Jump to content

అంటువ్యాధులు/పదమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదమూడవ ప్రకరణము

సూక్ష్మజీవులను వెదకివెదకి చంపుట

ఏ పదార్థము నందైనను సూక్ష్మజీవులు లేకుండజేసి కొనుటకే శుద్ధిచేసికొనుటయని చెప్పుదురు. సూక్ష్మజీవులెక్క డెక్కడయుండునో పైని చూపియున్నాము. ఇపుడు వానిని నశింపజేయు సాధనములందెలిసి కొనవలయును. ఇట్టిసాధనము లనేకములు కలవుకాని, యందుగొన్ని సూక్ష్మజీవులను చంపగలిగినను మనకు కూడ హానికలుగజేయును. ఒక బట్టను సూక్ష్మజీవులంటి యున్నపుడు ఆబట్టను నిప్పులోగాని, గంధకధృతిలోగాని వేసినయెడల సూక్ష్మజీవులు నశించిపోవును, బట్టయు నాశమగును. ఇట్టిపద్ధతివలన మనకేమి ప్రయోజనము? కాబట్టి, మన శరీరమునకుగాని వస్తువులకుగాని చెరుపుగలుగ జేయక యేపద్ధతులు సూక్ష్మజీవులను చంపునో యవి మన కుపయుక్తములు; అందును ఎవ్వి త్వరలో పనిచేయునో ఎవ్వి చవుకగను సులభముగను లభించునో వానిని మనము తరచుగనుపయోగ పరచవలెను. ఇట్టి పద్ధతులలో మూడు విధములుగలవు.

i. దుర్వాసనను మాత్రమే పోగొట్టునవి.

ii. సూక్ష్మజీవుల యభివృద్ధినిమాత్రము మాన్పగలిగి వానిని జంపుటకుకంతగాశక్తిలేనివి.

iii. సూక్ష్మజీవుల రూఢిగ జంపునవి.

1. దుర్వాసనను మాత్రముపోగొట్టునవి

ఇవి కూడదనిచెప్పుటకే వాని నీపట్టీలో చేర్చితిమి. అత్తరు, పన్నీరు, అగరవత్తులు, మొదలగు కేవల సువాసన ద్రవ్యములు బొత్తిగ బ్రయోజనకారులుగావు. సూక్ష్మజీవులను చంపలేకపోవు ట టుండగా, మనలను భ్రమపరచి మన మితరజాగ్రత్తలను తీసికొనకుండజేయును. సాంబ్రాణి హారతి కర్పూరము మొదలగు వానికి సూక్ష్మజీవులను నశింపజేయు శక్తి కొంతవరకున్నను, వీనినిగూడ నమ్మరాదు. ప్రాణవాయువు, పొటాసియము పర్మాంగనేటు, హైడ్రోజను పరార్సెడు, మొదలగుకొన్ని పదార్థములు దుర్వాసనను బోగొట్టుచు సూక్ష్మజీవులనుకూడ నశింపజేయును. ఇట్టివాని నుపయోగింపవచ్చును.

2. సూక్ష్మజీవులయభివృద్ధి నాపునవి

ఇట్టివి, ఉప్పు, పటికారము, బోరికామ్లము, (Boric acid) శాలిసికామ్లము (Salicylicacid) మొదలగు రసాయినిక పదార్థములు. ఇవిమన యాహారపదార్థములలో సూక్ష్మజీవులు చేరి క్రుళ్లిపోకుండ గాపాడుకొనుటకు మిక్కిలి యుపయోగకరములు. ఇవియున్నచో సూక్ష్మజీవులంతగజేరలేవు. వీనిలో ననేకములు పుండ్లు వగైరాలు కడుగుకొనుట కుపయోగపడును.

3. రూఢిగ సూక్ష్మజీవులను చంపుపద్ధతులు

ఇందు ననేక పద్ధతులుగలవు. వానిలో గొన్ని మొండివగు సూక్ష్మజీవులంగూడ చంపగలవు. మరికొన్నింటియందు తీవ్రము చాలక కొన్నిజాతుల సూక్ష్మజీవులను మాత్రము నశింపజేసి మరికొన్ని జాతుల సూక్ష్మజీవుల కపకారము జేయజాలవు. కొన్నిపద్ధతులచే సూక్ష్మజీవులు చచ్చునుగాని వానిగ్రుడ్లు నశింపక యుండి పిమ్మట కొంతకాలమున కా గ్రుడ్లు పెరిగి సూక్ష్మజీవులై మన కపకారము జేయగలవు. కాబట్టిమన మీపద్ధతులను నేరుకొనుటలో మిక్కిలి మెలకువగ నుండవలెను.

ఒకానొక వస్తువు సూక్ష్మజీవులను చంపుటకుశక్తికలదని మాత్రము మనము తెలిసికొనిన జాలదు. ఎంతమందును ఏవిధముగ నుపయోగించిన ఎట్టి సూక్ష్మజీవులను ఎంతకాలములో చంపునను విషయము మనము మిక్కిలి చక్కగ నెరుగవలయును. ఇవిగాక యేవేవి సూక్ష్మజీవులు నివసించు స్థలము లన్నిటిలోనికి దూరుకొనిపోగలవో యేవియట్లుపోజాలవో అదికూడ మనము గమనింపవలెను. ఎట్లన గోడలలో నుండు నెరబీటలు, కన్నములు మొదలగువానిలోనికి చూర్ణములుగానున్న మందులను ప్రవేశ పెట్టవలెననిన మిక్కిలి కష్టము. ద్రావకములైనయెడల చిమ్మెడుగొట్టముల (పిచికారి) ద్వారా కొంతవరకు ఎక్కించవచ్చును. లేదా ఆవిరిరూపమున నయిన ఇంతకంటే సులభముగ దానిని వ్యాపింపజేయ

వచ్చును. కొన్నిమందులు కొన్నినిమిషములలోనే సూక్ష్మజీవులను నశింపజేయు శక్తిగలవి. మరికొన్ని కొన్ని గంటలవరకు సూక్ష్మజీవుల నంటియుండినగాని వానిని చంపజాలవు. పై జెప్పిన విషయములలో దేనిని మనము గమనించక పోయినను మన మీమందుల నుపయోగించుటవలన మన కుపకారము కలుగకపోవుట సరేక దా, పై పెచ్చు అపకారము కలుగును. ఏలయన మనము మందులనుపయోగించి సూక్ష్మజీవులను, అంటువ్యాధిని నశింపచేసితిమిగదా యను వట్టిభ్రమచే,గర్వపడి మెలకువగ నుండము. అందుచేత అంటు వ్యాధి ప్రబలి మనల కనివార్యమగును. కావుననేయేమందు నెంతెంత యుపయోగించిన యేయే స్థలములందెక్కువ యనుకూలమో యోచించి మనము అంటువ్యాధుల నివారించు మందులను ఏర్పరచుకొనవలెను. ప్రసిద్ధికెక్కిన ప్రొఫెసర్ కాకు (Koch) అను శోధకుడు వేయి ఘనపుటడుగుల పరిమాణముగల గదిలోని సూక్ష్మజీవులను ముప్పది నిమిషములలో చంపుటకు ఒక పవును (40 తులములుగల) గంధకమును పొగవేయవలెనని కనుగొనెను. అప్పటికికూడ కొన్ని సూక్ష్మజీవుల గ్రుడ్లు చావకపోవచ్చును. ఇవి గాక బట్టల మడతలలోను పరుపులలోని ఖాళిస్థలములలోను దాగికొనిన సూక్ష్మజీవులవరకు పొగవ్యాపింపక పోవచ్చును. పైగా యీ పొగ తలుపులు, కిటికీలు ఇంటిమీది పెంకుల మధ్య నుండు సందులు మొదలగు వానిగుండ యెంతపోవునో ఆ యా

యిండ్ల నిర్మాణమును బట్టి తెలిసికొనవలెను. గంధకపు పొగ చాలునా చాలదా యనునది క్రిందివిధముగ తెలిసికొన వచ్చును. ఆ గదిలో నొక తెరపియయినచోట అనగా నొక బల్లమీద నొక రెండణాకాసును, ఒక చొక్కాజేబులో కాని బట్టమడతలోకాని మరియొక రెండణా కాసునుపెట్టి, మూసియున్న రెండణా కాసు నల్లబడినదా లేదా చూడవలెను. నల్లబడినయెడల పొగ చక్కగ వ్యాపించినట్లెంచవలెను. ఇంకొక ఉదాహరణము. కలరా మొదలగు వ్యాధిగ్రస్తుల విరేచనములలో నుండు సూక్ష్మజీవులను చంపుటకు సౌవీరపు మందు నీళ్లు మిక్కిలి ఉపయోగకరమైనది. ఇక పాలు సౌవీరము రెండువేలపాళ్లు నీళ్లలో చేర్చినను ఆ నీళ్లు అయిదారు నిముషములలోనే సమస్తవిధములైన సూక్ష్మజీవులను చంపగలవు. అయినను లెక్కలేకుండ ఈ మందు నీళ్లను కొంచెమెత్తుకొని అద్దెడు లేక కుంచెడు నీళ్లతో కలసియుండు విరేచనమునందుగాని వాంతియందుగాని దానిని కలిపిన యెడల సూక్ష్మజీవులు చచ్చినవా లేదా యెంతసేపటికవి చచ్చునను విషయము తెలిసికొనుట కవకాశములేదు. కాబట్టి ఈ మందులను మితిలేకుండ నుపయోగింపక, మనము కలపబోవు పదార్థముతో చేరినతరువాత ఏర్పడు మిశ్రమపదార్థములో వేయిపాళ్లకుగాని రెండువేల పాళ్లకుగాని ఒక పాలు సౌవీర ముండునట్లు చూచుకొనవలెను. లేదాపైనిచెప్పిన ప్రకారము

కుంచెడు కల్మషపునీళ్లకు, వేయిపాళ్ల నీళ్లకొక పాలుగల సౌవీరపు మందునీళ్లను సోలెడో తవ్వెడో చేర్చుకొనునెడల పది వేలపాళ్లు కల్మషపు నీళ్లకు ఒక పాలైన సౌవీరముండునో యుండదో సందేహము. కాబట్టి ఇట్టిమందుల నుపయోగింపుచున్నప్పుడు మిక్కిలి బలహీనమగు ద్రావకముల నుపయోగింపక తీవ్రమయిన గుణముగల పదార్థములనే ఉపయోగింపవలెను. ఎట్లనగా ఒక శేరు కల్మషపునీళ్లకు 10 శేరుల సౌవీరము చేర్చినయెడల రమారమి వేయింటి కొకపాలు సౌవీరము చేర్చినట్లగును. కాని అప్పటికప్పుడు చూర్ణముచేసినను సౌవీరమును కల్మషపు నీళ్లలో చక్కగ కరుగునట్లు కలుపుటకు తగిన అవకాశమును, అనుకూలమును నుండదు. కావున అంతకు ముందే నూటి కొకపాలుచొప్పున నీళ్లలో సౌవీరమునుకలిపి ద్రావకముగాచేసి నిలవయుంచుకొని ఆ ద్రావకమును శేరు కల్మషపు నీళ్లకు అరసోలెడు కలిపిన రమారమి వేయింటికి ఒకపాలు సౌవీరము చేరియుండును. ఇప్పుడు మందు చక్కగ కలసి మూలమూలలనుండు సూక్ష్మజీవులను చంపునట్లు కల్మష పదార్థమును దేనితోనైనను కలగబెట్టవలెను. తగినంత పలచగ నుండని యెడల నీళ్లు పోయవలెను.

తడిలేని వేడి (Dry heat)

అనగా నీటియావిరిలేని వేడిగాలి: సూక్ష్మజీవులను చంపు శక్తులలో వేడి మిక్కిలి ఉపయోగ కరమైనది. 100[1]


డిగ్రీల వేడిగల గాలిలో సూక్ష్మజీవులన్నియు 1½ గంటలో జచ్చును. కానీ వీనిగ్రుడ్లు కొన్ని 140 డిగ్రీల వేడివరకు హెచ్చించినను మూడు గంటలవరకు చావవు. శిలీంధ్రము జాతి అనగా బూజు మొదలగువాని విత్తనము. 110–115 డిగ్రీలవరకుగల వేడికి చచ్చును. క్షయ మొదలగు ననేక సూక్ష్మజీవులు సామాన్యముగ 60 డిగ్రీల వేడికి 1 గంటలోను, 90 డిగ్రీల వేడికి నైదు నిముషములలోను చచ్చును. ఇంత వేడిగాలిలో గంటలకొలది విలువబట్టల నుంచునెడల నవి సాధారణముగ పాడైపోవును. కావున పుస్తకములు తోలు పెట్టెలు, చెప్పులు మొదలగువానిని తప్ప తక్కినవానిని శుద్ధి చేయవలయునని పొంగునీళ్లలో నుడకపెట్టుటకాని 100 డిగ్రీల వేడిగల నీటియావిరితో బెట్టుటకాని మిక్కిలి యుపయుక్తము. నీటిలోగాని నీటియావిరిలోగాని కొంతసేపుంచినను బట్టలు మొదలగు నవి పాడుకావు. ఇదిగాక వట్టివేడికంటె నీటితో గూడినవేడి యెక్కువ శీఘ్రముగ వ్యాపించును. ఈ వేడి నీటి యావిరితోపాటు బట్టలయొక్క మడతలన్నిటిలోనికి తప్పక ప్రవేశించును. ఇందుచేత 100 డిగ్రీల వేడిగలనీటిలో నుంచిన యెడల 15 నిమిషములలో సూక్ష్మజీవులు సామాన్యముగ నన్నియు చచ్చును. పైని చెప్పినప్రకారము నీటియావిరితో బట్టలను, ఇతరవస్తువులను శుద్ధిచేయు యంత్రములు సామాన్యముగ నన్ని యాసుపత్రులలో నుండును. కొన్ని శస్త్రసాధన

ములను వేగముగ శుద్ధి చేసికొనవలసి యున్నపుడు సలసల కాగు చమురు నుపయోగించుట యుక్తము. నీటికంటే ననేకరెట్లు వేడిగనుండుటచే నిది శీఘ్రముగను నిశ్చయముగను సూక్ష్మ జీవులను నశింపజేయును.

దగా మందులు

వేడిగాక సౌవీరము మొదలగు కొన్ని మందులు శుద్ధి చేయుట కుపయోగించునని పైని చూచియున్నారు. ఈ బాబతులో లెక్కలే నన్నిమందుల నిప్పుడు బజారులో నమ్ముచున్నారు. అందు పండ్లపొడులు, తామరమందులు, గాయములకు తైలములు అంజనములు మొదలగు పేరులతో ననేక వస్తువులు మిక్కుటమైన ప్రకటనాడంబరములతో వేనవేలు పేటెంటుమందులు గలవు. ఇందులో ననేకము నియమిత మైన పాళ్లులేకుండ నేదో యొక విధమున తయారు చేయబడి యుండును. ప్రకటనలు మాత్రము బలముగ నుండును. ఇట్టి వానిని జూచి ప్రజలు భ్రమపడి వాని నుపయోగించి మోస పోవుచున్నారు. వీనిచే తమ వ్యాధి కుదురునను వట్టి యాస విడువకపోవుటచేత వ్యాధికి దగు చికిత్సచేయక ముదర బెట్టి కొని తుదకు అసాధ్యవ్యాధుల పాలగుచున్నారు.

వేలకొలది దగాచేయుమందులలో కొన్నిటిని బ్రిటిషు మెడికల్ అసోసియేషౝ వారు పృధఃకరించి యనగా విడదీసి శోధించి యేయే మందులో నే యేవస్తువు లెంతెంత చేరి

యున్నవో దాని నిజమైన వెల యెంతయో మోసగాండ్రమ్మెడు వెల యెంతయో యీ విషయములన్నిటిని కనిపట్టి ప్రతినెల యందు తమ పత్రికలో ప్రకటించుచున్నారు. కాని యిందలి విషయములు వైద్యులకేగాని ప్రజలకు చక్కగా తెలియవు. ఇట్టిదగామందులను అమ్మకూడదని యొక ఆక్టు నేర్పరుపవలయునని పార్లమెంటువారిని బ్రిటిషుమెడికల్ అస్సోసియేషౝ వారు కోరియున్నారు. వారు శోధించినమందు నొక దానిని గూర్చివారువ్రాసినవిషయమును మేముసంక్షేపముగ నుదహరించినయెడల ప్రస్తుతము మన దేశమందెల్ల వ్యాపించియున్న యిట్టి మందుల ప్రకటనలయొక్క నిజమైన విలువ మీకు తెలియగలదు. జాంబక్[2] (Zambak) అనుతైలము పేరు మీరు వినియుండవచ్చును, దీనిని లండనులో నొక కంపెనీ వారు తయారుచేయుదురు. జాంబక్ తైలములో గూడ జాంబక్ సబ్బునుగూడ నుపయోగించుట మంచిదని యీ కంపెనీ వారు సిఫార్సు చేయుదురు. ఈ మందును పంపుపెట్టెలో నీదిగువ కనుపరచినప్రకార మొక ప్రకటన యుండును.

కొన్ని యోషధులనుండి పుండు మాన్పుగుణము మిక్కిలి యధికముగను, అద్భుతముగను గల కొన్నిరసములును మేము గ్రహించితిమి. అధికవ్యయముతో జేరిన శోధ


నల పర్యవసానముగా నీ రసములన్నియు నెట్లు మిళితములగునో కనుగొంటిమి. ఇట్లుచేయగా నిర్మలమును, ఆరోగ్యకరమును అయినట్టియు, క్రొత్తచర్మమును పెంచుశక్తి నిశ్చయముగ గలిగినట్టియు మందు నొకదానిని కడపట గనుగొంటిమి. దానికే జాంబక్ అనిపేరు పెట్టితిమి. ఎక్కడనైనను కొంచెము నొప్పియెత్తినప్పుడు డాభాగమును చేతితో రుద్దుట సృష్టి యందెప్పుడు పుట్టినదో అప్పుడే మానవుని ఉపయోగార్థము సృష్టిలో పుట్టిన వస్తువులెవ్వియో అవియన్నియు ఈ జాంబక్ నందిమిడియున్నవని చెప్పవచ్చును. ఈ క్రిందివివరించిన వ్యాధులకు తనతో సమానమైనది లేదని జాంబక్ తానే రుజువుచేసి కొని యున్నది.

‘తెగినగాయములకు, కవుకు దెబ్బలకు, కాలిన పుండ్లకు, బొబ్బలకు, కొట్టుకొని పోయిన గాయములకు, మానని పుండ్లకు, లభపూరితమైన గాయములకు, ముక్కలు చెక్కలుగా చిలికిన గాయములకు, పురాతనపు పుండ్లకు, బెణుకులకు, బరువుమోయుటచే పట్టిన పట్టులకు, వాపులకు, కుక్క కాటులకు, పిల్లిరక్కులకు, మొండిపుండ్లకు, గజ్జికిని;’

‘తేనిటీగలు, కందిరీగలు, జెఱ్ఱులు, తేళ్లు వీనికాటులకును, ప్రాకెడుపుండ్లకు, బావులుపడిన పుండ్లకు, తామరకు అప్పుడు పుట్టినదైననుసరే మిక్కిలి పురాతనపుదైననుసరే, ఏనుగుగజ్జికి, పొడలకు, పోతరపు పొక్కులకు, ఉడుకుపొక్కులకు

కురుపులకు, సెగగెడ్డలకు, రాచపుండ్లకు, గండమాలకు, కొంకర్లుపోవుటకు, మంగలవాడంటించు చిడుమునకు, ఉడుకుచే శరీరము పేలుటకు, ఉడుకుబొబ్బలకు, మంత్రపు పొక్కులకు, చుండునకు, తలదురదకు, ఇంకను నెత్తిమీదనుండు ఇతరపుండ్లకు, జలుబుకు, చలికుదుపునకు, నీళ్లలోనాని మెత్తబడిన చేతులకు, పగిలిన పెదవులకు, క్షౌరపుకాటులకును:’

'కందిన చోట్లకు, పగిలిన చను మొనలకు, బిళ్లవాపులకు, వాచిన కీళ్లకు, కుంటులకు, మూలవ్యాధులకును, ఆసనమునొప్పికి, వీపుపుండ్లకు, బలహీనమైన చీలమండలకు, అరి కాలుమంటలకు పుండ్లకు పోట్లకును; పాదముల చెమటలకును, బరుకులకును, కాయలకును, ఉప్పునీటి పుండ్లకును, జాంబక్ అసమానమైనది.’

‘వేలువాయువు నందును, నడుమునొప్పియందును, నరముల నొప్పియందును, కాళ్లుతీయుటలందును, పంటినొప్పుల యందును,నొప్పిగలభాగములలో చక్కగరుద్దినయెడల జాంబక్ వలన అధికమైన సుగుణమగును. ఇది సర్వవిధములగు వాపులను, దురదలను, మంటలను అణచివేయును.'

ఈప్రకారము ఇంగ్లీషున యేమో వర్ణించియున్నది. సరియయిన తెలుగు పదముల దొరకక కొన్నివ్యాధుల పేర్లను మేము విడిచిపెట్టి యున్నాము. పైనివ్రాసిన దానినిబట్టి యేయేవ్యాధులలో నేమందు ఉపయోగమో మీకు బోధపడి

యుండదా! మేము మాస్వంత వాఖ్యానమేమియును చేయనవసరములేదు. ఇన్ని వ్యాధులకు సిద్ధౌషదమగు నీ ఘనమైన మందులో నేయే ద్రవ్యములు చేరియున్నవో తెలిసికొనినయెడల వీనిరహస్యము తేలిపోవును. రహస్యములను మిక్కిలి వ్యయప్రయాసలకోర్చి బ్రిటిష్‌మెడికల్, అసోసియేషన్ అనగా బ్రిటిష్ వైద్యసంఘము (British Medical Association) వారుకనిపెట్టి ప్రజలయుపయోగార్థమై రహస్యపు మందులు(Secret Remedies) అను గ్రంథముగాకూడ ప్రకటించి యున్నారు.

  • దేవదారుతైలము (Eucalyptic oil) 14 పాళ్ళు
  • కొవ్వు...........................................20 "/
  • ఆకుపచ్చ రంగు .............................స్వల్పము/
  • మొత్తము.......................................100 పాళ్లు.

ఈ పాళ్లప్రకారము పైమందులను కలిపి కొంచెంమాకు పచ్చనిరంగుచేర్చగా తయారైనమందు సర్వవిధములను అసలు జాంబక్‌ను పోలియున్నది. రెండుతులముల జాంబక్‌యొక్క నిజమైనవెల కాలుపెన్ని అనగా మూడుదమ్మిడీలని ఈ అసోసియేషన్ వారు నిర్ధారణ చేసియున్నారు. ఇప్పుడు చెన్నపట్టణములో నిదే మందును డబ్బీ ౧కి ఒక రూపాయవంతున నమ్ముచున్నారు. మితిలేకుండ వార్తా పత్రికలలో డంబముగ ప్రకటింపబడు నిట్టిమందులయొక్క రహస్యమెరింగిన వారెవ్వ

రును వీనిని కొని మోసపోక యుందురను నమ్మకముతో నింతగ వ్రాసియున్నాము.

ఇట్టితైలములను,అంజనములను,మాత్రలనుకొని ధనము వ్యయపడ తుదకు పిచ్చియెత్తిన వారలనుగూర్చి మేము వినియున్నాము. అజ్ఞాన దశయందున్న మన దేశమునందిప్పు డితర దేశంబులయందుకంటె నీ దగామందుల బాధయెక్కువగ నున్నట్లు తోచుచున్నది. క్రూరమగు నంటువ్యాధులకు పరిహారముగ నుపయోగించు మందులలో నిట్టివాని నుపయోగింపక తగినవైద్యులచే శోధింపబడిన మందులను మాత్ర ముపయోగింపవలెను. అట్టివానిని కొన్నిటి నీక్రింద వివరించియున్నాము:

నిజముగ శుద్ధిచేయు మందులు

ఇందు కొన్నిటి వెల అధికమగుటచేత వానిని సర్వత్ర ఉపయోగించుటకు వీలులేదు. ఇందుచే ఇండ్లలో నుపయోగించు మందులు వేరుగాను, జలదారులు, మరుగుదొడ్లు మొదలగు వానిని శుద్ధిచేయుటకు కుపయోగించు మందులు వేరుగాను, చేతులు కాళ్లు మొదలగునవి శుద్ధిచేసికొనునవి వేరుగా నుండును.

1. కార్బాలికు ఆసిడ్డు (కార్బాలికామ్లము Carbolic acid). నీళ్లుచేరని కార్బాలికామ్లము చేతిమీద పడిన చేయి కాలి పుండుపడును. చాలనీటితో కలిసియున్నప్పుడు సూక్ష్మజీవులను మిక్కిలి వేగముగ చంపుగుణము దీనియందంతగా 143

లేకున్నను, సామాన్య ద్రావకము సూక్ష్మ జీవుల పెంపును నిశ్చయముగ అణచి వేయ గలదు. ఇది సౌవీర ద్రావమువలె ఆయుధములను పాడు చేయదు. అందు చేతనే దీనిని శస్త్ర వైద్యులు ఆయుధములను శుద్ధి చేసికొనుటకు హెచ్చుగ ఉపయోగింతురు. నూరు చుక్కల నీళ్ల కొక చుక్క కార్బాలికామ్లము గల నీటిలో దొమ్మ (antrax) సూక్ష్మ జీవులు చచ్చుటకు రెండు దినములు పట్టుననియు, టైఫాయుడు సూక్ష్మ జీవులు జీవించి యుండగలవనియు ప్రొఫెసర్ కాకు అను వారు వ్రాసి యున్నారు.

సీమ సున్నము వంటి ఏదో యొక పదార్థము నందు నూటికి ఇంత ని లెక్క చొప్పున కార్బాలిక ఆమ్లమునే కలిపి బజారులో అనేక కార్బాలికు పొడుములు అమ్ముదురు. వీనిలో ఎన్ని పాళ్ళు కార్బాలి కామ్లమున్నదో నిశ్చయము తెలిసియున్నను గాని వీని నుపయోచించి ప్రయోజనము లేదు. నూటికి 15 పాళ్లకంటె తక్కువగ నున్న మందులు అంటు వ్వాధులను నివారించునని బొత్తిగ నమ్మకూడదు. ఫినైలు అని అమ్మబడు ద్రావకములో కూడ ఈ కార్బాలిక ఆమ్ల సంబంధమైన వస్తువులే కలవు. చేతులు కడుగు కొనుటకు నూటికి 2 మొదలు 5 వరకు ఈ కార్బాలిక్ ఆమ్లమును వేడి నీళ్లలో చక్కగ కలియు నట్లు కలిపి ఉపయోగింప వలెను. చన్నీళ్ళలో ఇది కలియక బొట్లు బొట్లుగా నుండును. అట్టి నీళ్ళలో చేతులు గడిగిన పుండ్లు పడును. 144

ఇప్పుడు క్రీసాలు, (Cresol) లైసాలు (Lysol) క్రియాలిన్ (Creolin) ఐజాల్ (Izol) లైసోఫారం (Lysoform) సిల్లిన్ (Cyllon) మొదలగు అనేక మందులు విక్రయమునకు దొరకును. ఇవి కార్బాలిక్ ఆమ్లము కంటే శుద్ధి చేయు శక్తి కొంచెము హెచ్చుగ గలవి. ఇవి చేతులయందంతగా మంట పుట్టింపవు. నీళ్లలో దాని కంటె సులభముగ కలియును. కాని వెల కొంచెము అధికమగును.

2. ఫార్మనిలు (Formalin). ఇది కార్బలికామ్లము కంటె తీవ్రమైన శక్తి గలది. కార్భాలికామ్లము వలె విషము కాదు. పాలు చేపలు మొదలగు భోజన పదార్థములలో సూక్ష్మ జీవులు చేరి పాడు కాకుండ ఈ ఫార్మనినును కొందరిపుడు ఉపయోగించెదరు. నూరు పాళ్లు నీళ్ళలో రెండు పాళ్లు దీనిని చెర్చిన ద్రావకము 15 నిముషములు మొదలు గంట లోపల సూక్ష్మ జీవులన్నిటిని చంపి వేయును. సౌవీర ద్రావకము వలె నిది సబ్బు నీటిని విరిచి వేయదు. కాబట్టి చేతులు తోము కొనుటకు, ఆయుధము బట్టలు మొదలగువని శుద్ధి చేసి కొనుటకు ఇది మిక్కిలి ఉపయోగ కరము. కోసి వేసిన కంతులు మొదలగు వానిని నిలువ చేయుటకు ఇది మిక్కిలి 145

అన్నిటి కంటె ఎక్కువ ఉపయోగకర మైనదని చెప్పవచ్చును. కాని అతి ప్రమాదకరమైన విషమగుటచే దీనిని కొందరు బహిష్కరిస్తున్నారు. 3 గురిగింజలెత్తు తినిన యెడల మనుష్యుని చంపుటకు చాలును. ఇట్టి ప్రమాదము అనేక చోట్ల కలిగి యున్నవి. కలరా వ్వాధి వచ్చిన ఇంటి యందు ఈ మందును మాత్ర రూపముక నుంచు కొని ఒక్కొక్క మాత్రను కొలత ప్రకారము తగినన్ని నీళ్లలో వేసి కలిపి ఆ నీళ్లలో తరుచుగ చేతులను కడుగుకొను చుండవలెను. కాని ఈ మాత్రలను ఏర్పాటుగ ఒక చోట బెట్టుకొని ఇతర మందులతో కలియ కుండ జూచుకొనవలెను. మిక్కిలి ఆప్తులగు రోగులు చని పోయినప్పుడా ఇంటిలోని స్త్రీలు మొదలగు వారీ మాత్రలను సంగ్రహించి మ్రింగి ఆత్మ హత్య చేసి కొనకుండ నెల్లప్పుడు జాగ్రత్తగ నుండ వలెను. సౌవీర ద్రావకమును తయారు చేసికొను మాత్రలో ఎల్లప్పుడు కొంత నీలి మందు కాని మరి ఏదైన రంగు గాని కలిపి ఈ మందు నీళ్లను తక్కిన మందుల నుండి గుర్తించుటకు వీలుగా చేసి కొనవలెను.

ఒక పాలు సౌవీరము పదివేల పాళ్లు నీళ్లలో చేరియున్నను, ఆ ద్రావకము సామాన్యముగా అన్ని జాతుల సూక్ష్మ జీవులను చంపగదు. వేయింటి కొక పాలు సౌవీర ముండిన మందు నీళ్లు నిశ్చయముగ నన్ని జాతుల సూక్ష్మ జీవులను రెండు మూడు నిముషములలోనే చంపి వేయును. విరేచనము, 146

మూత్రము, వాంతి, కఫము మొదలగు పదార్థములందలి సూక్ష్మ జీవుల నశింప జేయుటకు ఇది పెట్టిన పేరు. సామాన్యముగ నూటికి ఒక పాలు సౌవీరమును, 10 పాళ్లు ఉప్పును, 89 పాళ్లు నీళ్లును చేర్చి యొక ద్రావకముగ జేసి దానిని నిలవ ద్రావకముగ నుంచుకొని దానిలో నూటికి పది లేక ఇరువది పాళ్లు నీళ్లు చేరు ఒకటికి వేయి వేయి లేక రెండు వేల పాళ్లుగల ద్రావకముల నప్పటి కప్పుడు తయారు చేసికొని ఉపయోగించు కొనవలెను. లేదా మనకు కావలసిన పాళ్లతో ద్రావకము నెప్పటి కప్పుడు తయారు చేసి కొనుటకై యేర్పడిన రకరకముల మాత్ర లిప్పుడు అమ్ముచున్నారు. వానిని గూడ ఉపయోగించ వచ్చును. ఇది ప్రబలమైన విషయమని మాత్రము మరవ కూడదు. ఇందు పాదరసము చేరి యున్నది. ఇది లోహ పాత్రములను చెరిచి వేయును. సబ్బు నీళ్లను ఇది విరిచి వేయును.

4. తుత్తినాగ హరిదము.(జింక్ క్లోరైడ్) ఇది నూరు పాళ్ళ నీటి కొకటి చొప్పున చేర్చినను సూక్ష్మ జీవుల పెంపును అణచి వేయును. నూటికి 2 మొదలు 5 పాళ్లవరకు చేర్చిన సామాన్యముగ అన్ని సూక్ష్మ జీవులను చంపును. ఈ ద్రావకముల వలన బట్టలు గాని, ఆయుధములు గాని లోహ పాత్రములు గాని చెడిపోవు.

5. గంధకము, గంధకమును కాల్చుటచే వచ్చు పొగ సూక్ష్మజీవులను చంపుటలో మిగుల శక్తి గలది కాని ఇది తడితో 147

జేరి నపుడే సూక్ష్మ జీవులను చంప గలదు; పొడిగా నున్నపుడు ఇది సూక్ష్మ జీవులను అంట లేదు. కావున గదులలో పొగ వేయు నపుడు గోడల మీదను, దుస్తుల మీదను సామానుల మీదను నీళ్లను చక్కగ చిలకరించి చల్లవలెను. ఇట్లు తడితో గూడి నప్పుడిది బట్టలకు వేసిన తొగరు, జబరా మొదలగు చెట్ల సంబంధమైన రంగుల నన్నిటిని తిని వేయును. కాబట్టి అన్ని చోటుల ఈ పొగనుపయోగించుటకు వీలుండదు. ఈ పొగయొక్క ఘాటు ముక్కు రంద్రములకును, గొంతుకకును మిక్కిలి ప్రతి కూలమైనది. గాలిలో నూటికి ఐదు చొప్పున ఈ పొగ చేరియున్న ఎడల మనుష్యులకు దీనిని పీల్చి బ్రతుక జాలరు. వట్టి గంధపు పొడి తనంతట అది సామాన్యముగా నిప్పంటించిన కాలదు. అందు చేత ఎర్రగ కాలిన ఇనుప మూకుళ్లలో వేసిన గాని, ఊకతో జేర్చి గాని దీనిని కాల్చవలెను.

6. బోరికామ్లము (బోరిక్ ఆసిడ్) దీనిని శస్త్ర వైధ్యులు హెచ్చుగ ఉపయోగింతురు. ఇది మంట లేని మందు. కంటి యందు కూడ ఉపయోగింప వచ్చును. సూక్ష్మ జీవుల నొక్క పెట్టున ఇది చంపలేదు గాని వాని వృద్ధిని ఆపి వేయును. నిలువ చేసికొను పదార్థములను క్రుళ్ళకుండ జేయుటకు దీనిని ఉపయోగింతురు. తీవ్రమధికముగ లేనిదగుట చేత అంటు వ్వాధుల నాపుటుకకు గాను శుద్ధి చేయు మందులలో జేర్చుటకు దీనికంతగా హక్కు లేదు.

7. పులుసు పదార్థములు (ఆమ్లములు Acids). గంధక ధృతి మొదలగు తీవ్రమైన ఆమ్లములలో సూక్ష్మజీవులు క్షణములో చచ్చునుగాని వానిని వాడుకగా నుపయోచించుటకు వీలులేదు. ఇవి యేవస్తువును తాకిన నది కాలిపోవును. కాని మిక్కిలి తక్కువతీవ్రముగల నిమ్మపండు పులుసువంటి దానికి గూడ సూక్ష్మజీవులను చంపునట్టి శక్తిగలదు. ఆరోగ్యవంతుని పొట్టలో ఊరు జఠరరసము (Gastric juice) నందుగల హైడ్రోక్లోరికు (Hydro-chloric acid) ఉదజనహరితామ్లము, కలరా సూక్ష్మజీవులను చంపగలదు. అందుచేతనే కలరా సూక్ష్మజీవులతోగలసిన నీళ్లుత్రాగినను అన్నము తిననకూడ గొందరకు కలరా వ్యాధియంటక పోవచ్చును. లిమనేడు, లైమ్ జూసు సోడా మొదలగు పుల్లనినీళ్లను త్రాగుటవలననుకూడ జాడ్యములదినములలో గొంత యుపయోగకరము. రెండువేల పాళ్ల నీటికి నొక మపాలు గంధకధృతిచేరిన నా నీటిలో కలరా సూక్ష్మజీవులు వెంటనే చచ్చునని కొందరు శోధకులు వ్రాయుచున్నారు. దీనినిబట్టి చూడ విరేచనములు మొదలగు వానిని శుద్ధిచేయుటకును ఇది యుపయోగపడవచ్చును. పడవలు, బండ్లు మొదలైన వానికి అంటువ్యాధుల సంపర్కము గలుగు నెడల ఈనీళ్లతో గడిగి వానిని శుద్ధిచేయవచ్చును.

8. క్షారపదార్థములు. (Alkalis) తీవ్రమైనక్షారముగల పదార్థములు సూక్ష్మజీవులను చంపును. అపుడు కాల్చిన 149

గుల్లతో చేసిన నీళ్లు ఇండ్లను శుద్ధి చేసి కొనుటకు మిక్కిలి యోగ్యమైనవి. కాని సుద్ధతో కలిపిన వెల్ల నిష్ప్రయోజనము.

9. టించర్ అయోడిన్ : ఇది మిక్కిలి తీవ్రమైన శక్తి గలది. నిమిషములో సూక్ష్మ జీవులను చంపును. శస్త్రము చేయు భాగము మీదనుండు చర్మములో నివశించు సూక్ష్మ జీవులను చంపుటకు గాను శస్త్రము చేయక ముందు ఈ టించరు అయోడిన్ ను పూయుదురు. ఇందుచే ఆ భాగము శుద్ధి యగును. కొందరు శస్త్ర వైద్యులు చేతులు కడుగు కొనుటకు కూడ దీనినే యుపయోగింతురు. కాని దీని వెల మిక్కిలి అధికమగుటచే దీని వ్యాపకము అంత హెచ్చగుటకు వీలులేదు.

10. సీమరోటి బూడిదె (బ్లీచింగ్ ఫౌడర్) దీనిని బజారులలో క్లోరైడు ఆఫ్ లైము అందురు. ఇది దుర్వాసనలను పోగొట్టుటకును, మురుగు కాలువలు, మురుగు తొట్లు, మరుగు దొడ్లు మొదలగు వానిని శిద్ధి చేయుటకు, మిక్కిలి యుపయుక్తమయినది. దీనిని ఎల్లప్పుడు మిక్కిలి పొడిగా నుంచ వలెను. దీనిలో ఎంత మాత్రము తేమ చేరినను దీని తీవ్రత తగ్గి పోవును. ఇది నీటితో చేరినప్పుడు దీని యందలి హరితము (క్లోరైన్) నీటి యందలి ఉదజని తో చేరి నీటి నుండి ప్రాణ వాయువును వెడల గొట్టును. ఈ ప్రాణవాయువు (ఆమ్లజని..... ఆక్సిజన్) దుర్వాయువులను పుట్టించు 150

పదార్థములతో క్రొత్త పదార్థములయి వాని వాసన మారి పోవును.

11. హైడ్రొజన్ పర్ ఆక్సైడు ఉదజన పరామ్లజిదము. ఇందు ఆమ్లజని (ప్రాణవాయువు) నీటిలో లీనమయి యుండును. ఏదైనను క్రుళ్లుచుండు పదార్థములో ఇది చేరిన తోడనే దీని నుండి ప్రాణవాయువు వెలువడి అది సూక్ష్మ జీవుల పెంపు నణచును. ఇది మిక్కిలి విలువ గల దగుట చేత దీనిని సామాన్యముగ నుపయోగించుటుకు వీలులేదు. శానిటాస్ అను నదియు నిట్టిదియే. నూటికి రెండు పాళ్ల చొప్పున నీళ్లతో చేర్చి దానితో కొంచెము చెడిన మాంసము మొదలగు వానిని శుద్ధి చేసికొన వచ్చును. ఇందు మన శరీరమునకు పడని పదార్థమేదియును లేదు.

12. పొటాసియ పర్మాంగనితము: ఇది ఉదా రంగు గల పలుకులుగా నుండును. దీనిని నీళ్ళలో కలిపి నప్పుడు చంద్ర కాంత పూవు వంటి ఎరుపు రంగు గల ద్రావకము ఏర్పడును. ఈ ద్రావకము కుళ్ళు చుండు పదార్థములతో చేరి నప్పుడు దీని నుండి ప్రాణ వాయువు వెలువడి అది ఆ పదార్థములతో కూడి వానిని సుద్ది చేయును. ఇది నూటికి 5 పాళ్లకంటె తక్కువగ నున్న ఎడల సూక్ష్మ జీవులను నిశ్చయముగ చంపునని చెప్పుటకు వీలు లేదు. మిక్కిలి పలుచని ద్రావకము తప్ప, ఎంత మాత్రము చిక్కగ నున్నను దీని వలన 151

బట్టల కొక తరహా ఎర్ర రంగు పట్టుకొనును. కావున బట్టలు శుద్ధి చేసి కొనుటకు ఇది పనికి రాదు. కలరా యుండు దినములలో నూతులలోని నీటిని శుద్ధి చేయ్టకు ఇది మిక్కిలి యుక్తమైనది.

13. మందు సబ్బులు: అంటు వ్వాధి నివారకములనియు, చర్మ వ్వాధి నివారకములనియు, సమస్త విధములైన సూక్ష్మ జీవులను నశింప జేయు ననియు, డంబములతో నమ్ము మందు సబ్బులు(మెడికేటెడ్ సోప్సు) ప్రజలకు వట్టి బ్రమ కలిగించి వారితర మందుల నుపయోగించి జాగ్రత్త పడకుండ జేయును. ఇందు చేత సూక్ష్మ జీవులను చంపుటకు తగినన్ని పాళ్లు మందు చేరి యుండని ఈ సబ్బులు అపాయ హేతువులే గాని, ఏ సబ్బయినను నలుగు పొడి, సీకాయ, కుంకుడు కాయ అయినను శరీరమునందును, బట్టల యందు నుండి మురికిని చమురును వానితో పాటు కొన్ని సూక్ష్మ జీవులను కూడ వదలించుననుట సత్యమె.

  1. నూరు డిగ్రీల వేడి యనగా సల సల కాగు నీటియొక్క వేడి.
  2. రహస్యపుమందులు (Secret Remedies) వాల్యూం 1. పేజీ 111 జూడుము.