ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/నన్నెచోడకవి
న న్నె చో డ క వి
[1]నన్నెచోడ దేవుఁ డనెడి యీ కవి తెలుఁగున కుమారసంభవ మనెడు పండ్రెండాశ్వాసముల కావ్యమును రచియించెను. ఈ గ్రంధములోని మొదటి యే డాశ్వాసములను 1909-వ సంవత్సరమునందు బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు మొదటిభాగము గాఁ బ్రకటించి యాంధ్ర ప్రపంచమునకు మహోపకారము చేసిరి. వారా పుస్తకము యొక్క పీఠికలో నీ కవి కవిత్వ ప్రౌఢిమనుబట్టి కవిరాజ శిఖామణియనియు, దిగ్విజయమును బట్టి టేంకణాదిత్యుఁ డనియు, బిరుదములు గలవాఁ డయ్యెననియు, కావేరీ తీరమున నొరయూరను పట్టణము రాజధానిగా గోదావరీ, సింహళ మధ్య దేశము నేలె ననియు, క్రీ. శ.940 లోఁ బాశ్చాత్యచాళుక్యులతో యుద్ధము చేసి రణరంగమున నిహతుఁ డయ్యెననియు వ్రాసిరి. ఈ కవి కవిరాజశిఖామణి యన్నపేరును తానే పెట్టుకొనెను. గ్రంథాదియందే యవతారికలో నున్న యిూ పద్యమును జూడుఁడు.
చ. "రవికులశేఖరుండు కవిరాజశిఖామణి కావ్యకర్త స
త్కవి భువి నన్నెచోడుఁడఁటె! కావ్యము దివ్యకథం గుమారసం
భవమcటె ! సత్కథాధిపతి భప్యుఁడు జంగమమల్లికార్డునుం
డవిచలితార్థయోగధరుఁడట్టె వినం గొనియాడఁ జాలదే
[ఆ-1-50]
ఇతఁ డాత్మస్తుతియందు కొంచె మిష్టము గలవాఁడు. సూర్యవంశపురాజు లైన భగీరధుఁడు. రాఘవుఁడు మొదలయిన పూర్వులతోఁ దాను సమానుcడ నని యీకవి తన కుమారసంభవములో నీక్రిందిపద్యమునఁ జెప్పకొని యున్నాడు :
సీ. కుతలంబు నడుకొనఁ గొలకొండగా నిల్పి
శరనిధి గ్రొచ్చిరి సగరసుతులు
మిన్నులపైC బాఱుచున్నయే ఱిలఁ దెచ్చి
వారాశి నించె భగీరధుండు
గోత్రాచలము లెత్తికొని వచ్చి కడచన్న
రత్నాకరముఁగట్టె రాఘవుండు
జలధి మహీపతి మొలనూలుగాఁ జుట్టి
పాలించెఁ గరిఁగరికాలచోడు
గీ. వరుస నిట్లు సూర్యవంశాధిపతు లంబు
నిధియ మేర గాఁగ నిఖిల జగము
నేలి చనినవారి కెనవచ్చు సుశ్లాఘ
ధనుఁడ, నన్నెచోడ జనవిభుండ. [ ఆశ్వా.1-52 ]
దీనిక్రిందిపద్యములోనే తన తండ్రియైన చోడబల్లి పాకనాటి యం[2] దిరువది యొక్క వేయిటి కధీశుఁ డని కవియే చెప్పి యుండుటచేత నాతనికొడుకయిన నన్నెచోడుఁడును పాకనాటిలోఁ గొంతభాగమునకు ప్రభు వగుట స్పష్టము.
చ. 'అరినరపాలమౌళిదళితాంఘ్రియుగుం డయి పాకసూటియం
దిరువదియొక్కవేయిటి కధీశుఁడు నాఁ జను చోడబల్లికిం
జిరతరకీర్తి కగ్రమహిషీ తిలకం బన హైహయాన్వయాం
బరశశిరేఖ యైన గుణభాసిని శ్రీసతికిం దనూజుఁడన్.'
[ఆ.1-53]
ఈ పద్యముతరువాత నున్న యీక్రింద పద్యములోనే నొరయూరి
పురాధిపుఁ డన్న కథను జెప్పకొని యున్నాఁడు.
క. 'కలుపొన్న విరులు పెరుగం
గలకోడిరవంటు దిశలఁ గలయఁగఁ జెలఁగన్
బొలుచు నొరయూరి కధిపతి
నలఘుపరాక్రముఁడఁ డెంకణాదిత్యుండన్.' [ ఆ 1 -54 ]
ఈ పద్యము మొదటినుండియు నద్భుతకల్పనముగాఁ గనఁబడుచున్నది, ఆ యూరిలో రాతిపొన్న చెట్లు పువ్వులతోఁ బెరుగుచున్నవcట ! రాతికోళ్ళు దిశలు మాఱుమ్రోయునట్లుగా కూయుచుండునcట ! ఆహా! ఏమి యాయూరి మాహాత్మ్యము!
పూర్వము చోళరాజు లెవ్వరో కావేరీతీరమున తిరుచునాపల్లికి సమీపమునందున్న యొురయూరు రాజధానిగా రాజ్యపాలనము చేసినందునఁ దరువాతి చోళరాజ శాఖలలోనివా రందఱు నొరయూరిపురాధీశ్వరుల మని చెప్పకొనుట యాచార మయి యున్నది. ఈ యాచారము ననుసరించియే నన్నెచోడుఁడును నొరయూరి కధిపతి నని చెప్పుకొనెను. రాజ్యపరిమితిని గూర్చి పుస్తకములో నింతవఱకాధారము లున్నవి అంతకంటె నెక్కువగాఁ జెప్పినచో దానికి బలవత్ప్రమాణము లున్నఁ గాని విశ్వాసార్హము కాదు. ఈ కవి గోదావరిసింహళమధ్య దేశము నేలె ననువారు తమ వాక్యమున కాధారములైన ప్రమాణములను జూపి ఋజువుచేయవలెను. మన కిప్పటికిఁ దెలిసినంతవఱకా కథనము నిరాధార మయి యవిశ్వసనీయమైనదిగాఁ గనుపట్టుచున్నది. ఈతని దిగ్విజయములును గోదావరీ సింహళ మధ్యదేశ పాలనమువంటివే. ఇఁక నీ కవియొక్క కాలనిర్ణయము చేయవలసి యున్నది. ఈ కాలనిర్ణయమునకు సాధారణముగా పుస్తకములలో మూఁడు నాలుగాధారములుండును. అందొకటి కవివంశానువర్ణనము. అది యీ పుస్తకమునందు లేదు, కవి చోడబల్లి యని తనతండ్రి నొక్కనిని జెప్పుటయే కాని తత్పూర్వుల నెవరినిఁ బేర్కొనలేదు. చోళులచరిత్రమునందు చోడబల్లు లెందఱో కనఁబడుచున్నారు. వారిలో నీతని తండ్రి యెవ్వరో యీ పుస్తకమువలనఁ దెలియదు. రెండవది కృతిపతివంశ వర్ణనము, అదియు నీ పుస్తకమునందు లేదు. జంగమ మల్లి కార్జునుని నొక్కనిని మాత్రమే కృతిపతినిగాఁ జెప్పెను గాని కవి తత్పూర్వుల నెవ్వరిని వర్ణించి యుండ లేదు. బల్లిచోడులవలెనే మల్లి కార్డునులును ననేకు లున్నారు. వారిలో కృతిపతి యే మల్లికార్డునుఁడో చెప్పుట సులభసాధ్యము కాదు. గ్రంథ సంపాదకులైన రామకృష్ణకవిగారు తమ పీఠికలో ముగ్గురు జంగమ మల్లికార్జునులను పేర్కొని వారిలో భృంగిరిటియవతార మగు పండితారాధ్య మల్లి కార్డునుఁడు కాఁ డనియు, శైవాచారగురుపరంపరలో వానప్రస్తాశ్రమవర్తి యగు యోగిమల్లి కార్డునుఁడు కాఁ డనియు, మొదటి యిద్దఱిని నిరాకరించి మూఁడవ వాడయిన కొలాముఖమల్లి కార్డునుఁడు కావచ్చునని యంగీకరించిరి. మూఁడవది పూర్వకవి ప్రశంస. ఈ పుస్తకమునందదియు గానఁబడదు. కవి వాల్మీకి, వ్యాసుఁడు, కాళిదాసుఁడు, భారవి, భాణుఁడు మొదలయిన సంస్కృత కవులను కొందఱిని ప్రశంసించి తెలుఁగు కవులను విడిచిపెట్టెను. అయినను సంస్కృత కవులను బేర్కొన్న తరువాత
క. మును మార్గకవిత లోకం
బున వెలయఁగ దేశికవితc బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్రవిషయ[3]మున
జనసత్యాశ్రయుని తొట్టిచాళుక్య నృపుల్. [ ఆ.1-23 ]
అను పద్యమును, దాని తరువాత
చ. సురవరులం గ్రమంబున వచోమణి సంహతిఁ బూజచేసి మ
ద్గురుచరణారవిందములకుం దగ సమ్మతిఁజేసి కొల్చి వి
స్తరమతులం బురాణకవి సంఘము నుత్తమమార్గసత్కవీ
శ్వరులను దేశిసత్కవుల సంస్తుతిఁ జేసి మనోముదంబునన్.
[ ఆ.1-24 ]
శా. శ్రీరామేశకవీశ్వరాదు లెద నీశ్రీపాదము ల్భక్తితో
నారాధించి సమస్తలోకసముదాయాధీశులై రన్నసం
సారుల్ దుఃఖనివారణార్ధ మభవున్ సర్వేశు లోకత్రయా
ధారున్ నిన్ మదిఁ గొల్వకున్కి యుఱవే దారిద్ర్యవిద్రావణా!
[ఆ.10 - 90 ]
ఈ రామేశకవీశ్వరుఁడు కవికాలమునాఁటికి బ్రసిద్ధుడయి యుండిన శివభక్తుడైన యాంధ్రకవి యయి యుండును. పయి పద్యములోఁ బ్రథమపాదమున కవీశ్వరాదు లెద" యనుచోటు 'కవీశ్వరాదు లెడ్ద', యని వేసి సంపాదకులు డకారమును దేలఁ బలుకవలయు నని పట యడుగున నొక టిప్పణము వ్రాసిరి గణభంగము కలుగకుండ సాధారణ మైన 'యెద" యనురూపమును వేయక గ్రంథము పురాతనమైన దని చూపుటకుఁ దక్క నసాధారణమైన 'యెడ్డయనురూపమును వేసి యెడ్డలోని యెకారము లఘు వగు నని చూపుట కేల ప్రయాసపడ వలెను. రామేశ్వర కవిని గూర్చి "కవితరంగిణి" లో నిట్లు వ్రాయబడినది.
['రామేశ్వరకవి కవికాలము నాఁటికిఁ బ్రసిద్దుఁడై యుండిన యాంధ్ర కవియై యుండును' అని శ్రీ వీరేశలింగము పంతులుగారు వ్రాసియున్నారు.ఇతడాంధ్రకవి యనుట కాధారములు లేవు. ఏ భాషాకవియో చెప్పఁజాలము. కుమార సంభవకావ్యమునకు విమర్శనము వ్రాసిన శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రులుగారీ పద్యమున రామేశ్వరకవి ప్రశంసయే లేదని యభిప్రాయపడి యున్నారు. శ్రీ ముట్లూరు వేంకటరామయ్యగారు భారతి (వృష-శ్రావణము) లో కాకతీయ - రెండవ బేతరాజనకును, నాతని కుమారుఁడును దారిద్ర్యవిద్రావణ బిరుదాంచితుcడునైన త్రిభువనమల్ల దుర్గరాజునకును గురువై, వారిచే నగ్రహారములను గైకొని, కాలాముఖశైవ పరంపరకు సంబంధించిన శ్రీ శైల మల్లికార్జున మఠాచార్యుఁడుగ నుండిన రామేశ్వర పండితుఁడే పై పద్యములోఁ జెప్పిన రామేశ కవియై యుండుననియు, నన్నెచోడకవి దారిద్ర్యవిద్రావణ మకుటముతో రచించిన దశకమునకును, త్రిభువనమల్లుని దారిద్ర్య విద్రావణ బిరుదమునకును నేదియో సంబంధముండి యుండుననియు వ్రాసియున్నారు. రెండవ బేతరాజువలన రామేశ్వరపండితుఁడు దానమును బరిగ్రహించిన కాలము చాళుక్య విక్రమ శకము 23 [శా.శ.1019 క్రీ.శ.1017 - 1098 ].ఈ రామేశ్వరపcడితుఁడు పండితుఁడే కాని కవియైనట్లాధారములు లేవు. పై పద్యములో నీ రామేశ్వరుఁడే చెప్పఁబడెననుటకును నాధారములు కనఁబడవు.[పు. 175]
"మును మార్గకవిత" యను పద్యములో మార్గకవిత యనఁగా సంస్కృత కవిత్వమనియు దేశికవిత యనఁగా దేశభాషాకవిత్వ మనియు అర్ధము సంగీతరత్నాకరములోని యీ క్రింది శ్లోకము లీ యర్ధమును స్పష్టపఱుచుచున్నవి--
శ్లో|| గీతం వాద్యం తథా నృత్తంత్రయం సంగీత ముచ్యతే
మార్గో దేశీతి తద్ద్వేధా తత్ర మార్గ స్స ఉచ్యతే.
యో మార్గితో విరించాద్యైః ప్రయుక్తో భరతాదిభిః
దేవస్య పురత శ్శంభో నియతోభ్యుదయప్రదః
దేశేదేశే జనానాం య ద్రుచ్యా హృదయరంజకం
గీతం చ వాదనం నృత్తం తద్దేశీ త్యభిధీయతే.
1912 వ సంవత్సరమునందుఁ బ్రకటింపcబడిన తమ యాంధ్రుల చరిత్రము యొక్క ద్వితీయభాగములో శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు నన్నెచోడునిగూర్చి వ్రాయుచు 925-40 సంవత్సర ప్రాంతమున నున్న యీ సత్యాశ్రయుని నన్నెచోడమహాకవి తన కుమారసంభవకావ్యమున నీ క్రింది పద్యములోఁ బేర్కొని యున్నాఁడు
క. 'మును మార్గకవిత లోకం
బున వెలయఁగ దేశికవితఁ[5] బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్రవిషయమున
జనసత్యాశ్రయునిఁ దొట్టి చాళుక్యనృపుల్'
దీనిం బట్టి నన్నయభట్టారకుని నూఱేండ్లకుఁ బూర్వమే యాంధ్ర కవితాసతి వర్ధిల్లుచున్న దని స్పష్ట మగుచున్నది. ఈ పై పద్యమునందుఁ జెప్పబడిన సత్యాశ్రయునకుఁ దరువాతనే నన్నెచోడుఁ డున్నవాఁ డని నిస్సంశయముగాఁ జెప్పవచ్చును" అని వ్రాసిరి. ఈ సత్యాశ్రయకథనమువలన నన్నెచోడుఁడు 940 -వ సంవత్సరమునందు రణనిహతుc డయ్యె నన్న రామకృష్ణకవి గారి సిద్ధాంతము పూర్వపక్ష మయిపోయినది. అయినను రామకృష్ణకవిగారి కిటీవల లభించిన నన్నెచోడుని కుమారసంభవముయెుక్క ప్రత్యంతరములో పాఠభేదము కనఁబడి వారిసిద్ధాంతమును గొంతవరకు మరల నిలువఁ బెట్టినది. రామకృష్ణకవిగారు 1914 వ సంవత్సరము నందుఁ బ్రకటించిన నన్నెచోడుని కుమారసంభవముయొక్క ద్వితీయ భాగములో నీ పద్యపాఠాంతరమును "రంధ్రవిషయంబునఁ జనఁ జాళుక్య రాజు మొదలుగఁ బలువుర్ " అని చూపిరి ఈ పాఠభేదమునుబట్టి పద్య మీ విధముగా మాఱుచున్నది.--
క. "మును మార్గకవిత లోకం
బున వెలయఁగ దేశికవితc బుట్టించి తెనుం
గును నిలిపి రంధ్రవిషయం
బునఁ జనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్."
ఈ పాఠాంతరము సత్యాశ్రయుని బాధను తొలఁగించినను ఆంధ్రపత్రిక యొక్క 1911 వ సంవత్సరపు సంవత్సరాదిసంచికలో బుఱ్ఱా శేషగిరిరావు పంతులుగారు వ్రాసిన యీ క్రిందియంశమును గొంత పోషించుచున్నది .--
"సత్యాశ్రయుని తొట్టి చాళుక్యనృపులు ఆంధ్రవిషయమున తెలుగుఁ దేశ కవిత నిలిపిరని కవి వ్రాయుచున్నాఁడు. పైనుదాహరించిన శాసన నిదర్శనముల ప్రకార మిందుఁ జెప్పబడిన సత్యాశ్రయుండు భారతమును రచియించుటకు నన్నయను బ్రోత్సాహపఱిచిన రాజరాజనరేంద్రుఁ డని యూహింపఁ దగు. భారతమందు సత్యాశ్రయకులతిలక యని రాజరాజ విషయమున వాడcబడి యున్నది"
మొదటి పాఠమునుబట్టి సత్యాశ్రయకులతిలకుఁడైన రాజరాజ నరేంద్రుండు సత్యాశ్రయుండు కాకపోవచ్చును గాని యీ పాఠమును బట్టి చాళుక్యరాజు నిర్బాధకముగా రాజరాజనరేంద్రుఁడు కావచ్చును, అట్లయినచో నన్నెచోడుడు నన్నయభట్టునకుఁ దరువాతివాఁ డయి యుండవలెను.
నాలవది కవికొలమును నిశ్చయించుటకై ప్రధానసాధనము కవి గ్రంథము నారంభించిన సంవత్సరమునో, పూర్తి చేసిన సంవత్సరమునో పుస్తకమున వ్రాసికొనుట, ఈ కవి యదియుఁ జేసి యుండలేదు. అందుచేత మనము పుస్తకములోని సాధనసామగ్రి ననుసరించి యితరాధారములచేతనే కవికాల నిర్ణయమును జేయవలసి యున్నది.
బుజ్జా శేషగిరిరావుగారు త్రిభువనమల్ల చోడదేవుని కొడుకే నన్నెచోడుఁడని వ్రాయఁగా తమ యాంద్రులచరిత్రము ద్వితీయభాగముయొక్కయవతారికలో చిలుకూరి వీరభద్రరావు గారు
"శ్రీ బుఱ్ఱా శేషగిరిరావు ఎం-ఏ గారు పండ్రెండవ శతాబ్దము మధ్య నున్న త్రిభువనమల్ల చోడదేవుని చోడబల్లిగా భావించి యతని జ్యేష్టపుత్రుఁడైన నన్నెచోడుఁడే నన్నెచోడకవి యని సిద్ధాంతము చేసినారు; కాని త్రిభువనమల్లుఁడు చోడబల్లి కాఁజాలఁడు. అదియునుగాక త్రిభువనమల్లుని కొడుకైన నన్నెచోడునితల్లి మాబలదేవి యని శాసనములం గన్పట్టుచున్నది.కుమారసంభవమునఁ దన తల్లి శ్రీసతి యని నన్నెచోడకవి చెప్పకొనియున్నాడు."
అని వ్రాసిరి. తమ యాంధ్రులచరిత్రమునందు - శాసనమును బల్లయచోడ దేవుని కొడుకు కామచోడుఁ గని స్పష్టముగా ఘోషించుచుండగా దానికి ప్రత్యక్ష విరోధముగా చోడ బల్లికిఁ బెక్కండ్రుగురు భార్యలు గల రనియు, నన్నెచోడుఁడు పెద్దభార్యకొడుకనియు, కామచోడుఁడు మరియొక భార్య యొక్క తనయుఁ డనియు, మనమూహింపవచ్చు నని నిరాధారము లైన యూహలపై నూహలను పన్ని నన్నెచోడుఁడు క్రీ. శ.1116 వ సంవత్సరములోని శాసనములోఁ బేర్కొనcబడిన బల్లియచోడ దేవమహారాజు కొడుకని సిద్ధాంతము చేయ సాహసింపఁగలిగిన వీరభద్రరావుగారు త్రిభువనమల్లచోడునే బల్లె చోడునిగా భావించి యాతనిపుత్రుడైన నన్నె చోడునే నన్నెచోడకవినిగాఁ జెప్పిన శేషగిరిరావుగారి సిద్ధాంతము నేల నిరాకరింపవలెను ? శ్రీసతి మాబలదేవినామాంతరము కాఁగూడదా ? శాసనములలో నొక్కనినే చోడపల్లి, చోడవల్లి చోడమల్లి, బల్లిచోడుఁడు, బల్లయ చోడుఁడు మొదలైన నామములతో వ్యవహరించుచుండుట మనము చూచుచుండ లేదా ?
డి-48 సంఖ్యగల ది 1145-46 సంవత్సరపు నెల్లూరి శాసనములో
"స్వస్తి చరణసరోరుహవిహితలోచన త్రిలోచనప్రముఖాఖిల పృథివీశ్వర కారిత కావేరీతీర కరికాలకులరత్న ప్రదీపాహితకుమారాంకుశ శ్రీమన్మహామండలేశ్వర బల్లిచోడ మహారాజులు"
అని బల్లిచోడుని శాసనములో నున్నది. ఓ-19 సంఖ్యగల 1153-54 వ సంవత్సరపు నెల్లూరి శాసనములో నెనిమిదేండ్లకుఁ దరువాత
"స్వస్త్రి చరణసరోరుహవిహితవిలోచనత్రిలోచన ప్రముఖాఖిల పృథివీశ్వర కారిత కావేరీతీర కరికాలకులరత్న ప్రదీపాహితకుమా రాంకుశ శ్రీమన్మహామండలేశ్వర త్రిభువనమల్ల దేవచోడ మహారాజులు"
అని బ్రతిభువనమల్ల చోడ దేవుని శాసనములో నున్నది; డి-49 సంఖ్యగల 1166-68 వ సంవత్సరపు నెల్లూరి శాసనములో మఱి పదుమూఁడేండ్లకుఁ దరువాత
"స్వస్తి చరణసరోరుహవిహితవిలోచన త్రిలోచన ప్రముఖాఖిల పృథివీశ్యర కారితకావేరీతీరకలికాలకుల రత్న ప్రదీపాహితకుమారాంకుశ శ్రీమన్మహామండలేశ్వరబల్లిచోడ మహిరాజులు......"
అని మరల బల్లిచోడుని శాసనములో నున్నది. 1145 వ సంవత్సరము లోను, 1166 వ సంవత్సరములోను బల్లిచోఁడుడు రాజ్యము చేయు చుండగా నడుమను 1153 వసంవత్సరమునందు త్రిభువన మల్ల దేవుఁడు మఱియొకఁడు రాజ్యము చేయుట సాధారణముగా సంభవింపదు గావునను, ఒక్క యక్షరమైనను హెచ్చు తగ్గు లేక మూఁడు శాసనములలోను బిరుదావళి యొక్కటిగానే యున్నదిగావునను, ఈ శాసనములలోఁ బేర్కొనఁబఢిన బల్లిచోడుఁడును త్రిభువనమల్లచోడుఁడును ఏకపురుషుఁ డనుకొనుట సముచితముగాఁ గనఁబడు చున్నది.
మైసూరు చోడశాసనములలో మల్లి దేవచోడుని శిలా శాసనములు రెండు కానఁ బడుచున్నవి. వానిలో చళ్ళకెరెతాలూకాలోని మహాదేవపురమందలి వీర భద్రాలయముయొక్క తూర్పుగోడమీఁద నున్నది 43 సంఖ్యగల 1108 వ సంవత్సరపుది; ఓబలపురసిద్దరామేశ్వర దేవాలయములో దక్షిణమున శిల మీఁద నున్నది 21 వ సంఖ్యగల 1147 వ సంవత్సరపుది. ఈ రెండు శాసనము లును ఒక్కరి పేరివే యైనను మొదటిదానియందు "శ్రీమన్మహామండలేశ్వర త్రిభువనమల్లమల్లిదేవ చోళమహారా" జనియు, రెండవదానియందు 'శ్రీమన్మహామండలేశ్వర జగదేకమల్ల మల్లిదేవ చోళ మహారా' జనియు ఉన్నది. కారణాంతరములచేత శాసనములో నొక్కరికే వేఱువేఱు పేరు లుండవచ్చు ననియు, ఈ ప్రకారముగానే త్రిభువనబల్లి చోడమహారాజును బల్లిచోడ మహారాజు నొక్కరే యగుట విరుద్ధము కాఁజాల దనియు, చూపుట కొఱకు మాత్రమే యీ శాసనముల నుదాహరించితిని గాని వేఱు ప్రయోజన ముద్దేశించి కాదు. అయినను కాల సామ్యమును, నామసామ్యమును బట్టి చూడగా నా త్రిభువనబల్లిచోడమహారాజును , నీ త్రిభువనమల్లచోడ మహారాజును నొక్క-రే యయియుండవచ్చునేమో యని సందేహము కలుగుచున్నది. ఉభయులును సూర్యవంశజులు; కాశ్యపగోత్రజులు: కరికాలచోళకులాభరణులు. ఈ యూహ నిజమే యయి త్రిభువనబల్లి చోడ మహారాజు నకు మహిసూరులో కూడ కొంత రాజ్య ముండియుండినపక్షమునను, మన నన్నెచోడకవిరాజశిఖామణి బ్రతిభువనబల్లి చోడ మహారాజు పుత్రుఁడే యయిన పక్షమునను, నన్నెచోడునికిఁ గన్నడభాషలో విశేష పాండిత్య ముండె ననుటకుఁ దగిన కారణ మున్నది. పూర్వోక్తములై న రెండు శాసనములలో 43 వ సంఖ్య గలదానిలో క్రీ. శ. 1074మొదలు కొని 1126 వఱకును రాజ్యపాలనము చేసిన త్రిభువనమల్ల చక్రవర్తి యొక్క బిరుదావళి'సమస్తభువనాశ్రయం.......రాజాధిరాజపరమేశ్వరం........సత్యాశ్రయకులతిలకం' మొదలయిన విశేషణములతోఁ జెప్పఁబడినతరువాత చోడబల్లి నిగూర్చి"ఒరయూర పురవరాధీశ్వర, కరికాలచోళకులాంబరద్యు మణి, కాశ్యపగోత్రోద్భవ" మొదలైన విశేషణములు చెప్పఁబడినవి. ఈ ప్రకారముగానే 20-వ సంఖ్య గలదానిలో 1143 మొదలు 1154 వఱకు రాజ్యముచేసిన జగదేకమల్లచక్రవ ర్తి బిరుదులు సమస్తభువనేశ్వరాది వాక్యములతోఁ బేర్కొనఁ బడినపిమ్మట చోడ బల్లి యొరయూరపురవరాధీశ్వరాది బిరుదులతోఁ జెప్పఁబడెను. ఒక శాసనము త్రిభువనమల్లుని కాలము లోను, రెండవ శాసనము జగదేక మల్లుని కాలములోను వ్రాయఁబడుటయే. చోడ బల్లియెుక్కనామవ్యత్యాసమునకుఁ గారణము
నన్నెచోడుని కాలమును సరిగా నిర్ధారణము చేయుట కా కాలములో జంగమమల్లికార్జునుఁ డుండుటయు తండ్రి బలిచోడుఁడగుటయు, తల్లి శ్రీదేవి యగుటయు, ముఖ్యముగా మూఁడు కావలెను. ఈ విషయమును నిర్ణయించుటకు 1915-16 వ సంవత్సరపు దక్షిణమండల శాసనకార్య నివేదనపత్రిక (Epigraphical Report of the Southern Circle for the year 1915-16) మనకు కొంత తోడుపడుచున్నది. నర్సారావుపేట తాలూకాలోని కొప్పరపు గ్రామము నందలి కోదండరామస్వామి దేవాలయముముందున్న నాగ స్తంభముమీది 328 వ సంఖ్య గల శిలాశాసనములో చోడబల్లియు, మల్లికార్డునయోగియుఁ జెప్పఁబడి యున్నారు. శాలివాహనశకము 10౩7 అనఁగా క్రీ.శ.1115 జయసంవత్సర చై_త్రబహుళ అమావాస్యనాఁడు సూర్యగ్రహణసమయమునందుఁ జేయఁబడిన దానములను గూర్చి యీ శాసనము చెప్పుచున్నది. అప్పడు త్రిభువనమల్లచోడుని జ్యేష్టపుత్రుడైన కన్నడ చోడదేవుఁడు రాజ్యము చేయుచుండెను. త్రిభువనమల్లచోడుని ముగ్గురు పుత్రులలో నన్నెచోడుని జ్యేష్ఠునిగాఁ గొన్ని శాసనములు చెప్పుచున్నను, మఱికొన్ని శాసనములు నన్నెచోడుని కనిష్ఠపుత్రునిగాను, కన్నెరచోడుని జ్యేష్టపుత్రునిగాను జెప్పుచున్నవి. ఈ శాసనమునందు రాజు యొక్క వంశపరంపరాగతమంత్రియు నీశ్వరనాయకపుత్రుఁడును నయిన మారన రెండు గొప్పచెఱువులు త్రవ్వించి కొప్పరగ్రామములో సోమేశ్వ రాలయము కట్టించి యెుక తటాకము నిర్మించినట్టును రాజు తమ్ముడైన చోడబల్లి కొప్పరము సమీపమున నున్న బైడిపల్లిని దానము చేసినట్టును, ఈ దానములను మారన ప్రార్ధనముమీఁద విష్ణువర్ధనునిక్రింది యధికారి యైన మహామండలేశ్వరకడియరాజు స్థిరపఱిచినట్టును, సోమేశ్వరాలయము పాలూరునందలి కాలాముఖ సన్యాసి మల్లికార్జునుని పాలనమునందుంచcబడినట్టును, చెప్పఁబడి యున్నది. ఈ శాసనమును బట్టి చూడఁగా బల్లి చోడుఁడు మొదలైనవారు సర్వస్వతంత్రులుగాక పేరునకైనను చాళుక్యచక్రవర్తులకు లోఁబడిన మహామండలేశ్వరు లనియు తేటపడుచున్నది. ఈ శాస నమును బట్టి చూడఁగా నన్నెచోడుని సోదరుని కాలములో కాలాముఖమల్లికార్జునయోగి యుండినట్టును, నన్నెచోడునితండ్రి చోడబల్లి యనబడెడు త్రిభువనబల్లిచోడుఁడయి నట్లును రెండంశములు స్థాపింపఁబడినవి. ఈ చోడబల్లికిఁ ద్రిభువనమల్లచోడబల్లి యని పేరు వచ్చుట కతఁడు త్రిభువనమల్ల చాళుక్యచక్రవర్తి పాలనకాలములో నుండుట కారణమని మనము సులభముగాఁ దెలిసికొనవచ్పును. ఈ బల్లి చోడునికిఁ గామచోడబల్లి యనియు నామము గలదు. ఇఁక తల్లినిగూర్చిన మూడవ యంశము స్థాపింపఁబడవలెను. ఈ సన్నెచోడునితల్లి మాబలదేవి యని శాసనము చెప్పచున్నది. శ్రీసతికి మాబలదేవి మాఱు పేరు కాcగూడదా ? కావచ్చును.
ఈ సంబంధమున 1915-16 వ సంవత్సరపు కార్యనివేదనపత్రికలోనే "పేర్కొనబడిన ౩68 వ సంఖ్య గల నన్నెచోడుని శాసనమునే విచారింతము. ఈ శాసనము శక సంవత్సరము 1175 అనగా క్రీస్తుశకము 1153 వ సంవత్సరము విషువత్సంక్రాంతినాఁడు సోమేశ్వరాలయమునకుఁ జేసిన భూదానములను గూర్చినది. ఈ కాలమునందు రాజ్యమేలుచుండినవాఁడు మహామండలేశ్వరత్రిభువనమల్ల దేవమహారాజాత్మజుఁ డైన నన్నెచోడుఁడు. ఈ శాసనము నరసారావుపేట తాలూకాలోని చెన్నుపల్లియగ్రహారమునcదలి పరశువేదీశ్వరాలయముయెుక్క యెదుటనున్న నంది స్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. ఈ శాసనములో నన్నెచోడునికి కన్నరచోడుఁడు సోదరుఁడయినట్టును మాబలదేవి తల్లియైనట్టును చెప్పఁబడినది ధపు ప్రథమ శాసనమునందు చెప్పఁబడినట్టు నన్నెచోడునికి మాబలదేవి తల్లి యగుట సత్యమా ? ఈ ద్వితీయ శాసనమునందు జెప్పఁబడినట్టు మాచలదేవి తల్లి యగుట సత్యమా ? రెండును సత్యములే. రెంటికిని శ్రీసతి యనియే యర్ధము. గాలి నరసయ్యశాస్త్రి తన యింటిపేరైన గాలికి ప్రభంజనమనియు, నరసయ్య కహోబలుఁడనియు, పర్యాయపదములు వేసికొన్నట్లే కవులు పేరులకు పర్యాయ పదములు వేయుట మనలో నాచారమై యున్నది.
మా + అబల = శ్రీ(లక్ష్మి,) అబల = సతి (స్త్రీ) మాబల = శ్రీసతి
మా + అచల = శ్రీ, అచలదేవి = (పర్వతపుత్రి)సతి, మాచల దేవి = శ్రీసతి
'మాబల' యనిగాని 'మాచల' యని గాని పద్యములో వేయవలసిచో దానితుదను దేవీపదము చేర్పవలసి యుండును. కవి తాను రచించిన చంపకమాలలో గణ సౌలభ్యార్ధము మాబలార్థబోధక మయిన శ్రీసతి పదమును ప్రయోగించి యుండును. ఇది తృప్తికరమైన సమాధానము కాకపోయినను, ఇంతకు మించి యాధారము దొరకనప్పుడు దీనినే సరిపఱచుకొనవలెను. ఇప్పటికి దొరకిన యీ యాధారములనుబట్టి నన్నెచోడుcడు 1150 కిఁ దరువాత నున్నవాడఁని యేర్పడుచున్నది. ఆ కాలమందలి మండలేశ్వరు లందఱును రాజ్యకాంక్షచేత నొండొరులతోఁ బోరాడుచు జయాపజయములను బొందుచు నుండెడివారు. ఈ యల్ప యుద్ధములలో నొక్కదానియందు 940 వ సంవత్సరమునందు కాకపోయినను నన్నెచోడుడు తరువాత నిన్నూటనలువది సంవత్సరములకయినను ని హతుఁడయు యుండును. మూఢ విశ్వాసములధికముగాఁ గల యాకాలము నందాతని మృతిని శుభాశుభగణవిధిజ్ఞు లయిన లక్షణజ్ఞులు మగణముతరువాత రగణము వేయుట కారోపించుటయు, సామాన్యజను లా మాటలను విశ్వసించుటయుఁ దటస్థించెను. అందుచేత సన్నెచోడునకుఁ దరువాత గొంతకాలమున కున్న యధర్వణాచార్యుఁడు తనఛందస్సులో నీ క్రిందిపద్యమును వేసెను. క. "మగణమ్ముఁ గదియు రగణము
వగవక కృతి మొదట నిలుపువానికి మరణం
బగు నిక్కమండ్రు, మడియఁడె
యగు నని యిడితొల్లి టేంకణాదిత్యుఁ డనిన్."
ఈ పద్యమునుబట్టి నన్నెచోడుఁడు శుభాశుభగణపరిజ్ఞానములేనివాఁడని యధర్వణునియభిప్రాయ మయినట్టు తేలుచున్నది. నన్నెచోడుఁడు తన కుమారసంభవమునందు స్రగ్ధరావృత్తములో మగణము తరువాత రగణముండియే తీఱవలెను. ఈ నన్నెచోడకవి నన్నయభట్టారకునకును, తిక్కన సోమయాజికిని నడిమికాలమునం దున్నవాఁడు. ఇతడు తన పుస్తకము నందు సుకవి స్తుతియు కుకవినిందయు షష్ఠ్యంతపద్యములను వేసియున్నాఁడు. వీనిని వేయుటలో మొదటివాఁడని యింతవఱకును తిక్కని సోమయాజికి వచ్చిన ప్రతిష్ట యిప్పు డాతనినుండి తొలఁగి యీతనిని జేరు చున్నది.
[శ్రీరామకృష్ణకవిగారు కుమార సంభవమును పూర్తిగాఁ బ్రకటించిన ముప్పది మూఁడేండ్లకుఁ బిదప మద్రాసు విశ్వవిద్యాలయమువారును, శ్రీవావిళ్లవారును 'కుమారసంభవము" ను బ్రకటించియున్నారు. విశ్వవిద్యాలయమువారి-ప్రచురణకు శ్రీ కోరాడ-రామకృష్ణయ్యగారి విపుల 'పీఠిక' కలదు నాఁటివఱకును ఈ కావ్యమునుగూర్చి కలిగిన చర్చల నన్నింటిని పరిశీలించి యొకరీతి సిద్ధాంతముగనే శ్రీరామకృష్ణయ్యగారు కవి కాలాదులను గూర్చి వివరించియున్నారు ఆ విషయము సంగ్రహముగా నిచటc దెలుపఁబడును.
"ఈ కవికాల నిర్ణయమునుగూర్చి పరిశీలించిన వారిలో నొకరిద్దరు తక్క తక్కిన వారందరు నన్నయ తరువాతి వాఁడని నిరూపించుటకే యత్నించిరి. అందు పలువురు నన్నయ తిక్కనల నడిమికాలపువాఁడై యుండునని తలంపఁగా నిటీవల 'కుమార సంభవ విమర్శనము' ను బ్రకటించిన శ్రీ లక్ష్మీపతి శాస్త్రులుగారు తిక్కనకుఁ గూడఁ దరువాతివాఁ డగునని యాంతరంగికములగు కొన్ని పోలికలనుబట్టి నిర్ణయింప యత్నించిరి. ఇట్లీ కవి కాలనిర్ణయమునకు నిష్కృష్ణమగు శాసనాధారము లేకపోవుటచే నాంతరంగిక నిదర్శనములనుబట్టి క్రీ శ 940 మొదలు క్రీ శ. 1300 వరకు గల నడిమి కాలమున నీతని యునికి యూగులాడు చుండవలసి వచ్చినది.
ఈ మధ్యకాలము ముఖ్యముగా మూడు తరగతులుగా విభాగింపదగియున్నది. ఒకటి నన్నయకు పూర్వమని రెండవది నన్నయకు సమకాలికము-లేదా నన్నయ తిక్కనలకు నడిమి భాగమని, మూడవది తిక్కనకు తరువాతికాల మని. ఈ మూడవది - నన్నిచోడుఁడు తిక్కనకు తరువాతికాలపువాఁడను వాదము తక్తినవానికంటె నర్వాచీనము. శాసన నిదర్శనము నిష్కృష్టమైనదిగాఁ గానఁబడనందున నాంతరంగిక నిదర్శనమగు రచనలోని పోలికలనుబట్టి విచారింపఁగా గొన్ని విషయముల తిక్కన కేతనల భావములను, రచనలను నన్నిచోడు డనుకరించెనని శీలక్ష్మీ పతి శాస్త్రిగారికి తోచుటచే నాయనయే యా మూడవ పక్షవాదమును తొలుత ప్రతిపాదించిన వారైనారు. ఇంక ననేకవిధములగు పోలికలు ఇతర కవులతో సమానముగఁ గనఁబడుచుండఁగా, వారు చూపిన పోలికలైనను చోళుని రచననే వారనుకరించి యుండఁగూడదా ? యను సందేహమును నిశ్శేషముగాఁ దీర్చునవి కాకపోవుటచే తిక్కన తరువాతి వాఁడను నర్వాచీన వాదము నంతగా మనము పాటింపవలసిన యావశ్యకత కనఁబడదు.
ఇఁక నన్నయకుఁ బూర్వుఁడనునది తొలివాదము. కవి తననుగూర్చి చెప్పికొనిన గ్రంధస్థ విషయములలో తల్లిదండ్రుల నామములు కలవు . .పురాతన శాసనములఁ బరిశోధింపఁగాఁ బెక్కండ్రు నన్నిచోడు లగపడు చున్నారు గాని వారిలో గొందఱు మాత్రమే చోడబల్లియను రాజునకు బుత్రులుగాఁ బేర్కొనఁబడియైన నుండిరి గాని, ఎందునను దల్లి పేరు లేనందున నిస్పందేహముగా నిర్ణయించుటకు వీలే లేకున్నదనుట వాస్తవము. నన్నిచోడుఁడు కావేరీతీరమునందలి యొరయూరి కధిపతినని, టెంకణాదిత్యుండనని చెప్పుకొనినంత మాత్రముచేత-అతని తండ్రి చోడబల్లి పాకనాటి యందిరువదియొక్క వేయింటి కధీశుఁడని చెప్పుచుండఁగా - నీతఁడు అచ్చటి వాఁడును, పాకనాటి చోడ వంశము వాఁడును గాక - ఒరయూరును పాలించుచు (మగణమ్ము గది రగణమ్మును వేసి పద్యము చెప్పుటచే) పాశ్చాత్య చాళుక్యరాజులచే రణరంగమున నిహతుఁడైన వాఁడనుట సంభావ్యముగాఁ గనఁబడదు. ఆంతరంగిక సాక్ష్యమగు వ్యాకరణచ్ఛందో విశేషా పూర్వపద ప్రయోగములలోఁ గొన్ని నన్నయ తరువాతి కవులలోఁ గూడఁ గనఁబడుటచేత - వాని విషయమున నన్నయ యవలంబించిన దానికంటె భిన్నమగు సంప్రదాయము నవలంబించినవాఁడనియే వ్యక్తమగుచున్నది గాని, నన్నయకుఁ బూర్వఁడను కాలనిర్ణయమున కిది తోడ్పడునదిగా లేదు. (పీఠిక పుటలు VI-VIII)
ఇక నన్నిచోడుని నన్నయకు సమకాలికునిగా నిశ్చయించినవారిలో శ్రీ దేవరపలి (వెంకట) కృష్ణారెడ్డిగారు ముఖ్యులు. ఉద్భటుని గూఢ వస్తుమయకావ్యమునం దాదరము చూపిన సన్నిచోడునకుఁగూడ గూఢ వస్తుమయరచనయం దాదరము కలదనియు, కావుననే గ్రంధరచనాకాలమును 12-వ ఆశ్వాసమందు గూఢముగ "ఖడ్గలత పూచెనొ నాజయజై_త్ర సంపదన్’ అను పద్యములో జయసంవత్సర, జయమాస, జయతిధి, జయ వారమైనట్లు సూచించినాఁడనియు, ఇది విక్రమయంగపద్ధతిని తిధివారనక్షత్రముల కలయికచే క్రీ. శ. 1057 సం. సరిపోవుననియు, కావున నాతఁడు నన్నయకు సమకాలికుఁ డగుననియుఁ దెలిపిరి. వీరు చూపిన లెక్కలలోఁ గూడ నొక సంవత్సరము తేడా కనcబడుచునేయున్నది. ....నన్నిచోడుని వాస్తవాభిప్రాయము నిది యెంతవరకు సమర్ధింపగలదో తెలిసికొను నితరాధారమేమియునులేదు. ఇది యిట్లండ నిదివరకు లభించిన శాసనములలో నీకాలపువాఁడగు నన్నిచోడుని సూచించు శాసన మేదియు బయలు పడలేదు.... కావున నీకవి నన్నయ తిక్కనల నడిమివాఁడనువారి వాదమే యిప్పటి కాదరణీయముగా కనఁబడుచున్నది [పుట xii]
..చోడబల్లి పాకనాటియం దిరువదియొక్కవేయింటి కధీశుఁడేనా ? యను సందేహమున కాతని తరువాతి తరమువాఁడు, శాసనకర్తయగు మల్లిదేవచోడున కాబిరుదమున్నప్పు డీతనికి నుండి యుండునని మన మూహింప వచ్చును. దీనినిబట్టి యీ చోడబల్లి నన్నిచోడు లిద్దరు పాకనాటిలోనివారే యనుటయైనను స్పష్టమగును. ఇక సామాన్యపుశంకల నట్టుంచి. యీ శాసనములవలన చోడబల్లికొడుకు నన్నిచోడుడు, ఈతని కరికాలచోడాన్వయజనితత్వము, పాకనాటిలో నునికి, ఏకవింశతి సహస్రగ్రామావనీ వల్లభునితోడి సంబంధము చోడబల్లిచే నారాధింపబడిన యెుక కాలముఖ వ్రతుఁడగు మల్లికార్జున యోగి, దారిద్ర్యవిద్రావణ బిరుదముగల ప్రభువు. రామేశకవి - అను నిన్ని విషయములు గిట్టినవి కావున నీ కవి క్రీ శ 1100 ప్రాంతమువాఁడని, నన్నయ కవ్యవహిత పరమందుండి యుండునని తలంపు వచ్చును. [పు. X111]
నన్నిచోడుని కాలమును గూర్చి విపులముగ విమర్శించిన పిదప 'ఆంధ్రకవి తరంగిణి' కారులు కుమార సంభవ మందలి పదప్రయోగాదులనుబట్టి నన్నిచోడుడు ప్రాచీనుఁడనియు, నతనిది ప్రాచీన కవిత్వమనియు నన్నయకుఁ బూర్వుఁడో, పరుఁడో నిర్ణయింపఁ జాలము" అని వ్రాసియున్నారు. [పుట 202]
ఈ విషయమున 'తెనుఁగు కవుల చరిత్ర" లో గ్రింది విధముగఁ గలదు.
'ఈతఁడు రాజైనను, ఈ గ్రంధమున చారిత్రకాంశములను తెలుపక పోవుట చేత నీతని కాలము వివాదములకు మూలమైనది. అవి నాలుగు విధములు - 1. ఈ కవి తెనుఁగున నాదికవియని యనుకొనుచున్న నన్నయభట్టారకునకు పూర్వుఁడు అనఁగా క్రీ. శ. 940 ప్రాంతమువాఁడు. 2. నన్నయతో సమ కాలికుఁడు అనఁగా 1051 సం. ప్రాంతమువాఁడు. 3. నన్నయకు వెనుకనొక శతాబ్దిలోపువాఁడు. ఆనఁగా క్రీ. శ. 1130-1150 సం. ప్రాంతము వాఁడు. 4. తిక్కనకు తరువాతివాఁడు అనఁగా సం. 1275-1350 ప్రాంతము వాఁడు. నన్నెచోడకవి క్రీ శ సం 1130-50 ప్రాంతమువాఁడనియే నేఁడంగీకృతమైనది'.] [పుట 200]
కుమారసంభవములో నితఁడు చేసిన కుకవినింద యిది.
గీ. 'చెనసి గుణమైన దోషంబు సేయ నేర్చుఁ
గుకవి కృతులందు దోసంబు గుణము సేయ
నేరc, డది యట్ల దొంతులు చేరినాయి
దోర్ఫనేర్చుఁ గా కది యేమి చేర్పనేర్చు [ అ 1-19 ]
ఈ పద్యమునం దితఁ డనావశ్యకముగా కుక్కయనుటకు మాఱుగా "నాయి" యను నన్యభాషాపదమును ప్రయోగించి యున్నాఁడు. ద్రవిడభాషలోను, కన్నడభాషలోను కుక్కను నాయి యందురు. ఇట్లు తఱచుగా కన్నడ పదముల నుపయోగించుటయు, గ్రాంధికభాషలోను వ్యావహారికభాషలోను గూడ లేని యప్రతీతపదములను వాడుటయు స్వచ్చమయిన యీతని కవిత్వమునకుఁ గొంత కళంకమును దెచ్చుచున్నవి. *[6] దీనిని మనస్సునం దుంచుకొని యీ కవి నుద్దేశించియే కాఁబోలును తిక్కనసోమయాజి తన విర్వచనోత్తర రామాయణపునందుఁ గుకవిదూషణముగా నీ క్రింది. పద్యమును వేసి యున్నాఁడు.
చ. పలుకులపొందు లేక రసభంగము చేయుచుఁ బ్రాఁతపడ్డ మా
టలఁ దమ నేర్పు చూపి యొకటన్ హృదయం బలరింపలేక
యే పొలమును గానియట్టి క్రమముం దగ మెచ్చుగ లోకమెల్ల న
వ్వులఁబొరయం జరించు కుకవుల్ ధర దుర్విటులట్ల చూడఁగన్."
ఈ పద్యమునందు దుష్కవులు దుర్విటులతోఁ బోల్పఁబడి యున్నారు. కొందఱు పొగడినంత యత్యుత్తమమయినది కాకపోయినను, నన్నెచోడుని కవిత్వ మన్యభాషాపదదూషితము కానియెడల నుత్తమమయినదనియే చెప్పవచ్చును. ఇతడు సంస్కృత గ్రంధములను మాత్రమేకాక కన్నడ గ్రంథములను సహితము విశేషముగాఁ జదివి యుండుటచేత నాగ్రంధముల యందలి భావములను, పదములను గొంత చేకొనియున్నాఁడు. ఈ యంశమును స్థాపించుటకై పుస్తకసంపాదకులు చూపినవానిని మాత్రమే యొకటి రెంటినిం దుదాహరించుచున్నాను.
క. ముదమున సత్కవి కావ్యము
నదరక విలుకొనిపట్టినమ్మును బరహ్భ
ద్భిదమై తల యూఁపింపని
యది కావ్యమో ? వాని [7]పట్టినదియుం గరమే [ఆ1- 41]
అనెడు ప్రథమాశ్వాసములోని యీ నలువదియొకటవ పద్యము
శ్లో. కిం కవే స్తస్య కావ్యేన కిం కాండేన ధనుష్మతః
పరస్య హృదయే లగ్నం న ఘూర్ణ యతి యచ్చిరః
అను సంస్కృత శ్లోకమునకు తెలుఁగు, పయి వద్యము పీఠికలో నున్నట్టు చేకొనఁబడినది. గ్రంధములో 'నదరక' యన్నచోట 'నదరఁగ' ననియు, 'వానిపట్టినది" యనుచోట "మలరిపట్టినది" యనియుఁ బాఠ భేదములు గలదయి యున్నది.
మహస్రగ్ధర. హర హాసాకాశగంగాత్యమలజలమరాళాబ్జ నీహారధాత్రీ
ధరకర్పూరేందుకాకోదరవరపతిదిగ్దంతి పక్షిరనీరా
కరముక్తాహారకుందోత్కఠ రజత శరత్కౌముదీ ద్యోతకీర్తీ
శ్వరునాత్మారామువాణీ వరువరగురుసర్వజ్ఞునజ్ఞానదూరున్.
చతుర్ధాశ్వాసాంతమందలి యీ 475 వ పద్యము
'హరహాసాకాశగంగాజలజలరుహనీహారధాత్రీ
ధరనీహారాంశుతారావనిధరశరదంభోధరక్షీరనీరా
కరతారాభారతీదిగ్రదనిరదనపీయూష డిండీరముక్తా
కరకుందేంద్రేభహంసోజ్జ్వలవిశదయశోవల్లభం శాంతినాధమ్.'
సీ. కరలత లందంద కామపాశంబుల
నదిమి బంధించుచున్నట్లు బిగియ
నొదవఁ బేర్పిందులఁ బదనై న పూఁత లం
గమునకు వజ్ర లేపములుగాఁగఁ
బులక లొండొరుల మేనుల నుచ్చిపోయి డ
గ్గఱ మొల లిచ్చినకరణిగాఁగఁ
గనకంపుఁబ్రతిమలు గాఁచి యంటించిన
ట్లొడఁగూడి తనువు లొండొంటిఁ గదియ
గీ. దగఁగ నొక్కతలకు మొగములు రెండైన
పగిది దలలు మాఱుమొగము పడఁగ
గీఱి మేను మేను [8] దూఱ గాఢాలింగ
నంబు చేసి రంగనయుఁ బ్రియుండు.
అణు కుమారసంభవ నవమా శ్వాసములోని 149-వ పద్యములోని 'యొక్క తలకు రెండు మొగము లో యను నుత్ప్రేక్ష తక్కఁ దక్కిన భావము లన్నియుఁ గల" వని సంపాదకులు కన్నడ జగన్నాధవిజయము లోని యీక్రింది పద్యమును పూర్ణముగా నుదాహరించి యున్నారు.
మ. ఉరదింపెర్మొలెబెంగెమూడె చెమర్గళ్ బల్వజ్రలేపంబొ లా
గిరె, కీల్గొట్ట బెడంగనీయె పులకం, తోళ్తోళ్గేగంటిక్కిదం
తిరె, మెమ్మెయ్యొళడంగు వంతమరె, గాఢాలింగనంగెయ్దు న
ల్లరదేనిర్దరొకాసి బెచ్చ తెఱదిం శ్రీసత్యభామాచ్యుతర్".
సీసపాదము. అనులేపనములు మండనములు లేకయు
భాసురాంగములింత దేసియగునె. [ ఆ.6.పద్య.52 ]
ఇందలి దేసి పదము సుందరమైన యను నర్థ మిచ్చెడు కర్ణాటకపదము.
క. దోస మనేగుణదవోలు
ద్భాసిసి కన్నడదళొల్దుపూర్వాచార్యర్
దేసియనే నిఱిసిఖండ
ప్రాసమనతిశయమదెందు యనియం మిక్కర్.
(కవిరాజమార్గము.)
ఈ కవిరాజమార్గకర్త 814-887-వ సంవత్సరముల మధ్యమున నున్న నృపతుంగుఁడు,
వెంచలు.
చ. ఎలమిన పూరి మేసి సెలయేఱుల నీరులు దాగి మేలి వెం
చల నెలమావిజొంపములఁ జల్లని నీడల నిల్చి పొల్పి మQ
దలు గొని నందిపోతులునుఁ దారునుఁ బేయలు సమ్మదంబునన్
గలసి రమించుధేనువులఁ గాంచిరి తద్విపి నాంతరంబునన్.
[ ఆ.6.పద్య.50 ]
వెంచలనఁగా కన్నడమున సరస్సులు.
క. వికచసరసీరుహం కో
కకులవ్యాభాసి పూగొళం తానిరెయుం
బకనికరాలులితకలు షో
దకవిడిళ దొళంచె వెంచెయొళ్ వసియికుమే --గుణవర్మ.
ఈ గుణవర్మ 1050-వ సంవత్సర పాంతములం దుండినవాఁడు.
కొలవేళులు
సీసపాదము. మోసుల వీజనంబులు సేయుఁ గొలవేళు
లిరవుగాఁ గూర్చి చామెరలు చేయు.
[ఆ. 5. పద్య.136]
కొలవేళులనఁగా కన్నడమున వట్టివేళ్ళు
చ.'తరుణియరావిలాసకుసుమాస్త్ర..నీక్షి సెకామతాపదిం
తరుణమృణాలమంతెగెదుపూ గొళదిం పొఱ గిక్కిదండదిం
కొరగి మృణాళనాళికెగెచందనదణ్కెగెతిఱ్చుళిల్గెత
ర్గొరగదసూసునీర్గెకొలవేర్గొడల గుఱిియాగెమాడువర్ - (మల్లినాధపు)
మల్లినాధవురాణకర్త యైన నాగచంద్రుఁడు 1105 వ సంవత్సరప్రాంతములందున్నవాఁడు.
కండవడము.
చ. బెదరుచు నతరంగమున భీతికిఁ గండవడంబు సుట్టి ప
ల్కెదు పొరపొచ్చెమున్ వెఱపుఁ గేనముఁ జెయ్యులకోలినెత్తువె
ట్టెదు వడి మోవియుం గరువటిల్లెడు నీమది నింతతల్లడం
బొదవుఁడి దేమి కారణమ యుగ్మలి నాకెఱిగింపు మేర్పడన్.
[ఆ 4 పద్య. 59.]
కండవడ మనఁగా కన్నడమునందు తెఱ.
క. “తళిర్గళకండవడంగళ
తళిర్గళపానుగళెతలిర్గళోవరిగళెకెం
దలిర్గళెళసి పెళవిఱిిల్గళె
విలాసమంమెఱెదరిల్లి కెలరబలెయరొళ్."-ఆదిపురాణ.
ఈ యాది పురాణమును రచించిన యాదిపంపఁడు క్రీ శ. 940-వ సంవత్సర ప్రాంతమునం దుండినవాఁడు. ఈ యుదాహరణములనుబట్టి చూడఁగా నన్నెచోడుఁడు తన కాలపువియుఁ దన పూర్వకాలపువియుఁ నైన కన్నడ గ్రంధములను బాగుగాఁ జదివినవాc డయినట్టు కనబడు చున్నాఁడు. ఈతఁడు వాడిన కన్నడ పదము లన్నియు పూర్వకాలమునందు కర్ణాటకాంధ్ర భాషలకు రెంటికిని సామాన్యము లని మనవారు చెప్ప వత్తురు. అవి పూర్వము రెండు భాషలకును సామాన్యములని యెట్లు దెలిసికోవచ్చును ? ఏ పూర్వకవులు వీనిని బ్రయోగించిరి ? నన్నయభట్టారకాదులు ప్రయోగింపలేదు. 'బెదరుచు" నన్న పయి పద్యమునం దింకొక విశేష ప్రయోగము కూడc గానఁ బడుచున్నది. " ఒదవుటిదేమి?" యనుటకు మాఱుగా "ఒదవు డిదేమి ? " యను రూపము వాడఁబడినది. ఈ పుస్తకమును వ్రాసిన తంజావూరిలోని యఱవ వాండ్రకు ట డ భేదము చక్కఁగాఁ దెలియక పోవుటచేత వ్రాఁతలో నిట్టి రూపములు పడి యుండవచ్చును. అట్టివి పూర్వకాలపురూపములవి భ్రాంతి చెంది ముద్రాపకులు వాని నట్టెయుంచి యుందురు. ఇట్టి రూపము లీ పుస్తకమునం దిరువది ముప్పదిచోట్ల వేయబడి వాని క్రింద "ఒదవుడు-ఒదవుట" యనునట్లు టిప్పణములు వ్రాయఁబడినవి. డకారమువ్నచోట్ల టకారము వేసిన నీ యాయాస మంతయు తప్పిపోయి యుండును. ఈ యన్ని స్థలములలో డకారమును టకారమునుగా మార్పగూడని స్థల మొక్కటియు లేదు. అపూర్వరూపములను మాత్రముచేత క్రొత్తకవి ప్రాఁతకవి కానేరcడు. ఈ కవి భావార్థకమునందు టకారము వాడె ననుట కొక్క యుదాహరణమును కుమార సంభవమునుండి చూపెదను -
క. దొనఁగోలఁ గోలవేగం
బున నరికొల్పుటయుఁ దిరుపుఁ బొరిఁ బౌరి విడుపుం
జనుటయు దనుజులఁ గొనుటయు
ననిమిషులకు నైనఁ గాంచు డరుదయ్యె ననిన్-[ఆ.12-153]
అరిగొల్పుట, చనుట, కొనుట, అని మొదట మూడుచోట్ల టకారమువేసిన వారు కడపట కూడ 'కాంచుట" యని టకారమును వేయక కాంచు డని డకార మేల వేయవలెనో దురూహ్యముగా నున్నది. కాంచు డరు దయ్యె ననుటకు మాటలుగా "కాంచు టరు దయ్యె" నన్నచో యతి భంగము వచ్చునా ? గణభంగము వచ్చునా ? ఏదియును రాదు. ఈ ప్రకారముగానే యేకాదశాశ్వాసములోని 53 వ దయిన యీ పద్యమునందును -
ఉ.[9] ఆయము లిచ్చు డాజిమొన కాయము వెంచుట పెక్కు మన్ననల్
వేయుట పోరికి న్మొనసి చేయుట గా మది నిశ్చయించుచున్
నాయకు కోర్కిcదీర్ప; ని నా యెడ్డ నూఱడినట్లు ఱొమ్మునం
జే యిడి నిద్ర వోయిరి నిశీథి భటులీ సమరంబు కోరుచున్.
పెంచుట, చేయుట, చేయుట, యని వరుసగా మూడుచోట్ల టకారమువేసి మొదట నొక్కచోటమాత్ర మిచ్చు డని డకార మేల వేయవలసివచ్చెను ? ఇచ్చుట యన్న ఛందోలకణభంగము లేమైన వచ్చునా ? ఇచ్చుట యన్నదే పూర్వకాలరూపముగాని యిచ్చు డన్నది కాదు. 'అంతకంతకు మా పట్టణములో త్రాగుడు హెచ్చుచున్నది' అను విధమున నిప్పుడిప్పుడు తాగుట యనుటకు త్రాగుడని వాడుకలోనికి వచ్చినది ఈ పుస్తకములో నిప్పు
పయి పద్యమునందలి 'ఱొమ్మునం జేయిడి నిద్ర వోయిరి" యన్నభాగ మీ కవి నన్నయభట్టారకుని భారతమును చదివి యుండెనని తెలుపుడు చేయుచున్నది.
క. "వినుతధనుర్విద్యావిదు
ఘనుఁ గర్ణు సహాయుఁ బడసి కౌరవవిభుఁ డ
ర్జునువలని భయము చెడి ఱొొ
మ్మునఁ జేయిడి నిద్ర వోయె ముదితాత్ముండై."
అను నాదిపర్వములోని పద్యమును జూడుఁడు నన్నెచోడుఁడు నన్నయభట్టు పుస్తకమును జదివె నని స్థిరపఱచుటకయి యిచ్చట మఱి రెండుదాహరణములను గూడ నిచ్చుట చాలి యుండవచ్చును.
నన్నయభ ట్టారణ్యపర్వమున ద్వితీయాశ్వాసమునందు :
క. 'అఱపొఱడు కుఱుచచేతులు
నొఱవ శరీరంబు గలిగి యెురులకుఁ జూడం
గొఱగాకుం డియు మన్మధు
నొఱపులఁ బడియెడు నితండు యువతీ ప్రియుఁడై .[ప.134]
సీసపాదము.[10] ఈ కందుcబండ్లు బఱిగిగడ్డంబులును నఱ
పొఱడు ల నంటు రూపులును గుఱుచ.
పయియట్లు ప్రయోగించెను. ఒక కవి యింకొకకవి యొక్క గ్రంధమును జదివి యందుండి యేమయిన గ్రహించినట్లు తెలిసికొనుటకు మొదటి కవి యొక్క విశేషప్రయోగములనుబట్టి తెలిసికొనవలెనే కాని సర్వకవి జన సామాన్యము పైన ప్రయోగములనుబట్టి నిశ్చయించుటకు వలను పడదు. నన్నయభట్టాదిపర్వమునందు
చ. పొలుపుగఁ బూసి కట్టి తొడి భూరివిభూతి ప్రకాశితంబుగాఁ
గలయఁగఁ దత్పురీజనులు కాంస్య మృదంగక శంఖ భేరి కా
హళ పటహధ్వనుల్ చెలఁగ నాటలుఁ బాటలు నొప్పనెల్లవా
రలు చని చేసి రర్చనలు రై వతకాద్రికి నుత్సవంబుతోన్
అనెడి యష్టమాశ్వాసములోని పద్యములో 'తొడిగి" యని యుండవలసిన సామాన్యరూపములోని 'గి" వర్ణకమును దీసివేసి 'తొడి' యని విశేష ప్రయోగమును జేసెను. దీనిని జదివియే నన్నెచోడుఁడు తనకుమారసంభవము పంచమాశ్వాసములో
'కేసరరాజీవ కేయూరములు తొడి
రాజీవకర్ణపూరము లమర్చి.....' [పద్యము 20]
అను సీనపాదమునందు 'తొడి' యని ప్రయోగించి యున్నాఁడు.
ఉ. వీండె ఖలుండు దక్షుఁ డను వీఱిఁడిపాఱుఁడు వీఁడు సర్వవ
ధ్యుం డెడసేయ కుండు శివదూషకునాలుక గోసి యుప్పు నిం
పుండు త్రపుద్రవమ్మొడలఁ బూయుఁడు లోహము కాచి నోరఁ బో
యుండు దురాత్ము చర్యపట మొల్వుఁడు కస్నెలు మీఁటుఁ డుక్కఱన్
[ఆ. 2 - 84 ]
ఉ. ఎంచినప్రేమ నీపదక మి మ్మని రుక్మిణి మున్నువేఁడుడుం
బూంచినపూఁవు దక్కఁ బలుపోకలఁబోవుచు నుండు దేవుఁడున్
డాంచినసొమ్ము చేరె నకటా మదిఁ గోరనిసత్యభామకున్
నోంచినవారిసొమ్ము లవి నోమనివారికి వచ్చునే యిలన్.
అని పదునాల్గవశతాబ్లియం దున్న నాచన-సోముఁడు సహితము దీర్ఘము మీఁది యర్ధబిందువులను పూర్ణ బిందువులనుగా బ్రయోగించి యుండుటచేత నిది ప్రాచీనత కొక గుఱుతు కాదు.
క్రౌంచ పదము.
చంచుల నాస్వాదించుచు లేదూండ్ల కరువు ప్రియలకు నలCదుచు మైరోమాంచము లోలిం గంచుకితంబై పొడమఁగ నలరుచుఁ బులినములంగ్రీడించుచుసంభాషించుచుఁ ప్రీతింబొలుచుచుఁ జెలఁగుచుబొలయు సముద్యత్క్రౌంచగతుల్ వీక్షించుచు భాస్వజ్జ్వలనుఁడు శరవణ సరసికి వచ్చెన్.
అను దశమా శ్వాసములోని 3ం వది యగు క్రౌంచపదవృత్తము నుదహరించి, "ఇందుఁ గందసీసములవలెఁ బ్రతిపాదము రెండు భాగములుగా విభజింపబడి కందమువలెఁ బూర్వార్ధమునఁ బ్రాసమును ద్వితీయార్ధమున విశ్రమము మాత్రమే కూర్పఁబడియె. ద్వితీయప్రాసయతి మాత్రము నన్నయ, తిక్కన, కవిజనాశ్రయకారాది ప్రాచీనులు పాటించిరి కాని యప్పకవి తన్మర్మము తెలియక వదలెెను........................... ...........నన్నయకాలమునకే క్రౌంచపదము వృత్తము కావునఁ బ్రధమాక్షరవిరతి ముఖ్యమని ప్రాసమున్నను రెండు విరమస్థానములు ప్రయోగించిరి. ఇది నన్నెచోడుని ప్రాచీనత కొక గొప్ప కారణము." అని సంపాదకులైన రామకృష్ణకవిగారు ద్వితీయభాగపీఠికయందు వ్రాసిరి నా
అయినపక్షమున యతిస్థానము లన్నియు మొదటియక్షరముతో మైత్రికలవయి యుండుట యాంధ్రభాషాకవిత్వమర్యాద. ఈ మర్యాదను వదలి కర్ణాటకభాషాకవిత్వమర్యాద నవలంబించుట తెలుఁగుసంప్రదాయమునకు విరోధము. నన్నయభట్టెక్కడను దాను రచించిన భారతభాగమునందు క్రౌంచపదవృత్తమును వాడియే యుండలేదు. అందుచేత నాతని కాలమున క్రౌంచపదవృత్తము వాడుకలో లేదనుట స్పష్టము ఆతని కాలమునందును, తత్పూర్వమునందును అక్కరలు మొదలైనవి యొక్కువ వాడుకలో నున్నవి నన్నయభారతమునం దక్కరలు మిక్కిలిగా నుండుటయే కాక నన్నయకు నూఱు సంవత్సరములు పూర్వమందుండిన యుద్దమల్లుని శాసనములో నన్నియు మధ్యాక్కరలే యున్నవి. ఇటీవల నక్కరలు వాడుకలోనుండి తొలఁగుటయు క్రౌంచపదవృత్తము వాడుకలోనికి వచ్చుటయుc దటస్థించినది. నన్నెచోడుని కుమారసంభవమునం దక్కరలు లేక పోవుటయు, గ్రౌంచవదవృత్తముండుటయు నతఁడు నన్నయకు మిక్కిలి తరువాతివాఁ డని స్థాపించుటకు గొప్ప కారణముగా నున్నది. కవిజనాశ్రయమునఁ జెప్పఁబడిన క్రౌంచపదలక్షణ మిది -
"పంచ శరాభా ! సంచితపుణ్యా ! భమసభనననయ పరిమిత మైనన్
క్రౌంచపదాఖ్యం బంచితమయ్యెన్ గ్రయయతిదశ వసు కలితముగాఁగన్
మన నన్నెచోడకవి యీ తెలుఁగులక్షణమును పాటింపక విశ్రమవిషయమున
శీతకరోర్వీవాత శశాంకర్ యుగమితసురపురనివహదక డెయోళ్
భూతగణేశం భూత శరాశాగజదొళె యతిగళుమెసెదిరె పెసరిం
నీతియుతేకేళ్ నాతిశయోక్తిక్రమదొళే నెగళ్దుదిదతిశయరచనో
పేతమశేషోర్వీతళకం క్రౌంచపద మిదతిశయపదరచనెగళిం"
క. జగదొొళగిదొందుమిగిలెనె
నెగళ్దిర్దుదువేంగివిషయమావిషయదొళా
శ్రగణిత మెనె సప్తగ్రా
మగళొళమావేంగిపళుకరం సొగయిసుగుం 4
క. ఆవేంగి పళువినోశ్విభు
దేవసమానంవిదగ్ధనంబుజభవనం
తావగమొళ్గుణనిధియం
తీవసుధెయె ళెనిసి వెణ్నమయ్యంనెగళ్దం. 5
క. వేదదొళనుగత రెనిసువ
వేదగళొళ్ నిపుణనాగినెగళ్దంగంభీ
రోదోన్న తెపరివేష్టిత
మేదినియొళ్ పెణ్ణమయసకలంకగుణం. 6
ఈ నన్నెచోడకవి మన వా రనుకొన్నంత పూర్వుఁడు కాకపోయినను గొంత పూర్వుఁడే యయి నన్నయభట్టునకు, తిక్కనసోమయాజికిని నడిమి కాలమునం దుండినవాడయి నన్నయభట్టారకుఁడు బ్రాహ్మణకవులలో నగ్రగణ్యుఁ డయినట్టే రాజ కవులలో నగ్రగణ్యుఁ డయియున్నాఁడు. ఇతడు 1150-వ సంవత్సరప్రాంతమునుండి దాదాపుగా 1150-70 -వ సంవత్సరప్రాంతములవఱకు నుండి యుండును. ఈతని కవిత్వము మొత్తముమీఁదరసవంత మయి యసాధారణ ధార కలదయి హృదయంగమ మయి యున్నది. ఇతఁడు నాచన సోమనాథాది మహాకవులతోఁ దులఁదూగదగినవాఁడు గాని సాధారణుఁడు కాఁడు. ఈతని కవిత్వమునందు క్వార్ధక సంధులు మొదలైన కొన్నియల్పదోషము లున్నవి కాని యవి రత్నాకరములోని నత్తగుల్లలవలె నంతగాఁ బాటింపఁదగినవి కావు. కన్నడభాషాపద సమ్మేళనము మాత్రము శ్లాఘ్యము గాదు.[11]
సీ. పింఛాతపత్రముల్ పెనఁగి మరుద్వీధిఁ
గార్కొను నీలమేఘములు గాఁగ
వివిధభూషారత్న వివిధాcళజాలముల్
సదమలాఖండల చాపములుగ
ఘనవీధిఁ బొలసాడు ఖచరాంగనాపాంగ
తరళాక్షరుచులు సౌదామనులుగ
సింధురోన్నత కరశీక రాసారముల్
ధారుణిఁ గురియు నాసారములుగ
ఆ వె. సంచితంబులైన పంచమహాశబ్ద
రవము లులియ మేఘరవము లెసఁగ
హరుఁడు పచ్చె రజత్తగిరి కుమాన్వితము గ్రొ
క్కారులీలఁ గరము గారవమున [ఆ. 9 - 141]
అను నవమాశ్వాసములోని యీ పద్యమునందు "పొలసాడు" అనియు,
చ. 'నిజవదనామితాసితమణీకచనీలవిభాతివాహన
ద్విజవరబర్హిబర్హ విత తిం దొడరాడి సముల్ల సిల్లన
త్యజిత విలాసలీల విజయధ్వజ మంబరవీథిఁ గుక్కుట
ధ్వజముఁ బెనంగఁ బొల్పెసఁగి వచ్చెను మహేశ్వరసూతి ప్రీతితోన్
[ప 203]
క. ఏసియు వై చియుఁబొడిచియు
వేసర కొండూరుల బట్టి విడువక కేశా
కేశిఁ బెనంగుచుఁ బోర మ
హాసురముగఁ బోరి రా సురాసురవీరుల్." [ ప. 168 ]
అను ద్వాదశాశ్వాసములోని పద్యమునందు శసప్రాసము వేయఁబడినది.
చ. 'పుడమిపడున్ ధనాఢ్యుఁడునుభూరిబలుఁడును శౌర్యవంతుఁడున్
గడుదృఢపాణిపద్ముఁడును గాక యొడంబడ దశ్వమేధ మిం
దడరఁగ జేయుc దన్మఖమునందులపుణ్యఫలంబు లందఁగా
నడుగడుగశ్వమేధ మనునాజి మొనం జని చావు సేగియే. [ప. 44 ]
అనెడి యేకాదశాశ్వాసపద్యములో 'పుడమి పుఁడున్” అని గ్రామ్యపద ప్రయోగము చేయఁబడినది.
చ. అరుణజలంబు లాడి తురగాజినవస్త్రము లర్థిఁ గట్టి భీ
కరకరిదానకర్దమము కస్తూరిగాఁగ నలంది వీరహృ
త్సరసిరుహంబు లోలి నవతంసవిభూతిగఁ దాల్చి చాల న[13]
చ్చరువుఁ బిశాచ కాంతలు పిశాచములందవిలించి రొప్పులన్,
[ ఆ.11 - 202 ]
అను పద్యములో నచ్చెరు వని యుండవలసినదాని కచ్చరు వని యపశబ్దము వేయబడినది.
ఈ కవి చేసిన గ్రంథములు రెండు అందొకటి కుమారసంభవము, రెండవది కళావిలాసము. కాళిదాసుఁడు చేసిన కుమారసంభవము గాక యుద్భటుఁ డను కవి సంస్కృతమున వేఱొక కుమారసంభవమును జేసినట్టు కవి యీ క్రింది పద్యమునఁ జెప్పి యున్నాఁడు
క. క్రమమున నుద్భటుఁడు గవి
త్వము మెఱయc గుమారసంభవము సాలంకా
రము గూఢవస్తుమయకా
వ్యముగా హరులీల చెప్పి హరు మెప్పించెన్. [ ఆ. 1 -21 ]
ఈ రెండు కుమారసంభవములను జదివి కావలసినచో వానినుండి కధను గైకొనుచు తనమనసు వచ్చినట్టు మార్చి పెంచి సురుచిర వర్ణనాలంకారబంధురముగా నన్నెచోడుఁ డీ యాంధ్రకుమారసంభవమను కావ్యమును రచించెసు. ఇందు పండ్రెండాశ్వాసములు గలవు; ఈ పండ్రెండాశ్వాసములలోను సుమారు రెండువేల పద్యము లున్నవి. ఇది తన పరమార్థవిద్యాగురువైన జంగమ మల్లికార్జునయోగి కంకితము చేయఁబడినది. ఆశ్వాసాద్యంతపద్యములలోఁ గొన్నిచోట్ల నతఁడు శివుని కభేదముగా వర్ణింపఁబడుటయే గాక గ్రంథమధ్యమునందు సహిత మీ పద్యములలో నట్లే విరుద్దముగా వర్ణింపఁబడెను.[14]
చ. 'కమలదళాక్షి చాలఁ దమకంబునఁ గూర్పునిజేశుతోడఁ జి
త్తము దనివోవఁగా బహువిధంబులఁ గూడిన హృద్గతానురా
గము వెలిఁ జేర్చెనో యన నఖక్షతచుంబనరంజితాంగవి
భ్రమగతి వచ్చి చూచె నొకభామిని జంగమమల్లికార్జునున్.
గీ. మగువ జంగమ మల్లఁయఁ దగిలి చూచి
యంద కన్నులు మనమును నంటి యున్న
నచలభావన నిల్చెఁ దా నట్ల పరము
నభవుఁ గని జను లచలాత్ము లగుట యరుదె'
[ ఆ.8-ప.61 - 62 ]
1. కుమారసంభవము
చ. అతని శరాసనంబు కనకాచల, మిక్షుశరాసనంబు నీ,
కతనికి నమ్ము పాశుపత, మంటినఁ గందెడు పువ్వటమ్ము నీ,
కతఁడు పురాపహారి, విరహాతురపాంధజనాపహారి నీ.
వతనికి నీకు హస్తిమశకాంతర మె మ్మెయి నెన్న చూచినన్.
[ ఆ.4-32 ]
సీ. బాల నీవేనలి కాలోరగంబుని
మలయానిలంబు నీవలన రాదు
కమలాస్య నీకనుఁగవ చకోరము లని
వెన్నెల సొరదు నీయున్నయెడకు
నబల నీయెలుఁగు పికారావ మని నీకుఁ
జూతమ్ము కొమ్ములు చూప వెఱచుఁ
జపలాక్షి, నీముక్కు చంపక మనుభీతి
నలులు నీపొడ గని యలయఁ బాఱు
వనిత నీకుఁ బ్రాణవల్లభుండై మది
నొలసె శివుఁడు పాయకుండు ననియె
పేదమరుపశరములు నీదెశ రా నోడు
వీని కేల నీవు వెఱచె దమ్మ [ఆ. 5 - 165 ]
ఉ. గంధగజాసురారిఁ బురకాయజకాలబల ప్రహారి ను
గ్రాంధకహారిఁ దీ వ్రగరళాయతవహ్ని విహారి దేవతా
సింధుజలౌఘధారి సురసిద్దమునీంద్రగజకోపకారి ను
ద్బంధవిదారి నోఁబలుక బ్రాహ్మణనీవధికారివే మహిన్. [ ఆ. 28 ]
సీ. దుగ్ధాంబునిధి నిట్టఁ దోఁచెనో యని శేషు
బాన్పుగా హరి నీటఁ బవ్వడింపఁ
నొదవి సుధారస ముప్పొంగెనో యని
దేవతల్ దని వోవఁ ద్రావఁ దలఁపఁ
దొలఁకాడుమిన్నేఱు వెలివిరిసెనో యని
లీల సురాంగన లోలలాడఁ
బాదరసం బుర్విఁ బరఁగెనో యనిసిద్ద
నికరంబు కలశముల్ వించి కొనఁగఁ
బాండురాంగుండు విశ్వరూపంబు దాల్చి
యెలసెనో యని సద్భక్తు లెలమిఁ గొలువ
నఖిలజీవుల కానంద మతిళయిల్ల
నచ్చవెన్నెల విమలమై యలరి కాసె. [ఆ. 8-118 ]
ఉ. బాలకుఁ బట్టియే సురలు బల్విడి నాపయి నెత్తి రింతయే
నేలిదమైతినే తమకు నెన్నఁడు మద్భుజవిక్రమక్రమా
భీలకరాళఖడ్గవరభీషణవేషము చూచి నేలపైఁ
గా లిడి నిల్తురే యనికిఁ గ్రమ్మఱ వత్తురె వృత్తి సోత్తురే [ఆ. 10-149 ]
2. కళా విలాసము[15]
సీ. పృధులవిశ్వంభరారథమున కెదురుగాఁ
బూన్పించె నెవ్వాఁడు పువ్వుcదేరు
కాంచనాచలకార్మకమునకు సాటిగాc
జేపట్టె నెవ్వాఁడు చెఱకువిల్లు
నవిరళ పాశుపతాస్త్రమ్మునకు వాఁడి
మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు
నతులితామరదానవాదిబలంబుల
గెలిపించె నెవ్వఁ డయ్యళిబలంబు
నట్టిజగజెట్టి మన్మథుం డఖిలలోక
ములకు వెఱగొంగ జీవులమూలకంద
మతనియిలుఁ జొచ్చి వెడలనియతఁడు గలఁడె
యతనియమ్ములఁ బడకున్నయదియుఁ గలదె.
చ. తొడవులు వెట్టు సంభ్రమముతోఁ దిలకించు మడుంగు గట్టుపైఁ
బడ దడ వోప దింపెఱిఁగి పట్టదు నేర్పులు గట్టి పెట్టుఁ బ
ల్కెడు నెడఁదొ ట్రుపాటొదవుఁగింకకు జేగిలుమన్సమర్పఁగాఁ
జిడుముడిఁ బొందుఁ గాంత పతిచేరినఁగూరిమి గల్లెనేనియన్,
- ↑ కాలమునుబట్టి నన్నెచోడకవి తిక్కనాదులకంటె ముందు రావలసినవాఁడు. కాని శ్రీ వీరేళలింగము పంతులు గారు తొలుత గవిత్రయము యొక్కయుఁ, బిదప 11 వ శతాబ్దివాఁడని తాము భావించిన పావులూరి మల్లన యొక్కయు చరిత్రములను వివరించిన పిదపనే నన్నెచోడునిగూర్చి వ్రాయబ్రారంభించిరి. క్రమముతప్పక భారతకవుల చరిత్రమును దెల్పcదలఁచియే ఆయన తిక్కన,యెఱ్ఱనల చరిత్రములను ముందుగా జెప్పియుండవచ్చును.
- ↑ [ ఇయ్యది జనసంఖ్య కాని, గ్రామసంఖ్య కాదని ఆంధ్రకవితరంగిణి' పుట 160)]
- ↑ యం,బున జనఁజాళుక్యరాజు మొదలుగఁ బలువుర్. అనునది సరియైన పాఠము
- ↑ [ పయి రెండు పద్యములకును నడుమ దేశ సత్కవుల స్తుతి రూపమగు పద్య ముండవలెనని భావింపనక్కఱలేదనియు, 'మునుమార్గకవిత' అను పద్యముననే దేశ సత్కవులునుతింపఁబడినట్లు భావింపవచ్చుననియు, ఇంతకును లభింపని పద్యమును గూర్చి యాలోచించినc బ్రయోజనము లేదనియు, అట్టి పద్య మొక్కటి యుండి తీరవల యునని నిశ్చయము గాఁ జెప్పుటకును తగిన యాధారములు లేవనియు ఆంధ్ర కవి తరంగిణి" యందుఁగలదు. (చూ. పుట. 165)]
- ↑ శ్రీ వీరేశలింగము పంతులుగారభిప్రాయ పడినట్లే 'ఆంధ్రకవి తరంగిణి' "కారులును మార్గకవిత యనఁగా సంస్కృత కవిత్వమనియు, "దేశికవిత యనఁగా నాంధ్రకవిత యనియు సభిప్రాయపడి యున్నారు [చూ. పుట 165] కాని యిది సరికాదు. ప్రాచీన సంస్కృతి సాహిత్యమార్గము ననుసరించిన లక్షణములు కలది మార్గకవిత; దేశీయ సంప్రదాయములు కలది దేశికవిత.
- ↑ ['వ్యాకరణమునకు లొంగని పదములు అప్రతీత పదములు, భాషాంతరపదములు, నీకావ్యమునందుండుట దీని ప్రాచీనతను వ్యక్తము చేయునదే ! ఇట్టి ప్రయోగములవలన కవి కేమాత్రము కళంకము కలుగదు. ప్రాచీనకవుల ప్రయోగము లర్వాచీనములగు వ్యాకరణములకు లొంగకుండుట కవి కపకర్షను కల్లింపదు' - అని పండిత విమర్శకులు కొందఱభిప్రాయపడుచున్నారు.]
- ↑ [పట్టినదియున్ శరమే ?' అనునది సరియైన పాఠము]
- ↑ ["మేన దూఱి - పాఠాంతరము]
- ↑ [ "ఆయములిచ్చుటాజి..... నిసిన్ సుభటుల్" అని విశ్వవిద్యాలయ ముద్రిత ప్రతి.]
- ↑ [కందుcబండ్లుఁ బఱకి గడ్డంబులును నఱ పొఱడులనంటు రూపులునుఁగుఱుచ - అని మద్రాను, విశ్వవిద్యాలయ ముద్రిత ప్రతి.]
- ↑ [అట్టివి కన్నడ పదము లనుటకంటె - అప్పు డాంధ్రభాషలో వ్యవహారముననున్న పదములే యని యనుకొనవచ్చును.]
- ↑ [* ఇట్టివి శబ్దపల్లవములైనఁ గావచ్చును. క్వార్థకములని యనుకొన్నను.అట్టివాని సంధిని పెక్కు రామోదించి యున్నారు.]
- ↑ [ నచ్చరున - పాఠము. అచ్చరువు 'అచ్చెరువు' నకు రూపాంతరము కాని అపశబ్దము కాదు.]
- ↑ [జంగమమల్లి కార్జునుఁడు శివున కభిన్నుఁడని తలఁచినపుడు ఇట్టివర్ణన విరుద్ధమని భావింపనక్కఱ లేదు ]
- ↑ ఈ పద్యములు శ్రీ రామకృష్ణకవిగారి కుమారసంభవపీఠిక నుండి గ్రహింపఁబడినవి. లక్షణగ్రంధములయం దుదాహరింపఁబడిన కొన్ని పద్యములె కాని పుస్తకము సమగ్రమముగా నెవ్వరికిని లభింపలేదు. అందుచేత నీ యాంధ్రకళావిలాసము క్షేమేంద్రుని సంస్కృత కళావిలాసముతో నెంత వఱకు సంబంధించి యున్నదో తెలిసి
కొనుట శక్యము కాదు.