అన్నమాచార్య చరిత్రము/రాయఁ డన్నమాచార్యు సత్కరించుట
Appearance
తవిలి యెన్నినఁ గాళిదాసాదులైన-
కవులందుఁ జిక్కిన కవులందు నిట్టి-
కవితయు నిట్టి శృంగారభావంబు
వివరింపఁ గంటిమే వింటిమే మున్ను
కన్నవిన్నవి గావు గదర ! యీ పదము-
లన్నయార్యునివి మోహనమూర్తు లనుచు
వీనులవిందుగా విని చాల మెచ్చి
యానందవార్ధి నోలాడి యా రాజు
పచ్చలకడియాలు బంగారువ్రాఁత-
పచ్చడంబులును గెంబట్టు కుళ్ళాయి
యంగదంబులు నుభయాతపత్రములు
రంగైన వింజామరలజోడు మంచి-
యుదిరిఁజేసిన గిండియును గళాచికయు
మొదలైనవెల్ల సమ్ముఖమున నొసఁగి
తన పెద్దనగరియొద్దనె యొక్కనగరు-
ననువొందఁ జూపించి యట నుండఁ బనిచి
యనుదినంబును వేంకటాద్రీశుమీఁది-
వినుతులు వేడుక వినుచుండి యుండె
నరనాథుఁ; డట నొక్కనాఁ డన్నమార్యుఁ
బరిచివర్గంబుఁ బంపి రమ్మనిన