Jump to content

అంటువ్యాధులు/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము

బహిర్జనితరక్షణశక్తి

ఇంతవరకు సూక్ష్మజీవులుగాని వాని విషములుగాని మన శరీరములో ప్రవేశించి మనకపకారము చేయకుండుటకు తగినశక్తి మనకుకలిగించు సాధనములును మన శరీరమునందే పుట్టించు మార్గములనుగూర్చి వివరించియున్నాము. ఇట్టి రక్షణశక్తి కలిగించు పదార్థములను ఇతర జంతువుల శరీరములలో పుట్టించి ఆ పదార్థములను మన శరీరములోనికి మార్చుకొని వానివలన అంటువ్యాధులను మాన్పుకొను పద్ధతులను గూర్చి చెప్పవలసియున్నది. ఇట్లు కలుగు రక్షణశక్తికి బహిర్జనిత రక్షణశక్తి యనిపేరు.

ధనుర్వాయువునం దుపయోగించు టీకారసమును గూర్చి 77-వ పుటలో నుదాహరించియున్నాము. గుర్రపు నెత్తురులో మనము పుట్టించిన విరుగుడు పదార్థములు మన శరీరములో ప్రవేశించిన ధనుర్వాయు సూక్ష్మజీవులచే పుట్టిన విషమును విరిచివేసి రోగికి ఆరోగ్యమును కలుగజేయుటచూచి యున్నాము. ఈ విరుగుడు పదార్థములు, ఉప్పు, పులుపు నెట్లు విరిచివేయునో అట్లు విషములను విరిచివేయుచున్నవా యను విషయమింకను చక్కగ తెలియలేదు. ఏలయన తులము

8

చింతపండుయొక్క పులుపును విరుచుటకు తులము ఉప్పు సరిగానుండునని మన మూహించినయెడల 10 తులముల చింత పండునకు పదితులముల యుప్పు సరిగానుండును. కాని పది తులముల టీకారసమును పది తులముల ధనుర్వాయు విషమునుజేర్చి యొకజంతువులోని కెక్కించగా నాజంతువు మూడు దినములలో చచ్చెను. అదే మిశ్రపదార్థమును రెండు గంటల సేపు నిలువయుంచి పిమ్మట అదేతూనికగల జంతువులోని కెక్కించినప్పుడు దానికేమియు విషమెక్కలేదు. ఇదిగాక అదేతూనికల మరియొక జంతువులోనికి రెండు లక్షల తులముల టీకారసమును రెండులక్షల తులముల విషమును చేర్చి పిచికారీ చేసిప్పుడు ఆ జంతువున కేమియు రోగము రాలేదు. కావున సంయోగము ఉప్పు చింతపండులయొక్క సంయోగము వంటిదికాదు.

ఈ విరుగుడు పదార్థములయొక్క స్వభావమును తెలియపరచుటకు ఎర్లికు వాదములనియు, మెచ్ని కాపు వాదములనియు కొన్నివాదములు గలవు. వాని నన్నిటిని నిక్కడ వివరించుటకు ఎడములేదు. కాని సూక్ష్మజీవులు మనశరీరములో ప్రవేశించినతరువాత ఎంత శీఘ్రముగ విరుగుడు పదార్థములను ప్రవేశపెట్టిన అంత మంచిదని చెప్పవలసియున్నది. ఆలస్యమైనయెడల శరీరమునందలి విషపదార్థములు మిక్కిలి అధి

కమై మనమెంత విరుగుడుపదార్థములను ప్రవేశపెట్టినను చాలక పోవచ్చును. బహిర్జనితరక్షణశక్తిని కలుగజేయు పదార్థములు సూక్ష్మజీవుల సంబంధమైన విషములకేగాక త్రాచుపాము, తేలు మొదలగువాని విషములకును, నేపాళము మొదలగు విషములకునుగూడ నీ విరుగుడు పదార్థములను తయారుచేయవచ్చును. ఈ విరుగుడు పదార్థములను ఆ యా జంతువుల యొక్క నెత్తురు మూలముననేగాక పాలమూలమున కూడ ఇతరులకు మార్చవచ్చును. కావున పిల్లలకు వ్యాధివచ్చినప్పుడు వారల తల్లులయం దీ విరుగుడుపదార్థములను మనము పుట్టించినయెడల అవి పాలమూలమున పిల్లలకుచేరి గుణమీయవచ్చును. ఇట్లు బహిర్జనితరక్షణశక్తిని మనకు కలుగజేయు టీకారసములను మహామారి (ప్లేగు) కలరా, క్షయ, న్యూమోనియ, సూతికజ్వరము మొదలగు వ్యాధులకు ప్రస్తుతము తయారుచేయుచున్నారు. వీని యుపయోగమింకను రూఢిగ తెలియలేదు.