ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/దోనయామాత్యుఁడు
దోనయామాత్యుఁడు సస్యానందము, సర్వలోకాశ్రయమునను రెండు పద్యకావ్యములను రచించెను. ఇతనింగూర్చి శ్రీనిడుదవోలు వేంకట రావుగారు తెలుఁగువారి "కెఱుకపఱచినారు. (చూ. భారతి-వ్యయ. జ్యేష్ఠ మాససంచిక.) ఇతడు నియోగి బ్రాహ్మణుఁడు; ఆపస్తంభ సూత్రుఁడు, శ్రీవత్స గోత్రుఁడు; మాచిరాజునకును, రుద్రాంబకును పుత్రుఁడు.
సస్యానందము నాలుగాశ్వాసముల ప్రబంధము, ఇది శ్రీశైల మల్లి కార్జున స్వామి కంకితము. కర్షకుల కుపయోగించు పెక్కు విషయములిందు గలవు. దీనిని తొలుత శ్రీతడకమళ్ల వేంకట కృష్ణారావుగారు 1891 లో ముద్రించిరి. అందు కవి గోనయామాత్యుఁడని తెల్పఁబడినది. కాని ఆపేరు సరికాదు. ఇతఁడు దోనయ యన్నట్లే చాల తాళపత్ర ప్రతులలోఁ గలదు.
కవియే తన కాలమునుగూర్చి గ్రంధమునఁ దెల్సినాఁడు. కాని కాలమును దెల్పు నా పద్యమునఁగల పాఠ భేదములనుబట్టి సస్యానంద రచనా కాలము శా. శ. 1278, 1282, 1288. లలో నొకటియై యుండవలెను.
ఈతఁడు తన్ను "ఉపేంద్రుఁడాదరింపఁగా “సర్వలోకాశ్రయము" ను చెప్పెనఁట ! సర్వలోకాశ్రయ బిరుదము చాళుక్య ప్రభువులది ఆ గ్రంధము లభింపలేదు; కాని యందలి విషయము చాళుక్య వంశవర్ణనమై యుండవచ్చునని యూహించుచున్నారు. దోనయామాత్యుఁడు పేర్కొనిన యుపేంద్రుడు మూడవ యుపేంద్రదేవుఁడు కాని, నాల్గవ యుపేంద్రదేవుఁడు కాని యయి యుండవలెను. దోనయ నాదరించిన రాజు మూఁడవ యుపేంద్రుఁడని శ్రీ వేంకట రావుగారును. నాల్గవ యుపేంద్రుఁడని 'ఆంధ్రకవితరంగిణి' కర్త శ్రీ శేషయ్యగారును తలంచుచున్నారు.