Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/భైరవకవి

వికీసోర్స్ నుండి

భైరవకవి


ఈ కవి శ్రీరంగమహత్త్వమును, రత్నశాస్త్రమును, కవిగజాంకుశమును జేసెను. వీనిలో శ్రీరంగమాహాత్మ్యము ప్రధానమైనది. ఈ గ్రంథము చాగయామాత్యుని పుత్రుఁడైన రాఘవమంత్రి కంకితము చేయబడినది. రామామాత్యుఁ డని నామాంతరము గల యీ రాఘవమంత్రి మాధ్వుఁడని తోచుచున్నది. ఇతఁ డే కాలమునందుండెనో యే రాజుమంత్రియో పుస్తకమువలనఁ దెలియరాదు. అయినను కృతిపతి యన్న విఠ్ఠలేశ్వరుఁ డీ విధముగా వర్ణింపఁబడెను.

సీ.చండదిగ్వేదండకాండధూర్వహమహీ
                         మండలోద్ధరణసమర్ధ మగుచు
          దుర్వారపరిపంధిసర్వసంపద్గర్వ
                         నిర్వాపణక్రియానిపుణ మగుచు
          వేదాదివిద్యావినోదవిద్వజ్జనా
                         మోదాతిశయసముత్పాది యగుచు
          జంభజిన్మదకుంభికుంభీనసాధీశ
                         శంభుభూభృద్ద్యుతిస్వచ్ఛ మగుచుఁ

          బరఁగు నే మంత్రిభుజబలప్రకటశౌర్య
          దానసత్కీర్తు ల ప్రతిమానమహిమ
          నాతఁ డిమ్మడిసై పఖానాధిరాజ్య
          భారధుర్యుడు విఠ్ఠల ప్రభువరుండు.

ఇం దిమ్మడి యనియు, సైపఖా ననియు, రెండు పేరు లుదాహరింపఁబడి యున్నవి. ఈ రెంటిలో నిమ్మడి యనునది ప్రౌఢ దేవరాయని నామాంతరము. ఇమ్మడిదేవరాయ లనఁబడెడు ప్రౌఢదేవరాయలు 1423 మొదలుకొని 1447వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను. ఈ విఠ్ఠల

ప్రభుఁ డిమ్మడికి సామంతుఁడుగా నుండిన సైపఖానునొద్దనో యిమ్మడిసైపఖాను లిద్దఱియొద్దనో కొలువుండి రాజ్యభారమును తీర్చుచుండి యుండును. [1] అందుచేత విఠ్ఠలప్రభుని తమ్ముఁడైన రాఘవమంత్రి 1450-60 సంవత్సర ప్రాంతములయం దుండెనని యూహింపవలసి యున్నది. చతుర్థాశ్వాసాంతమునందలి యీ క్రింది పద్యమువలనఁ గృతిపతి సైపఖానునొద్దనే కొలువుండినట్లు తోఁచుచున్నది.

    శా. థాటీవిభ్రమజృంభమాణనిజయోధవ్యూహబాహాధను
        ర్జ్యాటంకారవిశంకటధ్వనివిశేషధ్వస్తనిస్తంద్రక
        ర్ణాటోదీర్ఘబలార్ణ వార్భటితురంగారోహణోదారలీ
        లాటోపార్కతనూజ చాగవిభురామామాత్యచూడామణీ.

కృతిపతి యైన రాఘవమంత్రి సభామండపంబునఁ గొలుపుండి తన్నుఁ బిలిపించి "శ్రీరంగమహత్త్వంబు మదంకితంబుగా నాంధ్రభాషాకౌశలంబు పచరించి రచియింపవలయునని యభ్యర్ధించి" నట్లు చెప్పుచోఁ గవి తన్నిట్లు చెప్పుకొనెను.

    మ. కృతవిద్యాఖురళీపరిశ్రమకళాకేళీవిలాసున్ జన
        స్తుతచారిత్రుని గౌతమాన్వయపవిత్రున్ గౌరనామాత్యస
        త్పుత్రుఁ గళ్యాణకవిత్వలక్షణసమర్జున్ సూక్తి ముక్తాఫలా
        తతకాంతిస్ఫుటచంద్రికోల్లసితవిద్వత్కైరవున్ భైరవున్.

అని తాను గౌతమగోత్రుఁడననియు. గౌరనామాత్యపుత్రుడననియుఁ జెప్పుకొని యుండుటచేత భైరవకవి హరిశ్చంద్ర నవనాథచరిత్రములను రచించిన

గౌరనమంత్రిపుత్రుఁ డేమో యని యూహ కలుగుచున్నది. గౌరనమంత్రి గౌతమగోత్రుడగుటయు, బ్రౌఢ దేవరాయలకాలములో నుండుటయు నీ యూహను మఱింత బలపరుచుచున్నవి గాని నిజముగా తనతండ్రి గొప్ప కవీశ్వరుఁడై యుండినపక్షమున భైరవకవి యా విషయమును దన గ్రంథమునందుఁ జెప్పఁడా యని సందేహము పొడముచున్నది. ఈ సందేహము మాట యటుండఁగా గౌరనామాత్యుఁడు భైరవామాత్యునికుమారుఁ డనుట కొక గొప్ప యాక్షేపణ కనఁబడుచున్నది. భైరవుఁడు కవిగజాంకుశమును రచించెను గదా ! గౌరనమంత్రి తాను రచించిన లక్షణదీపికలో కవిగజాంకుశములోని పద్యముల నుదహరించెను. తండ్రి తాను చేసిన గ్రంథములో కుమారుఁడు ముందు చేయబోయేడు గ్రంథములోని పద్యముల నుదాహరించుట సంభావ్యము కాదుగదా ? అందుచేత లక్షణదీపికలో నుదహరింపఁ బడిన కవిగజాంకుశము భైరవునిది గాక మఱియెవ్వరిదైనఁ బూర్వకవిదయియైన నుండవలెను; లేదా, గౌరనమంత్రి కి భైరవుఁడు కుమారుఁడైనఁ గాకుండవలెను. లక్షణదీపికలో నుదాహరింపఁబడిన కవిగజాంకుశమిది గాక యెప్పటిదో పూర్వపుదనియు, వివిథ దేశములనుండి సంపాదించిన తమ యొద్ది నాలుగు( భైరవకవికృత) కవిగజాంకుశ ప్రతులలోను లక్షణదీపికలో నుదాహృతములైన పద్యములు లేవనియు శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు చెప్పుచున్నారు. అల్పకాలములోనే కవిగజాంకుశనామము గల గ్రంథములు రెండు పుట్టె ననుటయు, నంత నమ్మదగినదిగా లేదు. దీనికి సమాధానముగా నొకటి కవిగజాంకుశ మనియు నింకొకటి కవిరాడ్గజాకుశ మనియుఁ జెప్పుదురు. ఇది యంతతృప్తికరమయిన హేతువు గాదు. అయినను గౌరన, భై రవకవుల కాల మించుమించుగా సరిపోవుచున్నది గనుకను, ఇరువురును గౌతమగోత్రులే యగుటచేతను,భై రవకవితండ్రీ యెవ్వరో గౌరనయే యగుటచేతను ప్రమాణాంతరములవలన నన్యధా సిద్ధాంత మగువఱ

కును భైరవకవితండ్రి హరీశ్చంద్రోపాఖ్యానాదులు రచించిన గౌరన మంత్రియే యని యంగీకరింతము.[2]

“ఇది శ్రీమద్భ్రమరాంబావర ప్రసాదలబ్ధసిద్దసారస్వతగౌరన ' అని శ్రీరంగ మాహాత్మ్యమునందును,

     క. భ్రమరాంబికామహావర
        సముదితనిరవద్యహృద్యసాహిత్యకళా
        క్రమవిమల ప్రతిభాసం
        క్రమణుఁడ మతిశాలి నగౌరనసుతుఁడన్

అని రత్న శాస్త్రమునందును.

     క. శ్రీమత్పరమశివానన
        తామరసవికాసలీలఁ దనరిన భ్రమరాం
        బామధుమత్తభ్రమరిక
        నామానససరసీరుహమునన్ వసియించున్

అని కవిగజాంకుశమునందును. భ్రమరాంబావర ప్రసాదమువలనఁ దనకుఁ గవిత్వసంపద గలిగినట్టు కవి చెప్పుకొని యున్నాడు. ఈతని కవిత్వము పీఠికయందు పొగడినంత యుత్తమమైనది కాకున్నను గంగా ప్రవాహమువలె ననర్గళధార కల దయి, యుభయభాషాపాండిత్యాతిశయసంసూచకమయి

హృదయంగమముగా నున్నది. రత్నశాస్త్రమగస్త్యుఁడు సంస్కృతమున రచించిన మణిలక్షణమునకుఁ దెనుఁగని యీ పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

      క. తన్నుఁ బ్రియమార వేడిన
         మున్ను మునీంద్రుల కగస్త్యముని చెప్పిన యా
         సన్నుతమణిలక్షణములు
         చెన్నుగఁ గ్రోడీకరించి చెప్పెదఁ తెలియన్

ఈతని గ్రంథములలో నొక్కొక్కదానినుండి రెండేసి పద్యముల నిందుదాహరించుచున్నాను.

1. శ్రీరంగమాహాత్మ్యము.

      చ. తలపులు నిక్క నిక్కపుముదమ్ములఁ దమ్ముల సంచలించు న
          య్యలులకు లోఁగి లోఁ గినుకనందెద నందెద వేల చంపకా
          వల్ వలి నున్న మొగ్గ లనివారణ వారణయాన కోయు మిం
          పలరఁగ దానఁ దేటి రస మానదు మానదు లేఁతపూవులన్.

      ఉ. ధీరులు దోషదూరులు సుధీజనసంస్తవనీయసద్గుణో
          దారు లుదారు లాహవజితప్రతివీరు లపూర్వనిత్యశృం
          గారులు శూరులు జ్ఝితవికారులు వార్థిగభిరు లంగనా
          మారులు శక్తినిర్జితకుమారులు రాజకుమారు లప్పురిన్

2. రత్న శాస్త్రము.

      ఉ. నీరదము ల్దిగంతముల నిండి తటిద్ఘనగర్జితంబు లిం
          పార మహోగ్రవృష్టి గురియం బ్రభవించు నితాంతకాంతితో
          నారయఁ గుక్కుటాండసమమై పడు ముత్యము లంతరిక్షసం
          చారులు పట్టుకొందురు వెసన్ వసుధం బడకుండ నేర్పునన్.

    
    ఉ. చేత ధరింవ మానవులచెంతను జేరవు భూతకోటు లే
        రీతినీ దుష్టవిద్య లొనరించిన నెక్కవు క్రూరజీవముల్
        ఘాతము సేయలేవు సతిగర్భము మోప సుఖప్రసూతి యౌ
        నాతతభాతితోఁ బ్రతిదినంబును బ్రీతి యొనర్చుఁ గేతువున్

3. కవిగజాంకుశము.

     క. ఒదుగుచు లక్షణ మెఱుగక
        గొదుకుచు బ్రాసంబు వడియుఁ గూడక మీఁదుల్
        వెదకుచుఁ బదసంధులు చెడ
        నదుకుచు వెడకవిత చెప్పునతఁడుం గవియే?

     క, కమలహితుఁ డున్న నక్ష
        త్రము మొదలుగ నేడు దోషతమములు నడుమన్
        ప్రమద ప్రదములు పండ్రెం
        డమరఁగ నశుభముల తొమ్మి దగుఁ బద్యాదిన్

  1. [‘చండదిగ్వేదండ...' అను పద్యములోని 'ఇమ్మడి సైఫఖానాధిరాజ్య' అసుచోటఁ గల 'ఇమ్మడి' పదము ఇమ్మడి దేవరాయలనెడు ప్రౌఢ దేవరాయాలను తెల్పదనియు, ఇమ్మడి సైఫఖానన రెండవ సైఫఖానని యర్థమనియు 'ఆంధ్రకవి తరంగిణి' లో జెప్పఁబడినది. (సం. 5. పుట 219)]
  2. [ భైరవకవి హరిశ్చంద్ర, నవనాధచరిత్రములకర్తయైన గౌరనపుత్రుఁడని ఊహించుటకుఁ జాలినన్ని యవకాశములున్నను, కవిగజాంకుశములోని పద్యములు లక్షణదీపిక యందుదాహరింపఁబడుటచే, - కుమారుని పద్యములు తండ్రి యుదాహరించుట అసంభావ్యము గాన - ఇర్వురును తండ్రి, కుమారులని తలఁచుట కుదరదని కొందఱి యాశయము, లక్షణదీపికలో కవిగజాంకుశములోని పద్యము లుదాహ రింపఁబడుట వాస్తవమే! అయినను, గుణగ్రాహియగు తండ్రి కుమారుని గ్రంథము నుండి యుదాహరించుటయు, కుమారుడు చిన్నతనముననే రచయిత యగుటయు నసంభావ్యములు కానేఱవని తోఁచుచున్నది. ఇట్టి పద్ధతి సంస్కృత వాఙ్మయమునను గానవచ్చుచున్నది ]