అన్నమాచార్య చరిత్రము/అన్నమాచార్యుఁడు సంకీర్తనములు పాడుట
Appearance
కెలనఁ జూపట్టు సంకీర్తనపరులఁ
బిలిచి లెస్సగ వినిపించఁగావలయు-
నిపు డన్న వారలు నెడఁ బాఱఁబాఱఁ
దిపిరిదండెలు శ్రుతుల్ తిన్నగాఁ గూర్చి
దండిమై నెఱగానదండెయు వాద్య-
దండెయుఁ దానసంతానంబు చూప
స్థాయి షడ్జమును బంచమమును జేసి
ఠాయముల్ కడువింత డాలుగాఁ జూప
తేనెలపై తేట తిన్ననిచెఱకు
పానకముల నేరుపఱచిన మేలు
చక్కెరలో తీపు చల్లఁదెమ్మెరలు
చిక్కని కపురంబు జీవరత్నములు
కల యమృతంబు మీఁగడమీఁది చవులు
చిలుకుచుఁ గవులెల్లఁ జేయెత్తి మ్రొక్క
వేంకటపతికిఁ గావించిన మంచి-
సంకీర్తనముల రసంబు లుట్టఁగను
సింగార మొకకుప్పఁ జేసిన రీతి
రంగైన రాగవర్ణములఁ బాడుటయు,