ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మారన

వికీసోర్స్ నుండి

మారన

మారన యను కవి తిక్కనసోమయాజుల శిష్యుఁడు. ఇతcడు మార్కండేయపురాణమును తెనిఁగించెను. నీతిబోధక మయి సర్వజనరంజక మయి యున్న హరిశ్చంద్రోపాఖ్యానము కథయుఁ ప్రబంధరత్నమని కొనియాడఁబడు మనుచరిత్రము కథయు మార్కండేయపురాణమునుండి తీసికొనఁబడినవే. ఇతని కవిత్వము తిక్కనసోమయాజి కవిత్వమంత మధురముగా నుండదు గాని సలక్షణ మయినదిగాను మృదువుగాను ఉండును. ఇతఁడు తన గ్రంథమును ప్రతాపరుద్రుని సేనానాయకుడైన నాగయగన్నమంత్రికిఁ [1] గృతి యిచ్చెను. కవి కృత్యాదిని కృతినాయకుని వర్ణించుచు నాతనిని గూర్చి

          చ. 'ఎలమిఁ బ్రతాపరుద్రమనుజేంద్రునిచేఁ బడసెం బ్రవీణుఁడై
               కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిఁ గీటడంచియున్
               బలరిపుతుల్యవిక్రముఁడు నాగయగన్నవిభుండు తేజమున్
               విలసితరాజ్యచిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్.'

ఆని చెప్పెను. ఈ కృతిపతి కేలికయైన ప్రతాపరుద్రుఁడు కాకతీయ వంశ భూషణుడై జగత్ప్రసిద్ధుఁ డయి యుండినవాఁడు. విద్యానాధ మహాకవి యీతనిపేరనే ప్రతాపరుద్రీయ మనెడి యలంకార శాస్త్రమును జెప్పెను. ప్రతాపరుద్రుఁడు తన మాతామహియైన రుద్రమ్మదేవియనంతరమున 1295 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చి 1323 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. 1321 వ సంవత్సరమునందు ఢిల్లీ ఫాదుషా యొక్కసేనలు ప్రతాపరుద్రునిరాజధాని యైన యోరుగల్లమీఁదికి దండెత్తి వచ్చి యోడిపోయినందున 1323 వ సంవత్సరమునందు ఢిల్లీచక్రవర్తి మఱియొక గొప్ప సేనను పంపఁగా సేనాధిపతి ఘోరయుద్ధములో ప్రతాపరుద్రుని పట్టుకొని ఢిల్లీ నగరమునకుఁ గొనిపోయెను. ప్రతాపరుద్రునిమంత్రి యైన యుగంధరుఁడు తన ప్రభువును వదలించి తెచ్చిన ట్లొక విచిత్రమైన కధను చెప్పదురు. తన ప్రభువును మహమ్మదీయులు కొనిపోయినతరువాత మంత్రి యుగంధరుఁడు తా నొక మనోహరమైన పడవను కట్టించి దాని యందు రత్నఖచితములై న భూషణములు వేసికొని వాణిజ్యమునిమిత్తమై పోయినట్లుగా గంగానదిమీcదుగా పోయి ఢిల్లీ నగరము చేరి యమ్మకము నిమిత్తమై యమూల్యములైన రత్నములు తెచ్చితిమని తన మనుష్యుల చేత ఫాదుషాకు చెప్పి పంపి చూచుట కయి యొక దిన మేర్పఱిచెను. ఈ ప్రకారముగాఁ జేయవలసిన యేర్పాటుల నన్నిటిని చేసి తాను పడవ దిగి పట్టణమునందు పిచ్చివానివలె తిరుగుచు నేటి కిన్ని దినములకు ఢిల్లీచక్రవర్తిని కారాబద్దునిగాఁ గొని పోయెద మని యొక చింపిచేటతో చాటుచు, రాత్రులూరి వెలుపల నున్న యొక మఱ్ఱిచెట్టు క్రింద శుచియై వంట చేసికొని భుజించుచు, మాఱువేషముతో నటించుచుండెను. ఈ రీతిగా ప్రతిదినమును పిచ్చిగా చాటుచుండుట రాజభటులు చూచి, రాత్రు లీతఁడు మఱ్ఱిచెట్టువంక పోవుచుండుటచారులవలన దెలిసికొవి, ఒకనాఁడు పగలు గూఢముగా పోయి మఱ్ఱిచెట్టుమీఁద నెక్కి కూరుచుండి యుండిరి.అతడు పగలంత యు నూరంతటను జాటి యథాప్రకారము రాత్రి మఱ్ఱిచెట్టుకడకు వచ్చి శుచియై వంట చేసికొని తినుట కన్నము విస్తరిలో వడ్డించుకొన్నతరువాత నతని కాపులింత యొకటి వచ్చెనఁట ! అప్పు డతఁడు వింత లేనిది యావులింత రాదనుకొని నిదానించి చూచి వెన్నెలలో చెట్టునీడనుబట్టి పయి నెవ్వరో మనుష్యు లున్నారని తెలిసికొని, పయివంకఁ జూచిన ననుమాన పడదురని యట్లు చేయక, వడ్డించుకొన్న యన్నముమీఁద వంటచేసిన కుండను బోర్లించి విస్తరిచుట్టును ముమ్మారు బ్రదక్షిణములు చేసి, ఢిలీ చక్రవర్తిని పట్టుకొని తమ యూరు కొనిపోదుమని పెద్దకేక వేసి, తనచేతికఱ్ఱతో కుండను పగులగొట్టి యన్నము తినక లేచిపోయెను. భటు లంతట నితఁడు పిచ్చివాఁడని నిశ్చయము చేసికొని వెడలిపోయి చక్రవ ర్తి కా వార్త తెలిపి తమతమ పనులమీఁద నుండిరి. గడువుదినమున ప్రతాపరుద్రుని తనవెంట నుంచుకొని పరిమిత పరివారముతో చక్రవర్తి యోడవద్దకి పోవుటకు బయలు దేఱగా యుగంధరుఁడు చక్రవర్తి నిప్పుడే పట్టుకొని పోయెద మని చింపిచేటతో చాటుచు వెంటఁబడెను. రాజభటు లాతనిని పిచ్చివానిఁగా భావించుటచేత నాతని మాటలను లక్ష్యముచేయక వెంట రానిచ్చిరి. అంతట నతడు చక్రవర్తిపరిజనులు చూడకుండ పడవ నెక్కి- పయిని కూర్చుండి చక్రవర్తిని పట్టుకొని పోవుచున్నామని చాట మొదలుపెట్టెనఁట • ఫాదుషా లోపల నున్న సరకులను పరీక్షించుచుఁ గొంతసేపు లోపలనుండి పయికి వచ్చి చూచునప్పటికి పడవ తమరేవున లేక బహుదూరము వచ్చినట్లు కనఁబడఁగా, ఆది యంతయు శత్రువుల కుతంత్రమువలన నయినదని తెలిసికొని చేయునది లేక ప్రతాపరుద్రునితో సమాధానము చేసికొని యాతని రాజ్యమును మరల నిచ్చివేసి విడుదల పొంది తాను తన రాజధానికి మరలి పోయెనcట! ప్రతాపరుద్రునిమంత్రులలో యుగంధరుఁడనువాఁ డెవ్వఁడును లేఁడు. యుగంధరుఁడు మిక్కిలి పూర్వకాలమునందు అత్యంత ప్రసిద్దుడయిన యొక మంత్రి శిఖామణి. శ్రీహర్షకవిచేత సంస్కృతమున రచియింపఁబడిన 'రత్నావళి " నాటికయందే యుగంధరుని సంతతివాఁడు (యౌగంధరాయణుఁడు) మంత్రిగాఁ జెప్పబడెను. మారనకవి నాగయగన్నని " నీతి యుగcధరc" డని చెప్పెను.

[యౌగంధరాయణుఁడు గొప్పరాజనీతిజ్ఞఁడుగను, ప్రభుకార్యతత్పరుఁడుగను భాసుని నాటకములందుఁ బ్రసిద్ధుఁడు. భాసుననుసరించియే శ్రీహర్షదేవుఁడు "రత్నావళి"ని రచించెను. యౌగంధరాయణుఁడు ప్రతాపరుద్రుని విడిపించి, ఢిల్లీచక్రవ ర్తిని చెఱఁగొనిన కథసు శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారు తమ 'ప్రతాపరుద్రీయనాటకము'నఁ గూర్చినారు. ఈ వృత్తాంతము విశ్వాసార్హము కాదని విమర్శకులు చరిత్ర కారులును తెలిపియున్నారు.

నాగయగన్నసేనాని ప్రతాపరుద్రుని యనంతరము మహమ్మదీయ మతమును గైకొని ఢిల్లీచక్రవర్తిని సేవించినట్లును, ఆతవికి సేనానియై రాజ్యకార్యములను నిర్వహించినట్లును శ్రీ నేలటూరు వేంకటరమణయ్య గారు తెలిపియున్నారు (భారతి-బహుధాన్య-మాఘమాసము) "భారతి"లోఁ బ్రకటింపఁబడిన పై వ్యాసమునుబట్టి ఉలూఫ్ ఖాను ప్రతాప రుద్రుని, నాగయగన్నసేనాని మన్నగు మఱికొందఱిని ఢిల్లీకిఁ బంపు చుండగా, ప్రతాపరుద్రుఁడు దారిలోనే మరణించినట్లును, సేనాని మహమ్మదీయ మతమును స్వీకరించి, రాజ్యకార్యములను నిర్వహించుచు, ఒకప్పు డోరుగంటి ప్రాంతమునకు నియమితుఁడై యుండియును ప్రజల కలవరము నణcపఁజాలక - కాపయనాయకుని ప్రతాపమున కోర్వలేక రాజ్యము నాతనికర్పించి ఢిల్లీకిఁ బాఱిపోయెననియుఁ దెలియుచున్నది]

పయికధ యెట్టి దయినను, నాగయగన్నఁడు ప్రతాపరుద్రుని కాలములోని వాcడు గనుక మారనయు పదుమూఁడవ శతాబ్దాంతము నందును, పదునాల్గవశతాబ్దాదియందును నున్నవాఁ డని తేలుచున్నది. కాబట్టి యతఁడిప్పటి కాఱువందల సంవత్సరముల క్రిందట నుండి యుండును. ఈ గన్నయ్యతల్లి మల్లాంబ కాకతీయ గణపతితలవరి యైన మేచయనాయకుని కూఁతురని యూ కింది పద్యమునఁ జెప్పఁబడినది.

           సీ. ఏ రాజు రాజుల నెల్ల జయించి మున్
                         వెట్టికిఁ బట్టె దోర్విక్రమమున
               నే రాజు సేతునీహారాద్రి మధ్యోర్యి
                         నేక పట్టణలీల నేలి (వాలె
               నే రాజు నిజకీర్తి నెనిమిదిదిశల ను
                         ల్లాసంబు నొంద నలంకరించె
               నే రాజు తనతేజ మీజగంబునకు న
                         ఖండై కవిభవంబు గా నొనర్చె

               నట్టి కాకతి గణపతిక్ష్మాధినాధు
               ననుఁగుదలవరి ధర్మాత్ముఁ డధికపుణ్యుc
               డయిన మేచయనాయకు ప్రియతనూజ
               నతులశుభలక్షణస్పురితామలాంగి
                  (నాగచమూవరుడు వరించె ...మల్లమాంబికన్ )

నాగయగన్నయ్య మార్కండేయపురాణమును గొంత పొగడి కవి నుద్దేశించి యీ కోరికను కోరినట్టు గ్రంధమునఁ జెప్పఁబడి యున్నది.

         ఉ. "కావునc దత్పురాణము ప్రకాశితసార కథామృతం బొగిన్
             ద్రావి జగజ్జనంబు లలరన్ రచియింపు తెనుంగున న్వచ
             శ్శ్రీవిభవంబుపెంపు విలసిల్లఁగఁ గోవిదు లిచ్చ మెచ్చి సం
             భావన చేయఁ జారుగుణభాస్వర మారయసత్కవీశ్వరా !

మారన యాంధ్రకవులలో నన్నయ తిక్కనలను మాత్ర మీక్రింది పద్యము లతో స్తుతించినాఁడు.

         ఉ. సారకథాసుధారస మజస్రము నాగళపూరితంబుగా
             నారఁగఁ గొలుచున్ జనులు హర్షరసాంబుథిఁ దేలునట్లుగా
             భారతసంహిత న్మును తిపర్వము లెవ్వఁ డొనర్చె నట్టి వి
             ద్యారమణీయు నంధ్రకవితాగురు నన్నయభట్టుఁ గొల్చెదన్.

         చ. ఉభయ కవిత్వతత్త్వవిభవోజ్జ్వలు సద్విహీతాధ్వర క్రియా
            ప్రభు బుధబంధు భూరిగుణబంధుర భారతసంహిత క్రియా
            విభుఁ బరతత్త్వకోవిదు నవీనపరాశరసూను సంతత
            త్రిభువనకీర్తనీయయశుఁ దిక్కకవీశ్వరుఁ గొల్తు భక్తితోన్.

మారన తన యాశ్వాసాంత గద్యములయందు 'శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం" బని చెప్పెను [2] మారనశైలిని సూచించెడు నయిదాఱు పద్యములను మార్కండేయపురాణములోని వాని నిం దుదాహరించుచున్నాను.

        చ. "ఉరగముచేతఁ జచ్చిన తనూభవునిం గని శోక వేదనా
             పరవశయు న్వికీర్ణకచభారయు నుద్గతబాష్పపూరయున్
             గరతలతాడితాస్యయును గద్గదికావికలా రనాదయున్
             జరణవిపర్యయాపగతసత్వరయానయునై పొరిం బొరిన్ ఆ.1

         చ. కనుఁగొని యాతనో గ్రనరకస్థజనంబు లెలుంగులెత్తి యో
             మనుజవరేణ్య ! పుణ్యగుణమండన ! తావక దేహదివ్యగం
             ధనిబిడమారుతంబు పరితాపభరం బడఁగించి మాకు నిం
             పొనరఁగఁజేయుచున్నయది యొక్క ముహూర్తమునిల్వవేదయన్. ఆ.2
 
         ఉ. ధర్మమునన్ ధనంబు సతతంబు ప్రవృద్దముగా ధనంబునన్
             ధర్మము తొంగలింప ధనధర్మవిరోధులు గాని కామభో
             గోర్ముల నొప్పు సంసృతిసుఖోదధిఁ దేలుచు నించుకేనియున్
             గర్మవిరక్తి లేక బహుకాల మలర్కుఁడు ప్రీతి నుండఁగన్ ఆ.౩

         ఉ. వాయపురజ్జు లేల మునివల్లభ ! వృద్దుఁడ వొండెఁ గావు లేఁ
            బ్రాయపువాఁడ వద్రివనరమ్యములైన యనేక దేశముల్
            ధీయుత! యల్పకాలమునఁ ద్రిమ్మర శక్యమె నీకు నెమ్మెయిన్
            వేయును నేల నమ్మ నెద నీపలుకన్న మునీంద్రుఁడిట్లనున్ ఆ.4

        ఉ. ఎక్కడనుండి వచ్చె నతఁ డీతుహినాద్రికి వేడ్క నూని యే
            నక్కడ నక్కుమారురుచిరాకృతి యాదట నేల చూచితిన్
            మక్కువ నేల నాదుమది మన్మధుఁ డేచఁ దొడంగె నా కయో!
            ది క్కిఁక నెవ్వ రిచ్చట మదీయు లటంచు దురాశ యేటికిన్ ఆ.5

        చ. తనరుచు నాకమోక్షసుఖదం బగు దారపరిగ్రహంబుచే
            యనికత మేమి ? బంధమున కాస్పదమా యది ? యంద సంతతం
            బును ముని దేవపిత్రతిధిపూజ లొనర్చుచుఁ బుణ్యలోకముల్
            చను గృహమేధి సర్వసుఖకారిణి వత్స! గృహస్థవృత్తిదాన్ ఆ.7

        చ. నిరుపమ సచ్చరిత్రుఁడు ఖవిత్రుఁడు సర్వజనైకమిత్రుఁ డి
            ద్ధరణజితోగ్రశత్రుఁ డతిదాంతుఁడు శాంతుఁడు సత్యవంతుఁ డా
            దరనయధర్మవంతుఁడు వదాన్యుఁడు మాన్యుఁడు ధన్యుఁ డంతరం
            గరహితమన్యుఁడై కరము గారవమారఁగ నేల యేలుచున్ ఆ.8

  1. [ఇతడు సేనానాయకుఁడు కాని మంత్రి కాcడనియు, సేనానాయకుఁడు మంత్రికాఁడనియు 'ఆంధ్రకవి తరంగిణి']
  2. [ఈ యాశ్వాసాంత గద్యనుబట్టి మారన తిక్కనసోమయాజి శిష్యుఁడనియు తిక్కనామాత్యుఁడను వేఱొకని పుత్రుఁడనియుఁ దెలియవచ్చుచున్నది. ఇందలి 'తిక్కనామాత్య పుత్ర' ఆను విశేషముగ బట్టి కొందఱు మారన తిక్కనసోమయాజి పుత్రుఁడని భ్రాంతిపడుచున్నారు. అది సరి కాదు. మారన తన్నుగూర్చి విశేషమేమియుఁ జెప్పనందున నితనింగూర్చి యెక్కువగా దెలియుట లేదు. ఇతని యితర రచన లేమియు నున్నట్లు కానcబడదు. ప్రతాపరుద్ర మహారాజు క్రీ.శ. 1265 మొదలు 1326 వఱకు నాంధ్ర రాజ్యమును పాలించినందున, మారన కవియు, నాగయ గన్నయయు, ఆ కాలముననే యుండిరనుట నిశ్చయమని 'ఆంధ్రకవి తరంగిణి' లోఁ గలదు. (మూడవ సంపుటము. పుట 167)]