Jump to content

అంటువ్యాధులు/పండ్రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పండ్రెండవ ప్రకరణము

అంటు వ్యాధులను నివారించు మార్గములు

అంటు వ్వాదులు ఒక ఇంట ప్రవేశించిన తరువాత ఒక్కొక్క రోగికి చికిత్స చేసికొనుట కంటే ఆ వ్యాధులను తమ ఇల్లు చేరకుండ జేసికొనుట యుక్తము. మన గ్రామమునందొక యంటు వ్యాధిని వ్యాపింప కుండ జేయ వలయుననిన ఆ వ్వాధి సంబంధమైన సూక్ష్మ జీవులు ఆ గ్రామము నందు ప్రవేశింప కుండ మొదట చేయవలెను. ఒక వేళ ప్రవేశించినను పుట్టిన వానిని పుట్టిన చోటనే నశింప జేయవలెను. వ్యాధి గ్రస్తుల యింటి నుండి ఇతరుల ఇండ్లకా సూక్ష్మ జీవులు ఏవిధమునను ప్రయాయము చేయకుండ కాపాడవలెను. అంటు వ్యాధులున్న చోట నుండి పోవు జనులు తమతో కూడ ఆ వాధిని ఇతర స్థలములకు తీసికొని పోకుండ జేయ వలయును. అనగా ఎక్కడి సూక్ష్మ జీవుల నక్కడనే నశింప జేయవలయుననుట. ఇందుకొరకై రోగులుండు ఇంటి లోని నేల మీదను గోడల మీదను సామానుల మీదను దూలముల మీదను ఇంటి పై కప్పులోపలి వైపునను గోడలలో నుండు పగుళ్ళ యందును గల దుమ్ముతో కలిసి పడియుండు సూక్ష్మ జీవులను, తివాసులు


చాపలు తెరలు జముకాణాలు అలంకారములు పటములు మొదలగువానిమీద నుండు దుమ్ముతోకలిసి పడియుండు సూక్ష్మజీవులను, ఇంటిలోనివారు ఉపయోగించు బట్టలు పాత్ర సామానులు మొదలగువాని నంటియుండు సూక్ష్మజీవులను, రోగియొక్క మలము మూత్రము ఉమ్మి వాంతులు కళ్ళ (గళ్ళ కఫము) మొదలగువానిలోనుండు సూక్ష్మజీవులను మనమెక్కడ కనిపట్టగలమో అక్కడనే చంపగలిగినయెడల ఒక యంటువ్యాధియొక్క వ్యాపకమును మనము నివారించిన వారమగుము.

ఇట్టిది మనకు సాధ్యమగునా? ఎంతవరకు సాధ్యమగునను విషయము గమనింపవలెను. ఇంగ్లాండుదేశమునందలి ప్రజలు సామాన్యముగ విధ్యాధికులును శాస్త్రజ్ఞానము గల వారును అగుటచేత కొంతవర కీ విషయమున జయముపొంది యున్నారని చెప్పవచ్చును. వారిదేశమున కుష్ఠవ్యాధిగాని, ప్లేగు వ్యాధిగాని, కలరాగాని, చలిజ్వరముకాని చూచుటరుదు వారిదేశమునకు చుట్టునున్న సరిహద్దుప్రదేశములలో నన్ని యోడరేవుల యందును తగిన ద్వారపాలకులను కాపులాయుంచుదురు. వీరు క్రొత్తగ దేశమునకు రాబోవు ప్రతి మానవునియొక్క సామగ్రిని శ్రద్ధగా పరిశోధించి వారు పైని చెప్పిన వ్యాధుల సూక్ష్మజీవులను దేశములోనికి దిగుమతి చేయకుండ కాపాడుచుందురు. ఇందుచేత తరతరములకొలది

వేలకొలది జనులు వచ్చుచు పోవుచున్నను వ్యాధులు మాత్రము దేశములో ప్రవేశింపనేరవు. ఇట్లే నాగరకత జెందిన అన్నిదేశములవారును తమ దేశములోనికి క్రొత్తవ్యాధులెవ్వియును ప్రవేశింపకుండ నిరంతరం ఫారాయుంచి తమ దేశమును కాపాడుకొనుచున్నారు. మన సంగతి ఎట్లున్నదన క్రొత్తవ్యాధులు వచ్చునవి వచ్చుచుండగా నిదివరకే మనదేశము నాశ్రయించియున్న చలిజ్వరము, కలరా, ప్లేగు , క్షయ కుష్ఠము మొదలగు వ్యాధులు ఒక్కొక్క సంవత్సరమునకును హెచ్చుచున్నవి. వీనిని నివారించుటకు ముఖ్యమైన పద్ధతులు మూడుగలవు.

i. ప్రకటన చేయుట (Notification). అనగా అంటువ్యాధి గ్రామములో ప్రవేశించిన తోడనే దానిం దాచి పెట్టక తక్షణమే సర్కారు ఉద్యోగస్థులకును, తరువాత సర్వ జనులకును బహిరంగపరచవలెను.

ii. ప్రత్యేకపరుచుట (Isolation). అనగా రోగినుండి యితరుల కా వ్యాధి అంటకుండ రోగిని ప్రత్యేక స్థలమందుంచుట. అనుమానాస్పదమగు ప్రదేశములయందుండి వచ్చు ప్రయాణికులను బలవంతపు మకాములలో (Quarantine) నుంచుటయు నిందులోజేరును.

iii. సూక్ష్మజీవుల సంహరించుట (Attacking Micorbes).

1  ప్రకటన చేయుట

సాధారణముగ మన దేశములో కలరా వచ్చిన రోగి తన కా వ్యాధి అంకురించిన తరువాత కొంత సేపటివర కెవ్వరికిని చెప్పనే చెప్పడు. భార్యకు కలరా వచ్చిన సంగతి భర్తకు తెలియదు. ఇతరులను తనకొర కెందుకు కష్టపెట్టవలెనని యొక యుద్దేశ్యము. చెప్పినయెడల నితరులుభయపడుదురురేమోయని మరియొక యుద్దేశ్యము. కాని యిట్లు దాచిపెట్టుట యెంతవరకు సాగును? కొంతసేపు గడచువరకు కాళ్లుచేతులు లాగుకొని వచ్చి తిరుగులాడుటకు శక్తిలేక పడిపోవునప్పటి కింటి లోనివారు వచ్చి చూచి ఏమి సమాచార మనగా నప్పుడు రహస్యము బయటపడును, అంటువ్యాధుల విషయములో నిట్లు దాచిపెట్టుట మిక్కిలి గొప్పతప్పు. వ్యాధి తగిలినతోడనే బహిరంగపరచవలెను. బంధువులు స్నేహితు లందఱును రోగికి సహాయము చేయవచ్చునుకాని ఏయే వ్యాధి ఏ మార్గమున వ్యాప్తిని జెందునో తెలసికొని వ్యాధి రోగినుండి యితరులకు వ్యాపింపకుండ తగు జాగ్రత్తను పుచ్చుకొనుచుండవలెను. అంటువ్యాధి సోకినతోడనే యే మార్గమున వ్యాధి తమ యింటికి వచ్చెనో తెలిసికొనుటకు ప్రయిత్నింపవలెను. వ్యాధి సోకిన సమాచారము యింటిలోని పూచీదారులెవరో తత్క్షణము గ్రామాధికారులకు తెలియపరచ వలెను. అందుచే వారలు రోగికి తగిన సహాయము చేయుటయేగాక వ్యాధి

యెట్లు వ్యాపించుచున్నదో శోధించి కనిపట్టి దాని నివారణకు తగిన మార్గములను యోచింతురు. ఆయా గ్రామములో సర్కారు వైద్యుడు లేని యెడల వెంటనే సమీపమున నున్న వైద్యుని పంపుదురు. పట్టణములలో నిప్పు డే యింటియందైనను అంటు వ్యాధి సోకినతోడనే యింటి యజమాని సర్కారు వారికి సమాచారము తెలుపనియెడల వానికిని రోగిని వైద్యముచేయు వైద్యుడు అట్టి సమాచారము తెలియపర్చనియెడల వైద్యునకు శిక్షవిధింతురు. ఇప్పటికంటె ఈ విధి నింకను కఠినముగ నుపయోగించినయెడల ప్రజలకింకను మేలుకలుగును.

2 ప్రత్యేక పరచుట

రోగినందరును తాకి వానినుండి మైల నింటినిండ కలపకూడదు. రోగి సామాన్య సంసారి యయినయెడల నతనిని ఆసుపత్రికి పంపుట మేలు. మనయిండ్లలో నిట్టి రోగుల కుపచారము చేసికొనలేము. సరేకదా ఆపేక్షను విడువజాలక బంధువు స్నేహితులందరు రోగిచుట్టును చేరి వానివద్దనుండి వ్యాధి నింటింటికి వ్యాపింప జేయుదురు. ఆసుపత్రిలో నిట్టి వ్యాధులకు చికిత్స చేయుటకు ప్రత్యేకముగ నేర్చిన పరిచారికలు లెల్లప్పుడు సిద్ధముగ నుందురు. రోగియొక్క సౌఖ్యము నా లోచింతుమా ఆసుపత్రిలోనే సుఖము. మన మొక్కరుచేయు పనిని అక్కడ పదిమంది చేయుదురు. అదిగాక యక్కడివారలకు దిన దిన మలవాటయి యుండుటచేత ప్రతి చికిత్సయు

చక్కగ యథావిధిగ జరుగును. ఇంటిలోని ఇతర బంధువుల సౌఖ్య మాలోచించితిమా రోగి నాసుపత్రికి పంపుటయే యుచితము. తమ కావ్యాధి యంటుట కవకాశము తగ్గియుండును. రోగియందలి ప్రీతిచే రోగిని చూడవలయుననిన ఆసుపత్రికి పోయి దినదినము చూచుచుండవచ్చును. ఇట్లు చేయుటచేత వారు తమ కుపకారము చేసికొను చుండుట యేకాకవ్యాధి యొక్క వ్యాపకమును తగ్గించి దేశమునకుకూడ నుపకారులగు చున్నారు. రోగిని తమ యింటియందే ప్రత్యేకముగ నొక చోటనుంచి తగిన వైద్యుని పరిచారికలను పిలిపించి వలసినంత ద్రవ్యము ఖర్చుచేసి వైద్యము చేయించుకొనుటకు శక్తిగల వా రట్లు చేసిన చేయవచ్చును. అట్లు చేయవలెననిన రోగి యొక్క సంరక్షకులు చక్కగ చదువుకొనినవారై ఈక్రింది సూక్ష్మములను శ్రద్ధతో గమనించువారుగ నుండవలెను.

i. రోగిని ప్రత్యేకముగ నొక గదిలో నుంచవలెను. ఈ గదిలోనికి చక్కగ గాలివచ్చునట్లు కిటికీలుండవలెను. ఈ గదిలోని యవసరమైన సామానులు అనగా పెట్టెలను తివాసులను, బట్టలను ముందుగా తీసివేయవలెను.

ii. ఈ గదిలోనికి పరిచారకులను తప్ప ఇతరులను పోనియ్యకూడదు. చీమలను ఈగలనుకూడ ఈగదిలోనికి పోనియ్యకూడదు. ఒకచో మనల నివి దాటిపోయినయెడల వీనిని గదిలోనే పట్టి చంపివేయవలెను. వీనిని పట్టుటకు జిగురుకాగి

తము లమ్మునని యిదివరులో చెప్పియున్నాము. ఎవ్వరైనను గదిలోని వారలతో గాని రోగితో గాని మాటలాడవలెననిన యెడల వెలుపలనే నిలుచుండి కిటికీలగుండ మాటలాడవలెను.

iii. కిటికీలను సాధ్యమయినంతవరకు తెరచియుంచవలెను.

iv. రోగి కుపచారముచేయుటకు ప్రత్యేకముగ నొకరినిద్దరిని తగువారి నేర్పరచవలెను. మశూచకపు రోగుల కుపచారము చేయుటకు సాధారణముగ నిదివర కొకసారి యీ వ్యాధి వచ్చినవారైనయెడల మంచిది. వీరు మాటిమాటికి బయటికివచ్చి యితరులను తాకకూడదు. వీరి దుస్తులు ఉతికి ఆర వేసికొనుటకు తగినవిగా నుండవలెను. బూర్నీసులు, శాలువలు మొదలగునవి సాధ్యమయినంతవరకు కూడదు. వీరు పనితీరినతోడనే మయిల బట్టలను విడిచి వేడినీళ్లలో నుడకవేసి స్నానముచేసి శుభ్రమైన బట్టలను కట్టుకొనిన పిమ్మటనే భోజనము చేయవలెను. రోగిని తాకినచేతులను మిక్కిలి శుభ్రముగ నయిదు నిముషముల వరకైనను తక్కువకాకుండ మందు నీళ్లలోముంచియుంచవలెను. గోళ్లలోని మట్టి సహితము మిక్కిలి శుభ్రముగా కడుగుకొనవలెను.

v.రోగియొక్క సంపర్కముగల పిల్లను బడికిపోనీయ కూడదు.

vi. రోగినుండి వెలువడు విరేచనములను, మూత్రమును, గళ్లను, వాంతులను వేనినికూడ ముందు చెప్పబోవు

ప్రకారము మందు నీళ్లతో కలుపకుండ గదిలోనుండి బయటికి పోనియ్యకూడదు. రోగి విడిచిన ఆహారాదులనుకూడ మందునీళ్లతో కలుపకుండ బయటికి పోనీయరాదు. ఇట్టివానిని మందు నీళ్లతోకలిపి పూడ్చివేయవలెను. లేదా ఊకతోకలిపి కాల్చివేయవలెను. రోగియొక్క బట్టలను, గుడ్డలను, మందు నీళ్లలో తగినంతకాలము బాగుగ నాననిచ్చి యుడకబెట్టి ఎండలో ఆరవేయవలెను. తడుపుటకు వీలులేని వేవయిన యున్న యెడల వానిని రెండు మూడు దినములు బాగుగ నెండలో వేయవలెను. లేదా ఈ బట్టలింటిలో నితరు లుపయోగ పరచినయడల వ్యాధి వారలకంటుకొనుట సులభము.

viii. రోగికి నెమ్మదించినతరువాత మందునీళ్లతోనతని శరీరమంతయు చక్కగ తుడిచి స్నానము చేయించవలెను.

9. రోగిగదిని విడిచినతరువాత దానిగోడలను, నేలను, చక్కగ మందు నీళ్లతో కడగవలెను. గోడలను కడుగుటకు వెదురు పిచ్చి కారీలనుగాని బొంబాయి పంపునుగాని యుపయోగించవలెను. లేదా నెరబీట్లలోని సూక్ష్మజీవులట్లనే దాగి యుండి గదిలోనికి ముందురాబోవువారికి ఆ వ్యాధినంటింప వచ్చును.

10. రోగి చనిపోయినయెడల నాతని శరీరమును మందు నీళ్లతో తడిపిన బట్టలతో కప్పియుంచి తగినంత త్వరలో దహనాదులు చేయవలెను.

పైని చెప్పినవన్నియు సన్నిపాత జ్వరము, కలరా, మశూచి, మొదలగు అనేక యంటు వ్యాధుల కుపయోగ పడును. కాని కొన్ని వ్యాధులలో వ్యాధిగ్రస్తులను ప్రత్యేక పరుచుటకు వేరువేరు పద్ధతులుగలవు. చలిజ్వరపు రోగినుండి వ్యాధి యితరులకు రాకుండ జేయవలెననిన రోగిని దోమ తెరగల మంచము మీద పరుండబెట్టి వానినుండి చలిజ్వరపు విత్తనములను దోమలు తీసికొనిపోయి యితరులకు జారవేయకుండ చూచుకొనవలెను. ఇట్టి నిబంధనలను ఆయా వ్యాధిని గూర్చి చర్చించునపుడు వ్రాసెదము.

బలవంతపు మకాములు

ఇంతవరకు వ్యాధిగ్రస్తులను మాత్రము ప్రత్యేకపరచుటనుగూర్చి చెప్పియున్నాము. ఒకానొకప్పుడు అంటువ్యాధి గలదను అను మానముగల వారిని వారితో సంపర్కము గల యితరులనుకూడ ప్రత్యేకముగ నొకచో నిర్భంధపరచి యుంచవలసివచ్చును. ఒక యూరిలో కలరా యున్నదనుకొనుడు. ఆయూరి మనుష్యులెవ్వరును సమీపపు గ్రామములకు పోకుండ చేయగలిగితిమా ఆయూరివ్యాధి యితరగ్రామములకు పోకుండచేయవచ్చునుగదా! ఇట్లే యొక ప్రదేశమునందొక యంటువ్యాధి యున్నప్పుడు ఆ ప్రదేశమునుండి రైలుమార్గమునగాని, పడవమార్గమునగాని, కాలినడకనుగాని యితర ప్రదేశములకుపోవుప్రజలనందరిని వ్యాధిగలప్రదేశము దాటగానే

1. గోడలమీద మందునీళ్లను చల్లుట కుపయోగించు చిమ్మెడుగొట్టము. (Pump).

యెక్కడైననొకచోట బలవంతముగ ఆపి అనుమానము తీరువరకు వారలను శోధనలోనుంచి అంటువ్యాధి యేదియును లేదని దృఢమయిన పిమ్మట వ్యాధి లేనిదేశము లోనికి పోనియ్యవలెను. ప్లేగువ్యాధికి సాధారణముగ 10 దినములును, మశూచికమునకు 12 దినములు నిట్టి శోధనలో నుంచుదురు. అంటువ్యాధి కలదని యనుమానముగల దేశములనుండి వచ్చు యోడలను నియమముల ప్రకారము కొన్ని దినములవరకు రేవునకు వెలుపలనే కట్టియుంచి యందలి ప్రయాణికులను దినదినము శోధించి చూతురు. వ్యాధిలేదని స్పష్టపడిన పిమ్మట నే యోడను రేవులోనికి రానిత్తురు.

ఇట్లు రోగము లేనివారిని రోగమున్న వారిని కూడ మధ్యమకాములలో బలవంతముగ నాపుటచే కొంత వరకు లాభమున్నను ఇబ్బందు లనేకములు గలవు.

1. వ్యాధియున్నదని చెప్పిన యెక్కడ బలవంతముగా నాపుదురోయను భయముచేత రోగులు వ్యాధిని దాచుదురు. తామొక చోటనుండి వచ్చుచు, మరియొకచోటనుండి వచ్చుచున్నామని యబద్ధమాడి తప్పించుకొన ప్రయత్నించుదురు.ఒకదారిని మనము కాపలాపెట్టిన మరియొక తప్పుదారిని పోవుదురు.

2. ఒకానొకప్పుడు మనమొకటి రెండు వారములు ప్రయాణీకుల నొక్కచోట మకాము వేయించినయెడల, ఈ

మకాములలో వ్యాధిగ్రస్తులు, వ్యాధిలేనివారు కలసియుండుట చేత నిక్కడ క్రొత్తవారికి వ్యాధి యంకురించి మనకు తెలియకయే వా రితర ప్రదేశముల కా వ్యాధిని గొనిపోవచ్చును.

3. బలవంతపు మకాములలో బాటసారులకు భోజనాది సౌకర్యము లమర్చుట బహుకష్టము. అందుచే బడలియున్న బాటసారుల నీ యంటువ్యాధు లధికముగ బాధింపవచ్చును. కావున నిట్టి బలవంతపు మకాములచే ప్రజలను భీతిజెందించుటకంటె ప్రజలకు అంటువ్యాధియొక్క వ్యాపకమును వాని నివారణ పద్ధతులనుగూర్చి విషయములను బోధించుటకు సులభ శైలిని వ్యాసములు వ్రాసి విరివిగ పంచి పెట్టి ప్రజలకు వానియందు విశ్వాసము కలుగునట్లు చేయవలెను. అంటువ్యాధిగల చోట్ల కితర దేశములయందలి ప్రజలు పోకుండ వారికి బోధింపవలెను. అంటువ్యాధిగల ప్రదేశము లనుండి వచ్చువారల కందరకు రహదారిచీటి (Passport) నొకదానినిచ్చి వారు ప్రతిదినము సర్కారు ఉద్యోగస్థుని పరీక్షలో నుండునట్లు తగు యేర్పాటుచేయవలెను. క్రొత్త ప్రదేశములలో నెక్కడనైన ఈ వ్యాధివచ్చినయెడల నీ రహదారి చీట్లమూలమున వెంటనే కనిపట్టవచ్చును. వారిని ప్రత్యేకముగా గ్రామమునకు తగినంత దూరములోనుంచి చికిత్సచేసి వ్యాధి యూరూరునకు వ్యాపింపకుండ చేయవచ్చును. ప్లేగు రహదారిచీట్లును బాటసారుల కిచ్చు నుద్దేశమిదియె.

3. సూక్ష్మజీవుల సంహారము

ఇంతవర కంటువ్యాధుల సంపర్కము సాధ్యమైనంత వరకు లేకుండ జేసికొనుటను గూర్చి చెప్పియున్నాము. ఇంక నీ యంటువ్యాధులకు గారణభూతములగు సూక్ష్మజీవుల మీదికి దండెత్తవలెను.

i. వానికిని వాని సహకారులకును తినుట కాహారమును, నిలువ నీడయును, లేకుండ వానిని మాడ్చి నశింప చేయవలెను. (Starvation).

ii. సూక్ష్మజీవులు మనచుట్టునుండినను, అవి మన కంటకుండ నెవరి శరీరములను వారు కాపాడుకొన వలయును. (Personal precaution)

iii. అవి మన శరీరములో ప్రవేశించినను మనకు హాని కలుగకుండ రక్షణశక్తి కలుగ జేసికొనవలెను (Immunity).

iv. సూక్ష్మజీవులను వెదకివెదకి చంపవలెను. (Disinfection)

౧. సూక్ష్మజీవులకుదగిన నివాసస్థానములును ఆహారమును లేకుండజేయుట.

సూక్ష్మజీవుల నివాసస్థానములగూర్చియు, ఆహారపద్ధతులం గూర్చియు పైని వివరముగ వ్రాసియున్నాము. ఈగలు దోమలు మొదలగు జంతువు లీసూక్ష్మజంతువుల కెట్టు సహాయపడునో యదికూడ వ్రాసియున్నాము. వానినన్నిటిని జక్కగ

గమనించుచు మనము నివసించు ప్రదేశములు మిక్కిలి పరిశుభ్రముగనుంచుకొనినయెడల నంటువ్యాధుల వ్యాప్తి మిక్కిలి తగ్గిపోవును. ముఖ్యముగ దోమలను రూపుమాపిన చలిజ్వర మడుగంటుననియు, ఈగలను రూపుమాపిన అనేక యంటువ్యాధులు నశించుననియు నమ్మవలెను. ఆయా వ్యాధుల శీర్షి కలక్రింద నాయాజాతి సూక్ష్మ జీవుల నెట్లు నివారింపవచ్చునో తెలియపరచెదము.

౨. మన శరీరబలమును గాపాడుకొని సూక్ష్మజీవులను చేరనీయకుండ జేసికొనుట రెండవ సాధనము. దేహదార్ఢ్యము తక్కువగనున్నపుడు సూక్ష్మజీవులు త్వరలో మనలను జయింపగలవని వెనుక వ్రాసియున్నాము. నిర్మలమైన వాయువు, నీరు, ఆహారము మొదలైనవానినిగూర్చి మనముశ్రద్ధపుచ్చుకొనుచు సాధ్యమైనంతవరకు మనశరీరబలమును మనము కాపాడుకొనవలెను. సారాయి, నల్లమందు, గంజాయి మొదలగు పదార్థములు శరీరపటుత్వమును తగ్గించును. గావున వానిని విసర్జింపవలెను. పచ్చికాయలను, మాగిపోయిన కాయలను తినగూడదు. చెడిపోయిన మాంసము, చేపలు, వీనిని దినకూడదు. వివాహాదులందు జనసంఘములుచేరి మితిమీరి వేళతప్పి భుజింపరాదు. యాత్రాస్థలములలో నీ విషయమై బహు జాగ్రత్తగ నుండవలెను.

ఉపవాసముల పేర శరీర దార్ఢ్యమును బోగొట్టుకొనరాదు. ఆటలకొరకుగాని, విద్యాభ్యాసము కొరకుగాని, రాత్రులయం దధికముగ మేల్కొనరాదు. సగటున నారు లేక యేడుగంటల నిద్రయుండ వలయును. పిల్లలకు నెనిమిది గంటల నిద్రకు తగ్గియుండరాదు. బాల్య వివాహములు కూడదు. మితిమీరిన భోజనమువలెనే మితిమీరి సంభోగింపకూడదు. మనము బలహీనులమైనచో మన సంతానమంతకంటెను బలహీనమగును. బలముగలవారి శరీరములో సూక్ష్మజీవులు ప్రవేశించినను, సాధారణముగ వ్యాధులను గలుగజేయవు. మన శరీరబలమే దేశముయొక్క బలమని నమ్మి యెల్లప్పుడు నాత్మబలమును గాపాడుకొనవలయును.

౩. రక్షణశక్తి గలుగజేసికొనుట (Immunity). దీని విషయమై యిదివరకే వ్రాసియున్నాము. 113వ పుటను జూడుము.

౪. సూక్ష్మజీవులను వెదకి వెదకి చంపుట (Disinfection). దీనినిగూర్చిక్రింది ప్రకరణమున జదువగలరు.