ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/ప్రతాపరుద్రుఁడు

వికీసోర్స్ నుండి

ప్రతాపరుద్రుఁడు


ఇతఁడు 1117-వ సంపత్సరము మొదలుకొని 1140 -వ సంవత్సరము వఱకును రాజ్యపాలనము చేసిన కాకతి ప్రోలరాజపుత్రుఁడు; సుప్రసిద్ధుఁడయి తిక్కన సోమయాజికాలములో నుండి 1199 -వ సంవత్సరమునుండి 1260 వఱకును ప్రజాపాలనము చేసిన గణపతిదేవుని పెదతండ్రి. ఓరుగంటి ప్రతాపరుద్రుఁడని సాధారణముగా పిలువఁబడెడు వేఱొక ప్రతాపరుద్రుఁడు రుద్రమదేవి మనుమడు 1295 మొదలుకొని 1321 వ సంవత్సరమువఱకును కాకతీయరాజ్యపరిపాలనము చేసినవాఁ డుండి నందున భేదము తెలియుటకయి చరిత్రకారు లీతనిని ప్రధమ బ్రతాపరుద్రుఁ డందురు. ఈ ప్రతాపరుద్ర దేవమహారాజు 1140 వ సంవత్సరము మొదలుకొని 1199 -వ సంవత్సరముపుకును నేఁబదియైదుసంవత్సరము లవిచ్ఛిన్నముగా రాజ్యపరిపాలనముచేసెను. ఇతఁ డనేకరాజులను జయించి తన రాజ్యమును నానా ముఖముల వ్యాపింపఁజేసెను. ఇతఁడు పరాక్రమ వంతు డగుటయే కాక విద్యావంతుఁడుకూడ నయి తాను శైవమతస్థుఁ డగుటచేత ముఖ్యముగా శైవకవుల నాదరించుచు వచ్చెను. బసవపురాణాది వీరగ్రంధములను రచించిన పాల్కురికి సోమనాధుఁ డీతనికాలములో నుండి యీతనివలన నగ్రహారాదులను బడసెను. ఈతఁడు కవులను బ్రోత్సాహ పఱుచుచు వచ్చుటమే కాక కర్ణాటాంధ్రసంస్కృత భాషల యందు బాండిత్యము కలవాడయి విద్యావిభూషణుఁడని పేరు వడసి స్వయముగా కవిత్వము చెప్పటయందు సమర్థుడయి యుండెను. ఇతఁడు సంస్కృతమున నీతిసార మనెడు గ్రంధమును రచించినట్టు బద్దెనకవి తన నీతిశాస్త్రముక్తావళిలో నీ క్రిందిపద్యమునఁ జెప్పెను.

   చ. "పరుపడి నాంధ్రభాషఁగల బద్దెననీతియు సంస్కృతంబులోఁ 
బరఁగ బ్రతాపరుద్రనరపాలునిచే రచియింపఁబడ్డ యా

       నరవరు నీతిసారము వినం జదువం గడు మంచి దంచుఁ జె
       చ్చెరఁ గవినీతిపద్ధతులు చేసె వినోదము బాలబోధకున్."

నీతిశాస్త్రముక్తావళిని ముద్రించిన శ్రీయుత మానవల్లి రామకృష్ణ కవిగారు ప్రతాపరుద్రుఁడు సంస్కృతముననే కాక తెనుఁగునఁగూడ నీతిసారమును రచించినట్టు చెప్పి దానిలో సుండి పెక్కు పద్యముల నుదాహరించిరి వానిలో నుండి కొన్ని పద్యముల నెత్తి యిందు క్రిందఁ బొందుపఱుచుచున్నాను.

   క. "ఆపదలఁ జెందు ప్రజలను
       భూపతి మొదలిచ్చి మగుడఁ బ్రోవఁగఁ జనుఁ దాఁ
       జేపట్టి విడువవలవదు
       భూపతికిఁ గుటుంబ మనగ భూమియ కాదే

   గీ. ఎంత పొదలి యున్న నేరండమూలు జీలు
      గులను దారుకృత్యములకు నగునె ?
      యితర లెcదఱైన నేలిక కధికులై
      చేయు పనులు పూని చేయఁగలరె ?

   క. దూరము వ్యవసాయకులకు
      భారంబు సమర్థులకును భాసురవిద్యా
      పారగులకును విదేశము
      వైరము ప్రియవాదులకును వసుమతిఁ గలదే ?

   గీ. విపత్తులా వెఱింగి వెఱ పేది తొడరుట
      మిడుత లగ్గిమీఁదఁ బడినయట్లు
      తోడు లేక యధికుఁ దొడరుట యంబుధిఁ
      గలము లేక యీఁదఁ గడఁగినట్లు.

  ఉ. కొందఱ మేలమాడుటలుఁ గొందఱిి వావులుదీర్చి పిల్చుటల్
      కొందఱ ముద్దుచేయుటయుఁ కొందఱ నెయ్యపు జూపుచూచుటల్

       కొందఱి నాత్మభావమునఁ గొందఱ మన్నన భృత్యులందు ని
       ట్లందఱ నన్నిభంగుల నృపాగ్రణి వశ్యులఁ జేయఁగాఁదగున్."

ఈ ప్రతాపరుదుఁడు lక్రీ.శ. 1158 నుండి 11985 వఱకును రాజ్యమును బాలించెననియు, మడికి-సింగన్న "సకలనీతి సమ్మతము" లో నీతి సారమును పేర్కొనినను, కర్తపేరు తెలుపలేదనియు, ఈ ప్రతాపరుద్రుని సంస్కృత "నీతి సారము" ను ముద్దరాజు రామన్న తన రాఘవ పాండవీయ వ్యాఖ్యలో నుదాహరించెననియు తెనుఁగు కవుల చరిత్ర" లోఁ గలదు.]