Jump to content

అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/తెలుగు నిలదొక్కుకునేదెలా

వికీసోర్స్ నుండి

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు
9866128846

2011 మాతృభాషల జనాభాలెక్కలు

తెలుగు నిలదొక్కుకునేదెలా....

2011 వ సంవత్సరంలో సేకరించిన భాషలకు సంబంధించిన జనాభా లెక్కలు చివరకు ఇంకా ఈ దశాబ్దం గడవడానికి ఏడాదిన్నర ఉందనంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ భారత జనాభా లెక్కల సంస్థవారువిడుదలచేశారు. కింద చూపిన పట్టిక (సేకర్త, కొలిచాల సురేశ్, తెలుగు భాషా వేదిక, తెలుగుబలగంలోకి ఎగుమతి చేసినది). ఈ పట్టికలో చూపిన కొన్ని భారత భాషల లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఎంత మంది ఏ భాషను మాట్లాడుతున్నారో 1971 నుండి 2011 వరకు జరిగిన జనాభా లెక్కలలో తేలిన గణాంకాల సారాంశం ఉంది. ఇందులో హిందీ తప్పించి అన్ని భాషలూ కొద్దోగొప్పో తరుగుతున్నా హిందీ బాగా పుంజు కొంటోంది. తెలుగూ మలయాళ భాషల జనాభా బాగా తగ్గుతోంది. అని తెలుస్తోంది. ద్రావిడ భాషల జనాభా తగ్గుముఖం పట్టాయి అని కూడా చెబుతోంది. దీనికి రెండుమూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి -ప్రతి దశాబ్దపు జనాభా సేకరణలోనూ మాతృభాషల సంఖ్య ఒకటి తగ్గిపోతోంది అని తెలుస్తోంది. అంటే 10వేలకంటే తక్కువ మాట్లాడే జనాభా ఉన్న భాషలనూ మరికొన్ని చిన్నా పెద్దా భాషలను ఆయా భాషా సమూహాలకిందజమకట్టేయడం జరుగుతోంది. ఉదాహరణకు షుమారు 40కి పైగా భాషలు (రాజస్థానీ, ఛత్తీస్గఢీ, భోజపురి, పహాడీ, మైథిలీ, మగధీ లాంటివెన్నింటినో హిందీ కింద జమవేయడం. అంటే హిందీ ఒక పెద్ద భాషా సమూహానికి మారు పేరుగా మారిపోయింది. అట్లాగే ఆయా రాష్ట్రాలలో మాట్లాడే జన్యుసంబంధం కలిగిన మరికొన్ని అల్పసంఖ్యాక భాషలను ఆయా రాష్ట్రభాషలలో కలిపి లెక్క చూపించడం జరిగింది. ఇంకొక కారణం - దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువగా నమోదు కావడం కావొచ్చు. ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరుగుదల సాధారణ జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువ. మూడవది - మన దేశ రాజ్యాంగంలో చెప్పినట్లుగా ఆయా రాష్ట్రాలలో ఉన్న మైనారిటీ లేక అల్పసంఖ్యాక భాషల రక్షణ హక్కులను పట్టించుకోకపోవడం. ఈ భాషా హక్కుల హరణం తెలుగుపై కోలుకోలేనివిధంగా దెబ్బతీస్తోంది. ఉదాహరణకు తమిళనాడులో 1971 వరకు వందలాది తెలుగు బడులు ఉండేవి అవి మెల్లమెల్లగా పూర్తిగా మూసివేతకు గురయ్యాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ టూ పీజీ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంలాంటి చర్యలు మరే రాష్ట్రంలోనూ కనబడవు. తెలుగు రాష్ట్రాలలోనే తెలుగుకు సరైన గుర్తింపు లేనపుడు ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు ఇంకా తెలుగును నిలుపుకునే ప్రయత్నం ఎలా చేయగలం?!

క్ర.సం ఏడాది/భాష హిందీ% తెలుగు% బంగ్లా% మరాఠీ% తమిళం% కన్నడ% మలయాళం%
1 1971 36.99 8.16 8.16 7.62 6.88 3.98 4.00
2 1981 38.74 7.61 7.71 7.43 6.50 3.86 3.86
3 1991 39.29 7.87 8.30 7.45 6.32 3.91 3.62
4 2001 41.03 7.19 8.11 6.99 5.91 3.69 3.21
5 2011 43.63 6.70 8.03 6.86 5.70 3.61 2.88

తెలుగు నిలదొక్కుకొనేందుకు ఇది చివరి అవకాశమే. నిజమే లేకపోతే తెలుగు కనుమరుగు అవటం కూడా ఖాయం. ఇదీ నిజమే. అయితే ఈ సందర్భంలో తెలుగువాళ్లు ఉన్నంతకాలం తెలుగు ఉండాలనుకొనేవాళ్లు ఏం చేయాలి అన్న దానిమీద సరైన అవగాహన ఉండాలని నా అభిప్రాయం. అయితే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ టూ పీజీ ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఎంతో మంది తెలుగువాళ్లు తమ బాధను దిగమింగుకొని ముక్కున వేలేసుకొని నిస్సహాయంగా చూస్తుండగా, కొంతమంది తమగోడునూ, వ్యధనూ, వేదననూ, ఆవేదననూ, ఆక్రందనాలనూ అభిప్రాయాలుగా అనేక రూపాలలో అంతర్జాలంలోనూ, సామాజిక జాలికావలయాలైన ట్విటర్‌ల, ఫేస్‌బుక్‌‌లోనూ, వివిధ పత్రికలలో వ్యాసాల రూపంలోనూ బయట పెట్టుకుంటున్నారు. ఇందులో కొంతమంది తెలుగు వర్ణమాలలోని అక్షరాలను పెంచాలనో తగ్గించాలనో, సరిచేయాలనో సూచిస్తూండగా, మరికొందరు తెలుగు పారిభాషిక పదాల రూపకల్పనకు సూచనలను చేస్తున్నారు. ఇంకా మరికొందరు తెలుగుపదాలలోని సంస్కృత, ఆంగ్ల పదాలను ఏరివేయాలనీ వాటి వాడకాన్ని నియంత్రించాలనీ సంస్కృత ఆంగ్ల ప్రభావాలను ఎటువంటివాటినైనాసరే సుతరామూ ఒప్పుకోగూడదనీ పట్టు బట్టుతున్నారు. ఇకనైతే కొందరు ఏ మాండలికం వాడాలో చెబుతూ ప్రామాణికతకు దారులు తెరుస్తున్నారు. ఇంకెంతో మంది ఇప్పటికిప్పుడు పెద్దపెద్ద నిఘంటువులను తయారుచేయాలని సూచిస్తూండగా ఇంకొందరు ప్రపంచంలో వస్తున్న ఆధునిక విజ్ఞానాన్ని అంతటినీ వెంటనే అనువాద రూపంలో తెలుగులోకి తీసుకురావాలని అభిప్రాయ పడుతున్నారు. ఇలా ఎంతోమంది తెలుగుభాష మనుగడకూ, తమ భాషను బతికించుకో వాలనే తాపత్రయపడుతున్నారు. ఇలా అనేక రూపాలలో తెలుగు మాధ్యమం కోసం పుంఖానుపుంఖాలుగా వ్యాసాలను ప్రకటిస్తున్నారు.

కొంతమంది తెలుగు మడిగట్టుకు కూచోవాలంటారు. ఇంకొందరు ఇదంతా వదిలి ఆధునిక యుగం కోసం తెలుగునే వదలాలి అంటారు. ఈ రెండూ మోతాదును మించిన అతి పోకడలే. ఈ రెండూ కాక మూడో దారి ఉందని గుర్తించాలి. ఇక్కడ అవసరం ఏమిటో గుర్తించాలి. ఆధునిక యగం జ్ఞానయుగం, జ్ఞాన సంపదను నియంత్రించగలగాలి. తేలికగా, విరివిగా వాడుకోగలగాలి. కోట్లాదిగా ఉన్న తెలుగువాళ్లు వేరేభాషకు మారడంకంటే ఆయా భాషలలో ఉన్న జ్ఞానసంపదను తెలుగులోకి తెచ్చు కోవడమే సులభం. ఈ ప్రక్రియ సులభంగా నెరవేరాలంటే కొత్త భావనలకు కొత్త పదాలను ఇతర భాషలనుండి స్వీకరించడంతప్పుకాదు. కాకపోతే ఉన్న పదాలు వాడ కుండా అనవసరంగా అరవుపదాలు వాడటం అర్థం లేని పనే. తెలుగులో వాడుతున్న సరీసృపం, కసేరుకం, పత్రహరితం త్రికోణమితి, అతిపరావలయ ప్రమేయాలు, కల్పితాక్షం, రసాయన చికిత్స, మొదలైన వాటికి వరుసగా ఇంగ్లీషులో సమానార్థకాలైన రెప్టైల్ 'reptile', వర్టిబ్రేట్ 'vertebrate', క్లోరోఫిల్ 'chlorophyll', ట్రిగ్నోమెట్రీ 'trigonometry', హైపర్‌బోలిక్ ఫంక్షన్స్ 'hyperbolic functions', ఇమాజినరీ యాక్సెస్ 'imaginary axis', కీమోథెరపీ 'chemotherapy', మొదలైనవిమౌలికంగా ఇంగ్లీషు పదాలు కావు. ఇవన్నీ లాటిను, గ్రీకు మొదలైన భాషలనుండి అరువు తెచ్చుకున్నవే, ఈ ప్రక్రియ ఇంగ్లీషు భాషను సుసంపన్నం చేసిన ప్రక్రియేగదా. ఇంగ్లీషుకు గ్రీకు, లాటిను లాంటివే తెలుగుకు సంస్కృత ప్రాకృతాలు. ఇలా తయారైన తెలుగును ఈసడించుకోవాల్సిన అవసరం లేదు. పారిభాషిక పదాలు ఉన్న తెలుగు సాధారణ విషయాలలో వాడే తెలుగు కాదు. ఇది ప్రత్యేక సందర్భాలలో వాడే తెలుగు. సందర్భాన్ని బట్టీ, వ్యాసంగాన్ని బట్టీ, వృత్తినిబట్టీ మనం వాడే తెలుగులో తేడాలు ఉండొచ్చు. ఇవిగాక ప్రాంతీయ మాండలిక భేదాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అన్ని తెలుగులూ ఉండాలి. ఇందులో ఏ తెలుగూ మరో తెలుగుకంటే మంచిదనిగానీచెడుదనిగానీ, చిన్నా పెద్దా తేడాలు కానీ, గొప్పా పేదా భావాలకు గానీ తావులేదు. ప్రామాణిక భాష అనే భావనకేతావు లేదు నేడు. రాష్ట్ర విభజననుండి నేర్చుకోవలసిన మొదటిపాఠం ఇదే.

వీరందరినీ కోట్లాది తెలుగువాళ్లకు ప్రతినిధులుగా, ఇట్లా రాయగల గడంచేతనైనవారిగా - తమ గోడు వినిపిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకొని సమస్య పరిష్కారానికి ఎలాంటి చొరవనుగానీ ఉద్దేశ్యాన్ని గానీ ప్రకటించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగును విద్యామాధ్యమభాషగా తొలగించి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టేందుకు అన్యాయమూ అక్రమమూ, కుతర్కంతో నిర్హేతుకమైన నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంలో ప్రజల తరఫున వెలువడిన స్పందనలను పట్టించుకొని ఇది ఒక సమస్య అని గుర్తించడానికి తిరస్కరించింది. దానిపై ఒక విస్తృత అధ్యయనం కోసం విద్యావేత్తలతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనిగానీ తెలుగు సమాజంలో పేరుపొందిన విజ్ఞులతో ఒక పౌర సంఘాన్ని ఏర్పాటుచేయాలనిగానీ ఇంకా ముందు చూపుతో విజ్ఞతతో రాజకీయ పార్టీల ప్రతినిధులను సమావేశపరిచి చర్చించి భాషాసమస్యను పరిష్కరిద్దామనిగానీ తలపెట్టలేదు. ఈ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోవు.

భాషలు తమ వికాస పరంపరలో, సందర్భాన్ని బట్టీ తాను ఎదుర్కొంటున్న కొత్త భావనలకు కొత్త పదాలను ఉనికిలోకి తెస్తాయి లేక సృష్టించుకొంటాయి. ఈ ప్రక్రియ, ఇప్పటికే ఉన్న వనరుల (పదాల) నుంచి గానీ ఇతర భాషలనుంచి తెచ్చుకున్న వనరులనుంచి గానీ కావచ్చు. రోజురోజుకూ అపరిమితంగా సృష్టింపబడుతున్న జ్ఞాన సంపదను ఒడిసి పట్టడానికి సొంత వనరులు చాలవు. ఇతరుల వనరులు వద్దని సొంత వనరులే ఎక్కువగా వాడితే పదాల నిడివి (పొడుగు) పెరిగి చాంతాడంత అవటం మామూలే. మనం తమిళం, జర్మను భాషలలో చూసేది ఇదే. కొత్త పదాలన్నీ సాధారణంగా చాలా పొడవుగా అలవిగానివిగా తయారవుతాయి. పైపెచ్చు, పదాల అర్థ భారం పెరుగుతుంది. సొంత వనరులనుంచి ఏర్పడే పదాలు అనేక సందర్భాలలో అనేకార్థాలతో నేర్చుకొనేందుకు కష్టంగా కూడా ఉండవచ్చు. అదే అరువు తెచ్చుకున్న పదాలు కొత్త భావనలకు వాడినప్పుడు పదాల నిడివిలోనూ, అర్థంలోనూ పొందిక, జిగిబిగి కనిపిస్తుంది. ఇంగ్లీషూ, తెలుగూ అరువుపదాలతో సుసంపన్నమైన పదసృష్టి గావించే భాషలు. ఇక్కడ వనరులకు కొదవు ఉండదు. అర్థ సంకోచ వ్యాకోచాలకు అసలు తావు లేదు.

మీరు ఏ తెలుగైనా వాడండి. తెలుగు ఉండాలిగానీ ఏ తెలుగు ఉండాలి అనిగాదు. ఇదే మన ఆరాటం. అందరినీ కలుపుకు పోవలసిన సమయం ఇది. ముందు తెలుగు అంటూ ఉంటే అవసరాన్ని బట్టీ ముందుముందు అది ఒక ఉమ్మడి తెలుగుగా ఎదగవచ్చు. అలాకాకుండా ఇప్పటినుంచే అచ్చతెలుగా, మచ్చతెలుగా అనే ప్రశ్నలు వద్దు. అందరికీ కావలసింది తెలుగు. దానికోసమే అందరం నడుం కట్టాలి. అందరికీ తెలుగు ఎందుకో అవగాహన కల్పించాలి. కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ బడులు అనే తేడాలేకుండామాతృభాషా మాధ్యమం ద్వారా చదువులూ, ప్రత్యేక విషయంగా మాత్రమే ఇంగ్లీషు అనే చట్టం రావాలి. అప్పుడే సమాజంలో ప్రజలందరికీ సమాన ఉద్యోగావకాశాలూ ఆర్థిక ఉన్నతీ చేరువవుతాయి.

ప్రపంచంలోని 230 దేశాలలో 175 దేశాలలో మాతృభాసా మాధ్యమమే నడుస్తోంది. ఆ మిగిలినవి బ్రిటీషు, స్పెయిన్ లాంటిఆధిపత్య దేశాల వలసపాలనలో మగ్గి అణగారిన దేశాలే. దాంట్లో మన దేశమూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి పెద్దదేశాలూ మరెన్నో చిన్నాచితకా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలే. మాతృభాషా మాధ్యమం నడుస్తున్న దేశాలలో అక్షరాస్యత ఎక్కువ. దాంతోపాటు ఆర్థికాభివృద్ధీ ఎక్కువే అందుకోసం బడిభాషగాఅమ్మనుడికే మనం నిలబడాలి. మాతృభాషామాధ్యమ ఉద్యమం అవసరం అందుకే.

పాఠశాల విద్యలో మాతృభాషే మాధ్యమంగా ఉండాలి