నొక్కనిని దన పూర్వునిఁ జెప్పి యుండుటఁ జూచి సూక్ష్మముగా విచారింపక స్థూలదృష్టిచేత నీ యెఱ్ఱనప్రెగ్గడయే యా యెఱ్ఱనప్రెగ్గడ యని భ్రమపడుటవలన గలిగినది. ఈ యెఱ్ఱన లిరువురును గాక మణియొక యెఱ్ఱనకవి గూడఁ గలఁడని కొక్కోకమునందు గ్రంధకర్త తన్నుఁగూర్చి చెప్పుకొన్న యీ క్రిందిపద్యమువలనఁ దెలియుచున్నది.

        సీ. 'శ్రీవత్సగోత్రప్రసిద్ధసంభూతి నా
                    పస్తంబసూత్రప్రశస్తఘనుఁడ
             గురదయానిధి యైన మాచనమంత్రికి
                    నంగనామణి ముత్తమాంబికకును
             దనయుండ సత్కవీంద్రసుమాన్యచరితుండ
                    శివకృపాను జ్ఞానశేఖరుండ
             నారూఢవిద్యాచలానంద యోగీంద్ర
                    శిష్ట ప్రచార విశిష్టఘనుఁడ

             నెఱ్ఱనామాత్యుఁడను సత్కవీంద్రహితుఁడఁ
             గవిత వాక్ప్రౌఢిఁ గొక్కోకకవివరుండఁ
             జతురమతితోడ రతికళాశాస్త్ర మిదియుఁ
             దెనుఁగు గావింతు రసికులు వినుతి చేయ'

ఇcకను మనము చెదలువాడ యెఱ్ఱాప్రెగడ కాలమునుగూర్చి యించుక విచారింప వలసియున్నది. ఇతఁడు తాను రచించిన రామాయణమును హరి వంశమును పోలయవేమున కంకితము చేసి యుండుటచేతను, పోలయ వేముఁడు 1320 మొదలుకొని (కొందఱనునట్లు 1324 మొదలుకొని) 1349-వ సంవత్సరమువఱకును సామంతుఁడు గానో స్వతంత్రుఁడు గానో ప్రజాపాలనము చేసి యుండుటచేతను, ఇతc డా కాలమున నుండె ననుటకు సందేహము లేదు. ఇతఁడు తిక్కనసోమయాజి తరువాత నిరువది ముప్పది సంవత్సరములలోపలనే యుండియున్నట్టు కనబడుచున్నాఁడు. "ప్రజ్ఞాపవిత్రుc" డన్న నృసింహపురాణపద్యమునుబట్టి చూడఁగా నీతని వంశవృక్ష మీ విధముగా నున్నది.


వెలనాటిచోడుని కాలములో నున్న భీమనమంత్రికొడుకు బొల్లన; బొల్లన కొడుకెఱపోతన ఎఱపోతనయొక్క కొడుకు సూరన, సూరన కొడుకెఱ్ఱాప్రెగడ. వెలనాటిచోడునికాలమునం దుండి భీమన మంత్రికిని కవియైన యెఱ్ఱాప్రెగడకును నడుమ ముగ్గురు పురుషులున్నారు. ఒక్కొక్క పురుషునికిఁ గలయంతరము నలువదేసి సంవత్సరముల చొప్పున గణించినను భీమనమంత్రి తరువాత నెఱ్ఱాప్రెగడ నూట యిరువది సం త్సరములకు పుట్టియుండ వలెను. వెలనాటిచోడుఁడు 1151 మొదలుకొని 1163 వ సంవత్సరము వఱకును భూపరిపాలనము చేసెను. అతనిచే మన్నన గన్న భీమనయు నా కాలమునం దుండవలెను; ఒక్కొక్కcడు తండ్రికి నలువదేసి సంవత్సరముల యీడునఁ బుట్టుచు వచ్చినచో భీమనకొడుకు బొల్లన 1196 వ సంవత్సరమునఁ బుట్టి యుండవలెను. తరవాత నాతని కొడు కెఱపోతన 1236-వ సంవత్సరమున బుట్టి యుండవలెను; అటుపిమ్మట నాతని కొడుకు సూరన 1276 వ సంవత్సరమునందుc బుట్టి యుండవలెను; పిదప సూరనకొడుకు మనకవి యెఱ్ఱాప్రెగడ 1316 వ సంవత్సరము నందు c బుట్టి యుండవలెను. వెలనాటిచోడునివలన మిగుల మన్ననc బొందిన భీమనమంత్రి వెలనాటిచోడునికాలమునాఁటికే ముప్పది నలువది యేండ్ల ప్రాయముగలవాఁడయి యుండును గాన నాతనిపుత్రుని జననమున కటు తరవాత నలువదియేండ్లు వేయుట న్యాయము కాదు. అందుచేత నిరువ దేసి సంవత్సరములు తగ్గించుచు వచ్చినచో మనకవి జననకాలము 1396 వ సంవత్సరప్రాంతములకుఁ బోవును [ఇయ్యెడ 'ఆంధ్రకవి తరంగిణి" లో క్రింది విధముగఁ గలదు.

"భీమనమంత్రిని గౌరవించిన చోడుడు మొదటి యాతcడని శ్రీ వీరేశ లింగము పంతులుగా రభిప్రాయపడిరి. రెండవ చోడుఁడని నా యభిప్రాయము. ఇతనిని వీరేంద్ర చోడుఁ డందురు భీమనమంత్రి 1135 సంవత్సర ప్రాంతమున నీ వెలనాటి చోడునిచే గౌరవము నందెననియు, నప్పటి కాతఁడు ముప్పది సంవత్సరముల యిూడుగల వాఁడనియు భావించితి మేని, భీమనమంత్రి జననము క్రీ.శ.1140 ప్రాంతమైయుండును. తరమునకు ముప్పది మూఁడు సంవత్సరముల వంతునఁ జూచినచో, 1178 ప్రాంతమున బొల్లనయు 1210 ప్రాంతమున నెఱపోతసూరియు, 1245 ప్రాంతమున సూరనయు, నించుమించుగ 1280 వ సంవత్సరకాలమున మన యెఱ్ఱాప్రెగ్గడయు జన్మించి యుందురని దలంపవలసి యున్నది. శ్రీపంతులుగారనినట్లు మొదటి వెలనాటిచోడుఁడైనచో, నీయంతరమధికమై తరమునకు 45 సంవత్సరముల వ్యవధి యేర్పడి యస్వాభావిక మగును." (నాలుగవ సంపుటము, పుటలు 57, 58)

కులోత్తంగరాజేంద్రచోడుఁడే యిందుఁ బేర్కొనఁబడిన వెలనాటిచోడుఁడు.ఈ యంశమును నిర్ణయించుటకు మంచనకవి విరచితమైన కేయూరబాహుచరిత్రము మనకు కొంత తోడుపడుచున్నది. వెలనాటి గొంకరాజుమంత్రి నండూరి గోవిందామాత్యుఁడు, గొంకరాజుపుత్రుడైన వెలనాటిచోడుఁ డనఁబడెడు కులోత్తంగరాజేంద్రచోడుని మంత్రి గోవిందామాత్యుని కుమారుఁడైన కొమ్మనప్రధానుఁడు. కేయూరబాహుచరిత్రము ప్రధమాశ్వాసములోని యిూ క్రింది పద్యములను జూడుఁడు.

        మ. 'విహితాస్థానములందుఁ జూపుఁ దగ గోవిందాభిధానప్రభుం
             డహితోర్వీధరవజి గొంకవిభురాజ్యాధిష్టియై సంధివి
             గ్రహాముఖ్యోచితకార్యసంఘటన వాక్ప్రౌఢత్వమున్ బాఢస
             న్నహనోదగ్రరిపుక్షితీశ బహుసైన్యధ్వంసనాటోపమున్

     కం. ధీరుం డా గోవిందన
             కూరిమినందనుఁడు వెలసెఁ గొమ్మన గొంక
             క్ష్మారమణున కుదయించిన
             వీరుఁడు రాజేంద్రచోడవిభుప్రెగ్గడయై. 23
                                                               
         సీ. నవకోటిపరిమిత ద్రవిణ మే భూపాలు
                   భాండారమున నెప్డు బాయకుండు
             నేకోనశతదంతు లే రాజునగరిలో
                   నీలమేఘంబులలీలఁ గ్రాలు
             బలవేగ రేఖ నల్వదివేల తురగంబు
                   లే నరేంద్రువిపాగ నెపుడుఁ దిరుగుఁ
             బ్రతివాసరంబు డెబ్బదియేడుపుట్ల నే
                  యేవిధుమందల నెపుడుఁ గల్గు

             నట్టి యధిక విభవుఁ డగు కులో త్తుంగరా
             జేంద్రచోడనృపతి కిష్ట సచివ
             తంత్రముఖ్యుఁ డనుఁగు మంత్రి గోవిందనం
             దనుఁడు కొమ్మనప్రధానుఁ డొప్పు. 24

         ఉ. ఇల వెలనాటిచోడమనుజేంద్రునమాత్యత యానవాలుగాఁ
             గులతిలకంబుగా మనిన కొమ్మనప్రెగ్గడకీర్తి మాటలం
             దెలుపఁగ నేల ? తత్క్రియఁ బ్రతిష్టితమైన తటాక దేవతా
             నిలయమహాగ్రహారతతి నేఁటికి నెల్లెడఁ దాన చెప్పఁగన్ 25

ఆ కాలమునందు నియోగులు రాజులకడ మంత్రులుగా నుండుటయేకాక ఖడ్గతిక్కనవలె దండనాథులుగాc కూడ నుండి శత్రురాజులతో యుద్ధములు

సహితము చేయుచుండిరి. ఈ కొమ్మనామాత్యునిఁ గూర్చి కేయూరబాహుచరిత్రములో వ్రాయబడినదానిని చూడుఁడు.

     మ. అరుదండన్ వెలనాటిచోడమనుజేంద్రాజ్ఞాపనం బూని దు
         స్తరశక్తిం జని యేకవింశతిసహస్రగ్రామసంఖ్యాకమై
         ధరణిం బేర్చిన పాకనాడు నిజదోర్దండై కలగ్నంబు గాc
         బరిపాలించె నమాత్యకొమ్మన జగత్ర్పఖ్యాతి చారిత్రుఁడై 27

      క. చలము మెయిఁ గటకసామం
         తులు కరిహయబహుళసేనతో నేతేఱన్
         దలపడియెఁ గొమ్మసచివుఁడు
         బలియుండై క్రొత్తచెర్లపరిసరభూమిన్. 28


      సీ. నెలకట్టెవాటినఁ జెలఁగి రెంటిని మూటిఁ
                  గూడ గుఱ్ఱంబులు గదులుగ్రుచ్చుఁ
         బ్రతిమొగంబగు నరపతులకత్తళమునఁ
                 గడిమిమై వీcపులు వెడలఁబొడుచు
         బందంపుగొఱియలపగిది నేనుంగల
                 ధారశుదిగ నసిధారఁ దునుముఁ
         జిదియించుc బగిలించుఁ జేతులతీఁట వో
                 వడిఁ గాండ మేసి మావతులతలలు

         తల పుడికి వేసి మావంతుతలలు శత్రు
         రాజశిరములు ద్రొక్కించు రాఁగెఁ దిరుగ
         వాగె నుబ్పెడు తన వారువంబుచేత
         మహిత శౌర్యుండు కొమ్మనామాత్యవరుఁడు 29

ఈ కొమ్మనామాత్యునికుమారుఁ డై న కేతన వెలనాటిచోడునికుమారుడై న పృధ్వీశ రాజునకు మంత్రిగా నుండెను. పృధ్వీశ రాజు 1168 మొదలుకొని 1187-వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను. మంచన వీరి నిట్లు వర్ణించెను.

     క. "ఆ కొమ్మన పెగ్గడసుతుఁ
         డై కేతన చోడభూవరాత్మజుఁడై ధై

          ర్యాకరుఁ డగు పృథ్వీశమ
          హీకాంతుని మంత్రి యయ్యె నెంతయుఁ బేర్మిన్ 31


      ఉ. కౌశిక గోత్రభూసురశిఖామణి కేతన భూవరుండు పృ
         థ్వీశ నరేంద్రుమంత్రి యయి యెల్లెడఁ జాలఁ బొగడ్త కెక్కె నా
         కాశనదీమరాళశివకాశసురాశనతారకేశనీ
         కాశతరాధీరోచిరవకాశవికాసయశోవిశాలుఁడై . 32

ఈ పృథ్వీశరాజు మనుమసిద్దితండ్రి యైన తిక్కనృపాలువిచే రణరంగమున సంహరింపఁబడినట్టు విర్వచనోత్తరరామాయణఘలోవి యీ క్రింది పద్యము చెప్పుచున్నది.


     ఉ.'కేశవసన్నిభుండు పరిగీతయశోనిధి చోడతిక్కధా
         త్రీశుఁడు కేవలండె నృపు లెవ్వరి కాచరితంబు గల్గనే ?
         శై_శవలీలనాఁడు పటుశౌర్యదురంధరబాహుఁ డైన
         పృథ్వీశనరేంద్రుమస్తకము నేడ్తెఱఁ గందుక కేళి సల్పఁడే!'

ఇది 1187-వ సంవత్సరమునందు జరగి యుండును. అప్పటికి మనుమసిద్ధి తండ్రి యైన తిక్కరాజిరువదియేండ్లలోపలి వయస్సువాఁడయి యుండును. ఎఱ్ఱాప్రెగడ 1280 వ సంవత్సరప్రాంతములయందు జనన మొంది 1350 -వ సంవత్సర ప్రాంతము వఱకును జీవించి యుండును. ప్రోలయవేముని యనంతరమున నీతఁడు జీవించి యుండిన పక్ష మున వేముని పుత్రుఁడైన యనపోతనయాస్థానమున నీతఁడు కవిగా నుcడక యన్యులాస్థానకపులుగా నుండుట తటస్టింపదు. ఆనపోతనయాస్థానమునందు వెన్నెలకంటివారు కవులుగా నుండి యాతనికిఁ బ్రబంధము లొసంగినట్టు విష్ణుపురాణములో నీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.

      ఉ. ఈ నిఖిలంబు మెచ్చ నమరేశ్వర దేవుఁడు చూడఁ గృష్ణవే
           ణీనది సాక్షిగా ననికి నిల్చిన రావుతుఁ గేసభూవిభుం
           గానకుఁ దోలి వెన్నడిచి కాచిన వేమనయన్నపోతభూ
           జానికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలగంటివారిలోన్,

అనపోతారెడ్డికి ప్రబంధముల నొసగిన యాతఁడు వెన్నెలకంటి సూర్యుఁడు. ఈ సూర్యకవి యనపోతనయాస్థానమునం దుండి ప్రబంధములు చేయుటయే కాక యనపోతని తండ్రి యైన వేమారెడ్డిచేత నగ్రహారములు పడసినట్లు జక్కన విక్రమార్కచరిత్రములోని యీ క్రింది పద్యము తెలుపుచున్నది.

ఉ. "వెన్నెలకంటిసూర్యుఁడు వివేకగుణాఢ్యుఁడు వేదశాస్త్రసం
     పన్నుఁడు రెడ్డివేమనరపాలకుచేత మహాగ్రహారముల్
     గన్న కవీంద్రకుంజరుఁ డకుంఠితతేజుఁడు పెద్దతండ్రిగా
     సన్నుతి గన్న సిద్దనకు సంతతదానకళావినోదికిన్.

పోలయవేమారెడ్డి యవసానదినములయందు వెన్నెలకంటి సూర్యుఁడు తదాస్థానకవిగా నుండి యగ్రహారములను బొందుట మొదలయిన వానినిబట్టి విచారింపఁగా నెఱ్ఱాప్రెగడ వేమారెడ్డికాలములోనే పరమపదము నొందెనేమో యని యూహ కలుగుచున్నది. యెఱ్ఱాప్రెగడ యనవేమారెడ్డి నెఱుఁగకపోవుట కూడ నీ యూహను బలపఱుచుచున్నది. ఎఱ్ఱాప్రెగ్గడకు ముఖ్యాశ్రయుఁడును, అన్న యైన వేమారెడ్డి కీకవి నిచ్చినవాఁడును, అయిన మల్లదండనాధుఁడు గూడ వేమారెడ్డి కాలములోనే లోకాంతరగతుఁ డయ్యెను. తమ్ముని మరణానంతరమున వేమారెడ్డి తన ప్రియానుజన్ముఁడైన మల్లారెడ్డికి పుణ్యముగా నమరావతీ పట్టణములోని యమరేశ్వరాలయశిఖరమున స్వర్ణకలశముల నెత్తించెను. ఎఱ్ఱాప్రెగడజననమరణకాలములను గూర్చి పైని వ్రాయబడినవి సంభావ్యము లైన యూహలే కాని సరిగా నిర్ధారితములైన పరమ సిద్ధాంతములు కావు. [భారతా రణ్య పర్వశేష, నృసింహ పురాణ, రామాయణ, హరివంశములనేగాక యెఱ్ఱాప్రెగడ "కవి సర్పగారుడ" మను ఛందో గ్రంధమును వ్రాసినట్టు ఆనంద రంగరాట్ఛందమునం దుదాహృతములైన పద్యములను బట్టితెలియుచున్నది, కాకొని యట్లూహించుటకుఁ దగిన ప్రమాణములు లేవు.

ఎఱ్ఱాప్రెగడయును, తిక్కనయు సమకాలీనులనియు తిక్కన భారతమును రచింపఁ బూనుటకు ముందే ఎఱ్ఱాప్రెగడ '(నన్నయ) తద్రచనయకా' నరణ్యపర్వమును పూరించి, రాజరాజనరేంద్రుని కంకిత మిచ్చెననియు, అరణ్యపర్వము సమగ్రముగా నుండుటచేతనే తిక్కనయు, మారనయు భారతమున మూఁడు పర్వములను నన్నయభట్టు రచించెనని చెప్పియున్నారనియు నిటీవలఁ గొందఱు తలంచుచున్నారు.రెడ్డిరాజుల యాశ్రయము లభింపక పూర్వమే భారతారణ్యపర్వము పూరింపఁబడుటచే, దాని నెఱిగియే తిక్కన మూఁడు పర్వములు నన్నయ కృతములని చెప్పుటయు, తాను విరాటపర్వమునుండి తెలిఁగింపఁ బ్రారంభించుటయుఁ గుదురదు. ఎంత ప్రయత్నించినను, తిక్కన గతించిన నాఁటి కెఱ్ఱాప్రెగడ జన్మించెనని చెప్పుటకును ప్రబల ప్రమాణములు లభించుట కష్టము]

ఈ కవి రచించిన భారతపద్యము లీ వఱకే యుదాహరింపఁబడి యున్నందున, తక్కిన పుస్తకముల శైలికూడఁ దెలియుటకయి వానినుండి కూడ రెండేసి పద్యముల నుదాహరించుచున్నాను


                       ఎఱ్ఱాప్రెగడ రామాయణము

      మ. చెఱకు౦దోటఁలఁ బెంచి శాలిమయసుక్షేత్రస్థలు ల్నించి య
           క్కఱ లేకుండc బూగనాగ లతికాకారతారము ల్ప్రోచి యే
           డ్తెఱ నంతం గుముదోత్పలాళి వనపాటికోటిఁ బాటించి పై
           న్జెఱువు ల్వొల్చెఁ బురంబునల్దెసలఁ నలఁ బ్రస్ఫీతాంబుపూర్ణస్థితిన్."

       ఉ. కోఱలు నుగ్గు నుగ్గయిన క్రూరఫణీంద్రుగతిం దరంగముల్
           మాఱిన భూరివారిధిక్రమంబున రాహుకరాళ వక్త్రమున్
           దూఱిన తీవ్రభాను క్రియ దుర్బలనైన్యతఁ బుత్రహీనతన్
           గీఱి పరాభవాదిగతిఁ గీడ్పడి భూపతి నెమ్మనంబునన్.

                           హరివంశము

       ఉ. ఏ నిటు ప్రాణరక్షకయి యెంతయుఁ బాపము చేసి గర్భసం
           తానవిఘాతినై విను నుదంచితశోకపయోధి ముంచితిం

           బూనిన మత్కృతం బఖిలమున్ వృథ యయ్యె విధాత చెయ్వు లె
           వ్వానికి మాన్పఁగా నకట • వచ్చునె మానుషతుచ్చయ్నతన్.


పూర్వ .ఆ.5


                                                          
      శా. పాపాత్ముండగు దైత్యుచేఁ బడిన మీపాటంతయుం జెప్పఁగాఁ
           గోపం బుత్కటమై మనంబునను సంక్షోభంబు ప్రాపించె మ
           ద్రూపం బొండొక భంగి మీకు నిటలై తోఁచెన్ భవన్మంజులా
           లాపంబుల్ ప్రకృతిస్థుఁ జేసె నను నుల్లాసంబుతోఁ గ్రమ్మఱన్.


ఉ.ఆ. 4


                                                           

                          నృసింహపురాణము

       చ. సురుచిరపానపాత్రమున సుందరి యొక్క తె కేల నిండు చం
           దురుఁడు ప్రకంపితాంగకముతోఁ దిలకించెఁ దదాననాంబుజ
           స్ఫురితవికాసవైభవము సొంపు లడంకువ మ్రుచ్చలింపఁ జె
           చ్చెరఁ జనుదెంచి పట్టువడి చేడ్పడి భీతి వడంకుచాడ్పునన్.

       చ. ఇదె చనుదెంచెఁ జైత్రుఁడని యెల్లవనంబులకుం బ్రమోదముల్
           పొదలఁగ మేలివార్తఁ గొని బోరన వచ్చిన దాడికాఁడనన్
           మృదువన దేవతాముఖసమీర మెదుర్కొన నుల్లసిల్లె నిం
           పొదవఁగ దక్షిణానిల మనూనమనోహరఖేలనంబునన్.

ఈ నృసింహపురాణముమాత్రము నరాంకితము చేయక యెఱ్ఱాప్రెగడ యహోబలస్వామి కంకితముచేసి యున్నాఁడు. ఈ క్రింది దా పురాణము లోని మొదటి పద్యము :

       ఉ. 'శ్రీకి నిరంతరంబు కడుఁ జెన్నెసలారెడు రాగలీల ను
            త్సేకముఁ బొంది యొప్పు తనచిత్తము చూపెడుమాడ్కి నిత్యర
            మ్యాకృతి యైన కౌస్తుభము నక్కుపయిం బచరించు నుత్తమ
            శ్లోకుఁ డహొలోబలేశుఁ డతిలోకుఁడు లోకముఁ గాచుఁగావుతన్.

భారతమును తెనిగించిన కవుల నిట్లు వరుసగాఁ జెప్పుటచేత నవ్నయ భట్టారకునికిని, ఎఱ్ఱాప్రెగడకును మధ్యకాలమునందు తెలుఁగు కవులెవ్వరును లేరని భ్రమింపఁగూడదు. ఆధర్వణాచార్యుఁడు, భీమకవి, రంగనాధుడు, భాస్కరుఁడు, కేతన, మారన, పెద్దన మొదలయినవారీ మధ్య కాలములో ననేకు లున్నారు*[6]. వారివి గుఱించి కూడ సంగ్రహముగా నికమీఁద వ్రాయుచున్నాను.
  1. పేరమాంబా మనఃప్రియుడు-అని పాఠము
  2. బోలనకు -అని పాఠము
  3. లక్ష్మీనృసింహావతారమను పేరు శబ్దరత్నాకరమునఁ గలదు.
  4. 'పోలయ'కు బదులు 'ప్రోలయ' అని యంతట నుండఁదగును.
  5. [ఇతని రాజ్యారంభ కాలము 1324 అని 'ఆంధ్ర కవితరంగిణి' (సంపుటము '4 ఫుట 57]
  6. ఎఱ్ఱాప్రెగడ తన నృసింహపురాణమునందు సహితము నన్నయాతిక్కనలనే పూర్వకవులనుగా జెప్పి యున్నాఁడు---

            ఉ. భాసురభార తార్థమూలభంగుల నిక్క మెఱుంగ నేరమిన్
                గాసట బీసటే చదివి గాధలఁ ద్రవ్వు తెనుంగువారికిన్
                వ్యాసముని ప్రణీతపరమార్థము తెల్లఁగఁ జేసినట్టి య
                జ్ఞాసనకల్పులం దలతు నాద్యుల నన్నయతిక్క నార్యులన్' (పీఠిక-9)

    • (వీరి పౌర్వాపర్యముం గూర్చి యాయా సందర్భములందు వివరింపబడును.)