ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/దగ్గుపల్లి దుగ్గయ్య

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దగ్గుపల్లి దుగ్గయ్య


ఈ కవి భారతానుశాసనికపర్వములోఁ జెప్పఁబడిన కధ ననుసరించి [1]నాచికేతూపాఖ్యానమును రచియించి యనంతామాత్య గంగన కంకితము చేసెను. దుగ్గయకవి శ్రీనాథమహాకవిశిష్యుడును, మఱదియు నయి యుండెను; శ్రీనాధుని భార్యతమ్ముఁడనియు నాతనియొద్దనే యుండి చిన్నతనమునందు విద్యాభ్యాసము చేసెననియు తోఁచుచున్నది.[2] 'నాచికేతూపాఖ్యానాశ్వాసాంతగద్య మి ట్లున్నది.

     గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్రకవిసార్వ
            భౌమ సకలవిద్యాసనాథ శ్రీనాధమహాకవీంద్ర ప్రసాదలబ్దకవితావిశేష దగ్గుపల్లి తిప్పనార్య
            ప్రియతనూజ దుగ్గననామధేయ ప్రణీతంబైన నాసికేతూపాఖ్యానంబను మహా
            ప్రబంధంబునందు ...

కృతిపతి కవి నుద్దేశించి యిట్లనియెను.

           క. హితమతివి సకలవిద్యా
              చతురుండవు చాటుపద్యజాలంబుల నా
              కతులితకీర్తులు కలిగిం
              చితి దుగ్గనకవివరేణ్య ! శివకారుణ్యా !

     

      సీ. సంస్కృత ప్రాకృతసౌరసేనీముఖ్య
                          భాషాపరిజ్ఞానపాటవంబు
           పన్నగపతిసార్వభౌమభాషితమహా
                          భాష్యవిద్యాసమభ్యాసబలము
           నక్షపాదకణాదపక్షిలోదీరిత
                          న్యాయకళాకౌశలాతిశయము
           శ్రుతిపురాణాగమస్మృతిసాంఖ్యసిద్దాంత
                          కబళనవ్యుత్పత్తిగౌరవంబు

           పూర్వకవిముఖ్యవిరచితాపూర్వకావ్య
           భావరససుథాచర్వణ ప్రౌఢతయును
           గందళింపంగఁ గాశికాఖండనైష
           ధప్రముఖవివిధప్రబంధము లొనర్చి.


       సీ. కవిసార్వభౌముఁడై కర్ణాటవిభుచేతఁ
                        గనకరత్నాభిషేకములు గనిన
          శ్రీనాథసుకవి కూరిమిచేయు మఱదివి
                        దుగ్గయకవిరాజ ! దగ్గుపల్లి
           తిప్పనార్యునకు సతీమణి యెఱ్ఱమ
                        కునుఁ దనూజుఁడవు పోతనకు నెఱ్ఱ
           నామాత్యవరునకు ననుఁగుఁదమ్ముండవు
                        శాండిల్యగోత్రుఁడౌ సరసమతివి

           చెప్పనేర్తువు కృతులు సుస్థిరముగాఁగఁ
           గాన నీవు రచింపంగఁ గడఁగియున్న
           నాసికేతుచరిత్రంబు నాదుపేర
           నంకితము సేయు కవిరాజు లాదరింప.

       ఉ. మా పినతండ్రి గంగయయమత్యశిఖామణి తత్తనూభవుం
           డై పెనుపొందు దేవసచివాగ్రణీ కిచ్చితి వంధ్రభాషఁ గాం
           చీపురనాధు దివ్యకథ చిత్రతరంబుగ విస్తరించి నీ
           వోపుదు వార్యహృద్యమధురోక్తుల సత్కృతు లొప్పఁ జెప్పఁగన్.

ఇతఁడు తన విద్యాగురువును, బావయు నైన శ్రీనాథునిపాండిత్య ప్రభావమును వర్ణించుచు నాతఁడు కర్ణాటవిభునిచేత కనకరత్నాభిషేకమును పొందిన వృత్తాంతమును గూడఁ జెప్పి యున్నాడు. కవి దగ్గుపల్లి తిప్పనార్యునకును నెఱ్ఱమకును పుత్రుఁడు; శాండిల్య గోత్రుఁడు; పోతనకును నెఱ్ఱనకును దమ్ముఁడు. ఈ గ్రంధమును రచియించుటకు ముందే యీ కవి కాంచీపుర మాహాత్మ్యమును రచియించి కృతిపతి పినతండ్రి కుమారుఁడైన దేవయామాత్యున కంకిత మొనర్చెను. కృతిపతియైన చెందలూరి గంగామాత్యుఁడు మాధవవర్మవంశమువాఁడైన తమ్మురాజుయొక్క కుమారుడగు బసవ నృపాలున కాప్తసచివుఁడైనట్లీ క్రింది పద్యమునఁ జెప్పఁబడెను.

        సీ. చతురంగబలము విజయవాడ దుర్గాంబ
                            వరమునఁ బడసి దుర్వారలీల
           జగతీస్థలం బెల్ల సాధించి జయశాస
                            నములు దిగ్దంతిదంతముల సలిపి
           పేదబాలునకుఁగాఁ బ్రియసుతమోహంబు
                            పట్టక బెజవాడపాడి నిలిపి
           కలయంగఁ బురమునఁ గాంచనవర్షంబు
                            గురియించి దేవతాకోటి పొగడ

           వసుధ నెగడిన మాధవవర్మవంశ
           వర్దనుండగు తమ్మభూవరుని బసవ
           పార్థివున కాప్తుడై కృపాపాత్రుఁ డగుచు
           ఘనత మెఱసె ననంతయగంగవిభుఁడు.

విశాఖపట్టణమండలములోని విజయనగరసంస్థానాధిపతులగు పూసపాటివారు తా మీ మాధవవర్మసంతతివార మని చెప్పుకొందురు. కృతిపతియైన గంగామాత్యుడొకనాడు కొలువుండి

   క."సరసులు సుకవీంద్రులఁ దను
      బరివేష్టింపంగఁ గావ్యబంధురగోష్టీ
      పరుఁ డగుచు నుండి యస్మ
      త్సరసవచోవైఖరుల హృదయమునఁ దలఁచెన్

వ. తలఁచి యప్పుడు పరమానందంబున సామాజికులం జూచి యిట్లనియె

   చ. శ్రుతుల విహారదేశములు సుస్థిరవాక్యపద ప్రమాణ శా
      స్త్రతతులయిక్క లాగమపురాణచయమ్ముల కేళిసద్మముల్
      స్మృతులనివాసముల్ కవిసమీహితసత్కవితాగుణప్రసా
      దితములు దగ్గుపల్లి కవితిప్పయదుగ్గని గద్యపద్యముల్.”

అన్నట్లు కవి కృత్యాదిని జెప్పెను. దుగ్గన శ్రీనాథునికాలములో బాల కవి యయి యాతని యనంతరముననే కాంచీమాహాత్మ్యమును, నాచికేతూపాఖ్యానమును జేసినట్టు కనఁబడుచున్నాడు. కృతిపతికాలమును బట్టి విచారింపఁగా నీకవి 1490 వ సంవత్సరప్రాంతమువఱకు నుండి కావ్యరచనము చేయుచుండిన ట్టూహింపఁదగి యున్నది. నంది మల్లయ్యయు, ఘంటసింగయ్యయుఁ గలిసి తాము రచించిన ప్రబోధచంద్రోదయ పద్యకావ్యము నీ గంగయామాత్యునకే యంకితము చేసిరి. అటు తరువాత నీ కవులే తమ వరాహ పురాణమును 1503 వ సంవత్సర ప్రాంతమునందు రాజ్యపాలనము చేయు చుండిన కృష్ణ దేవరాయని తండ్రియైన నరసింహదేవరాయనికిఁ గృతి యిచ్చిరి. గంగయామాత్యుఁడు సాళువ నరసింహరాయని కాలములో నుండక తత్పూర్వమునందే యుండినవాఁ డనుకొన్నను 1490 వ సంవత్సర ప్రాంతమువఱకైన నుండి యుండవలెను. ఆ వఱకే కాంచీపురమాహాత్మ్యమును రచియించి తరువాతనే నాచికేతూపాఖ్యానమును రచియించి

యుండుటచేత నీ కడపటి పుస్తకము 1450 వ సంవత్సరప్రాంతముల యందు రచియింపఁబడి యుండును. నాచికేతూపాఖ్యానములోని మొదటి మూడాశ్వాసములు మాత్రమే యిప్పుడు కనఁబడుచున్నవి గాని సంపూర్ణగ్రంథ మెక్కడను లభింపకున్నది. ఈతఁడు రచియించిన కాంచీపుర మాహాత్మ్యమును జదువఁగల భాగ్యము నాకు లభింపలేదు.[3]

దుగ్గనకవిత్వము సలక్షణమయి సరసమయి సకలజనాదరణీయముగా నున్నది. ఈతని కవిత్వ శైలి తెలియుటకయి యీతని పుస్తకములలోని కొన్ని పద్యముల నిందుదాహరించు చున్నాను

     మ. మకరందంబులఁ దొప్పఁదోఁగి వికచన్మందారమాకంద చం
         పకసౌరభ్యముఁ బూని లేఁజిగురుజొంపంబు ల్మొగిం జొచ్చి పా
         యక మందానిలుఁ డెందుఁ గ్రుమ్మఱు దపోవ్యాపిభ్రమత్తాపసీ
         సకలాంగోదితఘర్మవారికణికాజాలంబు నింకించుచున్

     ఉ. మున్నొకనాఁటిరాత్రి కనుమూసినచోఁ గల వచ్చి వేడుకన్
         నన్ను దృఢోపగూహనమునం గరఁగించి మొఱంగి చన్న యా
         పిన్నది గాదె యీ యువతి పెక్కువ నొందిన దిప్టు నాఁటికిం
         గన్నియ గానఁ బ్రాయ మిది గామి నెఱుంగఁగరాదు గ్రక్కునన్.

     ఉ. కోమలి వింటివే యతఁడు కూరిమిపుత్త్రుడు నాకు మున్ను పెం
         దామరమొగ్గలోన విదితంబుగ డాచినయట్టి తేజమున్
         మామక మించుకేని యనుమానము లే దిది తధ్య మిమ్మెయిన్
         దామరసప్రసూతిచెయిదంబులు వట్రిలె నిట్టిచందముల్.

     చ. జిలిబిలిముద్దుచేఁతలకు సిగ్గులనిగ్గులు వన్నెపెట్ట వే.
         నలి యరవిడుచుండఁ జరణంబులు తొట్రిలఁ గ్రాలుఁగన్నులం
         దొలఁకెడు మందహాసములు తొంగలిఱెప్పలలోన డాఁగఁగా
         నలికులవేణి యోసరీలె నల్లన పయ్యెద నోసరించుచున్

 
        ఉ. సౌహృద మొప్పఁగా గురుని సమ్మతి నాథుఁడు వేలిపింప వై
            వాహిక వహ్నికీలముల వామవిలోచన లీల వేల్చులా
            జాహుతి చూడ నొప్పెసఁగె నప్టు కళాధరఖండభృ జ్జటా
            వ్యూహములోపలం దొరుగుచుండెడు వేలుపుటేటికైవడిన్.

ఆంధ్రపరిషత్పుస్తకభాండాగారములోవి యదాహరణ గ్రంథములో దగ్గుపల్లి దుగ్గన శివకంచి మాహాత్మ్యములోనిదని యీ క్రింది పద్య ముదాహరింపఁ బడినది,

        సీ. బంధూక మెఱమించెఁ బరువయ్యె గేదంగి
                             కడిమి పుష్పిత మయ్యె గ్రంథి పూచె
           నర్జునం బలరారె నరవిందములు గ్రుస్సె
                             భూస్థలి నేరులు పుక్కిలించె
           గండూపదము లుబ్బె గలఁగె హంసచయంబు
                             నటియించెఁ గప్పలు నమిలి చెలఁగె
           చాతకంబులు మించె సాగరం బెడయించె
                             హరిగోపములతోడ నాటె వేళ్ళు

           మత్తభృంగములకుఁ దేనె రిత్త యయ్యె
           గండుఁగోయిలకూఁతలు కట్టువడియె
           చూలుకొనె స్వాతి కొక్కెరజూటిఁ బొదవె
           విష్ణునకు నిద్రపోయేడువేళ యయ్యె.

ఆ పుస్తకమునందే విష్ణుకంచిమాహాత్మ్యమును ఆంధ్రకవి రామయ్యచెప్పినట్టిందులోనిపద్యము లుదాహరింపఁబడినవి.[4]

  1. [దుగ్గయకవి గ్రంథము • నాసికేతోపాఖ్యానము' గాఁ బ్రసిద్ధము.]
  2. [దుగ్గయకనవి నివాసమైన దగ్గుపల్లి యేదియో నిశ్చయింపఁ జాలమనియు, కృష్ణాజిల్లా, బందరు తాలూకాలోను, గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోను కూడ దగ్గుపల్లి కలదఁట ! బాపట్ల తాలూకాలోఁ గల దగ్గుబాడయినను, ఇతని నివాసము కావచ్చునఁట ! (ఆంధ్రకవి తరంగిణి సం, 6 ఫుట 101)]
  3. [కాంచీపురమాహాత్మ్యమింతవఱకును లభింపలేదు.]
  4. [శివకాంచీమాహాత్మ్యములోనీ వేఱొక సీసపద్యముకూడ శ్రీ ప్రభాకర శాస్త్రి కూర్చిన 'ప్రబంధ రత్నావళి' లోఁ గలదు.]