పుట:హరవిలాసము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరవిలాసము



తే. అఖిలలక్షణసంపూర్ణ యైనయట్టి, యాలతాతన్విఁ జూచి పుష్పాయుధుండు
రమణ దాఁ బూను దేవతారాధనంబు, సఫలతం జెందె నని చాల సంతసిల్లె. 72

ఉ. అప్పుడు డాయ వచ్చెఁ దరుణాబ్దకళాధరు గౌరి భక్తితో
నప్పుడు డాసె నీశ్వరుఁడు నంచితయోగసమాధినిష్టమైఁ
దప్పక బాహ్యసీమఁ బ్రమదం బెసఁగం బరమంబు సోహమై
యొప్పెడుదివ్యతేజము సముజ్జ్వలకోటితటిత్ప్రకాశమున్. 73

క. అసమభయభక్తు లలరఁగఁ, గుసుమంబులు దోయిలించి కోమలి నించెం
గిసలయ భంగంబులతో, నసదునడుము వణఁక మృడునియడుగులమీఁదన్. 74

ఉ. పల్లవపుష్పభంగములు పాదసరోరుహయుగ్మకంబు పైఁ
జల్లి శ్రవోవతంస మగుసంపగిమొగ్గ యొకింత జాఱఁగా
నల్లన మ్రొక్కె బార్వతి భయంబును భక్తియుఁ సంభ్రమంబు సం
ధిల్లఁగ భర్తకున్ ఘనఫణిప్రభుహారున కంధకారికిన్. 75

క. సరి లేని మగనిఁ బడయుము, తరుణీ యని పల్కె శివుఁడు తథ్యమ యిది యీ
శ్వరభాషితమునకుం దర, తరములయం దైన నన్యథాత్వము గలదే. 76

ఉ. పంచశరుండుఁ దత్పరత బాణవిమోక్షణకాలముం బ్రతీ
క్షించుచు గౌరి శంకరునిఁ జేరినయప్పటినుండి యెప్పుడున్
నించునొకో హరుండు తరుణీమణి నంచును వింట నారి సా
రించుచు నుండెఁ జెంత సురరీకృతదైవతకార్యధుర్యుఁడై. 77

తే. ప్రియము శోభిల్లఁగా సమర్పించె గౌరి, పసని పయ్యెద జాఱ దోఃపల్లవమున
భానుదీప్తులు నీటారి ప్రన్ననైన, పృథులమందాకినీపద్మబీజమాల. 78

తే. అంబుజాక్షి సమర్పింప నాదరమున, నక్షమాల్యంబు నిటలాక్షుఁ డందుకొనియెఁ
బంచబాణుండు సంధించె నించువిట, నస్త్రరాజంబు సన్మోహనాశుగంబు. 79

మ. శమనారాతి నివృత్తధైర్యుఁ డగుచుం జంద్రోదయారంభకా
లమునం బొంగిన దుగ్ధసాగరములీలం బక్వబింబాధరో
ష్ఠముఁ గర్ణాంతవిలాసనేత్రము నతిస్వచ్ఛంబునై యొప్పు గౌ
రిముఖాంభోజమునందు నిల్పె సరసప్రేమంబునం జూడ్కులన్. 80

తే. శైలసుతయును భావంబుకీలు దెలిసి, యంగకంబుల బులకంబు లంకురింప
వ్రాల్చె నెమ్మోము లజ్జాభరంబు పేర్మిఁ, గేకరాలోకనంబులఁ గెల్లుమలఁగి. 81

వ. అనంతరం బంతకమధనుం డతర్కితం బైన యింద్రియక్షోభంబు బలాత్కారంబుగా గుదియించి, చేతోవికారంబునకుం గారణంబుఁ దెలియం దలంచి దిశాంచలంబు