అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/కొడిగట్టిపోతున్న తెలుగు భాషాదీపం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స.వెం.రమేశ్

పొరుగు రాష్ట్రాలలోని తెలుగువారు

కొడిగట్టిపోతున్న తెలుగు భాషాదీపం

భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తూ, భరతమాతకు వడ్డాణం లాగా వింధ్యపర్వతాలున్నాయి. ఈ వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీసుగడ్, మహారాష్ట్రల లోని కొన్ని ప్రాంతాలూ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలూ, పాండిచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతమూ ఉన్నాయి. చదువరుల సులువు కోసం దీనినంతా కలిపి నేనిక్కడ దక్షిణ భారత దేశం అంటున్నాను. ఈ దక్షిణ భారతదేశంలో ఎన్నో రకాల భాషలు మాట్లాడేవారున్నారు. ముఖ్యమైన భాషలు: తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠి, ఒరియా, గోండి, ఉరుదూ, తుళు, కొంకణి, కొడగు. ఇవిగాక కొద్ది కొద్ది మంది మాట్లాడే రకరకాల కొండవాసుల భాషలున్నాయి.

శాతవాహనుల కాలం నుండీ ఆంగ్లేయుల రాకవరకూ ఈ దక్షిణ భారతదేశం అంతా చిన్నా పెద్దా రాజ్యాలుగా వుండేది. కొన్ని కాలాలలో కలిసి వుండేది. ఎన్నో సమయాలలో చిన్న చిన్న రాజ్యాలుగా వుండేది. ఆంగ్లేయుల పరిపాలనా కాలానికి ఈ దక్షిణ భారతదేశం మద్రాసు, మైసూరు, నిజాం, తిరువాన్కూరు, కొచ్చిన్, రాష్ట్రాలుగానూ, బొంబాయి, మధ్యరాష్ట్రాలలో కొంతభాగంగానూ వుండి పోయింది.

తెలుగు వారి ఆందోళనలూ, అలజడుల కారణంగా ప్రజాస్వామ్య భారతదేశంలో ఇప్పుడు మొదట వివరించిన పద్ధతిలో ఉన్నది.

తెలుగువారు ఎందరున్నారు?

దక్షిణ భారతదేశంలో ఈనాటికీ ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగు. మిగిలిన అన్ని భాషలవారూ కలిసినా కూడా తెలుగు వారొక్కరే పెద్ద సంఖ్యలో వున్నారు. దక్షిణాదిన నేటికీ 50 శాతం పైగా తెలుగువారున్నారు.

తెలుగువారి సంఖ్యను ఇంకొంచెం వివరంగా చెబుతాను.

ఆం. ప్ర. జనాభాలో 90% అంటే సుమారు 7 కోట్లు

తమిళనాడులో 42% అంటే సుమారు 2 కోట్లా 80 లక్షలు

కర్ణాటకలో 33% అంటే సుమారు 1 కోటీ 70 లక్షలు

మహారాష్ట్రలో 16% అంటే సుమారు 1 కోటీ 50 లక్షలు

ఒరిస్సాలో 22% అంటే సుమారు 80 లక్షలు

ఛత్తీసుఘడ్లో 20% అంటే సుమారు 80 లక్షలు

కేరళలో 12% అంటే సుమారు 40 లక్షలు

అంటే దక్షిణ భారతదేశంలో పద్నాలుగున్నర కోట్లకు పైగా తెలుగువారు ఉన్నారు. ఉత్తరభారతం, ఇతర దేశాలలోని తెలుగువారిని కలుపుకుంటే తెలుగువారు 15 కోట్ల పైమాటే. అంటే భారతదేశంలో ఎక్కువమందికి తల్లిపలుకు తెలుగే. ఆంధ్రప్రదేశ్ కు బయట దక్షిణాదిన ఏడున్నరకోట్ల మంది తెలుగు వారున్నారు. ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లోని తెలుగువారి సంఖ్య కంటే పెద్దది

తెలుగు దీనస్థితి కి కారణాలు ఏమిటి?

ఇంత పెద్ద భాష ఎంతో చరిత్ర కలిగిన భాష ఇట్లా దీన పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? కాస్త చూద్దాము.

1 వ కారణము: పరాయిభాషల వారి పరిపాలనలో వుండిపోవడము. దక్షిణాదిన ఎక్కువ భాగం, ఎక్కువకాలం ఆంధ్రరాజులే పరిపాలన చేసినారు. కొన్ని ప్రాంతాలు మాత్రం అన్ని కాలాలపాటు ఇతర రాజుల పరిపాలనలో వున్నాయి. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత చాలా ప్రాంతాలు ఉర్దూ భాషీయుల చేతిలోనికి, వారి ద్వారా ఆంగ్లేయుల చేతిలోనికి పోయాయి. ఇదొక కారణము.

2 వ కారణము: తెలుగువాడికి మొదటినుంచీ కూడా తెలుగుభాషపై పట్టనితనం. అదిప్పుడు మనం కనులారా చూస్తూనే వున్నాం. ఏదో ఒక పొరుగు భాషపైన విపరీతమైన ఆకర్షణ తెలుగువాడికి. ఇది ఇప్పుడే కాదు. మొదట్నించీ వున్నదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంగ్లానికి పెద్దపీట వేసినట్లే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగువాడు తమిళానికీ, మైసూరురాజ్యంలోని తెలుగువాడు కన్నడానికి, ఒరిస్సాలోని వారు ఒరియాకు, మహారాష్ట్రలోని వారు మరాఠీకి, జాతీయభాష పేరుతో వచ్చిన హిందీకి, పెద్దపీట వేసినారు హిందీని జాతీయభాషగా ప్రచారం చేయడంలో తెలుగువాడిదే పెద్ద చేయి. తెలుగువాడి సాయమే లేకుంటే ఉత్తరాదిన కేవలం 13 కోట్ల మందికి మాతృభాష అయి వుండి, దక్షిణాదిన ఉనికేలేని హిందీ ( ఇప్పటి లెక్కల ప్రకారం) జాతీయభాష అయిఉండేదే కాదు. రాజుల కాలంలోనూ అంతే సంస్కృత ప్రాకృత భాషలకే పెద్దచోటు. శాతవాహనులు ప్రాకృతంలో గ్రంథాలు రాస్తే, పల్లవులు ప్రాకృతంతో పాటు తమిళంలో శాసనాలే వేసినారు చరిత్రలో నిన్న మొన్నటి రెడ్డిరాజులు కూడా సంస్కృత గ్రంథాలే వ్రాసినారు.

3 కారణము: ఇది కేవలం ఇతర రాష్ట్రాల్లోని వారికి చెందినది, ముఖ్యమైనది కూడా ఏమిటంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్ప డటం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఎందుకు అడిగినారో అర్థమే కాదు ఇక్కడ నేను ఆనాటి పెద్దలను విమర్శించాలను కోవడం లేదు ఆనాటి ఉద్యమస్ఫూర్తిని త్యాగధనులనూ తప్పు పట్టడం లేదు. జరిగిన చరిత్రను, ఇన్నాళ్లూ పెద్దలు దాచి పెట్టిన విషయాలను చెబుతున్నానంతే. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో తమిళుల పెత్తనాన్ని భరించలేక ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలయిందని మనం చరిత్ర పుస్తకాలలో చదువుతున్నాం ఇది నిజమేనా ? బాగా పరిశీలించి చూస్తే తెలుస్తుంది మాంటేగ్-చేమ్స్ఫ్‌ర్డ్ సంస్కరణలు వచ్చి భారతదేశంలో ఎన్నికలు జరిగి భారతదేశంలో స్థానికులకు పరిపాలనలో చోటు కల్పించడం మొదలయింది 1920లలో. అప్పటికే ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలైవుంది నిజంగా అప్పటి పెద్దలు చెప్పినట్లు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళుల పెత్తనమే ఉంటే మద్రాసు రాష్ట్రానికి అగరం సుబ్బరాయలురెడ్డి, పానగల్లు రాజా, కుమారస్వామి రాజా, కె.వి.రెడ్డి, బొల్లిని మునిస్వామినాయుడు, టంగుటూరి ప్రకాశం, ఓమండూరు రామస్వామి లాంటి తెలుగువారే ఎందుకు ముఖ్యమంత్రులయినారు. మదరాసు నగరానికి మొదటి మేయర్ పిట్టి త్యాగరాయశెట్టి తెలుగువాడే. తమిళుల పెత్తనం అంతగా ఉన్నప్పుడు తమిళులెందుకు ఉన్నత పదవులను పొందలేకపోయారు. దీనిని బట్టి చూస్తే ఆనాడు పెద్దలు చెప్పిన 'తమిళుల పెత్తనం' అనే మాట ఒట్టిది. ఆనాటి ఆంధ్రోద్యమకారులు చెప్పిన ఇంకొక ముఖ్య కారణము కృష్ణానది నీళ్లు. ఇప్పుడు నాగార్జునసాగర్ వున్నచోట కాకుండా, ఇంకా ఎగువన ఆనకట్ట కట్టి, కాలువల ద్వారా దక్షిణాన చెంగల్పట్టు వరకూ నీళ్లివ్వాలని అప్పటి మదరాసు రాష్ట్ర ప్రతిపాదన 'పన్నులు తెలుగు వారి దగ్గర కట్టించుకొంటూ, నీళ్ళు అరవలకా?' అని ఆంధ్రులు ఆనాడు గర్జించారు. నిజానిజాలను చూస్తే, అప్పటి మదరాసు రాష్ట్రం చెప్పిన ఈ కాలువ నీళ్ళు గుంటూరు, కృష్ణా జిల్లాలకే కాక, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల గుండా చెంగల్పట్టుకు చివరలో చేరేవి. వీటిలో అరవప్రాంతాలు ఏమున్నాయి? మదరాసు నగరానికి కేవలం 50 కిలోమీటర్లు దక్షిణంగా వుండే చెంగల్పట్టు అరవ ప్రాంతం కానేకాదు అచ్చమైన తెలుగు ప్రాంతం. మరి ఉద్యమం ఎందుకు చేసినట్లు? (ఇంత ఉద్యమం చేసీ ఆంధ్రప్రదేశ్ ఏర్పరచుకొని, చెంగల్పట్టునూ, మదరాసునగరాన్ని తమిళులకు అప్పగించి, తీరుబాటుగా మళ్లీ ఇప్పుడు ఆ కాలువనే తెలుగుగంగ పేరుతో తవ్వినారు) ఏతా - వాతా తేలేదేమిటంటే, అప్పుడు జరిగిన ఉద్యమం తమిళుల పైన కోపంతో కాదు. దక్షిణజిల్లాల తెలుగువారి పైన కోపంతో, ఉత్తర జిల్లాలవారు ఉద్యమించినారు. అప్పుడు అధికారంలో వున్న తెలుగువారంతా (ఒక్క ప్రకాశంగారు తప్పిస్తే) దక్షిణజిల్లాలవారే కదా? ఆ ఉద్యమానికి భాషను ఒక ఆయుధంగా ఎన్నుకొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వేర్పాటు వాదాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు వేర్పాటువాదులు కూడా నీళ్ళూ, భాషలోని యాసా ఆయుధాలుగా చేసుకుని ఉద్యమిస్తున్నా, వారి అంతరంగంలో అధికారం చేపట్టినప్పుడు అసలు కారణం. అప్పుడు జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆయా రాష్ట్రా లలో మిగిలిపోయిన తెలుగువారు నిస్సహాయు లయిపోయినారు. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు వారి పైన ఒత్తిడి పెరిగిపోయింది. ఏం మాట్లాడినా 'మీకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేసినా, ఇంకా ఇక్కడ మీ పెత్తనం ఏమిటి?' అని తమిళులు నిలదీయ సాగినారు. విధిలేని పరిస్థితుల్లో తల్లిమాటకు తెలుగువాడు దూరం కావలసి వచ్చింది.

ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం జరిగుండకపోతే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి వుండకపోతే దక్షిణాది అంతా కలిసి దక్షిణప్రదేశ్ రాష్ట్రం ఏర్పడివుంటే, ఈనాడు భారతదేశంలో తెలుగు తిరుగులేని స్థానంలో వుండుండేది. తెలుగుకన్నా చిన్న భాష అయిన హిందీ ఎట్లా అయితే ఉత్తరాది అంతా అల్లుకుందో, అట్లా తెలుగు దక్షిణాది అంతా అల్లుకుపోయి వుండేది. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఇతర భాషీయులు కూడా తెలుగును నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుండేవారు.

(2003 ఏప్రిల్ - నడుస్తున్న చరిత్ర నుండి)

మీకు తెలుసో, లేదో

 1. ప్రస్తుతం 'ఒరిస్సా'గా పిలుస్తున్న కళింగ ప్రాంతాన్ని కళింగగాంగులు తొమ్మిది వందల సంవత్సరాలు పరిపాలించి నారు. వీరి మాతృభాష తెలుగు.
 2. కేరళలో ప్రసిద్ధిచెందిన రామనాట్టం, కృష్ణనాట్టం అనే శాస్త్రీయ నృత్యాలు సంస్కృత భాషలో నడుస్తాయి. ఈ నాట్య గ్రంథాలు తెలుగు లిపిలో ఉండేవి.
 3. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎల్లోరా, కోణార్క్, పూరి, మధుర, మహాబలిపురం దేవాలయాలను తెలుగు రాజులే నిర్మించారు.
 4. ఒడియా భాషలో అద్భుతమైన ఆధ్యాత్మిక రామాయణాన్ని వ్రాసిన గోపాలకవి తెలుగువాడే.
 5. 1857వ సంవత్సరం ఆంగ్లేయులపై జరిగిన ప్రథమ స్వాతంత్ర్య తిరుగుబాటుకు పదేండ్లు ముందే 1847లో తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసినాడు.
 6. బ్రిటీష్ మహారాణి విక్టోరియా ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపడం లేదంటూ, ధైర్యంగా ఆంగ్లేయ ప్రభుత్వానికి ఎత్తిచూపిన మొదటి భారతీయుడు 'గాజుల లక్ష్మీనరుసు శెట్టి' అనే తెలుగువాడు.
 7. తెలుగులో వచ్చిన మొట్టమొదటి వార్తా పత్రిక సత్యదూత. ఇది 1835లో, ఇప్పుడు కర్ణాటకలో వున్న అచ్చ తెలుగు ప్రాంతమైన బళ్ళారి నుండి ప్రచురితమయ్యేది.
 8. అచ్చ కన్నడ జిల్లాలుగా పేరుపొందిన మైసూరు, మండ్య, శివమొగ్గ, చామరాజ నగరు జిల్లాలలో కన్నడ మాతృభాష కలిగిన మంగలివారు ఒక్కరూ లేరు. అందరూ తెలుగువారే
 9. కర్ణాటక మొట్టమొదటి ముఖ్యమంత్రి కేశంపల్లి చెంగలాయ రెడ్డి తెలుగువారే.
 10. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపకులు డా॥ హెగ్గేవార్ మాతృభాష తెలుగు.
 11. మహారాష్ట్రకు ఒకప్పటి ముఖ్యమంత్రి డా॥ కన్నంవార్ తెలుగువారే.
 12. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై తెలుగువారేననీ, వారి తల్లి పేరు బంగారమ్మ అనీ ఆంధ్రులకు మొట్టమొదట తెలియజేసినది స్వర్గీయ మరుపూరు కోదండరామిరెడ్డి.

స్పందనను వ్రాయండి
______________
'అమ్మనుడి'లో రచనలపై మీ స్పందనలు వ్రాసి పంపండి!

సంపాదకుడు 'అమ్మనుడి',
జి-2, వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీధి,
మాచవరం, విజయవాడ-520 004.
ఇ-మెయిల్ : editorammanudi@gmail.com