ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/కాచవిభుడు, విట్టలరాజు
కాచవిభుఁడును, విట్ఠలరాజును
ఈ కవులిరువురును రంగనాథరామాయణమును రచియించినట్లు చెప్పబడి యున్న బుద్ధరాజు యొక్క పుత్రులు. వీరు పదుమూడవ శతాబ్దమధ్యమున నుండి యందురు. వీ రిరువురును జేరి తమ తండ్రి యాజ్ఞ చొప్పన నుత్తరరామాయణమును ద్విపదకావ్యమునుగా రచియించినట్లు గ్రంథాది యందువ్న పీఠికవలనఁ దెలియవచ్చుచున్నది.
ద్వి. కోనకులార్ణవకువలయేశుండు
నా నొప్పు కోటగన్న క్షితీంద్రునకు [1]
ననఘాత్మ యగుచున్న యన్నమాంబికకుఁ
దనయుండు బుద్ధాభిధానండు పనుప
నారయ మత్స్యకూర్మాది దివ్యావ
తారంబులం దెల్లఁ దలంచి చూడంగ
రామావతారంబు రమణీయ మగుట
రామపావనచరిత్రము దివ్యభాష
లోకానురంజనశ్లోకబంధములఁ
జేకొని వాల్మీకి చెప్పినజాడ
మా తండ్రి బుద్ధక్షమానాథుపేర
నాతతనృపకైరవాప్తుని పేర
ఘనుఁడు మీసరగండకాచవిభుండు
వినుతశీలుఁడు పిన విఠలభూపతియు
నని జనుల్ మముఁ గొనియాడంగ మేము
వినుతనూతనపదద్విపదరూపమున
బ్రాకటంబుగ నాంధ్రభాషను జెప్పఁ
గైకొన్నయుత్తరకథ యెట్టి దనిన.
ఈ పుస్తకము యొక్క కవనధోరణి రంగనాథరామాయణమును పోలియున్నది. కాబట్టి యీ యుత్తరకాండమునుగూడ రంగనాథుఁడే రచియించి పూర్వకాండములకు బుద్దరాజును కృతిక ర్తనుగాఁ జేసినట్టే దీనికిఁ దత్పత్రులను గృతికర్తలనుగాఁ జేసి యుండ వచ్చునని యూహింపఁదగి యున్నది. అయినను, ఇతర నిదర్శనములు లేక యిది యిట్లని నిశ్చయింప వలను పడదు. ఈ కింది యుదాహరణమువలనఁ బుస్తకముయొక్క కవిత్వశైలి కొంత తెలియవచ్చును.
ద్వి. అంతట రంభయు నంభోజసరసి
దంతి చొచ్చినచొప్పు తనకుఁ బాటిలినఁ
జింతాపరంపర చిత్తంబులోన
నంతకంతకు దట్టమై కడ ల్కొనఁగఁ
దలఁకుచుఁ గొంకుచుఁ దనలోనఁ దానె
పలుకుచుఁ బులిబారిఁ బడి వడిచెడిన
హరిణిచందంబున నటఁ దొట్రుపడుచుఁ
బిరిగొన్నదురవస్థఁ బ్రియు పాలి కరిగి
యడుగులఁబడి లేచి యందంద మేను
వడఁకంగ వదనంబు వంచి హారములు
పెనఁగొన గనయంబు ప్రిదులలోఁ జెరివి
కొనిన పూవులు గందఁ గ్రొమ్ముడి వీడఁ
దొంగలిఱెప్పలఁ దోఁగు బాష్పములు
తుంగ స్తనంబులఁ దొరుఁగ నట్లున్నఁ
గనుగొని యిది యేమి కొంత నీచంద
మనవుడు నాలేమ హస్తముల్ మొగిచి
నడుకుచు నాపల్కు, నాల్కకు రాక
కడుcదూలి గద్గదకంఠయై పలికె
నేను నీయొద్దకు నేతేర నింద్రు
పై నెత్తిపోవుచుఁబంక్తి కంధరుఁడు
సేనతోఁ గలధౌతశిఖరిపై విడిసి
తా నందు ననుఁ గాంచి దర్పాంధుఁ డగుచు
నేనుఁ గోడల నన నిఱియంగఁ బట్టి
నాన దూలఁగ బిట్టు నను గాసి చేసెఁ
గావున నీ తప్పఁ గావంగఁ దగదు
నావుడు నలిగి యా నలకూబరుండు &c
మారన
మారన యను కవి తిక్కనసోమయాజుల శిష్యుఁడు. ఇతcడు మార్కండేయపురాణమును తెనిఁగించెను. నీతిబోధక మయి సర్వజనరంజక మయి యున్న హరిశ్చంద్రోపాఖ్యానము కథయుఁ ప్రబంధరత్నమని కొనియాడఁబడు మనుచరిత్రము కథయు మార్కండేయపురాణమునుండి తీసికొనఁబడినవే. ఇతని కవిత్వము తిక్కనసోమయాజి కవిత్వమంత మధురముగా నుండదు గాని సలక్షణ మయినదిగాను మృదువుగాను ఉండును. ఇతఁడు తన గ్రంథమును ప్రతాపరుద్రుని సేనానాయకుడైన నాగయగన్నమంత్రికిఁ [2] గృతి యిచ్చెను. కవి కృత్యాదిని కృతినాయకుని వర్ణించుచు నాతనిని గూర్చి
చ. 'ఎలమిఁ బ్రతాపరుద్రమనుజేంద్రునిచేఁ బడసెం బ్రవీణుఁడై
కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిఁ గీటడంచియున్
బలరిపుతుల్యవిక్రముఁడు నాగయగన్నవిభుండు తేజమున్
విలసితరాజ్యచిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్.'
ఆని చెప్పెను. ఈ కృతిపతి కేలికయైన ప్రతాపరుద్రుఁడు కాకతీయ వంశ భూషణుడై జగత్ప్రసిద్ధుఁ డయి యుండినవాఁడు. విద్యానాధ మహాకవి యీతనిపేరనే ప్రతాపరుద్రీయ మనెడి యలంకార శాస్త్రమును జెప్పెను. ప్రతాపరుద్రుఁడు తన మాతామహియైన రుద్రమ్మదేవియనంతరమున 1295 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చి 1323 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. 1321 వ సంవత్సరమునందు ఢిల్లీ ఫాదుషా యొక్కసేనలు ప్రతాపరుద్రునిరాజధాని యైన యోరుగల్లమీఁదికి దండెత్తి వచ్చి యోడిపోయినందున 1323 వ సంవత్సరమునందు ఢిల్లీచక్రవర్తి