Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/అధర్వణాచార్యుఁడు

వికీసోర్స్ నుండి

అధర్వణాచార్యుఁడు

అధర్వణాచార్యుని కాలమును నిర్ణయము చేయుటకుఁ గొన్నియాధారములు కనఁబడుచున్నవి. దక్షిణ హిందూస్థాన ప్రాచీనలిపి శాస్త్రమును రచించిన బర్నెల్ దొరవా రధర్వణకారికలలో నక్షరములనుగూర్చి వ్రాయఁబడిన

        శ్లో. పంచవరాదయో వర్ణా శ్శంఖశార్ఙ్గాదిసన్నిభాః
            తిర్వగ్రేఖాయుజ శ్చోర్ధ్వం దండ రేఖాన్వితా అధః.
            త ఏవ చ ద్వితీయా స్స్యురూర్ధ్వరేఖాద్వికాన్వితాః
            ప్రధమా స్తు ద్వితీయాస్స్యు స్తృతీయాస్తే చతుర్థకాః.
            రేఖాద్వయాధో దండేన యుక్తాస్స్యు రనునాసికాః
            మిళద్దండద్వయోపేతాః ప్రధమా లిపయః స్మృతాః

ఇత్యాది శ్లోకముల నుదాహరించి, తెలుఁగక్షరములలోఁ బైని జెప్పఁబడిన మార్పులు పండెండ్రవ శతాబ్దాంతమువఱకును గలుగనందున, అధర్వణాచార్యుఁడు పండెండ్రవ శతాబ్దాంతమునకుఁ గాని పదుమూడవ శతాబ్దారంభము నకుఁగాని పూర్వుఁడయి యుండఁజాలఁడని వ్రాసి యున్నారు. ఆ గ్రంధము లోనే దొరవా రింకొకచోట నధర్వణాచార్యుఁడు తన త్రిలింగశబ్దాను శాసనములో ప్రథమపరిచ్ఛేదము అయిదవ శ్లోకములోను, తృతీయపరిచ్ఛేదము పదుమూడవ శ్లోకములోను హేమచంద్రునిపే రుదాహరించి నందున 1088 -వ సంవత్సరమునఁ గాఁబోలును పుట్టి 1132-వ సంవ త్సరమునందు మృతినొందిన హేమచంద్రుని తరువాతివాఁడని వ్రాసినారు.

అధర్వణకారిక లనఁ బడునవి యధర్వణార్యువిచే రచియింపఁబడినవి గాక మఱి యెవ్వరిచేతనో యొక యాధునికునిచేత నాతని పేరు పెట్టి యిటీవల రచియింపఁబడిన వయినట్టు కనఁబడుచున్నవి. కాబట్టి యా కారికావళిని బట్టి యాతనికాలమును నిర్ణయించుటకు వలనుపడదు. అతఁడు మొట్ట మొదట నొక యాంధ్రవ్యాకరణమును జేసి యటుపై నింకొక యాంధ్ర వ్యాకరణమును జేయుట తటస్థింపదు. అధర్వణకారిక లనబడెడు వికృతి వివేకము మిక్కిలి యాధునికమని చూపుటకుఁ జాలినన్ని నిదర్శనములా పుస్తకమునందే యున్నవి. పూర్వకవు లెవ్వరును శ్రీవాచక తత్సమపదముల కకారాంతములకు సంధి కూర్చి యుండలేదు. ఈ నియమమును మీఱి "గంగానుకాసె", "శ్రీరంగభర్తంచు" అని యాము క్తమాల్యదయందు 1508 మొదలుకొని 1530 -వ సంవత్సరమువఱకును కర్ణాటకసామ్రా జ్యము నేలిన కృష్ణదేవరాయ లకారాంత తత్సమములకు మొట్టమొదట సంధిని గూర్చినవాఁడు. ఆతనికిఁ బూర్వ మెన్నఁడును లేని యీ నూతన ప్రయోగములకు 'కుత్ర చిత్సంస్కృతీయో పి ప్రాణోప్యత్రచ్యుతో భవేత్' అని యధర్వణకారికలయందు లక్షణము విధింపఁబడి యున్నందున కారికల కర్త 1530 వ సంవత్సరమునకుఁ దరువాతివాఁ డయి యుండవలెను [1] 285 పుట యీ మూలగ్రంథములో అలభ్యము. జేసెననియు, నది పరమప్రమాణ మనియుఁ జెప్పి యున్నాడు. [2]ఈ యకలంకుఁడు జైనపండితుఁడు. ఈతఁ డకలంకుఁ డనియు, ఆకలంక భట్టనియు, భట్టాకలంకుఁడనియు, అకలంక దేవుఁడనియు గ్రంథముల యందు వాడఁబడుచున్నాఁడు. ఇతఁడు సంస్కృత సూత్రములతో "శబ్దాను శాసన" మనుపేర కన్నడ వ్యాకరణమును జేసి, దానికిఁ దానే "భాషా మంజరి" యను వృత్తిని మంజరీ మకరంద" మను వ్యాఖ్యానమును జేసి యున్నాఁడు. తాము చేసిన వ్యాకరణములకు శబ్దానుశాసనము లని పేరు పెట్టుటయు వానికిఁ దామే వృత్తులను వ్యాఖ్యానములను వ్రాయుటయు మొదటినుండియూ జైనపండితులలో నాచారమయి యున్నది. మొట్టమొదట సంస్కృత వ్యాకరణమును జేసిన శాకటాయనుఁడను జై_నపండితుఁడు తన వ్యాకరణమునకు "శబ్దానుశాసన" మను పేరు పెట్టి దాని "కమోఘవృ త్తి యను వృత్తిని జేసి యున్నాఁడు. తరువాత "హేమచంద్రుఁ డను జైనపండితుఁ డెనిమిది ప్రకరణములు గల "శబ్దశాసనము"ను సంస్కృత సూత్రములతో 1170-వ సంవత్సరమునందుఁ జేసెను. దానిలోని యెనిమిదవ ప్రకరణము ప్రాకృతమునుగూర్చినది. దానినే మనవారు హేమచంద్రఫక్కి యని చెప్పదురు. సంస్కృత ప్రాకృతము లాంధ్ర భాషకు ప్రకృతులగుటచేత నొక విధముగాఁ గొంతవఱకు సంస్కృత ప్రాకృత వ్యాకరణములను తెనుఁగులక్షణములనియుఁ జెప్పవచ్చును. శబ్దాను శాసన మన పేరితో సంస్కృతసూత్రములతో వ్యాకరణమును జేసిన మూఁడవ జైనపండితుఁడు భట్టాకలంకుఁడు. ఈ కర్ణాటకశబ్దానుశాసనము నాలుగు పాదములను ఏనూటతొంబదిరెండు సూత్రములను గల దయియున్నది. ఇందలి సూత్రము లాంధ్రశబ్దచింతామణిలోని సూత్రములను బోలి యుండును. వాని స్వరూపమును జూపుటకయి యొక్క సూత్రము నిందు వృత్తి వ్యాఖ్యానములతో నిచ్చుచున్నాను.

సూత్రము -249 ---నవోల్వొలి

        వృత్తి- ఆకారాంతా చ్చబ్దా త్పరస్య సుపః శ్లుబ్న భవతి వోల్ ప్రత్యయే,
                  వొల్ ప్రత్యయే చ పరే.

         ప్రయోగః- ఇంద్రనవోల్, ఇంద్రనవాల్; చంద్రనవోల్, చంద్రనవొల్.
                  వోల్పొవీతికిం ఇంద్రంబొల్, చంద్రంబొల్.

         వ్యాఖ్యా- తస్య తుల్యే వోల్వోల్వితి షష్ట్యంతా తౌ ప్రత్యయౌ విధాన్యేతే తయోః
                  పరయోః సుపః శ్లుబ్నినిషిధ్యతే- తత్రానకారాంతే విభాషయా
                  వక్ష్యమాణత్వాద యమకారాన్త ఏవ నిషేధ8 వర్యవస్యతీత్యాహ-
                  ఆకారాంతాదిత్యాది-పూర్వేణ శ్లుపః ప్రాప్తా వయ మారంభః.

అకలంకుఁడు తన శబ్దాను శాసనము నీ మంగళ శ్లోకముతో ముగించెను.

        శ్లో. "మంగళం భగవానర్హన్ మంగళం భగవాన్ జినః.
            మంగళం ప్రధమాచార్యో మంగళం వృషభేశ్వరః"

అకలంకుని శబ్దానుశాసనమునుగూర్చి యింత దూర మేమేమో చెప్పియు ముఖ్యముగాఁ జెప్పవలసినదానిని చెప్పకయే యుంటిమి. అతఁడు తన గ్రంధరచనకాలమును పుస్తకము తుద నిట్లు చెప్పెను.

         శ్లో. శకవర్షే రస నేత్ర బాణ శశి సంఖ్యేబ్దే తపోమాసికో
            భకృతి శ్రీసితపంచమీ గురు దినే లగ్నే ఘటే పౌష్ణ భే
            అకలంకాహ్వయయోగిశిష్యతిలకో గ్రంథం సతాం మంజరీ
            మకరందాఖ్య మిదం మతం వ్యరచయం భట్టాకలంకో మునిః

ఈ శ్లోకములో తాను మంజరీమకరందాఖ్యవ్యాఖ్యను శకవర్షములు 1525 (అనఁగా క్రీ. శ. 1604) శోభకృత్సంవత్సర మాఘశుద్ధ పంచమీ గురువార రేవతీనక్షత్ర కుంభలగ్నమున ముగించినట్టు భట్టాకలంకుఁడు చెప్పెను. అకలంకుఁడు కర్ణాటకశబ్దానుశాసనమును వ్యాఖ్యతోడఁగూడ 1604-వ సంవత్సరమునందు ముగించినందున, దానిని చదివి తన కారికలను రచించిన వికృతివివేకకారుఁడు తరువాత నేఁబది, యఱువది సంవత్సరముల కుండి యుండును.[3] ఇక ఈ కాల మహోబల పండితుని కాలముతో సరిపోవుచున్నది. ఈ కారికలవార్త నహోబలునికిఁ బూర్వమునం దున్నవా రెవ్వరు నెఱుఁగరు. పూర్వమందున్నవా రనుట యేమి ? ఏక కాలమునందే యున్న యప్పకవి సహితమెఱుఁగఁడు. అప్పకవిమీఁది స్పర్థ చేతఁ దన వాఖ్యాన మనఁగా నహోబలపండితీయ మనcబడెడు కవిశిరోభూషణ మప్పకవీయమున కంటె మిన్నగా నుండవలె నన్నయభిలాషతో నీ కారికావళిని రచించి తన వ్యాఖ్యానములోఁ జేర్చి యధర్వణాచార్యుని వని లోకమును భ్రమ పెట్టి నమ్మించి యుండె ననుటకు సందేహము లేదు. [4] కారికల నధర్వణుఁడే రచియించి యుండినయెడల

       "శ్రుతే౽పశబ్దే చోకే వా ప్రమాదాత్ పాణినిం స్మరేత్
        ప్రాకృతే షడ్విధే చాపి వాల్మీకిం వా మహేశ్వరం
        ధ్యాయే దత్రతు మామేవ స్మరే త్పండిత సమ్మతః."

ప్రమాదముచేత సంస్కృతమున నపశబ్దము నుచ్చరించినచో పాణినిని స్మరించవలసినట్లే యాంధ్రమున నపశబ్దము నుచ్చరించినచోఁ దన్నే (యధర్వణునే) స్మరింపవలయునని యింత యత్యధికముగా నాత్మ శ్లాఘనను జేసికొని యుండఁడు. ఈ కారికావళిని తాను రచియించి యుండుటచేతనే యహోబలపండితుఁడు

          "యస్సారో౽ధర్వణే గ్రంధే సోప్యత్రైవ విధీయతే
           తేన తత్పక్కికాలోకలోలతా త్యజ్యతే బుధైః"

అధర్వణుని గ్రంధములో సారభూతమైన దంతయు నిందే చేర్పఁబడి యుండుటచేత పండితు లా గ్రంధమును జూడవలెనన్న యభిలాషను విడిచిపెట్టవలయునని వ్రాసి యున్నాఁడు. గ్రంధ మంతయు నహోబలపండితీయములోనే యుండినప్పడు వేఱుగా గ్రంథమును జూడవలెనన్న కోరిక గలవారికి గ్రంధము మఱి యెక్కడ దొరకును ? ఎక్కడ నైనను కారికావళి పుస్తకరూపమున నున్నను, ప్రకటింపఁబడినను తత్కారికలన్నియు కవిశిరోభూషణమునుండి యెత్తి వ్రాయఁబడినవే గాని వేఱుకావు. నన్నయ భట్టునకుఁబ్రధమాచార్యత్వమును, అధర్వణాచార్యునకు ద్వితీయాచార్యత్వమును, మొట్టమొదట సృజించి యాంధ్రపండిత లోకమున వ్యాపింపఁ జేసినవాఁడహోబలపండితుడే యని తోఁచుచున్నది. ఈ కారికలను రచియించినవాఁడు నిజమయిన యథర్వణాచార్యుఁడు గాక పేరు మార్చుకొన్న కృత్రిమాధర్వణాచార్యుఁ డగుటచేత, పాడి వేంకటస్వామిగా రన్నట్టు మొదట గాలి నరసయ్యరూపమునుండి వాతూలాహోబలరూపమునకు మాఱి మరల "వాతూల వంశే౽వతారభూయశ్శ్రీనన్నవిద్వానహమేవ సో౽స్మి” అని తానే చెప్పుకొన్నట్లు విద్వాంసుఁడయి ప్రధమాచార్యుడైన యా నన్నయభట్టారకుఁడే యీ యభినవ నన్నయభట్టావతారమున ద్వితీయాచార్యుఁ డయి వికృతివివేకకర్తయయి యుండును. కారికావళీకర్తకు ప్రధమాచార్య భావన యకలంకుని శబ్దానుశాసనమును నిపుణము గా చదువుటచేత దానిలోని మంగళ శ్లోకమువలనఁ గలిగెను. వికృతివివేక కారుఁడు శబ్దానుశాసనకర్తయైన యకలంకునిశిష్యుఁడై నను కాకపోయినను దన పుస్తకమునందాతనిఁని బేర్కొనుటచేతనే 1604 వ సంవత్సరమునకుఁ దరువాతివాఁడని నిరాక్షేపణీయ సిద్ధాంతమేర్పడుచున్నది. అధర్వణునిచే రచియింపఁబడినది త్రిలింగ శబ్దాను శాసన మొక్కటియే కాని వికృతివివేకము కాదు. ఆంధ్రకౌముదీకారుఁడు తా నధర్వణవ్యాకరణమును జదివినట్లీ క్రింది శ్లోకమున జెప్పి యున్నాడు.

           "అధర్వణాని కాణ్వాని బార్హస్పత్యాని సంవిదన్
            కౌముదీ మాంధ్రశబ్దానాం సూత్రాణి చ కరోమ్యహమ్."

దీనినిబట్టి యధర్వణాచార్యుఁడు పండ్రెండవ శతాబ్దాంతమునందో, పదుమూడవ శతాబ్దాది నో యున్నట్లు నిశ్చయముగాఁ దెలియవచ్చుచున్నది. అహోబలపండితు లీతనిని ద్వితీయాదార్యుఁ డని వాడుటయు, ఇతఁడు భారతమునందలి విరాటపర్వము మొదలుకొని తెనిఁగింపఁబూనుటయు కూడ నధర్వణాచార్యుఁడు నన్నయభట్టునకుఁ దర్వాతను దాదాపుగా తిక్కనసోమయాజికాలములోను ఉన్నట్టు చూపుచున్నవి. ఈతని ఛందస్సులో

           క. "మగణమ్ముఁ గదియ రగణము
               వగవక కృతి మొదట నిలుపువానికి మరణం
               బగు నిక్క. మండ్రు మడియఁడె
               యగు నని యిడి తొల్లి టేంకణాదిత్యుఁ డనిన్."

అను పద్య మండుటచేత నితఁడు నన్నెచోడునికిఁ దరువాత బహుకాలమున కుండినవాఁ డని తెలియవచ్చుచున్నది. కాబట్టి యితcడిప్పటి కాఱునూటయేఁబది సంవత్సరముల క్రిందట నుండెను. ప్రధమాచార్యుఁ డనఁబడు నన్నయభట్టారకుని తరువాతనే యీతఁ డుండక పోయినయెడల, ఈతవిని ద్వితీయాచార్యుఁ డనుట యెట్లు తటస్థించును ? నన్నయభట్టారణ్యపర్వమువఱకును తెనిఁగించిన తరువాతనే యీతఁడు భారత మాంధ్రీకరింపఁబూని యుండనియెడల, విరాటపర్వము మొదలుకొనియే తెలిఁగించుటకుఁ గారణ మేమియు నగపడదు. నన్నయభట్టారకుఁడు తన గ్రంథ ప్రాశస్త్యమునకయి యధర్వణభారతమును కాల్చివేసె నన్న కధ యెంతమాత్రము విశ్వాసార్హమైనదికాదు. ఆధర్వణాచార్యుఁడు తిక్కన కాలములో ననఁగా 1260 -వ సంవత్సరప్రాంతములం దుండినవాఁడు. అధర్వుఁణుడన్న పేరాంధ్రులలో లేదనియు, ఇది కల్పితనామమయి యుండుననియు నొకరు వ్రాయుచున్నారు. అయిన నయి యుండవచ్చును. గాలి నరసయ్యశాస్త్రి తనపేరు బాగుగా లేదని ప్రభంజనాహోబలపండితుఁడని పేరు పెట్టుకొన్నట్టుగానే, తల్లిదండ్రులు నాలయ్యవంటి పేరేదో పెట్టి యుండఁగా నది గౌరవావహమైనది కాదని నాలవ దధర్వవేదమయినందున పూజనీయమయిన యా పేరు పెట్టుకొని యుండనువచ్చును. లేదా యితఁడు జైనుఁడు గనుక జైనులలో నట్టిపే రుండిన నుండను వచ్చును. అధర్వణుఁ డాంధ్రమునందు తగినంత పాండిత్యము గల సంస్కృత విద్వాంసుఁడైన జైనపండితుఁడు. ఇతఁడును దిక్కనసోమయాజియు నించుమించుగా నేకకాలమునందే నన్నయభట్టు విడిచిన భారతభాగమును దెనిఁగింప నారంభించి యుందురు. ఇతఁడు రెండు మూఁడు పర్వములను మాత్రమే తెలిఁగింపఁగలిగెను; తిక్కన పదునేను పర్వములను జేసి గ్రంథము ముగింపఁగలిగెను. ఈతని కవిత్వము సంస్కృతసమాసపద భూయిష్ట మయి, సామాన్యులకు దురవగాహమయియుండెను; తిక్కన కవిత్వ మాంధ్రపదభూయిష్టమయి బహుజన సుఖావగాహమయి యుండెను. ఈ హేతువుచేతనే తిక్కన భారతము సర్వజనాదరణపాత్రమయు దేశమం దంతటను వ్యాపింపఁగా, నధర్వణభారతము కతిపయపండితజనై కాదరణపాత్ర మయి సర్వజనీన వ్యాప్తి గాంచక యాంధ్రదేశమున మృగ్య మయినది.అది యిప్పడు కతిపయ పూర్వలక్షణ గ్రంథములయందుదాహరింపఁబడిన పద్యరూపమున జీవించి యుండుటయే కాని సంపూర్ణపుస్తకరూపమున నెందును గానఁబడక నామమాత్రావశిష్టమయి యున్నది.

తిక్కనసోమయాజి భారతరచనము చేయ నారంభించునప్పటి కధర్వణాచార్యుఁడు త్రిలింగశబ్దానుశాసనమును జేసి యుండలేదు. ఆ కాలమునందు దశకుమారచరిత్రమును దిక్కన కంకితముచేసిన కేతనకవి తన యాంధ్ర భాషాభూషణవ్యాకరణమునందు

      క. "మున్ను తెలుఁగునకు లక్షణ
          మెన్నఁడు నెవ్వరును జెప్ప: రేఁ జెప్పెద వి
          ద్వన్నికరము మది మెచ్చఁగ
          నన్నయభట్టాదికవిజనంబులకరుణన్.

      గీ. సంస్కృత ప్రాకృతాదిలక్షణము చెప్పి
         తెలుఁగునకు లక్షణము మున్ను దెలుపకునికి
         కవిజనంబులనేరమి కాదు; నన్ను
         ధన్యుఁ గావింపఁ దలఁచిన తలపు గాని."

అని యా వఱ కెవ్వరును వ్యాకరణముచేసి యుండలేదని స్పష్టముగాఁ జెప్పెను. త్రిలింగశబ్దానుశాసనము మిక్కిలి పురాతనమయిన దనcగా నన్నయభట్టభారతమునకంటెను బ్రాచీన మయినదని చూపుటకయి పాడి వెంకటస్వామిగా రాంధ్రపత్రికయుగాదిసంచికలోఁ దమ వ్యాసమునందు బెర్నలుగారు చెప్పిన హేమచంద్రుని బాధ తొలంగునట్లుగా 'హేమచంద్రాది మునిభిః కథితం చాంద్రలక్షణం' ఇత్యాది శ్లోకములలో హేమచంద్రు డన్నది సోమచంద్రుఁ డని యుండవలెనని చెప్పిరి. హేమచంద్రుఁడె ట్లాంధ్రవ్యాకరణకర్త గాcడో యట్లే సోమచంద్రుఁడును నాంధ్రవ్యాకరణ కర్త కాఁడు. ఈ మార్పు సహితము త్రిలింగశబ్దానుశాసన మత్యంత పురాతనమని సాధించుటకుఁ బనికి రాకపోవుటయే కాక, యధర్వణా చార్యుఁడు మఱింత యర్వాచీనుఁడని చూపుటకే తోడుపడుచున్నది. జైన పండితుఁడయి సోమదేవుఁ డనఁబడెడి యీ సోమచంద్రుఁడు 1205-వ సంవత్సరమునందు 'శబ్దార్ణవ చంద్రిక' యను సంస్కృతవ్యాకరణమును రచియించెను. సోమచంద్రుఁ డన్న పాఠమునకంటెఁ ద్రిలింగశబ్దానుశాసనములో ననేక స్థలములయందున్న హేమచంద్రుఁ డన్న పాఠమే సరియైనది. త్రిలింగశబ్దానుశాసనమునందు "హేమచంద్రుఁడు మునిఁగా జెప్పఁబడినాఁడు; ఆందు విశేషమేదియు లేదు. జైనులు తమ విద్వాంసులను మునులనుగా జెప్పుటయు, విద్వాంసులే తమ్ము మునులనుగాఁ జెప్పకొనుటయు నాచారమయి యున్నది. కర్ణాటకశబ్దానుశాసనమును రచియించిన యకలంకభట్టు "భట్టాకలంకో మునిః" అని తన్నుఁగూర్చియే తన పుస్తకములోఁ జెప్పుకొనెను.

        శ్లో. "బార్హస్పత్యాని సర్వాణి | కాణ్వం వ్యాకరణం విదన్
            కరో మ్యధర్వణం శబ్దం | సర్వలక్షణలక్షితం."

అని బృహస్పతివ్యాకరణమును, కణ్వవ్యాకరణమును సర్వమును జూచి తా నీ వ్యాకరణమును రచియించిన ట్లారంభములోనే యధర్వణుడు సెప్పుచున్నాఁడు. ద్రావిడులు తమ యఱవభాష కగస్త్యుండు వ్యాకరణము చేసెనని చెప్పకొనునట్లే తెలుఁగువ్యాకరణములు సహితము ఋషిప్రోక్తము లన్నచో భాషకు గౌరవము వచ్చునని గొప్పకు చెప్పకొన్నవే కాని యీ వ్యాకరణము లన్నియుఁ గవీశ్వరుల మానస సృష్టిలోనివేగాని యెప్పుడును వ్యవహారములో నుండినవి కావు. ఆంధ్ర వ్యాకరణములు చేసినవా రొక్క దేవతలును, ఋషులును మాత్రమే కారు. వారిలోఁ గవిరాక్షసునివంటి రాక్షసరాజులును గలరు. శ్రీరాములకు శత్రువైన రావణుఁడు కూడఁ దెలుఁగుభాషకు త్రేతాయుగమునందే వ్యాకరణము చేసెను.

'అనుక్తం సర్వశాస్త్రం తు | రావణీయే విలోకయేత్."

త్రిలింగశబ్దానుశాసనములో లేని విషయముల నన్నిటిని రావణవ్యాకరణములోఁ జూచి తెలిసికోవలెనఁట ! త్రిలింగశబ్దానుశాసన మన్నపేరు పెద్దదిగా నున్నను. దానిలోఁ జెప్పఁబడిన విషయములు మాత్ర మత్యల్పములు. ఈ కాలపు చిన్న వ్యాకరణములలో సాధారణముగాఁ జెప్పఁబడు లక్షణములు సహితము దానియందు లేవు. ఆరంభదశలోఁ జేయఁబడిన వ్యాకరణములలో దేనిలోను విశేషాంశము లుండవు. ఆ కాలములోనే చేయబడిన తిక్కన 'కవివాగ్బంధనము" మొదలైన లక్షణగ్రంధములలో సహితము విశేషాంశములు లేవు. ఆంధ్రభాషయే యెఱిఁగినట్టు కనcబడని బృహస్పత్యాదులు చేయని వ్యాకరణములను చేసినట్టు మన పండితులు చెప్పి రన్న విశ్వాసార్హముగా నుండునా ? యని మనవారు సందేహపడవచ్చును. ఎప్పటి పండితుల మాటయో యేటికి ? మన యీ కాలపు పండితులే యాంధ్రభాషా విషయమున 'భౌతిక కళానిధి" • లో నేమివ్రాసిరో చిత్త గింపుఁడు.

         శ్లో "యుగ భేదా డాంధ్రభాషాచార్య భేదః ప్రకీ ర్త్యతే
             కృతే సుధాయనః ప్రోక్తస్త్రేతాయాం శుకనాభకః || 1

             దివోదాసశ్చ శల్యాతి రింద్రమిత్ర స్తధైవ చ
             భాషాచార్యా ద్వాపరే స్యుస్తిష్యే భూన్నందివర్ధనః || 2
 
             తతో దేవళరాయశ్చ తస్య శిష్యో నియోగికః
             ఏతే క్రమా దాంధ్రభాషాచార్యా స్సప్త ప్రకీర్తితాః || 3

             అథాంధ్ర భాషానామాని యుగ భేదాత్ప్రచక్షతే
             ఆంధ్ర మాంధేయణం చైవ మల్లకో గుహ్యకస్తథా || 4

                కోసలో దామిళశ్చైవ క్రౌంచో హేరంబక స్తథా |
                గుహ్యకో పిరక శ్చైైవ కాళింగో రౌద్ర మేవ చ || 5

మనము ప్రధమాచార్యుఁడు, ద్వితీయాచార్యుఁడు నన్న మాటలకే శంకవడు చుండఁగా,
కృతయుగమునందు సుధాయనుడు, త్రేతాయుగమునందు శుకనాభుఁడు. ద్వాపరమునందు దివోదాసుఁడు శల్యాతి యింద్రమిత్రుఁడు, కలియుగమునందు నందివర్ధ నుఁడు, దేవళరాయcడు నని యాంధ్రభాషా చార్యులు మీఁదుమిక్కిలి మఱి యేడుగు రయినారు. ఆంధ్రము, ఆంధ్రేయణము, మల్లకము, గుహ్యకము, కోసలము, ద్రామిళము, క్రౌంచము, హేరంబకము, పిరకము, కాళింగము, రౌద్రము, అని యాంధ్రభాషాభేదములు ద్వాదశాదిత్యులవలె బండ్రెండయినవి

          శ్లో|| 'తిష్యే ద్వావితి యద్యుక్తం తచ్ఛృణుష్వ సమాహితః |
                 కృష్ణాగోదావరీ మధ్యదేశే పాపవివర్ణితే || 1

                 దివ్యే గోకుల్యపార్శ్వస్థ భార్గవక్షేత్రసన్నిధౌ|
                 గోదావర్యాశ్చోత్తరస్థతట గంగాముఖే స్థితామ్|| 2
 
                 యాం పురీం శాసతి విభు శ్శాతకర్ణి ర్మహాయశాః|
                 తస్యాం మాహేంద్రపుర్యాం తు విష్ణువర్ధనపుత్రకః|| 3

                 సర్వశాస్త్రవినీతజ్ఞో వేదవేదాంగపారగః|
                 సర్వభాషారహస్యజ్ఞ శాంతో దాంత స్సమాహితః|| 4

                 శాతకర్ణే ర్మహారాజ్ఞ స్పభాధ్యక్షః సుబుద్ధిమాన్|
                 నందివర్ధననామా భూత్త స్య శిష్యో నియోగికః|| 5

                 ఆంధ్రభాషారహస్యజ్ఞో నామ్నా దేవళరాయకః|
                 తా వుభ వాస్థానసభాప్రదీపా వితి వర్ణితౌ|| 6

                 రాజాజ్ఞాం శిరసా ధృత్వా తావుభౌ పండితోత్తమౌ|
                 కలౌ యుగే ష్టపంచాశోత్తర త్రిశతవత్సరే|| 7

                 కళింగాంధ్రం చ రౌద్రాంధ్ర స్థాపయామాసతు స్ప్వయం||" Ete ,

పూర్వోక్తములైన ద్వాదశాంధ్ర భాషలలో కలియుగమునందు రెండాంధ్రభాషలు పుట్టినవి. పాపరహితమైన కృష్ణాగోదావరీ మధ్యదేశమునందు దివ్యమయి గోకుల్యపార్శ్వస్థమైన భార్గవక్షేత్రమున గోదావరియొక్క యుత్తరతటమున గంగాముఖ మను ప్రదేశ ముండెను. ఆ ప్రదేశమున మహాయశుఁడై న శాతకర్షి పాలించుచుండిన మహేంద్రపురమునందు విష్ణువర్ధనునిపుత్రుఁడును, సర్వశాస్త్రవినీతజ్ఞఁడును, వేదవేదాంగపారగుఁడును, సర్వభాషా రహస్యజ్ఞుఁడును, శాంతుఁడును, దాంతుఁడును. శాతకర్ణిమహారాజుయొక్కసభాధ్యక్షుఁడును. సమాహితుఁడునైన నందివర్ధన నామధేయుఁ డుండెను.

ఆతనికి శిష్యుఁడయి నియోగియు నాంధ్రభాషారహస్యజ్ఞుఁడు నైన దేవళరాయఁడుండెను. వా రుభయులను రాజాస్థానసభాప్రదీపములుగా వర్ణింపబడుచుండిరి, పండితోత్తములైన వీ రిద్దఱును రాజాజ్ఞను శిరసావహించి కలియుగమున మున్నూటయేcబదియెనిమిది సంవత్సరమునందు స్వయముగా కళింగాంధ్రమును, రౌద్రాంధ్రమును స్థాపించిరి. ఇది కలియుగాబ్దము 5018 అగుటచేత పూర్వోక్తమయిన వృత్తము నడచి యిప్పటికి నాలుగువేల యాఱునూట యఱువది సంవత్సరము లయినది. ఇఁక పూర్వకాలాంధ్ర భాషాకవనరీతిని గూడఁ గొంచెము చిత్తగింపుఁడు. కృతయుగమున సుధాయనుcడు స్థాపించిన భాష కాంధ్ర మని "పేరు గలుగుటకుఁ గారణమును విశ్వేశ్వరభట్టాచార్యులవారు భాషాముకుర మను నాంధ్రగ్రంథమునందిట్లు వ్రాసియున్నారఁట.

           
                 
            సీ. 'ఖేచరకిరణాగ్ని డగ్గిబోడరముచే
                         సత్యభాగుడియిండ్ల భాసముదర
                అగ్నిమిత్రుడంధకత ఝడంగె డుమ్మిలో
                         కడిజిగ్ఝి భాస్కరుం మనన మొంది
                బొరవిన జెరణినిం గడగుడి గెరగించి
                         గుడగనోచి భాబిందు లడగదొడసె
                ఆడుగ నా భామణి నవభవకరమొండ్రు
                        త్సలరించి వరుణకరగాగర్భ బవిడె

          గ్రుడువించు ఝ్రమ్ముల గరిమమనుడై
          దిఙ్ముఖము లరలించు భోగరిండ్ల
          భాసమెరయ భాసముబ్బరించె
          వాని కంశుగురుడు.

(అర్థము-ఖేచరకిరణాగ్ని డగ్గి బోడరముచే = సూర్యకిరణాగ్ని వలనఁ గలిగిన యెండపిడుగులచే; సత్యభాగుడి యిండ్ల = కన్నుల యొక్క? భాసము = ప్రకాశము, ఉదర = నశింపఁగా; డుమ్మిలో = భూమియందు; అగ్ని మిత్రుఁడు = అగ్నిమిత్రుఁ డనెడువాఁడు; అంధకతఝడంగె = గ్రుడ్డి తనమును బొందెను; కడి = అనంతరము; భాస్కరుం = సూర్యుని; జగ్ఝిచే = భక్తి చేత; మననమొంది = ధ్యానముచేసి; బొరవిన = కుంభకమార్గముచే; జెరణినిం = జీవాత్మను; గడగుడి గెరగించి = సూర్యునియందర్పించి; గుడగ నోచి = సూర్యప్రార్ధనచేసి; భాబిందులడగ దొడసె = కన్నులియ్యవేఁడు కొనెను, అడుగ = అడుగఁగా; ఆభామణి = ఆసూర్యుఁడు; నవభవకరమొండ్రు=చంద్రకిరణములవలె; త్సలరించి =చల్లనిస్వభావముగలవాడయి; వరుణకరగా గర్భబవిడె= సూర్యుని జలకిరణములచే గర్భముదాల్చిన మేఘమునుండి, గ్రుడవించు ఝ్రమ్ములగరిమమనుడై = చల్లగ గురియు వాన చినుకులనుబోలు మనముగలవాఁడై, దిఙ్ముఖములరలించు; దశదిక్కులవ్యాపించునట్లు: భోగరిండ్లభాసమెరయ = దంతకాంతులు ప్రకాశించు చుండఁగా; అంశుగురుడు = సూర్యుఁడు; వానికి = అగ్నిమిత్రునకు; భాసముబ్బరించె = భాష నుపదేశించెను.)

         క. భాగురు భాషా బ్రొమ్మున
            భాగుడిబొమ్మిండ్ల బిందు ల్భాసము నందెన్
            భాబుష్పభాష వానాంధమున్
            రాతీయ్యగనది నాంధ్రమనుంచు బరువడినందెన్

(అర్థము-భాగురుభాషా బ్రొమ్మున = సూర్యునిచే ననుగ్రహింపఁబడిన భాషాప్రభావముచే భాగుడిబొమ్మిండ్ల బిందుల్ = అగ్నిమిత్రుని నేత్ర

బిందువులు; భాసమునొందెన్=ప్రకాశమును బొందెను; భాబుష్పభాష = ఒక సూర్యునిచేవచ్చిన భాష; వాని = అగ్నిమిత్రుని; అంధమున్= గ్రుడ్డితనమును; రాతీయ్యగ = నాశనపఱుపఁగా, అది = ఆ భాష; ఆంధ్రమనుంచు = ఆంధ్ర భాష యని; బరువడినందెన్ = ప్రసిద్ధినొందెను.)

పయి పద్యముల తాత్పర్యము—పూర్వ మొకప్పు డెండ యధికమయి యగ్నిపిడుగులు పడి యగ్నిమిత్రుని కన్నులు పోయెను; ఆతఁడు తనకు కన్నులియ్యవలసినదని సూర్యుని ప్రార్ధింపఁగా సూర్యు డతనిభక్తి కి మెచ్చి యతని కొక భాష ననుగ్రహించెను; ఆ భాషాప్రభావమువలనను, సూర్యానుగ్రహమువలనను మరల నగ్నిమిత్రున కంధత్వము పోయి కన్నులు వచ్చెను; ఆ భాష యాతని యంధతను బోగొట్టినందున దాని కాంధ్రభాష యని పేరు కలిగెను.

అధర్వణాచార్యుఁడు మొదట త్రిలింగశబ్దానుశాసన మను వ్యాకరణము నొకదానిని చేసి తరువాత వికృతివివేక మను వ్యాకరణ కారికావళిని రచించి నాఁడను వాడుక కలదు గాని యది సత్యముకాదు. ఈ కడపటిది యధర్వణ కృతము కానేరదు. వికృతివివేకమునం డాంధ్రశబ్దచింతామణిలో లేని లక్షణము లనేకములు చెప్పఁబడి యున్నవి. ఈ గ్రంథము సంజ్ఞా పరిచ్ఛేదము, సంధిపరిచ్ఛేదము, అజంతపరిచ్చేదము, హలంతసరిచ్చేదము, క్రియా పరిచ్చేదము అని యైదుభాగములుగా భాగింపఁబడి కారిక లనఁబడు మూఁడు వందల శ్లోకములను గలిగి యున్నది. ఈ కవి రచియించిన తెలుఁగు భారత మిప్పటికి మాకు దొరకనందున, కవి వంశాదులనుగూర్చి యేమియుఁ జెప్పజాలము. లక్షణగ్రంధములం దుడాహరింపఁబడిన పద్యము ణము. బట్టి చూడఁగా నితఁడు విరాటోద్యోగభీష్మపర్వములను రచించినట్లును, కవిత్వము రసవంతమయి సంస్కృతపదబహుళముగా నుండునట్లును తెలియవచ్చుచుస్నది. ఆప్పకవి విరాటపర్వములోని యూ క్రింది పద్యమల నుదాహరించియున్నాఁడు.

           గీ. ధర్మతనయ యుష్మదా-జ్ఞానిగళవిని
              బద్దమగుచుఁ జిక్కువడియెఁ గాక
              విజయమత్తగజము విడివడ్డదో నడ్డ
              పాటు గలదె విష్టపత్రయమున.

           క. శ్రీకఁరుఁ డెదురునపుడు వ
              నౌకోధ్వజ మింద్రమకుట మర్జునతురగా
              నీకము దివ్యశతాంగము
              నా కవ్వడి కబ్పియున్న నతఁ డేమగునో.

           క. ఆ కర్ణుదురాలాపము
              లాకర్ణింపగ నసహ్యమై ద్రోణునితో
              నాకనదీసుతుఁ డనియె వ
              నౌకోధ్వజ మెఱుఁగ వచ్చునరుఁ జూపి తగన్.

కవిచింతామణియందు వెల్లంకి తాతంభట్టుచేత నుదాహరింపఁబడిన యీ క్రింది పద్య ముద్యోగపర్వములోని దయి యుండవలెను.

           శా. తృష్ణాతంతునిబద్ధబుద్ధు లగు రాధేయాదులం గూడి శ్రీ
               కృష్ణం గేవలమర్త్యుఁగాఁ దలఁచి మర్దింపంగ నుత్సాహవ
               వర్దిష్ణుండయ్యె సుయోధనుం డకట ! ధాత్రీనాథ ! యూహింపుమా
               యుష్ణీషంబునఁ గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాలమున్.

కూచిమంచి తిమ్మకవిచే సర్వలక్షణ సారసంగ్రహమునం దుదాహరింపఁబడివ యీ క్రిందిపద్యము భీష్మపర్వాదిదగటు స్పష్టము.
            క. పదిదినము లయిదుప్రొద్దులు
               పదఁపడి రెణ్ణాళ్ళు నొక్క పగలున్ రేయున్

           గదనంబుఁజేసి మడిసిరి

నదిసుత గురు కర్ణ శల్య నాగపురీశుల్.[5]

అథర్వణభారతములోని యిూ క్రింది మూఁడు పద్యములను నాంధ్ర సాహిత్యపరిషత్పుస్తకభాండాగారములో నున్న యుదాహరణపద్యగ్రంథము నుండి కైకొనఁబడినవి.

       సీ. రాజమండలపూర్ణరాజమండలవిథి
                        రత్నగర్బామలరత్నగర్చ
           గంధర్వగంధర్వగంధర్వనగరంబు
                        నాగపున్నాగ పున్నాగవనము
           మార్గణమార్గణమార్గణపీఠము
                        త్తుంగభుజంగభుజంగభూమి
           కాంతకాంతారాతికాంతకుంతస్థలి
                        వీరకుమారకుమారసరసి

           యనఁగఁ బొగడు కెక్కు నలకాపురంబు దే
           వేంద్రుపురము దానవేంద్రుపురముఁ
           గ్రేణి సేయు లలితశోణాంశుమణిబద్ద
           గోపురంబు హస్తినాపురంబు

      మ. నతనానావనినాథయోధమకుటన్యస్తాబ్జరాగోజ్జ్వల
          ద్యుతివిభాజితపాదపీఠు లలనాదోశ్చామరోద్ధూతమా

      రతలోలాళివినీలకుంతలఁ బ్రభారుగ్గాముఁ గేయూరశో
      భితబాహాపరిఘున్ సువర్ణ ధరణీభృద్ధైర్యు దుర్యోధనున్

  మ. ప్రణతాశేషవసుంధరాధిపశిరస్స్రగ్గంధలుబ్ధభ్రమ
      క్వణదభ్రభ్రమకృద్ధ్విరేఫగణఝంకారప్రదాబద్ధసం
      ప్రణవత్యుత్ప్రధితప్రవర్ధితసమస్త క్షత్రసూయాధ్వర
      క్షణసింహాసనభాసితున్ దృఢధను శ్శ్లాఘానుజున్ ధర్మజున్.

ఈ కవి తెలుఁగున ఛందస్సునుగూడ రచియించియున్నాఁడు. దాని 'కధర్వణఛcద'స్సని పేరు. దానియందలి రెండు పద్యముల నిందు క్రింద నుదాహరించుచున్నాను.

   క. 'అనిలానలసంయోగం
       బనఘా! కీలాకరాళమగు వహ్ని భయం
       బొనరించుఁ గర్త గృహమున
       ననుమానము లేదు దీన నండ్రు కవీంద్రుల్.

    క. మునుకొని పద్యముఖంబున
       ననిలగణం బిడిన నాయురారోగ్యంబుల్
       కొనసాగు దాని ముందఱ
       ననల గణం బిడినఁ బతికి నలజడి సేయున్

  1. [అథర్వణకారిక లనబడు 'వికృతివివేకము' అథర్వణకృతిగా 'తెనుఁగు కవుల చరిత్ర" యందుఁ జెప్పఁబడినది. మఱియు'ఇందలి (వికృతి వివేకము నందలి) లిపిశ్లోకములలో నుదాహరింపబడిన యక్షర విన్యాసమును బట్టి డాక్టరు బర్నెలు (Dr Burnell) దొరవారీతని పండ్రెండవ శతాబ్ది నున్నవాఁడని భావించిరి. ఇది సమంజసమే ! నన్నయభట్టారకుని వెనుక తిక్కనకు ముందుగా భారతమును పూరించుటకుఁ బూనుకొనిన యాంధ్రకవి యథర్వణుఁడు కాని యథర్వణుని కవిత, యతి సంస్కృత పద భూయిష్ఠ మగుట చేత వ్యాప్తిలోనికి రాలేదు. శైవకవితాప్రభావము వలన తిక్కన తెనుగుదనము చూపుచు రచించిన భారతము ముందఱ నధర్వణుని భారతము నిలువ లేదు.' అనియుఁ గలరు. (తెనుగుకవుల చరిత్ర-పుటలు ౩౦౩,304) ఆథర్వణుఁడు తిక్కనకుఁ దర్వాతివాఁడనియామి, నితని కాలము క్రీ శ.1250 ప్రాంతమని తలంపవచ్చుననియు, త్రిలింగ శబ్దానుశాసన, వికృతవివేకములను ఆధర్వణుఁడు రచింపలేదనియు, 'ఆంధ్రకవి తరంగిణి' లోఁ గలదు. (చూ. తృతీయ భాగము. అధర్వణాచార్యుఁడు ) అథర్వణుఁడు తొలుతఁ ద్రిలింగ శబ్దానుశాసనమును రచించి, పిదప వివరముగా- వికృతి వివేకమును రచించెనని శ్రీ వజ్ఝల - చిన సీతారామస్వామి శాస్త్రులుగారు 'అధర్వణ కారికావళి' పీఠికలోఁ దెల్పి యున్నారు. శ్రీ తిమ్మావజ్ఝల కోదండ రామయ్యగారు విజయ-మార్గశీర్షమాస 'భారతి'లో అధర్వణ భారతము అను వ్యాసమున అథర్వణాచార్యుని భారతము గూర్చిన యమూల్య విషయములను దెల్పిరి. ఇంత వఱకు నధర్వణcడు భారతములోని విరాటో
  2. [దీనిచే ఆకలంకుడు చెప్పబడెనని కాని చెప్పబడినను కన్నడ వ్యాకరణ కర్త చెప్పఁబడెనని కాని చెప్పవలను పడదని కొందరందురు.]
  3. [ఇట్లనుట సరి కాదనియు, అకలంకుడు ప్రాచీనుఁ డొకఁ డున్నాఁడనియు శ్రీ ప్రభాకరశాస్త్రిగారు 'ప్రబంధ రత్నావళి' పీఠిక లో వ్రాసియున్నారు.]
  4. [వెనుక 5 వ పుటలోఁ జెప్పినదాని కిది విరుద్ధముగా నున్నది.]
  5. ఈపద్య మల్పభేదముతో నన్నయభట్టారకుని యాదిపర్వమునందును గానc బడుచున్నది; గాని యీయర్థమే వచ్చెడి యీ క్రింది పద్యము దాని పయినే యున్నది గాన నిది యథర్వణ భారతములోనిదే యయి యుండవచ్చును. తరల. పదిదినంబులు భీష్మఁడాహవభారకుండు గురుండు పం చదివసంబులు గర్ణుఁడు న్దివసద్వయంబు దినార్థ మం దుదిత తేజుఁడు శల్యుం డత్యధితోగ్రవీరగదారణం బది దినార్ణముగాఁగ నిటు మహాభయంకరవృత్తితోన్