ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/గౌరన మంత్రి
గౌరన మంత్రి
ఈ కవి హరిశ్చంద్రోపాఖ్యానమును నవనాథచరిత్రమును ద్విపదకావ్యములనుగా రచించెను. ఇతఁడు హరిశ్చంద్రోపాఖ్యానమునందుఁ దన్నుఁగూర్చి యిట్లు చెప్పుకొనియెను.
ద్వి. సింగనమాధవషితిపాలమణికి
మంగళమూర్తికి మంత్రియై జగతిఁ
బొగడొందు పెద్దనపోతరాజునకుఁ
దగిన తమ్ముఁడు యశోధనుఁ డెల్లమంత్రి
చెట్ట పట్టంగ నోచినభాగ్యవతికిఁ
జూట్టాలసురభికి సుందరిమణికి
ఘనుఁడు వల్లభమంత్రి గంగాంబ గోరి
కనిన పోచంబకు గారాబుసుతుఁడ
ధరణి నమాత్యరత్నంబనఁబరఁగు
ధరణిమంత్రికిఁ గూర్మితమ్ముఁడ ఘనుఁడ
భూతనాయకపాదపూజాభిరతుఁడ
గౌతమగోత్రుండ గౌరనాహ్వయుఁడ
సరససాహిత్యలక్షణ [1] విచక్షణుఁడ
బిరుదవిఖ్యాతిచేఁ బెం పొందువాఁడ
ఇచ్చట నెల్లమంత్రికిని పోచాంబకును బుత్రుఁడయినట్లు చెప్పఁబడినను పుస్తకాంతమునందు
మతిమంతుఁ డయ్యలమంత్రిపుంగవుని
సుతుఁడు గౌరనమంత్రి సుకవి శేఖరుఁడు
కవు లెన్న నుత్తరకథ రచియించె
అని యయ్యలమంత్రిసుతుఁ డయినట్లు చెప్పఁబడి యున్నది. అయ్యల యని పొరపాటున నెల్లనకు మాఱుగా పడియుండును. మొదట నున్న దాని నయ్యల యని దిద్దుటకు వలనుపడదు. ఎల్లనామము రెండు చోట్లను సరిపడును. [గౌరనమంత్రి తండ్రి అయ్యలు మంత్రి; కాని, ఎల్లమంత్రి కాఁడు. 'యశోధనుఁ డెల్ల మంత్రి' యనుచోట 'యశోధనుఁ డయ్యమంత్రి' ఆని యుండదగును. లక్షణదీపికయందలి
‘ఆసీత్తస్యమహామాత్యః స్వామి కార్యధురంధరః |
పోతరాజ ఇతి ఖ్యాతో రాజనీతివిశారదః ||
మంత్రి చూడా మణే స్తస్య సోదరస్యాయ్యలు ప్రభో|
గౌరనార్య ఇతిఖ్యాతస్తనయో నయ కోవిద8 ||'
అను శ్లోకములను బట్టియు నీయంశమే తెలియుచున్నది. '....శ్రీమదయ్యలు మంత్రి శేఖర రత్నాకర రాకాసుధాకర శ్రీగౌరనామాత్య విరచితాయాం ..' అను లక్ష్మణదీపికాపరిచ్చేదాంతగద్యయు గౌరనతండ్రి అయ్యలుమంత్రి యనియే తెల్పుచున్నది.]
ఈ ద్విపదకావ్యమును మొట్ట మొదట ముద్రింపించిన (బ్రౌనుదొరవారీ కవి 1600 వ సంవత్సర ప్రాంత మునందుండినట్లభిప్రాయపడి తన పెదతండ్రియైన పెద్దనపోతరాజు సింగనమాధవ క్షితిపాలునిమంత్రి యైనట్టు కవి చెప్పెను గాని యీ పుస్తకమునుబట్టి యీ మాధవక్షితిపాలుఁ డెవ్వఁడో యే కాలమునం దుండినవాఁడో తెలియదు. ఈ కవియే సంస్కృతమున,'లక్షణదీపిక' యను ఛందశ్శాస్త్రము నొకదానిని రచియించెను. దానియందీ మాధవక్షితిపాలుని గూర్చి యీ క్రింది శ్లోకములోఁ గొంత వివరముగాఁ జెప్పెను.
శ్లో. అస్తి ప్రశస్తావనిపాలమౌళి రత్నావళీరంజితపాదపీఠః
రేచర్ల వంశార్ణవపూర్ణ చంద్రో మహాబల స్సింగయమాధవేంద్రః.
పయి శ్లోకమునందు రేచర్ల గోత్రము చెప్పఁబడి యుండుటచేత నీ మాధవక్షితిపాలుఁడు, బేతాళ రెడ్డి కెనిమిదవ తరమువాఁ డయిన రావు సింగయ
మాధవనృపాలుఁడని తేటపడుచున్నది. ఈ మాధవనృపాలునికి పెద్దన సుతుఁడైన పోతరాజు మంత్రి యైనట్టు వెలుగోటి వంక చరిత్రమునందుదాహరింపఁబడిన యొక శిలాశాసనములోని యీ క్రింది శ్లోకముల వలనఁ దెలియవచ్చుచున్నది.
శ్లో. శ్రీమతో మాధవేంద్రస్య రాజ్యాంగైకధురంధరః,
మంత్రి పోత నామాసీత్ సర్వశాస్త్రవిశారదః |
యస్యామాత్యశిఖామణేః కవివరస్తోత్రైకపాత్రీకృతాం
మత్వా వాక్పతి రిద్దనీతి సుభగాం వాగ్వైఖరీం లజ్జతే.
సోయం పెద్దనమంత్రి వర్యతనయః శ్రీపోతరాజో౽న్వహం
దేవస్యాస్య మహోపకారరచనాం సమ్యఙ్ముదాచీకరత్.
రాచకొండ కీశాన్యమూలను రెండు క్రోసుల దూరములోనున్న నాగార గ్రామమునందలి మాధవనృపాలుని భార్య శాసనములో
శ్లో. శాకాఖ్యే నిధివార్దిరామశశిగేఽప్యబ్దే ప్లవంగే శుభే
మానే ప్యాశ్వయుజే రఘూద్వహపదే యేరాఘవీయాహ్వయామ్
టీకా మర్ధపటుప్రబోధఘటనా మాణిక్యపుష్పాంజలిం
కృత్వా రాజతి రావు మాధవనృపో రామాయణస్య శ్రియే.
అని శాలివాహనశకము 1346 ప్లవంగసంవత్సరాశ్వయుజమాసమున ననఁగా క్రీస్తు శకము 1427వ సంవత్సరమునందు రావు మాధవనరపాలుఁడు శ్రీమద్రామాయణమునకు రాఘవీయమను టీకను జేసెనని చెప్పఁబడినది. 1427 వ సంవత్సరమునం దుండిన రావు మాధవనృపాలుని మంత్రిగా నుండిన పోతరాజుతమ్మునికుమారుఁడై న మన గౌరనకవి 1440 -50 వ సంవత్సర ప్రాంతములం దుండి యుండవలెను. అందుచేత గౌరనమంత్రి శ్రీనాథకవి యొక్క యంత్యకాలములోను, తదనంతరమునను నుండినందుకు సందేహము లేదు. [గౌరన పేర్కొనిన రావు సింగయ మాధవభూపాలుని గూర్చి యభిప్రాయభేదము లున్నవి. ఇతఁడు బేతాళ రెడ్డి కెనిమిదవ తరము వాఁడని శ్రీ వీరేశలింగమువంతులుగా రభిప్రాయపడినారు. శ్రీనాధుఁడు
1. శ్లో. స్వపత్న్యా శైబ్యయా సార్థం బాలకేనాత్మజేన చ,
వ్రజతో సర్వతో రుధ్వా పంథానం ప్రాహతం మునిః
[మార్కండేయపురాణము]
“వ. ఇట్లు వర్షితా శేషవిభూషణుండై తరువల్కలంబులు ధరియించి
యన్నరేంద్రుఁడు శైబ్యమైన ధర్మపత్నియుం దనయుండును దాను
నిలు వెడలు సమయంబున నమ్మునికుంజరుం డతని కడ్డంబు వచ్చి”.
[మారనకృతాంధ్రమార్కండేయపురాణము]
2. శ్లో. శ్రుత్వా రాజా తదావాదీ దేవమస్తు శుచివ్రతే !
తతః కృత్వా చితాం రాజా చారోప్య తనయం స్వకమ్,
భార్యయా సహిత శ్చాసౌ బద్ధాంజలిపుట స్తదా
చింతయన్పరమాత్మాన మీశం నారాయణం హరిమ్.
[మార్కండేయపురాణము]
క. అనవుఁడు నొడఁబడి విభుఁ డిం
ధనములు సొదగా నొనర్చి దానిపయిఁ దనూ
జుని విడి భార్యయుఁ దనపిఱుఁ
దన నిలువం గేలు మొగిచి తత్పరమతియై
.... ... .... .... ...... ....
క. నారయణుఁ బీతాంబరు
శ్రీరమణీరమణు భక్తచింతామణి దు
ర్వార విపద్ద్విపకుంభవి
దారణనిపుణాభిధానదైవతసింహున్.
సీ. తలఁచుచునున్న యా ధరణీశునొద్దకు
ధర్ముండు మొదలుగాఁ దత్క్షణంబ
..........................వచ్చి రపుడు.
[మారయకృతమార్కండేయపురాణము]
1. శ్లో. భార్యాం చంద్రమతీం ప్రాహ దుస్స్వప్న పరిపీడితః
మయి నిద్రాముపగతే దుస్స్వప్న స్సమజాయత.
[స్కాందపురాణము]
2. శ్లో. తతో రామ మహేష్వా సో నిశితేన వరాసినా,
జఘాన తచ్చిర స్తీవ్రం పశ్యతాం త్రిదివౌకసాం.
పున రాదాయ తం ఖడ్గం తచ్ఛిరః చేత్తు ముద్యతః,
తస్యశ్మిరసి తత్ఖడ్గః పపాత సుమదామవత్,
తత్రాంతరే సర్వ దేవా హాహేతి ప్రియవాదినః.
తత్రాగత్య ముదావిష్టా స్తత్కరం జగృహుస్తతః.
[స్కాందపురాణము]
ఈ రెండు కధలలో మార్కండేయపురాణములోనిది యుత్తరహిందూస్థానములోను, పశ్చిమ హిందూస్థా నములోను వ్యాపించి యున్నది. స్కాందపురాణములోనిది దక్షిణహిందూస్దానములో వ్యాపించి యున్నది. ఈ స్కాందపురాణములోని హరిశ్చంద్రకథనే మొట్ట మొదట గౌరనకవి ద్విపదకావ్యముగాఁ దెనిగించెను. తరువాత శంకరకవి, శరభకవి, మల్లారెడ్డి మొదలైనవారు దీనిని పద్యకావ్యములనుగా జేసిరి. గౌరనకవి ద్విపదకావ్యము మృదుమధురపదసంఘటిత మయి లోకోక్తి స్వభావోక్తి సంయుతమయి ప్రౌఢమయి హృదయంగమముగా నున్నది. ఈతని భాషాంతరీకరణకౌశలమును తదితరకవులకు నీతనికిం గల తారతమ్యమును దెలుపుటకయి రెండు, మూఁడుదాహరణముల నిచ్చుచున్నాను.
1. ద్వి. ఓజ దధ్యాజ్యశాల్యోదనమాంస
భోజనంబులు పరిపూర్తిగా మెసఁగి
మత్తులై వర్తిల్లు మానవేశ్వరులు
సత్తుగా బొంకుట సత్య మెయ్యెడను;
జనపతుఁ లే యూరు ? సత్య మే యూరు ?
వినఁగూడ దీ మాట విడువుము చాలు. [గౌరనమంత్రి]
శ్లో. శాల్యన్నం సఘృతాపూపం భక్షయిత్వా వద త్యగో,
నిర్వాహ్య మేవ వక్తవ్యం సభాయాం దేవసత్తమ
క్వ రాజానః పాపకృత్యాః ? క్వసత్యం దేవదుర్లభమ్ [స్కాందము.]
ఉ. ఒత్తుగ మాంసము న్మడుగుటోగిరమున్ ఘృతశర్కరాదులున్
గుత్తుకబంటిగా మెసఁగి క్రొవ్వి వధూరతితంత్రలీలలన్
మత్తిలి దేహము ల్మఱచి మాటికి బొంకు నృపాలకోటికిన్
సత్తు దలంప నెక్కడిది ? సంయమి నీ సీటు పల్క బాడియే.
[శంకరకవి.]
ఉ. మోదముతో నిరంతర మపూప ఘృతప్లుతశాకమాంసశా
ల్యోదనము ల్బుజించి వివిధోరుపధూరతితంత్రలీలచే
మాదృశు లెవ్వ రంచుఁ గడు మత్తిలి యున్న నరేంద్రకోటికిన్
బాదుకొనంగ నేర్చునె శుభప్రదసత్యవిశేషచిహ్నముల్ ? [శరభకవి.]
2. ద్వి. ఆటదానికి వశమమ్మ యీమేటి
కోటలు దాటి యీగోడలు దాటి
తాళంబు లెడలించి తలుపులు దెఱచి.
కేళిమై రొప్ప జాగిలముల మొఁఱగి
దాది వాకట్టి భూతలనాధు పట్టి
నాదట నీరీతి నఱ్ఱొత్తి చంప ? [గౌరనమంత్రి.]
శ్లో. మానుషీ చే త్కధం కుర్యాదియం ప్రాకారలంఘనం ?
కథం గచ్చతి భూపాలసదనం జనరక్షితం
ఆయుధైః కీలకై ర్వ్యాప్తాన్ కవాటపిహితాన్ బహూన్,
ఉత్పాట్యాంతఃపురం గత్వా కధం పుత్రం హవిష్యతి. [స్కాందము.]
మ. జలజాతాక్షికి శక్యమే మనమునం జర్చింప నిర్భీతిఁ గో
టలు లంఘించి కవాటము ల్డెఱచి చండస్ఫూర్తిమై నుండు కు
క్కల వాకట్టి నృపావరోధగృహభాగంబు ల్బ్రవేశించి ని
శ్చలత న్సాహసలీల రాకొనుచు నాశ్చర్యంబుగాఁ జంపఁగన్. [శంకరకవి]
3. ద్వి. ఱంతుగా నాబోతు ఱంకె వేసినను
గంతులు దక్కునే కంఠీరవంబు ?
కల్ల జంజాటంబు కౌశిక ! యిచటఁ
జెల్ల దుసుమ్ము వసిష్ఠుఁ డుండంగ
సురగకంకణుతోడ నూరజోగులను
సరిచేసి యెన్నినచందాన నీవు
నమితసత్యవ్రతుండగు హరిశ్చంద్రు
సమముగా నృపపిశాచముల లెక్కింతు. [గౌరన.]
చ. క్రమ మెలుఁగంగలేక ఫణికంకణుతోడుత నూరజోగులన్
సమముగఁ జూచినట్టమితసత్యచరిత్రు జగత్పవిత్రు దు
ర్దమరిపురాజికాననవిదాహసముజ్జ్వలవీతిహోత్రు స
ద్విమలవిచిత్రగాత్రుఁ బృథివీజనచారుసరోజమిత్రునిన్.
క. నిరత ప్రతాపజితభా
స్కరుఁడు హరిశ్చంద్రసుగుణసాంద్రునితోడన్
గురు తేఱుఁగలేని కతమున
సరిచూతురె నృపపిశాచసంఘమునెల్లన్. [శరభకవి.]
4. ద్వి. నీ వొకండవె కావు నినువంటి మునులు
వేవురు గూడి వేవేలచందముల
మాయలు పన్నిన మరులకొల్పినను
పాయని యిడుమలపాలు చేసినను
జననుతుఁడగు హరిశ్చందభూవిభుఁడు
మనసున వాక్కున మఱి చేతలందుఁ
గలలోన నై నను ... ... ... ...
.... ... తా నాడినమాట బొంకండు. [గౌరన.]
ఉ. భూతలమందుఁ జేరి నినుఁబోలు మునిప్రవరుల్ సహస్రసం
ఖ్యాతశతాయుతంబు లధికంబుగ మాయలు పన్ని దుఃఖసం
జాతమనస్కు జేసిన నిజంబుగ నెమ్మది నిల్పఁ డెన్న ని
ర్దూతకళంకుఁ డాతఁ డనృతోక్తులు దాఁగలలోన నేనియున్. [శరభకవి]
5. ద్వి. వరుస నిక్ష్వాకుభూవరునాఁటనుండి
పరిణామ మెసఁగ మీ పదములచెంతఁ
జల్లగా మహి చెల్లచనువుల మాకుఁ
జెల్లగా నుంటిమి, చెల్లఁబో నేఁడు
మదిలోన నిటు దయమాలి కుయ్యిడఁగ
వదలక యీ మునివ్యాఘ్రంబువాతఁ
బొదివి త్రోచెడు పశుపుంజంబువోలె
* * * * *
గజిబిజి నొంది యిక్కడఁ దల్లి లేని
ప్రజలమై బాములఁ బడఁజాల మేము. [గౌరన.]
మ. అలఘుప్రాభవ ! మమ్ము మీర లిది పర్యంతంబు సత్ప్రేమచేఁ
దలిఁదండ్రిన్ మఱపించి పెంచి చటులోద్యత్క్రోధివై నేఁడు బె
బ్బులివాతం బడఁద్రోచి పోవఁదగునే ? భూనాధ ! మానేర మే
వలనం జూచితి ? వైనఁ గావఁ దగదే వర్ణింప ముమ్మాటికిన్
[శంకరకవి.]
6. ద్వి. అనఘాత్మ ! నీకోమలాంఘ్రిపద్మమ్ము
ఘనవజ్రమకుటసంగత మైనయట్టి
నా మస్తకంబు మిన్నక సోఁకి నొచ్చె
నేమి తప్పొదవె నాయెడఁ జెప్పుమనిన
గిటగిట పండ్లను గీటి కౌశికుఁడు
చిటచిట మిడుగుర్లు చెదర వీక్షించి
తలపోయ నొక పాదతల మన నేల ?
కలయంగ నిఖిలాంగకంబులు నొచ్చె. [గౌరన.]
చ. అనఘచరిత్ర ! మీ మృదుపదాబ్జము మామకరత్నయుక్త కాం.
చనమకుటంబుతో నొరసి చాలఁగ నొప్పి వహించె; నే నొన
ర్చిన యపరాధ మేది యిటు చేయఁగ ? నానతియిండు నావుడున్
మునికులముఖ్యు డిట్లనియె మో మరుణాంబుజకాంతి నీనఁగన్.
క. ఒకపాద మనఁగ నేటికి ?
సకలాంగంబులును నొచ్చే సాహసవృత్తిన్
మొకమోడక నీచేసిన
సకుటిలకృత్యముల మాకుఁ జర్చింపంగన్. [శంకరకవి ]
శ్లో. పీడితో య న్మహాభాగ ! పాదస్తే నీరజోపమః,
కఠినోజ్వలపాషాణ కిరీ టే వినియోజితః,
తత స్తం ప్రాహ కుపితో విశ్వామిత్రో మహాతపాః,
న మే ఖిన్నం పాదమాత్రం సర్వాంగం త్వద్విచేష్టితైః
[స్కాందము]
గౌరనకవి రచియించిన రెండవ ద్విపదకావ్యము నవనాధచరిత్రము. ఈ శివ కథలలోని మూడవ యాశ్వాసములోని ముఖ్య కధ ఒక బ్రాహ్మణుఁడు సౌందర్యవతియు, యౌవనవతియు నైన రాజపుత్రిని గామించి మాయోపాయముచేత నామెను దక్కించుకోఁ దలఁచి యా రాజపుత్రి రాజమందిరమునం దుండుటవలన రాజ్యమును, రాజవంశము ను నిర్మూలమగుననియు, ఆ యాపద తొలగించుటగయి యా మెను స్వర్ణరత్నాభరణపూర్తమయిన యొక మందసయం దుంచి తలుపులు మూసి దాని నొక తెప్పఁమీదఁ బెట్టి నదీ ప్రవాహములో విడువవలయుననియు, చెప్పి రాజును నమ్మించి యొప్పించి, రాజా ప్రకారముగాఁ జేసి పిమ్మట నేటివాలునఁ బడి కొట్టుకొని పోయెడి పెట్టెను బట్టుకొని యొడ్డునఁ బెట్టి మఱుఁగుస్థలములోఁ బదిల పఱుపుఁ డని ముందుగానే శిష్యులను నియమించి యుంచెను జ్యోతిషఫలము నందు మూఢవిశ్వాసము గల యా రాజశిఖామణి విప్రవాక్యమును వేదవాక్య
ముగా విశ్వసించి తన కన్న కూతురును ప్రజాహితార్థముగా మందసలోఁ బెట్టి దుఃఖముతో నేటినీటఁ ద్రోయింపఁగాఁ బ్రవాహ వేగముఁన గొట్టుకొని పోవుచున్న యా పెట్టెను పరిసరారణ్యమునందు వేఁటాడి డస్సి దప్పితీర్చుకొనుటకయి యేటియొడ్డునకు వచ్చిన యొక రాజకుమారుఁ డొడ్డునకుఁ బట్టించి తలుపులు తెఱచి దానిలో రెండవ రతీ దేవివలెఁ బ్రకాశించుచున్న యా రాచకన్నెను చూచి వలచి తద్వృతాంత మడిగి తెలిసికొని స్వర్ణాలంకార సహితముగా గాంధర్వవివాహమున నామెను పరిణయమయి యా మందసలోఁ దాను వేటాడి పట్టుకొన్న భల్లూకము నొకదానిని బెట్టి తలుపులు వేయించి యధాపూర్వముగా మందసను నదీ ప్రవాహానఁ దోపించెను. పెట్టె నెదురు చూచుచు నేటియొడ్డున దిగువను వేచియున్న శిష్యులు తమవంకకు వచ్చుచున్న పెట్టెను దరికి లాగి యొక సురక్షితస్థలమునఁ జేర్చి గురువురాకకు ప్రతీక్షించుచుండఁగా, నింతలో సంధ్యాసమయమున బ్రాహ్మణుఁ డక్కడకు వచ్చి చూచి సంతోషించి శిష్యులను శ్లాఘించి శిష్యులకు వేఱు పనులు కల్పించి వారి నందఱిని సాగనంపి తా నొంటిగా మందసను తెఱుచునప్పటి కందులో నున్న యెలుఁగుగొడ్డాతనిమీఁదఁ బడి కఱిచి కండలూడదీసెను. ఈ కథలోనిభాగము లక్కడక్కడివికొన్ని యిం దుదాహారింపఁబడుచున్నవి.
ద్వి. చెడితిరా నిఁక నేమి చేయుదుఁ ననుచుఁ
గడుపును బిసుకుచుఁ గటకటా ! యనుచు
నిలిచినచో నొక నిమిషార్థమైన
నిలువనోపక కూడు నీళ్ళును బాసి
కడుజాలిఁ బొందుచుఁ గన్నంబులోన
వడి తేలు కుట్టినవానిచందమున
వెడఁగురీతిని కడు వేదనఁ జాల
నడరుచు నొక యుపాయమును జింతించి
* * * * * * *
విను వినకుండుము వివరించుకొనుము
కొనకుండు మనుచును గుటిలాత్ముఁ డతని
చెవి డాసి కూఁతురుచే వ్రాఁతఫలము
వివరించి చూచితి విను మీ కుమారి
నీయింటి నుండిన నీవు నీ ప్రజలు
నీయేలు దేశంబు నిర్మూల మగుదు
రన విని భీతితో నతఁ డాడుమాట
తనకు నంతకుమున్ను తార్కాణ యగుట
తలపోసి యక్కట ! తల్లి పెంచినది
యెలమి నీబాలిక నేగతి విడువ
నొడఁబడు బుద్ధి నీయువిదయె నాకుఁ
గొడు కై నఁ గూతైనఁ గూర్మి నెక్కొన్న.
* * * * *
వెఱతుము నీమాట వేరెదు గడవ
నెఱిఁగింపు మీ పాప నేమి చేసెడిది ?
నావుడు సిద్ధించె నాకోరి కనుచు
భావంబులోపలఁ బ్రమదంబు నొంది
యాతఁ డిట్లనె వసుధాధిప ! మిగుల
చాతురిగా మందసంబును జేసి
యా లోన మణికనఁకాంబరాభరణ
జాలంబుతోడ నీ చపలాక్షి నునిచి
తలుపులు వదలించి తగుతెప్పఁమీదఁ
బొలుపొంద నునిచి యుప్పొంగుపెన్నీట
వెసఁ బాఱవిడిచిన వేవేగ శుభము
లెసఁగు మీ కెల్లను నేలనాగభాగ్య
... ... ... ...
నృపతి యాకన్యపాణిగ్రహణంబు
విపులసమ్మదమున వెలయఁ గావించి
మనమార మొదల నమ్మందస నున్న
ఘనమైన వస్తువుల్ గైకొని యందుఁ
బూని తానంతకు మున్ను వేటాడి
బోనిలోఁ దెచ్చిన భూరిభల్లుకము
జొరఁగొట్టి తలుపు లచ్చులు వదలించి
తిరముగాఁ దొల్లిటి తెప్పపై నునిచి
యేట బో విడిచి యా యింతిఁ దోడ్కొనుచు
ఘోటకభటదంతికోటులతోడఁ
దనపురి కేఁగెను దదనంతరంబ
యనువునఁ జనుచున్న యా మందసంబు
వడుగులు గని యుబ్పి వడిఁ గుప్పిగంతు
లిడుచు నొండొరుల బల్విడిఁ గేక లిడుచుఁ
గొట్టి ఱంకెలు వేసికొనుచుఁ జెలంగి
పట్టి మందసఁ దెచ్చి పరఁగ నయ్యేటి
పొంత ప్రబ్బినప్రబ్బపొదలలో నునిచి
సంతసం బెసఁగ నొజ్జలరాక కెదురు
చూచుచునుండ నచ్చోటను విప్రుఁ
డే చేటుపోటుఁ దా నెఱుఁగక దక్కె
రాచకూఁతురు మనోరధసిద్ధి యెసఁగె
నాచపలాక్షీ జయ్యనఁ బొందకున్న
నేచిన యీ మనం బె ట్లాపవచ్చు ?
... ... ... ... ...
చలమున బ్రహ్మరాక్షసుఁడనై నిన్నుఁ
బొలియింప కిఁక నెటుఁ బోవనీ న్సుమ్ము.
మలయజగంధి నామాటకు మాఱు
పలుకవు నక్కిళ్లు పడియెనో చెవుడు
తొడరెనో పెనుముద్ద దురిగిరో నోర
నెడదవ్వులను మాట లేల మా కనుచు
వెలుపల దోవతి వేసి లోపలికిఁ
దలయెత్తి మోకాళ్ళు తడవుచుఁ జొచ్చె.
... ... ... ... ...
నలుపారు నెలుఁగుతిన్ననితోఁకఁ జూచి
ప్రీతిమై రాకొమారితవేణీ యనుచుఁ
జేతఁబిగ్గరఁబట్టి చేరఁ దివ్వుటయు
గొటగొట గోండ్రించి కోఱ లొడొంటిఁ
గటకటఁ దాఁకింప గర్భంబు గలఁగి
హా తాత ! హా మాత ! యనుచు మోచేతు
లూతగా వెనుకకు నొరిగి వెలికలఁ
బడి పాఱుకొని గుండె బలువిడి నడిచి
పడఁగ నెలుంగని బాతళింపఁగను
నత్తఱి విప్రుపై నదరంట నుఱికి
క్రొత్తనెత్తురు లొత్తఁ గ్రొవ్వాడిగోళ్ళ
జిల్లులు వోవంగ శిరమును నురము
గుల్లలతిత్తిగాఁ గొట్టియు మెడయుఁ
జరణయుగంబుఁ గక్షములు నురంబుఁ
గరములు జిగిబిగిగా నొగిలించి
విడిచె నంతటితోడ విటశిఖామణికి
నడఁగెఁ దొల్లిటివిషయఫువేధ లెల్ల
గెరలి భల్లూక మీ క్రియఁ తన్నుఁ గఱువ
హరిహారి ! గోవింద ! యయ్యరో యనుచుఁ
దఱియంగఁబడియె నంతయుఁ బోలఁ జూచి
మఱి వచ్చి వడుగులు మందసఁ గదిసి
వగచుచుఁ జేరి మీవంటి పెద్దలకుఁ
దగిలె నీదురవస్థ దైవయోగమున.[2]