అన్నమాచార్య చరిత్రము/నరసింగరాయఁడు విజయములందుట
స్వరూపం
నానాఁట నా నరనాథుండు వేఱు-
లేని కూరిమితోడ లీనమైయుండె;
తన సంపదలు సమస్తము నన్నమయ్య-
వని యెన్ను నడకల నారీతి నడచు-
నే పని గలిగిన నెఱిఁగించికాని
చేపట్టి తనయంతఁ జేయఁ డెప్పుడును
హితునిఁగా గురునిఁగా నెల్లబంధులఁగ
నతనినే భావించి యంగవింపుచును
పావనుండగు తాళ్ళపాకన్నమయ్య-
దీవెనలంది వర్ధిలుచు నా రాజు
బలియుఁడై పరిపంథిబలముల నడఁచి
నలిరేఁగి సింహాసనంబు చేకొనుచు
తన రాజధానియై తనరారు పసిఁడి-
పెనుగొండగతి నుండు పెనుగొండ నుండి
యన్నమాచార్యుల నటకు రావించి
యెన్నిక నెదురుగా నేతెంచి మ్రొక్కి
కనకాంబరాదుల గ్రామసంతతులఁ
గనువారలకు దండగాఁ బూజచేసి
వెన్నునిపై విన్నవించిన లోక-
సన్నుతంబైన మీ సంకీర్తనములు
విన నాకు మిక్కిలి వేడుకయ్యెఁడును-
ననఘాత్మ వినిపించు మనిన నగ్గురుఁడు